బజారవతల లక్షిందేవమ్మ

Spread the love

 ఇరప (బజారవతల)  లక్షిందేవమ్మ పెద్దమ్మ . ఇరప అచ్చయ్య భార్య . మావూరు దొరసొట్టపు కుటుంబం. నేను పెద్దమ్మ అని పిలుచుకునే పెద్దమ్మ. యాకూబు అని నోరారా పిలిచే ఈమె నాట్లు, కోతల మేస్త్రి. ఈమె రెండో కొడుకు సమ్మయ్య నా దోస్త్. మేం తిరగని వాగు వంకలు, డొంకలు, బీళ్లు ,చేలు లేవంటే లేవు. మేం ఈతకొట్టని వాగు మడుగులు ,బావులు ఒక్కటంటే ఒక్కటి లేదు ఆ చుట్టుపక్కల. నా బాల్యం సమ్మయ్యతో వాళ్ల  ఇంట్లోనో ,లేదా మా తోటోళ్లు ఇరప రాములు, బొర్రా స్వామి, చింత రాములు ఇళ్లలోనే గడిచేది. 

పెద్దమ్మ రోషమున్నావిడ. ఆత్మాభిమానం మెండు. కష్టం తప్ప ఏమెరుగని శ్రమజీవి. ఇంకొకరికి పెట్టడమే కానీ ఇంకొకర్నీ అడిగే స్వభావం కాదు. 

నా చిన్నప్పుడు మా అమ్మకు నాకివ్వడానికి పాలు బిక్కిపోతే, నా తోటోడు  సమ్మయ్యకు ఇవ్వాల్సిన పాలు ఒక పూట నాకు ఇచ్చేదంట . ‘పిలగాడు పాలు లేకపోతె సచ్చిపోతడు బూబక్క’ అని మా ఇంటికొచ్చి పిలగాడిని ఇట్టివ్వమని తీసుకుని రొమ్ముపాలు తాపిచ్చి పోయేదంట . పాలిచ్చిన అమ్మ, పెద్దమ్మ 

కన్నపిల్లలు ఎటెటో దూరంగా పొట్టచేతబట్టుకుని తలో ఊరు వెళ్లిపోయారు. ఇప్పుడు పెద్దమ్మ ,తన భర్తను అంటిపెట్టుకుని రొట్టమాకురేవులోనే ఉండిపోయింది. మసక మసక కళ్ళతో దగ్గరిగా వెళ్లి పలకరిస్తే గుర్తుపట్టే స్థితిలో ఇప్పుడు ఉంది. 

తలిదండ్రుల్ని పిల్లలు ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయే సంస్కృతి పెరిగాక ఇలాంటి తలిదండ్రుల కథలు ఊళ్లల్ల్లోఇప్పుడు మరింతగా కన్పిస్తున్నాయి. 

1

కొట్టు, ఎగసాయం ఉన్నా అదేంటో అన్ల అన్లనే ఉన్నట్టే ఉండేది. పెద్దగా పెరిగింది లేదు. తిండితిప్పలకు కటకట. ఏందో తెలియదు. అట్లని మాంసాలు రోజూ తిన్నమా అంటే అదీ లేదు. కొంచెం సోకైన బట్టలు కట్టుకున్నమా అదీ లేదు. పండక్కో పబ్బానికో, సుట్టం వచ్చినప్పుడు ఒక కోడిని కోసేది ఇంట్ల. దాన్ని పట్టి, హలాల్ అబ్బా చేసినంక, బూరుపీకి, మంటల్ల సెగచేసి, పసుపురాసి, ముక్కలు కోసి , మసాల నూరి పొయ్యి ఎక్కించడం, వండటం – ఇదంతా చూసుకుంట, కోడికూర తింటున్నమనే ఆ ఎదురుచూపు కోడికూరంత కమ్మగా వుండేది. కోసేది ఒక కోడి. అదే గొప్ప. ఎంతమందిమి తినాలె. మేం పిల్లలం ఆరుగురం. అమ్మ, అబ్బా, వచ్చిన సుట్టాలు.

అమ్మ వంటల ఇంతమందికి పెట్టాలె అని లెక్కేసుకుంట కారం ఎక్కువేసేది. నీళ్లు ఎక్కువగానే పోసేది పులుసు కోసం. టమాటాలు గట్టిగనే వేసేది. సర్వనిండా ఉండేట్లు వండేది.

తినడానికి ముందు చుట్టాలు, నాన్న, వాళ్లకు పెట్టినంక మిగిలింది మాకు. అందుల మా అన్నకు కొంచెం స్పెషల్. ఆ తర్వాత ఒక ముక్క, అన్నం కలుపుకునేంత పులుసు. దాన్నే అన్నం తినేదాక చూసుకుంట, కారానికి నోరు మంటపెడుతుంటే హహ అనుకుంటా తినేటోళ్లం. ఇంకొక ముక్క ఏస్తే బాగుండునని మా పిల్లలకు ఉండేది కానీ, అందుల ఏయడానికి ఉండేది కాదు. 

అటువంటి కోడికూర కడుపునిండుగా తినే ఆశ ఎప్పటికో కాని తీరేది కాదు. మా చుట్టాల ఇండ్లల్ల పెండ్లిల్లుకానీ, ఏదైనా పబ్బం కానీ జరిగితే కొద్దిగ నాలుగుముక్కలు తినే అవకాశం వచ్చేది. అక్కడ మేకనో, గొర్రెనో కోసేటోళ్లు.

సాయిబుల పెండ్లిళ్లలో తరుచూ జరిగే గొడవలు ఊళ్ళల్లో ముక్కల దగ్గరనే. ‘మాకు ముక్కలు తక్కువేసింరని కొందరు, మాకు బోటి కూరో, తలకాయ కూర వేయలేదని కొందరు, మాకు మళ్ళీ అడిగితే కూరవేయలేదని కొందరు’ ఇలా తిండి దగ్గరనే పెళ్లిళ్లు ఆగిపోయిన సంగతులు జరిగేవి. ఆడ కూడా ‘దాల్చా’ నే ఎక్కువగా పోసేది. దాల్చా’ ల బోటీ, బొక్కలు వేసి, సొరకాయ, పప్పువేసి మరగనిచ్చి చేసేడిది. మాకు దాల్చా’నే దొరికిందని గొడవలు పెట్టేవాళ్ళు కొందరు. ‘నీసు దగ్గర్నే నియ్యతు బయటపడతది’ సామెత ఉత్తగనే రాలే మరి !

ఊర్లలో ఉన్న ఆకలి, దారిద్ర్యం- అన్నం దగ్గర జరిగే గొడవలు చూస్తేనే అర్థమవుతది.

2

ఇంట్ల కొట్టు సంపాదన అంత పెద్దగేమీ ఉండేది కాదు. చిన్న ఊరు. కొందరు కారేపల్లి వెళ్లి సామాన్లు కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ఎవరైనా వస్తే బీడీలు, పువ్వాకు, పది పైసల మంచినూనె, బెల్లం, చాపత్త, ఉప్పు – ఇందులో మిగిలేదంతా ?!.  కోతల టైంల, కుప్ప నూర్పిళ్ల కాలంల, జొన్న, కంది కోతల కాలంల కొంచెం బాగుండేది. అమ్మ ఆ కాలంల అరిసెలు, కారపుసుట్లు,పకోడీలు, మిర్చీలు చేసేది. కుప్పలు కొట్టే ముఠాలోళ్లు, కోతలు కోసేటోళ్లు గింజలు తెచ్చి ఇవి తీస్కపోయేటళ్లు. మిగతా రోజుల్ల ఇల్లు గడవడం వరకు కొంచెం అటుఇటుగ కటకటగ నడిసేది. మా సదువులకి పెట్టిందేదీ కూడా లేదు. ఒకటుంటే ఒకటుండేది కాదు. పుస్తకాలు, పెన్సిళ్లు, బైండ్ లు వాల్లీళ్లు ఇవ్వడమే. స్కూల్ బీద పిల్లలకు ఇచ్చే పుస్తకాలు, నాకైతే మా క్లాసు దోస్తులు చాన సాయం చేసేటోళ్లు.

ఇట్ల ఉండేది కాలం. అబ్బా చేసే ఎగసాయం కూడా అట్లనే ఉండేది. ఎంత కష్టపడ్డా వానలు సరిగ్గా పడకుంటే అంతే. ఏసేదే జొన్న, కంది, వాటి మధ్యన కొన్ని గింజలు పెసర్లు, అలిసెందలు – కొంచెం వరిపొలం. ఆ వరిపొలం కోసినంక బాడవ మళ్లల్ల జనుము, మినుము జల్లడం. ఇవన్నీ కోతలయింతర్వాత అంతంత మాత్రమే రాబడి. గొడ్లకి వరిగడ్డి, జొన్న కట్టలు, మినుము,జనుము పెసర రొట్ట గొడ్ల మేతకోసం, తాళ్ల నారకోసం సరిపోయేవి. రాబడి, పోబడి సమానంగ ఉండేది. బతుకులు ఒక ఏడాది నుంచి మల్ల ఏడాదికి దొర్లుకుంటూ పోయేది. మళ్లీ అప్పులుసప్పులు.

అటువంటి రోజుల్ల మా ఇంటి పక్క తడికవతల ఏపె పెద్దులయ్య దగ్గరికి పోయేటోళ్లు అమ్మ అబ్బా అప్పుకోసం. ఆయన దగ్గర గిత్తలు అమ్మిన డబ్బులు, ముసలి గొడ్లు అమ్మిన డబ్బులు ఉండేవి. అడగ్గానే లేదనేటోడు. బతిమాలంగ బతిమాలంగ ఎంత కావాలనేటోడు. ఇంత అని అడగ్గానే అంతలేవు’ అనేటోడు. చివరికి పాతికో, యాభయో కాగితం రాసి ఇచ్చేటోడు. ఆ రోజుల్ల మా ఊళ్ళ అది పెద్ద అప్పు. కాగితం రాయడానికి కోటయ్య సారో, మా పెద్దన్ననో రాసేటోళ్లు. అందుల వడ్డీ, ఇచ్చే రోజుల సంగతి ఉండేది-  గురమ్మ తిరణాలకో, కోట మైసమ్మ తిరణాలకో ఇచ్చేటట్లు అని. అట్ల తెచ్చిన డబ్బుల్తో షావుకారు దగ్గర గింజలు కొలవంగ, మిగిలిన పాత అప్పుకట్టి మళ్ళీ సామాను వేస్కరావడం. ఇదీ తంతు.

Kavi Yakoob

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *