హైదరాబాద్ కోహినూర్ – నీలోఫర్

Spread the love

1857 సైనిక తిరుగుబాటు తరువాత వందేళ్ల ఈస్ట్ ఇండియా ఆధిపత్యానికి కాలం చెల్లింది. 1858లో మొదలైన బ్రిటిష్ ప్రభుత్వ పాలన 1947లో చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ తో ముగిసింది. ఆగస్టు 15,1947న ఎర్ర కోట లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాహోర్ గేట్ పై భారత జాతీయ పతకాన్ని ఎగురవేసి చారిత్రాత్మక మైన భారత స్వాతంత్ర ప్రకటన చేశారు.

“At the stroke of midnight hour, when the world sleeps, India will awake to life and freedom ”

అప్పటికి దేశంలో ఉన్న 565 రాజ సంస్థానాల్లో 562, భారత సార్వభౌమాధికారాన్ని అంగీకరించి, భారత దేశంలో విలీనం అయ్యాయి. హైదరాబాద్, జూనాఘడ్, కాశ్మీర్ సంస్థానాలు మాత్రం, విలీన ఒప్పంద పత్రం మీద సంతకం చేయకుండా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి.

జమ్మూ కాశ్మీర్ అక్టోబర్ 1947లో భారత దేశంలో విలీనం కాగా, జూనాఘడ్ ప్రజాభిప్రాయాన్ని అనుసరించి 1948లో విలీనం అయ్యింది. హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒక సంవత్సరం పాటు మొండిపట్టు తో హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వం లో విలీనం చేయకుండా నిజాం పాలన కొనసాగించ గలిగాడు.

ఖాసిం రజ్వీ నాయకత్వం లోని నిజాం ప్రవేటు సైన్యం ‘రజాకార్ల’ పేరిట తెలంగాణ గడ్డ పై అనేక మైన అమానుషకృత్యాలు చేసి, దాదాపు 2000 మంది ప్రాణాలు బలితీసుకున్నారు. అప్పటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభ భాయ్ పటేల్, హైదరాబాద్ విమోచన కోసం మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో 13-09-1948న మొదలెట్టిన “ఆపరేషన్ పోలో”తో 17.09.1948న హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వం లో భాగం అయ్యింది.

నిజాం నవాబుకు ఇద్దరు కొడుకులు అజామ్ ఝా, మోజాం ఝా. అజామ్ ఒట్టోమన్ సామ్రాజ్యపు చివరి ఖలీఫా కూతురు దురు షెహవర్ ని, మోజామ్ ఆమె కజిన్ సోదరి నీలోఫర్ ను వివాహం చేసుకున్నారు. వారిరువురు 700 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒట్టోమన్ సామ్రాజ్యపు రాజకుమార్తెలు.

నీలోఫర్ అనేది పర్షియన్ పదం, నీలోఫర్ అంటే ‘నీలి కలువ పువ్వు’ అని అర్థం.ఆ రోజుల్లో ప్రపంచం లోని అత్యంత అందమైన మహిళల్లో ఆమెది మూడో స్థానం అని ప్రతీతి. టైమ్ వంటి ప్రముఖ పత్రికలు ఆమె ఫొటోలు, ఇంటర్వ్యూలు ప్రచురించడానికి ఉత్సాహపడేవి.

1924లో 1300 ఏళ్లుగా కొనసాగుతున్న ఖలీఫా వ్యవస్థ ను టర్కీ నేషనల్ అసెంబ్లీ రద్దు చేసి చివరి ఖలీఫా కి దేశబహిష్కరణ విధించింది. ఖలీఫా ‘అబ్దుల్ మజీద్’ అతని కుమార్తె ‘దురు షెహవర్’ మిగతా బంధు గణం తో సహా ఫ్రాన్స్ లోని ‘నైస్’ లో ఆశ్రయం పొందారు. కుటుంబ పోషణ నిమిత్తం ప్రపంచంలోని ధనవంతులైన ముస్లిం రాజుల సహాయం కోరాడు ఖలీఫా. గ్రేట్ బ్రిటన్ వైశాల్యానికి సమానంగా వుండే హైదరాబాదు సంస్థానానికి నవాబ్ అయిన మీర్ ఖాసిం అలీఖాన్ ఆనాటికే 400 కోట్ల ఆస్తి విలువతో ప్రపంచం లోనే ధనవంతుడైన రాజుగా పేరుగాంచాడు. ఖలీఫా కు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నెలకు 300 పౌండ్ల పెన్షన్ ఇచ్చేవారు. ఆ డబ్బుతో ఖలీఫా కుటుంబం నెట్టుకొచ్చేది.

ఖలీఫా కూతురు దురు షేహవర్ కు నిజాం నవాబు పెద్ద కుమారుడు అజమ్ ఝా తో పెళ్లి కుదుర్చు కోవాలని అనుకున్నప్పుడు, నిజాం నవాబు దగ్గర పెన్షన్ తీసుకునే ఖలీఫా 40,000 పౌండ్ల మెహర్ ( కట్నం ) ప్రతిపాదన చేయడం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కి అసమంజసంగా తోచింది. అదే మెహర్ తో నవాబు రెండో కుమారుడికి దురు షెహవర్ కజిన్ “నీలోఫర్ హనీం సుల్తాన్” ను వివాహం చేసుకునే విధంగా ఒప్పందం కుదిరింది.

1931లో దక్షిణ ఫ్రాన్స్ లోని నైస్ లో వివాహం జరిగాక హైదరాబాద్ కు వచ్చేటప్పుడు 15 ఏళ్ల నీలోఫర్ తల్లి, నిజాం నవాబు కోడళ్ళకు కానుపు చేయడం కోసమని ఒక నైపుణ్యం వున్న మంత్రసానిని కూడా వెంటబెట్టుకొచ్చింది. దురుషేహవర్ ఇద్దరు పిల్లలకి జన్మ నిచ్చినప్పటికీ, దురదృష్ట వశాత్తూ నీలోఫర్ తల్లి కాలేదు..

నాజీ నియంత హిట్లర్ 01.09.1939న పోలెండ్ పై దండెత్తడం తో రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. యుద్ధ సమయంలో నిజాం ప్రభుత బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. తన వంతు కృషిగా నీలోఫర్ నర్స్ శిక్షణ తీసుకుని యుద్ధంలో గాయాల పాలైన వారికి సేవ చేసేందుకు మహిళా సేవాదళం లో చేరింది.

లండన్ యుద్ధ బాధితుల సహాయార్థం లేడీ హైదరీ క్లబ్ లో 1941లో Ondine (జలకన్య) అనే ఫ్రెంచ్ నాటకాన్ని ప్రదర్శించింది. ఆ నాటకంలో ప్రధాన పాత్ర పోషించాలని భావించినప్పటికీ నిజాం నవాబు మీర్ ఖాసిం అలీ ఖాన్ రాణివాసపు స్త్రీలు బహిరంగ ప్రదర్శనకు అర్హులుకారని విభేదించడంతో ఆమె కార్యదర్శి “ఫాతిమా ఘనీ” చేత ఆ వేషం వేయించింది.

నీలోఫర్ కి రఫతున్నీసా బేగం అనే పరిచారిక ఉండేది. కాన్పుకు వెళ్లివస్తాను చెప్పి వెళ్లిన బేగం ఎప్పటికీ తిరిగి రాలేదు. కాన్పు కష్టం అయ్యి సరైన వైద్య సదుపాయం లేక తల్లి బిడ్డ ఇద్దరూ మరణించారనే వార్త నీలోఫర్ ను కలిచివేసింది.”ఈ ప్రసూతి చావులకు పరిష్కారం లేదా?” అనే ప్రశ్న ఆమెని తొలిచివేసేది. స్త్రీ జీవితంలో కడుపున పుట్టిన బిడ్డను లాలించి, పాలిచ్చి పెంచే మధురానుభవానికి దూరం అయ్యి అర్ధాంతరంగంగా అసువులు బాసిన ఎందరో మాతృ మూర్తులు ఆమె ఊహాపథం లో నిలిచారు.

కళ్ళు తెరిచి అందమైన ఈ లోకాన్ని చూడకుండానే తల్లి గర్భంలో కళ్ళు మూసిన గర్భస్థ శిశువుల లేత మొహాలు “పుట్టుకతోనే నూరేళ్లు నిండిన మా దౌర్భాగానికి కారణం ఏమిటి?” అని ఆమెను ప్రశ్నించాయి. ఎప్పటికీ చప్పుడు చేయని వారి పసి నవ్వులు ఆమె హృదయంలో మారుమ్రోగాయి. ఆమెకు తన భోగలాలసత్వం, అంతఃపురదర్పం, రాచరికపు హోదా నీటి బుడగల్లా తోచాయి. ప్రసవాల కోసం, పుట్టిన పసిబిడ్డల సంరక్షణ కోసం ఒక ఉచిత ప్రసూతి ఆసుపత్రి నెలకొల్పాలనే ఆలోచన కార్య రూపం దాల్చేలా చేశాయి.

పెళ్ళయి 17 ఏళ్లు గడిచినా నీలోఫర్ కి పిల్లలు పుట్టలేదు, యూరప్ దేశాలలో డాక్టర్లను సంప్రదించినా ఫలితం దక్కలేదు.మోజాం ఝా, బహు భార్యత్వం నిషేధం కానీ మతాచారరక్షణ లో, రాచరికపు అధికార ఛత్రం కింద, మొదటి భార్య నీలోఫర్ తమ వంశాంకురానికి క్షేత్రం కాలేక పోయిందన్న కారణంతో 1948లో రజియాబేగం ను వివాహం చేసుకున్నాడు.

తల్లిని కాలేకపోయాను అన్న వేదన తొలిచి వేస్తుంటే భర్త మరొకరి సాహచర్యంలోకి వెళ్లిపోయాడన్న వైమనస్య భావన నీలోఫర్ లో హైదరాబాద్ తనకు ఏమీ కాదు అన్న పరాయిభావాన్ని కలిగించింది. రెండు సంవత్సరాల వయసులో తండ్రిని పోగొట్టుకుని, టర్కీ నుండి వెళ్లగొట్టబడి, ఆర్థిక మైన వెసులు బాటు లేక పడిన బాధల కంటే మొజాం ఝా తనను వదిలి వేయడం ఆమెను ఎంతో మెలి పెట్టింది.

ఆమె మామ గారైన నిజాం నవాబు తో ఈ విషయం చర్చించి, రెడ్ హిల్స్ లో స్థల సేకరణ చేసి ఆసియా లోనే పెద్దది అయిన ఉచిత ఆసుపత్రి నిర్మాణం మొదలు పెట్టింది. అందుకోసం తన బంగారు ఆభరణాలు అమ్మివేసింది ఆసుపత్రి. ప్రభుత్వం లోని ఉన్నతాధికారుల నుండి విరాళాలు సేకరించింది.1949లో తలపెట్టిన నీలోఫర్ ఆసుపత్రి నిర్మాణం 1950లో మొదలయ్యి 1953 నాటికి పూర్తి అయ్యింది

నీలోఫర్ హైదరాబాద్ సంస్థానంలో అంతఃపురం తలుపులు దాటి, ఘోషా పద్దతికి స్వస్తి చెప్పి బయటకు వచ్చిన మొదటి నిజాం రాణి. సరోజని నాయుడు కుమార్తె పద్మజా నాయుడు నీలోఫర్ కి స్నేహితురాలు. 1952లో విడాకులు మంజూరు అయ్యాక, భరణంగా వచ్చిన 25 ఎకరాల భూమిని ఆసుపత్రి నిర్వహణ కోసం డొనేట్ చేసి ప్యారిస్ వెళ్ళిపోయింది.1963లో ఎడ్వర్డ్ జూలియస్ పోప్ అనే అమెరికన్ రాయబారిని పునర్వివాహం చేసుకుంది. కానీ ఆ బంధంలో కూడా ఆమె ఇమడలేక పోయింది. కొంతకాలం తర్వాత అతనితో కూడా వేరుపడి ప్యారిస్ లో ఒంటరిగా జీవించి, 1989లో శాశ్వితంగా ఈ లోకాన్ని వీడిపోయింది. ఎందరో బిడ్డలకు జన్మ నిచ్చే నీలోఫర్ ఆసుపత్రి నిర్మించిన దాత న తన జన్మలో బిడ్డతల్లి కాలేకపోయింది.

మాతృత్వపు మధురిమ తెలియకపోయినా, బిడ్డ ను కోల్పోయిన తల్లుల వేదనతో తల్లడిల్లిన నీలోఫర్ హృదయ స్పందనే నేటి “నీలోఫర్ తల్లి బిడ్డల ఆసుపత్రి”.ఆర్ధిక స్తోమత లేని వారికి బ్రతుకు నీడ నిస్తున్న ఈ ఆసుపత్రి నిర్మాణం వెనుక వున్న నిజాలు కొన్ని గుండెను తడిచేస్తాయి. మానవత్వానికి, నిస్వార్ధప్రేమకు మతం, దేశం లాంటి సరిహద్దులు ఉండవనే సత్యానికి నిలువెత్తు సాక్ష్యమే నీలోఫర్. ఎక్కడో టర్కీలోని ఇస్తాంబుల్ లో పుట్టి ఫ్రాన్స్ లో పెరిగి, అమాయకులైన నిజాం ప్రజల నెత్తురు తాగిన రజాకార్ దళాలకు పోషకులైన నిజాం పాలకుల ఇంటికి కోడలు గా రావడం నీలోఫర్ తో విధి ఆడిన ఓ విషాద నాటకం.

“నాది నాది అనుకున్న దేది మనది కాదు” అన్న కవి మాటలకు నీలోఫర్ జీవితం ఒక ఉదాహరణ. దేశ కాల మాన పరిస్థితుల మార్పులో నీలోఫర్ ఓ వాణిజ్య నమూనా గా మారటం మరో పరిణామం. ఏది ఏమైనా హైదరాబాద్ చలికాలపు వెచ్చటి చాయ్ లో నీలోఫర్ మానవత్వం ఎప్పడూ పరిమళి స్తూనే వుంటుంది.

హైదరాబాద్ సంస్కృతి లో నీలోఫర్ ఆసుపత్రి, నీలోఫర్ టీ విడదీయలేని భాగం అయిపోయాయి. నీలోఫర్ ఆసుపత్రి ముందు 1976లో చిన్న బడ్డీ కొట్టులో ప్రారంభించిన టీ షాపు, అనుమాల బాబూ రావు ఆధ్వర్యంలో “నీలోఫర్ టీ”గా పేరు కెక్కి, దేశంలోనే అతి పెద్ద టీ షాప్ గా అవతరించి హైదరాబాద్ పేరుకు మరో ఐకాన్ గా నిలిచింది. 100 పడకల నీలోఫర్ 1200 పడకల ఆసుపత్రి గా ఎదిగింది.

“నీవు లేవు నీ పాట ఉంది
ఆకు పచ్చనిభూమికి, గిరులకి, ఝరులకి
సమస్త సృష్టికీ ఒకే అర్ధం కనుక్కున్న వేళ
నీ పాట హాయిగా గాలి లో తేలి
మునిమాపు జేగురులతో కలిసి, దిక్కులను చుట్టి,
నీ మృదు చలాంగుళిచ్చవి లో కరిగి
నా ఒంటిని నిమిరి నన్ను నిర్ణద్ర నిద్ర లో పడవేసి
నీ ఎర్రని పెదాలు నా నొసటి మీద ఆనందపు నెల వంకల్ని
చిత్రించి నన్ను మంత్రించిన ఆ రోజులింక రావు
ఇప్పుడు నువ్వు లేవు నీ పాట ఉంది”

- దేవరకొండ బాలగంగాధర తిలక్

 అద్వితీయ సౌందర్యానికి, అపారమైన మానవ ప్రేమకి నిర్వచనంగా నీలోఫర్ మరికొన్ని దశాబ్దాలు హైదరాబాద్ జీవన చిత్రపటం లో చెదిరిపోనిబొమ్మ గా నిలిచే ఉంటుంది.

“Love is not a feeling of Happiness love is a willingness to sacrifice” – Michael Novak.

శ్రీనివాస్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *