“Since then, at an uncertain hour that agony returns: And till my ghastly tale is told, this heart within me burns”
Coleridge: The Rime of the Ancient Mariner
పొద్దుట్నుండీ ముసురు. సాయంత్రం వేగిరంగా చీకటి పడిపోయింది. బురదలో, వానలో క్లబ్బుకి వెళ్ళడానికి మనస్కరించక ఇంట్లోనే వుండిపోయాను. మంచి కాఫీ తాగి, ఈజీ చైర్లో నడుం వాల్చి నా కిష్టమైన ఎలియట్స్ పాయట్రీ చదువుకుంటున్నాను, లీజెర్లీగా. ఇంతలో గేటు చప్పుడు. ఇలాంటి సమయంలో వచ్చిందెవరు చెప్మా అని చూస్తే మా చెల్లెలిగారి కారు డ్రయివరు.
“ఒకసారి తమర్ని వెంటనే రమ్మన్నార్సార్!” అన్నాడు
“ఏమిటి హడావిడి?”
“తెలీద్సార్”
“రవిబాబు గారు కేంప్ నుండి వచ్చేశారా?”
“వచ్చేశార్సార్!”
వాడ్నుండి సమాధానాలు అలాగే వస్తాయి. సజెస్టివ్గా అడిగి చూస్తే ఏమన్నా వివరంగా చెప్తాడేమోనని వూహించి “ఇంట్లో అంతా బాగానే వున్నారా?” అనడిగాను.
‘బాగానే వున్నట్టున్నార్సార్! అమ్మగారు మాత్రం దేనికో కంగారు పడుతున్నట్టుకనిపంచార్సార్!’ అన్నాడు.
లోపలికి వెళ్ళి రెయిన్ కోటు, గొడుగు, టార్చి తెచ్చుకున్నాను. నడుస్తున్నాం. మా చెల్లెలి గారి బంగళా అట్టే దూరంలేదు. వీధి దీపాలు అక్కడొకటీ, ఇక్కడొకటీ మినుకుమినుకు మంటున్నాయి. రోడ్లన్నీ బురద, బడా ఆఫీసర్ల వసతి కోసం బంగళాలయితే కట్టించేసింది గాని రోడ్ల గురించి శ్రద్ధ కనపర్చలేదు ప్రభుత్వం. దాని ఫలితంగా చినుకుపడితే చాలు, రోడ్ల మీద అడుగు పెట్టడానికి భయం.
నా రాక కోసం నిరీక్షిస్తున్నదాన్లా కనిపించింది శారద. ఆమె కళ్లల్లో ఏదో ఆందోళన. “ఏవిటి చెల్లీ’? అనడిగేను పోర్టికోలో అడుగుపెడుతూనే “ముందు లోపలికి రా చెప్తాను” అని ఇంట్లోకి దారి తీసింది. లివింగ్ రూమ్లోకి వేళ్ళేం సరాసరి. చిన్న డిమ్ లైట్ మాత్రం వెలుగుతోంది. ఆలవాటుగా స్విచ్ నొక్కేను. ఫ్లోరొసెంట్ దీపం వెలుగు పాల రంగులో గదంతా నిండింది. “లైట్ తీసేయ్ రా” రవి గొంతు విని తలతిప్పి చూసేను. మూలగా వున్న సోఫాలో కూర్చున్న రవి వింతగా కనిపించేడు, ఏదో ధ్యానంలో వున్న మునిలా. క్రీమ్ కలర్ షాల్ కప్పుకున్నాడు ఒంటి చుట్టూ, ఓ నిముషం వాడ్ని పరిశీలనగా చూసి లైటార్పేశాను. సోపాలో వాడి ప్రక్కనే కూర్చుంటూ “సంగతేవిట్రా” అనడిగేను. రవి నాకు చిన్నప్పట్నుండీ ఆప్తమిత్రుడు. వీధి బడి నుండి యూనివర్శిటీ చదువుల్లాకా ఇంచుమించు మా ఇంట్లో మనిషే ఆ చనువుతోనే మా చెల్లెల్ని చేస్కోరా అని వాడ్ని అడగడం, సంతోషంగా దానికి వాడంగీకరించడం జరిగింది. నా ఒక్కగానొక్క చెల్లెలు శారదంటే మాకెంత మమకారమో వాడికి తెలియంది కాదు. శారదని చేస్కున్నవాడు ఆమెని అభిమానంగా చూసుకోవాలని మా కోరిక. రవి మమ్మల్ని నిరాశపర్చలేదు. “శారదా, ముందు కాస్త కాఫీ ఇవ్వు మీ అన్నకి, వానలో సగం తడిసి వచ్చినట్టున్నాడు” అన్నాడు
కాఫీ వచ్చింది. శారద చేసిన కాఫీ చాలా గొప్పగా వుంటుంది. మా ఇద్దరికీ చెరొక కప్పు ఇచ్చి, తనూ తీస్కోని కుర్చీ దగ్గరగా లాక్కుని కూర్చుంది. కూర్చుంటూనే “ఇవాళ చాలా పెద్దగండం గడిచిందన్నయ్యా” అంది. కాఫీ కప్పు కింద పెడుతూ, చెప్పమన్నట్టు చూశాను.
“కేంప్ నుండి అలసిపోయి వస్తారు. రాగానే స్నానం చేస్తానంటారేవోనని వేణీళ్ళు పెట్టాను. గీజర్ పాడయి రెండ్నెల్లయింది. గేస్ సప్లయి కూడా అంతంత మాత్రంగానే వుంది. అందుకని డేగిశాతో నీళ్ళని కట్టెల పొయ్యిమీద పెట్టించాను పెరటి బాత్రూమ్‌లో” ఆగి కాఫీ గుక్క వేసింది శారద. “తర్వాత” అన్నాన్నేను.
“అనుకున్నట్లుగానే ఆలస్యంగా వచ్చేరు కేంపు నుండి. ముసురుకదా, నాలుగ్గంటలకే పొద్దుపోయినట్లనిపించింది. ఒస్తూనే స్నానానికి తయారయారు. ఇంతలో పక్కబంగళా వాళ్ళ, పిల్లల్తో ఆడుకుంటున్న బాబీకి మరెలా తెలిసిందో. డాడీ వచ్చారని పరిగెత్తుకొచ్చేశాడు. కొడుకుతో కబుర్లు చెప్పడమంటే ప్రపంచంలో ఇంకే పనీ మరి లేనట్టేగా ఇతనికి! బలవంతంగా లేపి స్నానానికి పంపించవలసి వచ్చింది. వెనకాతలే బాబు కూడా వెళ్ళాడు” చెప్తున్నదాన్ని అక్కడికి ఆపేసి ఏదో దిగులుగా శూన్యంలోకి చూస్తూ వుండిపోయింది శారద. ఆమె ఎందుకు బాధపడుతోందో తెలియక “ఏమిటయింది నాన్నా. అంత దిగులుగా కనిపిస్తున్నావు?” అని అడిగాను ఆందోళనగా, కళ్ళల్లో వూరుతున్న నీటిని తుడుచుకుంటూ తిరిగి ప్రారంభించి శారద.
“ఒరే అన్నయ్యా! ఈ దిక్కుమాలిన బంగళాలు హోదాలకే గాని హాయిగా బతకడానిక్కాదురా”.
ఒకదానికీ మరోదానికీ మధ్యన మాట వినబడనంతటి దూరాలు. పీక పిసికి ఎవరేనా చంపుతున్నా, అరచి చచ్చినా వచ్చి రక్షించే నాథుడుండడు” అని స్వగతించింది శారద.
“అసలేం జరిగింది నువ్వు చెప్పడం లేదు శారదా!” అన్నాను, ఆమెని విషయంలోకి మళ్ళించాలని.
“అదేకదా చెప్తున్నాను – అదిగో ఆ బయటి బాత్రూమ్ సర్వెంట్ క్వార్టర్స్‌కి దగ్గర, అంటే ఈ బంగాళాకి ఆరఫర్లాంగు దూరంలో కట్టేరు. అక్కడేం జరిగినా ఇంట్లో వాళ్ళకి తెలిసి చావదు. కట్టెల పొయ్యి కదా – పొగ ఇల్లంతా నిండిపోతుందని భయపడి. తిన్నగా ఆ బాత్రూమ్‌లో తీసికెళ్ళి పెట్టేను వేణ్ణిళ్ళ కోసం, ఎంత పొరపాటు చేశానో ఇప్పుడు తల్చుకుంటే భయంతో గుండెలు ఆగిపోతున్నాయి. తండ్రీ, కొడుకు కలసి జంటగా వెళ్ళారు కదా బాత్రూమ్‌కి పావుగంటయినా ఫికరు లేదేమిటి చెప్మా అని వరండాలోకి వెళ్ళి చూసేను. వాన, పైగా బాత్రూమ్ దగ్గర పొగ. ఏదీ స్పష్టంగా కనపడేదు. కాని బాబు మాత్రం ఎందుకో ఏడుస్తున్నట్లు, అటూ ఇటూ గాభరాగా పరిగెడుతున్నట్టు కనిపించి, పరిగెత్తాను బాత్రూమ్ దగ్గరికి, నేను అక్కడికి వెళ్ళగానే నన్ను వాటేసుకుని, ‘నాన్నగారు లోపలుండిపోయారు. తలుపు రావడంలేదని ఏడుస్తూ చెప్పాడు బాబు. అది వినగానే నా గుండె గతుక్కుమంది. బాత్రూము తలుపుకి ఇవతల నిలబడి నాన్నాగారితో కబుర్లు చెప్తూ పరాగ్గా గడీ వేసేసి వుంటాడు. ఆ గడీ పింపిరి పట్టేసింది. పొరపాట్న దాన్ని గాని వేసేస్తే దాన్ని తిరిగి తియ్యాలంటే గింజుకుచావాలి. తలుపురాక లోపలి మనిషి ఏం ఇబ్బంది పడుతున్నారోనని తల్చుకునేసరికి ఎందుకో వణకు వచ్చేసింది. గబగబా పక్కనున్న రాయితో గడీని బలవంతంగా విడగొట్టి తలుపు తెరిచి చూద్దునుకదా లోపలంతా పొగ, ద్వారానికి అడ్డంగా స్పృహ లేకుండా పడి వున్నారాయన. భయంతో కొయ్య కట్టుకుపోయేను. కాని అంతలోనే ఏం మొండి ధైర్యం ఒచ్చిందో మరి మనిషిని పట్టుకొని బరబర బయటికి ఈడ్చుకొచ్చేశాను. మనం రోజల్లా తిట్టుకుంటున్న ఈ వానా, గాలీ అవే రక్షించేయి ఇతన్నివాళ. వాన జల్లు ముఖం మీద పడి చల్లని గాలి తగిలేసరికి మెల్లగా తెలివొచ్చి, కళ్ళు విప్పి చూసేరు. చూసి నన్ను బాబునీ ఏడవ్వద్దని చేత్తో సౌంజ్ఞ చేశారు. మనిషి లేచి కూర్చోడానికి మరో అయిదు నిముషాలు పట్టింది. ఏడుస్తున్న నన్నూ బాబునీ దగ్గరకు తీసుకుని, తల నిమిరి తను కన్నీళ్ళు పెట్టుకోడం మొదలెట్టేరు. నేను చెయ్యి సాయం చేస్తే మెల్లిగా ఇంట్లోకి వచ్చేరు. వచ్చారన్నమాటే గాని, ఆదిగో ఆలా శాలువ కప్పుకుని మూలన వున్న సోఫా మీద కూర్చున్నారు. నా కెందుకో భయం వేసి నీ క్కబురు చేశాన్రా అన్నయ్యా!”
తను చెప్పదలుచుకున్నది చెప్పేసి కూర్చుంది శారద – ఇక నువ్వు కోరవలసిన వివరణ ఏదేనా వుంటే, అది అతగాడి దగ్గర్నుండీ రాబట్టుకో’ అన్న ధోరణిలో
కొద్దిసేపు నిశ్శబ్దం. నేను రవి భుజం మీద చెయ్య వేసి “ఏవిట్రా ఇదంతా? ఎందుకేనా ఆప్సెట్ అయేవా? నువ్విలా వుంటే శారదా, బాబూ, బెంగపెట్టుకోరూ?” అన్నాను. నా మాటల్తో కాస్త రవి కదిల్నట్టనిపించింది. శాలువా తీసి మెల్లగా పక్కకు పెడుతూ “శారదా, ఈ గోడ మీది లైటు వెయ్యి” అన్నాడు. రవి మాట వినపడగానే ఏదో గొప్ప సంతోషం కలిగినదాన్లా చురుగ్గా లేచి వెళ్ళిలైటు వేసింది శారద. ఫేన్సీషేడ్ లోంచి కిందికి జారుతున్న వెలుతురు కిరణాలు రవి మీద పడుతుంటే ఆ దృశ్యం నాకు చిత్రంగా కనిపించింది. విశాలమైన వాడి నుదురు, గుండె లోతుకి చూస్తున్న అనుభూతిని కలిగించే కళ్ళు. అందంగా గంభీరంగా కనిపించే వాడి ముఖం – రోజూ ఇవన్నీ చూస్తున్నవే అయినా, ఇవాళ మాత్రం ఈ వింత వెలుతుర్లో వాడిని చూస్తుంటే ఏదో ఒక ప్రొఫెట్‌ని చూస్తున్న భావం కలిగింది. రవి మాటలు శ్రద్ధగా వినడానికి ఒక రకమైన భక్తి భావంతో తయారుగా కూర్చున్నాను. అంతటా నిశ్శబ్దం. బయట మెల్లగా కురుస్తున్న వర్షం మాత్రం ఏదో మంద్రమైన శబ్దశృతిలా వినిపిస్తోంది. గంభీరమైన రవి గొంతు మంత్రోచ్చారణలా వినిపించింది.
“నీకు గుర్తున్నాయి కదా మన అప్పలస్వామి మేష్టారి క్లాసులు? ఇలాటి వాన కురుస్తున్న సాయంకాలమే – ఓరోజు ఆఖరి పీరియడ్లో మేష్టారు కోల్రిడ్జ్ రాసిన The Ancient Mariner’ పద్యం చెప్పేరు. క్లాసులో నువ్వు, నేను, మరో అరడజనుమంది విద్యార్థులు మాత్రమే మిగిలాం – అంటే కేవలం మాష్టారి అభిమానులం మాత్రం ఆ పద్యం వినడానికి క్లాసులో కూర్చున్నాం. ఆ వేళ మాష్టారికి మరే రకమైన ఇన్స్పిరేషన్ వచ్చిందో నాకు తెలీదు గాని, వున్న కొద్దిపాటిమందిని యేవేవో ఊహాలోకాలకి తీసుకుపోయారు. ఆయనే ఏన్షెంట్ మేరినర్‌గా మారిపోయి, మనల్నందర్ని వెడ్డింగ్ గెస్ట్లుగా మార్చేసి, పట్టి నిలిపి కథ చెప్తున్నారా అన్న అనుభూతి కలిగింది నాకు మాత్రం. మేరినర్ తను ఆల్బట్రాస్‌ని చంపిన వైనం. తదుపరి జరిగిన వైపరీత్యాలు – ఇవన్నీ మేష్టారి నోటంట వింటుంటే నాలో ఏదో తీవ్రమయిన సంచలనం ఆరంభమయింది. కాలం కప్పిన పొరల క్రింద దాక్కున్న ఏదో సంఘటన గుర్తుకు వచ్చి పాత గాయం రేపుతున్న ఫీలింగు. అదిగో ఆనాటి నుండి ఆ జ్ఞాపకం నా మనస్సులో ఓ మూలని ఆరిపోని అగ్నిలా మెల్లి మెల్లిగా రగులుతూనే వుంది. ఎప్పుడేనా, ఎవరితోనేనా నా బాధని చెప్పుకుంటే బావుండని ఎన్నోమార్లు అనిపించింది. కాని, అంతా విని ఆఖర్న ఏవిట్రా నువ్విలాటి సెంటిమెంటల్ ఫూల్‌వి’ అనేసి నవ్వుతారేమోనని భయం. పైగా పెద్ద ఉద్యోగం ఒకటి ఏడ్చింది కదా – దీంతో మన కష్టం సుఖం కూడా ఎవరితోనూ చెప్పుకోలేని దౌర్భాగ్యం హోదాలు, ఇగోలు, సుపీరియారిటీ కాంప్లెక్స్లూను.”
అయితే ఇవాళ నాలో ఇన్నాళ్ళుగా రగులుతున్న బాధ స్పష్టమైన మంటలా లేచింది. నా వేదనని అర్ధం చేస్కో గల వ్యక్తికి కనీసం ఒకరికేనా చెప్తేగాని ఆ మంట చల్లారదు. దిక్కుతోచని సముద్రంలో ఆశల సంకేతంలా తమ దగ్గరికి వచ్చిన ఆల్బట్రాస్‌ని చంపిన గిల్టీ ఫీలింగ్ ఏన్షెంట్ మేరినర్ని ఎలా హాంట్ చేసిందో. అలాగే నేను చేసిన పాపం నన్ను కూడా హాంట్ చేస్తోంది. నేను చేసిన తప్పుని, పాపాన్ని ఎవరికేనా చెప్పుకుంటే గాని నాకు నిష్కృతి లభించదు’ దుఃఖంతో రవి గొంతు పూడుకుపోయినట్టనిపించింది. వాడి కళ్ళల్లో ముత్యాల్లా నీటి బిందువులు.
నిజంగానే భయం వేసింది నాకు. రవి వీపుని మెల్లగా నిమురుతూ, “రవీ, నువ్వు అనవసరంగా ఉద్రేక పడుతున్నట్టున్నావురా! కాస్త కంట్రోల్ చేస్కో. నువ్వు చెప్పాలనుకున్నదేదయినా సరే, నిస్సంకోచంగా నాతో చెప్పు నేను వినడానికి రెడీగా వున్నాను” అన్నాను.
“I assure you ఇది అనవసరంగా తన్నుకొస్తున్న ఉద్రేకం కాదు. ఇంచుమించుగా మూడు దశాబ్దాల కాలం ఈ వేదనని నాలోనే దాచుకొని నేనే మధన పడుతున్నాను. అయితే ఇవాళ జరిగిన సంఘటన నాకో హెచ్చరికలా అనిపించింది. నా వల్ల జరిగిన ఘోరాన్ని ఇవాళ నేను కన్ఫెస్ (confess) చేసి తీరాలి లేకపోతే ఇహ నాకు మనశ్శాంతి వుండదు. ఏన్షెంట్ మేరినర్‌కి దొరికిపోయిన వెడ్డింగ్ గెస్ట్‌లా ఇవాళ నువ్వు నా చేతికి చిక్కేవు” తనలో టెన్షను పోయి తేలిక పడినట్లుగా కనిపించాలని రవి ప్రయత్నం. అయినా అతని కన్నుల్లో మాత్రం ఏదో కంపల్షన్ కనిపిస్తోంది. దాన్నుంచి తప్పించుకుని పారిపోవడం ఎవరికీసాధ్యం కాదు బహుశా. “చెప్పరా! నువ్వు చెప్పేది శ్రద్దగా వినడానికి సిద్ధంగా వున్నాను” అన్నాను. నా గొంతులో ధ్వనించిన డీప్ సిన్సియారిటీ నన్నే ఆశ్చర్యపెట్టింది. “శారదా, మరికొంచెం కాఫీ ఇవ్వవా” అన్నాడు రవి. శారద లేచి వెళ్లింది. అతి మంద్రస్థాయిలో వినిపిస్తున్న symphony లా బయట వర్షంచప్పుడు.
కాఫీ వచ్చింది. కప్పు అందుకుంటూ “కూద్చో శారదా, నువ్వు కూడా వినాలి నేను చెప్పే సంగతుల్ని” రవి మాటల్లో ఏదో శాసింపు. ఆజ్ఞని శిరసా వహిస్తున్న దాన్లా శారద కూడా కూర్చుంది. రవి ప్రారంభించాడు.
“మా తాతగారు జమీందారని తెలుసు కదా నీకు. ఆయనకి ఒరిస్సాలో చిలకా, రంభా ప్రాంతాల్లో ఓ ఎస్టేటు వుండేది. మేం చిన్న పిల్లలప్పటి సంగతి, వరి నాట్లప్పుడు, కోతలప్పుడూ, నూర్పిళ్ళప్పుడూ మా తాతగారు అక్కడికి వెళ్ళి మకాం చేస్తుండేవారు. ఆయనవెంట పెద్ద పరివారం కూడా వుండేది వంటవాడు, పనివాళ్ళు, బట్టలుతికేమనిషి, రాత్రిళ్లాయనకి కాళ్ళు పట్టడానికి మరో ఓడ్ర పనివాడు ఇలా పటాటోపంగా వుండేది. ఎప్పుడాయన వెళ్ళినా ఆయనతో పాటుగా నాయనమ్మగారు కూడా వెళ్ళవలసిందే. పిల్లలం కూడా ఎవరో ఒకరం వెంటపడేవాళ్ళం వొస్తామని. విసుక్కోకుండా వెంట తీసుకువెళ్ళేవారు. మా గుంటసజ్జుకి అక్కడికి వెళ్ళడమంటే పెద్ద పండుగలా వుండేది. చెరుగ్గడలు, బెల్లాలు, తేనె, పేలాలు, పేలాల్తో చేసిన కజ్జివుండలు, పనసకొసాలు – ఇలా ఒకటేవిటి – ఒరియా గ్రామాలంట తయారయే రకరకాల తినుబడిపదార్ధాలు రోజూ యినాముల క్రింద రైతులు తెచ్చి తాతగారికి సమర్పించుకునేవారు. నోటికి విశ్రాంతి అన్నది లేకుండా ఇవన్నీ తినొచ్చు గనక, అక్కడికి వెళ్ళడవంటే చెప్పలేనంత సంబరంగా వుండేది పిల్లలకి.
ఆ సంవత్సరం నా టర్న్ వచ్చింది. ఏడ్చి గోల చేశాక, సరే రమ్మని వెంట తీసుకెళ్ళేరు తాతగారు. “గార్డెన్ ఆఫ్ ఏడెన్” అంటుంటారు చూడు, అదెలా వుంటుందో మనకి తెలీదు. కాని ఆధునిక నాగరికత ఇంకా ఏ మాత్రం సోకని ఆ రోజుల్లో చిలక సరస్సు ప్రాతం నిజంగా కవులు వర్ణించన ఆ భూతల స్వర్గంలాగే వుండేది. ఓ పక్క భూమి, ఆకాశం కలుసుకున్నట్టనిపించే ప్రదేశం దాకా విస్తరించిన నీలి రంగుచిలక సరస్సు, మరో పక్క ఆకుపచ్చని శిల్కు తివాచీలను గుర్తుకుతెచ్చే పొలాలు. ఆ పొలాలకి వెనకనే అడవి, అది దాటేక కొండలు, అదుపూ ఆజ్ఞలు లేకుండా ఆడుకోవాలని వచ్చిన పిల్లలకి అంతకంటే ఏంకావాలి చెప్పు! ఆ అడవులంటా. పొలాలంటా పరిగెత్తి, నీళ్ళల్లో దిగి స్నానాలు చెయ్యాలనే కదా మేం తాతగారి వెంట పడుతుండేది!
“తాతగారేమో భూములు, పంటలు, అంచనాలు, తగాదాలు, పరిష్కారాలు- వీటిల్లో మునిగి తేలుతూ వుండేవారు. నాయనమ్మకి వంటవాళ్ళ మీద, పనివాళ్ళ మీద అజమాయిషీతో క్షణం తీరికుండేది కాదు. మమ్మల్నక్కడ పట్టించుకునేవాళ్ళే వుండేవారు కారు. దాంతో మాకు తోటలంటా, దొడ్లంటా. అడవులంటా తిరగడానికి బోలెడంత తీరుబడి. జమీందారు గారి మనవలం కదా- తిప్పి తీసుకురాకడానికి రైతులు, కంబార్లు వాళ్ల పిల్లల్ని తోడుగా పంపించేవారు. ఆ పిల్లలంతా ఒరియాలో మాట్లాడేవారు. నా కర్ధమయేది కాదు. అయినా వాళ్ళు ఆడే ఆటల్లో మాత్రం నన్నూ కలుపుకుని కేరింతలు కొడుతూ వుండేవారు. నన్ను వాళ్ళ ఆటల్లో చేరనివ్వడానికి నేను జమీందారాగారి మనవడ్ని కావడం ఓ కారణం కావచ్చు. కాని అంతకంటే బలమైన కారణం మరోటుండేంది. నా జేబులనిండా బఠానీలు, కజ్జివుండలు, సమూసాలు దండిగా వుండేవి ఎప్పుడూ, వాట్నందరికీ పెడుతూ వుండేవాడిని. అందుకని వాళ్ళు నన్ను కలుపుకుపోతూ వుండేవారు వాళ్ళ ఆటల్లో.
ఓనాడు అడివిలో కాస్త బాగా లోపలికి వెళ్లి పరుగులుతీసి, చెట్లెక్కి ఆడుకుంటున్నాం. ఇంతలో వయసులో మాకంటే కాస్త పెద్ద కుర్రాళ్ల గుంపొకటి వచ్చి. ఏదో విచిత్రమయిన ఆట ప్రారంభించేరు. ఆ క్షణానికి అది ఆట అనే అనుకున్నాన్నేను. తరవాత్తెలిసింది- అది ఆటకాదు, వేట అని.
వాళ్లని చూస్తూనే మాసజ్జంతా ఆటలూ గెంతులూ మనేసి, వాళ్లుచేస్తున్న పనులు చూడ్డానికి చుట్టూ మూగేం. ఏవిటి చేస్తున్నారో చూడాలనే ఆసక్తిలో ఒకర్నొకరం తీసుకున్నాం. ఆ పెద్దకుర్రాళ్లల్లో స్పోటకం మచ్చలు, గంట్లతో కొండ ముచ్చులా కనిపిస్తున్న కుర్రాడు మమ్మల్ని గట్టిగా కసిరి నిశ్శబ్దంగా వుండమని సౌంజ్ఞచేశాడు. తరవాత వాడేదో కేకవేసి చెప్పేడు. నా నేస్తులంతా గబగబా పరిగెత్తి చెట్లచాటున దాక్కున్నారు. వాళ్లని అనుకరిస్తూ నేనూ చెట్లచాటున నక్కేను. ఆ గంట్లమొహంవాడు నేలమీద కసిన్ని నూకలు చల్లేడు. తరవాత వాటి దగ్గరగా ఓ చిన్న కర్రపుల్లని నిలబెట్టి, దానిని ఆసరాగా చేసి ఓ కుండని ఏటవాలుగా అమిర్చేడు. కర్రపుల్లకి సన్నని దారం కట్టి, ఆ దారం రెండో కొసని తను పట్టుకొని ఎదురుగా వున్న తుప్పల్లో నక్కి కూర్చున్నాడు తోడేల్లాగ.
నిరీక్షణ ఆరంభమయింది తుప్పల్లో ఆకుర్రాళ్లు, చెట్లవేనకాతల మేవూను. ఎక్కడ అనుకోకుండా నోటంట ఏశబ్దమేనా వొచ్చెస్తుందోనన్న భయంవల్ల కాబోలు అందరూ నోటికి చేతులు అడ్డంగా పెట్టుకుని, వెయ్యకళ్లతో నిరీక్షిస్తున్నారు. అడవి లోపల భాగం నుంచి ఏవేవో వింత,వింత మృగాల అరుపులు, పక్షుల కూతలు వుండిండి నిశ్శబ్దాన్ని భంగంచేస్తున్నాయి. నాకయితే ఈ నిరీక్షణతో కాలం ఆగిపోయిందేమో అనిపించింది. దురద పెడితే కాలు గోక్కోడానికి కూడా ధైర్యం చెయ్యకుండా వూపిరి వుగ్గబట్టుకొని కూర్చున్నాం. కొన్ని యుగాల కాలం ఆ చెట్టువెనక నిలబడి వేచి చూస్తున్న భావన కలిగింది. ఓ దశలోనయితే ఆ టెన్షన్‌ని మరి తట్టుకోలేక మూర్చవచ్చేస్తున్నట్టు అనిపించింది. సూర్యుడు వాలిపోతున్నాడు. నీడలు మెల్లమెల్లగా పాకుతూ అడివిని ఆక్రమించుకుంటున్నాయి.
అదిగో అలాంటప్పుడు దిగిందో పక్షి. దాన్ని పక్షి అనే అనగలనా? నాటి దృశ్యాన్ని నా మనస్సులో ఆవిష్కరించి చూస్తుంటే ఏ వనిపిస్తోందో తెలుసా? అది మనకళ్లకి నిత్యం కనిపిస్తుండే పక్షుల్లాంటి పక్షి కానేకాదు. ఫీనిక్స్ (Phoenix) అని ఏదో మిధికల్ బర్డ్ (Mythical Bird) గురించి చెప్తుంటారు చూడు అలాంటి పక్షి అది. పొందికైన చిన్న తలమీద తురాయిలా ఎర్రటి రోమాలు. పాలమీగడ రంగులో రెక్కలు. పారదర్శకమైన పగడాల్లా మెరుస్తూ కళ్లు. ఆ కళ్లల్లో నిర్భీతితో కూడిన ఒక ఠీవి. భూమ్మీద వాలి, చెట్టు చాటున నక్కివున్న మాయగాడు చల్లిన నూకల్లి నిర్భయంగా, హుందాగా ఏరుకొని తింటోంది. ఇప్పుడనిపిస్తోంది. నాకు – కారణజన్మురాలయిన సీతాదేవినే ప్రలోభపెట్టగలిగిన మారీచుడు వున్నప్పుడు అలాటి దివ్యమైన పక్షి కూడా ఆ క్రూరుడు చల్లిన గింజలకోసం ప్రలోభపడడంలో ఆశ్చర్యం లేదని. అయితే ఇవన్నీ ఇప్పుడు కలుగుతున్న ఆలోచనలు సుమా!
ఆవేళ మాత్రం నాకు ఆ పక్షిని చూస్తుంటే ఏదో ఆవేశం. ఏదో పూనకం వచ్చినట్టనిపించింది. ‘ఎగిరిపో, ఎగిరిపో ఇదంతా నిన్ను పట్టుకోవాలనే ప్రయత్నం’ అని పెద్దగా అరిచి గోలచెయ్యాలనిపించింది. అలా అరవకుండా వుండడానికి చాలా ప్రయత్నం అవసరమయ్యింది. నా అరుపులకు బెదిరి ఆ పక్షిగాని నిజంగానే పారిపోతే, క్రూరంగా కనిపిస్తున్న ఆ కుర్రాళ్లంతా నన్ను పట్టుకొని చావగొట్టేస్తారేమోననే భయంవల్ల అరవాలనే వుద్రేకాన్ని బలవంతంగా అణుచుకున్నాను. అయితే మరోమాట – ఏం జరుగుతుందో చూడాలనే కోరిక కూడా బహుశా నన్ను అరవనివ్వకుండా అదుపులో పెట్టిందేవిటో! ఏది ఏంకానీ, అరవాలన్న కోరికని అదుపుచేస్కొని, నరాలు తెగిపోతాయేమోనన్నంత ఉత్కంఠతతో వూపిరిబిగబట్టి చూస్తున్నాను. జరుగుతుందోనని.
అదెలా జరిగిందో నాకు తెలీదు – తాడు లాగ బడ్డం కుండ బోర్లాపడ్డం అందులో పక్షి బందీ కావడం – ఇవన్నీ మెరుపువేగంతో జరిగిపోయాయి. చెట్లచాటున పొంచివున్న కుర్రాళ్లంతా కెవ్వున కేకవేసి, ఓవిధమైన పైశాచికానందంతో చిందులు వేస్తూ కుండచుట్టూ గుంపుగా కూడేరు. పక్షికేవయివుంటుందో అనే భయంతో నా గుండెలు గుబగుబలాడుతున్నాయి. పక్షిని కుండలో బంధించిన కుర్రాడైతే, అతి బేఖాతరీగా దారాన్ని వుండచుట్టి, నింపాదిగా కుండదగ్గరకి వెళ్లి, దాన్ని కొద్దిగా ఎత్తి, లాఘవంగా పక్షిని చేత్తో ఒడిసిపట్టుకుని, బయటకితీసేడు, వాడి ఇనప పిడికిలిలో గిలగిల కొట్టుకుంటున్న పక్షిని దగ్గర్నుంచి చూడ్డానికి ఒకర్నొకరం తోసుకుంటూ చుట్టూ చేరాం. వాడుమాత్రం అతి నిర్లక్ష్యంగా తన వేట సామాన్లని నింపాదిగా ఖాళీగా వున్న చేత్తో సర్దుకుంటున్నాడు. పాపం పక్షి వాడి చేతిలోంచి బయటపడాలని గింజుకుంటూనే వుంది. సామాన్లు సర్దుకోడం అయిపోయాక, పక్షిని పట్టిన వాడి లాఘవాన్నీ మెచ్చుకోలుగా చూస్తున్న కుర్రాళ్లనీ పూర్తిగా నిర్లక్ష్యంచేసి వూరివైపు వెళ్లిపోవడం మొదలెట్టాడు. జాతరలాగ మేవంతా వాడి వెనక పడ్డాం. నాకు చాలా ఆందోళనగా వుంది. ‘వాడేం చేస్తాడా పక్షిని’ అని. దుర్మార్గంగా వున్న వాడి ముఖాన్ని చూస్తుంటే. సరదాకి ఆ పక్షిని పట్టినవాడిలా అనిపించటంలేదు. చివరికి వుండబట్టలేక పక్షిని వాడేం చేస్తాడని అడిగేను నాకు దగ్గరగా వున్న ఓ కుర్రాడ్ని. అయితే – నేను తెలుగులో వేసిన ప్రశ్న వాడికర్ధంకాలేదు. మరొకడ్ని, మరొకడ్ని అడిగేను. చివరికి మా గుంపులో వున్న ఓ ఆడపిల్లకి నా భావం అర్ధమయినట్టుంది కిసుక్కున నవ్వింది నా తెలివితక్కువతనాన్ని చూసి జాలిపడుతున్నట్టు.
‘ఏంచేస్తాడా? కాల్చుకుతింటాడు’ అని ఒరియాలో చెప్పి, నాకర్థంలయేలా అభినయించి చెప్పింది.
అర్థవయీ అవగానే నా నెత్తిమీద ఏదో బరువైన వస్తువు దభీమని పడిన భావం కలిగింది. ‘అంత అందమైన పక్షిని, ఏదో దేవలోకం నుంచి విచ్చేసినట్టు అనిపిస్తున్న పక్షిని కాల్చుకుతింటాడా?? వాడు మనిషా, మనిషి రూపంలో వున్న రాక్షసుడా?’ ఇలాంటి భావాలు కలిగాయి. ఏడుపొచ్చేస్తోంది. ఇంతలో చిన్న తెగింపులాంటి నిశ్చయానికి వచ్చేను. ముందుకు కాస్త పరిగెత్తి ఆ రాక్షసుడి పక్కకి చేరేను. చేరి వాడ్ని బతిమాలేను. ఒక్కసారి – ఒక్కసారంటే ఒక్కసారి ఆ పక్షిని నా చేతికిమ్మన్నాను. కేవలం దాన్ని ఒక్కసారి నిమిరి తిరిగి ఇచ్చేస్తాన్నాను. విన్నవించుకున్నాను. ఆ ప్రాధేయపడ్డం అంతా సౌంజ్ఞల్లోనే చెప్పుకున్నాను. అయితే నా మాటలుగాని, బతిమాలుకోడాలుగాని, జమీందారుగారి మనవడిగా నాకున్నదని నేను భ్రమించిన ప్రత్యేక హోదాగాని ఏదీవాడిముందు పనిచెయ్యలేదు. జటాయువుని విదిలించిన రావణుడిలాగ ‘జా,జా’ అని నన్ను విదిలించేశాడు. వాడ్ని కిందకి తోసేసి, వాడి చేతిలో గిలగిలకొట్టుకొంటున్న పక్షిని గుంజి లాక్కుని పారిపోవాలని వెర్రి ఆవేశం కలిగింది. కాని వాడు చూస్తే రాక్షసుడ్లా క్రూరంగా, బలంగా వున్నాడు. వాడిముందు నేనెంత. నా బలమెంత! కనీసం పక్షిని తాకడానిక్కూడా ఎవడ్నీ అనుమతించని వాడి మనస్తత్వం చూడగానే నాకు అర్ధవయిపోయింది- నిజంగానే వాడు నరరూప రాక్షసుడనిన్నీ, ఎంతటి అతిలోకసుందరమైన పక్షినైనా సరే దాన్ని వాడు నిర్దాక్షిణ్యంగా చంపి వండించుకుకొని తినగలడనిన్నీ. ఇహ ఆ మూక వెనకాతల వెళ్లడం నాకుసాధ్యంకాలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక్క వుదుటున ఇంటి తోపపట్టేను. నన్ను ఆ ఒరియా పిల్లలంతా వింతగా చూస్తు వుంటారని అనిపించింది. ఏలా ఇల్లు చేరుకున్నానో నాకే తెలీదు. ఇల్లు దగ్గరవుతున్నకొద్దీ వెక్కి వెక్కి ఏడవడం నామోషి అనిపించింది. తాతగారుగాని, నాన్నమ్మగారుగాని చూస్తే నా ఏడుపుకి కారణాలు ఆరాతీస్తారు. అంతా విని నవ్వేస్తారు, దాన్ని నేను భరించలేను. అంచేత బలవంతంగా ప్రయత్నం చేసి ఏడుపు దిగ మింగేను. నన్ను నేను పూర్తిగా కంట్రోల్ చేసుకున్నానని ధైర్యం కలిగిందాకా ఈ గడ్డికుప్ప వెనకా, ఆ పాక వెనకా తచ్చాడుతూ గడిపేను.
అయితే భోజనాల దగ్గర తాతయ్య అడగనే అడిగేరు. ” ఏమిట్రా మొకం అలా జేవురించివుంది. ” అని. సమాధానం చెప్తే ఎక్కడ ఏడుపొచ్చేసి బయట పడిపోతానో అని ఏవీ లేదన్నట్టు తల ఆడించేను. నాన్నమ్మ మాత్రం దగ్గరకొచ్చి వొళ్లు ముట్టుకొని చూసి ” ఏమిట్రా వళ్లు వేడిగా వుంది ? ఇవాళ మజ్జిగ అన్నం తినకు. చారుతోనే మరోమారు తిను” అంది. ” అసలు నాకన్నం సయించడం లేదు. ” అని లేచిపోయిచేతులు కడిగేసుకున్నాను. అవతల ఆ దుర్మార్గపు వెధవ పక్షిని కూర చేయించి తింటుంటాడని వూహరాగానే తిన్న కాస్త అన్నం కూడా భళ్లున వాంతైపోయింది.
నాన్నమ్మ నన్ను పడుకోబెట్టి, మెల్లగా జోకొట్టింది. మగతగా నిద్రపట్టింది. నిద్రలో కలలు – ఆ పక్షిని అంత అరుదైన అందమైన పక్షిని – నా చేతుల్లోకి తీసుకొని, ఎంతో ఆప్యాయంగా నిమురుతున్నట్లు, నామీద పూర్తి నమ్మకంతో ఆ పక్షి నా చేతుల్లో ఒదిగి పోయి, ఎర్రని పగడం రంగు ముక్కుతో సుతారంగా నా బుగ్గని తాకినట్టు – ఇలా ఎన్నో కలలు. తెల్లారి లేచేటప్పటికి జర్వం. నీరసం వల్ల కదల్టానిక్కూడా ఓపికలేక మంచానికి అతుక్కుపోయి పడుకోవలసి వచ్చింది. అయితే, ఇంత జర్వంలోనూ ఆలోచనలు మాత్రం ఆ పక్షి చుట్టూనే గూడుకట్టుకోని తిరుగుతున్నాయి, అడవికి తిరిగి మరోసారి వెళ్లను గాక వెళ్లనని నిశ్చయించుకున్నాను. మనస్సులో, ఈ నిర్ణయం ఆట్టేసేపు నిలవలేదు. అడివిలోకి ఒక్కసారి వెళ్లి, ఈ పక్షి కుటుంబానికి చెందిన పక్షి మరోటి కనపడితే, దానికి జరిగిందంతా చెప్పి, ఏవీ చెయ్యలేకపోయిన నా ఆశక్తతకి మన్నించమనికోరితే ? పక్షులకి మన మాటలు అర్ధంకావు. కాని నేను చెప్పదల్చుకున్నది చెప్పేయాలి అంతే.
ఓ వారం గడిచింది. జర్వం క్రమేపీ తగ్గింది. ఈ లోగా తాతగారి పొలంపన్లు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లున్నాయి – ఇంటికి బయల్దేరాలనే హడావిడి వారిలో కనిపిస్తోంది. నాన్నమ్మ, తాతయ్య వాళ్ల పనుల్లో వాళ్లు సతమతమవుతూ వుండడంవల్ల నాతో తీరిగ్గా కబుర్లు చెప్పడానికి వాళ్లకి టైము దొరకడంలేదు. ఒరియా పిల్లల్తో ఆటకి వెళ్లడానికి ఎందుకనో ఇష్టం లేకపోయింది. వాళ్లు తప్పనిసరిగా అడవిలోకే తీసికెళ్తారు, ఆటకి. దాంతో పక్షి గురించి జ్ఞాపకాలు – అంచేత వెళ్లి కలియలేకపోయాను వాళ్ల ఆటల్లో.
అయాతే నిర్వాపారంగా కూర్చన్నప్పుడల్లా ఆలోచనలు పక్షిమీదికే మళ్లేవి.
ఆవేళ పొద్దుట్నుండే ఆకాశం మబ్బుపట్టి మసగ్గావుంది. వేళ గడుస్తున్నకొద్దీ మబ్బులు మరింత దట్టమై ఏ క్షణంలో వర్షిస్తుందో అన్నట్టుగా వుంది. ఒరియా పిల్లల సందడి ఎక్కడా వినిపించడం లేదు. వానవస్తుందని భయపడి బహుశా ఇళ్లల్లోనే వుండిపోయారేమో!
అలాటి సమయంలో వచ్చింది- ఓ సరికొత్త ఆలోచన. ఎవరూ లేని ఇలాటి సమయంలో అడవిలోకి వంటరిగా వెళ్లి, మరో పక్షిని మెళ్లిగా పట్టుకొని, దానికి క్షమాపణలు చెప్పుకుంటేనో? నీ జాతిదే అయిన ఆ అందమైన పక్షిని ఆ కిరాతకుడు బంధించి, నలిపేస్తూ దానికి వూపిరాడకుండా చేసి, ఇంటికి పట్టుకొళ్లి వండుకొని తినేశాడు. దాన్ని కాపాడ్డానికి నేనేవీ చెయ్యలేకపోయాను – ఏడవడంతప్ప. అంచేత నా చేతకానితనానికి నన్ను మన్నించవూ అని ఏ పక్షి దొరికితే ఆ పక్షిని వేడుకోవాలనే తీవ్రమైన కోరిక కలిగింది.
ఇవన్నీ ఉత్తి వెర్రి వెర్రి ఆలోచన్లుగా అనిపిస్తాయి మనకివాళ. ‘వీడొత్తి సెంటిమెంటల్ ఫెలో అన్న మాట’ అని కూడా నీకనిపించవచ్చు. కాని నాకు మాత్రం అవేళ కలిగిన ఆలోచనలు, భావాలు అప్పటికీ, యిప్పటికీ కూడా నిజాలు. ఏమిచెయ్యలేని నాచేతకాని తనానికి పక్షులన్నిటినీ అయితే ఇలాంటి క్షమాపణ కోరుకోవలసిన బాధ్యత నామీదుందని మనస్సుచెప్తోంది బరువైన మాటల్లో కాకుండా- వయస్సుకి తగిన పద్ధతిలో.”
రవి తను చెప్తున్నది ఆపేడు. వాడివైపు చూస్తుంటే ఏదో తీవ్రమైన మానసిక ఘర్షణకి గురైనవాడులా కనిపించేడు. ఊరడించబోతే ఏవిధంగా రియాక్ట్ అవుతాడోనని భయంవేసి మాట్లాడకుండా కూర్చున్నాను. కాసేపటికి రవి మళ్లీ మామూలు స్థితికొచ్చినట్టున్నాడు తిరిగి ప్రారంభించేడు.
“అడివిలోకి వంటరిగా వెళ్లడానికి ధైర్యం చాల్లేదు చాలాసేపటివరకూ. అయితే వెళ్లకండా వుండడానికీ మనస్సాప్పడంలేదు. చాలాసేపు వూగిసలాడేను. చివరికి ఏవయితే అదేకానీ అని తెగించి అడవిలోకి బయల్దేరడానికి నిశ్చయించేను. నిశ్చయంచేసీ చెయ్యగానే ఎక్కడలేని చురుకుతనం వచ్చేసింది. గబగబ అటూ ఇటూ తిరిగి, గుట్టుచప్పుడు కాకుండా ఓ పాతకుండ, కర్రముక్క, పురితాడు సంపాదించగలిగేను. ఎవరికీ తెలియకుండా, ఎవరికంటాపడకుండా ఈ వస్తువులన్నీ నాకు దొరకడం, నేను గుట్టుచప్పుడుకాకుండా అడవిలోకి వెళ్లగలగడం ఇవన్నీ ఏదో విధి సంకల్పంలా అనిపిస్తోంది ఇప్పుడు తలుచుకుంటే. “Eve of St.Agnes” పద్యంలో ప్రేమికులు తప్పించుకుపోతున్న సందర్భం కేవలం ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ అని మనకి అనిపించినప్పుడు, ఆవేళ నేనడవిలోకి వెళ్లగలగడం, అక్కడ జరిగిన సంఘటనలు కూడా అలౌకికశక్తుల ప్రేరణతోనే జరిగివుంటాయని నా విశ్వాసం. ఎవరి దృష్టిలోనూ పడకుండా ఆడవిలోకి ఎలా పరుగుతీయగలిగానో ఆపరమాత్ముడికే తెలియాలి.
అయితే, తీరా అడవిలోకి వచ్చింతర్వాత ఎందుకో బాగా భయంవేసింది. “The woods are lovely, dark and deep” అంటాడు Robert Frost మంచుకురుస్తున్న సాయంకాలం అడవుల్ని చూస్తూ, ఇప్పుడు నా మనోనేత్రం ముందు ఆనాటి అడవి దృశ్యాన్ని ఆవిష్కరిస్తే, మేఘాల కంబళి కింద ఒదిగిపోతున్న అడివి అచ్చం Frost వర్ణించిన దృశ్యంలాగే వుంది.
ఆ సంఘటన జరిగిన్నాటికి నేను బాగా చిన్న కుర్రవాడ్ని, అంచేత అలాటి వాతావరణంలో కనిపిస్తున్న అడవి దృశ్యాన్ని చూసి భయపడ్డం సహజం. అడవిలో పిట్ట మనిషి లేడు. మబ్బువల్ల బాగా తొందరగా చీకటిపడిపోయి, అడవి చిక్కగా, చీకటిగా, భీతావహంగా కనిపిస్తోంది.
అయితే పక్షుల్ని పట్టుకోడానికి మాత్రం పరిస్థితి చాలా అనుకూలంగా వున్నట్టనిపించింది,
చీకటి పడిపోతుండడం, వాన రాబోతున్నట్టనిపించటం వల్ల కాబోలు, పక్షులన్నీ చెట్ల మీదికి గుంపులు గుంపులుగా చేరిపోయి, ఓ కొమ్మమీంచి మరో కొమ్మ మీదికి దూకుతూ, ఆందోళన పడుతున్నట్టనిపిస్తూ అరుస్తున్నాయి. వాటిని ప్రలోభ పెట్టడానికి అది సరియైన సమయం. మెల్లిగా ధైర్యాన్నంతట్నీ కూడగట్టుకొని, గబగబా బియ్యం గింజలు జల్లి, కుండనీ, తాడునీ ఆ దుర్మార్గుడు ఏర్పాటుచేసినట్టుగానే అమర్చి, తాడు రెండవ చివరి పట్టుకొని చెట్టు చాటున ఒదిగేను.
కాలం గడుస్తోంది – అతి నెమ్మదిగా. చెట్ల నిండా పక్షులే. అయితే నేను ఆశించినదానికి భిన్నంగా ఒక్క పక్షి దిగడం లేదు నేల మీదికి. ఇంతలో చిన్న జల్లుకూడా ఆరంభమయింది. ఆడివిలో చెట్ల మీద, ఆకుల మీదా వర్షం చినుకులు పడుతూ వుంటే మనకు తెలియని వాద్య పరికరం యేదో నెమ్మదిగా మోగుతున్నట్టు అనిపించింది. ముసురుకుంటున్న చీకటి, చినుకులు, యీ వింత శబ్దం వాటి వల్ల ఏదో తెలియని భయంతో కాళ్ళ నుండి ప్రారంభమయిన చిన్న వణుకు మెల్లమెల్లగా శరీరమంతటికీ వ్యాపిస్తోంది. గుండెలు గబగబ కొట్టుకుంటుంటే, ఇహ ఇక్కడ వుండడం అసాధ్యం అనిపించింది. పక్షి లేదు. పట్టుకోవడం లేదు ముందీ అడవి నుండి బయటపడి యింటికి చేరుకుంటే చాలు ననిపించి, చెట్టు చాటు నుండి బయటకి వచ్చేయబోతున్నాను. అదిగో సరిగ్గా ఆ క్షణంలో ఓ పక్షి కిందికి దిగి, కుండ దగ్గర జల్ల బడిన బియ్యం గింజల్ని త్వర త్వరగా ఏరుకుతింటోంది. చెట్టు చాటు నుండి రాబోతున్న వాడినల్లా మళ్ళా వెనక్కి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి ఆసక్తిగా చూశాను పక్షిని.
నేను చూస్తున్నది నిజమో, కలో ఒక్క క్షణం తేల్చుకో లేకపోయానంటే నమ్ముతావా ? ఏ పక్షినయితే ఆ కిరాతకుడు పట్టుకొని, కూర కింద మార్చేశాడో. అదే పక్షి మళ్ళీ ఆకారం ధరించి నా ముందు కదులుతున్నట్టుగా అనిపించింది. దాని ఠీవి, రంగు, సొగసు చూస్తుంటే నిజంగానే అది దేవలోకం నుంచి దిగి వచ్చిన అపురూపమైన పక్షిలా కనిపించింది. లేక, మసక వెలుతురు నేపధ్యంలో ఆ పక్షి నా కంటికా విధంగా కనిపించడం ఒక భ్రమా ?
ఏది ఏమవయితేనేగాని, నా కలల్లో కనపడిన పక్షి మాత్రం అదే. దాన్ని పట్టుకొని లాలించాలనే భావనపోయి, దాని స్వేచ్ఛా సంచారం చూడాలనే కోరిక! అంత మనో నిబ్బరంతో , నిర్భయ భావంతో గింజలు తింటున్న పక్షిని బందీ చెయ్యడం అంటే, దాని విశ్వాసాన్ని వమ్ము చేసినట్టేకదా!
అయితే, నా చేతికి ఏం తెగులోచ్చిందో నాకుతెలీలేదు. చిన్న పిల్లల్నిచూడూ, ఆసంకల్పితంగా ఏవో వస్తువుల మీద చేతులు వేసి కదపడం, వూపడం, లాగడం లాంటివి చేస్తుంటారు- సరిగ్గా అలాగే జరిగింది అనుకోని హఠాత్సంఘటన.
నా ఆలోచనలు ఆ పక్షి రంగు గురించీ, స్వేచ్ఛా విహారం గురించీ, ఠీవి గురించీ ఆలోచిస్తుంటే, నా ఆలోచనలతో ప్రమేయం లేకుండా నా చెయ్య మెరుపు వేగంతో తాడుని సర్రునలాగడం, అందులో పక్షి బందీ అయిపోవడం అన్నీ లిప్తకాలంలో జరిగిపోయాయి.
అనుకోకుండా జరిగిన ఈ హఠాత్సంఘటన వల్ల ఒక్క క్షణం నిశ్చేష్టుడ్నయి నిలబడిపోయాను. అయితే మరుక్షణమే తేరుకుని ముందుకి నడిచాను. పక్షిని జాగ్రత్తగా బయిటికి తీసి, దాని రూపాన్ని దగ్గర్నుండి తనివి తీరా ఒక్కసారి చూసి, దాన్నోక్కమారు నిమిరి వదిలెయ్యాలి. స్వేచ్ఛాగా ఎగరడానికి – అదీ నా మనస్సులో ఆ క్షణానికి వున్న సంకల్పం. కుండ దగ్గరకు చేరుతుంటే నా గుండె డప్పులా కొట్టుకుంటోంది. కుండని తాకబోతున్నాను. ఇంతలో భూమ్యాకాశాలు ఒకేసారి అంటుకున్నట్టు మెరుపు, దాని వెనకనే ఆకాశం రంకె వేసినట్లు పిడుగు పాటు, దాని వెంటనే చిమ్మ చీకటి. వున్నపళాన ఆకాశం కరిగిపోయినట్టు కుండపోతగా వర్షం. ఈ వుత్పాతాలకి బెదిరి కాబోలు దూరంగా అడివిలో ఎక్కడో ఏదో క్రూరమృగం గర్జించింది. ఇవాళ నీతో చెపుతున్నాను. భయంతో నిక్కరు తడిసిపోయింది. గుండెలు అవిసిపోయాయి. ప్రాణాలు దక్కించుకోవాలనే ఆశతో ఒకటే దౌడు లంకించుకున్నాను. బోర్లా పడిన కుండ, అందులో బందీ అయిన పక్షి దాన్ని ముద్దుగా నిమరాలనే నా ప్రగాఢమైన వాంఛ – యివన్నీ గుర్తు లేకుండా పోయాయి. ఎలాగైనా నా ప్రాణాలు దక్కించుకోవాలనే ఆరటంలో పక్షి ప్రాణాల గురించి ఆలోచించడానికి ఆస్కారం లేకుండా పోయింది. భయంతో ఎటు పరిగెడుతున్నానో తెలియక, చెట్లకీ, పుట్టలకీ గుద్దుకుంటున్నాను. పడిపోతున్నాను. అయితే గ్రామం వైపునుండి మినుకు మినుకుమని కనిపిస్తున్న దీపాలని గుర్తుగా చేస్కొని, మెల్లిగా వూరుచేరుకోగలిగాను.
ఇల్లు చేరుకున్నప్పటికీ నా ఒళ్ళంతా చీరుకుపోయి రక్తంతోనీ, బురదతోనీ నానాభీభత్సంగా వుంది. వాన వల్ల అక్కడా యిక్కడా దాక్కోడానికి వీలు పడలేదు. నా ఆకారం చూసి జడిసిపోయింది నాయనమ్మ. తాతగారు కేకలు వేశారు. పరిగెత్తి వస్తుంటే జారి, ముళ్ళ తుప్పల్లో పడ్డాననీ, ఒళ్ళు చీరుకుపోయిందనీ బొంకేను.
సరే, స్నానం చేయించి, మంచి బట్టలు తొడిగి, అన్నం పెట్టి పడుక్కో బెట్టారు. కాని నిద్ర వస్తేనా? పక్షి ఏవయ్యంటుందోనని ఒకటే ఆలోచన. వెచ్చగా దుప్పటి కింద పడుకున్న నేను మెల్లిగా నాకు నేనే సమాధాన పరుచుకున్నాను పక్షికేమీ ఆపద జరిగి వుండదని, కుండ క్రిందన వున్న బియ్యపు గంజలు దాని తిండికి సరిపోతాయి. అంచేత ఆకలితో చచ్చిపోదు పక్షి. పోతే, వానపడుతోంది కనక, కుండ లోపల వెచ్చగా, హాయిగా వుంటుంది. పక్షికేం కాదు తెల్లవారీ తెల్లవారగానే అడివిలోకి పరిగెత్తి పక్షిని తప్పించేస్తాను బందిఖానా నుండి యివీ నా ఆలోచనలు. ఈ రకంగా ఆలోచించగానే నిద్రపట్టేసింది.
నిద్రలో మళ్ళీ కలలు – కలల్లో పక్షి. ఎదురుగా వున్న కిటికీ మీద కూర్చుని పక్షి నన్ను శపించే కళ్ళతో చూస్తోంది. పక్షితో నేనిలా అన్నాను – “నేను నిన్ను చంపి తినాలని కాదు పట్టుకున్నది. నీతో కాసేపు ఆడుకుందావని మాత్రమే. నువ్వెంతో అందంగా వున్నావు అంచేత నిన్ను దగ్గర్నుండి తృప్తిగా చూడాలని నిన్ను పట్టుకున్నాను. అంతే” అని. పక్షి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అంది “ఆ కిరాతకుడే నీ కంటే నయం ఓ విధంగా. వాడు పీక నులిమేసి, చిటికెలో చంపేవాడు – కాని నీలా బాధించి, బాధించి, బాధించి….” పూర్తి చెయ్యలేదు పక్షి. తృళ్ళిపడి లేచేను. పక్షి కళ్ళల్లో కనిపించిన బాధ, వేదన నన్ను కోస్తున్నట్టుగా అనిపించింది. లేచి చూస్తే తెలిసింది – అదంతా కలని, గది నిండా చిమ్మ చీకటి. బయట ధారాపాతంగా కురుస్తున్న వాన. ఈ కల సంఘటన జరిగిన చాలాసేపటి తర్వాత తెల్లవారింది.
తెల్లవారిందన్న మాటేగాని, కారు మేఘాల వల్ల అంతా చీకటిగానే వుంది. కుంభ వృష్టిగా వాన. నేను రెస్ట్ లెస్ గా యిల్లంతా కలియ తిరుగుతున్నాను. వాన కొద్ది క్షణాలు తెరిపిచ్చినా చాలు, అడవిలోకి పరిగెత్తి పక్షిని తప్పించాలనే తపన. కాని వాన తగ్గడం లేదు సరికదా. అంతకంతకీ దాని వుధృతం పెరుగుతోంది. అలా పేట్రేగిన గాలీ, వానా అయిదు రాత్రులూ, అయిదు పగళ్ళూ అయినాగ్గాని శాంతించలేదు.
గాలివాన తగ్గిందన్నమాటేగాని, ఎటూ కదల్లేని స్థితి. ఎటు పక్క చూసినా జల దిగ్బంధం. పొలాలు నీటిలో మునిగిపోయాయి. చేతి కందిందనుకున్న పంట నీటి పాలయిందని తాతగారు కల్లుతాగిన కోతిలా గెంతుతున్నారు. తుఫానుకి యిళ్ళూనేల మట్టవయిపోయి గ్రామం గ్రామమంతా నిరాశ్రయులయారు. ఎటు చూసినా హాహాకారాలు, నిట్టూర్పులే.
నాకయితే యివన్నీ పక్షి చేస్తున ఆక్రందనలా వినిపిస్తోంది. ఒక్కసారి అడవిలోకి పరిగెత్తి వెళ్ళి వచ్చేద్దాంవంటే, అక్కడ్నుండే నీరు పరవళ్ళు తొక్కుతూ, గర్జిస్తూ, చిలక సరస్సు వైపు ప్రవహిస్తోంది, సముద్రంలా. వూరందరిదీ ఒక రకం దిగులయితే, నాది మరోరకం దిగులు.
మరో రెండ్రోజుల్నాటికి నీటి జోరు తగ్గి చిన్న తోవలాంటిది కనపడింది అడవిలోకి. కాస్త ఎండ కూడా ఎక్కింది. ఈ అవకాశం కోసమే నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను. చడీ, చప్పుడు కాకుండా యింట్లోంచి బయటపడి, అడవిలోకి ప్రవేశించాను. తీరా కాస్త లోపలికి వెళ్ళి చూసేప్పటికి మొత్తం అడివంతా నీటిలో కూరుకుపోయి యమ భయంకరంగా కనిపిస్తోంది. అయితే తమాషా ఏవిటంటే, పక్షిని నేను బంధించిన చెట్ల దిసగా నడవడానికి మాత్రం, నా కోసం ప్రత్యేకంగా ఏర్పాటయిందా అన్నట్టు. ఓ చిన్న కాలిబాట కనపడింది. మహాసముద్రంలా కనిపిస్తున్న నీటి మధ్యని కాలబాటేమిటి, అబ్సర్డ్ అనకు నిజంగా ఓ కాలిబాట కనపడింది. జాగ్రత్తగా అడుగులో అడుగువేసుకుంటూ, చెట్ల దగ్గరికి చేరుకున్నాను. అక్కడ మరో ఆశ్చర్యం కాచి పెట్టుకుని కూర్చుంది నా కోసం.
జలప్రళయంలా ఎటు చూసినా నీరే అని చెప్పేనా, కాని అంతటి నీటి మధ్యనా, కేవలం కుండ కోసమే మిగల్చబడినట్టు ఓ చిన్న మట్టి జాగా, ఆ జాగా మీద బోర్లా పడి కనిపిస్తున్న కుండ! అయిదు రోజుల తుఫాను, జడివాన కుండనేవీ చెయ్యలేకపోయాయి! అయిదురోజులుగా వూగి వూగి, అలసిపోయి, నిస్త్రాణంగా నిల్చున్న చెట్లు, ప్రపంచాన్నే చుట్టుముట్టిన కన్నీటి ప్రవాహంలా నీరు. ఈ దుఃఖానికంతటికీ కారణభూతంలా మట్టి మీద బోర్లాపడి కనిపిస్తున్న కుండ!
కుండ దగ్గరకి వెళ్ళడానికి నాకెందుకో ధైర్యం చాలలేదు. గుండెలు గడగడ కొట్టుకుంటున్నాయి. అలా కుండని చూస్తూ ఎంతసేపు స్తబ్దంగా వుండి పోయానో నాకే తెలీలేదు. అయితే నిష్క్రియంగా అలా ఎంత సేపని నిల్చుంటాను? చివరికి మెల్లగా గుండె చిక్క బట్టుకొని, ఒక్కొక్కడుగు తాపీగా వేస్తూ కుండని సమీపించాను. పక్షికి ఏ ఆపదా జరిగి వుండకూడదనిన్నీ, నిజానికి పక్షి ఎలాగో ఓలాగ ఈ పాటికే తప్పించుకొని బయటికి పోయుండాలనీ ఆకాంక్షిస్తూ, నెమ్మదిగా కుండని తిప్పేను.
“ఆ!”అని ఒక్క పెనుకేక నా నోట్లోంచి వెలువడింది. మరుక్షణం బురదలో చతికిలబడిపోయి రోదించడం మొదలెట్టాను. ఆ క్షణంలో ఆకాశం నా నెత్తిమీద కూలిపోయినా నా కంత బాధ అని పించకపోనేమో! నాకెదురుగా చచ్చి కింద పడి వున్న పక్షి కనిపిస్తోంది. దాని కళ్ళల్లో ఓ కన్ను యింకా మూతపడకుండా తెరుచుకునే వుంది. ఆ తెరచి వున్న కన్ను నన్ను శపిస్తున్నట్టుగా అనిపించింది. తుఫాను నాటి తొలి రాత్రి నాకు వచ్చిన కలలో ఇదే రకంగా కనిపించాయి పక్షి కళ్ళు. కలలో పక్షి చెప్పినట్టు నేనే పెద్ద దుర్మార్గుడ్నని రుజువైంది. ఆకలి, దాహం, భయంతో రోజుల తరబడి గలగిలా కొట్టుకొని, కొట్టుకొని చచ్చిపోయి వుంటుంది! మరోసారి కన్నెత్తి చూశాను – నేను చేసిన నిర్వాకం వైపు.
దాని అందవైన పొడవాటి ముక్కు ఆకురాయితో అరగదీయబడినట్లు మొద్దుబారి వుంది. ఏ శక్తి అలా చెయ్యమని నన్నుప్రేరేపించిందో నాకు తెలీదుగాని, అక్కడ పడి వున్న కుండని మెల్లిగా ఎత్తి పట్టుకొని లోపలికి చూశాను. కుండ పైభాగం అంతా చిన్న చిన్న రంధ్రాలు కనిపించాయి. అంటే… అంటే… బంది ఖానా నుండి తప్పించుకోడానికి తన ముక్కునే ఆయుధంగా వుపయోగించి కుండకి తూట్లు పొడిచి బయట పడాలని అసంఖ్యాకమైనన్ని సార్లు ప్రయత్నించి, ప్రయత్నించి, ముక్కు మొద్దుబారి నిరుపయోగమైనంత వరకూ ప్రయత్నించి, కడసారి శక్తి వున్నంత వరకూ ప్రయత్నించి, విఫలమై ఆయాసపడుతూ ప్రాణాలు విడిచి పెట్టుందన్న మాట! ఎంత సేపుకొనసాగించిందో పోరాటం- జీవంచడానికి! బతకాలని అది చేసిన ప్రయత్నాల మధ్య, ఎన్ని వేల సార్లు నన్ను శపించిందో కదా!
ఏడుస్తూనే నీళ్ళ మధ్యనుండి బయటపడి యిల్లు చేరుకున్నాను. ఇల్లు చేరుతూనే వూరికి వెళ్ళిపోదావని గోల ప్రారంభించాను. అసలే చికాకుల్లో వున్న మా తాతగారు నా గోలని భరించలేక పనివాడ్ని సాయమిచ్చి వెంటనే నన్ను మా వూరికి దిగ బెట్టేశారు. కొంత కాలానికి ఆ పక్షి, దాని జ్ఞాపకాలు మరుగున పడిపోయాయని భ్రమలో వున్నాను. అవును. అది కేవలం భ్రమే! మేష్టారు “ఏన్షెంట్ మేరినర్” పాఠం ఏనాడయితే చెప్పేరో – అదిగో ఆవేళ నుండీ పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ నన్ను వెంటాడ్డం మొదలయింది. “చెప్పడం ఆపేడు రవి. అలసిపోయినట్టు కనినిస్తున్న వాడ్ని కదపడానికి నాకు భయం వేసింది. ఏదో మంత్రశక్తి ప్రభావానికి లోనయిన వాళ్ళల్లాగ శారదా, నేనూ నిశ్చలంగా రవిని చూస్తూ కూర్చున్నాం. మంచం మీద కూర్చున్నవాడల్లా లేచి పచార్లు ప్రారంభించాడు. వర్షం కురవడం తగ్గింది. అర్ధారాత్రి దాటినట్లుంది. అంతటా నిశ్శబ్దం. ఉండుండి కప్పల బెకబెకలు. లేచి వెళ్ళడానికి గాని, సంభాషణ కొనసాగించడానికి గాని శక్తిలేని వాళ్ళలా కూర్చున్నాం శ్రోతలమిద్దరం. కాసేపటికి పచార్లు ఆపి మా యిద్దరి ముందుకీ వచ్చి నిలబడ్డాడు రవి. ఎంతో వేదనకి గురయిన వాడిలా మాటల్ని బరువుగా, నెమ్మదిగా పలుకుతూ యిలా అన్నాడు. “ఆ వేళ ఆ పక్షి ఎంత బాధ ననుభవించిందో కదా! అయితే, యిన్ని సంవత్సరాల కాలంలో దాని బాధ నిజంగా ఎలా వుండి వుంటుంది అన్నది నా వూహకి అందని విషయంగానే వుండి పోయింది. తీవ్రంగా బాధపడి వుంటుందని తెలుసు – కాని మరణానికి ముందు అది అనుభవించిన వేదన యిలా వుండి వుంటుందని యివాల్టికిగాని నాకు తెలిసి రాలేదు”
“బాత్రూమ్‌లోకి స్నానానికి వెళ్లేనా, లోపలున్న నాతో ఏవో ముద్దు ముద్దు కబుర్లు చెపుతూ, యధాలాపంగా గడీ వేసేశాడు బాబు అనుకోకుండా నేను తాడుని లాగి, కుండలో పక్షిని బందీ చేసేనే – అలాగన్నమాట. ఆ గడే వేస్తే తిరిగి తియ్యటం ఎంతో కష్టం అని వాడికేం తెలుసు! స్నానం చేస్తుంటే నీళ్ళు కొద్దిగా పొయ్యిలోపడి మంట ఆగిపోయింది. పొగ కాలసర్పంలా నన్నూ గదినీ చుట్టు ముట్టింది. పొగ బయటికి పోవడానికి వీలులేని పద్దతిలో కట్టేరు ఆ బాత్రూమ్‌ని.
పొగవల్ల వూపిరి సరిగ్గా పీల్చలేకపోతున్నాను. ఫర్వాలేదులే అనుకున్నాను మొదట్లో. మరో రెండు నిమిషాలయేటప్పటికి తెలిసొచ్చింది- వూపిరి పూర్తిగా సలపడం లేదని “ఏస్ఫిక్సియేషన్’ వల్ల చచ్చిపోతానేమోననీ భావన కలగ్గానే చెప్పలేనంత భయం వేసింది. తలుపులు దబదబ బాదేను – అరిచేను. అయినా ప్రయోజనం లేకపోయింది. అవతల నుండి తలుపు తియ్యాలని ప్రయత్నం చేసి, తియ్యలేక, బాబు చేస్తున్నగోల, ఏడుపు తెలుస్తూనే వుంది. నా కేకలు అంతకంతకూ ఫీబుల్ అయిపోతుండడం. నాకు తెలివి తప్పుతుండడం నాకు గుర్తుంది. క్రింద పడిపోతుండగా, కడసారి నాకు మెరుపులా ఆలోచన వచ్చింది. ఆవేళ పాపం ఆ పక్షి కూడా యిలాగే, నాలాగే కొట్టుకొని, కొట్టుకొని, సొమ్మసిల్లిపోతూ, కడసారి స్పృహలో నన్ను శపిస్తూ పడిపోయి వుంటుందని” మంత్రముగ్ధుల్లా చూస్తున్న మా యిద్దరి మీదా చెరో చెయ్యివేసి “నేనెందుకు బ్రతికేనో తెలుసా? నేను తెలిసో, తెలియకో చేసిన తప్పుని ప్రపంచానికి తెలియ చెప్పాలని! పక్షికి నా వల్లజరిగిన అన్యాయం కేవలం కాకతాళీయం కావచ్చు. కాని నేను చేసిన తప్పుని అర్ధం చేస్కొగలిగిన నీలాంటి వాళ్ళకేనా చెపితే, నాకు నిజవైనా వూరట లభిస్తుంది. నేను క్షమించబడ్డాను అనే భావన కలుగుతుంది నాకు. ఈ కధని నీకు చెపుతూ మధ్యలో కాసేపు ఆపేనా – ఆ సమయంలో నాకో వింత అనుభూతి కలిగింది. ఆ వేళ చచ్చిపోయిన పక్షి ఒక్కసారి లేచి, నాకళ్ళ ముందే టకటక రెక్కలు విదిల్చి, కొత్త వుత్సాహంతో, సంతోషంతో ఎగురుతూ వెళ్ళిపోయినట్టు”
రవి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. వాడి కళ్ళ వెంట నీళ్ళు. శారద వెంటనే లేచి వెళ్ళి వాడికి దగ్గరగా కూర్చుని “వూర్కోండి, ఏవిటిది బొత్తిగా చిన్న పిల్లల్లాగ” అంది ఓదార్పుగా.
“నీ agony నా కర్ధవయింది” అన్నట్లుగా తల ఆడించి బయటికి వచ్చేశాను. పారిపోతున్న మేఘాల మాటు నుండి వుండుండి చంద్రుడు కనిపిస్తున్నాడు.
(ఆంధ్రజ్యోతి దీపావళి సంచిక 1993)

ఏ.వి.రెడ్డి శాస్త్రి
ఏ.వి.రెడ్డి శాస్త్రిగా పేరుగాంచిన ఆకెళ్ళ వెంకట రెడ్డి శాస్త్రి గారు 23 జులై 1935 సంవత్సరంలో జన్మించారు. ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఫిల్. చేసిన రెడ్డి శాస్త్రిగారు గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా చేసి రిటైరయ్యారు. కథకుడుగానూ, విమర్శకుడిగానూ ప్రముఖులు. సంప్రదాయం పైన గౌరవమూ, ఆధునికతపైన అభిమానమూ ఆయన దృక్పథంలో ప్రస్ఫుటంగా కనబడతాయి. ‘అసంగత సంగతాలు’, ‘ఈ మంటలు చల్లారవు’ వంటి కథా సంకలనాలు ఆయనకున్న కథానికా ధోరణులపైన ఆయనకు వున్న అవగాహనకూ గొప్ప ఉదాహరణగా నిలిచాయి. ఆంగ్ల సాహిత్య అధ్యయనంతోబాటూ ఎప్పటికప్పుడు సమకాలీన సాహితీ విషయాల పట్ల స్పందిస్తూ వుండడం ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టతలు. 04 ఏప్రిల్ 2021 రోజున ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు.
