పేపర్లో ఆరోజు వార్తలన్నీ ఒకసారి పైపైన తిరగేసేశాడు రవికాంత్. గడియారం చూస్తే ఉదయం తొమ్మిదిన్నరయింది. డ్రాయింగ్ రూములోనుంచే “అంజనా! అంజనా!!” అంటూ రెండుసార్లు పిలిచాడు.
అటునుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తనే బెడ్రూమ్ లోకెళ్ళాడు. భార్య అంజన, ఏడాది కూతురు చాందినీ యిద్దరూ యింకా నిద్రపోతున్నారు. అలాగే కాసేపు వాళ్ళిద్దర్నీ చూస్తూ నిల్చొని నెమ్మదిగా “అంజనా! లే యింక. టైము చూడు తొమ్మిదిన్నరయింది. పదింటికల్లా నేను ఆఫీసుకెళ్ళాలి. నువ్వు లేస్తావని నేను ఎప్పట్నుంచి ఎదురుచూస్తున్నాను. చాందినీ కూడా చూడు పక్క తడిపినట్టుంది. గౌనంతా తడిసిపోయింది. అలాగే పడుకుంది” అన్నాడు. అంజన కళ్ళు కొంచెం తెరిచి జాకెట్ హుక్స్ పెట్టుకుని చాందినీని దూరంగా జరిపి పడుకోబెట్టి మళ్ళీ ముసుగెట్టింది.
అంజన ఇంక ఇప్పుడే లేవదని అర్ధమయ్యి టవల్ తీసుకొని స్నానానికి బయల్దేరాడు. ఆఫీసుకు తొందరగా తయారయి వెళ్తూ మళ్ళీ ఓ కేక పెట్టాడు “అంజనా! నేను వెళ్ళొస్తా. పాలు కాచేసాను. చల్లారాక చాందినికి పట్టించి మిగిలినవి ఫ్రీజ్ లో పెట్టెయ్.”
అంజన కళ్ళు తెరవకుండానే “టైమెంత?” అంది.
రవికాంత్ బెడ్రూములోకెళ్ళి కారు తాళాల కోసం వెదుకుతున్నాడు.
అటుతిరిగి పడుకుంటూ అంజన మళ్ళీ “టైమెంతైంది?” అని అడిగింది.
“పది దాటి పదినిమిషాలైంది” బెడ్రూములోంచి బయటకొస్తూ చెప్పాడు రవికాంత్.
“టీ తాగావా? పనమ్మాయి వచ్చిందా?” అడిగింది అంజన.
“ఆ..ఆ.. తాగాను. పనమ్మాయి యివాళ కూడా రాలేదు.” నిర్లక్ష్యంగా చెప్పాడు రవికాంత్.
పనమ్మాయి రాలేదన్న మాట వినగానే అంజన నిద్రంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. “రానీ దాని పని చెప్తాను. రేపట్నుంచి దాన్ని పన్లోంచి తీసెయ్యకపోతే నాపేరు అంజన కాదు. మై గాడ్ యివాళ కూడా ఆ ఆంట్లన్నీ నేనే తోమాలా భగవంతుడా!!” అంటూ అరవడం మొదలెట్టింది.
అంజన అలా అరుస్తుంటే ఎందుకోగానీ రవికాంత్ కి ఏదో చెప్పలేని ఆనందంగా ఉంది. “అంట్లన్నీ తోమేశాను. స్టాండులో సర్దాయ్ చాలు” అనేసి వెళ్ళిపోయాడు.
రవికాంత్ కారు స్టార్టయ్యి వెళ్ళిపోయిన సౌండు విన్నాక అంజన మంచందిగి తిన్నగా కిచెన్ లోకి వెళ్ళింది. కిచెన్ అంతా శుభ్రంగా ఉంది. గిన్నెలన్నీ కడిగేసున్నాయి. పాలు కాగి, చల్లారుతున్నాయి. ముందు ఓ కప్పు టీ పెట్టుకొని. పాలు కొంచెం చల్లారాక చాందినికి పట్టిద్దామనుకుంది. గిన్నెలమధ్యలోంచి టీపెట్టుకునే గిన్నె తీస్తోంటే ఓ గిన్నె జారి చప్పుడు చేసుకుంటూ సింక్ లోకివెళ్ళి పడింది. ఆ చప్పుడుకి చాందినీ లేచి ఏడుపందుకుంది. టీ డికాక్షన్ కి నీళ్ళు స్టామీద పెట్టి చాందినీని చంకనేసుకుంది.
టీ తాగుతూ, పేపరు తిరగేస్తుంటే అంజనకి టైమే తెలియలేదు. చూస్తో చూస్తోనే ఒంటిగంటైపోయింది. రవికాంత్ మధ్యాహ్నం భోజనానికొచ్చే టైముకూడా అయింది. తనకీ ఆకలి కరకరలాడుతోంది. ఏమైనా వండుదామని కిచెన్ లోకైతే వెళ్ళిందిగానీ ఏం వండాలో అర్ధం కాలేదు. కాస్త బియ్యం కడిగి కుక్కరు పెట్టేద్దామనుకుంది. కానీ యిప్పుడు అంత ఓపిక కూడా లేదని ఆపని మానుకుంది, చపాతీలొత్తే ఓపిక అసలే లేదు. “ఆ – నూడిల్స్ అయితే నయం. రెండు నిమిషాల్లో అయిపోతుంది. నూడిల్స్ రెండు ప్యాకెట్లే ఉన్నాయి. అయినా ప్రస్తుతానికి సరిపోతాయిలే. మళ్ళీ సాయంత్రం మార్కెట్ కెళ్ళి తెచ్చుకోచ్చు.” అనుకుంది.
ఇంతలో రవికాంత్ వచ్చాడు.
“ఇవాళ కొంచెం త్వరగా వచ్చినట్టున్నావ్?” కిచెన్ లోంచే అంది అంజన.
రవికాంత్ పిల్లనెత్తుకుని కిచెన్ లోకి అడుగుపెడుతూ, “ఇవాళ మూడింటికి ఓ మీటింగుంది. త్వరగా వచ్చి తిని కాస్త రిలాక్స్ అయ్యి వెళ్దామని వచ్చేశా. ఆకలి దంచేస్తోంది. ఏం చేశావ్.” అన్నాడు.
“ఇంకా ఏమీ చెయ్యలేదు. అదే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా” అంది.
“ఏం చేస్తావు?”
“నూడిల్స్ అయితే తొందరగా అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్నా. నాకూ చాలా ఆకలేస్తోంది.”
నూడిల్స్ మాట వినగానే రవికాంత్ ప్రాణం నీరుగారిపోయింది. ఏ సాంబారో వేసుకుని అన్నం తినాలనుంది తనకి. మధ్యాహ్నం అప్పుడు ఇంట్లో అన్నం తినే టైము తనే సావకాశం దొరకదు. ఇంచుమించుగా ఆఫీసు క్యాంటీన్ లోనే తినేస్తూ వుంటాడు. కానీ ఆ గొడవంతా పక్కన పెట్టి- “సరే ఏదో ఒకటి చెయ్యి. నాకు నూడిల్స్ చాలా యిష్టం. లేదంటే చాందినీని పట్టుకో నేను చేసేస్తాను. బాగా ఆకలేస్తోంది. టిఫిన్ కూడా తినలేదు.”
“టిఫిన్ ఎందుకు తినలేదు? పొద్దున్న ఏమైనా చేసుకోచ్చుగా.” నూడిల్స్ కి ఎసరు పెడుతూ అంజన అంది.
చాందినీ రవికాంత్ భుజంమీద నిద్రపోయింది. పిల్లని మంచం మీద పడుకోబెట్టి వస్తూ అన్నాడు – “ఎందుకు చేసుకోలేను? ఒక్కణ్ణి ఉంటే చేసుకుంటూనే ఉంటాను. పెళ్ళికి ముందు కూడా చేసుకునే వాణ్ణి. నువ్వు వెళ్ళిపోయాక కూడా చేసుకుంటాను. కానీ ఇలా కొన్నాళ్ళ కోసం నువ్వు నాదగ్గరికొచ్చినప్పుడు నీతో చేయించుకోవాలనుంటుంది. కానీ నీకు గంట పది కొడితే కానీ తెల్లారదాయె.”
అంజన నూడిల్స్ కలపడానికి గరిటి వెతుకుతోంది. పదిగంటలదాకా నిద్ర మాట వినేసరికి కొంచెం కోపమొచ్చింది. “నేను మాత్రం ఇక్కడకొస్తేనే కదా పదింటిదాకా పడుకోగలిగేది. మామూలుగా అయితే నేనూ ఎనమిదింటికల్లా ఆఫీసులో ఉండాలి. నా టిఫిన్ నేనే చేసుకుంటాను. కూర్చోబెట్టి వండి వార్చేవాళ్ళు నాకూ ఎవరూ లేరు అక్కడ. ఏడాదినుంచి చాందినీని కూడా ఒక్కర్తినే చూసుకుంటున్నాను. సెలవు పెట్టి కొన్నాళ్ళు యిక్కడికొచ్చేదే కాస్త విశ్రాంతి దొరుకుతుందని. యిక్కడ కూడా ఐదింటికి లేచి అంట్లు తోమాలి. బట్టలుతకాలి అంటే ఇంక నేను సెలవు పెట్టి ఏం ఉపయోగం? నేను నీకు అన్నీ చేసి పెట్టాలనుకుంటావు. కానీ నాకెవరు చేసి పెడుతున్నారు?”
రవికాంత్ మౌనంగా ఉండిపోయాడు. తన నూడిల్స్ ప్లేటు తీసుకొని డైనింగ్ టేబులు ముందు కూర్చున్నాడు. అంజన కూడా తన ప్లేటు తెచ్చుకుంది. కాసేపు యిద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. మళ్ళీ అంజనాయే కల్పించుకుని “సాయంత్రం ఎన్నింటికొస్తావు?” అంది.
“ఆరున్నర-ఏడు మధ్యలో రావచ్చు. ఎందుకు?”
“ఏం లేదు. మార్కెట్ కి వెళ్ళాలి. ఇంట్లో సామాన్లేం లేవు.”
‘మార్కెట్ కి బయల్దేరుతూ అంజన చాందినీని ప్రామ్ లో పడుకోబెట్టింది. రవికాంత్ చాందినీని ఎత్తుకుందామనుకున్నాడు. అంజన “నీకు ఈ లోక్లాసు బుద్ధులు పోవా? పిల్లల్ని కూలాళ్ళలా, అలగా జనాల్లాగా చంకనేసుకు నడవడం నాకు యిష్టముండదు.” అని కయ్యిమంది.
చాందినీ ప్రామ్ లో పడుకుంది. కానీ, ప్రామ్ ముందుకొరిగినప్పుడల్లా కిందకి దూకుతోంది. అంజన మళ్ళీ సరిగ్గా పడుకోబెడుతోంది. చాందిని మళ్ళీ మళ్ళీ ముందుకు వంగుతోంది. కొంతసేపటికి ఆంజన చూసింది – ప్రామ్ కి వేళ్ళాడుతున్న గిలక్కాయని అందుకోడానికి చాందినీ మాటిమాటికి ముందుకు దూకుతోంది. చాందినీ చేతికందేలా పక్కనే కూడా గిలక్కాయలున్నాయి. కానీ చాందినీ ఆ దూరంగా ఉన్న గిలక్కాయకోసమే ముందుకు ఉరుకుతోంది. అంజన ఆలోచనలో పడింది. మనమంతా కూడా అంతే, ఎక్కడో దూరంగా ఉన్నవాటికోసం వెంపర్లాడుతూ ఉంటాం. చేతికందాక కానీ తెలీవు అవి ఎంత పనికిరానివో.
“కొంచెం త్వరగా నడు. ఏడున్నరవుతోంది. షాపు మూసేస్తాడు. ఇంట్లో రేపు లంచ్ కి నూడిల్స్ కూడా లేవు.” అన్నాడు రవికాంత్.
రవికాంత్ మాటల్లో వెటకారం అంజనకి అర్థమైంది. తిరిగి మాటకి మాట సమాధానం చెప్పేలోపల ఎవరో తెలిసున్నాయన ఎదురొచ్చాడు.
టైమైపోయినా కానీ షాపు యింకా తెరిచే ఉంది. రవికాంత్, ఓ’పది ప్యాకెట్లు నూడిల్స్, ఇంకా మిగిలిన సరుకుల లిస్ట్ చెప్పి ఇంటికి పంపించమన్నాడు షాపు అతనితో. అక్కడే ఉన్న రవికాంత్ స్నేహితుడొకాయన “ఎంటండోయ్!! ఇంట్లో నూడుల్స్ షాప్ ఏమన్నా పెట్టారా ఏంటి?” అన్నాడు.
రవికాంతికి తలతీసేసినట్టయింది. ఒక్కసారి అంజన వైపు చురుక్కున చూసి పాపులోంచి బయటికి నడిచాడు.
మార్కెట్ నుంచి బయటికొచ్చి ఇద్దరూ నడుస్తున్నారు. రోడ్డు ఖాళీగా ఉంది. అంజన ఖాళీ ప్రామ్ నెట్టుకొస్తోంది. చాందినీ రవికాంత్ చంకెక్కింది. రోడ్డు మీద ఎవరూ లేకపోవడం చూసి రవికాంత్ మొదలుపెట్టాడు “చూడు అంజనా! చాలా రోజుల్నించి నీతో ఒక విషయం మాట్లాడదామనుకుంటున్నాను. కానీ మళ్ళీ నువ్వేమనుకుంటావో అని మాట్లాడలేకపోతున్నాను. మన పెళ్ళయ్యి అప్పుడే నాలుగేళ్ళయింది. చాందినీకి కూడా ఏడాది దాటింది. ఒక్కసారి ఆలోచించు. ఇన్నేళ్ళలో నువ్వు నాదగ్గరున్నది ఎన్నాళ్ళు? ఏడాదికి ఒక్కసారి సెలవు పెట్టి నా దగ్గరకొస్తావు. ఒక్కోసారి అదీ లేదు. నేనే నీ దగ్గరికి రావల్సివస్తుంది. అక్కడ ఊళ్ళో నాన్నగారు ప్రతీ పండక్కీ మనకోసం ఎదురుచూస్తూ ఉంటారు. మనకేమో ఏ పండక్కీ అక్కడకెళ్ళడం కుదరదు. అమ్మ పోయిన దగ్గర్నుంచి నాన్నగారే చెయ్యి కాల్చుకుంటున్నారు. నేను పెళ్ళిచేసుకున్నప్పుడు పాపం నాన్నగారికి కోడలిచేతి వంట దొరుకుతుందని అనుకున్నాను. ఇలాంటి మన పెళ్ళివల్ల ఏం లాభం నువ్వే చెప్పు. నువ్వు ఉద్యోగం మానేస్తే మంచిదనిపిస్తోంది. మనం కలిసుండొచ్చు. నువ్వు అప్పుడప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళొస్తూ ఉందుగాని.”
అంజన, రవికాంత్ మాటలు వింటూ నెమ్మదిగా నడుస్తోంది. రవికాంత్ మాట్లాడ్డం అయిపోయాక చెప్పింది – “నేను ఉద్యోగం మానే ప్రసక్తే. అసలు నువ్వు ఆ విషయం మర్చిపో. ఇంకా నువ్వు యిప్పుడన్నావే ‘ఇలాంటి పెళ్ళి’ వల్ల ఏం లాభం అని, దానికోసం నువ్వు పెళ్ళిని రీడిఫైన్ చెయ్యాల్సి వుంటుంది. ‘ఇలాంటి పెళ్ళి’ అన్నావు చూశావా అంటే ఏంటి? నేను చెప్పనా – నేను నా ఉద్యోగం మానేసి నీదగ్గరే ఉంటూ నీకు సేవలు చేస్తూ వుండాలి. నీకు మొహం మొత్తినప్పుడు ఊరెళ్ళి మీనాన్నకి వండివారుస్తూ ఉండాలి. మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలి. అంతే కదా? నువ్వేమనుకోనంటే నిన్నోమాట అడగనా? నువ్వు నీ ఉద్యోగం మానేసి, పూర్తిగా నాతో ఉండగలవా? ఉండలేవు. నువ్వు నీ ఉద్యోగం మానుకోలేనప్పుడు, నన్ను ఉద్యోగం మానెయ్యమని ఎలా అనగలవు? అయినా మా నాన్న తప్పుచేశారు. నీతో పెళ్ళికి ముందే నిన్ను, మీ నాన్నని అడిగుండాల్సింది ఎలాంటి పెళ్ళి కావాలో? ‘ఇలాంటిదా’ లేకపోతే ‘అలాంటిదా’ అని.
చాందినీ రవికాంత్ చంకలోంచి కిందకి ఉరుకుతోంది. రవికాంత్ పిల్లని పడుకోబెట్టేశాడు. రవికాంతే ప్రామ్ నెడుతున్నాడు. అంజన యింకా ఏదో చెప్పబోయేంతలో రవికాంతే అన్నాడు – “నాకు తెల్సు నువ్వు ఇలాగే మాట్లాడతావని. నువ్వెప్పుడూ నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. నువ్వు ఉద్యోగం మానేస్తే నాకొక్కడికేనా సుఖం? మనిద్దరం సుఖపడతాం కదా?”
అంజన మధ్యలోనే అందుకుంది “ఏం సుఖం? సుఖమంటే కొంపదీసి నీ దృష్టిలో సెక్స్ అయితే కాదు కదా? లేకపోతే ఉద్యోగం మానేస్తే నాకొచ్చే సుఖమేంటో అర్థం కావట్లేదు. ఇక్కడు నువ్వు సంపాదించుకుంటూ సుఖంగా ఉంటున్నావు, అక్కడ నేను సంపాదించుకుంటూ సుఖంగా ఉంటున్నాను. ఉద్యోగం మానేస్తే నెలొకొచ్చే ఆ జీతం కూడా రాదు. సుఖమైతే నీకే కదా! ఇంకా నీకు నేను 24 గంటలూ అందుబాటులో ఉంటాను. అంతే కదా.”
ఇంటికొస్తూనే అంజన పిల్లని తీసుకుని బెడ్రూములోకి వెళ్ళిపోయింది. రవికాంత్ వంట చేసి, పిల్లకి పాలు వేడి చేసాడు. ఎంత పిలిచినా అంజన భోజనానికి రాలేదు. రవికాంత్ ఒక్కడే భోజనం చేసి బెడ్రూములోకి వచ్చాడు. రవికాంత్ వచ్చాక అంజన వెళ్ళి అన్నం తింది.
అంజన కోపంతో బుసులుకొడుతోంది. రవికాంత్ అయితే ‘ఎందుకు ఇలా మాట్లాడానురా భగవంతుడా!’ అని తనని తనే తిట్టుకుంటున్నాడు. అన్నం తినొచ్చి అంజన బెడ్రూములో అటూ ఇటూ పచార్లు చేస్తోంది. మంచం మీద కూర్చొంటూ “నా సెలవులు అయిపోవొచ్చాయి. రేపు రిజర్వేషన్ చేయించు” అంది.
సరే రిజర్వేషన్ చేయిస్తాలే కానీ, గోరంతలు కొండంతలు చేస్తావెందుకు అంజనా? దార్లో నేను చెప్పిందంతా మర్చిపో, నన్ను క్షమించు. నువ్వు ఉద్యోగం కూడా మానవలసిన అవసరం లేదు. నేనేదో ఊరికే నీ మనసు తెలుసుకుందామని అన్నానంతే” అంటూ అంజనని తనవైపు తిప్పుకోబోయాడు.
“నాకిప్పుడు ఇంట్రస్ట్ లేదు. నాకు అసహ్యమేస్తోంది” అంటూ రవికాంత్ ని నెట్టేస్తో దూరంగా అటు తిరిగి పడుకుంది. “ప్రపంచంలో మగవాళ్ళంతా యింతే. సెక్సే అన్ని సమస్యలకీ సమాధానమనుకుంటారు” అనుకుంది.
రవికాంత్ కూడా పడుకుని ఆలోచిస్తున్నాడు. “హబ్బ ఈ చదువుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుని తప్పుచేశాను. ఏదో పల్లెటూరి పిల్లని చేసుకొనుంటే ఎంత బాగుండేది, ఇలాంటి సంపాదించే పిల్లని పెళ్ళి చేసుకునే ప్రతి మగవాడికీ దేవుడు ఎంతో ఓర్పునివ్వాలి….” అనుకున్నాడు.
“సరే. నిస్ను నేను ముట్టుకోను, నువ్వు ఉద్యోగం కూడా మానక్కర్లేదు. ఇవి కాకుండా మనం వేరే విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు కదా. నిదానంగా మాట్లాడుకుంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఆఖరికి యిద్దరం చదువుకున్నవాళ్ళమయ్యే” అన్నాడు రవికాంత్ కొంచెం సేపాగి.
“చదువుకున్నవాళ్ళం…… మై ఫుట్’ మనసులోనే అనుకుంది అంజన.
“ఉద్యోగం మానకపోతే మానకపోయావ్, కనీసం ఇంటి పేరైనా మార్చుకో. ఇప్పటికీ నువ్వు అంజనా కంచిభట్ల అనే రాస్తావు. ఏం అంజనా శంకరమంచి అని రాయలేవా? నీ ఉత్తరాలు అంజనా కంచిభట్ల పేరుతో నా ఆఫీసుకొస్తే రవికాంత్ శంకరమంచి గారి భార్య అంజన కంచిభట్ల ఎలా అవుతుందని అందరూ నన్ను ఆటపట్టిస్తున్నారు. ఇంటి పేరు మార్చుకోడానికి నీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకపోవచ్చనుకుంటా కదా!” అన్నాడు రవికాంత్.
అంజన ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. నువ్వు నా ఇంటి పేరు వెనకాలెందుకు పడుతున్నావు? దానితో నీకొచ్చిన యిబ్బందేంటి? అయినా నా ఉనికిని చెరిపేస్తే నీకు ఒరిగేదేముంది? నేను పుట్టినప్పట్నుంచే అంజన కంచిభట్లని, జీవితాంతం అలాగే ఉంటాను కూడా. ఎప్పుడూ నేను నీతోనే కలిసి నీ పడవలోనే ప్రయాణించాలని ఎందుకనుకుంటావ్? మనం వేరు వేరు పడవల్లో కూడా ప్రయాణించచ్చు కదా. ఒక్క మాట గుర్తుపెట్టుకో రవికాంత్, నేను ముందు ఒక మనిషిని, తర్వాతే నీకు భార్యని. నా భర్త యింటి పేరు పెట్టుకోకుండా కూడా నన్ను నేను ఈ సమాజంలో నిలబెట్టుకోగలను. ఇంటిపేరు మార్చుకోవాలన్న తలంపే నాకు ఎంతో యిబ్బందిగా ఉంటుంది. ఏదో నా ఉనికిని కోల్పోతున్నట్లుంటుంది. నా యింటిపేరు నా ఉనికిని తెలియజేస్తుంది. దేర్ ఫోర్, ఐ విల్ నెవర్ ఐడెంటిఫై మైసెల్ఫ్ విద్ యూర్ సర్ నేమ్. ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు ఫోర్స్ మీ ఫర్ దర్.”
అంజన మాటలు రవికాంత్ ని కాస్త ఎక్కువే బాధపెట్టాయి. ఇంక ఆ విషయం మీద చర్చలు లేవదియ్యడం మానేశాడు. రవికాంత్ మౌనంగా ఉండడం చూసి ఇంక అంజన కూడా అటు తిరిగి పడుకుంది. పెళ్ళిని డిఫైన్, రీ-డిఫైన్ చేయ్యడం మొదలుపెట్టింది. “అసలు పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే మొగుడి మాసిపోయిన సాక్సులు ఉతికి ఆరెయ్యడం, బాత్రూమ్ లో స్నానంచేసి వదిలేసిన ఆ మురికి అండర్ వేర్లు జాడించడం, వాష్ బేసిన్ దగ్గర గడ్డం గీసుకుని వదిలేసిన షేవింగ్ కిట్ సరిగ్గా సర్దిపెట్టడం, మొగుడి ఎంగిలి ప్లేట్లు, చెంచాలు రోజుకు నాలుగుసార్లు కడుగుతూ కూర్చోడం, వాడు కార్చే చొంగనే పవిత్రమైన ప్రేమగా భావిస్తూ ప్రతి రాత్రీ పరవశించిపోవడం.. ఫలితంగా తొమ్మిదినెల్లపాటు ఆ బరువును మోస్తూ తిరగడం, హాస్పటల్లో బట్టలూడదీసుకుని లేబర్ రూములో పడుకోవడం, తల్లి పదవిని కైవసం చేసుకొని మళ్ళీ యిల్లు చేరడం యింక అటుపై పిల్లలకోసం బ్లాక్ మెయిల్ భరిస్తూ మిగిలిన జీవితాన్ని ఈడ్చడం. ఇంతే కదా. అదృష్టవంతురాల్ని, నాకు అమ్మ పదని ఒక్కసారే దక్కింది. ఇంకా నయం కదూ, నేను ఎక్కడో భర్తకి దూరంగా ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఏడాదిలో ఒక్క నెలరోజులే ఈ మొగుడి చొంగని భరించాల్సి వస్తోంది. బాత్రూములో గుఱ్ఱాల్లాగా నిలబడి ఉచ్చలుపోస్తూ ఉమ్ములేసే మొగుళ్ళని భరించే ఆ భార్యలకి చేతులెత్తి మొక్కాలి. నాయనా నావల్ల కాదు ఈ పెళ్ళి, ఈ జీవితం. నేను భరించలేను. ఇది జస్ట్ ఒకరకమైన బ్లాక్ మెయిల్. పెళ్ళి అనే గుంజకి కట్టిన గానుగెద్దులాగా జీవితాంతం నేను తిరగలేను. అసలు పెళ్ళెందుకు చేసుకుంటారు? కేవలం పిల్లలకోసం అయితే పెళ్ళి చేసుకొనే అవసరం ఏముంది? కనీసం ఆధునిక స్త్రీకైతే అంత అగత్యం లేదు కదా! ఇంచుమించు అన్ని పెద్ద పెద్ద నగరాల్లో కూడా స్పెర్మ్ బ్యాంకులు వచ్చేశాయి. లండన్ లో అయితే ఎప్పట్నుంచో ఉన్నాయి. ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి వీర్యకణాలు దానం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉనికి కూడా రహస్యంగా ఉంచబడుతుంది. ఏ స్త్రీకైనా ఇంతకంటే ఇంకేం కావాలి?”
మరోపక్క రవికాంత్ కూడా ఆలోచిస్తున్నాడు. నేననుకున్నదేంటి. అయ్యిందేంటి? పెళ్ళైతే నాక్కొంత సుఖం దొరుకుతుందనుకున్నాను. నాన్నగారికి కూడా కొన్నాళ్ళైనా చెయ్యి కాల్చుకునే శ్రమ తగ్గుతుందనుకున్నాను. నాన్నగారిని నా దగ్గరుంచుకుంటే ఆయన ఎంత సంతోషిస్తారు? వెంటనే రవికాంత్ కి గుర్తొచ్చింది. పెళ్ళైన కొత్తలో అంజన తన దగ్గరుండే రోజుల్లో ఒకసారి నాన్నగారిని యింటికి తీసుకొచ్చాడు. అప్పుడు అంజన “మీ నాన్న ఎంత తింటాడు? ఏదిస్తే అదే తినేస్తాడు. అసలీ పల్లెటూరు వాళ్ళు ఇంతింత ఎందుకు తింటారు? ఎలా తింటారు?” అనేది. చాలాసార్లు అంజన నాన్నగారికి వంటచేయనని కూడా చెప్పేసింది. కొన్నాళ్ళకి సంక్రాంతి పండగ వంకపెట్టి ఆయన్ని ఊళ్ళో దిగబెట్టి రావల్సివచ్చింది. ఇంక ఆయన జీవితం మాత్రం ఎంత మిగిలిందని, ఏదోలాగా గడచిపోతుంది. అంజన ఉద్యోగమా మానదు. మానకపోనీ, ఇంటి పేరూ మార్చుకోదు, మార్చుకోకపోనీ, నాకెలాగూ ఒంటరి బతుకు అలవాటైపోయింది.
రవికాంత్ కాళ్ళావేళ్ళా పడ్డ మీదట అంజన తన శెలవు మరో పదిహేను రోజులు పొడిగించింది. రవికాంత్ ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కలిసి ఉండకపోవడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవడమే ఈ సమస్యలన్నిటికీ కారణమని రవికాంత్ అభిప్రాయం. ఈ పదిహేనోజులూ అంజన మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు తను. అసలైతే చాందినీ పుట్టగానే అంజన మనసు మారిపోయుండాలి. ఊళ్ళో పెద్దమ్మ అస్తమానం అంటూ ఉండేది. ఒక పిల్లో పిల్లాడో పుడితే ఎంతటి పొగరుబోతు ఆడదైనా దార్లోకొచ్చేస్తుందని. కానీ ఎందుకో అంజన మీద పెద్దమ్మ సూత్రం పనిచెయ్యలేదు. రవికాంత్ కి ఒక విషయమైతే తెలిసిపోయింది. తను అంజనని ఎలాకావాలంటే అలా ఆడించలేడు. ఒక్కోసారైతే తనే ఒక సరైన మనిషిని కాదని, అందువల్లే అంజన తన మాటను లెక్కచెయ్యదని అనిపిస్తూ ఉంటుంది రవికాంత్ కి. నేను పల్లెటూరి వాడిని, అవును అందుకే అనుకుంటా అంజన ఎప్పుడూ తనని తక్కువంచనా వేస్తూ వుంటుంది. కానీ పల్లెటూరివాడినైతే ఏంటి? ఊళ్ళో అందరికంటే పెద్ద చదువు చదువుకున్నాను. ఆఫీసర్ అయ్యాను. వీటన్నిటికంటే మించి నేను అంజన భర్తని, తను భర్త అనే ఆలోచన వస్తూనే మనసులో ఏదో కొత్త ఉత్సాహంతో రవికాంత్ ఛాతీ వెడల్పయింది. భుజాలు పొంగాయి. వెన్నెముక ఒక్కసారిగా నిటారుగా అయ్యింది. సరిగ్గా అప్పుడే భర్తగా తన తండ్రి ఎలా ఉండేవాడో గుర్తొచ్చింది. బ్రతికున్నన్నాళ్ళు అమ్మ ఎప్పుడూ తండ్రి ముందు మాట్లాడి ఎరుగదు. మాటిమాటికీ నాన్నే అమ్మని కేకలేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు చెయ్యిచేసుకునేవారు కూడా. కానీ అలా దెబ్బలు తింటూ కూడా అమ్మ బాధపడడం తనెప్పుడూ చూడలేదు. నాన్నగారు ఏమీ ఆఫీసురు కూడా కాదు. ఒక మామూలు రైతు అంతే. ఎప్పుడూ బడి మొహం కూడా చూసిన పాపాన పోలేదు. అయినా కానీ అమ్మ, నాన్నగారి ఏమాటనీ కాదనేదికాదు. ఎందుకు? ఆవిడ చదువుకోలేదు కాబట్టేనా?? లేక….??
రవికాంత్ బ్రతిమాలినమీదట అంజన సెలవయితే పొడిగించింది కానీ దేనిమీదా తనకి మనసు లగ్నం కావట్లేదు. అంజన మనసులో ఏదో భయం గూడుకట్టుకుపోయింది. రవికాంత్ ఏదో గారడీ చేసి తనతో ఉద్యోగం మానిపించేస్తాడని భయం. పల్లెటూరివాళ్ళు ఈ మాయలు, గారడీలు అవీ చేస్తూంటారని తనకి ఎవరో చెప్పగా వింది కూడాను. అప్పుడు తను జీవితాంతం రవికాంత్ తో ఎలా ఉండగలదు? పెళ్ళి పేరు చెప్పి యింక మిగిలిందేంటి?? సెక్స్, పిల్లలు అన్నీ అయ్యేపోయాయి. చాందినీ పుట్టినదగ్గర్నుంచి రవికాంత్ తన్ని ముట్టుకుంటే ఏదో బలాత్కారం చేస్తున్నట్టే అనిపిస్తోంది. పెళ్ళైన కొత్తల్లో మోజువల్ల, కొత్తదనం వల్ల రవికాంత్ కొంచెం బాగానే అనిపించేవాడు. కానీ యిప్పుడెందుకో మాటల్లో చెప్పలేని అసహ్యం, ద్వేషం చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రవికాంత్ కాలి గోళ్ళు మురిగ్గా కనిపిస్తున్నాయి. మీసాలు కూడా ఏంటో విచిత్రంగా నిక్కబొడుచుకున్నట్లు ఈతముళ్ళలా అనిపిస్తున్నాయి. ఆ పళ్ళు పచ్చగా, కళ్ళు మిటకరిస్తున్నట్లు, పెదవులు భయంకరంగా ఏదో జంతువు పెదాలులా అనిపిస్తున్నాయి. ఇప్పుడు అతని చెమటవాసన భరించడం కూడా కష్టంగా ఉంది.
అంజన ఉన్నన్నాళ్ళు రవికాంత్ మధ్యాహ్నం భోజనానికి యింటికే వచ్చేవాడు. ఇంట్లో భోజనం చేసినా, చెయ్యకుండా ఆఫీసుకి తిరిగెళ్ళాల్సి వచ్చినా కానీ రవికాంత్ వస్తూనే ఉండేవాడు. అంజనని ఆనంద పెట్టే ప్రయత్నంలో భాగమే యిదంతా. ఒకరోజు మధ్యాహ్నం భోజనానికి యింటికొచ్చేసరికి తలుపుకి ఒక ఉత్తరం పెట్టి ఉంది. ఉత్తరం అంజన పేరు మీద వచ్చింది. అడ్రస్ ‘డా. అంజన కంచిభొట్ల, హౌస్ నెం. 17 ….’ అని ఉంది. అంజన పేరుమీద యింటి అడ్రసుకి ఉత్తరం రావడం రవికాంతికి చాలా ఆశ్చర్యమేసింది. తనకైనా, అంజనకైనా వచ్చే ఉత్తరాలన్నీ తన ఆఫీసు అడ్రస్సుకే వస్తాయి. అంజన కిచెన్ లో ఉంది. ఉత్తరం తీసుకెళ్ళి అంజనకి ఇచ్చాడు.
భోజనం అయ్యాక రవికాంత్ అంజనని ఉత్తరం గురించి అడిగాడు. “నీకు సంబంధించింది కాదు” అనేసి ఊరుకుంది అంజన.
“అయినా కానీ, నీకు ఇంటి అడ్రస్ కి ఉత్తరం రాసేవాళ్ళెవరో తెలిస్తే నయంకదా. ఎవరో కొత్తవాళ్ళులాగున్నారు” అన్నాడు రవికాంత్.
అంజన ఉత్తరాన్ని కవరుతో సహా రవికాంత్ ముందు పెట్టింది. ఆ ఉత్తరం ”మహిళా సంక్షేమ సంఘం’ కార్యదర్శి నుంచి వచ్చింది. అందులో – “డా.ఆంజన కంచిభొట్ల గారు, మీ ఉత్తరం మా మహిళా సంక్షేమ సంఘం దృష్టికొచ్చింది. బాగా ఆలోచించిన మీదట మా నిర్ణయం ఏమిటంటే ఇంటి పేరు మార్చుకోవడమా లేదా అనేది పూర్తిగా మీ యిష్టాయిష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మీ భర్త ఏవిధంగానూ మిమ్మల్ని బలవంతం చెయ్యలేరు. మీ ఉత్తరం ఒక కాపీ మా సంఘం సిఫార్సుతో సహా మీ దగ్గరలోని పోలీసు స్టేషనుకు ఫ్యాక్సు చెయ్యడం జరిగింది. భవిష్యత్తులో మా నుంచి ఎటువంటి సహాయం కావల్సినా సంకోచించవద్దని మనవి.”
ఉత్తరం అంజనకి తిరిగి యిస్తూ “ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉంటే బాగుండేది.” అని ఊరుకున్నాడు.
అదేరోజు సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగొస్తూ రవికాంత్ అంజనకి టికెట్ రిజర్వేషన్ చేయించి తీసుకొచ్చాడు. టికెట్టు డ్రెసింగ్ టేబులు మీద పెడుతూ “రేపు సాయంత్రం బండికి నీకు టికెట్టు రిజర్వేషన్ చేయించాను” అన్నాడు.
బండి బయల్దేరే టైమవుతోంది. అంజన చాందినీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కిటికీ పక్కనే కూర్చుంది. ప్లాటుఫారం మీద నిలబడ్డ రవికాంత్ చాందినీకేసి, అంజనకేసి మార్చి మార్చి చూస్తున్నాడు. అంజన రవికాంత్ ని దగ్గరకి పిలిచి నెమ్మదిగా “చాందినీని నాతో తీసుకెళ్తున్నాను. తండ్రినీడలో దాన్ని పిరికిదాన్ని చెయ్యడం నాకిష్టంలేదు. తండ్రిలాంటి మగవాడి నీడలో పెరిగే పిల్లలు శాశ్వతంగా పిరికి వాళ్ళైపోతారు. పెద్దయ్యాక చాందినీ నీగురించి అడిగితే నువ్వు ఏ విదేశాల్లోనో ఉన్నావని చెప్తానులే” అంది.
స్టేషన్ నుంచి తిరిగొచ్చిన రవికాంత్ బెడ్రూములో ఖాళీగా ఉన్న మంచంమీద కొంచెంసేపు వాలాడు. పరుపు అంతా చాందినీ ఒలకపోసిన పాల వాసన …. తలగడ మీద రెండు మూడు పొడవైన అంజన తలవెంట్రుకలు… గదిలో ఒక మూల చాందినీ ప్రామ్, దానికి ప్రశాంతంగా, స్తబ్దుగా వేలాడుతున్న గిలక్కాయ…. ఒక్కసారి గడియారం వైపు చూశాడు. మళ్ళీ ఆఫీసుకి టైమయింది.
***
