వార్డ్‌రోబూ, ముసలాయనా, మృత్యువూ

Spread the love

మా నాన్న గది లోని వార్డ్‌రోబు మామూలు కర్ర సామగ్రి కాదు. అది ఇంటి లోపల మరో ఇల్లులా వుండేది. అది ఎంత పెద్ద సైజులో వుండేదంటే ఎవరైనా దాన్ని చూసినప్పుడు మాక్కొంచెం ఇబ్బందికరమైన తడబాటు కలిగేది. మా నాన్న పూర్వీకుల నుండి మాకు సంక్రమించిన ఆ వార్డ్‌రోబు మేం ఇల్లు మార్చినప్పుడల్లా మా వెంట వచ్చి ఆఖరుకు మిరాఫ్లోర్స్‌లోని మా నాన్న పడకగదిలోకి చేరింది.

            అది దాదాపు సగం గదిని ఆక్రమించడమేగాక సరిగ్గా పైకప్పు దాకా వచ్చేటంత ఎత్తులో నిలుచుంది. మా నాన్న బయటికి వెళ్లినప్పుడు మేం అన్నదమ్ములం సాహసించి అందులో దూరేవాళ్లం. అది అందమైన వంపులతో, చిత్రవిచిత్రమైన అద్భుత నగిషీలతో, అలంకార వైభవంతో ఒప్పారే ఒక చిన్న భవనంలా వుండేది. దాన్ని పందొమ్మిదవ శతాబ్దంలో ఒక మతిస్తిమితం లేని వడ్రంగివాడు అత్యంత నైపుణ్యంతో తయారు చేశాడట. అది మూడు భాగాలుగా వుండేది. ఒక్కో భాగానిది ఒక్కో విలక్షణత్వం. ఎడమవైపు భాగానికి ఇంటి తలుపంత పెద్ద తలుపు! దాని తాళంకప్ప నుండి వేలాడే పెద్ద తాళంచెవి తుపాకిలా, రాజదండంలా, గదలా- ఇలా రకరకాల ఆటబొమ్మలుగా పనికొచ్చే విధంగా వుండేది. తన సూట్లను, తను ఎన్నడూ తొడుక్కోని ఇంగ్లీషు కోటును నాన్న ఈ భాగంలో వేలాడ దీసేవాడు. గంధపుచెక్కల, కలరా వుండల సువాసన నిండిన ప్రపంచం లాంటి ఆ వార్డ్‌రోబు లోనికి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఆ తలుపు ద్వారానే వెళ్లాలి. రకరకాల వస్తువులు ఉండే మధ్యభాగం మాకు మూడుభాగాల్లోని అత్యంత ప్రీతికరమైన భాగం. అందులో కిందవైపు నాలుగు పెద్దపెద్ద సొరుగులు. నాన్న చనిపోయింతర్వాత మా అన్నదమ్ముల్లో ఒక్కొక్కరికి ఒక్కో సొరుగు సంక్రమించింది. ఆ మొత్తం వార్డ్‌రోబు మీద మా నాన్న ఎంత దీక్షతో అధికారాన్ని నెలకొల్పుకున్నాడో మేం అంతే గట్టిగా మా హక్కును నెలకొల్పుకున్నాం. సొరుగులకు పైన ఒక పెద్ద అర. అందులో నాన్నకిష్టమైన పుస్తకాలు దాదాపు ముప్ఫై వుండేవి. వార్డ్‌రోబులోని మధ్యభాగానికి ఒక పెద్ద దీర్ఘ చతురస్రాకారపు తలుపు. ఆ తలుపును ఎప్పుడూ తాళంవేసి మూసి వుంచేవాళ్లు. అందులో ఏముందో మాకెవ్వరికీ తెలియదు. బహుశా కాయితాలూ, చిన్నప్పటి ఫొటోలు ఉండవచ్చు. అవి చిరిగిపోతే జీవితంలో కొంత భాగం చిరిగిపోతుందనే భయం వల్ల జాగ్రత్తగా దాచి వుంటారు. నిజానికి అప్పటికే మేం జీవితంలోని కొంత భాగాన్ని నష్ట పోయాం. ఇక కుడివైపు వున్న భాగానికి ఇంకో తలుపు ఉండేది. కాని ఆ తలుపుకు ఒక వాలు అంచుల అద్దాన్ని బిగించారు. ఈ భాగంలో కూడా షర్టులు, అండర్వేర్ల కోసం కింద సొరుగులు ఉండి వాటి పైభాగాన ఒక మనిషి నిటారుగా నిలబడ గలిగేటంత పెద్ద అర వుండేది.

            పైభాగంలో పుస్తకాల అర వెనుక నుండి ఎడమవైపు భాగాన్ని కుడివైపు భాగంతో కలుపుతూ ఒక పొడవైన ఖాళీస్థలం వుండేది. ఎడమవైపు తలుపు ద్వారా లోపలికి దూరి కొన్ని క్షణాల తర్వాత అద్దం వున్న కుడివైపు తలుపును. తోసుకుని తలను బయటకు పెట్టే ఆట మాకు బాగా నచ్చేది. దాగుడుమూతల ఆట సమయంలో పైభాగంలోని తోవ లాంటి ఆ ఖాళీ స్థలం దాక్కోవటానికి మాకు చక్కగా పనికొచ్చేది. అక్కడ దాక్కున్నప్పుడు మా స్నేహితులెవరూ మమ్మల్ని కనుక్కోలేకపోయేవాళ్లు. మేం వార్డ్‌రోబు లో ఉన్నామని తెలిసినా పైకి వెళ్లి కాఫిన్‌లో మాదిరి ఆ మధ్యభాగంలో కాళ్లు చాపి పడుకుని వున్నామని వాళ్లు ఊహించ లేకపోయేవాళ్లు.

            మా నాన్న మంచం ఆ వార్డ్‌రోబు లోని కుడివైపు భాగానికి సరిగ్గా ఎదురుగా వుండేది. దిండ్లపైన తలను పెట్టుకుని న్యూస్ పేపరు చదువుకుంటున్నప్పుడు నాన్న తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకోగలిగేవాడు. ఆయన అద్దంలో తనను తాను చూసుకోవటం కన్న ఎక్కువగా పూర్వం అందులో చూసుకున్నవాళ్లను వీక్షించేవాడు. “మంత్రివర్గ సమావేశానికి వెళ్లే ముందు ఖ్వాన్ ఆంటోనియో రిబేరో ఎస్టాడా తన టైను సరిచేసుకుంటూ ఆ అద్దంలోనే చూసుకున్నాడు” అనీ, “సాన్ మార్కోస్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికి వెళ్లే ముందు డాన్ రమోన్ రిబేరో అల్వారెజ్ డెల్ విల్లార్ ఆ అద్దంలోనే చూసుకున్నాడు” అనీ, “ఎన్నిసార్లు కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించడానికి వెళ్లేముందు నా తండ్రి డాన్ జూలియో రిబేరో బెనైట్స్ తయారవుతూ ఆ అద్దంలో తనను తాను చూసుకోలేదు?” అనీ అంటూ ఉండేవాడు మా నాన్న. నాన్న పూర్వీకులంతా ఆ అద్దపు లోతుల్లో బంధింపబడ్డారు. వాళ్ల రూపాలనూ వాటి మీద పడిన తన ప్రతిబింబాన్నీ చూసుకుని ఆ క్షణాన వాళ్లతో కలిసి జీవించినట్టు ఊహించుకునేవాడు. ఆ అద్దం కారణంగా దివంగతుల ప్రపంచం లోకి మా నాన్న ప్రవేశించేవాడు. అదే విధంగా తన పూర్వీకులను ఈ బ్రతికి వున్న ప్రపంచంలోకి తీసుకొచ్చేవాడు.

            మాకు ఆటలను, కేరింతలను బహుమతిగా ఇస్తూ ఆ ఎండాకాలపు ఎంతకూ గడవని పగళ్లూ, సాయంత్రాలూ ఎంత సంతోషానికి కారణమైనాయో తల్చుకుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతై. ఆ వేసవి మా నాన్నను శాంతపరుణ్ని చేసింది. తన వివాహపు రోజు నుండి నాన్న మద్యపానాన్నీ, స్నేహితులతో కలవడాన్నీ మానేశాడు. అరుదుగా మా తోటలో పళ్లచెట్లు విరగకాసి మరులు గొలిపినప్పుడో లేక మేం అందమైన డిన్నర్ సెట్ కొన్నప్పుడో నాన్న తన పాత సహచరులను మా ఇంటికి ఆహ్వానించేవాడు.

            ఆవిధంగా మా ఇంటికి మొదట వచ్చినవాడు ఆల్బర్టో రికెట్స్. ఆయన అచ్చు గుద్దినట్టుగా సరిగ్గా నాన్నలాగే వుండేవాడు కాని సైజు మాత్రం చాలా చిన్నది. ఇతన్ని సృష్టించేటప్పుడు ఆ భగవంతునికి ఏదైనా కష్టం కలిగివుంటే అది నాన్నకు జిరాక్స్ కాపీ తీయటం మాత్రమే! వాళ్లిద్దరు ఒక్కంతే తెల్లగా, ఒక్కతే బక్కపలుచగా ఉండే వాళ్లు. వారి శరీరపు కదలికలు ఒకేవిధంగా ఉండటమేకాక ఇద్దరూ అవే ఊతపదాలను వాడేవారు. ఇద్దరూ ఒకే బడిలో సహ విద్యార్థులుగా వుండటం, అవే పుస్తకాలను చదవడం, ఒకే రకంగా నిద్రలేని రాత్రులను గడపటం, ఒకేవిధమైన బాధాకర దీర్ఘకాలిక వ్యాధితో బాధపడటం – బహుశా ఈ కారణాల వల్లనే వాళ్లిద్దరిలో ఒకే పోలికలు వచ్చి ఉంటై. వాళ్లిద్దరు ఒకరినొకరు కలుసుకుని పది పన్నెండేళ్లయింది. ఈ పది పన్నెండు సంవత్సరాల కాలంలో రికెట్స్ ఒక మందుల కంపెనీలో పనిచేసి బాగా ధనవంతుడయ్యాడు. ఇప్పుడా కంపెనీకి ఆయనే యజమాని. మా నాన్నేమో ఎంతో కష్టం మీద మిరాఫ్లోర్స్‌లో ఇల్లును కొనగలిగాడు.

            ఈ పది పన్నెండేళ్ల కాలంలో రికెట్స్ సాధించింది మరొకటి వుంది. అదేమిటంటే ఆయనకు ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ఆల్బర్టో జూనియర్. రికెట్స్ మొదటిసారి మా యింటికి వచ్చినప్పుడు తన కొడుకును వెంట తెచ్చాడు. ఇద్దరు స్నేహితులు వుంటే వాళ్ల పిల్లలు ఒకరితో ఒకరు నిజమైన స్నేహితులుగా ఉండడమన్నది అరుదు కనుక మొదట్లో మేము జూనియర్ ఆల్బర్టోను సందేహించాము. అతడు బక్కపలుచగా, వికారంగా, కొన్నిసార్లు పూర్తి ముభావంగా ఉండటాన్ని గమనించాం మేము. నాన్న తన స్నేహితునితో మా పండ్లతోటలో తిరుగుతూ చీనీ చెట్టును, మేడిచెట్టును, సీమరేగు చెట్టును, ఇంకా తీగల చెట్లను చూపిస్తుంటే మేం మా గదిలో ఆడుకోవటానికి జూనియర్ ఆల్బర్టోను మాతో తీసుకువెళ్లాము. ఆ అబ్బాయికి తోబుట్టువులు లేరు కనుక మేం కనిపెట్టి ఆడుకునే ఆటలేవీ అతనికి తెలియవు. ఆటలో రెడ్ ఇండియన్లాగా నటించాల్సినప్పుడు ఆ పాత్రను అతడు సరిగ్గా చెయ్యలేదు. పోలీసాఫీసరు వర్షించే తూటాలు తనకు తగిలినట్టు నటించాల్సినప్పుడైతే మరీ ఘోరం. అతడు పడిపోయిన తీరు మమ్మల్నెవ్వరినీ ఒప్పించలేకపోయింది. ఇక టెన్నిస్ రాకెట్‌ను ఆటలో మెషీన్‌గన్‌లా కూడా వాడుకోవచ్చని అతనికి తెలియదు. మాకిష్టమైన ఆటను అతనితో కలిసి వార్డ్‌రోబులో ఆడటం దండగ అని నిర్ణయించడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు. దానికి బదులు నేలమీద బొమ్మ కారును నెట్టడం, చెక్కముక్కలతో ఇల్లు కట్టడం వంటి చిన్నచిన్న ఆటలను ఎవరి బొమ్మలతో వారే ఆడుకునే విధంగా మా కాలక్షేపాన్ని సాగించాము.

            మధ్యాహ్న భోజన వేళకు ముందు ఆడుకుంటున్న మాకు బయట వున్న మా నాన్నా, అతని స్నేహితుడూ కిటికీలోంచి కనిపించారు. వివిధరకాల పూలచెట్లను చూపించడం మిగిలిపోయింది కనుక అప్పుడు వాళ్లు తోటలో పచార్లు చేస్తున్నారు. తోటపని లోని ఆనందాన్ని మా నాన్న గుర్తించి అప్పటికి కొన్ని సంవత్సరాలయింది. ఒక పొద్దుతిరుగుడు పువ్వులో లేక గులాబి పువ్వులో గొప్ప జీవిత సత్యం దాగివుండటాన్ని గ్రహించాడు మా నాన్న. ఒకప్పుడైతే తీరిక వేళల్లో మా నాన్న విసుగూ అలసటా కలిగించే పుస్తకపఠనం చేస్తూ జీవిత పరమార్థాన్ని గురించి ఆలోచించేవాడు. కాని ఇప్పుడలా కాదు. చెట్లకు నీరు పారించడం, మొక్కల ఆకులను కొమ్మలను కత్తిరించడం, చెట్లను అంటుకట్టడం, కలుపు తీయడం చేస్తున్నాడు. ఈ పనుల్లో ఆయన తన వ్యామోహపూరిత వాంఛను తీర్చుకుంటున్నాడు. పుస్తకాల మీద ఆయనకున్న ప్రేమ ఒకేసారి ఏకమొత్తంగా మొక్కల మీదికి, పువ్వుల మీదికి మళ్లింది. పూర్తి తోటను తయారు చేసి వోల్టేర్ నవలలోని ఒక పాత్ర చెప్పినట్టు తన ఆనందమంతా తోటపని లోంచే వచ్చిందని నిర్ణయించాడు.

“ఏదో ఒకనాడు టార్మాలో భూమిని కొని తీరుతాను. కాని ఇట్లాంటి చిన్న ప్లాట్‌ను కాదు. పెద్ద ఫామ్‌నే కొంటాను. అప్పుడు నీకు నా తడాఖా తెలుస్తుంది. ఆల్బర్టో” అని నాన్న అనటం మాకు వినపడింది.

            “టార్మాకు బదులు చాక్లకాయో అయితే ఎలా వుంటుంది పెరికో? అది లిమా నుండి నలభై కిలోమీటర్ల దూరంలో వుంటుంది కాని వాతావరణం మాత్రం లిమాలో ఉన్నట్టే వుంటుంది” అన్నాడు నాన్న స్నేహితుడు. అక్కడ తాను అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద ఇల్లును కడుతున్న విషయాన్ని నాన్నకు చెప్పాడు.

            “కానీ నా తాత టార్మాలో నివసించేవాడు, చాక్లకాయోలో కాదు కదా” అన్నాడు నాన్న. టార్మాలో అయితే నాన్నకు తన పూర్వీకులతో కలిసి నివసించినట్టు! నాన్నను తన స్నేహితుడు యవ్వన దశలో పెరికో అని పిలిచేవాడట.

            ఆల్బర్టో జూనియర్ తన బొమ్మకారును మంచం కిందికి పంపి అక్కడికి పాక్కుంటూ వెళ్లాడు దాన్ని తేవటానికి. అతడు బిగ్గరగా వేసిన గెలుపు కేరింత వినపడింది మాకు. అతనికి మంచం కింద ఫుట్‌బాల్ దొరికింది. అతన్ని ఉల్లాసంగా వుంచటానికి ఎంతగానో యాతన పడుతున్న మాకు ఫుట్‌బాల్ ఆడాలనే ఆ ఒంటరి అపరిశుభ్ర బాలుని రహస్యమైన కోరిక తెలిసిపోయింది.

            అప్పటికే అతడు లేసులతో ఆ ఫుట్‌బాల్‌ను పట్టుకుని దాన్ని తన్నబోయాడు కాని మేము అతన్ని వారించాం. గదిలో ఫుట్‌బాల్ ఆడటం పిచ్చితనమే. తోటలో ఆడటమేమో నిషేధితం. కనుక మాకు వీధిలోకి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకపోయింది.

ఆ వీధి కొన్నేళ్ల క్రితం మేము గోమెజ్ సోదరులతో ఆడిన ఉద్వేగపూరిత క్రీడలకు మైదానంగా వుండేది. ఆ గేములను మేము పూర్తి చీకటి పడేదాకా నాలుగైదు గంటలపాటు ఆడేవాళ్లం. అప్పుడు మాకు ఒకరికొకరు గాని, ప్రత్యర్థులు చేసిన గోల్స్ గాని కనపడేవి కావు. ఆట అప్పుడు ఒక దయ్యాల తోపులాట లాగా ఒక భయంకర మైన చీకటి యుద్ధంలాగా తయారయ్యేది. అందులో అన్నిరకాల ఫౌల్‌లు, మోసాలు చోటు చేసుకునేవి. పిల్లలమే అయినా మా ఆటల్లో మేము కనబరచినంత కసిని, ప్రగాఢమైన పట్టుదలను లేక ఆత్మాభిమానాన్ని ప్రొఫెషనల్ జట్లు కూడా కనబరచి వుండవు. అందుకే గోమెజ్ కుటుంబం వెళ్లిపోయింతర్వాత మేం ఫుట్‌బాల్ ఆటను పూర్తిగా మానేశాము. అట్లాంటి వర్ణనీయ క్రీడా సమరాల వంటి గేములు మళ్లీ జరగవు అని ఫుట్‌బాల్‌ను మంచం కింద దాచి వుంచాము. ఇప్పుడు జూనియర్ ఆల్బర్టో దాన్ని వెలికితీసే దాకా ఆ ఫుట్‌బాల్ మంచం కింద అలానే పడి వుంది. అతడు కోరుతున్నది ఫుట్‌బాల్ ఆట అయితే అతనికి మొహమ్మొత్తేటంతగా ఆడుదామని నిర్ణయించుకున్నాము.

            మా ఇంటిగోడ ముందు గోల్‌పోస్ట్ వుంచాము. ఎందుకంటే గోల్ అయినప్పుడు బంతి గోడను తాకి వెనక్కి వస్తుంది. జూనియర్ ఆర్బర్టోను గోల్‌పోస్ట్‌లో నిల్చోబెట్టాము. మా మొదటి ప్రయత్నాలను అతడు ధైర్యంగానే ఎదుర్కొని గోల్ అవకుండా కాపాడాడు. కాని ఆ తర్వాత మేము విజృంభించి ధనాధన్ గోల్ తర్వాత గోల్ చేశాం. ఆ అబ్బాయి నేల మీద పారాడుతూ, కాళ్లూ చేతులూ బార్లా చాపి బంతిని ఆపలేకపోతుంటే అది చూసి మాకు ఆనందోత్సాహాలు కలిగివై.

            తర్వాత గోల్ కొట్టడానికి అతని వంతు వచ్చింది. గోల్ ఆపడం నా పని, బక్కపలుచగా వున్న అతడు బంతిని తన్నుతున్నప్పుడు ఒక కంచర గాడిద తన్నినట్టనిపించింది. మొదటి గోల్‌ను నేను ఆపగలిగాను కాని తర్వాత కొంచెంసేపటి దాకా నా అరచేతులు మండినై. గో‌ల్‌పోస్ట్ మూలలోకి తన్నిన అతని రెండో గోలు గొప్పది. కాని అతడు చేసిన మూడో గోల్ అత్యంత సుందర మైనదీ బ్రహ్మాండమైనదీనూ, ఆ బంతి నా చేతుల మధ్యలోంచి దూసుకుపోయి, గోడపై నుండి వెళ్లి, మల్లెచెట్టు కొమ్మల మధ్యలోంచి సైప్రెస్ చెట్టు మీదుగా పోయి, తుమ్మచెట్టు కొమ్మకు తాకి అక్కణ్నుంచి మా ఇంటిలోపలికి అదృశ్యమైంది.

            ఎప్పట్లాగానే మేము వీధి పేవ్మెంట్ గట్టుమీద కూర్చుని బంతిని తీసుకొచ్చే పనిమనిషి కోసం నిరీక్షించసాగాము. కాని ఎవరూ రాలేదు. మేము లేచి బంతిని వెతకటానికి వెళ్లాలనుకుంటున్న సమయంలో మా ఇంటి దొడ్డిదారి తలుపును తెరుచుకుని నాన్న వచ్చాడు. అతని చంకలో ఫుట్‌బాల్ వుంది. ఆయన బాగా పాలిపోయి వున్నాడు. మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీధి చివరిదాకా నడిచి, ఎదురుగా ఈలవేస్తూ వస్తున్న కూలివాడి దగ్గరికి చేరాడు. ఆ బంతిని వాడి చేతుల్లో పెట్టి మావైపు ఒక్క చూపు కూడా ప్రసాదించకుండా ఇంట్లోకి వెళ్లి పోయాడు. జరిగిన విషయం అర్థం కావటానికి ఆ కూలివాడికి కొంత సమయం పట్టింది. అర్థం అయిన తక్షణమే వాడు బంతిని తీసుకుని పరుగెత్తడంతో వాణ్ని పట్టుకునే అవకాశం లేకపోయింది మాకు.

            మధ్యాహ్న భోజనానికి మమ్మల్ని పిలవటం కోసం అమ్మ ద్వారం దగ్గర వేచి వుంది. ఆమె ఎంత ఆందోళనగా వున్నదంటే ఆమెను చూడగానే ఏదో జరగరాని ఘోరం జరిగినట్టు తెలిసిపోయింది మాకు. లోపలికి రావలసిందిగా ఒక తొందరతో కూడిన చిన్న సంజ్ఞ చేసింది. మేం ఆమెను దాటుకుంటూ పోతుంటే “అలా ఎందుకు చేశార్రా మీరు?” అన్నదామె.

            మా నాన్న గదికి వున్న ఒక ఊచలు లేని కిటికీ సగం తెరిచి వుండటాన్ని గమనించగానే ఏం జరిగి వుంటుందో మేము ఊహించగలిగాము. జూనియర్ ఆల్బర్టో అద్భుతంగా తన్నిన ఆ బంతి నమ్మశక్యం కాని విధంగా అర్ధచంద్రాకారపు బాటలో పయనించి గోడలు, చెట్లు, ఊచలు మొదలైనవాటిని దాటి వార్డ్‌రోబుకు ఉన్న అద్దానికి సరిగ్గా నట్టనడుమ తగిలింది. ఆల్బర్టో జూనియర్ కాని మరెవరైనా కాని జీవితమంతా ప్రయత్నించినా అట్లాంటి షాట్‌ను మళ్లీ కొట్టడం సాధ్యం కాదు.

            లంచ్ తినడం మాకు ఇబ్బందికరమైంది. అతిథి ముందు మమ్మల్ని తిట్టలేక నాన్న తన కోపాన్ని దిగమింగుకున్నాడు. ఆయన పాటించిన మౌనాన్ని ఛేదించే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. భోజనం తర్వాత మేము పండ్లరసాలను తీసుకుంటున్నప్పుడు నాన్న కొంచెం మెత్తబడి మాకందరికి కొన్ని ఆహ్లాదకరమైన కథలు చెప్పాడు. నాన్న నర్మగర్భంగా చేసిన సూచనను ఆల్బర్టో గ్రహించటంతో ఆ భోజనాలు నవ్వులతో ముగిసినై. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ మధ్యాహ్న భోజనమేగాక పాత మిత్రుణ్ని ఆహ్వానించటమనే అరుదైన సదుద్దేశం పూర్తి ప్రహసనంగా మారిన విషయం మా మనసుల్లోంచి చెరగిపోలేకపోయింది.

            తండ్రీకొడుకులిద్దరు త్వరగానే వెళ్లిపోయారు. నాన్నకు మమ్మల్ని శిక్షించే అవకాశం దొరికిందని మేము భయపడ్డాము. కాని స్నేహితుని రాకవల్ల అలసి పోయి ఆయన మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే పగటి కునుకులోకి జారుకున్నాడు.

            నిద్రలోంచి మేల్కొనగానే నాన్న మమ్మల్నందర్నీ తన గదిలో సమావేశ పరిచాడు. దిండ్ల మీద తలను ఆనించిన ఆయన తాజాగా, ప్రశాంతంగా కనిపించాడు. మధ్యాహ్నపు వెలుతురు గదిలోకి పుష్కలంగా వచ్చేలా కిటికీ తలుపులను బార్లా తెరిచాడు.

            వార్డ్‌రోబును చూపిస్తూ “అటు చూడండి” అన్నాడు. ఆ దృశ్యం నిజంగా చాలా బాధాకరంగా వుంది. అద్దాన్ని పోగొట్టుకోవడం ద్వారా వార్డ్‌రోబు తన ప్రాణాన్నే కోల్పోయినట్టు వుంది. ఇంతకు మునుపు అద్దం ఉండినచోట ఇప్పుడు కేవలం ఒక నల్లని దీర్ఘచతురస్రాకారపు చెక్క మాత్రమే వుంది. అది ఏమీ చెప్పని, దేన్నీ ప్రతిఫలించని దిగులు నిండిన ఖాళీ ప్రదేశం అనిపించింది. తళతళ మెరిసే తటాకపు నీళ్లన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు ఉన్నది ఆ ఖాళీస్థలం.

“నా పూర్వీకులు తమను తాము చూసుకున్న అద్దం అది” అని మమ్మల్ని వెళ్లిపొమ్మన్నట్టు నాన్న తన చేయి ఊపాడు.

            ఆ రోజు నుండి మా నాన్న తన పూర్వీకులు గురించి ప్రస్తావన తేవడం మేమెరుగం. తను అదృశ్యమవుతూ ఆ అద్దం పూర్వీకులను కూడా అదృశ్యం చేసింది. గతం మా నాన్నను బాధించటం మానేసింది. పైగా నాన్న తన భవిష్యత్తు లోకి కుతూహలంతో చూడనారంభించాడు.

            బహుశా తనింకా ఎక్కువ కాలం జీవించేది లేదని ఆయనకు తెలిసిందేమో.

అందువల్ల తన పూర్వీకులను కలుసుకోవడానికి అతనికి ఆ అద్దపు అవసరం లేకపోయింది. మరో జన్మలో కూడా వాళ్లను కలుసుకోలేననుకున్నాడు. ఎందుకంటే ఆయనకు పునర్జన్మ మీద నమ్మకం లేదు. అతన్ని బంధించిన పుస్తకాల ప్రపంచం, పువ్వుల ప్రపంచంలో కూడా వాళ్లను కలువలేననుకున్నాడు. ఆయనకు అదొక శూన్యం నిండిన ప్రపంచం.

Julio Ramon Ribeyro

హూలియో రమోన్ రిబేరో (1929-1994)

ఇతడు పెరూ దేశస్థుడు. నిరాశా వాదం, హాస్యం రాశాడు. ఇతని రచనల్లో వ్యంగ్యం కూడా వుంటుంది. దాదాపు 30 పుస్తకాలు రాశాడు. విపరీతంగా సిగరెట్లు తాగేవాడు. ఆ అలవాటు కారణంగానే ఛాతీ వ్యాధితో చనిపోయాడు.

ఎలనాగ
కరీనంగర్ జిల్లాలోని ఎలగందుల గ్రామంలో 1953 లో పుట్టిన ఎలనాగ వృత్తి రీత్యా డాక్టరైనా ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. వీరి తండ్రి అయిన నాగరాజు తిరుమలయ్య ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో పేరొందిన ఆయుర్వేద వైద్యులు. తల్లి నాగరాజు రంగమ్మ సాధారణ గృహిణి. ఎలనాగ  1980 నుండి 1986 వరకు నైజీరియాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో, ఆ తర్వాత 1989 నుండి 2012 వరకు ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్ లో పని చేసి, రాష్ట్రస్థాయి అధికారిగా పదవీ విరమణ పొందారు.
ఎలనాగ గారిది  విస్తృతమైన సాహితీ నేపథ్యం. హైస్కూల్లో ఉన్నప్పటినుండే రచనలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు రాసిన మొదటి కవిత, కరీంనగర్ నుండి వెలువడుతుండిన గౌతమి అనే పత్రికలో ప్రచురితమైంది. మెడిసిన్ చదువుతున్న కాలంలో భారతి, కృష్ణా పత్రిక,  స్రవంతి, ఆంధ్రప్రభ, తరుణ, పొలికేక, విపుల మొదలైన పత్రికల్లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. తర్వాతి కాలంలో మరెన్నో పత్రికల్లో అచ్చయ్యాయి. సోమర్సెట్ మామ్ రచన అయిన ది ఏలియెన్ కార్న్ అనే నవలికకు వీరు చేసిన తెలుగు అనువాదం కలుపుమొక్క శీర్షికతో 2005 లో అచ్చైంది. 2005 వరకు చేసిన రచనలన్నీ నాగరాజు సురేంద్ర అనే పేరుతో వచ్చాయి. తర్వాత ఎలనాగ అన్న కలంపేరు పెట్టుకున్నారు. 2009 లో మొదటి కవితా సంపుటి వాగంకురాలు వెలువడింది.
తెలుగులోనూ, ఆంగ్లంలోనూ అనేక స్వతంత్ర  రచనలు వెలువరించారు. అనేక అనువాదాలు చేశారు. సుమారు అనేక పద్యకవితలు, వచన కవితల పుస్తకాలు వెలువరించారు. ఆగ్లం నుండి తెలుగు లోకి చేసిన అనువాదాలు - కలుపు మొక్క: సోమర్సెట్ మామ్ ఆంగ్ల నవలిక The Alien Corn కు అనువాదం (2005); ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు: అనువాద కథల సంపుటి (2013); పొరుగు వెన్నెల: అనువాద కవితల సంపుటి (2013); ఉత్తమ ఆఫ్రికన్ కథలు: అనువాదకథల సంపుటి (2014); సోమర్సెట్ మామ్ కథలు: అనువాద కథలు (2016); ఊహల వాహిని: భారతీయ భాషల కవితలకు తెలుగు అనువాదం (2017); కథాతోరణం: వివిధ దేశాల భాషల కథలకు తెలుగు అనువాదం (2017);  గాలిబ్ –నాటి కాలం: పవన్ కె వర్మ రచించిన Ghalib: The Man, The Times కు తెలుగు అనువాదం. కేంద్ర సాహిత్య అకాడమీ వారి ప్రచురణ (2017); ఆత్మగానం: ఒడియా కవి ప్రదీప్ బిస్వాల్ రాసిన A House Within, Pilgrimageto Ayodhya ఆంగ్ల కవితా సంపుటుల అనువాదం.(2023); శవాలను మోసేవాడి కథ: సైరస్ మిస్త్రీ రాసిన Chronicle of a Corpse Bearer కు అనువాదం (2023).
పైవన్నీ కాక కాళోజీ,  వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరధి, కాళోజి మొదలగు సుప్రసిద్ధ సాహితీవేత్తల కథలను ఆంగ్లం లోకి అనువదించారు.
వీరికి 2023 సంవత్సరానికి గాను అనువాద రంగంలో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది.

Spread the love

One thought on “వార్డ్‌రోబూ, ముసలాయనా, మృత్యువూ

  1. హూలియో రమోన్ రిబేరో రాసిన ఈ కథలోని వస్తువు మానవ మనస్తత్వానికీ, మారుతున్న సామాజిక-ఆర్థిక పరిస్థితులకూ మధ్య ఉన్న ఘర్షణ.

    కథా శిల్పం దృష్ట్యా చూస్తే వస్తువును ఒక ప్రతీక ద్వారా చెప్పడంలో రచయిత అద్భుతమైన సాఫల్యం సాధించాడు.

    ఈ కథలో వార్డ్‌రోబ్, ప్రధానంగా అందులోని అద్దం కేవలం జడ వస్తువులు కావు. అవి క్షీణ దశలో ఉన్న భూస్వామ్య వర్గపు ‘గత వైభవానికి’, ఆత్మవంచనకు సజీవ ప్రతీకలు.

    కథానాయకుడైన తండ్రి తన వర్తమాన జీవితంలోని ఆర్థిక అసంతృప్తిని, నిస్సహాయతను ధైర్యంగా ఎదుర్కోలేడు. వర్తమానం ఇచ్చే బాధను తట్టుకోలేక, ఆ పాత అద్దంలో తన పూర్వీకులను చూసుకుంటూ ఒకరకమైన ‘పలాయనవాదం’ లోకి జారుకుంటాడు.

    సామాజిక వాస్తవికతను ఎదుర్కోలేని ఒక వర్గపు బలహీనతను, వారి మిథ్యా చైతన్యాన్ని రచయిత ఇక్కడ చాలా నిశితంగా పట్టుకున్నాడు.

    కథలో వచ్చే నాన్న స్నేహితుడు రికెట్స్ పాత్ర ఎంతో కీలకమైనది. ఒకే నేపథ్యం నుంచి వచ్చిన ఇద్దరిలో ఒకరు ధనవంతుడైన పెట్టుబడిదారిగా ఎదగడం, మరొకరు పేదవాడిగా మిగిలిపోవడం ఇక్కడ గమనించాల్సిన సామాజిక వాస్తవం.

    ఆ ధనవంతుడైన స్నేహితుడి కొడుకు తన్నిన ఫుట్‌బాల్ వచ్చి ఆ పాత అద్దాన్ని బద్దలు కొట్టడం ఈ కథలో శిల్పపరంగా ఒక గొప్ప మలుపు.

    ఇది కేవలం పసివాళ్లు ఆడుకుంటుంటే జరిగిన ప్రమాదం కాదు. ఆర్థికంగా పైచేయి సాధించిన కొత్త వర్గం… పాత తరం భద్రపరుచుకున్న మిథ్యా ప్రతిమలను, కల్పిత గౌరవాలను ఎలా బద్దలు కొడుతుందో రచయిత ప్రతీకాత్మకంగా చిత్రించాడు.

    అద్దం పగిలినప్పుడు నాన్న కోపాన్ని దిగమింగుకుని మౌనంగా ఉండిపోవడం, బలమైన వర్గం ముందు సామాన్యుడి నిస్సహాయతకు అద్దం పడుతుంది.

    అద్దం పగిలిన తర్వాత తండ్రిలో వచ్చిన మార్పు ఈ కథకు ప్రాణం. అద్దం పగిలిపోవడంతో ఆ పాత్రకు వాస్తవం బోధపడుతుంది. గతకాలపు నీడల నుంచి, ఆత్మవంచన నుంచి బయటపడతాడు.

    ఏ భ్రమలూ లేకుండా, తన పరిమిత భౌతిక జీవితాన్ని, అనివార్యమైన మృత్యువును ధీరత్వంతో అంగీకరించడానికి సిద్ధపడతాడు.

    వస్తువును శిల్పంతో ఏకం చేసి, ఒక మనిషి అంతరంగం గుండా విశాలమైన సామాజిక సత్యాన్ని చెప్పడంలో ఈ కథ సంపూర్ణంగా సఫలమైంది.

    పాత భ్రమలను బద్దలు కొట్టుకుని వాస్తవికతలోకి అడుగుపెట్టడమే మనిషికి నిజమైన విముక్తి అని ఈ కథ నిరూపిస్తుంది.

    మంచి కథను అనువదించిన ఎలనాగ గారికి ధన్యవాదములు

    —- ఎం కె కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *