రామ్ధన్ గారి ఇంటికి ఒక సాధువు వచ్చేడు.
“అబ్బాయీ, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. సాధువులు, సన్యాసులను కాస్త ఆదరించు నాయనా!”
రామ్ధన్ ఇంటి లోపలికి పోయి, భార్యతో చెప్పేడు: ఇంటి ముంగిట ఒక సాధువు నిలబడి ఉన్నాడు. కాస్త అతనికి ఏమైనా ఇద్దాం.”
అతని భార్య గిన్నెలు తోమడంలో తలమునకలై ఉంది. రాత్రి భోజనం లోకి ఏం వండాలా అని ఆమె తల బద్దలు కొట్టుకుంటోంది. ఇంట్లో చూస్తే, ఒక్క బియ్యపు గింజ లేదు. అది చైత్ర మాసమే అయినా, మిట్ట మధ్యాహ్నమే కారు చీకట్లు కమ్ముకున్నట్టుగా ఉంది. గాదె లో ధాన్యం పూర్తిగా నిండుకున్నాయి. వడ్డీ వ్యాపారి సగం ధాన్యం తీసుకున్నాడు. తక్కిన సగం భూస్వామి తాలూకు మనిషి తీసుకెళ్ళి పోయాడు. తౌడు అమ్మగా వచ్చిన సొమ్ముని ఎద్దుల వ్యాపారికి కట్టాల్సి వచ్చింది. కుటుంబానికి ఏదో నామకా కాస్త ధాన్యం మిగిలింది. అదంతా దంపిస్తే, ఒక నలభై కిలోల గింజలు వచ్చేయి.
ఎలాగో, చైత్ర మాసం గడిచింది. ఆ తరవాత సంగతేమిటి? ఎద్దులు ఏం తింటాయి? ఇంట్లో వాళ్ళు ఏం తినాలి? ఆ పై వాడికే తెలియాలి. కానీ, గుమ్మం లో సాధువు నిలబడి ఉన్నాడు. అతడిని నిరాశ పరచకూడదు. పాపం, అతను ఏం అనుకుంటాడు?
భార్య అడిగింది: “ నేను అతనికి ఏం పెట్టగలను? ఇంట్లో అసలు ఏమీ లేవు.”
“ ఒక్క సారి కుండలో చూడు. అడుగున ఏమైనా, బియ్యమో, నూకలో మిగిలి ఉన్నాయేమో!”
“ నిన్న కుండ ఊర్చీసి, తోమి వంట చేసేను. అసలు ఏమీ మిగల్లేదు.”
“ మన ఇంట్లో ఏమీ లేవని నేను అతనితో చెప్పలేను. పొరుగింటికి వెళ్ళి,ఏమైనా అప్పుగా తే!”
“ మనం గతంలో చేసిన అప్పులు ఇంకా తీర్చలేదు. ఇంకా ఇమ్మని నేను ఎలా అడగాలి?”
“ దేవుడి నైవేద్యం కోసం పక్కకి పెట్టిన గింజలు ఉన్నాయి కదా. వాటిని తీసుకు రా!”
“ మరి దేవుడి పూజ, నైవేద్యం ఎలా?”
“ దేవుళ్ళు నైవేద్యాలు కావాలని అడగరు. వీలుంటే ఆ నైవేద్యాలు తీసుకు రా! లేదంటే, వదిలెయ్యి.”
ఆ నైవేద్యం గింజలు గరిసెలతో ఉన్నాయనుకుంటున్నావా? మహా అయితే, ఓ పిడికెడు ఉండొచ్చు. ఇతని తరవాత మళ్ళీ సాధువులు రారూ? ఎప్పుడో ఒకప్పుడు ‘లేదు’ అని చెప్పడం నేర్చుకోవాలి.”
“ ఇప్పటికి ఈ గండం గట్టెక్కుతుంది కదా! తరవాత సంగతి తరవాత చూద్దాం.”
భార్య చిరచిరలాడుతూ,ఒక మట్టి కుండ మీద మూత తీసి చూసింది. అందులో ఒక అరకిలో కి తక్కువగా పిండి కనిపించింది. ఆ కాస్త పిండిని కష్టమ్మీద దేవుడి నైవేద్యం కోసం దాచడం జరిగింది. రామ్ధన్ కాసేపు తటపటాయిస్తూ నిలబడ్డాడు. ఆ తరువాత ఆ పిండిని తీసుకు వెళ్ళి, సాధువు గారి జోలె లో పోసేడు.
ఆ పిండిని తీసుకుని, ఆ మంచి మనిషి ఇలా అన్నాడు: “ అబ్బాయీ, ఈ సాధువు ఇవాళ్టికిక ఇక్కడే బస చేస్తాడు.నువ్వు కాస్త పప్పు దినుసులు ఇప్పించావంటే, నేను వంట చేసుకుంటాను.”
రామ్ధన్ ఇంట్లోకి తిరిగి వచ్చి, సాధువు కోరికను భార్య కి తెలియజేసాడు. అయితే, యాదృచ్ఛికంగా ఇంట్లో పప్పు దినుసులు ఉన్నాయి. రామ్ధన్ సాధువుకి పప్పు, ఉప్పు సమకూర్చేడు. వంట చేసుకోవడానికి ఆవు పేడ పిడకలు ఏర్పాటు చేసాడు. నూతి నుంచి నీరు తోడి ఇచ్చేడు. సాధువు రొట్టెలు చేసుకుని,
పప్పు వండుకున్నాడు. తన జోలె లోంచి ఒక బంగాళదుంప తీసి, దాన్ని ఉడకబెట్టి, ముద్ద చేసాడు. వంట అంతా అయిపోయేక, అతను రామ్ధన్ ని ఇలా అడిగేడు: “ అబ్బాయీ, దేవుడి నైవేద్యానికి కాస్త నెయ్యి కావాలోయ్! ఆహారం పవిత్రంగా లేకపోతే, దేవునికి ఎలా అర్పించగలను?”
రామ్ధన్ అన్నాడు కదా, “ అయ్యా, ఇంట్లో నెయ్యి ఉన్నట్టు లేదు.”
సాధువు అన్నాడు, “ అబ్బాయ్! దేవుడు నీకు ఇంత ఇచ్చేడు కదా. అలాంటి మాటలు మాట్లాడకు, నాయనా!”
“ అయ్యా, నాకు ఆవు, గేదె ఏమీ లేవు. నాకు నెయ్యి ఎక్కడ నుంచి వస్తుంది?”
“ అబ్బాయ్, దేవుడు పుష్కలంగా ఇస్తాడు రా! ఇంట్లోకి పోయి, మీ ఆవిడని అడుగు.”
రామ్ధన్ ఇంట్లోకి వెళ్ళి, భార్య తో అన్నాడు: “ అతను నెయ్యి కావాలని అంటున్నాడు. అతను భిక్ష కి వచ్చినా, నెయ్యి లేకుండా తినలేడు కామోసు!”
భార్య అంది: “ అలాంటప్పుడు కాసిని పప్పు దినుసులు తీసుకు పోయి, దుకాణంలో ఇచ్చి, నెయ్యి తీసుకు రా! ఇంత చేసాక, అతడిని విసుక్కోవడం ఎందుకు ?”
నెయ్యి వచ్చింది. ఆ సాధువు తన సంచి లోంచి దేవుని కోసం ఒక చిన్న మందిరం బయటకు తీసి, గంట వాయించి, నైవేద్యం కానిచ్చేడు.ఆ తరవాత కడుపు నిండా తిని, పొట్ట నిమురుకుంటూ, ద్వారం దగ్గర పడుకున్నాడు. రామ్ధన్ అతని పళ్ళెం, చెంబు, గరిటె తోమడానికి తీసుకు వెళ్ళేడు.
ఆ రాత్రి రామ్ధన్ ఇంట్లో సరైన భోజనం లేదు. వాళ్ళు కేవలం పప్పు మాత్రమే వండుకుని, తిన్నారు.
మంచం మీద వాలేక, “ఆఖరికి వీళ్ళు కూడా నా కంటే బాగున్నారు”,అనుకున్నాడు రామ్ధన్.
