శిశిరం : అటు-ఇటు

Spread the love

రాత్రి తొమ్మిది అయ్యింది. ఢిల్లీ-చండీగఢ్ బస్సు సరైన సమయానికే గమ్యస్థానం చేరుకుంది. తోషితో ఆఖరిసారి ఏడుగంటలకి మాట్లాడాడు. అప్పటికి బస్సు కర్నాల్-అంబాల మధ్యలో ఏదో చిన్న ఊర్లో ఉన్నట్టు గుర్తు.

‘డాడీ, మీరు బస్ స్టాండుకి వచ్చేయండి. నేను కూడా వచ్చేస్తాను.’

బస్ స్టాండులో ఎక్కువ బస్సులు లేవు. బస్ స్టాండు పగటివేళతో పోలిస్తే రాత్రివేళల్లో ఎక్కువ కళకళ్ళాడుతూ ఉంటుంది. ప్రయాణికులు సంఖ్య తగ్గుతుంది, హడావుడి పెరుగుతుంది. చెప్పిన ప్రకారం తోషి బస్ స్టాండులో కనబడకపోయేసరికి ఎందుకో గాబరా అనిపించింది. భలే చిత్రమైన మనిషిలా ఉన్నాడే. ఏమయిపోయినట్టు? మాటిమాటికీ తోషి మొబైల్ కి ఫోను చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు రింగ్ అయినా అటువైపు నుండి ఎలాంటి జవాబు లేదు. భుజానికి ఎయర్ బ్యాగ్ తగిలించుకుని ఇప్పటికి బస్ స్టాండు అంతా రెండు చక్కర్లు కొట్టి వచ్చాడు. ఢిల్లీ నుండి చండీగఢ్ ఈ ఐదు గంటలు ప్రయాణంతో బాగా అలసిపోయాడు. అసలు ఇల్లు వదిలి వచ్చిన ఆ పనికిమాలిన వెధవతో మాట్లాడకుండానే ఉండాల్సింది. లేదా ఇలా మధ్యలో చండీగఢ్ దిగకుండా తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి ఉండాల్సింది.

ఎంతో నిరాశతో ఏం చెయ్యాలో అర్థం కాని ఆ పరిస్థితుల్లో బస్ స్టాండులోనే ఒక మూల సిమెంటు బెంచి మీద చతికిలబడ్డాడు. కనీసం టీ అయినా తాగుదాం అనిపించింది. ఈలోపు నాన్నని వెతుక్కుంటూ తోషి రావచ్చు ఏమో! పేపరు కప్పులో టీ తీసుకుని మళ్ళీ ఆ సిమెంటు బెంచి మీదనే కూర్చొన్నాడు. వస్తున్న కోపాన్ని, నిస్సహాయతని ఆపుకోవడానికి చేస్తున్న వృథా ప్రయాస. మధ్యలో చాలాసార్లు కొడుకుకి ఫోను చేస్తూనే ఉన్నాడు.

అసలు ఏం జరిగి ఉండొచ్చు? తోషి స్కూటరు తీసుకుని వస్తాను అన్నాడు. పొరపాటు ఏమయినా…. అయ్యో ఏంటి నా మనసు ఇలా కీడు శంకిస్తోంది.. లేదు లేదు.. అలాంటిది ఏం జరిగి ఉండదు. ఎందుకో క్రమంగా తను కొయ్యబారిపోతున్నట్టు అనిపించింది. వెంటనే తేరుకుని భార్యకి ఫోను చేసాడు. ఇంచుమించు ఏడుపు ముఖంతో జరిగినది అంతా చెప్పుకొచ్చాడు. “పొరపాటున ఫోను ఏమైనా ‘సైలెంటు’లో ఉండిపోయింది ఏమో” కాస్త ఓదార్చడానికి ప్రయత్నిస్తూ అంది భార్య.

            “నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావు. నన్ను తీసుకెళ్ళడానికి బస్ స్టాండుకి వస్తాను అన్నవాడు ఫోను సైలెంటులో ఎందుకు పెడతాడు. నాకు వాడి ఇంటి అడ్రస్ కూడా తెలియదాయె! ఎక్కడో డైరీలో రాసిన గుర్తు. ఆఁ ఆఁ గుర్తొచ్చింది. ఎరుపు రంగు డైరీ …. స్టడీ రూమ్ లో టీపాయ్ మీద ఉంటుంది. చూడు కాస్త. “హబ్బ, ఇప్పుడు ఇంత రాత్రి నేను ఆ డైరీ ఎక్కడ వెతకాలి? కాసేపు ఆగండి. దారిలో ఉన్నాడేమో!” నీకు దణ్ణం పెడతా. ముందు ఆ డైరీ చూడు. ఇంకా తొమ్మిదే అయ్యింది. ఏదో అర్ధరాత్రి అయిపోనట్టు మాట్లాడుతున్నావు. వాడు రాకపోతే, నన్ను రాత్రి అంతా ఇలా బెంచి మీదనే పడుకొని ఉండమంటావా? తోషి మీద చిరాకు చాలదు అన్నట్టు ఇప్పుడు భార్య మీద కూడా కోపం వస్తోంది.

            ఫోను పెట్టేసాడు. రాత్రి ఎలా గడుస్తుందా అని బెంగ. బస్ స్టాండులో ఉక్కపోత భరించలేకుండా ఉంది. రాత్రి ప్రయాణీకుల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది. ఈ రాత్రి బెంచి మీదనే గడిచేలా ఉంది. కళ్ళు మూతలు పడుతూంటే మెల్లగా పక్కన కూర్చొన్న ఒక నడివయస్సు ఆడమనిషి భుజం మీదకి తల వాలిపోయింది. ‘ఈ ముసలాడు నా మీద ఎందుకు పడుతున్నాడా?’ అని బెదిరినట్టుంది. ‘అన్న! కాస్త ఆ పక్కకి జరిగి కూర్చో.’ అంది. “నిద్ర వచ్చేసింది. ఏమీ అనుకోకు. క్షమించు.” అన్నాడు. ఇంతలో ఫోను మోగితే, తోషి దగ్గర నుండే అనుకుంటూ ఆశతో ఫోను చూసాడు. తీరా చూస్తే భార్య దగ్గర నుండి …. ఆశల మీద నీళ్ళు చల్లినట్టు అనిపించింది. ‘రాసుకోండి. తోషి అడ్రెస్’ అంది. జేబులో నుండి పెన్ను తీసి ఎనిమిది మడతలు పెట్టిన న్యూస్ పేపరు కొసన కొడుకు ఇంటి అడ్రస్ రాసుకున్నాడు. “ఇప్పుడు ఏం చేసేది? టైం చూస్తే పావు తక్కువ పన్నెండు. తోషి ఆఫీసుకు వెళ్ళే టైం. అసలు ఇంటి అడ్రస్ దొరుకుతుందో లేదో ఆ పరమాత్ముడికే ఎరుక.”

            “మీరు కూడా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏదో ఒక ఆటో దొరకకపోదు. వెళ్ళి అసలు వాడు ఎలా ఉన్నాడో చూడండి. లేదంటే అక్కడ బస్ స్టాండులో మీరు, వాడికి ఏమయిందో తెలియక ఇక్కడ నేను, ఇద్దరం కంగారు పడాలి.”

            “నిజమే. భార్య సలహా తీసుకోవడం మంచిదే అయింది. తల్లిదండ్రుల పట్ల ఇదేనా పిల్లల బాధ్యత? షిట్, ఒక ఎమోషన్ లేదు ఏం లేదు. అసలు ఈ తరం యువతలో ఆత్మ అన్నది చచ్చిపోయినట్టు ఉంది. నానా తిప్పలు పడి వీళ్ళని పెంచి పెద్ద చెయ్యడం, ఇదిగో వీళ్ళేమో ఇలా …. కన్న తండ్రి పట్ల ఎంత నిర్లక్ష్యం? కొడుకు కోసం ఎదురు చూస్తూ ఇంత అర్ధరాత్రి ఈ ఉక్కపోతలో బస్ స్టాండు బెంచి మీద తను మగ్గిపోతున్నాడు. ఇదీ వాడి నిర్వాకం.  దేశంలోని లక్షలాది ముసలి తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉందిలే. అనాథలలా క్షణక్షణం ఇలా బెంగతో మౌనాన్ని, మనసులో చెలరేగే హాహాకారాలని ఒకేసారి మనసులో దాచుకుంటూ చస్తూ బతకమని రాసినట్టు ఉన్నాడు ఆ దేవుడు!

ఇంతలో హిమాచల్ రోడ్ వేస్ ఎంక్వయిరీ వరకు రెండుసార్లు తిరిగి వచ్చాడు. ఎడ్వాన్స్ బుకింగ్స్ సాయంత్రం ఆరు గంటలకే అయిపోయాయి. ఢిల్లీ, వేరే చోట్ల నుండి చండీగఢ్ మీదుగా తన సొంత ఊరు ధర్మశాల వెళ్ళే బస్సుల వివరాలు కూడా కనుక్కున్నాడు. టూరిస్ట్ సీజన్ అవ్వడం వల్ల రిజర్వేషన్లు లేవు. అని చెప్పారు. ఇంత గుంపులో సీటు దొరకటం కష్టం అని కూడా తేల్చి చెప్పేసారు. అయినా ఆ గుంపులో జనాలని తోసుకుంటూ తను బస్సు ఎక్కగలడా?

బెంచి మీద కూర్చుని కూర్చుని నడుం లాగేస్తోంది.

వేడి గాలి మొహానికి కొడుతోంది. తన జీవన సమరంలో కొడుకు మిగిల్చిన నిరాశకి ఇది నిలువెత్తు నిదర్శనం. కొడుకు తనని ఇలా అర్ధరాత్రి ఒంటరిగా వదిలెయ్యడం తన పరువు ప్రతిష్ఠల మీద దెబ్బ కొట్టినట్టు ఉంది.

ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ బస్ స్టాండు నిప్పుల కొలిమిలా అనిపిస్తోంది.

వరసగా వస్తూ-పోతూ ఉన్న బస్సులతో ఆవరణ అంతా పొగ కమ్ముకుంది. ఆ మట్టి కణాలు కళ్ళల్లో సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. మొదటి నుండి తను జీవితంతో పోరాడుతూనే ఉన్నాడు. ఇక దేనికయినా తను సిద్ధం అన్నట్టు బయటకి వచ్చి ఆటో రిక్షా పిలిచాడు. చండీగఢ్ వీథుల వెంట ఆటో రిక్షా ముందుకు సాగిపోతోంది. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త భయం పట్టుకుంది. ఈ ఆటోవాడు తనని నాలుగు తన్ని పర్సులో ఉన్న ఆ కాస్త డబ్బు-దస్కం గుంజుకుంటే? ఎదిరించడం మాట దేవుడెరుగు, కనీసం తనకి పెనుగులాడే ఓపిక కూడా లేదు.

“చూడు నాయనా! కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళు. నన్ను మా అబ్బాయి ఇంటికి చేర్చు. ఇంత రాత్రి. నాకు కళ్ళు కూడా సరిగ్గా కనబడి చావవు. నువ్వే తీసుకెళ్ళు.” మాటల్లో పెట్టి ఆటో కుర్రాణ్ణి మంచి చేసుకునే పనిలో పడ్డాడు. “అంకుల్, మీరు ఏం టెన్షన్ పడొద్దు. మిమ్మల్ని ఎక్కడకి చేర్చాలో అక్కడికి చేర్చే బాధ్యత నాది” అన్నాడు ఆటో కుర్రాడు.

‘ఎక్కడికి చేర్చాలో అక్కడకి?’ ఇదేంటి? కొంపదీసి ఈ ఆటోవాడు…? మనసులో భయం ఇంకా ఎక్కువయింది. ఏంటి వీడి డబుల్ మీనింగ్ డైలాగులు? నన్ను దోచుకోవాలని పన్నాగం ఏం లేదు కదా? నా బట్టలు, మాటలు అన్నీ చూడటానికి బాగా డబ్బున్న వాడిలా కనిపిస్తున్నాయి కూడా. ఈ ఆటో వాళ్ళ కళ్ళు ఎప్పుడూ ప్యాసింజరు జేబు మీదనే ఉంటాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ‘అంకుల్, ఈ ఫేజ్ ఫైవ్ చాలా దూరం. బెరకా చౌక్ దగ్గర.’ – ఆటో డ్రైవరు మాటలతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు.

అరగంటలో భార్య నోట్ చేయించిన అడ్రస్ కి చేరుకున్నాడు. అదే ఇల్లా? కాదా? తేల్చుకోవాలి.

“బాబూ, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. నేను వెళ్ళి కనుక్కుని వస్తాను.”   

“ఫ్లాట్ నెంబరు 985. ఇదే అంకుల్. సరే. కనుక్కుని రండి”

మొదటి అంతస్థుకి వెళ్ళి కాలింగ్ బెల్లు కొట్టాడు.

ఒక కుర్రాడు వచ్చి తలుపు తీసాడు.

“తోషి ఉండేది ఇక్కడేనా?”

“అవును. మీరు ఎవరు?”

“నేను తోషి డాడీని. నొచ్చుకున్న మనసుతో ఏదో నూతిలో నుండి వస్తున్నట్టు వచ్చింది నా గొంతు.”

“ఓహ్ అంకుల్ మీరా! రండి. రండి. తోషి ఇంట్లోనే ఉన్నాడు.”

“సరే. నేను ఆటోకి డబ్బులు ఇచ్చి వస్తాను.”

ఓహ్! అంటే నా గారాల కొడుకు ఇంట్లోనే ఉన్నాడన్న మాట! రాగానే చెంప ఛెళ్ళుమనిపించాలి అన్నంత కోపం వచ్చింది. ఏదో బొమ్మలా గుమ్మంలోనే నిలబడిపోయాడు.

“తోషీ, లే! మీ డాడీ వచ్చారు.”

ఎవరో మూర్ఛపోయిన వాణ్ణి లేపుతున్నట్టు ఉంది అక్కడి పరిస్థ్తితి. కొంపదీసి తన కొడుకు డ్రగ్స్ కి బానిస అయిపోలేదు కదా. ఈరోజుల్లో ఇవన్నీ సర్వ సాధారణం.  లేదు లేదు. తోషి ఒక్కనాటికి అలా చెయ్యడు. అయినా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఇలాంటి కాల్ సెంటరు ఉద్యోగాలు చెయ్యలేరు. రాత్రి అంతా కళ్ళకి మోనిటర్, చెవులకి ఇయర్ ఫోన్స్. ప్రతీసారి కొత్త కాలర్ గురించి ఎదురుచూస్తూ ఉండాలి. తను అనవసరంగా తోషి గురించి భయపడుతున్నాడు. రెండు పెద్ద-పెద్ద గదులు. మార్బుల్ ఫ్లోరింగ్. ఫాల్స్ సీలింగ్. గోడలకి లేత రంగు పెయింట్.  చక్కటి ఉడ్ వర్క్ తో అల్మారాలు. కానీ ఇల్లు అంతా ఖాళీ. నేలమీద రెండు చాపలు, వాటిపై పరుపు, దాని మీద మాసిపోయిన దుప్పటి. రెండు రంగు వెలిసిపోయిన తలగడలు. అంత పెద్ద హాలులో ఒక్క కుర్చీ కానీ, టేబులు కానీ లేవు. గదిలో ఒక మూల అలా ఆ పరుపు మీదే గోడకి ఆనుకుని కూర్చొంటే చిరాకే కాదు, చాలా ఇబ్బందిగా కూడా ఉంది.

“అంకుల్ కూర్చోండి” అంటూ తోషి రూమ్మేట్ పరుపు మీద కూర్చోమని చెప్పాడు. అసలు ఆ ఆటోవాణ్ణి ఆపి ఉండాల్సింది. తోషి యోగక్షేమాలు కనుక్కుని తిరిగి వెళ్ళిపోవాల్సింది. నేలమీద ఎలా పడుకోవాలి?  రాత్రంతా అటూ-ఇటూ దొర్లటమే సరిపోతుందేమో! ఇప్పుడు ఇక మరో దారి లేదు. బస్ స్టాండుకి వెళ్ళే అవకాశం కూడా లేదు.

బ్యాగ్ తీసి గదిలో ఒక మూల పెట్టాడు. బూట్లు విప్పి బ్యాగ్ పక్కనే పెట్టాడు. నడుం గోడకి ఆన్చి ఆ పరుపు మీద కూర్చుండిపోయాడు.

ఓహ్ గాడ్! హారిబుల్!

ఇంతలో తోషి రూమ్మేట్ ‘అంకుల్ మంచి నీళ్ళు  తీసుకోండి’ అంటూ గ్లాసు చేతికి అందించాడు.

“అంకుల్ టీ తాగుతారా?” 

“వద్దు. అసలు ఏదో రాకూడని చోటుకి వచ్చినట్టు అనిపిస్తోంది. అసలు ఈ గదికి, ఆ బస్ స్టాండు బెంచికి ఏం తేడా ఉన్నట్టు? తనకి అయితే రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద ఉన్నట్టు అనిపించింది. రైలు కోసం ఎదురు చూస్తూ ప్రయాణికులు స్తంభాలకి, టీ స్టాల్ గోడలకి, పార్శల్ సామానుకి, ఏవన్నా డబ్బాలకి ఆనుకుని కూర్చొన్నట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. నిద్ర లేక శరీరం తూలుతోంది. పక్కకి జారి పడిపోతాడా అన్నట్టు ఉంది. శరీరంలో నుంచి రక్తం అంతా పీల్చేసినట్టు అనిపిస్తోంది.” ఎవరో కాళ్ళు తాకినట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా తోషి. కళ్ళలో ఎర్రటి జీర.

“డాడీ, అయాం సారీ. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓవర్ టైం చేసాను. సాయంత్రం ఏడింటికి మీతో మాట్లాడిన తర్వాత నిద్రపట్టేసింది. మీ ఫోనూ వినిపించలేదు, బస్ స్టాండుకీ రాలేకపోయాను. అయాం ఎక్స్ట్రీమ్లీ సారీ డాడీ.”

కోపాన్ని లోపలే అణచుకుంటున్నాడు. లావా ఎప్పుడెప్పుడు బయటకి ఎగజిమ్ముతుందా అన్నట్టు ఉంది. మనసులో తోషిని ఎన్ని తిట్టుకున్నాడు… ఎన్నెన్ని శాపనార్థాలు పెట్టాడు. నాన్న అంటే ఇంత నిర్లక్ష్యమా? చెప్తాను ఆగు వీడి సంగతి. ఈ ఉత్తర ఆధునికత మనిషి నుండి ఏమేం లాగేసుకుందో అసలు మనిషికి తెలియటం లేదు. ప్రేమ, మమకారం, సానుభూతి…అసలు పెద్దవాళ్ళు అంటే లెక్కలేకుండా పోయింది. తనకే కనక నిద్ర రాకుండా ఉంటే తోషి కళ్ళబడగానే కాలర్ పట్టుకుని నాలుగు తగిలించేవాడు.

కాసేపటికి తోషి స్నానం చేసి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. “డాడీ, నేను వెళ్తున్నాను. క్యాబ్ వచ్చేసింది. రాత్రి ఒంటిగంట షిఫ్ట్. మళ్ళీ రేపు పొద్దున్న పది గంటలకి వస్తాను. మీరు ప్రశాంతంగా నిద్రపోండి.”

తుషార్ వెళ్ళిపోయాడు. అసలు అంత అర్ధరాత్రి వచ్చిన కన్న తండ్రి ఏమన్నా తిన్నాడా లేదా అని అడగడానికి కూడా టైం లేకుండా పోయింది. ఏం పిల్లలో? కొడుకు కోసం ఎదురు చూస్తూ గంటల తరబడి ఆ వెధవ బస్ స్టాండులో కూర్చొన్నాడు. కడుపులో ఆ కప్పు టీ తప్ప మరేం లేదు. కడుపులో పేగులు గీఁ అంటున్నాయి. ఆకలికి నిద్ర కూడా పట్టదు. తోషి రూమ్మేట్ బిస్కెట్లు-టీ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు.

“బాబూ, తోషి ఏం తినకుండానే డ్యూటీకి వెళ్ళిపోయాడా?” లేదు అంకుల్. తను ఎనిమిది గంటలకే తినేసాడు. అన్నం-పప్పు. ఉదయం ఆఫీసు క్యాంటీన్ లో నే టిఫిన్ చేస్తాడు. అయ్యో అంకుల్, మీరు ఏం తిన్నట్టు లేదు. మ్యాగీ చెయ్యమంటారా?

“లేదు, లేదు. నేను బస్ స్టాండులోనే తినేసాను. నువ్వు వెళ్ళి పడుకో. నేను కూడా పడుకుంటున్నాను. బాగా అలసిపోయాను.” ఎంత సునాయాసంగా అబద్దం చెప్పేసాడో తను.

“ఓకే అంకుల్. గుడ్ నైట్.”

“గుడ్ నైట్ బాబు.”

ఈ కాల్ సెంటరు ఉద్యోగం తుషి అనబడే ఈ తుషార్ ని పీల్చి పిప్పి చేసేసింది. ఆడ్ వర్కింగ్ అవర్స్. ఎప్పుడూ ఆ కంప్యూటర్ స్క్రీన్ కే గుడ్లు అప్పగించుకుని కూర్చోవడం. అసలు కదలడం కూడా ఉండదు. చెవుల్లో ఆ ఇయర్ ఫోన్సుతో ఎప్పుడూ చెవి నొప్పి అని గొడవ. రెణ్ణెల్ల క్రితం ఒక చెవిలో పరఫొరేషన్ అని వచ్చాడు ఇంటికి. పదిసార్లు ఈ.ఎన్.టి. ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం. ఆరు వారాల తర్వాత నొప్పి కాస్త తగ్గింది. ఈ ఉద్యోగం ప్రభావం అన్నింటికంటే ముందు చెవుల మీద పడుతుంది. సర్వేల ప్రకారం చెవులే ఎక్కువ పాడవుతాయి. ఈ ఉద్యోగం వదిలెయ్యరా నాయనా అని ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసుగొచ్చింది. అసలు నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఏదో రోగిష్టివాడిలా ఉన్నావు. ఆరోగ్యం పాడవుతోంది. అసలు రాత్రికి పగలుకి తేడా లేకుండా పోయింది. సోషల్ లైఫ్ అయితే అసలు లేనే లేదు. పడుకోవడం-లేవడం-తినడం- దేనికీ ఒక సమయం అంటూ లేకుండా పోయింది. అంతా గందరగోళం. అమ్మ-నాన్నలు ఎంత చెప్పినా వెంటే కదా? ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు తోషి.

తోషి నెల-రెండు నెలలకి వీకెండ్ కి ఇంటికి వ స్తూ ఉంటాడు. రాత్రి బస్సుకి బయలుదేరి వచ్చి రెండు రోజులు నిద్రపోయి మళ్ళీ తిరిగి వెళ్ళే హడావుడి. గంటల తరబడి ప్రయాణం తర్వాత సమయానికి ఆఫీసు చేరుకోవాలి అన్న వత్తిడి. మ్యాక్సీ క్యాబ్ కంటే ముందు చేరుకోవాలి. ఏం చెయ్యమంటావు డాడీ. రాత్రి ఒంటిగంట కి డ్యూటీ. పన్నెండు గంటలకల్లా చండీగఢ్ చేరుకోవాలి. పిక్-అప్ వ్యాన్ వెళ్ళిపోతే మళ్ళీ అదొక గోల.

ఈ కాల్ సెంటరు ఉద్యోగంలో ముందుగా పర్మిషన్ లేకుండా ఒక్క పూట సెలవు తీసుకోవడం వీలు కాదు. ఎందుకంటే అన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి.  ఫ్లోర్ మేనేజర్ నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. వాడి చూపులు మనసుని చీరేస్తాయి. అలాంటి క్షణాల్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిజంగా ఈ కాల్ సెంటరు ఉద్యోగం ప్రాణాంతకం. కళ్ళు పైకెత్తి తిరుగుతున్న ఫ్యాన్ కేసి చూస్తున్నాడు. నిద్ర వస్తే కదా కళ్ళు మూసుకోవడానికి. రాత్రి అంతా ఇలా కళ్ళు తెరిచే గడపాలి ఏమో. శిశిర ఋతువులో పచ్చదనం కోల్పోయిన చెట్ల వంటి శూన్యం ఆవహించింది తన మనసు నిండా. నిజంగానే తను శిశిరం గడపలో ఉన్నట్టా?

రాత్రి అంతా ఖాళీ కడుపుతో పడుకోవడంతో ఉదయం చాలా ఇబ్బందిగా ఉంది. ఒళ్ళు వేడిగా ఉంది. బహుశా కాస్త జ్వరం తగిలినట్టు ఉంది. పారాసిట్మాల్ టాబ్లెట్ వేసుకోవాలి ఏమో. టీ కోసం నాలుక పీకేస్తోంది. తోషి పదింటికి కానీ రాడు. రెండుసార్లు వంట గదిలోకి వెళ్ళి చూసి వచ్చాడు. పాలు లేవు. ఎక్కడా టీపొడి-పంచదార కనిపించలేదు. సరే అలా రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగి వద్దాం అనుకుంటే ఎక్కడా దగ్గర్లో టీ కొట్టు కూడా కనిపించలేదు. టీ కోసం సందులు-గొందులు తిరిగి ఇల్లు మర్చిపోతాడేమో అని రెండు మైళ్ళు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసాడు.

పదింపావు అవుతోంటే తోషి వచ్చాడు. రాత్రి పన్నెండు గంటలకి చక్కగా ట్రిమ్ గా తయారయ్యి ఫారెన్ సెంటు కూడా కొట్టుకుని వెళ్ళాడు. ఉదయం వచ్చేసరికి వాలకం చూస్తే ఆశ్చర్యమేసింది. ముఖం అంతా పీక్కుపోయింది. కళ్ళలో ఎర్రటి జీర. ఏదో రక్తదానం చేసి వచ్చినట్టు నీరసంగా ఉన్నాడు. చేతిలో కవరు… పాలు, బ్రెడ్, బటర్, గుడ్లు.

“డాడీ, స్నానం చేసారా? టిఫిన్ చెసెయ్యనా?”

“చూడు తోషి, ఈ ఉద్యోగం నిన్ను పీల్చి పిప్పి చేసేస్తోంది. వై డోంట్ యూ అండర్ స్టాండ్?”

మళ్ళీ అదే చిన్న చిరునవ్వు. లోపల అణుచుకున్న బాధని కొంచెం కొంచెం చూపిస్తున్నట్టు ఉంది ఆ నవ్వు.   

ఇద్దరూ ప్రశాంతంగా టిఫిన్ చేసారు. తోషి మనసు విప్పి మాట్లాడుతాడు అని ఎదురు చూసాడు. కానీ వాడి మౌనం నన్ను బాధించింది. ఇలా ఎవరితోనూ మాటా-మంతి లేకుండా ఉంటే ఎలా? ప్రాణాంతకమైన ఈ కాల్ సెంటర్ ఉద్యోగమే ఇక పర్మినెంటు కెరీర్ అనుకుంటున్నాడా? వేరే ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నించడు? ఇప్పటికి పది-ఇరవై సార్లు చెప్పి చెప్పి బుర్ర బద్దలు బద్దలు కొట్టుకున్నాడు. తనకి నచ్చిన కోర్సు ఏమైనా చేస్తే సరి. తన సలహా వినడు. కెరియర్ గురించి తోషి ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించలేదు అనిపిస్తుంది. తోషి ఇలా అమ్మ-నాన్నలని ధిక్కరిచడం ఎన్నో ఏళ్ళగా బాధిస్తోంది.

తోషి దేనికీ లొంగడం లేదు. ఏదో చెయ్యాలని ఊహించుకుని ఇక్కడకి వచ్చాడు. ఎలాగైనా తోషితో ఈ కాల్ సెంటరు ఉద్యోగం మాన్పించాలి అని కంకణం కట్టుకున్నాడు. నయానో-భయానో. బతిమలో-బెదిరించో… ఎదో ఒకలాగ. కానీ అదంతా తన భ్రమ. ఎలాగైనా తోషి తన కాళ్ళ మీద తాను నిలబడాలని పంతం పట్టి ఉన్నాడు. నాన్న డబ్బులు మీద బతకడం వాడికి అస్సలు ఇష్టం లేదు. ఆ మాట ఎత్తితేనే మెల్లగా జారుకుంటాడు. కాల్ సెంటరు ఉద్యోగం … భగవంతుడా! అదొక నరకం. కెరియర్ కి, ఆరోగ్యానికి మధ్య ఒక మౌన పోరాటం. శరీరం గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు? ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు వాడుకోవడమే. మనిషి రక్త-మాంసాలతో ఉన్న ఒక శరీరంలా కాకుండా ఏదో ప్రొడక్టుగా మారిపోయాడు. ఈ వినియోగదారుల సంస్కృతి నవ్వుతూ-తుళ్ళుతూ ఉండే కుర్రకారును ఒక ప్రొడక్టులా మార్చేస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీలు వీళ్ళ మెదడును వీలైనంత వరకు వాడేసుకుంటున్నాయి. తుషార్ కూడా అలాంటి ప్రవాహంలో ఒక నీటి చుక్క. కంప్యూటర్ రంగంలో రోజురోజు వచ్చే కొత్త కొత్త ఆవిష్కరణలు, మనిషి నైసర్గిక కార్యకలాపాలు ఇవన్నీ కలిసి మనిషి మేధస్సుని తన గుప్పిట్లో పెట్టేసుకుంటున్నాయి. మనిషి చేసే ప్రతి పనీ, రోబో చేసే రోజు ఎంతో దూరం లేదు అనిపిస్తోంది. అప్పుడు మనిషి ఏం చెయ్యాలో పాలుపోక ఖాళీ చేతులతో నిలబడిపోతాడు.

కొడుకు తనని తప్పించుకుని తిరుగుతున్నాడు అని భట్నాగర్ కి అర్థమయింది. వాళ్ళ మధ్య పొడిపొడి మాటలు తప్ప పెద్ద ఏం కబుర్లు ఉండవు. నిజం చెప్పాలంటే మౌనం అనే చిన్న గీత తనకి, తుషార్ కి మధ్య ఎప్పుడో వచ్చి చేరింది. తనకి తోషికి మధ్య ఒక మౌన సొరంగం …. ఆ సొరంగానికి రెండు వైపులా తలుపులు మూసి గొళ్ళాలు పెట్టేసి ఉన్నాయి. ఈ గొళ్ళాలు తెరుచుకునేది ఎప్పుడు? ఇవన్నీ ఆలోచించి తను మానసికంగా చాలా కృంగిపోతున్నాడు.

రోజంతా చండీగఢ్ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. కొంతమంది స్నేహితులని కలిసాడు. పాత జ్ఞాపకాలు హాయిగా అనిపించాయి. సెక్టర్ 17 కూడా తిరిగి వచ్చాడు. తోషికి ఏమైనా కొంటే బాగుంటుంది అనిపించింది. అసలు తోషి గది ఖాళీగా బోసిపోయి ఉంది. ఒక టి.వి., రేడియో, టేప్ రికార్డర్…ఏమీ లేవు. నాలుగైదు షాపులు తిరిగిన తర్వాత ఒక త్రీ-ఇన్-వన్ నచ్చింది. ఎఫ్.ఎమ్., టేప్ రికార్డర్ ఇంకా ఆడియో సి.డ్. ప్లేయర్. నిజానికి తోషికి సంగీతం-పాటలు అంటే చాలా ఇష్టం.

త్రీ-ఈన్-వన్ ప్లేయర్ చూసి తుషార్ ఎగిరి గంతు వేస్తాడు అనుకున్నాడు. తనని కౌగిలించుకుని ‘థాంక్యూ డాడీ’ అంటాడు అనుకున్నాడు. కానీ నీరసంగా నవ్విన తుషార్ నవ్వుతో మనసు చేదెక్కిపోయింది.

“త్రీ-ఇన్-వన్. నీకు సంగీతం అంటే ఇష్టం కదా!”

“అది సరే. బట్ ..”

“ఇష్టం లేకపోతే  సరే. ఇక్కడే ఉండనీ. మళ్ళీసారి వచ్చినప్పుడు తీసుకెళ్తాను.”

మొత్తానికి ఎలాగో కోపం ఆపుకున్నాడు. నిజానికి ఆ డబ్బా ఎత్తి బయట రోడ్డు మీద విసిరెయ్యాలి అనిపించింది. తండ్రి మనసు అర్థం చేసుకోలేని పనికిమాలిన వెధవ.

“అన్నం తింటారు కదా!” ఎంతో సహజంగా అడిగిన తోషి మాట కూడా ఎందుకో గుచ్చుకుంది.

“అక్కర్లేదు. బయట తినేస్తాను.”

“లేదు, లేదు. వండుతున్నాం. వెళ్ళి స్నానం చేసి రండి. అన్నం తిన్నాక స్కూటరు మీద బస్ స్టాండులో దింపి వస్తాను.”   

“అలాగే” వీపు గోడకి ఆన్చి నేల మీద కూర్చొన్నాడు. అసలు టైం త్వరగా గడిస్తే బాగుండును అనిపిస్తోంది.

“వంట ఏం చెయ్యమంటారు?”

“అందరికీ ఏది వండితే అదే.”

“రాత్రి మేం ఎప్పుడూ అన్నం-పప్పు వండుకుంటాం. మార్కెట్ నుండి పెరుగు తీసుకొస్తాను.”

“ఎలాగూ మార్కెట్ వెళ్తున్నావు కదా నీ వీలును బట్టి క్యాప్సికం తీసుకుని రా. ఆలూ-క్యాప్సికం చేసి, పప్పు వండు. అరే, మర్చిపోయాను. నీకోసం మామిడి పళ్ళు తీసుకున్నాను. ఫ్రిజ్ లో పెట్టాను. ఇదిగో డబ్బులు తీసుకుని నాకు ఒక బీర్ తీసుకురా.”

“సరే, సరే డబ్బులు ఎందుకు? నేను తీసుకొస్తాను.”

తొందరగా స్నానం చేసి తోషి కోసం ఎదురుచూస్తూ కూర్చొన్నాడు. టైం ముందుకు కదలడం లేదు. ఆ పాత పేపరు రెండుసార్లు అటూ-ఇటూ తిప్పాడు. పేపరు సంపాదకీయంలో కాల్ సెంటరు ఉద్యోగాల వల్ల కలిగే దుష్పరిణామాల మీద ఒక పెద్ద వ్యాసం అచ్చయింది. ఎవరో గొప్ప పేరున్న మానసిక శాస్త్రవేత్త రాసాడు. ఆ వ్యాసంలో కాల్ సెంటర్లలో పనిచేసే యువతీ-యువకుల ఆరోగ్యం మీద పడే చెడు ప్రభావాన్ని గురించి వివరించాడు.

తోషి గురించి తను బెంగపడటం సమంజసమే. లక్షలాది మంది యువతీ యువకులు ఈ మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగాల్లో, ఆ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. తన తోషి కూడా అటువంటి వ్యవస్థకి బలి అయిపోతున్న వాళ్ళలో ఒకడు.

ఆ వ్యాసంలో కాల్ సెంటర్లలో పనిచేసే యువతీ-యువకుల గురించి అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే నిర్వహించి ప్రచురించిన రిపోర్టు ఎంతో శ్రద్ధగా చదువుతున్నాడు.  చదువుతున్న కొద్దీ ఆయన దిగులు-బెంగ-ఒత్తిడి ఇంకా పెరిగిపోతున్నాయి. కాల్ సెంటర్లలో పనిచేసే యువతీ యువకుల ఆరోగ్యం దెబ్బతింటోంది. వాళ్ళల్లో తలనొప్పి, అజీర్తి, నిద్రలేమి సర్వసాధారణం. రక్తపోటు, ఒత్తిడి సహజం. ఈ ఉద్యోగ సంస్థలు అన్నీ రోగాలని మోసుకు వస్తాయి. అవుట్ సోర్సింగ్ చేసుకునే కంపెనీలు యువతీ యువకుల సహజమైన ఆనందాన్ని-సంతోషాన్ని వాళ్ళ నుండి లాగేసుకున్నాయి. వీళ్ళు కుటుంబ బంధాలు-అనుబంధాలకి దూరం అయిపోయారు.

ఆ విషయం మీద తను ఎక్కడైన ప్రసంగించాలి అన్నంత తన్మయత్వంతో ఎంతో ఏకాగ్రతతో చదువుతున్నాడు. రిపోర్టు ప్రకారం, కాల్ సెంటర్లలో పనిచేసే వాళ్ళల్లో 30 శాతం మందికి నడుం నొప్పి. 37.5 శాతం మహిళల్లో ఒత్తిడి. 45 శాతం మహిళలు అలసటకి గురి అవుతుంటే, 45 శాతం మహిళలు శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. నిద్రపోవడం, మేల్కోవడం లో ఒక పద్ధతి ఉండదు. కాల్ సెంటరు ఉద్యోగాలు ప్రకృటి విరుద్ధం అన్నది ఒప్పుకు తీరవలసిన నిజం. అంటే రాత్రి అంతా మెలకువగా ఉండి, పగలు నిద్రపోవడం. సర్వే ప్రకారం, రాత్రి అంతా మెలకువగా ఉండటం వల్ల పగలు శరీరంలో హార్మోన్లు, రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయి.  కానీ, రాత్రి పూట ఈ అవయువాలు సహజంగా పనిచెయ్యవు. ఎందుకంటే అవి విశ్రాంతి తీసుకునే స్థితిలోకి వెళ్ళిపోతాయి. హార్మోన్లు-రసాయనాల సంతులనం చెడిపోతుంది.

ఆయనకి ఆ సర్వే రిపోర్టులో తన కొడుకు ముఖమే కనిపిస్తోంది. తోషి ఎన్నో ఏళ్ళుగా ఈ కాల్ సెంటర్ల కి ఊడిగం చేస్తున్నాడు. చండీగఢ్, మొహాలీ, నోయిడా, ముంబై నుండి ఆఖరికి బెంగుళూరులో కూడా ఉద్యోగాలు వెలగబెట్టాడు. నెల, రెండు నెలలు, ఆరు నెలలు మహా అయితే ఏడాది. కొన్నాళ్ళకే శరీరం సహకరించడం మానేస్తుంది. అంతే. ఇంకేముంది… రిజైన్ చేసేస్తాడు. మళ్ళీ కొత్త ఉద్యోగం కోసం పగలు-రాత్రి ఇంటర్నెట్ కెఫేల చుట్టూ తిరగడం, ప్లేసుమెంటు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు.  చివరకి కొత్త అపాయింటుమెంటు ఆర్డరు. కొత్త చోట జాయిన్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడం, ఇల్లు-తిండి సమస్యలు …. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది.  

తోషి ఆ పాలరాతి నేలమీద గ్లాసు, బీరు బాటిల్ పెట్టి వెళ్ళాడు.

“చూడు తోషి, టైం కుదిరినప్పుడు ఈ రిపోర్టు చదువు. ఇట్స్ ఏన్ ఐ ఓపెనర్.”

“దేని గురించి?”

“చదువు. నీకే అర్థమవుతుంది.”

“తోషి రిపోర్ట్ హెడింగ్ చూసాడు.” ఇలాంటివి పేపర్లలో వస్తూనే ఉంటయి. నో బడీ టేక్స్ సచ్ రిపోర్ట్స సీరియస్లీ”

“హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ జాబ్?”

“జాబ్! హూ కేర్స్ ఫర్ హెల్త్?”

ఇక ఏమీ మాట్లాడలేదు. దీనికి ఏం సమాధానం ఎవరు మాత్రం చెప్పగలరు? ఏం చెప్పినా తుషి వినడానికి సిద్ధంగా లేడు.

బీరు ప్రభావం మెల్లమెల్లగా నరాల్లోకి పాకుతోంది. బాటిల్ కి ఉన్న లేబుల్ చదివాడు – సూపర్ స్ట్రాంగ్.

“అన్నం వడ్డించనా?”

“ఆఁ. పెట్టెయ్.”

అన్నం కోసం ఎదురు చూస్తున్నాడు. చేదుగా ఉన్నా బీరు మెల్లగా గొంతు దిగుతూ ఉంది. లోపల గదిలో నుండి వినిపిస్తున్న కుర్రాళ్ళ అరుపులు కాస్త కలవర పెట్టాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఇంతలో ఏమయినట్టు? కొంపదీసి తన వల్ల ఏం గొడవ పడట్లేదు కదా? తను ఇక్కడికి ఎందుకు వచ్చానా అనుకుంటున్నాడు. బయలుదేరే ముందే తోషి తనతో పరోక్షంగా – “డాడీ, ఇప్పుడు మీరు అంత దూరం నుండి రావడం ఎందుకు? అనవసరంగా అలసిపోతారు. రెండు గదుల్లో నలుగురు కుర్రాళ్ళం ఉంటాము. అందరం చిన్న-చిన్న ఉద్యోగాలతో తంటాలు పడుతున్న వాళ్ళమే. ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. కుర్చీ, బల్ల, బెడ్ ఏమీ లేవు. నేల మీదే పడుకుంటాం. కాదు-కూడదు వస్తాను అంటే ఏదైనా హోటల్ రూమ్ బుక్ చేస్తాను. నేల మీద మీకు అస్సలు నిద్ర పట్టదు. ఫ్యాను కూడా సరిగ్గా తిరగదు. వేడి, చెమట, విపరీతమైన ఉక్కపోత. మీకు మంచిగా పర్వతాల మధ్య చల్లటి కాలుష్యం లేని వాతావరణంలో ఉండటం అలవాటు. ఇక్కడ అస్సలు ఉండలేరు” అన్నాడు.

తోషి అన్నం కంచం పెట్టి వెళ్ళిపోయాడు. అన్నం-పప్పు. నాలుగు ఉల్లిపాయ ముక్కలు. తను క్యాప్సికం తెమ్మని చెప్పాడు. బహుశా దొరికి ఉండదు మార్కెట్ లో. రాత్రి అన్నం పప్పు వండుకుంటాం రోజూ అని వాడు ముందే చెప్పాడు.

“ఆ గొడవ ఏంటి?”

“ఏం లేదు మీరు తినండి.”

“ఏంటి? ఏదైనా సీక్రెట్?”

“అలాంటిది ఏం లేదు డాడీ.”

“కుళాయి కట్టేసాడు. మేము నీళ్ళు పట్టి పెట్టుకోము.”     

“అదేంటి? కుళాయిలో సుబ్బరంగా నీళ్ళు వస్తున్నాయి కదా! అరగంట క్రితమే నేను స్నానం చేసి వచ్చాను.”

“మీరు బకెట్ ఖాళీ చేసేసారు. నా రూమ్మేటు ఇంకా స్నానం చెయ్యలేదు. మీరు బకెట్టు పట్టి ఉంచితే వాడు స్నానం చేసేవాడు.”

బీరు ప్రభావం తలకి ఎక్కింది. మరీ ఎక్కువ కాకపోయినా కాస్త గట్టిగా అందుకున్నాడు – “వాట్ ఏ నాన్సెన్స్. నీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోతాయి అని నాకేం తెలుసు? నువ్వు ముందే చెప్పి ఉండాల్సింది. ఇట్స్ యువర్ ఫాల్ట్.”

తోషి కి కూడా చిర్రెత్తుకొచ్చింది. “మీరు ఇంకేం మాట్లాడకుండా అన్నం తినండి. మీ వల్ల ఇవాళ నా రూమ్మేటుతో మాట పడవలసి వచ్చింది. స్నానం చేసాక బకెట్టుతో నీళ్ళు పట్టి పెడితే మీ సొమ్ము ఏం పోయేదిట?”

“యూ షట్ అప్. ఇంక సహనం కోల్పోయాడు తను.”

“మీరు మాట్లాడకండి. డోంట్ ట్రై టు క్రియేట్ సీన్. ఈ కుర్రాళ్ళ ముందు మీరు నా పరువు తీసేస్తున్నారు. మీలాంటి ముసలి వాళ్ళ వల్లనే మాలాంటి యంగర్ జనరేషన్ నానా తిప్పలు పడుతోంది. అసలు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి?”

ఓహ్ గాడ్! ఫరగివ్ మీ! తింటున్న ప్లేటు పక్కకి నెట్టి లేచి నిలబడ్డాడు. ఇంకా ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకున్నది లేదు. శక్తి అంతా కూడదీసుకుని లేచి బూట్లు వెతుక్కున్నాడు. బూట్లు లేసు కట్టుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని గదిలో నుండి బయటకి వచ్చి గబగబా మెట్లు దిగిపోయాడు.  

రోడ్డు మీదకి వచ్చిన తర్వాత గుండెల నిండా కాస్త చల్లటి గాలి పీల్చుకున్నాడు. ఆ రాత్రి చీకట్లో …. మోటరు సైకిళ్ళు-కార్ల మిరుమిట్లు గొలిపే వెలుతురుల మధ్య బస్ స్టాండు వైపు కదిలాడు.


***

శ్రీ రాజేంద్ర రాజన్

ది. 15 ఆగష్టు, 1953 న హిమాచల్ ప్రదేశ్ లో ని హమీరపుర్ కి దగ్గర్లోని బల్హ్ గ్రామంలో జన్మించిన శ్రీ రాజేంద్ర రాజన్ ఎం.ఏ. (హిందీ), ఎం.ఎం.సి. (జర్నలిజం) పట్టాలతో పాటు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి అనువాదంలో డిప్లొమా మరియు ఎఫ్.టి.టి.ఐ., పూణె నుండి ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సులు చేసారు. శ్రీ రాజన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డెపార్టుమెంటులో సుదీర్ఘ సేవలు అందించి 2011లో జాయింట్ డైరెక్టరుగా పదవీ విరమణ చేసారు. శ్రీ రాజన్ ఇప్పటి వరకు 5 కథ సంకలనాలు, 6 నవలలు, కొన్ని చారిత్రక గ్రంథాలు ప్రచురించడంతో పాటు 6 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. వీరి సాహితీ సేవకు గాను 2007 లో హిమాచల్ ప్రదేశ్ పభుత్వం తరఫున ‘పండిత్ చంద్రధర్ శర్మ గులేరీ రాష్ట్ర సమ్మాన్’, 2023-24 కు గాను దివ్య హిమాచల్ మీడియా గ్రూపు నుండి ‘హిమాచల్ ఎక్సలెన్సీ అవార్డు’ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.

మొబైల్ : 8219158269; 9418020610

ఈ-మెయిల్ : rajanhmr@gmail.com

డా. వి.ఎల్. నరసింహం శివకోటి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి M.A (ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్ లేషన్) (గోల్డుమెడల్), M.Phil (హిందీ) (గోల్డుమెడల్), Ph.D (హిందీ) పట్టాలు పొందిన డా|| నరసింహం శివకోటి హిందీ - తెలుగు భాషలలో పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను 'ప్రభాత కిరణేఁ', 'అనావరణ్' శీర్షికన తెలుగు నుండి హిందీలోకి, అలాగే, ప్రముఖ హిందీ కవి నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను "అంతరిక్షం  నుండి.." శీర్షికతో హిందీ నుండి తెలుగులోకి అనువదించడంతోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలు తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ' భారత్ డైనమిక్స్ లిమిటెడ్'లో డిప్యూటీ మేనేజర్ (రాజభాష)గా సేవలు అందిస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *