ప్రేమించాడో, ప్రేమించాననుకున్నాడో గానీ సుబ్బారావు ప్రేమించానన్నాడు.
* * *
ప్రేమకు ముందు సుబ్బారావు ఎవరినీ ప్రేమించకుండా బుద్దిగా చదువుకునే కోవకు చెందిన యువకుడు.క్లాసు పుస్తకాలే చదువనుకోక, వయసు తెచ్చే భావాలకు పదును పెట్టేందుకు ఫ్రాయిడ్ నీ, మార్క్స్ ని కూడా చదివాడు.వాళ్ళిద్దర్ననేం, అవకాశం లభించిన మేరకు శ్రీశ్రీ కవిత్వమూ, చలం సాహిత్యమూ అర్థం చేసుకునే ప్రయత్నమూ చేశాడు. ఫలితంగా చెలరేగిన ఘర్షణ జీవితంలో ఏదీ సీరియస్ గా తీసుకోవలసినదిగా తోచని స్థితికి వచ్చేశాడు. చివరకు పరీక్ష పేపరు పూర్తిగా రాసాకా,’అవును మాస్టారూ, ఈ చదువు నేనెందుకు చదవాలి? ఈ పరీక్ష ఎందుకు రాయాలి? ఇంతా చేసి,ఇంతా చదివి,డిగ్రీలు తెచ్చుకుని, ఆ డిగ్రీ భుక్తినివ్వక, డిగ్రీ గల వ్యక్తిగా కాయకష్టం చేసేందుకు మనసొప్పక అలమటించే మరో దీనుడిగా తయారయేందుకేనా, టు హెల్ విత్ యువర్ ఎగ్జామ్స్’అని ఒక థీసిస్ లాగా రాసేంతగా ప్రభావితుడయ్యాడు. అదిగో… సరిగ్గా ఆ సంధి స్థితిలోనే సంధ్యను చూశాడు. గూడు రిక్షాలో పొందిగ్గా కూచుని, క్లాసు పుస్తకాలు పక్కన పెట్టుకుని తన్మయంగా తెలుగు నవల చదువుకోంటోంది సంధ్య.
సంధ్యను చూడ్డంతోనే సుబ్బారావు కళ్ళలోకి కొత్త మెరుపొచ్చింది. శరీరమంతా వింత అనుభూతి కలిగింది.
‘ప్రేమా’అనుకున్నాడు ఓ క్షణం.’ప్రేమేనా’అనుకొన్నాడు మరోక్షణం.’అలాఅయివుండదు,ఆకర్షణేమో’అనుకున్నాడు ఒకింతసేపు…
ఇలా ఆలోచిస్తూ తాను సైకిలు మీద వెళ్తున్న సంగతి కూడా మరచి పెడలింగ్ చెయ్యడం ఆపేశాడు సుబ్బారావు. హఠాత్తుగా వేగం తగ్గి, చివరకు నిశ్చలన స్థితికి చేరుకున్న స్థితిలో సైకిలుతో సహా పడబోయి,బలవంతాన నిలదొక్కుకుని,ఆగి,కిందకు దిగాడు.
దిగాక చేసుకొన్న సింహావలోకనంలో అతనికనిపించిందేమిటంటే ,’ఎంతమందిని రోజూ చూడడం లేదూ, ఈ రోజే ఎందుకిలా అనుభూతి పొందాను?అని.మనసులోనే ఫ్రాయిడ్ ని మళ్ళీ చదివాడు. ఫ్రాయిడ్ సమస్యను మరింత జటిలం చేశాడు.
‘అది ప్రేమా కావచ్చు ,శారీరకాకర్షణతో ఏర్పడ్డ అనుభూతీ కావచ్చు’అన్న సూచన చల్లగా వదిలి చక్కగా పోయాడు. దూరమైపోతున్న రిక్షాను చూస్తూ చూస్తూ పోనివ్వలేక …ఆలోచనలకు బ్రేకు నొక్కి,సైకిలెక్కి పెడలు తొక్కాడు. కావాలని రిక్షాకు మరింత దగ్గరగా వెళ్ళాడు.అప్పుడు సంధ్య చేతిలో పుస్తకంపై అక్షరాలు మెరుస్తూ కనిపించాయి. ‘ఐ లవ్ యూ.’అది నవల పేరు.
ఆ పేరు చూడ్డంతోనే సుబ్బారావు ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా ఫీలయ్యాడు.
ప్రేమించాడో, ప్రేమించాననుకున్నాడో పూర్తిగా తెలవదు కానీ ,మర్నాడు ఆత్మీయ స్నేహితుడు శ్రీధర్ తో మాట్లాడుతూ ‘నేను సంధ్యను ప్రేమించాను’,అన్నాడు.
ఇంకేం సుబ్బారావు అంత గట్టిగా ప్రేమించేశాను అని ఘంటాపథంగా చెప్పేసాకా,ఆ ప్రేమ కథా,దాని ప్రోగ్రెస్సూ వినడానికి చాలా ఆవేశపడ్డాడు శ్రీధర్.
అబ్బే ఆ కథ అసలు మొదలే అయిన లక్షణాలు కనిపించలేదు.
కాలం కదిలిపోతోంది. అసలు సుబ్బారావు ప్రేమ మొదలై,తనను దూరం పెట్టి,ఆ ప్రస్తావన లేకుండా రహస్యం పాటిస్తున్నాడేమోనని ఒక అనుమానపు జ్ఞానోదయమైంది శ్రీధర్ కి. కొన్నాళ్ళ తర్వాత, ఉండబట్టలేక అడిగేశాడు ఓ రోజు.
“ఏంటోయ్ …ఇంతకీ సంధ్యకి విషయం చెప్పేశావా?”అని.
“ఏ విషయం” ఇది జవాబు.
“అదే తనని ప్రేమించానన్న సంగతి”
“ప్రేమిస్తే ఆ విషయం చెప్పాలా….చెప్పకుండా ప్రేమించకూడదా,నేనుచెప్పలేదు.ప్రేమిస్తున్నాను” అన్నాడు సుబ్బారావు.
ఆ సమాధానంతో మరింత అర్థం కాకుండా పోయాడు సుబ్బారావు. అంతకుముందే వీడు తేడా అనే భావనతో వున్న శ్రీధర్ కి.
దాంతో ఇక ఆ విషయాన్ని ఆలోచనలలోంచి నెట్టేసి, వాడు కనిపించినప్పుడల్లా ‘ఏం మనిషిరా బాబూ వీడు’అని మాత్రం మనసులో అనుకుంటూ,పైకి మమూలుగానే వుంటున్నాడు.
అలా ఇంటర్ సెకండ్ ఇయర్ మధ్యలో సంధ్య మీద సుబ్బారావు పెంచుకున్న ప్రేమ కథ,తను డిగ్రీ చదవడానికి విశాఖపట్నం వెళ్ళడంతో,అక్కడితో ఆగిపోయింది. సంధ్య ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే ఉండిపోయింది.
* * *
సుబ్బారావు డిగ్రీ రెండో సంవత్సరానికి వచ్చేసరికి ,అదే కాలేజీలో సంధ్య కూడా డిగ్రీలో చేరడంతో , ఈ ప్రేమకథ మళ్ళీ చిగురించింది.అలా అక్కడ తొలిసారి కనిపించినప్పుడు పలకరింపుగా నవ్వాడు. సంధ్య కూడా నవ్వుతోనే బదులిచ్చింది.
ఇంటర్ సెకండ్ ఇయర్ చివర్లోలాగే,ఇప్పుడు కూడా సుబ్బారావు ఏమీ మారలేదు. సంధ్యను ప్రేమిస్తున్నాడు కానీ ఆ మాట చెప్పటం లేదు.ఒకవేళ ఎవరైనా ఎందుకలా అని అడిగితే, “ప్రేమిస్తే చెప్పాలా”అనే జవాబు అతని దగ్గర సిద్ధం.
ప్రేమించాను అని మాత్రం అనుకుని,అలా ఆగిపోయిన సుబ్బారావుని సంధ్య పలకరించడంతో ప్రేమకథ మళ్ళీ చిగురించింది. ఆ పలకరింపు కూడా భిన్నంగా జరిగింది.
“హలో”అని పలకరించింది సంధ్య.
“మీరుబాగుంటారు”అన్నాడుసుబ్బారావు,సమాధానంగా
ఆశ్చర్యంగా చూసింది సంధ్య ఆ సమాధానానికి .
“ఇంటర్ రోజుల్లోనే మీరంటే ఇష్టం కలిగింది”అని కూడా అన్నాడు వెంటనే.
సుబ్బారావు కొంచెంగా తెలుస్తున్నాడు సంధ్యకు. ఆశ్చర్యపోవడం దాటి మాటలు కొనసాగించింది సంధ్య.
ఆ మాటల్లో అప్పటికీ ప్రేమ ప్రస్తావన లేదు.స్నేహితులయ్యారు.
అప్పుడప్పుడు కలుస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటున్నారు.
అలాంటి మూడో కలయికలో హఠాత్తుగా అన్నాడు సుబ్బారావు.
“ఐ లవ్ యూ”
“ఈ మాట ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదో”అంది సంధ్య కొంచెం టీజింగ్ గా.
“చెప్పాలా. చెప్పకుండా ప్రేమించకూడదా”టిపికల్ సుబ్బారావు జవాబు.
“చెప్పకపోతే ఎలాగండీ.ఇద్దరి మధ్య ప్రేమ విషయం ఒకరికొకరు చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది”
” ‘ఇద్దరి మధ్య’అన్నారంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారా”
“ఏమో.ప్రేమించబట్టే ఆ మాట వచ్చిందేమో”అన్న సంధ్య మాటతో వీళ్ళిద్దరి లవ్లీ ప్రేమ మొదలైంది.
విడివిడిగా ఒకరు కాకుండా చాలాసార్లు ఇద్దరుగా కలిసి తిరుగుతున్నారు.
ఆ తిరగటంలో సినిమాలకెళ్ళటాలు,లంచ్,డిన్నర్ మీటింగులూ,ఇలా ఎన్నో ఎన్నో భాగాలయ్యాయి.
కలిసి లేకపోయినా చాలాసార్లు కలిసే ఉంటున్నారు, ఫోన్లో మాట్లాడుకోవడాలూ,ఛాటింగుల ద్వారా.
అలా ఈ ప్రేమకథ డేటింగ్ గా మారి,రొమాన్స్ కూడా పూసుకుంది.సుబ్బారావుకి ప్రతిదీ కొత్తగా ఉంది.ప్రతిదీ గొప్పగా ఉంది.ప్రతిదీ అద్భుతంగా వుంది. ప్రతిదీ అనుభూతులనందిస్తోంది.
ఇద్దరూ డిన్నర్ కి వెళ్లినప్పుడు ఒకసారి తనకు ఆకలి లేదని,కేవలం ఒక సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేసి, సంధ్య కిష్టమైన రొయ్యల బిర్యానీ తెప్పించాడు.తింటూ తింటూ, “నాకేం నచ్చలా ఒక్కదాన్ని తినడం”అంటూ బలవంతం చేసి ఒక ముద్ద పెట్టింది సంధ్య.ఆ ముద్ద గొప్ప రుచిగా తోచింది సుబ్బారావుకి.”ఒక్క ముద్ద పెట్టి ఊరుకుంటే అశుభం అట”అని ఏదో శాస్త్రం చెప్పి మరో ముద్ద పెట్టింది.ఆ మరో ముద్ద మరింత గొప్ప రుచి అనిపించింది ఇతనికి.బిర్యానీ తింటూ,సుబ్బారావు ముందున్న సాఫ్ట్ డ్రింక్ బాటిల్ తీసుకుని కొంచెం తాగింది సంధ్య.ఆ పెదాలు తాకిన బాటిల్ నుంచి ,మళ్ళీ ఆ డ్రింక్ తాగుతుంటే మరింత తీపిగా అనిపించింది సుబ్బారావుకి.
“థాంక్యూ డియర్”అన్నాడు సుబ్బారావు సంధ్యని ప్రేమగా చూస్తూ.
బదులుగా ఇతన్ని చూసి ప్రేమగా నవ్వింది సంధ్య.
షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా “ఎక్ లేర్స్ “అనే చిన్ని చాక్లెట్ తప్పకుండా కొనేది సంధ్య,అది తనకు బాగా ఇష్టమని చెప్తూ.
ఒకవేళ సంధ్య మర్చిపోయినా ,గుర్తు పెట్టుకుని తనే కొనిచ్చేవాడు ‘ఎక్ లేర్స్’చాక్లెట్.
మరోసారి షాపింగ్ లో చాక్లెట్స్ ఉన్న అరలో ‘కిసెస్’అన్న పేరుతో చాక్లెట్ కనపడితే ,అది కొన్నది సంధ్య,సుబ్బారావుకి తెలియకుండా.
తర్వాత ఇద్దరూ సాయంత్రం పార్కులో కూర్చుని కబుర్లాడుతుండగా ,ఆ చాక్లెట్ తీసి “విత్ లవ్ టు యూ”అని సుబ్బారావుకిచ్చింది.
అది చూసి ‘అరే ఈ పేరుతో చాక్లెట్ కూడా వస్తుందా’అంటూ తీసుకున్నాడు సుబ్బారావు.
“డంబ్ హెడ్”అని ఒక మొట్టి కాయ వేసి ,వాళ్ళు కూర్చున్న బెంచ్ కొంచెం చీకటిగా ఉన్న చోటున ఉండటంతో వంగి సుబ్బారావుని ముద్దు పెట్టుకుంది సంధ్య.
అది సుబ్బారావుకి తొలి ముద్దు అనుభవం.ఒళ్ళంతా ఒక వణుకు.గుండె వేగం హెచ్చింది.సంధ్య పెదాల మెత్తదనం అతనికి నిర్వచించలేని అనుభూతినిచ్చింది.
నోరంతా తీపిమయమైంది. ఆ ప్రకంపన నుంచి తేరుకుని,”థాంక్స్”అన్నాడు సంధ్యతో.ఆ తర్వాత అవకాశమున్నప్పుడల్లా ముద్దులు వీళ్ళ ప్రేమలో భాగమయ్యాయి.ముద్దులకు కౌగలింతలు తోడయ్యాయి.
మధ్యలో ఒకసారి సంధ్యకు వైరల్ ఫీవర్ వస్తే,చిన్నపాటి నర్సింగ్ హోమ్ లో చేర్చి,రెండు రోజులు తోడుగా వుండి,జ్వరం తగ్గుముఖం పట్టాక కానీ హాస్టల్ కి వెళ్లనివ్వలేదు సుబ్బారావు.
అదే తనకి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ,కలిస్తే తనకెక్కడ అంటుకుంటుందోనని ఒక వారం సంధ్యని కలవకుండానే గడిపాడు సుబ్బారావు.
అలా ప్రేమని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ,అనుభూతిస్తూ,ఆనందిస్తూ గడిపాడు
.అప్పుడే అయిపోయిందా అనుకునేంతగా సంవత్సరం పైన కాలం గడిచిపోయింది.
ఇన్నాళ్లూ సంధ్యకి ఏ కష్టం వచ్చినా తోడై నిలిచాడు.ఏ అవసరం వచ్చినా తీర్చాడు.చిరకాలం తనకు తోడై నిలిచే వ్యక్తిగా భావించి సంధ్యకి పరిపూర్ణంగా అంకితమైపోయాడు.
మరో రెండు నెలల్లో సుబ్బారావుకి ఫైనల్ ఎగ్జామ్స్.
సంధ్యకి మరో సంవత్సరం చదువుంటుంది.ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేలోపు సంధ్యకి పెళ్లి ప్రపోజల్ చేద్దామనుకున్నాడు సుబ్బారావు.
అనుకున్న వారం రోజులకే సంధ్య పుట్టినరోజు వచ్చింది.అది అవకాశంగా పెళ్లి ప్రపోజల్ భిన్నంగా ప్లాన్ చేశాడు.
కాబ్ బుక్ చేసుకుని దగ్గర్లో ఉన్న పల్లెటూరికి వెళ్ళి ,అక్కడ పొలాల మధ్య,కాలవల దగ్గర ,చెట్ల నీడల్లో ఆకలేసినప్పుడల్లా తీసుకెళ్లిన ఫుడ్ తింటూ గడపడం,రాబోయే ముందు పెళ్లి ప్రస్తావన తేవడం.
అయితే సుబ్బారావు ఆలోచన నెరవేరలేదు.వస్తానన్న సంధ్య రాలేదు.కారణం తెలీలేదు.”సారీ …అనేబుల్ టు జాయిన్ యూ ..లవ్ “అన్న మెసేజ్ మినహా.
నెమ్మదిగా సుబ్బారావుని సంధ్య కలవడం కూడా తగ్గింది.తర్వాత అసలు కారణం తెలిసేసరికి,అసలిలా ఎందుకు జరుగుతుందోన్న విషయం,ఇంత విస్తృతంగా చదివిన సుబ్బారావుకే అంతుపట్టలేదు.
ఆ కారణం ఏమిటంటే,సంధ్య,గత మూడు నెలల నుండీ ,సుబ్బారావుతో పాటు ,తన క్లాస్ మేట్ రవితో కూడా ప్రేమలో వుంది.సుబ్బారావుకీ విషయం తెలిసినా కూడా బయట పడలేదు.సంధ్యతో మామూలుగానే వుంటున్నాడు.
ఒక వారం తర్వాత సుబ్బారావు పుట్టినరోజు వచ్చింది.సంధ్యని ఆహ్వానించాడు సుబ్బారావు.సంధ్య వస్తానంది.సుబ్బారావు బర్త్ డే రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి కలిశారు.సంధ్య బర్త్ డే కి తను చేసిన ఏర్పాటు గుర్తు చేసి,అలా వెళదామా అన్నాడు సుబ్బారావు.ఆమె ‘సరే’అనేలోపే కాబ్ బుక్ చేశాడు.కాదనలేక సరేనంది సంధ్య.
తిరిగినంతసేపూ వాళ్ళిద్దరి మధ్య కాస్త ఇబ్బంది దూరి తిష్ట వేసుకుంది.సాయంత్రం దాకా ఆ ఊరి చుట్టుపక్కల తిరిగారు.ఆ ఊళ్ళో ఒక చిన్న టీ స్టాల్ ఉంటే ,అక్కడ బన్నులు తిని టీ తాగారు.తిరిగి వస్తుండగా ఊరి చివర,పైన పెంకులు రాలి ఉన్న చిన్న పెంకుటిల్లు కనిపిస్తే కారాపించింది సంధ్య.అక్కడెవరూ లేరు.చాలాకాలంగా లేనట్టు పాడుబడి వుంది.ముందు సగం విరిగిన రెండు అరుగులు.ఒక అరుగు మీద కూర్చుంది సంధ్య.ఇంటి వంక చూస్తూ కూర్చున్న సంధ్యకి దుఃఖం వచ్చింది. దాచుకోకుండా ఏడ్చింది కూడా.సుబ్బారావుకి ఒక పజిల్ గా అనిపించింది ఆ దుఃఖం.కానీ ఎందుకూ అని అడగలేదు.ఏడవనిచ్చాడు.
కాస్త కుదుటపడ్డాక ,తేరుకున్న సంధ్య ‘సారీ’అంది.
‘ఎందుకూ’అని అడిగే మూడ్ లేదు సుబ్బారావుకి.పైగా ఆశ్చర్యకరంగా వుంది సంధ్య ప్రవర్తన.తిరిగి వస్తున్నంతసేపూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.టాంక్ బండ్ దాటుతుండగా, ‘మమ్మల్ని ఇందిరా పార్క్ దగ్గర డ్రాప్ చేయండి’అన్నాడు కాబ్ డ్రైవర్ తో సుబ్బారావు.రెండు ఎంట్రీ టికెట్స్ తీసుకుని సంధ్యతో కలిసి లోపలికెళ్ళాడు.కాస్త దూరం నడిచాక,కొంచెం ప్రైవసీ ఉన్న చోట ఒక బెంచీ మీద కూర్చున్నాడు.తనూ కూర్చుంది సంధ్య.
“సంధ్యా ఒకవిషయం “సుబ్బారావు అడగబోతుండగానే, “నేనే చెబుతా “అంది సంధ్య.
“ఏమిటది ?”అన్నాడు సుబ్బారావు.
“మీరడగాలనుకున్న దానికి సమాధానం.”
ఆశ్చర్యపోతూ “చెప్పు”అన్నాడు సుబ్బారావు.
“ఇందాక ఆ పాడుబడిన పెంకుటిల్లు చూశారుగా.అది పాడుబడింది.మనుషులు లేరు.మా ఇల్లూ అలాగే పాడుబడి ఉంది.కొన్ని రిపేర్లు చేసుకుని,పెంకులు పోయిన చోట పట్టాలు కప్పుకుని ,కష్టాలు పడుతూ మనుషులు ఉన్నారు.అమ్మా,నాన్నా,నాయనమ్మ,ఒక చెల్లెలూ ,తమ్ముడూ.”
ఇంతకుముందు కుటుంబ నేపథ్యం గురించి చెప్పింది కానీ,ఆ పాడుబడిన పెంకుటిల్లు నేపథ్యం,పేదరికం గురించి చెప్పలేదు సంధ్య.
ఆలోచిస్తూ విన్నాడు సుబ్బారావు.
“మీరు అప్పటి స్కూల్ డేస్ లో నా వంక ప్రత్యేకంగా చూడడం గమనించాను.తర్వాత మీ ఫ్రెండ్ ఏదో సందర్భంలో నేనంటే మీకిష్టమని చెప్పాడు కూడా.నాకు ఈ ఇష్టాల మీద మనసులేదు. చదువుకుని,చదువుకుని,చదువుకుని నా కుటుంబానికి రక్షణగా నిలవాలి. ఇదే నా ఆలోచన”చెప్తుంది సంధ్య. వింటున్నాడు సుబ్బారావు.
“మీరు వెళ్లిపోయారు.ఇంటర్ రెండో సంవత్సరం ఊళ్లోనే కనుక ఎలాగో నెట్టుకొచ్చాను.డిగ్రీ ఎలా చదవగలనో కూడా ఆలోచించకుండా మొండిగా దూకాను.అదృష్టవశాత్తూ అదే కాలేజీలో మీరు సీనియర్ గా మళ్ళీ కనిపించారు.స్కూల్ డేస్ లో నా మీద మీరు చూపిన ఇంట్రస్ట్ గుర్తొచ్చింది.సమస్యల్లో మునిగిపోతున్న నాకు మీరు ఆలంబనగా కన్పించారు.ప్రేమ ముసుగేసుకుని,అవసరార్థం మీకు చేరువయ్యాను.దాదాపు రెండేళ్ళు నా చదువుకి, ఇతర అవసరాలకు మీరు తోడయ్యారు.”
“మరి …అయితే “అని సుబ్బారావు ఏదో అడగబోతుంటే, “నన్ను పూర్తి చేయనివ్వండి”అంది సంధ్య.
ఆగాడు సుబ్బారావు.
“మీ డిగ్రీ అయిపోయి మీరు వెళ్లిపోతున్నారు. నాకు మరో సంవత్సరం చదువుంది.మరో మెట్టెక్కాలి మరి.ఆ మెట్టుగా రవి దొరికాడు.ఇప్పటికీ నా కుటుంబమూ,దానికి నేనందించవలసిన తోడు,అందుక్కావలసిన నా చదువు …ఇది తప్ప నాకు మరో ఆలోచన లేదు.ఇలా మిమ్మల్ని మోసం చేసినందుకు సారీ”అంది చివరగా సంధ్య.
విన్న సుబ్బారావుకి కోపం వచ్చింది.లాగిపెట్టి చెంప మీద కొట్టాలన్నంత కోపం.కింద పడేసి తన్నాలన్నంత కోపం,గొంతు పిసికి చంపాలన్నంత కోపం.కానీ అవేమీ చెయ్యలేదు. మౌనంగా వున్నాడు.ఆలోచిస్తూ సంధ్య వంక చూస్తున్నాడు.
ఆలోచనల్లో ఆ పాడుబడిన పెంకుటిల్లు మనసులో మెదుల్తోంది. ఆ ఆలోచనలో వుండగానే సంధ్య కుటుంబసభ్యులు కూడా అతని ఆలోచనల్లో.ఎదురుగా ‘చదువు’అనే అక్షరాలతో అలంకరించిన ఒక స్త్రీ రూపం కనిపించింది సంధ్యకు బదులు.అలా సాగిన ఆలోచనలు ఆగిన తర్వాత సంధ్యతో ఇలా అన్నాడు.
“నో నీడ్ టు సే సారీ సంధ్యా.మనిద్దరం స్పష్టంగానే వున్నాం.మన సంబంధం వెనుక వున్నది,నీ అవసరం,నా ప్రేమ.రెండు అవసరమేనేమో!ఇదొక బార్టర్ సిస్టంగా జరిగింది.ఒకరకంగా ఇద్దరమూ విజేతలమే.”
కాసేపు ఇద్దరి మధ్య మౌనం. మళ్ళీ సుబ్బారావే మాట్లాడాడు.
“కానీ ఒక్క తేడా వుంది, ఈ విషయంలో. నువ్వు నాకు ప్రేయసివి. నేను నీకు ప్రియుడిని కాదు,కేవలం ప్రేమికుడిని.ఈ విషయంలో మాత్రం నాదే గెలుపు.ఇప్పుడు నీ ప్రేమ నిజం కాదని చెప్పేవరకూ ,ఆ సంగతి నాకు తెలియదు కనుక,ఇన్నాళ్లూ నేను ఆ ప్రేమానుభూతుల్ని ఆనందంగా అనుభవించాను.ఆవేశంగా అనుభవించాను.
నీ కౌగిలి వెచ్చదనం,నీ ముద్దుల తియ్యదనం,ఈ ఆలోచనలు నాలో నిలిచే వుంటాయి.అవే కౌగిళ్ళు,ముద్దుల ఆలోచనలు నీకు గిల్ట్ గా మిగుల్తాయి.ఈ బ్రేకప్ వల్ల నేనేం నష్టపోలేదు.అనుభూతుల లాభం మిగిలింది నాకు.”
ఒక్క క్షణం ఆగిన సుబ్బారావు,”నీ కుటుంబానికి నువ్వు అనుకుంటున్నట్టుగా తోడుగా నిలవాలని,ఏదో ఒక రోజు,నీకు ప్రేమికుడిగానే కాక,ప్రియుడిగా కూడా ఒక వ్యక్తి దొరకాలనీ కోరుకుంటున్నాను.ఆల్ ది బెస్ట్”అని చెప్పాల్సింది అయిపోయినట్టు ఆగిపోయాడు.
ఏదో బరువు మోస్తున్న వ్యక్తిలా పైకి లేచింది సంధ్య.
నెమ్మదిగా తన షోల్డర్ బాగ్ తీసి,ఎక్ లేర్స్ చాక్లెట్ రాపర్ తీసి నోట్లో వేసుకుని చప్పరించింది.చూస్తున్నాడు సుబ్బారావు.
అలా రెండుసార్లు చప్పరించిన సంధ్య,వంగుని సుబ్బారావు తల వంచి ముద్దు పెట్టుకుంది.ముద్దు పెట్టడమే కాదు,తన నోట్లో చాక్లెట్ నాలుకతో సుబ్బారావు నోట్లోకి నెట్టింది. ముద్దు ముగిసాకా,”థాంక్ యూ”అని చెప్పి నెమ్మదిగా పార్క్ ఎగ్జిట్ గేట్ వైపు నడిచింది.
సుబ్బారావు నోట్లో చాక్లెట్ తియ్యగా …
తర్వాత వీళ్ళిద్దరి కథ ఏమైందో కానీ,సుబ్బారావు జీవితంలో ఎక్ లేర్స్ చాక్లెట్ ఒక ఇష్టంగా మిగిలిపోయింది.
సుబ్బారావు ప్రేమించాడో,ప్రేమించాననుకున్నాడో కాదు,ప్రేమించాడు మరి!
* *
