ఛకౌడీలాల్ గారు దుకాణం తెరిచి, బట్టల తానులను ఒక్కొక్కటిగా పేరుస్తున్నాడో, లేదో ఇంతలో ఒక ఆడ మనిషి ఇద్దరు స్వయంసేవకులతో కలిసి దుకాణంలోకి అడుగు పెట్టింది.
ఆమె ను చూస్తూనే ఛకౌడీలాల్ గారు నిశ్చేష్టుడయ్యాడు.
‘ అయితే, లాలా , మీరు సీల్ తీసేసేరన్న మాట! కానీ మీరు ఒక గుడ్డ ముక్క అయినా ఎలా అమ్ముతారో చూద్దాం. మహానుభావా,అసలు మీకు సిగ్గు, శరం ఏమీ లేవా? దేశంలో స్వాతంత్ర్య పోరాటం నడుస్తోంది. ఇక్కడ తమరేమో విదేశీ వస్త్రాలు అమ్ముతున్నారు.తమరి లాంటి వాళ్ళు ఎందులోనైనా పడి చస్తే మంచిది. ఆడాళ్ళు కూడా ఇళ్ళ నుంచి బయటికి వచ్చి, పోరాటంలో పాల్గొంటున్నారు. కానీ మీకు మాత్రం సిగ్గు గా లేదు. మీ లాంటి పిరికి వాళ్ళ వల్లనే దేశానికి ఈ గతి పట్టింది,’ అందామె తిరస్కారంగా చూస్తూ.
ఈ మందలింపులు విని ఛకౌడీ సిగ్గు తో తల దించుకున్నాడు. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. నిజానికి నిన్ననే ఛకౌడీలాల్ కాంగ్రెస్ వారు వేసిన సీల్ ని బద్దలుకొట్టడం జరిగింది. అతనిది చిన్న దుకాణం. అతను అరువు మీద బట్టలు తెచ్చి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ దుకాణం మీద వచ్చే ఆదాయం తోనే అతను తన ముసలి తల్లినీ, రోగిష్టి భార్యనీ, అయిదుగురు సంతానాన్నీ పోషిస్తున్నాడు. స్వతంత్ర పోరాటం ప్రారంభం అయ్యేక,వ్యాపారులంతా విదేశీ వస్త్రాల పై సీల్ వేయిస్తే, అతను కూడా వేయించేడు. ఒక అయిదో, పదో తానుల స్వదేశీ గుడ్డ లు అరువు మీద తెచ్చి అమ్మకానికి పెట్టేడు. కానీ విదేశీ వస్త్రాల నాణ్యత ఈ బట్టకు లేకపోవడంతో అమ్మకాలు జరగలేదు. అద్రృష్టం కొద్దీ ఎవరైనా కొనుగోలుదారుడు దుకాణానికి వస్తే ఒక రూపాయో, అర్ధ రూపాయో దక్కేది. అలా రోజంతా దుకాణం లో ఈగలు తోలుకుంటూ కూర్చుని , ఏ అర్ధరాత్రి కో ఇంటికి చేరే వాడు. కానీ మరి ఈ అమ్మకాలతో ఇల్లు నడిచేదెలా? కొన్నాళ్ళు ఎలాగో ఒప్పో, సొప్పో చేసి కాలం గడిపేక, ఇక నగా,నట్రా అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక నాలుగైదు నెలలు ఇంటందరూ పస్తులు ఉండకుండా చేసేదేదీ ఇంట్లో కనిపించలేదు. మరో ప్రక్క భార్య కి రోగం ముదిరి పోతోంది.ఎవరైనా పెద్ద వైద్యుడికి చూపించకపోతే లాభం లేదు. ఈ ఆందోళనలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడే విదేశీ వస్త్రాలు కొనడానికి ఒక కొనుగోలుదారుడు వచ్చేడు.ఒకేసారి పది రూపాయల బేరం దొరికింది. ఈ ప్రలోభానికి అతను లొంగక తప్పలేదు.
అతని ఉద్దేశ్యం తెలుసుకున్న భార్య చెవుల మీద చేతులుంచుకుని అంది , “ మీరు సీల్ పగల కొట్టడానికి నేను చచ్చినా ఒప్పుకోను. వైద్యుడు ఏమన్నా అమ్రృతం ఇస్తాడా? మిమ్మల్ని అందరూ అసహ్యించుకుంటారు. నేను బతకాలని రాసి పెట్టి ఉంటే, బ్రతుకుతాను.చావాలని రాసి పెట్టి ఉంటే, చస్తాను. కనీసం మనకి అవమానం ఉండదు కదా! ఇప్పుడు బ్రతికి ఉండి ఈ కుటుంబానికి ఏం ఉద్ధరిస్తున్నాను కనుక? నా వల్ల అందరికీ సమస్యే తప్ప ఉపయోగం ఏముంది? దేశానికి స్వాతంత్య్రం వచ్చి, ప్రజలు సుఖంగా ఉంటే అంతే చాలు. నా లాంటిది చనిపోతే, కొంప మునిగి పోదు. వేల మంది జైళ్ళకి వెళ్తున్నారు. ఎన్నో ఇళ్ళు నాశనం అవుతున్నాయి. వాళ్ళందరి జీవితాల కంటే గొప్పదా నా బ్రతుకు?”
కానీ ఛకౌడీలాల్ ఇంత కచ్చితంగా ఉండలేకపోయాడు. తన వల్ల అయినంత వరకు అతను భార్య ని ఆమె కర్మానికి వదిలి పెట్టదలుచుకోలేదు. చడీ, చప్పుడూ లేకుండా సీల్ పగులకొట్టి, పది రూపాయలకు తాను అమ్మేసాడు.
ఇక ఇప్పుడు వైద్యుడిని వెతకాలి. కానీ ఈ నిజాన్ని అతను తన భార్య దగ్గర దాచలేకపోయాడు. జరిగినదంతా భార్యకి చెప్పి, వైద్యుని కోసం బయలుదేరబోయాడు.
భార్య అతని చెయ్యి పట్టుకుని ఆపి, “ నాకు ఏ వైద్యుడూ అవసరం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో! గానీ నన్ను బలవంతం చేస్తే, మందు వంక కన్నెత్తి కూడా చూడను,” అంది.
ఛకౌడీలాల్, అతని తల్లి ఇద్దరూ ఆమెని ఒప్పించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు.కానీ, వైద్యుడిని చూడడానికి ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. నిరాశతో ఛకౌడీలాల్ ఆ పది రూపాయలను ఇంట్లో ఓ మూలకి గిరాటెట్టి, నోట్లో ముద్ద పెట్టకోకుండా,దుకాణానికి బయలుదేరేడు. దారి పొడుగునా అతను తన దురద్రృష్టాన్ని నిందిస్తూనే ఉన్నాడు. అదుగో, అలా అతను దుకాణం చేరేసరికి, నిరసనకారులు దుకాణం దగ్గరకు వచ్చి, అతడిని మందలించసాగేరు. ప్రక్క దుకాణదారుడెవరో కాంగ్రెస్ కమిటీకి ఉప్పందించి ఉంటాడు.
2.
ఛకౌడీలాల్ లోపల నుంచి, తుప్పు పట్టి, విరిగిన కుర్చీ ని తెచ్చి, ఆ మహిళని కూర్చోమని, కిళ్ళీ తేవడానికి పరుగెత్తేడు. చివరకు ఆమె కూర్చుని, కిళ్ళీ నమలడం పూర్తి చేసేక, తన తప్పిదాన్ని మన్నించమని వేడుకున్నాడు. అతను “ సోదరీ, నేను చేసినది ముమ్మాటికీ తప్పే! కానీ, సీల్ పగలకొట్టడం తప్ప నాకు వేరే దారి లేదు. ఈ ఒక్క సారికీ, క్షమించండి. ఇక పై ఎప్పుడూ ఈ తప్పు చేయను,” అన్నాడు.
ఆ దేశ భక్తురాలు పోలీసు ఆఫీసర్ కి ఉన్నంత పొగరుతో అంది, “ ఈ తప్పు ని క్షమించడం కుదరదు. జరిమానా కట్టాల్సి ఉంటుంది. నువ్వు కాంగ్రెస్ పట్ల నమ్మకద్రోహం చేసేవు.దీనికి నీకు శిక్ష పడుతుంది. ఈ విషయాన్ని ఇప్పుడే బాయ్ కాట్ కమిటీ కి నివేదించడం జరుగుతుంది.”
స్వతహాగా ఛకౌడీలాల్ ఎంతో నెమ్మదస్తుడు, ఓర్పు కలిగిన వ్యక్తి. కానీ, అతను ఎంత వేదన లో ఉన్నాడంటే, చిన్నపాటి మాటకే అతని గుండె భగ్గున మండేట్టు ఉంది. అతను ఒక్కసారిగా తిరగబడ్డాడు. “ నేను జరిమానా కట్టలేను. అసలు కట్టాలని అనుకోవటం లేదు కూడా! అవసరమైతే, నేను దుకాణం మూసేస్తాను. అయినా, నేనెందుకు దుకాణం ముయ్యాలి? దుకాణం నాది.అందులో ఉన్న సరుకు నాది. నేను పోయి,పోలీసులకి ఫిర్యాదు చేసేనంటే, బాయ్ కాట్ కమిటీ ఏం చేస్తుంది? నేను లొంగే కొద్దీ, మీరు నన్ను
తొక్కే స్తున్నారు.”
చివరకు తన సత్యాగ్రహ శక్తిని చూపించే అవకాశం దొరకగానే, ఆ మహిళ, “ సరే, సరే, అలాగే చెయ్యండి. తప్పకుండా పోలీసులకి ఫిర్యాదు చెయ్యండి. మీ కోసం తమ జీవితాలనే త్యాగం చేస్తున్న మనుషులనే మీరు బెదిరిస్తున్నారని మర్చిపోవద్దు. స్వార్థం తో తమరు ఇంత గుడ్డివారైపోయేరా? మీ స్వార్థం కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి మీకు సిగ్గు గా లేదూ? పైపెచ్చు పోలీసులకి ఫిర్యాదు చేస్తానని నన్ను బెదిరిస్తున్నావా? బాయ్ కాట్ కమిటీ ఉన్నా, లేకపోయినా, నువ్వు మాత్రం జరిమానా కట్టాల్సిందే! లేదంటే, దుకాణం మూసెయ్యాల్సిందే!”అన్నది.
ఈ మాటలు అంటున్నప్పుడు ఆ మహిళ మొహం లో విజయ గర్వం తొణికిసలాడింది. అక్కడ జనాలు గుమికూడేరు. అంతా ఛకౌడీలాల్ ని తలో మాటా అన్నారు. తను పోలీసుల పేరు చెప్పి బెదిరించడం అవివేకమే అని ఛకౌడీలాల్ కి కూడా తోచింది. సిగ్గు తో, అవమానం తో అతని తల వాలిపోయింది. మొహం చిన్నబోయింది.తరవాత అతను తల ఎత్తనే లేదు.
రోజంతా గడిచినా, చిన్న గుడ్డ ముక్క కూడా అమ్ముడు పోలేదు. చివరకు, పూర్తిగా ఓడిపోయి, అతను దుకాణం మూసేసి, ఇంటికి వెళ్ళేడు.
మర్నాడు పొద్దున్నే అతనికి 101 రూపాయల జరిమానా విధించినట్టు బాయ్ కాట్ కమిటీ ఒక స్వయంసేవకునితో కబురు చేసింది.
3
కాంగ్రెస్ శక్తి ముందు తాను అశక్తుడనని ఛకౌడీలాల్ కి తెలుసు. తన నోటి వెంట వచ్చిన బెదిరింపు మాటలకి అతను ఎంతో పశ్చాత్తాపం చెందేడు. కానీ విల్లు నుంచి బాణం బయటకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దుకాణం తెరిచి, ప్రయోజనం లేదు. నయా పైసా కూడా అమ్మకాలు జరగవు. 101 రూపాయల జరిమానా కట్టడం అతని తరం కాదు. అలా రెండు, మూడు రోజులు మౌనంగా గడిపేడు. ఒకనాటి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా దుకాణం తెరిచి, సరుకునంతా ఇంటికి తెచ్చి, అక్కడ నుంచి రహస్యం గా అమ్మడం ప్రారంభించేడు. ఖరీదైన సరుకుని అణా, కానీ కి అమ్మేస్తున్నాడు. అది కూడా అరువుకి. కానీ, బతకడానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా!
కానీ, అతని ఈ ఉపాయం కూడా కాంగ్రెస్ వారి ద్రృష్టి లో పడింది. నాలుగో రోజునే కార్యకర్తలు ఈ విషయాన్ని కమిటీ ద్రృష్టి కి తీసుకు వెళ్ళేరు. ఆ రోజు మధ్యాహ్నమే ఛకౌడీలాల్ ఇంటి ముందు ధర్నా ప్రారంభం అయింది. అది ఉత్త ధర్నా మాత్రమే కాదు.గలాటా గా మారింది.ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఛకౌడీలాల్ ఇంటి ముందు చేరి, గుండెలు బాదుకుంటూ, ఇంటి వారికి శాపనార్థాలు పెట్టసాగేరు.
ఛకౌడీలాల్ వాకిట్లో తల వంచుకుని నిలబడి ఉన్నాడు. అతని బుర్ర పని చెయ్యడం లేదు. ఈ అనర్ధం నుంచి తప్పించుకోవడం ఎలా? అతని రోగిష్టి భార్య దగ్గర లోనే ఒక పూరి కప్పు కింద నులక మంచం మీద పడుకుని ఉంది. అతని ముసలి తల్లి భార్య కి, విసన కర్ర తో వీచుతూ, ఆమె తల దగ్గర కూర్చుని ఉంది. పిల్లలు గొడవ నుంచి చూస్తూ, ఆనందిస్తున్నారు.
అతని భార్య అన్నది, “ మనం ఏం తిని, బ్రతకాలి? వాళ్ళని అడుగు.”
“ నేనెవరిని అడగాలి? నా మాట ఎవరు వింటారు?”
“ వెళ్ళి, కాంగ్రెస్ వారికి చెప్పు.మన కోసం ఏదైనా ఏర్పాటు చెయ్యమని. ఇప్పుడే మనం ఆ తానులన్నీ కాల్చేద్దాం.ఎక్కువ ఏమీ వద్దు, నెలకి పాతిక రూపాయలు ఇప్పించమను, చాలు.”
“ అక్కడ కూడా మన గోడు ఎవరూ వినరు.”
“ అసలు ముందు నువ్వు వెళ్ళి, అడుగుతావా? లేదా ఇక్కడే నిలబడి, వాదిస్తూ ఉంటావా?”
“ఏమని వెళ్ళేది? నేను వెళ్తే, అక్కడ నన్ను వెక్కిరిస్తారు. ఎవరైనా దుకాణం తెరిస్తే చాలు, జనాలు అతడిని లక్షాధికారి అనుకుంటారు.”
“ అయితే,ఇక్కడే నిలబడి, ఈ తిట్లూ, శాపనార్థాలు వింటూ ఉంటావన్నమాట!”
“ సరే, నువ్వు చెప్తే వెళ్తాను. కానీ అక్కడ వెక్కిరింపులు తప్ప ఏమీ ఉండవు.”
“పోనీ , నేను చెప్పేననే వెళ్ళు. ఎవరూ మన గోడు వినకపోతే, మరో దారి ఏదైనా చూద్దాం.”
చిన్నబుచ్చుకున్న మొహంతో, ఛకౌడీలాల్ చొక్కా తొడుక్కుని,కాంగ్రెస్ కార్యాలయం వైపు వెళ్ళేడు. మరణం ఆసన్నం అయిన రోగి ని చూడటానికి వెళ్తున్న వైద్యుడిలా ఉంది అతని వాలకం!
4
పరిచయాలు జరిగేక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అడిగేడు, “ అయితే, బాయ్ కాట్ కమిటీ 101 రూపాయల జరిమానా విధించింది తమరికేనన్న మాట!”
“ఔనండీ !”
“ అయితే, జరిమానా ఎప్పుడు కడుతున్నారు?”
“ నాకు జరిమానా కట్టేంత శక్తి లేదండీ. నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. మా ఇంట్లో రెండు రోజుల్నించి పొయ్యి వెలిగించలేదు. మేం దాచుకున్నదంతా అయిపోయింది. ఇప్పుడు మీరు నాకు జరిమానా వేసేరు. నేను దుకాణం మూసేయాల్సి వచ్చింది. నేను ఏదో కొంచెంగా ఇంటి నుంచే అమ్మకాలు సాగించేను. కానీ, ఇప్పుడు ఇంటి దగ్గర కూడా రచ్చ చేస్తున్నారు. మీరు మమ్మల్ని పస్తులతో చంపెయ్యాలనుకుంటే, అలాగే చెయ్యండి. ఇక నేను చెప్పేదేమీ లేదు.”
ఛకౌడీలాల్ ఏ మాట చెప్దామని ఇంటి నుంచి బయలుదేరేడో, ఆ మాటలు అతని నోటి నుంచి బయటకు రానే లేదు.ఇక్కడ తన మీద జాలి పడేవారెవరూ లేరని అతనికి అర్థం అయింది.
అధ్యక్షుడు గంభీరంగా అన్నాడు, “ జరిమానా కట్టాల్సిందే! ఇప్పుడు నిన్ను వదిలేస్తే, తరవాత అది చూసి వేరే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. మరి, విదేశీ వస్త్రాల అమ్మకాన్ని ఆపడం ఎలా సాధ్య పడుతుంది?”
“ నా మాట మీద మీకు విశ్వాసం కలగడం లేదా?”
“నువ్వు సంపన్నుడవని నాకు తెలుసు.”
“ నా ఇల్లు సోదా చెయ్యండి.”
. “ ఈ ఎత్తులు నా దగ్గర పని చెయ్యవు.”
ఛకౌడీలాల్ ఆగ్రహంగా అన్నాడు, “ అయితే, ఆ ముక్క చెప్పండి మరి. మీరు దేశ సేవ చెయ్యడం లేదు. జలగల్లా పేద వాళ్ళ నెత్తురు తాగుతున్నారు. పోలీసులు చట్ట ప్రకారం చేస్తుంటే, మీరు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు.ఏదైనా ఫలితం ఒకటే! వాళ్ళూ మమ్మల్ని అవమానిస్తారు, మీరు కూడా మమ్మల్ని అవమానిస్తారు. నా ఇంట్లో తినడానికి ఒక్క బియ్యపు గింజ కూడా లేదనీ, నా భార్య మంచం పట్టి ఉందనీ, నేను ఒట్టేసి చెప్తున్నా, మీరు నా మాటలు నమ్మటం లేదు. మీరు నన్ను కాంగ్రెస్ కార్యకర్త గా పెట్టుకోండి. నెలకి పాతిక రూపాయలు ఇప్పించండి, చాలు. ఇంతకంటే నా పేదరికానికి ఏం ప్రమాణం చూపించగలను? మీకు నా పని నచ్చకపోతే, ఒక నెల తరువాత పని లోంచి తీసెయ్యండి. నాకు వేరే దారేదీ లేదు కనుకనే నేను మీకు సేవకునిగా ఉంటానంటున్నాను. ఆ విషయం మీకు అర్థం కావడం లేదా? మేం వ్యాపారులం. మాకు ఏ మాత్రం వీలు ఉన్నా, మేం ఇంకొకరి క్రింద నౌకరీ చెయ్యం. రోజులు ఏమీ బాగు లేవు.లేదంటే కేవలం 101 రూపాయల కోసం నేను ఇంత దేబిరించి ఉండేవాడిని కాదు.”
అధ్యక్షుడు ఫకాల్మని నవ్వి, “ ఇదో కొత్త ఎత్తా?” అన్నాడు.
“ నేనేమీ ఎత్తులు వెయ్యడం లేదు.నా గోడు మీతో చెప్పుకుంటున్నాను.”
“ మీలా బలిసిన వాళ్ళని మేపడానికి కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు.”
“ మీరు ఇంకా నేను సంపన్నుడిని అనే భావిస్తున్నారా?”
“ నువ్వు సంపన్నుడివే కదా!”
“ మీకు నా మీద కొంచెం కూడా జాలి కలగడం లేదా?”
అధ్యక్షుడు ఎంతో గంభీరంగా జవాబిచ్చేడు, “ చూడండి, ఛకౌడీలాల్ గారూ! నాకు మీరు చెప్పేది నిజంగా నమ్మబుద్ధి కావడం లేదు. ఒకవేళ నమ్మినా, నేను మీ కోసం ఏమీ చెయ్యలేను. ఈ మహోద్యమం లో ఎన్నో ఇళ్ళు నాశనం అయ్యేయి. ఇంకెన్నో నాశనం అవుతాయి. మేమంతా నాశనం అయిపోతున్నారు. నా భుజస్కంధాలపై ఉన్న గొప్ప బాధ్యత మీకు కనిపించటం లేదా? ఇవాళ నేను మీ జరిమానా మాఫీ చేస్తే, రేపు వందల కొద్దీ మీ తోటి వ్యాపారులు ఇదే పని చేస్తారు. అప్పుడు వాళ్ళని ఆపడం మా తరం కాదు. మీరు నిజంగానే పేదవారు అయి ఉండొచ్చు. కానీ, అందరూ కాదు కదా! అప్పుడు వాళ్ళంతా కూడా తమ పేదరికాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తారు. నేను వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి, సోదా చెయ్యాలా? ఇంటికి తిరిగి వెళ్ళి, ఎలాగో ఒకలాగ డబ్బు కి ఏర్పాటు చెయ్యండి. అప్పుడు మీరు మీ దుకాణం తెరవవచ్చు. దేవుడు తల్చుకుంటే, మీ కష్టాలు తీరే రోజు తప్పక వస్తుంది.”
. 5
ఛకౌడీలాల్ ఇల్లు చేరేసరికి చీకటి పడింది. ఇంటి ముందు రచ్చ నడుస్తూనే ఉంది. అతను తన భార్య తో అన్నాడు, “ నేను చెప్పినట్టే జరిగింది. అధ్యక్షుడు నా మాట నమ్మలేదు.”
క్రృశించి ఉన్న అతని భార్య శరీరం ఒక్కసారిగా ఉత్తేజితమైంది. ఆమె లేచి, నిలబడి అంది, “ సరే,బాగుంది. వాళ్ళు మనని నమ్మేట్టు చేద్దాం. ఇప్పుడు నేను కాంగ్రెస్ కార్యాలయం ముంగిట్లో నే ప్రాణాలు విడుస్తాను. వాళ్ళ ముందే నా పిల్లలు అవస్థలు పడతారు. కాంగ్రెస్ మనకి సత్యాగ్రహం చెయ్యడం నేర్పుతుంది కదా! మనం కూడా అదే సత్యాగ్రహం చేసి కాంగ్రెస్ కి పాఠం నేర్పుదాం! నా ఈ రోగిష్టి శరీరం కాంగ్రెస్ ని చీల్చి చెండాడుతుంది. ఇప్పుడే పేదల పట్ల ఇంత జాలి లేకుండా ఉన్నవాళ్ళు రేపు అధికారంలోకి వచ్చేక, న్యాయం చేస్తారా? ఒక బండి ని పిలవండి. మంచం అవసరం లేదు. నేను అక్కడే కాలిబాట మీద ప్రాణాలు వదులుతాను. జనబలం వారికి ఉందని మిడిసి పడుతున్నారు. చూపిస్తాను, జనాలు వాళ్ళతో ఉన్నారో, నా తో ఉన్నారో!”
ఈ అగ్నిపర్వతాన్ని చూసి, ఛకౌడీలాల్ కోపం చప్పున చల్లారిపోయింది. కాంగ్రెస్ మీద ఈ రకంగా సత్యాగ్రహం చెయ్యడం అనే ఆలోచనే అతనికి వెన్ను లోంచి వణుకు పుట్టించింది. ఊరంతా గగ్గోలు పుడుతుంది.వేల కొద్దీ జనాలు చోద్యం చూస్తారు. అల్లర్లు కూడా జరగొచ్చు. ఈ వ్యవహారం అంతా ఎంత భయంకరంగా ఉందంటే, తల్చుకుంటేనే ఛకౌడీలాల్ గుండె జారిపోయింది. తన భార్య ని సముదాయిస్తూ,అతను అన్నాడు కదా, “ అబ్బే,అలా చెయ్యడం సబబు కాదు. నేను మరోసారి అధ్యక్షుల వారిని కలుస్తాను. ఇప్పుడు రాత్రి అయింది కదా! గొడవ కూడా ఆపేస్తారు. రేపు చూద్దాం.నువ్వు ఇంకా పథ్యం కూడా తినలేదు. పాపం, అధ్యక్షునికి కూడా ఏం చెయ్యాలో తోచలేదు. మిమ్మల్ని క్షమించి ,విడిచి పెడితే ఇక ఎవరికీ క్రమశిక్షణ ఉండదు అంటున్నాడు. దుకాణదారులంతా సీళ్ళు పగులగొట్టి, అదేమని అడిగితే, నా ఉదాహరణ ఇస్తారని అతను భయపడుతున్నాడు.”
అంబ అనిశ్ఛితి తో, ఒక్క క్షణం ఛకౌడీలాల్ మొహం వంక చూస్తూ, నిలబడింది. ఆ తరవాత మెల్లగా మంచం మీదకి వాలింది.ఆమె ఉద్వేగం క్రమంగా ఆలోచన గా మారింది. కాంగ్రెస్ కి కల బాధ్యత గురించీ , అలాగే కాంగ్రెస్ పట్ల తమకి కల బాధ్యత గురించీ ఆమె ఆలోచన మళ్ళింది. అధ్యక్షుని మాటల లోని సత్యం ఆమెకు అవగతమైంది.
ఛకౌడీలాల్ తో ఆమె అంది, “ ఈ మాట ముందు చెప్పలేదు.”
“ అప్పుడు నాకు ఈ ముక్క గుర్తు రాలేదు.”
“ నిజంగానే అధ్యక్షుడు చెప్పేరా లేక మీరు కల్పించి చెప్తున్నారా?”
“ అయ్యో, నిజంగా అతను చెప్పిన మాటలే! అయినా, నేనెందుకు కల్పించి చెప్తాను?”
“ అతను మాట కూడా సమంజసంగానే ఉంది.”
“ ఏదైతేనేం,మనం సర్వనాశనం అయిపోతాం.”
“ ఇప్పుడొకటి బాగున్నాం కనుకనా? ఇప్పుడూ నాశనం అయిపోతున్నాం.”
“ డబ్బెక్కడ నుంచి తేవాలి? పూటకి ఠికాణా లేకుండా ఉన్నాం. జరిమానా ఎలా కడతాం?”
“ కనీసం మనకి ఇల్లు ఉంది కదా! దాన్ని తాకట్టు పెడదాం. ఇక ఎప్పుడూ, ఏ పరిస్థితుల్లోనూ, విదేశీ వస్త్రాలు అమ్మొద్దు. పస్తులున్నా, పర్వాలేదు. ఇదంతా నువ్వు సీల్ పగలకొట్టడం వలన వచ్చింది. నా మందుల కోసం ఆందోళన పడొద్దు. దేవుడు ఏది తలిస్తే అది జరుగుతుంది. పిల్లలు పస్తులతో చావాలని రాసి పెట్టి ఉంటే, అలాగే జరగనీ! దేశంలో కోట్ల మంది ప్రజలు మన కన్నా ఎన్నో బాధలు పడుతున్నారు. మనం చస్తే మాత్రం ఏం? కనీసం ఒక రోజున దేశం బాగుంటుంది.”
అంబ పట్టిన పట్టు విడవదనీ, తను అనుకున్నది చేసి తీరుతుందనీ, ఛకౌడీలాల్ కి బాగా తెలుసు.
తల వంచుకుని, అంబ మీద విసుక్కుంటూ, అతను శెట్టి గారి ఇంటి వైపు కదిలేడు.
