అధ్యాయం- 7
కోర్ట్ ఉద్యోగులు
చివరికి మాథ్యూ నికిటిచ్ కూడా కోర్టుకి వచ్చేసాడు. అప్పుడు ఒక బక్కపలుచటి బంట్రోతు జ్యూరీ సభ్యులున్న గదిలోకి ప్రవేశించాడు. సన్నటి పొడవైన మెడతో, కింది పెదవి ఒకపక్కకు పొడుచుకొచ్చినట్టుగా వుంది. పక్కవాలుగా నడుస్తూ అచ్చం టర్కీకోడిలా ఉన్నాడతను .
ఆ బంట్రోతు నిజాయితీగలవాడు. యూనివర్సిటీలో చదువుకున్నవాడు. కానీ మద్యం మత్తుకి బానిసైపోవడం వల్ల ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. మూడునెలల క్రితం అతడి భార్య ఒక దొరసాని ప్రాపకం సంపాదించి ఈ ఉద్యోగం అతనికి ఇప్పించింది. ఇంతకాలంగా ఈ ఉద్యోగాన్ని నిలబెట్టుకున్నందుకు అతడు చాలా సంతోషంగా ఉన్నాడు.
పిన్స్‍నేజ్‍ని (హాండిల్స్ లేని కళ్ళజోడుని) ముక్కు మీద ఒత్తిపెట్టుకుని గది చుట్టూ చూస్తూ అడిగాడు బంట్రోతు: ‘అయ్యా, సభ్యులందరూ వచ్చారా?’
‘అందరూ ఉన్నారనుకుంటా’ అన్నాడు ఉల్లాసంగా ఉన్న వ్యాపారి.
‘సరే, చూద్దాం మరి!’ అంటూ తన జేబులోంచి ఒక లిస్టు బయటకు తీసి, కొన్నిసార్లు తన పిన్స్‍నేజ్‍లోపల్నించి, కొన్నిసార్లు దాని పైనించి చూస్తూ ఒక్కొక్క సభ్యుడి పేరు పిలవడం మొదలుపెట్టాడు.
‘కౌన్సిలర్ ఆఫ్ స్టేట్ (ఇలాంటి హోదాలు రష్యాలో సర్వసాధారణం. వీటికి పెద్దగా ప్రాముఖ్యత లేదు) జె.ఎం. నికిఫోరోఫ్!’
‘నేనే…’ అన్నాడు కోర్టు ప్రక్రియలు బాగా తెలిసినట్టు కనిపిస్తున్న ఆ గౌరవనీయుడైన పెద్దమనిషి.
‘రిటైర్డ్ కల్నల్, ఇవాన్ సెమియోనోవిచ్ ఇవానోఫ్!’
‘ఇక్కడున్నాను!’ అన్నాడు రిటైర్డ్ ఆఫీసర్ యూనిఫాం వేసిన సన్నటి వ్యక్తి.
‘సెకండ్ గిల్డ్ వ్యాపారవేత్త పీటర్ బక్లాషెఫ్!’
‘ఇక్కడే సిద్ధంగా ఉన్నా!’ అన్నాడు విశాలమైన చిరునవ్వుతో, ఉల్లాస వ్యాపారి.
‘లెఫ్టినెంట్ ఆఫ్ గార్డ్స్, ప్రిన్స్ దిమిత్రి నెఖ్లుడోవ్!’
‘అది నేనే…’ జవాబిచ్చాడు నెఖ్లుడోవ్.
పిన్స్‍నేజ్ మీదుగా నెఖ్లుడోవ్‍ని సౌమ్యంగా చూస్తూ వినయంగా నమస్కరించాడు బంట్రోతు. మిగతావాళ్ళ కంటే ఇతను ప్రత్యేకం అనిపించాలని అతని ఉద్దేశ్యం.
‘కెప్టెన్ యూరీ దిమిత్రివిచ్ దాంచెంకో, వ్యాపారి గ్రిగోరీ యూఫిమిచ్ కులెషొఫ్…’ అంటూ మిగతావాళ్ళ పేర్లన్నీ పిలిచాడు. ఇద్దరు తప్ప అందరూ హాజరయ్యారు.
‘శ్రీయుతులందరూ దయచేసి కోర్ట్‌లోకి రండి’ అన్నాడు బంట్రోతు, తలుపు వైపు చూపిస్తున్నట్టు తన చేతిని సాదరంగా ఊపుతూ.
అందరూ తలుపు వైపు కదిలారు. ఒకరినొకరు గౌరవంగా ‘మీరు ముందంటే, మీరే ముందు’ అన్నట్టుగా ఆగి, బయటకు నడిచి, కారిడార్ గుండా వెళ్ళి కోర్ట్ లోపలికి ప్రవేశించారు.
కోర్టు ఒక పెద్ద పొడవైన గది. ఆ గదికి ఒక చివరన మూడు మెట్లున్న న్యాయపీఠం మీద ముదురాకుపచ్చటి అంచుల ఆకుపచ్చగుడ్డ కప్పబడిన ఒక టేబుల్ వుంది. ఆ టేబుల్ దగ్గర ‘ఓక్’ దుంగలతో చెక్కిన మూడు ఎత్తైన కుర్చీలు ఉన్నాయి. వాటి వెనక గోడమీద చక్రవర్తి వేషభూషలతో- పతకాలు ధరించి, ఒక కాలు ముందుకు చాపి, కత్తి చేతపట్టుకున్న ఒక నిలువెత్తు పెయింటింగ్ వేలాడుతూ వుంది. కుడివైపు మూలనున్న పెట్టెలో ముళ్ళకిరీటం ధరించిన క్రీస్తు విగ్రహం వేలాడుతోంది. దానికింద ఒక ‘ప్రసంగ వేదిక’ వుంది. అదే వైపున ప్రాసిక్యూటర్ డెస్క్ వుంది. దానికెదురుగా ఎడమవైపున సెక్రటరీ టేబుల్ వుంది. దాని ముందు, ప్రజలు కూర్చునే చోట ఒక ‘ఓక్’ దుంగని అడ్డుగా పెట్టారు. దాని వెనకున్న నిందితుల బెంచీ ఖాళీగా వుంది. వీటితో పాటు న్యాయపీఠం కుడివైపున జ్యూరీ సభ్యుల కోసం ఎత్తైన యాష్‌వుడ్ కుర్చీలున్నాయి. పీఠం కిందిభాగంలో లాయర్ల కోసం కొన్ని టేబుళ్ళున్నాయి. ఇవన్నీ కోర్టు ముందుభాగంలో ఉన్నాయి. ముందుభాగాన్ని వెనుకభాగాన్ని వేరు చేస్తూ ఒక ఇనుప గ్రిల్ గేట్ వుంది.
వెనుక వైపంతా మెట్లుమెట్లుగా అమర్చిన కుర్చీలతో నిండిపోయింది. ముందువైపు కుర్చీలపై నలుగురు మహిళలు (పనిమనిషులో, ఫ్యాక్టరీ కార్మికులో కావచ్చు), ఇద్దరు మగకూలీలు కూర్చుని ఉన్నారు. ఆ గది వైభవం వాళ్ళల్లో భయభక్తులని కలిగించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళు గుసగుసగా తప్ప గట్టిగా మాట్లాడే సాహసం కూడా చేయలేకపోతున్నారు.
జ్యూరీ సభ్యులు లోపలికి వచ్చిన కొద్దిసేపటికి, కోర్టు బంట్రోతు కోడినడకతో లోపలికి ప్రవేశించాడు. న్యాయపీఠం ముందువైపుకి వచ్చి, కాస్త భయపెట్టే తీరులోనే ‘కోర్టు మొదలవబోతుంది!’ అని బిగ్గరగా అరిచాడు. అందరూ లేచి నిలబడుతుండగానే కోర్టు సభ్యులు న్యాయపీఠం పైకి నడిచారు.
ముందుగా- దువ్విన మీసాలతో, కండలు తిరిగిన దేహంతో కోర్టు అధ్యక్షుడు ప్రవేశించాడు. ఎప్పుడూ విచారంగా కనిపించే కోర్టు సభ్యుడు, ఇప్పుడు మరింత విషాదవదనంతో అధ్యక్షుని వెనకాలే వచ్చాడు. కొద్దిసేపటి క్రితమే అతని బావమరిది అతణ్ణి కలిసాడు. తాను వాళ్ళ అక్క పిలిస్తే ఇంటికి వెళ్ళొచ్చానని, అక్క అతనితో ఈరోజు రాత్రి మా ఇంట్లో భోజనం లేదన్నదని చెప్పాడు.
‘అయితే ఈ రోజు మనకి హోటల్ భోజనం తప్పదనుకుంటా!’ అన్నాడు బావమరిది నవ్వుతూ.
‘ఇదేం నువ్వుకునే విషయం కాదు’ అన్నాడు సభ్యుడు. అసలే మాడినట్టు ఉండే అతని మొహం, కోపంతో మరింత మాడిపోయింది.
తరువాత ఆఖరున ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే కోర్టు మూడవ సభ్యుడు మ్యాథ్యూ నికిటిచ్ వచ్చాడు. అతనికి గడ్డం వుంది. గుండ్రంగా దయతో మెరుస్తున్న పెద్ద కళ్ళున్నాయి. అతడు కడుపుకి సంబంధించిన విసర్జన వ్యాధితో (catarrh) బాధపడుతున్నాడు. వ్యక్తిగత డాక్టర్ సలహాతో ఒక కొత్త ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. అందుకే మామూలు సమయం కంటే ఎక్కువసేపు ఇంట్లో ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం కోర్టులో న్యాయపీఠంపైకి ఎక్కుతున్న అతని మొహంలో ఒక తాత్విక ఆలోచనాముద్ర కనిపిస్తోంది. తనకు తానే ప్రశ్నలు వేసుకుని వాటికి వింత పద్ధతుల్లో జవాబులు ఊహించడం అతనికి అలవాటు. ఇప్పుడతను- ‘ఈ కొత్త ట్రీట్మెంట్ నాకు మంచిదేనా?’ అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. దానికి జవాబుగా- ‘ఈ తలుపు నుంచి నా కుర్చీదాకా వేసే అడుగుల సంఖ్య 3తో భాగింపబడితే కొత్త ట్రీట్మెంట్ నాకు పనిచేస్తుంది’ అనుకున్నాడు. కాని అతను మొత్తం 26 అడుగులు మాత్రమే వేయగలిగాడు. చివర్లో కుర్చీ దగ్గరికి రాగానే 27వ అడుగు కూడా వేసేలా సర్దుబాటు చేసుకున్నాడు.
కాలర్‍ల మీద బంగారు ఎంబ్రాయిడరీలున్న యూనిఫారాల్లో అధ్యక్షుడు, కోర్టు సభ్యులు చాలా ప్రతిష్టాత్మకంగా కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా తమ ఘనతని తాము గమనించినట్టు అనిపించింది. తమ గొప్పతనానికి తామే లోనయ్యామన్న భావనతో గబగబా నడుస్తూ ఆకుపచ్చని వస్త్రం కప్పిన టేబుల్ వెనకున్న ఎత్తయిన కుర్చీలలో కూర్చుండిపోయారు.
ఆ టేబుల్ పైన గద్దబొమ్మ ఉన్న ఒక త్రికోణాకార వస్తువు, హోటళ్ళలో మిఠాయిలు ఉంచే జాడీల్లాంటి రెండు గాజు జార్ లు, ఒక ఇంక్ స్టాండ్, కొన్ని పెన్నులు, శుభ్రంగా ఉన్న కాగితాలు, కొత్తగా చెక్కిన రకరకాల పెన్సిళ్ళు చక్కగా అమర్చబడి ఉన్నాయి.
కోర్టు సభ్యులతోపాటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా లోపలికి ప్రవేశించాడు. ఒక చేతిలో ఫైలు పట్టుకుని ఇంకోచేతిని ఊపుకుంటూ వేగంగా లోపలికెళ్ళి, కిటికీ దగ్గరున్న తన సీట్లో కూర్చుని, విచారణ మొదలయ్యే సరికి సిద్దంగా ఉండాలనే ఆతృతతో, ఒక్కక్షణం కూడా వృథా చేయకుండా వెంటనే కేస్ పేపర్లు పరిశీలించడంలో మునిగిపోయాడు. కొంతకాలం కిందటే అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు. దీనికి ముందు కేవలం నాలుగు కేసులు మాత్రమే వాదించాడు. అతనినొక లక్ష్యసాధకుడు. పదవిలో పైపైకి ఎదగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కాబట్టి తాను పట్టుకున్న ఏ కేసులోనైనా నిందితులకు తప్పనిసరిగా శిక్షపడేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ విషప్రయోగం కేసులో కీలకమైన అంశాలు అతనికి తెలుసు కాబట్టి అప్పటికే ఒక వ్యూహం సిద్దం చేసుకున్నాడు. అవసరమైన కొన్ని పాయింట్స్‌ని కాపీ చేసుకోవడమే ఇక మిగిలింది.
న్యాయపీఠానికి ఎదురుగా కూర్చొని, తనకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుని, సెన్సారైన ఒక వ్యాసాన్ని మళ్ళీ చదువుతున్నాడు సెక్రటరీ. అతను ఆ వ్యాసాన్ని నిన్ననే ప్రత్యేకమార్గంలో సంపాదించి చదివాడు. ఆ వ్యాసం మీద అభిప్రాయాలను వ్యక్తం చేసిన గడ్డం వున్న జ్యూరీ సభ్యుడితో చర్చించి, తన అభిప్రాయాలను కూడా అతనితో పంచుకోవాలని సెక్రటరీకి చాలా ఆతృతగా వుంది. ఆ చర్చకు ముందే ఇంకోసారి ఆ వ్యాసాన్ని పరిశీలించాలనుకున్నాడు.
అధ్యాయం- 8
జ్యూరీ ప్రమాణం స్వీకారం
కొన్ని పత్రాలను పరిశీలించాడు ప్రెసిడెంట్. కొన్ని ప్రశ్నలు బంట్రోతునీ, సెక్రెటరీని అడిగాడు. తర్వాత ఖైదీలను లోపలికి తీసుకురమ్మని ఆదేశించాడు.
ఇనుప గ్రిల్ వెనకున్న తలుపు వెంటనే తెరవబడింది. తలపై టోపీలున్న ఇద్దరు పోలీస్‌లు, ‘ఒర’లోంచి బయటకు తీసిన కత్తులని చేతుల్లో పట్టుకుని లోపలికి వచ్చారు. వాళ్ళని అనుసరిస్తూ ముగ్గురు ఖైదీలు- ఎర్రజుట్టు మచ్చలతో ఉన్న ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు లోపలికి వచ్చారు. ఆ పురుషుడు వేసుకున్న జైలు కోటు చాలా పొడుగ్గా, వదులుగా వుంది. పొడవైన కోటుచేతులు జారిపోకుండా అతను రెండుచేతులూ కట్టుకుని, బొటనవేళ్ళతో దండల దగ్గర గట్టిగా పట్టుకుని నిల్చున్నాడు. న్యాయమూర్తుల వైపు చూడకుండా పీఠంవైపు నిశ్చలంగా చూసి, దానికి మరోవైపు నడిచి, నిందితులు కూర్చునే బెంచీ అంచున, మిగితావాళ్ళు కూర్చోడానికి వీలుగా ఎక్కువ స్థలం విడిచిపెట్టి, చాలా జాగ్రత్తగా కూర్చున్నాడు. తన చూపును ప్రెసిడెంట్ మీద నిలిపి ఏదో గుసగుసలాడుతున్నట్టుగా చెంపలు నిమురుకుంటున్నాడు.
తర్వాత వచ్చిన మహిళ కూడా జైలు కోటు వేసుకుని వుంది. తలకు కూడా జైలు రుమాలే కట్టుకుంది. ఆమె మొహం పాలిపోయిన పసుపువర్ణంలో వుంది. కనుబొమ్మలు, కనురెప్పలు లేవు. కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి. మొహంలో ఒక ప్రశాంత నిశ్చలత్వం ఉన్నట్టు కనిపించింది. ఆమె కోటు దేనికో చిక్కుకుంటే, ఏమాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా దాన్ని విడదీసి కూర్చుంది.
మూడో ఖైదీ మస్లోవా.
ఆమె కనబడగానే కోర్టులో ఉన్న మగాళ్ళందరి కళ్ళు ఆమె వైపే తిరిగాయి.
తెల్లని మొహం, మిలమిలమెరిసే నల్లని కళ్ళు, జైలు దుస్తుల వెనక ఉప్పొంగుతున్న యవ్వన సంపద మీద వాళ్ళ చూపులు నిలిచిపోయాయి. ఎదురుగా ఉన్న పోలీసుని దాటి తన కుర్చీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే, ఆమె కూర్చునే వరకూ అతను తదేకంగా ఆమెనే చూస్తూ అలాగే నిలబడిపోయాడు. తర్వాత వెంటనే ఏదో తప్పు చేసినవాడిలా చటుక్కున తల తిప్పుకుని, తనను తాను విదిలించుకుని ఎదురుగా ఉన్న కిటికీ వైపు దృష్టి సారించాడు.
ఖైదీలిద్దరూ కూర్చునే వరకు ఆగి, చివరగా మస్లోవా కూడా తన సీట్లో కూర్చోగానే సెక్రెటరీ వైపు తిరిగాడు ప్రెసిడెంట్.
తరువాత ఎప్పటిలాగే న్యాయప్రక్రియ మొదలైంది. జ్యూరీ సభ్యుల లెక్కింపు, హాజరుకాని సభ్యులపై వ్యాఖ్యలు, వారిపై విధించాల్సిన జరిమానాల నిర్ణయం, మినహాయింపు కోరిన వారిపై తీర్మానాలు, రిజర్వు జ్యూరీ సభ్యుల నియామకం లాంటి న్యాయప్రక్రియలు పూర్తయ్యాయి.
కొన్ని కాగితపు చీటీలను మడిచి, వాటిని ఒక గాజు జాడిలో వేసిన తరువాత, అధ్యక్షుడు తన యూనిఫార్మ్ చొక్కాకున్న బంగారు అల్లికలు గల ‘కఫ్స్’ కొంచం పైకి మడిచి ఒక్కో చీటీని తీసి చదవడం ప్రారంభించాడు. ఆ ప్రక్రియలో నెఖ్లుడోవ్ కూడా జ్యూరీ సభ్యుల్లో ఒకడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత అధ్యక్షుడు తన చొక్కా ‘కఫ్స్’ మళ్ళీ కిందకి దించి జ్యూరీ సభ్యులను ప్రమాణస్వీకారం చేయించమని పాస్టర్‍ని కోరాడు.
ఉబ్బినట్టున్న ఎర్రని మొహంతో, గోధుమరంగు గౌన్ మీద బంగారు శిలువతో పాటు చిన్న గౌరవపతకాన్ని ధరించిన ముసలి పాస్టర్, కట్టెల్లా బిగుసుకున్నట్టున్న కాళ్ళను అతి కష్టం మీద ఈడ్చుకుంటూ, క్రీస్తు విగ్రహం కిందున్న ‘ప్రసంగ వేదిక’ వైపు వచ్చాడు.
జ్యూరీ సభ్యులు కూడా లేచి నిలబడి ఆ వేదికవైపు గుంపుగా నడిచారు.
‘దయచేసి అందరూ పైకి రండి’ అన్నాడు పాస్టర్, బొద్దుగా ఉన్న చేత్తో ఛాతీ మీదున్న శిలువను సర్దుకుంటూ.
జ్యూరీ సభ్యులందరూ అక్కడికి వచ్చేవరకు ఆగి, వాళ్ళందరూ వేదిక మెట్లెక్కాక, నూనె జిడ్డున్న ఉత్తరీయం (stole) రంధ్రంలో ఓ పక్కనుంచి నెరిసిన తన బట్టతలను దూర్చి, తన పలుచని జుట్టును మళ్ళీ సరిచేసుకుని జ్యూరీ సభ్యుల వైపు తిరిగాడు.
ముడుతలు పడిన లావు చేతిని ఎత్తి, బొటనవేలుతో మొదటి రెండువేళ్ళను కలిపి, చిటికెడు పదార్థమేదో తీసుకుంటున్నట్లుగా చూపిస్తూ, వణుకుతున్న ముసలి స్వరంతో ‘ఇప్పుడు, మీమీ కుడిచేతులను ఇలా పైకెత్తి, మీ వేళ్ళను ఇలా కలిపి ఉంచండి.’ అన్నాడు పాస్టర్.
సభ్యులందరూ అతను చెప్పినట్టే చేసారు.
‘ఇప్పుడు అందరూ నాతో పాటే చెప్పండి- సర్వశక్తివంతుడైన దేవుని సాక్షిగా, ఆయన పరిశుద్ధ సువార్తల సాక్షిగా, ప్రాణప్రదాయి అయిన మన ప్రభువు శిలువ సాక్షిగా ప్రమాణంచేస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ పనిలో నేను…’
ఒక్కొక్క వాక్యం మధ్యలో విరామం తీసుకుంటూ ప్రమాణపాఠం వల్లె వేయిస్తున్నాడు పాస్టర్.
‘నీ చేయి క్రిందికి దించొద్దు, ఇలా పట్టుకో’ అని చేతిని కిందికి వదిలేసిన ఓ యువకుడికి ఎలా పట్టుకోవాలో సూచించాడు.
‘ఈ పనిలో నేను..’ అంటూ తిరిగి ప్రమాణ వాక్యాన్ని కొనసాగించాడు.
బుర్రమీసాలున్న గౌరవనీయ వ్యక్తి, కల్నల్, వ్యాపారి ఇంకా చాలామంది పాస్టర్ చెప్పినట్లే చేతులను బాగా పైకెత్తి, వేళ్ళను సరిగ్గా కలిపి పట్టుకున్నారు. వాళ్ళు ఆ పని చాలా ఇష్టంగా చేసినట్లు కనిపించారు.
మిగతావాళ్ళూ అయిష్టంగా, నిర్లక్ష్యంగా ఆ పని చేసారు. కొంతమంది బిగ్గరగా అరుస్తున్నట్టుగా ప్రమాణాన్ని పలికారు. కొందరి స్వరం ‘ఏదోటి పలకాలి కాబట్టి పలుకుతున్నాము’ అన్నట్టుగా వుంది. మరికొందరు గుసగుసలాడినట్టు చాలా నింపాదిగా ఉచ్ఛరించి, మళ్ళీ వెనకబడిపోతామనే భయంతో గబగబా పలుకుతూ పాస్టర్‍ని అందుకునే ప్రయత్నం చేసారు.
కొంతమంది తమ వేళ్ళను బాగా బిగించి పట్టుకున్నారు. వేళ్ళమధ్యలో పట్టుకున్న ఆ చిటికెడు కనబడని పదార్థాన్ని ఎక్కడ కిందపడేస్తామో అని భయపడుతున్నట్టుగా ఉన్నారు వాళ్ళు. మిగతావాళ్ళు వేళ్ళను విడదీస్తూ, మళ్ళీ ముడుస్తూ ఉండిపోయారు.
ఆ ముసలి పాస్టర్‍ని మినహాయిస్తే, అందరికీ కొంచెం అసహజంగా అనిపించింది అది. కాని పాస్టర్ మాత్రం ఎంతో ఉపయోగకరమైన, అతి ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నానన్న నమ్మకంతో ఉన్నాడు.
ప్రమాణస్వీకారం పూర్తయ్యాక అధ్యక్షుడు జ్యూరీ సభ్యులతో వాళ్ళ నాయకుడిని (ఫోర్‌మెన్) ఎంచుకోమని కోరాడు. దాంతో సభ్యులందరూ తలుపు వైపు గుంపుగా కదిలి చర్చాగదిలోకి వెళ్ళారు. అక్కడ అందరూ ఒకేసారి సిగరెట్లు తాగడం మొదలుపెట్టారు. ఆ గౌరవనీయుడైన వ్యక్తినే నాయకుడిగా ఎవరో నామినేట్ చేసారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తర్వాత అందరూ సిగరెట్లు ఆర్పేసి, వాటిని పారేసి, తిరిగి కోర్టులోకి వచ్చారు. గౌరవనీయుడు తానే నాయకుడిగా ఎంపికైనట్టు అధ్యక్షుడికి తెలియజేసాడు. అందరూ మళ్ళీ ఎత్తైన చెక్కకుర్చీల మీద కూర్చున్నారు.
అన్ని ప్రక్రియలు తొందరగా సవ్యంగా గంభీరంగా ముగిశాయి. ఆ ఖచ్చితత్వం, క్రమబద్ధత, గంభీరత- ఇవన్నీ ఈ ప్రక్రియలో పాల్గొన్నవారికి బాగా నచ్చినట్టు స్పష్టంగా కనిబడింది. ‘ఒక గొప్ప అమూల్యమైన, బాధ్యతాయుతమైన ప్రజావిధిని నిర్వర్తిస్తున్నా’మనే వాళ్ళ భావాన్ని ఈ ప్రక్రియ మరింత బలపరిచింది.
నెఖ్లుడోవ్‌కి కూడా అదే భావన కలిగింది.
జ్యూరీ సభ్యులు కూర్చోగానే అధ్యక్షుడు వారికి తమ హక్కులు, బాధ్యతలు, కర్తవ్యాల గురించి ఓ ప్రసంగం ఇచ్చాడు. అతను మాట్లాడుతూనే తన భంగిమలను మార్చుతున్నాడు. ఒకసారి కుడిచేతిమీదకి మరోసారి ఎడమచేతి మీదకి వాలుతూ, అప్పుడప్పుడు కుర్చీ వెనుక భాగానికి కొన్నిసార్లు కుర్చీచేతులకి ఆనుకుంటూ, ఒకసారి కాగితాలను సరిచేస్తూ మరోసారి తన పెన్సిల్‍ని పేపర్ కత్తిని తిప్పటం లాంటి చర్యల్లో నిమగ్నమయ్యాడు.
అతని మాటల ప్రకారం జ్యూరీలకు అధ్యక్షుడి ద్వారా ఖైదీలను ప్రశ్నించే హక్కు ఉంది, పెన్సిలు పేపరు వాడుకునే హక్కు ఉంది. సాక్ష్యంగా దఖలుపరిచిన వస్తువులను పరిశీలించే హక్కు వుంది. తప్పుడు తీర్పు కాకుండా న్యాయమైన తీర్పు చెప్పడం జ్యూరీల ముఖ్య కర్తవ్యం.
ఇక జ్యూరీల బాధ్యతలేంటంటే- విచారణ గోప్యతని ఉల్లంఘించకుండా ఉండటం, బయటి వాళ్ళతో సమాచార సంబంధాలు పెట్టుకోకుండా ఉండటం. అలా చేస్తే సభ్యులు శిక్షార్హులవుతారు.
అధ్యక్షుడి మాటలను అందరూ గౌరవశ్రద్ధలతో విన్నారు. వ్యాపారి మాత్రం, బ్రాందీ వాసనను చుట్టూ వెదజల్లుకుంటూ, వస్తున్న వెక్కిళ్ళను ఆపుకుంటూ, ప్రతి వాక్యాన్ని అంగీకరిస్తున్నట్టుగా సంతృప్తిగా తల ఊపుతూ ఉన్నాడు.
అధ్యాయం– 9
న్యాయ విచారణ – ఖైదీలను ప్రశ్నించడం
అధ్యక్షుడు తన ప్రసంగం ముగించిన తరువాత మగఖైదీ వైపు తిరిగాడు.
‘సిమియన్ కార్టింకిన్, లేచి నిలబడండి.’
సిమియన్ గబుక్కున లేచాడు. అతని పెదవులు ఆందోళనతో కదులుతూ వినబడనిదేదో గొణుగుతూనే ఉన్నాయి.
‘మీ పేరు?’
‘సిమియన్ పెట్రోవ్ కార్టింకిన్.’
వణుకుతున్న స్వరంతో గబగబా చెప్పాడు. బహుశా అతను సమాధానం ముందే సిద్ధం చేసుకున్నట్లున్నాడు.
‘ఏ వర్గానికి చెందినవారు?’
‘రైతు.’
‘ఏ ప్రభుత్వం, ఏ జిల్లా, ఏ గ్రామ పంచాయితీ?’
‘టౌలా ప్రభుత్వం, క్రాపివిన్స్కియా జిల్లా, కౌపియానోవ్స్కీ పంచాయితీ, బోర్కి గ్రామం.’
‘వయసు?’
‘ముప్పై మూడు. 18xx సంవత్సరంలో పుట్టాను.’
‘మతం?’
‘రష్యన్ సాంప్రదాయ మతం.’
‘పెళ్ళైందా?’
‘అయ్యో, అవలేదు సార్.’
‘వృత్తి?’
‘హోటల్ మారిటానియాలో పనిచేసేవాణ్ణి.’
‘ఇంతకు ముందెప్పుడైనా విచారణ ఎదుర్కొన్నారా?’
‘ఇంతకు ముందెప్పుడూ నన్ను విచారించలేదు. ఎందుకంటే మేమేలా బతికేవాళ్ళమో మీరు గమనిస్తే-’
‘-అంటే మిమ్మల్ని ఎప్పుడూ విచారించలేదంటారు, అంతే కదా?’
‘దేవుడి దయవల్ల ఎప్పుడూ విచారించలేదు!’
‘అభియోగపత్రం కాపీ తీసుకున్నారా?’
‘తీసుకున్నాను.’
‘కూర్చోండి.’ అని తర్వాత ఖైదీ వైపు తలతిప్పి ‘యూఫేమియా ఇవానోవ్నా బోచ్‌కోవా!’ అన్నాడు అధ్యక్షుడు.
కానీ బోచ్‌కోవా ముందు కార్టింకిన్ ఇంకా అలాగే నిలబడున్నాడు.
‘కార్టింకిన్, ఇక మీరు కూర్చోండి!’ అధ్యక్షుడు మరోసారి చెప్పాడు.
అయినా కార్టింకిన్ ఇంకా నిలబడే ఉన్నాడు.
‘కార్టింకిన్ మిమ్మల్నే… కూర్చోండి!’ అధ్యక్షుడు కాస్త గట్టిగా ఆదేశించాడు ఈసారి.
చివరికి ఒక బంట్రోతు, విస్తారంగా తెరిచిన కళ్ళతో తల ఒకవైపుకు వంచి పరుగెత్తుకుంటూ వచ్చి, జాలిపడుతున్న స్వరంతో గుసగుసగా ‘కూర్చో… కూర్చో!’ అన్నాడు.
కార్టింకిన్ ఎంత గబుక్కున పైకి లేచాడో అంత చటుక్కున కూర్చుని తన జైలు కోటును దగ్గరగా చుట్టుకుని మళ్ళీ మౌనంగా పెదవులు కదుపుతూ ఉన్నాడు.
‘మీ పేరు?’ అధ్యక్షుడు నిస్పృహగా నిట్టూర్చి, బోచ్‌కోవాని ప్రశ్నించాడు.
ఒకేరకమైన ప్రశ్నలను పదేపదే అడగాల్సిరావడం అతనికి విసుగు కలిగించింది. ఖైదీ వైపు కూడా చూడకుండా తన ముందున్న కాగితం మీద దృష్టిపెట్టి అడిగాడు. తన పని త్వరగా పూర్తి చేసుకోవాలనే తహతహతో అధ్యక్షుడు ఒకేసారి రెండు పనులు చేస్తున్నాడు.
బోచ్‌కోవా వయస్సు నలభై మూడు సంవత్సరాలు. ఆమె కలోమ్నా పట్టణం నుండి వచ్చింది. ఆమె కూడా హోటల్ మారిటానియాలో పనిచేసింది.
‘నేనెప్పుడూ విచారణ ఎదుర్కోలేదు, అభియోగపత్రం కాపీ అందుకున్నాను.’
ఆమె ధైర్యంగా సమాధానం చెప్పింది. ప్రతి సమాధానంలో కూడా ఆమె స్వరంలో ‘ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను, అర్థంపర్థం లేని మాటలను నేను సహించను’ అని చెబుతున్నట్టుగా వుంది. కూర్చోమని చెప్పేవరకు కూడా ఆగలేదామె. చివరి ప్రశ్నకు సమాధానం చెప్పి వెంటనే కూర్చుండిపోయింది.
హఠాత్తుగా మూడో ఖైదీ వైపుకు తిరిగి అడిగాడు అధ్యక్షుడు.
‘మీ పేరేంటి?’
మస్లోవా ఇంకా కూర్చునే వుంది. అది చూసి చూసి మృదువుగా, శాంతంగా ‘మీరు లేచి నిలబడాలి.’ అన్నాడు అధ్యక్షుడు.
మస్లోవా లేచి నిలబడి ఛాతీ విరుచుకుని తన చిన్ని నల్లనికళ్ళతో నవ్వుతూ, మొహంలో ఒక ప్రత్యేకమైన సంసిద్ధతతో అధ్యక్షుడి వైపు నిశ్చలంగా చూసింది.
‘పేరేంటి?’
‘ల్యుబోవ్,’
నెఖ్లుడోవ్ అప్పటికే తన పిన్స్‌నేజ్ పెట్టుకొని, ఖైదీలను ప్రశ్నించడం గమనిస్తున్నాడు. మస్లోవా మీద నుంచి తన చూపును తిప్పకుండానే ‘లేదు… ఇది అసాధ్యం!’ అనుకున్నాడు.
ఆమె పేరు విన్న వెంటనే తనలో తానే ‘ల్యూబోవ్! ఇదెలా సాధ్యం?’ అనుకున్నాడు.
అధ్యక్షుడు తన ప్రశ్నలను కొనసాగించబోతుంటే, కళ్ళజోడున్న సభ్యుడు కోపంగా ఏదో గుసగుసలాడుతూ అతనికి అడ్డుపడ్డాడు. అధ్యక్షుడు తలూపి, మళ్ళీ ఖైదీ వైపు తిరిగాడు.
‘అదేంటీ, రికార్డుల్లో ఉన్న మీ పేరు ‘ల్యూబోవ్’ కాదు గదా?’
ఖైదీ మస్లోవా మౌనంగా నిలబడి వుంది.
‘అసలు పేరు చెప్పండి’ అన్నాడు అధ్యక్షుడు.
‘బాప్తీస్మంలో పెట్టిన పేరు చెప్పు?’- ఇందాక కోపంతో ఉన్న సభ్యుడు ప్రశ్నించాడు.
‘గతంలో నన్ను కాటెరినా అని పిలిచేవాళ్ళు.’
‘లేదు, ఇది కూడా అసాధ్యం.’ మళ్ళీ అనుకున్నాడు నెఖ్లుడోవ్.
కానీ ఇప్పుడతనికి స్పష్టంగా అర్థమైంది, ఈమె ఆమే అని. సగం పనిమనిషి, సగం విద్యార్థిగా తన అత్తల దగ్గర పెరిగిన అదే అమ్మాయి అని! అదే కటూషా అని!.
ఎవరినైతే ఒకప్పుడు తాను ప్రేమించాడో- నిజంగా ప్రేమించాడో, ఎవరినైతే తాను మోసం చేసి వదిలేసాడో, ఆ తర్వాతెప్పుడూ ఆమెను గుర్తుచేసుకోలేదో- ఆ కటూషా. గుర్తుచేసుకునుంటే ఆ జ్ఞాపకం చాలా బాధాకరంగా ఉండేది. అది అతణ్ణి చాలా స్పష్టంగా నేరస్థుడిగా నిలబెట్టేది. తన నైతికత గురించి ఎంతో గర్వపడే మనిషి ఈ స్త్రీతో ఎంత అసహ్యంగా, ఎంత అగౌరవంగా ప్రవర్తించాడో నిరూపించేది.
అవును…! ఈమె ఆమెనే. వేలాది మొహాల మధ్యలో కూడా వేరుగా కనిపించే ఆ విచిత్రమైన మొహం, వర్ణించలేని వ్యక్తిత్వం కలిగిన ఆమె మొహం- ఇప్పుడు అతనికి స్పష్టంగా కనిపించింది. ఎంతో ప్రత్యేకమైన, పూర్తిగా ఆమె సొంతమైన, మరెక్కడా కనిపించని మొహం. అనారోగ్యంతో పాలిపోయి కొంచెం ఉబ్బిన ఆకారం ఉన్నప్పటికీ- ఆ మాధుర్యభరితమైన ప్రత్యేక వ్యక్తిత్వం ఇంకా అక్కడే- ఆ పెదవుల్లో, స్వల్పంగా ‘మెల్ల’ ఉన్న ఆ కళ్ళల్లో, ఆ స్వరంలో, ముఖ్యంగా అమాయకమైన ఆ చిరునవ్వులో, ఎప్పుడూ సంసిద్ధమే అన్నట్టుండే ఆ సౌష్టవంలో- స్పష్టంగా వుంది.
‘మీ పేరు అలా చెప్పాల్సింది.’ ప్రెసిడెంట్ మళ్ళీ మృదువైన స్వరంతో అన్నాడు.
‘తండ్రి పేరు చెప్పండి?’
‘నేను చట్టబద్ధమైన సంతానాన్ని కాదు.’
‘సరే. అప్పుడు మీ దత్తతండ్రి (గాడ్‍ఫాదర్) పేరుతో పిలుస్తారు కదా?’
‘అవును. మిఖైలోవ్‍నా.’
‘ఇంతకీ ఈమె చేసిన నేరం ఏంటి?’ మళ్ళీ మనసులోనే అనుకున్నాడు నెఖ్లుడోవ్. అతను ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నాడు.
‘మీ కుటుంబం పేరేంటి? అంటే- మీ ఇంటిపేరు?’ ప్రెసిడెంట్ అడిగాడు.
‘మా తల్లిగారి ఇంటిపేరు మీద నన్ను మస్లోవా అని పిలిచేవాళ్ళు.’
‘ఏ వర్గం?’
‘మెషాంకా.’ (టౌన్‌లో అట్టడుగు సామాజిక వర్గం)
‘సంప్రదాయ మతమేనా?’
‘అవును. సంప్రదాయ మతమే.’
‘వృత్తి? మీ వృత్తేంటి?’
మస్లోవా మౌనంగా వుంది.
‘మీ ఉద్యోగం ఏంటి?’
‘అది మీకు తెలుసు’ అందామె మందహాసం చేస్తూ.
అలా అన్న తర్వాత కంగారుగా గది చుట్టూ ఒకసారి చూసి మళ్ళీ అధ్యక్షుడిపైన చూపు నిలిపింది.
ఆమె మొహంలోని హావభావాల్లో ఏదో అసాధారణత వుంది. ఆమె సమాధానాల్లోని అర్థాల్లో, ఆ చిరునవ్వులో, గది చుట్టూ చూసిన దొంగచూపులో- భీతికరమైనదీ, దయనీయమైనదీ ఏదో వుంది. దానితో అధ్యక్షుడు కూడా సిగ్గుపడ్డాడు. కొద్ది నిమిషాల పాటు కోర్టులో నిశ్శబ్దం అలుముకుంది. జనం లోంచి ఎవరో నవ్వడంతో ఆ నిశ్శబ్దం చెదిరింది. తరువాత ఎవరో ‘ష్’ అన్నారు. అధ్యక్షుడు తలెత్తి చూసి, తన ప్రక్రియను కొనసాగించాడు.
‘ఇంతకుముందెప్పుడైనా విచారణ ఎదుర్కొన్నారా?’
‘ఎప్పుడూ ఎదుర్కోలేదు.’ మృదువుగా బదులిచ్చి నిట్టూర్చింది మస్లోవా.
‘అభియోగపత్రం కాపీ అందిందా?’
‘అందింది.’
‘కూర్చోండి.’
ఖైదీ మస్లోవా వెనక్కి వంగి, ఒక గొప్పింటి స్త్రీ పట్టుకున్నట్టుగా తన గౌను అంచును పట్టుకుని కూర్చుంది. తన తెల్లటి చిన్న చేతులని ముడుచుకుని, జైలు కోటుని గుప్పిళ్ళతో పట్టుకుని, కళ్ళు అధ్యక్షుడిపై నిలిపింది. ఆమె మొహం మళ్ళీ ప్రశాంతంగా మారింది.
సాక్షులను లోపలికి పిలిచారు. కొంతమందిని వెనక్కి పంపించారు. నిపుణుడిగా వ్యవహరించేందుకు ఒక డాక్టర్‍ని కోర్టులోకి పిలిపించారు.
అప్పుడు సెక్రెటరీ లేచి అభియోగ పత్రాన్ని ఇంగ్లీష్ లో చదవడం ప్రారంభించాడు. ‘I’ని ‘R’ని అతను ఒకేలా పలికినప్పటికీ, బిగ్గరగా స్పష్టంగా చదివాడు. గబగబా చదవడం వల్ల పదాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి నిరాటంక ప్రవాహంలా వినిపించి అతని ప్రసంగం విసుగు పుట్టించింది.
న్యాయమూర్తులు ఒకసారి తమ కుర్చీల కుడివైపుకి మరోసారి ఎడమవైపుకి, అప్పుడప్పుడు టేబుల్ మీదకి తిరిగి మళ్ళీ కుర్చీలవీపులకి, వాలిపోతూ ఉన్నారు. కొంతమంది కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నారు. కొందరు ఒకరితో ఒకరు గుసగుసలాడుతూ లోగొంతుతో ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక పోలీసు చాలాసార్లు ఆవలింతను ఆపుకున్నాడు.
ఖైదీ సిమియన్ కార్టింకిన్ తన బుగ్గలను కదిలించడం ఒక్కక్షణం కూడా అపలేదు. బోచ్‌కోవా మాత్రం చాలా నిశ్చలంగా, నిఠారుగా కూర్చుని వుంది. అప్పుడప్పుడు తలకి కట్టుకున్న రుమాలు కింద గోక్కుంటూ వుంది.
మస్లోవా కదలకుండా కూర్చుని, అభియోగపత్రాన్ని చదువుతున్న సెక్రెటరీ వైపు చూస్తూ వుంది. మధ్యమధ్యలో ఆమె పేరు వచ్చినపడు ఉలిక్కిపడి, బహుశా సమాధానం చెప్పాలేమో అనుకుని లేవబోయి ఆగింది. సిగ్గుతో మొహం ఎర్రబడి దీర్ఘంగా నిట్టూర్చింది. కట్టుకున్న చేతుల స్థానం మార్చుకుని ఒకసారి చుట్టూ చూసింది. అభియోగపత్రం చదువుతున్న సెక్రెటరీ మీద మళ్ళీ చూపు నిలిపింది.
ముందు వరుసలోని ఎత్తయిన వీపుగల కుర్చీలో కూర్చుని, తన పిన్స్‌నేజ్ తీయకుండా మాస్లోవానే చూస్తూ ఉన్నాడు నెఖ్లుడోవ్.
ఆ సమయంలో అతని అంతరంగంలో ఒక భయంకరమైన సంక్లిష్ట సంఘర్షణ జరుగుతూ వుంది.
***
