“హారీపోటర్‌ని మనుషులు చచ్చిపోకూడదని అడుగుతాను” అన్నాడు.
“అక్కా… గీతి, ప్రథమ్ ఇలా రండి” అని అరిచింది. అందరూ వచ్చారు రోహన్ దగ్గరికి.
“మనుషులు చచ్చిపోకూడదని హరీపోటర్‌ని అడుగుతాడంట.”
“హారీనే చాలా మందిని యాష్ చేశాడు” అంది గీతి.
“వాళ్ళు విలన్స్” అన్నాడు రోహన్.
“విలన్స్ మనుషులు కాదా?” అంది ప్రియాంక. రోహన్ మాట్లాడలేదు.
“నువ్వు చిన్న పిల్లాడివి. నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు?” అంది విదూషి.
“తాతగారు ఎందుకు చనిపోవాలి? మనుషులు ఎందుకు చనిపోవాలి? ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఎవరు చేస్తున్నారు? నోబడి కెనాట్ డై” అన్నాడు రోహన్.
“అవన్నీ మన చేతుల్లో లేవు” అంది గీతి.
“ఎందుకు లేవు. నువ్వు అబాకస్ చేస్తావు. ప్రథమ్ స్విమ్ చేస్తాడు. ప్రతిదానికీ సైన్స్ అంటారు. మరి సైన్స్ ఎందుకు డెత్ గురించి మాట్లాడదు. నాకు ఆన్సర్ కావాలి” అన్నాడు రోహన్.
“సైన్స్ మనలా చిన్నపిల్ల” అంది గీతి.
విదూషి అందర్ని గమనిస్తోంది.
“అవుననుకుంటాను. సైన్స్ పెద్దది అయ్యేకొద్దీ అసలు మనల్ని ఎందుకు పుట్టిస్తున్నారో, ఎందుకు చంపుతున్నారో తెలుసుకుంటుంది” అంది ప్రియాంక.
“నాకేం బాగుండలేదు. హారీని పిలిచినా రావటం లేదు.”
“హారీ దేవుడా, నువ్వు పిలిస్తే రావటానికి” అన్నాడు ప్రథమ్.
“దేవుడు పిలిస్తే వస్తాడా?” అన్నాడు రోహన్.
అందరూ ఒకరి ముఖం ఇంకొకరు చూసుకున్నారు.
“రోహన్! ఇంతకుముందు చెప్పాను. అది రౌలింగ్ క్రియేట్ చేసిన పాత్ర. నువ్వు నిజం అనుకుంటున్నావు. అతని దగ్గర మేజిక్ స్టిక్ అంతా కల్పన. మనం చూసేవన్నీ గ్రాఫిక్స్. అవన్నీ నిజం అనుకుంటాం. చార్లీ చాప్లిన్ సినిమాలు చూశావు. ఒకప్పుడు మాటలు వుండేవి కాదు. వాటిని మూకీలు అనేవారు. తర్వాత మాటలు వచ్చాయి. అవి టాకీలు” అంది విదూషి.
“ఇప్పుడు ఏదయినా చచ్చిపోవాలా?”
“ప్రస్తుతం అంతే. కానీ ఏదొక రోజున మనుషులు డెత్‌ని జయిస్తారు. ఓ.కే.నా! మనం రేపు ఉదయం సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. అందుకని త్వరగా నిద్రపోవాలి” అంది విదూషి.
పిల్లలందరూ నిద్రలోకి జారుకున్నారు. రోహన్‌కి నిద్ర రావటం లేదు.
విదూషి తన డైరీలో రాసుకుంది.
“మనుషులు చనిపోకూడదని రోహన్ అంటున్నాడు. అది కుదురుతుందా?”
******
ఉదయం అందరూ సముద్రం దగ్గర వున్నారు.
అక్కడ రకరకాల షాపులు, అప్పటికప్పుడు పట్టిన చేపల్ని కాల్చి లేదా నూనెలో వేయించి ఇస్తున్నారు. నీళ్ళన్నీ నలుపు రంగులో వున్నాయి.
“దీన్ని బ్లాక్ సీ అంటారా?” అడిగాడు రోహన్.
“కాదురా. పొల్యూషన్ వల్ల రంగు మారిపోయింది. అన్ని సముద్రాలూ ఒకే రంగులో వుండవు. ఎర్ర సముద్రాలు, నల్ల సముద్రాల గురించి చెబుతుంటారు” అన్నాడు ప్రథమ్.
“నాకయితే ఇది క్రూడ్ ఆయిల్‌లా వుంది” అంది ప్రియాంక.
“క్రూడ్ ఆయిల్ సముద్రాలు మనకి వుంటే మనంత రిచ్‌గా ఏ దేశం వుండదు” అంది గీతిషా.
“అందుకే అరబ్ కంట్రీస్ పెట్రోల్ అమ్ముకుంటూ రిచ్ అయ్యాయి” అన్నాడు ప్రథమ్.
“నాకో అనుమానం. పెట్రోల్ ఎప్పుడూ వుండదు. బావులన్నీ ఎండిపోతాయి. అప్పుడు కార్లు, విమానాలు అన్నీ బంద్ చేసుకోవాలా?” అంది ప్రియాంక.
“అలా వుండదు. ఇప్పటికే సోలార్ విండ్‌తో కరెంట్ జనరేట్ చేస్తున్నారు. అలాగే జల విద్యుత్ వుంది. అందుకని అన్నీ వుంటాయి. మనుషులు తెలివిగలవారు. కాకపోతే బద్ధకస్తులు. వారికి దాహం అయినప్పుడే బావి తవ్వుకుంటారు” అంది విదూషి.
అక్కడ రకరకాల బోట్లు, దూరంగా షిప్స్ కనిపిస్తున్నాయి. అనేక రకాల మనుషులు. అందులో విదేశాల వారున్నారు. లత, ఉష పిల్లల్ని గమనిస్తూనే ఓ పక్క మాటలు చెప్పుకుంటున్నారు. సుధ కూడా వచ్చింది. తను ఓ షాప్‌లో పని చేస్తోంది. ఓ వారం రోజులు సెలవు పెట్టింది.
అందర్నీ పిలిచి స్నాక్స్ అందించింది. అలాగే బోర్నవిటా, సాఫ్ట్ డ్రింక్స్ ఎవరికి కావలసినవి వారికి ఇస్తోంది. అందరూ ఫోటోస్ తీయించుకుంటున్నారు. లంచ్ టైమ్‌కి ఓ హోటల్‌కి వెళ్ళారు. రోహన్‌కి ఆ వంటలు నచ్చలేదు. అన్నీ తినాలి అని లత అన్నా స్నాక్స్ చాలన్నాడు.
తర్వాత ఇంటికి వెళ్ళారు. అప్పుడు రూపేందర్ గారికి ఫోన్ చేయాలనిపించింది విదూషికి. చేసింది.
“హాయ్ విదూషి… ఎలా వుంది మీ జర్నీ?”
“నైస్ తాతగారూ! ఇంతకుముందు అమ్మమ్మ దగ్గరకు వచ్చాను. అప్పుడు చూడటానికి, ఇప్పుడు చూడటానికి తేడా వుంది!”
“వయసు పెరిగింది కదా అలానే వుంటుంది! మాకు సడన్‌గా వాషింగ్ మెషిన్ చెడిపోయింది విదూ!”
“అయ్యో… ఇబ్బంది పడుతున్నారా?”
“అదేం లేదు. వెంటనే నేను వాషింగ్ మెషిన్‌ని తీసుకున్నాను. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేస్తుంది.”
“అప్పుడే ఏ.ఐ. వాషింగ్ మెషిన్ కూడా వచ్చిందా!”
“అంతేకాదు. కార్లు, చివరికి మెడిసిన్స్, సర్జరీల్లో కూడా ఈ టెక్నాలజీనే వాడుతున్నారు” అన్నాడు రూపేందర్.
“సర్జరీల్లో కూడానా?” అని, “మా తమ్ముడు అడిగాడు. మనుషులు ఎందుకు చనిపోతారని? ఎప్పుడూ బతికి వుండవచ్చు కదా ఏ.ఐ. తో అని వాడి మనసులో వుందనుకుంటాను” అంది విదూషి.
“చాలా పెద్ద సందేహం అది. నువ్వు తిరిగి వచ్చాక మనం మాట్లాడుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కి కొన్ని లిమిట్స్ వున్నాయి. మీ తమ్ముడికే కాదు, అందరికీ ఇలానే అనిపిస్తుంది. మనుషులకు అర్థం కానిది పుట్టుక, చావు. అవి మనకు కొంత వరకే తెలుసు విదూ.”
“అలాంటి వాటి మీద పరిశోధనలు చేయవచ్చు కదా!”
“చేయాల్సినవి ఎన్నో వున్నాయి. నువ్వు పురాణాలు చదివావా?”
“రామాయణం, భారతంలో కొన్ని కథలు చదివాను. అమ్మమ్మ, నానీ, తాతగార్లు కూడా చెప్పేవారు.”
“మనం సైన్స్ చదువుతున్నా ఇలాంటివి కూడా చదవాలి విదూ. ఇంత టెక్నాలజి లేనప్పుడే వారు ఎన్నో ఆలోచించారు. అందులో సారాంశం మాత్రం తీసుకోవాలి. నీకు రాక్షసుల గురించి మీ పెద్దవాళ్ళు చెప్పి వుంటారు.”
“అవును తాతగారూ.”
“వాళ్ళు తపస్సులు చేసి దేవుళ్ళని అడిగేవారు. మాకు డెత్ అనేది వుండకూడదు అని. నాయనలారా అది కుదిరేపని కాదని గాడ్స్ చెప్పేవారు. అందుకే మనుషుల వల్ల, పాముల వల్ల, జంతువులు, వాటర్, ఫైర్, భూమ్మీదా, ఆకాశంలో, చివరికి దేవుడి వల్ల చావు రాకూడదు అనేవారు. అలా పుట్టాడు నరసింహస్వామి” అన్నాడు రూపేందర్.
“నేను భక్త ప్రహ్లాద సినిమా చూశాను.”
“అందుకే నరుడు కాదు, జంతువు కాదు. సగం సగం. చివరకి నేల మీద కాదు ఆకాశంలో కాదు, తొడల మీద కూర్చోబెట్టుకుని రక్తం చుక్క నేల మీద పడకుండా చంపేశాడు.”
“నాకు అప్పుడు భయం కలిగింది. హిరణ్య కశిపుడ్ని చూసి!”
“దీని అర్థం ఏమిటంటే మనుషులయినా, రాక్షసులయినా చనిపోకూడదు అనుకుంటారు.”
“అది జరుగుతుందా తాతగారూ!”
“అది కూడా పురాణాల్లో చెప్పారు. క్షీరసాగర మథనంలో ముందు పాయిజన్ పుట్టింది. హాలాహలం అంటారు. తర్వాత అమృతం పుట్టింది. అది తాగినవాళ్ళకి చావు వుండదు. ఆకలి వుండదు. వయసు పెరగదు. కాకుంటే చిన్న చిక్కు వుంది!”
“అదేంటి తాతగారూ!”
“అమృతం దేవతలకు మాత్రం పంచారు. రాక్షసులకు అది ఇస్తే వారి అరాచకాలకు అంతు వుండదని. ఇవన్నీ అందమైన కల్పనలు. మనుషుల ఆశల్ని, కలల్ని, కోరికల్ని వీటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా కొంతమంది కోట్ల రూపాయలు ఖర్చు చేసి వయసు పెరగకుండా ప్రయోగాలు చేస్తున్నారు. మీ తమ్ముడికి మంచి ఆలోచన వచ్చింది” అన్నారాయన.
విదూషి నవ్వింది.
“రేపు మేం మున్నార్ వెళ్తున్నాం తాతగారూ!” అంది.
******
మున్నార్…
అదో హిల్ స్టేషన్. అక్కడ కాఫీ, టీ ప్లాంటేషన్స్ వున్నాయి. పరుగులు తీసుకుంటూ వెళ్తున్న మేఘాలను చూసి అనుకుంది విదూషి.
“వీటి జర్నీలో మేఘాలకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో!” అంతలోనే… మమ్మల్ని చూసి వర్షం వస్తుందనుకుంటారు. కానీ ఎక్కడ కురవాలో, ఎప్పుడు కురవాలో మేం నిర్ణయించుకుంటాం అనుకుంటాయి మబ్బులు. కానీ చల్లగాలి తగిల్తే అవి కురవాలి. మబ్బుల చేతిలోనూ ఏదీ వుండదు!”
తన చేతి మీద వానచుక్క పడింది.
ప్రియాంక, గీతిషా, ప్రథమ్, రోహన్‌లు పరుగులు తీసుకుంటూ వచ్చారు.
“మనం వానలో తడుద్దామా!” అన్నారు. అప్పుడు మెరుపు. పెద్ద ఉరుము శబ్దం వినిపించగానే గెస్ట్ హౌస్ లోకి వెళ్ళిపోయారు.
******
అందరూ గదుల్లోకి రాగానే కరెంట్ పోయింది.
ప్రియాంక ఒక్కసారిగా అరిచింది.
“ఎందుకు అరుస్తున్నావు ప్రియా! జనరేటర్ వుంది. కంగారుపడకు. మనం అప్పుడప్పుడు చీకటిని కూడా ఎంజాయ్ చేయాలి” అంది విదూషి.
“చీకటిని కూడానా!”
“మనందరికీ కళ్ళు వున్నాయి. ఈ ప్రపంచంలో వున్న అందమైనవన్నీ చూస్తాం. రంగులు, వెలుగులు మనం తెలుసుకుంటాం. పుట్టుకతో గుడ్డివారుంటారు. వారికి జీవితమంతా చీకటేగా!”
“అవును విదూ! ఓ రోజు మమ్మల్ని ఆ స్కూల్‌కి తీసుకువెళ్ళారు. అక్కడ డంబ్ అండ్ డెఫ్ పిల్లలు వున్నారు. వారికి మన మాటలు వినపడవు. మాట్లాడలేరు. సైగలతో మాట్లాడుకుంటారు. బ్లైండ్ పీపుల్‌కి బ్రెయిలీ లిపి వుంది. టచ్ చేస్తూ చదువుకుంటారు” అంది గీతిషా.
“అవును. ఇంకా లోపాలు వున్నవారు వుంటారు. అలాంటి వారిని దివ్యాంగులు అంటున్నారు. వారందరూ కూడా వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. మనకు కావలసింది పట్టుదల” అంది విదూషి.
అప్పుడే కరెంట్ వచ్చింది.
“ఇప్పుడు టీ.వీ. పెట్టుకుందామా?” అన్నాడు ప్రథమ్.
“వద్దు. అది అది రోజూ చూస్తాం. మనం ఘోస్ట్ స్టోరీస్ చెప్పుకుందాం” అంది ప్రియ.
“నాకు భయం” అంది గీతిషా.
“భయాన్ని కూడా ఎంజాయ్ చేయాలి కదక్కా!” నవ్వారు.
“అసలు దెయ్యాలున్నాయా?” ప్రథమ్ అన్నాడు.
“య్యా… స్టోరీస్‌లో వున్నాయి. డెమన్స్, ఘోస్ట్‌లు. నువ్వు హారీపోటర్ సిరీస్ చూడలేదా?” అన్నాడు రోహన్.
“వీడు మళ్ళీ మొదలుపెట్టాడు” అంది ప్రియాంక.
“మనం ఏదయినా చూడాలి. కనీసం గాలిలా మనల్ని టచ్ చేయాలి. అప్పుడు నమ్ముతాం. సైన్స్ కూడా అంతే. అందుకే రకరకాల ఘోస్ట్ కథలు, సినిమాలు తీస్తారు. మనం వాటిలో ఫియర్‌ని చూడవచ్చు. ఘోస్ట్‌లు లేవుగాని ఫియర్ అన్ని చోట్లా, అందరికీ వుంది” అంది విదూషి.
అందరూ దెయ్యాల కథలు చెప్పుకుంటున్నారు.
విదూషి, లత వాళ్ళ దగ్గరకు వెళ్ళింది.
“రేపు మనం ఎక్కడకి వెళ్తున్నాం?” అడిగింది.
“అదరంపల్లి వాటర్ ఫాల్స్.”
“ప్రియ ముందు పద్మనాభస్వామి ఆలయం చూడాలంటోంది.”
“అది దగ్గరే కదా… ఎల్లుండి మనం కన్యాకుమారి వెళ్దాం. అక్కడ రెండు రోజులు ప్లాన్ చేసుకున్నాం. అక్కడకు అన్ని చోట్ల నుండి జనం వస్తారు. సన్‌సెట్, సన్‌రైజ్ అక్కడ చూడాలనుకుంటారు” అంది లత.
“పిల్లలు ఏం చేస్తున్నారు?” అంది సుధ.
“దెయ్యాల కథలు చెప్పుకుంటున్నారు”.
“పిల్ల దెయ్యాల కథలా! ఇక్కడ అయిదు దెయ్యాలున్నాయి. మీ కథలు మీరు చెప్పుకోండి” అంది నవ్వుతూ.
******
అదరంపల్లి వాటర్ ఫాల్స్!
పిల్లలందరూ ఆ దృశ్యాన్ని చూసి మైమరచిపోతున్నారు. ఇలాంటివి ప్రతి రాష్ట్రంలోనూ ఒకటో, రెండో కనిపిస్తాయి. మనుషులకు ఇలాంటివి చూసే తీరిక, అవకాశం దొరకాలి. అటునుండి పద్మనాభస్వామి గుడికి వెళ్ళారు. ప్రియాంక కళ్ళు మెరుస్తున్నాయి.
తనకు నేల మాళిగలోని గదిని తెరిపించి చూడాలని వుంది. అక్కడి బంగారు విగ్రహాలను పత్రికల్లో, టీ.వీ.ల్లో చూసింది.
“ప్రియాంకా! నువ్వు కే.జి.ఎఫ్. సినిమా చూశావు కదా. బంగారు గనులు మీద తీశారు. ఇంకొకరు బొగ్గు గనుల మీద తీశారు. దాన్ని నల్లబంగారం అంటారు. అలాగే పత్తి, కాటన్ అంటారు. అది తెల్ల బంగారం. అలాగే మిల్క్. మనం పాలను తాగుతుంటాం. ఇవన్నీ బంగారాలు. చేపలు నీలి బంగారం. ఇలా మనకు ఎన్ని బంగారాలో!” అంది విదూషి.
“అవును. అసలు బంగారం అంటే ఆడవాళ్ళు ఇష్టపడతారు” అంది ప్రియ.
“సముద్రం నీటితో బంగారం చేయవచ్చు తెలుసా?”
“నిజమా!”
“ఇంతకుముందు రాజ్యాల్ని ఆక్రమించుకుని, అక్కడి టెంపుల్స్‌లో బంగారం అంతా షిప్స్‌లో తీసుకువెళ్తున్నప్పుడు ఓడలు మునిగిపోయి సముద్రంలోకి చేరిపోయాయి బంగారు విగ్రహాలు, కాయిన్స్. అందుకని బంగారం గురించి ఆలోచించకు. మనకు మిడాస్ టచ్ అనే కథ వుంది. తను ఏది టచ్ చేస్తే అది బంగారం అవుతుంది. అలా వరం కోరాడు ఏంజెల్‌ని. చివరకి అన్నం తినాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా బంగారం అయ్యింది. మనుషులు గ్రీడీగా మారితే అలా వుంటుందన్నమాట” అంది విదూషి.
“నాకంత గ్రీడ్ లేదక్కా! అవన్నీ చూసి ఎంజాయ్ చేయాలి!” అంది ప్రియ.
“అందుకే ఇవన్నీ మనం కథలుగా రాయవచ్చు. నువ్వు రైటర్‌గా మారు!”
“నేను కాదు, మన రోహన్ మరో హారీని క్రియేట్ చేస్తాడు.”
కన్యాకుమారి వెళ్ళారు. అక్కడ మూడు సముద్రాలు కలుస్తాయి. ఉదయం సూర్యోదయం చూడటానికి వెళ్ళారు. ఆ క్షణాల కోసం చూశారు. ఫోటోలు తీశారు. అలాగే సూర్యాస్తమయం.
“ఇది ప్రతిరోజు జరుగుతుంది. కానీ మనం నిద్రలో వుంటాం. ఇంకేదో పనిలో వుంటాం. ఇంత అందమైన లోకాన్ని క్రియేట్ చేయటం ఎంత శ్రమ. అసలు ప్రకృతిని మించిన వండర్ ఏముంటుంది. నా దృష్టిలో భగవంతుడి ఇంటిలిజెన్స్ ముందు ఏదయినా తక్కువే” అనుకున్నారు.
“అందుకే దాన్ని ఆర్టిఫిషియల్ అనేది” అంది సుధ.
విదూషి అందరి మాటలూ వింటోంది.
******
దాదాపు మూడు వారాలు ఆనందంగా గడిచిపోయాయి. రేపు త్రివేండ్రం నుండి హైదరాబాద్ వెళ్తున్నారు. జిష్ణు, చిన్ని వచ్చారు. జిష్ణుకి పని వుండటంతో విమానంలో వెళ్తున్నాడు. ఈసారి రైల్లో వెళ్దాం అన్నాడు రోహన్.
సుధకి అందరూ వీడ్కోలు చెప్పారు.
“నిన్ను తిరిగి ఎప్పుడు కలుసుకుంటానో” అంది సుధ.
“అదేంటి అమ్మమ్మా! వచ్చే సంవత్సరం గీతి వస్తుంది. నువ్వు తీసుకుని వస్తున్నావు” అంది విదూషి.
“ఎప్పుడూ హైదరాబాదులోనే పోటీలు పెట్టరు” అంది గీతి.
“ఈ సంవత్సరం మేమందరం వచ్చాం. రేపు మీరు రండి. నాకు మీతో కలిసి తిరగటం కుదరకపోవచ్చుగాని కలుసుకుంటాం” అంది విదూషి.
“నువ్వు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నావా? మెడిసినా?” అడిగాడు విజయ్.
“ఈ రెండూ చేయను. నాకు సైన్స్ ఇష్టం. ముందు ఇంటర్‌మీడియట్ కంప్లీట్ చేశాక డిసైడ్ చేసుకుంటాను మావయ్యా.”
“నువ్వు ప్రియా!” అన్నాడు.
“ఇంకా అయిదారు సంవత్సరాలుంది. అప్పుడు చూస్తాను.”
“గీతి లెక్కలు, ప్రథమ్ స్విమ్మింగ్” అన్నాడు రోహన్.
“లేదురా. నేను నేవీ లోకి వెళ్తాను” అన్నాడు ప్రథమ్.
అందరూ స్టేషన్‌కి వచ్చారు. రైలు కదులుతున్నప్పుడు మళ్ళీ సుధ, లతలు కన్నీళ్ళు పెట్టుకోవటం రోహన్ చూశాడు.
“అక్కా! అమ్మ వాళ్ళు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు?”
“అది నీకు పెద్దయ్యాక తెలుస్తుంది. రోజూ ఫోన్లో మాట్లాడుకుంటున్నా ఎప్పుడో కలుసుకుంటాం. రేపు అమ్మనీ, నాన్నని వదిలిపెట్టి మనందరం కూడా దూరంగా వెళ్తాం. అప్పుడు మనం కూడా ఏడుస్తాం” అంది విదూషి.
“నువ్వు నవ్వకు. హారీ తలుచుకుంటే మినిట్స్‌లో ఎక్కడికయినా వెళ్తాడు. అలాంటి మెషిన్‌ని కనుక్కుంటాం. అప్పుడు దూరం వుండదు.”
“అక్కా! వీడు టైమ్ ట్రావెల్ చేయాలంటున్నాడు. అది కూడా నిజంగానే కనుక్కుంటారేమో!” అంది ప్రియాంక.
******
అందరూ ఇంటికి చేరుకున్నారు.
జానకిని హగ్ చేసుకున్నారు. తాతని కలిశారు.
“మీ అందరూ లేకపోతే మాకు ఏమీ తోచలేదురా. కాలం ఆగిపోయినట్లనిపించింది” అన్నాడు తాత.
“కాలం ఆగిపోతుందా?” అన్నాడు రోహన్.
“నువ్వు ఒక్కడివే ఓ దీవిలో…” అంటుంటే,
“దీవిలో అంటే!”
“ఐలాండ్. అక్కడ వుంటే నీకు తెలుస్తుంది. కాలం ముందుకు కదలటం లేదని” అన్నాడు తాత.
“డోంట్ వర్రీ తాతా! నా దగ్గర మేజిక్ స్టిక్ వుంటుంది. నేను మూవ్ చేస్తాను” అన్నాడు రోహన్.
******
కాలేజ్‌లో మృదుల కలిసింది. ఇప్పుడు తనలో చాలా మార్పులు వచ్చాయి.
“విదూ! ఇప్పుడు రకరకాల డివైస్‌లు వస్తున్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడే తెలుస్తోంది. మా పేరెంట్స్ నన్ను తలుచుకొని మళ్ళీ సూసైడ్ చేసుకుంటానేమో అని భయపడేవారు. ఇప్పుడు నేను ఫైట్ చేయగలనని వారికి నమ్మకం వచ్చింది” అంది మృదుల.
“గుడ్. మనం ఎవరితోనన్నా ఫైట్ చేసేముందు మనతో మనం ఫైట్ చేయటం నేర్చుకోవాలి. నీకు ఈ సంవత్సరం మంచి ర్యాంక్ రావాలి” అంది విదూషి.
కాలం పరుగులు తీసింది. ఇద్దరూ పరీక్షలు బాగా రాశారు. సెలవులు ఇచ్చారు. అప్పుడు రూపేందర్, విదూషి ముందు ఓ ప్రపోజల్ పెట్టాడు.
“సింగపూర్‌లో ఓ సైన్స్ కాన్ఫరెన్స్ వుంది. నువ్వు వస్తానంటే నేను తీసుకువెళ్తాను.”
“ఇంట్లో అడుగుతాను గ్రాండ్‌పా” అంది విదూషి.
ఈ విషయం మీద ఇంట్లో అందరూ మాట్లాడారు. వారికి డబ్బులు సమస్య కాదు. ముందునుంచి లత, జిష్ణులు ఆ విషయంలో ప్లాన్ చేసుకుంటున్నారు. రూపేందర్ వున్నారు. కాబట్టి యిబ్బంది వుండదు.
“విదూ! నీకు సింగపూర్ వెళ్ళాలని వుందా?” అడిగాడు జిష్ణు.
“సింగపూర్ కాదు నాన్నా… సైన్స్‌కి చెందిన కాన్ఫరెన్స్‌కి వెళ్ళాలనుంది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా చర్చలు జరుగుతాయని తాతగారు చెప్పారు. అవన్నీ లోతుగా తెలుసుకోవాలని వుంది” అంది విదూషి.
“సరే. ముందు నీకు పాస్‌పోర్ట్ తీసుకోవాలి. వీసా ప్రాబ్లమ్ వుండదు. అవన్నీ తాతగారు చూసుకుంటారు. నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు ఏం చదవాలనుకున్నా నేను చదివిస్తాను. అది ఇండియాలో అయినా, విదేశాల్లో అయినా. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నువ్వు మంచి సిటిజన్‌గా వుండాలి. నిన్ను చూసి నలుగురు ఇన్‌స్పైర్ కావాలి” అన్నాడు జిష్ణు.
“తప్పకుండా నాన్నా!” అంది విదూషి.
******
చకచకా పనులు జరిగాయి. విదూషి సింగపూర్ వెళ్ళే సమయం వచ్చింది. అప్పుడు మృదుల లాంటి ఫ్రెండ్స్, బంధువులు, సుధ కుటుంబం అందరూ ఫోన్ల ద్వారా కూడా అభినందనలు చెప్పారు. కొంతమంది కలిశారు.
“సింగపూర్ నుండి నాకేం తీసుకువస్తున్నావు అక్కా!” అంది ప్రియాంక.
“మంచి మెమోరీస్‌ని” అంది విదూషి.
“నాకు కూడా ఏ.ఐ. గురించి తెలుసుకోవాలనుంది. ఇప్పుడు నేను బొమ్మలు గీస్తున్నాను. ఏ.ఐ. ద్వారా కూడా అవి డ్రా చేయవచ్చంట!”
“అవును. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. పాటలు పాడవచ్చు. డాన్స్ చేయవచ్చు. స్టోరీస్ రాయవచ్చు. నేను వచ్చాక అన్నీ… సరేనా?” అంది.
రోహన్ ఈ మధ్య హారీని పక్కనపెట్టాడు. అలా అని మరిచిపోలేదు. ఇతర పుస్తకాలు చదువుతున్నాడు. అలాగే కొత్త కొత్త సినిమాలు చూస్తున్నాడు. ఆ లేత మనసులో రకరకాల ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి.
అందరూ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళారు. రోహన్ అక్కను పక్కకు పిలిచాడు.
“అందరూ నిన్ను హ్యాపీగా పంపిస్తున్నారు. ఎవరూ ఏడవటం లేదు” అన్నాడు.
“ఇది ఇంటి నుంచి ఇంకో ఇంటికో, ఊరుకో వెళ్ళటం కాదురా. కాన్ఫరెన్స్‌కి వెళ్తున్నాను. వారంలో తిరిగి వస్తాను. ఇలాంటి ఛాన్స్ అందరికీ రాదు. అందుకని సంతోషంగా పంపిస్తారు. రేపు నీకు కూడా అవార్డ్ వచ్చిందనుకో హ్యాపీగా పంపిస్తాం” అంది విదూషి.
సింగపూర్‌లో విమానం దిగారు. అక్కడనుండి ఓ హోటల్‌కి చేరుకున్నారు. అక్కడ ఫ్రెషప్ అయ్యాక కాన్ఫరెన్స్‌కి వెళ్ళారు. అనేక దేశాల నుండి డెలిగేట్స్ వచ్చారు. విదూషి లాంటి యువతీ యువకులు కొద్దిమంది వున్నారు.
కార్యక్రమం ఆరంభం అయింది.
చీఫ్ గెస్ట్ తన ప్రసంగం మొదలుపెట్టాడు.
“సైన్స్ గాని, మరొకటి గాని దానికి హ్యూమన్ ఫేస్ వుండాలి. లేకపోతే అది ఎంత గొప్ప ఆవిష్కరణ అయినా విధ్వంసం మాత్రమే చేయగలదు. మనం విధ్వంసాల మధ్య బతుకుతున్నాం. ప్రపంచంలో ఏ మూల చూసినా యుద్ధాలే జరుగుతున్నాయి. అవి రెండు దేశాలకే పరిమితం కావు. సైన్స్ ఏ ఒక్క దేశానిదో కాదు. అలాగే వార్ కూడా. అందుకని సైన్స్‌తో పాటు యుద్ధం ఎక్కడ జరిగినా అది మన ఇంటివరకు వస్తుంది. దాని ప్రభావం థర్డ్ వరల్డ్ వార్ కి దారి తీయవచ్చు. అందుకని మనకు సైంటిఫిక్ థాట్ అవసరం. అణ్వాయుధాలను నిషేధించటానికి మనం ఒత్తిడి చేయాలి.”
చప్పట్లు ఆ ప్రాంగణంలో మారుమోగాయి.
“ఓ పక్కన అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాం. విశ్వ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈ కాలంలో కూడా కులం, మతం, ప్రాంతం, దేశం లాంటి సమస్యల నుండి బయటపడలేకపోతున్నాం. వీటిని అధిగమించాలి అంటే ప్రచారం చేయాలి. డెలిగేట్స్ అందరికీ వెల్‌కమ్ చెబుతున్నాను. అనేక అంశాలు మన ముందు వున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్. ఇలాంటివి చాలా వున్నాయి. మీరందరూ డిస్కస్ చేయండి. మీ ప్రయోగాల గురించి చెప్పండి. రేపటికి మీ సూచనలు అందించండి. ముగింపు సభలో కలుసుకుందాం.”
అక్కడ నుండి డెలిగేట్స్‌ని గ్రూపులుగా విభజించారు. వారి వారి ఆసక్తులను బట్టి ఆయా గ్రూపుల్లో వుంటారు. విదూషి, రూపేందర్ గ్రూప్ లో వుంది. ఎవరికి వారు తమని పరిచయం చేసుకున్నారు. ఆ చర్చలను విదూషి నోట్ చేసుకుంటోంది.
చాట్ జీ.పి.టి. అనేది సాఫ్ట్‌వేర్ రంగంలో ఓ రివల్యూషన్‌ని తీసుకువచ్చింది. అంతకుముందు మైక్రోసాఫ్ట్, ఏపిల్, గూగుల్ అని మూడు సంస్థలు వున్నాయి. అవి ఓ రకంగా సుడిగుండం లాంటివి. ఎలాంటి సమాచారన్నయినా, సంస్థలనైనా తమలోకి లాగేసుకుంటాయి. అలాంటివారికి చాట్ జీ.పీ.టి ఓ షాక్‌ని ఇచ్చింది.
ప్రపంచంలోని ఏ భాషనయినా, లిటరేచర్ నుండి వచ్చిన ఏ అంశాన్ని అయినా అన్ని భాషల్లోకి అనువాదం చేయగలుగుతుంది. ఈ పనిని ఇంతకుముందు గూగుల్, మైక్రోసాఫ్ట్ చేశాయి. ఏపిల్ వీటికి కాస్త భిన్నంగా వుంటుంది. ఈ అప్లికేషన్స్ రావటం వేరు. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. వారానికి, రెండు వారాలకి అలా చేయటంతో ఉలిక్కిపడ్డారు ఒక్కసారిగా!
ముందుగా మైక్రోసాఫ్ట్ వారు అడుగు ముందుకు వేశారు. చాట్ జీ.పీ.టి. తో పార్ట్నర్ గా చేరారు. దీనికి ఆద్యుడు ALTMAN. అతన్ని చాట్ జీ.పీ.టి. బయటకు నెట్టేసింది. అతని మైక్రోసాఫ్ట్ తీసుకుంది. అక్కడ నుండి మరికొన్ని సమస్యలు వచ్చాయి.
ఇవన్నీ లాభాల కేంద్రంగా పని చేస్తాయి. షేర్ మార్కెట్ వుంది. షేర్ హోల్డర్స్ వుంటారు. వారు ఇలాంటి పరిణామాలను నిశితంగా గమనిస్తుంటారు. ఫౌండర్‌ని బయటకు పంపితే అతని మేధస్సుని ఇంకో సంస్థ వినియోగించుకుంటుంది. వారి లాభాలు పెరుగుతాయి. అందుకని మొదటి సంస్థ మీద వ్యతిరేకంగా కోర్టులని ఆశ్రయిస్తారు. అలా జరుగుతున్నాయి.
వాషింగ్‌టన్, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించటం మీద కాపీరైట్ దావాలు వేశాయి.
ఓ వార్తను అందించటానికి అనేక సాహసాలు చేయాలి. ప్రాణాపాయం వుంటుంది. స్టింగ్ ఆపరేషన్స్ చేయాలి. యుద్ధం జరుగుతుంటే వాటి మధ్యలో వుండి కవర్ చేయాలి. అందుకు కొన్ని లక్షల డాలర్స్ ఖర్చు అవుతాయి. ఈ సంస్థల వారు అవన్నీ క్లబ్ చేసి వాడుకుంటున్నారు కాబట్టి మాకు రాయల్టీ చెల్లించాలని వారి వాదన. ఈ కేసులో వారు గెలిస్తే మిలియన్ డాలర్స్ రాయల్టీ కట్టాలి. అంటే ఇక్కడ యధేచ్ఛగా చౌర్యం జరుగుతుంటుంది.
ఇందులో సెర్చ్ ఇంజిన్ లు వుంటాయి. BING, BARD లాంటి అప్లికేషన్లు వుంటాయి. ఇదో మహా ప్రపంచం. మనం ఎవరి గురించి అడిగినా క్షణాల్లో సమాచారం అందిస్తుంది. BARD లో అయితే ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా వుండి మాట్లాడుకుంటున్నట్లు వుంటుంది.
******
విదూషి, రూపేందర్ లు రూమ్‌కి చేరుకున్నారు.
“మనం చూస్తున్నాం కదా! కొన్ని వందల కోట్ల రూపాయల్తో సినిమాలు తీస్తారు. విడుదల కాకుండా కొన్ని సినిమాలు, విడుదలయిన గంటల్లోనే మరికొన్ని సినిమాలు బయటకు వస్తాయి. అలాగే పత్రికలు, పుస్తకాలు కూడా. కొన్నివేల రూపాయలు ఖర్చుపెట్టి పుస్తకాలు ప్రచురిస్తే వాటి లింకులు అందరికీ అందుబాటులోకి వస్తాయి. గ్రంథ చౌర్యం వేరు. రైట్స్ తీసుకోకుండా ఇతర భాషల నుండి సినిమా కథల్ని తీసుకుంటారు. ఇదో దొంగల సామ్రాజ్యం” అని రూపేందర్ నవ్వాడు.
“అందుకేనా మానవీయ కోణం కావాలన్నారు?”
“అదో చిన్న కోణం విదూ… దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ జరుగుతున్న విషయాలు మామూలు మనుషులకు అర్థం కావు. రెండవది అందరూ వినియోగించుకుంటారు. ఎవరికి వారికి దెబ్బ తగలగానే బయటకు వస్తారు. ఇంకొకటి మనం పూర్తిగా ఏ.ఐ. మీద ఆధారపడటం కూడా ప్రమాదమే” అన్నారాయన.
విదూషి తలూపింది.
“ఇదివరకు కొన్ని వందల ఫోన్ నెంబర్లు మనకి గుర్తుండేవి. లేదా బుక్‌లో నోట్ చేసుకునేవాళ్ళం. సెల్‌ఫోన్‌లో ఫీడ్ చేసుకోవటం వచ్చాక గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. లెక్కల నుండి అన్నీ అలా తయారయ్యాయి. చిన్న విషయాలకి కూడా గూగుల్ ఆన్ చేయటమే!”
విదూషి నవ్వింది.
******
“ఈరోజు మనం సింగపూర్ చూస్తున్నాం” అన్నాడు రూపేందర్.
“అవునా!”
“మనం హైదరాబాద్ వెళ్ళగానే నిన్ను అందరూ అడుగుతారు సింగపూర్ లో ఏం చూశావు అని. నేను సైన్స్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేశానంటే అందరూ నవ్వుకుంటారు. నీకు బ్యాంకాక్, పట్టాయా అలాగే కొన్ని ఐలాండ్స్ కూడా చూపించాలనుకున్నాను. అలాగే కౌలాలంపూర్ కూడా. అవన్నీ మంచి అనుభవాలు విదూ. అక్కడ పుత్రజయ అని మలేషియా కొత్త రాజధానిని కట్టారు. ఇలాంటివి చూసినప్పుడు మనకు కొత్త థాట్స్ వస్తాయి. ఇప్పుడు మనకు సమయం లేదు.”
“ఫర్వాలేదు తాతగారూ… ఇలాంటివన్నీ తమ్ముడు రోహన్ తో, ఫ్యామిలీతో కలిసి చూడాలని వుంది. ఎప్పుడన్నా అవకాశం వస్తుందేమో!”
“అవకాశాలు మన దగ్గరికి రావు. మనం క్రియేట్ చేసుకోవాలి. మన మనసులో ఓ ఆలోచన పడగానే, ఎలా అయినా సాధించాలనే కృషి మొదలు కావాలి. ఆ పట్టుదల వుంటే మనం దేన్నయినా సాధించవచ్చు విదూ” అన్నారాయన.
సింగపూర్ లాంటి చిన్న దేశంలో, అది హైదరాబాద్ అంత కూడా వుండదు. వారు సాధిస్తున్న అభివృద్ధి చూస్తుంటే విదూషికి ఆశ్చర్యం కలిగింది. అక్కడికి వస్తున్న టూరిస్టుల్లో తెలుగువారు ఎక్కువున్నారు. తమిళనాడు, కేరళ వాళ్ళు కూడా బాగానే వున్నారు. సింగపూర్ ప్రధానంగా టూరిజమ్ మీద ఆధారపడి వుంది. తెలుగువారు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. తెలుగు సంఘాలు వున్నాయి.
అక్కడ చేసిన ప్రయాణాలు, చూసిన విశేషాలు అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ ని చూసి థ్రిల్ అయింది. ఎప్పటికైనా ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలు చూడాలనుకుంది విదూషి.
ఆ యాత్ర విజయవంతం అయింది. ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. రకరకాల డెలిగేట్లతో మాట్లాడారు. అక్కడ టూరిజానికి చెందిన బ్రోచర్స్ అన్నీ సేకరించి పెట్టుకుంది. ప్రతి చిన్న వివరం తన డైరీలో నోట్ చేసుకుంది.
******
హైదరాబాద్ రాగానే అక్కడి విశేషాలు చెప్పమని అక్క చుట్టూ రోహన్, ప్రియాంకలు తిరుగుతున్నారు. రూపేందర్ ఓపిగ్గా తీసిన వీడియోలను ఇంట్లో అందరూ చూశారు.
“థాంక్స్ నాన్నా!” అంది విదూషి.
“ఎందుకు విదూ?”
“మీరు నన్ను సింగపూర్ పంపించకపోతే ఇవన్నీ చూసేదాన్ని కాదు. నేను ఒక్కదాన్నే కాకుండా మనందరం చూడాలనిపించింది”.
“నువ్వు బాగా చదువుకుని, మంచి జాబ్ లో చేరితే మా అందరినీ నువ్వే తీసుకువెళ్ళవచ్చు” అంది లత.
“ఇప్పుడు ఎందులో చేరాలనుకుంటున్నావు?” అడిగాడు జిష్ణు.
“ఇంతకుముందు చెప్పాను. ముందు సైన్స్ గ్రాడ్యుయేట్ ని కావాలి. తర్వాత ఏంటనేది ఆలోచిస్తాను. నా మనసులో చాలా థాట్స్ వున్నాయి. డబ్బులు సంపాదించటమే నా గోల్ కాదు నాన్నా” అంది.
“అలాగే నో ప్రాబ్లెమ్. ఏమీ చదువుకోని వారు కూడా లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నారు. మనకంటూ ఓ గోల్ అవసరం. నువ్వు రూపేందర్ తాతగారి సలహాలు తీసుకో. నువ్వు ఇష్టపడుతున్న సైన్స్ రంగంలో నీదైన ముద్ర చూపించాలి. అంతవరకు చెప్పగలను” అన్నాడు జిష్ణు.
******
మృదుల విదూషిని తన ఇంటికి ఆహ్వానించింది. తన గదిలోకి తీసుకువెళ్ళాక అంది…
“నాకు ఇప్పుడు ఏ.ఐ. మీద మరికొంత అవగాహన వచ్చింది మృదులా!”
“గుడ్. మా పేరెంట్స్ నీ గురించి చెప్పగానే చాలా సంతోషించారు. నాలో కాన్ఫిడెన్స్ ని కలిగించిన బెస్ట్ ఫ్రెండ్‌వి కదా!”
“అలా అంటావా! మనకు 1+1=2 అని తెలుసు. 1+1=5 అన్నాం అనుకో. అదెలా సరయిందో ఏ.ఐ. చెబుతుంది. ఇక్కడ డేటా ఫీడ్ చేయటం ముఖ్యం. దానిని బట్టి ఫలితాలు వుంటాయి. మనం ఏ లాంగ్వేజ్‌లో అయినా లెటర్స్‌ని ఫీడ్ చేస్తాం. అక్కడనుండి మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ని క్షణాల్లో అందిస్తుంది. మా రూపేందర్ గారు చెప్పారు. ఏ.ఐ. వలన చాలా లాభాలు వున్నాయి. అలాగే లిమిటేషన్స్ వున్నాయని!”
“కొంచెం వివరంగా చెప్పు విదూ…”
“మనం రోబో సినిమాని చూశాం. అందులో మనం ఫీడ్ చేసిన మేటర్ కరఫ్ట్ అయితే, అప్పటిదాకా ఆ రోబోని క్రియేట్ చేసిన ఫాదర్ లాంటి వ్యక్తి మీద విలన్‌గా మారతాడు. అన్నీ డిస్ట్రాయ్ చేస్తుంటాడు”.
“అవును విదూ! మనుషులకు కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్, వైరస్‌లు వస్తుంటాయి. అందుకే సీరియస్ పేషెంట్లనుకున్న అందరనీ ఐ.సీ.యూ.లో వుంచుతారు” అంది మృదుల.
“నువ్వు హెల్త్ గురించి మాట్లాడావు కాబట్టి చెబుతున్నాను. మనకు యూట్యూబ్, వాట్సాపుల్లో రకరకాల వైద్యాల గురించి సమాచారం వస్తుంటుంది. మీరు ఈ ఆకులు తినండి. పండ్లు తినండి. గుండె నొప్పులు రావు. క్యాన్సర్లు రావు అంటారు. అలాగే రకరకాల వ్యాధుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాంటి వారందరూ డాక్టర్స్ కాదు.”
“ఒకవేళ డాక్టర్స్ అయితే!”
“మృదులా! చిన్న చిన్న తలనొప్పులకు, జ్వరాలకు మనం మెడిసిన్స్ వాడుతుంటాం. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ని కలుసుకుంటాం. అన్నింటికీ టెస్టులు చేస్తారు. ఆపరేషన్లు చెయ్యరు కదా!”
“నా ప్రశ్న అది కాదు. డాక్టర్లు సలహాలు చెబితే వాటిని ఫాలో అవవచ్చా?” అంది మృదుల.
“నిజమైన డాక్టర్లు పేషెంట్లను చూడకుండా, టెస్ట్‌లు చేయకుండా సలహాలు ఇవ్వరు మృదులా. అలాగే కొన్ని వ్యాధులు ఎంతకూ తగ్గవు. అందుకని డాక్టర్లను మారుస్తుంటారు. అవునా?”
తలూపింది మృదుల.
“డాక్టర్లు ఓ విషయం చెబుతుంటారు. ప్రతి మనిషీ భిన్నమైన వ్యక్తే. అందరికీ ఒకే మందు, ఓకే డోస్‌లో పని చేయదు. వారి బాడీని బట్టి, హాబిట్స్ ని బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి మందులు మారుస్తారు. ట్రీట్‌మెంట్ మారుస్తారు. ఇది ఏ.ఐ. కి అప్లై చేసుకుంటే అందరికీ ఒకేలా వర్తించదు. మనం హాఫ్ నాలెడ్జితో ఓన్ డెసిషన్స్ తీసుకుంటే అసలుకే మోసం వస్తుంది” అంది విదూషి.
“మరి రోబోలు కూడా సర్జరీలు చేస్తున్నాయి కదా!”
“చేస్తున్నాయి. ఒకప్పుడు లేజర్ ట్రీట్‌మెంట్ లేదు. తర్వాత వచ్చింది. మనం హాస్పిటల్‌కి వెళ్ళగానే, ముందు మనకి ఫైల్ ఓపెన్ చేస్తారు. అందులో మన వయసు నుండి అన్ని వివరాలు నోట్ చేస్తారు. ఇక్కడ ముఖ్యం రోగాన్ని గుర్తించటం. రోబోలు చేస్తున్న డెలికేట్ సర్జరీలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. అంటే డాక్టర్ ఆ రోగాన్ని సరిగ్గా గుర్తించారా? ఇది ముఖ్యం. అదే కాదు ఏదయినా మనం ఫీడ్ చేయటం, ఫీడ్ బ్యాక్‌ని సరిగ్గా అర్థం చేసుకోవటంలో వుంది. అక్కడ ఫెయిలయితే ఏ.ఐ. కాపాడలేదు.”
మృదుల ఆలోచనల్లో పడింది.
“అంటే సాధ్యమైనంతవరకు కొన్ని రంగాల్లోనే మనం ఏ.ఐ. ని ఉపయోగించాలి. అది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దాని మీద భారమంతా వేయకూడదు.”
“ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది విదూ!”
“అందుకే కొన్ని సంస్థల వారు, అలాగే ప్రకటనలు ఇచ్చేవారు. డిస్క్‌క్లైయిమర్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీలు. ఇవన్నీ నిపుణులైన వారితో
తీశాం – ఎవరూ సాహసాలు చేయవద్దని. అంటే మన హక్కుని వదులుకునేలా చేస్తారు. మీకు జరిగే నష్టాలతో మాకు సంబంధం లేదని నిరాకరిస్తున్నారు. అసలు ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేయాలి? ఎందుకు అలాంటి సాహసాలు చేయించాలి?”
“అవును కదా!” అంది నవ్వుతూ.
“ఈ డిస్క్‌క్లైమర్లు లేకపోతే కోర్టులు జరిమానాలు వేస్తాయి. అవి వందల, వేల కోట్లల్లో వుంటాయి. అందుకే ఇవన్నీ” అంది విదూషి.
“మరి ఏ.ఐ. వలన ఉపయోగం లేదంటావా?”
“అలా కాదు. దానివల్ల సమయం ఆదా అవుతుంది. రోగాన్ని తెలుసుకోవటం, మెరుగైన డెసిషన్లు తీసుకోవటం, మన పనులను ఆటోమేట్ చేయటానికి ఇంకా చాలా వాటికి ఏ.ఐ. ఉపయోగపడుతుంది.”
“ఇవన్నీ ఎప్పుడు స్టడీ చేస్తున్నావు విదూ!”
“మనం సైన్స్‌ని ప్రేమిస్తున్నాం. ఇందులో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. డాక్టర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, చివరికి పొలిటికల్ లీడర్స్ కూడా స్టడీ చేయాలి. చిన్న సూది నుండి అంతరిక్షం వరకు ఏ.ఐ. చొచ్చుకుపోతోంది. దీన్ని క్రియేట్ చేసింది మనిషి మెదడు” అంది విదూషి.
“నువ్వు గ్రాడ్యుయేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నావు?”
“ముందు నేను బేసిక్స్ ని అర్థం చేసుకోవాలి. తర్వాత నాకు చాలా ఆలోచనలు వున్నాయి. నాకు ఈ గ్రాడ్యుయేషన్ వల్ల సమయం దొరుకుతుంది” అంది విదూషి.
******
లత, జిష్ణు మాట్లాడుకుంటున్నారు.
“ఈ ఏ.ఐ. వల్ల పెద్ద సమస్య రాబోతోంది లతా!”
“అవును. గూగుల్ వాళ్ళు వెయ్యి మందిని తీసేశారు. మైక్రోసాఫ్ట్ కూడా అంతే. మెల్లగా రిసెషన్ వస్తుందేమో అని జనం భయపడుతున్నారు” అంది లత.
“ఓ రకంగా చూస్తే ఇది కొత్త పరిణామం కాదు. ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లు, రిక్షాలు, బస్సులు, ఆటోలు ఇలా కొత్తవి వచ్చినప్పుడు కొంతమంది నష్టపోయారు. తోలుబొమ్మలు, నాటకాలు, రేడియో, సినిమా, టీ.వీలు ఇప్పుడు ఓ.టీ.టీలు వచ్చినప్పుడు చాలామంది నష్టపోయారు.”
“బావా! మనకు ఇబ్బంది వస్తుందా?”
“అందరితో పాటు మనకీ వస్తుంది. నేను విదూ, ప్రియ, రోహన్‌ల గురించి ఆలోచిస్తున్నాను.”
“ప్రియాకీ, రోహన్ కి సమయం వుంది. విదూకి ఏమన్నా సలహా ఇప్పిస్తావా?”
“నేను రూపేందర్ గారితో మాట్లాడాను. మీరు విదూ గురించి మరచిపోండి. మారే పరిస్థితులను బట్టి తనను తాను ఎడాప్ట్ చేసుకుంటుంది. నాకు గట్టి నమ్మకం. షి విల్ క్రియేట్ వండర్స్ అన్నారు. అది ఓ.కె. అయినా మన ఆందోళనలు మనకు వుంటాయి కదా!”
“బావా! ఓ మాట చెబుతాను. మన దేశంలోనే కాదు ప్రపంచమంతా శ్రమ చేసి బతికేవారు ఎక్కువ. వారికి ఇలాంటి టెక్నాలజీతో పరిచయాలు వుండవు. అసలు వారికి రోజూ పని దొరుకుతుందో లేదో కూడా తెలియదు. అయినా అందరూ బతుకుతున్నారు. మనకి లగ్జరీలు కావాలంటే కష్టంగాని కష్టపడటానికి ముందుకు వస్తే ఏ పనీ దొరకకుండా వుండదు. మన పిల్లలు కూడా అంతే. అందరం కలిసి ఏదొక పని చేద్దాం.”
లత కేసి ఆశ్చర్యంగా చూశాడు.
“అవును బావా! ఒకప్పుడు నేను జాబ్ చేశాను. ఇప్పుడు అత్తా మావలను చూసుకోవాలి. వాళ్ళు పెద్ద వాళ్ళయ్యారు. అలాగే పిల్లల్ని చదివించాలి. విదూ పెద్దది అయింది. రోహన్ మరీ చిన్న పిల్లాడు కాదు. అందుకని నేను ఏదో జాబ్ చేస్తాను. చిన్నదయినా గాని” అంది లత.
“అంత అవసరం ఇప్పుడు లేదులే. నేను జనరల్‌గా మాట్లాడుతున్నాను. ఇదో చిన్న కుదుపు. పెద్దవో, చిన్నవో ఇలాంటివి చాలా చూశాం. అందుకని భయాలు లేవు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని మనుషుల్ని చూస్తున్నాం. వారి ఇళ్ళు ధ్వంసం అవుతున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. ఆస్తులు మట్టిలో కలుస్తున్నాయి. మనకు ఇంకా అలాంటి ప్రమాదం రాలేదు” అన్నాడు జిష్ణు.
******
ప్రియాంక ఓ బొమ్మను రోహాన్‌కి చూపించింది.
“ఇది ఎవరు వేశారక్కా?”
“నేను అని చెప్పను. ఐడియా నాది. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకు కంప్యూటర్ వుంది. లాప్‌టాప్ ఏప్స్ అన్నీ బాగా తెలుసు.”
“విదూ అక్కలానా!”
“అక్క ఇంకా ఇలాంటివి చేయటం లేదు. ఆ అన్నయ్య పేరు అనిల్. తాను నా ఐడియాను ఫీడ్ చేసుకుని ఏ.ఐ. తో కష్టపడ్డాడు. ఈ బొమ్మ తయారయింది. అందుకని ఇది నేను డ్రా చేశానని ఎలా చెప్పను?” అంది ప్రియాంక.
“నాకు కూడా ఏ.ఐ. తో హారీపోటర్ అంత పుస్తకం రాయాలని వుంది. అందులో హీరో హారీపోటర్ కాదు.”
“హీరో పేరు నేను చెప్పనా?”
“చెప్పు” అన్నాడు రోహన్.
“నీ పేరే… రోహన్ పోటర్” అని నవ్వింది.
“అప్పుడు పోటర్ ఎందుకు? రోహన్ రిటెన్ బై రోహన్ అనాలా? ఏ.ఐ. హెల్ప్ తో రాసుకుంటే అది మనదెలా అవుతుంది?”
“ఐడియా నీదేగా?”
“నువ్వు నీ బొమ్మకి నీ పేరు పెట్టలేదు”
“అదా! అది కాదు తమ్ముడూ… కథలు రాసేవాళ్ళూ, బొమ్మలు వేసేవాళ్ళూ ఎవరైనా అంతే చేస్తారు. కొత్తవి చేయలేరు. మిక్సింగ్ వుంటుంది. కాకపోతే మీ పోటరో, కోటరో కొత్తగా ఏం చేస్తాడు. ముందు ఇవన్నీ అనుకోవాలి కదా. ఒకప్పుడు ఇవన్నీ చేయటానికి మంత్రాలు, మంత్రదండాలూ వుండేవి. ఇప్పుడు సైన్స్ అంటున్నారు.”
“అక్కా! మా హీరో దేవుడితో యుద్ధం చేస్తాడు” అనగానే షాకయ్యింది.
“అలా చూస్తావేంటి?”
“దేవుడితో యుద్ధం చేసేవాళ్ళని రాక్షసులు అంటారు. వారు ఎప్పుడూ యుద్ధంలో గెలవరు. హీరో గెలవకపోతే పిల్లలూ, పెద్దవాళ్ళు అలాంటి పుస్తకాలు చదవర్రా” అంది ప్రియాంక.
“రాక్షసులు అంతా డిస్ట్రాయ్ చేస్తారు. మరి దేవుడు అదే చేస్తున్నాడు. గాడ్‌తో మంచి హీరో వార్ చేస్తే బాగుంటుంది కదా!”
“నీకు మంచి ఐడియాలు వస్తున్నాయి గాని దేవుడితో హీరోలే ఎందుకు యుద్ధం చేయాలి? హీరోయిన్లు ఎందుకు చేయకూడదు?”
“మీ ఆడవాళ్ళు దేవుడ్ని ఇష్టపడతారు. పూజలు చేస్తారు. అందుకని యుద్ధం చేయటానికి ముందుకు రారు” అన్నాడు రోహన్.
“మగవాళ్ళు కూడా పూజలు చేస్తారు.”
“అయితే ఓ సూపర్ డూపర్ హీరోయిన్ని తయారు చేద్దాం. పేరు మాత్రం ‘ప్రివి.’
“అదేం పేరు?”
“ప్రియాంకవి కదా నువ్వు!”
అప్పుడు నవ్వింది.
“ఈ విషయం మీ అమ్మమ్మకి చెప్పవద్దు. దేవుడితో యుద్ధం చేయటం పాపం అంటుంది” అన్నాడు రోహన్.
******




