గాలికి రెపరెపలాడే దీపం వలె
నాలోని ప్రాణం అల్లాడుతోందీ చివరి వేళ
నువ్వు నడిచి వెళ్లిన గాయపడి, చిరిగిన ఈ దేహాన్ని
ఇహ వాడని చాప వలే ఒక మూలకు గిరవాటు వేశాను
నీవు నా రక్తివి కావు, నా ముక్తివి కావు
నీవు నా ఆనందము కావు, నా స్వేచ్ఛవి కావు
నీవు నా ప్రేమవీ కావు, నా నిశ్చింతవీ కావు
నీవు నా తోడువీ కావు, నా ధైర్యమసలే కావు
నా భయాల నిరంతర నిరీక్షణలకు ఎన్నటికీ వేకువ తేలేని
నిత్య సందిగ్ధతల నిరాశల అగమ్యాల చీకటి చివరవు
దిగులుతో, అవమానంతో ఎన్నడో మరణించిన
నా అంతరాత్మతో అనునయంగా మాట్లాడి దానిని ఓదార్చుతాను
ప్రశ్నను,తర్కాన్ని, సత్యాన్ని ,వేదనను,ఏకాకితనాన్ని ఎరిగి
ఎన్నింటి నుండో విడుదలైన నేను
కంటకావృత లోకంతో ఇప్పుడు నిబ్బరంగా సంచరిస్తానిక..