సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢిల్లీని చేరుకోవాలన్న ఆత్రంతో కూతవేసి వేగంగా పరుగుతీస్తుంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకున్నాయి. పగలంతా కూర్చుని కూర్చుని ప్రయాణం చేసిన ప్రయాణీకులు తిన్న తర్వాత బెర్త్‌లను దించేసి పడుకొని నిద్రలోకి జారుకున్నారు.
టి.సి. ఒకసారి హడావుడిగా అటూ ఇటూ తిరిగేసి చూసివెళ్ళి పోయేడు. రెస్ట్ తీసుకున్న టి.సి లేచాడు. తెల్లవారుఝామున నాలుగుగంటలు దాటుతుంది.
“ఎవరమ్మా? ఎవరు నువ్వు?”
“నిన్నే, మాట్లాడవేంటి? నీ బెర్త్ ఎక్కడ?”
“అసలు ఇక్కడ కూర్చున్నావేంటి?” టి.సి. స్వరం స్థాయి పెరిగింది.
నిద్రలో వున్న అభినవ్‌కు మెళుకువ వచ్చింది. లోయర్ బెర్త్‌పై ఉన్నాడేమో, మాటలు గట్టిగా చెవిని తాకాయి.
“ఇక్కడెందుకు పడుకున్నావ్? మాట్లాడు, ఇందాకట్నుంచీ కనపడలేదు, ఇప్పుడెక్కడ్నుంచి ఊడిపడ్డావ్?” టి.సి. అరుస్తూనే వున్నాడు. ప్రతిస్పందనేం వినపడటం లేదు. అభినవ్, పై బెర్త్ తలకు తగలకుండా కూర్చుంటూ చూశాడు ‘ఏం జరుగుతుంది?’ అని.
ఒక స్త్రీ తల మీదుగా కొంగు కప్పుకుంది, ముఖం పూర్తిగా కనబడటం లేదు. రెండు బెర్తుల మధ్యన కిటికీకి దగ్గరగా తలవాల్చి కూర్చుని వుంది. టి.సి. కి సమాధానం చెప్పకుండా కూర్చునే వుంది ఆమె.
“నీ టికెట్ చూపించు, నీ లగేజ్ ఏది?”
“లేదు” అంది నెమ్మదిగా.
“ఎంత ధైర్యంగా లేదని చెప్తున్నావ్? టికెట్, లగేజ్ రెండూ లేవా తల్లీ?” కోపంగా మారింది అతడి స్వరం.
“ఉన్నదే చెప్పాను. నాకు టికెట్, లగేజ్ లేవు సార్. “
“ఓహో! నా ఉద్యోగం ఊడగొట్టటానికి వచ్చేవనమాట. ” అభినవ్ కలుగజేసుకున్నాడు.
“టి.సి. సార్, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆవిడకు మాట్లాడే అవకాశం ఇవ్వండి” అన్నాడు అభినవ్.
“ఖరాఖండీగా టికెట్ లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు చెప్తుంది కదా. ఇంకేం వినాలి? వచ్చేది ఝాన్సీ స్టేషన్. అక్కడ దిగిపో, ఏదో ఆడదానివని వదిలేస్తున్నా.” అన్నాడు టి.సి.
ఆమె అలాగే మౌనంగా కూర్చుంది కదలకుండా. టి.సి వెళిపోయేక ఆమెవైపు చూశాడు అభినవ్.
“మీరు…ఇలా ఎందుకు…” సంశయంగా ఆగాడు. ఆమె నుండి స్పందన లేదు.
“ప్లీజ్, దయచేసి మాట్లాడండి, అతడు ట్రెయిన్‌లో నుంచి దింపేసేలోగా.”
ఆమె తల ఎత్తి అతడి వైపు చూసింది. తల మీది కొంగు వెనక్కు జారింది. డిమ్‌గా వున్న లైటు వెలుగులో స్పష్టంగా తెలియటం లేదుగాని, చదువు, సంస్కారం వున్న యువతిలాగే వుంది ఆమె.
“మీరు లేచి, ఇలా పైన సీట్లో కూర్చోండి” అంటూ బాగా చివరకు జరిగి కూర్చున్నాడు అతడు.
ఆమె నెమ్మదిగా లేచి కిటికీకి దగ్గరగా ఒదిగి కూర్చుంది.
“అసలు ఏమైంది?” అడిగేడు.
“ఏమీ కాకూడదనే కదులుతున్న ఈ ట్రెయిన్‌లో ఎక్కేయటం జరిగింది” అంది.
“మరి, టి.సి. నెక్స్ట్ స్టేషన్‌లో దిగిపొమ్మంటున్నాడు?” నిట్టూర్చింది ఆమె, “దిగిపోతాను” అంటూ.
“ఆ తర్వాత?”
“ఏమో, విధి ఎటు పొమ్మంటే అటు. అయినా ఇవన్నీ మీకెందుకు?”
“వీలైతే మీకు ఏమైనా హెల్ప్ చెయ్యగలనేమో అని”
“దేవుడే చెయ్యని సాయం ఒక మనిషి చేస్తాడా?” పేలవంగా నవ్వింది ఆమె.
“సాయంచేసే మనిషిని కలుపుతాడేమో!”
“నాది ఒక కథ. ముందు నేను వున్న పరిస్థితి నుంచి తప్పించుకోవాలని, వేటకుక్కల్లా వెంటాడి తరుముతున్న వాళ్ళ నుంచి తప్పించుకొని సికింద్రాబాద్‌లో ఫస్ట్ ఫ్లాట్‌ఫారమ్‌పై కదులుతున్న ఈ ట్రెయిన్ ఎక్కేసాను.
బాధ, ఆశ్చర్యం కూడా కలిగాయి అతడికి.
“మీరు నమ్మటం లేదు కదూ! అక్కడా, ఇక్కడా, టాయిలెట్లలోను దాక్కుంటూ గడిపా ఇంతవరకు. ఇందాకట్నుంచీ మీ బెర్త్ క్రిందే ఇరుక్కుని పడుకున్నాను. ఎవరో సూట్‌కేస్‌ను నెట్టారు బలంగా. ఇదిగో నుదుటిపై తగిలింది గాయం” అంటూ గాయం కనపడేలా ముఖం అతడి వైపుకు తిప్పింది. అక్కడ చిట్లి రక్తం గడ్డకట్టినట్టుంది.
అతడి మనసుకు బాధ కలిగింది, తనే ఆ సూట్‌కేస్‌ను నెట్టినందుకు.
“సారీ అండీ, ఏం చేద్దాం అనుకుంటున్నారు?” అడిగేడతడు.
“నాకు తెలిస్తేగా మీకు చెప్పటానికి. దారం వున్నంతవరకే గాలిపటం ఎగురగలిగేది. తెగేక, గాలి విసురుకు పోయి, ఏ కరెంట్ పోల్‌కో, ఏ చెట్టు కొమ్మకో తగులుకుంటుంది. గాలికి చినిగి, ఎండకు ఎండి, వానకు తడిసి, పోతుంది. నేనూ అంతే” అంది కళ్ళు ఒత్తుకుంటూ.
అతడి మనసు, ‘ఆమెకు తను ఏవిధంగా సాయపడగలడు?’ అని తల్లడిల్లుతుంది.
టి.సి. మళ్ళీ వచ్చేడు. “పద… పద, వస్తుంది స్టేషన్. ఖర్మకొద్దీ తగుల్తార్రా బాబూ…” అంటూ ఒకసారి అభినవ్ వైపు చూసేడు అతడు.
“క్రింద నుంచి సీట్లోకి ప్రమోట్ చేసేవా నాయనా?” అన్నాడు.
“ఇపుడు టికెట్టే ప్రాబ్లమ్ కదా?” అడిగేడు అభినవ్.
“మరి ఇంకేంటి ప్రాబ్లమ్, టిక్కెట్టే” ఒత్తిపలికేడు అతడు.
“ఎంత చెప్పండి?” అన్నాడు అభినవ్.
“ఏం? నువ్వు పే చేస్తావా?” అడిగేడతడు ఎగతాళిగా.
“చేస్తాను, ఎంతో చెప్పండి? పాపం ఆవిడ ఏ పరిస్థితిలో అలా నిరాధారంగా ట్రెయిన్ ఎక్కవలసివచ్చిందో! ఇంకా వెలుగు కూడా రాలేదు. ఊరు కానీ వూర్లో ఆమెకు కష్టం కదా!” అన్నాడు అభినవ్.
“సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ వరకు కట్టాలి. పే చేస్తావా?” సవాల్‌లా అడిగేడతడు.
“చెప్పండి ఎంతో” అంటూ పర్స్ తీసి అతడికి చెల్లిస్తున్న అభినవ్‌కు చెయ్యి అడ్డుపెట్టింది ఆమె.
“ప్లీజ్, మీరు పే చేయకండి. నేను స్టేషన్‌లో దిగిపోతాను” అంటూ.
“మీరేం ఫీల్ అవకండి. మీ దగ్గర వున్నపుడు వడ్డీతో సహా ఇచ్చేదురు గాని.” అన్నాడు అభినవ్.
ఆమె ముఖంలోకి అపుడు చూశాడు. ఆమె అలసిపోయినట్టుంది చెదిరిన జుట్టుతో, అలసిన కళ్ళతో.
అభి లేచి నిలబడుతూ “మీరు కాసేపు పడుకోండి, మళ్ళీ అందరూ లేస్తారు.” అన్నాడు.
మారు మాట్లాడకుండా బెర్త్‌పై ముడుచుకుపడుకుంది ఆమె. ఒక గంట ఒళ్ళుమరచి నిద్రపోయింది ఆమె. ట్రెయిన్ ఆగిన కుదుపుతో లేచింది ఆమె.
“ఝాన్సీ” అన్నాడు అతడు.
“అవునా, దిగిపోవాలిగా?” అంది కంగారుగా లేస్తూ.
“ఢిల్లీ వరకు దిగనక్కర్లేదు, టికెట్ వుందిగా” అన్నాడు చిన్నగా నవ్వుతూ.
“ఎక్కడ దిగినా ఒకటేనండి. నాకు పరిచయం వున్న ప్రాంతాలూ కాదు, వూర్లూ కావు ఇవి. ఎవ్వరూ పరిచయస్తులు లేని వూళ్ళు” అంటూ లేచింది ఆమె.
“మరి ఢిల్లీ వరకు వెళ్ళే అవకాశం వుండగా ఇక్కడెందుకు దిగటం?” అడిగేడతడు.
తిరిగి అన్నాడు “నేను ఢిల్లీకే వెళ్తున్నాను అని చెప్పెనుగా? నేను ఇపుడు కాస్త పరిచయం ఏర్పడిన వ్యక్తినేగా” అన్నాడు అతడు. ఆమె అలాగే చూస్తూ నిలబడింది.
“మీరు దయచేసి కూర్చోండి ఇలా” అన్నాడు. నెమ్మదిగా ముడుచుకుని కూర్చుంది. చలిగా వుంది, ఫిబ్రవరి నెల. అభినవ్ తన బ్యాగ్ తీసి ఓపెన్ చేసి ఒక షాల్ తీసి ఆమెకు ఇచ్చాడు. “ఇది కప్పుకోండి. ” అంటూ.
ఒకసారి అతని ముఖంలోకి చూసి అందుకుని, భుజాల పైనుంచి మెడ చుట్టూ కప్పుకుంది ఆమె. ట్రెయిన్ కదిలి స్టేషన్ దాటేక, అతడు లేచి బ్రష్, పేస్ట్ తీసుకుని “మీరూ రండి” అంటూ నడిచాడు. ఆమె అతడిని నెమ్మదిగా అనుసరించి వెళ్ళింది. టూత్ పేస్ట్ ఆమె వేలిపై వేసేడు.
ఇద్దరూ బ్రష్ చేసుకుని తిరిగి తమ సీట్ల దగ్గరకు వెళ్ళారు. అంతలో మధ్య బెర్త్‌పై వ్యక్తి, బెర్తును దించేసి కూర్చున్నాడు.
“మీరు ఏమీ అనుకోకుంటే ఆ సీట్ నాది, కూర్చోవచ్చా?” అని అడిగేడు అతడిని.
“ష్యూర్, వైనాట్” అంటూ లేచాడతడు.
విండో దగ్గర సీటు ఆమెకు ఇచ్చి, పక్కగా కూర్చున్నాడు అభినవ్.
“థాంక్యూ, మీ పేరు తెలియదుగా” అంది సంశయంగా.
“అభినవ్.. అభీ.”
“అభీగారూ, మీకు నేనెవరో తెలియదు, నా గురించి ఏమీ తెలియకుండానే ఇంత ఆదరణ చూపారు. నేను, నా చివరి శ్వాస వరకూ మీకు కృతజ్ఞురాలిగా వుంటాను. సాయంచేసే మనిషిని దేవుడే కలుపుతాడేమో అన్నారు మీరు. ఇంతమంది వ్యక్తులు, ఇన్ని బెర్త్‌లు వుండగా, నేను మీ బెర్త్ క్రిందే ఎందుకు దాక్కున్నాను? అవును దేవుడే కలిపాడు తనలాంటి వ్యక్తిని” అంది.
ఆమె కళ్ళలో తడి చూసి బాధనిపించింది అతడికి.
“ఇంత మాత్రానికేనా? ప్లీజ్ బాధపడకండి, దేవుడు కేవలం రక్తమాంసాలతోనే కాకుండా, మానవత్వం అనే ఒక అదృశ్య పదార్థంతో మానవజాతిని రూపొందించాడు. యుగాలు మారే కాలక్రమంలో మనుషులు రాక్షస ప్రవృత్తితో రూపాంతరం చెందారు. వారిలో దేవుడు భద్రపరిచిన మానవత్వం క్రమంగా ఎక్స్ పైరీ డేట్ వైపు పరుగు తీస్తుంది. కొందరైనా తోటి ప్రాణుల పట్ల మానవత్వాన్ని కనబరిస్తే, ఆ సృష్టికర్త మనసులో దిగులును తగ్గించినవాళ్ళం అవుతాం, ఆయన సృష్టిని గౌరవించిన వాళ్ళం అవుతాం. ఇది నా నైజం మిస్….” అంటూ ఆగేడతడు.
“నైమిశ” అంటూ చిన్నగా నవ్వింది ఆమె. అతడి ముఖంలో సర్ప్రైజ్ లాంటి భావం కనిపించింది ఆమెకు.
“నాకు మీ పేరు కొత్తగా అనిపించింది. అందుకే అలా చూసేను” అన్నాడు అతడు.
“అమ్మ పెట్టిన పేరు. ఆమెకు దైవభక్తి ఎక్కువ”.
“అది ఒక అరణ్యం పేరు అనుకుంటా?” అన్నాడు అతడు.
“అవును. రామాయణ, భారతాలలో కూడా ఈ పేరు వింటాం. ఎందరో దేవతలు, మహాఋషులు మసలిన అరణ్యం అది, అంతే తెలుసు నాకు. అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు” అంది.
ఆమె విండోలోంచి బయటకు చూస్తూ కూర్చుంది కాసేపు. బ్రేక్‌ఫాస్ట్ వస్తే తీస్కున్నాడు అతడు. ఒక ట్రే ఆమెకు ఇచ్చి, తనొకటి తీసుకున్నాడు. వాటర్ బాటిల్ పక్కన పెట్టాడు. “తినండి” అంటూ.
“మీరూ తినండి” అంటూ ఆమె తినటానికి ఉపక్రమించింది. ఇద్దరూ కాఫీ తాగుతుండగా, టి.సి అలా వెళిపోతూ ఒక్కక్షణం ఆగి ఇద్దరి వైపు చూసి వెళిపోయాడు. ‘ఢిల్లీ వరకు వెళ్ళేక ఏం చెయ్యాలి? అది తన ఆలోచనకు అందని విషయం’ ఆమె కళ్ళు మూసుకు చేర్లబడి కూర్చుంది సీట్లో
‘ఢిల్లీ వరకు తీస్కెళ్ళాక ఎలా? ఈ అమ్మాయి పరిస్థితి ఎలా?’అతడికి ఢిల్లీకి చేరువ అవుతున్న కొలదీ ఏదో ఒక సమస్య ముందున్న ఫీలింగ్ కలుగుతుంది మనసులో.
ట్రెయిన్‌లో అంతమంది వుండగా తన పరిచయం లోకే ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి? ఎన్నిసార్లో ట్రావెల్ చేశాడు, కాని ఇటువంటి పరిస్థితి ఈరోజే ఎదురైంది. అయినా ఆమె ఆ స్టేషన్‌లో దిగిపోతానంది, తనకే ‘పాపం’ అనిపించి ఆపాడు దిగకుండా. అలా ఆమెను వదిలేసి వుంటే, “ఆమె ఏమైందో? ఏ సమస్యలను ఎదుర్కొంటుందోనన్న బాధ కలిగేది మనసులో. అలా అని ఢిల్లీలో విడిచి పెట్టేయటం కూడా మానవత్వం కాదు. అలాచేస్తే తన మనసు, తనను ఎప్పటికీ క్షమించదు! కాని ఇది ఒక ఆలోచనతో, ఒక నిర్ణయంతో, ఒకరోజు లేక రెండ్రోజుల్లోనో సాల్వ్ అయిపోయే సమస్య కాదు కదా! అతడికి కళ్ళు మూతలు పడుతున్నాయి. కాసేపటికి ట్రెయిన్ ఎక్కువ శబ్దంతో కుదపటంతో కళ్ళు తెరిచాడు అభినవ్. అప్రయత్నంగా పక్కకు చూశాడు. అతడి గుండె స్పందన లయ తప్పినట్టైంది. ఆమె లేదు అతడి ఒక ఆందోళన మొదలైంది. ‘అయినా ట్రెయిన్ ఎక్కడా ఆగలేదుగా’ అనుకున్నాడు. లేవబోయిన అతడు ఆగిపోయాడు.
ఆమె నెమ్మదిగా వచ్చి కూర్చుంది, ముఖాన్ని కొంగుతో తుడుచుకుంటూ.
“వెళిపోయాను అనుకున్నారు కదూ?” అంది అతడి ముఖంలోకి చూస్తూ.
“అనుకోలేదు” అన్నాడు.
“నన్ను చూసిన మీ ముఖంలో ఒక రిలీఫ్ కనిపించింది. అందుకే అడిగేను”
“అటువంటి సంస్కారం అనుకోలేదు నేను”
“అర్థం కాలేదు” అంది నైమిశ.
“మోసం చేసే వ్యక్తిలా అనిపించలేదు”
“మోసమా!” ఆశ్చర్యంగా చూసింది ఆమె.
“అవును, చెప్పకుండా వెళిపోతే ఏమంటారు దాన్ని?” అన్నాడు.
“అలా చెయ్యను, కాని ఏం చెయ్యాలి అన్న ప్రశ్నకు, జవాబు దొరకటం లేదు, అభీగారూ” అంది దిగులుగా.
“ఆలోచిద్దాంలెండి, డోంట్ వర్రీ” అన్నాడు. ఒకే విషయానికి సంబంధించి, ఇద్దరి మనసులలో కూడా ఒక అలజడి!
******
ఢిల్లీ స్టేషన్ సమీపిస్తుంది. అభినవ్ లేచి బెర్త్ క్రింద వున్న సూట్‌కేస్‌ను బయటకు లాగేడు.
ఆమె నుదిటి పైన అయిన గాయాన్ని చూస్తూ, “సూట్‌కేస్‌ను నెట్టి మిమ్మల్ని గాయపరచిన దుర్మార్గుడిని నేనే.” అన్నాడు. తిరిగి “సారీ నైమిశా.” అన్నాడు.
ఆమె చేత్తో నుదుటిపై పాముకుంటూ “నొప్పి కొంచెం తగ్గిందిలెండి” అంది.
అతడు బ్యాగ్ కూడా తీసి సీట్‌పై పెట్టేడు.
“ఇంకో పావుగంటలో దిగాలి మనం” అన్నాడు.
“అవునా? మనమా?” అంది.
ఒక్కక్షణం ఆమె ముఖంలోకి చూసి చిన్నగా నవ్వేడు అతడు.
“ఇక్కడ దిగకపోతే ట్రెయిన్ ఒప్పుకోదనుకుంటా. అందరూ దిగవలసిందే.” అన్నాడు.
ఆమె ముఖంలో కూడా చిరునవ్వు కనిపించింది అతడికి.
“ఫస్ట్ లెట్ అజ్ గెట్ డౌన్.” అన్నాడు.
“ఓకే.”అంది.
ట్రెయిన్ ఆగింది. స్టేషన్ హడావుడిగా వుంది ప్రయాణీకులతో. అతడి చేతిలో బ్యాగ్ అందుకుంది నైమిశ. ఇద్దరూ దిగేరు. నెమ్మదిగా కొంచెం దూరంగా వున్న బెంచ్‌వైపు నడిచేడు అతడు. అతడు సూట్‌కేసు క్రింద పెట్టి, ఆమె చేతిలో బ్యాగ్ కూడా అందుకుని సూట్‌కేస్ పక్కన పెట్టాడు.
“కూర్చోండి ఒక్క క్షణం.” అన్నాడు అభినవ్. వెంటనే కూర్చుంది ఆమె. ఉదయం పదకొండు అవుతుంది. అతడు కూడా కూర్చున్నాడు.
“నన్ను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా?” అప్రయత్నంగా అడిగింది నైమిశ.
“రాంగ్” అన్నాడతడు. “ఏ విషయానికి సంబంధించి అయినాసరే ఏం చెయ్యాలి అని ఒక ప్లాన్ వేసుకోవటం నాకు అలవాటు” పది నిమిషాలు అయ్యేక “పదండి” అంటూ లేచాడతడు. ఇబ్బందిగా వుంది ఆమెకు. లేవకుండా చూస్తున్న నైమిశ వైపు చూస్తూ, “ఏంటి ఆలోచన!” అన్నాడు.
“మీకు ఒక భారంగా, ఒక సమస్యలాగా వున్నానని షేమ్ ఫీలవుతుంది నా మనసు అభీ గారూ” అంది.
“అబ్బా!” అంటూ కూర్చున్నాడు అతడు. “మనం అనుకోకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో ఒక కొత్త దారిలో అడుగుపెడుతున్నపుడు ఒక సంశయం, సందేహం, బాధ కలగటం అన్నది సహజమే నైమిశా! లేవండి, వెళ్దాం.” అన్నాడు.
ఒక్కక్షణం అతడి ముఖంలోకి చూసి చూపును మరల్చుకుంది ఆమె.
“నావల్ల మీకు మంచేగాని, హాని జరగదని మాటిస్తున్నాను” అన్నాడు. తిరిగి అన్నాడు, “తెలివిగా ఆలోచించండి. ఒంటరిగా, నిరాధారంగా ఒక అమ్మాయి,ఎలా,ఎలా చెప్పండి? అందరూ మనుషులే. కాని మానవత్వాన్ని ఎక్స్‌రే తీసి చూడగల టెక్నాలజీ కళ్ళకు లేదుగా. ఎవరు ఎవరో తెలియదు నాతో సహా. నేను గొప్పవాడిని అని అనను, కాని మంచోడినే.”
నైమిశ కళ్ళలో నీళ్ళు అతడిని కలవరపరచాయి. నైమిశ చటుక్కున లేచి, వంగి అతడి పాదాలను తాకి, చేతిని తలపై వుంచుకుంది. ఆమె చెయ్యి పట్టిలేపి, కంగారుగా చుట్టూ చూశాడు అభినవ్.
“ముందు ఇలా కూర్చోండి” అంటూ కూర్చోబెట్టేడు ఆమెను. కళ్ళు ఒత్తుకుంటూ “నేను ఎటువంటి దానినో తెలియకుండానే మీతో మీ ఇంటికి తీస్కెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని అనుమానిస్తే, నాకు క్షమార్హత వుండదు. నా వల్ల మీకు సమస్యలు ఎదురవుతాయేమోనని భయంగా వుంది”
“నైమిశా, మీ దగ్గర వేరే బెటర్ అయిడియా ఏదైనా వుందా? లేదు కదా, దయచేసి ముందు నేను చెప్పింది ఫాలో అయితే, తర్వాత మిగతావి ఆలోచించుకోవచ్చు” అన్నాడు లేచి నిలబడుతూ.
మారు మాట్లాడకుండా అతడి వెంట స్టేషన్ బయటకు నడిచింది నైమిశ.
అభినవ్ ఒక ఆటోరిక్షాను పిలిచేడు. అతడిలో హిందీలో మాట్లాడేసి “ఎక్కండి” అంటూ పక్కకు నిలబడ్డాడు. లగేజ్ సర్ది తనూ ఎక్కాడు. కొంత దూరం వెళ్ళేక ఆటో ఆపి, “దిగండి” అంటూ దిగాడు. ఆమె దిగి చుట్టూ చూస్తుంది. చుట్టూ అన్నీ రకరకాల షాపులే ఉన్నాయి. కొద్దిదూరంలో వున్న బట్టల దుకాణంలోకి తీస్కెళ్ళేడు. లగేజ్ ఒక పక్కగా పెట్టేడు.
“నైమిశా, మీకు కావలిసిన డ్రెస్‌లూ, చీరలూ కొన్ని తీసుకోండి. ఇంకా మీకు ఏమేమి అవసరం వుంటాయో అన్నీ తీసుకోండి. పక్కనే కాస్మెటిక్స్ కూడా వున్నాయి. కావాల్సినవి చూసి తీసుకోండి. ఇక్కడేం సీన్ చెయ్యకుండా ఒక అరడజను డ్రెస్‌లు, చీరలు తీసుకోండి. తర్వాత ఒకరోజు మళ్ళీ వద్దాం.” అన్నాడు అభినవ్. ఆమె మొహమాటంగా సెలెక్ట్ చేసుకుంటుంది. అభినవ్ అక్కడ డిస్‌ప్లేలో వున్న రెండు డ్రెస్‌లు సెలెక్ట్ చేశాడు “బాగున్నాయి కదూ” అంటూ.
“అవును” అని తీసుకుంది. టవెల్స్, కర్చీఫ్‌లూ తీసుకున్నాడు. పక్కషాపులో పౌడర్, స్టిక్కర్స్, కాటుక, సబ్బులు, దువ్వెన, టూత్‌బ్రష్, పేస్టులు వంటివి తీసుకున్నాడతడు.
“నైమిశా, నాకు తెలిసినవి ఇవి మాత్రమే. మీకు ఇంకేమి అవసరమో నాకు తెలియదు. ప్లీజ్, తీసుకోండి ఫర్వాలేదు” అన్నాడు. ఆమె పాదాలకు చెప్పులు లేవని అపుడు గమనించాడు అతడు.
ఆమె సైజు చెప్పులు చూపమని “కంఫర్ట్‌గా వున్నాయో లేదో చూసుకోండి” అన్నాడు.
తొందరగా ఒకటి తీసుకుంది. అన్నీ తీసుకున్నాక లగేజ్ అంతా పక్కకు సర్దిపెట్టి,
“ఇపుడే వస్తాం, ఇక్కడ వుంచవచ్చా?” అని అడిగేడు అభినవ్.
“ఓకే భాయీ సాబ్.” అన్నాడు షాప్ అతడు. ఆమె జుట్టు బాగా రేగి వుండటం చూసి, “కొంచెం తల చేత్తో సర్దుకోండి” అన్నాడు.
ఆమె చటుక్కున తల చేత్తో సర్దుకుని, క్లిప్ తీసి టైట్‌గా పెట్టుకుంది. లోలోపల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆమెకు. ట్రాఫిక్ రష్ గా వుంది. రోడ్ అవతలి వైపు ఉన్న హోటల్‌కు వెళ్ళాలి రోడ్ దాటి.
“రండి, నెమ్మదిగా నడుద్దాం” అంటూ నడవబోయిన అతడు ఆగి చూసేడు, వెనక్కు వుండిపోయిన నైమిశ వైపు.
“అభ్యంతరం లేకపోతే నా చెయ్యి పట్టుకు రావచ్చు.” అన్నాడు నెమ్మదిగా చెయ్యి అందిస్తూ. అతడి చెయ్యి పట్టుకుని నెమ్మదిగా దాటింది.
‘సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ మీల్స్’ అని బోర్డు వుంది హోటల్‌కు. వాష్ బేసిన్‌లో చేతులు కడుక్కుని కూర్చున్నారు. మీల్స్, చపాతి, కర్రీ, ఆర్డర్ చేశాడు అభినవ్.
“ఫుడ్ బాగానే వుందిగా” అన్నాడు అతడు తింటూ. చిన్నగా నవ్వింది నైమిశ.
“ఆకలి రుచి ఎరుగదు అంటారు. అలా వుంది నా పరిస్థితి.” అంటూ భోజనం ముగించి బయటకు వచ్చి మళ్లీ రోడ్డు దాటేరు. ఈసారి అతడు చెప్పకుండానే, అతడి చెయ్యి పట్టుకుంది నైమిశ.
లగేజ్ అంతా తీసుకుని ఆటో ఎక్కేరు. చాలా దూరం వెళ్ళేక ఆగింది ఆటో. ఆటోను పంపించేసి, లగేజ్ తీసుకుని లోపలకు నడిచేరు. ఒక పెద్ద ఆవరణలోకి గేటు వుంది. బిల్డింగ్ క్రింద ట్రావెల్స్ ఆఫీసులు అవీ వున్నాయి. బిల్డింగ్ వెనుక వైపునుంచి పైకి మెట్లున్నాయి.
మెట్లు ఎక్కి పైకి వెళ్ళేరు. బ్యాగ్ లో నుంచి కీస్ తీసి డోర్ ఓపెన్ చేసేడు అభినవ్. లోపలకు వెళ్లి,
“రండి నైమిశా” అన్నాడు అభినవ్. నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. చుట్టూ చూస్తున్న నైమిశకు,
“ఆ లోపలి రూమ్‌కు బాత్‌రూమ్ ఎటాచ్ అయి వుంది. వెళ్ళి కాస్త స్నానం చేసి రిఫ్రెష్ అయి రండి నైమిశా.” అన్నాడు.
“బెడ్‌రూమ్‌లో అల్మారాలో మీకు సంబంధించినవన్నీ సర్దుకోండి” అన్నాడు. ఒక చైర్ తీస్కెళ్ళి బయట వేసుకు కూర్చున్నాడు అతడు.
ముందు గదిలో ఒక సోఫా, రెండు మూడు చైర్‌లు, ఒక టేబుల్, గోడకు పెద్ద టీవీ, ఓ మూలగా ఫ్రిజ్ వున్నాయి. తన బ్యాగ్‌లు తీసుకుని లోపల గదిలోకి వెళ్ళింది. తలుపులు లేని ఒక పెద్ద అల్మరా వుంది గోడలోనే. ఒక అరలో అతడి బట్టలు వున్నాయి. ఆపై అరలో బుక్స్ అవీ వున్నాయి. క్రింద అరలో తను తెచ్చుకున్న డ్రెస్‌లు, చీరలు అవీ సర్దుకుంది. స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకుంది. తల దువ్వుకుని బయటకు వెళ్ళింది.
అభినవ్ ఒకసారి ఆమె వైపు చూసి, చూపును మరల్చుకున్నాడు.
“థాంక్యూ అభీగారూ! ఈ డ్రెస్‌లు అవీ లేకుంటే ఇబ్బంది అయ్యేది, థాంక్యూ సో మచ్.” అంది.
“వెల్‌కమ్ నైమిశా, అలా అనుకోవద్దు. ఇలా కలుస్తాం అని కలగనలేదు. ఏదో తోటి వ్యక్తిగా ఒక బాధ్యతగా చేసిన పని అది. నేను చెయ్యగలిగినది చేసేను అంతే” అన్నాడు అభినవ్.
“మీరు కూడా కాస్త స్నానం చెయ్యండి” అంది. అతడు లేచి వెళ్ళేడు.
నైమిశ ఇల్లంతా తిరిగి చూసింది. కిచెన్‌లో గ్యాస్ స్టౌ వుంది. డబ్బాలలో సరుకులు తక్కువ తక్కువగా వున్నాయి. తొందరగా ఇల్లంతా శుభ్రం చేసింది. స్టౌ, స్టౌ ప్లాట్‌ఫారమ్, కుర్చీలు, బల్లలు, సోఫా అన్నీ తుడిచి శుభ్రపరిచింది. టి.వి, లాప్‌టాప్, మౌస్ అన్నీ కూడా శుభ్రంగా తుడిచింది.
బయట డాబా కూడా చిమ్మి, కడిగేసింది. ఇక ఆపైన ఏం చెయ్యాలో ఆమెకు తెలియలేదు. రెండు, మూడు రోజులపాటు ఆమె పడిన కష్టాలకు, ఆమె శరీరం విశ్రాంతి తీసుకుంది. ఆదమరచి నిద్రపోయింది సోఫాలో.
మెళుకువ వచ్చేసరికి కనుచీకటిగా వుంది బయట. కంగారుగా లేచి కూర్చుంది. అభినవ్ లాప్‌టాప్‌లో ఏదో వర్క్ చేస్తున్నాడు. తల ఎత్తి చూసాడు.
“అలసట కొంచెం తీరిందా నైమిశా?” అడిగాడు చిరునవ్వుతో.
“ఊ” అంది తడబాటుగా.
“లోపల అల్మారాలో ఆయింట్మెంట్ వుంది, ఆ గాయానికి కొంచెం రాసుకుంటారా?” అన్నాడు.
“అలాగే” అంది కాని అక్కడే నిలబడి చూస్తుంటే,
“ఏం కావాలి నైమిశా?” అడిగేడతడు.
“కాఫీ గాని, టీ గాని చేస్తాను, కొంచెం పాలు, షుగర్, పౌడర్ తెప్పిస్తారా?”
“ఒక్క నిమిషం.” అంటూ సెల్ తీసి రింగ్ చేశాడు.
“రామ్‌ని పైకి రమ్మన్నానని చెప్పండి.” అని చెప్పేడు.
“నైమిశా, కిచెన్ లోకి ఇంకేమైనా కావలిస్తే చెప్పు, స్లిప్ రాసి ఇస్తాను” అన్నాడు.
“వంటకు అవసరమైనవి చెప్పమంటారా?” అంది సంశయంగా. ఆమె చెప్తుంటే హిందీలో రాసాడు.
“నాలుగు వెజిటబుల్స్ కూడా చెప్పండి” అనడంతో, అన్నీ రాసేడతడు. అంతలో ఓ పద్నాలుగు, పదిహేనేళ్ళ కుర్రోడు వచ్చాడు.
“సాబ్ కుచ్ కామ్ హై?” అంటూ.
అతడికి ఒక సంచి, డబ్బులు ఇచ్చాడు, రాసిన చీటీ ఇచ్చాడు.=
“వీధి చివర కిరాణా షాప్ లో తే. ” అని చెప్పాడు
అతడు లిస్ట్ చూసి ఇంకో సంచి కావాలి అన్నాడు.
“నైమిశా, ఇందాక డ్రెస్‌లతో ఇచ్చిన పెద్ద సంచీ ఒకటి తెచ్చి ఇయ్యి” చెప్పాడు అభినవ్.
రామ్, నైమిశ వైపు చూసి చిన్నగా నవ్వేడు “నిన్ను ఏమని పిలవాలి?” అంటూ.అభీ చెప్దాం అనుకునేలోపలే చెప్పింది నైమిశ “దీదీ అని పిలువు.” అని.
“ఒకే దీదీ.” అంటూ వెళిపోయాడతడు.
“ఇక్కడందరూ హిందీయే మాట్లాడతారు కదూ. నాకూ కొంచెం వచ్చు. కమ్యూనికేట్ చెయ్యగలంత.” అంది నైమిశ తనవైపే చూస్తున్న అభీతో.
“గుడ్, గెట్ ఆన్ అయిపోవచ్చ. ” అన్నాడు అతడు. ఒకసారి నైమిశ ముఖం వైపు చూసి, లేచి లోపలకు వెళ్ళాడు అతడు.
వేలుపై ఆయింట్‌మెంట్ తెచ్చాడు. చూస్తూనే “నేను రాసుకుంటాను” అంది నైమిశ.
నా వేలుకి అయిందిగా. ఫర్వాలేదు రాస్తా” అంటూ రాసి, వెళ్ళి చెయ్యి కడుక్కుని వచ్చాడు అభినవ్.
“నైమిశా, కాస్త ఫ్రీగా వుండు. హ్యాపీగా వుండు అని చెప్పలేను, ఎందుకంటే నీ సమస్య ఏంటో నాకు తెలియదు కదా” అన్నాడు ఆ ముఖంలోకి చూస్తూ.
“అలాగే. ఫ్రిజ్‌ను ఆన్ చేస్తే పనిచేస్తుందా?” అడిగింది.
“కొంచెం క్లీన్ చేసి ఆన్ చేస్తాను” అన్నాడు.
“నేను చెయ్య వచ్చా?” అడిగింది.
“వైనాట్?” అంటూ లేచి ఒక పాత క్లాత్ తెచ్చి ఇచ్చేడు చిన్నగా నవ్వుతూ.
ఒంటరిగా ఉండటం అలవాటైపోయిన అతడికి, ఇంట్లో నైమిశ పనులు చేస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే మనసులో ఒక గమ్మత్తైన ఫీలింగ్ కలిగింది.
లైఫ్‌లో ఒక తోడు వుంటే ఇలా వుంటుందా? అనిపించింది. మొన్న హైదరాబాద్‌లో నాన్న బాధపడలేక, పెళ్ళిచూపులు చూసిన అమ్మాయి నచ్చలేదు తనకు. నాన్నకు, అమ్మకు తనపై కోపం వచ్చింది. కాని వాళ్ళకు చెప్తే బాధపడతారని చెప్పలేదు,
“మీ పేరెంట్స్ మనతోనే ఉంటారా? జీతమెంత? లోన్‌లు ఏమైనా తీర్చాలా?” అని అడిగిందని.
అసలు అటువంటి మెంటాలిటీ భరించలేడు తను. రాజీపడి బ్రతకటం తన వల్ల కాదు అనుకున్నాడు.
రామ్ రెండు బ్యాగ్‌లు తెచ్చేడు. అతడు మిగిలిన చిల్లర ఇస్తుంటే, “నువ్వు తీసుకో రామ్, నీకు శాలరీ రేపిస్తాను” అని చెప్పాడు అభినవ్.
చూస్తున్న నైమిశతో “దీదీ బయ్.” అంటూ వెళిపోయేడు రామ్. ఆమె చెక చెక ఫ్రిజ్ క్లీన్ చేసి ఆన్ చేసింది. కూరగాయలు, పాలు, పెరుగు ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఫ్రిజ్‌లో పెట్టి, ఒక పాల ప్యాకెట్టు కట్ చేసి, గిన్నెలో పోసి స్టౌ మీద పెట్టింది. అల్మారాలో వున్న కప్పులు తీసి కడిగిపెట్టింది. బ్రూ తో కాఫీ కలిపింది. ఒక కప్పు తీసుకెళ్ళి “కాఫీ” అంటూ అభీ దగ్గర టేబుల్‌పై పెట్టింది.
“థాంక్యూ నైమిశా.” అంటూ కొంచెం సిప్ చేసి చూసి, “కాఫీ చాలా బాగుంది. నువ్వు కూడా తెచ్చుకో.” అని, “సారీ, మీరు కూడా” అన్నాడు. చిరునవ్వుతో చూసింది ఆమె,
“ఫర్వాలేదు అభీ గారూ, నువ్వు అన్నా ఫర్వాలేదు” అంది.
లోపలికి వెళ్ళి తన కప్పు తెచ్చుకొని కాస్త దూరంగా వున్న కుర్చీలో కూర్చుంది. కాఫీ పూర్తి చేసి, అతడి కప్పు కూడా తీసుకువెళిపోయింది.
“అభీగారూ, చాకు కనిపించటం లేదు వెజిటబుల్స్ కట్ చేయడానికి” అంది కిచెన్లో నుంచి.
అభినవ్ వెళ్ళి, కిచెన్ అల్మారాలో వెనక్కి వున్న చాకు, కత్తెర, పీలర్ తీసి స్టౌ పక్కన పెట్టాడు, “ఓకేనా?” అన్నాడు.
“ఊ.” అంది నైమిశ.
అభినవ్ ఒకసారి కిచెన్ నలువైపులా చూసి, ‘నీట్‌గా సర్దింది క్లీన్ చేసి.’అనుకున్నాడు.
అతను దృష్టిని వర్క్ మీద కాన్సెంట్రేట్ చేయలేకపోతున్నాడు. ల్యాప్‌టాప్‌ను క్లోజ్ చేసి వెళ్ళి బెడ్ పై పడుకున్నాడు. అతడికి మనసులో అలజడిగా వుంది. కలీగ్స్ తో కూడా మాట్లాడడు ఎక్కువగా.
‘ఇలా ఒక అపరిచితురాలితో కలిసి వుండవలసి వస్తుందని ఎన్నడూ వూహించలేదు. ఈ సమస్యకు పరిష్కారం,ముగింపు, ఎలా వుంటాయో వూహకు అందటం లేదు. నెమ్మదిగా ఆమె గురించి తెలుసుకోవాలి, అది అవసరం’ అనుకున్నాడు.
“అభీగారూ, డిన్నర్ రెడీ. మీరు చెప్పినపుడు పెడతాను” అని చెప్పి వెళ్ళిపోయింది నైమిశ. నెమ్మదిగా లేచి వెళ్ళాడు అభినవ్. ఆమె బయట నిలబడి ఆకాశంలో నెలవంకను, నక్షత్రాలను, తేలి వెళ్తున్న తెల్ల మబ్బులను చూస్తుంది.
“నైమిశా” నెమ్మదిగా పిలిచాడు. చూసింది వెనుతిరిగి.
“డిన్నర్ చేస్తారా?” అడిగింది.
“తిందాం రండి” అంటూ లోపలకు వెళ్ళాడు అతడు.
ఆమె టేబుల్ పై డిష్‌లు, ప్లేట్లు, వాటర్ బాటిల్స్ పెట్టింది. అతడికి ప్లేట్లో రైస్ పెట్టింది. కర్డ్ ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసింది.
“మీరు కూడా కూర్చోండి” అంటూ ప్లేట్లో రైస్ పెట్టాడు అతడు. అతడిని వారించి “నేను పెట్టుకుంటాను లెండి” అంది. మౌనంగానే భోజనం ముగించారు. న్యాప్‌కిన్‌తో చేతులు తుడుచుకుంటూ,
“ఫుడ్ బాగుంది నైమిశా, థాంక్స్” అన్నాడు.
“నేనేం చెప్పను? ఇంట్లో చోటిచ్చి, ఫుడ్ పెట్టినందుకు థాంక్స్ చెప్పనా?” అంటూ అతడికి ముఖం కనపడకుండా గిన్నెలు, ప్లేట్లు తీసుకుని కిచెన్ లోకి వెళిపోయింది. ఆమె చున్నీతో కళ్ళు ఒత్తుకోవటం అభినవ్ దృష్టిని దాటిపోలేదు.
గిన్నెలు, ప్లేట్లు కడుగుతున్న నైమిశకు మనసులో దుఃఖం నిండిపోయింది.
‘అతడి మంచితనాన్ని ఎన్నాళ్ళు భరించగలదు తను? ఇద్దరు అపరిచితులం కలిసి వుండటం! దేవుడే తనకు ఒక మార్గం చూపితే బాగుండును.’ అనుకుంది.
ఆమె వచ్చేవరకు ఏదో బుక్ తిరగేస్తూ కూర్చున్నాడు అతడు. వచ్చి చేతులు తుడుచుకుంటూ అతడి వైపు చూసింది. సోఫాలో ఒక దిండు, రగ్గు వున్నాయి. వెళ్ళి సోఫాలో కూర్చుంది నైమిశ, “నేను ఇక్కడ పడుకుంటాను” అంటూ.
“నో, అవి నా కోసం తెచ్చుకున్నాను. మీరు లోపల పడుకోండి కాట్‌పై” అన్నాడు అభినవ్.
“బెర్త్ క్రింద ముడుచుకు పడుకున్న దానికి కాట్ ఎందుకు అభీ గారూ? రోడ్డుపాలు కాకుండా నీడను ఇచ్చేరు నాకు. మీ ఉన్నతమైన ప్రవర్తన నా మనసులో మీ పట్ల ఆకాశమంత గౌరవాన్ని పెంచింది” అతడికి చేతులెత్తి దణ్ణం పెట్టి దుఃఖిస్తున్న ఆమె వైపు నిస్సహాయంగా చూశాడు, ఎలా ఓదార్చాలో తెలియక.
“ప్లీజ్ బాధపడకండి. ఇది దేవుడు ఏర్పాటు చేసిందే మీకు. నెమ్మదిగా ఆలోచిద్దాం ఏం చేద్దాం అని, వర్రీ అవ్వద్దు. ప్లీజ్ నా మనసు బాధపడుతుంది చూస్తుంటే.” అన్నాడు.
“నాకు ఏదైనా వర్క్ చూడగలరా?” అడిగింది నైమిశ.
“ప్రస్తుతం వర్క్ లోనేగా వుంటా. క్లీనింగ్, కుకింగ్, సర్వింగ్” అన్నాడు నవ్వేస్తూ. బలవంతంగా నవ్వింది, “జాబ్ ఏదైనా.” అంటూ.
“మీ క్వాలిఫికేషన్?” అన్నాడు
“నేను ఎంబీఏ కంప్లీట్ చేసేను. కాని నా దగ్గర సర్టిఫికెట్స్ ఏవీ లేవుగా” అంది దిగులుగా. తిరిగి అంది “ఉన్నా కూడా ఎక్కడా సరైన జాబ్ రాలేదు. ఏదో దొరికిన దానిలో టెంపరరీగా జాయిన్ అయ్యాను. అక్కడే నాకు ట్రబుల్ స్టార్ట్ అయింది” అంది.
అతడు ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూస్తూ లేచాడు.
“నాకు రేపూ, ఎల్లుండీ కూడా సెలవే, మాట్లాడుకుందాం. మీరు వెళ్ళి పడుకోండి” అన్నాడు.
“సరే” అంటూ ఆమె లేచి, “గుడ్ నైట్ అభీ గారూ” అంటూ గదిలోకి వెళిపోయింది.
“గుడ్ నైట్ నైమిశా” అంటూ బెడ్ రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చి సోఫాలో పడుకున్నాడు అతడు.
అతడికి ఎంతకూ నిద్ర పట్టడం లేదు. ‘పెండింగ్ వున్న వర్క్ అయినా పూర్తి చేద్దాం’ అనుకుంటూ లేచి ల్యాప్‌టాప్ ఆన్ చేసుకు కూర్చున్నాడు. చాలాసేపు చేసేక టైం చూసాడు, రెండున్నర అయింది. ‘ఇక పడుకుందాం’ అనుకుని లేచిన అతడికి, గదిలో నుంచి అస్పష్టమైన మాటలూ, శబ్దాలు చిన్నగా వినిపిస్తుంటే, అతని మనసు ఉలిక్కిపడింది. ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు అతడు. అంతలో కెవ్వుమని అరుపు వినిపించింది.
ఆత్రంగా డోర్ నెమ్మదిగా తెరిచి చూసాడు, నైమిశ మంచంపై కూర్చుని వుంది.
లైట్ స్విచ్ వెయ్యబోయిన అతడిని, నైమిశ పరుగున వచ్చి చుట్టేసుకుంది “కాపాడండి” అంటూ. ఆమె శరీరం గజగజ వణుకుతుంది. అతడు లైట్ వేశాడు అందుకుని.
“చంపేస్తున్నాడు, కాపాడండి” అంటూ అతడిని మరింత గట్టిగా పట్టుకుంది ఆమె. ఏడుస్తుంది బిగ్గరగా.
“నైమిశా!” ఆమె చేతులను విడిపించుకుంటూ బిగ్గరగా అరిచేడు అతడు. కళ్ళు తెరిచి అతడి ముఖంలోకి చూసి, పరుగున వెళ్ళిపోయి, మోకాళ్లపై తలపెట్టుకు కూర్చుంది.
అభినవ్ కు చాలా ఆందోళనగా వుంది మనసులో. ఆమెను సమీపించి, వీపుపై నెమ్మదిగా తట్టేడు అతడు.
“నైమిశా, తెలివిలోకి రా. నీకు కల వచ్చింది అంతే. నేనున్నాను, నీకు ఏం కాదు” అన్నాడు. ఆమె నెమ్మదిగా లేచి సర్దుకు కూర్చుంది. ఆయాస పడుతుంది.
వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు అభినవ్. అందుకుని గటకట తాగేసింది.
“కలవచ్చిందా?” అడిగేడు.
“ఊ.”అంది. లేచి వెళ్ళబోయిన అతడి చెయ్యి గట్టిగా పట్టుకుంది.
“ఒకత్తేనూ వుంటే నన్ను చంపేస్తారు.” ఆమె కళ్ళలో విపరీతమైన భయం. ఆమె శరీరం కంపిస్తుంది.
“పోనీ హాలులోకి రా” అంటూ మరో దుప్పటి, దిండు ఇచ్చాడు. అవి తీసుకుని హాలులో ఒక మూలగా పరుచుకు పడుకుంది. రగ్గు తీసుకెళ్ళి కప్పాడు అభినవ్.
నిట్టూరుస్తూ సోఫాలో కళ్ళు మూసుకు పడుకున్నాడు. అతడికి మనసు అల్లకల్లోలంగా వుంది. ఇది అస్సలు కలలో కూడా వూహించని పరిస్థితి. ‘ఇందువల్ల నాకు గాని, నైమిశకు గాని ఎటువంటి కష్టం, సమస్య ఎదురవ్వకుండా చూడు. నేను చెప్పక్కర్లేదు, ఇదంతా నీ రచనే కదా!” ప్రార్థించాడు అభీ. అలా నిద్ర వశం చేసుకుంది అతడిని.
******
తలుపుపై తడుతున్న శబ్దానికి మెళుకువ వచ్చింది అభినవ్‌కు. కిటికీలో నుంచి ఎండ పడుతుంది. ఉలికిపడి లేచాడు అతడు. నైమిశ లేదు. దుప్పటి, రగ్గు, దిండు కూడా లేవు. నెమ్మదిగా తలుపు తెరిచాడు, ఎదురుగా రామ్ వున్నాడు నవ్వుతూ.
“ఏమైనా తేవాలా? మార్కెట్‌కు వెళ్తున్నాను. దీదీని అడుగుదాం అని వచ్చేను” అన్నాడు.
“దీదీ స్నానం చేస్తుంది కాని, రెండు పాల ప్యాకెట్లు, నాలుగు వాటర్ బాటిల్స్ తీసుకురా.” లోపలకు వెళ్ళాడు బ్యాగ్, డబ్బులు తేవటానికి. బాత్రూంలో వాటర్ శబ్దం వస్తుంది. తొందరగా బయటకు వచ్చి తలుపులు దగ్గరగా లాగాడు. రామ్ వెళిపోయాడు. సంచీ, డబ్బులు తీసుకుని.
టీ.వీ ఆన్ చేసి చూసేడు, ఆన్ కాలేదు.
నీట్ గా తయారై, “గుడ్ మార్నింగ్ అభీ గారూ!” అంటూ వచ్చింది నైమిశ. ఒకసారి చిరునవ్వుతో ఆమె వైపు చూసి “గుడ్ మార్నింగ్” అన్నాడు.
“అవును అభీ గారూ, నేను లేచేసరికి ఈ గదిలో ఇదిగో ఇక్కడ పడుకుని వున్నాను, ఇక్కడకు ఎప్పుడు వచ్చేనూ?” అడిగింది నైమిశ.
అభినవ్‌కు గుండెజారిపోయినంత పనైంది. ‘అమ్మో! పైగా ఈ కళ కూడా వుందా?’ అనుకున్నాడు.
ఒక్కక్షణం ఆమె ముఖంలోకి చాలా సీరియస్ గా చూసేడు.
“ఒకసారి గుర్తుకు తెచ్చుకో రాత్రి ఏం చేసావో.” అన్నాడు
ఒక్కసారి పైకి కిందకు చూసి, “నాకు గుర్తులేదు నిజంగా. ఏమైంది చెప్పండి,, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేనా?” అడిగింది.
“నీకు తోడు అది కూడానా?” అన్నాడు బాధగా చూస్తూ.
“ఎవరు?” అంది చుట్టూ చూస్తూ.
“నీ మతిమరుపు తల్లీ.” అన్నాడు అలాగే ఆలోచిస్తున్నట్టు చూస్తుంది నైమిశ.
“రాత్రి ఎవరో వచ్చి చంపేస్తున్నారని గోల చేసావు కదా, అది కల అని నమ్మించేసరికి జీవితం మీద విరక్తి కలిగింది”
“అవునా? మరి ఇక్కడ ఎందుకు పడుకున్నాను?”
‘ఇంకొక్కసారి అలా అడిగావంటే చంపేస్తాను’ అని చర్రున రాబోయిన డైలాగ్ ను గొంతులోనే ఆపేసి అడిగాడు.
“అసలు ట్రెయిన్‌లో నీతో ఎవరూ లేరా? మర్చిపోయి ఇంత కథా నడిపేవా? నాకు డౌట్ గానే వుంది, ఇప్పుడు నామీద ఏ కిడ్నాప్ సెక్షనో బుక్ అవుద్దేమో!”
“లేదు, నేను పరుగున వచ్చి కదులుతున్న ట్రెయిన్‌లో ఎక్కేసాను”
“నాకు అనుమానంగా వుంది, ఎవరైనా నీకోసం వెతుక్కుంటున్నారేమోనని”
“లేదు అభీ గారూ! నాకోసం వెతుకుతున్నారు చంపేద్దామని.”
“నైమిశా, అది నిజమేనా? మరి రాత్రి అదే కలగా వచ్చిందా? ప్లీజ్… గుర్తు చేసుకో. నాకు ఇపుడు నిన్ను చూస్తుంటే భయంగా వుంది”
“ప్లీజ్, మాట్లాడకండి” అంటూ కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకుంది. అంతలో రామ్ తలుపుపై తట్టేడు.
వెళ్ళి తలుపు తీసి, “టేబుల్ పై పెట్టు వచ్చి.” అన్నాడు.
“దీదీ గుడ్ మార్నింగ్” అన్నాడు రామ్, సంచీ అక్కడ పెట్టి. కళ్ళు చటుక్కున తెరిచింది.
“వాడు ఎవరు? గుర్తున్నాడా?” అడిగేడు అభినవ్.
“రామ్ కదా, రామ్ గుడ్ మార్నింగ్” అంది.
‘అయితే పూర్తిగా ‘గజినీ’ కాదనమాట’ అనుకున్నాడు.
“రామ్ మళ్ళీ పిలుస్తాన్లే వెళ్ళు” అని తలుపులు మూసి వచ్చి కూర్చున్నాడు.
“నైమిశా, రాత్రి ‘భయపడకు నీకు కల వచ్చింది’ అని చెప్పేనా నేను?”
“అవును చెప్పేరు, గుర్తుంది” అంది.
“ఆ తర్వాత అక్కడ భయం, అని వచ్చి ఇక్కడ పడుకున్నావ్ గుర్తుందా?”
“అవును, మీరు దిండూ, దుప్పటీ ఇచ్చేరు. ఆ మూలన పడుకున్నాను కదూ” అంది
కొంచెం ప్రాణం కుదుటపడింది అభినవ్‌కు.
“మరి ఇక్కడ పడుకున్నాను ఏంటి అని ఎందుకు అడిగావ్ నన్ను?” కాస్త తీవ్రంగానే వుంది అతడి స్వరం. ఆమె ఉలిక్కిపడింది.
“నాకు అపుడు గుర్తులేకే అడిగేను. ఇపుడు నెమ్మదిగా నాకు జ్ఞాపకం వచ్చింది. కల, నిజం రెండూ మిక్స్ అయిపోయి కన్ఫ్యూజ్ అయ్యేను, నన్ను క్షమించండి”
“ఇంకేమి చేశావు? భయమేస్తే ఏం చేశావో గుర్తులేదా?”
“అభీని గట్టిగా పట్టుకున్నాను భయంతో. సారీ.” అంది బెరుకుగా.
“నా పేరేంటి?” అడిగేడు.
“అభీగారూ ప్లీజ్, అదంతా ఒక కన్ఫ్యూజన్‌లో అన్నాను, క్షమించండి. వేట కుక్కల్లా వెనుక నలుగురు తరుముతుంటే, ప్రాణభయంతో ఆ ట్రెయిన్ లోకి ఎక్కేశాను. కన్నుమూసినా, తెరిచినా అవే భయంకర దృశ్యాలు కళ్ళలో, క్షమించండి అభీ” అంది.
“క్షమించండి, అనడంతో అయిపోదు నైమిశా. నేను ఇంతవరకు నీ ఫ్యూచర్ గురించి వర్రీ అవుతున్నాను. కానీ ఒక్కసారిగా అడిగావు చూడు, నేను ఇక్కడ ఎప్పుడు పడుకున్నాను?’ అని, “దాంతో నా శ్వాస ఆగిపోయినంత పని అయింది.” అన్నాడు.
ఒక వాటర్ బాటిల్ ఓపెన్ చేసుకు తాగి బల్ల పై పెట్టాడు. అతడి వైపు భయంగా చూస్తూ, టేబుల్ పైన వున్న వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు కిచెన్ లోకి పట్టుకు వెళ్ళిపోయింది. వాటర్ బాటిల్స్ కడిగి ఫ్రిడ్జ్ లో పెట్టింది.
పాలు కాచి కాఫీ కలిపింది. రెండు కప్పులు ఒక ప్లేట్లో పెట్టి తెచ్చి టేబుల్ మీద పెట్టింది, “కాఫీ” అంటూ.
“రెండే తెచ్చావేంటి?” అడిగాడు.
అతడి ముఖంలోకి ఒకసారి చూసి, “మీకు ఒకటి, నాకు ఒకటి, అంతేగా?” అంది.
“మరి అభీకి ఇవ్వవా?” అడిగాడు.
“నాకు ఉన్న మతి కూడా పోగొట్టకండి. ప్లీజ్, “అంటూ దండం పెట్టింది.
“మీరే కదా అభీ!” అంటూ.
“ఇలా కూర్చో నైమిశా, నువ్వు చెప్పింది నిజమే కదా.”
“నాకు అబద్ధం ఆడటం రాదు. మా అమ్మ నేర్పిన మంచి గుణం అది.”
“ముందు కాఫీ తాగుదాం” అన్నాడు. తను తాగుతూ, “నువ్వు తీసుకో నైమిశా” అన్నాడు.
చిన్నగా నవ్వింది ఆమె, “నన్ను అండి అనకుండా నువ్వు అంటూ ఉంటే ఏదో హ్యాపీగానే ఉంది నాకు”
“నీకు హ్యాపీగానే ఉంది. నయమే, నేను ఇక్కడకు ఎలా వచ్చాను? అసలు నన్ను ఎందుకు తీసుకువచ్చావ్? అని అడగలేదు.” అన్నాడు.
“నాకు నిజంగానే, నేను చూసింది నిజమా, లేక కలా? తెలియని స్థితిలో మాట్లాడాను. మీకు ఇబ్బంది కలిగిస్తే
సారీ.” అంది.
“కలిగిస్తే అన్న డౌట్ లేదు ఇక్కడ. అంతా ఇబ్బందే కదా!” అన్నాడు.
“నేను వెళ్ళిపోతే మీ ఇబ్బంది కూడా పోతుంది కదా!”
“అలా అని కాదు, కానీ నాకు మళ్ళీ అటువంటి షాకింగ్ డైలాగ్స్ వినపడకుండా చూడు దయచేసి. ” అన్నాడు అభినవ్.
“అలాగే సారీ చెప్పాను కదా, ఏదో కావాలని చేసినట్లు అంటున్నారు.” అంటూ తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళిపోయింది ఆమె.
కాసేపు చూస్తూ కూర్చున్న అతడు ఉలిక్కిపడ్డాడు.
‘ఒకవేళ వెళ్ళిపోతుందా?’ అన్న ఆలోచనతో చతుక్కున లేచి బయటకు వెళ్ళాడు. చూస్తే ఎక్కడా లేదు. కంగారు వచ్చింది అతడికి, ‘తను అంత కటువుగా మాట్లాడకుండా వుండవలసింది.’ పశ్చాత్తాపం మొదలైంది.
కంగారుగా కిందకు మెట్లు దిగుతున్న అతడు ఆగి చూశాడు, “అభీ గారూ” అన్న పిలుపుతో.
పైన వాటర్ ట్యాంక్ పక్కన చిన్న ఫ్లాట్ ఫామ్ ఉంది. అక్కడ కూర్చుని వుంది ఆమె. దిగిన మెట్లు, మళ్లీ పైకి ఎక్కి వచ్చాడు అతడు. “నేను వెళ్ళిపోతాను అనుకున్నారా? చెప్పకుండా వెళ్లలేనుగా? అలా చేస్తే అది మోసం అన్నారుగా మీరు” అంటూ నిచ్చెన దిగి క్రిందకు వచ్చింది నైమిశ.
అమాయకమైన ఆమె మాటలకు చాలా బాధ కలిగింది అతడికి. ఆమె కళ్ళు ఏడ్చినట్టుగా ఎర్రగా వున్నాయి.
“సారీ నైమిశా. నిన్ను హార్ట్ చేశాను కదూ!” అన్నాడు అభినవ్.
మౌనంగా తల వూపింది.
“ఇంకెప్పుడు కోప్పడను, సారీ లోపలికి రా.” అంటూ ఆమె చేయి పట్టుకు లోపలికి తీసుకువెళ్లాడు అతడు.
ఆమె చేయి వదిలించుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది. కిచెన్ లోకి వెళ్ళింది.
“నైమిశా” పిలిచాడు అతడు.
వచ్చింది “టిఫిన్ ఏదైనా చేస్తాను”అంటూ.
“ఏం చేయద్దు, అని చెప్పడానికే పిలిచాను”
“అర్థం కాలేదు.” అంది. ఆమె కళ్ళు చాలా ఇన్నోసెంట్ గా వుంటాయి అని అప్పుడే గమనించాడు అతడు.
అతడు ఏం చెప్పకపోయేసరికి లోపలికు వెళ్ళి బకెట్ తో బట్టలు తెచ్చి బయట ఆరేస్తుంది. ముందురోజు విడిచిన అతడి ప్యాంటు, షర్టు, తన డ్రెస్, మంచం పై వున్న దుప్పటి ఆరేసింది. అతడి వైపు చూసింది. ఏదో చెప్పలేకపోతున్నాడేమో అనిపించింది ఆమెకు.
లోపలికి వెళ్లి కుర్చీలో కూర్చుంది. “ఏంటి చెప్పండి అభిగారూ, మీరు ఏం చెప్పినా నేను ఏమీ అనుకోను. వెళ్ళిపోమన్నా వెంటనే వెళ్ళిపోతాను. పర్వాలేదు. ఏదో ఓలా బతికేస్తాను.. బతకలేకపోతే…” ఆగింది ఆమె.
“ఊ…బ్రతకలేకపోతే…ఏంటి?” కంగారుగా అడిగాడు అతడు.
ఆకాశం వైపు చూపించింది, “వెళ్ళిపోతా” అంటూ.
అభికి గుండెల్లో పొడిచినంత బాధ కలిగింది.
నైమిశను సమీపించి, ఆమె తలపై చేయి వేసి నిమిరాడు అతడు.
“నిన్ను ఇంత దూరం తీసుకొస్తా….” అన్నాడు కానీ ఆ పైన అతడికి మాటలు రాలేదు. అతడి మనసు ఒక ఉద్వేగానికి లోనయ్యింది. అతడి కళ్ళు చమ్మగిల్లాయి.
“క్షమించు నైమిశ.” అంటూ సోఫాలో కూర్చున్నాడు.
గమనించిన నైమిశ, ఫ్రిజ్ లో నుంచి ఒక వాటర్ బాటిల్ తెచ్చి అతడికి ఇచ్చింది.
మౌనంగా అందుకుని తాగి “థ్యాంక్స్.” అన్నాడు.
కిచెన్ లోకి వెళ్లిన నైమిశ వెనుకే వెళ్ళాడు అతడు.
“నైమిశా, “ఏం కుక్ చేయకు, బయటకు వెళ్దాం.” అన్నాడు.
“ఇప్పుడెందుకు అభీ గారూ?” అడిగింది.
“నువ్వు అన్నావు, కళ్ళు తెరిచినా మూసినా నీకు అనుభవమైన భయంకర దృశ్యాలు కళ్ళల్లో కదలాడుతున్నాయని.”
“అవును, అదే నేను అనుభవిస్తున్న నరకం. రాత్రి కూడా అదే జరిగింది. అందుకే ఒక అయోమయ స్థితికి గురైంది నా మనసు.” ఆగింది నైమిశ.
“నైమిశా, ఆ భయంకర జ్ఞాపకాలు నీ కళ్ళల్లో నుంచి, మనసులో నుంచి పోవాలి. బయట అందమైన రంగుల ప్రపంచం వుంది. అది మన దగ్గర కు రాదు, మనమే వెతుక్కుని వెళ్ళాలి. అప్పుడు మన జీవితాలు కూడా అందమైన రంగులను, సంతోషాలను నింపుకుంటాయి. అందరికీ ఉంటాయి సమస్యలు, దేవుడు ఏదో ఒక పరిష్కారం అందిస్తాడు. అంతవరకు వేచి చూడాలే గాని చనిపోయి, సృష్టించిన ఆ పైవాడిని మోసం చేయకూడదు.”
“ఊ” అంది, ఆమె చున్నీతో కళ్ళు ఒత్తుకుంటూ లోపలకు వెళ్ళింది. అభి, ‘బాగుంది,’ అని సెలెక్ట్ చేసిన పింక్ డ్రెస్ వేసుకుంది. హెయిర్ కు క్లిప్ పెట్టుకుంది. అభి కూడా తొందరగా తయారై, వచ్చేసాడు. నైమిశా చేతిలో చిన్న వెల్వెట్ పర్సు ఉంది. ఆమెలో వచ్చిన మార్పును గమనించిన అభినవ్, ఏదో ఒకటి మాట్లాడాలని, “నీ చేతిలో అదేంటి నైమిశా?” అని అడిగాడు.
“నేను అత్యంత విలువైనదిగా భావించే మా అమ్మ పర్స్ ఇది” అంది. “గుడ్,” అంటూ “నైమిశా, ఒక వాటర్ బాటిల్ తీసుకురా” అన్నాడు. చిన్న పాలిథిన్ కవర్లో పెట్టి తెచ్చింది బాటిల్. డోర్ లాక్ చేస్తూ, “గ్యాస్ సిలిండర్ క్యాప్ క్లోజ్ చేసావా?” అడిగాడు. మూస్తున్న తలుపును నెట్టుకొని, పరుగున వెళ్లి వచ్చింది. “కట్టేశాను, అడిగితే డౌట్ అంతే.” అంది. కింద కాంపౌండ్ లో ఉన్న బైక్ పై కవర్ తీసి, గోడపై పెట్టి, స్టార్ట్ చేశాడు అతడు. కింద ఆఫీసులో ఉన్న వ్యక్తులు ఒకసారి అభి, నైమిశల వైపు చూసి తిరిగి తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
“నేను గేటు బయట ఎక్కుతాను,” అంటూ గేటు బయటకు వెళ్లి నిలబడింది. “మనం ఆటో లాంటి దాంట్లో వెళ్లకూడదా? కోప్పడకుండా చెప్పండి.” అతడి నుంచి చూపును మరల్చుకుంటూ అడిగింది
పెద్దగా నిట్టూర్చాడు అభినవ్. “ఆటో లాంటిది ఎక్కి, ఊరంతా తిరిగితే చాలా అవుతుంది.” అన్నాడు.
బైక్ ఎక్కటానికి ఇబ్బంది పడుతున్న నైమిశతో, “నైమిశా, ప్లీజ్ ఇక్కడ సీన్ చేయకుండా, ఎక్కు. దయచేసి,” అన్నాడు. ఒకసారి అతడి ముఖంలోకి చూసి, ఎక్కి కూర్చుంది.
అతడికి మనసులో చికాకు కలిగినా ‘కూల్… కూల్ ‘ అనుకున్నాడు.”
చాలా దూరం వెళ్ళాక, బైక్ ఆపాడతాడు. ” నైమిశా, దిగు.” అన్నాడు. బైక్ ను పార్కింగ్‌లో పెట్టి వచ్చాడు అతడు.
“ఏంటి? అసలు పరిసరాలు చూడవా?” అడిగాడు అభినవ్ నవ్వుతూ.
తిరిగి చూసిన నైమిశ “వావ్! అభి గారూ, కుతుబ్ మీనార్.” అంది ఎక్సయిటింగ్ గా.
“టికెట్స్ తీసుకుంటాను,రా నైమిశా ” అంటూ టికెట్ కౌంటర్ దగ్గరకు నడిచాడతడు.
కొంచెం దూరంలో నిలబడి చూస్తుంది. ‘చాలా మంచి వ్యక్తి, కానీ కోపం, చికాకు కూడా ఎక్కువే. ఇంతకూ తన భవిష్యత్తు ఏంటో అర్థం కావటం లేదు.’ అనుకుంది. “ఏంటి, పరధ్యానం? ఏం ఆలోచిస్తున్నావ్? రెండుసార్లు పిలిచేను,” అన్నాడు అభి. ఉలిక్కిపాటుగా చూసి, అతడి వెంట వెళ్ళింది.
“నైమిశా, చూడు! సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్లు ఎత్తు ఉంది ఇది.. ఇంతకుముందు లోపల మెట్లు ఎక్కి టాప్ వరకు వెళ్ళనిచ్చేవారు. 1981లో తొక్కిసలాట జరిగి, చాలామంది చనిపోయారు. అప్పటినుంచి, చుట్టూ తిరిగి చూడడం మాత్రమే. చాలా కాలం క్రితం, పిడుగులు కూడా పడి, టాప్ లో ఉన్న అంతస్తులు దెబ్బతిన్నాయట. అవి మళ్ళీ మరమ్మత్తు చేశారు, కానీ వాటి నిర్మాణం డిఫరెంట్‌గా వుంటుంది. చూడు.” చెప్పాడు అభినవ్.
తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న నైమిశ కళ్ళముందు చెయ్యి అటూ ఇటూ ఊపాడు. “ఎక్కడ ఉంది ఆలోచన? అన్నీ మర్చిపోయి, ఎంజాయ్ చేసి సంతోషంగా నువ్వు వుండాలని నా ప్రయత్నం. సక్సెస్ అయ్యేలా చూడు.” అన్నాడు.
“మీరు గైడ్ లా అన్ని చెప్తూ ఉంటే, సర్ ప్రైజ్! అంతే.” అంది.
“గైడ్ సినిమా చూసావా?” అడిగాడు.
“రెండుసార్లు చూశాను, నాకు ఇష్టం. ఆ సినిమా లో పాటలు కూడా కొన్ని చాలా ఇష్టం నాకు. కొన్ని సినిమాలు మళ్ళీ చూడాలనిపిస్తుంది, కదూ?” అంది. అన్నాక, మాటల్లో స్పీడు తగ్గించి, అతడి వైపు బెరుకుగా చూసింది.
“పర్వాలేదు, నైమిశా. అలా వుంటేనే బాగుంటుంది. అలా వుండు, యాక్టివ్‌గా,” అన్నాడు.
కుతుబ్ మీనార్ చూసేసరికి ఎండ ఎక్కువైంది. “మనం ఏమి తినలేదుగా? ఏమైనా తిందామా?” అంటూ దగ్గరలో వున్న ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు.
“ఏం తింటావు? నైమిశా ” అన్నాడు. మెనూ కార్డు ను టేబుల్ పైన ఆమె ముందుకు జరుపుతూ, “మీకు నచ్చింది ఆర్డర్ ఇచ్చేయండి,” అంది.
దోశలు తిన్నారు. “ఇంకేం చెప్పను,” అని చూస్తున్న అభినవ్ తో, “ఇక నేను ఏమి తినలేను, మీరు తినండి” అంది.
“నాకూ తినాలి అనిపించటం లేదు,” అన్నాడు. కాఫీ తాగి, బయటకు వచ్చారు.
అతడు బైక్ స్టార్ట్ చేస్తుంటే, “ఇంటికేనా?” అంది.
ఒకసారి ఆమె ముఖంలోకి చూసి, “ఎక్కాలి,” అన్నాడు. ఎక్కి కూర్చుంది.
“కాసేపు ఎక్కడైనా కూర్చుందాం,అని నా ప్రయత్నం” అన్నాడు.
పార్కు దగ్గర బైక్ ఆపుతూ, రకరకాల పూల మొక్కలతో, నీడలు పరిచిన ఎత్తైన వృక్షాలతో కళకళలాడుతుంది పార్క్. “రా నైమిశా ” అంటూ పార్కులోకి నడిచాడు అభినవ్. అతడిని అనుసరించి నడుస్తుంది నైమిశ. ఒకచోట నీడలో వున్న బెంచ్ పై “కూర్చుందామా?” అంటూ కూర్చున్నాడు అతడు.
“ఊ! అంటూ కూర్చుంది. ఓచివరకు!
“నైమిశా, ఏమి ఆలోచిస్తున్నావు?” అడిగాడు అతడు. ” ఏం లేదు. ఇలా తీసుకువచ్చి నా మనసులో ఉన్న దిగులును, భయాన్ని పోగొట్టాలి అనుకుంటున్నారు. నాకు అవసరమైనవి అన్నీ మీరు ఊహించుకొని కొనిపెట్టారు. నా పట్ల ఒక కన్సర్న్ తో ఉన్నారు.”
“తప్పా?” అడిగాడు అభినవ్.
“కాదు, కానీ ఇంతవరకు నా జీవితంలో తిన్నానో లేదో చూడటానికి కానీ కనుక్కోవటానికి, నా కన్నీళ్లు తుడవడానికి కానీ ఎవరూ లేరు.”
“నైమిశా, ముందు ఆ దుఃఖాన్ని నీ మనసులోంచి తరిమికొట్టు. గతాన్ని సమాధి చేయి, వర్తమానంలో సంతోషాన్ని నింపుకోవటానికి ప్రయత్నించు.”
“భవిష్యత్తు కనిపించటం లేదు,” అంది.
“భవిష్యత్తు అదే కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తుంటే, నేను ఉన్నాను గా. ఏదైనా ఉద్యోగం చూస్తాను. అవసరం అయిన, సాయం అంతా చేస్తాను. సరే, కానీ హైదరాబాద్ లో ఎక్కడ ఉండే దానివి?”
“మణికొండ, అక్కడ ఒక కోటీశ్వరుడి భార్యకు అనారోగ్యంగా వుంటే, నన్ను అసిస్టెన్స్ కు పెట్టుకున్నారు.”
“ఎవరు వాళ్ళు?” అడిగాడు.
“రాజకీయ నాయకుడు వాడు. వాళ్ళదే ప్రభుత్వం.”
“పేరు గుర్తులేదా?”
“ఉంది, జయవర్ధన్, దుర్మార్గుడు”
“పోనీయ్ వూరికే అడిగాను,” అంటూ సెల్ తీసి, కాసేపు నోట్ చేసుకున్నాడు అతడు.
“నైమిశా, నిన్ను తరిమిన వాళ్ళు ఎవరు? ఎందుకు? చెప్తావా ఉన్నది ఉన్నట్టు?” అడిగాడు అతడు.
ఒకసారి అతడి ముఖం లోకి చూసింది.
“నాకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు, చెప్తాను.” అంది.
తిరిగి “ఈ వెల్వెట్ పర్సులో అమ్మ రాసిన ఉత్తరం వల్లే నాకు విషయాలు తెలిశాయి. అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని, అంటే మా నాన్నను, తాతయ్య మేనమామ హత్య చేశారు. అమ్మ చాలా కాలం అంటే నా స్కూల్ చదువు పూర్తి అయ్యే టైంలో, అమ్మను నన్ను వెతికి పట్టుకొని తీసుకొనిపోయేరు. అమ్మ అనారోగ్యంతో చనిపోయాక, నన్ను తాతయ్య ఇంట్లో పని మనిషిని చేశారు . ఆ తర్వాత మా మామయ్య తీసుకెళ్లి, ఆ రాజకీయ నాయకుడు ఇంట్లో అతడి భార్యకు అటెండెన్ట్ గా వుంచాడు. ఆమె చాలా మంచిది. ప్రైవేట్ గా చదువుకోవడానికి చాలా సాయం చేసింది ఆవిడ. వాళ్ళ ఇంటికి తరచూ వేరే దేశాల వ్యక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళ మీటింగులు ఎక్కువగా అర్ధరాత్రే జరిగేవి . ఒకరోజు ఆవిడ నిద్రపోయాక, నన్ను బలవంతం గా తీసుకు వెళ్లి ఒక కుక్కల బండి లాంటి దాంట్లో పడేశారు. అందులో మరో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు. కొంత దూరం ప్రయాణం చేశాక, ఒకచోట ఆపేరు. మేము ఆరుగురం ముందే చెప్పుకున్నాం. వాళ్ళు డోర్… ఎందుకు తెరిచినా పారిపోదాం, ఎటాక్ ఇచ్చి,అని.
“వాళ్ళు మాట్లాడుకుంటుంటే అర్థమైంది, మమ్మల్ని షిప్ ఎక్కించి పంపించేస్తారని. ఒక దాబా లాంటిచోట ఆపేరు. వాళ్లు ఫుల్‌గా తిని తాగి వచ్చి, డోర్ తీసేరు. వాటర్ బాటిల్స్, ఏదో తిండిపొట్లాలు కుక్కలకు వేసినట్టు విసిరేసారు. ఎవరం దిగలేకపోయామ్. అందులో ఒకడు నా చెయ్యి పట్టుకు కిందకు లాగేసి , ఎటో తీసుకెళ్తున్నాడు. నాకు అర్థమైంది, అదంతా చీకటి, తుప్పలు. వాడు నాకు ఎటాక్ ఇవ్వబోయేడు. నాకు చేతికి పెద్ద కొండరాయి దొరికింది. దాంతో వాడిని క్రూరంగా కొట్టాను. దుమ్ము కళ్ళల్లోకి చల్లి, పరుగు మొదలు పెట్టాను. ఆ పరుగు ట్రైన్ ఎక్కే వరకు ఆపలేదు నేను, నాకు వాళ్ళ వివరాలు తెలుస్తాయని, నేను కనపడగానే చంపేయాలని వాళ్ళు చెప్పుకోవడం విన్నాను. తీసేసిన గూడ్స్ పెట్టె లో దాక్కున్నాను. మొదటి ఫ్లాట్ ఫామ్ మీదకే వచ్చిన, ట్రైన్ ఎక్కేసాను. నేను , టాయిలెట్ లో నీళ్లు తాగి ప్రాణం నిలుపు కున్నాను.” రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్న ఆమెకు సంచిలో వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు.
“నైమిశా, ఈ క్షణం నుంచి నువ్వు కన్నీళ్లు కార్చడం నేను చూడకూడదు. ధైర్యంగా ఉండు. నేను ఉన్నాను, భయపడకు,” ముఖం కడుక్కొని, కొంచెం వాటర్ తాగు, “ఇంటికి వెళ్దాం,” చెప్పాడతడు.
కర్చీఫ్ తీసి ఇచ్చాడు. ముఖం తుడుచుకోమని.
నైమిశ చెప్పిన విషయాలకు అతడి మనసు ఎంతో క్షోభకు గురైంది.
“నైమిశా లే వెళ్దాం, నాకు ఫీవరిష్ గా ఉంది,” అంటూ లేచాడు అతడు. భారమైన మనసుతో, ఇద్దరూ ఇంటికి చేరేవరకు మాట్లాడుకోలేదు. అతడు వెళ్తూనే, కాళ్లు, చేతులు కడుక్కొని పడుకున్నాడు.
“అభీ గారూ, అల్మారా లో డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్లు ఉన్నాయిగా. ఇస్తాను, వేసుకోండి.” చెప్పింది.
“నన్ను డిస్టర్బ్ చేయకు, ప్లీజ్,” అంటూ అటు తిరిగి పడుకున్నాడు అతడు.
కాసేపు సోఫాలో పడుకుంది. నిద్రలోకి జారుకుంది, ఉలిక్కిపడి లేచింది. తొందరగా బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. అతడు అలాగే పడుకుని వున్నాడు. నుదిటి పై చేయి పెట్టి చూసింది. చాలా ఎక్కువ వేడిగా వుంది.
అభీ గారు, అభీ గారు,” అంటూ పిలిచింది. అతడి నుంచి స్పందన ఏం లేదు. కర్చీఫ్ తడిపి నుదుటి పై వేసింది. అది పొడిగా అయిపోయింది. కంగారుగా వుంది నైమిశకు. ఒక టాబ్లెట్, అందేలా గ్లాసుతో నీళ్లు పెట్టింది ఒక కుర్చీలో.
“లేచి టాబ్లెట్ వేసుకోండి,, ప్లీజ్. జ్వరం ఎక్కువగా వుంది.
“నన్ను పడుకోనియ్యి, నువ్వు వెళ్ళు,” విసుగ్గా అన్నాడు.
గ్లాసు లో, నీళ్లు కొద్దిగా ముఖం పై చల్లింది. కళ్ళు తెరిచి, “ఎందుకు నీళ్లు చల్లేవ్? ఏది ఆ టాబ్లెట్ ఇయ్యి.” అని నోట్లో వేస్తే మింగాడు. మళ్లీ పడుకున్నాడు. కాసేపు అలాగే చూసి, మంచానికి కాళ్ల వైపున నేల మీద ఒక దుప్పటి పరుచుకుని పడుకుంది.
‘పాపం జ్వరం ఎందుకు వచ్చిందో! తను వుంది కనుక టాబ్లెట్ ఇచ్చింది. లేకుంటే మంచినీళ్లు కూడా ఎవరిస్తారు అతడికి?’బాధనిపిస్తుంది ఆమెకు.
అతడు మూలుగుతున్నాడు. కంగారుగా లేచింది నైమిశ అతడి నుడిటి పై చెమటలు పడుతున్నాయి. చెయ్యి వేసి చూసింది. చల్లగా వుంది. అతడు ఏమో ఆస్పష్టంగా అంటున్నాడు. తొందరగా వెళ్ళి ఫ్రిజ్ లో పాల ప్యాకెట్ తీసి కాఫీ కలిపింది. కప్పుతో కష్టం అని ఒక గ్లాసులో పోసుకొని తీసుకువెళ్లింది కాఫీ.
“అభి గారు, కాఫీ తాగండి.” అంటూ లేపింది. పలకలేదు. మెడ క్రింద చేయి వేసి పైకి ఎత్తి, అతని తలను తనకు ఆనించి,”కాఫీ తాగండి.” అంటూ కొంచెం కొంచెం పట్టించింది.
అతడి చేతికి దొరికిన ఆమె చున్నీతో మూతిని తుడి చేసుకొని, క్రిందకు జారి ఆమె ఒళ్ళో తల పెట్టుకు పడుకున్నాడు.అలాగే కదలకుండా, కూర్చుంది.
‘తన మనసు, ఒక ఉత్తమ సంస్కారం గల వ్యక్తిగా అతడికి గుడి కట్టుకుంది. అంతేగాని, అతడి జీవితంలో చోటు కోసం ఆశపడటం లేదు. తనకు కొద్ది రోజులైనా అతడి నీడన జీవించే అదృష్టం కలిగినందుకు సంతోషించాలా, లేక ఆ తర్వాత అతడికి దూరంగా వెళ్లవలసి వచ్చినప్పుడు మనసుకు తగిలే గాయాన్ని తలుచుకొని విలపించాలా? ఆమె కళ్ళు నిండి, రెండు నీటి బొట్లు అతడి నుదుటి పై పడ్డాయి. ఆ స్పర్శకు, అతడు స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచాడు.
తను ఎక్కడ పడుకున్నాడో చూసుకున్న అతడి మనసు ఉలిక్కిపడింది.
అభినవ్ కంగారుగా ఒక్క ఉదుటున లేచాడు.
నైమిశ అతడికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చింది. తాగుతూ ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళల్లో తడి అతడి దృష్టిని దాటిపోలేదు.
అభినవ్ బాత్రూమ్ లోకి వెళ్ళివచ్చి టవల్ తో ముఖం తుడుచుకుంటూ, “నైమిశా నువ్వు పడుకోలేదా?” అడిగాడుతడబడుతూ.
“బాగా చెమటలు పట్టేసి ఒళ్ళు చాలా చల్లగా వుంది. మీకు లేపి కాఫీ తాగించాను. నిద్రలోనే తాగారు. ఆ నిద్రలోనే అలా పడుకున్నారు. లేపి పడుకోబెడితే నిద్ర లేచిపోతారేమోనని…కదలకుండా అలాగే కూర్చున్నా. సారీ అభి గారు. ” అంటూ వెళ్లిపోయి తన పక్క మీద పడుకుంది. “మీరు కూడా పడుకోండి.” అంది మళ్ళీ లేచి, “అలాగే,” అన్నాడు.
అతడి మనసులో అలజడిగా వుంది. ‘తను అంత ఒళ్ళు తెలియకుండా ఎలా పడుకున్నాడు అలా?’
‘పాపం ఎదురు తనకు సారీ చెప్పింది.’ అనుకున్నాడు.
**********
నైమిశ లేచి పనులు చేస్తుంది, కానీ ఆమె మనసులో ఎన్నడూ లేని ఒక సంభ్రమం! అతడు స్పృహలో లేకే తన ఒడిలో తల పెట్టుకున్నా గాని, ఆమె మనసు అతడి స్పర్శతో తను ఎన్నడూ తెలియని ఒక అనుభూతికి లోనైంది.
అభినవ్ ఆమె ప్రవర్తనలో ఒక మార్పును గుర్తించాడు. తనకు కాస్త దూరంగా డిస్టెన్స్ ను మెయిన్ టెయిన్ చేస్తుంది అనిపించింది అతడికి.
“నైమిశా!”నెమ్మదిగా పిలిచాడు.
‘”మీకు ఎలా వుంది? తగ్గిందా?”అడిగింది.
“బాగా తగ్గింది.” అన్నాడు.
కిచెన్ లోకి వెళ్ళి ఒక కప్పుతో కాఫీ తెచ్చి అతడికి ఇచ్చింది.
“కాఫీ, ” అంటూ,
“నీ కాఫీ ఏది? ” అడిగాడు అతడు.
“నేను తర్వాత తాగుతాను” అంది.
“ఇలా రా నైమిశా” అన్న అతడి పిలుపుతో ఆగి చూసింది.
“ఇక్కడకు రావా?” నెమ్మదిగా వచ్చి నిలబడింది
“చెప్పండి.” అంటూ.
“నా మీద కోపం వచ్చిందా?” అడిగేడు ఆమె ముఖంలోకి చూస్తూ.
“అదేం లేదు, కోపం ఎందుకు?” అంటూ వెళ్ళబోయిన ఆమెను
“ప్లీజ్, నా మాట విను కాస్త, జ్వరంలో తెలియక అలా పడుకున్నానేమో! అందుకు నన్ను క్షమించు.” అన్నాడు అతడు.
“మిమ్మల్ని క్షమించటమా నేను?” అంది అతడి నుంచి చూపును మరల్చుకుంటూ. తిరిగి అంది ” అసలు నేను అలా అనుకోవటం లేదు. నాకు తెల్సు మీకు ఎంత టెంపరేచర్ వచ్చిందో” అంటూ లోపల గదిలోకి వెళిపోయింది.
బెడ్ పై దుప్పటి, పిల్లో కవర్లు తీసేసింది. ఆల్మరాలో నుంచి వేరేవి వేద్దాం అని తీస్తుండగా అభినవ్ వచ్చేడు.
“కాఫీ కూడా తాగకుండా ఈ పనులు అవసరమా నైమిశా?”
ఉలికిపడి చూసింది. అతడి చేతిలో కాఫీ కప్పు ఉంది.
“కాఫీ తాగు ముందు” అంటూ కప్పు అందించాడు ఆమెకు. ఆమె వేళ్ళు కంపించటం గమనించిన అతడు నెమ్మదిగా బయటకు వెళిపోయాడు.
నైమిశ నెమ్మదిగా కాఫీ కప్పుతో బయటకు వచ్చి కూర్చుంది.
ఆమె కాఫీ తాగటం పూర్తి చేసింది.
ఆమె ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అతడికి.
కిచెన్ లోకి వెళ్ళిన నైమిశ వెనుకే వెళ్ళేడు అతడు.
“నైమిశా, రాత్రి మనం ఏమీ తినలేదు
కదా? ” అడిగాడు.
“అవును, మీరు టాబ్లెట్టే కష్టంగా వేసుకున్నారు. మీకు చాలా హై టెంపరేచర్ వచ్చింది ఎందుకో. ఆ జ్వరం దిగి చెమటలు బాగా పట్టాయి. అపుడే.. కాఫీ
తాగించేను. ” అంది.
“మరి నువ్వు? “
“ఇదిగో ఇపుడు అభీగారిచ్చిన కాఫీ తాగేను” అంది చిన్నగా నవ్వుతూ.
“బ్రేక్ ఫాస్ట్ తెప్పిస్తాను, ఏం చెయ్యద్దు కష్టపడి. ఏం తిందాం?” అడిగేడు.
నెమ్మదిగా ఆమె మనసులో తడబాటు తొలగిపోయింది.
“మీ ఇష్టం. ఏదైనా సరే. “అంది.
“అంటే, నా ఇష్టమే నీకు ఇష్టం అనుకోవచ్చా?”
“అయి వుండవచ్చు” అంది. చిన్నగా నవ్వుకున్నాడు అభినవ్.
“ఆర్డర్ చేసేను, ఇరవై నిముషాలలో వస్తుంది” చెప్పేడు.
“ఆలోగా మీరు స్నానం చెయ్యండి. చాలా జ్వరం వచ్చింది కదా”
“అలాగే” అంటూ స్నానం చేయటానికి వెళ్ళేడు. అతడు లైట్ బ్లూ కలర్ షర్టు, పైజామా వేసుకున్నాడు.
బెడ్ షీట్, పిల్లో కవర్లు, అతడు విడిచిన బట్టలు, తన డ్రెస్ జాడించి బకెట్లో తీసుకెళ్లి బయట తాడుపై ఆరేస్తున్న నైమిశను చూస్తే, అభినవ్ కు, ‘ఈ అమ్మాయి పాపం పనులన్నీ ఇష్టంగా చేస్తుంది.’ అనిపించింది.
ఖాళీ బకెట్ తీసుకెళుతూ తననే గమనిస్తున్న అభీ వైపు చూసింది.
అతడు చటుక్కున దృష్టిని మరల్చుకున్నాడు.
“నైమిశా!” పిలిచాడు అతడు.
చేతిలో దువ్వెనతో వచ్చింది “పిలిచేరా?” అంటూ.
“ఆహా లేదు” అన్నాడు. ఒక్క క్షణం అతడి ముఖంలోకి చూసి వెళిపోయింది.
‘తనకు ఏమైంది? అనుకోకుండా పిలిచేడు,’ అనుకుంటూ డాబా పైకి వెళ్ళేడు.
నీట్ గా తయారై వచ్చింది నైమిశ.
‘వైలెట్ కలర్ డ్రెస్ తనకు చాలా బాగుంది’ అనుకున్నాడు అభినవ్.
“టిఫిన్ తిన్నాక టాబ్లెట్ వేసుకోవాలి. ఇంకా తేలేదు,” అంది.
“ట్రాఫిక్, పొల్యూషన్ ఒక సమస్య కాదుగా, కొంచెం లేట్ అయింది. “
“టి.వి. పెట్టొచ్చుగా” అడిగింది నైమిశ.
“ఏదో ప్రాబ్లమ్ అట. సాయంకాలానికి వస్తుందట. “
అంతలో ‘బర్’ మంటూ ఏదో శబ్దం మొదలైంది. ఇంట్లో వస్తువులు అన్నీ శబ్దం చేస్తూ కదులుతున్నాయి. సీలింగ్ ఫ్యాన్ అటూ ఇటూ వూగుతుంది.
కాళ్ళక్రింద నేల అదురుతుంది.
“అభీ గారూ, ఏమైంది?” అంటూ పరుగున అతడికి దగ్గరగా వెళ్ళి నిలబడింది భయంగా చుట్టూ చూస్తూ.
కుర్చీలో నుంచి చటుక్కున లేచాడు అతడు. నైమిశ చెయ్యి పట్టుకుని వేగంగా డాబా పైకి నడిచాడు.
“ఎర్త్ క్వేక్ నైమిశా. భయం లేదు. ఈ మధ్య ఇక్కడ ఇలా మైల్డ్ గా తరచు వస్తుంది భూకంపం” అన్నాడు.
తన చేతిలో వున్న నైమిశ చెయ్యి కంపించటం తెలుస్తుంది అతడికి.
ఆ ప్రకంపనలు క్రమంగా ఆగిపోయాయి.
“భయమేసింది.” అంటూ అతడి ముఖంలోకి చూసింది.
ఆమె కళ్ళలో భయం కనిపిస్తుంది అతడికి.
అప్రయత్నంగా దగ్గరకి తీసుకున్నాడు నైమిశను. ఆమె వెనక్కు జరగాలని ప్రయత్నిస్తుంది. విడిచి పెట్టకుండా అభీ ఆమెను గుండెకు హత్తుకుని వదిలేశాడు. ఆమె విస్తుపోయి చూసింది అతడి ముఖంలోకి.
“లవ్ యు నైమిశా” అప్రయత్నంగా ఆ మాటలు గుసగుసగా వెలువడ్డాయి అతడి నోటి నుంచి.
పరుగున లోపలికి వెళిపోయింది. ఆమె వెనుకే లోపలకు వెళ్ళాడు అతడు.
రూమ్ లో తలగడలో ముఖం దాచుకుని పడుకుంది.
ఆమె గుండె వేగంగా స్పందిస్తుంది.
‘తనకు మనసులో కలిగిన భావాన్నే తన పెదవులు అప్రయత్నంగా చెప్పాయి, తను.. తను అలా ప్రవర్తించకుండా వుండవలసింది. ఆమె ఎలా ప్రతిస్పందిస్తుందోనన్న భయం ఒకప్రక్క, పశ్చాత్తాపం ఒకప్రక్క అతడి మనసులో అలజడిని సృష్టించాయి.
తన మనసులో ఉన్న ఖాళీని, ఇంట్లో ఉన్న ఖాళీని నైమిశ ఆక్రమించుకుంది’ అని అతడికి అర్థమైంది. తను కోరుకునే అణకువ, సున్నితమైన ప్రవర్తనలతో ఆమె తనను వశం చేసుకుంది’ అని అతడి మనసు గుసగుసలాడుతుంది.
‘తను ఎన్నడూ వూహించను కూడా వూహించలేదు, ఇటువంటి ఒక పరిస్థితి తన జీవితంలో చోటు చేసుకుంటుందని.’
‘ఈ సమస్యకు ఆరంభం అయితే తన చేతిలో మొదలైంది, కాని ముగింపు ఎలా అన్న ఆలోచన అతడిని నిత్యం అశాంతికి గురి చేస్తుంది. ఆమెను ఒంటిపక్షిలా ఈ దారుణమైన ప్రపంచంలోకి పంపించేయలేడు తను. కాని వేరే మార్గం ఏది? అన్న అశాంతితో కూడిన ప్రశ్నను అతడు నిస్సహాయంగా భరిస్తూ వస్తున్నాడు.’
‘కాని అనుకోలేదు తను, దానికి జవాబు తన మనసే ఇవ్వగలదని. నైమిశ తనకు అలవాటైపోయింది. ఆమె లేని ఇంటిని ఊహించలేడు తను, తనకు ఎంత గౌరవం ఇస్తుంది తన పరిధి దాటకుండా.’
“సార్!” అన్న పిలుపుతో అతడి ఆలోచనలు ఆగిపోయాయి.
“సరే, ఆ టేబుల్ పై పెట్టు, థాంక్యూ, ” అన్నాడు అతనితో. వెళిపోయాడతడు.
ఆ పార్సెల్ ను తీసుకెళ్ళి లోపల టేబుల్ పై పెట్టేడు.
“నైమిశా!” పిలిచేడు. ఆమె పలుకలేదు, రాలేదు. నెమ్మదిగా గదిలోకి వెళ్ళేడు.
“నైమిశా, టిఫిన్ వచ్చింది. రా, నాకు ఆకలేస్తుంది.” అన్నాడు.
నెమ్మదిగా లేచి, అతడి వైపు చూడకుండానే బయటకు వెళ్ళింది నైమిశ.
అభినవ్ వెళ్ళి, ఫ్రిజ్ లో వాటర్ బాటిల్ తీసి టేబుల్ పై పెట్టి కూర్చున్నాడు.
నైమిశ రెండు ప్లేట్లలో టిఫిన్ సర్ది తెచ్చింది.
“కూర్చో నైమిశా,” అన్నాడు, కూర్చుంది నెమ్మదిగా.
“ఎవరో నాతో మాట్లాడరట!” అన్నాడు.
ఒకసారి అతడి ముఖంలోకి చూసి, “తినండి. నిన్న ఉదయం తిన్నదే. ఇంతవరకు ఏమీ లేదు. తిన్నాక టాబ్లెట్ ఇస్తాను” అంటూ తినడానికి ఉపక్రమించింది.
“బాగుంది కదా!” అన్నాడు.
“ఊ,” ఫుడ్ బాగానే వుంది” అంది ఒకసారి అలవోకగా అతడి వైపు చూస్తూ.
“మరి ఏం బాగోలేదూ నైమిశ గారూ?” అన్నాడు.
“మీకే తెలుసు, చెప్పాలా ఏంటి?” అంది.
“అబ్బా నీ క్విజ్ లు అర్థం కావు, చెప్పరాదూ!” అన్నాడు.
“మీరు ముందులా లేరు”
“ఏం చేశాను? ఏం చెయ్యలేదు? ” అడిగేడు ఆమె ముఖంలోకి చూస్తూ.
“ఇలాంటి కాంప్లికేటివ్ క్వశ్చన్స్ వేసి డైవర్ట్ చేయకండి. “
“ఇంకేం తింటాను? తినాలన్న కోరిక..” అంటూ లేచిన అతడిని చెయ్యిపట్టుకు ఆపింది నైమిశ చటుక్కున.
“తినకుండా లేస్తే నా మీద ఒట్టే, ప్లీజ్..తినండి. ” అంది అతడి ముఖంలోకి చూస్తూ.
కూర్చుని మారు మాట్లాడకుండా తిన్నాడు అతడు. టాబ్లెట్ తెచ్చి టేబుల్ పై పెట్టింది, ” వేసుకోండి,” అంటూ.
ఒకసారి ఆమె ముఖంలోకి చూసి టాబ్లెట్ మింగేశాడు.
“ఇంకేం చేయ్యాలో చెప్పు” అన్నాడు.
“అది ఒకళ్ళు చెప్తే తెలిసేది కాదు”
“అయ్య బాబోయ్ చంపేస్తుంది. నీ పొడుపు కథలు అర్థం కావు. ఓపెన్ గా చెప్పేయ్.”
“ఇందాక ఏం చేశారు? “
“ఆ…ఏం చేశాను? ఉండు గుర్తుకు తెచ్చుకోనియ్. ” అన్నాడు.
“నటించటం కూడా వచ్చా? కష్టపడి గుర్తుకు తెచ్చుకోవలసిన పని కాదు చేస్తా!” అంటూ తిన్న ప్లేట్లవీ కిచెన్ లోకి తీసుకువెళ్ళింది. వెనుకే వెళ్ళేడు అతడు.
“నైమిశా, నీకు ఒక మంచి మాట చెప్పాలని వుంది. నువ్వు చూస్తే హాట్ హాట్ గా ఉన్నావు, వింటావా? “
ఆమె విసురుగా వెను తిరిగింది. ఆమెను దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకున్నాడు అభినవ్.
నైమిశ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. “మిమ్మల్ని చాలా ఉన్నతంగా ఊహించుకున్నాను. అందుకే నిశ్చింతగా మీతో వుండగలుగుతున్నాను, లోలోపల ఇది ‘తగని పని’ అనిపిస్తున్నా సరే” చటుక్కున, విస్తుపోయి వదిలేశాడు ఆమెను.
తన పక్కనుంచి విసురుగా వెళిపోతున్న నైమిశ వైపు నిస్సహాయంగా చూసేడు అభినవ్.
ఆమె వేగంగా బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. నెమ్మదిగా వెళ్ళి, నిలబడ్డాడు.
ఆమె బెడ్ రూమ్ అల్మారాలో నుంచి రెండు డ్రెస్‌లు, ఒక బ్యాగ్‌లో పెట్టుకుంటుంది. ఆ దృశ్యం చూసిన అభినవ్ గుండె స్పందన ఎక్కువైంది.
ఆమె అభినవ్ దగ్గర ఆగింది. “అభీగారూ, మీరు నాకు ఆశ్రయాన్ని ఇచ్చారు, ఆదరించారు, మర్యాదగా చూసుకుంటున్నారు. కాని ఇలా నేను వూహించలేదు. నన్ను క్షమించండి” అంటూ అతడి పాదాలను తాకి దణ్ణం పెట్టి వెళిపోతున్న నైమిశను గట్టిగా పట్టుకుని ఆపాడతడు. తీసుకెళ్ళి, బెడ్‌పై కూర్చోబెట్టాడు. బలవంతంగా.
“అలా కూర్చొని, నేను చెప్పేది విను ముందు. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నేను ఆపను నిన్ను” అంటూ ఆమెకు దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. చిన్నగా ఆయాసపడుతూ, అతడి వైపు చూస్తుంది నైమిశ.
“నైమిశా, నువ్వు తెలియక ముందు ఎలా వున్నానో తెలియదు. ఇపుడు నాకు కలిసిన తర్వాత, ఒక కలలా మాయం అయిపోతే, నేను ఎలా బతకను చెప్పు? నువ్వు కావాలి నాకు” అతడి మాటలకు మధ్యలోనే అడ్డు వచ్చింది నైమిశ.
“మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం కోరుతున్నారు కదూ? మీది ప్రేమ కాదు. అందరి మగాళ్ళలాగే!”
“నైమిశా!” అంటూ బిగ్గరగా అరిచాడు అతడు. అదిరిపడింది ఆమె.
“ఛీఛీ! నన్నింత హీనంగా అంచనా వేశావా? నాకు నీ మీద కోపం రావటం లేదు. దుఃఖం కలుగుతుంది. నా మనసును గాయపరిచావ్ నైమిశా. అంత నిర్దయగా ఎలా మాట్లాడగలిగావ్?” అంటూ అతడు వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు.
నెమ్మదిగా హాలులోకి వెళ్ళిన నైమిశ విస్తుపోయింది. అతడు ముఖంపై చెయ్యి వేసుకు పడుకున్నాడు. అతడి కళ్ళనుంచి కన్నీరు పక్కకు కారుతుంది.
“నెమ్మదిగా అక్కడే నేలపై కూర్చుంది. తలవాల్చి. కాసేపటికి నెమ్మదిగా లేచాడు అభినవ్. టేబుల్ పై బాటిల్ తీసుకొని నీళ్ళు తాగేడు అతడు.
నెమ్మదిగా నైమిశకు దగ్గరగా వున్న కుర్చీలో కూర్చున్నాడు అతడు.
“నైమిశా, నా అంతట నేను ఈ గూడులో నిశ్చింతగా బ్రతికేవాడిని. నువ్వు ప్రవేశించావ్. నిన్ను శ్రావణసమీరం అనుకున్నాను. కాని నిప్పులు చెరిగే గ్రీష్మపు వడగాలిలా నా గూటిని చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోతున్నావు. ఈ ఇంట్లో ఎటు చూసినా నైమిశే గుర్తుకు వస్తుంటే, ఎలా బ్రతకమంటావ్? నాకు అలసిన వేళ నీ ఒడి కావాలి, ఒంటరిని కానని అక్కున చేర్చుకునే నీ వెచ్చని బంధం కావాలి నైమిశా. ఎందుకు ఇంత జాలి లేకుండా అభాండం వేసావ్? ఈ అమానుష ప్రపంచంలోకి నిన్ను ఎలా పంపించగలను? నీ జీవితానికి ఒక నిలకడైన, శాశ్వతమైన ఆసరాను ఎలా కల్పించగలను?” అన్న ఆలోచనతో రాత్రిళ్ళు నిద్రకు దూరమై గడుపుతున్నాను.”
అతడు ఆగాడు.
తలెత్తి చూసింది అతడి వైపు. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి!
“అభీ, మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ముందు”
“అడుగు.. పూర్తిగా నా నిజాయితీని, నా మానవత్వాన్ని, నా సున్నితమైన నైజాన్ని, నా జాలి గుండెను, కర్కశంగా పాతాళానికి తొక్కేశావు ఒక్క అభియోగంతో. అడుగు.. ఏమి అడుగుతావో.. తట్టుకోలేక నా ప్రాణమే గాలిలో కలిసిపోయేలా అడుగు. అప్పుడు నాకీ బాధ వుండదు”
షర్ట్ స్లీవ్ తో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడతడు.
“నిన్న ఉదయం మీ నాన్నగారితో మాట్లాడేరు కదా! కట్నం ఆశలు వదిలి, నా ఉద్దేశాలకు తగినటువంటి అమ్మాయిని, అంటే చివరివరకు మీతో కలిసి ఉండే అమ్మాయిని చూడండి, చేసుకుంటా అని చెప్పేరుగా”
“అయితే..?”
“మరి నేను లేకుండా బ్రతకలేను లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అలసిన వేళ నా ఒడి కావాలి.. చాలా చెప్తున్నారు నాకు..?” ఆమె స్వరం దుఃఖంతో కంపిస్తుంది.
“నైమిశా, కాస్త ఓపికగా విను దయచేసి. ఇప్పుడు, అంటే ఈ దశలో ఒక అపార్థం, ఒక రాంగ్ స్టెప్ మనిద్దరి జీవితాలను తలకిందులు చేస్తాయి. నా మాటలు, అడ్డురాకుండా పూర్తిగా వింటాను, అంటే చెప్తాను.”
“సరే, చెప్పండి” అంది నైమిశ.
“నిన్న నిన్ను బయటకు తీసుకెళ్ళేను. అపుడు, కేవలం నీ మనసులో గూడు కట్టుకున్న భయాన్ని పోగొట్టాలన్న ఉద్దేశంతోనే తీసుకువెళ్ళేను. ఇద్దరం ఫ్రెండ్స్ లా గడిపేం, సరదాగా. అంతేనా? నీకేమైనా ఆసౌకర్యం కలిగిందా నా వల్ల?”
“లేదు” అంది తల అడ్డంగా ఊపుతూ.
“రాత్రి ఇంటికి వచ్చేక నేనేమైనా మిస్ బిహేవ్ చేశానా?”
“లేదు, లేదు” అంది.
“నిజంగా ఏం జరిగిందో చెప్పు” నైమిశా.
“టాబ్లెట్ కి జ్వరం దిగిపోయి బాగా చెమటలు పట్టాయి. మూలుగుతున్నారు బాగా. గబగబ కాఫీ చేసి తెచ్చాను. లేవటం లేదు లేపుతుంటే. భయమేసింది. నెమ్మదిగా పైకి లేపి కాఫీ తాగించా కొంచెం కొంచెం. తాగేసి, నా చున్నీతో మూతి తుడుచుకొని, నా ఒళ్ళో తలపెట్టుకు పడుకున్నారు. కదిపితే లేచిపోతారని అలాగే కూర్చున్నా”
“నైమిశా తెల్లారేక, ఆ ఉదయం జరిగింది నే చెప్తాను, విను. నువ్వు కొత్తగా నాతో దూరంగా ఉండడం గమనించాను. ఇంటి పనులు అన్నీ నువ్వు ఒక అభిమానంతోనే చేస్తున్నావని చెప్పింది నా మనసు. కొత్తగా నీ పట్ల ఆసక్తి కలిగింది మనసులో. అంతలో భూకంపం వచ్చింది. నువ్వు భయంతో నాకు దగ్గరగా వచ్చావు. భయం పోగొట్టాలనే దగ్గరకు తీసుకున్నాను. కానీ నాకు తెలియకుండానే నా ఇంట్లో, నా హృదయంలో ఉన్న ఖాళీని నువ్వు ఆక్రమించుకున్నావని అర్థమైంది నా మనసుకు. నా జీవితంలోకి ఎటువంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నానో, అది నువ్వేనని మనసు చెప్పింది” ఆగేడతడు.
“అప్పుడే, అప్పుడే ఆ ఉద్వేగంలో, నిన్ను ప్రేమతో అప్రయత్నంగా గుండెకు హత్తుకున్నాను. నా మనసు నుంచి అందిన సమాచారంతో నా పెదవులు, ‘లవ్ యు నైమిశా’ అని పలికాయి. ఇది నిజం నైమిశ. నేను నమ్మే మానవత్వాన్ని సృష్టించిన ఆ దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. నువ్వు కోపంగా ఉన్నావని, నీకు నా మనసులో… మాట సంతోషంగా నీ మనసుకు చెప్పాలని కిచెన్ లోకి వచ్చాను. కానీ నువ్వు నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా నీచమైన అభాండం వేశావు. దానితో నా మనసు, నేనూ కూడా చచ్చిపోయాం నైమిశా. నేను తోటి ప్రాణులన్నింటి పట్ల మానవత్వం కలిగి ఉంటాను, నీ విషయంలో కూడా అదే చేశాను. అడుగడుగునా నీ బాధను మాన్పటానికే చూశాను. ఒక్కక్షణం ఆగి, ఆమె ముఖంలోకి చూసాడు అభినవ్.
“నైమిశా, నన్ను క్షమిస్తావో, శిక్షిస్తావో నీ ఇష్టం. నువ్వు ఎక్కడకు వెళ్తావో చెప్పు, తీసుకెళ్తాను. ఈసారి టికెట్ లేని ప్రయాణం చేయకు. టికెట్ కొని ఎక్కిస్తాను ట్రైన్. నా వల్ల నీ నుదుటికి అయిన గాయం తాలూకు మచ్చ నెమ్మదిగా పోతుంది. అలాగే నాకు సంబంధించిన చేదు జ్ఞాపకాలు కూడా నీ మనసునుండి తొలగిపోతాయి! నన్ను క్షమించు” అంటూ లేస్తున్న అభినవ్ ను ఒక్క ఉదుటన లేచి, చుట్టేసుకుంది నైమిశ. నెమ్మదిగా అతడి పాదాలపై తల పెట్టుకు దుఃఖిస్తుంది ఆమె.
“మీ మనసును గాయపరిచాను. క్షమాపణ అడిగే అర్హత కూడా లేకుండా. అభీ, ప్లీజ్, నన్ను మీ నీడలో ఉండనివ్వండి” అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. నెమ్మదిగా లేవదీసి గుండెకు హత్తుకున్నాడు.
‘అభీ గారూ!’ అంటూ నా హృదయాన్ని తట్టి పిలిచే నీ పిలుపు ఎప్పటికీ ఈ ఇంట్లో నాకు వినిపిస్తూనే ఉండాలి, నైమిశా” అంటూ…
******
“అభీ, నా మీద కోపం లేదు కదూ?” అంటున్న నైమిశ ముఖాన్ని పైకెత్తి, ఆమె కనురెప్పల మాటునుంచి జారుతున్న నీటి ముత్యాలను తన పెదవులతో ఒత్తాడు. “లవ్ యు, మై స్వీట్ పార్టనర్.” అంటూ ఆమె పెదవులను తన పెదవులతో స్పృశించాడు.
“నైమిశా, ఇపుడు నీకు తెలియకుండానే ‘అభీ’ అన్నావు, బాగుంది. కంటిన్యూ చెయ్యి, ‘గారు’ కట్ చేయి,” అన్నాడు.
“ఓకే అభీ” అంది చిరునవ్వుతో.
“నైమిశా, తొందరగా తయారవ్వు, బయటకు వెళ్దాం. “నిండుగా చీర కట్టుకో, ఇది నా రిక్వెస్ట్” అన్నాడు.
“అలాగే అభీ.” అంటూ రూమ్ లోకి వెళ్ళి తలుపు మూసింది. ఒకవేళ నైమిశ వెళ్ళిపోయి ఉంటే, ఆ వూహే భరించలేడు తను!
తలుపు తెరుచుకుని వచ్చిన నైమిశ వైపు కన్నార్పకుండా చూసాడు అభినవ్. ‘ఈ అమ్మాయిలో ఇన్ని అందాలు దాగి ఉన్నాయని తను ఇంతవరకు గమనించనేలేదు’ అనుకున్నాడు. లేత గులాబీ రంగు చీరతో పోటీ పడుతుంది ఆమె అందం.
“దిష్టి తగిలేలా ఉంది. అలా తినేసేలా చూడకూడదు” అంది అతడి చూపులను గమనించి.
“షాపింగ్ క్యాన్సిల్ చేద్దామా?” అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ,
“మరి ఎక్కువ అవ్వటం అంటే ఇదే,” అంది.
“ఏమైనా తట్టుకోవటం కష్టం, పద.” అంటూ నడుస్తున్న అభినవ్ ని అనుసరించింది నైమిశ.
బైక్ స్టార్ట్ చేసి, “ఎక్కు నైమిశా, చీర కట్టుకున్నావు కదా, దీనికి శారీ గార్డ్ లేదు , వేయిస్తాను. జాగ్రత్తగా కూర్చో,” అని చెప్పాడు.
“ఓకేనా?” అడిగాడు.
“ఓకే అభీ” అంది నైమిశ సర్దుకు కూర్చుని.
స్లోగానే వెళ్తూ ఒక మెకానిక్ షాప్ దగ్గర ఆపాడతడు. శారీ గార్డ్ ఫిట్ చేయమనీ, గంటలో వస్తాం అనీ చెప్పాడు మెకానిక్ కు.
ఆటో పిలిచి, “ఎక్కు నైమిశా” అంటూ ఎక్కి కూర్చున్నాడు. మరీ దగ్గరగా జరగబోయిన నైమిశకు, “డ్రైవర్ ఉన్నాడ”ని సైగ చేశాడతడు.
ఒక జ్యుయలరీ షాప్ కు వెళ్ళారు. “షాదీ కేలియే బ్లాక్ బీడ్స్ చెయిన్ చాహియే?” అని అడిగాడు. ఒకసారి అతడి ముఖంలోకి చూసింది నైమిశ. కనురెప్పలు ఆర్పి సైగ చేశాడు మాట్లాడవద్దని. తనకు నచ్చిన నిండుగా ఉన్న చెయిన్ తీసుకున్నాడు. నైమిశకు ఒక ముత్యం ఉంగరం తీసుకున్నాడు. అతడికి గ్రీన్ స్టోన్ ఉంగరం సెలెక్ట్ చేసింది నైమిశ. వెండి మువ్వల పట్టీలు, మట్టెలు తీసుకున్నాడు.
“ఇంకా” అన్నాడు.
“చాలా అయ్యింది, చాలు,” అంది.
“ఇయర్ రింగ్స్ తీసుకో” అంటూ ముత్యాలు, నల్లపూసల కాంబినేషన్లో చిన్న హ్యాంగింగ్స్ తీసుకున్నాడు.
“నీకు బాగుంటాయి నైమిశా” అంటూ. అన్ని బాక్సులూ కలిపి, ఒక అందమైన బ్యాగులో పెట్టి ఇచ్చాడు షాప్ అతడు.
అక్కడ నుంచి ఒక టెంపుల్ కి తీసుకువెళ్ళాడు అభినవ్. అక్కడ రెండు పూలమాలలు, వేరే మల్లెమాల ఒకటి తీసుకున్నాడు. ఎర్రటి కుంకుమ బాక్స్ ఒకటి, పసుపు, ఎరుపు గాజులు తీసుకున్నాడు. కళ్ళప్పగించి చూస్తున్న నైమిశకు చిరునవ్వుతో చెప్పాడు, “ఈ దేవుడి సాక్ష్యంగా నిన్ను నా భార్యను చేసుకుంటున్నాను” అని. ఆమెకు మాటలు కరువయ్యాయి.
అతడు అందించిన చెయ్యి అందుకుని, మెట్లెక్కేరు ఇద్దరూ కలిసి. గుడిలో పెద్దగా రష్ లేదు. ఒక పక్కగా ఉన్న అరుగుపై కూర్చున్నారు ఇద్దరూ.
“రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో చూడు,” అన్నాడు. తెల్లటి విగ్రహాలు, నిండు అలంకరణతో సజీవంగా కనిపిస్తున్నాయి. నైమిశ మనసులో, అతడిని తొందరపాటులో బాధించినందుకు బాధగా ఉంది. ట్రైన్ లో బెర్త్ కింద నుంచి, బెర్త్ పైకి, ఆ తర్వాత రోడ్డు నుంచి ఇంటికి చేరిన తన ప్రస్థానం, ఇప్పుడు ఏకంగా అతడి మనసులోకి, జీవితంలోకి చేరిపోయింది. కలలో కూడా ఊహించలేదు, ఇటువంటి ఒక ఉత్తముడు తనను అతడి జీవితంలోకి ఆహ్వానించి, తనకు ఒక అందమైన జీవితాన్ని ఇస్తాడని.
గమనిస్తున్న అభినవ్, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. “నైమిశా, ఇది మన జీవితంలోని అపురూపమైన సమయం. ‘నీ… నా’ ల కలయికతో ‘మనం’గా మారుతున్న ఈ తరుణాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకెవరూ లేరుగా” అన్నాడు. అప్పటికి ఉన్న భక్తులు అందరూ వెళ్ళిపోయారు. పూజారి గారి దృష్టి వారిపై పడింది. నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు ఆయన. ఇద్దరూ లేచి నిలబడ్డారు.
“ఆశీర్వాదం తీసుకుందాం, నైమిశా” అంటూ ఆయన పాదాలను తాకి నమస్కరించారు.
“జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధించుకొని, హాయిగా సుఖంగా ఉండండి” దీవించాడాయన ఇద్దరి తలలను తాకి.
“మీరు తెలుగువారా?” ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్.
“అవును, బాబు. మీ మాటలు నా చెవిన పడ్డాయి. రండి,” అంటూ తీసుకెళ్లాడు వారిని. రాధాకృష్ణుల సన్నిధిలో నిలబడ్డారు, చేతులు జోడించి.
ఆయనకు అర్థమయ్యేలా విషయం చెప్పాడు అభినవ్ అపార్థానికి తావు లేకుండా.
పూలదండలను రాధాకృష్ణుల పాదాలకు తాకించి తెచ్చి ఇచ్చాడు ఆయన, “దండలు మార్చుకోండి. అమ్మాయి, ముందు నువ్వు అబ్బాయి మెడలో వేయమ్మ,” అని చెప్పాడాయన. “అమ్మాయి వేసాక, నువ్వు వెయ్యి బాబు ఆమె మెళ్ళో” అని చెప్పాడాయన,
నైమిశకు అందేలా తలవంచాడు అభినవ్. చిరునవ్వుతో అతడి కళ్లల్లోకి చూస్తూ మాల వేసింది నైమిశ.
తర్వాత అభినవ్, నైమిశ మెళ్ళో వేశాడు మాల. నల్లపూసల చైన్ తీసి ఇచ్చాడు అభినవ్. ఆయన దానిపై మంత్రాలతో ఉదకం జల్లి, దేవుడికి చూపించి తెచ్చి అభినవ్ కు ఇచ్చాడు. గొలుసుకున్న హుక్ తీసేడు అభినవ్. అతడు ఒక అనూహ్యమైన సంభ్రమానికి లోనయ్యాడు.
తలవంచింది నైమిశ. నల్లపూసలను ఆమె మెళ్ళో వేశాడు. బాక్స్ లో కుంకుమ తీసి నల్లపూసలలో ఉన్న సూత్రాలకు పెట్టాడు ఆయన చెప్పినట్లే. అపుడు ఉంగరాలు రెండు బాక్సుల్లో నుంచి తీసిచ్చాడు ఆయనకు.
ఆయన వాటిపై ఉదకం జల్లి, దేవుడికి చూపించి అభినవ్ కు ఇచ్చాడు. “ఉంగరాలు మార్చుకోండి,” అంటూ.
ముందు నైమిశ, అభినవ్ కు, తర్వాత అభినవ్ నైమిశ కు ఉంగరం పెట్టారు. ఆయన, దేవుడికి హారతి ఇచ్చి, పళ్ళాన్ని ముందుకు పెట్టి, “దంపతులిద్దరూ కలిసి కళ్ళకు అద్దుకోండి” అని చెప్పారు.
హారతి అద్దుకుంటూ, “పూజారి గారు, ‘దంపతులు’ అన్నారు విన్నావా?” అన్నాడు అభినవ్ నెమ్మదిగా. దేవుడికి పెట్టిన చేతులతోనే అభినవ్ కి దణ్ణం పెట్టింది నైమిశ.
“ఈ భాగ్యం మీరు ప్రసాదించారు అభీ” అంటూ..
బాక్స్ లో కుంకుమ తీసి, అభినవ్ నుదుట నిలువుగా పెట్టాడాయన.
“కుంకుమను అమ్మాయి నుదుట, పాపిట్లో కూడా పెట్టు బాబూ!” అన్నారు.
అలాగే చేశాడు అభినవ్.
“బాబూ, మీరిద్దరూ దేవుడికి ఎదురుగా రండి” అంటూ ప్లేట్లో కర్పూరం పెద్దగా వెలిగించాడు ఆయన, “మీరిద్దరూ ఈ అగ్నిసాక్షిగా ప్రమాణం చేయండి. “మేము ఇద్దరం పరస్పరం కష్టసుఖాలలో ఒకరికొకరుగా, జీవితాంతం తోడుగా ఉంటాం,” పూజారి గారు చెప్పినట్లే చెప్పారు ఇద్దరూ. పూజారి గారి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు.
హారతి పళ్ళెంలో అభినవ్ ఉంచిన మొత్తం చూసి పూజారి గారు, “ఇది చాలా ఎక్కువ బాబు. ఆ భగవంతుడు కూడా మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సమృద్ధిగా ప్రసాదించుగాక!” అని దీవించారు.
ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.
“ఒక క్షణం ఇక్కడ కూర్చుందాం, మై డియర్ వైఫ్!” అన్నాడు అభినవ్. చిరునవ్వుతో స్పందించింది నైమిశ.
“నాకు ఈ స్థానాన్ని ఇచ్చినందుకు థాంక్యూ, మై డియర్ హజ్బెండ్ అభీ.” అంటూ అతడి పక్కన కూర్చుంది.
ఆమె నుదిటి కుంకాన్ని సరిదిద్దాడు వేళ్ళతో అభినవ్. మెడలో ఉన్న పూలదండలను తీసి మళ్ళీ సంచిలో పెట్టేశారు. “వెళ్దామా? నైమిశా కొంచెం తినేసి వెళ్దామా?” అడిగాడు.
“అలాగే” అంది. వెళ్ళేరు హోటల్ కు.
“ఇది ఈ ఏరియాలో మంచి హోటల్. సౌత్ అండ్ నార్త్ రెండు ఫుడ్స్ ఉంటాయి. “ఇవేళ ఏదో ఒకటి అన్నట్టు తింటే ఊరుకోను అమ్మాయి” అన్నాడు మెనూ ఆమె దగ్గరకు జరుపుతూ.
నవ్వేసింది “వెజ్ బిర్యానీ తిందామా?” అంటూ.
“నా జన్మ తరించిపోయింది, సుమా! నోరు విప్పి ఒకటి అడిగావు” అన్నాడు.
“ఐస్ క్రీమ్ తిందామా?” అంటూ ఆమె చేతిపై చేయి వేశాడు.
“అదేంటి, అలా ఉలిక్కిపడ్డావేంటి?” అడిగేడు ఆమె ముఖంలోకి చూస్తూ,
“ఏమో, అలా అయింది,” అంది.
“సరే నాకు అర్ధం అయిందిలే.” అంటూ ఐస్క్రీం ఆర్డర్ చేసేడతడు.
“అభీ, ఒకటి చెప్తారా? అడుగుతాను మరి”
“ఏవో సామాన్య మానవుల పరిధిలోవి అయితే చెప్పగలను. థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడు? సునీతా విలియమ్స్, ఎప్పుడు ఎర్త్ కు వస్తుంది? లాంటి క్లిష్టమైన ప్రశ్నలు అయితే నా వల్ల కాదు” నవ్వేసింది నైమిశ.
“అవేం కాదులేండి. మరి మన విషయం మీ పేరెంట్స్ కి చెప్తారా?”
“మొదలు పెట్టావా? ఇప్పుడు తెలిసిందనుకో, వెంటనే నాన్న బయలుదేరి వచ్చేసి మన ఇద్దరి మధ్యన పడుకోవటం జరుగుతుంది. నువ్వు హైదరాబాద్ వెళ్ళి సంచుల నిండా కట్నం తెస్తేనే, నిన్ను తాకనిస్తాడు. చెప్పనా మరి?”
“నాకు ఎవరూ ఎలాగూ లేరు. మీ వైపు నుంచి అయినా పెద్దవాళ్ళు ఉండాలి మనకు అని నా కోరిక అంతే” అంది నైమిశ.
“చెప్తాను విను. ఎవరో ఇంద్రులు, చంద్రులు అని చంపేస్తుంటే… మొన్న వెళ్ళేను హైదరాబాద్ అమ్మాయిని చూడటానికి. ఆమె నాతో మాట్లాడాలి అంది. రెండే ప్రశ్నలు వేసింది.”
“ఏమడిగింది?”
“పెళ్ళయ్యాక మీ పేరెంట్స్ మనతో ఉంటారా? అది మొదటి ప్రశ్న”
“మీ శాలరీ ఎంత? లోన్లు ఉన్నాయా? నా శాలరీ నుంచి కూడా ఆశిస్తావా?” ఆ ప్రశ్నల వల్ల… ఇంకా నాలుగు రోజులుండవలసిన నేను, ‘పెళ్ళి’ అన్న పదం మీద విరక్తి కలిగి వెంటనే పెట్టె సర్దేసి ట్రైన్ ఎక్కేసాను” చూస్తుంది నైమిశ.
“ఆ ట్రైన్ ఎక్కినందువల్ల నిన్ను కలిశాను.
నిన్ను కలిసినందువల్ల..” ఆమె వైపు ఓరగా చూస్తూ ఆగిపోయాడు.
“ఊ… కలిసినందువల్ల ఏంటి?” అంది.
“నీకు తెలియదా? బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్న అమాయకుడిని ఇలా…ఇలా…. బంధించేసావ్, నిజమే కదా!” అన్నాడు చిలిపిగా చూస్తూ.
“అందులో ఒకటి కరెక్ట్ కాదు” అంది నైమిశ.
“ఏంటో?”
“అమ్మో, అమాయకుడా? దొంగ!”
“దొంగ అయితేనే మంచిదిగా దోచుకుంటాడు!”
“కరిగిపోతుంది. ముందు ఐస్ క్రీమ్‌ను దోచుకు తినండి, తర్వాత నన్ను!”
“అది ఎలాగా ఫిక్స్‌డ్ కదా!”
అసలు మీ ధోరణి సడెన్‌గా ఇలా మారిపోయిందేంటి?” అంది నవ్వాపుకుంటూ…
“మాకిప్పుడు అన్ని రైట్స్ ఉంటాయి కదా!”
“ఏం ఉండవు”
“చూస్తావుగా! అయినా ఏదో సరదాగా లేకుండా మూతి బిగించుకు కూర్చుంటే నాకు నచ్చదు అసలు”
“సరే, ఒక విషయం బ్రీఫ్‌గా చెప్తాను, విను.
నేనేదో దొంగతనంగా పెళ్ళి చేసుకున్నాను అనుకుంటున్నట్టున్నావ్, కొన్నాళ్లకు వెళ్దాంలే… మా అన్నయ్య ఆర్నవ్ చాలా సరదా మనిషి.
యూఎస్ లో మంచి జాబ్. ఇప్పుడు పెళ్ళి, కట్నం, ఆస్తి అంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నట్టే
వాడికి కూడా కోటీశ్వరులని ఓ సంబంధం సెటిల్ చేసేసి, పెళ్ళి చేసేసాడు మా నాన్న. వాడు గట్టిగా వద్దు అనలేదు మరి.
వాడితో చీటికీ మాటికీ గొడవలు పెట్టి కుటుంబాన్ని వీధికి లాగింది. చివరకు అమెరికాలో విడాకులు తీసుకుంది. అక్కడ చట్టాలు వేరు. ఈ మధ్య చాలామంది ఇదే చేస్తున్నారని ఒక టాక్ వచ్చింది. ఆ కట్నాలు, కానుకల కంటే ఐదారు రెట్లు ఎక్కువగా వాడిని ఖాళీ చేసేసింది. వాడు ఏకాకిగా బ్రతుకుతున్నాడు. అలానే నన్నూ చేసేద్దామని ఆయన, పెళ్లి అని చంపుకు తింటున్నాడు. “
“ఆయనకు విషయం తెలిసి కోపం వస్తే?”
“నేను అనుకున్నట్టే బ్రతుకుతాను గాని, మరోవిధంగా రాజీపడి బ్రతకలేను. పోనీయ్ నైమిశా, ఈ రోజు మన పెళ్ళిరోజు. ఆ విషయాలు ఇంక వద్దు. నీకు తెలియాలి అని చెప్పాను అంతే”
“సరే అభీ” అంది.
“ఇంకొక విషయం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్… నా ఒక్కడి కోసం ఎక్కువ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆ చిన్న ఇంట్లో ఉంటున్నా. మంచి చోటకు మూవ్ అవుదాం సరేనా.! అలాగే వాషింగ్ మెషిన్, ఇంకా అవసరమైన అదర్ అప్లై ఎన్సెస్ కూడా తీసుకుందాం. నువ్వు ఆ బకెట్లలో కష్టపడి వాష్ చేయక్కర్లేదు. నీకు ఏ విధమైన ఇబ్బంది ఉండకుండా చూసుకుంటాను.”
“నాకు ఇబ్బందా అభీ?” అంటూ నవ్వింది నైమిశ.
“నైమిశా, ప్లీజ్. ఇకపైన అలా మాట్లాడకు. ఇదంతా కూడా ఏదో సాయమో, సానుభూతో, ఉద్ధరణో కాదు. నీ మనసులో, నా మనసులో కూడా అటువంటి భావన ఉండ కూడదు. ఇలా అపరిచితులం, ఒక పేరు లేని బంధంలో ఇరుక్కొని ఎంతకాలం ఉండగలం? పరిష్కారం ఏంటి? అని సతమతమయ్యాం. కాని పరిష్కారం ఆ పైవాడే నా మనసుతో సంకేతం పంపించాడు. నీ వ్యక్తిత్వం నచ్చింది నాకు. నీ ప్రవర్తన, సౌమ్య స్వభావం నా మనసును ఆకట్టుకున్నాయి. ఇపుడు నువ్వు అభినవ్ భార్యవు, అంటే నాకు ఎవ్విరి థింగ్! అలాగే, ఈ క్షణం నుంచి నీ స్థానం ఇక్కడ!” అంటూ గుండెపై చెయ్యి వేసుకుని చూపాడు అతడు.
“థాంక్యూ అభీ…” అంది. ఆమె కళ్ళలో నీటిపొర మాటున దాగిన కృతజ్ఞత కనిపించింది అతడికి.
“బైక్ రేపు తీసుకుంటాను, ఇప్పుడు ఇంటికి వెళిపోదాం” అన్నాడు.
“సరే, మీ ఇష్టం అభీ” అంది.
******
డోర్ లాక్ తీసి, ఓపెన్ చేసి ఆగాడు అభి.
“నా పక్కకు రా నైమిశా, కుడికాలు లోపల పెడదాం. ఇది మన జీవితంలోకి మనం వేసే తొలి అడుగు. మనకు స్వాగతం చెప్పి హారతి ఇవ్వటానికి ఎవరూ లేరు”
నైమిశ చేతిని తన చేతిలోకి తీసుకొని, ఆమె ముఖంలోకి చూసాడు అభినవ్. నైమిశ ముఖంలో భావం అతడికి నచ్చింది.
“ఒకరికి ఒకరం మనం ఉన్నాం కదూ అభీ” అంది.
“హ్యాపీ మ్యారీడ్ లైఫ్!” అన్నాడు అతడు.
ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. తలుపు మూసాడు అతడు.
“నైమిశా, ఇదిగో” అంటూ అతడి చేతిలో వున్న కవర్‌ను నైమిశకు ఇచ్చాడు అతడు. ఆత్రంగా ఓపెన్ చేసింది నైమిశ. మల్లెల సువాసన ఇల్లంతా వ్యాపించింది. మల్లెమాల, విడి మల్లెలు ఉన్నాయి. అడుగున ఉన్న బాక్స్ తీసి ఓపెన్ చేసిన నైమిశ కళ్ళు మెరిసాయి. అందమైన రాధాకృష్ణులు!
“రా నైమిశా” అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్లాడు అతడు. అల్మారాలో పెట్టాడు రాధాకృష్ణులను. విడిగా ఉన్న కొన్ని మల్లెపూలను అక్కడ ఉంచి, ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు అతడు.
కళ్ళు తెరవగానే,
“ఏం కోరుకున్నావు అభీ?” అడిగింది నైమిశ.
“మన మధ్య ప్రేమనురాగాలు నిత్యం చిగురు తొడుగుతూనే ఉండాలి అని” అంటూ నైమిశను దగ్గరకు తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు
“లవ్ యూ మై వైఫ్” అంటూ.
నైమిశ చేతులు కూడా అతడి చుట్టూ బిగుసుకున్నాయి,”లవ్ యూ అభీ” అంటూ.
అతడు నెమ్మదిగా, నైమిశ ముఖం పైకి ఎత్తి, “చిన్న రిక్వెస్ట్” అన్నాడు.
“ఏమిటి అభీ?” అంది కళ్ళు తెరవకుండానే.
“కొంచెం ఈ మల్లెపూల మాలను నువ్వే అలంకరించుకోవాలి తలలో” అన్నాడు అల్మారాలో ఉన్న మల్లెమాలను అందుకుని ఆమెకు ఇస్తూ.
“ఆ అలంకరణ తమరే చేయొచ్చు కదా, అభీ సార్!” అంది చిరునవ్వుతో.
“ఇంతవరకు ఎక్కడా ట్రై చేయలేదు కదా!” అన్నాడు కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
“అభీ యూ ఆర్ సో నాటీ!” అంది.
“ఇపుడు నాటీ అంటున్నావు. ఇందాక ‘దొంగ’ అన్నావు కదా!” అన్నాడు ఆమెను దగ్గరకు హత్తుకుంటూ.
“మరి కాదా అంది.”
” అన్నింటిని నిజం చేస్తా, కొంచెం ఆగండి నైమిశ గారూ.”
అతడు ఒక్కసారిగా ఉలికిపడ్డాడు.
“నైమిశా, ప్లీజ్… ఒక్కక్షణం నీ బందీని రిలీజ్ చెయ్యవా? ఒకటి మర్చిపోయేను సుమా!”అడిగేడు.
“ఒకే” అంటూ చేతులు వెనక్కు తీసుకుంది నైమిశ.
“మరచిపోయాను!” అంటూ “నైమిశా, ఇలా రా చెప్తాను” అని ఆమెను పట్టుకొని బెడ్ పై కూర్చోబెట్టాడు.
జ్యూయెలరీ షాప్ బ్యాగ్‌లోంచి చిన్న పెట్టె తీసాడు. అందులో నుంచి మువ్వల పట్టీలు, మట్టెలు వున్న కవర్ తీసుకుని బెడ్ పై కూర్చున్నాడు దూరంగా.
అతడు వెనక్కువాలి, నైమిశ రెండు పాదాలను గుండెపై పెట్టుకున్నాడు. కంగారుగా లేవబోయింది నైమిశ.
“వద్దు అభీ గారూ, నా పాదాలు మీ గుండెపైనా!” అంటూ.
“డిస్టర్బ్ చెయ్యకు నైమిశా, నువ్వు పాదం కదుపుతుంటే ఇక్కడ హుక్ పట్టటం లేదు!” అంటూనే రెండు పాదాలకు మువ్వల పట్టీలను పెట్టేశాడు.
“మట్టెలు కొంచెం టైట్‌గా ఉన్నాయి. నొప్పిగా వుందా నైమిశ?” అడిగేడు.
“లేదులే అభీ.”అంది.
“లవ్లీ నైమిశా! నీ సున్నితమైన పాదాలతో వాటికి అందం వచ్చింది!” అంటూ ఆమె పాదాలను పెదవులతో స్పృశించాడు.
నైమిశ నెమ్మదిగా లేచింది. పాదాలు చూసుకుంది. ‘అందంగా ఉన్నాయి.’అనిపించింది.
” థాంక్ యు డియర్ అభీ. ” అంటూ పాదాలను కదిలించింది. మువ్వలు సున్నితంగా ‘ఘల్లు ‘ మన్నాయి.
“నీ మువ్వల సవ్వడి, నా గుండె స్పందనతో కలిసి కవ్విస్తుంది నా మనసును నైమిశా” అంటూ అల్మారాలో వున్న మల్లెలను దోసిలిలో తీసుకున్నాడు అతడు.
“ఇవే నీకు తలంబ్రాలు” అంటూ ఆమె తలపై పోసేడు.
నైమిశ చిన్నగా నవ్వింది. లేచి మిగిలిన మల్లెలను అతడి తలపై పోసింది దోసిలితో.
“అభీ, మన జీవితం ఈ మల్లెల సువాసనలాగే మత్తుగా, హాయిగా ప్రేమానురాగాలను పంచుతూ ముందుకు సాగిపోవాలి!” అంటూ అతడి గుండెలో ఒదిగిపోయింది నైమిశ.


VIJAYARANI GARU
NICE STORY