టైము రాత్రి ఎనిమిదిన్నర కావొస్తోంది. అయినా ఇంకా పింకీ ఇంటికి రాలేదు. నా టెన్షన్ గ్రాఫ్ ఇంకా ఇంకా పైపైకి పాకిపోతోంది. అసలే శీతాకాలం. త్వరగా చీకటిపడిపోతుంది. ఈ సిటీల్లో రోజూ జరిగే రకరకాల అఘాయిత్యాలు, వాటిగురించి పేపర్లో, టీవీలో వచ్చే వార్తలూ చూసూనే ఉన్నాం. అవన్నీ తలచుకుంటే గుండె గుబగుబలాడుతోంది. ఈ పిల్లలకి మన టెన్షన్లేవీ పట్టవు. పైగా చాదస్తం అంటూ కొట్టిపారేస్తారు. అసలు ఎక్కడుందో తెలుసుకుందామని ఫోను చేస్తేనే నామీద ఇంతెత్తున లేస్తుంది. “మా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎవ్వరూ ఇలా ఫోన్లు చేసి విసిగించరు. ఎప్పుడు చూడు, నాకు ఇదే గొడవ. ఫ్రెండ్స్ ముందు ఎంత తలకొట్టేసినట్టు ఉంటుందో అస్సలు అర్థం చేసుకోరు మీరు.” అని విసుక్కుంటుంది.
అసలు పేరెంట్స్ ఫోను చేస్తే తలకొట్టేసినట్టుండే అంత అవమానం ఏంటో నాకర్థం కాదు. మీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మనాన్నలకి పిల్లలంటే నిర్లక్ష్యమేమో, దానికి నేనేం చెయ్యగలను? నేను వాళ్ళంత దిలాసాగా ఉండలేను. అదే ఆయన ఇంట్లో ఉండి ఉంటే ఐదునిమిషాలకి ఒకసారి ‘కూల్ డౌన్’ ‘కూల్ డౌన్’ అంటూ నాకు సర్దిచెప్పేవారు. నా ప్రాణానికి ఇవాళ ఆయన కూడా ఇంట్లో లేరు. ఆఫీసు టూరు అని చెప్పి వెళ్ళి రెండురోజులైంది. ఈ టెన్షనంతా ఇప్పుడు నా నెత్తిమీదే పడింది.
కాలుగాలిన పిల్లలా ఈ హాల్లోనే ఎంతసేపని తిరుగుతానులే అని చెప్పి శాలువా కప్పుకుని బయట గేటుదగ్గరకి వెళ్ళి నిలబడ్డాను.
“అమ్మాయి కోసమా?” చీకట్లోంచి ఒక ప్రశ్న బాణంలా దూసుకొచ్చింది. తీరా చూస్తే పక్క వాటా పెద్దావిడ శాలువా కప్పుకుని కుర్చీలో కూర్చుని ఉంది.
అటుపక్కకి తిరిగి నవ్వి ఆవిణ్ణి పలకరించాను. ప్రహారీ గోడకి ఆనుకుంటూ – “చూడండి పిన్నిగారూ, ఇంత రాత్రి ఆడపిల్ల ఒంటరిగా వస్తుంది అంటే మరి నాకు ఆమాత్రం టెన్షన్ ఉండదా? మీరే చెప్పండి!” అన్నాను.
“మీ పిల్ల ఏం ఒంటరిగా రాదు. ప్రతీ రోజూ ఒక కుర్రాడు బండి మీద తీసుకొచ్చి దింపి వెళ్తాడు.”
నేను ఆశ్చర్యపోయి ఆవిడికేసి చూసాను. పింకీ ఆవిడకి ‘టోల్ గేట్’ అని పేరు పెట్టడంలో ఏం తప్పు లేదనిపించింది.
ఆ పెద్దావిడ వాకిట్లో కుర్చీ వేసుకుని కూర్చుని వీథిలో ఎవరింట్లో ఏం జరుగుతోందో అంతా ఆరా తీస్తూ ఉంటుంది. ఆవిడ మాటలకి నా మనసు కాస్త నొచ్చుకుంది. నేను కూడా కాస్త చురక పెడుతూ – “అయినా చలిలో ఇంత చీకటిపడే వరకు మీరు బయట ఏం చేస్తున్నట్టు?” అని అడిగాను.
“మా అబ్బాయి ఆఫీసు నుండి ఇప్పుడే వచ్చాడు. వాడు ముఖం-కాళ్ళూ-చేతులు కడుక్కుని, కాస్త టీ తాగి స్థిమితపడ్డాక అప్పుడు నేను లోపలకి వెళ్తాను.” అంది.
“అవునా? ఎందుకలా?”
“అయ్యో! ఏం చెప్పమంటావమ్మా! నేను కనిపిస్తే వచ్చి నా పక్కన చేరతాడు. ఇంక నాతో ఆఫీసు కబుర్లు, అవీ-ఇవీ ముచ్చట్లు చెబుతూ ఉంటాడు. అది నా కోడలుకి నచ్చదు. ‘ఇంతకాడికి నన్ను పెళ్ళి చేసుకోవడమెందుకు? అమ్మ కొంగుపట్టుకునే ఉండలేకపోయారా?’ అని దెప్పిపొడుస్తూ ఉంటుంది.” – అంటూ ఆ పెద్దావిడ శాలువా మరింత బిగించి దగ్గరకి లాక్కుంది.
‘ఇంటింటి రామాయణం’ అనుకుంటూ నేను మౌనంగా ఉండిపోయాను. అయినా ఎవరింటి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి. ఇందులో బయటివాళ్ళు చెయ్యగలిగింది మాత్రం ఏముంది? నాకున్న తలకాయనొప్పులతోనే పడలేకపోతోంటే ఇంక ఇరుగు-పొరుగు పంచాయితీలు ఎక్కడ తలకెత్తుకునేది?”
ఎక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నా ‘సమస్య’, అదే మహారాణి పింకీ గారు వేంచేసారు. వెంట ఆ కుర్రాడు కూడా ఉన్నాడు.
పింకీ గేటు బయట నుండే – “అమ్మా, ఇంత చలిలో ఇక్కడేం చేస్తున్నావు?” అంది నన్ను చూసి. ఆ కుర్రాడు కూడా నన్ను చూసి – “నమస్తే ఆంటీ!” అన్నాడు.
“రా బాబూ, లోపలకి రా. వేడివేడి ఫిల్టర్ కాఫీ ఇస్తాను.”
స్కూటరు బయటే పార్క్ చేసి ఆ కుర్రాడు నిర్మొహమాటంగా లోపలకొచ్చాడు.
“ప్రతీ రోజూ అటు నుంచి అటే వెళ్ళిపోతావు. మొత్తానికి ఇవాళ దొరికావు.”
“అసలు ప్రియాంక నన్ను ఎప్పుడూ లోపలకి రమ్మని పిలవనే లేదు ఆంటీ. నన్ను రోజూ రమ్మన్నా వచ్చి మీ చేతి కాఫీ తాగి వెళ్తాను.” అంటూ నవ్వేసాడు.
నేను గబగబా కాఫీ కలిపి, ప్లేట్లో కొన్ని జంతికలు పెట్టి పట్టుకొచ్చాను. కాఫీ తాగే ఆ కాసేపట్లోనే ఆ కుర్రాడి పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆరా తీసాను.
ఆ కుర్రాడు అటు వెళ్ళగానే నాలో నేను అనుకుంటున్నట్టు ‘కుర్రాడు మంచివాడిలాగే ఉన్నాడు’ అని పైకి అనేసాను.
“కొంపతీసి వీణ్ణి గానీ నాకు అంటగట్టాలని చూడట్లేదు కదా! పదినిమిషాల్లోనే వాడి వంశవృక్షం, పుట్టుపూర్వోత్తరాలూ అన్నీ కూపీ లాగావు. అందుకే అనుమానం వచ్చి అడిగాను.”
“తప్పేముంది?”
“నో మమ్మీ – హి ఈజ్ జస్ట్ ఏ ఫ్రెండ్.” కోచింగ్ సెంటరుకు తీసుకెళ్ళి-తీసుకురావడం వరకు పనికొస్తాడు. అంతే. పెళ్ళికి మాత్రం అస్సలు సరిపోడు. అయినా ఇంత సాదాసీదా వాడితో పెళ్ళి నేను కనీసం ఊహించుకోలేను కూడా!”
“క్యాట్ కి ప్రిపేర్ అవుతున్నాడంటే కాస్తో కూస్తూ తెలివైనవాడే అయ్యుంటాడుగా!”
“నా మొహం. ఇది మూడోసారి.”
“అక్కడికి నువ్వేదో మొదటిసారికే సాధించేసే దానిలా మాట్లాడుతున్నావే.”
“నీకు చెప్పి అనవసరం” అని విసుక్కుంటూ బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయింది.
***
అసలు ఈ అమ్మాయిలని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కిందటి ఏడాది ఎవరో సునీల్ అనే కుర్రాడితో స్నేహం. ఇద్దరూ కాలేజీ తరఫున ఎన్నో టేబుల్ టెన్నిస్ మ్యాచ్ లు కూడా ఆడారు. ఏమయిందో ఏమో, ఉన్నట్టుండి ఆ కుర్రాడు ఇంటికి రావడం మానేసాడు. ఏమయిందని పింకీని అడిగితే – “ఆ మహానుభావుడు ఆటలోనే కాకుండా జీవితంలో కూడా ‘పార్టనర్’ అవ్వాలని కలలు కంటున్నాడు. హౌ రబిష్!” అంది.
ఇంకొక కుర్రాడు ఉండేవాడు రజిత్ అని. రెండు-మూడు నాటకాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు కూడా. కుర్రాడు అందగాడు, ఆస్తిపరుడు. నాకైతే గుణవంతుడు కూడా అనిపించాడు. అయితే పింకీ మాత్రం, “అమ్మా! వాణ్ణి కానీ స్టేజిమీద కాకుండా బయట విడిగా చూస్తే వాంతుకొస్తుంది.” అంది.
“అలాంటప్పుడు అతగాడితో కలిసి తిరగడం ఎందుకు?”
“బికాజ్ హి ఈజ్ ఎ ఫైన్ యాక్టర్.”
“రేపటిరోజు పెద్ద సినిమా హీరో అయిపోతే ….”
“నో ఛాన్స్ మమ్మీ. వాడు ఒఠ్ఠి లోకల్ హీరో. సినిమాల్లో చిన్న-చితక పాత్రలకోసం వందలాది మంది చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అక్కడ వీణ్ణి ఎవ్వరూ కనీసం చూడనుకూడా చూడరు.”
“అమ్మాయిలకి అతగాడు ‘కలల రాజకుమారుడ’ని విన్నాను.”
“అమ్మాయిలకి మెదడు మోకాల్లో ఉంటుది. అందుకే వీడిలాంటి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు.”
“నీ దృష్టిలో అసలు ఎవరైనా ‘మిస్టర్ పరఫెక్ట్’ ఉన్నారా?” అని అడగాలని నాలుక చివరివరకు వచ్చి ఆగిపోయాను.
***
ఆరోజు కాలేజి నుంచి వస్తూనే పింకీ, “కాస్త విటమిన్ ‘ఎమ్’ ఇవ్వమ్మా. పార్లర్ కి వెళ్ళాలి” అంది.
“ఇప్పుడు ఎందుకు? కాలేజీలో ఏమన్నా ఫంక్షన్ ఉందా?”
“ఫంక్షనే, కానీ కాలేజీలో కాదు. ఒక బర్తడే పార్టీ కి వెళ్ళాలి. కార్తీక్ ఈజ్ థ్రోయింగ్ ఏ పార్టీ.”
“కార్తీక్! ఇన్నాళ్ళూ ఏమయిపోయాడు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?”
“ఎక్కడికీ పోలేదు. ఇక్కడే ఉన్నాడు. పి.జి. చేస్తున్నాడు కదా! చదువులో బిజీ అయిపోయాడు అంతే.”
“మరి ఉన్నట్టుండి ఇప్పుడు నువ్వెందుకు గుర్తొచ్చావు?”
“ఇందులో గుర్తొచ్చేది ఏముంది? అసలు నేను మరచిపోనిస్తే కదా! ప్రతీ ఏడాది తన పుట్టినరోజుకి విష్ చేస్తూనే ఉంటాను. న్యూ ఇయర్ కి విష్ చేస్తాను. తనూ జవాబు ఇస్తూ ఉంటాడు. ఆఁ అయితే తను పార్టీ ఇవ్వడం మాత్రం ఇదే మొదటిసారి అనుకో.”
కార్తీక్ పార్టీకి బాగా అలంకరించుకుని వెళ్ళింది పింకీ. మాటిమాటికీ – “అమ్మా, ఎలా ఉన్నాను? మేకప్ మరీ ఓవర్ గా లేదు కదా? చీర కుచ్చిళ్ళు అవీ సరిగ్గా వచ్చాయా? నాకు ఈ చీర నప్పిందా? ఎబ్బెట్టుగా అయితే లేదు కదా?” అంటూ బయలుదేరే వరకు రకరకాల ప్రశ్నలు వేస్తూనే ఉంది. పింకీ నిజంగా భలే అందంగా ఉంది. నా దిష్టే తగిలేలా ఉంది. జడ కూడా తీరువగా అల్లుకుంది. బట్టలు కూడా చాలా శ్రద్ధగా వేసుకుంది. ఎప్పట్లా ఏదో హడావుడిగా చేతికి దొరికిన చున్నీ తగిలించుకుని పరుగెట్టలేదు. ఆ హడావుడి అంతా చూస్తూంటేనే ఎవరినో ఇంప్రెస్ చెయ్యడానికి ఆతృతత పడుతోందని అర్థమయిపోతోంది.
అయితే ఈ హడావుడి అంతా చూసి నాకూ సంతోషంగానే ఉంది. కార్తీక్ చాల మంచి కుర్రాడు. చాలా ఏళ్ళ క్రితం వాళ్ళు మా పక్కింట్లో ఉండేవాళ్ళు. కార్తీక్ చెల్లెలు కీర్తి, పింకీ క్లాస్ మేట్స్. అమ్మనాన్నలు ఇద్దరూ డాక్టర్లు అవ్వడంతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. అందుకే కీర్తి రోజులో ఎక్కువసేపు మా ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేది.
కొన్నాళ్ళకి వాళ్ళు ఇల్లు మారారు. కానీ, ఒకే క్లాసు అవ్వడంతో పింకీ, కీర్తిల స్నేహం మరికొంత కాలం కొనసాగింది. ఇంటర్ తర్వాత కీర్తి కూడా తన అన్న బాటలోనే మెడిసిన్ లో జాయినయ్యింది. దానితో ఇంక రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. అయితే పింకీ, వాళ్ళతో, మరీ ముఖ్యంగా కార్తీక్ తో ‘టచ్’ లో ఉన్నట్టు ఇప్పుడే తెలిసింది. సంతోషంగా కూడా అనిపించింది. పార్టీకి బయలుదేరేటప్పుడు పింకీతో – “త్వరగా వచ్చెయ్. ఒంటరిగా ఆటోలో రావద్దు. ఎవరైనా తెలిసినవాళ్ళ కార్లో రా.” ఇలా వంద జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాను.
పింకీకి ఇవన్నీ నచ్చకపోయినా తల ఆడిస్తూ వింటూనే ఉంది. వాళ్ళ నాన్నకే ఇంక చిరాకేసి – “ఆపుతావా నీ నస? అదేం ఇంకా చిన్నపిల్ల కాదు. చూడు ఎంత పెద్దదయిందో. నీకెప్పుడు అర్థమవుతుంది?”
“చిన్నపిల్ల కాదు. పెద్దదయిందనే కదా! నా బెంగ కూడా. కానీ మగవాళ్ళకి ఇవేమీ అర్థం కావు. ఈ తంటాలు, బెంగలు అన్నీ, తల్లి బాధ్యతే అనుకుంటారు.”
***
రాత్రి పార్టీ నుంచి వచ్చేసరికి బాగా పింకీ అలసిపోయింది. షరా మామూలే! అందులో పెద్ద ఆశ్చర్యపోయేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజుల్లో పార్టీ అంటే ఏదో ఇంత తిన్నామా, కాస్త జ్యూస్ తాగామా, నాలుగు పాటలు విన్నామా అన్నట్టు ఉండట్లేదు. డ్యాన్స్ ఫ్లోరు దద్దరిల్లేలా కుప్పిగంతులు, చెవులు పగిలిపోయేలా డి.జె. సౌండ్.
“పార్టీ ఎలా జరిగింది?” అడిగాను నేను.
“అఁ బాగానే జరిగిందిలే” అంటూ పొడిపొడిగా జవాబు చెప్పి తన బెడ్ రూములోకి వెళ్ళిపోయింది. నాకు భలే ఆశ్చర్యమేసింది. మామూలుగా అయితే అసలు నేను అడిగే అవసరమే ఉండదు. అయ్యో, అర్ధరాత్రయింది, అమ్మకి నిద్రొస్తుందేమో అని కూడా ఆలోచించకుండా పార్టీలో ఏం జరిగిందీ పూసగుచ్చినట్టు కనీసం అరగట చెప్పుకొస్తుంది. కానీ ఇవాళ నేను అడుగుతున్నా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయింది. పార్టీకి వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఏమయిపోయిందో!”
పొద్దున్నే టీ తాగుతూ వాళ్ళ నాన్న రాత్రి పార్టీ గురించి అడిగితే –“పార్టీకేం, బ్రహ్మాండంగా జరిగింది. జరగాల్సిందే కూడాలే. తన ఎంగేజిమెంటు అనౌన్స్ చెయ్యడానికి ఇచ్చిన పార్టీ కదా! ఆమాత్రం ఉండాలి మరి! నాకూ అక్కడికి వెళ్ళాకే తెలిసింది.”
“అరే వాహ్, సూపర్. ఎవరా అమ్మాయి?”
“తన క్లాస్ మేట్. ఇద్దరూ కలిసి పి.జి. చేసారు.”
“అంటే, కుటుంబం అంతా డాక్టర్ల సైన్యం అన్నమాట. తన నర్సింగ్ హోమ్ మరికాస్త పెద్దదవుతుంది.”
“అందులో అనుమానం ఏముంది? అది ఏం మామూలు హాస్పిటల్ కాదు. ఇంక అక్కడ పెద్ద పెద్ద సర్జరీలు కూడా చేస్తారు. అందుకే కార్తీక్ ఆ తింగరిదాన్ని పెళ్ళి చేసుకుంటున్నాడు. ఆమెకి పి.జి. లో సీటు రాకపోయి ఉంటే ఆమెకేసి కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. వేరే అమ్మాయిని పడేసేవాడు.” ఎంతో కచ్చిగా అంది పింకీ.
“అంకుల్-ఆంటీ కూడా ఆమె డిగ్రీ చూసే ఒప్పుకున్నారు. లేకపోతే కార్తీక్ పర్సనాలిటీ ఎక్కడ? ఆమె ఎక్కడ? ఇట్ ఈజ్ ఏ బిజినెస్ డీల్ ఆల్ ఇన్ ఆల్” అంటూనే పింకీ కీచుపోయిన గొంతుతో “డాడీ, ఈరోజుల్లో జనాలు ‘లెక్కలేసుకుని’ ప్రేమిస్తున్నారు” అంది.
పింకీ బాధ నేను తట్టుకోలేకపోయాను. ఒక్కసారి కౌగిలించుకుని ఓదార్చాలనిపించి మళ్ళీ అంతలోనే – “పింకీ! ఇందులో కార్తీక్ తప్పేముంది? తన లాభ-నష్టాలు చూసుకోవడం ఈ తరానికి మామూలయిపోయింది. నువ్వు చేస్తున్నది మాత్రం ఏంటి? నువ్వూ ఆ తానులో ముక్కవే కదా!” అని చెప్పాలనిపించింది.
అయినా గుండెలు పగులేలా ప్రేమించే ఆ తరం ఎప్పుడో కనుమరుగయిపోయింది …. అంతరించిపోయింది. అలాంటి ప్రేమలూ, ప్రేమికులు ఇప్పుడు చరిత్ర శకలాలుగా మిగిలిపోయారు…!!!
