‘Winter is here’ సాగర్ దగ్గరగా వచ్చి నా చెవిలో గుసగుసలాడినట్లైంది గాలి తగలగానే. కొన్నికొన్ని వాసనలకీ, స్పర్శలకీ ఎప్పటివో జ్ఞాపకాలు గిచ్చినట్లవుతాయి. చలికాలం మొదలైనట్లు ఎలాగో తెలిసిపోయేది చిన్నప్పుడు. వున్నట్టుండి ఒకరోజు గాలి మారిపోయేది. ఓ రకమైన మగతపూల వాసన గాలితో వచ్చి తగిలినప్పుడుముక్కుపుటాలు కొంచెం మంటగా అనిపించి పొడిగాలికి పెదాలు తడారిపోయి పొట్లిపోయేవి. కాళ్ళకీ చేతులకీ కొబ్బరినూనె పట్టించి పగిలిన పెదాలకి వెన్నపూస రాసేది అమ్మ . అటక మీద గొంగళి తీసి ఉతికిచ్చి ట్రంకుపెట్టెలో స్వెట్టర్లు తీసి అందరికీ బట్వాడా చేసేది. ఇదంతా కలిపి ఒక టెన్షన్ క్రియేట్ అయ్యేది. తెల్ల చామంతులూ, పచ్చ చామంతులూ, చిట్టి చామంతులూ తోటలో మిగిలిన పూలవాసన్ని డామినేట్ చేసేవి. పనంతా అయిపోయాక, అమ్మ స్నానం చేసి తల్లో చామంతులు పెట్టుకుని వీధి గుమ్మంలో కూచునేది. తన వెనకగా కూచోని, మెడ చుట్టూ చేతులేసి కోటయ్య పెదనాన్న వాళ్ల పెంకుటింటి మీదగా మిణుకుమిణుకుమనే చుక్కల్ని చూడ్డం భలే వుండేది. ఇంత డ్రామా వుండేది లైఫ్‌లో. చిన్నచిన్న సంతోషాలూ, ఎక్సైట్మెంట్లలన్నీ వయసుతోపాటు బండబారిపోడం ఎప్పటికప్పుడు తెలుస్తూనే వుంటుంది. కానీ ఆ హెల్ప్‌లెస్‌నెస్‌ని ఏం చేయగలం? ఆరో నెంబర్ ప్రమాద ఘంటికలాంటి హెచ్చరిక లాంటివేవీ జారిచేయకుండానే జీవితం అమాంతం మీద పడుతుంది. పడి లేచి దానితో కుస్తీ పడటంతోనే ఎన్ని సెన్సిబిలిటీస్ సైలెంట్‌గా చచ్చిపోతాయో మనకి గుర్తు కూడా వుండదు. ఒక్కోసారి వెనక్కి తిరిగి పారిపోదామనిపిస్తుంది. ఇంకొకళ్లని మిస్ అవ్వడం కంటే, నా పాత నన్నే ఎక్కువ మిస్ అయినట్లనిపిస్తది. పెసిమిస్ట్ అంటే అన్నారు గానీ, నిన్నల్లో మొన్నల్లో అన్నీ అందంగా అనిపిస్తాయి. బాధ కూడా కొన్నాళ్లు పోయాక, అప్పటి తీవ్రత పోయి రొమాంటిసైజ్ అవుతుంది. ఇది పనికి రాని డిప్రెసివ్ నోస్టాల్జియా ఏం కాదు. కొండలూ గుట్టలూ ఎక్కి, రాళ్లూరప్పలూ తగిలి, మోకాళ్లు డోక్కుపోయి బొటనివేలు నుండి కారే రక్తంతో కాళ్లీడ్చుకుంటూ కొండ చివర నుంచొని చూసినప్పుడు ఆ ప్లేస్‌కన్నా, అక్కడి దాకా వచ్చిన దారే అందంగా కనపడదూ? వెనక్కి పోయే వీలులేక ముందుకు నడుస్తున్నాం అనిపించని వాళ్ళెంతమంది?
ఎందుకో అనుకోకుండా “మొదటి అనుభవం” సినిమాలో పాట గుర్తొచ్చింది . ఆ పేరు చాలా మెమరీస్‌ని ట్రిగ్గర్ చేస్తుంది విన్న ప్రతిసారీ. చుట్టింటి ముందు కూచొని, అమ్మ కాచే నెయ్యివాసన చూసినప్పుడు ఫస్ట్‌టైం అమృతంతో ఆ వాసన్ని పోల్చుకోడమూ, పద్నాలుగేళ్లప్పుడు చాటుగా దాచుకొని పిల్లలు పుట్టడం మొదటిగా చూసినప్పుడు కలిగిన ఆశ్చర్యమూ వికారమూ, మొదటి మగ స్పర్శా, ఫస్ట్ ఎవర్ బ్రేకప్, మొదటి ముద్దూ అన్నీ అన్నీ గిర్రున తిరుగుతాయి బుర్రలో. మొదట ముద్దు పెట్టుకున్న అబ్బాయి మొహం ఇప్పటికీ స్పష్టంగా గుర్తురాదు. ఆ ముద్దు రుచి ఎలా వుండిందో ఎంతకీ జ్ఞాపకం రాదు. కొత్త కాపురానికెళ్లేప్పుడు బీహార్ దాకా ఒక్కదాన్ని పంపించలేక, అక్కతో పాటు అరణంగా నన్ను కూడా పంపించాడు నాన్న. ఆ నార్త్‌లో అయిదు నెలల ఎక్స్ర్టీమ్ వింటర్‌ని అక్కాచెల్లెళ్లం ఎలా సర్వైవ్ అయ్యామో మాకే తెలియదు. ఇంటి ముందు కళ్లాపి చల్లడానికీ, గిన్నెలు కడగడానికీ కూడా నీళ్లు కాచుకునేవాళ్లం. అలాంటి చలికాలపు ఉదయాల్లో మంచుని చేతితో బూజు తీసినట్లు జరుపుకుంటూ, చిన్న గౌనేసుకుని బుట్ట పట్టుకొని ఆర్మీ క్వాటర్స్‌కి కొంచెం దూరంలో వున్న క్యాంటిన్‌కెళ్లి పాలపాకెట్లు తెచ్చేదాన్ని. క్యాంటిన్‌లోకెళ్లగానే ఓ పదహారుపదిహేడేళ్లబ్బాయి కౌంటర్ మీదినుంచే, చేతులు వేడిచేసి నా చెంపల మీద పెట్టేవాడు. దాదాపు రోజూ చేసేవాడలాగ. చిన్నదాన్ని కదా అలా చేసేవాడేమో అనుకునేదాన్ని. లేదులేదు అప్పుడలా అనుకునేంత జ్ఞానం లేదు లక్కీగా. ఇప్పుడనిపిస్తుంది గుర్తుచేసుకుంటే అలాగని. ఐదునెల్ల తర్వాత ఇక మేం ఊరెళ్లిపోతున్నామని చెప్పటానికి వెళ్తే, ఒక బర్ఫీ చేతిలోపెట్టి, ఒంగి పెదాలమీద ముద్దు పెట్టాడు. గుమ్మం దగ్గరకెళ్లి వెనక్కి తిరిగి చూశాను. కళ్లనిండా నీళ్ల తో తెల్లటి పిల్లాడి బుగలు ఎర్రెర్రగా కందిపోయాయి. గుమ్మం దగ్గర పదేళ్ల ఆ పిల్ల-కౌంటరకవతల ఆ పదిహేడేళ్ల పిల్లాడు… ఆ ఫ్రేమ్ అలా ఫ్రీజ్ అయిపోయింది. కానీ ఆ ముద్దు టేస్ట్ ఎలా వుండిందో అని గుర్తు రాదు ఎంత గింజుకున్నా.
You easily get carried away. “ఒక్క నిమిషం వదిలేస్తే ఆలోచనల్లో పడిపోతావ్” సాగర్ మళ్ళీ నా చెవిలో అన్నట్లే స్పష్టంగా వినిపించింది. చూస్తే ఎదురుగా తను లేడు. కొద్దికొద్దిగా మంచు పడటం అప్పుడే మొదలైంది. ఇలా రాలే మంచుని చూసి స్మశానం నుంచి బూడిద తెచ్చి, ఎవరో ఆకాశం నుంచి చల్లినట్లనిపిస్తుంది అన్నాడోసారి. ఎందుకలా అబ్సర్డ్‌గా మాట్లాడతావంటే life itself is absurd అనేవాడు. తిరిగితిరిగి తను ఈ ప్లేస్‌ను ఎంచుకోడం ఆశ్చర్యం. నార్త్ నాకసలు దొబ్బదు మాన్, ఆ హిందీ వాళ్ల యాసా, ఆ జనాలూ నావల్ల కాదనేవాడు. ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాల్రోజులొచ్చి చూసి తిరిగి వెళ్లిపోడం తప్ప నాక్కూడా ఇది ‘నా దేశం’ అనే ప్రత్యేకమైన ఫీలింగ్ ఏంలేదు, అన్‌లెస్ బాక్‌గ్రౌండ్లో ఎవరైనా జనగణమన పాడితే తప్ప. ఆల్ఫ్స్ యెంతో, వింధ్య హిమాచల్ అంతేగా. Geographically miles apart. అయినా భాగాలేసుకొని ఇయి నా కొండలూ, అయి నా లోయలు… ఈ పంపకాలు విచిత్రం. ఇండియాని బ్రిటిష్ ఇన్వేడ్ చేసివుండకపోతే, యురోపియన్ యూనియన్ లాగా ఇండియన్ యూనియన్ అనేవాళ్లేమో. అక్కడ లాగా ఇక్కడ కూడా బోలెడన్ని బుజ్జిబుజ్జి దేశాలుండేవి. మంచు కొంచెం డెన్స్‌గా పడటం స్టార్ట్ అయింది. మనుషులంతా కొత్త, భాష తెలిసినా చుట్టూ అదో స్ట్రేంజ్ ఆంబియన్స్. లోపల వెచ్చగా వున్నా, కేఫ్ బయట మంచులో తడుస్తూ తనకోసం చూస్తూ కూచోడం బావుంది. అట్టే ఒళ్లు దాచుకోవాలని కూడా లేదు. ఎక్కడినుంచొస్తుందో ఈ గాలి. ఈ చలికాలపు గాలి నాకెప్పుడూ గుర్తే. ఒక్కోసారనిపిస్తుంది my life is made up of only winters అని. పూలబాసలు ఎంకికి తెలిసినట్లు, ఈ గాలికన్నీ తెలుసునిపిస్తుంది. ఎక్కడో సైబీరియా మైదానాల మీద నుంచి గోబీ ఎడారులపైగా ప్రయాణం చేసి, ఈ హిమాలయాలని తట్టుకొని ఇక్కడే నిలిచిపోయిన ఈ గాలిలో ఏదో తెలియని మార్మికత ఉంది. ఈ నేల మీద నడిచిన మొదటి మనుషులెవ్వరో? భాషొచ్చాక మాట్లాడుకున్న మొదటి మాటలేవైయుంటాయో? ఆ సమూహాల గుసగుసలు గాలిలో రాసిపెట్టి వెళ్లినట్లు ఈ గాలి తగిలినప్పుడు ఒళ్లు గగుర్పొడిచి ఎక్కడినుండో ఏవేవో గొంతులు వినిపిస్తాయి. అర్థమయ్యీ కాని భావం సతమతం చేస్తుంది. వేలమైళ్ల అవతలి నుండి అవ్యక్తంగా పిలిచినట్లు ఏవో రహస్యాలు చెప్పినట్లు ఉక్కిరిబిక్కిరైపోతాను. వెళ్లినవాళ్లంతా ఈ దారినే నడిచిపోయుంటారా ? మనం చూడలేని వాళ్ల పాదముద్రల్లో అడుగులేస్తూ మనమెక్కడికి పోతామో !.ఈ అనంత ఆకర్షణ లోకి నన్నేదో లాక్కెళ్లిపోతున్నట్లు మనసు గతితప్పుతుంది.
Down the South wintersకీ, నార్త్‌లో వింటర్స్‌కీ ఎంత తేడా! అక్టోబర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. శరద్మాసపు వెన్నెల్లో చిటికెడు మంచు కలిపినట్లు నులివెచ్చని చలి అక్కడిది. మంటకి కాగినట్లు ఇక్కడి చలి కాల్చి ఒంటిని కోసేస్తుంది. బాడీ నంబ్ అయి, స్పర్శలేకుండా పోతుంది. నిపిల్స్ సెన్సిటివ్‌గా అయ్యి భరించలేనంత నొప్పేస్తాయి. వాటిని తాను కాపాడతానని చేతులడ్డుపెట్టి వెంటపడేవాడు. చెప్పుకోలేనంత సిగ్గేసేలా మోహించాడు. తననెప్పుడైనా ప్రేమించానా? అనడుగుతుంది మనసు. అసలు ప్రేమంటే ఏంటని తెలిస్తేగా! తనని ప్రేమించానో లేదో తెలియడానికి. ప్రేమనే పదార్థపు చుట్టుకొలతలూ, లోతుపాతులూ తెలిసిన మనుషుంటే చెప్పాలి. చిక్కటి నలుపుతెలుపుల్లో వుండదు, life is always this abstract. ఎంత సింపుల్‌గా వుందామనుకుంటే అంత గజిబిజి దారుల్లో నడస్తుంది. అనుకున్నవి అనుకున్నట్లుగా ఏ కొద్దిమందికో తప్ప జరగవేమో. నడక తడబడుతున్నా అడుగులొక్కోసారి అటుఇటుగా పడతాయి. కుడి ఎడమైతే పొరపాటు లేదని కవి ఎంత మధనపడి పాడుకున్నాడో! ఒక్కోసారి బాధకి సరండరై, మనల్నిమనమలా వదిలేసుకోడం నిజంగానే సుఖం. కొలబధ్ధలతో మంచిచెడులెంచే మనుషులకి నా కథ ఏమని చెప్పుకోడం.
సత్య జ్ఞాపకాలింకా తడిగానే వున్నాయి. కలుసుకున్నంతసేపు పట్టలేదు విడిపోడానికి. ఎందుకు సత్య మీద అంత ప్రేమైందంటే ఎట్లా చెప్పడం? అయినట్లు కూడా చాలా రోజులు అర్ధం కాలేదు. వుట్టి ఇష్టం అనుకున్నానేమో కూడా. తన లైఫ్‌లో ఎవరూ లేనప్పుడు చెప్పలేదు నువ్వంటే ఇష్టమని. ఆ తర్వాత చెప్పే అవసరం రాలేదు. కానీ ఓరోజు కోపంకొద్దీ నన్ను తనేదేదో అరిచేసరికి తమాయించుకోలేక చెప్పేశాను. చెప్పడమైతే చెప్పాను కానీ చెప్పేసాక, మనసు మనసులో లేదు. అర్ధం లేని పని చేసానేమో ! ఎక్కడికి పోతుందీ దారి? బోలెడన్ని ప్రశ్నలు. ఆ రోజు రంజాన్ అనుకుంటా. సత్య కాల్ చేశాడు కలుద్దాం ఓసారని. ఇష్టంగా ఉంది కానీ ఆ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్‌లో అదోరకమైన బెరుకు. మనసు అటుఇటుగా పోతోంది. తనొస్తున్నాడనే ఎక్సైట్‌మెంట్ ఓ పక్కా, ఎందుకిదంతా అని మరో పక్కా. లైట్స్ ఆఫ్ చేసి, ఇల్లంతా దీపాలు పెట్టి, నల్లటి చీర కట్టుకుని, తల్లో బోలెడన్ని జాజులు పెట్టుకున్నా. చాలా చీకటైపోయింది తానొచ్చేసరికి. ఆ రాత్రి అబద్ధమంత నిజం. చాలాసేపటిదాకా ముట్టుకోడానిక్కూడా సంశయించాడు. దగ్గరికి తీసుకుని అలా ఉండిపోయాడు తెల్లవారేదాకా !! ఇద్దరికీ కలగానే ఉంది. చుట్టూ ఇల్లంతా కలయజూసి, నా మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, మొదటిసారి అంత దగ్గరగా చూశాడు. “సిల్క్‌స్మితలా వున్నావు అచ్చం” అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూసా తనని. ఆమె తన యవ్వనపు రాత్రులను వెలిగించిన దేవకన్య అని, వెలిగే కళ్లతో ఆమెను ఎంతగా ప్రేమించాడో చెప్పాడు. మురిపాల ఆ రాత్రి కొవ్వొత్తులతో పాటు కరిగిపోయింది. విడిచిపెడితే దొరకదేమో అనేంత అపురూపంగా ఒకరిచేతులొకరం పట్టుకుని ఉదయంలోకి నడిచిపోయాం. రాత్రీ, పగలూ మనసొకలాగే వర్తించదు. మధురోహాలు తేలిపోయి, మబ్బులు విచ్చుకున్నాక మిట్ట మధ్యాహ్నపు ఎండ వాస్తవంలా చుర్రుమంది. అదే మొదటీ, చివరీ కలయిక!! ఆశలు అంత త్వరగా వాడిపోవుగా… కానీ ఒట్టు పెట్టుకున్నాం. ఇక ఎప్పుడూ ఇలా కలుసుకోవద్దని. తేనెతుట్టిని కదిపితే ఊరుకుంటుందా… ఆ రాత్రి మైకం త్వరగా వదల్లేదు నన్ను. తను నా ముందే ఎవరెవరితోనో కనిపించడం కష్టంగా ఉండేది. సత్య అలాగని నాకు తెలిసినా, తనని అర్ధం చేసుకున్నా, అప్పుడప్పుడూ బుద్ధి అదుపుతప్పి కొపమొచ్చేది తనమీద. అదీ అర్థం లేనిదే. కానీ ఇద్దరి మధ్యా పలచటి తెరలాంటి ఆకర్శణ కనీకనిపించకుండా ఊగుతూ వుండేది. లోకరీతికి తగదని చెప్పుకున్నా, మనసుకి ఏ తాళం వేస్తాం? సత్యలో వుండే ఇన్‌డిఫ్రెన్స్, వల్నరబిలిటీ, రెక్లెస్‌నెస్ వెనక ఓ రకమైన పిరికితనం వుందనిపించేది. నేను కావాలి కానీ అందుకోలేడు. పోనీ దూరంగా వుండి, స్థిమితంగా వుంటాడా అంటే ఏదో ద్వైదీ భావంలో కొట్టుకునేవాడు. తనొకింత స్వార్థంగా ఆలోచించినట్లనిపించినా సత్య మీద ఇష్టం పోలేదెప్పుడూ. చిన్నపిల్లాడి ఉడుకుమోత్తనం సత్యది.
నన్ను నేను ఏ తక్కెడ లో వేసి తూచుకోవాలో తెలియదు. అసలు నన్ను నేనైనా యాక్సప్ట్ చేసానో లేదో కూడా అర్థం కాదు. గాలివాటుకి కొట్టుకుపోడం, ఏ తీరానికీ చెందకపోడం ఎంత శాంతి ! టైం చాలా గడిచింది. వస్తాన్న సాగర్ ఇంకా రాలేదు. లోపల్లోపల ఆత్రంగా వున్నా కాల్ చేయాలనిపించలేదు. మంచుతోపాటు మెల్లగా చీకటి కలిసి కురుస్తుంది.వెన్నెల మరకల్లో తడిచి మనుషులు వింతగా కనిపిస్తున్నారు. యునివర్సిటీ క్యాంపస్‌లో వున్నప్పుడు బాగా రాత్రయ్యాక, దారి పక్కన మోరీ మీద పడుకుని పైకి చూస్తే… తురాయి చెట్ల మధ్యనుంచి మసకగా కనిపించిన చంద్రడిలా వుండేది తనమొహం చెదురుమదురుగా పెరిగిన గడ్డంతో. పచ్చిగడ్డి కోసినప్పుడొచ్చే ఓ రకమైన కసురు వాసనా… చమేలీ,మరువం, గోల్డ్‌ఫ్లాక్స్ కలిపి కుప్పపోసి కదిపి చూస్తే వచ్చే వాసనా… తన చెవివనక మెడమీద నుంచి వచ్చే స్మెల్‌తో సరిపోతుంది. “ఎందుకలా మీద మీద పడి వాసన చూస్తావు you’re my hachiko” అనేవాడు ఇంకా ఇంకా పైకి లాక్కుంటూ. అతని పల్చటిపెదాలు లేత ముంజలంత మెత్తన. గుండె కొట్టుకోడం బయటికి తెలుస్తోంది. దాచుకోలేని తమకం ఓ చోట పుట్టి, ఒళ్లంతా పాకతోంది. ఎప్పుడూ ఇంతే తానొచ్చే ముందు కొద్ది క్షణాలు ఏ కామదేవత పూని నిలవనీయకుండా చేస్తుందో. తన మొదటి స్పర్శ ఎంత బలంగా రక్తంలో ఇంకిపోయిందో.
“తాగిన మైకంలో తూలే మాటల్తో నిన్ను ముద్దు పెట్టుకోవాలనుంది కానీ అలా అనిపించి కూడా పెట్టుకోకుండా వుండచ్చు తెలుసాని అర్థం లేని మాటలేవో అన్నావు. ఆరోజే నిన్ను ఫస్ట్ టైం ‘సరిగ్గా’ చూశాను. సివిల్ డ్రస్‌లో వున్న మావోయిస్ట్ మేధావిలాగా , సుత్తీకొడవలి చేతిలో పట్టుకున్న కామ్రేడ్లా కనిపించేదానివి. అంతకముందు… చూడగానే నీకో నమస్తే పెట్టి, పక్కకెళ్లిపోయేవాడిని. మొదటసారి నిన్ను చీరలో కాకుండా డ్రస్‌లో చూడటం, అదీ స్లీవ్‌లెస్ డీప్‌నెక్ టాప్‌లో. చూడగానే పిల్ల కత్తిలా వుందనుకున్నా. ముట్టుకొని చూస్తే నాచుపట్టిన రాయిలా జారిపోయింది నీ ఒంటి మీద నా చెయ్యి. అబ్బా! ఏంటంత నున్నగా వుంది పాపనుకున్నా” అంటూ ఓపలేనంత బలంగా దగ్గరకి లాక్కొని లిప్‌లాక్ చేశాడు. ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడో, ఇంకొంచెం దగ్గరకి జరిగాను. నొప్పిలో తియ్యదనం తెలిసింది. చిన్నప్పుడు ఈత చెట్టు మొదట్లో చుట్టుకొని పడుకున్న రక్తపింజర గుర్తొచ్చింది అతను గట్టిగా వెనకనుండి దగ్గరగా అదుముకున్నప్పుడు. పింజర రక్తం పీల్చి మనిషిని అమాంతం చుట్టేసి ఎట్లా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో పిల్లలందరికీ కథలుకథలుగా చెప్పేవారు. అలాంటి డిస్క్లెమర్ ఏమీ వుండదుగా మనుషుల విషయంలో. అన్నీ సొంతగా తాకిచూసి కొరికిమరీ రుచి తెలుసుకోవాలి. నిషిధ్ధ ఫలాలు తినడం నేను కాదు కదా మొదలుపెట్టింది. తల బొంగరంలా తిరుగుతోంది. అది సాగర్ ప్లేస్. దట్టంగా సిగిరెట్ పొగ మేఘాలు చుట్టూరా. ఫ్లోర్ మీద అడ్డదిడ్డంగా కొందరు స్నేహితులు.
“గదిలోకి తీసుకెళ్లిబోల్ట్ వేసి వెనక్కి తిరిగేలోపు బాత్రూమ్లోకెళ్లి షవర్ తిప్పి, చల్లటి నీళ్ల కింద వణుకుతూ నించున్న నిన్ను షవరాఫ్ చేసి బయటికి తీసుకొచ్చాను. టవల్ తెచ్చేలోపు బట్టలొక్కక్కటిగా తీసి తిప్పితిప్పి విసిరేశావు. దుప్పటితో నిన్ను చుట్టబోతే అమాంతం మంచం మీద పడిపోయావ్. నిన్నలా చూడటం, ఆ ఇన్సిడెంట్ లైఫ్‌లో మరిచిపోలేను. ఇంతందం ఎదురుగా వుంచుకుని ఇన్నాళ్లేంచేశాను. నిన్ను తాకకుండా ఎలా వున్నాను? What an idiot I’m అనుకున్నా” అంటూ ఆ రాత్రి గురించిన చిన్నచిన్న డిటైల్స్ ఆలాపనలా చెప్తూవుంటాడు. నాకు మాత్రం తిరిగే రంగులరాట్నం మీద అతనితో పడుకున్నట్లు, రోలర్‌కోస్టర్‌లో సెక్స్ చేస్తుంటే… అది భూమికీ, ఆకాశానికీ మధ్య గిరికీలు కొట్టినట్లు తల మైకంలో తిరిగిపోయిన గుర్తు. మెలకువొచ్చేసరికి తల గిరగిరా తిరిగిపోతోంది. బరువుగా అనిపించి, కష్టం మీద కళ్ళు తెరిచి చూస్తే పైన తాను నాలుగైదు నీడల్లో కనిపించాడు. గదంతా చిన్నచిన్న లైట్లు మెరుస్తున్నాయి. చున్నీలూ, చీరలూ చింపి కట్టిన కర్టెన్లు కదలకుండా నిలబడున్నాయి. మట్టికుండ చేసే చక్రంలా రూఫ్ తిరుగుతూనే వుంది. తిరిగి ఇతన్ని చూశాను. కొత్త వాడు.. అతనితో ఇలా మొదటిసారి. అన్నింటికీ మించి అతను సత్య క్లోజ్ ఫ్రెండ్ సాగర్.ఈ డిటైల్ దగ్గర ఆలోచన ఆగిపోయింది.
సాగర్‌ని చూసి ఇష్టపడ్డ, మోహపడ్డ గుర్తు లేదు. ఇద్దరం పరిచయస్తులమే అయినా ఆరేళ్లలో ఓ పదిసార్లు కలుసుకోని వుంటామంతే. ఆరాత్రి ఒడిలో ఇద్దరం గువ్వల్లా ముడుచుకుని పడుకునేదాకా తన చేతిని కూడా తాకలేదెప్పుడూ. తన మీద ప్రత్యేకమైన అభిప్రాయం కూడా ఏం లేదు. బాగా తాగేసిన మత్తులో అతని పెద్దపెద్ద కళ్లు చూసి మోహం కలిగింది. నియాన్ లైట్ అతని చెంపల మీద మెరుస్తుంటే ముట్టుకొని చూడాలనిపించింది. దగ్గరకెళ్లి తాకిచూస్తే అతని టచ్ మంచిగా అనిపించింది. కొంచెం ఆడ్‌గా అనిపించిన విషయం ఏంటంటే ఈ అబ్బాయ్ నా ఫస్ట్ బాయ్‌ఫ్రెండ్లా వున్నాడు. ఆ అబ్బాయితో బ్రేకప్ అయిన తర్వాత, ఇప్పటివరకూ చూసి మాట్లాడింది లేదు. వెంటనే బెంగేసింది తను గుర్తొచ్చి. ఏ కారణమైతే ఏంటి అప్పుడు అతను నాకు కావాలనిపించింది.
ఆ క్షణంలో ఏ ఆలోచనా నిలవలేదు. అయితే ఏంటని మనసు తలెగరేసింది. ఇలా సుఖానికి ఒళ్లప్పగించి ఎన్ని రోజులైంది. తన గరుకు చేతుల్లో నలిగిపోయి, ఆ తియ్యటి బాధతో ఒళ్లంతా మూలుగుతోంది. వరదకి గేట్లెత్తినట్లు సుఖం పల్లానికి పాకింది. దేహం తడిరాగం పాడుతోంది. అయినా సాగర్ విడిచిపెట్టలేదు. నన్ను బొమ్మలా చేసి ఆడుకున్నాడు. అతన్ని ఇంకా రెచ్చగొట్టి, నా అణువణువులో కలిపేసుకోవాలనే వెర్రిమోహం పుట్టింది. కలలో నడకలా నిజానికీ మగతకీ మధ్య గీతల్లో ఎక్కడో నీడలాంటి జ్ఞాపకమే నాకు ఆరాత్రి. తెల్లవారింది, పొయ్యిలోంచి లేచిన పొగలా మంచు కమ్మి, అంతా మబ్బుమబ్బుగా వున్నాయి పరిసరాలు. సుఖం తాలూకు గుర్తుల్లో ప్రతిదీ అందంగా హాయిగా కనిపిస్తోంది. చెత్త తీసుకెళ్లే టాటా ఏసీ ఆగివుంది ఇంటి ముందు. డ్రైవర్ పక్కసీట్లో ఒకామె పల్చటి ఆకుపచ్చ చీర కట్టుకుని కూర్చొనుంది. తలకి నూనె రాసి నున్నగా దువ్వి, పిన్నులు పెట్టి బిగుతుగా అల్లుకున్న జడలో కనకాంబరాలు పెట్టుకుంది. అటుగా తిరిగి కూర్చోని విండో లోంచి బయటకి చూస్తోంది. డ్రైవర్ సీట్లోంచి చెత్తవాడు దిగెళ్లి ఆమెతో ఏదో అనేసి, చెత్త కోసం వీధి లోకి వెళ్లిపోయాడు. సిగ్గు పడి ఇటువైపు తిరిగింది. ఆమె కళ్లూ నా కళ్లూ ఒక్క క్షణం కలుసుకొని విడిపొయ్యాయి. నా కళ్లలో చెకుముకిరాయి ఆమె కళ్ళల్లోనూ మెరిసింది. సంతోషపు స్థాయిలో ఏ తేడానూ వుండదనుకుంటా ఏ ఇద్దరి మధ్యా. ఆమే నేనూ ఒకే ఆత్మలా అనిపించాం ఆ నిమిషంలో.
అట్లాంటి చోట సాగర్‌ని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. తన పేరు కూడా అట్టే గుర్తు రాలేదు. ఒక్కొక్కరూ ఒక్కో దారిన వస్తారు మన లైఫ్ లోకి. ఇతను మాత్రం చుక్క తెగిపడ్డట్టు ఉల్కాపాతంలా వచ్చాడు. మంచిచెడ్డలు ఎంచుకునేంత వ్యవధి లేదు. అలా ఎందుకు చేసానంటే, సమాధానం లేదు నా దగ్గర. అసలు ఏదైనా ఎందుకు చేసానో తెలియదు. ‘ స్వైరిణి అన్నారు నన్ను శ్యామసుందరా…’ మనసు పాటగా మూలిగింది. దుఃఖం తెరలుతెరలుగా తన్నుకొస్తోంది లోపలినుంచి. సహజాతాలు అణిచిపెట్టి ఎవరెంత సంతోషంగా వున్నారో అర్థం కాదు. చాలా అలసిపోయినట్లు నిస్సహాయంగా అనిపించింది. ఎదుట వాళ్లలో లేనిది, మనం పలికించలేం. ఇదిలాగని అర్థమయ్యేలా ఎవరికి చెప్పగలం? ఎవరి భూతద్దాలు వాళ్లకుంటాయిగా. ఆ రాత్రికి నన్ను నిస్సిగు గా వదిలేసుకున్నా. కానీ అతని ముందు మాత్రం సిగ్గు ముంచేసింది. ఎంత సిగ్గైతే అంత మురిపెం అతనికి. మొహాన్ని చేతుల్లోకి తీసుకుని మతాబుల్లా వెలిగే కళ్లతో ఎన్ని ముద్దులాడతాడో. దగ్గరైన ఆడామగా మధ్య మొదటి రోజుల ఆకర్శణని ఎంత బలమూ చెరపలేదు కదా! పున్నమినాగుల్లా చుట్టుకొని విడిచివుండలేనితనం, ఒకళ్లనొకళ్లు ధ్వంసం చేసేంత శక్తి తో కూడటం, కాసేపటి విరహానికే వేగిపోడం, శీతకాలపు రాత్రుల తమకం…
చంద్రడ్ని జల్లెడలో వేసిపట్టి వెన్నెల తుంపర లో తడవటం…
ఆ మోహావేశం మాటల్లో ఏం చెప్తాం !
కోరిక
అదంతా కోరికే..
రాత్రీపగలూ నరాలు మెలిపట్టేంత కాంక్ష…
దేహసౌఖ్యంలో దైవత్వాన్ని అనుభవించలేని వాళ్లని ప్రేమే కాదు, ఏ భావావేశమూ తాకలేదేమో! ఇది మనదైన అనుభవం కాబట్టి దీనికి ఔన్నత్యాన్ని ఆపాదించటం, గొప్పలు పోడమేమో. బయట నిలబడి చూసేవాళ్లకి వుత్త వ్యవహారం లా అనిపించొచ్చు. నియమాలకి అవతల నిలబడ్డాను, నిరభ్యంతరంగా వాటిని తొక్కినడిచాను. బోలెడన్ని మాటలన్నారు.అందరినీ పక్కన పెడితే, సత్యా ఏమనుకున్నాడో,ఎంత దుఃఖపడ్డాడో ! ఆ రాత్రి తను పక్క గదిలోనే వున్నాడు వేరెవరితోనో. కష్టమేసింది చాలా, తనని ఇంకొకరితో చూడ్డం. మూడో పెగ్ అవ్వగానే సత్యని తాకాలన్న కోరిక ఎక్కువైంది. పక్కన ఇంకో అమ్మాయి, అయినా వుండలేక దగ్గరగా వెళ్లి తన గడ్డం తాకి చేతుల్లోకి తీసుకున్నా. మృధువుగా నా చేతులు తీసేశాడు. ఇద్దరం విడిపోయిన మాట నిజమే, కానీ ప్రేమెక్కడికి పోతుంది? ఒకరి పట్ల ఇంకొకళ్లకుండే ఫీలింగ్ చచ్చిపోతుందా? పరాయైపోతారా? కానీ కనపడని సన్నటి గీతలు, మనుషులం మనం అని గుర్తుచేస్తుంటాయిగా. మన మనసుకి మనల్నే కాపలా పెడతాయి. ఎంత నిస్సహాయంగా అనిపించిందో… ఎవ్వరిమీదో కూడా తెలియని కోపం, కసి.
ఇన్ని ముడులెందుకేసుకున్నాను? అందరికీ సంజాయిషీలిచ్చీ ఇచ్చీ నామీద నాకే విసుగొచ్చింది. ఎవరినీ సమాధాన పరచలేను. అదంతా సరిపోనట్లు ఇప్పుడు మళ్లీ సత్య క్లోజ్ ఫ్రెండ్ సాగర్‌తో. ఆ పక్కరోజు ఉదయం వెళ్తూ వెళ్తూ సత్య చూసిన చూపులో భావం అర్థంకాలేదు. బాధా, అసహ్యమూ, వెగటూ… గాయపడ్డట్టు మాత్రం తెలిసింది. తనని ఆపి ఏదైనా చెప్పాలనికూడా తోచలేదు. రకరకాలుగా పోయింది మనసు. ఓ వారం తర్వాత సత్యా, నేనూ ఎదురుపడ్డాం అనుకోకుండా. నా పక్కన సాగర్. ఏమీ కానట్లే పలకరించుకున్నాం. వెళ్లి భుజం పట్టుకొని కుదిపి అడగాలనిపించింది ఏమనుకుంటున్నావని. మౌనంగా వెళ్లిపోయాడు అక్కడ్నించి. ఆరోజు అర్థరాత్రి దాటాక ఫోన్ చేసి దాచుకున్న కోపం బాధతో… దాచుకోలేని ఏడుపు గొంతుతో how could you do this to me అని ఎంత వేదనతో అడిగాడు. నాకు చచ్చిపోవాలనిపిచ్చింది. వెళ్లి తనని దగ్గరకి తీసుకొని ఏదేదో చెప్పాలనిపించింది. కానీ నిస్సహాయతకి మాటలు దొరకవు. తనకి దూరంగా వుండటం తప్పించి ఇంకేమీ చేయలేకపోయాను. సత్య ప్లేస్‌లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అయ్యేవాళ్లేమో. బలహీనతల నుంచి ఎవరికి మినహాయింపు ?
ఒక కథ ముగిసీ ముగియక ముందే మరొకటి. ఇందులో సుఖం సంతోషం మాట ఎటున్నా, విపరీతమైన ఇమోషనల్ ట్రామా. ఎటూ తేల్చుకోలేని స్ట్రగుల్. సాగర్ మాత్రం చాలా క్లియర్గా వున్నాడు. సత్య ఒకరితో వున్నప్పుడు నువ్వు వేరెకళ్లతో వుంటే తప్పేంటి? తనకి బాధపడే అవసరం ఏంటి? అదంతా హిపోక్రసీ. దానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోడంలో అర్థం లేదు అనేవాడు. కానీ అన్నీ గీతకి అటూఇటుగా అంత ఖచ్చితంగా వుంటాయా? ఒకరంటే ఒకరికి సరిపడక కాదుగా దూరమైంది సత్యానేను. ఇద్దరి లైఫ్‌లో వున్న మనుషుల ఫీలింగ్స్‌ని స్టేక్‌గా పెట్టలేకేకదా ఈ దూరమని నేనంటే, దానిలో వున్న హిపోక్రసీని నువ్వర్థం చేసుకోవట్లేదనేవాడు. తప్పొప్పుల మాటెటున్నా సాగర్‌తో వున్నంతసేపూ ప్రశాంతంగా వుండేది. తను నా పాస్ట్ బట్టి నన్ను జడ్జ్ చేయలేదు. ఇప్పుడు తనతో వుండమనీ నన్నింబ్బంది పెట్టలేదు. ఎంత లాలనగా చూశాడో నన్ను. పావురాయి మెత్తటి రెక్కల కింద దాచుకున్నట్లు అపురూపంగా దాచుకున్నాడు గుండె కింద. ముందేంటనే ప్రశ్నలేవీ వుండేవికాదు తనకి. నేనొదిలేసి పోతాననే దిగులు కూడా లేదు, వున్నా కనిపించనివ్వడు. తనలోపలికి నన్ను తొంగి చూడనివ్వడు. అలాగని నాతో టైంపాస్ చేసినట్లుకూడా ప్రవర్తించలేదు. లైఫ్ పట్ల తనకున్న డిటాచ్మెంట్ చూస్తే వండర్‌గా అనిపించేది. అంత డిటాచ్డ్‌గా ఉండే సాగర్‌కి మనుషుల పట్ల ఎంత అక్కరో. ఆ లెక్కలేనితనపు మాటల వెనకగా తనని చూడటానికి ప్రయత్నించాను. అందరితోనూ ప్రేమగా వుంటాడు కానీ ఏ విషయాన్నీ లోతుగా తీసుకోడనిపించేది. ఎంత పెద్ద సమస్యైనా… అయితే ఏంటని తలెగరేసేవాడు. నేనెళ్లిపోతే ఏం చేస్తావంటే… ఇంకో అమ్మాయిని వెతికిపెట్టి వెళ్లనేవాడు. నేను గుర్తొస్తే ఏం చేస్తావంటే… సింపుల్‌గా నీకు ఫోన్ చేస్తా అనేవాడు. నేనేమో ఆర్ట్ సినిమాలో హీరోయిన్‌లా ఏవోవో ఊహలు చేసేదాన్ని. తను బెంగపడి, ఎవరితో పలక్క, ఏడుస్తూ ఒంటరిగా మిగిలిపోతాడని. వెర్రి ఒక విధం కాదు. నా మాటల గాలానికి ఒక పట్టున దొరికేవాడు కాదు సాగర్. కానీ ఎందుకో ఒక అర్ధరాత్రివేళ… ఏం గుర్తొచ్చి కలవరపడ్డాడో కానీ ఒళ్లో తలపెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. గట్టిగా చేతులతో చుట్టేసి పొదువుకున్నాడు. “వెళ్తానని నిజంగా అన్నావా? ఒక వేళ వెళ్లిపోయినా కూడా నాతో పలక్కుండా దూరంగా వుండకు. నిన్ను బాధపెట్టే పనేదీ చేయను” అని చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఎవరి దగ్గర నుంచి ఇదంతా కోరుకున్నానో తను అందీఅందక క్షోభపెట్టాడు. ఏమీకాని ఇతను మాత్రం ఎదురుచూడనంత ప్రేమను పంచాడు. sagar never made me feel the way satya did. సత్య నన్ను ఒకరకమైన సఫకేషన్‌కి గురిచేశాడు. ఇదంతా శాశ్వతమా? సాగర్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా? ఇవన్నీ వట్టి వ్యర్థమైన ప్రశ్నలు. ఒక మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలి. నిజమైన ప్రేమ ఏది అనే లాలూచీలో పడి, చేతుల్లో ఉన్న ఆనందాన్ని ఒలకబోసుకుంటాం మూర్ఖంగా. ప్రతిదాన్నీ ప్రశ్నించి తర్కంతో లెక్కలు కడతాం వెర్రిగా. ఎంత మెచ్యూర్డ్‌గా ఆలోచించడానికి ట్రై చేసినా, నన్ను మాత్రం ఏదో ఇన్‌సెక్యూరిటీ ఎప్పుడూ వేధించేది. అటూఇటుగా తూగుతూ వుండేదాన్ని. దానివల్ల వచ్చే రెస్ట్‌లెస్‌నెస్, అగొనీలతో ఎప్పుడూ ఓ ఏడుపు లోపల్లోపల. అంతా మంచిగా వున్నదాన్ని ఏదో చేసి చెడగొడతావే నువ్వూ… అని అమ్మ అంటుండేది. అలా ఈ స్ట్రగుల్ భరించలేక, ఒకరోజు సాగర్‌కి చెప్పకుండా చాలాచాలా దూరం వెళ్లిపోయాను. ఫోన్ తీసేసి ఏ కమ్యునికేషనూ లేకుండా చేసుకున్నా. ఎవరికీ సమాధానం చెప్పే అవసరం లేని చోటికి నాపాత నన్ను నేనే మరిచిపోయేంత దూరం పోయా. సత్య కంటే సాగర్ ఎక్కువ గుర్తొచ్చేవాడు. తన పట్లమరీ సెల్షిష్‌గా ప్రవర్తించాననిపించింది. ఓ మాట చెప్పి వెళ్లిపోయుంటే బావుండని ఎంత అనిపించిందో. కానీ అలా చేస్తే వెళ్లిపోలేననే భయం వుండింది మనసులో. లోన్లీనెస్ భరించలేక ఏడ్చీ ఏడ్చీ గొంతు తడారిపోయేది. కానీ ఎవరికీ చెందని ఒంటరితనం ఒక సాంత్వన నిచ్చేది. పైగా సాగర్ లాంటి మనిషితో ఏదైనా బంధం కావాలనిపించింది. పెళ్లంటే వెగటు పుట్టి వున్నాను కాబట్టి, అది వద్దని తెలుసు కానీ చిత్రంగా తనతో పిల్లలుంటే బావుండనే కోరిక చాలా భయపెట్టింది. మళ్లీ ఏవో చిక్కుముడులు అల్లడానికి తయ్యారైంది మనసు, ఏ బంధమూ లేకుండా నిలవలేదు వట్టి పిరికిది. అదంతా వద్దని తోసేసి, ఇట్లా ఒంటరిగా వుండటం ఒకరకమైన మొండితనాన్నిచ్చింది. రోటీన్‌నీ, స్థబ్ధతనీ తిట్టుకుంటాం కానీ, ఒక్కోసారి అవే కాపాడతాయి మనమల్లుకున్న చిక్కుముడులనుంచి. నన్ను నేను తమాయించుకోగలననే నమ్మకమొచ్చాక కలవాలనుకున్న మొదటి మనిషి సాగర్. I owe him an answer. ఇప్పుడు. మనసు కాస్త తేటగా వుంది. గతాన్నీ, భవిష్యత్తున్నీ భుజాలమీంచి వదిలించుకున్నా. ఈ క్షణం బ్రతకాలనుకుంటున్నా. సాగర్ ఎక్కడున్నాడో కనుక్కోడం పెద్ద కష్టం కాలేదు. వచ్చి కలుస్తానని చెప్పినప్పుడు తను మౌనంగా వున్నాడు ఓ నిమిషం. తర్వాత ఎక్కడికి రావాలో చెప్పాడు.
ఎలా ఉన్నాడో సాగర్? నేను చేసిన పిచ్చిపనికి ఎంత నొచ్చుకున్నాడో? తను రాగానే ఏం మట్లాడాలి? ఎందుకెళ్లిపోయావంటే… ఏమని చెప్పాలి? వెనకగా అడుగుల చప్పుడు. కొద్దికొద్దిగా దగ్గరవుతుంది. హార్ట్‌బీట్ పెరిగింది. వెనక్కితిరిగి చూడాలనిపించింది. మంచు మరీ దట్టంగా పడుతోంది. గ్రే కలర్ ఓవర్‌కోట్‌తో బ్లాక్ క్యాప్‌లో వచ్చాడు సాగర్. కాస్తదూరంగా నించొని చూస్తున్నాడు. లేచి దగ్గరగా వెళ్లాను. ఏ భావమూ కనిపించలేదు తన మొహంలో. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ” నార్త్ నాకసలు దొబ్బదు మ్యాన్” అన్నావుగా. బావుందా ఈ చలీ, మంచూ అంటే పొగడపువ్వు విచ్చుకున్నట్టు మొత్తగా నవ్వాడు. కళ్లలో పల్చగా నీటిపొర. దగ్గరగా వచ్చి, కంటి నిండా చూసుకుని గట్టిగా హత్తుకున్నాడు.

ఉషాజ్యోతి
1984 వ సంవత్సరంలో పుట్టిన ఉషాజ్యోతి ఖమ్మం జిల్లాకు చెందినవారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. తెలుగు చేశారు. 'ఉన్మత్త' పేరుతో కవిత్వ పుస్తకం వచ్చింది. వైయక్తికం, సామాజికం, వస్తు ప్రాధాన్యం, శైలీగతం లాంటి పడికట్టు పాదాలకు దూరం జరిగి అలజడికి అనువైన అక్షరాల్నే పేర్చుకోవాలనే తపన వీరిది.
