స్నేహితురాళ్ళందరు ‘నడయాడే రెస్టారెంట్’ అని ముద్దుపేరుతో పిలుచుకునే సూసన్ ఇమ్మాన్యువేల్ తన టిఫిన్ క్యారియర్లో వరుసగా పేర్చిన లెక్కకుమించిన గిన్నెలన్నింటిని ఒక్కొక్కటిగా పైకి తీసి మేజాపై పేర్చింది. రమ్యా నాయర్ లంచ్ బాక్సులో దంపుడుబియ్యంతో ఓ మోస్తారుగా ఉడికిన అన్నం అడుగున చెయ్యిపెట్టి, దొండకాయ వేపుడిని, ఊర మిరపకాయల్ని వెలికి తీసింది. అప్పటికీ ఆమె దృష్టంతా సూసన్ రెస్టారెంటు మీదే ఉంది. ఈ రౌండ్ టేబుల్‌పై తరుచూ చోటు చేసుకునే వంటరుచుల కార్యక్రమంలో సూసన్ చేతి నైపుణ్యాన్ని కొట్టే దమ్ము, రమ్య అవియలు(కొబ్బరితో చేసే కలగలపు పెరుగుకూర), సంగీతా నంబూద్రి మామిడి పులిస్సేరి (మామిడి మజ్జిగపులుసు) ఈ రెండింటికి లేవు .
కోదమంగళంలోని తన పూర్వీకుల వంశపారంపర్యపు రుచికరమైన వంటకాలలో ఒకటైనటువంటి పోర్క్ వేపుడుతో సూసన్ ఈరోజు కోర్టుకి హాజరయ్యింది. ఆమె తన పసుపురంగు గుమ్మడికాయ ఆకారంలోని చిన్నసైజు కాసరోలును తెరవగానే కొట్టాయం వంట స్టైలులో సూసన్ అవ్వ వండిన ఫస్ట్‌క్లాసయ్యిన, వేయించిన పందిపిల్ల ఒక్కసారిగా కిచకిచమని అరవసాగింది. వెనుక కాళ్ళను ఒక్క ఉదుటన విదిలించుకుని అందులో నుండి పైకి దూకింది. అదే అదునుగా భావించిన రమ్యా నాయర్ ‘ఆగవే’ అని అరిచిగీపెట్టి దానిని పట్టుకుని, ఎముకలు లేని ఒక మెత్తని ముక్కను నోట్లో వేసుకుని ఆ రుచిని ఆస్వాదిస్తూ, కళ్ళింత పెద్దవి చేస్తూ చూసింది. ఆమె ఎరుపెక్కిన ముక్కంచున చెమట పట్టింది. నెమ్మదిగా ఆమె ముక్కు ఒక ఊర మిరపకాయలా మారడం చూసి, సూసన్ గొల్లున నవ్వింది. సరిగ్గా అప్పుడే సూసన్ సెల్‌ఫోన్ ఇన్‌బాక్స్‌లో సంగీతా నంబూద్రి మెసేజ్ రావడం గమనించింది.
“చూశావా?” అని సూసన్ తన సెల్‌ఫోన్‌ను రమ్యకి చూపించింది.
“Hearing is going on. don’t finish the pork,wait until I come back.”
“ఈ పోర్క్‌ని తలుచుకుంటూ ఒక పట్టాన కోర్టులో కూడా ఆమె కుదురుగా ఉండలేకపోతుంది. అటువంటి ఇదా నంబూద్రి ఇంటి ఆడపిల్ల” అంది సూసన్.
“నీకు తెలియదా? సంగీత తాతముత్తాతలు ప్రాచీన నంబూద్రిలలో ‘యోగక్షేమా’ అనే సామాజిక సంస్థకి చెందినవాళ్ళని?” అంది రమ్య.
“అయితే ఇప్పుడు దానికే ఏం చెయ్యమంటావ్? రమ్య ఏం మాట్లాడుతుందో సూసన్‌కి ఒక్కముక్క కూడా అర్ధంకాక అంది. ఆమె పంటి బిగువన దొండకాయ వేపుడితో తన స్నేహితురాలివైపు తదేకంగా చూసింది.
“మై గాడ్! పోయి పోయి నీతో ఇవన్నీ చెప్పాను చూడు, నన్ను అనాలి. బొత్తిగా చరిత్రజ్ఞానం లేని మనిషివి” అని
వెంటనే రమ్య నెత్తిని బాదుకుని “నంబూద్రిల వంశపరంపరలోనివారు, యోగక్షేమా సామాజిక సంస్థకి చెందినవాళ్ళు, పైగా సంఘసంస్కర్తలు కూడా. నంబూద్రిలంటే ఏదో మోళుక్షియం(పచ్చిపులుసు) వండుకుతింటూ, జంధ్యం తొడుక్కునే అల్లాటప్పా మనుష్యులు కాదని చెప్పదలిచాను, చాలా? నంబూద్రి వంశస్తుడైన సంఘ సంస్కర్త వి.టి. బట్టత్తిరిపాడు గురించి ఎపుడైనా విన్నావా? అని చెప్పసాగింది రమ్య.
“ఎస్” అని సూసన్ అవునన్నట్లు తలూపింది. గతంలో ఎక్కడో ఆయన గురించి చదివినట్టు గుర్తు అంది.
“అతను దేవాలయాలనే తగలబెట్టించమన్న మనిషి. అది జరిగి డెబ్బై ఏళ్ళకు పైబడింది. ఇంతకీ నీ పందిమాంసం వేపుడు సంగతేంటి?” అంది రమ్య.
సూసన్ ఇంకేం మాట్లాడకుండా చేతిలో ఉన్న కొబ్బరి తురుమును మొత్తంగా ఊడ్చి, రమ్య అన్నంలో వేసింది.
“ఈ కొబ్బరి తురుమును ఊరికే పైపైన జల్లుతారా, లేదా నూనెలో వేపుతారా?” అని రమ్య అడిగింది.
“అది…మా అవ్వ మూడ్‌ని బట్టి ఉంటుందిలే” అంది సూసన్.
“హియరింగ్ జరుగుతుంది అన్నావు కదా? ఇంతకీ మన సంగీత కేస్ ఎంతవరకు వచ్చిందంటావ్?” అని తింటూ అడిగింది రమ్య.
“కేస్ ఫైల్స్‌ను నేనొకసారి పైపైన చూశాను” అంటూ
సూసన్ ఊర మిరపకాయ కాడను తుంచి, మిరపకాయలోని విత్తనాలను కుదిపి నేలపై చల్లింది.
రమ్య మధ్యలో కలుగజేసుకుని “జాతి పేరును అడ్డంపెట్టి తిట్టడం, హత్యాయత్నం ఈ రెండింటికిగానూ చార్జ్ చేశారు. 1999 లో అమలులోకి వచ్చిన SC/ST PREVENTION OF ATROCITIES ACT కింద మన నంబూద్రి పిల్ల సంగీత దర్యాప్తు చేస్తున్నటువంటి క్లైంట్‌ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి పేరు సి.పి. గోపాల్ మేనన్” అని చెప్పింది.
“ఆ సరిసరే..ఏ మేనన్ అయితే మనకెందుకులే? మొత్తం మీద ఆ ఆసామికి పదేళ్ళపాటు జైలు శిక్ష పడటం ఖాయం కదా!” అంది సూసన్.
“ఇంతకీ అసలేం జరిగిందే? సంగీత తన కేసును, తనే ఇండిపెండెంట్‌గా వాదించబోతుందని తప్ప, అంతకు మించి ఒక్కముక్క తెలిస్తే ఒట్టు” అంది రమ్య.
“నువ్వు ఆ మేనన్‌ను గతంలో ఎపుడైనా కలిశావా?” అంది సూసన్.
“ఆయన తోపుకి తూర్పు వైపున, కాప్పకుట్టి అనే వ్యక్తి నివసించేవాడు, అతడే ఈ మేనన్‌పై కంప్లైంట్ చేశాడు” అంది రమ్య.
సూసన్ ఆ కేస్ ఫైల్స్‌లలో కంప్లైంట్ చేసిన వ్యక్తి వాంగ్మూలాన్ని ఒకసారి సరిగ్గా గుర్తు చేసుకునేందుకు ప్రయత్నించింది. “కాప్పకుట్టి పారే నీటిలో కొడిమె వేసి (చేపలు పట్టే వెదురు గంప) చేపలు పట్టే సామాజిక వర్గానికి చెందినవాడు. మేనన్ కొత్త ఇల్లు కట్టేందుకు సిమెంటు, రాళ్ళను లారీలో తరుచూ కాప్పకుట్టి దొడ్డి మార్గం గుండా తరలించేవాడు. కాస్త అటువైపు నుంచి వెళితే మెయిన్ రోడ్డు మీదుగా, మేనన్ తన తోపుమార్గం గుండానే లారీని తరలించవచ్చు. అయితే తను మాత్రం ఈ దారినే పట్టుపట్టుకు వెళ్ళాలనుకునేవాడు. లారీలు అదే పనిగా ఆ దారిలోనే పైకి, కిందకి వెళ్ళడం చూసి తట్టుకోలేక ఒకరోజు “మేనన్ ఆహ్… గాడిదగుడ్డా” అని, కాప్పకుట్టి అతడి దారిని అడ్డగించాడు… “అది సరే గాని ముందు నువ్వు ఆ క్యాబేజీ వేపుడిని కాస్త ఇటు తీసివ్వవే” అంది రమ్య.
“ఆ తర్వాత ఏమైంది?”
రమ్య లోలోపల బిగుసుకుపోయి,ఠారెత్తిపోయి వంట్లోనుండి సెగలు, పొగలు పెల్లుబికాయి.
“అవును ఎంతైనా కడజాతివాడు కదా, దానితో కాప్పకుట్టి చెప్పిన డైలాగ్ మేనన్‌కి ఏ మాత్రం రుచించలేదు. అతన్ని మెడ పట్టుకుని ‘ఏరా కొండజాతి నా కొడకా! ఎక్కువ మాట్లాడితే, చంపేస్తాను ఏమనుకుంటున్నావోయేమో’ అని గట్టిగా అరిచి, (‘పులయన్లు’ కేరళ, తమిళనాడు సరిహద్దులలోని కొండజాతి వాళ్ళు) పక్కనున్న ఒక ఇనుప చువ్వతో అతని నెత్తిమీద బలంగా కొట్టాడని అతనిపై కేసు నమోదయ్యింది.. ATTEMPT TO MURDER. ఆ తర్వాత ఏం జరిగిందని ఆ దేవుడికే ఎరుక” అంది సూసన్.
అయితే ఈ విషయాన్నీ పూర్తిగా జీర్ణించుకోలేక రమ్య జీలకర్ర నీళ్ళ గ్లాసును సూసన్ వైపు తిప్పింది. ఆమె ఊహించిన దాని ప్రకారం మేనన్ కాప్పకుట్టిని అసహ్యంగా తిట్టి, ఇంకేం చెయ్యలేక, లారీని వెనక్కి తిప్పి మెయిన్ రోడ్డు గుండా ఇంటివైపుకు బండిని పోనిచ్చుండాలి అంతే.
“అంతకుమించి మేనన్ క్రూరంగా నడుచుకునేందుకు మరే అవకాశం లేదు” అంది రమ్య.
“నువ్వు అలానే అంటావులే. ఎంతయినా మీ నాయర్‌లు, మేనన్‌లు మీరూ మీరూ ఒకటేగా” అని సూసన్ భళ్ళున గ్లాస్ కింద పెడుతూ చెప్పింది.
చటుక్కున బార్ అసోషియేషన్ హాల్ నుండి ఒక గబ్బిలం ఎగురుకుంటూ వచ్చి ఒక పోర్క్ ముక్కను నోటితో లాక్కొని వెళ్ళింది.
“హా.. సంగీ.. అని గబ్బిలం వైపు చూసి అరిచి, దాన్ని తరిమింది రమ్య. హియరింగ్ జరుగుతుండగా సూసన్ వండి తెచ్చిన ఫోర్క్ ముక్క వాసన కోర్టులోకి ప్రవేశించి సంగీత ముక్కు పుటలలో రుచిని తట్టి లేపింది. ఆమె దర్యాప్తు పూర్తవ్వగానే నేరస్తుల బోను నుండి చెమటలు కక్కుతూ గబగబా నడుచుకుంటూ వచ్చిన మేనన్‌తో, కనీసం రెండు మాటలైనా మాట్లాడేందుకు కూడా ఆగకుండా, బార్ అసోసియేషన్ హాల్ వైపు పరుగులు తీసింది. సంగీత ఆమె నల్లకోటును, టైను విప్పి పక్కన పడేసి, ఆవురావురుమని తన భోజనం క్యారేజీని విప్పింది. వడుమామిడి ఊరగాయ, పెరుగుపులుసును సూసన్‌కు అందించి, పందిమాంసం వేపుడిని లొట్టలు వేసుకుతింటూ, దాని రుచిని మరింత ఆస్వాదించసాగింది.
ఆ రోజు నుండి ఈరోజు వరకు ప్రతిసారి కోదమంగళంపు వంటకాలను వడ్డించేటప్పుడు రెండు మతాల మధ్యా చోటు చేసుకున్నటువంటి సాంఘిక అసమానతలను రూపుమాపడంలో పందిమాంసం ఎటువంటి పాత్ర వహిస్తుందోనని రివాజుగా చెప్పే అవే మాటలనే సంగీత ఈ రోజు కూడా చెప్పింది.
“సంగీ బీ సీరియస్” అని సూసన్ తన రెండేళ్ళ సీనీయారిటీ దర్పాన్ని ప్రదర్శించే రీతిలో కళ్ళద్దాలను ముక్కుపై నుండి పైకి జరిపి, ఆమె వైపుకు జరిగి కూర్చుంది.
“ఇది నువ్వు ఇండిపెండెంట్‌గా వాదించే మొట్ట మొదటి కేసు. మరింత అప్రమత్తంగా ఉండు. నేను FIR కాపీ చదివి చూశాను. ఇట్ ఇజ్ వెరీ స్ట్రాంగ్. సాక్ష్యులను లొంగదీసుకోవడానికి ఏ ప్రయత్నం చెయ్యలేదంటే మేనన్ పరిస్థితి ఇక అధోగతే”
అంతవరకు పందిమాంసంతో సల్లాపించిన సంగీతా, సూసన్ హెచ్చరికను వినగానే క్యారేజీ గిన్నె నుండి పైకి చూపుతిప్పి, మునివేళ్ళను క్యారియర్ అంచున ఉంచి, కాస్సేపు తినడమాపి, ప్రశాంతంగా కూర్చుంది. కాప్పకుట్టి కొడిమెలోకి, పొంచివున్న పెనుముప్పు గురించి ఎటువంటి అవగాహనా లేని, ఏమరపాటుగా ఉండే ఒక ఆప్రా కళాకారునిలా, ఈదుతూ వస్తున్న ‘చోరించిత్తు పాలాట్టు’ వంశానికి చెందిన ఓ ఉన్నత వర్గపు చేప సి.పి.గోపాల మేనన్. క్రిమినల్ ప్రొసేజర్ కోడ్ ఉచ్చు నుండి ఆ చేపను దారి మళ్ళించి, దాన్ని ప్రాణాలతో బయటపడేసేందుకు ఇప్పుడు ఏ మంత్రం జపించాలో ఏమో?
“నిన్ను కంగారు పెట్టడం కోసం నేనామాట అనడం లేదు” అని రమ్య, సంగీత వెన్నుతట్టి కేసు రిజల్ట్‌ని ముందుగానే గుర్తు చేసింది.
“అది నాకు తెలుసులే!” అంది సంగీతా, కరకరమనే నంబూద్రి గొంతును సవరించుకుని. తనకెదురుగా ఉన్నటువంటి గాజు గ్లాసును ఏది పట్టనట్టు చేతితో తిప్పుతుంది.
“సాక్ష్యులను లొంగదీసుకునేందుకు నేను మేనన్‌ను మూలకడవు వరకు పంపాను. అయితే దానివలన పెద్దగా ఒరిగిందేం లేదు. సాక్ష్యులందరూ కాప్పకుట్టితో పాటు నీటిలో కొడిమె వేసి చేపలు పట్టేవాళ్ళే. ఆఖరికి మేనన్ తన డబ్బు, సారాయి వంటి వాటిని ఎరవేసి, వాళ్ళందరిని లొంగదీసుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ తన పాచికలేవి పారలేదు. పైగా తమని జాతిపేరుతో తిట్టి, కించపరిచినవాడిని వాళ్ళందరూ జైలు ఊచలు లెక్కపెట్టించాలని ధృడంగా తీర్మానించుకున్నారు. మరోవైపు కాప్పకుట్టి ప్రతిరోజు కేసు పూర్వాపరాల తెలుసుకోవడం కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీసు వరకు వస్తూ, పోతూ ఉండేవాడు. ప్రాసిక్యూటర్ రుక్మిణి అతనికి దూరపు బంధువు. ఇంతకీ రుక్మిణి అంటే ఎవరనుకుంటున్నావు? తెలుసుగా అప్పట్లో యూనివర్సిటీ చదివే రోజుల్లోనే అందరిని గజగజలాడించిన, నిప్పుకణిక లాంటి మనిషి.” అంది సంగీత.
“కొత్తగా ఏముంది? ఇది అందరికీ తెలిసిన విషయమేగా” అంది రమ్య.
“అదొక్కటే కాదు, వీటికి తోడు దళితిజం, ఫెమినిజం మట్టి,మశానం అని ఇంకా ఏవేవో ఉన్నాయి. ప్రభుత్వం చేతులు మారగానే, కొత్తగా అప్పాయింట్ కావడం వలన, ఆరంభంలో తెగువ, ఆవేశం కాస్త ఎక్కువగానే ఉండేవి. అది సరే కానీ, నువ్వు కాస్త ఆ వడుమామిడి ఊరగాయ ఇటివ్వు…హా..చాలు చాలు..…అధ్బుతంగా ఉంది” అంది సంగీత.
“ఇది యేడాదిగా నిల్వవున్న ఊరగాయా?” అని అడిగింది సుసాన్.
“అవును” అని సంగీత తలాడించింది.
“ఆ రుక్మిణికి కూడా మనలా, అగ్రకులస్తులంటే కాస్త చిరాకు” సూసన్ ఇంకో ముక్క చెవిన వేసింది.
రమ్య మధ్యలో కలగజేసుకుని “ఏంటి? ఏంటన్నావ్? అగ్రకులస్తులా? మేము నాయర్, నంబూద్రిలం, మా సంగతి సరే. మధ్యలో ఈ సిరియన్ క్రైస్తవులు ఎటు నుండి ఊడిపడ్డారు అగ్రకులస్తులగా” అంది.
“నువ్వు వెళ్ళవే చెప్పొచ్చావు కానీ పెద్ద.., ఆ స్థానిక చరిత్రలన్నింటి మీద మా కోదమంగళం అన్నాకుట్టి అవ్వకి కాస్త పరిచయముంది. ఇంతకీ మేము ఎవరనుకుంటున్నాం? ఆ రోజుల్లోనే అసలు సిసలైన నంబూద్రికులం నుంచి మతం మార్చుకున్న క్రైస్తవులం. ఏమనుకుంటున్నావో?”
“పర్వాలేదే! అయితే నిన్ను నువ్వు సంభాళించుకోవడం కోసం కాస్త చరిత్రజ్ఞానాన్ని కూడా బాగానే వంటబట్టించుకున్నావన్నమాట” అని రమ్య నవ్వుతూ చెప్పింది.
“ఆమె అనుకుంటే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుంది” అంది రమ్య.
“కానీ ఆమె అలా అనుకోదుగా, “ఎందుకంటే మనలాంటి అగ్రకులస్తుల తిత్తి తీసేందుకు దొరికిన ఒక్కగానొక్క సదవకాశాన్ని చేజేతులా వదులుకుంటుందా ఏంటి? అని సంగీత బాధపడింది.
రుక్మిణికి స్వతహాగానే జాతి విషయంలో ఒక విధమైనటువంటి ఆత్మన్యూన్యతభావం ఉందని సంగీతకి ముందే తెలుసు. గతేడాది, ఒక రోజు మిట్టమధ్యాహ్నంవేళ, ఇదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ చుట్టూ అందరూ మూగినపుడు కూరల్లో ఉన్నటువంటి జాతి తారతమ్యాలపై ఒక చర్చ చెలరేగింది. ఆరోజు సంగీత స్నేహితురాళ్ళతో పాటు, అడ్వకేట్ ఉన్నిరాజా కింద జూనియరుగా పని చేస్తున్నటువంటి, అగ్రకులస్తుడైన సతీష్ వర్మ కూడా వారి మధ్యే ఉన్నాడు. వారిలో సంగీతనే ముందుగా నోరు మెదిపింది. వంట చేసేటప్పుడు ఉప్పు, పసుపుపొడి వీటితోపాటు మరెన్నో మసాలా దినుసులను చేర్చినట్లు, వివిధరకాల కూరల్లో, వాటిని వండేటటువంటి వారి జాతి, మతాలను కూడా స్వతహాగా అందులో రంగరిస్తారు అంది. కనురెప్పలలో పేరుకుపోయిన కొవ్వుపరిమాణాన్ని బట్టి మంగోలియన్ల ముఖజాడలను గుర్తించినట్లు, ఒక కూరను పట్టి చూస్తే అది ఇట్టే ఏ వంశస్తులదో పట్టేయోచ్చని సంగీత ఉదాహరణలతో సహా బలంగా నొక్కి చెప్పింది.
నంబూద్రిలు – మామిడి పులిస్సేరి, ఓలన్ (బూడిదగుమ్మడి, బొబ్బర్లు, కొబ్బరిపాలతో చేసే ఆధరువు(సైడ్‍డిష్ ))
నాయర్లు – కూట్టు, కాయగూరల వేపుళ్ళు, అవియల్, మోళుక్షియం
ఈళవర్లు – ఉలవచారు, శనగల పులుసు.
క్రైస్తవులు – తారావు మప్పాస్ (కొబ్బరిపాలతో వండే బాతు ఇగురుకూర) , వేయించిన పంది మాంసం.
ముస్లిమ్స్ – బీఫ్ బిర్యాని, చికెన్ బిర్యాని వగైరా.
“ఒక్కొక్క కూర రంగూ, రుచిలో భాగమైనటువంటి అజినిమోటోలా, వంశపారంపర్యం ప్రభావం కూడా అందులో కలిసిపోయి ఉంటుంది” అని సతీష్ వర్మ, సంగీత మాటలకు మద్దతుగా నిలిచాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ మధ్య రుక్మిణి ప్రస్తావన కూడా వచ్చింది.
LLB, LLM ఇలా ఎన్నో గొప్ప చదువులు చదివి, డాక్టర్ రేటు సంపాదించినప్పటికీ, ఆమె టిఫిన్ బాక్స్ నుంచి వచ్చే మట్టగిడసల కంపు మాత్రం ఆమెను వదిలిపోదు. అది కూడా వంశపారంపర్యంగానే సంక్రమిస్తుందనేమాట సంగీత నోటి నుంచి అప్రయత్నంగా వచ్చింది.
ఒక ఏడాది తర్వాత అదే సతీష్‌ని, రుక్మిణి బుట్టలో పడేస్తుందని ఎవరు కలగన్నారు గనుక. అసలు సిసలైన త్రిప్పునితురై నంబూద్రి కుర్రాడిని, ఈ నల్లామె బహుశా తమ తొడిమి గంపతో చేపలా పట్టిందేమో.
ప్రేమ వలన మనసు కాస్త తేలికై, మాట్లాడేందుకు ఇంకే టాపిక్కు దొరకని సమయం చూసుకుని, గతంలో సంగీత తన ప్రేయసి రుక్మిణి గురించి చెప్పినటువంటి మట్టగిడసల వ్యవహారాన్ని నంబూద్రి కుర్రోడు ఇప్పుడు మెల్లగా బయటికి తీసి వదిలాడు. దానితో ఈ సంఘటన తర్వాత రుక్మిణి సంగీతని కన్నెత్తి కూడా చూడలేదు. ఎపుడైనా కోర్టు వరండాలో ఆకస్మికంగా సంగీతకు, రుక్మిణి ఎదురుపడితే తలదించుకుని, లేదా ఏవో కేసుఫైల్స్ పేజీలు తిరగేస్తూన్నట్టు, తన దృష్టి నుండి కనుమరగయ్యేంతవరకు ఆమెను కలవకుండా ముఖం చాటేసేది.
కలెక్టరేటులో అనేక డివిజన్లలో ఎంతోమంది షెడ్యుల్డ్ క్యాస్ట్ వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ, రుక్మిణి ఒక దళితురాలయ్యుండి, ఎందుకు ఒక బ్రాహ్మణుడినే వెతికి మరీ పట్టుకుంది. ఈ ప్రశ్నకు సతీష్ చటుక్కున ప్రేమకు జాతి లేదని సమాధానమిచ్చాడు. ఇది రెగ్యులరుగా కేవలం విమర్శలను ఎదుర్కోలేనివారు, కప్పిపుచ్చడానికి చెప్పే సమాధానం అని రమ్య ఎద్దేవా చేసింది. “అసలు కారాణాలు ఇవి కాదులే. ఆర్థికంగాను, చదువు రీత్యా నిలదొక్కుకుంటున్న సమయంలో, తక్కువ జాతివాళ్ళు, అగ్రకులస్తులతో కలిసి పోవాలని పరితపిస్తుంటారు” అంది సంగీత.
గతవారం సతీష్ వర్మను ఎదురుపడినప్పుడు అతని ప్రవర్తనలో కొన్ని అనూహ్యమైన మంచిమార్పులు చోటుచేసుకోవడాన్ని సంగీత గమనించింది. అతడు కోర్టు లైబ్రరీలో సంగీతతో కాసేపు మనసు విప్పి మాట్లాడాడు.
“రుక్మిణి విషయంలో నేనేమైనా తప్పు చేశానేమో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అనవసరంగా ఇరుక్కున్నానేమో అనిపిస్తుంది. ఈ విషయం నుంచి నేను ఎలాగోలా పక్కకు తప్పుకుని, మెల్లగా ఇందులో నుంచి బయటపడాలనుకుంటున్నాను. భవిష్యత్తులో జాతి పేరుతో తలెత్తే సమస్యలు, తుడిస్తే తుడిచిపెట్టుకు పోతాయా ఏంటి? పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి ఆ వివాహబంధమనేది మన సొంత జాతివాళ్ళతో అయితేనే మంచిది కదా? లేకుంటే ఇవన్నీ భవిష్యత్తులో పెద్ద సమస్యై నెత్తినెక్కి కూర్చుంటాయి. ‘వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలని’ పూర్వంరోజుల్లో పెద్దలు చెప్పిన మాటలను పెడచివిన పెట్టకుండా ముందుకు సాగడమే తెలివైనవాళ్ళు చేసే పని” అని సతీష్ వర్మ చెప్పసాగాడు.
“ఏమైందే నీకు, అన్నం ముందు పెట్టుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయావు” అని రమ్య సంగీత బుగ్గలను నిమురుతూ అడిగింది.
“ఇప్పుడు నా చేతిలో ఒక ట్రంప్ కార్డ్ ఉంది. ఆ రుక్మిణి కాళ్ళపై పడటానికంటే ముందు, దీన్ని అడ్డంపెట్టి ఒక ఆట ఆడుకోవచ్చు అనుకుంటున్నాను” అంది సంగీత.
“ఏంటే అది?” అని, సూసన్ తన చేతివేళ్ళను నాలికతో శుభ్రం చేసుకుని, టిఫిన్ క్యారియర్ని యధావిధిగా పేర్చి పైకి లేచింది.
“మీరు కావాలంటే చూడండి… ‘కొండజాతి నా కొడకా’ అంటే అది ఒక జాతిని ఎద్దేవా చేసే మాట కాదని కోర్టులో నిరూపించబోతున్నాను” సంగీత కళ్ళు ఆవేశంతో మిరుమిట్లు గొలిపాయి. “కొండజాతి నా కొడకా అంటే అసలు అర్థం తెలుసా?” అని అడిగింది.
సూసన్ గతంలో తనెప్పుడు అటువంటి మాటను వినలేదు. ఆమె రమ్యా నాయర్ వైపు చూసింది. ఆమెకు కూడా దాని అర్థం ఏంటో తెలియదు.
‘పులం’ అంటే భూమి, అంటే చేను అన్నమాట. సంగీత మరింత వివరంగా చెప్పసాగింది. చేలలలో పనిచేసేవారిని పులయన్లు అంటారు. కాప్పకుట్టిని, మేనన్ జాతి పేరు చెప్పి పిలవలేదు. చేలలో పనిచేసే వాడు గనుక కొడుకా అనే పిలిచాడు, అంటే దానర్ధం ‘భూమి పుత్రుడు’ సరేనా!” అంది సంగీత.
సూసన్ కాసేపు ఆలోచనలో పడింది. సంగీత తన అభూతకల్పనతో ఓ కట్టుకథ అల్లి, కోర్టువారిని నమ్మించేందుకు అందులో ఒక లాపాయింట్ కూడా చేర్చలేక పోయింది. ఊరికే నోటికి ఏదొస్తే అది మాట్లడేయోచ్చు. దాన్ని కోర్టువారు అంగీకరించాలన్న రూలేం లేదుగా.
“నువ్వు మరీ రిస్కు తీయొద్దు. కావాలంటే రుక్మిణితో మాట్లాడి రాజీ కుదుర్చుకోవడమే సరైన పద్ధతి. కాప్పకుట్టి ఎలాగు రుక్మిణి మాటయితే మీరి ఏది చెయ్యడు” అంది రమ్య.
“అదెలా సాధ్యం?” అని అడిగింది సంగీత.
“దానికి కూడా ఒక మార్గముందిలే” అంది రమ్య.
ఇంటికి వెళ్ళగానే బాగా పండిన బొప్పాయ పండుకు నిమ్మరసం దట్టించి, దాన్ని గ్రైండ్ చేసి బుగ్గలకు రాసుకుని, సరిగ్గా గాలిలో ముఖం ఆరబెట్టుకుందామని ఇలా కూర్చుందో లేదో, ఈలోపు సంగీత సెల్ మోగింది.. అవతలివైపు నుండి ఫోనులో రమ్య.
“ఏమైంది? రుక్మిణిని కలిశావా?” అని సంగీత అడిగింది.
“అవన్నీ తర్వాత చెతానులే కానీ, ఇప్పుడు ఫోన్ చేసింది మరో విషయం చెబుదామని. రేపు నువ్వు వచ్చేటప్పుడు మామిడిపండు పులిస్సేరి తీసుకురా. దానితో పాటు వడుమామిడి ఊరగాయ కూడా తీసుకురా. ఇదేదో ఆషామాషిగా చెప్పడం లేదు. ఇట్స్ మై ఆర్డర్; ఓకే గుడ్ నైట్” అంది రమ్య.
ఇంకేదైనా మాట్లాడుదాం అనుకునేలోపు రమ్యా నాయర్ చటుక్కున ఫోన్ పెట్టేసింది.
మరుసటిరోజు మధ్యాహ్నం, బార్ అసోసియేషన్ హాల్లో ఫస్ట్ క్లాసయిన, మేలురకం మామిడికాయలతో చేసినటువంటి పులిస్సేరిని, అవ్వను బ్రతిమాలి మూడేళ్ళుపాటు నిల్వవుంచిన వడుమామిడి ఊరగాయను వెంట తెచ్చి భోజనం టేబుల్ వద్దకు వచ్చి నిలబడింది. కాసేపటి తర్వాత ఒక పెద్ద కాసరోల్, పొడవాటి టిఫిన్ క్యారియరుతోను, నాన్ వెజిటేరియన్ వంటకాలతో ‘నడయాడే రెస్టారెంట్’ అయిన సూసన్ హాల్లోకి ప్రవేశించింది. కాసరోలును తెరవగానే క్రైస్తవుల వంశపారంపర్యపు వంటకం – ‘తారావు మప్పాస్’ కొబ్బరిపాల వాసన గుభాళింపు వేడివేడి పొగలు గుప్పున సంగీత ముఖాన్ని తాకాయి.
“ఈరోజు అతిథులిద్దరూ మన మధ్యనే ఉన్నారు” అంది సూసన్.
“ఇంతకీ వాళ్ళెవరెవరు” అని బాతుకూరపై కాసరోల్ మూతతో మూసి సంగీత సూసన్ వైపు తిరిగి చూసింది.
“ఆ దళిత మహిళ, నీ ప్రతివర్గం అయినటువంటి రుక్మిణి, ఆమె ప్రియుడు సతీష్ వర్మ. అన్నట్లు మీరిద్దరూ ఇక్కడే రాజీ కుదుర్చుకోబోతున్నారా? దానికేమైనా కాస్త పులుపు,కారం ఏమైనా దట్టించాలా. అందుకే అనేక జాతులవారి ఈ వివిధ వంటల డిష్షులన్నీ… నీ మామిడి పులిస్సేరి, నా తారావు మప్పాస్, వీటితో పాటు మరిన్ని డిష్‍లు కాసేపట్లో మీ ముందుకు రానున్నాయి. రుక్మిణి జాతికి చెందినటువంటి మట్టగిడసలు డిష్ మొదలుకుని ఈ టేబులుకి రానున్నాయి. ఆ సతీష్ వర్మ కాళ్ళావెళ్ళా పడి, మేము ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మా దారికి తెచ్చుకున్నాం” అంది సూసన్.
ఆ తర్వాత ఆమె గొంతును కాస్త చిన్నగా సవరించుకుని, సంగీత చెవుల కిందకు ఒక బాతులా సూసన్ తన మెడను వంచింది.
“సంగీ నీకో విషయం తెలుసా? అందరం పక్కపక్కన చేరేసరికే మనలో ఎవరెవరు ఎటువంటి వాళ్ళని తెలియవచ్చింది. రుక్మిణికి, మనతో మాట్లాడాలి, పరిచయం పెంచుకోవాలి అనే కోరిక ఉంది. నిజానికి కాప్పకుట్టి ఆమె రిలేటివ్ అని చెబుతుందే తప్ప లోలోపల ఆమెకు అటువంటి మనుష్యులంటే రోతే. దీనికి తోడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాక ఇటువంటి కేసులు గోల ఎలాగు తప్పదు కదా. అన్నట్టు ఇంకో విషయం చెప్పనా? యెహోవా మీద ప్రమాణం చెయ్యండి. ఈ విషయం బయటకు పోక్కకూడదు సుమా. ఈ రాజీ ఒప్పందం కుదరగానే సతీష్ వర్మ ఆమెను చేతులు దులుపుకుబోతున్నాడు. దొరగారు ఈ అడ్వకేట్ పనికి స్వస్తిచెప్పి కెనడాకి ప్రయణమవుతున్నాడట” అంది సూసన్.
సంగీత ఈ విషయాలేవి పట్టనట్టు సూసన్ వైపు చూసింది. ఆమె చేతిని సంగీత తల మీద పెట్టి సూసన్ ప్రమాణం చేసింది. ‘పరిశుద్ధ ఆంటోనీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నిజం’ అంది సూసన్.
అరగంటలో భార్ అసోసియేషన్ హాలు మేజా మీద వివిధవంటకాల ఐటమ్స్ వరుసగా వచ్చి చేరాయి. రమ్యా నాయర్ తన అవియలును మిగిలిన గిన్నెలలో వడ్డిస్తూ రాజీ గురించిన చర్చ మొదలు పెట్టింది. ఈ విషయాలన్నిటిని తన ప్రేమికుడు అంతక్రితమే నేరుగా తనతో చర్చించడంతో, మళ్ళీ రుక్మిణితో ప్రత్యేకించి ఆ వివరాలేవీ చర్చించవలసిన అవసరం లేకుండా పోయింది. మిత్రురాళ్ళ సలహా మేరకు సంగీత తన మామిడి పులిస్సేరిని రుక్మిణి భోజనం ప్లేటులోకి వడ్డించింది. బదులుకు ఆమె పచ్చిమిర్చి పేస్ట్‌లో తోక జాడిస్తున్న ఒక మట్టగిడసను తీసి ఈ నంబూద్రిపిల్ల సంగీతకి వడ్డిచ్చింది. వాళ్ళిద్దరి చేతులు జాతిభేదాలకు అతీతంగా ఏదో సమ్మోహనశక్తితో ఆకర్షించబడి రౌండ్ టేబులుపై ఒకదానితో ఒకటి జతకలిశాయి. అది పొగలుకక్కే ధృడమైన షేక్ హ్యాండ్.
‘చోరించిత్తు పాలాట్టు’ వంశస్తుడైన గోపాల్ మేనన్‌ను ఈ న్యాయస్థానం నిరాటంకంగా శిక్ష నుండి విడుదల చేసింది.
దీన్నందరూ చప్పట్లతో ఘనంగా ఆహ్వానించారు.
రమ్య, సూసన్ దగ్గరున్న తారావు మప్పాసును అందుకుని,తన కాయగూరల కూట్టుతో పాటు, అక్కడి వారికి కాస్తంత చరిత్ర జ్ఞానాన్ని కూడా వడ్డించింది.
1917 లో ఎర్నాకుళంలోని చుట్టుపక్కల్లో ‘సెరాయ్’ అనే ఊరిలో, ఇలాంటిదే ఒక సహపంక్తి భోజనం చోటుచేసుకుంది.
అందరూ రమ్యవైపు తిరిగి చూశారు.
“సంఘ సంస్కర్త అయినటువంటి కామ్రేడ్ అయ్యప్పన్ ఇంటి ప్రాంగణంలో” అని చెప్పి నవ్వ సాగింది. మళ్ళీ కొనసాగిస్తూ “అది మన రుక్మిణిలా ఇద్దరితో కాకుండా, వందారెండు వందల మందిదాకా వరుసగా కూర్చోబెట్టిన చరిత్రాత్మక విందుఘట్టం. అది పూర్తయిన, మరుక్షణమే ఆ అయ్యప్పన్‌ని తమ సొంత జాతి వాళ్ళే దూరంగా వెలేశారు. వాస్తవానికి ఈరోజు ఇక్కడ మన మధ్య ఆ అయ్యప్పన్ పాత్రను, మన సతీష్ వర్మ పోషించాడు.
నవ్వును అదుపు చేసుకుంటూ రమ్య, సూసన్ వైపు చూసి కనుసైగ చేసి “మొత్తమ్మీద దాంతో పోల్చుకుంటే ఇది ఒక ఆషామాషీ విందు కాదన్నమాట. ఇదొక సామాజిక విప్లవం కదూ వకీలమ్మా” అంది.
రమ్య ప్రశ్నను విని రుక్మిణి అందుకు సరేనన్నట్లు తలాడించింది. అందరూ గొల్లున నవ్వారు. మట్టగిడస తలను నమిలి ‘వెరీ టేస్టీ’ అని సంగీత తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
విందు పూర్తవ్వగానే సతీష్ వర్మ వడ్డించినటువంటి నేంధిరపళం (అరటి పండు) పాయాసం తీపిలో మైమరచి బయటకు నడిచి వస్తుంటే, రుక్మిణి పెదాలపై అంటిన తీపి మరకలను సూసన్ తన చేతిరుమాలుతో తుడిచింది. నంబూద్రి కుర్రాడు మునివేళ్ళను పట్టుకుని రుక్మిణి చిట్టచివరి వీడ్కోలు చెప్పి, ఆమె అటు బయలుదేరగానే, టాయిలెటులో సంగీత డోకుతున్న శబ్దం రమ్య చెవిన పడింది. ఆమె సూసన్ వైపు చూసింది. తక్షణం శబ్దం వినిపించిన దిశగా వెళ్ళింది.
మట్టగిడసలు వాష్‌బేసినులో ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నాయి.
రమ్య, మెల్లగా సంగీత వీపును నిమిరింది.
“మనసుకు నచ్చనిది తినడం వలనే ఇలా అయ్యింది. నువ్వు మూతి కడుక్కుని వెళ్ళి కాస్సేపు రెస్ట్ తీసుకో. నాకు మధ్యాహ్నం ఒక ఆర్గ్యుమెంట్ ఉంది” అంది రమ్య.
ఆమె అటు వెళ్ళగానే సంగీత అద్దంలో చూస్తూ, ముఖం తుడుచుకుంది. కుళాయిని తిప్పి వదిలి, నీళ్ళపై మెదులున్నటువంటి చనిపోయిన మట్టగిడసలను వాష్‌బేసిను నుండి పక్కకు తొలగించే ప్రయత్నం చేసింది.
*****