అరచేతిలో ప్రపంచవీక్షణం చేస్తున్నాము
అంతరంగంలోకి తొంగి చూడడం... మానేసాము
కాదు, కాదు... మర్చిపోయాము
డబ్బులు జమ చేస్తూ
విలువల్ని తీసేస్తున్నాము..
క్షణాల్ని ఆస్వాదిస్తూ
జీవితకాలాన్ని కోల్పోతున్నాము..
పిడికిట్లో ప్రపంచం..
చేజారిపోయిన ఆనందం
భ్రమలు మనల్ని బందీ చేసాయి
బ్రతుకు బరువవుతున్నా గుర్తించలేనంత
బందీ చేసాయి
మనసు.. అలుసయిపోయింది
సంతృప్తి అందని పండయింది..
అనుబంధం... అమెజాన్లో దొరకట్లేదు...
అందుకునేదెట్లా... ??
అవుట్ అఫ్ స్టాక్!!
అవ్వ తాత... గోడ మీది బొమ్మలు
ఆత్మీయతా గంధం పులుముకునేదెట్లా..??
నిజజీవిత వైకుంఠపాళిలో
కనపడని కర్కోటకుడు మింగేసాడు...
ఫలితంగా ...
చావనీయని విషం తలకెక్కింది..
ఇంటిచూరు కిందే అందరం...
గుండె గదుల్లో ఏకాకులం..
నవ్వినా ఏడ్చినా అనామకులైన నలుగురికీ తెలియాలి..
ఫలితంగా మెచ్చుకోలో, సానుభూతో కోరుకోని కర్కషులం.
పరుల వ్యూస్ కోసమే బతికే వివషులం....
యాంత్రిక యుగంలో
మసకబారిన మానవత్వంతో
అస్థిపంజరాలకు
తోళ్లు వేల్లాడదీసుకుని తిరిగే అనామకులం..
మనం మారేదెప్పుడు??
మనల్ని మార్చేదెవ్వరు??..
మారేదెప్పుడు??
