ఈదురుగాలికి ఎగిరొచ్చిన
గడ్డిపోచలతో వంతెన కట్టగలను
నీటిబొట్లని పిండి
నదులుగా ప్రవహించగలను
నిలువనీయని తపనేదో
రెక్కలు కట్టి నన్ను మబ్బుల సిగమీదకెక్కిస్తుంది
అమావాస్య నక్షత్రాలని కోసుకొచ్చి
దీపస్తంభము నలంకరిస్తాను
చందమామలో కుందేలుపిల్లను
భుజాలపైకెక్కించుకుని ఆడిస్తాను
హద్దులు మీరి ఎదిగిపోవాలని
గీసిన గీతలన్నీ దాటి ఎగిరిపోవాలనీ
మనసు మొండికేస్తుంది
బంధించిన కలల వెంబడి
నే పరిగెట్టడం మొదలెడితే
ఈ భూప్రపంచమంతా
నా అరికాలికింద
ఒకే ఒక్క అడుగయిపోతుంది

