దక్షిణానికి  రైలు ప్రయాణం

Spread the love

సెలవులు వచ్చే ముందు కలిగే ఆ ప్రత్యేకమైన అనుభూతి ఏమిటో మీకు తెలుసా? ఇది ఏదో అదృశ్యమైన,  తోట నుండి వీచే పిల్లగాలిలా మీ చుట్టూ తిరుగుతూ మీ హృదయ తంత్రులను మీటుతున్నట్లు ఉంటుంది.

వసంతకాలంలో మీరు దీనిని మొదటిసారిగా చవి చూస్తారు. ట్రేడ్-యూనియన్ కమిటీ టైపిస్టులు వారి ఉన్ని జాకెట్లను పక్కనబెట్టి, వేసవి గౌన్లు, బ్లౌజులు ధరించి ఉదయాన్నే ఆఫీసుకి వెచ్చని ఎండను, తెరిచిన ట్రామ్ కిటికీల గాలిని తీసుకువస్తారు. మీ విభాగంలోని అకౌంటెంట్ ఇప్పటికే వేసవి కాలం గడపడానికి నగరం విడిచి వెళ్ళినప్పుడు మీకు గుర్తుకు వస్తుంది. ఏకాగ్రతకు నిలయమైన అతని డెస్క్ మీద  అంకెలతో నిండిన లావుపాటి లెడ్జర్ పుస్తకాలపై కూడా, క్లియాజ్మా  నదిపై వెన్నెల వెలుగు, రాత్రి వేళల్లో మెరిసే బిర్చ్ చెట్ల సవ్వడి,  పార్కులోని ఏకాంతాలు, రహస్యంగా కలుసుకోవడాలు గుర్తుకొస్తాయి. మీరు మీ మనస్సులో దక్షిణ దిశగా వెళ్లే రైళ్ల సమయాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. మాస్కో నడిబొడ్డున కూడా ఆఫీసు గోడలు అద్దాలుఉన్న కిటికీలుగా  మారిపోతాయి. వాటి గుండా పచ్చని, అనంతమైన గడ్డి మైదానాలు  ఎంతో వేగంగా దూసుకుపోతాయి. ఓహ్, అవి ఎంత వేగంగా కిటికీల ప్రక్క నుంచి దూసుకెళ్తాయో!

 నేను దక్షిణానికి వెళ్ళేలా చేసిన మరొక విషయం కూడా ఉంది.

ఒకానొక సమయంలో ఆ గడ్డి మైదానాలు అంతర్ యుద్ధ వినాశనంతో వణికిపోయాయి, యుద్ధంలో గెలిచిన ప్రతి చిన్న రైల్వే స్టేషన్ కూడా ప్రపంచం ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఒక మెరుగైన భవిష్యత్తును అందిస్తామనే వాగ్దానాన్ని మోసుకొచ్చింది. బెరెజ్నెవాట్కా  గ్రామం సమీపంలో 6వ ఉరల్స్ రెజిమెంట్ యొక్క విషాదకరమైన ముగింపు గురించి వచ్చిన యుద్ధ ప్రకటనలు మీకు బహుశా గుర్తిండి ఉండవచ్చు. సమయానికి ఆ ద్రోహాన్ని కనుగొనగలిగింది నేనే,  ఇరవై నాలుగు గంటల నిరంతర పోరాటం తర్వాత, నా మనుషులలో సగానికి పైగా కోల్పోయి (నా ఏకైక సోదరుడితో సహా), రెజిమెంట్ యొక్క మిగిలిన క్షతగాత్రులతో కలిసి మా డివిజన్‌ను చేరుకోగలిగాను.

కోల్పోయిన యవ్వనం, చావుల వాసనతో కూడిన ఆ మైదానాన్ని మళ్లీ చూడబోవటం ఎంత వింతగా ఉందో. మూడేళ్లలో నేను ఆ వాసనను పూర్తిగా మర్చిపోయాను.

నేను మాస్కో వదిలి వెళ్ళడానికి ముందే, ఆగస్టులో ఒక సాయంత్రం అర్బాట్ లోని ఒక సినిమా థియేటర్‌కు వెళ్ళినట్లు గుర్తుంది. అంతా అనుకున్నట్లే ఉంది. ముఖాల్లో ఎలాంటి భావాలు లేని జంటలు ఫోయర్‌లో అటు ఇటు తిరుగుతున్నారు, ‘ది బయాడెరే’ (The Bayadere) నాటకంలోని వయోలిన్ శబ్దాలు దీనంగా వినిపిస్తున్నాయి, పియానో వాయిద్యకారుడు పిచ్చి పట్టినట్లు తన స్టూల్‌పై పైకీ కిందకీ కదులుతున్నాడు. భారీగా తెరలు వేసిన కిటికీల వెనుక నుండి  వీధి  సందడి, ప్రజలతో  వెలుతురుతో నిండిన ట్రామ్-కార్లు వెళ్తున్న శబ్దం వినిపిస్తోంది. నాకు నా ప్రయాణం గురించి, దక్షిణాది గురించి గుర్తుంది, ఎందుకో తెలియదు కానీ, అప్పుడు బెరెజ్నెవాట్కా అనే స్థలం ఉందని 6వ రెజిమెంట్‌ నాశనం , పొగలు గక్కుతున్న పెరెకాప్ (Perekop) పై ఉదయించే సూర్యుడు అనేవి అసాధ్యంగా అనిపించాయి. ఈ విషయాల గురించి ఆలోచించడం పాడైపోయిన  సమాధిని చూసినట్లుగా అనిపించింది. ఇప్పుడు ఆ చీకటి మైదానాలు ఆనందం వైపు పరుగెడుతున్న రైళ్ల వలన పవిత్రం చేయబడుతున్నాయి.

నేను కూడా ఆ పేరులేని మృతుల మధ్య అక్కడే పడి ఉండాల్సింది!

…కానీ అదంతా నేను విపరీతంగా అలసిపోవడం వల్ల జరిగింది. నేను బయలుదేరే రోజు ఉదయం ప్లాట్‌ఫారమ్‌పై ఎంతో ఆనందమైన సందడి ఉంది. ఆకాశం ఎంత హాయిగా నీలి రంగులో ఉందంటే నేను అన్నింటినీ దాదాపు మర్చిపోయాను. నేను స్వేచ్ఛగా ఉన్నానని మాత్రమే నాకు తెలుసు, నేను ఆ కేసు ఫైళ్లు, నివేదికలు  విచారణలన్నింటినీ నా తల నుండి తీసివేయడానికి ఆ ఆలోచనల పై ఒక యుద్ధం చేశాను.

సెవాస్టోపోల్  వెళ్లే రైలు, రెండు గంటలకు బయలుదేరాల్సి ఉంది. నేను నా కంపార్ట్‌మెంట్‌లో కూర్చుని, నాతో పాటు ఎవరు ప్రయాణిస్తారో అని ఊరికే ఆలోచిస్తున్నాను. మొదటగా వచ్చినవారు ఇద్దరు యువతులు, బహుశా ఏదో మంచి పేరున్న ఆఫీసులో సెక్రటరీలుగా పనిచేస్తున్నట్లు ఉన్నారు. వారి పసుపు రంగు సూట్‌కేసులు, వారి ప్రయాణ బ్యాగులపై అల్లిన వారి పేర్ల మొదటి అక్షరాలు,  టేబుల్‌పై ఉన్న పూలు, ఇవన్నీ  ఒక శుభ్రమైన, సౌకర్యవంతమైన వారి జీవితాన్ని తెలియజేస్తున్నాయి.  అక్కడ కిటికీ కింద నిలబడి ఉన్న ఇద్దరు పాత తరం తల్లులు, పాతకాలపు దుస్తులు ధరించి, పెద్ద లెదర్ హ్యాండ్‌బ్యాగులను పట్టుకుని ఉన్నారు. “రాయడం మర్చిపోకు!” అంటూ వారు కంగారుగా అంటున్నారు. “సాయంత్రాలు చల్లగా ఉంటాయి, జెన్యా  డియర్, తప్పకుండా నీ ఓవర్ కోటు వేసుకో ! సోన్యా  డియర్, నువ్వు యాల్టా  లో సోఫియా ఆండ్రీవ్నాని కలవడం మర్చిపోవద్దు!” చేతులు పైకెత్తి, అభిమానుల చూపులతో ముద్దాడబడుతున్న జెన్యా,  నల్లని కంటి కింద ఆకర్షణీయమైన పుట్టుమచ్చతో, చిలిపిగా గట్టిగా అంది, “వ్లాదిమిర్ ఆండ్రీవిచ్‌కి చెప్పండి!… ఆయనే ఏర్పాటు చేస్తానని చెప్పారు.” ట్రేడ్-యూనియన్ గురించి మరొక విషయం…

సమాచారం అందించాల్సిన కమిటీ ఒకటి ఉంది, ఆమె ఖార్కోవ్ నుండి తప్పకుండా పంపే ఒక పోస్ట్‌కార్డ్ ఉంది.

రెండవ వ్యక్తి, సిల్క్ లంగా ధరించిన కాస్త లావుపాటి యువతి  ఓ, ఆమె భవిష్యత్తులో ఒక మంచి తల్లి అవుతుంది, ఎప్పుడూ తమ ట్రామ్ కోసం ఆలస్యంగా పరిగెడుతూ, అనేక వస్తువుల మూటల బరువు కింద నిరాశతో రొప్పుతూ ఉండే రకం ఆమె. ఆ రెండవ యువతి తన విలాసవంతమైన, బంగారు రంగు జుట్టు ముడిని కాస్త పక్కకు తిప్పి, ఎంతో గారంగా నవ్వింది.

“అమ్మీ, తుస్కాకు ఆహారం పెట్టడం మర్చిపోకు,” ఆమె చెప్పాల్సింది అంతే.

వారిద్దరి కళ్లలోనూ ఒక మైకపు మెరుపు ఉంది. అవును, వారు ఎలాంటి గదుల్లో నివసిస్తున్నారో నేను ఊహించగలను. కుర్చీ కవర్లు, చిన్న అల్మారాలు, చిన్నచిన్న అలంకరణ వస్తువులతో కూడిన ఫర్నిచర్ మ్యూజియంల లాంటి గదులు అవి. పాత అధికారిక ఆడంబర వాతావరణం నిండిన 1910 నుండి 1914 నాటి గదులు, విప్లవ తుఫానును తట్టుకుని నేటి మన ప్రశాంతమైన రోజుల్లోనికి సురక్షితంగా వచ్చి చేరాయి. ఇప్పుడు, ఆ భయంకరమైన సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మళ్లీ పాత రోజుల్లోలాగే క్రిమియాకు ప్రయాణమౌతున్నారు!

అప్పుడు ఒక సైనికుడు వచ్చాడు, అతని కాలర్‌పై రెజిమెంట్ కమాండర్ గుర్తులు ఉన్నాయి. సుమారు ముప్పై ఏళ్ల వయసున్న భారీ కాయుడైన వ్యక్తి, ఎండకు ఎండిన పల్లెటూరి ముఖం, కానీ అందులో ఒక స్త్రీ సహజమైన కోమలత్వం ఉంది. అతను అప్పటికే అందరి వైపు చూస్తూ అమాయకమైన, సున్నితమైన మొహమాటంతో నవ్వుతున్నాడు. అరగంట గడవక ముందే నాకు తెలిసింది అతని పేరు గ్రిగోరీ ఇవానిచ్ అని, అతను ఒకసారి అకాడమీ కోసం ప్రయత్నించి సాధారణ విద్యలో విఫలమయ్యాడని, ఇప్పుడు మరోసారి ప్రయత్నించబోతున్నాడని, ఈసారి అతను ఖచ్చితంగా ఉత్తీర్ణుడవుతాడని, ఈ విలాసవంతమైన సూట్‌కేసులను, ప్రపంచంలోని తల్లులందరినీ కాదని చూపించడానికైనా.

“మీరు కూడా విశ్రాంతి-చికిత్స (రెస్ట్-కూర్) కోసమే వెళ్తున్నారా?” అని అతను తన మృదువైన గొంతుతో అడిగాడు, తన ఒడిలో తన పెద్ద ఊదా రంగు చేతులను జోడించి.

“అవును, దక్షిణానికి,” నేను జవాబిచ్చాను. అతని వైపు ఆరాధనతో కూడిన అసూయతో చూస్తూ మనసులో అనుకున్నాను, “నీకు అసలు విశ్రాంతి,చికిత్స ఎందుకురా బాబు?”

నా మనసులోని ప్రశ్న సమాధానంగా అన్నట్లు, అతను షెల్-షాక్ (యుద్ధ భ్రాంతి) తాలూకూ చిరునవ్వుతో నా వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వు అతని కళకళలాడే బుగ్గలను ఒక్కసారిగా ముడతలు పడేలా చేసింది, కన్నీటి చుక్కలా పక్కకు తుడిచేయాల్సిన ఒక మెరుపు లాంటి నవ్వు అది. ఆ నవ్వు వెనుక ఒక యుద్ధ రాత్రి, వికృతమైన చీకటి, నెమ్మదిగా పాకుతూ వచ్చే మరణం కనిపించాయి….

“అహో,” నేను అనుకున్నాను, “అయితే నీకు కూడా అది ఎలాంటిదో తెలుసన్నమాట!”

చివరకు ఒక విచారకరమైన దంపతులు వచ్చారు. వారి కోపంగా, విసిగిపోయినట్లున్న ముఖాలను చూస్తే, విధి వారిని ఒక చోటు నుండి మరో చోటుకి అడుగడుగునా తరుముతున్నట్లు అనిపించింది.  ఇప్పుడు వారు వోరోనెజ్ లో దుకాణదారులు, ఆ తర్వాత లెబెడ్యాన్ కో-ఆపరేటివ్ స్టోర్లలో క్యాషియర్లు, ఇప్పుడు మాస్కో రైల్వేలో కార్మికులు,  ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులే లే-ఆఫ్స్ కష్టాలతో  ఉండేవారు…. చివరిసారిగా గంటలు మ్రోగాయి. తల్లులు తమ చేతిరుమాళ్లను ఊపుతున్నారు., ఇటు అటు వేగంగా తిరుగుతున్న పోర్టర్ల ట్రాలీలు వెనకకు వెళ్లిపోతున్నాయాయి.త్వరలోనే మేము రైల్వే వ్యాగన్ల దట్టమైన, శబ్దాలతో నిండిన ప్రాంతంలోకి ప్రవేశించాము, ఆఅది కేవలం బంగారు రంగు దుమ్ముతో నిండిన ప్రాంతం మాత్రమే. వీడ్కోలు, మోస్కో!

గ్రిగోరీ ఇవానిచ్, నేను లేచి, అమ్మాయిల తలలపై నుండి మా కింద తిరుగుతున్న  పొగమంచును చూడటానికి ప్రయత్నించాము. అంతలోనే గ్రిగోరీ ఇవానిచ్ కన్ను జెన్యా రెప్ప కింద ఉన్న పుట్టుమచ్చపై పడటం నేను గమనించాను, అతను ఒక్కసారిగా తడబడ్డాడు. అతను ఆమె వైపు దొంగచూపులు చూస్తున్నాడు, సిగ్గుపడుతూ, కుర్రాడిలా చూస్తున్నాడు.

“ఇది అంత విలువైనది కాదు, గ్రిగోరీ ఇవానిచ్,” అని నేను అతనితో చెప్పాలనుకున్నాను. “వారి విలాసవంతమైన గదులు, ఆ సున్నితమైన సువాసనలు మీకు అర్థం కావు, వారు మాట్లాడే విషయాలు మీకు వేరే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మీరు శీతాకాలంలో మీ ఇంటి ముసలామెకు ఇంటీలో కప్పుకోవడానికి సహాయంగా పంపడం కోసం, మీ ప్రయాణ ఖర్చుల నుండి పదిహేను రూబుల్స్ ఎలా ఆదా చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. గ్రిగోరీ ఇవానిచ్, మీ పల్లెటూరి అమాయకత్వం ఆమెకు విసుగు తెప్పిస్తుంది.”

మేము శివారు ప్లాట్‌ఫారమ్‌లు దారి పక్కన ఉన్న స్టేషన్ల నిశ్శబ్దాన్ని దాటుకుంటూ అడవుల్లోకి, అడవి యొక్క చల్లదనం చీకట్లోకి దూసుకెళ్లాము. ప్రతిచోటా మా రైలు , చప్పుడు, దుమ్మును చల్లుకుంటూ వెళుతోంది.

యువతులు అలసిపోయారు. వారు టేబుల్ వద్ద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని, గాలికి చెదిరిన తమ జుట్టును సరిచేసుకుంటూ, మా వైపు ఒక వాలు చూపు చూశారు. గ్రిగోరీ ఇవానిచ్‌కు ఒక ఆలోచన వచ్చింది, అతను కెటిల్ కోసం సీటు కిందకు వంగాడు. త్వరలోనే మేము సెర్పుఖోవ్‌లో ఉంటాము.

గ్రిగోరీ ఇవానిచ్ యువతుల ఎనామెల్ కేటిల్‌ను  చూశాడు.

“నేను మీ ఈ చిన్న కెటిల్ లో నీళ్లు నింపమంటారా?”

అనూహ్యమైన ఈ ప్రశ్నతో ఆశ్చర్యపోయిన జెన్యా, అతని వైపు ప్రశ్నిస్తున్నట్లు చూసింది.

“సరే!….”

రైలు ఆగగానే, బూట్ల చప్పుడు, కేటిల్స్ చెప్పుడ్లతో కారిడార్ గుండా వేగంగా వెళ్లాయి. జెన్యా కిటికీలోంచి బయటకు తల పెట్టింది.

“వెనుకబడిపోకండి, త్వరగా వచ్చేయండి !” అని  అతని వెనుక గట్టిగా అరిచింది.

ఆనందాతిశయంతో గ్రిగోరీ ఇవానిచ్ ఎక్కడైనా తడబడి పడిపోయాడేమోనని నేను చూడటానికి కూడా భయపడ్డాను.

రైలు సెర్పుఖోవ్ స్టేషన్ దాటిన తర్వాత విశాలమైన మైదానాల్లోకి ప్రవేశించింది. చంద్రుడు ఎర్రటి మంటలా ఉన్నాడు. నీడలు చర్చిలను, గ్రామాలను, పొగమంచుతో నిండిన పొలాలను మింగేస్తున్నాయి. టీ తాగుతూ గ్రిగోరీ ఇవానిచ్ యువతులతో మాట్లాడటంలో కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ జెన్యా చూపిస్తున్న  అతి శ్రద్ధను నేను నమ్మలేదు.

…ఆమె స్వభావం కారణంగా, ఆమెకున్న ఆ గుండ్రటి కళ్ళ నవ్వును నేను నమ్మలేదు. మాస్కోలోని రాజకీయ ప్రదర్శనలలో ఆమె ఎర్రటి కండువా ధరించడానికి,  ట్రేడ్ యూనియన్ కమిటీ యొక్క కమ్యూనిస్ట్ అధ్యక్షుడి వైపు చూసి నవ్వేలా చేసిన అవే భావాల వల్ల ఈ నవ్వు పుట్టలేదా? అవును, ఆమె చాలా జిత్తులమారిది, బాస్‌లతో ఎలా మంచిగా ఉండాలో ఆమెకు బాగా తెలుసు. త్వరలోనే సోన్యా, ఆమె ఆలూప్కాకు, ఆపై క్రిమియా దక్షిణ తీరం గుండా వెళ్తున్నారని మాటల్లో మేము తెలుసుకున్నాము. 1914లో వారు కేవలం పాఠశాల విద్యార్థినులుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నారని, ఆపై యుద్ధం వచ్చింది. అక్కడ ఒక పెద్ద భయాందోళన, తీవ్రమైన కలకలం రేగిందని కూడా తెలిసింది.

“కానీ సోన్యా, నీకు బైదరీ ద్వారాలు  గుర్తులేవా?”

“ఆహ్, బైదరీ ద్వారాలా!…” సోన్యా ముఖంలో ఆనందంతో కూడిన ముడతలు పడ్డాయి.

“నువ్వు కూడా సెవాస్టోపోల్‌కు వెళ్తున్నావా?” జెన్యా అడిగింది, ఆమె కళ్లలో ఒక సరదా, సూటియైన సవాలు కనిపించింది. దీపపు నీడలో, తులిప్ రేకుల క్రింద, పియానో మీదుగా, ఆ సవాలు ఇంతకుముందు ఎంతమందికి విసిరిందో? ఎంతమందికి అని నేను ఆశ్చర్యపోయాను.

“లేదు, నేను సింఫెరోపోల్ గుండా వెళ్తున్నాను. ఆ… బైదరీ ద్వారాలు, నేను వాటిని ఇప్పటికే చూశాను. మా బ్రిగేడ్ ఆ ప్రాంతమంతా తిరిగింది…”.గ్రిగోరీ ఇవానిచ్ ప్రత్యేకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాడు.

“ఇదిగో, నేను ఇదంతా రాసి పెట్టుకున్నాను. ఏది ఎక్కడ ఉందో, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది! ఖార్కోవ్ తర్వాత మనం చికెన్ బాగా దొరికే ప్రాంతంలో ఉంటాము, అక్కడ మీరు మీకు నచ్చినంత తినవచ్చు, హా-హా-హా!” గ్రిగోరీ ఇవానిచ్ యొక్క గరుకు, చిన్న నవ్వు ఆడవారు మర్యాదపూర్వకంగా నవ్వే చిరునవ్వులా ఉంది. ” మెలిటోపోల్ తర్వాత అక్కడ వేయించిన బుల్‌హెడ్స్ చేపలు ఉంటాయి. బుల్‌హెడ్స్ చాలా అద్భుతమైనవి, హా-హా-హా!”

అతను ఒకచోట ప్రశాంతంగా కూర్చోలేకపోయాడు, అతను ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు, అతను ఆ గంభీరమైన  స్త్రీలకు పదే పదే టీ కావాలా అని అడుగుతూ ఇబ్బంది పెడుతున్నాడు.

మొదట్లో వారు వద్దన్నారు. కానీ తరువాత వారు తమ బ్యాగ్ తెరిచి భారీ సైనిక కప్పులు తీసి, సంకోచిస్తూ గ్రిగోరీ ఇవానిచ్ వైపు చాచారు. గ్రిగోరీ ఇవానిచ్ పోయడం ప్రారంభించాడు, అతను తన చేయి నొప్పితో అలసిపోయేంతవరకు చాలా సేపు, ఓపికగా టీ పోస్తూనే ఉన్నాడు. కానీ ఆ మగ్‌కు అడుగే లేనట్లు అనిపించింది. గ్రిగోరీ ఇవానిచ్ ఇబ్బందిగా భావించాడు, కానీ ఆపడం మరింత ఇబ్బందికరంగా ఉండేది,  సిగ్గుపడుతూ తన మగ్‌ను చాచిన ఆ స్త్రీ కూడా ఇబ్బంది పడింది. ఆమె తెల్లటి పళ్ళు జాలిగా నవ్వాయి. ఆ  ప్రయత్నం తర్వాత గ్రిగోరీ ఇవానిచ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు, ఎవరో తనపై ఉమ్మివేసినట్లు, భూమి విడిపోయి తనను మింగేస్తే బాగుండునని అతను కోరుకున్నాడు.

సాయంత్రానికి మేము టులా నగరంలోకి ప్రవేశించాము, అది మినుకుమినుకుమనే దీపాలతో కూడిన ఒక చల్లని హాయిగా ఉన్న సాయంత్రం. యువతులు దీపపు వెలుతురు ఉన్న చల్లదనంలో నడవడానికి బయటకు వచ్చారు…నెమ్మదిగా ఇటు అటు నడిచారు, మాకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మగ్‌ల అనుభవం తర్వాత గ్రిగోరీ ఇవానిచ్ వారిని సమీపించడానికి ధైర్యం చేయలేదు. దయనీయమైన ఒంటరితనంలో దూరంగా ఉండిపోయాడు. కానీ నేను సంతోషించాను. నన్ను బంధించిన గోడలు చివరకు విడిపోయాయి. ఈ తాజా చీకటిలో నేను ప్రతి స్టేషన్‌కు ఆవల వేలాది జీవితాలతో కూడిన అంతులేని నగరాన్ని ఊహించుకోగలను, వాటిలో ఏవైనా నా జీవితంతో ముడిపడవచ్చు.  బెరెజ్నెవాట్కా  వంపు తిరిగిన ఆవల ఎక్కడో ఉంది.

జెన్యా ఒక వెచ్చని అల్లిన జాకెట్ వేసుకుని, కారిడార్‌లోకి, తెరిచిన కిటికీ వైపు వెళ్ళింది. బయట చల్లని గాలి వీస్తున్న రాత్రి ,  అద్భుతమైన అడవులు అంతులేకుండా వేగంగా దాటిపోతున్నాయి,  అదంతా అది అంతం లేని ఒక పాటలా సాగిపోతోంది. ఇప్పుడు ఆమె అసలు ముఖాన్ని,  అలసటతో నిండిన ముఖాన్ని చూడగలిగే సమయం వచ్చింది! కానీ గ్రిగోరీ ఇవానిచ్ అక్కడ లేడు, అతను రైలులోని మరొచోట తిరుగుతున్నాడు.  తరువాత స్టాప్‌లో, ఫస్ట్-క్లాస్ క్యారేజ్ నుండి క్లీన్-షేవ్ చేసుకొన్న ఒక యువకుడు కిటికీ గుండా కనిపించాడు. అతను మంచి దుస్తులు ధరించాడు, జెన్యా వైపు అతను కళ్ళను ఎత్తి చూస్తూ చాలా అద్భుతంగా పాడాడు. కిటికీల కింద పాడటం, చెట్లు గలగలలాడుతుండటం, ఎవరైనా నిన్ను రాత్రిలోకి తీసుకెళ్లడం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అది తనలో తాను ఆశ్చర్యపోయే ఒక ఆనందం. పాపం గ్రిగోరీ ఇవానిచ్, నువ్వు ఎంతటి క్షణాన్ని కోల్పోయావు! కానీ ఇదిగో అతను వచ్చాడు, మా గ్రిగోరీ ఇవానిచ్, కారిడార్‌లో  పూర్తిగా రొప్పుతున్నాడు. బహుశా వెనుకబడిపోయేవాడేమో. రెండు చేతుల క్రింద ఒక పెద్ద పుచ్చకాయ ఉంది.

“మంచి పుచ్చకాయలు !” అని అతను ఉక్రేనియన్ భాషలో మా వైపు అరిచాడు. తన బహుమతిని వదలకుండా, తన భారీ శరీరాన్ని సీటుపై పడేస్తూ, తన గరుకు చిన్న నవ్వును ఆపుకోలేకపోయాడు.

“అమ్మాయి గారూ, మీ అసలు పేరు నాకు తెలియదు! మీకు అక్కడ బయట కంటికి నచ్చినది ఏదో దొరుకుతుంది. నేను కేవలం ఇరవై కొపెక్స్‌కు కొన్న ఈ రెండు పెద్ద పుచ్చ కాయలను వచ్చి చూడండి!”

జెన్యా నిరాసక్తంగా చూసింది, వెలుతురులో ఆమె కళ్ళు మంచులా  కలలు కంటున్నట్లు ఉన్నాయి, ఆమె తల ఊపింది. లేదు, ఆమెకు ఏదీ వద్దు, ఇప్పటికే చాలా చలిగా ఉంది.  ఆమె వణుకుతూ నుదురు ముడిచింది.

“సోన్యా, నువ్వు ఇప్పుడు పడుకోబోతున్నావా?”

కానీ గ్రిగోరీ ఇవానిచ్‌ దేనికీ ఒప్పు కోవడానికి సిద్ధంగా లేడు.

“చూడండి ఇది ఎంత అందంగా ఉందో,” అని అతను, హఠాత్తుగా పుచ్చకాయను తన మోకాలిపై ఒక దెబ్బతో కిందకు కొట్టాడు.

అది పగుళ్లు ఇచ్చి, లోపల ఎర్రటి రంగుతో, చక్కెర కారుతున్నట్లున్న గుజ్జుతో నిండిన రెండు రసవత్తరమైన ముక్కలుగా విడిపోయింది, దానిని ఒక కత్తితో జెన్యా కోసం  కోసాడు.

“ఇదిగోండి, మిస్!” అంటూ గ్రిగోరీ ఇవానిచ్ మాకందరికీ ఒక్కొక్క ముక్కను పంచాడు, ఆయన సంతోషాన్ని పంచుతున్నట్లుగా ఉంది.

దాంతో జెన్యా ఆపుకోలేక పిచ్చిగా నవ్వసాగింది, ఆ  లావుపాటి ఆమె కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. ఆ అలిగిన దంపతులు, నేను కూడా ఆ ముక్కలను తీసుకుని, కరుగుతున్న వసంతకాలపు మంచు వాసన వచ్చే ఆ చల్లదనాన్ని తిన్నాము. అంతసేపూ మౌనంగా ఉండిపోయిన గ్రిగోరీ ఇవానిచ్, ఇప్పుడు మా ఐదుగురి కోసమూ సరిపోయేంతగా వాగుతూ, నవ్వుతూ ఉన్నాడు.

…రాత్రివేళ తోటల మధ్య రైలు ఆగింది.

నేను ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లాను. నీలిరంగు లాంతరు వెలుతురులో ఆ స్టేషన్ పేరు కనిపించింది. ఒకప్పుడు డెనికిన్, మామొంటోవ్ ఇక్కడి నుండే వెళ్ళారని, ఆ తర్వాత మా రెడ్ ఆర్మీ రైళ్లు వారి వెనుక వెళ్లాయని గుర్తుకు వచ్చింది. నేను వెలుతురు వైపు వెన్నుతిప్పి, కళ్ళు సగం మూసుకుని, ఆనాటి దృశ్యాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాను.

పగిలిన కిటికీలు, స్టేషన్ హాల్‌లో కిరోసిన్ దీపాల వణుకుతున్న వెలుతురు… అక్కడ మాస్కోకు వ్యతిరేకంగా పంపబడిన, చిరిగిన బట్టలతో, నిరాశతో, పేలతో నిండిన సైనికులు తమ తుపాకులతో నేలపై, బెంచీలపై ముడుచుకుని కూర్చుని ఉన్నారు, అదే సమయంలో రైలు ఇంజన్లు ప్రాణాంతక గాయాలైన జంతువులలా గర్జిస్తున్నాయి. కానీ నేను దానిని పూర్తిగా ఊహించుకోలేకపోయాను. నది లాంటి చల్లదనం నన్ను తన కౌగిట్లోకి తీసుకుంది, చీకటి తోటలలో ఆకులు ధైర్యంగా, దట్టంగా, కొత్తగా చప్పుడుస్తున్నాయి. ఓహ్, ఈ గడ్డిలో పడుకుని, గడ్డిభూముల నుండి వీచే గాలి నాపై గుసగుసలాడుతుండగా నిద్రపోవాలి అనిపించింది….

దూరంలో నాకు గ్రిగోరీ ఇవానిచ్ కనిపించాడు. ఆయన పొట్టకు మరో పెద్ద కర్బూజా పండును అణచిపెట్టుకుని సంతోషంగా రైలు పెట్టె వైపు దుముకుతూ వస్తున్నాడు. మెట్ల దగ్గర మేమిద్దరం దాదాపు ఒకరినొకరు ఢీకొట్టుకునేంత పని అయింది, కానీ ఆయన నన్ను జాగ్రత్తగా తప్పించుకుని, తన నరాల బలహీనత వల్ల వచ్చే వణుకు తగ్గే వరకు పక్కకు తిరిగి నిలబడ్డాడు.

అందరూ నిద్రపోతున్న చీకటిగా ఉన్న కంపార్ట్‌మెంట్ లో, ఆయన నా భుజంపై చేయి వేసాడు.

“చాలా ఆలస్యమైంది. ఇది చాలా గొప్ప పుచ్చకాయ. నీకు కొంచెం కావాలా?” ఆపై ఆయన గుసగుసలాడుతూ కంగారుగా అడిగాడు: “రాత్రికి నా బూట్లను నేనేం చేయాలి? నా కాళ్లు వాసన వస్తున్నాయి.”

“ఏం పిచ్చి మాటలు,” అన్నాను నేను.

అయినప్పటికీ, ఆయన ఒక అమరవీరుడిలా పడుకున్నాడు, ఆయన భారీ బూట్లు తొడిగిన కాళ్లు ఆ పడక అంచు నుండి కిందకు వేలాడుతూ ఉన్నాయి.

నేను నా లోకంలో మిగిలిపోయాను, రైలు మామొంటోవ్ రైలు పట్టాలపై దూసుకుపోయింది. చీకటి పొలాలు రోడ్లను, పట్టణాలను చుట్టుముట్టాయి, నా కలలు ఒక పెద్ద మేఘంలా మారాయి.

వసంతకాలపు బిజీ నీళ్లలా ఇప్పుడే చేతికొచ్చిన పంట ముగిసిన, వందలాది  మైళ్లు కొద్దీ సాగిన అంతులేని పసుపు రంగు మొడులు. పొదలు, పోప్లర్ చెట్లలో నడుము లోతున మునిగిపోయిన  స్టేషన్లు, ప్లాట్‌ఫారమ్‌పై ఆహారంతో, కుండలతో, పుచ్చకాయలతో ఉన్న కాళీ కాళ్ళ మహిళలు, గ్రామం తోటల పంట అంతా అక్కడ ఉంది, వారి బుగ్గలు పండిన రేగు పండ్లలా ఉన్నాయి. స్టేషన్ పైన సూర్యుడు ఉన్నాడు, దానికి ఆవల ఆ  రోడ్లు వంకరలు తిరిగి ఉన్నాయి, అక్కడ కొద్ది రోజుల క్రితమే మఖ్నో, ష్చుస్  ఖ్మారా రెడ్ ఆర్మీ కూంబింగ్ విభాగాల నుండి తప్పించుకున్నారు. ఆ రోడ్లలో ఒకదానిపై, దాని బూడిద-నీలం రంగు దుమ్ముపై, ఎద్దులు ఒక బండిని లాగుతున్నాయి, బండిపై బోర్లా పడుకుని ఉన్న ఒక యువ విముక్త సైనికుడు, నిద్రమత్తుతో నిండిన కళ్లతో రైలును చూడటానికి తల పైకెత్తాడు. గ్రామానికి ఆవల ఉన్న గుంతలలో, పాత స్తంభాలు, తుప్పు పట్టిన ముళ్ల తీగలతో, బర్డాక్, రేగుడు మొక్కలు దట్టంగా పెరిగాయి, సాలీడు గూళ్లు.  చీకటిలో కోళ్లు కొక్కొరోకో అని అరుస్తున్నాయి.

అంతా గడ్డి దట్టంగా పెరిగిపోయి, అజ్ఞానంతో, మొండితనంతో నిండిపోయింది.

మళ్లీ మేము మా కంపార్ట్‌మెంట్‌లో పుచ్చకాయలు తిన్నాము, ఖార్కోవ్ దగ్గర చౌకగా దొరికే చికెన్ తిన్నాము, నిజానికి అప్పటికి మాకు దానిని చూడాలని కూడా లేదు, తినడం సంగతి పక్కన పెడితే, గ్రిగోరీ ఇవానిచ్ కేటిల్ నుండి ఎన్నిసార్లు టీ తాగామో ఎవరికి తెలుసు. ఆ తెల్లటి జుట్టు అమ్మాయికి మలబద్ధకం

వచ్చిందని నేను అనుమానించాను, అమాయకుడైన గ్రిగోరీ ఇవానిచ్ ఆ ఇద్దరు యువతులను తన కంటి చూపు నుండి అస్సలు తప్పించలేదు, తన బూట్ల వెనుక ఉన్న ముళ్లతో శబ్దం చేస్తూ వారిని రక్షిస్తున్నట్లు వెనుక నడిచాడు, ఖార్కోవ్‌లోని స్టేషన్ లెటర్ బాక్స్ వరకు వారిని తీసుకువెళ్లడానికి తనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. ఆ తెల్లటి జుట్టు అమ్మాయి స్టేషన్ టాయిలెట్‌లో కాసేపు ప్రశాంతంగా ఉండటానికి ఆ లెటర్ బాక్స్ ఆలోచన చేసిందని భావించాను, ఇప్పుడు ఆమె జెన్యా చేతిని పట్టుకుని బాధతో ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తోంది, జెన్యా మాత్రం నవ్వుతూనే ఉంది, ఫస్ట్ క్లాస్ బోగీ కిటికీల వైపు సరదాగా చూపులు విసిరింది.

నేను మనసులోనే నవ్వుకున్నాను. “చూశావా, నువ్వు నా మాట వినలేదు గ్రిగోరీ ఇవానిచ్!” కానీ ఆయన ఉనికి కోల్పోయాడు. ఆ గరగరమనే నవ్వు, ఆ ముళ్లు, అవి నిజంగా గ్రిగోరీ ఇవానిచ్‌వేనా?

ఈ అజ్ఞానం మొండితనం ఉన్న చోటు నుండి, మా కంపార్ట్‌మెంట్‌లోకి మా పాత వాళ్ల స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక కొత్త కుటుంబం వచ్చింది.

ఖార్కోవ్‌లో ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా తప్పించుకున్న ఒక దిగులైన జంట. బలమైన, కోపంగా ఉన్న ఆ స్త్రీ చేతుల్లో ఒక చిన్న పాప ఉంది. ఆమె భర్త, జిప్సీ లాంటి నిప్పులు కురిపించే కళ్లతో ఉన్న ఒక యువకుడు, ఆమెను అనుసరిస్తూ దాదాపు నాలుగేళ్ల చిన్నారిని నడిపించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వారి సంచులు, బుట్టలు, దుప్పట్లు వచ్చాయి. అవన్నీ ఆ అందమైన యువతి బెడ్‌పై ఏడుస్తున్న పాపతో కలిసి ఒక కుప్పలా పడేశారు. ఆ తల్లి, ఏ మాత్రం పట్టించుకోకుండా, తన రొమ్మును బయటకు తీసి వెంటనే పాపకు పాలు ఇవ్వడం ప్రారంభించింది. ప్రతి స్టాప్‌లోనూ ఆ యువకుడు ఆహారంకోసం, వేడి నీటి కోసం బిజీగా పరిగెత్తాడు. ఈ అణకువ స్వభావం గల యువకుడు శాంతంగా, క్షమాపణ కోరే ధోరణితో ఎవరికీ ఫిర్యాదు చేయకుండా అందరినీ చూసుకోవడం చూస్తుంటే, నేనే అతడిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు నాకు అనిపించింది.

ఆ యువతులు పక్కచూపులు చూస్తూ, భుజాలు ఎగరేస్తూ, తమ పెదవులపై విషాన్ని దాచుకున్నారు. ఆ యువతులు అసంతృప్తిగా ఉన్నారు.

 నిజంగానే, పుచ్చకాయ తొక్కలు, గుజ్జు ఇతర నమలని ముక్కలు నేలంతా చెల్లాచెదురుగా పడ్డాయి, అక్కడ ఒక

జారే బురదలాంటి చెత్త ఏర్పడింది, దానిపై చేతిలో పెద్ద పుచ్చకాయ ముక్క పట్టుకున్న పెద్ద అమ్మాయి తన మనసుకు నచ్చినట్లు ఎగురుతూ, గెంతుతూ ఉంది.  ఆమె మరిగే నీటితో నిండిన కేటిల్‌ లో టీ ఒలికించి, ఆ అందమైన యువతి స్కర్ట్‌పై మరకలు పడ్డాయి .

అప్పుడు ఆమె గట్టిగా ఏడవడం ప్రారంభించింది.

“ఇది అసహ్యంగా ఉంది, నేను దీనిని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంత గందరగోళాన్ని, ఇంత అస్తవ్యస్తతను సృష్టించడం, ఒకరి దుస్తులను పాడు చేయడం…. నేను ఫిర్యాదు చేస్తాను.”

ఆ స్త్రీ చుట్టుపక్కల కూడా చూడకుండా, ఏ మాత్రం పట్టించుకోకుండా తన పాపను జోలపాడుతూ ఊపింది.

“కంపార్ట్‌మెంట్‌ను పాడు చేసినందుకు మీకు జరిమానా విధిస్తారు,” అని నేను అన్నాను, జోక్యం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తూ. “చూడండి, ఇది ఎలాంటి స్థితిలో ఉందో.”

ఆమె నిగ్రహించుకున్న నిశ్శబ్దం బద్దలైంది.

“సరే, వేయనివ్వండి!” ఆమె కేకలు వేసింది. “నాకు పిల్లలు ఉన్నారు. మీరు చూస్తూన్నారుకదా పిల్లలు! ఇక్కడ మీకు తగినంత సౌకర్యం లేకపోతే మీరు ఫస్ట్ క్లాస్‌లో ఎందుకు

ప్రయాణించకూడదు? కేవలం చాలా….”

ఆ యువకుడు సీటు పై తన మోచేతులను ఆనించి వెనక్కి నిలబడి  నవ్వాడు. అది పొగరో లేక అమాయకత్వమో  చెప్పలేరు. నేను అతని వైపు ఉద్దేశపూర్వకంగా చూశాను. నేను ఆ పాత ఆందోళనకరమైన రోజులలో చూశానని అనుకున్న, కానీ గుర్తుకు తెచ్చుకోలేకపోయిన ఆ చిరునవ్వుతోనే అతను నా వైపు చూస్తూ నవ్వుతూనే ఉన్నాడు. నేను ఆ స్త్రీకి కఠినంగా సమాధానం ఇచ్చాను.

“మేము ఎవరో సామాన్యులం కాము, మేము సోవియట్ సంస్థలలోని కార్మికులం. ఆ విషయాన్ని మనసులో ఉంచుకోండి.”

” మీరు ఒక సీటు మొత్తాన్ని  ఆక్రమించుకుంటున్నారు!” ఆ తెల్లటి జుట్టు గల యువతి కన్నీళ్ల మధ్య మళ్లీ అరిచింది, తన తడి స్కర్ట్‌ను సర్దుకుంటూ.

గొడవ పడే ఆలోచన నాకు ఇష్టం లేదు. నేను బయటకు వెళ్ళాను,   తెరిచిన కిటికీ పక్కన ఉన్న కారిడార్ చివర ఎన్ని గంటలు నిలబడ్డానో నాకు తెలియదు.

పొలాలు అనంతమైన దూరంలో వెనుకకు ప్రవహిస్తున్నట్లు ఉన్నాయి. తెల్లవారుజామున వెచ్చని కాంతికి , దూరాన్న కొండల ఊదా రంగు రేఖలు పైకి వస్తున్నాయి . ఇంకా కనిపించని సూర్యుడి నుండి వచ్చిన కాంతితో సైనికుల ముఖాలు గులాబీ రంగులో మెరుస్తుండగా, ఆ కొండపై తెల్లవారుజామున ఒక పూర్వం సైన్యం నడుస్తున్నట్లు నేను ఊహించుకున్నాను. అవును, ఇది బెరెజ్నెవాట్కా , మూడు వందల మంది నా సహచరులను బలితీసుకున్న భూమి మొదటి పాట-శ్వాస, వారిలో ప్రతి ఒక్కరినీ నేను వారి మొదటి పేరుతో పిలిచేవాడిని. రాత్రి వేళ రైలు తన నిశ్శబ్ద స్లీపింగ్ భోగీలతో  వారిపై నుండి దూసుకుపోతుంది.

రాత్రి ఒక ప్రమాద అలారమ్ మోగింది.

సెరెబ్రియానోయే-బెరెజ్నెవాట్కా మార్గంలో ముందు రోజు రాత్రి ఒక దొంగల ముఠా ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకుంది. కాబట్టి జంక్షన్ వద్ద ఒక సాయుధ గార్డు మా రైలు ఎక్కాడు. 1919 నాటి దాదాపు మర్చిపోయిన తుఫానుల శ్వాస ఆ బండి అంతటా వ్యాపించింది. ప్రయాణికులు వారి చీకటి కంపార్ట్‌మెంట్‌లలో గుంపులుగా చేరారు, యువకులు నవ్వారు, పై బెడ్లలో ఒకదానిపై గడ్డం ఉన్న పౌరుడు చాలా ఆందోళన చెందాడు: “వారు ఏమి ప్లాన్ చేస్తున్నారో ఆ దెయ్యానికే తెలియాలి, బహుశా వారు ఇప్పటికే ఎక్కడో మాటు వేసి ఉన్నారేమో!” “అది మిమ్మల్ని భయపెడుతుంటే మీ జేబులో చాలా డబ్బు ఉండి ఉండాలి!” అని బల్బస్  బ్రీచెస్ ధరించిన, వంకర కాళ్లు ఉన్న ఒక హుషారు కుర్రాడు అతనిని చూసి నవ్వాడు.

మా కంపార్ట్‌మెంట్‌లో ఒక మినుకుమినుకుమనే కొవ్వొత్తి వెలిగించారు.ఆ స్త్రీ, మళ్లీ ఎవరినీ పట్టించుకోకుండా, తన పాపకు పాలు ఇస్తోంది. తన జీవితంలో ఆమె ఇంకా ఎన్ని ఇలాంటి కఠినమైన సాయంత్రాలను చూస్తుందో? ఆ యువకుడు, ఎప్పటిలాగే నిశ్శబ్దంగా సహాయం చేస్తూ, రాత్రికి వారందరికీ ఆహారం అందించాడు, పరుపులు సిద్ధం చేశాడు. నీటి కోసం వెళ్ళాడు. అవి నాపై ఊపిరాడని ప్రభావాన్ని చూపాయి.

అది ఒక కాలరాత్రి, నిజంగా దొంగలకు సరిపోయే రాత్రి. ప్రయాణికులు త్వరగా నిద్రపోవడానికి ఆతురత పడ్డారు, తద్వారా వారు తమ ఆందోళనను మర్చిపోయి సూర్యకాంతిలో మేల్కొనవచ్చు. ఒంటరిగా ఉన్న ఆ అందమైన యువతి, తన విశాలమైన మాతృత్వపు భావంతో కంపార్ట్‌మెంట్‌ను ఆక్రమిస్తూ, కోపంగా పై బెడ్ కి చేరుకుంది. నేను ఒంటరిగా మిగిలిపోయాను.

నేను గ్రిగోరీ ఇవానిచ్ కోసం వెతకాలని నిర్ణయించుకున్నాను. రైలు కిందికి వెళుతోంది. నేను కారిడార్‌లో ఇటు అటు తిరుగుతున్నాను . నా స్పర్శకు బండి చివర ఉన్న తలుపు తెరుచుకుంది—గట్టి శబ్దంతో, కిర్రుమనే ధ్వనితో, చల్లగా. అతను అక్కడ ఉన్నాడు, కానీ ఒంటరిగా లేడు. వారిద్దరూ కిటికీలోంచి బయటకు వంగి, సంతోషంగా ఒకరినొకరు అతుక్కుని ఉన్నారు.

మొదట్లో నాకు అర్థం కాలేదు. నిజానికి, జెన్యా దొంగలకు బాగా భయపడటం వల్లే అలా జరిగింది. ఇప్పుడు ఆమెకు ఒకరి విశాలమైన, భరోసానిచ్చే శక్తి అవసరమైంది. లేకపోతే ఆమెను అకస్మాత్తుగా ఒక రష్యన్ రైతు రెక్కలవంటి చేతులు క్రిందకు ఎందుకు వెళ్ళింది ?

“స్టేషన్ ఇంకొంచెం ముందే ఉంది, నేను మీకు చూపిస్తాను…” గ్రిగోరీ ఇవానిచ్ చెప్తున్నాడు, నేను ఎవరి కోసమైతే ఎదురుచూస్తున్నానో ఆ మరో గ్రిగోరీ ఇవానిచ్ స్వరం ఇది. “కానీ మీరు చూస్తున్నట్లుగా నేను ఇంకా బతికే ఉన్నాను, సముద్ర తీరానికి వెళ్తున్నాను. రెండు లేదా మూడేళ్లలో, బహుశా నేను మళ్లీ ఇదే దారిలో వెళ్తానేమో, అప్పుడు అంతా మారిపోతుంది, నేను రెండు భాషలు మాట్లాడుతుంటాను….”

“నాకు ఇంకా కొన్ని విషయాలు చెప్పండి…” జెన్యా నిశ్శబ్దంగా అడగడం లేదా వేడుకుంటున్నట్లు మరేదో అనడం నేను విన్నాను. వారు నన్ను చూడలేదు, నేను వెనక్కి జరిగి నిశ్శబ్దంగా తలుపు మూశాను.

నాకు ఎందుకు అకస్మాత్తుగా ఒక అస్పష్టమైన దుఃఖ భావన కలిగిందో తెలియదు. బహుశా నేను తప్పుగా ఊహించడం వల్లేమో.  జీవితం నా బలహీనమైన ఆలోచనలను సులభంగా తొక్కేసింది. బహుశా నేను కూడా జీవితంలో విజయవంతంగా ముందుకు సాగాలని అనుకున్నందుకేమో.

దాంతో నేను కంపార్ట్‌మెంట్‌లోని నా మూలకు తిరిగి వచ్చి కునుకు తీశాను. అందరూ నిద్రపోతున్నారు; ఆ మంచి యువకుడు కూడా ఇనుప స్తంభానికి తల ఆనించి నిద్రపోతున్నాడు.

బెరెజ్నెవాట్కాకు ఇప్పుడు పెద్దగా దూరం లేదు. బెరెజ్నెవాట్కాకా? అంటే భూమిపై నిజంగానే అలాంటి ప్రదేశం ఒకటి ఉందన్నమాట?

… అర్ధరాత్రి సమయంలో మా పత్రాలను తనిఖీ చేయడానికి సాయుధ గస్తీ బృందం వచ్చింది.

భోగీ లో మసకగా ఊగుతున్న మూలలు నిద్రలో సగం మునిగిపోయాయి. ఆ యువకుడు కూడా నిద్రమత్తులో కళ్ళు తెరిచి, నన్ను అగ్గిపెట్టె అడిగి, తన జేబుల్లో జాగ్రత్తగా వెతికాడు.

“ముందుగా చూడటానికి ఇదిగో నా పార్టీ కార్డ్,”

అన్నాడతడు. “ఒక్క నిమిషం ఆగండి, నా పాస్‌పోర్ట్ వెతుకుతాను.”

ఆ పత్రాన్ని పరిశీలించడానికి ఒక దీపం ముందు రెండు నుదుళ్ళు ఒకచోటికి వచ్చాయి.

“ఇది సరిపోతుంది,” అని వారు కరుకైన స్వరంతో గౌరవంతో అన్నారు. నిద్రిస్తున్న, నిరంతరం సాగుతున్న, వేగంగా దూసుకుపోతున్న నిశ్శబ్దంలో మేము ఒంటరిగా మిగిలిపోయాము. నా ఎదురుగా ఉన్న వ్యక్తి కళ్ళు నన్ను ఏదో అడుగుతున్నట్లు అనిపించింది.

“కామ్రేడ్,” అన్నాడతడు అకస్మాత్తుగా లోతైన స్వరంతో ముందుకు వంగుతూ, “జరిగిన దానికి, నా భార్య ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఆమె కొంచెం,” అతను మంచి మనసుతో నవ్వుతూ, “ఆమె కొంచెం ఆందోళనగా ఉంది, మీకు తెలుసుగా; అండర్‌గ్రౌండ్‌లో పనిచేయడం వల్ల ఆమె అలా అయిపోయింది.”

నేను కొద్దిగా ఆశ్చర్యపోయాను, కానీ త్వరపడి మర్యాదగా అతనికి భరోసా ఇస్తూ, నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయానని చెప్పాను. అతనికి మాట్లాడాలని ఆత్రుతగా ఉన్నట్లు అనిపించింది. అతడు దొంగల గురించి ప్రస్తావించాడు. నాకు ఈ ప్రాంతం బాగా తెలుసని చెప్పాను…

…అవును బెరెజ్నెవాట్కాకు ముందు ఒక వాలు ఉంటుంది, ఆ తర్వాత ఒక కటింగ్ వస్తుంది. మాటు వేయడానికి అది అత్యంత అనుకూలమైన ప్రదేశం. సిక్స్త్ ఆర్మీ పెరెకాప్‌ను బద్దలు కొట్టినప్పుడు నేను వారితో కలిసి ఇక్కడే ఉన్నాను.

అతడు ఎంతో సంతోషించాడు.

“అవును, నాకు తెలుసు. ఆ తర్వాత మీరు క్రిమియాలోకి వచ్చారు. నేను అక్కడి నుంచే వచ్చాను.”

ఆ యువకుడు ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని  ప్రత్యేక విభాగంలోని కొందరు వ్యక్తుల పేర్లను, అలాగే కొందరు డివిజన్ కమాండర్ల పేర్లను చెప్పాడు. కానీ, అతనికి నా పేరు గుర్తుకు రాలేదు.

“బహుశా మీరు నా గురించి వినే ఉంటారేమో? యాకోవ్లెవ్, ఒక పార్టిసన్. మేము సింఫెరోపోల్‌లో సిక్స్త్ ఆర్మీతో కలిశాము.”

ఒక ఉద్వేగభరితమైన వణుకు నాలో ప్రవహించింది. ఈయనేనా యాకోవ్లెవ్? ఖచ్చితంగా, నాకు అతడు గుర్తున్నాడు. డివిజన్ నిఘా విభాగంలో ఉన్నప్పుడు, చావుతో దొంగాట ఆడిన, వ్రాంగెల్ వెనుక భాగాన్ని నిశ్శబ్దంగా తన ఆధీనంలోకి తీసుకుంటున్న సైన్యానికి కమాండర్ అయిన ఈ సాదాసీదా యువకుడి ఫోటోను మేము ఒకప్పుడు ఆసక్తిగా పరిశీలించాము. యాకోవ్లెవ్! శీతాకాలంలో, అడివి మృగాలకు మాత్రమే తెలిసిన మంచు దారుల గుండా యైలా పర్వతశ్రేణిని దాటిన పూర్వపు ప్రయాణం గురించి, యాకోవ్లెవ్ గురించి మనలో ఎవరికి తెలియదు? అతని సోదరుడిని సెవాస్టోపోల్‌లో ఉరితీశారు.

“అత్యంత ఘోరమైన సమయం శీతాకాలం, కానీ మేము ఎలాగోలా తప్పించుకోగలిగాము. మేము బైదరీకి దగ్గరగా ఉన్న ఒక గుహలో దాక్కునేవాళ్ళం. సెవాస్టోపోల్ కమిటీతో మాకు మధ్యవర్తిగా నా భార్య పనిచేసేది.”

నేను ఎంతో ఉద్వేగంతో అతని మాటలు విన్నాను. ఇప్పుడు మేము ఇక ఎంతమాత్రం ఆ కంపార్ట్‌మెంట్ చీకటిలో బంధించబడి లేము, మేము అక్కడ బెరెజ్నెవాట్కా భూముల ఊహల మధ్య ఉన్నాము. అతడు కుప్యాన్స్క్ జిల్లాలో ఎక్కడో మిలీషియా చీఫ్‌గా పనిచేశాడని, ఇప్పుడు తన సొంత ఇల్లు ఉన్న యాల్టాకు దగ్గరగా బదిలీ అవుతున్నాడని,  బైదరీ గేట్లను మళ్లీ చూడటం కోసమే అతడు, అతని భార్య కావాలనే సెవాస్టోపోల్ మీదుగా ప్రయాణిస్తున్నారని చెప్పాడు. రైలు చప్పుడు ఒక విషాదభరితమైన, శక్తివంతమైన సంగీతంలా వినబడటం ప్రారంభమైంది. నిద్రమత్తులోనే గ్రిగోరీ ఇవానిచ్ లోపలికి రావడం, తన పెద్ద కోటును తీసుకుని మళ్లీ బయటకు వెళ్లడం నేను చూసాను. బహుశా ఆ గాలి వీస్తున్న కిటికీ దగ్గర ఉన్న ఆమె భుజాలపై దానిని కప్పడానికి కావచ్చు.

నిద్రలోనే వెలుగులతో మెరుస్తున్న ఒక చిన్న బ్యారక్ కనిపించింది, నేను బెరెజ్నెవాట్కాను గుర్తించాను.

అరిగిపోయిన వార్నిష్ పూసిన చెక్క సోఫా ఉన్న ఆ పాడుబడిన స్టేషన్ హాల్‌లోకి నేను పరుగెత్తాను; రెడ్ ఆర్మీ సైనికులు చేతుల్లో తుపాకులతో టెలిఫోన్ల దగ్గర ఉన్నారు. పక్క గదిలో, సైనికులు ఒక గొడవ జరగడానికి ముందు వినబడే భయంకరమైన గసగసలాట లాంటి శబ్దాలు చేస్తూ అటుఇటు తిరుగుతున్నారు. నేను టెలిగ్రాఫ్ ఆఫీసులోకి వెళ్లాను. అదే పెద్ద ముక్కు ఉన్న, కాకి లాంటి అర్మేనియన్ తన కీబోర్డ్‌ను నొక్కుతున్నాడు,

ఆ ఏనుగుదంతపు కీస్ నుండి జీవం పూర్తిగా పోయిందని నాకు చూపాలనే ఉద్దేశ్యంతోనే అతను అలా చేస్తు న్నా డనిపించింది

“దాటడం సాధ్యం కాదు,” అని అతను అన్నాడు.

“నువ్వేమీ దాటనక్కర్లేదు,” నేను అన్నాను, “మనం వెనక్కి తగ్గుతున్నాం.”

కొండ అంచు మీదుగా మరణం నుండి తప్పుకుని వెనక్కి వెళ్తున్న బెటాలియన్ వెనుక నేను నా గుర్రాన్ని వేగంగా పరిగెత్తించాను. ఆ కుర్రాళ్ళ ముఖాలు గంభీరంగా ఉన్నాయి, ఎండలో ఎర్రబారి ఉన్నాయి. మరణాన్ని పైనుంచి చూస్తున్న ఒక చల్లటి ఎండ అది.

“హెచ్.క్యూ (HQ) ప్లాటూన్ ఎక్కడ ఉంది?” నేను అడిగాను. నా సోదరుడు దానికి కమాండర్‌గా ఉన్నాడు. ఎవరికీ తెలియదు. కొండ అడుగున ఉన్న కంచెల వెనుక కొన్ని బెటాలియన్లు వెనుక భాగాన్ని కాపాడుతున్నాయి, అవి మరణానికి సిద్ధమైన  బెటాలియన్లు. నేల మీద నిట్టనిలువుగా పడుకుని ఉన్న రెడ్ ఆర్మీ సైనికుల పక్క నుండి నేను ప్రయాణించాను. వారు చిరిగిన గుడ్డల కుప్పల్లా కనిపించారు. కానీ వారు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా దృఢంగా ఉన్నారు, ఏం జరిగిందో తెలియని స్థితిలోనే ఉన్నారు. నా సోదరుడు పైకి దూకి, కంచె వైపు పరుగెత్తి, దాన్ని దాటడానికి గట్టిగా పట్టుకున్నాడు.

“అలెక్సీ!” నేను అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ గట్టిగా అరిచాను. “ఆ వైపు కాదు, అలెక్సీ!”

అతను వెనక్కి తిరిగి చూడకముందే నిర్జీవంగా స్తంభించిపోయాడు. నేను గుర్రం పైనుంచి దూకి అతని టోపీని తీశాను. అతని తల వెనుక భాగంలోని జుట్టు రక్తం  మాంసం ముద్దలా ముడతలు పడిపోయింది, దాని కింద ఒక లోతైన రంధ్రం ఉంది. ఇప్పుడు మేము నేను ఎన్నడూ చూడని సమాధుల మీదుగా ఉరుకులు పరుగులు పెడుతున్నాము.. … ఆ రైలు యొక్క లయబద్ధమైన మెల్లని కదలిక అందరినీ నిద్రపుచ్చింది. నేను కూడా నిద్రపోయాను.

పెరెకోప్  శివాష్ అవతల వేకువజాము వచ్చింది. ఒడ్డు లేని వెచ్చని బూడిద రంగు గడ్డి భూములు, ఆకాశంలో పక్షులు.. ఆ పక్షులు ఖచ్చితంగా అవతల ఉన్న పర్వతాలను, నీలి రంగు స్వర్గాన్ని చూడగలుగుతూ ఉండాలి. జాంకోయ్ వద్ద సూర్యుడు అకస్మాత్తుగా మాపై ప్రకాశించాడు. స్టేషన్ గోడలు ఒక్కసారిగా మధ్యాహ్నం లాగా మెరిసిపోసాగాయి. తారు ప్లాట్‌ఫారమ్‌లపై నల్లటి మృదువైన నీడలు పడ్డాయి. అవి నీటితో కడిగినట్లుగా కనిపించాయి,  ఆ చల్లదనంలో అమ్మకానికి గులాబీలు ఉన్నాయి. అవును, మేము నీలి రంగు స్వర్గపు ముఖద్వారం వద్ద ఉన్నాము.  మళ్లీ మేము గడ్డి మైదానాల  బూడిద రంగు వెచ్చదనంలో మునిగిపోయాము, అక్కడ గాలి, ఉదయపు గాలి కూడా, ఎప్పుడూ ఎండతో ఎండిపోయిన ఏదో ఒక ప్రాంతం నుండి వస్తుంది. అది మిమ్మల్ని కిటికీ నుండి మీ చేతులను ఆనందంగా బయట పెట్టేలా చేస్తుంది, వేడి చట్రంపై మీ బుగ్గను ఆనించి, కలలు కంటూ, పాటను పాడేలా చేస్తుంది… గడిచిన రాత్రి యొక్క గుర్తుల కోసం నేను నా మనస్సులో జాగ్రత్తగా వెతికాను, కానీ అది అయిపోయింది. ప్రస్తుతానికి రైలు యొక్క జోలపాడే వేగం తప్ప మరేమీ లేదు.

లేదు, నేను నమ్మలేకపోయాను. అది ఇంకా ఏదైనా చీకటి మూల నుండి నాపైకి దూకవచ్చు, నా ప్రపంచంపై పడే ఒక క్షమించరాని నీడలా…

పిల్లలు నిద్రలేచి మా బెడ్ల కింద కిలకిలరావాలు చేస్తున్నారు. యాకోవ్లెవ్‌ల సందడి మళ్లీ మొదలైంది. దూరంగా ఒక లేత నీడ వెళ్ళింది, అది ఒక అందమైన, సాటిలేని పాట  ప్రతిధ్వని, ఉరితీసే ఆచారానికి ముందు రోజున, వ్రాంగెల్ హెచ్.క్యూ వద్ద ఉన్న చురుకైన కళ్ళు, దట్టమైన జుట్టు కలిగిన ఒక గూఢచారి స్త్రీ. కాస్త ఆగు, గుహ ఇంకా ముందుంది.

“అది చతీర్-దగ్,” నా వెనుక ఉన్న యువతులు ఆశ్చర్యంతో రొప్పుతూ, తమ పరవశానందంలో తమను తాము మర్చిపోయి, తమ మృదువైన వెచ్చదనంతో నన్ను ఒరుసుకుంటూ నా కిటికీ వైపు దూసుకొచ్చారు. వారి వెనుక గ్రిగోరీ ఇవానిచ్ యొక్క ఎర్రటి, నవ్వుతున్న ముఖం ఉదయపు అలసటతో కూడిన ముడుతను కలిగి ఉంది.

“సింఫెరోపోల్‌కు ఇంకా ఎంత దూరం ఉంది?” అతను నన్ను మెల్లగా అడిగాడు.

“ఇంకా ఒక గంట పడుతుంది.” పాపం, అతను త్వరలోనే మాకు వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది.

తర్వాతి స్టాప్‌లో, గ్రామీణ సైన్యానికి  కమాండర్ అయిన కామ్రేడ్ యాకోవ్లెవ్, పండ్ల దుకాణాల చుట్టూ తిరిగి, టోపీ నిండా పెద్ద ఊదా రంగు రేగు పండ్లను, ఒక పెద్ద సంచి నిండా ద్రాక్ష పండ్లను కొన్నాడు. ఆ పండ్లను అతని భార్య  ఒడిలో పోశారు, దాని నుండి కుటుంబం మొత్తం ఎటువంటి తొందరపాటు లేని నిశ్శబ్దంతో తృప్తిగా తిన్నారు. ఇప్పుడే తయారైన ఆ లావుపాటి తెల్లటి స్త్రీ చేతి అద్దంలో చూసుకుంటూ తన సువాసనతో కంపార్ట్‌మెంట్‌ను చల్లబరిచింది. కిటికీ నుండి బయటకు ఊగుతున్న దుప్పట్లకు అవతల ఒక సున్నపు-నీలి రంగు పర్వతం లేచింది, అది ఒక అద్భుతమైన భూమి  క్రిమియా. దొంగలు, ఆ రాత్రి  గురించి ఎప్పుడో మర్చిపోయారు, రైలు పెట్టె ఎండతో ఊపిరాడనంత ఉక్కపోతగా ఉంది. పురుషులు తమ చొక్కాల ముందరి భాగాలను విసిరికొడు తున్నారు. వాటిని పూర్తిగా చింపేయగలిగితే బాగుండు అన్నట్లుగా.

సింఫెరోపోల్ వద్ద, గ్రిగోరీ ఇవానిచ్ రహస్యంగా అదృశ్యమయ్యాడు. అతని నీట్‌గా కట్టిన పరుపు, సూట్‌కేస్‌తో పాటు బంక్ అంచున ఉన్నాయి. కారిడార్ నుండి నేను గాలిలాంటి కాటన్ ఫ్రాక్‌లో ఉన్న జెన్యా యొక్క ఖాళీ మెడను, సన్నని వీపును చూడగలిగాను, ఆమె  జుట్టు ముడుల వెనుక ఆమె ఖాళీ చేతులు చాపి ఉన్నాయి. ఆమె ఆ తెల్లటి స్త్రీతో కోపంగా గొడవపడుతోంది.

“సోన్యా, నా ప్రియమైన దానా, నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. దేవుడి కోసమని నాకు నీతులు చెప్పకు!”

చివరి గంట మోగడానికి కొద్దిగా ముందు గ్రిగోరీ ఇవానిచ్ చాలా సిగ్గుపడుతూ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.

“నేను సెవాస్టోపోల్ వరకు బుక్ చేసుకున్నాను,” అతను తప్పు చేసినట్లు నవ్వుతూ అన్నాడు. “ఆ బైదారీ గేట్లు అంత అద్భుతమైన దృశ్యం అయితే నేను వాటిని  చూడాలి.”

“నువ్వు వాటిని ఇంతకు ముందే చూశావని నేను అనుకున్నాను?” ఆ తెల్లటి స్త్రీ అసూయతో అతనిపై విరుచుకుపడింది.

“అది వేరే విషయం,” గ్రిగోరీ ఇవానిచ్ తడబడుతూ అన్నాడు.

“అలాంటి పేరే, నేను ఇప్పుడు మర్చిపోయాను, కానీ అదే స్థలం కాదు.”

ఆ రైలు ఆకాశాన్నంటే ఎత్తైన రాతి కొండల మధ్య గుండా వెళ్తోంది. ఆహ్లాదకరమైన, వేడి మధ్యాహ్నం ఎక్కడో వాటి సుదూర పచ్చటి, నిటారైన కొండలపై ఉంది. వినోదభరితమైన చిన్న రాత్రులలాగా టన్నెల్స్  శబ్దం చేస్తూ దాటిపోతున్నాయి, ప్రతి చీకటి ముంచెత్తినప్పుడల్లా ఒక అమ్మాయి నవ్వు వినపడుతున్నట్టుగా అనిపించింది. మాస్కో-సెవాస్టోపోల్ రైలు రాకను తెలియజేయడానికి అప్పటికే స్టేషన్‌లో గంటలు మ్రోగుతూ ఉండాలి. ఇదిగో, మా ఎండతో కూడిన, మేము ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రయాణ ముగింపు! మేము మా ఇనుప ఊపిరితిత్తుల పూర్తి బలంతో ఈలలు వేస్తూ, ఆనందకరమైన శబ్దంతో ప్లాట్‌ఫారమ్‌ల చివరి అడవిలోకి దూసుకెళ్లాము.

మెరుస్తున్న తలుపులపై  ఖాళీగా ఉన్న, తెరలు వేసిన స్టేషన్ హాల్ యొక్క తారు నేలపై సూర్యకాంతి కిరణాలు ఆడుతున్నాయి, దాని ప్రకాశవంతమైన ద్వారం చౌరస్తా వైపు ఉంది. అక్కడ బయట అంతా ఎర్రటి ఎండగా ఉంది. అది మిమ్మల్ని పెద్ద, విలాసవంతమైన అలల గురించి ఆలోచించేలా చేసింది.

మేము శరణార్థులలాగా మా లగేజీపై కూర్చుని, పన్నెండు సీట్ల క్రిమియా రిసార్ట్ కారు కోసం ఎదురుచూశాము. క్రిమియా నలుమూలల నుండి ప్రకటనల బోర్డుల ద్వారా మాపైకి దూసుకొస్తోంది. నీలిరంగు ఆకాశంలోకి విసిరిన తెల్లటి గోడల అద్భుత కథలు, సాయంత్రపు నీడలో వాడిపోతున్న పూల తోటలతో కూడిన ప్యాలెస్‌లు  వెనుక భాగంలో సముద్రం. ఆ ప్రకటన బోర్డుల నుండి నేరుగా కార్లు  బస్సులు సాయంత్రం రైలును పట్టుకోవడానికి నడుస్తూ వస్తున్నాయి, బీచ్‌ల రాతి ధూళి ఇంకా వారి బుగ్గలపై ఉన్న ఎండకు కమిలిన ప్రయాణికులను దించుతున్నాయి. వెళ్ళిపోవాల్సిన  సముద్రాన్ని వదిలి వెళ్ళవలసిన వారికి ఎంతటి బాధాకరమైన, అంగీకరించలేని విచారం!

అతని భార్య పిల్లల బట్టలు మారుస్తున్నప్పుడు, కామ్రేడ్ యాకోవ్లెవ్ నాతో పాత పరిచయస్తుడిలా మాట్లాడారు. అతను చాలా కాలంగా క్రిమియాలో ఒక ఉద్యోగం కోసం కలలు కంటున్నాడు. ఇక్కడ అతను తన సొంత గడ్డ పైన ఉన్నాడు, ఇది పిల్లలకు మంచిది, అతని మిలిషియా సేవ అతనికి పెద్దగా ఇబ్బంది కలిగించదు. ఇక్కడ చుట్టుపక్కల పెద్దగా సంఘటనలు జరగవు! ఇప్పుడు అతను, అతని భార్య తాము ఎప్పుడూ కోరుకున్నట్లుగా తమ చదువును కొనసాగించగలరు.

“మేము ఈ రోజు మీ గుహను చూస్తాము,” నేను  నెమ్మదిగా అన్నాను.

నాకు ఎంతో ముఖ్యమైనది అతని చూపుపై, అతను ఎలా సమాధానం ఇస్తాడనే దానిపై ఆధారపడి ఉంది. ఆ యువకుడు నా తలపై నుండి ఆకాశం వైపు చూస్తూ నవ్వాడు. ఏమీ చెప్పలేదు.

కారులో ఆ తెల్లటి జుట్టు ఉన్న యువతి, నేను ముందు సీట్లులో కూర్చున్నాము. నా వెనుక ప్రతి ఒక్కరూ ఉండాలని నేను కోరుకున్నాను. ఫర్వాలేదు, ఇప్పుడు నేను వారిని సరైన సమయంలో, పూర్తిగా ముఖాముఖిగా చూడగలను.

ఆ తెల్లటి జుట్టు ఉన్న యువతి దయతో కరిగిపోయింది. శివార్లలోని చిన్న కొండలను చూసి కూడా ఆనందించింది.

“అద్భుతం, అద్భుతం!” అని ఆమె అరిచింది, కారు కదలికల వల్ల ఆమె శరీరం బలంగా ఊగుతోంది.

మేము తడి బాలాక్లావా లోయ గుండా కిందకు వెళ్లాము. పైన మేఘాలు ఉన్నాయి. కుడి వైపున ఉన్న గ్రామాలు పచ్చటి, సారవంతమైన లోయల చీకటిలో నడుము లోతున మునిగిపోయాయి. నీలిరంగు స్వర్గం ముందుకు ఉంది. మేము వంపులు తిరుగుతూ మరింత పైపైకి ఎక్కాము.

డ్రైవర్ గేర్ మార్చాడు. ఆ ఎత్తు తన గుండెను కూడా పట్టుకున్నట్లుగా ఇంజిన్ దీనంగా మూలిగింది. పర్వతాలు మా చుట్టూ మూసుకుపోయాయి, వాటి వాలులు తెల్లగా, వంకరగా ఉన్నాయి. మేము అంతకంటే పైకి వెళ్ళలేకపోయాము. క్రింద గాలి ఉంది, లోయల యొక్క అద్భుతమైన లోతులు ఉన్నాయి. ఇప్పుడు మేము క్రిందికి దిగాలి.

“ఓహ్!” గ్రిగోరి ఇవానిచ్ భయంతో కేకలు వేశాడు. మేము శూన్యంలోకి పడిపోయాము, పొదలు మా పక్క నుండి వేగంగా వెళ్ళాయి, మా ఊపిరితిత్తులు ఖాళీ అయ్యాయి. శ్వాస తీసుకోలేకపోయాము. నేను చుట్టూ చూశాను. జెన్యా గ్రిగోరి ఇవానిచ్‌ను పట్టుకుని, అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె నిస్సహాయంగా ఉంది, ఆమె ప్రతిదానిని కోల్పోయింది. గ్రిగోరి ఇవానిచ్ కళ్ళు నా కళ్ళను కలిశాయి, వారి ఆనందంలో వారికి ఏమీ కనిపించలేదు.

మేము బైదరీలో విశ్రాంతి తీసుకున్నాము. గాలిలో సాయంత్రం రాబోతున్న సువాసన ఉంది, కొద్దిగా వర్షం పడింది. ఇప్పుడు పైనున్న పైన్ చెట్లలో సూర్యుడు, చల్లని గాలి ఉన్నాయి . చల్లదనం స్టాల్స్‌లోని ద్రాక్షపై పచ్చటి మంచును కురిపించింది. మేము అనంతంగా ప్రయాణిస్తున్నట్లు అనిపించింది. బహుశా అదొక కల కావచ్చు.

అవును, అదొక కల. గ్రామీణ సైన్యం ఒకప్పుడు ప్రయాణించిన లోయ ఇదిగో. ఇంకొక మలుపు,  ఎవరో ఒకరి కళ్ళు వారు దేని కోసం వెతుకుతున్నారో చూస్తాయి. ఆ నిటారైన పచ్చని కొండపై ఉన్న పైన్ చెట్ల క్రింద ఉన్న చీకటి అంతరాన్ని చూసి ఆశ్చర్యపోతాయి. ఇప్పుడు పర్వతం యొక్క గుండ్రని భుజం వెనక్కి తగ్గుతోంది, పొదల నీలిరంగు రేఖ క్రిందికి దిగుతోంది, రహదారి అవతలి వైపు శూన్యంగా ఉంది. అవును, దీని కోసమే నేను ఎదురుచూస్తున్నాను. నా వెనుక ఉన్న ఇతర వ్యక్తి యొక్క తపనను నేను అనుభవించగలను, అది అకస్మాత్తుగా, కత్తిపోటులా పదునైనది. గతం నుండి కాంతి యొక్క అద్భుతమైన, భయంకరమైన కిరణం పడి, అక్కడ జీవితాన్ని విభిన్నంగా, కొత్త వెలుగుతో చూపిస్తున్నట్లు నాకు అనిపించింది. కానీ బహుశా అది కేవలం నా ఊహ మాత్రమే కావచ్చు. నా వెనుక కూర్చున్న ఇద్దరి అస్పష్టమైన ముఖాలను చూడటానికి నేను నా తల తిప్పాను. నేను వారి కోసం వెతికాను, కానీ దానికి బదులుగా నేను గ్రిగోరి

ఇవానిచ్‌ను చూశాను, అతని మినుకుమినుకుమనే నవ్వుతో ఒక భయంకరమైన ఆకారం,  డజను ఇతర కళ్ళు పిచ్చిగా పెద్దవయ్యాయి, ఆపై అకస్మాత్తుగా లేత నీలం రంగులోకి మారాయి.

మేము బైదరీ గేట్స్  వద్దకు దిగాము! పర్వతాల గోడలు విశాలంగా తెరుచుకున్నాయి. ఇప్పుడు డ్రైవర్ ఏమాత్రం సంకోచించకుండా, గుండెలను పిండేసే నీలిరంగు శూన్యంపై, అగాధపు అంచునే కారును ఆపాడు. మా ముందు, మా కింద ఆకాశం తప్ప మరేమీ లేదు, ప్రపంచంపై పైకి లేస్తున్న ఆ అద్భుతమైన నీలిరంగు ప్రకంపన తప్ప మరేమీ లేదు.

అది సముద్రం.

కారులో ఒక్కసారిగా అరవడం, గుసగుసలు, పరమానందం వెల్లివిరిశాయి. ఆ తెల్లరంగు జుట్టు  పిల్లే మొదటగా కిందకు దూకి, కొండ అంచు వైపు పిచ్చిగా పరుగెత్తింది.

“ఎంత అందంగా ఉందో! ఓహ్, ఎంత అందంగా ఉందో!…”

గ్రిగోరీ ఇవానిచ్ పిచ్చి చూపులతో అటు ఇటు పరుగెత్తి, తన జేబులో నుండి ఒక రివాల్వర్‌ను తీసి, కింద ఉన్న లోయలో ఒక నక్కను చూసినట్లు నటించాడు.

“నీకా ధైర్యం వద్దు!” అని జెన్యా  గట్టిగా అరుస్తూ రోడ్డు వెంబడి అతని వెనుక పరుగెత్తింది.

ఇప్పుడు నేను నా సహచరులైన యాకోవ్లెవ్స్  ను చూడాలి. ఆ స్త్రీ, డ్రైవర్‌ను ‘పాపకు పాలు ఇవ్వడానికి సమయం ఉందా?’ అని అడగడం నాకు వినిపించింది. అతను సమయం ఉందని చెప్పాడు. కానీ నా ముందు సాక్షాత్కరించిన ఆ అగాధమైన అందమైన ప్రపంచం నుండి నా కళ్లను తిప్పుకోలేకపోయాను. సముద్రం అంతులేని హద్దుల వరకు విస్తరించి ఉంది. మేము రాకముందు నిన్న కూడా అది అలాగే ఉంది, వెయ్యి సంవత్సరాల క్రితం దాని క్రూరమైన, అల్లకల్లోలమైన నిశ్శబ్దంలో కూడా అది అలాగే ఉంది. నా పాదాల దగ్గర ఉన్న ఆకుపచ్చని అగాధంలో నగరాలు, ఒక ఆశ్రమం, ఒక రాతి మొనపై ప్రమాదకరంగా నిలిచిన ఒక లైట్‌హౌస్ ఉన్నట్లు నేను ఊహించుకున్నాను. ఒక పక్షి  మతిభ్రమించిన వేగంతో ఎగిరిన మెరుపు…. కానీ ఇప్పటికీ నేను ఆ వ్యక్తులను చూడాలి.

… నేను వెనక్కి తిరిగి చూశాను, ఆ స్త్రీ సున్నితంగా వంచిన తల, ఆమె మెడపై ఉన్న మృదువైన ముంగురుల గందరగోళం కనిపించాయి. పర్వతాలలో వాతావరణం చల్లబడింది. ఒక పాత కోటు నుండి తిరిగి కుట్టిన ఒక కోటు ఆమె భుజాలపై వేయబడి ఉంది, ఆ కోటు మడతలలో ఇప్పటికీ ఆ తుఫాను లాంటి, గత సంవత్సరాల శ్వాస

నిలిచి ఉంది. ఆ యువకుడు తన చేతులను జేబుల్లో పెట్టుకుని ఆమె పక్కన నిలబడి, ఆమె రొమ్ము వైపు శ్రద్ధగా చూస్తున్నాడు. అతని కనురెప్పలు ఒక ఆనందకరమైన వంపును కలిగి ఉన్నాయి. వాటిపై సముద్రపు కాంతి  నిశ్శబ్దం ఉన్నాయి.

నేను అటువైపు నుండి ముఖం తిప్పుకుని, నీటి నుండి, శాశ్వతత్వపు రాళ్ల నుండి జీవం సృష్టించిన ఆ అంతులేని అద్భుతాన్ని చూశాను. పట్టు లంగా వేసుకున్న ఆ లావుపాటి అమ్మాయి కంగారుపడుతూ, జెన్యాకు ఏమైందని అందరినీ అడుగుతోంది. కానీ జెన్యా గురించి ఎవరికి పట్టింది? ఆ ప్రమాదకరమైన నీలిరంగు అంచున ఉన్న పొదల గుండా గ్రిగోరీ ఇవానిచ్ నవ్వుతూ, ఆ అమ్మాయిని తన చేతుల్లో ఎత్తుకుని పరుగెత్తడం కేవలం నేను మాత్రమే చూడగలిగాను.

అలెగ్జాండర్ మాలిష్కిన్

అలెగ్జాండర్ మాలిష్కిన్ పెంజా గుబెర్నియాలోని బొగోరోడ్‌స్కోయ్ గ్రామంలో జన్మించారు. ఆయన మోక్షన్స్క్‌లోని ఒక గ్రామర్ పాఠశాలలో చదువు కున్నారు. అది ఒక చిన్న పట్టణం, అక్కడి పితృస్వామ్య జీవన విధానం ఉండేది. ఆ కాలంలో ఉన్న ఎలాంటి కొత్త ఆలోచనల  ప్రభావం అయనపై పడ లేదు.  తర్వాత ఆయన పెట్రోగ్రాడ్ (ఇప్పటి సెయింట్ పెటర్స్ బర్గ్) విశ్వవిద్యాలయంలోని ఫిలాలాజికల్ విభాగంలో చదివారు. అక్కడ ఆయన ప్రాచీన రష్యన్ సాహిత్య అద్భుత రచన అయిన 'ది లే ఆఫ్ ఇగోర్స్ హోస్ట్' (The Lay of Igor's Host) పై ప్రత్యేక అధ్యయనం చేశారు. అ సమయంలో ఆయన కొన్ని కవితలను ప్రచురించారు. తన మొదటి చిన్న కథలను రాశారు. మొదటి ప్రపంచ యుద్ధం, విప్లవం, అంతర్యుద్ధం మాలిష్కిన్‌ను కొన్నేళ్లపాటు  సాహిత్య రచనలకు దూరం చేశాయి. ఆయన ప్రముఖ రెడ్ ఆర్మీ జనరల్ మిఖాయిల్ ఫ్రుంజ్ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు. అంతర్యుద్ధంలో పేరొందిన పోరాటాలలో ఒకటైన పెరెకోప్ ముట్టడిలో పాల్గొన్నారు.

1921 వరకు మాలిష్కిన్ మళ్లీ పెన్ను పట్టలేదు. ఆయన రాసిన చిన్న నవల 'ది ఫాల్ ఆఫ్ దాయిర్' (The Fall of Dayir - 1923) ఆయనకు సాహిత్యపరంగా మంచి కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ పుస్తకంలో మాలిష్కిన్, ఆ కాలంలో చాలా మంది చేసినట్లుగానే, విప్లవం యొక్క  స్వభావాన్ని రాయడానికి ప్రయత్నించారు. ఆయన తరువాత రచనలలో కూడా ఇదే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు, వాటిలో 'ఎ ట్రైన్ టు ది సౌత్' (A Train to the South - 1926) అనే చిన్న కథ 'సెవాస్టోపోల్' (Sevastopol - 1931) అనే నవల అత్యంత ప్రముఖమైనవి. తరువాతి నవల విప్లవంలో రష్యన్ మేధావులు అనుసరించిన విభిన్న మార్గాల గురించి వివరిస్తుంది. ఇది సోవియట్ సాహిత్యం లో ఒక మైలురాయిగా నిలిచింది.మాలిష్కిన్ ప్రచురించిన చివరి నవల ' ఆడువులనుంచి వచ్చిన మనుషులు ' (People from the Backwoods). ఇందులో ఆయన ప్రాంతీయ జీవితంలో వచ్చిన తీవ్రమైన సామాజిక మార్పులను చిత్రీకరించారు. ఆయన  మాటలలో చెప్పాలంటే, "మా కొత్త నిర్మాణ స్థలాలకు వచ్చి, వర్గ-స్పృహ కలిగిన పారిశ్రామిక కార్మికులుగా మారిన పూర్వపు  కళాకారుల దృక్పథంలో వచ్చిన మార్పును చూపించడానికి" ఆయన ప్రయత్నించారు.మాలిష్కిన్ 1938 లో తీవ్రమైన క్షయ వ్యాధి కారణంగా నలభై ఆరు సంవత్సరాల వయస్సు లోనే మరణించారు.

కె. కుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *