1
ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ కి దగ్గరలో, గంగా నదికి దక్షిణ తీరప్రాంతంలోని ఒక చిన్న ఊరు. ఈ కథ ఆ ఊరు నుండే మొదలవుతుంది. ఊరికి ఉత్తరాన శివాలయం. శివలింగానికి ఎదురుగా ధ్యానముద్రలో పాలరాతి నందీశ్వరుడు. దక్షిణాన సీతారాముల మందిరం. వారి పాదాల చెంత సభక్తికంగా తలవంచి నమస్కరిస్తూ పవనపుత్ర హనుమంతుడు. తూర్పున కళకళలాడుతూ పచ్చని పంట పొలాలు. పడమరన మామిడి, జామ, నేరేడు తోటలు. ఉదయపు సూర్యకిరణాలు గంగా నదిలో స్నానం చేసి, పంటపొలాలకి వెచ్చదనం అందించి వాటి మీదుగా మెల్లమెల్లగా ఊర్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ కిరణాలు తమ వేడి నుండి తమనే కాపాడుకోవడానికా అన్నట్టు ఇంటి పైకప్పుల మీద, ముందు వాకిళ్ళల్లో మధ్యాహ్నం అంతా విశ్రాంతి తీసుకుంటాయి. సాయంకాలం అవుతూనే మెల్లగా తోటల్లోని చెట్ల పంట-పూతలతో దోబూచులాడుతూ పాలకోసం తల్లి దగ్గరకి పరుగులు తీసే లేగ దూడల వలె పడమరకి ప్రయాణిస్తున్న సూర్యుడి వెనక పరుగులు పెడుతూ ఉంటాయి. గంగానది ఒడిలో ఉండటం వల్ల వర్షాకాలం వచ్చిందంటే ఊర్లోకి మోకాలు లోతు నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటప్పుడు పంట కూడా సగం నీళ్ళల్లో మునిగిపోవడమే కాకుండా ఒక్కొక్కసారి ఎడతెరిపి లేకుండా కురిసే వానల వల్ల పంటలు జలసమాధి కూడా అయిపోతూ ఉంటాయి. వర్షాకాలం అనే కాదు, ఇంచుమించు అన్ని ఋతువులూ ఊరి జనాలకి అయితే సంతోషమో లేదా విషాదమో మిగులుస్తూ ఉంటాయి. చలికాలంలో చలి మంటలు వేసి, గొడ్డు-గోదాన్ని కూడా అక్కడే కట్టేస్తూ ఉంటారు. ఆ వెచ్చదనానికి పశువులు, ఉదయం నుండీ తిన్న గడ్డి నెమరు వేసుకుంటూ ఉంటే, పశువుల యజమాన్లు కబుర్లు నెమరు వేసుకుంటూ ఉంటారు. ఆ నిప్పు నెగళ్ళు కాస్తా చల్లారిపోయిన తర్వాత జనాలు మెల్లమెల్లగా తమ గుడిసెల్లోకి వెళ్ళి నిద్రా దేవత ఒడిలోకి జారుకుంటారు. వేసవికాలం మధ్యాహ్నాలు వేపచెట్టు నీడలో కూర్చుని, పండిన వేపకాయలు ఏరుకు తింటూ, విసినకర్రతో విసురుకుంటూ కాలం గడిపేస్తారు. అలాంటి సమయాల్లో అందరికీ ప్రభుత్వం వారి బోరింగులే దిక్కు. ప్రభుత్వం ఊరూరా ‘ఇండియా’ మార్కు హ్యాండ్ పంపులు వేయించిన దగ్గర నుండి ఊళ్ళో బావులు అన్నీ ఒక్కొక్కటిగా ఎండిపోయాయి. మెల్లమెల్లగా ఊరి జనాలు తమ ఇంట్లో చెత్త-చెదారాలు తీసుకొచ్చి ఆ ఎండిపోయిన ఆ బావుల్లో వెయ్యడం మొదలుపెట్టారు. ఒకప్పుడు తాగిన ఆ బావుల్లోని తియ్యటి నీళ్ళు ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఎండలు-వానలు కలిసి వచ్చే రోజులు ఊరి ప్రజలకి పనీ-పాట లేని రోజుల్లా ఉంటాయి. అలాంటి రోజుల్లో జనాలు గుంపులు-గుంపులుగా చేరి ఆల్హా సేనాపతి వీరగాథలు పడుకుంటూ, రామాయణం గానం చేస్తూ ఉంటారు. ఆల్హా వీరగాథల వల్ల పిల్లల్లో ధైర్యసాహసాలు పెరుగుతాయి అని, రామాయణం వల్ల పెద్దవాళ్ళ ఆయుష్షు పెరుగుతుంది అని వాళ్ళ నమ్మకం. ఊరిలో చాలామటుకు ఇళ్ళు దగ్గర్లోని చెరువులో నుండి తీసిన మట్టితో కట్టినవే. ఆ చెరువు మట్టి ఒక్కసారి ఎండిపోయిందంటే రాయి కంటే గట్టిగా అయిపోతుంది. అయితే వర్షాకాలంలో గంగా నది నుండి కొట్టుకొచ్చిన ఇసుక ఈ చెరువులో కలవడమే దీని వెనక ఉన్న అసలు కారణం …. కానీ బయటి వాళ్ళకి ఇదొక రహస్యం! ఒకటి-రెండు ఇళ్ళు సిమెంటుతో కట్టినవి. ఊళ్ళో ఆసుపత్రి కానీ, బడి కానీ లేకపోవడం వల్ల ఏదైనా రోగమొస్తే మందులకి, పిల్లలు చదువుకోవడానికి కన్నౌజ్ వెళ్ళక తప్పదు. ఆ ఊరు నుండి కన్నౌజ్ నాలుగు మైళ్ళ దూరం. ఊరి వాళ్ళకి మాత్రం అదిగో ఆ మలుపు తిరిగితే కన్నౌజ్ అన్నట్టే ఉంటుంది. ఈ ఊరు కన్నౌజ్ కి ఏదో ఉపగ్రహంలా ఉంటుంది. రాత్రి కన్నౌజ్ లో లైట్లు వెలిగితే ఆ నగర వెలుగు రేఖలు ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చి ఈ ఊరంతా వెండి వెన్నెలలా పరచుకుంటాయి. కన్నౌజ్ మసీదులో అజాన్ శబ్దం గాలి కాస్త సద్దుమణిగిన తర్వాత ఈ ఊరిదాకా వినిపించేది.
ఈ ఊరికి సంబంధించి కొన్ని దస్తావేజులు ఇప్పటికీ కన్నౌజ్ పురావస్తు శాఖ వారి వద్ద అందుబాటులో ఉన్నాయి. ఆ పత్రాల ప్రకారం పన్నెండవ శతాబ్దంలో కన్నౌజ్ ని పరిపాలించిన రాజు జయచంద్ తన రాజ్య రక్షణ కోసం రాజ్యానికి నాలుగు వైపులా నాలుగు సైనిక శిబిరాలు ఏర్పాటు చేసాడు. ఇప్పుడు ఈ ఊరు ఉన్న చోటే ఒక శిబిరం ఉండేది. మామిడి తోటల నడి మధ్య ఉండటం వల్ల దీనికి బాగ్-శిబిరం అనే వారు. అవును ‘బాగ్’ అంటే హిందీలో తోట అని అర్థం మరి! ఈ శిబిరంలో వెయ్యి మంది సైనికులు ఎల్లవేళలా సాయుధులై ఉండేవారు. ఈ శిబిరంలోని సైనికులు ఢిల్లీ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ కన్నౌజ్ కోట మీద దండయాత్ర చేసినప్పుడు ఎదురు దాడి చేసి పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యాన్ని విజయవంతంగా తిప్పి కొట్టారు. అందుకే రాజుకి మిగిలిన మూడు శిబిరాల కంటే ఈ శిబిరం ఎంతో ప్రత్యేకం. అందుబాటులో ఉన్న పత్రాల ప్రకారం ఆ ‘బాగ్-శిబిర్’ పేరు మీదనే ఈ ఊరికి ‘బాగసర్’ అని పేరు వచ్చింది.
మొత్తానికి చెప్పొచ్చేది ఏమిటంటే ఈ కథ ‘బాగసర్’ అనే ఊళ్ళో మొదలవుతుంది. ఈ ఊరికి సుమారు ఏడు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఊరిలో ఎన్నో హిందూ కులాల వాళ్ళు నివసిస్తున్నారు. భారతదేశంలోని మిగిలిన అన్ని గ్రామాల వలె ఈ గ్రామంలో కూడా ధనికలు-పేదవారు కలగలిసి ఉన్నారు. కొంతమంది మంచిగా తింటూ తిరుగుతూ ఉంటే, మరి కొంతమంది ఏ పూట తిండి ఆ పూట సంపాదించుకోవడానికి తిరుగుతూ ఉంటారు. కొందరి ఇళ్ళల్లో రేడియో ఉంటే మరి కొందరి ఇళ్ళల్లో ఇప్పుడిప్పుడే టెలివిజన్లు వచ్చి చేరాయి. రామానంద్ సాగర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణం’ ప్రసారం అవ్వకుండా ఉండి ఉంటే ఊరికి టెలివిజన్ అనే ఈ యంత్రం ఇంత త్వరగా వచ్చి ఉండేది కాదు. శతాబ్దాలుగా ఊహల్లో మెదిలే సీతా-రాములు ఇలా టెలివిజన్ లో ప్రత్యక్షమవ్వడాన్ని ఎవరూ నమ్మలేక పోతున్నారు. కొంతమంది భక్తులయితే ఈ యంత్రం కొనడానికి భార్య నగ-నట్ర అమ్మడానికి కూడా వెనకాడలేదు. ప్రతి ఆదివారం సరిగ్గా పది గంటలకి ‘రామాయణం’ ప్రసారం అవుతుంది. ఆ సమయానికి ఊరు ఊరంతా టెలివిజన్ ఉన్న ఇళ్ళకి చేరుకుని గంటసేపు రామాయణాన్ని ఆస్వాదించేవారు. ఆ గంట సేపు ఊరు ఊరంతా ఎంతో ధార్మికంగా మారిపోయేది. ఆదివారం నాడే సాయంత్రం ఒక సినిమా కూడా ప్రసారమయ్యేది. ఇప్పుడు యువతీ-యువకుల వంతు అన్నమాట! ఉదయం ధార్మికంగా ఉన్న వాతావరణం కాస్తా సాయంత్రం అయ్యేసరికి రంగులు వెదజల్లుతున్నట్టు మెరిసిపోయేది. ఈ సినిమాలు జనాలని ఎంతగా ప్రభావితం చేసేసాయి అంటే సినిమా పూర్తయిపోయిన తర్వాత కూడా జనాలు ఆ పాత్రల్లో నుండి బయటకి వచ్చేవారు కాదు. అందులోనే మునిగిపోయి ఉండేవారు. ఊరంతా తిరుగుతూ ఆ సినిమాల్లో పాత్రల వలె నటిస్తూ ఆనందించేవారు. ఒకానొకప్పుడు గ్రామంలో యువకులు తమ గ్రామంలోని యువతులని అక్క-చెల్లెళ్ళుగా భావించేవారు. వాళ్ళే ఇప్పుడు కుర్రాళ్ళ కళ్ళకి కథానాయికలుగా కనిపిస్తున్నారు. అమ్మాయిల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. పూర్వం అమ్మాయిలు మొద్దుల్లా ఉండి మగవాళ్ళు కనబడితే పరిగెట్టుకుంటూ ఇంట్లోకి పారిపోయేవారు. ఇప్పుడయితే మగవారి కళ్ళల్లో కళ్ళుపెట్టి మాట్లాడటం కూడా నేర్చుకున్నారు. అంతేనా! మెల్లమెల్లగా ఊరివాళ్ళ కట్టు-బొట్టు కూడా మారిపోయాయి. ఎవరో కానీ పంచెకట్టులో కనిపించడం లేదు. జీన్స్ ప్యాంటు, పైన ప్రింటెడ్ టీ-షర్టులు ఊళ్ళోకి ప్రవాహంలా వచ్చి పడిపోయాయి. ఏదో చుట్టాల ఇంటికో, పొరుగూరో వెళ్ళినప్పుడు కాకుండా పొలాలకి నీళ్ళూ పెడుతున్నా, కలుపు తీస్తున్నా కూడా ఇవే బట్టలు. ఊర్లో కోడళ్ళ ప్రవర్తనలో కూడ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చుబుకం వరకు ముసుగు వేసుకుని నేల మీద కూర్చుని కూరగాయలు తరిగే కోడళ్ళు ఇప్పుడు కాగడా పట్టుకుని వెతికినా కనిపించటం లేదు. ఇప్పుడు కోడళ్ళు తాము కట్నంగా తీసుకొచ్చిన సోఫాలో కూర్చొని ‘వివిధ భారతి’ పాటలు వింటూ ఇంటి పనులు చేసుకుంటున్నారు. ఊర్లోకి ఇంకా కరెంటు రాలేదు. కానీ రాత్రిళ్ళు ఇంటి పైకప్పుల మీద కరెంటు బల్బులు వెలుగుతూ ఉంటాయి. అంటే దొంగ కరెంటు అన్న మాట! ఒక మైలు దూరంలో ఉన్న ప్రభుత్వ కరెంటు నుండి వైరు లాగి తీసుకుంటారు. ఈ దొంగ కరెంటుతోనే బల్బులు వెలుగుతాయి. టెలివిజన్లు పని చెయ్యడానికి బ్యాటరీలు కూడా ఛార్జింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిసారి ఈ ఊర్లో అడుగు పెట్టిన వ్యక్తికి ఇది బాగా సంపన్న గ్రామంలా కనిపిస్తుంది. ఇంట్లో ఉండే చెత్త-చెదారం ముందు వాకిట్లో నుండి కనిపించనట్టే ఆ ఊరిలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ ఊరి దారిద్ర్యం బయటకి కనిపించదు. పైపైన అంతా సవ్యంగా కనిపిస్తున్నా, లోపల ఏదో తేడా ఉంది అన్న విషయం వెంటనే అర్థం కాదు.
అయితే అంతగా సవ్యంగా లేనిది ఏమున్నట్టు ఆ ఊర్లో? సవ్యంగా లేదని ఎవరికయినా ఎలా తెలుస్తుంది? దీనికి చాలా లక్షణాలు ఉన్నాయి – ఊరిలో జనాలు ఎప్పుడూ అనుమానాస్పదంగా చూస్తూ ఉంటారు. ఎప్పుడూ వాళ్ళ ముఖాల్లో ఒక రకమైన మానసిక భయం తాండవిస్తూ ఉంటుంది. ఎవ్వరూ ఎవ్వర్నీ ఒక పట్టాన నమ్మరు. అందరూ కలిసి ఆల్హా గీతాలు వింటారు, పాడుకుంటారు కూడా. టెలివిజన్ లో రామాయణం, సినిమాలు చూస్తూ ఉంటారు కూడా! కానీ మనసుల మధ్య దూరాలు మాత్రం యథాతథం! పిల్లల్ని స్కూలుకి పంపాలి అంటే భయపడతారు. ఇంట్లో ఏ ఉప్పూ-పప్పో నిండుకుంటే పొరుగింటి వాళ్ళని అడగడానికి పదిసార్లు ముందు-వెనక ఆలోచిస్తారు. ఏడు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఊళ్ళో ఉండేవాళ్ళ ప్రవర్తన ఇలా ఎందుకు ఉన్నట్టు? అయితే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు దీనికి విరుద్ధంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఊళ్ళో ఎవరికైనా కష్టం వస్తే ఊరు ఊరంతా వాళ్ళకి సహాయం చెయ్యడానికి కదిలి వస్తుంది. మరొక చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ఈ పరస్పర అపనమ్మకం పెరిగిన దగ్గర నుండి అవసరంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండే భావన కూడా పెరిగింది. ఇవి రెండూ పరస్పరం విరుద్ధం. అయితే అపనమ్మకం వల్ల అభద్రత, ఆ అభద్రత నుండి సామూహికత పెరిగి ఉండొచ్చు. లేదా ఈ సామూహికతయే ఏడు వందల ఏళ్ళ ప్రాచీన సాంప్రదాయం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అవకాశం చూసుకుని మళ్ళీ ఎదుగుతూ ఉండి ఉండొచ్చు.
ఊరిలో ఈ ప్రస్తుత పరిస్థితులకి ఎవరు బాధ్యులు? – అన్న ప్రశ్న తలెత్తడం సహజం. జనాలు ఇలా తయారయ్యారు అంటే అసలు ఎవరు ఏం చేసినట్టు? ఇదంతా ఈ రేడియో-టెలివిజన్ వల్లనా? లేక ఊర్లో మనిషే ఎవరైనానా? ఏ ఊరు అయినా నది మీద ప్రయాణిస్తున్న పడవ లాంటిది. ఒక్క ప్రయాణికుడి చిన్న తప్పిదం మొత్తం పడవనే ముంచేస్తుంది. అలాగే ఊర్లో ఒక్క మనిషి చేసిన తప్పిదం ఊరు మొత్తాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది. ఈ ‘బాగసర్’ పూర్వం ఇలా ఉండేది కాదు అని నా నమ్మకం. ఎందుకంటే ఈ ఊరికి మూడు వైపుల నుండి గాలి గంగా నది మీదుగా వీస్తుంది. పంటలన్నీ ఈ గంగా జలాలతో పండుతాయి. ఊరి ప్రజలు ప్రతి పౌర్ణమి-అమావాస్యకి గంగా స్నానాలు చేస్తారు. ఆ ఊరి జనాలు నిద్రపోతున్నా-మెలకువగా ఉన్నా రామాయణం వింటూ ఉంటారు. అలాంటి ఊరు ఇలా ఎందుకు ఉంటుంది? కానీ ఉంది! అంటే అసలు ఏం జరిగినట్టు? ఈ ఊరికి ఏమయింది?!
బాగసర్ లో ఒక ‘పలటన్’ బాబా ఉండేవారు. ఆయన కథానాయకుడు కాకపోయినా కథని ముందుకు నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు, కాబట్టి ముందుగా ఆయన్ని పరిచయం చేస్తే బాగుంటుంది. ఆయన గుడ్డివాడు. అంటే పుట్టుగుడ్డి కాదు సుమా! ఆయన ‘బిహార్ రెజిమెంట్’ లో హవల్దారుగా పని చేస్తున్న రోజుల్లో ఇంఫాల్ పోస్టింగులో ఉన్నప్పుడు ఒక బాంబు పేలుడులో ఆయన రెండు కళ్ళు పోయాయి. పలటన్ బాబా భారతదేశంలోని అన్ని మహా నగరాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని సైనిక శిబిరాల్లో పనిచేసాడు. ఆయన ఇల్లు మరీ సిమెంటు ఇల్లు కాదు, అలాగని పూరి గుడిసె కాదు. ఇంటి ముందు వాకిలి మీద రెల్లు గడ్డి కప్పి ఉంటుంది. ఆ అరుగు మీద ఎప్పుడూ ఒక నులక మంచం వాల్చి ఉంటుంది. సైన్యం నుండి ఆయనకి నెలకి రెండు వందల రూపాయల పెన్షన్ వస్తుంది. కాస్త సాగు భూమి ఉంది. పొలాన్ని, బాబాని చూసుకోవడానికి ఆయనకి ఒక కొడుకు-కోడలు ఉన్నారు. సైన్యం నుండి రిటైర్ అయ్యి ‘తిరిగి’ వచ్చిన తర్వాత జనాలు ఆయన్ని ‘పలటన్’ బాబా అని పిలవడం మొదలు పెట్టారు. హిందీలో ‘పలటన్’ అంటే తిరిగి రావడం అని అర్థం మరి! ఆయన గ్రామానికి తిరిగి వచ్చేసరికి ఊళ్ళో వాళ్ళకి మంచి-చెడు చెప్పడానికి పెద్దదిక్కు ఎవరూ లేరు. అంతే, ఆయన వస్తూనే ఊరు మొత్తానికీ కొండంత ధైర్యం వచ్చింది. ఆయన ఓపిక, నిదానంగా నచ్చజెప్పే విధానం చూసి అందరూ ఆయనని గౌరవించడం మొదలు పెట్టారు. ఊర్లో ప్రతి పంచాయితీ ఆయన పంచనే కొలువు తీరేది. దేశం, ఊరు మెల్లమెల్లగా మారడం ఆయన కళ్ళారా చూసాడు. అందుకే ఆయన నిర్ణయాలు నిష్పక్షపాతంగా ఉండేవి. ఊర్లో దారులన్నీ ఎంతో మారిపోయాయి. అయినా చిన్నప్పుడు నడిచిన దారులు మెదడులో నిక్షిప్తమయి ఉండటంతో ఇప్పుడు చూపు లేకపోయినా ఎంతో వేగంగా నడిచేస్తారు. ఆయన ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి గంగా స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చాక ఇంటి అరుగు మీద పరిచిన దర్భ చాప మీద తూర్పు దిక్కుగా కూర్చొని జపం చేసుకుంటారు. అలా జపం చేసుకునేటప్పుడు ఆయన వంటి మీద ఒక్క తెల్లటి అంగవస్త్రం తప్ప మరేం ఉండేది కాదు. తెల్లటి ఆయన తలవెంట్రుకలు చెల్లాచెదరుగా చెంపల మీద పడుతూ ఉండేవి. సూర్యోదయం అవుతూనే మెల్లగా ఎర్రటి సూర్య కిరణాలు ప్రసరిస్తూంటాయి. ఆ కిరణాల స్పర్శతో ఆయన నుదురు ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఏదో దివ్యాస్త్రాన్ని సంధించే వీర సైనికుడిలా కనబడతాడు. ఊరి జనాలు అయన్ని చూడటానికి, ఆ ఇంటి పంచన చేరి నిలబడతారు. ఆ క్షణాన ఆయన్ని చూసిన వారికి ఈ సైనికుడు తమ ప్రతి సమస్యని పరిష్కరించగలడు అనిపించేది.
2
కాన్పూర్ జల మండలి కార్యాలయంలో దేవదత్తుడు అని ఒక క్లర్కు పనిచేస్తూ ఉంటాడు. తెల్లటి పొడుగాటి బలిష్టమైన శరీరం. ఎదుటి మనిషిని తనవైపు ఆకర్షించే పెద్ద పెద్ద కళ్ళు. ఒత్తైన మీసాలు. నోట్లో ఎప్పుడూ పాన్. అందుకే తక్కువ మాట్లాడుతూ ఎక్కువగా ఊఁ ఊఁ అంటూ ఉంటాడు. అలా ఊఁ ఊఁ అనడంలో అప్పుడప్పుడు పాన్ మరకలు అతని చొక్కామీద కూడా పడుతూ ఉంటాయి. అతని ప్రతి శ్వాసలో తన సొంతూరు వినిపిస్తుంది, కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యం …. గత ఇరవై ఏళ్ళుగా ఈ దేవదత్తుడు తన ఊళ్ళో అడుగుపెట్టింది లేఉ. స్వతంత్ర భారత దేశంతో పాటుగా దేవదత్తుడు కూడా ఎదుగుతూ వచ్చాడు. అందుకే ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఉన్న ఆత్మన్యూనత భావమే పట్టణ స్థాయిలో ఇతనిలో కూడా ఉంది. అంత దేహదారుఢ్యం ఉన్న మనిషి అయినా అతని అలవాట్లు చూస్తే మాత్రం దద్దమ్మ లా ఉంటాడు. ఏదైనా దుకాణానికి పోయి వస్తువుల ధరలు అడగాలన్నా, బేరం ఆడాలన్నా సంకోచిస్తాడు. బజార్లో నిలబడి తినాలి అంటే సిగ్గు పడతాడు. ఆడవాళ్ళ కళ్ళల్లో కళ్ళుపెట్టి మాట్లాడాలి అంటే అతని శరీరం ఆకులా వణికిపోతుంది. ఇతగాడి వ్యక్తిత్వానికి మరొక కోణం – హింసాత్మక ప్రవృత్తి. ముక్కోపి. జనాలని కుల-మతాల పేరు మీద వేరుచేసి చూసే మనస్తత్వం. దేవదత్తుడు ఈ అలవాట్ల వల్లనే తన తల్లిదండ్రులు, సొంత ఊరు, దేశాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేసాడు.
దేవదత్తుడు బాగసర్ లో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి గొప్ప రామభక్తుడు. అందుకే ఊర్లో అందరూ ఆయన్ని ‘భగత్’ అని పిలిచేవారు. అంటే ‘భక్త్’ కి దేశీ ఉచ్చారణ అన్న మాట! ఆయన నిరక్షరాస్యుడు. మహత్యం అనుకోండి, ఆయన పడ్డ కష్టం అనుకోండి లేదా ఆ దేవుని కృప అనుకోండి, ఆయనకి ‘రామచరిత మానస్’ మొత్తం కంఠోపాఠం. ఊర్లో ఎక్కడ ‘అఖండ రామాయణ పారాయణ’ జరిగినా మొదటి ఆహ్వానం ఆయనకే. ఆయన ఒక్కడే రాత్రంతా అఖండ రామాయణం పారాయణ కొనసాగించేవారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇంట్లో రామాయణం పారాయణ చేసుకుంటారు. ఈ పారాయణకి ఆయనకి నచ్చే ప్రదేశం ఇంటి ముందు వాకిలి. అనువైన సమయం మధ్యాహ్నం. తన రెండు ఎడ్లని ముందుకు తోలి, నాగలి భుజాన వేసుకుని మిట్టమధ్యాహ్నం పొలం నుండి తిరిగి వస్తారు. ఎద్దుల మెడ మీద నుంచి కాడి తీసేసి వాటిని మేతకి వదిలేసి స్నానానికి బకెట్ తీసుకుని హ్యాండ్ పంప్ దగ్గరకి వెళ్తారు. స్నానం కానిచ్చి తిరిగి వచ్చి ఆ తడి అంగవస్త్రం, యజ్ఞోపవీతంతో అరుగు మీద రామాయణం పారాయణకి కుర్చుంటారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ప్రతివాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఆయన వైపు చూసి చేతులు జోడిస్తారు. కానీ ఆయనకి మాత్రం ఇవేం పట్టవు. వజ్రాలకు సానపెట్టే వానిలా రామాయణంలో లీనమయిపోయి ఉంటారు. ఇంటి ఇల్లాలు భోజనానికి రమ్మని ఎన్ని కేకలు వేసినా, ఆరోజు పారాయణ పూర్తయ్యేవరకు కదిలే ప్రసక్తే ఉండేది కాదు.
పొలంలో కాయకష్టం చెయ్యడం వల్ల భగత్ కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుండి విల్లులా వంగిపోయాయి. అందుకే శరీరం కూడా మామూలుగా కంటే కాస్త కురచగా అనిపిస్తుంది. ఆయన నుదుటి మీద బలమైన మడతలు చూసి ఊరి వాళ్ళు వాటిని ఆయన భాగ్యరేఖలు అంటూ ఉంటారు. ఆయన కూడా తనని తాను చాలా అదృష్టవంతుడు అనే భావిస్తూ ఉంటారు. భగత్ తన తండ్రి కంటే ఎక్కువ అర్జించాడు. ఆయన తండ్రి ఆయనకి మూడు సెంట్ల మెట్ట పొలం పిత్రార్జితంగా ఇచ్చాడు అందులో ఏ వేరుశనగో లేదా కందులో వేసుకోవాల్సిందే. అది కూడా ఏడాదికి ఒక్క పంటే. భగత్ తన కష్టంతో ఆ మూడు సెంట్లకి మరో మూడు సెంట్లు భూమి కొన్నాడు. అదృష్టం లేకుండా ఇది జరిగే పని కాదు అని ఆయన నమ్మకం. ఇప్పుడు ఆయన ఆరు సెంట్ల భూమి, ఏదో ఒక మోస్తరు ఇంటికి యజమాని. ఇంటి ముందు వాకిలి, వరండా, ఒక గది సిమెంటు-ఇటుకలతో కట్టింది, లోపల రెండు గదులు సున్నం-మట్టితో కలిపి కట్టినవి. ఆ గదులు ఎప్పుడూ శుభ్రంగా అలికి పెగ్గులు పెట్టి ఉండేవి. ఆ గదిలోనే ఒక పక్క ధాన్యం, బంగాళదుంపల బస్తాలు, ఎదురు గూట్లో భగత్ నిత్య పారాయణ గ్రంథం రామాయణం ఎర్రటి తువాలులో చుట్టిపెట్టి ఉండేది. ఇంటికి ముందు పెద్ద వాకిలి. ఆ వాకిట్లోనే ఒకవైపు పశువులు కట్టేసి ఉంటే, మరొక వైపు వంట చేసుకుంటూ ఉండేవారు.
భగత్ కి ఐదుగురు సంతానం. అందరికంటే పెద్దది – కూతురు దేవయాని. ఆమె కంటే మూడేళ్ళు చిన్నవాడు దేవదత్తుడు, తర్వాత వరసగా ముగ్గురు కొడుకులు. జీవితంలో చదువుకు ఉన్న ప్రాముఖ్యత ఆయనకి బాగా తెలుసు. అక్షరం ముక్క రాకుండా కేవలం రామాయణ పారాయణ చేస్తేనే తనకి ఊళ్ళో ఇంత గౌరవ మర్యాదలు ఉంటే ఇంక చదువుకుంటే ఎంత గౌరవం దక్కుతుందో కదా అని ఆయన తన జీవితానుభవంతో తెలుసుకున్నారు. అందుకే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల పిల్లలు అందరినీ కాకపోయినా పెద్ద కొడుకును మాత్రం బాగా చదివించాలి అని నిర్ణయించుకున్నారు. వాడు చదువుకుని స్థిరపడితే రైలు ఇంజను లాగ అక్క-తమ్ముళ్ళని వాడే చూసుకుంటాడు. దేవయానిని చదివించాలని ఆయనకి పెద్దగా ఉత్సాహం లేదు. ఏదో మొగుడికి ఉత్తరం ముక్క రాసే మాత్రం చదువు చెప్పిస్తే సరిపోతుంది అని ఆయన అభిప్రాయం. భార్య తన పుట్టింటి నుండి వచ్చిన ఉత్తరం చదివించుకోవడానికి పక్కింటి కుంటి మిసుర్ ఇంటికి వెళ్ళడం ఆయనకి చాలా నామోషీగా ఉండేది. దేవయాని జీవితంలో అలాంటి పరిస్థితి రాకూడదు అన్నది ఆయన కోరిక.
నలుగురు కొడుకులకి తండ్రి, పైగా రామభక్తుడు అవ్వడంతో ఆయన తనని తాను దశరథ మహారాజుగా భావిస్తూ ఉంటారు. పెద్ద కొడుకు దేవదత్తుడిలో ఆయనకి ఎప్పుడూ ఆ శ్రీరాముడి ప్రతిరూపమే కనిపిస్తూ ఉండేది. అన్న-తమ్ముళ్ళు-అక్కల మధ్య ఒక స్నేహపూరిత వాతావరణంతో తన ఇంటిని దశరథుని ఇల్లులా చెయ్యాలని ఆయన కోరిక. అన్నదమ్ముల మధ్య స్నేహభావం నేర్పి, ఆ స్నేహం ఎప్పటికీ కొనసాగేలా విద్యా బుద్ధులు నేర్పాలన్నదే ఆయన జీవితాశయం.
తన పొలంలో పండిన దానితో సంవత్సరం మొత్తం ఇల్లు గడిచిపోతుంది. మధ్యలో ఏదైనా అనుకోని అవసరం వస్తే ఇంట్లో పాడి గేది ఉండనే ఉంది. ఆ పాలు-నెయ్యి అమ్మి నెట్టుకొస్తారు కానీ ఎవరి ముందూ చెయ్యి మాత్రం చాపరు. కొడుకులకి కూడా ఉన్నదాంట్లోనే సర్దుకోవాలన్న తారకమంత్రం నేర్పారు. సరిపడ ధాన్యం ఉన్నప్పటికీ ఇంట్లో అందరికీ సర్దుకు బతకడం, పచ్చడి మెతుకులు తినేలా నియమం విధించారు. రోజూ రాత్రి ఒఠ్ఠి చపాతీలు చెయ్యడం, వాటిని బెల్లంతో కలిపి పాలల్లో ముంచుకుని తినడమే. పప్పు కానీ, కూర కానీ మధ్యాహ్నం పూటే. అది కూడా ఎవ్వరికీ మారు వడ్డించడం అన్నది ఉండదు. హోళీ-దీపావళి, రక్షాబంధన్ వంటి పండగలకే పూరీ-కూర చేస్తూ ఉంటారు. కో-ఆపరేటివ్ సొసైటీలో ఖద్దరు కొంటారు. భగత్ సహా కుటుంబంలో అందరూ ఆ ముతక ఖద్దరే కడతారు. దేవదత్తుడు స్కూలుకి వెళ్తాడు కాబట్టి అతగాడికి ఒక ప్యాంటు ఉంది. ఎప్పుడైనా గంగ స్నానానికి వెళ్ళడానికి దేవికి ఒక జత సల్వార్ కమీజ్ ఉన్నాయి. మిగిలిన ముగ్గులు కొడుకులూ నిక్కర్లే వేసుకుంటారు.
వినయంగా ఉంటూ చదువు పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉండటంతో దేవదత్తుడిని బాగా చదివించాలి అని భగత్ నిర్ణయించుకున్నారు. అయితే సన్నగా రివటలా ఉండే తన దేవదత్తుడు రోజూ నాలుగు మైళ్ళు కన్నౌజ్ ఎలా నడిచి వెళ్ళి వస్తాడా అని బెంగ పెట్టుకున్నారు. అందుకే కుర్రాడి ఒళ్ళు కాస్త గట్టిపడేదాకా చాలా సంవత్సరాలు ఎదురు చూసి ఇంక ఊళ్ళోవాళ్ళు చెప్పిన మీదట పై క్లాసుల్లో వేసారు. ఊర్లో తోటి కుర్రాళ్ళతో కలిసి ఆడుతూ-పాడుతూ స్కూలుకి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తూ ఉండేవాడు. భగత్ ప్రతి రోజూ ఊరి చివరి రామాలయం కూడలిలో నిలబడి కొడుకు స్కూలు నుండి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఎప్పుడైనా దేవదత్తుడు రావడం ఆలస్యం అయ్యి చీకటి పడుతోంది అనిపిస్తే ఆయన కొడుకుని పిలుస్తూ కన్నౌజ్ వెళ్ళే దారి వెంట వెళ్తూ ఉండేవారు. అలా పిలుస్తూ ముందుకు వెళ్ళేకొద్దీ ఆయనకి ఏడుపు తన్నుకొస్తూ గొంతు క్రమంగా నక్క ఊళలు వేస్తున్నట్టు అనిపించేది. అది చూసిన గ్రామ ప్రజలు నవ్వుతూ “దశరథుడు తన రాముడి కోసం విలపిస్తున్నాడు.” అనేవారు.
దేవదత్తుడు ప్రతి యేడూ పరీక్షల్లో మంచి మార్కులతో పాసవుతూ ఒక్కొక్క క్లాసు ముందుకు దూకుతూ పోయాడు. కొడుకుని రాముణ్ణు చెయ్యాలన్న భగత్ కల నెరవేరుతున్నట్టు అనిపించడం మొదలయింది. అయితే కలలు ఎంత కాదన్నా, కలలే అనీ, ఒక్క గాలి తెమ్మెరకి ఎగిరిపోయే సాలెగూడు లాంటివి అని బహుశా భగత్ మర్చిపోయి ఉండొచ్చు. అంతే కాదు, మనం ఎంత గింజుకున్నా అంతా ఆ బ్రహ్మ రాత ప్రకారమే జరుగుతుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. దేవదత్తుడి విషయంలో కూడా ఆ బ్రహ్మ నిర్ణయం మరొకలా ఉంది. కన్నౌజ్ కుర్రకారు గాలికి ఆ అమాయకపు దేవదత్తుడు ఎంతలా చెడిపోయాడు అంటే పేపర్లలో వచ్చే హీరోయిన్ల ఫొటోలు కత్తిరించి పుస్తకాల్లో పెట్టుకోవడమే కాకుండా ఇంటి గోడలకి కూడా అతికించడం కూడా మొదలుపెట్టాడు. తనకి నచ్చిన హీరోయిన్ ఫొటో మడత పెట్టి నిక్కరు నాడాకి ముడేసి కట్టుకున్నాడు. స్కూలు నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా బుద్ధిగా చదువుకోకుండా వేరే వాళ్ళ ఇళ్ళకి పోయి రాత్రి పది గంటల వరకు టెలివిజన్ లో వచ్చే సీరియల్స్ చూస్తూ గడిపేసేవాడు. ఆదివారం ఏ ఇంట్లో కూర్చోవడానికి చోటు దొరికితే ఇంక ఆ ఇంట్లోనే స్థిరపడిపోయి మొత్తం సినిమా చూసి కానీ అక్కడి నుండి కదిలేవాడు కాదు. అది అయ్యాక, అచ్చోసిన ఆంబోతులా ఊరంతా బలాదూర్ తిరుగుతూ ఉండేవాడు. అసలు ఈ కుర్రాడు పనీ-పాట లేకుండా ఇలా ఊరంతా ఎందుకు తిరుగుతున్నాడో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. మెల్లమెల్లగా లోగుట్టు అందరికీ అర్థమయింది. భగత్ కి రోజూ రెండు-మూడు ఫిర్యాదులు వస్తూ ఉండేవి. ఒకరొచ్చి – “నీ కొడుకు నా కూతుర్ని చూసి ఈల వేసాడు” అంటే మరొకరు వచ్చి “హ్యాండ్ పంప్ దగ్గర నీ కొడుకు నా కూతురు చెయ్యి పట్టుకుని లాగాడు” అని చెప్పి పోతూ ఉండేవారు. ఇంతలో మరొకడు వచ్చి – “దున్నపోతులాంటి నీ కొడుకుని కాస్త అదుపులో పెట్టుకో. నా కూతురుకి కన్ను కొట్టాడు.” అంటాడు. అయితే భగత్ కి చాలారోజులు అసలు ఈ కన్ను కొట్టడం ఏంటో? అసలు అది ఎందుకు ఎలా కొడతారో అర్థం కాలేదు. అయినా భగత్ కి తెలిసే అవకాశం ఎక్కడిది? గోస్వామీ తులసీదాస్ తన రామాయణంలో దీని గురించి ఎక్కడా చెప్పలేదే! మర్నాడు ఎవరో ఇలాగే ఫిర్యాదు చెయ్యడానికి వస్తే –“నాయనా, అసలు ఈ కన్ను కొట్టడం ఏంటి? ఎందుకు కొడతారు? కాస్త చెప్పు” అంటే ఆ ఎదుటి మనిషి కాస్త ముందువెనక ఆలోచించి “భగత్, నువ్వు జీవితాంతం భగత్ గానే మిగిలిపోతావా? ఇవన్నీ ఈ కొత్తతరం కుర్రకారు వెకిలి చేష్టలు. ఎవడైన కుర్రాడు మనసులో చెడు ఆలోచనలతో అమ్మాయిని చూసి ఇలా ఒక కన్ను మూస్తే, దాన్ని ‘కన్ను కొట్టడం’ అంటారు. ఇది మంచి పని కాదు.” అన్నాడు. అప్పుడు భగత్ కి తన కొడుకు ఊర్లో అమ్మాయిలని ఏడిపిస్తున్నాడు అని అర్థమయింది. ఇదంతా విని భగత్ చాలా సిగ్గుపడ్డాడు. ఆరోజు సాయంత్రం దేవదత్తుడిని చావచితకబాదాడు. కానీ అప్పటికే దేవదత్తుడు మొండికెత్తి పోయాడు. దెబ్బలకి ఒళ్ళు అప్పగించేసాడు. తండ్రి చేతుల్లో తిన్న దెబ్బల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. మర్నాడు షరా మామూలే అన్నట్టు మళ్ళీ ఊరు మీద పడ్డాడు.
దేవదత్తుడు చేసే పనులకి ఊరంతా భగత్ ని తిట్టుపోస్తున్నారు. అసలు భగత్ లాంటి మంచి మనిషి, సదాచార సంపన్నుడి కొడుకే ఇలాంటి పనులు చేస్తూంటే, ఇంక మామూలు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల సంగతి ఏమిటా అని జనాలు ఆలోచనలో పడ్డారు. భగత్ కి ఇదంతా స్కూల్లో చెడు స్నేహాల ప్రభావమే అనిపించింది. ఒక్క కొడుకునే స్కూలుకు పంపించి మంచిపని చేసాను. లేదంటే నలుగురు-నలుగురు ఆకతాయి వెధవలని నేను ఎక్కడ కట్టడి చెయ్యగలిగేది అనుకున్నారు! ఇప్పుడు ఇంక భగత్ కి రెండే దారులు కనిపిస్తున్నాయి – అయితే దేవదత్తుడిని స్కూలు మానిపించాలి లేదా వాడు మరి కాస్త పెద్దవాడు అయ్యేవరకు ఎదురు చూడాలి. కన్ను కొట్టడం లాంటి పనికిమాలిని పనులు కాదు కదా, అసలు ఇప్పటి వరకు పరాయి స్త్రీని ఆటపట్టించడం లాంటి నీచమైన పనులు చెయ్యనందుకు భగత్ కి తనపైన, తన ఊరుపైన ఎంతో గర్వంగా ఉండేది.
నువ్వు ఈ అలవాట్లు మానుకోకపోతే స్కూలు మాన్పించేస్తాను అని దేవదత్తుడికి ఎన్నోసార్లు ప్రేమగా, చాలా సార్లు బెదిరించి చీవాట్లు పెట్టి మరీ నచ్చజెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. దేవదత్తుడు మాత్రం దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఏమీ మాట్లాడకుండా తండ్రి ముఖం వైపు చూస్తూ, నాలుగు రోజులు తల దించుకుని తిరుగుతూ మళ్ళీ తన పని మొదలుపెట్టేవాడు. చివరకి ఒకరోజు దేవదత్తుడు కట్టుతప్పి ఆ ఊరు పరువు మర్యాదలని కాలరాసాడు. ఆరోజు సాయంత్రం బాగసర్ మొత్తం ప్రశాంతంగా ఉంది. జనాలు పొలాలు, బజార్ల నుండి మెల్లమెల్లగా ఇళ్ళకి తిరిగి వస్తున్నారు. పశువుల కొట్టాల్లో గడ్డివేసి నీళ్ళు పెడుతున్నారు. మిల్లులు పెద్దగా చప్పుడు చేస్తూ తమ పని చేసుకుపోతున్నాయి. ఆడవాళ్ళు ఇళ్ళల్లో రాత్రి వంటలకి ఏర్పాట్లు మొదలు పెడుతున్నారు. వీధుల్లో పిల్లలు కర్ర-బిళ్ళ; దొంగ-పోలీసు ఆడుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుండో – “పారిపోండి, పారిపోండి. రహమాన్ బాబాయి ని ఎవరో దుండగులు గుడి దగ్గర చంపేసారు… పారిపోండి.” అని కేకలు వినబడ్డాయి. ఒకరిని హత్య చెయ్యడం అంటే బాగసర్ లాంటి చిన్న ఊళ్ళో పెద్ద విషయమే! అందరూ చేతిలో పని వదిలిపెట్టి గుడి వైపు పరుగు తీసారు. అక్కడ రహమాన్ బాబాయి నేలమీద పడి గిలగిల కొట్టుకుంటున్నాడు. ఆయన సైకిల్ ఆ పక్కనే పడి ఉంది. సైకిల్ హ్యాండిల్ కి తగిలించిన చేతిసంచిలో నుండి కూరగాయలు బయటకి చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. పగిలిన తల నుండి కారుతున్న రక్తం ఆయన తెల్లటి గడ్డం గుండా కారుతూ మెడ కింద వరకు చేరింది. రహమాన్ బాబాయి సగం స్పృహలో లేడు. నలుగురు కలిసి ఆయన్ని లేపి కూర్చోబెట్టారు. కానీ ఆయన నోరు విప్పి మాట్లాడే స్థితిలో లేడు. అసలు ఆయనకి అంత పెద్ద దెబ్బ ఎలా తగిలిందో తెలుసుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సైకిలు మీద నుండి పడినా, ఇంత పెద్ద దెబ్బ తగలే ఆస్కారం లేదు. బాగసర్ కి ఉత్తరాన నాలుగు ఫర్లాంగుల దూరన ఉన్నా రహమాన్ బాబాయి ఊరు ఇబ్రహీంపట్నానికి కబురు వెళ్ళింది. ఆయన కొడుకులు వచ్చి ఆయన్ని ట్రాక్టరులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. కానీ, పాపం ఊరు చేరుకోక ముందే రహమాన్ బాబాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలు ఇదంతా ఎలా జరిగిందా అని రెండు గ్రామాల వారికీ అంతుచిక్కట్లేదు. పొద్దు గడిచే కొద్దీ మెల్లగా గుట్టు బయటకి రావడం మొదలైంది. ఎవరో ఆయని మీదకి రాయి విసిరినట్టు తెలిసింది. అసలు ఎవరు విసిరినట్టు? ఎందుకు విసిరినట్టు? అయితే ఇదంతా కళ్ళారా చూసిన వ్యక్తి ఎక్కువసేపు ఇదంతా కడుపులో దాచుకోలేక బయటకి కక్కేసాడు – “దేవదత్తుడు, ఠాకుర్ ఇంటి పిట్టగోడ ఎక్కి రహమాన్ బాబాయి మీదకి రాయి విసిరాడు.” విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం జనాలు అర్ధరాత్రి వేళ కత్తులు, కొడవళ్ళు, తుపాకులు పట్టుకుని బాగసర్ ని చుట్టుముట్టారు. వెంటనే బాగసర్ ప్రజలు పలటన్ బాబా దగ్గరకి పరుగెట్టారు. కాసేపు మంతనాలు జరిగిన పిమ్మట ఊరి జనాలు బాబా నాయకత్వంలో ఎలాంటి ఆయుధాలు లేకుండానే ఊరి పొలిమేరలకి చర్చలకి వెళ్ళారు. వీళ్ళు ఎలాంటి ఆయుధాలు లేకుండా రావడం చూసి ఇబ్రహీంపట్నం జనాలు కాస్త చల్లబడ్డారు. సరిహద్దుల్లో ఇరుపక్షాల వాళ్ళు ఎదురెదురుగా నిలబడ్డారు. అందరి ముఖాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయాందోళనలు. అసలు రహమాన్ బాబాయి లాంటి నెమ్మదస్తుడు, పెద్దమనిషి ఏం చేసాడని మీ కుర్రాడు ఆయన్ని పొట్టన పెట్టుకున్నాడో తెలుసుకోవాలని ఇబ్రహీంపట్నం వాళ్ళు పట్టుపట్టారు. ఆ హంతకుణ్ణి తమకి అప్పగిస్తే మర్యాదగా ఉంటుందని, లేదంటే ఊళ్ళోకి చొరబడి ఎలాగైనా వాణ్ణి పట్టుకుంటామని, అప్పుడు లేనిపోని రక్తపాతం తప్పదని కత్తులు నూరారు. బాగసర్ ప్రజలు కూడా దేవదత్తుణ్ణి అప్పగించడానికి సిద్ధంగా లేరు. రాత్రంతా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. చివరకి పోలీసులకి కబురు వెళ్ళడంతో తెల్లవారుతూనే ఇనిస్పెక్టర్ త్రిపాఠీ నేతృత్వంలో పోలీసులు బాగసర్ చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఇరు పక్షాల వారి వాదనలు విన్న తర్వాత హంతకుడు ఇంకా మైనరు కావడంతో అరెస్టు చెయ్యడం సరి కాదు అని నచ్చజెప్పారు. ఒకవేళ కాదూ-కూడదు అని అరెస్టు చేసినా, రెండేళ్ళలో ఎలాగూ ‘జువైనల్ హౌస్’ నుండి తిరిగి వచ్చేస్తాడు. దీనివల్ల పిల్లాడి జీవితం నాశనం అయిపోతుంది. అందుకే జరిగిన దానిని ఒక ప్రమాదంగా భావించి ఇదంతా ఇంక ఇక్కడే మర్చిపొమ్మని సలహా ఇచ్చాడు ఇనిస్పెక్టరు.
ఇబ్రహీంపట్నం వాళ్ళు ఇనిస్పెక్టరు మాట వినడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు, పోలీసులు అక్కడ ఉండగానే బాగసర్ లో కి చొరబడాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇంక కోపం వచ్చి ఇనిస్పెక్టరు ఇబ్రహీంపట్నం ప్రజలని ఉద్దేశిస్తూ – “ఏమిరా దొంగ నా కొడకల్లారా! భారతదేశాన్ని విడగొట్టినా ఇంకా మీ కళ్ళు చల్లబడలేదా? ఇక్కడ మీకు అంత ఇబ్బందిగా ఉంటే అప్పుడే పాకిస్తాన్ పోవాల్సింది కదా! భారతదేశంలో ఉండాలి అనుకుంటే హిందువుల దగ్గర కాస్త అణిగిమణిగి ఉండటం నేర్చుకోండి. కళ్ళు కనిపించడం లేదా? మీ ఊరికి నాలుగు పక్కలా హిందువుల ఊళ్ళే ఉన్నాయి. ఒక్క కేక వేస్తే మిమ్మల్ని సున్నంలోకి ఎముకలు లేకుండా కుళ్ళబొడిచేస్తారు. ఇద్దరు-ముగ్గురు మిగిలినా, హింసని ప్రోత్సహిస్తున్నారని కేసు పెట్టి లోపల పడేస్తాం. ఎక్కువ పేట్రేగితే ఇద్దరు ముగ్గుర్ని నేనే ఇప్పుడే ఇక్కడే ఎన్ కౌంటర్ చేసి పడేస్తాను. చెప్పండి, వెనక్కి వెళ్తారా లేక ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వమంటారా?” అన్నాడు.
ఇదంతా వినేసరికి ఇబ్రహీంపట్నం జనాల కత్తులు-కటార్లు, తుపాకిలు కిందకి వాలిపోయాయి. వాళ్ళు తమ ఊరి వైపు వెనుదిరిగారు. పంచనామా తర్వాత రహమాన్ బాబాయి శవం వాళ్ళ కొడుకులకి అప్పగించేసారు. ఇంత జరిగినా, రహమాన్ బాబాయి అంతిమ యాత్రలో ఇరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఒకటి రెండు నెలల్లో జనాలు ఇదంతా మర్చిపోయారు. కానీ రెండు ఊళ్ళ మధ్య ఒక తెలియని విభజన రేఖ ఏర్పడిపోయింది. స్పష్టమైన చీలిక కనిపించడం మొదలయింది. ఇబ్రహీంపట్నం జనాలు మార్కెటుకి వెళ్ళడానికి ఇన్నేళ్ళూగా వాడుకుంటూ వస్తున్న బాగసర్ దారిని శాశ్వతంగా మర్చిపోయారు.
రహమాన్ బాబాయి మీదకి రాయి విసిరిన తర్వాత దేవదత్తుడు తిన్నగా ఇంటివైపు పరుగెత్తాడు. తను రాయి విసరడం ఎవ్వరూ చూడలేదని నిబ్బరంగా ఉన్నాడు. అయితే గుట్టు బయట పడటం తో ఇంట్లోనే అటక ఎక్కి కూర్చొన్నాడు. విషయం తెలిసినా కూడా దేవదత్తుడు, రహమాన్ బాబాయి మీదకి రాయి విసిరాడు అంటే భగత్ నమ్మలేకపోయాడు. కానీ, ఊరు ఊరంతా చెప్పడంతో నమ్మక తప్పలేదు. రాత్రి ఊరును చుట్టుముట్టి, మానవ హంతకుడు అయినా ఆ కుర్రాణ్ణి పట్టుకెళ్ళడానికి ఇబ్రహీంపట్నం వాళ్ళంతా ఒంటి కాలు మీద నిలబడటంతో భగత్, కొదుకుని వెతకడం మొదలుపెట్టారు. ఊరంతా వెతికినా, దేవదత్తుడు కనిపించలేదు. ఆ రోజు సాయంత్రం చలి ఎక్కువగా ఉండి మెల్లగా మంచు కూడా కురుస్తోంది. అలాంటి వేళల్లో ఊరి జనాలు, చలిమంట వేసి పశువుల కొట్టం దగ్గర కూర్చొంటారు. కానీ ఆ రోజు సాయంత్రం చలిమంటా వెయ్యలేదు, వంటకోసం పొయ్యి కూడా వెలిగించలేదు. అసలు దేవదత్తుడు ఇదంతా ఎందుకు చేసినట్టు? చేసి ఎక్కడికి పారిపోయినట్టు? అని అందరూ దిగులుగా ఉన్నారు. ఇంట్లో అందరూ తలొక మూల పడుకుని నిద్రపోతున్నారు. అర్ధరాత్రివేళ అటక మీద నుండి ఎవరో దగ్గుతున్న చప్పుడు వినిపించింది. చూస్తే దేవదత్తుడు. భగత్, కుర్రాణ్ణి లాక్కొచ్చి చచ్చేలా కొడుతూనే – “నువ్వు రహమాన్ బాబాయి మీదకి రాయి విసిరావా? చెప్పు. వాళ్ళ ఊరు వాళ్ళు నిన్ను ఈడ్చుకుని పోవడానికి మన ఊరుని చుట్టుముట్టు నిలబడ్డారు. రహమాన్ కి బదులు వాళ్ళు నిన్ను చంపాలని పట్టుపట్టి కూర్చొన్నారు.” అన్నారు.
“జనాలు అబద్ధం చెబుతున్నారు. నా కొడుకు ఒక్కనాటికి హంతకుడు కాదు. అసలు వీడు రాయి విసిరి ఉండడు.” దేవదత్తుడి తల్లి కొడుకుని కౌగులించుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతోంది.
భగత్, భార్యని అవతలకి లాగి, కర్ర తీసుకుని దేవదత్తుణ్ణి చితకబాదటం మొదలుపెట్టాడు. అసలు జరిగిన సంగతి తెలుసుకోవాలని కోపంతో ఊగిపోతున్నారు భగత్. చివరికి దేవదత్తుడు ‘అవును. నేనే చంపాను” అని ఒప్పుకున్నాడు.
“ఎందుకు?”
“ఎందుకంటే అతను ముసల్మాను.”
“అతను ముసల్మాను అయితే ఏమయింది? నిన్ను ఏం చేసాడు?”
“ఎందుకంటే ముసల్మానులు హిందువుల శత్రువులు కాబట్టి.”
“ముసల్మానులు, హిందువుల శత్రువులు అని నీకు ఎవరు చెప్పారు?”
“స్కూలులో పంతులు గారు.”
“పంతులు గారు ఏం చెప్పారు?”
“భారత దేశంలో ఉండే ముసల్మానులు అందరూ హిందువుల శత్రువులు. వీళ్ళే సోమనాథ దేవాలయాన్ని నాశనం చేసారు. వీళ్ళవల్లనే మనదేశం విడిపోయింది. మన దేశంలో ఉన్న సమస్యలన్నీ వీళ్ళవల్లనే. అందుకంటే వీళ్ళు బోల్డంత మంది పిల్లల్ని కంటూ ఉంటారు.” అన్నాడు దేవదత్తుడు.
ఇదంతా విని భగత్ చేతులు వణికాయి. కర్ర పక్కన పడేసి తల పట్టుకుని నేలమీద కూర్చుండి పోయారు. ఈసారి అమ్మ కూడా కోపంగా వచ్చి దేవదత్తుణ్ణి ఆ చెంప ఈ చెంప వాయించింది. రెహమాన్ బాబాయి ని చంపిన హంతకుడు తన కడుపున పుట్టడం, తాను వాడికి జన్మనివ్వడం ఇప్పుడు ఆమెకి ఎంతో సిగ్గుచేటుగా అనిపించింది. తెల్లవారి పోలీసులు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. లేదంటే ఇబ్రహీంపట్నం జనాలు వచ్చి తమ కొడుకుని తీసుకుపోయి చంపేస్తారని భయపడిపోయారు ఆ తల్లిదండ్రులు.
సరైన సమయానికి పోలీసులు కలగజేసుకోవడంతో దేవదత్తుడు శిక్ష పడకుండా తప్పించుకోగలిగాడు. కానీ, ఆ శిక్ష కుటుంబానికి పడింది. బాగసర్ ప్రజలు దేవదత్తుణ్ణి మానవ హంతకుడుగా ముద్రవేసి, ఆ ఇంటిని వెలి వేశారు. ఎవరూ వీరి ఇంటి గడప తొక్కరు, వీళ్ళని ఏ కార్యక్రమానికీ పిలవరు. ఇది ఎక్కడికి దారి తీసింది అంటే, భగత్ ని అఖండ రామాయణ పారాయణికి కూడా పిలవడం మానేశారు. భగత్ కి ఇది అతిపెద్ద అవమానం. మృత్యు సదృశం. బతికి ఉన్నా, ప్రాణాలు లేన్నట్టు ఉంది భగత్ పరిస్థితి. ఇప్పుడు ప్రతిరోజూ మధ్యాహ్నం పూట పారాయణ కూడా ఎవరికీ కనబడకుండా గుట్టుగా చేసుకుంటూ, ఆ భగవంతుణ్ణి – “ఓరి భగవంతుడా! ఏ జన్మలో ఏం పాపం చేసానని నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు?” అని కన్నీళ్ళు పెట్టుకునేవారు.
3
మొదటి సంతానం అవ్వడం వల్ల ఇంటిల్లపాదీ దేవయానిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఎవ్వరూ ఆమెతో గొంతు పెంచి కూడా మాట్లాడేవారు కాదు. రోజంతా ఇంట్లో అందరూ ఆమె పేరే జపం చేస్తూ ఉండేవారు – “దేవీ, కాసిని మంచినీళ్ళు పట్టుకు రా. దేవీ, నా చొక్కా బొత్తం ఊడిపోయింది కాస్త కుట్టిపెట్టు. దేవీ, ఇది చెయ్యి, దేవీ, అది చెయ్యి.” ఇలా రోజంతా ఆమె జపమే! ఆమె కూడా అందరి అవసరాలూ చూసుకుంటూ బొంగరంలా తిరుగుతూ పనులన్నీ చకచకా చేస్తూ అందరి మన్ననలూ పొందేది. అమ్మకి వంటలో కాస్త సాయం చెయ్యడం తప్ప ఆమెకి రోజంతా పెద్దగా పనేం ఉండేది కాదు. ఊళ్ళో స్కూలు లేకపోవడం, ఎక్కడో కన్నౌజ్ అంత దూరం ఆడపిల్లని పంపడం ఇష్టం లేక ఆమెని స్కూల్లో చేర్పించలేదు. ఇప్పుడు ఆమె స్కూలుకు వెళ్ళే వయసు కూడా దాటిపోయింది. ఆడపిల్లకి కొద్దోగొప్పో చదువు చెప్పించాలని భగత్ కోరిక. అయినా వేరే దారి లేక ఆ ఆలోచన విరమించుకున్నారు. ఒకరోజు ఉన్నట్టుండి దేవికి చదువు చెప్పించడానికి పొరుగింటి కుంటి మిసుర్ కోడలు దగ్గరకి పంపితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. మిసుర్ వాళ్ళది భగత్ పొరుగిల్లే. మిసుర్ ఒక్కగానొక్క కోడలు ‘హోమ్ సైన్సు’లో హైస్కూలు చదివిన విషయం ఊరంతా తెలుసు. దానికి ఋజువు ఏంటి అంటే ఆ కోడలు, అత్తగారు అనే ఒక్క మాటకి కూడా తన దగ్గర ఋణం ఉంచుకోకుండా మాటకి మాట తిరిగి ఇచ్చేస్తుంది. అప్పుడప్పుడు కోపం వస్తే అత్తగారి మీదకి గిన్నెలు-గరిటలు కూడా విసురుతూ ఉంటుంది. అత్త-కోడళ్ళ కొట్లాటలో ఒకసారి మిసుర్ భార్య తల పగలడం కూడా అందరికీ తెలుసు. అలా ఆ ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటూంటే కుంటి మిసుర్ రెండు అడవి దున్నల పోట్లాట మధ్య నలిగిపోయే మేకపిల్లలా బయట అరుగు మీద కూర్చుని ‘మేఁ మేఁ’ అంటూ ఉండేవాడు. ఏదేమైనా కానీ, ఇది కుంటి మిసుర్ సొంత విషయం. దానితో భగత్ కి ఏం సంబంధం లేదు. ఎలాగో అలాగ, కుంటి మిసుర్ కోడలు, కాస్త వీలు చూసుకుని దేవయానికి నాలుగు అక్షరం ముక్కలు చదవడం-రాయడం నేర్పిస్తే కూతురుకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టొచ్చు అని భగత్ ఆలోచన. ఇదంతా దృష్టిలో పెట్టుకునే భగత్, కుంటి మిసుర్ ని, ఆయన తన కోడలిని వేడుకున్నారు. కాసేపు అయినా అత్తగారి పీడ వదిలించుకోవడానికి ఇదే చక్కని అవకాశం అని ఆ కోడలు కూడా వెంటనే ఒప్పుకుంది. దేవికి బాగా చదువు చెబితే, అది చూసి ఊళ్ళో మిగిలిన అమ్మాయిలు కూడా తన దగ్గరకి చదువు చెప్పించుకోవడానికి వస్తారని ఆమె ఆలోచన. మెల్లగా బాలికల స్కూలు తెరిచి ప్రిన్సిపాల్ అయినట్టు ఊహించేసుకుంది. దేవి ఆమె దగ్గరకు క్రమం తప్పకుండా వెళ్లడం మొదలుపెట్టింది. ఇంటి పని, అత్తగారితో తగవులు అవ్వగా మిగిలిన వేళల్లో ఆమె దేవికి చదువు చెప్పేది. దేవికి చదువు పట్ల అభిరుచి కలిగించాలి అంకుంది. అందుకోసం బొమ్మలతో చదువు చెప్పడం మొదలు పెట్టింది. ‘హోమ్ సైన్స్’ పుస్తకం లో నుంచి బొమ్మలు చూపిస్తూ ‘మానవ శరీర నిర్మాణం’ రహస్యాలు వివరించింది. ఆ బొమ్మలు చూడాలంటే మొదట్లో దేవికి చాలా సిగ్గుగా ఉండేది. మెల్లమెల్లగా ఆమెకి కూడా అందులో ఏదో మాటలకి అందని ఆనందం ఉంది అనిపించింది. మెల్లగా కుంటి మిసుర్ కోడలు దేవికి అక్షరాలు నేర్పింది. ఫలితాలు చాలా బాగా ఉన్నాయి. అతి కొద్ది రోజుల్లోనే దేవయానికి హిందీ చదవడం-రాయడం బాగా వచ్చేసాయి. ఒకనాటి మధ్యాహ్నం భగత్ వసారాలో కూర్చుని రామాయణం పారాయణ చేసుకుంటూంటే దేవయాని ఒక పద్యం మొత్తం చదివి వినిపించి తన నేర్చుకున్న చదువుని తండ్రి ముందు నిరూపించుకుంది. కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగా కారుతుండగా భగత్ – “శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి కి జై …. పవనపుత్ర హనుమాన్ కి జై …” అని బిగ్గరగా అన్నారు.
కుంటి మిసుర్ కోడలు, దేవికి చదువుతో పాటు కాస్త లోకజ్ఞానం, ఇంకా చాలా నేర్పింది. తల్లి ఇంట్లో లేనప్పుడు చిన్న అద్దం ముక్క తీసుకుని అందులో తన ముఖం చూసుకోవడం నేర్చుకుంది. దేవయాని అప్పుడప్పుడు చిన్న బొట్టుబిళ్ళ, కాటుక పట్టుకుని అద్దంలో తనని తాను చూసుకునేది. ఒకసారి వాలుజడ వేసుకుంటే ఒక్కొక్కసారి జుట్టు అంతా ఒక దగ్గరకి చేర్చి కొప్పులా పెట్టుకునేది. అప్పుడప్పుడు నడుం ఊపుతూ గదిలో అటు నుండి ఇటు, ఇటు నుండి అటు నడుస్తూ ఉండేది. ఒకసారి అలా నడవడం తమ్ముడు చూసి ఆ విషయం మెల్లగా తల్లికి చెప్పేసాడు. అసలే దేవదత్తుడు చేసిన నిర్వాకానికి ఆ తల్లి భయపడి చేస్తోంది. ఇంక ఆరోజు మొదలు కూతురు మీద ఒక కన్నేసి ఉంచి గట్టి ఆంక్షలు కూడా విధించేసింది. రాత్రిళ్ళు తన పక్కలోనే పడుకోబెట్టుకోవడం మొదలు పెట్టింది. అద్దం చూసుకోవడానికి వీలు లేకుండా చేసింది. దేవి ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదు. చదువు పేరు చెప్పి మిసుర్ కోడలు దేవిని చెడగొట్టింది అని అర్థమయింది.
ఒక రోజు దేవి కుంటి మిసుర్ ఇంటి నుండి వస్తూనే తను ‘ఓపెన్ స్కూలు’ కి అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకుంటున్నట్టు, దానికోసం కన్నౌజ్ వెళ్ళాలని ప్రతిపాదన చేసింది. ఆ మాటలు వింటూనే భగత్ అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. భార్యలాగే తను కూడా కొడుకు చేసిన పనికి బెదిరిపోయి ఉన్నాడు. ఇంక ఎవ్వరినీ చదువుల కోసం ఊరు దాటి పంపకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయినా ఏదో మూల ఉన్న చిన్న ఉత్సాహంతో అసలు ఈ ‘ఓపెన్ స్కూల్’ అంటే ఏమిటో తెలుసుకోవాలి అనిపించింది. “ఓపెన్ స్కూలు అంటే ఎవరైనా, ఆఖరికి గొర్రెలు మేపుకొనేవాడు అయినా ఎలాంటి అర్హతలు లేకుండా దరఖాస్తు చేసుకుని చదువుకోవచ్చు, పరీక్ష రాయొచ్చు” అని మిసుర్ కోడలు వివరించి చెప్పింది. ఇందులో రోజూ స్కూలుకి వెళ్ళడం కానీ, ఫీజులు కట్టడం కానీ ఉండవు. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే పరీక్షల్లో హాయిగా పుస్తకం చూసి కాపీ కొట్టొచ్చు. దేవి పంతం ముందు భగత్ కి తల వంచక తప్పలేదు. అయితే దేవిని కన్నౌజ్ పంపడం ఎలాగ అన్నది ఒక సమస్య! కొద్దోగొప్పో చదువుకున్న వారిని తోడిచ్చి పంపాలి కదా! అసలు స్కూలు ఫారం నింపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఊళ్ళో? కుమ్మరోళ్ల కుర్రాడు చారుదత్తుడు కొన్నేళ్ళ క్రితం ఫారం అయితే నింపాడు కానీ, ఎవరూ కాపీ కొట్టించే వాళ్ళు దొరకకపోవడంతో పరీక్ష ఫెయిల్ అయిపోయాడు. చారుదత్తుడికి కబురు పంపారు. చాలా బతిమాలిన మీదట ఒప్పుకున్నాడు. “నాకు చాలా పనులు ఉన్నాయి. అయితే మీరు చెబుతున్నారు కాబట్టి వెళ్తాను. ఆ స్కూలు ఉన్నది తాలూక ఆఫీసు దగ్గర. 20 రూపాయలు ఖర్చవుతుంది. రెండు ఫోటోలు కూడా.”
“ఫోటోలు ఇంట్లో లేవు అనుకుంటా” అన్నాడు భగత్.
“అయితే ఇవాళ వెళ్ళి ఫోటోలు తీయించుకోవాలి. ఫోటోలు వచ్చాక, అప్పుడు ఫారం నింపొచ్చు. అంటే రెండు రోజులు వెళ్ళాలి మాట!” అన్నాడు చారుదత్తుడు.
“పుణ్యం ఉంటుంది. వెళ్ళి రా నాయనా! అమ్మాయి పట్టుపట్టి కూర్చొంది. దేవదత్తుడు ఇక్కడ లేడు. నాకేమో ఈ స్కూలు వ్యవహారం ఏం తెలియదు.” అని నిస్సహాయంగా అన్నాడు భగత్.
చారుదత్తుడు కన్నౌజ్ వెళ్ళడానికి ఒప్పుకున్న తర్వాత భగత్ ఇంట్లోకి వెళ్ళి విషయం భార్యకి చెప్పాడు. అంతే భార్య కోపంతో ఒంటి కాలు మీద లేస్తూ – “ఎవరో ముక్కు-ముఖం తెలియని మగవాడితో నేను నా కూతుర్ని ఎక్కడికీ పంపను. అసలే వయసులో ఉన్న పిల్ల. ఏదైనా జరగకూడనిది జరిగితే ఇంక ఊళ్ళో తలెత్తుకుని తిరగాలా వద్దా? దేవదత్తుడు చేసిన నిర్వాకం మర్చిపోయారా? ఆడపిల్ల కి చదువు చెప్పించడం అంటే నెత్తికెక్కించుకోవడమే. ఆ కుంటి మిసుర్ కోడలు కూడా చదువుకున్న పిల్లే. చూడట్లేదా దాని వేషాలు? ఆడపిల్లలు చదువుకుని పెళ్ళి చేసుకుని అత్తారిళ్ళకి వెళ్ళి అత్త-మామలని కాల్చుకుని తినడం తప్ప ఏం చేసేది లేదు. నాకు ఆ మిసుర్ కోడలు మీద ముందు నుండి అనుమానమే! “
“ఏమిటోయ్, ఏం మాట్లాడుతున్నావు? ముక్కు-మొఖం తెలియకపోవడం ఏమిటి? మన కుమ్మరోళ్ళ చారుదత్తుడే. వెర్రిబాగులాడు, తన పనులన్నీ మానుకుని నా మాట తీసెయ్యలేక ఒప్పుకున్నాడు. లేదంటే అసలు వెలి వేసిన దగ్గర నుండి ఎవరైనా మన మాటకి విలువ ఇస్తున్నారా? మన ఇంటికి వస్తున్నారా? పాపం దేవయానిని తన సైకిలు మీదనే తీసుకు వెళ్తాను అన్నాడు. పోనీలే పాపం పిల్లని వెళ్ళిరానీ. నాలుగు అక్షరం ముక్కలు వస్తే అత్తగారింట్లో కాస్త గౌరవం అయినా ఉంటుంది. మనల్నే చూడు గౌరవానికి మొహం వాచిపోయి ఉన్నాం. చదువు రాని మనిషికి, గొడ్డుకి ఏం తేడా లేదు. ‘విద్య లేని వాడు వింత పశువు’ అని ఊరికే అనలేదు.” అని భగత్ తన భార్యకి నచ్చజెప్పాడు.
చారుదత్తుడు మర్నాడు ఉదయాన్నే సైకిలు తీసుకుని భగత్ ఇంటి ముందు నిలబడ్డాడు. అప్పటికే భగత్ పొలానికి వెళ్ళిపోయాడు. చారుదత్తుడిని చూస్తూనే దేవి త్వరత్వరగా తయారయ్యింది. ఆ రోజు దేవయాని పండుమిరప రంగు సల్వార్ మీద పసుపు పచ్చని కుర్తా, దాని మీద ఎర్రటి దుపట్టా వేసుకుంది. ఆ దుపట్టా ఎర్రదనం తెల్లటి దేవయాని బుగ్గల మీద ప్రతిబింబించి ఆమె బుగ్గలు మోదుగు పూలలా మెరుస్తున్నాయి. నల్లటి పొడవైన ఆమె జడ పిరుదులు దాటి నాట్యం చేస్తోంది. తల్లి గుమ్మం వరకు వచ్చి – “గడప దాటగానే వెర్రిత్తిన దానిలా చెయ్యకు. దుపట్టా సరిగ్గా వేసుకో. ఛాతీ కాస్త కూడా బయటకి కనబడకూడదు. నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి నాతో నువ్వు దుపట్టా సరిగ్గా వేసుకోలేదు అని చెప్పారో, నా అంత చెడ్దది ఉండదు చూడు. కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతాను.” అంది.
అమ్మ చెప్పిన హితోపదేశాలన్నీ పాటిస్తూ దేవయాని సైకిలు మీద కూర్చోగానే దుపట్టా నడుం చుట్టూ బిగించి కట్టుకుంది. కాసేపటికి సైకిలు తారు రోడ్డు ఎక్కింది. ఆ రోడ్డు మీద పెద్ద పెద్ద వాహనాలు రాక్షసుల్లా పరుగెడుతున్నాయి. ఆ వాహనాలు వేగంగా సైకిలు పక్క నుండి వెళ్ళేసరికి దుపట్టా ఎప్పుడు ఎగిరిపోవడం కూడా దేవయానికి తెలిసేదే కాదు. అక్కడ ఎవరూ తెలిసిన వాళ్ళు లేకపోవడంతో అసలు దుపట్టా వేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. ఇవాళ మనస్పూర్తిగా జీవించాలి అనుకుంది. జీవితంలో మొదటిసారి పంజరంలో నుండి బయటకి వచ్చింది. చారుదత్తుడు అప్పుడప్పుడు ఆమెకేసి దొంగ చూపులు చూడటం మొదలుపెట్టాడు. అతగాడు అలా చూడటం దేవికి కూడా నచ్చింది. ఇంతలోనే చారుదత్తుడికి ఆమె బ్రాహ్మల అమ్మయి అని, తను కుమ్మరోళ్ళ కుర్రాడు అని గుర్తొచ్చేది. దేవిని ఇలా చూడటం పాపం అని చారుదత్తుడికి కూడా అనిపిస్తోంది. అయినా మళ్ళీ కాసేపటికే మనసు ఆమెనే చూడాలని గొడవ చేస్తోంది. గాలికి ఎగిరి దేవి ముఖం మీద పడుతున్న ఆమె ముంగురులు అతణ్ణి ఆకర్షిస్తున్నాయి. ఒకళ్ళ శరీరాలు ఒకళ్ళకి తాకినప్పుడల్లా ఇద్దరి హృదయాల్లో వీణలు మోగేవి. అలాంటప్పుడు తేలుకుట్టిన దొంగలా చూపులు మరల్చుకోవడానికి వృథా ప్రయత్నం చేసేవారు.
ఈసారి దుపట్టా గాలికి ఎగిరితే దేవయాని దాన్ని తీసి చుట్టచుట్టి ఒళ్ళో పెట్టుకుంది. అసలు ప్రతిరోజూ ఇంత స్వేచ్ఛగా బతికే ఆడపిల్లలు ఎంత అదృష్టవంతులో కదా అని ఆలోచిస్తోంది. తను ఒక్కరోజుకే ఇంత సంబర పడిపోతోంది. ఇవాళ ఫారం నింపేస్తే ఇంక అమ్మ మళ్ళీ బయటకి రానివ్వదు కదా అని దిగులు పడింది.
‘ఇరఫాన్ స్టూడియో’లో మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరివీ రకరకాల ఫోటోలు అద్దానికి పెట్టి ఉన్నాయి. అక్కడ రకరకాల హీరోల నిలువెత్తు ఫొటోలు అక్కడ ఉన్నాయి. అవి చూస్తే అసలు వాళ్ళే అక్కడ నిలబడ్డారా అన్నట్టు ఉంది. స్టూడియో అతను రకరకాల ఫొటోల నమూనాలు చూపించాడు. స్కూలు ఫారం నింపడానికి అని చెప్పగానే ఫొటో స్టూడియో అతను వెంటనే ఒక స్టూలు మీద కూర్చోబెట్టి గదిలో లైట్లు వేసాడు. కెమెరాకి కప్పిన నల్లటి ముసుగులో తల దూర్చి, ఒకే ఒక్క కరెంటు మెరుపుతో ఫొటో తీసాడు.
ఫొటో తీయించుకున్న తర్వాత బజారు అంతా తిరగాలి అని దేవయాని కోరిక. కానీ చేతిలో ఒక్క పైసా మిగల్లేదు. దేవి మూడు రూపాయలు తీసుకొచ్చింది. రెండున్నర ఫోటోలకి, అర్ధ రూపాయి తన ఖర్చులకి. అయితే ఫోటో స్టూడియో అతను రేట్లు పెరిగాయి అని చెప్పి మొత్తం మూడు రూపాయలు వసూలు చేసాడు. ఇంక చేతిలో చిల్లిగవ్వ మిగల్లేదు. చారుదత్తుడి దగ్గర కూడా నయా పైస లేదు. ఇద్దరికీ విపరీతమైన దాహం వేస్తోంది. ఇక్కడైనా తాగటానికి మంచినీళ్ళు దొరుకుతాయేమో అని చూస్తున్నారు. ఎండ మండిపోతోంది. చారుదత్తుడు బజార్లో ఉన్న కుళాయిలు అన్నీ తిప్పి చూసాడు. ఎందులోనూ ఒక్క చుక్క నీరు లేదు. ఏదైనా టీ బడ్డీ దగ్గరకి వెళ్ళి మంచినీళ్ళు తాగడం కుదిరే పని కాదు. ఆ బడ్డీ దగ్గర టీ తాగేవాళ్ళనే అక్కడ మంచినీళ్ళు తాగనిస్తారు. గంగమ్మ తల్లి చల్లటి తియ్యటి నీళ్ళు ఇచ్చి మన నుండి తిరిగి ఏమీ ఆశించదు కదా! అని ఆలోచిస్తున్నారు ఇద్దరూ. గంగ ఒడ్డున ఉండే ఆ యువతీ యువకులు ఇద్దరూ గుక్కెడు నీటి కోసం ఇంత యాతన పడుతున్నారు. చారుదత్తుడు మొండి ధైర్యంతో చారుదత్తుడు ఒక దుకాణంలో దూరి నీటి జగ్గు తీసుకుని బయటకి వచ్చి దేవయానిని ‘త్వరగా దోసిలి పట్టు’ అన్నాడు. ఆమె దోసిలి పట్టగానే, చారుదత్తుడు దోసిలి నిండా నీళ్ళు పోసాడు. ఇంతలో దుకాణదారుడు బయటకొచ్చి – “ఒరే పల్లెటూరు బైతు, ఈ నీళ్ళేమయినా నీ బాబుగాడివి అనుకున్నావా? పద ఇక్కడ నుండి. లేదంటే కాళ్ళు విరగ్గొడతాను” అని నీళ్ళ జగ్గు లాక్కున్నాడు. దేవి ముందు ఇలా మాటలు పడటం చాలా అవమానం అనిపించింది. నిజానికి దేవి కూడా చాలా నొచ్చుకుంది. ఇద్దరూ ఎలాగో మెల్లగా అక్కడి నుండి జారుకున్నారు. గుడ్డిలో మెల్ల కనీసం దేవి దాహం తీరినందుకు చారుదత్తుడికి కాస్త సంతోషంగా ఉంది. కానీ అతని గొంతు ఎండిపోతోంది. పరిగెట్టుకుంటూ గంగలో దూకి, మళ్ళీ జన్మలో దాహం వెయ్యకుండా నీళ్ళు తాగెయ్యాలి అనిపించింది. తనకు నీళ్ళు తాగిపించి చారుదత్తుడు దాహంతో ఉండిపోయాడే అని దేవి మనసు విలవిల్లాడిపోతోంది. నగరం మొత్తం ఎడారి అయిపోయిందా అన్నట్టు అసలు ఎక్కడా వీళ్ళకి తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకలేదు. నగరం దాటి బయటకి రాగానే ఒక పొలం దగ్గర మోటారు పంపు నడుస్తోంది. దాని నుండి వస్తున్న లావుపాటి నీటి ధార అద్దంలా ధగధగ మెరిసిపోతోంది. అక్కడకి వెళ్ళి చారుదత్తుడు దోసిళ్ళ నిండా నీళ్ళు తాగాడు. దాహం తీరిన తర్వాత ముఖం మీద నీళ్ళు చిలకరించుకున్నాడు. రోడ్డు వారగా నిలబడ్డ దేవి వైపు ‘ఇదిగో, నీళ్ళు తాగాను, ఎవ్వరూ నన్ను ఒక్క మాట అనలేదు, నా ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు” అన్నట్టు చూస్తూ నవ్వేసాడు. అతడు అలా నవ్వడం చూసి దేవి పరుగెట్టుకుంటూ వెళ్ళి అతణ్ణి కౌగిలించుకుని “నువ్వు ఎంత మంచివాడివి, ఎంత అమాయకుడివి చారుదత్తా!” అనాలి అనిపించింది. కానీ ఇంతలోనే తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. అతడు ఏమనుకుంటాడో అనిపించింది. ఈసారి చారుదత్తుడి సైకిల్ వెనక కూర్చొన్నప్పుడు కావాలనే శరీరాన్ని అతనికి తాకించింది. ఆమె అలా చేసినప్పుడల్లా, చారుదత్తుడు రెట్టించిన ఉత్సాహంతో సైకిలు తొక్కేవాడు. దేవి దుపట్టా సర్ర్ సర్ర్ మని చప్పుడు చేస్తోంది. ఆ వీచే ఎదురుగాలికి దేవి సల్వార్ కమీజ్ అంతా గాలి నిండిపోయి ఎగురుతోంది.
‘ఓపెన్ స్కూలు’ ఫారం నింపే మిష మీద దేవికి కొత్త ఉత్సాహం వచ్చింది. చారుదత్తుడు కలిసాడు. ఆమెకి దిక్కులన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. అకారణంగా ఏడుపు, నవ్వు కలిసి వస్తున్నాయి. గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపిస్తోంది. ఈమధ్య కుంటి మిసుర్ కోడలు దగ్గరకి వెళ్ళడం కూడా తగ్గించేసింది. ఆవార, వసారా కిటికీ చాటున నిలబడి చారుదత్తుడు ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురుచూస్తూ ప్రేమ పాఠాలు ఎక్కువగా నేర్చుకుంటోంది. అలా చారుదత్తుడి గురించి ఎదురు చూస్తూంటే గుండె వేగంగా కొట్టుకునేది. శరీరం అంతా చెమటలు పట్టిపోయేది. అసలు ఊపిరి ఆగిపోతుందా అనిపించేది. ఇది ఆమెకి కొత్త అనుభవం. చారుదత్తుడు కూడా పని ఉన్నా లేకపోయినా, రోజుకి ఒక్కసారి అయినా వీళ్ళ గుమ్మంలో నుండి వెళ్ళేవాడు. అలాంటప్పుడు ఇద్దరి చూపులు కలుసుకునేవి. ఒకరినొకరు తనివి తీరా చూసుకునేవారు. ఒక కుమ్మరోళ్ళ కుర్రాడు కారణం లేకుండా ఇలా రోజూ బ్రాహ్మల వీథి వెంట తిరగడం అంటే ఏదో అపాయం పొంచి ఉన్నట్టే! ఎవరైనా చూస్తే ఏమంటారు? ఏం అడుగుతారు అని చారుదత్తుడికి కూడా బెరుకుగానే ఉండేది. అయితే దేవి తల్లికి ఇంకా ఈ విషయాలేవీ తెలియవు. వీళ్ళిద్దరి దాగుడుమూతలు ఎన్నో రోజులు సాగలేదు. విషయం మెల్లమెల్లగా ఊరంతా పాకింది. బాగసర్ లాంటి చిన్న ఊరు, పైగా తెలివైన జనాలు, చారుదత్తుడిలో వచ్చిన ఈ మార్పుని పసిగట్టేసారు. అతగాడు ఎప్పుడు, ఎందుకు, ఎన్నిసార్లు, ఎక్కడెక్కడికి వెళ్తాడు లాంటి వివరాలు అన్నీ కూపీ లాగడం మొదలుపెట్టారు. భగత్ ఇల్లు మళ్ళీ ఒకసారి చర్చల్లోకి వచ్చింది – “అసలు భగత్ ఇంటికి ఏమయినట్టు? ఇప్పుడు కుమ్మరోళ్ళ కుర్రాడు ఆ ఇంటి చుట్టు చక్కర్లు కొడుతున్నాడు. ఏదో ఒకరోజు కొంపదీసి ఈ కుర్రాడు, ఆ కుర్రదాన్ని లేవదీసుకుపోడు కదా!” వెంటనే విషయం దేవి తల్లి చెవిన కూడా పడింది. ఒకరోజు కుంటి మిసుర్ భార్య వచ్చి – “ఇదిగో చూడు వదిన, నీ గుర్రం పిల్లకి కాస్త కళ్ళెం వేసి ఉంచు. వేరే పొలాల్లోకి ఎగబడుతోంది. కట్రాడు గుంజతో సహా పారిపోక ముందే మంచి సవారీ చూడు. నీ కూతురు వసారా కిటికీ దగ్గర నిలబడి ఆ కుమ్మరోళ్ళ కుర్రాడితో ప్రేమాయణం సాగిస్తోంది. అసలు ఇలాంటి దిక్కుమాలిన సంతానం నీ కడుపునే ఎందుకు పుట్టినట్టో నాకు అర్థం కావట్లేదు. చెప్పడం నా బాధ్యత. తర్వాత నీ ఇష్టం.” అని వెళ్ళిపోయింది. దేవి తల్లికి ముందు నమ్మకం కుదర్లేదు. భగత్ తో తన పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళయింది. కానీ ఎప్పుడూ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టలేదు. అలాంటిది రెండ్రోజులు అతడి సైకిలు మీద వెళ్తే ఈ ప్రేమ ఎలా పుట్టినట్టు? ప్రేమ కాదు, ఇదేదో అంటురోగంలా ఉంది. రెండు రోజులు కలిసి ఉంటేనే అంటుకునేలా ఉంది. అయినా పక్కింటి ఆమె మాట కొట్టిపారెయ్యలేకపోయింది. విషయం తెలిసి భగత్ కూడా నమ్మలేకపోయాడు. ఇనప్పెట్టెలో దాచిన బంగారు నగ ఒక్కరోజు బయటకి తీస్తేనే కిలమెక్కి పోతుందా? అయితే కూతురు పెద్దదయిపోయిందనీ, వీలైనంత త్వరగా పెళ్ళిచేసి అత్తవారింటికి పంపాలని, ఇన్నేళ్ళుగా ఇనప్పెట్టెలో దాచి ఉంచిన నగని, వెంటనే యజమాని దగ్గరకి చేర్చాల్సిన సమయం వచ్చిందని భగత్ కి అర్థమయింది. మర్నాడే ఒక డజను పోస్టుకార్డులు తీసుకొచ్చి తన కూతురుకి మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడమని చుట్టాలు అందరికీ ఉత్తరాలు రాసాడు. ఉత్తరం చివర్లో ప్రస్తుతం తమని ఊరి వాళ్ళు అందరూ వెలివేసారని, ఆ పరిస్థితులకి అంగీకరించే వారే సంబంధం మాట్లాడుకోవడానికి రావాల్సింది అని కూడా రాసాడు.
సడీ-చప్పుడు లేకుండానే కళ్ళెం బిగుసుకుంది. వసారా కిటికీ దగ్గర నిలబడటం, హ్యాండ్ పంపు దగ్గరకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకు రావడం, మిసుర్ కోడలు దగ్గరకి చదువుకోవడానికి వెళ్ళడం అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. మధ్యాహ్నం-రాత్రి భోజనంలో ఒక్క ముద్ద తక్కువ వడ్డించడం స్పష్టంగా తెలుస్తోంది. దేవి కొన్నాళ్ళు గింజుకుని మెల్లగా సర్దుకుంది. చారుదత్తుడు భయపడి ఆ బ్రాహ్మణ వీధిలో అడుగుపెట్టడమే మానుకున్నాడు.
