టీచర్ 1965 చివరి భాగం

Spread the love

అయితే రాజా ఏడవ తరగతి ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఏడ్చాడు. అప్పుడు అనిపించింది.

“ఒకరిని ఏడిపించాలన్నా, నవ్వించాలన్నా ముందు మనం ఏడవాలి. అప్పుడే ఏడుపులో వున్న బాధ మనకు తెలుస్తుంది. అలాగే నవ్వించాలన్నా చివరికి మనుషుల్ని భయపెట్టాలన్నా అలాంటివన్నీ మనం అనుభవించాలి.”

***

ఆలోచనలు తెగాయి. సీత వచ్చింది.

“ఏమిటి ఆలోచిస్తున్నారు?”

“నా చిన్నతనం గుర్తుకొచ్చింది. నా మిత్రులు గుర్తుకొస్తున్నారు. మన జీవితం ఇంకో మలుపు తీసుకుంటుందని నాకు అనిపిస్తోంది సీతా!”

“అంటే తిరిగి హైదరాబాద్ నుండి ఇంకో ఊరికి ప్రయాణమా?”

చిన్నగా నవ్వి అన్నాడు…

“నాకు చాలా ఊర్లు తిరగాలని వుండేది సీతా. అది బతకటం కోసం కాదు. హాయిగా ఓ అన్వేషణ కోసం అనుకునేవాడిని. అందరికీ అన్ని అవకాశాలు రావు కదా!”

“అంటే డబ్బులు వుండాలని మీ ఉద్దేశమా?”

“అదొక్కటే కాదు. డబ్బులు వున్నవారు తాము అనుకున్న పనులన్నీ చేయగలుగుతున్నారా? అది సంపాదించడానికి పరుగులు ఆపరు. అంటే మనుషులు నేర్చుకోవాల్సింది ఒకటి వుంది. డబ్బులు అనేది మనం చేయాలనుకున్న పనులు చేయటం కోసం కావలసింది. అది మన కోసం పనిచేయాలి. డబ్బు కోసం మనం పని చేయకూడదు. నాకు అప్పుడప్పుడు మావయ్య గుర్తు వస్తారు. ఓసారి ఆయనకు వెయ్యి రూపాయలు ఇవ్వబోయాను. ఇవి నాకెందుకు? పిల్లలు ఎవరి బ్రతుకులు వారు బతుకుతున్నారు. నాకు పెద్ద కోరికలు లేవు. ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అన్నారు.”

“మీరు చెప్పేది నాకు అర్థం అయింది. మనం మన పిల్లల కోసం డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు లక్షాధికారులు అయ్యారని కాదు. మనం ఎన్నో కష్టాలు పడ్డాం. ఆ అనుభవాలే కదా మీ ఆస్తి. అందుకని ఎవరికి వారు కష్టపడాలి.”

చిన్నగా తలూపాడు.

“మీరు ఏం చేయాలనుకుంటే ఆ పనులు చేయండి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. మీతో పాటు నేనూ వస్తాను” అని వెళ్ళిపోయింది.

టీచర్ అంటే బడిలోనో, మరో చోటో చదువులు చెప్పేవారు కాదు. ప్రవచనాలు చెప్పేవారు మాత్రమే కాదు. అడుగడుగునా ఉపాధ్యాయులు వున్నారు. విద్యార్థి అంటే నిరంతరం పాఠాలు నేర్చుకునేవారు అనుకున్నాడు.

***

తిరుపతి

రాజా, రాధాకృష్ణను కలుసుకున్నాడు.

అతను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు థియేటర్లు లీజ్‌కి తీసుకున్నాడు. అలాగే వారికో ఫర్మ్ వుంది. వారు రకరకాల కాంట్రాక్టులు చేస్తున్నారు.

“నువ్వు ఫోన్ చేయగానే మన బాల్యం అంతా గుర్తుకొచ్చింది రాజా” అన్నాడు రాధా.

తర్వాత ఇప్పటివరకు జరిగిన తన ప్రయాణం గురించి వివరంగా చెప్పాడు రాజా.

“ప్రతిభ అక్క గురించి మా అక్క చెబుతుంది రాజా. అయినా ఇదేం బతుకో నాకు అర్థం కాదు. మా అక్కని చూసి మూడు సంవత్సరాలు. ఏదన్నా శుభకార్యమో, అశుభకార్యమో జరిగితే తప్ప సొంత మనుషులను కలుసుకోవటం కూడా కష్టంగా వుంది. ఆ మధ్య ఎవరో చెప్పారు రాజా. నీ ఫ్రెండ్ ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నాడని. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది.”

రాజా చిన్నగా నవ్వాడు.

“పుస్తకాలు రాస్తే డబ్బులు వస్తాయా రాజా?”

“కొంతమందికి వస్తాయి. కొంతమందికి రావు రాధా!”

“అదేంటి?”

“ఇప్పుడు ఆ హడావిడి కూడా తగ్గిందిలే. డబ్బులు వచ్చే పుస్తకాలు, తృప్తిని ఇచ్చే పుస్తకాలు అని వుంటాయి. నా వరకు డబ్బులు వచ్చే పుస్తకాలు రాయటం లేదు.”

“మరి బతకాలి కదా?”

“ఏదో బతుకు నడుస్తోంది రాధా! చెప్పాను కదా – ఇంతకు ముందు రకరకాల ఉద్యోగాలు చేశాను. పిల్లలు వారి బతుకులు వారు బతుకుతున్నారు. మా ఇద్దరి ఖర్చులకి యిబ్బంది ఏమీ లేదు.”

“ఇల్లు కట్టుకున్నావా?”

“లేదురా. అద్దె ఇంటిలో వుంటున్నాం. ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా?”

“చెప్పు. నా దగ్గర మొహమాటం ఎందుకు?”

“కృతజ్ఞతలు చెప్పడానికి.”

“ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు?”

“అవును. అప్పట్లో మనిద్దరం కలిసి చూసిన సినిమాలు ఇంకా నాకు గుర్తున్నాయి. మేరానామ్ జోకర్ గాని, శాంతారం తీసిన జల్ బిన్ మచిలీ, నృత్య బిన్ బిజిలీ సినిమాలు ఈ మధ్య కూడా చూశాను. నువ్వు లేకపోతే ఇన్ని పదుల సినిమాలు చూసేవాడినా!”

“నాదేముంది రాజా. థియేటర్ ఫ్రీ. ఆ మాటకొస్తే నేను నీకు థాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు లేకపోతే నేను కూడా ఇంటి నుంచి కదిలేవాడిని కాదు”

“ఇప్పుడు నాకు టీ.వీ.లకు రాసే అవకాశం వచ్చింది రాధా. అందుకని ముందుగా నీకు చెప్పాలనుకుని మా అక్క ద్వారా మీ అక్కను అడిగి, నీ వివరాలు తెలుసుకున్నాను.”

“చాలా మంచి విషయం చెప్పావు రాజా. మరి ఇక్కడ కూడా డబ్బులు వచ్చే సీరియల్స్ వుంటాయి కదా! ఇక్కడ నిలబడతావా?”

“అన్నీ అలాంటివే వుండవు రాధా. అన్నిచోట్లా కొన్ని మంచివి వుంటాయి. లేకపోతే సినిమాలు గాని సాహిత్యం గాని నిలబడవు. నేను మంచి సీరియల్స్ రాస్తాను. అలాంటి ఒక వ్యక్తి దొరికారు. అయితే రచనలు గాని, సినిమా గాని మామూలు మనుషులకి అర్థం కాకుండా రాస్తే అది నిలబడటం కష్టం. నేను ఒకటే అనుకున్నాను. ప్రజలకు మంచి చేయనివి రాయకూడదు. ఏం రాసినా ప్రజల్ని మోసం చేయనివి మాత్రమే రాయాలని. రాసినంతకాలం రాస్తాం. లేదంటే మానేస్తాం” అన్నాడు రాజా.

“బాగుంది. లక్షలకు లక్షలు సంపాదించాలనుకుంటే వేరు. నాకిది చాలు అనుకునేవారికి సమస్య ఏముంటుంది? ఈ భాష కాకపోతే ఇంకో భాష. ఇంకో రాష్ట్రం. అంతే కదా!”

ఇద్దరూ నవ్వుకున్నారు.

“అయితే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను రాజా. నువ్వు పుస్తకాలు తీసుకొస్తావో, ఓ చిన్న సినిమా తీయాలనుకుంటున్నావో నీ ఇష్టం. అందులో మనకు లాభాలు అవసరం లేదు. నష్టం వచ్చినా పర్వాలేదు. మనం ఇన్ని సినిమాలు చూశాం. మన స్నేహానికి గుర్తుగా అలాంటి సినిమా మన పిల్లలకి మన గుర్తుగా ఇద్దాం.”

“అంత సంపాదించావా రాధా?”

“ఏంటి రాజా సంపాదించేది. అప్పుడు మనకు ఇచ్చిన ఆస్తులు అమ్మకుండా వుంచాను. అవి గుడ్లు పెట్టాయి. ఇప్పుడు మన సంపాదనలు మన పిల్లలకి అవసరం లేదు. అందరూ అమెరికాలు, లండన్లే కదా!”

“సరే! మీ మాటలు గుర్తుంచుకుంటాను రాధా. ఏదో ఒక రోజు మనం ఒక మంచి ప్రయత్నం చేద్దాం.”

“సర్లే. ఇప్పుడు మా వాళ్ళకి నిన్ను పరిచయం చేస్తాను. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటాను. ఇకనుండి మనం తరచుగా కలుసుకుందాం రాజా. అలాగే ఈరోజు మనిద్దరం కలిసి ఒక సినిమా చూడాలి. నో అనకు” అన్నాడు రాధా.

***

రాజా హైదరాబాద్ చేరుకున్నాడు.

అప్పుడు కిసాన్ నగర్ ని, ఆ ఊరినీ వదిలిపెట్టి రావలసిన రోజు గుర్తు వచ్చింది.

ఆ రాత్రి ప్రతిభ అక్క – అమ్మలతో జరిగిన సంభాషణ ఎప్పటికీ గుర్తుంటుంది.

“అమ్మా… చిన్నతనంలో నాకు ఎందుకు పెళ్ళి చేసావు?” అడిగాడు రాజా. అమ్మ ప్రతిభను చూసింది.

“తమ్ముడూ! నేను మాట్లాడతాను. నేను మధ్యలో వెళ్ళిపోయాను. నా చదువుకు మన దగ్గర వున్న చిన్న మొత్తం కూడా అయిపోయింది. నేను చిన్న ఉద్యోగం చేస్తూ మీకు కొంత డబ్బు పంపుతున్నాను. అప్పుడు నీలో చాలా మార్పు వచ్చింది. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేది. మనకు అడుగడుగునా అపజయాలే కదా!”

అక్కని చూస్తున్నాడు రాజా.

“ఓరోజు నువ్వు అమ్మతో అన్నావంట. నేను ఇక్కడ వుండను. ఎటన్నా వెళ్ళిపోతాను. నువ్వు అక్క దగ్గరికి వెళ్ళు అని. అప్పుడు అమ్మ కంగారుపడింది. అది నువ్వు ఆవేశంతో అన్నమాట కాదనుకుంది. నీకు తెలియకుండా నాకు ఉత్తరం రాయించింది. అప్పుడు నేను అర్జెంటుగా వచ్చాను. నువ్వు ఏదో షాపులో పనిలో వున్నావు. నువ్వు లేకుండా మేము మాట్లాడుకున్నాం.”

“ఏం మాట్లాడుకున్నారక్కా?”

“ఎంత లేదనుకున్నా నీలో నాన్నగారి జీన్స్ వున్నాయి. నిన్ను కలుస్తున్న మనుషులు, మారుతున్న నీ భావాలు అమ్మ చెప్పింది. ఇంత హీనంగా మనం ఎందుకు బతకాలి. చదువుకునే అవకాశాలు ఎందుకు లేవు. ఈ దేశంలో వున్నది మనలాంటి వారే కదా! నాన్న ఎందుకు అన్నీ వదులుకొని వెళ్ళాడో ఇప్పుడు తెలుస్తోంది అన్నావంట. ఇప్పుడు నాకు వాడిని చూస్తుంటే భయంగా వుంది. ఏ అర్ధరాత్రో వాడు మన నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మనం ఎలాంటి కబురు వినాల్సి వస్తుందో అంది అమ్మ.”

రాజాకి తన కోపం, అసహనం, జరిగిన అవమానాలు గుర్తుకొచ్చాయి.

“ఇప్పుడేం చేద్దాం అమ్మా!” అని అడిగాను. వాడికి పెళ్ళి చేద్దాం అంది. ఇంత చిన్న వయసులో పెళ్ళా. అయినా వాడికి పిల్లని ఎవరు ఇస్తారు అన్నాను. మనలాంటి వారున్నారు. మనకు దూరపు బంధువులు వున్నారు. వారి అమ్మాయిని ఇస్తామన్నారు. పెళ్ళి చేసుకుంటే వాడికి ఈ ఆవేశం తగ్గుతుంది. ముందు తనకంటూ ఒక ఇల్లు ఒక బాధ్యత వుంటాయి కదా అంది.”

“అందుకని నువ్వు సరే అన్నావా అక్కా?”

“నేను చిన్నదానిని రాజా. నాన్న చనిపోయాక మనకోసం అమ్మ బతికింది. ఆమెకు బతుకంతా దుఃఖమేనా. నాన్న గురించి నీ గురించి ఏడుస్తూ బతకాలా? రేపు పెళ్ళి అయినా కష్టాలు పడాలి. అది మనకు కొత్త కాదు కదా. అందుకే నీ పెళ్ళి అలా జరిగిపోయింది”

అక్కడ నిశ్శబ్దం.

“ఏది ఏమైనా ఈ నిర్ణయం వెనక నేనూ వున్నాను. అంతేకాదు, అమ్మ బాధ్యత నీ ఒక్కడిదే కాదు. నాకూ వుంది. అందుకే అమ్మని నేను తీసుకెళ్తున్నాను. ప్రస్తుతం నీకు భారం కాకూడదు. రోజులు ఎప్పుడు ఇలా వుండవు. నీకు మనకు మంచి మార్గం దొరుకుతుంది. అమ్మ మన ఇద్దరికీ దగ్గరగా వుంటుంది. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు నీకు ఇష్టం లేకపోయినా. అందుకు నిన్ను అక్కగా మెచ్చుకుంటున్నాను. నా కృతజ్ఞతలు చెబుతున్నాను.”

అమ్మ, అక్క వెళ్ళిపోతున్న రోజు…
మైదానంలోకి వెళ్ళాడు.

“నేను ఎవరిని? నా అస్తిత్వం ఏమిటి? అనే ప్రశ్న వచ్చింది. మైదానంలోని మనుషులందరూ గుర్తు వచ్చారు. మిత్రులు గుర్తు వచ్చారు. అందులో అనేకమందికి అమ్మానాన్నలు వున్నారు. పొలాలు వున్నాయి. స్థలాలు వున్నాయి. డబ్బు వుంది. వ్యాపారాలు వున్నాయి. బాగా చదువుకుంటున్నారు. పెద్ద పెద్ద వుద్యోగాలు చేస్తున్నారు. మరి ఈ రాజా ఎవరు?

అనామకంగా మిగిలిపోవాల్సిందేనా? ఎప్పుడు పుట్టామో, ఎందుకు పుట్టామో తెలియకుండా అనామకుడిగా చనిపోవాల్సిందేనా? నాన్న, అమ్మ, అక్క, మాస్టారు గుర్తుకొచ్చారు. సీత గుర్తు వచ్చింది. అలా ఎంతసేపు వున్నాడో! దుఃఖిస్తున్నాడా? కించపడుతున్నాడా? ఆవేశంతో, నిస్సహాయతతో రగిలిపోతున్నాడా? తెలియదు.

అక్క రైలు ఎక్కేముందు తమ్ముడికి ఓ పెన్ ఇచ్చింది. అది ఎందుకు అన్నట్లు చూశాడు.

“అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు రాజా!”

నిర్వికారంగా అందుకున్నాడు.

“నీకోసం దాచిన కొన్ని పుస్తకాలు అలానే వున్నాయి. నీకు బాధ కలిగినప్పుడు వాటిని చదువుకో. బ్రతుకు మీద ఆశ కల్పిస్తాయి” అంది.

రాజా ఆలోచన నుండి బయటపడ్డాడు.
అక్క ఇచ్చిన ఆ పెన్, పుస్తకాలు ఇప్పటికీ వున్నాయి.

***

శరత్ నుండి రాజాకి లేఖ వచ్చింది.

రాజా……

పత్రికల్లో ఈరోజు నీ గురించి వార్త చదివాను. చాలా సంతోషంగా అనిపించింది. నువ్వు రాసిన పిల్లల నవలకు కేంద్ర సాహిత్య అకాడమి వారి పురస్కారం లభించిందని.

గర్వపడుతున్నాను రాజా!

నువ్వు ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశావో అందులో వుంది. ఒకప్పటి నీ మాటలు గుర్తుకొచ్చాయి. నా చేతి వేళ్ళు బలహీనం శరత్. వాలీబాల్‌ని లిఫ్ట్ చేయలేను. బాల్‌ని అవతల కోర్టుకి నెట్ దాటించటం నా వల్ల కావటం లేదని!

ఇప్పుడు అదే చేతితో వేల పేజీలు రాయగలిగావు. నీ వేళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఇలా జరుగుతుందని ఊహకు అందిందా! ఏది ఏమైనా నీ జర్నీలో నేను వున్నాననే సంతృప్తి నాకుంది. నేను కొంతమంది మన పాత మిత్రుల వివరాలు సేకరిస్తున్నాను. అందులో మనవాళ్ళు కొంతమంది చనిపోయారు. ఇంకొందరు విదేశాల్లో వున్నారు. రకరకాల వృత్తుల్లో వున్నారు. అలాగే పెద్ద రౌడీలు, రాజకీయ నాయకులు వున్నారు. ఇప్పుడు సందర్భం వచ్చింది. మనందరం మన ఊరిలో కలుసుకోవాలి. అక్కడ నిన్ను సన్మానించుకోవాలి.

— నీ శరత్.

ప్రతిగా రాజశేఖర్ ఉత్తరం రాశాడు.

ప్రియమైన శరత్…

ముందుగా ధన్యవాదాలు. మన మిత్రులు కొంతమంది ఫోన్లు చేశారు. తొలి ఉత్తరం నీదే! నేను రచయితను కావటం వెనక వున్నది మన మైదానం. నిజమే నువ్వు అన్నట్లు నా చేతులు, నా వేళ్ళు బలహీనం. అయినా నన్ను నడిపించింది ఏదో శక్తి. ఇది నా సొంతం కాదు.

నిజానికి ఇంతకుముందు చెప్పినట్లు నాకు నీ మీద ఎన్నో ఆశలు వుండేవి. నువ్వు గొప్ప రచయిత అవుతావనుకున్నాను. మంచి ఆటగాడివి, మంచి ఆఫీసరు అవుతావనుకున్నాను. కానీ కుటుంబం నీలోని శక్తుల్ని బలహీనం చేసింది. నన్ను నువ్వు బెంగళూరు పంపించటం కూడా ఓ మలుపు. ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ జీవితంలో నువ్వు ఒక మంచి పుస్తకం అన్నా రాయాలి. మనం తప్పకుండా మన ఊరిలో కలుసుకుందాం. నాకు మాత్రమే సన్మానం కాదు, మనలో సక్సెస్ అయిన వారందరికీ. అలాగే జీవితంలో ఓడిపోయిన వారికి కూడా.

ఫెయిల్యూర్ ఈజేన్ ఆప్షన్ బట్ నాట్ ది ఎండ్!

మీ
రాజా… రాజశేఖర్.

***

హైదరాబాద్ లో ఒక సంస్థ వారు రాజశేఖర్ కి సన్మానం చేశారు. కుటుంబరావు మాస్టారు, సుగుణా టీచర్, ప్రతిభ, రాధాకృష్ణ, రాజా అమ్మ, భువన్, సురేష్, రాజా కుటుంబం, ప్రతిభ కుటుంబం వచ్చారు.

రాజా తన స్పందనలో చెప్పాడు.

“ఈ పురస్కారం అందుకోవటం సహజంగా సంతోషం కలిగిస్తుంది. నా అదృష్టం ఏమిటంటే నాకంటే ఎక్కువగా ఆనందించేవాళ్ళు నాకున్నారు. నేను రచయితను కావటం యాదృచ్ఛికం కాదు. అలాగని ముందుగా ఏర్పరచుకున్న ప్రణాళిక కూడా కాదు. అనేక అంశాలు దీని వెనకాల వున్నాయి. బోలెడంత నాటకీయత వుంది. నా రచనలు చదివినవారికి చాలా అంశాలు మీకు దొరుకుతాయి.

నేను చివరిగా ఒకటే చెబుతాను. నా వెనుక వున్నది ప్రత్యక్షంగా మా మాస్టారు, మా అక్క, మా అమ్మ. పరోక్షంగా ఎందరెందరో! ఈ వేదిక మీద నుండి మా మాస్టారు రెండు ముక్కలు మాట్లాడతారు.”

కుటుంబరావు మాస్టారిని వేదిక మీదకి తీసుకువచ్చారు.

“నేను గర్వంగా ప్రకటిస్తున్నాను.
ఐ యామ్ ఏ టీచర్. నేను ఉపాధ్యాయుడ్ని.
ఇది రాష్ట్రపతి పదవి కంటే ప్రధాని పదవి కంటే గొప్పదని అనుకుంటాను.”

చప్పట్ల హోరు!

“నేను ఓ రచయితను, టీచర్ ని తయారు చేశాను. ఇదిగో ఈ రాజశేఖర్ ని మీకు అంకితం చేస్తున్నాను” అని చేతులు జోడించారు.

***

సభ ముగిశాక కొందరు రచయితలు రాజాని అభినందించారు.

“నువ్వు రాయాలనుకున్నది రాశావు రాజా. పాఠకులను ఏడిపించావు. నవ్వించావు. మేం రకరకాల ప్రభావాల్లో ఎప్పటికప్పుడు వుండిపోతున్నాం. ఇప్పుడు మారాల్సింది మనుషులు” అన్నారు.

“దానికి ముందు నేను ఈ పరిస్థితులన్నిటిని అనుభవించాను. ఎవరి అనుభవం తక్కువ కాదు. అలాగే ఫైనల్ కూడా కాదు” అన్నాడు రాజశేఖర్ వినయంగా.

***

రాజా స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు.

అప్పుడు ఫోన్ మోగింది. డిస్‌ప్లే లో చూస్తే భువన్ పేరు కనిపించింది.

“భువన్ జీ! మాస్టారూ, సుగుణా టీచర్ ఎలా వున్నారు?”

“బాగున్నారు. నేను హైదరాబాద్ వచ్చాను.”

“కొత్త సినిమాకి పాటలు రాస్తున్నారా?”

“పాటలు కాదుగాని ఓ పాట రాస్తున్నాను. మనం కలవటానికి అవకాశం వుందా?”

“అలా అన్నారేంటి? తప్పకుండా కలుసుకుందాం.”

“నువ్వు టీ.వీ.లకు రాస్తున్నావు కదా. అందులోనూ డెయిలీ సీరియల్‌కి రాయటం అంటే ఎంత ఒత్తిడి వుంటుందో నాకు తెలుసు.”

“ఫర్వాలేదు భువన్ గారూ… మీరు గెస్ట్‌హౌస్‌లో వున్నారా?”

“నీ లొకేషన్ పెట్టు కారు పంపిస్తాను. ఈ లొకేషన్ సిటీ బయట వుంది. గ్రీనరీ వుంటే మంచి పాటలు వస్తాయని ఈ నిర్మాత గారి ఫీలింగ్. ఇక్కడకు వచ్చాక మాట్లాడుకుందాం” అన్నారాయన.

ఇద్దరూ మరో రెండు గంటల తర్వాత కలుసుకున్నారు.

“నీ సీరియల్స్ చూస్తున్నాను రాజా!”

“మీకు అంత తీరిక వుందా?”

“మన పని ఇదే కదా. పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం. అసలు ఈ ప్రపంచం ఎలా వుంది. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలి. అన్ని సీరియల్స్ చూడటం కుదరదు. నువ్వు రాస్తున్నావు కాబట్టి చూస్తున్నాను. నీకు ఇంకో అభిమాని వున్నారు!”

“ఎవరు భువన్ జీ?”

“నా భార్య. నేను ఎప్పుడన్నా మిస్ అయినా తను కథ చెబుతుంది. అన్నట్లు తను ఎమోషనల్ స్టోరీ టెల్లర్. ఇప్పుడు కొన్ని విషయాలు నిన్ను అడుగుతాను. ఈ సీరియల్ ఒక్కడివే రాస్తున్నావా? అసిస్టెంట్‌లు వున్నారా? కాస్త పేరు వచ్చింది కదా. వాళ్ళతో రాయించి పర్యవేక్షణ చేస్తున్నావా?” అన్నారు నవ్వుతూ.

“భువన్ జీ! నేను రాసే ప్రతి అక్షరం నాదే. నా చేతిరాత మీకు తెలుసు. అలాగే రెండు యూనిట్స్ నడుస్తుంటాయి. అన్నీ నేనే రాస్తాను. స్క్రీన్‌ప్లే అప్పుడు ఇద్దరు రచయితలు వుంటారు. వారు కొత్తవారు. మా ప్రొడ్యూసర్ గారు వారికి మంత్లీ శాలరీ ఇస్తారు. వారిని తయారు చేయమంటారు. మేం కథనం గురించి చర్చించుకుంటాం. అప్పుడు వారి అభిప్రాయాలు తీసుకుని నా పద్ధతిలో రాసుకుంటాను. మా నిర్మాత గారు నా అక్షరాలకు ఎంత అలవాటు పడ్డారంటే, అదే స్క్రిప్ట్‌ని ఇంకొకరు పెయిర్ చేసినా వారికి నచ్చదు.”

భువన్ నవ్వాడు. తర్వాత,

“నువ్వు కథలూ, నవలలూ రాయటం మానలేదు. అది కష్టంగా అనిపించటం లేదా రాజా!”

“ఇష్టంగా చేస్తున్నాను భువన్ జీ. నా చదువు అయిన మరుసటి రోజు, అదే పదో తరగతి పరీక్షలు అయిన వెంటనే పనికి వెళ్ళాను. గంటలకు గంటలు పని చేయటం అలవాటయింది. రచనా అంతే.”

“ఇది మేధస్సుకి చెందినది కదా. అంత మెకానికల్‌గా రాస్తున్నావా?”

“అది మీరు చెప్పాలి.”

“అందుకే అడుగుతున్నాను. టీ.వీ. సీరియల్ అయినా కథయినా నువ్వు ఏదో రాయాలి కాబట్టి రాస్తున్నట్లు అనిపించదు. ఇది నగరం. ఈ ఫీల్డ్‌లో రకరకాల వ్యక్తులు. అలవాట్లు. పాయింటాఫ్ వ్యూస్. వీటన్నింటి మధ్యన నువ్వు హృదయాన్ని ఎలా నిలుపుకుంటున్నావు. నీ రచనల్లో ఏదో వుంది!”

“ఈ మాట నేను అనాలి భువన్ గారూ! మీ పాటల్లో, మాటల్లో మీ ఆత్మ కనిపిస్తుంది. ఒకటి నిజం. కొత్తగా రాసేవారికి మూడ్ రావాలి. ప్రేరణ కలగాలి. అప్పుడు ఓ ఆవేశంతో రాసుకుపోతారు. అదే అనుభవం వున్నవారు టేబుల్ దగ్గర కూర్చుంటే మూడ్‌లోకి వెళ్ళిపోతారు.”

“అనుభవం వున్నవారు ఎంతోమంది వున్నారు. వారు ఎందుకు రాయటం లేదు?”

“అది వారిని అడగాలి!” నవ్వాడు రాజా.

“చాలామందికి అచ్చు కావటం కావాలి. అలాగే డబ్బు వచ్చేవి కావాలి. ఇలాంటివి చాలా వుంటాయి. ఇప్పుడు నేను నీకు ఓ పుస్తకం ఇస్తున్నాను. దానికి నువ్వు ముందుమాట రాయాలి!”

“ఎవరి పుస్తకం భువన్ గారూ!”

“నాదే!”

“మీ పుస్తకానికి నేను ముందుమాట రాయటమా? పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు, గీత రచయితలు వున్నారు. అప్పుడు అది ఇంకా త్వరగా పాఠకుల దగ్గరకు చేరుతుంది కదా! వారితో రాయించండి.”

“ఇది కమర్షియల్ రచన కాదు రాజా. నా పాటల కూర్పు కాదు. ఇది నా ప్రయాణాల అనుభవసారం. ఫిలాసఫీతో నిండింది. ఈ పుస్తకానికి నువ్వు ముందుమాట రాస్తే బాగుండును అనిపించింది. ఇంకో ఇద్దరు రాస్తున్నారు. అందులో ఓ యోగి వున్నారు.”

“ఏంటండీ! మీకు మాస్టారు వున్నారు. వారితో రాయించండి. ఇది నేను రాయదగ్గది కాదు. ఆ ఎత్తులకు నేను చేరుకోలేదు.”

“బావ ఇంకో పుస్తకానికి రాస్తున్నారు. అయినా లల్లాయి పదాలు రాసేవాడివి, నీ పుస్తకానికి నేను రాయటమా అనుకుంటే మానేయ్. బలవంత పెట్టను.”

అప్పుడు భువన్ రెండు చేతులూ పట్టుకున్నాడు రాజా.

“నా నిస్సహాయతని మీ ముందుంచాను. ఇంత మంచి పుస్తకానికి ముందుమాట రాయటానికి నేను తగను అంటున్నాను. మీరు ఇంకోలా అనవద్దు భువన్ గారూ.”

“ఓ పాఠకుడిలా నీ ఫీలింగ్స్ రాయవచ్చు కదా! కాదనకు” అన్నారాయన.

బలవంతాన తలూపాడు రాజా.

***

భువన్ పుస్తకం చెన్నైలో ఆవిష్కరణ జరిగింది. అక్కడికి కుటుంబరావు మాస్టారు వచ్చారు. భువన్ అంతకుముందు చెప్పినట్లు ఓ యోగి వచ్చారు. ఇంకా చలనచిత్ర పరిశ్రమకు చెందినవారు వచ్చారు. ఒకరిద్దరు తమిళ గీత రచయితలు వచ్చారు. రాజాని రమ్మని, నువ్వు కూడా ఈ సభలో ఉపన్యాసకుడిగా మాట్లాడాలని భువన్ కోరాడు.

రాజా తన పరిస్థితి చెప్పాడు. రెండు డెయిలీ సీరియల్స్‌కి రాస్తున్నాను. ఒకదానికి స్క్రీన్‌ప్లే, రెండోదానికి సంభాషణలు. రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. మాస్టారు చెప్పినట్లు మనం ఓ సారి మన తలను అమ్ముకున్నాక వ్యక్తిగతమైన వాటిని కూడా కోల్పోవాల్సి వుంటుంది. మనం కమిట్ అయిన పనులు చేసి తీరాలని. అది పాటిస్తున్నాను. ఏమాత్రం అవకాశం వున్నా వచ్చేవాడిని. అయినా అంతమంది మేధావుల, మహానుభావుల మధ్య నేను మాట్లాడటం మంచి అవకాశమే. కానీ నా దురదృష్టం అనుకుంటున్నా అని చెప్పాడు.

“సరే. నిన్ను అర్థం చేసుకుంటాను. ఇలానే వుండు” అన్నారు భువన్.

ఆ పుస్తకం ఆవిష్కరణ అయ్యాక మాస్టారు రాజా దగ్గరకు వచ్చారు.

“నిన్ను చూడాలనిపించింది రాజా. ఇప్పుడు వయసు మీద పడుతోంది. ఇదివరకటిలా నాకు ఓపిక వుండటం లేదు. అలా అని బాగా నీరసపడిపోయాను అని కాదు. మరో అయిదారు సంవత్సరాలు గట్టిగా పని చేయగలను.”

“మీరు చేయాలనుకున్న పనులు ఇంకేం మిగిలాయి మాస్టారూ? అలాగే మీకు తీరని కోరికలు ఏమైనా వున్నాయా?”

“మనిషి బతికి వున్నంతవరకు కోరికలు పుడుతూనే వుంటాయి రాజా. అవి తీరని కోరికలు అంటానికి లేదు ఇంతకుముందు ఏదో రూపంలో అనుభవించాం. కారు కొనాలనుకుంటాం. మారుతి 800 కారు తీసుకున్నాం. ఇప్పుడు బెంజ్ కారు తీసుకోవాలనిపిస్తుంది. అది తీరని కోరిక అని నేను అనుకోను. మొదటి కారు కొనటంతో అది పూర్తి అయింది. అప్పుడు అది అవసరం. ఇప్పుడు బెంజ్ లగ్జరీ. ఇల్లు అయినా, మరొకటయినా అంతే. సో… తీరని కోరికలు లేవు. అలాంటిది ఊహించటానికి నా మనసు అంగీకరించేది కాదు.”

“నా పరిస్థితి కూడా అలాంటిదే. ఇప్పటికీ కొన్ని డ్రీమ్ చేయటానికి కూడా నా మనసు అంగీకరించదు” అన్నాడు రాజా.

మాస్టారు చిన్నగా తలూపారు. తర్వాత…

“భువన్ పుస్తకం నేను చదివాను. మీ ఇద్దరి మధ్య ఆ పుస్తకం గురించి జరిగిన చర్చ గురించి భువన్ వివరంగా చెప్పాడు.”

రాజా మాస్టారినే చూస్తున్నాడు. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రాజాకి గుర్తు వుంది. అందులో తను ఓ మాట అన్నాడు.

“భువన్ గారూ! మీ పుస్తకం అద్భుతంగా వుంది. కొన్ని చోట్ల నేను అంగీకరించలేని విషయాలు వున్నాయి.”

“అది ఎవరి విషయంలో అయినా, ఏ పుస్తకం విషయంలో అయినా సహజంగా వుంటాయి. ఎవరూ దేనినీ పూర్తిగా ఆమోదించరు రాజా. అవేంటో నాకు తెలుసుకోవాలనుంది.”

“మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువ మొగ్గు చూపారు. అది మీ విశ్వాసం కావచ్చు. అలాగే అతిగా అనను గాని ఓ ట్రాన్స్‌లోకి వెళ్ళి కొన్ని సంఘటనలు చెప్పారు అని నాకు అనిపించింది” అని కొన్ని ప్రశ్నలు అడిగాడు.

“అనుభవం మీద చర్చ అవసరం అని నేను అనుకోను రాజా!”

“ఒక్కోసారి మన అనుభవాలు కూడా మనల్ని ఓ మాయలోకి నెట్టవచ్చు. మన కంటికి కనిపించేదంతా వాస్తవం కాకపోవచ్చు అని పెద్దలు చెబుతారు కదా భువన్ జీ!”

“అంటే నేను భ్రమలో వున్నాను అంటున్నావా?”

“కొన్నిచోట్ల అనిపించింది. అది భ్రమ అంటారా? విపరీతంగా పెంచుకున్న భక్తి అంటారా? ఇంకేదయినా పేరు పెడతారా అనేది నాకు తెలియదు” అన్నాడు రాజా.

“అస్తిత్వాల గురించి ఎవరు ప్రశ్నించినా, అందులో కాస్త ఎగ్జాగరేషన్ వుంటుంది. ప్రతి విషయానికీ లాజిక్ పనిచేయదు. నా అనుభవం నీకు వస్తేగాని అది నీకు అర్థం కాకపోవచ్చు.”

“చర్చ కోసం అంటున్నాను. మీ అనుభవాన్నే నేను వాస్తవానికి దూరంగా వుంది అంటున్నాను. అలా రాయటం వెనుక ఇంకేదయినా కారణం వుండవచ్చు. అలాగే మీరు నా స్థానంలో వుంటే మీ అనుభవమే మీకు విచిత్రంగా అనిపించవచ్చు కదా!”

భువన్ కాస్త అసహనంగా చూశాడు.

“క్షమించండి. ఈ చర్చను ఇక్కడ ఆపివేద్దాం” అన్నాడు రాజా.

“అదేం వద్దుగాని, పుస్తకంలో కొన్ని విషయాలు వదిలేస్తే మొత్తంగా ఎలా వుందనిపించింది?” అన్నారాయన.

“బాగుంది. చదివించింది. క్లిష్టమైన పదజాలం లేదు. ఇందులో గుర్తుంచుకోదగ్గ ఎన్నో కొటేషన్స్ వున్నాయి. అలాగే నేను ఎంతో నేర్చుకున్నాను. ఎప్పటికయినా నాకు కూడా మీలా జర్నీ చేయాలనిపించింది. అలాగే ఇలాంటి పుస్తకం రాయాలనిపించింది.”

భువన్ చిన్నగా నవ్వారు. అవన్నీ ఇప్పుడు మదిలో మెదిలాయి.

“ఏంటి ఆలోచిస్తున్నావు రాజా!”

“భువన్ గారి పుస్తకం గురించి!”

“అందులో కొన్ని నాకు కూడా ప్రశ్నార్థకం అనిపించాయి రాజా” అన్నారాయన.

“అవి భువన్ గారికి చెప్పారా?” అన్నాడు రాజా.

“చెప్పకుండా ఎలా వుంటాను. నేను టీచర్‌ని కాదు. అప్పుడు ఓ పాఠకుడిని. అయినా భువన్ నా దగ్గర చదువుకోలేదు. అతని అనుభవాలు అతనివి. మనం చూస్తుంటాం. ఆకాశంలో అప్పుడప్పుడు వెలుగులు వస్తుంటాయి. కొంతమంది సాసర్స్ లాంటివి చూశాం అంటారు. అలాగే గ్రహాంతర వాసులు వస్తున్నారంటారు. ఎవరి ఊహలు వారివి. వెంటనే తెలియకపోయినా తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి కదా! అప్పుడు కూడా కొందరు అంగీకరించకపోవచ్చు. ఇక్కడ ఓ విషయం చెప్పాలి” అని ఆగారు.

రాజా మాస్టారిని చూస్తున్నాడు.

“ఈ పుస్తకం నేను రాసినా నువ్వు ఇలానే అడిగుండేవాడివా?”

“అవును మాస్టారూ!”

“అలా అడగకపోతే నేను బాధపడేవాడిని రాజా. టీచర్ అనే వ్యక్తి పరిపూర్ణుడు కాదు. అతను విద్యార్థుల కంటే ఎక్కువ చదువుకున్నాడు. అంతవరకు పాఠాలు చెప్పగలడు. తను గ్రాడ్యుయేట్ మాత్రమే అయితే అంతకంటే పెద్ద చదువులు చదివేవారికి చెప్పగలడా! లైఫ్ గురించో, మరో అనుభవం గురించో జనరల్‌గా చెప్పటం వేరు.”

చిన్నగా తలూపాడు రాజా.

“టీచర్ అంటే ప్రశ్నించటం నేర్పేవాడు. అది తనతో మొదలు కావాలి. విద్యార్థి తనకు అర్థంకాని పాఠాల గురించి అడగటమే కాదు. సిలబస్‌ని మించినవి కూడా అడగవచ్చు. అప్పుడు టీచర్ కూడా సమాధానాలు అన్వేషించాలి. నేను ఫైనల్ అని ఎవరనుకున్నా అంతకుమించి విషాదం వుండదు.”

“మా ప్రశ్నలకు కూడా అంతేగా మాస్టారూ!”

“అన్ని ప్రశ్నలూ అలా వుండవు నాన్నా… బాల్యంలో అడిగే ప్రశ్నలకు, ఎదుగుతున్నాక అడిగే ప్రశ్నలకు తేడా వుంటుంది. మనకంటే చిన్నవారని తేలిగ్గా తీసేయకూడదు. మనకంటే పెద్దవారు, గొప్పవారని వారు చెప్పిందల్లా చేయకూడదు. అలాగే అన్నీ నమ్మకూడదు. సత్యం తెలుసుకోవాలనుకున్నవారు ఏం చెప్పినా, ఏం రాసినా రిజిడ్ వుండరు. ఉండకూడదు. ధబాయించటం ఏ ఫిలాసఫీకి మేలు చేయదు” అన్నారాయన.

“నాకు మీరు ఎప్పుడూ టీచరే మాస్టారూ!”

“మంచి విద్యార్థులు వున్నచోట మంచి టీచర్స్ తయారవుతారు రాజా. ఇంక చేయవలసిన పనుల గురించి అడిగావు. అదయితే ఒకటి వుంది.”

“ఏంటి మాస్టారూ?”

“రష్యాని చూడాలి రాజా!” అని కళ్ళు మూసుకున్నారు. అప్పుడాయనకి తన తండ్రి రాజేశ్వరరావు, రాజా తండ్రి గుర్తొచ్చారు.

“ఇప్పుడు ఆ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయింది. మన నాన్నలు ఒక్కసారయినా ఆ దేశం వెళ్ళాలనుకున్నారు. పిల్లల్ని అక్కడికి పంపాలనుకున్నారు. వారి జీవితం అర్థంతరంగా ముగిసిపోయింది. అందుకని ఆ పని మాత్రం మిగిలిపోయింది రాజా. అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు. అసలు మనం కూడా చూడలేకపోవచ్చు. కనీసం మన పిల్లలనయినా ఆ దేశం వెళ్ళి చూడాలని కోరుకుందాం” అన్నారు మాస్టారు.

గురుదక్షిణ

రాజా చెన్నై వెళ్ళాడు. భువన్‌ను కలుసుకున్నాడు.

“ఊరకరారు మహానుభావులు అంటారు. ఇప్పుడు ఇక్కడికి రావటం వృత్తి పరంగానా? ఇంకేదయినా వుందా?”

“వృత్తిపరంగా కాదు భువన్ జీ. ముందు మీ పుస్తకం గురించి మేధావులు మాట్లాడుకుంటున్నారు. మంచి స్పందన వచ్చింది. అందుకు అభినందనలు.”

“కొంతమంది కొన్ని విషయాలలో విమర్శిస్తున్నారు కూడా!”

“అలాంటివి ఎప్పుడూ వుంటాయని మీరే చెప్పారు. అదలా వుంచుదాం. మాస్టారితో కలిసి రష్యా వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడా వస్తారా?”

భువన్ కొంతసేపు ఆలోచించాక అన్నారు.

“రాననుకుంటున్నావా?”

“నేను ఏమీ అనుకోవటం లేదండి.”

“ఈ విషయం చెప్పు. నువ్వు చాలా బిజీగా వున్నావు. సమయం కేటాయించగలవా రాజా!”

“నేను టీ.వీ.లకు రాయటం మానేశాను భువన్ జీ.”

“అదేంటి. షాకింగ్ న్యూస్ చెప్పావు!”

“ఇప్పుడు పూర్తిగా సీరియల్స్ కమర్షియల్‌గా అయిపోయాయి. లేడీ విలన్స్ ఎక్కువ అయిపోయారు. అలాగే ప్రతి సీరియల్‌లో కుట్రలూ, మనుషులను చంపుకోవటాలు, స్త్రీ-పురుష సంబంధాల్లో అనేక రకాల ధోరణులు వచ్చాయి. సాఫ్ట్‌గా చక్కటి హాస్యం, హింస లేకపోవటం వీటిని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇప్పటివరకు గొప్ప సీరియల్స్ రాయికపోవచ్చు. మనుషుల మనసులు పాడు చేసేవి రాయలేదు. అంతేకాదు, నేను రెండు మూడు తాత్విక పుస్తకాలు రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్న సీరియల్స్ పూర్తి అయ్యాయి. నా ప్రయాణం రష్యాతో మొదలు పెట్టాలనుకుంటున్నాను.”

“గుడ్. నేను రష్యా రావటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జర్నీ అంటే అది ఆధ్యాత్మికం కావచ్చు. విప్లవం కావచ్చు. మరొకటి కావచ్చు. మనం అన్నీ తెలుసుకోవాలి. అన్నీ చూడాలి. ప్రతి దేశం తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకుంది. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాలు మానవ నాగరికతలో భాగాలు కదా!”

“మీరు మాతో వస్తాననటం బాగుంది.”

“బావగారిని కలిశావా?”

“ముందు మీ దగ్గరికే వచ్చాను. నేను మన ప్రయాణానికి తగ్గ ఏర్పాట్లన్నీ చూస్తాను. అప్పుడు మీతో మాట్లాడతాను.”

“తప్పకుండా రాజా. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను రెడీగా వుంటాను” అన్నాడాయన.

అటునుండి కుటుంబరావు మాస్టారి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరూ గోదావరి చెంతన కూర్చున్నారు.

“నేను భువన్ గారిని కలిసి వస్తున్నాను మాస్టారూ… మనం రష్యాను చూడబోతున్నాం” అన్నాడు రాజా.

మాస్టారి ముఖంలో ఉద్విగ్నత కనిపించింది.

“భువన్ గారు వస్తాను అన్నారు. అలాగే సుగుణా టీచర్ వస్తానంటే ఇంకా సంతోషం. ముందు ముందు ప్రయాణాలు చేయాలంటే కష్టం. మనతో పాటు ఇంకొంతమంది మిత్రులు వస్తారు మాస్టారూ. ఇప్పుడు ఆ ప్రయత్నంలో వున్నాను. త్వరలోనే ఆ ఏర్పాట్లు పూర్తి అవుతాయి.”

“సుగుణకు ఆరోగ్యం బాగుండటం లేదు రాజా. తను జర్నీ చేయటం కష్టం. మనమయితే తప్పకుండా వెళ్దాం. జీవితంలో మిగిలిపోయిన పని అందామా- కర్తవ్యం అందామా ఇదే కదా!” అన్నారు మాస్టారు.

“ఇకనుండి నేను టీ.వీ.లకు రాయటం లేదు మాస్టారూ. ఆ సరదా అనండి. అవసరం అనండి అది తీరిపోయింది. ఈ జర్నీ తర్వాత నేను కొన్ని పుస్తకాలు రాయాలనుకుంటున్నాను. వాటి మీద దృష్టి పెడతాను.”

చిన్నగా తలూపి అన్నారు.

“ఎక్కడి కిసాన్ నగర్. అక్కడ మనం కలవటం ఏమిటి? తిరిగి కొంతకాలం అజ్ఞాతంలో వున్నాం. నువ్వు మీ నాన్న కోరుకున్నట్లు రచయిత అయ్యావు. పేదరికాన్ని పోగొట్టాలనేదే మన వాళ్ళందరి కోరిక. అది అందరి విషయంలో జరగటానికి సుదీర్ఘకాలం పడుతుంది. వ్యక్తిగతంగా ఏ ఒక్క కుటుంబం ఆ స్థితి నుండి బయటపడినా ఆ మేరకు సమాజం ఓ అడుగు ముందుకు వేసినట్లే అని నేను అనుకుంటాను. నేను ఒక్కడినయినా రష్యా వెళ్ళి రావచ్చు. ఎందుకో అలాంటిది చేయలేకపోయాను.”

“అన్నిటికి సమయం, సందర్భం కలిసి రావాలి కదా మాస్టారూ!”

“అవును. ఏ టీచర్ అయినా అదే చెబుతారు. పరిస్థితులు పరిపక్వం కావాలి. అప్పటిదాకా వేచి చూడగల ఓపిక వుండాలి. అది లేకపోతే చాలా తప్పులు జరుగుతాయి. ప్రయాణం మధ్యలో ఆగిపోవచ్చు. ఇప్పుడు నాకు సంతోషంగా వుంది. నా విద్యార్థి, నా ఫ్రెండ్ ఇందుకు ముందుకు వచ్చాడు. నేను అభిమానించే భువన్ నాతో జర్నీ చేస్తాడు. యువకులుగా వున్నప్పుడు ఏ దేశమైనా ఏ ప్రాంతమయినా చూడటం వేరు. ఇప్పుడు మనందరికీ మెచ్యూరిటీ వచ్చింది. అది పరిపూర్ణం కాకపోయినా ఆ దిశలో ట్రావెల్ చేస్తోంది. మంచిది నాన్నా… మనం వెళ్దాం” అన్నారాయన.

తర్వాత అన్నారు…

“రేపు నువ్వు రాయబోయే పుస్తకాలయినా అంతే. టీచర్ అంటే పాఠశాలలలోనో, కళాశాలలోనో, యూనివర్సిటీల్లోనో పాఠాలు బోధించేవారు మాత్రమే కాదు. నీ జీవితం ఎన్నెన్నో మలుపులు తిరిగింది. అవే నిన్ను రచయితను చేశాయి. ఉపాధ్యాయుడ్ని చేశాయి. ఓ టీచర్‌గా ఇవి నేను గర్వపడుతున్న క్షణాలు” అన్నారు మాస్టారు.

***

రాజా అక్క ప్రతిభను కలుసుకున్నాడు. అంతకుముందు రష్యా ప్రయాణం గురించి చెప్పాడు.

“నువ్వు కూడా వస్తావా అక్కా!” అన్నాడు.

“లేదు తమ్ముడూ… అయినా నువ్వు వెళ్తున్నావు. పక్కన మీ మాస్టారుంటారు. నీ కళ్ళతో నేను చూస్తాను. నువ్వు రష్యాని కేవలం చూసి రావని నాకు తెలుసు. వచ్చాక తప్పకుండా ఓ పుస్తకం రాస్తావు. అది చదువుతుంటే నాకు ఆ దేశాన్ని చూసినంత అనుభూతి కలుగుతుంది.”

“రష్యా మీద చాలా మంది పుస్తకాలు రాశారు కదక్కా!”

“ఎవరి దృష్టి వారిది రాజా. ఎవరి కోణం వారిది. నువ్వు ఆ ప్రాంతాలు చూస్తున్నప్పుడు నాన్న గుర్తు వస్తారు. అమ్మా, మేమందరం గుర్తు వస్తాం. దానికంటే ముందు ఓ పసి పిల్లవాడి కుతూహలం, కలలూ, నీ కళ్ళల్లో వున్నాయి. ఆలోచిస్తుంటే నాకూ అనిపిస్తుంటుంది…”

“ఏ విషయం గురించి అక్కా?”

“మిరాకిల్స్ అంటుంటారు. అద్భుతాలు. మనం ఊహించనివి. అవి యాక్సిడెంటల్‌గా జరుగుతాయో, వాటి వెనకాల రీజన్ వుంటుందో మనకు తెలియదు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అప్పటిదాకా విధిని నమ్మనివారు కూడా ఏదో శక్తి దీని వెనకాల వుందని ఆధ్యాత్మికతలోకి జారిపోతారు.”

“అవును. అలాంటి వ్యక్తులు మన ముందున్నారు. అకస్మాత్తుగా వారు ఇలాంటి మార్పుకు లోనవటం మీద తీవ్ర విమర్శలు కూడా వున్నాయి.”

“రాజా! ఒకప్పుడు విమర్శకు ఓ గౌరవం వుండేది. ఇప్పుడు ఎవరయినా ఏ విషయాన్ని అయినా విమర్శిస్తారు. అందుకు వారికి ఆ విషయం మీద లోతైన అవగాహన అవసరం లేదు. ఇందాక నువ్వు అన్నావు అకస్మాత్తుగా వారు మార్పుకు లోనయ్యారు అని. కాదు. అది ఎప్పుడో మొదలవుతుంది. దాన్ని పరిశీలిస్తారు. తర్వాత ఓ చర్చకు పెట్టాలనుకుంటారు. అలాంటి వాటి మీద ఎలాంటి వ్యంగ్యాలు లేకుండా చర్చించవచ్చు. కానీ అలా వుండదు. పార్టీలు మారేవారు వుంటారు. పార్టీలో వున్నప్పుడు వారిని ఏమీ అనరు. వారు కూడా పార్టీ గురించి మాట్లాడరు. ఓసారి బయటకు వచ్చాక రెండు పక్కల నుండి యుద్ధం మొదలవుతుంది.”

“అవునక్కా! మనిషి మారటం తప్పుకాదు. అన్ని పార్టీల్లో అంతర్గతంగా ఏం జరుగుతుందో బయటకు తెలియదు. తాను నమ్మని వాటిని కూడా నమ్మినట్లు నటించటం పొరపాటు కదా!”

చిన్నగా తలూపి అంది.

“మన వరకు ఇదో మిరాకిల్. మీ మాస్టారు రావటం, ఇప్పటి ఈ ప్రయాణం వరకు జరిగినవన్నీ తలచుకుంటే మాత్రం ఇది చిన్న విజయం కాదు. పైనుంచి ఇవన్నీ చూస్తుంటారు అంటారు. అదో అందమైన ఊహ. వాస్తవం తెలిసినవారు, చెప్పినవారు లేరు. ఓ వ్యక్తి మరణించినా, అతని, ఆమె భావాలను గౌరవించటం మనుషులు చేయాల్సిన పని. ఆ రకంగా చూస్తే నువ్వు గొప్ప జర్నీ మొదలుపెట్టావు. నాకు చాలా…” అని మాట్లాడలేకపోయింది ఉద్వేగంతో.

***

హైదరాబాద్ ఎయిర్పోర్ట్.

కుటుంబరావు మాస్టారు, భువన్ కలిసి వచ్చారు. అప్పుడు రాజా తన మిత్రుడు శివకుమార్‌ని వారికి పరిచయం చేశాడు.

“అందరూ కుమార్ అంటారు. తను అమెరికా, చైనా, వియత్నాం లాంటి దేశాలు తిరిగాడు. నిరంతరం ప్రయాణం చేయటం ఇష్టం. ఇప్పుడు మన రష్యా ప్రయాణం ఏర్పాట్లు చూసింది కుమార్” అన్నాడు రాజా. తర్వాత…

“మా మాస్టారి గురించి మీకు చెబుతుంటాను కదా కుటుంబరావు గారు. ఇంకా భువన్ గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.”

“ఈ మధ్య మీ పుస్తకం చదివాను భువన్ గారూ! మీ అనుభవం విస్తారమైనది. అటు సినిమా రంగంలోనూ, అలాగే మీ మిలటరీ అనుభవాలు, ఆధ్యాత్మిక ప్రయాణం మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడ్డాయి. ఇంక మాస్టారిని గురించి వినటమే గాని చూడటం ఇదే. రాజాకి మీరంటే అంతులేని గౌరవం, ప్రేమ, అన్నీ అనుకోండి. ఇప్పటి తరానికి మీలాంటి టీచర్స్ కావాలి.”

“మీరేం చేస్తుంటారు కుమార్?”

“నాకు ఇద్దరు అమ్మాయిలు మాస్టారూ! రెండో అమ్మాయి అమెరికాలో డాక్టర్. మొదటి అమ్మాయి సాఫ్ట్‌వేర్. తను లండన్‌లో వుంది. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. పిల్లలు. నేను కొంతకాలం యూత్ ఆర్గనైజేషన్‌లో పని చేశాను. ప్రస్తుతం ప్రపంచంలో వున్న గొప్ప క్లాసిక్స్‌ని తెలుగులోకి అనువాదం చేయిస్తున్నాను. అవన్నీ వరుసగా పుస్తకాలుగా ప్రచురిస్తున్నాం. ఆర్థికపరంగా ఇబ్బందులు లేవు. వంశపారంపర్యంగా భూములు, స్థలాలు వచ్చాయి. అందుకే జర్నీ అంటే నాకు ఇష్టం.”

“మంచి పని చేస్తున్నావు బాబూ” అన్నారు మాస్టారు.

హైదరాబాద్ నుండి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ నుండి మాస్కో వెళ్ళటానికి విమానం ఎక్కారు. కిటికీ నుండి చూస్తుంటే కొండలూ, దట్టమైన అడవులు ఎక్కువగా కనిపించాయి. మాస్కో చేరేటప్పటికి అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలయింది. అందరూ బయటకి వచ్చారు. అక్కడ వారి పేర్లున్న బోర్డులు పట్టుకుని ఓ వ్యక్తి కనిపించాడు. అతనికి ఆంగ్లం రాదు. సైగలతోనే సంభాషణ. బెంజ్ వ్యాన్ తీసుకువచ్చాడు. దారిలో పైన్ చెట్ల వనాలు, అడవులు కనిపించాయి.

అరగంటలో ‘వీగా’ అనే ముప్పై అంతస్తుల హోటల్‌కి తీసుకెళ్ళాడు. చెకిన్ అవ్వటానికి గంట పట్టింది. రెండు గదులు తీసుకున్నారు. ఇరవై రెండో అంతస్తులో.

సాయంకాలం ఆరు గంటలకు గైడ్ రెడీగా వుంటుంది. మాస్టారు గదిలోకి వెళ్తూ అన్నారు.

“రష్యా గడ్డ మీద కాలు మోపాం రాజా!”

***

కుమార్, రాజా ఓ గదిలో వున్నారు. కుటుంబరావు మాస్టారు, భువన్ మరో గదిలో వున్నారు. కుమార్‌కి ఇంతకుముందు ప్రయాణపు అనుభవాలు వున్నాయి. అందుకని ముందు డాలర్స్ తీసుకున్నాడు. డాలర్ 67 రూపాయలు. ఒక డాలర్‌కి 63 రూబుల్స్. రూబుల్ మన కరెన్సీలో ఒక రూపాయి 7 పైసలు.

అందరికీ సరిపోయేలా తీసుకున్నాడు. రష్యాలో షాపింగ్ చేయటానికి, అలాగే ఏది కొనుక్కోవాలన్నా ఇబ్బంది పడకుండా కుమార్ ప్లాన్ చేశాడు.

ఆరు గంటలయింది. ‘యూజీనా’ వారికి గైడ్. ఇరవై అయిదు సంవత్సరాల వయసు. సృజనాత్మక రచనా విధానంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. టూరిస్ట్ గైడ్‌గా వుండటం ఆమె హాబీ.

అందరూ ఆమెను కలుసుకున్నారు.

మాస్కోలో మూడు రోజుల్లో ఏయే ప్రాంతాలు చూడాలో వివరంగా చెప్పింది. మనం మెట్రో స్టేషన్‌తో ప్రారంభిద్దాం అంది. అది దగ్గరలో వుంది. ‘పార్టిజిని స్కియా’ దాని పేరు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే కట్టిన రైల్వే స్టేషన్.

1935లో ఈ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ ఆరంభం అయింది. 11 కిలోమీటర్ల పొడవు పదమూడు స్టేషన్లు కట్టారు. తర్వాత అది 466 కిలోమీటర్ల పొడవు 271 స్టేషన్లకు విస్తరించింది.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మాస్కో మీద జర్మనీ బాంబుల వర్షం కురిపించినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఇక్కడ తలదాచుకున్నారు.

యుజీనా స్తంభం లాంటి ఆకారాన్ని చూపించి అందరిని చూస్తూ…

“ఇది ఎవరో తెలుసా?” అంది. అటు చూస్తుంటే ‘జోయా’ అని చెప్పింది.

రాజాకు వాళ్ళ నాన్న గుర్తు వచ్చాడు. బంధువులు వారి అమ్మాయికి పేరు పెట్టమని అడిగినప్పుడు ‘జోయా’ పేరును సూచించాడు. అప్పట్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్యూనిస్టు ప్రభావం వుండేది. కమ్యూనిస్టులే కాదు, అభ్యుదయ దృక్పథంతో ఆలోచించేవారు, ఉద్యమాల్లో పాల్గొనకపోయినా సానుభూతిపరులుగా వున్నవారు తమ పిల్లలకు రష్యా నదుల పేర్లు, త్యాగమూర్తుల పేర్లు, యూనివర్సిటీల పేర్లు, రెడ్ ఆర్మీలో పని చేసిన యోధుల పేర్లు పెట్టేవారు.

అలాగే దేశానికి చెందిన భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, గాంధీల నుండి అనేకమంది పేర్లు పెట్టుకున్నారు.

మాస్టారు రాజా దగ్గరకు వచ్చారు.

“‘జోయా’ పేరు మా బంధువుల్లోనూ వుంది” అన్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం అయిన తొలి రోజుల్లోనే రష్యా బోర్డర్‌లోని గ్రామాలను జర్మన్లు ఆక్రమించారు. అప్పుడు జోయా ఆ గ్రామాల ప్రజలందరినీ ఏకం చేసింది. ఆ సైన్యాన్ని ప్రతిఘటించింది.

శత్రువులు జోయాను అత్యంత క్రూరంగా చంపటమే కాదు. వారాల పాటు ఆమెను గ్రామ నడిబొడ్డులో, మంచులో వేలాడదీశారు.

అక్కడ అందరూ నిలబడి శిరస్సు వంచి నివాళులు అందజేశారు. ‘యుజీనా’ వారిని ‘పుష్కిన్ స్క్వేర్’కి తీసుకువెళ్ళింది.

అక్కడ పుష్కిన్ నిలువెత్తు విగ్రహం వుంది. అలాగే మ్యూజియం వుంది. పుష్కిన్ 18వ శతాబ్దపు కవి, కథకుడు, నాటక కర్త.

రాజా, కుమార్‌ని చూశాడు.

‘ఇస్పేట్ రాణి’ అన్న పుష్కిన్ కథను కుమార్ చెప్పాడు. అది ఒకటి రెండు చోట్ల రాజా తన కథానానికి ఉపయోగించుకున్నాడు. చిన్న కథ. మొదటిసారి విన్నప్పుడు ఊహించని ఆ ముగింపుకి దిగ్బ్రమ కలిగింది. భిన్నాభిప్రాయాలు ఎలా వుంటాయో, ఒక కథ ఎన్ని కోణాల్లో జీవితాన్ని చూపిస్తుందో చెప్పిన రచన.

ఈ కథను ఎందరికో చెప్పాడు.

పుష్కిన్ విగ్రహం ముందు మోకరిల్లాడు రాజా. భువన్, మాస్టార్లకు కుమార్ ఆ కథ గురించి చెప్పాడు. సాధారణంగా ప్రముఖ రచయితల రచనలన్నీ అందరికీ చేరవు. వారు ఓ కథ, నవల, లేదా ఓ కవిత్వ పుస్తకంతో జనంలోకి వెళ్తారు. వాటి గురించే మాట్లాడుతుంటారు.

అందులోనూ విదేశీ భాషల్లోకి అనువదించేవారు కూడా ప్రముఖ రచనలనే తీసుకుంటారు. స్వదేశంలో కూడా వెలుగు చూడని అద్భుత రచనలుంటాయి. ఎవరో ఒకరు అలాంటివి వెలుగులోకి తీసుకువస్తుంటారు.

అక్కడ నుండి నడక దూరంలో గోర్కీ స్థాపించిన ‘లిటరేచర్ ఇన్‌స్టిట్యూట్’ వుంది. గోర్కీ అంటే తెలియని సీరియస్ రచనలు చేసేవారుండరు. 1906లో ‘అమ్మ’ నవల వచ్చింది. జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా కార్మికులు తిరుగుబాటు చేశారు. వారికి మద్దతునిస్తూ నిలబడిన ఓ నిరుపేద మహిళే ఈ అమ్మ.

బైబిల్ తర్వాత ఎక్కువ భాషల్లో అనువాదం అయింది ‘అమ్మ’ నవల మాత్రమే. ముందు ముందు ఇంకే రచనకయినా అలాంటి అవకాశం వస్తుందా అనేది చరిత్ర రాసుకోవాల్సి వుంది.

గోర్కీ ఏనాడూ బడి ముఖం చూడలేదు. పుస్తకాలు చదువుకుంటూ, నిరంతరం ప్రజల మధ్య వుంటూ రచయితగా ఎదిగాడు.

కుమార్ అన్నాడు అందరితో…

“గోర్కీకి చెందిన అమ్మ, ఆయన బాల్యం లాంటి కొన్ని రచనలు మాత్రమే మనకు అందుబాటులో వున్నాయి. ఆయన కథలు, ఇతర రచనలు చాలా వున్నాయి. వాటిలో కొన్నింటినయినా తెలుగు పాఠకులకి అందించే ప్రయత్నం మొదలు పెట్టాను.”

“అలాంటి రచనలకు కాలదోషం పట్టదు” అన్నారు భువన్.

అక్కడ ప్రతి స్టేషన్‌కి ఓ ప్రత్యేకమైన పేరు, రకరకాల శిల్పాలు, పెయింటింగ్స్‌తో కళాత్మకంగా తీర్చిదిద్దుకున్నారు.

పుష్కిన్ స్క్వేర్ నుండి బోల్ష్‌వాయ్ థియేటర్‌కి చేరుకున్నారు. అక్కడ బాలె డాన్సులు, బపెరాలు జరుగుతుంటాయి. వంద రూబుల్స్ నుండి పదిహేను వందల రూబుల్స్ దాకా టిక్కెట్ ధరలు వుంటాయి. అవి చూసే అవకాశం లభించలేదు. మొదటి రోజు ప్రయాణం అలా ముగిసింది.

***

ఆ రాత్రి నలుగురూ కూర్చున్నారు.

“ప్రధానంగా లెనిన్ మసోలియం చూడాలి. ఇన్ని దశాబ్దాలుగా లెనిన్ మృతదేహాన్ని పాడవకుండా కాపాడుతున్నారు. దీని మీద రకరకాల అభిప్రాయాలు వున్నాయి. అలా చేయటం సరయింది కాదంటారు. అలాగే గోవాలో కూడా చర్చి ఫాదర్ మృతదేహం వుంది. అవన్నీ అలా వుంచితే ఇప్పుడు మీ అనుభూతి ఎలా వుందో తెలుసుకోవాలనుంది. అన్నారు మాస్టారు.

“ఇక్కడ రచయితలకు, కళాకారులకే కాదు అమరవీరులకు ఇస్తున్న గౌరవం చూస్తుంటే తన్మయత్వం కలుగుతుంది. మనం వరుసగా మార్క్స్ విగ్రహం చూడాలి. ఇంకా అనేక ప్రాంతాలు వున్నాయి. నాకు అనిపిస్తోంది ఒకటే. ఇక్కడ చర్చ్‌లు గాని, మసీదులు గాని క్షేమంగా వున్నాయి. వాటిని కూల్చలేదు. ఇప్పుడు ప్రపంచమంతా గత చరిత్రను కూల్చుకుంటూ పోవటమే కదా!” అన్నారు భువన్.

“జార్ చక్రవర్తుల విగ్రహాలను కూల్చారు. ఇప్పుడు స్టాలిన్ విగ్రహాలను కూల్చారు. కొన్నిచోట్ల మార్క్స్ విగ్రహాలను. అలాగే తాలిబన్లు లాంటివారు బుద్ధుడి విగ్రహాల నుండి అనేక విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతదాకా ఎందుకు ఇప్పుడు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది రాజా?” అడిగారు మాస్టారు.

“విధ్వంసం. పునర్ నిర్మాణం, తిరిగి విధ్వంసం. 1941లో జర్మన్ సైన్యం సోవియట్ యూనియన్ మీద దాడి చేసింది. మాస్కో, లెనిన్ గ్రాడ్, స్టాలిన్ గ్రాడ్ నగరాలను చుట్టుముట్టాయి. ఆ యుద్ధంలో ఆరు కోట్లమంది చనిపోయారు అంటారు. సోవియట్ యూనియన్‌కి చెంది రెండున్నర కోట్ల మంది ప్రజలు చనిపోయారు. అందులో కోటిమందికి పైగా సైనికులు వున్నారు. చరిత్ర నుండి మనుషులు పాఠాలు నేర్చుకోరా? విధ్వంసమే వారి ఏకైక గమ్యమా అనిపిస్తోంది మాస్టారూ” అన్నాడు రాజా.

“అసలు ఈ సమాజం ఎప్పటికయినా మారుతుందా అని నాకు అనుమానం వస్తుంటుంది” అన్నాడు కుమార్.

“అవును. ఏ మతం చరిత్ర చూసినా ఇంతే. అంతర్గత యుద్ధాలు, లేదంటే ఇతర మతాల మీద దాడులు, విధ్వంసాలు. అసలు మనుషులకి ఏం కావాలి, వారి అంతిమ గమ్యం ఏమిటి అన్నది మనకు అర్థం అవుతోందా అనిపిస్తుంది” అన్నారు భువన్.

***

లెనిన్ మాసోలియంకు వెళ్ళేముందు కారల్ మార్క్స్ విగ్రహం చూశారు. లెనిన్‌ని చూడటానికి ఇప్పటికీ బారులు తీరిన జనాన్ని చూశారు. లెనిన్ ముందు నిలబడ్డారు. మానవులు అంతకుముందు చూడని ఓ కొత్త సమాజాన్ని రూపుదిద్దటానికి కోట్లమంది ప్రాణాలు అర్పించారు. ఆ విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించాడు లెనిన్.

‘మా తండ్రి కలలుగన్న కొత్త సమాజపు గడ్డమీద వున్నాను. మిమ్మల్ని చూడాలనుకున్నారు. మీరు నిర్మించుకుంటున్న కొత్త సమాజాన్ని చూడాలనుకున్నారు. కానీ ఏ దేశమైనా మార్పులను సహించదు. రక్తంతో చరిత్రను రాస్తుంది. అలా అమరవీరులయ్యారు. వారి బిడ్డలుగా ఈ రూపంలో అయినా ఇప్పటికి చూడగలుగుతున్నాం. రేపు ఎన్ని విప్లవాలు వచ్చినా, రానున్న సమాజం ఎలాంటి మార్పుకు గురవుతుందో ఎవరూ చెప్పలేరు. మేం చేయగలిగింది ఒక్కటే. ఈ కల కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ వినయంగా నమస్కరించటమే!” అనుకున్నారు మాస్టారు.

రాజాకు నాన్న గుర్తు వచ్చాడు. అక్కతో అనేవారంట. నేను ఎంతకాలం వుంటానో తెలియదు. ఓ రకంగా మీ అందరికీ అన్యాయం చేశాను. మీకు కనీస జీవితం ఇవ్వలేకపోయాను. అయితే మీరు నా పిల్లలు అని ఇప్పుడు అనిపిస్తోంది. నా కుటుంబం అనే ఆలోచన వస్తూంది. ఇంతకుముందు జగమంత కుటుంబం, అందులో మనందరం భాగం అనిపించేది. అది వాస్తవమే. మేము కోరుకున్న సమాజం రాలేదు. రేపటి నుంచి నేను వుండను. అప్పుడు మిమ్మల్ని ఎవరు చూస్తారు అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

“నాన్నా మీరు ఏడవకండి. మీరే అంటున్నారు. ప్రపంచమంతా మనలాంటి వారు వున్నారు. వారు బతకటం లేదా? అలానే మేం బతుకుతాం” అంది ఆ చిన్న వయసులోనే.

చిన్నగా తలూపి అన్నాడంట…

“ఇలా అడగటం ఏ రకంగా చూసినా అన్యాయమే. రేపు ఏమిటో ఎలా బతకాలో తెలియని వారిని అడగకూడదు. నువ్వు తమ్ముడూ లేదా మీలో ఎవరో ఒకరు రష్యాని చూడాలి. అది ఎలా సాధ్యం అవుతుందో నాకు తెలియదు. ఇది మీ నాన్న చివరి కోరిక.”

అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన వెళ్ళిపోయారు.

అప్రయత్నంగా ఆకాశం కేసి చూశాడు రాజా.

“మీరు కోరుకున్న గడ్డమీద వున్నాను. ఈ చరిత్ర తెలుసుకుంటుంటే, ఇక్కడ గత చిహ్నాలు చూస్తుంటే మీ ఆశయం విలువ తెలుస్తోంది. మీవి గొప్ప కలలు. మీ ఆదర్శాలు హిమాలయాలంత ఎత్తైనవి. ఇక్కడ నిలబడి మీలాంటి వారందరికీ రెడ్ సెల్యూట్ చేస్తున్నాను.”

కుమార్ అందరినీ నిర్వికారంగా చూస్తున్నాడు.

***

మూడు రోజుల తర్వాత యుజీనా అందరి దగ్గర సెలవు తీసుకుంది.

టాల్‌స్టాయ్ మ్యూజియమ్ చూశారు. జమీందారీ వంశంలో పుట్టి అన్నీ త్యజించి సామాన్యుడిలా బతికిన రచయిత టాల్‌స్టాయ్. ఆయన రచనలు అన్నా కెరీనినా, యుద్ధం-శాంతి నవలలు ఇప్పటికీ ప్రపంచ దేశాల పాఠకులను అలరిస్తూనే వున్నాయి. సినిమాలుగా వచ్చాయి.

యూరీ గగారిన్ ప్రపంచంలోనే తొలిసారిగా స్పేస్‌లోకి వెళ్ళిన వ్యోమగామి. ఆ రోజు తన తండ్రి ఆనందంగా గగారిన్ గురించి చెప్పటం రాజాకి గుర్తు వచ్చింది. అప్పుడు అర్థం కాలేదు. కానీ ఆయన కళ్ళల్లోని ఆనందం ఇప్పటికీ రేఖామాత్రంగా గుర్తుంది.

చెకోవ్ సమాధిని చూశారు. మాస్కో యూనివర్సిటీ, క్రెమ్లిన్ గోడ, జార్ చక్రవర్తి వైభవాలు, లెనిన్ కావ్యం రాసిన మైఖోవ్‌స్కీ, అలాగే దోస్తోయేవ్‌స్కీ, విఖ్యాత సినీ దర్శకుడు ఐజన్ స్టీన్ (1898-1948). ఐజన్ స్టీన్ ‘మాంటేజ్’ అనే ఫిల్మ్ టెక్నిక్ రూపశిల్పి. బ్యాటిల్ షిప్ పొటెంకిన్, అక్టోబర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తీశారు. అలాగే జాన్‌రీడ్‌ని చూసినప్పుడు ‘ప్రపంచాన్ని కుదిపిన పది రోజులు’ పుస్తకం గుర్తు వచ్చింది.

ఆఖరి జార్ చక్రవర్తి నికోలస్-2 అధిరోహించిన సింహాసనం కనిపించింది. బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణం చేశారు.

కుమార్ అందరి ఫోటోలు తీస్తున్నాడు. కొన్ని పెయింటింగ్స్ తీసుకున్నారు. పోప్లార్ వృక్షాలు చూశారు. ముఖ్యంగా రష్యన్ చాయ్ తాగారు. మనసటి రోజు ఇండియాకు ప్రయాణం!

***

రాత్రి అందరూ తిరిగి సమావేశం అయ్యారు.

“ఇది మరపురాని ప్రయాణం. ముఖ్యంగా మనకూ, రష్యా వారికి మధ్య దశాబ్దాలుగా ఓ అనుబంధం వుంది. రాజ్ కపూర్ సినిమాలంటే రష్యన్లు ఇష్టపడేవారు. అలాగే నెహ్రూని అభిమానించేవారు. ఇక్కడ ఇన్ని కట్టడాలున్నాయి. మ్యూజియమ్స్ వున్నాయి. ఏ రంగాన్నీ వారు వదలలేదు. ఏమైనా ఈ పది రోజుల్లో ఈ దేశాన్ని చూడటం ఎలా సాధ్యం. కానీ నిన్నటి సోవియట్ ఆత్మ మాత్రం నన్ను ఆవహించింది” అన్నారు భువన్.

“రష్యా అంటే అనేకమందికి ఓడ్కా గుర్తుకువస్తుంది. నన్ను రెండు బాటిల్స్ తెమ్మని అడిగిన మిత్రులు వున్నారు” అన్నాడు కుమార్.

“ఇన్ని యుద్ధాలను భరించి అగ్ర రాజ్యాలతో ఏ రంగంలో అయినా సమానంగా అంతరిక్షంలో కూడా అద్భుత విజయాలు సాధించారు. అలాంటిది ఓ బ్రేక్ పడింది. అయినా సరే. సోవియట్ యూనియన్ అనేది మానవుల మహా స్వప్నం” అన్నారు మాస్టారు.

“ఇక్కడ ఎందరో ఉపాధ్యాయులను చూశాను. ఒక్కో రంగం ఓ మహా సముద్రం. వాటి లోతులను దర్శించటం, కొలవటం, ఇంకా మనకు అర్థం కాని ప్రకృతి రహస్యాలను శోధించటం అంత సులభం కాదు. అవన్నీ కొత్త తరాలు అందిపుచ్చుకోవలసిన కర్తవ్యాలు. ఇప్పుడు నాకు ఇంకోటి అనిపిస్తోంది మాస్టారూ!”

ఏమిటన్నట్లు చూశారు.

“మనం రష్యాను పూర్తిగా కాకపోయినా చూడగలిగాం. మనం భారతదేశాన్ని ఎంతవరకు చూశాం. మనకూ చరిత్ర వుంది. మన దగ్గరా మహోపాధ్యాయులు వున్నారు. మనదేశంలో కూడా అన్ని రకాల ఉద్యమాలు బలహీనపడ్డాయి. ఇప్పుడు మేధావులందరి ప్రశ్న. ఏం చేయాలి? ఏం చేయకూడదు. ఎలా చేయాలి? వీటి గురించి అన్వేషించాలి కదా!”

ఒక్కసారిగా నిశ్శబ్దం.

తర్వాత మాస్టారు అన్నారు.

“ఈ ప్రశ్న భారత మేధావులదే కాదు. సోవియట్ యూనియన్‌ది, చైనా లాంటి దేశాలదే కాదు. ప్రపంచ దేశాల మేధావులది. తిరిగి అందరూ ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ పోవాలి. అప్పుడు మానవీయ అద్భుత సౌథాన్ని నిర్మించగలం.”

తిరిగి అందరూ విమానం ఎక్కారు.

‘బాయ్ బాయ్ రష్యా’ అనుకున్నారు మనసుల్లో!

***

కాలం మరికొన్ని నెలలు ముందుకు కదిలింది.

కుమార్ సోవియట్ యూనియన్ ప్రయాణం మీద పుస్తకం ప్రచురిస్తున్నాడు. అందులో అన్ని ఫొటోస్ వున్నాయి. రంగుల్లో అత్యంత క్వాలిటీతో ఆ పుస్తకం చూసేవారికి, చదివేవారికి రష్యాలో పర్యటిస్తున్నట్లు వుంది.

అంతకుముందు రష్యాను దర్శించినవారికి గత అనుభవాలు గుర్తు వస్తాయి. అలాగే కుమార్ తన దృష్టి నుండి రాసినా అందులో అందరి అభిప్రాయాలను ప్రచురించాడు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం రూపొందిస్తున్నప్పుడు ఈ వార్త తెలిసింది.

కుటుంబరావు మాస్టారికి గొంతు కేన్సర్ వచ్చింది. భువన్, మాస్టారిని చెన్నై తీసుకువెళ్ళారు. అక్కడ అడయార్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స చేయిస్తున్నారు.

మాస్టారి నుండి రాజాకు మెసేజ్ వచ్చింది.

“ఇంకెంతకాలం వుంటానో తెలియదు. నిన్ను చూడాలని వుంది. ట్రైన్ బయలుదేరి వెళ్ళాక స్టేషన్‌కి రాకు.”

అప్పటికప్పుడు కుమార్‌తో కలిసి చెన్నై వెళ్ళాడు రాజా.

మాస్టారిని అలా చూడగానే భోరున ఏడ్చేశాడు.

“ఎందుకు నాన్నా అంత దుఃఖం. అసలు మన బాల్యం మొదలయింది మృత్యువుతోనే కదా! మనం మన తండ్రుల్లా అర్థంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఓ తండ్రిని కిరాతకంగా చంపారు. ఇంకో తండ్రి ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఉద్యమం కోసం చనిపోయారు. మీ అందరినీ వదిలి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నువ్వు బస్ దగ్గర ఏడ్చావు. దానివెంట కొంత దూరం పరుగులు తీశావ్. అవన్నీ నా మనసులో వున్నాయి.”

కుమార్, భువన్‌లు ఇద్దర్నీ విషాదంగా చూస్తున్నారు.

“మృత్యువు అత్యంత సహజమైన విషయం అని మనందరికీ తెలుసు. ఎందరో అమరవీరులు ఉరికొయ్యల ముందు నిలబడినప్పుడు కూడా దుఃఖపడలేదు. మా కర్తవ్యాలను ముందు తరాలు అందుకుంటాయని నమ్మారు. మృత్యువును జయించటం అంటే అది!”

“మాస్టారూ! మనం తర్వాత మాట్లాడుకుందాం” అన్నాడు రాజా.

“అలాంటి అవకాశం వస్తుందో రాదో నాన్నా!”

“అలా అనకండి. మీరు చాలా కాలం వుంటారు. మీరు కేన్సర్‌ని జయిస్తారు.”

“అలా వుంటే మంచిదే. అయినా మనుషుల చేతిలో లేనిది జనన, మరణాలే కదా! నన్ను మాట్లాడనీయండి. మనం అత్యంత సాధారణ మనుషులం. మనం ఈ లోకంలోకి వచ్చినందుకు మన పరిధిలో కర్తవ్యాలను పూర్తి చేశాం. ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే మనం ఎంత? ఓసారి ఓ కమ్యూనిస్టు నాయకుడు ఓ అమరవీరుడి పేరుమీద నిర్మించిన స్థూపం దగ్గరకు వచ్చాడు. తను సోషలిజం కోసం చేసిన ప్రయాణాల్లో, పోరాటంలో కోట్లాదిమంది చనిపోయారని చెప్పాడు. అది నిజమే. అక్కడి సందర్భం ఆ అమరుడి గురించి చెప్పటం. దానికి విలువ ఇవ్వలేదు. రెండు ముక్కల్లో ముగించాడు.”

అందరూ ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు.

“ఒక వీరుడు మరణిస్తే వేన వేలు ప్రభవిస్తారు అనటం అలంకారికంగా బాగుంటుంది. కానీ ఒక వీరుడు తయారుకావటానికి దశాబ్దాలు పడుతుంది. ఆ లోటును పూడ్చటానికీ అంతే. అసలు ఈ ప్రపంచ సమస్య ఏమిటో తెలుసా?”

అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.

“వ్యక్తికీ, సమాజానికీ మధ్య వున్న సన్నటి పొర. ఇన్ని వందల కోట్లమంది జనం వున్నా ప్రతి మనిషీ ప్రత్యేకం. ఎప్పుడయితే సమాజం కంటే వ్యక్తి గొప్పవాడు అనుకుంటే అది విపరిమాణాలకు దారి తీస్తుంది. అలాగే వ్యక్తి ఆచరణనూ, త్యాగాలనూ అసలు పట్టించుకోకపోయినా అది పొరపాటు అవుతుంది. ‘నేను’ అనేది అవసరం. ‘మనం’ అనేదానికి కట్టుబడాలంటే ఈ ‘నేను’ నుండే జర్నీ ఆరంభం కావాలి. ‘నేను’ లేనిదే ‘మనం’ వుండదు. ‘మనం’ లేకుండా ‘నేను’ వుండడు. ప్రపంచంలోని ఇన్ని చీలికలకు, ఇన్ని అనర్థాలకు కారణం ఈ రెంటి మధ్య సమన్వయం సాధించలేకపోవటమే.”

ఇంతలో అక్కడికి సిస్టర్ వస్తోంది.

“చివరగా ఒకటి చెబుతాను. ఇప్పుడు మరణాన్ని నేను ఆనందంగా ఆహ్వానిస్తున్నాను. అలా అని కోరికలన్నీ జయించానని కాదు. నా చిన్ని ప్రపంచంలో నేను అనుకున్నది చాలా వరకు చేయగలిగాను. ఇప్పుడు నాకు మృత్యువు కూడా సన్నిహితుడే” అని కళ్ళు మూసుకున్నారు మాస్టారు.

***

రాజా చిన్ననాటి మిత్రులను, తర్వాత తన జీవితంలోకి వచ్చిన మరికొందరిని కలుసుకున్నాడు. శరత్, రాధాకృష్ణ, కుమార్ ఇంకా తన జీవితంలో రకరకాల సహాయ సహకారాలు అందించిన వారందరినీ.

“ఇప్పుడు నేను మహాప్రయాణం ఆరంభించాను. ఇది మహోపాధ్యాయుల అన్వేషణ. ఇది ఎప్పటికి పూర్తి అవుతుందో నాకు తెలియదు. నా శ్రీమతి, నా పిల్లలు అంగీకరించారు. మా అమ్మ ఇప్పుడు లేదు. అయినా ఆమె దీవెనలు నాకు వుంటాయి. అలాగే మా అక్క ప్రతిభ. ఇంకొందరు నన్ను ప్రోత్సహించారు” అన్నాడు.

“ఇప్పుడు ఈ ప్రయాణం ఉపాధ్యాయుల కోసమేనా? ఇంకేమైనా వుందా?” అన్నాడు శరత్.

“ఇప్పటివరకు నేను రాసిన రచనలు వేరు. వాటిలో బోల్డంత అజ్ఞానం వుండవచ్చు. అపరిపక్వత వుండవచ్చు. అవసరాలు కూడా వుండవచ్చు. వీటికి అతీతంగా స్వేచ్ఛగా రాసుకుంటున్న పుస్తకం కోసం ఈ ప్రయాణం.”

“అంటే అది పరిపూర్ణం అంటావు!”

“అనను. కాలం నిరంతరం పరుగులు తీస్తున్నప్పుడు పరిపూర్ణం అంటూ వుండదు. అది ఆ కాలానికి చెందింది. ఇప్పటివరకు నేను రాసిన పుస్తకాలు నాకు సంతృప్తిని కలిగించలేదు. ఈ పుస్తకం అలాంటి భావనను ఇవ్వాలి!”

“ఇస్తుందనుకుంటున్నావా?”

“ఓ ప్రయత్నం చేస్తాను. ఏ రచయిత కయినా, కళాకారుడికైనా తమ సృజన ముందు వారికి తృప్తిని ఇవ్వాలి. బహుశా ఇది నా చివరి పుస్తకం కావచ్చు శరత్.”

“కాకూడదని నేను కోరుకుంటాను” నవ్వుతూ అన్నాడు శరత్.

“చూద్దాం!”

“నిన్ను చూస్తుంటే నాకు సంతోషం అలాగే జెలసీ కూడా నేను నీలా చాలా చేయాలనుకున్నాను. ప్రేక్షకుడిలా మిగిలాను.”

“ఇప్పటికీ సమయం మించిపోలేదు. పాత శరత్‌వి కావాలి. నీకోసం నువ్వు బతకాలి” అన్నాడు రాజా.

రాధాకృష్ణ మాట్లాడుతూ “మధ్యలో నేను వచ్చి కలుస్తుంటాను” అన్నాడు.

“మీ పుస్తకాన్ని నేనే ప్రచురిస్తాను” అన్నాడు కుమార్.

“నీ పుస్తకం కోసం ఎదురు చూస్తుంటాను” అన్నారు భువన్.

కుటుంబరావు మాస్టారు, సుగుణా టీచర్ని కలిశాడు.

మాస్టారి ఆరోగ్యం ఫర్వాలేదు. కానీ ఎప్పుడు తిరగబెడుతుందో తెలియదు.

“నీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చెయ్యాలి రాజా. నీకు రాజశేఖర్ అని మీ నాన్న పేరు పెట్టినందుకు నువ్వు వారి కలను వాస్తవం చేస్తున్నావు. నాకయితే మెట్ల మీద కూర్చుని నా మాటలు వింటున్న అలనాటి రాజా గుర్తు వస్తున్నాడు” అన్నారాయన. సుగుణా మేడమ్ దీవించారు.

ప్రయాణం ఆరంభం అయింది.

***

రాజా దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు. అన్ని రకాల ప్రజానీకాన్నే కాదు చిన్నతనం నుండి అభిమానం పెంచుకున్న వ్యక్తుల్ని కలుస్తున్నాడు. అందులో కొంతమంది చనిపోయారు. వారు నివసించిన ఇళ్ళ దగ్గరకు వెళ్ళాడు. అలాగే రాజ్ కపూర్‌ని చూడలేకపోయినా ఆర్.కె. స్టూడియోస్ దగ్గర ఫోటో తీయించుకున్నాడు. అప్పుడు పక్కన రాధాకృష్ణ వున్నాడు.

“ఏంటి రాజా… నువ్వు ఇప్పుడు పెద్దవాడివి అయ్యావు. అయినా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు” అన్నాడు.

“మనం ప్రకృతిని గాని, దేన్నయినా చిన్నపిల్లల్లా చూడగలగాలి. అప్పుడే ఆనందించగలం రాధా” అన్నాడు రాజా.

“సలీంని కలుసుకున్నాడు. అతను తన పేరు చెప్పగానే గుర్తుపట్టాడు.

“మీరు నాకంటే సీనియర్. మా నాయనకు మీ నాన్నగారంటే అభిమానం. మీ కుటుంబం గురించి చిన్నప్పుడు నాకు చెప్పేవారు. మీ నాన్నగారిని అచ్చా ఆద్మీ అనేవారు. రాజా సాబ్‌ని చూస్తుంటే బాధగా వుంటుంది అనేవారు. మా నాయన గొప్ప పాటలన్నీ పాడేవాడు. రఫీ అంటే ప్రాణం. ఇప్పుడు నాన్న లేరు. ఆయన బతికి వుండగానే నాకు మంచి పేరు వచ్చింది. నన్ను హగ్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నాకు గర్వంగా వుంది సలీమ్ అనేవాడు” అతని కళ్ళు చెమ్మగిల్లాయి.

“నువ్వు అదృష్టవంతుడివి సలీం భాయ్. నీ కంఠంలో మస్తాన్ జీ వున్నారు. ఆయన పాటలు నువ్వు పాడుతున్నావు. ఎవరయినా అమ్మా నాన్నలు బతికి వుండగా వారు కోరుకున్న విధంగా విజయాలు సాధించటం అందరికీ సాధ్యం కాదు” అన్నాడు రాజా.

మధ్యలో శరత్‌ని పిలిచాడు. ఇద్దరూ హిమాలయాలు వెళ్ళారు. యోగుల్ని కలుసుకున్నారు. ఈ జర్నీ ఇలా సాగుతుండగా భువన్ నుండి ఫోన్ వచ్చింది.

“రాజా… మాస్టారు వెళ్ళిపోయారు!”

ఒక్కసారిగా నిశ్శబ్దం.

“రాజా… రాజా…” అంటున్నారు భువన్. మాట్లాడలేకపోతున్నాడు.

“మీ మాస్టారు, నా బావ ఏం చెప్పారో గుర్తు చేస్తున్నాను.

‘నేను చనిపోతాను. అప్పుడు వీణియలు మూర్ఛనాలు పోవద్దు. నా ఆప్తులు ఎవరూ రోదించవద్దు. మన జాతీయ జెండాను అవనతం చేయవద్దు. నన్ను మట్టిలో మట్టి కానీయండి. నామీద మొక్కనొకటి నాటండి. నేను మహావృక్షంగా ఎదుగుతాను. నామీద కోకిలలు వాలతాయి.’ ఈ కవిత అంటే మాస్టారికి చాలా ఇష్టం రాజా!”

“అవును భువన్ గారూ!”

“చిన్నప్పుడు మీ చింత చెట్ల మీద నువ్వు ఆడుకున్న ఆటల గురించి బాగా చెప్పేవారు. నీ రచనల్లోనూ చదివాను. మనం ఇప్పుడు నిన్నటి పిల్లలం కాదు. జనన, మరణాలను దగ్గరగా చూశాం. ఇప్పటికే ఆధ్యాత్మికతలోకి పయనం చేస్తున్నాం. అందుకని నువ్వు ఈ సామాన్యుడి మరణాన్ని…”

“మాస్టారు సామాన్యులు కాదు అసామాన్యులు భువన్ జీ…”

“అది నీలాంటి, నాలాంటి కొద్దిమందికి… ప్రస్తుతం ఎక్కడ వున్నావు?”

“ప్రయాణంలోనే. నేను వెంటనే బయలుదేరి వస్తాను.”

“నిన్నటి నుండి నీకోసం ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికి సిగ్నల్స్ దొరికాయి. మాస్టారి చివరి యాత్రకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంకో అరగంటలో స్మశానానికి తీసుకువెళ్తున్నాం.”

“చివరి చూపు కూడా దక్కటం లేదు. దురదృష్టవంతుడ్ని.”

“అలా అనకు రాజా… మాస్టారు నీ గుండెల్లో వున్నారు. నీ ప్రయాణాన్ని ఆపకు. మెల్లగా రా. అప్పుడు కలుసుకుందాం. ఎవరి కోసం కాలం ఆగదు. అది నిరంతరం పరుగులు తీయవలసిందే అని బావ చెప్పేవారు. అందుకని మనం అనుకున్న పనిని చేసుకుపోవటమే మీ మాస్టారికి ఇచ్చే నివాళి.”

“అలాగే భువన్ జీ. త్వరలో వచ్చి కలుసుకుంటాను!” అన్నాడు రాజా.

***

ఉపసంహరం

కుమార్, రాజశేఖర్ పుస్తకాన్ని ప్రచురించాడు. ఆవిష్కరణ సభకు భువన్ అధ్యక్షత వహించారు. ఆ నవల గురించి అందరూ మాట్లాడారు. చివరిగా రాజా కృతజ్ఞతలు చెప్పటానికి మైక్‌ని అందుకున్నాడు.

“ఈ పుస్తకం పేరు ‘మహోపాధ్యాయుడు.’ ‘డు’ అన్నానంటే ఇది ఏ ఒక్క మాస్టారి గురించే కాదు. ఈ మకుటం వెనుక కోట్లాదిమంది వున్నారు. అందరూ ఉపాధ్యాయులే. మహోపాధ్యాయులు కొందరే వుంటారు. అలాంటి వారిని మనందరం అన్వేషించాలి అని చెప్పటం నా ఉద్దేశం.”

నిశ్శబ్దంగా వింటున్నారు.

“ఈ నవలకు బీజం పడింది నా చిన్నతనంలో. అది తొలి ఉపాధ్యాయుడి రూపంలో మా జీవితంలోకి వచ్చిన కుటుంబరావు మాస్టారు, నా అక్క ప్రతిభ, ప్రాథమికంగా ముందుకు తీసుకువెళ్ళారు. పరోక్షంగా అమ్మా, నాన్న, ఎందరో మిత్రులు, పెద్దలు నాకు సహకరించారు. ఇదో అన్వేషణ. నా ఈ పుస్తకాన్ని మా టీచర్, గైడ్, పెద్దన్న, ఆప్తమిత్రుడు, ఇవన్నీ నేను అనేవి కాదు. మా మాస్టారు నన్ను చూసిన, చెప్పిన బంధాలు. నాకు బతుకు అంటే ఏమిటో చెప్పారు. ఎన్నెన్నో జీవిత పాఠాలు చెప్పారు. అందుకే వినమ్రంగా కుటుంబరావు మాస్టారికి అంకితం చేసుకుంటున్నాను” అని చేతులు జోడించాడు.

సమాప్తం.

చంద్రశేఖర అజాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *