” యుద్ధం మధ్యలో నువ్వు ” ఈ కవితా సంపుటి
దేశ సరిహద్దుల్లో జరిగే రణరంగం గురించి కాదు
ప్రేమ,దు:ఖము,మైత్రి,మానవీయత, పశ్చాత్తాపాల
భావసంఘర్షణలతో మనిషికి మనసుకి
నడుమ జరిగే ఆంతరంగిక యుద్ధం గురించి.
ఏది ఊరికే రాసినట్టు అనిపించదు
తనలో ఊపిరాడనివ్వని భావాలన్నింటినీ కవిత్వమే తన చేత రాయించుకున్నట్టు ఉంటుంది.ఏళ్లనాటి అనుభవంతో రాసిన ఈ కవితల్లో మనల్ని మనం బాధలోనో,స్నేహంలోనో,ప్రేమలోనో ద్రోహంలోనో ఎక్కడోచోట వెతుక్కుంటూనే ఉంటాం.
మనల్ని మనకు వెతికి పట్టించే కవితా వాక్యాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.సరళంగా కొన్ని,తాత్వికంగా కొన్ని.తాత్వికంగా ఉన్న వాటిలోకి చొరబడాలంటే పాఠకుడిగా నవతరం మాత్రం కాస్త హోమ్ వర్క్ చేయాల్సిందే. కానీ లోతైన భావనలతో ఉన్న సరళమైన వాక్యాలు మాత్రం పాఠకుడిని ని పట్టుకొని
వెంటాడుతూనే ఉంటాయి.
చదువుతున్నంత సేపు ఆఁ వాక్యాల వెంట పరిగెడుతూ, ఘాడమైన అభివ్యక్తీకరణల చుట్టూ తిరుగుతూ కాసేపు కాసేపు అక్కడే ఆగిపోతాం, తాత్వికమైన వాక్యాల్లోకి తర్కిస్తూ నెమ్మదిగా జారిపోతాం.
ఆరంభంలో
” బాధని వినే చెవి ఉండాలి
ఆ చెవికి హృదయం ఉండాలి
యెన్ని ఆత్మహత్యలైనా నిలిపివేసే శక్తి హృదయమున్న చెవికి ఉంటుంది”అని
గుండెలోలోపల ఉక్కపోస్తూ గుక్కపెట్టే దుఃఖమేధో కలిగినప్పుడు దాన్ని బయటకు తోడుకోడానికి హృదయం తేలికపడడానికి ధైర్యం చెప్పే ఒక్క మనిషి తోడుండాలంటాడు.
” ఇక్కడికి వచ్చే సరికి ఆకాశానికి
పసితనమే వచ్చేస్తుంది
దాని బుడి బుడి అడుగులన్నీ
నేను చూస్తూనే వుంటాను
యెప్పుడైనా ఊరిచివరకి వెళ్లొచ్చిన నన్ను
వెంటనే నువ్వడుగు
ఆ వూరాఖరి చెర్వు
చెవిలో పోసిన రహస్యాలన్నీ నీకే చెప్తాను”
(ఆకాశాన్ని ఆనుకొని వొక వూరు)
అని పసితనంనుండి లేని ఈనాటి దాకా ఊర్లోని కబుర్లన్నీ కూడా ఆఁ చెరువు దగ్గరే మాట్లాడుకుంటుంటారనే సంగతిని భావుకతతో కవి చెప్పుకొస్తారు.
” నీకు తెలుసో లేదో యిప్పుడు
నా పట్నం కొన్ని వేల నల్లమ్మల వెలి వాడ.
నువ్వెక్కడ వున్నావో తెలీదు కానీ
నిన్నే వెతుక్కుంటూ వుుంటాయి నా కళ్ళు యిక్కడ కూడా –
వొరే,
యిక్కడ కొన్ని యిళ్లకి తండ్రి ముఖమే తెలీదు.
ఆ యిింటిని మోసే భుజాలెప్పుడో కూలిపోయాయ్
రోజూ కనిపించని వందల తెల్ల మోకాళ్లు ఆ గొంతుల్ని నొక్కీ నొక్కీ!
ఆ వొంటరి ఇళ్ళకి నల్లమ్మలే రెక్కలు, భుజాలూ అన్నీ –
ఆ భుజాల మీదే పెరుగుతాయ్ కొన్ని వందల అనాథ మొక్కలు.
అవి పెరిగి చెట్లుగా మారితే
వాటి పూలూ పండ్లూ చూడాలని
రోజూ నీళ్ళు పోసి ప్రార్థనలు చేస్తుంది ప్రతి పిచ్చితల్లి.
వొక మధ్యాహ్నం ఆ మొక్క కనిపించకుండా పోతుంది
లేదంటే
నెత్తురొలుకుతూ ఇంటి గుమ్మం ముుందు కూలిపోతుంది ” (నల్లమ్మ అనే ఒక volcano గురించి)
అంటూ తెల్లజాతీయుడి చేతిలో ప్రాణం పోగొట్టుకున్న నల్లజాతీయుడిని అతని కుటుంబాన్ని తలుచుకొని దిగాలై పోతాడు కవి.
“ఇప్పుడంటే కొన్ని స్థలాలకు
కులం పేరో, మతం ఆనవాలో పడిందేమో గాని,
అవన్నీ వేలేసిన అందమైన కాలం వొకటి యెప్పుడో వుండేదిగా-
మనిద్దరి లోలోపల పసితనం చెర్వు కట్టల మీదా
దర్గా గుట్టల మీదా
ఆకాశమ్మీదికి రాయబారాలు పంపేదిగా-
అవన్నీ ఇప్పుడు వేలేసిన
వొంటరి కాలానికి కొట్టుకుంటూ వెళ్ళిపోయి,
నది నట్ట నడుమ
విరిగిన పడవని నేను ” అని
( ఆత్మహత్య వాయిదా వేసుకున్న వాడు)
తననుండి జారిపోయిన కాలంలో మిత్రుడు లేని లోటుకి బాధని ఇలా నిర్మాణంత్మకంగా చెప్తూ మనల్ని కూడా కాసేపు దూరమైన/దూరంగానున్న ఆప్తమిత్రుణ్ణి తలుచుకునేలా చేస్తాడు.
” వంచీ వంచీ నాకొక తల వుందనో ఉండేదనో ఇప్పుడు చెప్పలేను అసిఫా!
నీ కళ్ళలోకి చూసి చూసి సిగ్గుతో యెన్ని ముక్కలవ్వాలో ప్రతి ముక్కా వొక అద్దమై నన్నే చూపిస్తోంది నా నిలువెత్తు అవమానాన్ని!
యివాళ నా వొంట్లోని ఆ వొక్క చుక్క నెత్తురూ చచ్చిపోయింది, నీతో పాటే..!”
( ఆసిఫా, నువ్వే నా జాతీయ గీతం)
అని ఆసిఫా పాపపై జరిగిన అత్యాచారానికి పూర్తి మగజాతి తరపున క్షమాపణలాంటివి చెప్తూ సిగ్గుతో కరుణాత్మకంగా కన్నీటి పర్యమవుతాడు కవి.
ఈ వాక్యాలు చదివినప్పుడుహృదయం నిండా అలుముకున్న విషాదంతో సిగ్గుపడాలో , ఆఁ అభివ్యక్తి బాగుంది అనాలో పాఠకుడికి అర్థం కాదు.
“మనిద్దరికీ అంటే కొన్ని వాక్యాలు ఉన్నాయి కాబట్టి యీ రెండు మాటలూ పెదవి దాటి గుండెను ఖాళీ చేస్తాయి కానీ
అసలే మాటా పలక్కుండానే
చేతి వేళ్ళల్లోంచి నీళ్లలా జారిపోయిన ప్రాణాల సంగతి యెట్లా చెప్పాలి నీకైనా? ఎవరికైనా?” అంటారు కవి
(లెక్కబెట్టుకున్న క్షణాలు)
నిజమే కదా..! మరణపు ఆఖరి క్షణంలో నైనా హృదయంలోని భారాన్ని దించుకొనే మాటలు అది ఇంతకాలం దాచుకున్న ప్రేమో, పశ్చాత్తాపమో ఏదైనా కావచ్చు అవి చెప్పుకోవాలనుకున్నా చెప్పుకోలేక గుండె భారం తోనే పోయే ప్రాణాలెన్నో లెక్కబెట్టలేము కదా, అలాంటి మనుషుల వేదనని మన కళ్ళ ముందు చిత్రించి హృదయాన్ని తడిచేస్తారు కవి. కాస్త బాధాకరంగా అనిపించినా చాలా అద్భుతంగా ఉందని చెప్పకుండా ఉండలేకపోతాం మనం.
” మాటల్లేక మనం ఎడారి దిబ్బలం,
చిర్నవ్వుల్లేక కురవని మబ్బులం
వొక్క మాట కురిసిందా
మనమంతా విరగ్గాసిన
పంటచేనులం” అంటారు కవి
( అనేక యుద్ధ కాలాల తరువాత )
నల్లని మబ్బుల్ని తాకగానే చినుకుల్ని కురిపించే
స్వచ్ఛమైన చల్లగాలి లాంటి మాటలు మనుషుల మధ్యన ఉండాలి అప్పుడే ఎడారిలా సాగే జీవితాలు పచ్చని పంటపొలాల్లా బంగారుమయవుతయాని, ఆత్మీయంగా మాట్లాడుకునే మాటలతో మనసులు నిండు తేనెకుండల్లా మారుతాయని కవి మనకు చెప్తున్నాడిక్కడ.
” ఒక పూవు ఎందుకు పుస్తుందన్న
ప్రశ్నలోనుంచి
సమస్త లోకమే కనిపిస్తుంది నా కళ్ళకి
పూలని వెలివేసే కాలాల్నీ
లోకాల్నీ ఊహించలేను
వొక్క పూవూ లేని చోట
అమ్మలేదు
లాలి లేదు
ఆమె లేదు
ప్రేమలేదు ” అంటారు కవి
( ఒక్క పువ్వూ లేని చోట )
పువ్వులు ఎందుకు పూసినా పూసిన పువ్వు ఏం చేస్తుంది వాటి రంగుతో,పరిమళాలతో మనిషికి మనసుకు హాయిని ఆనందాన్ని ఇస్తుంది, ఎప్పుడూ నవ్వుతూ, నిర్మలంగా ఉండమని మనకు అనుక్షణం గుర్తు చేస్తుంటాయి. అతివ కురుల్లో చేరి ఆమె అందాన్ని అద్వితీయం చేస్తాయి కూడా. సుకుమారానికి ప్రేమకి ప్రతి రూపంగా ఉంటాయి పూలు.అటువంటి పువ్వులు లేని లోకం అమ్మలు ప్రేయసిలు లేని లోకమని అలాంటి ప్రపంచాన్ని తాను ఊహించలేనంటున్నాడు.మనిషంటే పూలకి, అమ్మలకి పర్యాయ పదంగా ఉండాలని కవి యీ వాక్యాల ద్వారా కవి రసాత్మకంగా చెప్తున్నాడు.
ఇలాంటి కవితలు యీ పుస్తకం నిండా కొత్త వాక్యనిర్మాణాల సుగంధాలని వెదజల్లుతున్నాయి
అనిశ్చితీ – చింత,పొద్దుటి ముంగురులు, వాగర్థ, వొక తాజ్ మహల్, అద్దంలో నిలబడి, చెప్పలేనివి చాలా, వెళ్లిపోతున్న పడవలకోసం, విముఖ, వొక చినుకై, చెట్టంత కావడం గురించి, అతని ఉత్తరం లాంటి మరెన్నో కవితలు చదివిన ప్రతిసారి అక్కడే కాసేపు నిలువరించి దేహాన్ని,హృదయాన్ని,తార్కిక లోకాన్ని తడుముకునేలా చేస్తుంది.యీ కవిత్వాన్ని చదవడం ద్వారా మన దృష్టి ఆలోచన మరింతగా విస్తృతమవుతుంది. తప్పకుండా ఓ సారైనా చదవలసిన కవిత్వం.
