‘ఏనుగు డాక్టర్’ – కథా పరిచయం

Spread the love

కథలు రెండు రకాలు… పుట్టు కథలు, పెట్టు కథలు

            సామాజిక స్పృహ ఉన్న రచయితలు పుట్టు కథలు… అంటే నిజజీవితంలోని వ్యక్తులను, సంఘటనలను కథలో జొప్పించి పాఠకుడికి ఓ రకమైన ఎరుక కలుగజేసే సందేశాత్మక కథలు రాస్తారు. సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ రాసిన ఎన్నో కథల్లో అలాంటి ఒక కథయే  ‘ఏనుగు డాక్టర్’. చక్కటి అనువాదం చేసి తెలుగులోకి అందించింది అవినేని భాస్కర్.

            తన అల్పత్వాన్ని గ్రహించలేని మూర్ఖుడైన మానవుడి కథ ఇది. తన కలంతోనే మన ఈ చెంప ఆ చెంప వాయించి దవడలు పగల గొట్టే కథ.

            సుమారు 47 పేజీల్లోకి  విస్తరించిన ఈ కథను ఓ నవలికగా పేర్కొనడం సబబేమో! అటవీశాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, వృతిరీత్యా అటవీ ప్రాంతంలోనే నివసిస్తూ అడవి జంతువులకే కాక పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ప్రేమను పంచుతూ వైద్యం చేసి, జాతీయంగా అంతర్జాతీయంగా ఖ్యాతినార్జించిన డాక్టర్ వి. కృష్ణమూర్తి చుట్టూ అల్లిన కథ ఇది. నిజజీవితంలోని ఈ డాక్టరే ఈ కథలో కథానాయకుడు. ప్రతినాయకుడు మాత్రం మానవుడే.

            కథ ఆరంభమైన కొద్ది పేజీల తర్వాత… ఓ ఏనుగు కాలిలో గుచ్చుకున్న ఖాళీ బీరు సీసాను ఆ డాక్టర్ తొలగించే సన్నివేశం హృదయవిదారకంగా ఉంటుంది. నాగరికులం అనుకునే మనలాంటి వాళ్లు నగరాలను వదలి అరణ్య ప్రాంతాల్లోకి పిక్నిక్ వెళ్లి అక్కడి వన్యసంపదను నాశనం చేస్తూ, తాగి తందనాలాడుతూ ఎక్కడ పడితే అక్కడ అంతులేని చెత్తను వేస్తూ పగలగొట్టి వేసే బీరు సీసాలు అక్కడి జంతువులకు… ముఖ్యంగా ఏనుగులకు ప్రాణాంతకం అవడం అనే విషయాలను చదవడం ఒకింత కష్టంగా ఉంటుంది.  “మనిషి ఎంత దౌర్భాగ్యుడో దవడ పగిలేలా ప్రతి రోజు మీ కళ్లబడాలంటే మీరు అడవిలో ఉండాలి.” చదువుకున్న దౌర్భాగ్యులు తాము ఆనందించే నెపంతో ఆడిపాడి కారు హారన్లు, స్టీరియో రేడియోల మోతతో కలిగే శబ్ద కాలుష్యం అంతాఇంతా కాదు.

            మన అల్పత్వాన్ని మనం గ్రహించడానికి… క్రిమికీటకాలను, ఓ శునకాన్ని, ఓ ఏనుగును ప్రతీకలుగా తీసుకుని ఏనుగు డాక్టర్ (డాక్టర్ కృష్ణమూర్తి) ఆసరాగా ప్రథమ పురుషలో ప్రతిభావంతంగా అల్లిన ఈ కథ రచయిత ప్రతిభకు, సామాజిక స్పృహకు అద్దం పట్టడమేకాక ఓ కార్యశీలి అయిన పర్యావరణ ప్రేమికునికి నివాళి.

            మనిషి జీవితంలో ఓ గొప్ప స్నేహితుడు శునకం అని చెబుతూ ఇరవై సంవత్సరాల ప్రాయంలోనే తన కుక్క మరణం తట్టుకోలేక Epitaph to a Dog అనే మకుటంతో రాసిన లార్డ్ బైరన్ పేరెన్నికగన్న కవితలోని కొన్ని పంక్తులను ఉదహరిస్తాడు రచయిత. మానవుడి అల్పత్వాన్ని సూచించే ఓ గొప్ప కవితగా సాహితి ప్రియులు ఈ కవితను పేర్కొంటారు.

            అలాగే… “అడవిలో… నొప్పి ఉంటుంది. మరణం ఉంటుంది. నీచత్వం లేదు. హీనత్వం లేదు. అణువంతైనా హీనత్వం లేదు.” అని ఓ చోట అంటాడు కథకుడు.

             “మాన్ ఈజ్ అ పథెటిక్ బీయింగ్”

            “పురుగులను మనిషి ద్వేషించకూడదు.” … పురుగులది మహా సమూహం అని, వాటితో పోలిస్తే మానవ సమూహం చాలా చిన్నదని, క్రిమికీటకాదులు కలిసికట్టుగా తమను నిర్మూలించడానికి మానవుడు చేసే ప్రయత్నాలను… తమను తాము మార్చుకోవడం ద్వారా తిప్పికొడతాయనే ఓ గొప్ప సందేశాన్ని పాఠకులకు చేర్చాడు జయమోహన్. ఇటీవలి కోవిడ్ కాలంలో ఇదంతా సామాన్య మానవుడికి కూడా అనుభవైకమైందని మరి మరి చెప్పాల్సిన అవసరం  లేదు.

            ఇదంతా ఒకెత్తయితే ప్రధానమైన సందేశం… “దేవాలయాల్లో ఏనుగులను బంధించకూడదు.” అనేది. ఈ విషయంలో తన నిజజీవితంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చిన డాక్టర్ కే (డాక్టర్ కృష్ణమూర్తి) పాత్ర ఇలా అంటుంది:

            “రోజుకు 30 లీటర్ల నీళ్లు తాగి, 200 కేజీల ఆహారం తిని, 50 కిలోమీటర్లు నడిచే జంతువు.” అంటూ భారీ జంతువైన ఏనుగు గురించి చెబుతూ “ఒక్కచోట ఐదు రోజులు నిలుచుని ఉంటే అది చిక్కిశల్యమవుతుంది… ఒకప్పుడు దేవాలయాల నిర్మాణం కోసం సహాయంగా వాడుకున్న ఏనుగులు ప్రస్తుతం కేవలం అలంకరణ కోసం మతసంబంధమైన ఆచారాల కోసం అడవి బయట పెంచబడుతున్నాయి. జంతు ప్రదర్శనశాలల్లో వినోదం కోసం బంధించబడుతున్నాయి. దేవాలయాల్లో ఏనుగుల పెంపకాన్ని నిషేధించాలి… “వాడు అడవికి రాజు. వాడిని ఊళ్ళో పోర్టర్ గానూ, బిక్షగాడిగానూ వాడుకోవడం మానవజాతికే అవమానం” అంటాడు.

            ఈ విషయంపై ఇలా మరింత కొనసాగిన ప్రస్తావనను కథలోనే చదవడం మంచిది. ఈ ప్రస్తావనకు ముగింపుగా, “యూరోపియన్ పత్రికల్లో దీని గురించి మాట్లాడాలి. తెల్లవాళ్ళు చెప్పితే మనవాళ్ళు వింటారు. ఇప్పటికీ మనవాళ్ళకు గురువులు వాళ్లే.” అంటాడు.

            నిజ జీవితంలో ఇలాంటి ప్రయత్నం చేసి డాక్టర్. కే గెలుపొందినట్లుగా ఇంటర్నెట్‌లో సమాచారం ఉంది.

            అలాగే… కథలో గాంధీజీ గురించిన ప్రస్తావనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి:

            “యూ షుడ్ రీడ్ గాంధీ.  ఈ జనరేషన్ ఆలోచనలను ప్రభావితం చేయగలిగే శక్తి గల ఒకే ఒక్క థింకర్ ఆయన. ప్రతి విషయం మీద ఒరిజినల్ గా ఏదో ఒకటి చెప్పి వెళ్లారు.”

            “గాంధీ జీవించడానికి ఇంకా జానెడు చోటు ఉందని ప్రపంచానికి చూపాలనిపించింది. అది పదిమంది గుర్తించినా చాలు.”

            “గొప్ప ఆదర్శ జీవితం వెలుగులోకి వస్తే మనుషుల లోపల గడ్డకట్టుకుపోయిన మంచితనాన్ని తాకుతుంది. గాంధీ బలం అదే. అన్నీ ఆదర్శాలు నెగ్గేది ఆ అంశాన్ని ఆధారం చేసుకునే.”

కథలో కొసమెరుపు:

            ఆరంభంలోనే సూచన ప్రాయంగా డాక్టర్. కే కు పద్మశ్రీ బిరుదు ఇప్పించే ప్రయత్నం ఉంటుంది. చివరకు జయమోహన్ తన నిజ జీవితంలో తనకు లభించిన పద్మశ్రీ బిరుదును తన సిద్ధాంతాలకు వ్యతిరేకమని తృణప్రాయంగా తిరస్కరించినట్టు కథను ముగిస్తాడేమో అనుకున్నప్పటికీ అలా కాకుండా ఓ మంచి ట్విస్ట్ ఇచ్చాడు.

            ఇంత ఉదాత్తమైన కథ రాసిన జయమోహన్ కు, సరళంగా అనువదించిన అవినేని భాస్కర్ కు, ఎంతో విలువైన జాతీయ, అంతర్జాతీయ అనువాద సాహిత్యాన్ని తెలుగు పాఠకుల దరిచేరుస్తున్న ఛాయా పబ్లికేషన్స్ వారికి అభినందనలు.

            ఈ కథను అవినేని భాస్కర్ అనువదించిన జయమోహన్ రాసినవే మరో 11 భారీ కథలు ఉన్న సంకలనం ‘నెమ్మి నీలం’ లో చదవండి. పుస్తకం ఛాయా పబ్లికేషన్స్ లో దొరుకుతుంది. ఫోన్ నెం. 040-23742711, 70931 65151.

చింతకుంట్ల సంపత్ రెడ్డి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *