నాది గెలుపా.. ఓటమా ..?

Spread the love

ముందుగా నన్ను క్షమించండి. 

ఒక ఆర్టిస్టుగా నన్ను అభిమానించే మీరంతా నా మాటలకు ఆశ్చర్యపోవచ్చు.  ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వచ్చిందో  అర్థం కావాలంటే దయచేసి ఓపిక నేను చెప్పేది చివరిదాకా చదవండి.  మీకే అర్థమవుతుంది.  

నాకు తెలుసు మీరు నా గురించి వాకబు చేస్తుంటారు.మీ సందేహాలకు జవాబులు ఇవ్వడం నా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. 

ఎవరికీ ఎటువంటి సందేహాలు, ఇబ్బందులు లేకుండా నా అభిమానులందరికీ నా గురించి చెప్పడం నా బాధ్యత అని భావించి మీ ముందుకు వచ్చా.  మీరు అర్థం చేసుకుంటారని  ఆశిస్తున్నా.

మీకు తెలుసో తెలియదో చిత్తవైకల్యం ఒక దుర్మార్గమైన వ్యాధి. మనపై ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తుంది. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు తికమక పరుస్తుంది. నెమ్మనెమ్మదిగా భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఆలోచించడం, గుర్తించడం, మాట్లాడటం, రోజువారీ పనులు చేయడం ఎప్పటిలాగా చేయలేక గందరగోళ పరుస్తుంది. 

అటువంటి వ్యాధి నా దరి చేరింది.  ఈ క్షణంలో చిత్తవైకల్యం గురించి మాట్లాడటం కంటే,  ఆత్మీయత పంచే మీతో నా జీవితం గురించి చెప్పుకోవాలని ఉంది. 

జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. ఏ కొందరికో తప్ప.  ఆ కొందరిలో నేను లేను. 

జీవితం నాపై ఎన్నో సవాళ్లు విసిరింది. మరెన్నో ప్రతికూలతలు ఇచ్చింది. అన్నిటినీ ఎదుర్కొన్నా. చాలా నిబ్బరంగా ఎదుర్కొన్నా.  

నాతో కలిసి ఏడడుగులు నడిచిన వ్యక్తి అనుమాన భూతంతో ఉన్నపళాన ఇంట్లోంచి గెంటేశాడు. 

గుండెపగిలిన ఆ క్షణాల్లో చంటి బిడ్డలనేసుకుని భయంతో, అవమానంతో, దుఃఖంతో బయటకు వచ్చా. కానీ నేను కుంగిపోలేదు. వంగిపోలేదు. 

సమాజం ముందు నన్ను దోషిగా నిలబెట్టి నప్పటికీ ధైర్యంగా ఎదురొడ్డి గడ్డిపోచలా నిలబడ్డా. 

కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టా. 

నా జీవితంలో కొంత కోల్పోయి ఉండొచ్చు, కానీ ఎంతో భవిష్యత్తు మిగిలే ఉంది. దాన్ని జాగ్రత్తగా నిర్మించుకుందామని ముందుకు నడిచే ప్రయత్నం మొదలుపెట్టా. 

ఒంటరి తల్లి గానే పిల్లలిద్దరినీ పెంచా.  నా మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి, తీవ్ర గాయాలైనా ఎక్కడా తలవంచలేదు. నా పద్ధతి లో ధైర్యంగా ఎదుర్కొన్నా. నాపై నా వ్యక్తిత్వం పడిన ప్రతి దెబ్బను నా ఎదుగుదలకు సోపానాలుగా మలుచుకున్నా. 

నా పిల్లలు ఉన్నత విద్యావంతులై ఉద్యోగాల్లో నిలదొక్కుకున్నారు.  నా కష్టకాలం కాలం ముగిసింది. ముందుందిలే మంచి కాలం అని ఆనంద పడుతున్న వేళ మిన్ను విరిగి మీద పడిన వార్త. 

చిత్తవైకల్యం నాతో సావాసం చేస్తున్నదని.  నా ప్రత్యర్థిగా మారి నాపై సవాల్ విసిసురుతుందని ఎప్పుడైనా ఊహించానా? లేదే?  అనుకోనిది జరగడమే జీవితం కావచ్చు. 

చిత్తవైకల్యం నాతో చెలిమి చేయడానికి ఎప్పుడు వచ్చి చేరిందో తెలియదు. కానీ ఆటలు ఆడుతూ గందరగోళ పరచడం మొదలు పెట్టింది.

పెరుగుతున్న వయసులో అది సాధారణమే అనుకుని ప్రాధాన్యత ఇవ్వలేదు. నా పిల్లల పెళ్లిళ్ల పనుల్లో  కొంత కాలం గడిచిపోయింది.  

నా రోజువారీ పనులకు అంతరాయం కలిగిస్తూనే ఉంది నా మతిమరుపు.  నా మాట, పలుకులో కూడా కొంత తేడా. 

అదంతా అలసట వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఉన్నాను. 

పిల్లలిద్దరూ వెళ్లిపోయారు. ఒంటరిగా ఒక్కదాన్నే ఇంట్లో. నా పరిస్థితిలో మరింత మార్పు.  ఒక్క దానికి వండుకో బుద్ధి కాక తిండి సరిగ్గా తినేదాన్ని కాదు. పిల్లలు ఉదయం, సాయంత్రం ఫోన్ చేస్తే తింటున్నానని చెప్పేదాన్ని. 

నాలో వచ్చే మార్పుల్ని పసిగట్టారు వాళ్ళు.  ఓ రోజు నా పెద్ద కూతురు వచ్చి బలవంతాన న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లింది. 

ఆ డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి డిమెన్షియా అదే చిత్తవైకల్యం  అని నిర్ధారించారు. మొదట నేను నమ్మలేదు.  

మరి కొన్నేళ్లలో నా జీవితం లో అత్యంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, నన్ను నేను గుర్తించలేని రోజులుంటాయని తెలిసిన మరుక్షణం గుండె బద్దలైంది. అసలు ఆ విషయం గుర్తుంచుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు.  

నా వ్యక్తిత్వం అది కాదు కదా..  

నెమ్మదిగా దాన్ని దాటుకొని  ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నించాను. ఆ ప్రయత్నమే నాతో కుంచె పట్టించింది. కాన్వాసుపై రంగులద్దించింది.  మీ మన్ననలు పొందేలా చేసింది. 

నా చిత్తవైకల్యమే నన్ను చిత్రకళా ప్రపంచంలో చిత్రకారిణిగా ఒక స్థానాన్ని ఇచ్చింది. 

అందరూ ఇలా ఉంటారని నేను చెప్పను. సమస్య వచ్చినప్పుడు అందులోంచి పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించు కోగలిగితే మన పరిస్థితి మెరుగ్గా ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్పగలను. 

డిమెన్షియా గురించి తెలిసిన తర్వాత నాలోకి నేను చూసుకోవడం మొదలుపెట్టాను. ఈ జీవితంలో నేను బతికి సాధించింది ఏంటి? చచ్చి సాధించేది ఏంటి అని ప్రశ్న ఉదయించింది.  

గతాన్ని నెమరు వేసుకుంటే శూన్యంగా కనిపించింది. ఉలిక్కిపడేలా చేసింది. 

నేను ఈ లోకంలో బతికానని నా గుర్తులుగా నా పిల్లల్ని సమాజానికి ఇవ్వడం మాత్రమేనా? ఇంకా ఏమి చేయగలను అని ఆలోచన మొదలైంది. 

నా ఆలోచన నా పిల్లలతో పంచుకున్నాను. అప్పుడు నా కొడుకు ఇచ్చిన సలహా బొమ్మలు వేయడం. 

అమ్మా నువ్వు బొమ్మలు చక్కగా వేస్తావు, చక్కటి చిత్రకారిణివి.  నీ చిన్ననాటి హాబీ కొనసాగించమని కూతురు ప్రోత్సాహం. 

నాకు చిత్తవైకల్యం రాకముందు చేసినట్లు నా పనులు నేను చేయగలనో లేదో తెలియదు. కానీ నా పిల్లలు మాత్రం నా నుంచి అలా ఆశిస్తున్నారని అర్ధమైంది.   

ప్రయత్నించి చూద్దాం నష్టమేముంది. నాకు కూడా ఒక వ్యాపకం ఉంటుంది. ఆలోచనలు అటు ఇటూ దొర్లిపోకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవడం మంచిదే అనిపిపించింది.  

ఏదో గాలివాటుగా వేసుకున్న నా బొమ్మల్ని చూసి పిల్లలు నా నుంచి ఎక్కువ ఆశిస్తున్నారేమో..  వారి అంచనా అందుకో గలనో లేదో…అని సందేహపడ్డా. ఏదేమైనా నా ప్రయత్నం మానకూడదు, ఆందోళన చెందకూడదని ఒక స్థిర నిర్ణయానికొచ్చా. 

నా ప్రవర్తనలో కొన్ని మార్పులు వచ్చి ఉండవచ్చు. నా సామర్ధ్యాలు కొంత తగ్గి ఉండొచ్చు. ఇతర వైద్య సమస్యలు ఉండవచ్చు. నేను ఇక మునుపటి స్థితికి ఎప్పటికీ వెళ్ళలేక పోవచ్చు. అయినా నేను ఇప్పుడు బొమ్మలు వేయగలిగే స్థితిలో ఉన్నానని నమ్మాను. భవిష్యత్తులో నేను ఏమీ చేయలేకపోవచ్చు.  అందుకు నా ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవచ్చు అని వెంటనే  నా చిత్ర కళకు కావలసిన సరంజామా సమకూర్చుకుని పని మొదలుపెట్టా.  

నా చుట్టూ ఉన్నవారి కంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న నేను, నన్ను నేను వ్యక్తపరుచుకోవడానికి బొమ్మలు వేయడం మొదలు పెట్టా.  

నా సమస్యలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ నాలాగే చిత్తవైకల్యం తో బాధపడే ఇతరులకంటే నేను మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నానని భావించాను. నా సమస్యలకు కారణం ఏంటో నాకు తెలుసు. 

నాలో కలిగే భావోద్వేగాల మార్పులు,  గందరగోళం, కొన్ని సమయాల్లో కలిగే నిరాశ వంటివన్నీ నా చిత్రాల్లో తొంగిచూడడం బహుశా మీరు గమనించే ఉంటారు. వాటితోపాటు నా సానుకూల దృక్పథం కూడా ఆ బొమ్మల్లో కనిపిస్తుందని నా అభిమానులు అంటూ ఉంటారు. 

నేను వేసిన మొదటి యాక్రిలిక్ పెయింటింగ్ చూసుకుంటే ఫర్వాలేదు వేయొచ్చు అని ధైర్యం వచ్చింది. పిల్లలిద్దరూ మరింత ప్రోత్సహించారు. 

ఆ తర్వాత వేసిన రెండు పెయింటింగ్స్  నాకెంతో తృప్తినిచ్చాయి. 

నా చిత్రాలు మా అమ్మాయి మొదట ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే మంచి ఆదరణ లభించింది.  అప్పుడు మా అబ్బాయి నా కోసం ఓ బ్లాగ్ తెరిచాడు. 

ఇందులో నా బొమ్మలు పోస్ట్ చేయడం మొదలు పెట్టా. ఆ చిత్రాలకు అప్పుడప్పుడు కొన్ని శీర్షికలు ఇచ్చేదాన్ని. 

నేనసలు ఊహించని విధంగా నా బ్లాగ్ చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.  ప్రశంసలు వెల్లువయ్యాయి.  అవి నాకు మరింత ఉత్సాహంతో వేయడానికి దోహద మయ్యాయి. 

పెయింటింగ్ చేస్తున్నంత సేపు నన్ను నేను మరచి పోయేదాన్ని. నన్ను నేను వ్యక్తపరుచుకోవడానికి ఒక మార్గంగా వేస్తూ పోయాను. నా అనుభవాలు, అనుభూతులు నా బొమ్మల్లో వ్యక్తం చేస్తున్నాని అన్నారు నా పిల్లలు, తెలిసిన వాళ్ళు. 

నా మానసిక ఆరోగ్యం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పై అధికారులు, తోటి ఉద్యోగుల వత్తిడి ఉంది.  ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగం మానడమే అందరికీ మంచిదనిపించింది. దానికి తోడు నాకిప్పుడు ఉద్యోగం తప్పనిసరి అవసరం కాదు.  కుటుంబ బాధ్యత లేమీ లేవు నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్ప.  అందుకే ఇప్పటి వరకు చేస్తూ వచ్చిన గుమాస్తా ఉద్యోగం మానేశా. 

ఒక వ్యాపకంగా మొదలైన పెయింటింగ్ రాన్రాను అదే లోకంగా మారిపోయింది. అనేక ప్రయోగాలు చేస్తూ పోయాను. అఫ్ కోర్స్ ఆ విషయం మీకు తెలుసనుకోండి. 

చిత్తవైకల్యం ఉన్న వ్యక్తిని చూసి చెడ్డవాళ్ళని, పిచ్చివాళ్ళని దూరంగా జరిగిపోవడం, వేళాకోళం చేయడం చేస్తుంటారు. చాలా సార్లు చూసాను కూడా. 

నిజానికి వాళ్ళు స్పష్టంగా ఆలోచించ లేకపోవచ్చు, గందరగోళం, భ్రమల కారణంగా ఒకటి మాట్లాడడానికి మరొకటి మాట్లాడి ఉండవచ్చు, విచిత్రంగా ప్రవర్తిస్తే చెప్పలేని సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు అని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టేస్తుంటారు. కాలో చెయ్యో పని చేయకపోతే ఎలా ఉంటుంది? అలాగే మెదడు సరిగా పని చేయకపోతే, దెబ్బతింటే ఎవరైనా భిన్నంగానే ప్రవర్తిస్తారనే అవగాహన నా దాకా వచ్చేవరకు నాక్కూడా లేదు. 

నేను ఎప్పుడు నా జీవితాన్ని ఒక ప్రణాళిక బద్దంగా గడపడానికి ఇష్టపడతాను.  కానీ చిత్తవైకల్యం నన్ను నియంత్రించాలని చూసింది.  అయినా నా భవిష్యత్ ని నేను ప్లాన్ చేసుకున్నా. నా డాక్టర్ సహాయం కూడా తోడైంది.  

ఒక్కోసారి కుంచె పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఒకటి రెండుగా మూడుగా  కనిపిస్తున్నప్పుడు రంగులు అద్దడం చాలా ఇబ్బంది అయ్యేది. చిత్తవైకల్యం నన్ను తర్వాత దశల్లోకి తీసుకుపోతున్నదని నాకు తెలుస్తూనే ఉంది. ఇబ్బందులు పెరుగుతున్నాయి.  నా రోజువారీ అవసరాల కోసం క్రమంగా ఇతరులపై ఆధారపడే స్థితిలోకి జారిపోతున్నాను.  

నా పిల్లలు వాళ్ళ కుటుంబం, వృత్తి, ఉద్యోగాల్లో ముంబైలో ఒకరు, బెంగుళూరులో ఒకరు. వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించడం నాకిష్టం లేదు. నా కోరిక మేరకు నన్ను డిమెన్షియా కేర్ హోమ్ లో చేర్చారు.  

నేను ఎప్పుడు స్నానం చేయాలో, ఎపుడు తినాలో, ఏం తాగాలో నా సహాయకులే నిర్ణయిస్తారు. వాళ్ళు నాకోసమే అవన్నీ చేస్తున్నారు. నన్ను సంతోషంగా ఉంచడానికి వారు ప్రయత్నిస్తున్నారు.  కానీ అది నాకు నచ్చదు. నేను ఇతరులపై ఆధారపడటాన్ని ద్వేషిస్తాను. అందుకే అప్పుడప్పుడు వాళ్ళని కోప్పడుతున్నా. విసుక్కుంటున్నా. 

ఈ విజయలక్ష్మి ఎప్పటికీ ధైర్యంగా ఎదుర్కొనే ధీశాలి గానే అందరికీ గుర్తుండి పోవాలి.

కుంగి కృశించి పోయిన శరీరంతో, మాటాడలేని స్థితిలో ఉన్న నన్ను నేను ఊహించుకోలేక పోతున్నా. అటువంటి నా స్థితిని నా పిల్లలే కాదు ఎవరూ చూడటాన్ని నా మనసు ఒప్పుకోవడం లేదు. 

ఆ సమయంలో నా మదిలో మెదిలింది కారుణ్య మరణం.  

బహుశా మీకు నేను వేసిన పెయింటింగ్స్ లో కారుణ్య మరణాలపై వేసిన చిత్రాలు గుర్తుండే ఉంటాయి.  

కుంచె నా మాట వినడం మానేస్తున్న ఆ క్షణాలలో నన్ను నేను వ్యక్తం పరచుకోవడానికి జీవన్మరణ పోరాటమే చేశా. మనసును, శరీరాన్ని కూడదీసుకుని  సమన్వయం వేయడానికి నేనెంతో శ్రమ పడ్డాను.  ఆ చిత్రాల ద్వారా నా అభిలాష ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. 

జీవితంలో మనకు ఉండని ఎంపిక మనం పుట్టడం. కానీ మిగిలిన పనులన్నీ మనం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. చేసుకుంటాం కూడా. అంటే మనం ఎలా జీవించాలో మనం ఎంపిక చేసుకుంటాం. 

అలాగే మనం ఎలా చనిపోవాలో ఎంత కాలానికి చనిపోవాలో ఎంచుకునే హక్కు మనది ఎందుకు కాకూడదు?

పుట్టుక గురించి జీవితం గురించి మాట్లాడే మనం మరణం ఏ క్షణమైనా తప్పదని తెలిసినా దాని గురించి మాట్లాడడానికి విముఖత చూపుతాం.  

ఆస్తిపాస్తులు, తెలివితేటలు,కులమతాలతో సంబంధం లేకుండా చికిత్సలేని రోగంతో బాధపడుతున్న నాలాంటి వారి నిర్ణయానికి విలువ ఇవ్వరు.  వారి స్వచ్ఛంద మరణాన్ని గౌరవించరు. ఎందుకిలా?  

నియంత్రణ లేని రోగం కోరలు చాచుకుని ముందుకు వస్తుంటే ఎదుర్కోలేని స్థితిలో నిస్సహాయంగా ఒక నిర్జీవ వస్తువులా పడి ఉండే జీవితం ఎందుకు చెప్పండి? 

అలా ఎక్కువ కాలం జీవంతో ఉంటామేమో కానీ అందులో జీవితం ఉంటుందా?  అది  ఎవరికి ఉపయోగం?! అందరికీ బరువు, భారం అవడం తప్ప. 

ఆరోగ్య వ్యవస్థలో ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలు వచ్చినప్పటికీ, ఎంతో పురోగతి సాధించినప్పటికీ మరణం అనివార్యం. దాన్ని నివారించే చికిత్సలు ఇప్పటికి ఈ భూమి మీద ఉన్నాయా.. లేవు. 

అయినవాళ్లు ఎన్ని ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ, సంరక్షణ కోసం ఎంత తపన పడినప్పటికీ చిత్తవైకల్యం ఆటుపోట్లను ఆపలేం. 

ఇదంతా ఎందుకు చెబుతూన్నానని అనుకుంటున్నారు కదూ.. ఆ విషయానికే వస్తున్నా.  నా స్థితిలో ఉన్న వారికి కారుణ్య మరణం అందుబాటులో ఉంటే నేను దాన్ని ఎంచుకునే దాన్ని. 

నేనే కాదు, బహుశా నా స్థితిలో ఉన్న చాలా మంది ఎంచుకుంటారని ఈ హోమ్ కి వచ్చాక అర్ధమైంది. మనదేశంలో డిమెన్షియా కేర్ హోమ్స్ చాలా ఖరీదైన వ్యవహారం. అలాగే, పాలియేటివ్ కేర్ అందుబాటులో లేదు. 

దేశంలో జీవన ప్రమాణం పెరిగింది. వృద్ధాప్య జనాభా నానాటికి పెరుగుతున్నది. అట్లాగే చిత్తవైకల్యం కూడా పెరిగిపోతున్నది.  

అలాంటి వాళ్ళు అనారోగ్యంతో జీవితాన్ని పొడిగించడం ఇష్టం లేకపోవచ్చు.  ఇప్పటివరకు గడిపిన జీవితం చాలు. ఆ అనుభవాలు పదిలంగా నా గుండెల్లో ఉన్నాయని తృప్తి పడే నాలాంటి వాళ్ళు ఉండొచ్చు.  

ఉనికిలో ఉండడానికి ఇష్టపడని నాలాంటి వాళ్ళు కారుణ్యమరణం కోరడంలో తప్పేముంది?  నా జీవితం, నా ఎంపిక.  

ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావించాలి. వేగగనంతమైన ప్రపంచంలో అనేక బాధ్యతల్లో ఉండే పిల్లల వనరుల్ని మాటాపలుకులేకుండా మంచానికి అతుక్కుపోయిన తల్లిదండ్రుల సేవలో కరిగించేయడం కూడా నాకు నచ్చని విషయమే.  

శ్వాస ఆడుతూ ఉన్నప్పటికీ అలాంటి స్థితిలో ఉన్నవాళ్లు చచ్చిన వాళ్లతో సమానం అని నా ప్రగాఢ విశ్వాసం. అటువంటి స్థితిలో ఎన్నాళ్ళున్నా సమాజానికి నష్టం తప్ప ప్రయోజనం ఏమి ఉండదని నా భావన. దాన్ని అందరూ అంగీకరించవచ్చు, అంగీకరించక పోవచ్చు. అది వారి అభిప్రాయం. అంతే. 

జీవిత చరమాంకంలో దయనీయమైన మానసికలోకి పడిపోయే నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. నా పిల్లలు నన్ను ఆ స్థితిలో చూడటం నాకు సుతారమూ ఇష్టం లేదు. 

ఆఖరి ఘడియల్లో ఆ ఆటుపోట్లు  నాతో పాటు నా పిల్లలు కూడా భరించడం, దుఃఖించడం ఎందుకు? 

వద్దు.. వాళ్లకు నేను మామూలుగా గుర్తుండాలి.చివరి క్షణాల్లో అయోమయ స్థితిలో చేదు అనుభవాలిచ్చే నేను కాదు. 

నన్ను సంతోషపెట్టడం కోసం పిల్లల విలువైన సమయం, వనరులు ఖర్చు కావడం, నేను ఇతరులపై ఆధార పడటం నా అభిమతానికి విరుద్ధం.  

గౌరవప్రదంగా మరణం కావాలని కోరుకుంటున్నా. ఇబ్బంది పడకుండా సునాయాసంగా మరణించాలని అభిలషిస్తున్నా. 

నా చిత్రాల్లో నేను ఎప్పుడూ ఆశను నింపాను. నేనెప్పుడూ ఆశాపూర్వకంగానే జీవించాను. అలా ఉండడానికి ఇష్టపడ్డాను.  

నేను ఎంచుకున్న విధానం ద్వారా ఆ ఆశను చంపేశానా? అనే ప్రశ్న నాకు రాక పోలేదు. జీవితం జీవించడం కోసం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మరణం వాకిట ఉన్నప్పుడు అది వారి ఎంపిక కూడా కావచ్చని, కావాలని  నా అభిప్రాయం.

కొన్ని పరిమిత పరిస్థితుల్లో  కారుణ్య మరణానికి మనదేశంలో అనుమతి ఉన్నప్పటికీ అది అన్ని సందర్భాల్లో కాదు. ఏళ్ల తరబడి కోమాలో ఉన్న వారికి మాత్రమే. 

గౌరవంగా జీవించడం లాగే గౌరవంగా మరణించే హక్కు కూడా నా లాంటి స్థితిలో ఉన్నవారికి అవసరం. 

ఎవరైనా పోయేది ఒంటిరిగానే. అయితే అది బాధాకరంగా, భయంకరంగా ఉండకూడదంటే నాలాగే నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. దాదాపు పది పన్నెండేళ్లుగా చిత్తవైకల్యం నన్ను వెంటాడుతూ, వేటాడుతూ ఉంది. ఎప్పటికప్పుడు యుద్ధం ప్రకటించి నన్ను నేను గెలిపించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చా. 

నా శక్తిసామర్ధ్యాలు సన్నగిల్లుతున్న క్షణాల్లో చిత్తవైకల్యం నన్ను ఓడించి నాలో  సృష్టించిన విధ్వంసం చాలదన్నట్టు, నన్ను పూర్తిగా కబళించేందుకు పొంచి ఉన్నది. దాని ప్రయత్నాలు అంతం చేయడానికి నేను నిర్ణయించుకున్నా.  

ఇలా చేయమని నాతో ఎవరు చెప్పలేదు, బలవంతంగా రుద్దలేదు. ప్రలోభ పెట్టలేదు. పూర్తిగా నా ఇష్టంతోనే తినడం, తాగడం మానేసి చిత్త వైకల్యానికి చెక్ పెడుతున్నా. 

నా చర్యను మీరు సమ్మతించవచ్చు. సమ్మతించక పోవచ్చు. కానీ ఇది నా స్వ విషయం. నా జీవితం పై నిర్ణయం తీసుకునే హక్కు నాదే.  

ఇక్కడొక విషయం చెప్పాలనిపిస్తున్నది.  ఎవరైనా ఏదైనా ఒక పని నడుస్తున్న వ్యవస్థకు, సమాజ సంప్రదాయానికి భిన్నంగా ప్రారంభిస్తే దానికి విపరీతంగా నిరసన వ్యక్తం అవుతుంది. అది నాడూ ఉంది. నేడూ ఉంది. 

రేపటి సమాజంలో నెమ్మదిగా మార్పు వచ్చి అలవాటుగా మారుతుండొచ్చని నా ఆశ.  అప్పుడు నేను చేసిన పని సబబుగానే కనిపిస్తుండని నా నమ్మకం.  

తినడం, తాగడం మానేసి ముక్కు మూసుకుని నా నుంచి నేను, మీ నుంచి నేను, ఈ ప్రపంచం నుంచి నేను శాశ్వతంగా వెళ్లిపోతున్నా. 

చిత్తవైకల్యం తో నేను అద్దిన రంగుల ప్రపంచాన్ని ఆదరించిన మీ అందరికీ వేలవేల ధన్యవాదాలు. 

నా చిత్రాలకు అశేషమైన ఆదరణ ఇచ్చిన మీ మద్దతు వెలకట్టలేనిది. 

సెలవు

మీ 

విజయలక్ష్మి 

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *