ఆవిడ 56 యేళ్ల సూరమ్మ. ఆఫీసర్ కు ఫిర్యాదు చేస్తోంది.
“అయ్యా.. కొడుకు పట్టించుకోవడం లేదు.” సూరమ్మ ఏడుస్తోంది.
ఆఫీసర్ సర్దుకున్నాడు.
“పిలిపిస్తాను. మాట్లాడతాను. నీ కొడుకు ఎక్కడ ఉంటాడు.” అడిగాడు.
ఆనవాలుతో కొడుకు సోమయ్య ఇంటి వివరాలు చెప్పుతోంది సూరమ్మ.
ఆ వివరాలు రాసిన కాగితం ఇస్తూ.. అటెండర్ తో.. “వెళ్లి తీసుకురా.” చెప్పాడు ఆఫీసర్.
“నువ్వు ఏడవకుంటా కూర్చో. అతడు రాని చెప్తాను.” అనేసి.. మరో ఫైలు తెరిచాడు ఆఫీసర్.
సూరమ్మ ఆ గదిలో బెంచీ మీద ఓరగా కూర్చొని ఉంది.
***
సూరమ్మ.. ఎకరా పొలం.. ఓ ఇల్లు యజమాని. భర్త ఎప్పుడో చనిపోయాడు.
సూర్మమ్మకి ఒక్కరె సంతానం.. సోమయ్య.
సోమయ్యని చదివించాలని ఎంతగానో యత్నించింది సూరమ్మ. అబ్బే.. సోమయ్య వింటేగా. దాంతో తప్పక వ్యవసాయ పనులకు సోమయ్యని తనతో తిప్పుకునే ప్రయత్నాలు చేసేది సూరమ్మ.
సూరయ్య ఎప్పుడో తల్లి మాటు నుండి పక్కకెళ్లిపోయాడు. తన తోటి వాళ్లతో ఊరిలో తిరిగేవాడు. తిళ్లకి.. నిద్రలకి ఇంటికి వచ్చేవాడు.
సూరయ్యతో సూరమ్మ తెగ అవస్తలయ్యేది. కొడుకును బతిమలాడేదే తప్పా.. వాడిపై విరుచుకు పడేదే లేదు.
కొడుకంటే సూరమ్మకి ఏదో జాలి. తండ్రి లేని బిడ్డన్న దిగులు. పైపెచ్చు ఒక్కగానొక బిడ్డన్న ప్రీతి.
వీటి మూలంగానే సూరయ్య దారి తప్పాడంటే తప్పు లేదు.
వయస్సు పక్వం పట్టేక సూరయ్య ఊరిలోని తన ఈడు పిల్ల హంసని ఒడుపుగా పట్టుకున్నాడు. ప్రేమ కబుర్లుతో కాలం గడిపేడు.
ఆ నోట ఈ నోట నుండి ఈ కబుర్లు సూరమ్మ చెవుల్లో పడ్డాయి.
“ఆ పిల్ల బుగత బిడ్డ. మనం సాలం. ఆ పిల్లని వదులుకో నాయనా.” సూరయ్యని సముదాయించబోయింది సూరమ్మ.
సూరయ్య ససేమిరా అనేసాడు.
పైగా.. “బుగత కాదంటే.. ఆ పిల్లని లేపుకు పోతాను.” చెప్పేసాడు.
సూరమ్మ వణికిపోయింది.
“నాయనా.. తప్పురా. అలా చేయకు. ఆపై ఎటు పోయి ఎలా బతుకుతారు. ఐనా.. బుగత నిన్ను బతకనిస్తాడా.” బెంబేలు పడ్డది సూరమ్మ.
“ఆ పిల్లకి నేనంటే ఇష్టమే. మేమనుకున్నాం కూడా.. పెద్దల్ని కాదనైనా పెళ్లాడుకోవాలని. ఆఁ.” సర్రు సర్రున చెప్పేసాడు సూరయ్య.
దిగలయ్యింది సూరమ్మ.
నచ్చచెప్పలేననుకుంది.
దీనంగా కొడుకును చూస్తూ ఉండిపోయింది.
ఆ తర్వాత..
సూరయ్య అన్నట్టే ఆ హంసని లేపుకుపోయాడు ఎటో ఓ రాత్రిన.
ఊరు గగ్గోలైంది.
బుగత ఆవేశంతో ఊగిపోయాడు.
సూరమ్మ సరేసరి.
ఆ తర్వాత..
నెల తిరక్కముందే సూరయ్య.. హంసని వెనుకేసుకొని ఇంటిని చేరాడు.
సూరమ్మ గింజుకుంటోంది.
కబురెరిగి సూరమ్మ ఇంటికి వచ్చాడు బుగత.
హంస ఖండితంగా తన తండ్రికి చెప్పేసింది. తమని విడదీస్తే తానే ముందు చనిపోతానని. పైగా తన చావుకి తన తండ్రే కారణమని రాసి పోతానని కూడా అంది.
దాంతో బుగత తగ్గాడు. వెను తిరిగి పోయాడు. వెళ్తూ.. “నువ్వు చచ్చావనుకుంటానే.” అనేసాడు కూడా.
సూరమ్మ కూడా తన కొడుకుని సముదాయించలేకపోయింది.
మరి తప్పక.. తన ఇంటిన వాళ్లకి ఆశ్రమిచ్చింది.
అది అలుసుగా తీసుకొని.. ఆ ఇంటిన తన మాటే మాటన్నట్టు సూరయ్య.. హంసతో కలిసి మెసులుతున్నాడు.
***
“మీ అమ్మ ఆఫీసర్ ని కలిసిందట. నాకు తెలిసింది.” చెప్పింది హంస.. అప్పుడే బయటి నుండి వచ్చిన సూరయ్యతో.
“అట్టానా. ఎందుకట.” నిమ్మళం తప్పుతున్నాడు సూరయ్య.
“మనమేదో రాసి రంపాన పెడుతున్నట్టు మొరెట్టుకోడానికేమో. ఏమో ఏటి. అదే అవుతోంది.” రెచ్చకొడుతోంది హంస.
“అట్టానా. రానీ. ఎవరొస్తారో. అందరి నీలుగులూ కత్తెరించేస్తాను.” వాగాడు సూరయ్య.
అంతలోనే ఆఫీసర్ అటెండర్ వచ్చాడు.
“నాతో రా. ఆఫీసర్ తీసుకు రమ్మన్నారు.” చెప్పాడు.. సూరయ్యతో.
“నే రాను. ఎందుకు రావాలి.” రివ్వున కసిరాడు సూరయ్య.
“రావాలి. లేకపోతే బాగోదు.” అటెండర్ చెప్పాడు.
ఆ వెంబడే..
“నీ అమ్మ ఆడనే ఉంది. నీ మీద పిర్యాదు పెట్టి ఉంది. రా.” కొంచెం జోరుగానే చెప్పగలిగాడు అటెండర్.
“అట్టానా. చూసావే. ఆ పొలం తనకి రాసిమ్మన్నాని.. కొడుకని చూడక ఎలా రోడెక్కిందో.” వెకిలిగా అన్నాడు సూరయ్య.. హంసని చూస్తూ.
“మరే.” అనేసింది హంస.
“తను చచ్చేక తీసుకోమంటుంది. ఛ. నేను వ్యాపారం చేసుకుంటాను. పొలం అమ్ముకుంటానంటే ఒప్పుకోదే. ఏంటి దీని పొగరు.” చిందులేస్తాడు సూరయ్య.
“మరే.” మళ్లీ అనేసింది హంస.
“మీ గోలాపండి. నాతో రావయ్యా. ఏమున్నా ఆఫీసర్ దగ్గర తేల్చుకో.” అసహనంగా అన్నాడు అటెండర్.
“నాకు వచ్చే పని లేదు. ఎవరో చెప్పేది వినను.” గట్టిగానే చెప్పేసాడు సూరయ్య.
“అయ్యా. అలా కుదరదు. ఆవిడ పేరునున్న పొలం లాక్కోవాలనుకోవడం చాలా దారుణం. నీకు తగదు. ఆఫీసర్ కలగచేసుకుంటే నీ ఆటలు కట్టేస్తాయి. అంత వరకు తెచ్చుకోకు. రా. వచ్చి తప్పు ఒప్పుకో. కనికరించి మీ ఇద్దరికి కుదిరేలా ఆఫీసర్ చూస్తారు.” నచ్చ చెప్పాడు అటెండర్.
గుర్రుమన్నాడు సూరయ్య.
“తన తిక్కలు మాకు ఎరికే. మా ఆయన వచ్చేది లేదు. ఇతడికి హక్కు ఉంది.” కలగ చేసుకుంటోంది హంస.
“తప్పమ్మా. ఆడదానివై ఉండి మరో ఆడదాని ఉసురు తీయకు.” చెప్పాడు అటెండర్.
“ఆఁ. గొప్ప చెప్పొచ్చావ్. వెళ్లవయ్యా.” కస్సుమంది హంస.
భార్యకు వంతై.. “ఆఁ. వెళ్లెళ్లు. నేను రాను. ఏం చేసుకుంటుందో చేసుకోమను.” అనేసాడు సూరయ్య.
అటెండర్ మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసాడు. అన్నీ విఫలం కావడంతో తిరిగి వెళ్లిపోయాడు.
గంట తర్వాత..
ఆఫీసర్ జీపు వచ్చి సూరమ్మ ఇంటి ముందు ఆగింది.
గడపలోనే ఉన్న సూరయ్య, హంసలు కదలక మెదలక కూర్చొని ఉన్నారు. గుర్రుగా వచ్చిన వాళ్లని చూస్తున్నారు.
ఆఫీసర్ తో పాటు సూరమ్మ ఇంటిలోకి వస్తోంది. వీళ్ల వెనుక మరి కొంత మంది ఉన్నారు. వాళ్లలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు.
వాళ్లని చూసి సూరయ్య నిజంగానే జంకాడు.
“నా మాట వింటావా. లేదా పద్ధతి ప్రకారం చర్యలు చేపట్టమంటావా.” అడిగాడు ఆఫీసర్.. సూరయ్యనే చూస్తూ.
“తన చచ్చేక తన పొలం ఇస్తే నాకు లాభం లేదు. ఇప్పుడు ఇస్తేనే.. దానిని అమ్మేసి వ్యాపారం పెట్టుకుంటాను.” చెప్పగలిగాడు సూరయ్య.
“తను కుదరదంటోందిగా. ఏం. ఆ వ్యాపారం బదులు తనతో కలిసి పంటలు పండించుకు తిన వచ్చుగా. ఏం లోటు.” ఆఫీసర్ ప్రశ్నించాడు.
“నాకు పొలం పనులు చేతకావు. పైగా నాకు ఆ మట్టి.. బురదలు వద్దు.” చెప్పాడు సూరయ్య.
“విన్నారా సార్.. వీడి ఆలోచన వేరు. పొలం అమ్మేసి.. ఆ డబ్బులతో భార్యతో పట్నం చెక్కేయాలనుకుంటున్నాడు. అలా ఐతే నా బతుకు ఏం కావాలి.” ఏడుస్తోంది సూరమ్మ.
“ఊరుకో. అది నీ ఆస్తి. నిన్ను మెడ్డి ఇతడేం చేయగలడు. చట్టం ఒప్పుకోదు.” ఆఫీసర్ చెప్పాడు.
సూరమ్మ ఏడుపాపింది.
“ఈ ఇల్లు ఉందిగా. ఉండు. నేను నెల నెల డబ్బులు సర్దుతాలే.” చెప్తాడు సూరమ్మతో సూరయ్య.
“చాల్లేవయ్యా. నువ్వు అంత ముచ్చట తీర్చే వాటంలో కనిపించడం లేదు. నీ తల్లి భయం మాకు అర్థమైంది. తనాస్తి.. తనిష్టం. నీ యాగీలు చాలించు.” విసురుగానే అన్నాడు ఆఫీసర్.
ఇరు వైపు మాటలు నడుస్తున్నాయి.
వాటిని వింటున్న హంసకి బెదురు పట్టుకుంది. తన భర్త ఆగడాలు పారవని గ్రహించింది.
సూరయ్యని పక్కకు లాక్కుపోయింది.
“తగ్గు. బలం మీ అమ్మ వైపే కాస్తోంది. మనం వీగిపోతాం.” చాటుగా చెప్పింది.
“అంటే..” అయోమయమవుతాడు సూరయ్య.
“మీ అమ్మ చచ్చేకే మనకి ఆవిడవి దక్కుతాయి. మీ అమ్మ మొండిది. తన మాటే చెల్లించుకునేలా ఉంది.” చెప్పింది హంస.
ఏమీ పాలు పోక.. ఆఫీసర్ పిలుపుతో జల్దుకొని తిరిగి వచ్చాడు. హంస అతడి వెంటే వచ్చింది.
“మీ మంతనాలు తూగవు. మీ అమ్మ చెప్పినట్టు వింటేనే మీకు మేలు.” చెప్పేసాడు ఆఫీసర్.
“తమరు ఆవిడికి వత్తాసవుతున్నారు.” నసిగాడు సూరయ్య.
“లేదు లేదు. నేను చట్టం మనిషిని. న్యాయం వైపే నడుస్తాను. ఆఁ.” గట్టిగానే చెప్పాడు ఆఫీసర్.
సూరయ్య ఏమీ అనలేక పోతున్నాడు.
“చివరిగా ఏమంటావమ్మా.” అడిగాడు ఆఫీసర్.. సూరమ్మని.
“ఏమంటానయ్యా. వీళ్లతో వేగలేను. వీళ్లని నా ఇంటిలోంచి తోలేయండి. ఇకపై నా కేసి కానీ.. నా పొలం కేసి వీళ్లు రాకుంటా చేయండి.” చెప్పేసింది సూరమ్మ. ఆవిడలో తల్లితనం మొద్దుబారిపోయింది ఎప్పుడో.
“అంతేనంటావా. మరో సారి ఆలోచించుకో. ఎంతైనా వీళ్లు నీ తాలుకా. ఇతడు నీ బిడ్డ.” చెప్పాడు ఆఫీసర్.
“లేదయ్యా. వీళ్లు నా మనసు విరిసేసారు. ఉండి లేనట్టు ఇక నేను బతకలేను.” సూటిగానే అనేసింది సూరమ్మ.
“ఎంత ఇబ్బంది పర్చావయ్యా. లేదంటే.. ఒక తల్లి ఇలా మాట్లాడదు.. మాట్లాడ లేదు. ఛ.” ఆఫీసర్ నొచ్చుకుంటాడు.
అక్కడ కొద్ది సేపు అలికిడి లేదు.
“మీ అమ్మ ఇక మాట్లాడేలా లేదు. మా డ్యూటీ ప్రకారం మేము పోతాం. నిన్ను కట్టడి చేయక మాకు తప్పదు.” చెప్పేసాడు ఆఫీసర్.
దాంతో.. ముందుగా హంస.. సూరమ్మ కాళ్ల మీద పడిపోయింది.
“మన్నించత్తా. నువ్వు తగిలేస్తే బతకలేం.” అంది.
అదే తడవగా.. సూరయ్య కూడా సూరమ్మ కాళ్లు మీద పడ్డాడు.
కొద్ది సేపు తర్వాత..
“అమ్మా.. ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మారామంటున్నారుగా. అటుపై మేము ఎలా ఉన్నాం.” కలగ చేసుకున్నాడు ఆఫీసర్.
“నా చావు తర్వాత.. నాదంతా వీడికేగా. అలానే కానీయండి. అంత వరకు నేను సుబ్బరంగా బతికేలా నాకు సాయపడండి. వీళ్లని కట్టడి చేయండి.” ఆఫీసర్ ని వేడుకుంది సూరమ్మ.
ఆ వెంబడే..
“ఆ పైన.. నా చావు లోగ వీడు మీరితే నా పొలం.. నా ఇల్లు.. పరులుపాలు చేసేస్తాను. ఆఁ.” హెచ్చరికలా అనేసింది కూడా.
ఆఫీసర్ తల విదిలించుకున్నాడు. తన పరిధిలోని చట్టంని చేపట్టాడు.. ఓ తల్లి మరో పార్శ్వంకి సాక్షి అయ్యాడు.
***

బి వి డి ప్రసాదరావు
నేను, బివిడి ప్రసాదరావు, తెలుగు రైటర్ ని, తెలుగు బ్లాగర్ ని, తెలుగు వ్లాగర్ ని. నా పూర్తి పేరు - బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు. నేను పుట్టింది (15.5.1956), పెరిగింది, చదివింది (సామాన్య విద్యతో పాటు సాంకేతిక విద్య) మరియు నేను చేపట్టిన వృత్తి (సాంకేతిక విద్యల శిక్షణ) నిర్వహించింది - పార్వతీపురం (ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా) లో. నేను ప్రస్తుతం (6.12.2011 నుండి) ఉంటుంది - హైదరాబాద్ (తెలంగాణ) లో. ఇదే నా మొదటి నివాస స్థల మార్పిడి. ఇది అవసరంతో ముడిపడిన ఒక కొత్త అనుభూతి.