దారి ప్రవహిస్తుంది..

Spread the love

దుఃఖ ఆగ్రహ ధిక్కారాల నా యవ్వన కాలాన్నంతా
ఆ దారికే ఇచ్చి, నేను వెను తిరిగాక
దారి తప్పలేదు, పక్క దారీ పట్టలేదు
అలసిన పాదచారి వలె, కొంచెం పక్కకు జరిగి
నడుస్తున్న దారి కేసి, నిశబ్దంగా చూస్తూ నిలిచాను


ఆ దారి పాదరసమై ప్రవహించింది
సముద్రపు అలల వలె ఎగసిపడింది
దుర్గామారణ్యాలు, పంటచేలు,
పర్వత మార్గాల గుండా సాగి,సాగి
దారి పొడుగునా ఆశల పతాకాల్ని ఎగరేసింది


అలసిన దారి ఇక ప్రవహించక నిలిచిన నిలువ నీటి వలె
ఎగుడు దిగుళ్ళ, దిగులు దిగుడు బావి వలె
రూపాంతరం చెందుతూ, తనను తాను సరి చేసుకోలేక
రెండడుగులు ముందుకి, వెనక్కి ఊగుతూ
ముడుచుకుని మెలి తిరిగి, చిక్కులు పడి చెదిరింది


నా వెనుక, చుట్టేసిన చాప వలె దారి ముడుచుకుంది
దారులన్నీ మూసుకుపోయినప్పుడు కూడా
నీటి వలె, గాలి వలె,కాంతి వలె దారి కూడా
అతి సన్నని, కానరాని సందుల గుండా
అతి కష్టంగా, నెమ్మదిగా ముందుకే ప్రవహిస్తుంది


ఎదురు చూస్తాను, నేలను తట్టి నిద్ర లేపే పిల్లల కోసం
దారులలో రాలిన పల్లేరులను ఏరి
గాయపడిన దారులను సరిచేసి, వైద్యంచేసే,
కొత్త దారులను వేసే, కుర్రవాళ్ళ కోసం
వేచివుండటం కలల దారులకు కూడా తెలుసు

నడచి వచ్చిన దారులలోని సుడిగుండాలను,
నిప్పుల వానలను, నీటి చెలమల నవ్వుల
కొండగుర్తులను, చెప్పే
ముసలి పేదరాశి పెద్దమ్మవలె నా కలల చేతికర్ర ఊతంకాగా, అట్లా నిలిచివుంటాను
పిల్లలారా పదిలం, పదిలం అని పలవరిస్తూ

విమల
25.5.2026

విమల

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *