బిడ్డ తిరిగొచ్చింది

Spread the love

పట్టలేనంత కోపం తోనూ, అసహనం తోనూ ఉమాకాంత్ నుదుటి మీద ఉన్న బ్యాండేజ్ ను చింపేసాడు. నుదుటి మీద ఉన్న గాయం లో నుండి రక్తం స్రవించసాగింది. ఒక రోజు ముందు డాక్టర్ మిశ్రా ఉమాకాంత్ నుదుటి మీద అయిన  గాయానికి బ్యాండేజ్ వేసాడు తన హాస్పీటల్ లో. డాక్టర్ మిశ్రా బ్యాండేజ్ వేస్తున్నప్పుడు ఉమాకాంత్ చూపు ఎదురుగా గోడలకి తగిలించి వున్న హ్యూమన్ ఎనాటమీ క్యాలెండర్ వైపు తిరిగింది. దాని పక్కనే మానవ ఎముకల కూర్పు కి సంబంధించిన మరొక క్యాలెండర్ కూడా వుంది. ఉమాకాంత్ ఆ క్యాలెండర్ల వైపు చూడటాన్ని గమనించిన డాక్టర్ మిశ్రానవ్వుతూ

  “దేవుడి దయ వలన మీకు ఎక్కడా ఆయువు పట్టు లో దెబ్బ తగల్లేదు. ఇంకొంచెం కింద కానీ, పక్కకు కానీ ఈ దెబ్బ తగిలినట్లు అయితే చాలా ప్రమాదం ముంచుకొచ్చేది” అన్నాడు.మళ్ళీ ఒక్క క్షణం ఆగి

“అవునూ ఈ దెబ్బ ఎలా తగిలింది?” ఎవరైనా కొట్టారా? ఏదైనా ఒక వారం మాత్రం ఈ బ్యాండేజ్ ను కదపకండి” అన్నాడు

ఉమాకాంత్ అసహనం గా కదిలాడు. “ఈయన డాక్టరా?లేక పోలీసా?దెబ్బ ఎలా తగిలితే ఈయనకు ఎందుకు?” అనుకున్నాడు లోలోపల బయటకు కన్విన్స్ చేసే సమాధానం ఏదీ చెప్పలేక.

ఉమాకాంత్ కి నుదుటి మీద మాత్రమే దెబ్బ తగల్లేదు. అతడి హృదయానికే పెద్ద దెబ్బ తగిలింది. నుదుటికి తగిలిన దెబ్బ వలన రక్తం కాసేపు కారి ఆగిపోతుంది కానీ హృదయానికి తగిలిన దెబ్బ వలన మాత్రం రక్తం నిరంతరం కారుతూనే ఉంటుంది కన్నీళ్ల రూపం లో. సరిగ్గా ఇరవై అయిదేళ్ల క్రితం ఉమాకాంత్ తన హృదయానికి తానే గాయం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరి మీద మాత్రం నేరం నెట్టివేయగలడు?

సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం, మునిమాపు వేళ కరుణా నర్సింగ్ హోమ్ లో జరిగిన ఆ సంఘటన అప్రయత్నంగా గుర్తుకు వచ్చింది. అప్పుడు అక్కడ చాలా చీకటిగా వుంది. అయినా ఉమాకాంత్ కళ్ళు స్ఫష్టంగా చూడగలుగుతున్నాయి. నాలుగు చేతులు అందులో రెండు చేతులు ఒక పురుషుడివి రెండు చేతులు ఒక స్త్రీవి. ఒక పురుషుడు  తన రెండు చేతులతో తీసుకునివచ్చిన గులాబీ రంగు ఎన్వలప్ కవరు ను స్త్రీ కి అందించాడు. ఆమె చాలా నిర్భయంగా, కాన్ఫిడెంట్ గా ఒక నిశ్వాస వదిలి

“ఇది పండుగ చేసుకోవలసిన సమయం అన్నది.”

ఉమాకాంత్ తన అరచేతుల వంక చూసుకున్నాడు. వాటి మీద ఏమైనా రక్తం మరకలు ఉన్నాయా? అని.  ఈ   నెత్తుటి మరక ఇరవై ఏళ్ళ క్రితం అరచేతులు అంటిన నెత్తుటిదేనా? అలా ఎలా అవుతుంది. ఈ ఇరవై ఏళ్ళ లోనూ తాను  ఎన్ని సార్లు అత్యంత ఖరీదైన సబ్బులతో చేతులను శుభ్రం చేసుకోలేదు. మరి ఈ నెత్తుటి మరకలు ఎలా వచ్చాయి? ఉమాకాంత్ కి కచ్చితంగా తెలుసు  తానెవరినీ “హత్య చేయలేదని.” మరి ఈ చేతులు నెత్తురు తో తడిశాయి?

ఆలోచనల తో అతడి తల  పగిలి పోతున్నది.

“అవును నువ్వు హంతకుడివే! నువ్వు ఒకరి నమ్మకాన్ని హత్య చేసావు.” ఒక చిన్న కేక అతడి హృదయం లోనుండి బయటకు వచ్చింది ఆశ్యర్యంగా, అనూహ్యంగా!

ఆ బలహీనమైన చీకటిలో ఉమాకాంత్ మరొకసారి తన చేతులవంక చూసుకున్నాడు. ఆ నెత్తుటి మరక  చాలా తాజాగా కనిపించింది. రక్త మాంసాలతో నిండి ఉన్న ఏ కీటకాన్నో, జంతువునో నువ్వు చంపితే కొద్దిసేపటి లోనే నెత్తుటి మరకలు మాయమైపోతాయి, కానీ ఒకళ్ళ నమ్మకాన్ని హత్య చేస్తే ఆ మరక జీవితాంతం అలాగే నిలిచి ఉంటుంది.

తీవ్రమైన పశ్చాత్తాపం తో అతడి కళ్ళు వర్షిస్తున్నాయి. కళ్ళు తుడుచుకుని చుట్టుపక్కల చూసాడు. తననెవరినాత్ చూస్తున్నారేమో అని. అర్ధరాత్రి దాటింది. ఈపాటికి అపర్ణ, తన  భార్య, తను  ఇంటికి ఇంకా రాలేదని తెలిసిన వాళ్ళు అందరికీ ఫోన్లు చేస్తూ ఉండొచ్చు. తను  కావాలనే తన మొబైల్ ముందు గదిలో ఉన్న  టేబుల్ మీద వదిలేసి వచ్చాడు. ఇప్పుడిక అతడికి మొబైల్ తో పని లేదు. అతడు దుఃఖం తో, ఒక రకమైన మొండితనం తో ఒక నిర్ణయం తీసుకుని వచ్చేసాడు.

అతడి ఆలోచనలు ఇరవై ఏళ్ళ క్రితం ఒకానొక సాయంత్రం పూట జరిగిన ఆ సంఘటన వైపు మళ్ళాయి. నిజానికి అతడెప్పుడూ ఆ సాయంత్రం ఏమి జరిగిందో ఎప్పుడూ మరచి పోలేదు. కాలం ఆ గాయాన్ని, మచ్చను చెరిపేస్తుందని అతడు అనుకున్నాడు. అలా ఆశించడం సహజం కూడా. ఆ సాయంత్రం ఏమి జరిగిందో అతడి భార్య అపర్ణకు కానీ, యోగ మాయ కు కానీ లేశ మాత్రమైనా తెలియదు.

యోగమాయ

ఆ పేరు అతడికి వెంటనే కల్మషం లేని, కపటం లేని ఒక చిన్న పాప కళ్ళను గుర్తుకు తెచ్చింది. సిస్టర్ అప్పుడే పుట్టిన ఆ చిన్న పాప చేతికి వేసిన ఐడెంటిటీ ట్యాగ్ తీసివేసి అప్పుడే పుట్టిన మరొక చిన్న పాపడికి వేస్తున్నప్పుడు ఆ చిన్న పాప చిట్టి వేళ్ళతో సిస్టర్ చేతిని  అలా చేయవద్దు అన్నట్టు  గట్టిగా పట్టుకున్నదని సిస్టర్ చెప్పిన విషయం గుర్తుకొచ్చి అతడి కన్నీరు మున్నీరు  అయ్యాడు.

“నిజమైన నేరస్తుడిని నేను.  దుర్గా మాతను వదిలేసుకొని మహిషాసురుడిని ఇంటికి తీసుకుని వచ్చాను. నేను చేసిన పాపానికి ఈ మాత్రం శిక్ష నాకు పడవలసిందే.!”

ఒక గూడ్స్ ట్రైన్ పట్టాలను దడ దడ  లాడిస్తూ వెళ్ళిపోయింది.

ఎక్కడ తప్పు జరిగింది. ఉమాకాంత్ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం లో విఫలం అయ్యాడు.

 అతడు కానీ అతడి భార్య అపర్ణ కానీ తల్లి తండ్రులు గా తమ కర్తవ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కన్న కొడుకును ఆదర్శవంతం గా పెంచడానికి తాము చేయవలసింది అంతా చేసారు. మంచి పాఠశాలలు, కళాశాలలు లో చదివించారు. ఆ ప్రయత్నాలు అన్నీ విఫలం అయినట్టు ఇప్పుడు అనిపిస్తున్నది.

రైల్వే ప్లాట్ ఫారం మీద చీకటిగా వున్న ఒక మూలన ఉమాకాంత్ కూర్చుని వున్నాడు. అతడి తలంతా బరువుగా వుంది. అంతకు ముందు రోజు దేవదత్త అతడి నుదుటి మీద క్రికెట్ బాట్ తో కొట్టాడు. అపర్ణ పెద్దగా కేక పెట్టడం తో  క్రికెట్ బాట్ ను పట్టుకున్న దేవదత్త గ్రిప్ జారడం ఊహించని వేగం తో ఊహించనంత బలంగా క్రికెట్ బాట్ ఉమాకాంత్ నుదుటిని తాకడం క్షణం లో వెయ్యోవంతు లో జరిగి పోయాయి. ఉమాకాంత్ భయం తోనే ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకున్నాడు.

“ఆ అమ్మాయి చెప్పింది అంతా నిజమేనా? ఈ స్థాయికి ఎలా దిగజారావు నువ్వు?”

ఉమాకాంత్ అడిగింది ఇంతే. అలా అడగటానికి తండ్రిగా తనకు హక్కు వున్నది అనుకున్నాడు. కానీ జవాబు మాత్రం దిమ్మతిరిగేలా ఉంది.

ఇరవై ఐదేళ్ల అతడి కొడుకు దేవదత్త మంచం కింద వున్న క్రికెట్ బాట్ తీసి కొట్టేశాడు.

“దీనెమ్మ జీవితం!” అనుకున్నాడు ఉమాకాంత్ చేదుగా.

జ్ఞాపకం అతడిని ఒక్కొక్క ముక్కా కొరుక్కు తిన్నట్టు కొరుక్కు తింటోంది. అతడు మళ్ళా ఆ సాయంత్రం కరుణా నర్సింగ్ హోమ్ కి వచ్చాడు. ఆ సాయంత్రం అతడి భార్య అపర్ణా, కైలాష్ మొహంతీ భార్య ఐదు నిమిషాల తేడాతో మాతృ మూర్తులు అయ్యారు. అపర్ణ ఆడ శిశువు కి జన్మ నిస్తే, కైలాష్ మొహంతీ భార్య మగ బిడ్డకి శ్వాస నిచ్చింది. భార్య ప్రసవం అప్పుడు కైలాష్ మొహంతీ హాస్పటల్ కి రాలేదు. మగ  బిడ్డకి జన్మ నిచ్చిన ఆమె అపస్మారకం నుండి ఇంకా కోలుకోలేదు. ఆ సమయాన్ని ఉమాకాంత్ ఉపయోగించుకున్నాడు.ఎంతో కాలంగా వున్న తన కోరికను నెరవేర్చుకోవడానికి. ప్రసూతి వార్డ్ కి ఇన్ ఛార్జ్ గా ఉన్న  సిస్టర్ ని డబ్బిచ్చి లోబరచుకున్నాడు పిల్లలను మార్పిడి చేయడానికి.

మంచి తెలివిగల ఆ సిస్టర్ ఉమాకాంత్ చెప్పిన రీజన్ కి ఒప్పుకుంది. “పిల్లాడు ముద్దుగా కార్తికేయడు లాగా వున్నాడు. మగ  పిల్లాడు  ఎంతైనా మగపిల్లాడే! ఆడ పిల్లాడి ఏముంది? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆడ పిల్ల ఎప్పటికీ మీ పిల్ల కాదు” అని ఉమాకాంత్ రీజనింగ్ కి తనవైన  కారణాలు కూడా జత చేసింది. ఒక్క క్షణం పాటు తాను  తప్పు చేస్తున్నాడేమో అని ఉమాకాంత్ అంతరాత్మ హెచ్చరించింది.

“అపర్ణ కి ఇక పిల్లలు పుట్టరు. పుడితే ఆమె కే  ప్రమాదం అని డాక్టర్లు చెప్పేసారు. మగ  బిడ్డంటూ లేకపోతే ఈ ఆస్థి, అంతస్థు అంతా ఏమైపోవాలి? ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం తన తరువాత ధూళి లో కలసి పోవలసిందేనా? కొడుకంటూ లేకపోతే తన వంశాభివృద్ధి ఎలా?” ఇలా తర్కించుకుని అంతరాత్మ గొంతు నొక్కేసాడు.

అతడి ఆలోచనలు చదివినట్టు ఆ సిస్టర్ “భయపడకండి సార్!. అంతా నేను చూసుకుంటాను. మీరు మాత్రం నన్ను చూసుకోవాలి”

అన్నది. ఉమాకాంత్ యంత్రం లా కదిలి ఒక భారీ కవరు తీసుకుని వచ్చి సిస్టర్ కి ఇచ్చాడు. క్షణం లో ఆ ప్రసూతి వార్డ్  తో సహా కరుణా నర్సింగ్  హోమ్ అంతా పాకిపోయింది ” ఉమాకాంత్ భార్య ఒక మగ  బిడ్డకి, కైలాష్ మొహంతీ భార్య ఒక ఆడపిల్ల కీ జన్మ నిచ్చారనీ, పిల్లలు తల్లులు క్షేమంగా వున్నారని.”

ఎనిమిదో రోజు ఉమాకాంత్  హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని భార్యను, కొడుకును తీసుకుని కారెక్కుతూ, కైలాష్ మొహంతీ

భార్య తో, ఆడ పిల్లతో నడిచి వెళ్లడాన్ని చూసాడు. కైలాష్ మొహంతీ మొహం ఎంతో సంతోషం తో వెలిగిపోతున్నది. ఒక చిన్న, లేశ మాత్రపు సందేహం కూడా కైలాష్ మొహంతీ కళ్ళలో కనిపించకపోవడం తో అతడు కుదుట పడ్డాడు.

పాతికేళ్ల క్రితం ఆ కరుణా నర్సింగ్ హోమ్ లో మునిమాపు వేళ  జరిగిన ఆ సంఘటన ను కేవలం నాలుగు జతల కళ్ళు మాత్రమే చూశాయి. అందులో రెండు జతలు ఆ చిన్న పాప, చిన్న బాబువి. ఆ కళ్ళు ఏమి జరిగిందో ఎవరికీ చెప్పలేవు. మూడో జత కళ్ళు సిస్టర్ రాధారాణివి. ఐదేళ్ల తరువాత రాధారాణి ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. ఇక నాలుగో జత ఉమాకాంత్ వే  స్వయంగా

ఆ రోజు హృదయం పట్టనంత ఆనందం లో భార్యా, కొడుకు తో ఇంటికి కారులో వస్తున్న ఉమాకాంత్ ఆ ఇద్దరు పిల్లల భవితవ్యాన్ని తన మనోనేత్రం తో దర్శించాడు.

కైలాష్ మొహంతీ తన కూతురు ను గవర్నమెంట్ స్కూల్ లో చేరుస్తాడు. పదవ  తరగతి పాసవడానికే ఆ అమ్మాయి కష్టపడుతుంది. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు పాసవుతుంది. ఆ తరువాత ఏదో  కాలేజీ లో చేరి డిగ్రీ మమ అనిపిస్తుంది.  బ్లాక్ ఆఫిస్ లో సీనియర్ క్లర్క్  గా పనిచేసే కైలాష్ మొహంతీ ఏ జూనియర్ క్లర్క్  నో చూసి ఆమె పెళ్లి జరిపిస్తాడు. అంతటి తో ఆ అమ్మాయి జీవితానికి ఎండ్ కార్డు పడుతుంది. కానీ తన కొడుకు విజయాల నిచ్చెన ఒక్కొక్కటి ఎక్కుతూ వెళ్తాడు. ఒక్కొక్క గోల్ కొట్టుకుంటూ లక్ష్యం చేరుకుంటాడు. అమెరికా లో కెల్లా అత్యంత ఖరీదైన బిజినెస్ స్కూల్ కి తన కొడుకు వెళతాడు. తన బిజినెస్ ఎంపైర్ ను విస్తరిస్తూ వెళతాడు. ఇండియా లో ఉన్న  రాజకీయ నాయకుడి ఏకైక కూతురు ను తన కోడలుగా చేసుకుంటాడు. రాజకీయాలకే, వ్యాపార వర్గాలకు మధ్య బంధం బలపడితే ఇక తిరుగు ఏముంటుంది?

తన ఊహలకు అనుగుణంగానే దిబ్యసింఘా మత్తగజరాయ్ అధికార పక్ష మెంబెర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూతురు తో వివాహానికి నిశ్చయం చేసాడు. కాబోయే కోడలు కూడా ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ నుండి M.B.A చేసింది. ఈ వివాహ విషయమై ఎప్పటికప్పుడు కొడుకు తో సంప్రదిస్తూనే వున్నాడు ఉమాకాంత్. పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కొడుకు వాళ్ళు, పెళ్లి కొడుకు ఇంటికి పెళ్లి కూతరు వాళ్ళు వచ్చి చూసుకున్నారు. నిశ్చితార్ధం కూడా జరిపేసుకున్నారు.

ఉమాకాంత్ తన కొడుకు దేవదత్త అంత నీచమైన పని చేస్తాడని కలలో  కూడా ఊహించలేదు. నిజానికి వాళ్ళిద్దరి మధ్యా మాటలు అతి తక్కువ. చిన్నతనం లో తనకెప్పుడైనా డబ్బు అవసరం పడితే తండ్రి తో మాట్లాడే వాడు దేవదత్త. ఉమాకాంత్ తన క్రెడిట్ కార్డు దేవదత్త కి ఇచ్చాక ఆ కాస్త మాటలు కూడా బంద్  అయిపోయాయి. ఇక అభిప్రాయాలు కలబోసుకోవడం ఎక్కడ? తల్లి తండ్రులతో మాట్లాడటం అంటే టైం వేస్ట్ ప్రోగ్రాం అనుకునేవాడు దేవదత్త

ఉమాకాంత్, కైలాష్ మొహంతీ ని ట్రాక్ చేయడం మానలేదు. అతడికి సంబంధించిన ప్రతి చిన్న వార్తని కలెక్ట్ చేసేవాడు. కైలాష్ మొహంతీ కి బిడ్డ పుట్టిన వెంటనే బారిపద బదిలీ అయినా తరువాత ఊపిరి పీల్చుకున్నాడు. తల మీద నుండి పెద్ద భారం తీరిపోయినట్టు అనుభూతించాడు. కానీ అతడికి ఆశర్యం కలిగే రీతిలో కైలాష్ మొహంతీ పద్నాలుగేళ్ల తరువాత మళ్ళీ కటక్ వచ్చాడు, రాముడు పధ్నాలుగేళ్ళు వనవాసాన్ని ముగించుకుని అయోధ్య కి తిరిగి వచ్చినట్టు.

ఉమాకాంత్ కి ఊహించని షాక్ ఏప్రియల్ 2020 లో తగిలింది. ఒక సాయంత్రం పూట  టి .వి లో వార్తలు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా టి వి తెర  మీద కైలాష్ మొహంతీ మొహం ఫ్లాష్ లా మెరిసింది. వెంటనే అతడి కుమార్తె యోగమాయ ఒడిషా మెట్రిక్యులేషన్ పరీక్ష లో నెంబర్ వన్ గా టాప్ పొజిషన్ లో నిలిచింది అనే వార్త ను న్యూస్ రీడర్ చదివాడు. ఇన్ సెట్ లో యోగమాయ తండ్రికి స్వీట్ తినిపిస్తుండ గా యోగ మాయ తల్లి కళ్ళ లో ఆనందాశ్రువులతో చూస్తున్న దృశ్యం రెండు నిముషాల పాటు టెలీ కాస్ట్ అయింది. అతడి వెనకే నిలబడి వార్తలు వింటున్న అపర్ణ ” ఆ అమ్మాయి కి టాలెంట్ తో పాటు అందం కూడా వుంది” అని వ్యాఖ్యానించింది. ఉమాకాంత్ గదిలో నుండి తటాలున లేచి వెళ్ళిపోయాడు ఎవరో బెత్తం తో తరుముతున్నట్టు

ఆ రోజు నుండి యోగ మాయ మొహం ఒక స్టిల్ ఫొటోగ్రాఫ్ లా ఉమాకాంత్ ను వెంటాడటం మొదలు పెట్టింది. యోగమాయ ప్రతి సందర్భం లోనూ తనను విజేత గా నిలుపుకుంటూ వస్తున్నది. ఆ వివరాలు అన్నీ టి వి ల ద్వారా, దినపత్రికల ద్వారా ఉమాకాంత్ కి తెలుస్తూనే వున్నాయి. ఇంటర్ మీడియట్ లో కూడా సైన్స్ గ్రూప్ లో ఆమె టాపర్. A I I M S నిర్వహించిన ఎంట్రన్స్ లో టాపర్.కామన్  వెల్త్ దేశాలలో ప్రతిభావంతులైన డాక్టర్లకి ఆరు నెలల పాటు  ఇచ్చే ట్రైనింగ్ కి యోగ మాయ ఎన్నికైంది. ఒక పెద్ద దినపత్రిక యోగ మాయ సక్సెస్ స్టోరీ ని తన టాబ్లాయిడ్ లో ప్రచురించింది. ఆ పేపర్ కట్ చేసి భద్రంగా తన పర్స్ లో పెట్టుకున్నాడు

ఇప్పుడు ప్లాట్ ఫారం మీది మసక వెలుతురు లో పర్స్ లో నుండి ఆ పేపర్ కటింగ్ తీసి యోగమాయ ఫోటో వంక మెల్లగా చూసాడు. ఫోటో లో నుండి యోగమాయ అతడి వంక చూసి నవ్వింది. అసలైన విషాదం ఏమిటంటే యోగమాయ విజయ వార్త ను దినపత్రిక మోసుకుని వచ్చిన రోజే, దేవదత్త ఉమాకాంత్ ని నుదుటి మీద క్రికెట్ బాట్ తో కొట్టడం. ఆ మసక వెలుతురు లోనే  యోగమాయ కళ్ళ వంక చూసాడు ఉమాకాంత్. మనిషి పుట్టినప్పుడు కళ్ళు ఎలా వుంటాయో, పెరిగి పెద్దయినా కళ్ళు అలాగే ఉంటాయట. వయసు తో పాటు మిగతా అవయవాలు పెరిగినట్టు మనిషి కళ్ళు మాత్రం పెరగవని డాక్టర్లు అంటారు. ఆ స్వచ్ఛమైన కళ్ళను పాతికేళ్ల క్రితం, కైలాష్ మొహంతి భార్య ఆటో రిక్షా ఎక్కుతూ ఉండగా, కైలాష్ మొహంతీ తన చేతుల మీద ఊయల లూపుతున్నపుడు చూసిన స్వచ్ఛమైన కళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఫోటో లో

ప్లాట్ ఫారం మీద లైట్ స్థంభం కింద నిస్సత్తువగా కూలబడ్డాడు ఉమాకాంత్. కన్నీళ్ళై ప్రవహిస్తున్నాడు. ఆ క్షణం లో తన సంపద, తన సోషల్ స్టేటస్, తన వ్యాపార సామ్రాజ్యం అంతా శూన్యమై చిక్కటి చీకటి మాత్రమే మిగిలినట్టు అనిపించింది. రేపటి నుండి తాను కొంచెం కొంచెం గా మరణిస్తాడు. అలా మరణిస్తాడన్న వాస్తవం అతడి మగ అహంకారానికి (Male Vanity) ఒక అశనిపాతం లా తగిలింది. కొడుకు చేతిలో దెబ్బలు తిన్న వాస్తవాన్ని అతడు ఎలా జీర్ణించుకోగలడు? దిబ్యసింఘా మత్తగజరాయ్ కూతురు తో వివాహం తప్పిపోతే తన పరువు ఎంత అధః పాతాళానికి కుంగిపోతుంది? యోగమాయ పెట్టిన శాపం తనను దురదృష్టం రూపం లో జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. దాని బదులు రైలు కింద తలపెట్టడం నయం కదూ

పట్టాలను దడ దడ లాడించుకుంటూ మరొక రైలు వెళ్ళిపోయింది. ఉమాకాంత్ మెల్లగా లేచి మహానది వైపు నడవసాగాడు. నిన్న జరిగిన ఆ చేదు జ్ఞాపకం అతడి కళ్ళ ముందు కదలాడింది. దేవదత్త వివాహానికి సంబంధించిన చివరి నిర్ణయం మొన్న జరిగింది. నిన్న సోమవారం నాడు ఉమాకాంత్ కార్ల షో రూమ్ కి ఒక అమ్మాయి వచ్చింది. అప్పుడు పది అవుంతుందేమో. ఆ అమ్మాయి సరాసరి ఉమాకాంత్ ఛాంబర్ లకి వచ్చింది. బహుశా ఎవరో కస్టమర్ మరింత డిస్కౌంట్ అడగడానికి వచ్చిందేమో అనుకుని కూర్చోమని సీట్ చూపించాడు. కానీ ఆ అమ్మాయి కూర్చోకుండా అతడి దగ్గరకు వచ్చి అతడి పాదాలకు నమస్కరించింది. బహుశా ఆ అమ్మాయి ఎవరైనా తన పాత స్నేహితుల కూతురు అయి ఉంటుందా అని ఆలోచిస్తూనే,

“మీరెవరో గుర్తు పట్టలేకున్నను. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్” అన్నాడు ఉమాకాంత్

ఆ అమ్మాయి జవాబు చెప్పడానికి బదులుగా

“మీరు దేవదత్త పెళ్లి  దిబ్యసింఘా మత్తగజరాయ్ కూతురు తో నిశ్చయించారా?” అని ప్రశ్నించింది

ఉమాకాంత్ కి చెప్పలేంత ఆశ్ఛర్యం కలిగింది. దేవదత్త పెళ్లి సంగతి కేవలం ముగ్గురు నలుగురు తప్పిస్తే ఎవరికీ తెలియదు. ఈ అమ్మాయికి ఎలా తెలిసింది. అసలీ అమ్మాయి ఎవరు?

“నిజమే. కానీ మీకెలా తెలిసింది మీరేమైనా దిబ్యసింఘా మత్తగజరాయ్ కూతురు స్నేహితురాలా?” అని అడిగాడు. ఆ అమ్మాయి   ఉమాకాంత్ వంక కోపంగా చూసింది. ఆ ఛాంబర్ లో ఉమాకాంత్ ఆ అమ్మాయి తప్ప మరెవరూ లేరు. ఆ ఛాంబర్ లో అమ్మాయి చెప్పిన విషయం  ఉమాకాంత్ ని తలకిందులు చేసింది

“నేను తనుశ్రీ. దేవదత్త నేను గత మూడేళ్ళుగా రిలేషన్ షిప్ లో ఉంటున్నాము. పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. ఇప్పుడు నేను రెండు నెలల గర్భవతిని . ఇదంతా చెప్పాలి అంటే నాకు ఎంబరాసింగ్ గా వుంది. కానీ దేవదత్త కావాలని నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు. నిన్ననే దేవదత్త ఫ్రెండ్స్ ద్వారా మీరు అతడి పెళ్లి మరొక అమ్మాయి తో నిశ్చయించారని తెలిసింది. మీరు నాకు న్యాయం చేస్తారనే ఆశ తో వచ్చాను ” అన్నది

శరీరం లోని రక్తమంతా పొంగుకొచ్చి ఉమాకాంత్ మొహం లోకి చేరింది. అతడికి తల  తిరగడం మొదలు అయింది. ఆ అమ్మాయి చెప్పేదంతా నమ్మశక్యం గా లేదు.వొట్టి అసహ్యం. అతడు పక్కనే ఉన్న  కూజా లో నుండి గ్లాస్ లోకి నీళ్లు ఒంపుకుని గటగటా తాగేశాడు.

తనుశ్రీ తన బ్యాగ్ లో నుండి కొన్ని ఫోటోలు తీసి ఉమాకాంత్ కి చూపించింది. వాటిలో దేవదత్తా, తనుశ్రీ చాలా ఇంటిమేట్ గా వున్నారు.

“బహుశా మీరు మా నాన్న గురించి వినేవుంటారు.  ఐ జి ఆఫ్ పోలీస్ R K  సింగ్  మా నాన్నగారు. తనకు నేనేమీ చెప్పలేదు. కానీ మా అమ్మ కి అంతా తెలుసు. మీరు నాకు న్యాయం చేస్తారని  నమ్ముతున్నాను అంకుల్ ” అని  తనుశ్రీ వెళ్ళడానికి కుర్చీ లో నుండి లేచింది.

వెంటనే ఉమాకాంత్ తన కుర్చీలోనుండి లేచి ముందుకొచ్చి  చేతులు జోడించి

“దయ చేసి ఈ పెళ్లి జరగనివ్వు. ఈ పెళ్లి ఆగి పోతే  నా పరువు ప్రతిష్ట అంతా మంట  గలిసి పోతుంది. ఆల్రెడీ పెళ్లి నిశ్చయం అయిపొయింది. అటు పక్కన వున్నది కూడా మామూలు మనిషి కాదు.” అన్నాడు

తనుశ్రీ మొహం కోపం తో జేవురించింది. “మీరు మీ ప్రతిష్ట గురించే మాట్లాడుతున్నారు. కానీ నా సంగతి ఆలోచించారా? రెండు నెలల గర్భవతిని నేను. మీకు రెండు రోజులు టైమ్  ఇస్తున్నాను. మీరు న్యాయం చేయకపోతే మా నాన్నకి అంతా చెప్పేస్తాను. మీడియా కి పిలిచి చెప్తాను. వుమెన్ కమీషన్ సహాయం తీసుకుంటాను. దేవదత్తకి పాఠం చెప్పడానికి నా పేరు బద్నామ్ అయినా నేను లెక్క చేయను ” అని అల్టిమేటం ఇచ్చి తనుశ్రీ వెళ్ళిపోయింది

ఉమాకాంత్ చెమటతో తడిసిపోయాడు. ఎయిర్ కండిషనర్ పనిచేస్తూనే వున్నది కానీ ఛాంబర్ మాత్రం  ఒక్కసారిగా ఒక అగ్ని పర్వతం ఏదో

 పేలిపోయినట్టుగా  వేడెక్కిపోయింది. లోపల నుండి జీవం అంతా ఎగిరిపోయినట్టుగా నిస్తేజంగా కూర్చుండిపోయాడు ఉమాకాంత్ చాలా సేపు.

నిజానికి దేవదత్త పెళ్లి అనుకున్నప్పుడు ఉమాకాంత్ అపర్ణ, దేవదత్త పూర్తిగా వొప్పుకున్నాకే దిబ్యసింఘా మత్తగజరాయ్  తో మాట కలిపాడు. ఇప్పుడీ పెళ్లి ఆగిపోతే  దిబ్యసింఘా మత్తగజరాయ్ కి ఎంత పరువు నష్టం? అందులోనూ అధికార పార్టీలో వున్నవాడు కనుక ఆ అవమానం తీర్చుకోవడానికి ఉన్న  మార్గాలన్నీ వాడుకుంటాడు.  తన వ్యాపార సామ్రాజ్యాన్ని  సమూలంగా నాశనం చేయడానికి కూడా వెనుకాడడు. అలా అని తనుశ్రీ మాటలు కూడా తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. ఆమె తన పరువు ను రిపేరు చేయడానికి వీలు లేనంతగా పాడుచేయగలదు . డీప్ సీ  కి డెవిల్ కీ నడుమ చిక్కుబడినట్టు అయింది ఉమాకాంత్ స్థితి

ఆ తరువాత రోజు ఉమాకాంత్  తనుశ్రీ ఆరోపణలు గురించి దేవదత్త ని  అడిగితే సౌమ్యంగా అడిగితే అతడేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం బాగా తాగి రాత్రిపూట ఎప్పుడో పదకొండున్నర కి ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఉదయం అదే ప్రశ్న ఉమాకాంత్ కాస్త హార్ష్  అడిగితే అప్పటి కింకా మత్తుదిగని  దేవదత్త మంచం కింద ఉన్న  క్రికెట్ బాట్ తీసాడు. ఆ క్షణం ఒక రీ ప్లే లాగా గుర్తుకు రాగానే ఉమాకాంత్ కళ్లనీళ్లు పర్యంతం అయ్యాడు. అతడికి అపర్ణ గుర్తుకు వచ్చింది. “పాపం ! అపర్ణ” అనుకున్నాడు. దేవదత్త  ని గారాబంగా పెంచడం ఆమె తప్పు కాదు. ఉమాకాంత్ యోగమాయ కి చేసిన అన్యాయం కంటే అపర్ణ కి చేసిన అన్యాయమే పెద్దది. నిజం బయట పడితే యోగమాయ కంటే అపర్ణ ఎక్కువగా గాయపడుతుంది. దీనికి పరిష్కారం తాను  అదృశ్యం కావడమే.

తాను కొడుకు కోసం ఎందుకు తాపత్రయపడాలి? దేవదత్త లాంటి మాన్స్టర్ కుటుంబ పరువు ప్రతిష్టలను ఎలా ముందు కు తీసుకుని వెళ్లగలుగుతాడు? రోజుకోసారి తల్లి తండ్రులను చంపే కొడుకు వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత కూడా వాళ్ళనెలా  బతికించగలుగుతాడు?

ప్రతి యుగం లోనూ యోగమాయ మాతృగర్భం లో పడగానే, తండ్రులు కొడుకు అంటే వుండే ప్రేమ వలన యోగమాయ లను కంసుడికి అప్పచెపుతూనే వున్నారు. కానీ యోగమాయ లు కంసుడి చేతినుండి తప్పుకుని ఆకాశానికి ఎగిరి కాంతులు వెదజల్లుతూనే వున్నారు. దరిద్రం, అజ్ఞానం, అణచివేత ల సరిహద్దులను దాటుకుంటూనే వున్నారు. తమ ప్రతిభ తో చీకటి తెరలు తేల్చుకుని ఉదయించే సూర్యుడి లా వెలిగిపోతూనే వున్నారు.

ఒక్క సారి తనకు ఇష్టమైన తన నగరం కటక్ వంక చూసుకున్నాడు ఉమాకాంత్

రాత్రి తొలగి వేకువ వచ్చే సమయం ఆసన్నమౌతోంది. ఇంకా ఆలస్యం చేయడం లో అర్ధం లేదు. ఈ శాపగ్రస్త జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం మినహా మరొక దారి లేదు. ఉమాకాంత్ ఆలోచనల్లో నడుచుకుంటూ ప్లాట్ ఫారం చివరి కి వచ్చాడు. కనుచూపు మేర లోఎవరూ కనపడటం లేదు. కథా జోడి బ్రిడ్జ్ ను రైలు దాటి స్టేషన్ లో వస్తూండగా ఉమాకాంత్ రైల్వే పట్టాల వెంట నడవసాగాడు. మరో ఐదు నిమిషాలలో అతడి జీవితం ముగుస్తుంది. పట్టాల వెంట దూరం నుండు వస్తున్న రైలు ఇంజన్ కాంతి పైకీ కిందకూ ఊయల లూగుతున్నట్టుపడుతున్నది. ఇంజన్ హారన్  సన్నగా వినపడింది అతడికి. రైలు పట్టాల మధ్య వున్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, దుమ్ము ధూళి మీద గా రైలు కి అభిముఖంగా నడవసాగాడు ఉమాకాంత్. హఠాత్తుగా అతడి కాలికి సున్నితమైన ఒక గుడ్డల మూట లాంటిది తగిలింది. ఒక్కసారిగా ఆ గుడ్డల మూట లో నుండి  కీచుమంటూ కేక ఒకటి వినిపించింది. అతడు వంగి గుడ్డల మూట వంక చూసాడు.  ఆ మూట లో ఒక చిన్న పసిపాప. ఆ దృశ్యం అతడిని బలంగా కుదిపి వేసింది. అతడు వెంటనే పసి పాప ను చేతిలోకి తీసుకుని తన వైపే వస్తున్న రైలు వంక చూసాడు. కేవలం రెండు మూడు వందల మీటర్ల దూరం లో రైలు. పాపను విసిరేసి తానూ రైలు వంక దూసుకుని వెళితే … ? లేదా పాపను తీసుకునే రైలు కి ఎదురు వెళితే …. ?

కానీ అనూహ్యంగా రెండూ ఒక స్ప్లిట్ సెకండ్ లో జరిగాయి. పాపను బలంగా విసిరివేయబోతూ అతడూ మూడడుగులు పక్కకి వేసాడు, రైలు వెంటనే పట్టాలమీదనుండి దూసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఉమాకాంత్ ఒంటరి వాడు కాదు. అతడి చేతిలో పాప. ఆ పాపను అక్కడ ఎవరు వొదిలారో అతడికి తెలియదు. కానీ ఎవరో తనలాంటి ఒక దురదృష్టకరమైన తల్లో, తండ్రో వదిలి వుంటారు. ఏమి చేయాలో నిర్ణయించుకోలేక అతడు స్తబ్దంగా నిలబడ్డాడు.

అతడికి దేవుడు ఎందుకు రెండవ ఛాన్స్ ఇచ్చాడో తెలియదు. అన్ని బంధాలను వదిలివేసుకుని జీవితాన్ని అంతం చేసుకోవడానికి దేవుడు ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు? ఎందుకీ పరీక్ష పెట్టాడు. ఉమాకాంత్ పాప వంక తేరిపార చూసాడు. చామన ఛాయతో ముద్దుగా అందంగా వున్నది పాప. రాలిపోతున్న చీకటి వేళ  ఆ చిన్ని పాప పెద్ద కళ్ళు అచ్చు యోగమాయ కళ్ళ లా మెరుస్తున్నాయి. మహానది మీదుగా చల్లటి గాలి వచ్చి ఉమాకాంత్ ను తాకింది. ఆ చిన్న క్షణం లో తన తప్పును దిద్దుకోవడానికి పాప ఒక పరిష్కారం గా అతడికి తోచింది. పాతికేళ్ల క్రితం అతడు చేసిన తప్పు ను దిద్దుకోవడానికి ఇప్పుడు సమయం వచ్చింది.

ఉమాకాంత్ పాపను గుండెలకు హత్తుకుని ప్లాట్ఫారం వంక పరుగెత్తాడు. పాప కి అర్జన్ట్ గా పాలు పట్టాలి. ప్లాట్ ఫారం మీద వున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో నుండి ఇంటికి ఫోన్ చేసాడు. అపర్ణ దుఃఖ పూరిత స్వరం అటువైపు నుండి పలికింది

“ఎక్కడకు వెళ్లారండీ? రాత్రంతా మీకోసం ఎంత ఎదురు చూసాను? తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేశాను” అపర్ణ చెప్పుకుంటూ పోతోంది.

“అపర్ణా జాగ్రత్తగా విను. డ్రైవర్ ఇంత పొద్దున్నే రాడని నాకు తెలుసు. నువ్వే కారు డ్రైవ్ చేసుకుంటూ కటక్ రైల్వే స్టేషన్ ప్లాట్  ఫారం నెంబర్ 1 దగ్గరకు రా! చాలా చెప్పాలి. అదంతా ఫోన్ లో చెప్పడం కుదరదు. నీ కోసం ఎదురు చూస్తూ వుంటాను. త్వరగా రా !” ఉమాకాంత్ రిసీవర్ క్రేడిల్ చేసి పాప వంక చూసాడు. పాప మూలగడం ఆగిపోయింది. పాపను గుండెకు హత్తుకుని

“అమ్మ దారిలో వుంది. వచ్చేస్తోంది నీకోసం” అన్నాడు

గౌర హరి దాసు
వంశీకృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *