గురూపదేశం

Spread the love

కుటుంబ కలహాలతో చింతామణి పండితుడికి ప్రాణం విసుగెత్తింది.‌తనకి ఆదరణ కూడా కరువవడంతో అతను సన్యసించాలని నిశ్చయించుకున్నాడు.‌సన్యాసిగా మారాలనే అతని నిర్ణయం విన్న అతని ప్రాణ మిత్రుడు పండిత మోతేరామ్ శాస్త్రి అతనికి కొన్ని సలహాలు చెప్పేడు. ‘ మిత్రమా,‌ నేను ఎందరో సాధు సన్యాసులను సన్నిహితంగా ఎరుగుదును. వాళ్ళు ఎవరి ఇంటికైనా, భిక్ష కి వచ్చినప్పుడు వాళ్ళు తమ చేతులు చాచి,‌వినయంగా తల వంచి భిక్ష కావాలని అడగడమో, “ దేవుడు నిన్నూ, నీ కుటుంబాన్నీ చల్లగా చూస్తాడు,” అని నాటకీయంగా దీవించడమో చెయ్యరు.‌ నిజమైన సన్యాసులు ఎవరి గడపలోనైనా నిలబడ్డప్పుడు తమ ఉనికిని తెలుపుతూ ఒక్క కేక వేస్తారు. అది వింటూనే, ఆ ఇంటి వాళ్ళు తుళ్ళిపడి,‌ఏం జరిగిందో చూడడానికి పరుగున వస్తారు.‌ నాకు అలాంటి పొలికేకలు మూడు, నాలుగు తెలుసు. నువ్వు కూడా వాటిని నేర్చుకుని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు.

          “ గుడీ బాబా ఇలా అరిచేవాడు, ‘ ఒకడు చస్తే, అయిదుగురు చస్తారు’ అని.‌ ఇలాంటి పొలికేక వినగానే, జనాలు అతని కాళ్ళ మీద పడి పోయేవారు.‌ సిద్ద్ భగత్ గారి పొలికేక మరో విధంగా ఉండేది: “ తినండి, తాగండి, జల్సా చెయ్యండి, కానీ సాధువు గారి బెత్తం గురించి జాగ్రత్త పడండి.‌” నంగా బాబా గారు ఏమనేవారంటే, “ మీరు నాకు భిక్ష ఇవ్వండి, లేదంటే ఎవరైనా భిక్ష ఇచ్చే ఏర్పాటు చెయ్యండి, నాకు తిండి పెట్టండి, నన్ను నిద్ర పుచ్చండి.” నీ గౌరవ మర్యాదలు, నిన్ను నలుగురూ ఆదరించే విధానం అన్నీ నీ నినాదం మీదనే ఆధారపడి ఉంటాయని గుర్తు పెట్టుకో. ఇంతకంటే నేను నీకు చెప్పేదేమీ లేదు.‌ నువ్వు, నేను చాలా కాలం కలిసిమెలిసి ఉన్నాం, ఇద్దరం కలిసి వందల కొద్దీ విందులు ఆరగించేం  అన్నది మర్చిపోకు.‌ మనం ఎక్కడైనా విందు భోజనానికి వెళ్ళినప్పుడు వడ్డించిన వంటకాలను ఒకరితో ఒకరం పోటీలు పడి మరీ తినేవాళ్ళం. ఇక ఇప్పుడు నువ్వు లేకుండా ఆ మజా ఉండదు.  దేవుడు ఎల్లవేళలా నీకు మంచి భోజనాన్ని సమకూర్చాలని కోరుకుంటున్నాను. ఇంతకు మించి చెప్పడానికేముంది?”

            చింతామణి గారికి ఆ సాధువుల నినాదాలు ఏవీ నచ్చలేదు. “ నా కోసం ప్రత్యేకంగా ఏదైనా ఆలోచించు,” అన్నాడతను.

       “ సరే, ఇదెలా ఉందో చూడు.. ‘ మీరు నాకు భిక్ష వెయ్యకపోతే, నేను మీ మీద పడతాను.’”

“ బాగానే ఉంది, కానీ, నువ్వు ఒప్పుకుంటే, దాన్ని నేను కుదిస్తాను.”

     “ సరే, కానివ్వు.”

“ ఇలా చెప్తే ఎలా ఉంటుంది : “ నాకు భిక్ష  భిక్ష వెయ్యండి. లేకుంటే, నేను మిమ్మల్ని భూస్థాపితం చేస్తాను.”?”

 మోతేరామ్ సంతోషంతో ఎగిరి గంతేసాడు! “ దేవుడా! దీనికిక తిరుగు లేదు. భక్తి వలన నీ బుద్ధి పదునెక్కింది.‌ అద్భుతం! ఒక్క సారి కేక పెట్టు. మేం కూడా వింటాం.”

         చింతామణి రెండు చెవుల్లో చేతులు పెట్టుకుని, తన శక్తినంతా కూడగట్టుకుని, పెద్దగా అరిచేడు: “ భిక్ష వెయ్యండి, లేదంటే మిమ్మల్ని భూమిలో పాతేస్తాను!” ఆ అరుపు ఎంత కర్ణకఠోరంగా ఉందంటే, మోతేరామ్ కూడా తుళ్ళి పడ్డాడు.‌ చెట్ల మీది గబ్బిలాలు బెదిరి పోయి, దూరంగా ఎగిరిపోయాయి.‌భయంతో కుక్కలు మొరగసాగేయి.

      మోతేరామ్ అన్నాడు కదా, “ మిత్రమా, నీ కేక కి నా గుండెలు అదిరిపోయాయి.‌ అసలు నేనెప్పుడూ ఇలాంటి పొలికేక వినలేదు. ఇది సింహగర్జన లా ఉంది. ఇక నినాదం నిశ్చయమైపోయింది కనుక, నేను చెప్పే మాటలు ఒక నాలుగు ఉన్నాయి,  జాగ్రత్తగా విను. సాధువులు, సన్యాసుల భాష మనం మాట్లాడే భాష కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మనం కొందరిని ‘ మీరు’ అనీ, కొందరిని ‘ తమరు’ అనీ సంబోధిస్తూ ఉంటాం.‌ కానీ సాధువులు, మహాత్ములు చిన్నా,పెద్దా, బీదా, గొప్పా అందరినీ ఒకే రకంగా చూస్తారు. ‘ నువ్వు’ అనే సంబోధిస్తారు.‌ ముసలి వారిని కాస్త గౌరవంగా చూడు.‌మరో మాట.. సాధారణ భాషలో మాట్లాడకు. ఇట్టే దొరికిపోతావు. కాస్త కఠినంగా ఉండే భాష మాట్లాడు.‌ ఉదాహరణకి, “ అమ్మా, తినడానికి ఏమైనా పెట్టు” అని మహాత్ములు ఎన్నడూ అడగరు.‌ నిజమైన మహాత్ముడు “ అమ్మా, నాకొక విందు ఏర్పాటు చెయ్యి తల్లీ, నీకు పుణ్యం లభిస్తుంది”, అంటాడు.

          “ మిత్రమా, నిన్ను పొగడటానికి నా వద్ద మాటలు లేవు. నువ్వు నాకెంతో సాయం చేసావు,” అన్నాడు చింతామణి.

       తను చెప్పాల్సిన సలహా చెప్పేసాక, మోతేరామ్ నిష్క్రమించేడు.‌ చింతామణి తన దారిన బయలుదేరేడు. కాస్త దూరంలో అతనికి జడలు కట్టిన జుట్టు తో ఉన్న సాధువులు ఒక భంగు దుకాణం వద్ద కూర్చుని కనిపించేరు.‌ వాళ్ళంతా గంజాయి తాగుతున్నారు.‌వాళ్ళు చింతామణి ని చూడగానే, వాళ్ళలో నుంచి ఒక సాధువు ఇలా కేక వేసాడు: “ ఫో, ఫో, వేగంగా వెళ్ళిపో.‌లేదంటే, నేను నిన్ను బూడిద చేస్తాను.” మరో సాధువు ఇలా అరిచేడు: “ మేం వచ్చేసాం.. ఇక చింతించనక్కరలేదు.”

         ఆ అరుపులు ఇంకా ప్రతిధ్వనిస్తూ ఉండగానే, మూడవ సాధువు ఇలా అరిచేడు: “ నేను వంగ దేశం నుంచి వచ్చేను..ఎవ్వరూ చూడని దేశం అది. వెంటనే నా కప్పుని నింపండి.”

    చింతామణి తనని తాను అదుపు చేసుకోలేక, ఇలా అరిచేడు: “ భిక్ష ఇవ్వండి. లేదంటే మిమ్మల్ని భూమిలో పాతేస్తాను.”

         ఈ మాటలు వినగానే, సాధువులు అతడిని మనస్పూర్తిగా ఆహ్వానించేరు.‌ వెంటనే, పైపు ని నింపి,‌దానిని వెలిగించే బాధ్యతని చింతామణి కి అప్పజెప్పడం జరిగింది. అతను సందిగ్ధంలో పడ్డాడు. తను పైపు తీసుకోకపోతే, తన గుట్టు రట్టవుతుంది.‌

       చేసేదేమీ లేక, అతను పైపు ని అందుకున్నాడు. కానీ అంతవరకు ఎన్నడూ గంజాయి తాగని వాళ్ళు ఎంత ప్రయత్నించినా, పొగ పీల్చడం సాధ్యం కాదు.‌ అతను కళ్ళు మూసుకుని, తన శక్తినంతా కూడగట్టుకుని, పొగ పీల్చడానికి ప్రయత్నించేడు. పైపు అతని చేతుల్లోంచి కింద పడిపోయింది. అతని కనుగుడ్లు పైకి పొడుచుకు  వచ్చేయి.  నోటి ముందు కాస్త నురగ లా కనిపించింది. కానీ, అతని నోటి నుండి పొగ మేఘాలు రాలేదు.‌గంజాయి అంటుకోలేదు.‌ ఈ తత్తరపాటు చాలు, సాధువుల గుంపు అతడిని వెలి వెయ్యడానికి.‌ వాళ్ళలో కొందరు అతని మీదకు వచ్చి, అతడిని చెయ్యి పట్టి లేపారు.‌

       “ నిన్ను పంపిస్తున్నారు!” అన్నాడొకడు.

     “ నీకు సిగ్గు వెయ్యడం లేదూ? సాధువు గా నటిస్తున్నావా?” అన్నాడు మరొకడు.

        అవమానంతో  కుమిలిపోతూ, పండిట్ గారు అక్కడ నుంచి దూరంగా వెళ్ళి, ఒక మిఠాయి దుకాణం వద్ద కూర్చున్నారు. తంబురాలు మోగుతుండగా, సాధువులంతా ఇలా పాడసాగేరు:

     “ జగమే మాయ…ఓరన్నా, ఈ జగమే మాయ..

      పాపపుణ్యాలు ఒట్టి అబద్ధాలు.. అదే లోకజ్ఞానం…

     ఓరన్నా, ఈ జగమే మాయ..

     మనకి గంజాయి,‌భంగు ఇవ్వని వాళ్ళంతా నాశనం అవుతారు…

      ఓరన్నా, ఈ జగమే మాయ..”

Aruna Prasad

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *