నీలి నీడలు 1984 Part 2

Spread the love

4

రెహమాన్ బాబాయి హత్య తర్వాత బాగసర్-ఇబ్రహీంపట్నం ఊళ్ళ మధ్య సంబంధ-బాంధవ్యాలు మునుపటిలా లేవు. పూర్తిగా మారిపోయాయి. పొలం పనుల కోసం ఆ ఊరి కూలీలు ఈ ఊరికి, ఈ ఊరి కూలీలు ఆ ఊరికి రావడం మానుకున్నారు. కొంతమంది ఇళ్ళల్లోనే ఉంటూ బీడీలు చుట్టే పని చేస్తూ ఉంటే మరి కొంతమంది ఇటుక బట్టీల్లో పనికి వెళ్ళడం మొదలుపెట్టారు. హోలీ, రంజాన్ లకి ఒకరి ఇళ్ళకి ఒకరు వెళ్ళి పలకరించుకోవడం, శుభాకాంక్షలు తెలుపుకోవడం అనే సంప్రదాయానికి పూర్తిగా తెరపడింది. ప్రతి రోజూ రచ్చబండల దగ్గర పరిచే జంపఖానాలు అలాగే శుభ్రంగా మాపులేకుండా ఉండేవి. సాయంత్రం పరవడం, మళ్ళీ రాత్రి అయ్యేసరికి మడతపెట్టి పక్కన పెట్టెయ్యడం. రోజూ ఇదే తంతు. రెండు గ్రామాల పంతుళ్ళు, మౌలవీలు కూడా తమ-తమ ధర్మ గ్రంథాల సాక్షిగా తమ-తమ మతాలే గొప్పవని ఢంకా బజాయించి చెప్పడం మొదలుపెట్టారు. ఏతావాతా రెండు ఊళ్ళ మధ్య అసహనం ఎంతగా పెచ్చు మీరిపోయింది అంటే చిన్న-చిన్న విషయాలకే కత్తులు దూసుకోవడం మొదలుపెట్టేస్తున్నారు. కానీ, ఇప్పటికీ రెండు ఊళ్లను కలిపి ఉంచే చిన్న సూత్రం ఒకటి మిగిలి ఉంది. అదేమిటి అంటే రెండు గ్రామాల్లో ఎవరు చనిపోయినా శతృత్వం మరిచి రెండు ఊళ్ళ వాళ్ళు కబ్రిస్తాన్ కి, గంగా నది ఒడ్డుకి చేరుకుంటారు. మనసులు విప్పి మాట్లాడుకోకపోయినా, కార్యక్రమం పూర్తయ్యే వరకు మాత్రం అందరూ అక్కడే ఉంటారు. ఈ ఒక్క కారణానికే రెండు గ్రామాల పెద్దవాళ్ళు, మరీ ముఖ్యంగా పలటన్ బాబా ఏదో ఒకరోజు పరిస్థితులు చక్కబడతాయి అని బలంగా నమ్ముతూ ఉండేవారు. 

రెండు ఊళ్ళ మధ్య ద్వేషం అనే గోడ కట్టేసిన తర్వాత దేవదత్తుడు త్వరత్వరగా పెద్దవాడయిపోయాడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసి కండలు బాగా పెంచాడంతోపాటు భగత్ సింగ్ లా మీసాలు కూడా మెలివేశాడు. రెహమాన్ బాబాయిని హత్య చేసిన తర్వాత ఊళ్ళో అందరూ తనని చూసి భయపడిపోతున్నారు అని దేవదత్తుడు భ్రమపడటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు తన వెడల్పాటి భుజాలు ఎగరేస్తూ ఛాతీ విరుచుకుని ఊరంతా తిరుగుతూ ఉండేవాడు. మానవ హంతకుడు అని చెప్పి ఊళ్ళో ఎవ్వరూ అతణ్ణి పట్టించుకునేవారు కాదు. ఎవరూ భయపడేవారు కూడా కాదు. ఊరివాళ్ళు దేవదత్తుణ్ణి ఎక్కువ రోజులు భరించవలసిన అవసరం లేకపోయింది. డి.ఏ.వి. కాలేజిలో అడ్మిషన్ దొరకటంతో దేవదత్తుడు కాన్పూరుకి బయల్దేరాడు. ఊరు వదిలి వెళ్ళే ముందు భగత్, దేవదత్తుణ్ణి దగ్గరకి పిలిచి వీలైనంతవరకు ఊళ్ళో అడుగుపెట్టొద్దు అని, కాలేజి వాళ్ళు ఇచ్చే స్కాలర్ షిప్ తో ఖర్చులు సరిపెట్టుకోమని గట్టిగా హెచ్చరించాడు. రెహమాన్ బాబాయి హత్య చేసిన పగ మనసులో పెట్టుకుని ఇబ్రహీంపట్నం వాళ్ళు దేవదత్తుణ్ణి ఎక్కడ చంపేస్తారో అని భగత్ భయం. ఈ భయం దేవదత్తుడికీ లేకపోలేదు. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉండేవాడు.

డి.ఏ.వి. కాలేజి హాస్టల్ లో మొత్తం మూడు వందల గదులు ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న ఆ బహుళ అంతస్థుల హాస్టలు భవనం ఏదో యుద్ధంలో ఓడిపోయిన మహారాజు గారి కోటలా ఉండేది. ఆ భవనానికి ఎదురుగా వెడల్పాటి రోడ్డు. ఆ రోడ్డు పగలూ-రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ రద్దీగా ఉండేది. హాస్టలు ముఖద్వారం ఈ రోడ్డు వైపు ఉంటుంది. ఎత్తైన స్తంభాల హాస్టలు వరండా రోడ్డుకు సమాంతరంగా చాలా దూరం వరకు ఉంటుంది.  రిక్షాల రద్దీ నుండి తప్పించుకోవడానికి పాదచారులు ఈ హాస్టలు వరండా గుండా నడుస్తూ ఉండేవారు. ప్రవేశ ద్వారానికి ఉన్న పెద్ద చెక్క తలుపు కొన్ని ఏళ్ళ బట్టి తెరిచినట్టు లేదు. అది సగం వరకు చెత్తలోకి దిగిబడిపోయి ఉంది. ఆ తలుపుల్లో నుంచి వేప, రావి మొక్కలు మొలిచాయి. అక్కడే పిచ్చుకలు గూళ్ళు కూడా కట్టుకున్నాయి. ఆ పెద్ద తలుపుకే మధ్యలో ఒక చిన్న తలుపు. విద్యార్థుల రాకపోకలు అన్నీ ఆ చిన్న తలుపు గుండానే. ఆ తలుపుకి ఎడమ వైపు ఒక టీ బడ్డీ, కుడి వైపు పాన్-బీడీ బడ్డీ కొట్టు. హాస్టలులో ఉండే విద్యార్థులు ఈ బడ్డీ కొట్ల దగ్గర అరువులు పెట్టి నెట్టుకొస్తూ ఉంటారు. ఆఁ అయితే రెండు బడ్డీ కొట్ల దగ్గర కూడా పెద్ద పెద్ద అక్షరాల్లో – “అరువు రేపు” అని రాసి ఉంటుంది. కానీ దాన్ని పట్టించుకునే,  పాటించే నాథుడే ఉండడు.

మొట్టమొదటిసారి హాస్టలు వాకిట్లో అడుగుపెట్టిన దేవదత్తుడు ఆ భవనం ఎత్తు, వరండా పొడవు, మెట్ల వెడల్పు, ఎక్కడికక్కడ కుప్పలు పోసి ఉన్న చెత్త-చెదారం చూస్తూ నిలబడ్డాడు. దేవదత్తుడికి రెండవ అంతస్థులో ఉన్న 212 నెంబరు గది ఇచ్చారు. అతని గదికి పక్కన 211 కి ఎదురుగా హనుమంతుడి చిన్న విగ్రహం ఉంది. అప్పటికే ఎవరో భక్తుడు రెండు బంతిపువ్వులు హనుమంతుడి పాదాల చెంత సమర్పించి వెళ్ళాడు. అంటే ఉదయాన్నే పూజ అయిపోయిందన్న మాట! ఇదంతా చూసి దేవదత్తుడికి ఒకపక్క సంతోషంగా ఉన్నా, కాలేజి హస్టల్లో దేవుడి విగ్రహాలు ఏమిటా అని ఆశ్చర్యపోయాడు కూడా! 211 నెంబరు గదికి తాళం వేసి ఉంది. అసలు ఆ గదిలో ఎవరు ఉంటారా తెలుసుకోవాలి అని దేవదత్తుడి ఉత్సాహం రెట్టింపు అయ్యింది. 212 గదిలో ముందు నుండి మరొక విద్యార్థి ఉంటున్న విషయం హాస్టలు సూపరింటెండెంటు చెప్పాడు. దేవదత్తుడు గదిలో అడుగుపెడుతూనే గదిలో ఉన్న ఆ విద్యార్థి హడావుడిగా పరుపు మీద నుంచి లేచి తనని తాను బభృవాహన్ ‘దొహరే’ గా పరిచయం చేసుకున్నాడు. ‘దొహరే’ అంటే మాదిగ వాళ్ళు అని దేవదత్తుడికి తెలుసు. తన ఊళ్ళో కూడా ఈ ‘దొహరే’ పేరు విని ఉన్నాడు. దేవదత్తుడు బ్రాహ్మణుడు అని తెలిసి బభృవాహనుడు ఎంతో మర్యాదగా తన పరుపు మీద కూర్చోమని ఆహ్వానించాడు. బభృవాహనుడి కులం తెలిసిన తర్వాత దేవదత్తుడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయినట్టు అనిపించింది. ఉన్నఫళంగా అక్కడి నుండి పారిపోవాలి అనిపించింది. గదిలో సిమెంటుతో చేసిన రెండు బల్లలు లాంటివి ఉంటే ఒకదాంట్లో బభృవాహనుడు పరుపు, రెండవదాంట్లో నీళ్ళ కుండ పెట్టుకున్నాడు. బభృవాహనుడు వెంటనే లేచి నీళ్ళ కుండ తీసి తన పరుపు పక్కన పెట్టుకుంటూ – “పంతులు గారూ! మీ సామాన్లు ఇక్కడ పెట్టుకోండి” అన్నాడు. క్షణంపాటు దేవదత్తుడి నోట మాట రాలేదు. దేవదత్తుడు ఆ రెండవ బల్ల మీద తన పక్క పరుచుకుని పడుకుంటూ ‘చచ్చినా ఈ మాదిగ వాడితో కలిసి ఉండే ప్రసక్తే లేదు … రేపే వెళ్ళి ప్రిన్సిపల్ ని కలిసి నా గది మార్చేసుకుంటాను’ అనుకున్నాడు.

ఆ రోజు సాయంత్రం 211 గది తలుపులు తెరుచుకున్నాయి. కొంతమంది కుర్రాళ్ళు గోల చేసుకుంటూ ఆ గదిలో దూరి చాలాసేపు గలాటా చేస్తూ ఉన్నారు. వినబడుతున్న కబుర్లను బట్టి వాళ్ళు అప్పుడే ఎక్కడో ఏదో గొడవ చేసి వచ్చి, తర్వాత చెయ్యబోయే దొమ్మీకి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని అర్థమైంది. ఆ హడావుడి ఏమిటని అడిగిన మీదట బభృవాహనుడు – “వారంతా ‘భారత ఆత్మగౌరవ వేదిక’ కార్యకర్తలు. కృపాచార్య వాజపేయి నాయకత్వంలో వారందరూ ఆ గదిలో ఉంటున్నారు. కృపాచార్య తప్పించి మిగిలిన వాళ్ళు ఎవ్వరూ మన కాలేజి రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా కాదు. కృపాచార్య ఈ కాలేజి విద్యార్థి సంఘానికి పూర్వ అధ్యక్షుడు. గత పది సంవత్సరాలుగా రకరకాల కోర్సులు చేస్తూ ఇక్కడే హాస్టలులో ఉంటున్నాడు.” అన్నాడు.

మరి కాసేపటికి 211 నెంబరు గది ముందు గంట మోగడం, శంఖనాదం వినిపించాయి. దేవదత్తుడు బయటకి వచ్చి చూస్తే హనుమాన్ హారతి చాలా అట్టహాసంగా నడుస్తోంది. హారతి అయ్యాక అందరికీ ప్రసాదం పంచిపెట్టారు. నినాదాలు హోరెత్తాయి – ‘జై బజరంగబలి’, ‘భారత్ మాత కీ జై’, పాకిస్తాన్ డౌన్ డౌన్, మాతో తలపడితే నుజ్జు నుజ్జు అయిపోతారు…” బజరంగబలి హారతికి, పాకిస్తాన్ డౌన్ డౌన్ నినాదాలకి పొంతన కుదరలేదు. అసలు ఆ రెండింటికి ఏం సంబంధమో కూడా అర్థం కాలేదు. అయితే ఆ నినాదాలు దేవదత్తుడికి చాలా నచ్చాయి. ఆ నినాదాలు తన మనోభావాలకి అక్షర రూపం ఇచ్చినట్టు అనిపించింది.

మర్నాడు ఉదయం వాకిట్లో కుళాయి దగ్గర స్నానం చేసి తడి తువాలు కట్టుకుని, తడిపిన బట్టలు భుజాన వేసుకుని గదిలోకి వెళ్తూంటే కృపాచార్యతో పరిచయం అయ్యింది. అక్కడి హనుమంతుడి విగ్రహం ముందు వస్తాదులాంటి ఒక మధ్య వయస్కుడు బస్కీలు తీస్తున్నాడు. ఎర్రటి లంగోటి బిగించి కట్టుకుని, నూనె పట్టించిన అతని శరీరం అద్దంలా మెరుస్తోంది. మీసం గాలికి అల్లల్లాడుతోంది. చిన్న చిన్న పిల్లి కళ్ళు మెరుస్తున్నాయి. తలపై సగానికి పైగా జుట్టు నెరిసిపోయింది. దేవదత్తుణ్ణి చూస్తూనే, అతగాడు చేత్తో సైగచేసి దగ్గరకి రమ్మని పిలిచి రొప్పుతూ – “212లోకి కొత్తగా వచ్చింది నువ్వేనా?” అని అడిగాడు.

“అవునండీ!” అన్నాడు ఎంతో వినయంగా.

“నేనెవరో తెలుసా?”

“తెలియదండీ.”

“మరి, నీకు ఇంకేం తెలుసన్నట్టు? నేను కృపాచార్య వాజపేయి. ఈ కాలేజీకే తోపు. ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కూడా!”

“ఇప్పుడు తెలిసింది.” ఇంకా మర్యాదగా అన్నాడు దేవదత్తుడు.

“ఒంటి మీద జంధ్యం జాడలు కనిపించటం లేదు. ఏ కులం నీది?”

“అయ్యా, బ్రాహ్మణ్ణి. అయితే ఇంకా విధిగా ఉపనయనం జరగలేదు.”

“అరేయ్! ఈ ‘విధిగా’ ఏంటి? సింహాన్ని ఎవరైనా ‘విధిగా’ సింహంగా చేస్తారా? అది పుట్టుకతో సింహం. అంతే! హ్హ హ్హ హ్హ …. సరే బ్రాహ్మడివి అయితే మరి అంత దూరంగా నిలబడ్డావేం. దగ్గరకి రా! నువ్వు ఇక మా పిల్లవాడివే. నీకు ఆ భగవంతుడు మంచి కండలు తిరిగిన శరీరం ఇచ్చాడు. మాకు బాగా ఉపయోగపడతావు.” దేవదత్తుణ్ణి దగ్గరకి పిలిచి, భుజం మీద చరిచి – “212 లో ముందు నుండే ఒక మాదిగ వాడు ఉన్నాడు. మరి మీ ఇద్దరికీ ఎలా పొసుగుతుంది?”

“అవును. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. రేపు ప్రిన్సిపల్ కి ఒక అప్లికేషన్ రాసి నా గది మార్చమని అడుగుదాం అనుకుంటున్నాను.”

“నేను ఉండగా ఈ తతంగం అంతా ఎందుకు? అలాంటివి అన్నీ నువ్వే చేసేసుకుంటే నేననేందుకు ఉన్నట్టు ఇక్కడ? రేపు కాలేజిలో నాకు ఒక్కసారి గుర్తు చెయ్యి. నేను ఎప్పుడూ ఆ సైకిల్ స్టాండు దగ్గరే ఉంటాను. ప్రిన్సిపల్ కి డైరెక్టుగా చెబుతాను. అయినా నువ్వెందుకు రూమ్ మారాలి? మన బ్రాహ్మణులం అందరం ఒక దగ్గర ఉందాం. ఆ మాదిగోడినే బయటకి పంపేద్దాం.”  అంటూ తన పిల్లికళ్ళను విచిత్రంగా తిప్పాడు.

దేవదత్తుడి భుజం మీద ఉన్న తడి బట్టల నుండి నీళ్ళు కారుతున్నాయి. ఆ బట్టలు చేతిలోకి తీసుకుంటూ – “మీరు అనుమతి ఇస్తే బట్టలు ఆరేసి మళ్ళీ మీ సేవకి హాజరవుతాను” అన్నాడు దేవదత్తుడు.

“లేదు, లేదు. ఇప్పుడు కాదు. ముందు నన్ను వ్యాయామం పూర్తి చెయ్యనీ. సాయంత్రం హారతి వేళకు తప్పకుండా రా. నీకొక పని అప్పగిస్తాను. ఖైనీ, గుట్కా తింటావా లేదా? ఇదిగో భగవంతుడి పాదాల దగ్గర పొట్లం ఉంది. తీసుకో” అన్నాడు.

“లేదు, లేదు. ఖైనీ లాంటివి ఏం తీసుకోను. ఊళ్ళో ఉండగా ఒకసారి తింటే వాంతి అయిపోయింది.”

“అరే! అయితే నువ్వు అసలు మగాడివే కాదు. ఈ వాంతులు గట్రా ప్రెగ్నెంటు ఆడవాళ్ళకి అవుతాయి. నిజమైన మగాడివి అయితే, ఇదిగో ఇవాళే, ఇప్పుడే ఖైనీ తినడం మొదలుపెట్టు. దీనితో మెదడు చురుగ్గా పని చేస్తుంది.” అంటూనే బస్కీలు తియ్యడం కొనసాగించాడు.    

“యాభై ఐదు, యాభై ఆరు..” కృపాచార్య చెమట, ఒంటికి పట్టించిన ఆముదం వాసన కలిసిన ఒక రకమైన వాసన వరండా అంతా వ్యాపించింది.

దేవదత్తుడు తడిబట్టలు వరండాలో రెండు స్తంభాల మధ్య కట్టిన దండెం మీద ఆరేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని కాలేజికి బయలుదేరాడు. అప్పటికి కృపాచార్య కూడా స్నానం చెయ్యడానికి కిందకి వెళ్ళిపోయాడు.

అదే రోజు సాయంత్రం కృపాచార్య మనిషిని పంపి దేవదత్తుణ్ణి పిలిపించాడు. హారతి మొదలయింది. ఒక ఇత్తడి గంట దేవదత్తుడి చేతిలో పెట్టి మోగించమన్నాడు. హారతి అవుతున్నంత సేపు దేవదత్తుడు కళ్ళు మూసుకుని శ్రద్ధగా గంట మ్రోగిస్తూనే ఉన్నాడు. హారతి అయినాక రోజూలాగే ప్రసాదం పంచి నినాదాలు ఇచ్చారు. తర్వాత కృపాచార్య అధ్యక్షతన 211 నెంబరు గదిలో సభ కొలువు తీరింది. దేవదత్తుణ్ణి అందరికీ పరిచయం చేసాడు కృపాచార్య. ఎన్నో ప్రశ్నల తర్వాత సంబోధిస్తూ – “బాలకా! ఉదయం ఏం పేరు చెప్పావు నీది?” అన్నాడు.

“అయ్యా, నా పేరు దేవదత్తుడు. నేను బ్రాహ్మణ్ణి.”

“ఆఁ, అయితే బ్రాహ్మణ దేవదత్తుడివి అన్నమాట!”

నువ్వు ఈ కాలేజికి కొత్తగా వచ్చావు కాబట్టి,  కొన్ని విషయాలు ముందే తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా మన శక్తిసామర్థ్యాలు, ఆత్మగౌరవం కాపాడుకోవాలి అంటే మన అగ్ర కులాల వాళ్ళు ప్రత్యేకించి బ్రాహ్మణులు అందరూ ఐకమత్యంగా ఉండాలి. మనలో మనం గొడవలు పడితే మనకే నష్టం. ఈ దేశంలో మనకి వ్యతిరేకంగా ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి. వాటిల్లో ఒకటి – ఈ దేశంలో ఉండే ముసల్మానులు. వీరి వల్ల దేశ ఐకమత్యం బీటలు వారుతోంది. వాళ్ళు మన హిందువులకు శతృవులు. భవిష్యత్తులో అగ్రకులాలు, తక్కువ కులాల మధ్య ఎప్పుడైనా గొడవ వస్తే వీళ్ళు కచ్చితంగా మన పక్షాన నిలబడరు. మన దేశంలో ఉన్న మరొక శక్తి – తక్కువ కులాల వాళ్ళు. వీరిని మన రాజ్యాంగమే మన నెత్తిమీద కూర్చోబెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి రిజర్వేషను ఉంటుంది. మన అగ్ర కులం వారి పిల్లలు పోటీ పరీక్షల్లో వీరికంటే మెరుగైన ప్రతిభ కనబరిచినా, ఎక్కువ మార్కులు సాధించినా ఉద్యోగాలు దొరకటం లేదు. ఈ గదిలో ఉన్న విద్యార్థులు అందరూ ఈ రిజర్వేషన్ భూతానికి బలయిపోతున్న వారే! మన జాతి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఈ రెండు శక్తులతో పోరాడాలి. వీలయినంత త్వరగా మనం మేలుకోకపోతే ఈ దేశం ముస్లిముల వశమయిపోతుంది. ఈ కడజాతి మాదిగవాళ్లు మన పిలకలు పట్టుకుని నడి బజారులో ఈడ్చుకుని వెళ్ళే రోజు ఎంతో దూరం ఉండదు. ‘భారత ఆత్మగౌరవ వేదిక’ సభ్యత్వం తీసుకుని, దాని లక్ష్యాలకి అనుగుణంగా నడవడం ఒక్కటే మనకు మిగిలిన ఉపాయం. అగ్రవర్ణ హిందువులను రక్షించ గలిగేది ‘భారత ఆత్మగౌరవ వేదిక’ ఒక్కటే” చెప్పడం ఆపి తన పక్కన ఉన్న వ్యక్తికి సైగ చేసాడు కృపాచార్య. అతను ఒక కాగితం పొట్లం దేవదత్తుడి ముందు ఉంచాడు.

“నీ పేరు ఏమిటన్నావు? ఆఁ ఓ! బ్రాహ్మణ దేవదత్త! ఆ పొట్లం తెరిచి చూడు. నీ కోసమే తెప్పించాను” అన్నాడు కృపాచార్య.   

పొట్లం విప్పి చూస్తే అందులో ఒక ఖాకీ రంగు నిక్కరు, తెల్ల చొక్కా, నీలం రంగు టోపీ, ఒక జత చెప్పులు, మేజోళ్ళు ఉన్నాయి.

దేవదత్తుడు ఆ బట్టలు-చెప్పులు అటు-ఇటు తిప్పి చూస్తూ, “ఇవన్నీ ఎవరి కోసం?” అన్నాడు ఆశ్చర్యంగా.

“ఇవన్నీ నీ కోసమే.”

“అయ్యో, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు?”

“ఎందుకు అన్న ప్రశ్న అనవసరం. ప్రతి బ్రాహ్మణ యువకుడికి క్రమశిక్షణ నేర్పించడం ఒక బ్రాహ్మణుడిగా నా బాధ్యత. ఎందుకంటే క్రమశిక్షణ గల ఆ బ్రాహ్మణ యువకుడే భవిష్యత్తులో మన జాతి ఆత్మగౌరవాన్ని కాపాడగలడు, ఇనుమడింపజేయ గలడు. నేటి నుండి మేము నిన్ను ‘భారత ఆత్మగౌరవ వేదిక’ కార్యకర్తగా నియమిస్తున్నాం. వేదిక శాఖల్లో జరిగే కార్యక్రమాలకి వచ్చేటప్పుడు విధిగా ధరించడం కోసం నీకు ఈ కానుక. వచ్చే ఆదివారం పరేడ్ గ్రౌండులో జరిగే శాఖ కార్యక్రమాలకి తప్పకుండా రావాలి. అక్కడ కొంతమంది పెద్దవాళ్ళకి నిన్ను పరిచయం చేస్తాను. మంచిది. ఓ బ్రాహ్మణ దేవదత్తుడా! ఇప్పుడు నీ గురించి చెప్పు. ఇప్పటి వరకు నువ్వు నీ జాతి కోసం ఏం చేసావు? భవిష్యత్తులో ఏం చెయ్యాలనుకుంటున్నావు?”

ఈ సందర్భంగా తను కూడా మాట్లాడాలని దేవదత్తుడు ఉబలాటపడ్డాడు. అతడు ఎంతో వినయంగా – “మహానుభావా! ఇప్పటి వరకు దేశంకోసం నేను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. అయితే చిన్నప్పటి నుండి ముసల్మానులు అంటే నాకు గిట్టేది కాదు. వీరివల్లనే మన దేశంలోని హిందువుల ఆడపిల్లలని, హిందుత్వాన్ని కాపాడుకోవడానికి నానా అగచాట్లు పడవలసి వస్తోంది. ఆ కోపంతోనే నేను ఒక ముసల్మాను మీదకి రాయి విసిరి వాణ్ణి చంపేసాను. అయితే అప్పటికి నేను ఇంకా చిన్న పిల్లవాణ్ణి అవడంతో కేసు-గీసు ఏమీ లేకుండా బయటపడగలిగాను. ఆ జాతిని మట్టుపెట్టడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదు అని నేను ఆరోజే కంకణం కట్టుకున్నాను.”

దేవదత్తుడి మాటలకి గది మొత్తం గంభీరంగా మారిపోయింది. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఆశ్చర్యం ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళలో ఒక్కరు కూడా ఇప్పటివరకు ఎవ్వరినీ హత్య చెయ్యలేదు. వాళ్ళందరి దృష్టిలో దేవదత్తుడు ఉన్నఫళంగా హీరో అయిపోయాడు. తన వలలో ఊహించిన దాని కంటే పెద్ద చేప పడినందుకు కృపాచార్య నోట మాట రాక ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంటనే కృపాచార్య లేచి నిలబడి దేవదత్తుడి రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఉద్వేగంగా ‘ఓ బ్రాహ్మణ బాలకా! నువ్వు ఈ చేతులతోనే కదా ఒక మ్లేచ్ఛుణ్ణి హతమార్చినది! అభిమన్యుని వంటి తేజస్సు కలిగిన ఓ బాలకా! నీలో అనంతమైన శక్తి ఉంది. నీ పరాక్రమానికి గర్విస్తూ దేశం మొత్తం నీ వైపు చూస్తోంది. దేశోద్ధరణకి నువ్వు నీవంతు సహాయం అప్పుడే చేసేసావు. ఇక ముందు ముందు నువ్వు చెయ్యబోయే సేవకి ఈ దేశమే నీకు ఋణపడి ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా” అంటూ రెండు మిఠాయిలు తినిపించాడు. ఆ మిఠాయిలు నములుతున్న దేవదత్తుణ్ణి చూస్తే ముసల్మానుల ఎముకలు నములుతున్నట్టే అనిపించింది.

అందరూ ఒకేసారి సమవేత స్వరంలో –“బ్రాహ్మణ బాలకుడు దేవదత్తుడికి జై! …. పాకిస్తాన్ డౌన్ డౌన్ …. మమ్మల్ని ఢీకొన్నవాడు తుత్తినియలు అయిపోతాడు …. బ్రాహ్మణ్యాన్ని రక్షించేది ఎవరు? మేము…మేము … భారత ఆత్మగౌరవ వేదిక …. వర్ధిల్లాలి …. వర్ధిల్లాలి” అంటూ నినాదాలు హోరెత్తాయి.

అందరూ తనని పొగడటం విని దేవదత్తుడు ఉద్విగ్నుడయ్యాడు. నేను ఊరు విడిచి ఇక్కడికి వచ్చి ఉండకపోతే ఎంత గొప్ప అవకాశం కోల్పోయేవాడినో కదా అనుకున్నాడు. తను ఈ రోజు, కాదు … కాదు… ఈ క్షణం నుండే కృపాచార్యునికి ఒక నమ్మకమైన కుక్కగా ఉండాలని, ఆయన చెప్పిన శతృవులను అందరినీ మట్టుపెట్టాలని శపథం చేసాడు. ఇబ్రహీంపట్నం ముసల్మానులను భారతదేశం నుండి, తన ఊళ్ళోని మాదిగ వాళ్ళని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టేస్తాడు. అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎలా దొరుకుతుందో చూద్దాం అనుకున్నాడు.

ఆదివారం, వేదిక కార్యక్రమంలో పాల్గొనడానికి దేవదత్తుడు కృపాచార్యతో కలిసి పరేడ్ గ్రౌండ్ కి వెళ్ళాడు. హైస్కూలు తర్వాత హాఫ్ ప్యాంటు వేసుకోవడం మళ్ళీ ఇదే మొదటిసారి. తన నగ్నమైన కాళ్ళు, పిక్కలు చూసుకుని అతనికి సిగ్గేసింది. అయితే పరేడ్ గ్రౌండులో ముసలి-ముతక అందరూ హఫ్ ప్యాంట్లు వేసుకోవడం చూసి దేవదత్తుడి సిగ్గు పటాపంచలు అయిపోయింది. కృపాచార్య, అందరికంటే ముందు దేవదత్తుణ్ణి కాన్పూర్ యూనిట్ అధ్యక్షుడు ఆచార్య ధర్మాధికారికి పరిచయం చేసాడు. ఆచార్యుల వారు మొదట దేవదత్తుణ్ణి పెద్దగా పట్టించుకోలేదు. అయితే కృపాచార్య ఆయన చెవిలో ఏదో గొణగడంతో పులకరించిపోయి, దగ్గరకి వచ్చి దేవదత్తుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నారు. ఆనందంలో ఆచార్యుల వారు తన బిగి కౌగిలిలో బంధించడంతో దేవదత్తుడు ఎముకలు పటపటమన్నాయి. ఆచార్యుల వారిది బలిష్టమైన శరీరం. ఎర్రటి తిలకం దిద్దిన ఆయన ముఖం ముసలి గుఱ్ఱం ముఖాన్ని తలపిస్తుంది. ఆయన గొంతు బొంగురుపోయింది – “ఓ బాలకా! భారత ఆత్మగౌరవ వేదికకి స్వాగతం, సుస్వాగతం. నువ్వు ఈ భరతమాత ముద్దు బిడ్డవు. భరతమాత కిరీటంలో కలికి తురాయివి. పిన్న వయసులోనే నువ్వు చేసిన ఘనకార్యం, మహా మహా హిందూ వీరులు కూడా చేసి చూపించలేకపోయారు. ఈ జాతి మొత్తం నీకు సదా రుణపడి ఉంటుంది.”

ఆచార్యుల వారు తనని అంతలా పొగడటంతో దేవదత్తుడు మనసు పులకరించి పోయింది. క్రమంగా దేవదత్తుడి ఆత్మన్యూనత పోయి తన శరీరం ‘సురస’ శరీరంలా ఎదిగిపోతున్నట్టు, ఆ బరువుకి భూమి లోపలకి దిగబడిపోతున్నట్టు అనిపించింది. కృపాచార్య దేవదత్తుడి భుజం పట్టుకుని కుదిపి – “ఓ దేవదత్తా! ఎక్కడ కలల్లో విహరిస్తున్నావు? ఆచార్యుల వారు సమావేశానికి చేరుకుని ఉంటారు. పద. పద.” అన్నాడు.

శాఖ అభ్యాస ప్రక్రియలు మొదలయిపోయాయి. కొద్ది సేపు వ్యాయామం తర్వాత కర్రసాము వగైరా ప్రాక్టీసు చేయించారు. తర్వాత కార్యకర్తలు అందరూ బాసింపట్టు వేసుకుని నేల మీద వరుసలో కూర్చొన్నారు. ఆచార్యుల వారు సంబోధిస్తూ – “ప్రియమైన భారత ఆత్మగౌరవ వేదిక కార్యకర్తలారా! మనమంతా కలిసి భరతమాతని మరొకసారి దాస్య శృంఖలాల నుండి విడిపించాలి. ఈ భారతదేశం హిందువులది. ఇది ఒక హిందూ దేశంగానే ఉండాలన్నది మన అందరి ఆకాంక్ష. మన పూర్వీకులు తమ రక్తం-చెమట చిందించి ఈ దేశాన్ని అభివృద్ధి చేసారు. కాబట్టి ఈ దేశాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడానికి మనం ససేమిరా ఒప్పుకోము. ఒకానొకప్పుడు మన సంస్కృతి, ప్రపంచ సంస్కృతుల్లోనే గొప్పదిగా కీర్తి గడించింది. కానీ ముస్లిం చొరబాటుదారుల వలన ఇప్పుడు మన సంస్కృతి ఆపదలో ఉంది. మన సంస్కృతిని కోతులు, ఏనుగులు, సాధువులు, భిక్షువులు, ఉగ్రవాదుల సంస్కృతి అని ముద్ర వేసేసారు. ఈ ముసల్మానులు మన దేవాలయాలను ధ్వంసం చేసి అక్కడ మసీదులు నిర్మించారు. రండి! ఆక్రమించిన మన దేవాలయాలను, పూజా స్థలాలను, అమూల్యమైన సంపదను తిరిగి సాధించుకుందాం. ఈ మహాయజ్ఞంలో అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరినీ దండిద్దాం. ప్రస్తుత ప్రభుత్వం ఒఠ్ఠి పనికిమాలిన ప్రభుత్వం. ఓట్ల కోసం జనాలను సంతృప్తి పరచడం కోసం చాలామంది హిందువులకు అన్యాయం చేస్తోంది. మన దేశంలో ముసల్మానులకి భయపడుతూ బతకాల్సిన రోజులు దాపురించాయి. రండి! ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని గద్దె దింపి మన భారత ఆత్మగౌరవ వేదిక సమర్థించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. దీనితో భారత దేశం, హిందూ దేశంగా మారడం సులువు అవుతుంది. పైగా భరతమాత అన్ని రకాల బంధనాల నుండి ముక్తి పొందుతుంది. భరతమాత కి జై! ‘భారత్ ఆత్మగౌరవ వేదిక జిందాబాద్!’

ఆ కార్యక్రమం నుండి తిరిగి వచ్చిన తర్వాత దేవదత్తుడు రోజంతా ఆకాశంలో తేలిపోతూ ఉన్నాడు. వేదిక పేరు చెప్పి తనకు ఒక మంచి సంస్థ దొరికినందుకు సంబరపడుతూ ఆ సంస్థ ద్వారా తన జాతికి, మతానికి సేవ చెయ్యాలి అని సంకల్పించాడు.

మరొక పక్క కృపాచార్య బభృవాహనుణ్ణి 212 గది ఖాళీ చేయించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రిన్సిపల్ కృపాచార్య మాటలకి లొంగలేదు. ఆయన  తిన్నగా – “చూడు వాజపేయి! హాస్టలులో రూములు ఖాళీ లేవు. బభృవాహనుణ్ణి ఎక్కడికి పంపాలి? పైగా కులం పేరు చెప్పి ఒక విద్యార్థిని గది మార్చడం అస్సలు కుదరదు. ఆల్ మోస్ట్ ఇంపాజిబుల్. హాస్టలు వార్డెన్ శుక్లా గారు కూడా ఒప్పుకోరు. నేను ఈ కాలేజి ప్రిన్సిపల్ ని. స్టూడెంట్, షెడ్యూల్డ్ కాస్ట్ అయినా, ఫారఫర్డ్ కాస్ట్ అయినా, నాకు అందరూ సమానమే. ఈ సీటులో ఉన్నంతకాలం నేను ఎవరి పట్ల డిస్క్రిమినేషన్ చూపించలేను …. చూపించను.”

చాలాసేపటి వరకు మాటల యుద్ధం నడిచింది. ప్రిన్సిపల్ ఒక మాట అంటే కృపాచార్య దానికి ఎదురు చెప్పడం …. ఇలా! తన పంతం నెగ్గకపోవడంతో కృపాచార్య చివరకి గుండాగిరికి దిగుతూ ప్యాంటు  జేబులో నుండి రివాల్వర్ తీసి ప్రిన్సిపల్ టేబులు మీద పెడుతూ – “ఓ ప్రిన్సిపల్ సాహెబ్! ఆ మాదిగోణ్ణి 212లో నుండి ఎలా బయటకి పంపవో నేనూ చూస్తాను” అన్నాడు.  

ప్రిన్సిపల్ తన టేబులు మీద ఉన్న రివాల్వరు చూసి నవ్వుతూ – “కృపాచార్య, నీ ఈ పిల్ల చేష్టలు వేరే ఎవరి దగ్గర అయినా చూపించు. నా దగ్గర కాదు. నేను నీలాంటి టపోరిగాళ్ళని నలుగుర్ని నా పిలకకి ముడివేసి పెట్టుకోగలను చూస్కో” అంటూ ప్రిన్సిపల్ కుడిచేత్తో తన పిలక ముడి విప్పి విదిలించాడు. ముడి విడిన ఆ పిలక చిన్న పాము పిల్లలా ప్రిన్సిపల్ మెడమీద అటు-ఇటు ఊగుతోంది. “నిన్ను నువ్వు బ్రాహ్మడివి అని చెప్పుకుంటే నేను మహా బ్రాహ్మణ్ణి. లే, నడు. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. ఇదిగో వెళ్ళే ముందు రెండు చెవులూ తెరుచుకుని లిజన్ – ఈ దేశానికి నువ్వు, బభృవాహనుడు ఇద్దరూ సమానమే. ఇంతకు ముందు ఈ దేశంలో నీ అధికారం నడిచి ఉండొచ్చు. ఇప్పుడు కాదు. గుడిని-గుడిలో లింగాన్ని కూడా అమ్ముకుని తినే మీ దుకాణాలు ఎప్పుడో మూతపడ్డాయి. ప్రస్తుతం ఈ దేశం మనుస్మృతితో కాదు, రాజ్యాంగంతో నడుస్తోంది. అండ్ నీకు బాగా తెలిసే ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం నీ స్థాయి 11% మించి లేదు. గెట్ అవుట్!”

కృపాచార్యకి కాలేజి జీవితంలో మొట్టమొదటిసారి ఇలాంటి ప్రిన్సిపల్ ఎదురయ్యాడు. ఇక వెనకడుగు వెయ్యక తప్పలేదు. ‘భారత రాజ్యాంగం’ ప్రకారం తన స్థాయిని ఎత్తి చూపించి తన పడగ మీద కాలు వేసి తొక్కేసినంత పనిచేసాడు. కోపంతో ఊగిపోతూ కృపాచార్య అటూ-ఇటూ చూస్తున్నాడు. మొత్తం బ్రాహ్మణ విరోధులని అంతం చెయ్యడానికి తన గొడ్డలి వెదుకుతున్నట్టు ఉన్నాయి ఆ చూపులు. తను తీసుకువచ్చిన ఆయుధం …. అదే రివాల్వర్ ప్రిన్సిపల్ టేబులు మీద ఉన్న విషయం మరచిపోయాడు. ఎందుకంటే ప్రిన్సిపల్  ముడి విడిన పిలక ఆయన మెడ మీద భయంకరంగా అటు-ఇటు ఊగుతోంది. ఈరోజు ఒక జూనియర్ ముందు తనకి ఇంత అవమానం జరగడంతో చాలా బాధగా ఉంది కృపాచార్యకి. బజరంగబలి ఎదుట ఏళ్ల తరబడి చేసిన వ్యాయామం కూడా అక్కరకు రాలేదు. అవమానంతో అతని ముఖం జేవురించుకు పోయింది. మళ్ళీ ఈ లోకంలోకి వస్తూనే టేబులు మీద ఉన్న రివాల్వరు తీసుకుని ప్రిన్సిపల్ గురించి ఫిర్యాదు చెయ్యడానికి ఆచార్య ధర్మాధికారి దగ్గరకి బయలుదేరాడు. దేవదత్తుడు తన 212 నెంబరు గదిలోకి తిరిగి వచ్చాడు. బభృవాహనుడు గదిలో తన పక్క మీద కూర్చుని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ చదువుతున్నాడు. దాని వెనక పేజీలో ఒక వార్త పెద్ద పెద్ద అక్షరాల్లో –
“ఏ దళిత్ యూత్ బర్న్ట్ అలైవ్ ఇన్ ఘాటంపూర్” అని అచ్చయి ఉంది.

***

5

దేవి పెళ్ళి సంబంధం గురించి భగత్ ఎంతో మందికి ఉత్తరాలు రాశాడు. అయితే వాటిల్లో చాలా ఉత్తరాలకి జవాబులు వచ్చినా ఒక్కరే పెళ్ళికి సుముఖంగా ఉన్నారు. మిగిలిన వారందరూ ‘ఊరు వాళ్ళు వెలివేసిన ఇంటితో మేం సంబంధం కలుపుకోము’ అని నిర్మొహమాటంగా రాసేశారు. బతుకు జీవిడా, దొరికినదే మహాప్రసాదం అనుకుంటూ భగత్ ఆ వచ్చిన ఒక్క సంబంధం ఖాయం చేశాడు. దేవి పెళ్ళి అయిపోయింది. కుర్రాడి పేరు లోమహర్షుడు. పెళ్ళికొడుకుని చూసిన వాళ్ళు అందరూ, కుర్రాణ్ణి అందగాడు అని పొగుడుతూనే, ఈ రోజుల్లో ఇలాంటి కుర్రాడు దొరకడం అరుదు అని చెప్పుకున్నారు. కుర్రాడు తెల్లటి తెలుపు. సన్నని పొడవైన శరీరం. హీరోలాంటి క్రాపింగు. పెళ్ళి జరగడానికి కొద్ది రోజుల ముందే అతనికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఐదుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాడు. వీళ్ళందరి కంటె పెద్దిది ఒక అక్క ఉంది. వీళ్ళ ఇల్లు అన్న-వదినలు, పిల్లలతో సందడిగా ఉంటుంది. ఒకానొకప్పుడు వీళ్ళ ఇల్లు సామాజికంగానూ, ఆర్థికంగానూ కూడా చాలా పేరుగాంచినది. ప్రస్తుతం వాటి లక్షణాలు లేశ మాత్రం కూడా కనిపించవు. ఇప్పుడు నిజానికి ఆ కుటుంబానికి ఏమన్నా మిగిలి ఉంది అంటే ‘మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి’ అన్నట్టు చరిత్ర గురించి గొప్పలు చెప్పుకునే పనికిరాని బడాయి కబుర్లే. అసలు ఆ ఇంటి చరిత్ర ఏంటి అంటే లోమహర్షుడి తండ్రి శ్రీ మేఘనాథ పూర్వం ఎప్పుడో షాహజహాపూర్ మహారాజు దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. మహారాజు గారు, బ్రాహ్మణుడు అని ఈయనకు కొన్ని ఎకరాల భూమి దానం చెయ్యడమే కాకుండా ఒక పెద్ద ప్రాంతానికి జమీందారుగా కూడా ప్రకటించారు. మేఘనాథుడు ఆ ప్రకటననే తన ఇంటి గుమ్మం ముందు “శ్రీ మేఘనాథ జమీందారు, మహారాజ షాహజహా ప్రధాన కార్యదర్శి, మండలం- కటరీ సంయుక్త ప్రాంతం” అని శిలాఫలకం చెక్కించాడు.

మేఘనాథుడు ఎప్పుడూ తన దగ్గర సవర్ల కొద్దీ బంగారం-వెండి ఆభరణాలు ఉన్నాయని, అవసరానికి వాడుకోవచ్చు అని వాటిని దాచి ఉంచానని చెబుతూ ఉంటాడు. అయితే కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఆ వెండి-బంగారాలు ఎన్నడూ చూసినది మాత్రం లేదు. మళ్ళీ మాట్లాడితే అసలు అవి ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? – అని ఎవ్వరికీ తెలియదు. తన జమీందారీతనం చూపించుకోవడానికి మేఘనాథుడు ఆ గడ్డుకాలంలో కూడా ఇంటి ముందు ఒక ఏనుగుని, దాని బాగోగులు చూసుకోవడానికి ఒక మావిటివాణ్ణి పెట్టాడు. ఏనుగు అలా ఇంటి ముందు నిలబడితే, దాహంతో ఉన్నవాడికి ఒక్కొక్క చుక్క నీరు దొరికినట్టు వాళ్ళ అహం కొంచెం-కొంచెం తృప్తి చెందుతూ ఉంటుంది.  ఏనుగు మెడకి ఉన్న గంటల శబ్దం వినిపించని రోజు తను ప్రాణాలు విడిచేసినట్టే అని అంటూ ఉంటాడు మేఘనాథుడు. ఇలా లేనిపోని ఆడంబరాలు, బడాయిల కారణంగానే ఐదుగురు కొడుకుల్లో నలుగురికి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. లోమహర్షుడు మాత్రం దేవుని దయవల్ల ‘కాలమతి’ లాగ, మారుతున్న కాలాన్ని, పరిస్థితుల్ని పసిగట్టి కాస్త చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. కుటుంబ దారిద్ర్యం వల్ల ఆ అన్నదమ్ములు ఎంత ఆత్మన్యూనతకి లోనయ్యారు అంటే వాళ్ళందరి ప్రవర్తన కాస్త వెకిలిగా, తేడాగా ఉండేది. నిజ జీవితంలో కూడా నటిస్తూ ఉండేవారు. ప్రస్తుతం వారు జమీందార్లు కాదు అని ఒప్పుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగా లేరు. ఇంటి లోపల పరిస్థితి ఏమిటి అంటే అందరికీ ఉండటానికి సరిపడే చోటు కూడా లేదు. ఇల్లు కూలిపోతూ ఇంచుమించు శిథిలావస్థలో ఉంది. ఐదంటే ఐదు చిన్న-చిన్న గదులు. అవి కూడా నౌకర్లు ఉండే గదులు మాత్రం మిగిలాయి. ఆ ఐదు గదుల్లో ఐదుగురు అన్నదమ్ములు తమ-తమ కుటుంబాలతో ఉండేవారు. ఆ గదులకి ఎదురుగా ఆరు-ఆరు అడుగుల స్థలం. అక్కడే వీళ్ల వంట-వార్పు. ఇంటి యజమాని మేఘనాథుడికి విడిగా గది లేకపోవడంతో వసారాలోనే మంచం వాల్చుకుని పడుకునేవాడు. రోజూ ఉదయం-సాయంత్రం పొయ్యిలు వెలిగే వేళకి వసారా అంతా పొగ కమ్ముకునేది. పొగ మొదలవుతూనే మేఘనాథుడు మంచం మీద లేచి కూర్చుని ఏదో ఒక పొయ్యి మీద నుంచి రెండు రొట్టెలు రాకపోతాయా అని ఎదురుచూస్తూ ఉండేవాడు. రొట్టెలు ఏ కోడలు తీసుకొచ్చినా – “ఓ ముసలాడా! ఆ బంగారం ఎక్కడ పాతిపెట్టావు? గుట్టుచప్పుడు కాకుండా నాకు చెప్పు. ఆ దేవుడి మీద ఒట్టు. నీకు రేపటి నుండి మరొక రొట్టె ఎక్కువ పడేస్తాను.” అనేది.

ఆయన ఆ బోసి నోటితో చర్ర్ చర్ర్ మని రొట్టెలు నములుతూ – “చూడు కోడలు పిల్లా! కాస్త ఓపిక పట్టు. న్యాయంగా అందరికీ తలొక యాభై సవర్లు ఇస్తాను. నేను ఏమన్నా ఇప్పుడే చచ్చిపోతున్నానా?” అనేవాడు.

మేఘనాథుణ్ణి అతని కొడుకులు, కోడల్లు ఇంకో ఏనుగులా చూసేవారు. ఒక ఏనుగు బయట నిలబడి తింటూంటే, ఇంకొక ఏనుగు ఇంటో పడి తింటోంది. అంతే తేడా అనుకునేవారు.

ఆ ఇంటి మగవాళ్ళు వెలుతురు ఉండగా గడప దాటేవారు కాదు. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే రాత్రి వెళ్ళి రాత్రికే ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఊరి వాళ్ళు వీరిని చూస్తే ఏనుగు గణగణమని గంటలు మోగించుకుంటూ బయటకి వెళ్ళి తిరిగొచ్చింది అనుకునేవారు. ఎవరి దగ్గరి నుండి అయినా ఏ పెళ్ళికో, శుభకార్యానికో పిలుపు వస్తే ఎవ్వరూ వెళ్ళకపోగా మావటివాడితో ‘జమీందార్లు ఇంట్లో లేరు’ అని కబురు పంపేవారు. అయినా ఆ మావటి వాడి మాట ఎవ్వరూ నమ్మకపోగా నవ్వుకునేవారు.

ప్రభుత్వ ఉద్యోగం అవ్వడంతో దేవి భర్త ఉన్న ఊరు, సొంత ఇల్లు వదిలి షాహజహాపూర్ లో మకాం పెట్టాడు. ఇల్లు వదిలి వెళ్లడం అతనికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కొత్త ఊళ్ళో ఎవరికీ తను ఒక నామమాత్రపు జమీందారుకి కొడుకు అని తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్లపాటు మామూలుగా ఉన్నా, రోజులు గడిచే కొద్దీ అతనిలోని ఆత్మన్యూనతా భావం తిరిగి నిద్ర లేచింది. ఈ ఆత్మన్యూనత అన్నది క్రమక్రమంగా ఆ వ్యక్తికి రక్షణ కవచంలా మారిపోతుంది. సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి వస్తూనే కిరాయి ఇంట్లో తలుపులు బిడాయించుకుని కూర్చొనేవాడు. బజార్లో ఏమైనా పనులు ఉంటే రాత్రి చీకటి పడిన తర్వాత చూసుకునేవాడు. అసలు నోట్లో నుండి  మాట పెగిలేది కాదు. ఎప్పుడు మాట్లాడుతాడా, ఎప్పుడు ముత్యాలు రాలుతాయా అని అతని చుట్టుపక్కల జనాలు ఎదురు చూసేవారు. ఏదో ప్రపంచం అంతా అతని రహస్యాలు తెలుసుకోవడానికి అర్రులు చాచి ఉంది అన్నట్టు తన చిన్న చిన్న వస్తువులు కూడా ఎంతో రహస్యంగా ఉంచుకునే ప్రయత్నం చేసేవాడు.    

లోమహర్షుడితో పెళ్ళయిన తర్వాత దేవి ఎంతో సంతోషంగా ఉంది. తన భర్త జమీందారు. ప్రభుత్వ ఉద్యోగం, పైగా అత్తవారి ఇంటి ముందు ఒక ఏనుగు కూడా. ఇప్పుడు దేవి తనని తాను కాస్త అదృష్టవంతురాలు అయిన గృహిణిగా భావిస్తోంది. కాస్త అదృష్టవంతురాలు అనుకోవడం ఎందుకు అంటే తండ్రి అదృష్టం క్రమక్రమంగా దురదృష్టంగా మారడం తను కళ్ళారా చూసింది. ఆమెకి ‘అదృష్టం’ మీద పెద్దగా నమ్మకం లేదు. పెళ్ళయిన తర్వాత కొన్నాళ్లపాటు అత్తవారింట్లో ఆ పెద్ద ద్వారం వెనక ఉన్న చిన్న గదిలో ఉంది. ఆ రోజుల్లో మిగిలిన కుటుంబ సభ్యులు దేవికి గుఱ్ఱం జీను, ఏనుగు ఇత్తడి అంబారీ, సగం విరిగిపోయిన మొండి కత్తులు, రాజుగారి ప్రధాన కార్యదర్శి తలపాగా వగైరా వగైరా  చూపిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు గుమ్మంలో నిలబడి అరటి బోదెలు చీల్చుకుని తింటున్న ఏనుగును కూడా చూపించేవారు. ఏదో వంకన, ఇల్లు-ఆస్తి వాటాలు వేసినప్పుడు ఆమె వాటాకి కనీసంలో కనీసం యాభై సవర్ల బంగారం వస్తుందని చెప్పడం మరచిపోయేవారు కాదు. బంగారం మాట వింటూనే దేవి చాలా సంబర పడిపోయేది. నగల పేరు చెప్పి ఆమె పుట్టింట్లో ఉన్నవి రెండే రెండు – అమ్మ గిల్టు మెట్టెలు, తన చెవులకు ఉన్న ఇత్తడి దుద్దులు. అమ్మ ఎప్పుడూ తన ముక్కు-చెవులకి వేప పుల్లే పెట్టుకునేది. దేవికి కూడా ముక్కు-చెవులు కుట్టించినప్పుడు వేప పుల్లే పెట్టారు. యాభై సవర్ల బంగారం రాగానే తను రకరకాల నగలు చేయించుకుని, ఒకటి రెండు నగలు తల్లికి కూడా చేయించి ఇచ్చినట్టు కలలు కంటూ ఉండేది. ఒకరి ఇంటి ముందు ఇలా ఏనుగు కట్టేసి ఉండటం దేవి ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఎరుగదు. తన ఊళ్ళో ఏనుగుని అప్పుడప్పుడు నాగా బాబా తీసుకొచ్చేవాడు అంతే. ఊళ్ళో అయితే ఇళ్ళ ముందు ఆవులు-గేదెలు-మేకలు కట్టేసి ఉండటమే తెలుసు.   

దేవి తన భర్తతో కలిసి షాహజహాపుర్ వెళ్ళిన రోజు రాత్రి ఆమె భర్త తన భవిష్యత్తు పథకాల గురించి చాలా నాటకీయంగా వర్ణించి అవన్నీ తీరడంలో భార్యగా ఆమె సహాయ-సహకారాలు అర్థించాడు. – “ఇదిగో వింటున్నావా? నేను ఇంకా ఈమధ్యనే ఉద్యోంగంలో చేరాను. కటింగులు అన్నీ పోయి చేతికి వచ్చేది సుమారు ఎనిమిది వందలు. ఇంటి అద్దె, ఖర్చులు పోనూ పెద్దగా మిగిలేది ఏం ఉండదు. లక్షాధికారి కావాలని ఉద్యోగంలో చేరిన మొదటి రోజే నేను ప్రతిజ్ఞ చేసాను. వారసత్వంగా వచ్చిన జమీందారీ బరువు మోసి-మోసి నా నడుం వంగిపోయింది. జీవితంలో అసలైన జమీందారుగా ఎదిగి వెలుతురులో అందరి ముందు గర్వంగా నిలబడాలి అన్నది నా కల. నిజమైన జమీందారు అంటే తక్కువలో తక్కువ లక్షాధికారి అన్న మాట! నాకు వచ్చే జీతంలో చేసే పొదుపుతో లక్షాధికారి కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ ఆ లక్ష్యం పూర్తవకుండా నేను ఏమీ మొదలుపెట్టకూడదు అని నిర్ణయించుకున్నాను ….. వైవాహిక జీవితంతో సహా! ఈ లక్ష్య సాధనలో నువ్వు నాకు తోడుగా నిలబడాలి. నువ్వు ఇంకా పై చదువులు చదవాలి. కనీసం ఇంటరు పాసయితే ఏదో ఒక ఉద్యోగం దొరకుతుంది. అప్పుడు మనిద్దరం కలిసి జమీందారు అవ్వడానికి ప్రయత్నిద్దాం. నువ్వు రేపే బయలుదేరి నీ పుట్టింటికి వెళ్ళి చదువు మొదలుపెట్టు. ఇంటరు పాసయ్యి కబురు పంపితే నేను వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చుకుంటాను.”

దేవి ఏదో చెప్పబోయేలోపు లోమహర్షుడు లేచి గదిలో లైటు ఆర్పేసాడు. ‘ఇంక నిద్రపో’ అంటూ గదిలో వాల్చి ఉన్న ఒకే ఒక్క మంచం మీద పడుకుని గుర్రుపెట్టడం మొదలుపెట్టాడు.

దేవి బొంత మీద వాలి గోడకి ఆనుకుని ఆలోచిస్తోంది. ఇదెక్కడి పెళ్ళి? అసలు ఇంకా పెళ్ళి అయ్యి ఎన్నాళ్ళు అయినట్టు? ఇంటరు పాసవ్వడం అంటే …. నాలుగేళ్లు! అదీ నేను పాసవ్వగలనో లేదో! లక్ష రూపాయలు లేనివాడు వైవాహిక జీవితం మొదలుపెట్టలేడా? ఆమె అలాగే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది.

మర్నాడు లోమహర్షుడు బలవంతంగా ఆమెను బాగసర్ వెళ్ళే బస్సు ఎక్కించేసాడు. సాయంత్రానికల్లా దేవి పుట్టింటికి చేరుకుంది.

***

6

బభృవాహన్ ‘దొహరే’ అనే విద్యార్థి సుల్తానుపూర్ వాస్తవ్యుడు. అతని తండ్రి ఆ ఊళ్ళో మాదిగవాడలో ఒక గౌరవప్రదమైన వ్యక్తి. సొంత భూమి లేకపోవడంతో అదే ఊళ్ళో యాదవుల పొలాల్లో కూలి పనికి వెళ్తూ ఉండేవాడు. వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇతర రకరకాల యంత్రాలు వచ్చెయ్యడంతో కూలి పనులు దొరకడం కష్టమయిపోయింది. దానితో నెలకి వంద రూపాయల జీతం, ఒక పూట భోజనం పెట్టే షరతు మీద యాదవుల ఇంట్లో పనికి కుదిరాడు. ఆ డబ్బుతోనే ఇల్లు గడవాలి, బభృవాహనుడి చదువు కొనసాగాలి. బభృవాహనుడిని ఇంట్లో అందరూ ‘బబ్బూ’ అని పిలిచేవారు. తన బబ్బూ ఎలాగైనా నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుని ఏదైనా చిన్నపాటి ప్రభుత్వ గుమాస్తా ఉద్యోగం సంపాదిస్తే తనకి యాదవుల ఇంట్లో ఈ చాకిరీ తప్పుతుంది అని అతని ఆశ. బబ్బూ చదువులో చాలా చురుకైనవాడు. చూస్తూ చూస్తూనే డి.ఏ.వి. కాలేజి వరకు వచ్చేశాడు. బబ్బూ తండ్రికి చదువు గురించి తెలిసినదల్లా చదువు మొత్తం 16 క్లాసులు. బబ్బూ ఇప్పుడు పదహారో క్లాసు చదువుతున్నాడు. అంతే! అయితే బబ్బూ ఇంత త్వరగా పదహారో క్లాసుకు రావడంతో తండ్రి చాలా భయపడిపోయాడు. ఊళ్ళో యాదవులు తనని ఏం చేస్తారో అని ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ ఉండేవాడు. ఊళ్ళో ఏ యాదవుల పిల్లాడూ ఇప్పటివరకు హైస్కూలు చదువు కూడా పూర్తి చెయ్యలేదు మరి. కొడుకుకి రాసే ప్రతి ఉత్తరంలో, మరీ అవసరం అనుకుంటే తప్ప ఊళ్ళోకి అడుగుపెట్టొద్దు అని, వీలయినంత త్వరగా ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోమని రాస్తూ ఉండేవాడు.

దేవదత్తుడు 212 గదిలోకి వచ్చిన సంవత్సరమే బబ్బూ ఫిజిక్స్ లో ఎం.ఎస్.సి. ఆఖరి సంవత్సరం పరీక్షలు రాశాడు. అదే ఏడాది యు.పి.ఎస్.సి. పరీక్ష కూడా రాసాడు. విశేషం ఏంటంటే రెండు పరీక్షల ఫలితాలు ఒకే రోజు వెలువడ్డాయి. ఎం.ఎస్.సి. ఫస్టు క్లాసులో పాసయ్యాడు. యు.పి.ఎస్.సి. లో అత్యధిక మార్కులు సాధించిన మొదటి పదిమందిలో బబ్బూ పేరు కూడా ఉంది. బబ్బూ యు.పి.ఎస్.సి. పాసయిన విషయం హాస్టలు మొత్తం గుప్పుమంది. ఇంకేముంది? అగ్రవర్ణ విద్యార్థుల గుండెల్లో గుబులు మొదలయింది. కృపాచార్య సహా మిగిలిన వేదిక సభ్యులకి కూడా ఈ వార్త మింగుడు పడలేదు. కృపాచార్య ఆదేశాల మేరకు ఆ రోజు హాస్టలులో సంతాప దినంగా ప్రకటించారు. ఆ రోజు బజరంగబలి హారతి కూడా రద్దు చేసారు. అగ్రవర్ణ విద్యార్థులు ఎవ్వరూ ఆరోజు భోజనానికి ‘మెస్’కి వెళ్ళలేదు. మర్నాడు 211 నెంబరు గదిలో వేదిక కార్యకర్తల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సభలో కృపాచార్య ఎంతో ఉద్విగ్నంగా మాట్లాడాడు – “ప్రియమైన సోదరులారా! ఈరోజు మన అగ్రకులం వారు అందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఈరోజు ఒక తక్కువ కులం వాడు ఐ.ఏ.ఎస్. పరీక్ష పాసయ్యి మన ముందు తలెత్తుకుని తిరుగుతున్నాడు. ఎన్నో సంవత్సరాల మేధస్సు వారసత్వంగా కలిగిన మనం అతని ముఖం చూస్తూ నిలబడ్డాం. ఇందులో మన తప్పేం లేదు. దీనికి మన భారత రాజ్యాంగమే బాధ్యత వహించాలి. ఈ రాజ్యాంగమే మన అగ్రకులాల వారిని నపుంసకులుగా చేసేసింది. ఈ తక్కువ కులం వారికి ఇచ్చిన రిజర్వేషన్ మనల్ని ముంచేస్తుంది అని నేను ఆ రోజే అనుకున్నాను.  దాని నిజ స్వరూపం ఇదిగో ఇప్పుడు ఇలా బయటపడింది. ఈ కృత్రిమ వరదని ఎలాగయినా ఆపాల్సిందే. నేను రేపే ఆచార్య ధర్మాధికారిని కలిసి ఈ రిజర్వేషన్లకి వ్యతిరేకంగా ఒక సమితి ఏర్పాటు చేసి, సమితి ఆధ్వర్యంలో ధర్నాలు, బహిరంగ ప్రదర్శనలు చెయ్యడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. ఈ సంగ్రామంలో మీరు అందరూ ఉత్సాహంగా పాల్గొని మీ వంతు సహాయం అందించాలి. నడుం బిగించి ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాలి.”

సభ ముగియగానే రిజర్వేషన్లకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఈ హడావుడికి భయపడి తక్కువ కులాల విద్యార్థులు చాలా రోజులు హాస్టలు గదుల్లో నుంచి బయటకి రాలేదు. ఒకవేళ రావాల్సి వస్తే ఒంటరిగా కాకుండా నలుగురు-ఐదుగురు కలిసి గుంపుగా వచ్చేవారు.

మర్నాడు కృపాచార్య, ఆచార్య ధర్మాధికారిని కలిసాడు. ధర్మాధికారి రిజర్వేషన్లకి వ్యతిరేకంగా సమితి స్థాపించడానికి అనుమతి ఇస్తూ – “ప్రియమైన కృపాచార్య! రిజర్వేషన్లకి వ్యతిరేకంగా పోరాడటం పూర్తిగా నీ హక్కు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఏ విషయం గురించి అయినా, ఎవరైనా ఎప్పుడైనా బహిరంగ ప్రదర్శన చెయ్యొచ్చు. కానీ రాజకీయ పార్టీలతో కలిసి పని చేసినప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. అయితే భారతదేశ వర్తమాన పరిస్థితి ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ కూడా నీకు తోడు రాదు. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి అన్ని రాజకీయ పార్టీలూ ఈ రిజర్వేషన్లను అడ్డు పెట్టుకునే కేంద్రం, రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏ ఒక్క గ్రూపుని నిరాశపరిచి తమ ఓటు బ్యాంకుకి గండి పడటం ఏ పార్టీకీ ఇష్టం లేదు. అయితే రిజర్వేషన్లు వచ్చే వాళ్ళ గురించి కానీ, రాని వాళ్ళ గురించి కానీ ఏ రాజకీయ పార్టీకి పెద్దగా బెంగ లేదు. వ్యక్తిగతంగా ఈ రిజర్వేషన్లని వ్యతిరేకించేది ఎందుకు అంటే మన పూర్వీకులు చేసిన-చెయ్యని ఆ తప్పులకి మనం ఎందుకు శిక్ష అనుభవించాలి? మనం ఈ స్వతంత్ర భారత దేశ పౌరులం. అన్ని రంగాల్లో మనకి కూడా సమానమైన అధికారాలు-అవకాశాలు దక్కాలి. అసలు నువ్వు ఈ ధర్నాలు, ప్రదర్శనల్లో ఎందుకు చిక్కుకుంటావు? పాము చావకుండా, కర్ర విరగకుండా, మళ్ళీ మాట్లాడితే మన చేతికి మట్టి అంటుకోకుండా ఏదైనా దారి ఆలోచించు. దీనిని ఒక రహస్య సంస్థగా నడుపు. హాస్టలులో ఉండే కుర్రవాళ్ళని బెదిరిస్తూ ఉండు. అప్పుడు వాళ్ళంతట వాళ్ళే చదువు మాని పారిపోతారు. అసలు ఎవడూ చదవకపోతే ప్రభుత్వం రిజర్వేషన్లు ఎవరికి ఇస్తుందో అదీ చూద్దాం. నా ప్రియ శిష్యుడా! కొమ్మల మీద దాడి చెయ్యడం కంటే, వేళ్ళతో సహా చెట్టు మొదలంటా నరికే ఉపాయం ఆలోచించు!   

***

ప్రొఫెసర్ సచ్చిదానంద చతుర్వేది

01 మే, 1958 న ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా గోధానీ లో జన్మించిన ప్రొ. సచ్చిదానంద చతుర్వేది హిందీ, సంస్కృత భాషల్లో పిహెచ్.డి. పట్టాలు పొందారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, హిందీ శాఖలో ప్రొఫెసర్ గా సేవలందించి పదవీ విరమణ చేసిన ప్రొ. చతుర్వేది ఫిబ్రవరి, 2005 నుండి ఫిబ్రవరి 2007 వరకు వార్సా విశ్వవిద్యాలయం, పోలెండ్ లో కూడా హిందీ ప్రొఫెసరుగా తమ సేవలందించారు. దేశ విదేశాల్లో హిందీ భాషా-సాహిత్య విషయాలపై ప్రసంగాలు చేయడంతోపాటు ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో తమ కథలు, పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు. ‘వైరాగ్య్ : ఏక్ దార్శనిక్ ఏవం తులనాత్మక అధ్యయన్’, ‘అరుణాచల్ కా ఆదికాలీన్ ఇతిహాస్ : ఏక్ ఝలక్’, ‘అజ్ఞేయ్ కే నిబంధ్ : ఏక్ ఆలోచనాత్మక్ అధ్యయన్’, ‘అధబునీ రస్సీ : ఏక్ పరికథా’, ‘మఝధర్’, ‘పిఘలే చెహరే’, ‘రోషనీ కీ లకీరేఁ’, ‘భారతీయ్ కావ్యశాస్త్ర్’ వీరి ప్రముఖ రచనలు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.

డా. వి.ఎల్. నరసింహం శివకోటి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి M.A (ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్ లేషన్) (గోల్డుమెడల్), M.Phil (హిందీ) (గోల్డుమెడల్), Ph.D (హిందీ) పట్టాలు పొందిన డా|| నరసింహం శివకోటి హిందీ - తెలుగు భాషలలో పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను 'ప్రభాత కిరణేఁ', 'అనావరణ్' శీర్షికన తెలుగు నుండి హిందీలోకి, అలాగే, ప్రముఖ హిందీ కవి నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను "అంతరిక్షం  నుండి.." శీర్షికతో హిందీ నుండి తెలుగులోకి అనువదించడంతోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలు తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ' భారత్ డైనమిక్స్ లిమిటెడ్'లో డిప్యూటీ మేనేజర్ (రాజభాష)గా సేవలు అందిస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *