ఎంత వరకు?

Spread the love

రామలత డోర్ బెల్ నొక్కింది.

        డోర్ తీసిన తండ్రి రామస్వామితో.. “మీరే తీస్తారనుకున్నాను.” అంది. నవ్వింది. కానీ ఆ నవ్వుకు జీవం లేదు.

        “ఫస్ట్ కదా. నీ జీతం ముట్టే రోజుగా. జీతం డ్రా చేసి తెచ్చావుగా” అడుగుతాడు రామస్వామి. తను తన ధోరణిలో తానున్నాడు.

        “ఇంట్లోకి వస్తోందిగా. ఏంటా తొందర.” విసుక్కుంటుంది అప్పుడే అక్కడికి వస్తున్న రామస్వామి భార్య రమణమ్మ.

        రామస్వామి వీటి వేటినీ పట్టించుకోక.. తను తన ధోరణిని కొనసాగిస్తున్నాడు.

        రామలత తన హేండ్ బేగ్ నుండి ఓ కవర్ తీసి తండ్రికి ఇస్తోంది.

        దానిని పుచ్చుకున్న రామస్వామి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. కవర్ లోని డబ్బు నోట్లను తీసి లెక్కిస్తుంటాడు.

        రామలత తన గది లోకి వెళ్లిపోతోంది.

        రమణమ్మ కూతురుకు టీ చేసి ఇవ్వడానికి వంట గది వైపు కదులుతోంది.

        రామస్వామి ఓ ప్లీడర్ గుమస్తా. తన 19వ ఏటనే ఓ లాయర్ వద్ద పనికి కుదిరాడు. మెల్లి మెల్లిగా పనులు నేర్చుకుంటూ ఆయన వద్దే ప్లీడర్ గుమస్తాగా స్థిర పడ్డాడు.

        ఆ లాయర్ చొరవతోనే రమణమ్మతో ఓ ఇంటి వాడయ్యాడు. ఆ తోవన రామలతకి తండ్రయ్యాడు.

        రామలత డిగ్రీ అయ్యేక.. పోటీ పరీక్షలు పాసై.. ఓ గ్రామీణ బ్యాంక్ లో జాబ్ సంపాదించుకుంది. ఈ అంతటికి రామస్వామే కర్త.. క్రియ.

        రామస్వామికి సంపాదన అంటే మోజు. చాలీచాలని జీతం అంటే అఇష్టత.

        కూతురు సంపాదన తన చేతులు మీద కదలాడాలన్నది అతడిలో ఉన్న ఓ బలమైన కోరిక. తత్ఫలితం.. కూతురు జీతం.. ఆమె అందుకున్న రోజునే.. అతడి చేతుల్లోకి వచ్చేయాలి. దానికై.. భార్య పోరు కానీ.. కూతురు మొర కానీ.. అతడు ఇసుమంత కూడా పట్టించుకోడు.

        రామలతకి ఉంటుంది.. తన జీతంలో కొంత తనకై వెచ్చించుకోవాలని.. తన ఇష్టాలు నెరవేర్చుకోవాలని. అబ్బే.. తన తండ్రి ముందు అవి తనకి కుప్పిగంతులు మచ్చే.

        “మీది మరీ చోద్యం. కష్టపడుతోందది. తనకంటూ ఖర్చులు ఉంటాయి. దానికి కొంత వదలండి.” చాలా మార్లు రమణమ్మ అన్నది భర్తతో. అనడమేమిటి కసురుకుంది కూడా.

        అబ్బే.. రామస్వామి కొఱకరానికొయ్యే.

        చెప్పి చెప్పి గొంతునబడ్డ వెలగకాయ మాదిరైపోయింది రమణమ్మ.

        మగ్గి మగ్గి కుక్కినపేను మాదిరైపోయింది రామలత.

        టీ గ్లాస్ తో కూతురు గదిలోకి వెళ్తోంది రమణమ్మ వంట గది నుండి.

        కూతురు ఇచ్చిన డబ్బు కవర్ తో తమ గదిలోని బీరువా వైపు చేరిపోయాడు రామస్వామి.

        ఇదే తీరు రామలతకి పెళ్లైనంత వరకు కొనసాగింది.

        రామలత పెళ్లి కబురు వచ్చింది కనుక.. దానికి రిలేటైనవి చాలా జరిగాయి. కానీ వాటన్నింటికీ మూలం మాత్రం మీకు తెలిస్తే చాలు.

        ఆ మూలం..

        “పిల్ల పెళ్లి తలంపు లేదా మీకు. ఇంకా దాని సంపాదన మీదే మీ యావ తగదు.” ఓ రోజున రామస్వామిని రమణమ్మ నిలదీసేసింది.

        దానికి రామస్వామి చాలా నింపాదిగా.. “అయ్యో లేకేమి. దానికి పెళ్లి చేయాలి. కానీ దానికి పాతికేళ్లే నిండాయిగా ఇంకా.” అంటాడు.

        దాంతో రమణమ్మకి చిరాకు పొడ్చుకు వచ్చేసింది. తెగ రుసరుసలాడేసింది.

        అది మొదలు రోజుకు రెండు.. మూడు మార్లయ్యినా రామలత పెళ్లి ఊసులు ఆ భార్యాభర్తల మధ్య పొడచూపుతుండేవి.

        ఎట్టకేలకు రామస్వామి తలొగ్గాడు అనే కంటే.. రామలతకి పెళ్లయ్యే సమయం ఆసన్నమైందంటేనే సబబు.

        రామలతకి పెళ్లైపోయింది.

        రామలత భర్త శ్రీనివాసం ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

        పెళ్లితో రామలత ఊరు మారుతోంది.

        లక్కీగా శ్రీనివాసం జాబ్ చేస్తున్న చోటునే తను పని చేస్తున్న గ్రామీణ బ్యాంక్ బ్రాంచీ ఒకటి  ఉండడంతో.. అక్కడికి బదిలీ అయ్యి.. తను తన ఉద్యోగంని కొనసాగించుకోగలుగుతోంది రామలత.   తనకు ఉన్న ఉన్నతి పరిచయాలతో రామలత ట్రాన్స్ఫర్ కు శ్రీనివాసం చొరవ బాగా తోడయ్యింది కూడా.

        రామలత పెళ్లితో తన కూతురు సంపాదన అందక రామస్వామి బాగా డీలాపడిపోయాడు. అది పోల్చిన రమణమ్మ అస్సలు దానిని పట్టించుకోవడమే లేదు.

        కానీ.. రామలత పెళ్లి కబురులు ఆడుతున్న రోజుల్లో జరిగిన ఓ సంఘటన మీకు తెల్పాలి..

        అది..

        “పెళ్లి తర్వాత కూడా.. రామలత జీతంలో.. సగం నా చేతిలో పడాలి. అందుకు ఒప్పుకున్న వాడితోనే పిల్లకి పెళ్లి చేస్తాను.” అంటాడు రామస్వామి.

        కస్సుమంటోంది రమణమ్మ.

        అలాగే ఎప్పటి నుండో తండ్రి చేష్టని దిగమింగుకుంటున్న రామలత కూడా అడ్డవుతోంది.

        “అలా ఐతే నాకు పెళ్లి కాదు.” అనేసింది ఖరాఖండీగా.

        దాంతో పాలుపోక రామస్వామి బేజారు పడుతూనే తగ్గిపోయాడు. లేదు తగ్గిపోవలసి వచ్చింది.. తల్లీకూతురుల ఏక గొంతుకు.

        రామలత పెళ్లయ్యాక తెగ సంబర పడింది. పెళ్లయ్యిందని కాదు.. తన సంపాదన ఇక తనదేనని.

        ఐనా ఆ ముచ్చట పెళ్లి తర్వాతి తన తొలి సంపాదన అందిన రోజు వరకే సాగింది.

        ఆ సాయంకాలం పూటన..

        తను బ్యాంక్ నుండి బయటికి వస్తుండగా.. గేట్ వద్ద బైక్ తో ఉన్న శ్రీనివాసంని చూస్తోంది రామలత.

        “ఏంటిలా వచ్చారు.” సరదాగా అడుగుతోంది.

        “నీ శాలరీ డేగా. నీ శాలరీకి సేఫ్టీ ఉంటుందని వచ్చాను.” నవ్వుతాడు శ్రీనివాసం.

        “శాలరీకి సేఫ్టీ ఏంటి. నేను చిన్నపిల్లని కాను. నా జాగ్రత్త నాకు తెలుసు.” చెప్పుతోంది రామలత.

        ఆ వెంబడే..

        “ఐనా.. నా శాలరీ నా బ్యాంక్ అకౌంట్ లో పడిపోతోంది. కేష్ గా తీసుకోవడం లేదు.” చెప్పింది.

        “అందేంటి. మీ నాన్నకి ఏ నెల కా నెలది కేష్ గా ఇచ్చేసేదానివటగా.” అడిగాడు శ్రీనివాసం.

        రామలతకి చిరాకేస్తోంది.

        “ఇలా ఇక్కడ ఆ మాటలు ఎందుకు. ఇంటికి పోయి అనుకుందాం.” చెప్పగలుగుతోంది.

        శ్రీనివాసం బైక్ స్టార్ట్ చేసేసాడు.

        బైక్ వెనుక కూర్చుంది రామలత.

        బైక్ తన ఇంటి వైపుకు పోతోంది.

        దార్లోనే..

        “అలవాటు మార్చుకుంటే ఎలా. నీ శాలరీ నాకు ఇకపై ముట్టాలిగా.” అంటాడు శ్రీనివాసం.

        రామలతకి అయోమయమవుతోంది.

        “మీ నాన్న నీ శాలరీ విషయం మాట్లాడేరు. నీ వాళ్లు నీ శాలరీని వాడుకునేవారటగా. అది ఇక నీ పెళ్లితో అందక తమకు కష్టమవుతోందన్నారు కూడా. నీ శాలరీలో సగం కోరారు కూడా..” చెప్పుతున్నాడు శ్రీనివాసం.

        “మీ మాటలు సరిగ్గా వినిపించడం లేదు. ఇంటికి వెళ్లేక మాట్లాడదామా. ప్లీజ్.” చెప్పింది రామలత. తనకి భర్త మాటలు బెంబేలు పరుస్తున్నాయి.

        ఇల్లు చేరేక..

        తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లీ వెళ్లగానే..

        “రా ఇలా కూర్చో.” అనేసాడు శ్రీనివాసం. ఓ కుర్చీలో కూర్చుండిపోయాడు.

        తప్పక రామలత మరో కుర్చీలో కూర్చుంటుంది.

        “నీ శాలరీలో మీ వాళ్లకి సగం ఇవ్వడం ఏంటి. కుదరదుగా. మీ నాన్నకి అదే చెప్పేసాను.” జోరుగానే చెప్పాడు శ్రీనివాసం.

        రామలత సర్దుకోలేక పోతోంది.

        “నువ్వు పెళ్లితో చేరావంటే.. నా ఖర్చులు పెరుగుతాయిగా. నీ శాలరీతో దానిని సరి చేసుకోవాలిగా. ఏం అంటావు.” సీరియస్ గానే మాట్లాడుతున్నాడు శ్రీనివాసం.

        పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ అట్టు లా అయ్యింది రామలత పరిస్థితి. గింజుకుంటోంది.

        “నీ శాలరీ ఇప్పటి నుండి నా బ్యాంక్ అకౌంట్ కు పూర్తిగా ట్రాన్స్ఫర్ చేస్తుండు.” ఆర్డర్ లా అన్నాడు రామస్వామి.

        రామలత ప్రాణం చివుక్కుమంది. వెర్రిగా భర్తను చూస్తోంది.      

        అతడు పర్సు తీసి ఓ లెమినెటెడ్ కార్డును తీసాడు.

        “నా బ్యాంక్ డిటైల్స్ ఇవి. ఇప్పుడే నీ శాలరీ మొత్తం నాకు పంపేసి.” చెప్పాడు.

        ఆ వెంబడే..

        రామలత మంత్లీ శాలరీ మొత్తం చెప్పి.. “మీ నాన్న చెప్పారు. కానీ నీ శాలరీ షీట్ నాకు ఓ మారు చూపించు.” అన్నాడు.

        రామలత భారంగా లేచింది. అతడి నుండి ఆ కార్డు పుచ్చుకుంది. గదిలోకి నడిచింది.

        “తర్వాత తెములుదువు. ముందు నేను చెప్పినట్టు చేసేయ్.” చెప్పాడు రామస్వామి.

        అయ్యో.. రామలత..

        రామలత ఆశలన్నీ గాలి తీసిన బెలూన్స్ లా తుస్స్ మన్నాయి.

        పాపం.. మారు బదులు ఇవ్వలేక పోయింది.. భర్త కూడా తన తండ్రికి జరాక్స్ కాపీ అనుకోవడం తప్పా. ఆ తోవన తన భర్త చెప్పినట్టు చేస్తోంది.

        కాలం తన తీరున సంవత్సరాలను దాటేస్తోంది..

        రామలత కొడుకు గోపాలం.. టీచరయ్యాడు.

        తన తొలి జీతంని తెచ్చి.. తన తల్లి చేతిలో పెట్టాడు.

        అప్పటికే.. ఆయా సందర్భాలలో.. తన తాత.. తన తండ్రి నైజాలను.. ముఖ్యంగా తల్లి తన సంపాదనతో తీర్చుకోలేని ముచ్చట్లును.. తను తన తల్లి నుండి ఎరిగి ఉన్నాడు.

        “నాకు ఎందుకు..” అంటోంది కొడుకుతో రామలత కాస్తా నిస్సత్తువగానే.

        “లేదమ్మా. నా జీతం నువ్వు వాడుకో.” చెప్పాడు గోపాలం.

        “ఎంత వరకు?” అడుగుతోంది రామలత.

        “నీ ముచ్చట్లు తీర్చుకునేంత వరకు.” చెప్పేసి అక్కడి నుండి కదిలాడు గోపాలం.

        వెళ్తున్న కొడుకును చూస్తూ ఉండిపోతోంది రామలత..

        చేతిలోని గోపాలం జీతం.. తనకు చాలా భారంగా అనిపిస్తోంది..

               ***

బి వి డి ప్రసాదరావు

నేను, బివిడి ప్రసాదరావు, తెలుగు రైటర్ ని, తెలుగు బ్లాగర్ ని, తెలుగు వ్లాగర్ ని. నా పూర్తి పేరు - బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు. నేను పుట్టింది (15.5.1956), పెరిగింది, చదివింది (సామాన్య విద్యతో పాటు సాంకేతిక విద్య) మరియు నేను చేపట్టిన వృత్తి (సాంకేతిక విద్యల శిక్షణ) నిర్వహించింది  - పార్వతీపురం  (ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా)  లో. నేను ప్రస్తుతం (6.12.2011 నుండి) ఉంటుంది -  హైదరాబాద్ (తెలంగాణ) లో.  ఇదే నా మొదటి  నివాస స్థల  మార్పిడి.   ఇది  అవసరంతో ముడిపడిన ఒక కొత్త అనుభూతి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *