కలవనివాడు

Spread the love

తుఫాన్లో వస్తున్నాడు అప్రమత్తమవ్వమనే హెచ్చరిక వచ్చింది. తుఫాన్ ఎప్పుడొచ్చేది ఎటునుండి వచ్చేది, ఎంతకాలం ఉండేది చెప్పవచ్చు. వచ్చే కారణాల్ని నష్టాన్ని అంచనా వేయవచ్చు. జరగబోయే నష్టాన్ని నివారించవచ్చు. తగ్గించవచ్చు. ఆపలేకపోయినా ప్రమాదాన్ని అరికట్టవచ్చు. కొంతకాలం గడిచాక మరచిపోవచ్చు. అతణ్ణి మాత్రం అంచనా వేయలేమని తెలిసింది.

            అతడొచ్చాడు. ఆత్మీయంగా కురిసాడు. తట్టుకోలేనివారు తడిసారు. మిగతావారు మురిసారు. అతడు అరిచాడు. మురిసినవారు కన్నీరై కురిసారు. తడిసినవారు ముద్దె ముడుచుకున్నారు. అంతా అప్రమత్తం. అప్రకటిత కర్ఫ్యూ ఆవరించింది. అతడు వాతావరణాన్ని కబళించాడు. అతని మనసు నిండింది. స్మశాన నిశ్శబ్దం ఆవరించింది. అది ఎప్పటివరకో చెప్పలేం. ఎంతవరకో చెప్పలేం. ఎందుకో చెప్పలేం. అతని మనసు కరిగితే వాతావరణం పురివిప్పుతుంది. అతనికి నచ్చితే పండగ, లేకుంటే ఎండుగ. కారణం వెతకడం దండగ.

ఉదయం:

ఆఫీసు మొదలై గంట ముగిసింది. ఆఫీస్ సబార్డినేట్ కాఫీ అందించాడు. కబుర్లతో కాఫీ తాగుతున్నారు. అక్కడ ఆనందం నాట్యమాడింది.

            “అతడు కాఫీ తాగనన్నాడు” చెప్పాడు ఆఫీస్ సబార్డినేట్

            “ఎందుకట”

            “నిన్న మధ్యాహ్నం టీ చేసిపోయమన్నాడు”

            “ఒక్కరి కోసం చేస్తరటనా”

            “అదేమాట అన్నాను”

            “నీ సంగతి చూస్తడు ఇక”

            “మీరందరు లేరా”

            “క్లబ్ డబ్బులు అడగడమే చాతకాలేదు మాకు”

            “ఆఫర్ చేయడం మన మర్యాద ఇవ్వడం ఆయన బాధ్యత”

            “ఎప్పుడు తాగుతాడో ఎప్పుడు తాగడో తెలియదు. అడగడం ఎట్లా”

            “అట్లాంటి వాడికి మర్యాద ఇవ్వకుంటేమి”

            “మనకు పత్రిక చదవడమే తెలుసు. అతనికి రాయడం అలవాటు”

            “మనకిష్టం లేని వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించవద్దు” అన్నాడు ఆఫీసర్

మధ్యాహ్నం :

అది భోజన మధ్యాహ్నం. నవ్వుతూ తుళ్ళుతూ అన్నపు గిన్నెలు ఖాళీ అయ్యాయి. ఆఫీసు ప్రశాంతంగా ఉంది. పనిమీద ఒకడొచ్చాడు. వచ్చినవాడు అతనికి నచ్చనివాడు. ఎందుకొచ్చావని తగిలించుకొన్నాడు. అతడు మాత్రం తక్కువ తిన్నాడా! పనిమీద వచ్చానని దబాయించాడు. ఆఫీసు అంగడైంది. వచ్చినవాడు ఆఫీస్ పని చెడగొట్టాడని పోలీసుకు ఫిర్యాదు రాసాడు. మన మధ్య ఐక్యత లేదన్నాడు. అతడి వాదన అర్ధం కాలేదు. వారం రోజులు తుఫాను కమ్మింది. అందరు సర్దుకొని సంతకం పెట్టారు. పట్టు సాధించాననుకున్నాడు. “మన దారికి అడ్డు తగిలినవారి నుండి పాఠాలు నేర్చుకోవాలి” అన్నాడు ఆఫీసర్,

విరామవేళ :

ట్రాన్స్ఫర్ హడావిడి నెలరోజులు సాగింది, రిజెక్ట్ అయితదని తెలిసి అందరికంటే ముందు అప్లికేషన్ పెట్టిండతడు. విషయం ఎవరికీ అంతుబట్టలేదు.

            “అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే మెయిన్ ఆఫీసులో పనిమంతులున్నట్లు లెక్క అతని దృష్టిలో” అన్నారొకరు.

            “అతనికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటే నా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ వెనక్కి తీసుకుంటా” మరొకరు.

            “అతడు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు లేవు”

            “ఇక్కడికి వచ్చేవారు అభాగ్యులు”

“ఇక్కడి నుండి వెళ్ళేవాళ్ళు అదృష్టవంతులు”

            “అతడొక్కడు లేకుంటే బాగుండు”

            “అతని సెక్షన్లో పనులు ఆగవు. పనిమంతుడతడు”

            “పసలేని సెక్షన్ అంది. పుల్లలు పెట్టడమే అతని పని”

            “ఆఫీస్లో 144 సెక్షన్ పెట్టినట్లుంటది, మనశ్శాంతి కరువైంది”

            కారిడార్ లో సరదాగా మాట్లాడ నోళ్ళు సడన్గా మూతపడ్డాయి.

            “అతడొస్తున్నాడు”

            “భయమెందుకు”

            “దుష్టోదూరవర్ణితః”

            “మన ఆఫీసర్ వచ్చాడా” అడిగాడతడు

            “వచ్చాడన్నా”

            “అనుభవం, తెలివి, పలుకుబడి ఉండి కూడా పనికిరానివాణ్ణి అయిన” హుంకరించాడు.

            “చిన్న విషయాలను నీ వంటివాడు పట్టించుకోవద్దు. వదిలేయాలి”

            “నాకు తెలుసు ఎవరెవరు ఏం చేస్తున్నారో” బుసకొట్టాడు

            “ఆఫీస్ సక్రమంగానే సాగుతుంది కదా”

            “మాట్లాడాల్సినోడు మాట్లాడడెందుకు” గప్పున గ్యాస్ వదిలాడు

            “ఆఫీసర్ అనేవాడు వదరకూడదు”

            “మీటింగ్ పెట్టాలె. సమస్యల్ని చర్చించాలె” ఊలపెట్టాడు.

            గోల భరించలేక కారిడార్ ఖాళీ అయింది. “అన్యాయమైన నిందలను ప్రశంసలనుకోవాలి” అని చెప్పిన ఆఫీసర్ గొంతు బంగళా అంతా ప్రతిధ్వనించింది.

ఒకరోజు :

వెళ్ళేసరికి ఆఫీస్ గేట్ విరిగి ఉంది. చిల్లర బ్యాచ్ పనే అని అర్థమైంది. ఆఫీసర్ బాగుచేయించాడు. గేటు పూర్తయి ఆఫీసు పేరు రాయించే రోజు కాంపౌండ్ లోని తమ ఆఫీస్ పేరు కూడా రాయించాలని ఒకతను పేచీ పెట్టాడు. ఆఫీసర్ మౌనం వహించాడు.

            పదిమంది జమయ్యారు.

            “అన్ని పనులు చేసినోడు ఆపని కూడా చేయాలి” అన్నాడతడు.

            “ఆఫీసర్ గారిది ఏం తప్పులేదు”

            “చిన్న విషయాన్ని పెద్దగా చేసుకొనుడెందుకు” అన్నాడతడు

            “సార్దేం తప్పులేదు”

            “ఇటువంటివి ముందే అనుకోవాలె. నాకు చెప్పినా అయిపోవు” అన్నాడతడు.

            “సమయానికొచ్చి మా ఆఫీస్ పేరు రాయమనడం పద్దతా”

            “మంత్రసాని తనం చేసినప్పుడు పిల్లచ్చినా పట్టాలె, పియ్యచ్చినా పట్టాలె” అన్నాడతడు.

            “ముద్ది నీది కాకుంటే ఢిల్లీదాకా దేకమంటావు నువ్వు”

            “బాగ ఎగురుతున్నవు. దొరుకవా నువ్వు” సకిలించాడు.

            “మన ఆఫీసోనివై ఉండి అవేం మాటలన్నా” ఆర్తిగా అందో కంఠం.

            “నా మాటలెపుడు మీకు గొడవగానే కనపడతాయి” వెళ్ళాడతడు.

            “అతనిది మంటను ఎగదోసే మనస్తత్వం. అది అతణ్ణి కాల్చివేస్తుంది” అన్నాడు ఆఫీసర్.

సెలవుకు ముందురోజు

            సమయం పదకొండున్నర. ఆఫీస్ సబార్డినేట్ వైపు చూసాను.

“ఒక కాఫీ తక్కువ తెస్తాను” అన్నాడు.

            “ఎందుకలా”

            “అతడు ఈ రోజు సెలవు పెట్టాడు”

            పరిసరంలోని ప్రశాంతతకు కారణం తెలిసింది. భద్రలోకపు బలహీనత అర్థమైంది. కాసేపటి వరకు కాఫీతో వచ్చాడు.

            “ఇందాక గాభరాగా వచ్చి ఆగావెందుకు”

            “మీకో విషయం చెప్పాలని”

            “ఏంటది”

            “మన వాయిస్ రికార్డ్ అవుతుంది”

            “ఎవరు చేస్తున్నారు”

            “అతడు”

            “అంతా బహిరంగ రహస్యమేకదా. భయమెందుకు. వదిలేయ్”

            “వాయిస్ రికార్డ్ చేయడం నేరం కదా”

            “ఆఫీసరు చెప్పు, ఏమైనా చేస్తాడేమో చూద్దాం”

            “ఏదైనా ఐక్యంగా చేయాలి. ఏం చేద్దామో చెప్పు”

            “అతని చెడును దేవుడైనా క్షమిస్తాడేమో కాని అతని నాడీమండలం మాత్రం ఉపేక్షించదు”

            సమాధానపడ్డట్టు కనిపించాడు ఆఫీస్ సబార్డినేట్.

సెలవురోజు

వారం రోజుల ఒత్తిడి పడక పై బార్లా కాళ్లు జాపింది. రాత్రంతా గాఢ నిద్రలో సేదతీరిన మనసు ఎప్పటిలాగే లేచింది. శరీరం సహకరించక మనసు మూలిగింది. కళ్ళు మూతలు పడ్డాయి. పొద్దెక్కుతుందని తెలుస్తనే ఉంది. అయినా లేవలేదు. సన్నటి గురక నాది నాకే వినిపిస్తుంది. వేసవి ఉదయం వాకిట్లో పడుకోవడం వల్ల చల్ల గాలికి నిదురపట్టింది. మనసు మంకు చెడ్డది. దాని పని అది చేసింది.

            అనుకోని అతిథిలా ఊడిపడింది డైరెక్టర్. ముందు చూసినవాడు సెల్తో చాటింపు చేసాడు. అందరు అప్రమత్తమయ్యారు. ఆవిడ నేరుగా ఆఫీసర్ గారి గదికి వెళ్ళింది. ఆఫీసర్ నుండి ఎలాంటి పిలుపు రాలేదు. ఒకింత ఆశ్చర్యంతో ఒక్కొక్కరం అందరం అక్కడికి వెళ్ళాము. సెక్షన్ వైజ్ ఒక్కొక్కరిని పరిచయం చేసాడు ఆఫీసర్. ఆమెతో వచ్చినవారు ఆఫీస్ ఫైల్స్ చెక్ చేసారు. తనకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రధాన ఫైల్స్ అన్నిటినీ పరిశీలించింది. ఒక పూట ఒత్తిడిలో గడిచింది. ఫిర్యాదు ఎవరు చేసారో చెప్పలేదు.. అదొక బూటకం అని తేల్చింది. తృప్తి చెంది వెళ్ళింది. హడావిడి పడనిది అతడొక్కడే.

            “ఆఫీస్ రూంకు రాకపోయినవేందన్నా” అడిగారొకరు.

            “పిలిస్తే వస్తాను. మీలాగా ఎగేసుకుంటూ వెళ్ళేరకం కాదు నేను” అన్నాడతడు.

            ఆ మాట అంటున్నప్పుడు అతని మొకం మరింత నలుపెక్కింది. “స్పష్టంగా చెబితే సమస్య సగం పరిష్కారం అయితది” అనే విషయం మా ఆఫీసర్ వ్యవహారం వల్ల అర్థమైంది.

            “గేటు దగ్గర పాముంది” గట్టిగా అరిచింది ఆవిడ. కళ్ళు తెరిచాను. ఇందాక కల. ఇప్పుడు ఇలా. గేటు ఈవల నేను. ఆవల పాము. చురుకుగా కదిలాను. అది మాత్రం అలాగే ఉంది. భయంతో కట్టె అందుకున్నాను. దానిలో కదలిక లేదు. మామూలు పాము అలా ఉండదు. ఇది ఏమై ఉంటుందా? ఆలోచనలో పడ్డాను. దాని పొడవు, అడ్డం భయం కొల్పింది. గట్టిగా అరిచాను కర్ర విసరడానికి వీలులేదు. దానిపై ఆవిడ నీళ్ళు చల్లింది. నీటి తాకిడికి అది మెల్లగా కదిలింది. దాని తోక స్థానంలో తల ఉంది. “రెండు తలల పాము” అప్రయత్నంగా అన్నాను. ఆవిడ భయంతో అరిచింది. అది నెమ్మదిగా రోడ్డు దాటింది. మట్టి తాకగానే నడకలో వేగం పెరిగింది. క్షణంలో మాయమైంది. అది కనిపించి హడలగొట్టింది. మాయమై మనసు చెడగొట్టింది. ఎందుకో అతడు గుర్తు కొచ్చాడు.

* * *

డా.బి.వి.ఎన్.స్వామి

డా.బి.వి.ఎన్.స్వామి గా సాహిత్యలోకంలో చిరపరిచితులైన భైరవి వెంకట నరసింహ స్వామి గారు విస్తృతమైన సాహిత్య నేపథ్యం కలిగి ఉన్నారు. తెలుగు, చరిత్ర శాఖలలో విద్యాధికులు. పలు పరిశోధనలు చేశారు. కథా రచన, విమర్శ రంగాల్లో పలు వర్క్ షాపులు నిర్వహించారు. నెలపొడుపు, రాత్రి పగలు ఒక మెలకువ, కథా తెలంగానం (కథా విమర్శ) వంటి అనేక కథల సంకలనాలు, కథా విమర్శ, శతక పద్యాలు, కవిత్వం మొదలైన ప్రక్రియలలో అనేక సంకలనాలు తెచ్చారు. ముఖ్యంగా కరీం నగర్ కథల మీద అనేక సంకలనాలు తెచ్చి విశేషమైన కృషి చేసారు. కస్తూరి ఆనందాచార్య రాష్ట్రస్థాయి కథా పురస్కారం, పలు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కరీం నగర్ జిల్లా ఉత్తమ రచయిత ప్రభుత్వ పురస్కారం వంటి అనేక అవార్డులు అందుకున్నారు. ఉపాధ్యాయుడిగా పని చేసారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *