ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నగర శివారున.. కొండల మధ్య.. మధ్యస్థ అడవీ ప్రాంతం లాంటి ఓ ఎస్టాబ్లిస్ట్ చోటున.. ఒక రిసార్ట్ ని కొనుగోలు చేసుకున్నాను.
వృత్తి రీత్యా నేను ఒక కార్డియాలజిస్ట్ ని.
నాకు వృత్తే.. తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. బంధువులు.. మిత్రులు.. కుటుంబం.
వృత్తిలో గట్టి పట్టుకై పూర్తి సమయాన్ని హెచ్చించేసాను. దాంతో పెళ్లీడు దాటి నలభైయో పడిలోకి వచ్చేసాను.
నా పెళ్లికై పోరే నా తల్లిదండ్రులూ ఎప్పుడో చనిపోయారు.
తోబుట్టువులు.. బంధువులు లేక నేను కుటుంబ పరంగా ఒంటిరిని. ఐనా నాకు ఇవైవీ వెలితిగా అనిపించడం లేదు. కానీ.. అప్పుడప్పుడు పిల్లల్ని.. తల్లుల్ని చూడగా.. నా మది గందికవుతోంది.. ప్చ్..
నేను రిసార్ట్ కొనుక్కున్న లగాయితు నుండి.. నగరం ఇంటి నుండి.. ప్రతి శనివారం సాయంకాలం రిసార్ట్ కి క్రమం తప్పకుండా వెళ్తుంటాను. ఆదివారం సాయంకాలం తిరిగి నగరం ఇంటికి వస్తుంటాను.
నగరంలోని నా ఇంటిని క్రమంగా ఐదంతస్తులుదిగా విస్తరించుకున్నాను.
కింది పోర్షన్ న రెండు గదులు నాకై కేటాయించుకున్నాను. వాటిలో ఒక దానికి ఎటాచ్డ్ బాత్రూం.. మరో దాని దరిన కిచిన్ ని ఏర్పర్చుకున్నాను.
మిగతా గదులును కన్సల్టింగ్ రూమ్స్ గా మార్చాను.
ఇక పై పోర్షన్స్ ను ఇన్పేషంట్స్ రూమ్స్ గా.. ఆపరేషన్ థియేటర్స్ గా వినియోగించుకుంటున్నాను.
ఆరుగురు వెల్ ట్రైన్డ్ డాక్టర్స్ ను.. పదుల్లో అదే విధమైన స్టాఫ్ ను నాకు అందుబాటుగా సమకూర్చుకున్నాను.
వీళ్ల మూలంగానే నా వృత్తి పని ఒత్తిడిని మెల్లిగా తగ్గు ముఖం పట్టించుకున్నాను.
వారంలో చివరి రెండు రోజులు పూర్తిగా నాకై కేటాయించుకున్నాను.
ఆ తోవతోనే నేను నా అభిరుచుల్ని.. నా వంతుగా.. ఆ రెండు రోజుల నాడు నెరవేర్చుకుంటున్నాను.
అత్యవసరమైతేనే నన్ను నా స్టాఫ్ డిస్టర్బ్ చేస్తోంది. లేదంటే నా స్టాఫంతా కూడా ఆ రెండు రోజులు నా ఊసు ఎత్తదు.
నేను ఉన్నట్టే నా స్టాఫ్.. హాస్పిటల్ పనులు తనంతట తాను నిర్వహించుకుంటోంది.
రిసార్ట్ లో ఉన్నంత సేపు నేను ఏదో తమకమున ఉంటాను.
అక్కడ.. అదో చెప్పలేని అనుభూతి నాకు.
రాత్రి వచ్చాను. రిసార్ట్ లో ఉన్నాను.
నాకు తొలుత నుండి లోన్లీ గా ఉండడం అబ్బేయడంతో రిసార్ట్ కు ఒంటరిగానే వస్తాను. నాతో పాటు రకరకాల పచ్చి ఫ్రూట్స్ ను.. డ్రై ఫ్రూట్స్ ను.. కొద్ది రకాల బిస్కెట్స్ ను.. కొద్దిపాటి హాట్స్ ను.. కొబ్బరి బోండాలును.. మినరల్ వాటర్ బాటిల్స్ ను.. రెండు రోజులకు సరిపడేలా తెచ్చుకుంటుంటాను.
నిద్ర లేచాను. కాలకృత్యాలు పూర్తి చేసాను.
ఇంటి ముందు ఆరుబయలున.. పూల మొక్కల చోటున.. చెట్ల నీడలో కూర్చో తలచి.. ముఖ ద్వారం తలుపు తీసాను.
అక్కడ..
బయట..
ఎదురుగా..
ఎవరో ఆమె..
మట్టి నేల మీద.. పడిపోయినట్టు.. పడుకున్నట్టు కనిపించింది.
అటు తిరిగి ఉండడంతో ఆమె ముఖం అగుపించడం లేదు.
ఇంతకీ ఎవరీమె.. ఇక్కడికి ఎలా వచ్చింది..
అటు ఇటు చూసాను.
ఒక పక్కగా నా కారు తప్ప.. మరొకరు కాన రాలేదు.
ఇక్కడి రిసార్ట్స్ దూర దూరంగా ఉంటాయి.
రోడ్డు వైపు పెద్ద గేటున షిఫ్టులు వారీగా ఇద్దరేసి సెక్యూర్టీ గార్డ్స్ నిత్యం ఉంటారు.
ఇక్కడ ఉన్న రిసార్ట్స్ వాళ్లంతా.. రిసార్ట్ వారీగా.. సమానంగా.. మొత్తం ఎత్తుకొని.. వాళ్లకి నెలవారీగా ముట్ట చెప్పుతుంటాం.
అలాగే అప్పుడప్పుడు నాలా వచ్చేవారు.. తమ రిసార్ట్స్ ను శుభ్ర పర్చడానికి వచ్చేవారిని ఈ సెక్యూర్టీ గార్డ్స్ సమకూర్చిపెడుతుంటారు.
కానీ.. మేము ఇచ్చే మొత్తం సరిపడడం లేదంటూ గత రెండు వారాల నుండి సెక్యూర్టీ గార్డ్స్ రావడం లేదు.
దాంతో బయటి కాపలాలు.. శుభ్రపరిచే వాళ్ల సేవలు అందుబాటులో లేవు.
ఇది ఎప్పటికి.. ఎలా పరిష్కారం అవుతోందో.
ఇది నాకు ఇబ్బందవుతోంది. ఐనా.. నా అలవాటు మేరకు నేను ఇక్కడికి వస్తున్నాను. సర్దుకుపోతున్నాను.
‘బయట అడ్డు లేకనే.. ఈమె ఎవరో ఇలా వచ్చేసి ఉంటుంది.’ అనుకున్నాను ఆమెనే చూస్తూ.
గుమ్మం దాటి ఆమె దరికి చేరాను.
“హే.. హై..” లేపుతున్నట్టు అన్నాను.
ఆమె లేవ లేదు. కదల లేదు కూడా.
ఒంగి చూసాను. ఆమె మస్తు నిద్రలో ఉంది.
సరిగ్గా నిల్చున్నాను. ‘ఎలా..’ అనుకుంటూనే కదిలి.. ఆ పక్కనే ఉన్న కర్ర బల్ల బెంచీ మీద కూర్చున్నాను. ఆమెనే చూస్తున్నాను.
ఆమె.. ఆహార్యముతో.. ఒక లంబాడీ మనిషిగా తేల్చుకున్నాను. ఆమె.. శరీర బిగువుతో ఒక ప్రాయము అమ్మాయిగా గుర్తించాను.
ఎలా వచ్చిందో తర్వాత.. ఎందుకు వచ్చింది.. ఇక్కడే ఎందుకు నిద్ర పోతోంది.
తెములుకోలేక పోతున్నాను.
ఆమెనే చూస్తూ ఉండిపోయాను.
ఈమె సొదన పడి ఇక్కడి ప్రకృతిని నా తీరున ఆస్వాదించ లేకపోతున్నాను.
రమారమీ పావు గంట లోపునే నేను లేచాను.
ఆమె చెంతకి మళ్లీ వెళ్లాను.
మళ్లీ ఒంగున్నాను.
ఆమె భుజం మీద తట్టాను. మళ్లీ తట్టాను. మళ్లీ మళ్లీ తట్టాను.
ఆమె గమ్మున లేచింది. లేస్తూనే చుట్టూ చూస్తోంది. నన్నూ చూస్తోంది.
ఆమె వాటం బట్టి ఆమె అయోమయంన ఉన్నట్టు తెలుస్తోంది.
బెదురుతోంది కూడా.
నేను సరిగ్గా నిల్చుని.. “నిదానం.. నిదానం..” అన్నాను.
ఆమె కుదురవుతోంది.
“ఎవరు నువ్వు.” అడిగాను.
ఆమె ఏమీ చెప్పలేదు.
ఈ మారు కాస్తా హెచ్చు గొంతుకతో అడిగాను.
ఆమె ఏదో చెప్పింది.
నాకు అర్థం కాక తిరిగి అడిగాను.
ఆమె నన్ను ఎగాదిగా చూస్తూ.. ఏదేదో చెప్పుతోంది.
ఆమె మాటలాడుతోంది.. ఆమె భాష అర్ధం కావడం లేదు.
ఆమె హావభావములు బట్టి ఆమె ఏదో అవస్థలో ఉన్నట్టు ఉంది.
ఆమె చెప్పడం ఆపింది. ఆ వెంబడే.. కడుపు చూపుతూ ఏదో చెప్పింది.
నాకు తను తిండి అడుగుతున్నట్టు తోచింది.
కదిలాను.
లోనికి వెళ్లి ఒక బిస్కెట్ పాకెట్.. ఒక కొబ్బరి బోండాం తెచ్చి ఆమెకి అందించాను.
తిరిగి బెంచీ మీద కూర్చున్నాను.
ఆమె ఆబగా బిస్కెట్స్ తింటోంది.
అరె.. ఆకలి జాస్తీ ఐనట్టు ఉంది.
“మరోటి ఇవ్వనా.” అడిగాను.
ఆమె ఏమీ అనలేదు. తిండి సొదన ఉండిపోయింది.
నేను తిరిగి లోనికి వెళ్లాను.
చాకు తెచ్చాను. ఆమె ముందు ఉన్న కొబ్బరి బోండాం తీసుకున్నాను. దాని ముఖం వైపు ఒలిచి ఉన్న చోట చాకుతో రంధ్రం చేసాను.
ఆ బోండాంని ఇస్తూ.. “ముందు ఈ నీళ్లు తాగు.” చెప్పాను.
ఆమె అలానే చేస్తోంది.
నేను లోనికి వెళ్లి.. తీసిన చోట చాకుని పెట్టి.. మరో బిస్కెట్ పాకెట్ మరియు నీళ్ల సీసాతో తిరిగి వచ్చి.. బెంచీ మీద కూర్చున్నాను.
“ఇవిగో..” అన్నాను.
ఆమె సాగినట్టు ఒంగోని.. నా చేతి నుండి బిస్కెట్ పాకెట్ ను మరియు నీళ్ల సీసాను అందుకుంది.
అప్పటికే.. ఇక ఆమెను ఏం అడిగినా లాభం లేదని నేను తేల్చుకొని ఉన్నాను. కారణం ఆమె భాషే.
అది వాళ్ల భాషేమో.. నాకు తెలియని భాష.
నా భాష ఆమెకు తెలుస్తున్నట్టు లేదాయె.
నా చేష్టలు మాత్రం ఆమెకు అర్ధమవుతున్నట్టుంది.
అప్పుడే నాకు స్ఫురించింది.
వెంటనే లేచి.. లోనికి వెళ్లాను. నా సెల్ ఫోన్ తీసుకొని వచ్చి.. బెంచీ మీద కూర్చున్నాను.
నా హాస్పిటల్ లోని గిరీశంకి ఫోన్ చేసాను. అతడికి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు.. మరో ఎనిమిది భాషలు తెలుసు. బహుశా ఈమె భాష తెలుసుండొచ్చేమో.
అటు కాల్ లైన్ కు కనెక్ట్ ఐన గిరీశంకి.. ఈమె సంగతి చెప్పాను. నా పరిస్థితి చెప్పాను.
“ఈమెకు ఫోన్ ఇస్తాను. మీరు మాట్లాడండి. ఈమె భాష మీకేమైనా తెలుస్తోందేమో.” కోరాను.
అటు గిరిశం సమాధానం వినకనే.. ఆమెకు ఫోన్ ఇచ్చి..
“మాట్లాడు.” అన్నాను. ఆ వెంబడే అట్టి సైగలు కూడా చేసాను.
ఆమె.. నేను ఇచ్చిన ఫోన్ లో మాట్లాడుతోంది.
అటు గిరీశం కూడా మాట్లాడుతున్నట్టు ఉంది.
నిముషంలోపే.. ఆ ఇద్దరికి తమ తమ మాటలు అర్ధం అవుతున్నట్టు నాకు అర్ధమైపోయింది.
ఐదు నిముషాల తర్వాత.. ఆమె తిరిగి నాకు ఫోన్ ఇచ్చింది.
నేను అటు గిరీశంతో.. “ఈమె చెప్పింది తెలిసిందా.” గమ్మున అడిగాను.
అటు గిరీశం.. ఈమె గురించి తెలుసుకుందంతా చక్కగా చెప్పాడు.
“సరే. నేను అవసరమైతే మళ్లీ కాల్ చేస్తాను.” చెప్పాను. కాల్ కట్ చేసేసాను.
ఆమెనే చూస్తున్నాను. ఆమె నన్నే చూస్తోంది.
ఆమె చూపుల్లో ఇంకా బెదురు ఉంది.
‘ఈమె పేరు మంగ్లీట. ఈమె ఒక తండా మనిషిట. ఆ తండా పేరు.. చోటు చెప్పడం లేదట. ఈమె మారటతల్లి దాష్టికం భరించలేక తప్పించుకొని పారి పోయి అటు నుండి ఇటు వచ్చేసిందట.
తనకు అమ్మ ఉన్నంత వరకు బాగానే ఉండేదట. అమ్మ చనిపోయేక.. మారటతల్లి వచ్చేక.. తనకు బాగా లేదట.
ఈ మధ్య తన నాన్న కూడా చనిపోయాడట. మారటతల్లి మరింత పేట్రేగిపోతోందట. చిన్నాచితక దానికి చితక కొట్టేస్తోందట. తనకు ఏమీ తోచక ఎటైనా పారిపోవడమే మేలనుకుందట.
అలా వచ్చేసిన తను.. నడిచి నడిచి అలిసిపోయిందట. దిక్కు తోచక.. చీకటి పడడంతో.. ఇక్కడికి వచ్చేసిందట.
అలసట.. ఆకలి మూలంగా.. ఇక్కడ వరకు వచ్చి.. పడిపోయిందట.
వచ్చేసిందే కానీ.. ఇప్పుడు ఏం చేయాలో తెలియక.. చావాలనుకుంటుందట.’
ఆమె గురించి.. గిరీశం ద్వారా నాకు తెలిసింది ఇంతే.
ఆమెను చూసాను. ఆమె చూపులు బట్టి.. తను చాలా బెంబేలుపడుతున్నట్టు ఈజీగా తెలుస్తోంది.
నా సొదన నేనున్నాను.
నా మది గిలక్కొట్టబడుతోంది.
నా మస్తిష్కము చురుగ్గా యోచిస్తోంది.
అలానే ఆమెనే చూస్తున్నాను.
ఆమె కూడా నన్నే చూస్తోంది.
తర్జనభర్జనలు ఆపేసాను.
తల విదిలించుకున్నాను.
ఆమెకై మొగ్గేసాను.
ఐనా.. నేనేం చెప్పినా.. ఆమెకు అర్ధం కాదు.
ఆమెను ఓదార్చాలి. ఆమెలో చావు తలంపుని తుంచాలి. ఎలా.
తిరిగి గిరీశంకి ఫోన్ చేసాను.
“ఈమె భాషలో.. ‘నీకు నీ సొంత అమ్మలా అమ్మనవుతాను’.. అన్నది ఎలా చెప్పాలి.” అడిగాను.
అటు గిరీశం చెప్పాడు.
మళ్లీ చెప్పించుకున్నాను. తర్వాత ఆ కాల్ కట్ చేసాను.
ఫోన్ ని బెంచీ మీద పెట్టేసాను.
లేచాను. ఆమె దరికి వెళ్లాను.
కొద్దిగా ఆమె వైపుకు ఒంగి.. ఆమె భాషలో.. “నీకు నీ సొంత అమ్మలా అమ్మనవుతాను.” చెప్పాను.
ఆమె నన్ను చూస్తోంది. ఇంకా ఆ చూపుల్లో బెదురు ఉంది.
మళ్లీ చెప్పాను.. ఆమె భాషలోనే.
ఆమె గుబుక్కున నా కాళ్లకు నమస్కరించింది.
ఆమె భుజాలు పట్టి లేవనెత్తాను. ఆమె నన్ను పెనవేసుకుపోతోంది. వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది.
ఆమె స్పర్శ.. నాకు నచ్చిన ప్రకృతిలా అనిపిస్తోంది.
‘తల్లినయ్యాను.. నేనూ తల్లినయ్యాను..’ ఆ క్షణాల్లో అనుకున్నాను.. పులకిస్తున్నాను..
నాకు ఈ అనుభూతి నచ్చుతోంది..
నేనైనా ఈమె భాషకు మారతాను.. లేదా.. ఈమెనైనా నా భాషకు మార్చుకుంటాను..
ఐనా.. తల్లీ బిడ్డ బంధంకి భాష అడ్డంకా.. అవసరమా..
***

బి వి డి ప్రసాదరావు
నేను, బివిడి ప్రసాదరావు, తెలుగు రైటర్ ని, తెలుగు బ్లాగర్ ని, తెలుగు వ్లాగర్ ని. నా పూర్తి పేరు - బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు. నేను పుట్టింది (15.5.1956), పెరిగింది, చదివింది (సామాన్య విద్యతో పాటు సాంకేతిక విద్య) మరియు నేను చేపట్టిన వృత్తి (సాంకేతిక విద్యల శిక్షణ) నిర్వహించింది - పార్వతీపురం (ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా) లో. నేను ప్రస్తుతం (6.12.2011 నుండి) ఉంటుంది - హైదరాబాద్ (తెలంగాణ) లో. ఇదే నా మొదటి నివాస స్థల మార్పిడి. ఇది అవసరంతో ముడిపడిన ఒక కొత్త అనుభూతి.