ఆమె ఏవో ఆలోచనల్తో నడిచి వస్తోంది.
అప్పుడు ఆమె పాదాలముందు ఓ పువ్వు రాలింది. దానిమీద అడుగు వేయబోయి ఆగింది. చేతిలోకి తీసుకుని తల పైకెత్తి చూసింది. ఆ చెట్టు నవ్వుతున్నట్లు అనిపించింది.
“రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే!” వేటూరి గారి పాట చెవులకు తాకుతోంది. చుట్టూ చూసింది. చెవులు రిక్కించింది. అది ఇక్కడ ఎవరూ ఆలపించరు. తన మెదడులో నిక్షిప్తం అయిన గీతం ఉబికి వచ్చినట్లుంది.
అంతకుముందు ఏకాంతంలో అనేకసార్లు ఆ పాటను వింది. అప్పుడు రకరకాల భావాలు కలిగాయి. రాలిపోయే పువ్వులకు రాగాలు అవసరం లేదా! ఇప్పుడు తన చేతిలో వుంది రాలిన పువ్వు. అది రాలకముందు, రాలుతున్నప్పుడు నేపథ్యంలో ఎలాంటి రాగాలు స్రవించాయో పువ్వుకి మాత్రమే తెలుసు. అది అలా రాలటానికి సహాయం చేసిన ‘బ్రీజ్’ కి మాత్రం తెలుసు.
పువ్వులు మాట్లాడవు. మలయమారుతం మాట్లాడదు. మాట్లాడవా! కవులు అంగీకరిస్తారా? మనుషులు ఒప్పుకుంటారా! నిజమే. మానవ ప్రపంచం మాట్లాడుకుంటూనే వుంటుంది. అవన్నీ మాటలేనా? అవసరాలు కదూ… వ్యాపారాలు కదూ! అందులో ఎన్ని మాటలకు జీవం వుంటుంది. అంత యాంత్రికంగా మారిపోయిన చోట భాషలేని ప్రకృతి పలికించే రాగాలను ఎవరు వినగలరు? అంత తీరిక ఎవరికి వుంది?
ప్రకృతి లేకపోతే మనుషులు అనాధలు కదా. అందుకే ఇన్ని రాగాల వెనుక ఓ సంతోషం-ఓ నిట్టూర్పు-కొన్ని జ్ఞాపకాలు. ఇప్పుడు ఈ పువ్వు తనకో సందేశాన్ని పంపింది. ఆమె అడుగులు ముందుకు వేసింది. అప్పుడు చేతి మీద నీటి చుక్క. తిరిగి చూసింది. మేఘాలు కనిపించలేదు. దూరంగా ఎక్కడో వుండుంటాయి.
ఇది పువ్వు రాలినందుకు కన్నీటి చుక్కా… నువ్వు పుష్పించి, కొన్ని గంటలే అస్తిత్వంలో వున్నా నీ కర్తవ్యం నిర్వహించావన్న అభినందనా! మరికొన్ని చుక్కలు పడుతున్నాయి.
ఆమె వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తోంది.
అదో గేటెడ్ కమ్యూనిటీ. విల్లాల సముదాయం. అత్యంత అందంగా తీర్చిదిద్దుకున్న దారులు, మొక్కలు, రకరకాల ఖరీదయిన కార్లు, అడుగడుగునా డాలర్లు పరిచినట్లున్నారు.
అమెరికా-అమెరికా! కోట్లాది మంది కలల ప్రపంచం. భూతల స్వర్గం. తను తమ విల్లాలోకి వెళ్ళిపోయింది.
******
“గ్రాని దేవీ… మార్నింగ్ వాక్ కంప్లీట్ అయిందా” అంటూ వచ్చింది ప్రవాహ.
“నన్ను భువనా అని పిలవమంటాను. ఎప్పుడూ నువ్వు దేవీ అనే అంటావు” అంది భువన.
“మా మామ్ చెప్పింది. వాళ్ళ గ్రానీ నీ పేరు ముందు దేవీ అని పెట్టుమని చిన్న సైజ్ వార్ చేసిందంట. అప్పుడు గ్రాండ్‌పా ఓ.కే. అన్నారంట. సో… నిన్ను దేవీ అనే అంటాను. ఓ.కే.” అంది ప్రవాహ.
అప్పుడు భువన చేతిలో పువ్వు చూసింది.
“నీకు ఫ్లవర్స్ అంటే అంత లైకింగ్ ఎందుకు?”
“ఆడవారికి పూలు అంటే ఇష్టం. ముఖ్యంగా ఇండియన్స్‌కి. అయినా ఇది నేను వస్తున్నప్పుడు నా ముందు పడింది. నాకు గుడ్ మార్నింగ్ చెప్పినట్లు అనిపించింది. ఈ రోజు బాగుంటుంది. సరే నీకు టైం అవుతోంది. అగన్య ఏం చేస్తోంది?”
“ప్రిపేర్ అవుతుంది. హావే నైస్ డే” అని ప్రవాహ వెళ్ళిపోయింది.
అప్పుడు కాఫీ కప్పుతో వచ్చింది మయూరి. భువన ఏకైక కూతురు.
“మామ్! సలీల్ నీతో మాట్లాడమన్నాడు” అంది కప్ అందిస్తూ.
“ఏ విషయం గురించి?”
“జూన్ తొమ్మిదితో నీకు సెవెన్టీ యియర్స్ కంప్లీట్ అవుతాయి. మన దగ్గర సప్తతి అంటారు కదా. ఈ అకేషన్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం అంటున్నాడు.”
“నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మయూరి” అంది భువన.
“డాడీ వుంటే కాదనేదానివా? మీకు షష్టిపూర్తి చేశారు. అవన్నీ గుడ్ మెమరీస్. నాన్న చనిపోయారు. అంతమాత్రాన నువ్వు అన్నీ మానేయాలని లేదు కదా!”
“నేను ఏం మానేశాను మయూ…”
“ఒకప్పటిలా నువ్వు లేవు. నేను ఫర్టికులర్‌గా ఇదీ అని చెప్పలేను. నాన్నా నువ్వూ ప్రేమగా కలిసి బతికారు. డెత్ అనేది ఇనెవిటబుల్. కొన్ని డికెడ్స్ కలిసి బతికాక ఓ సెంటిమెంట్ డెవలప్ అవుతుంది. ఇట్స్ నాచురల్. ఇదొక అకేషన్” అంటుంటే సలీల్ వచ్చాడు.
అతని పేరు సలీల్ చౌధురి. బెంగాలీ.
“మయూరీ… నేను కొన్ని ఐలాండ్స్‌ని సెర్చ్ చేశాను. జమైకా-అరుబా-దిబహమాస్. బోత్ ఆఫ్ యు సెలెక్ట్ ది ఐలాండ్. మనకు టైం తక్కువ వుంది. లెటజ్ సెలబ్రేట్ విత్ ఫ్రెండ్స్” అని ఓ పేపర్ అందించాడు.
అందులో ఇంకొన్ని దేశాల్లో వున్న ఐలాండ్స్ వివరాలు వున్నాయి. ఇంతలో అతని సెల్ మోగింది.
“సారీ… కారీ ఆన్” అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
“సలీల్ వన్ ఇయర్ నుండి అంటున్నాడు. మనం ఆంటీ సెవెన్టీయత్ బర్త్‌డేను సెలబ్రేట్ చేయాలని. ప్రవాహ, అగన్యలు కూడా ఇంట్రెస్ట్‌గా వున్నారు.”
భువన మాట్లాడలేదు.
“మామ్! ఓ మాట అడుగుతాను. డాడ్-నువ్వు ఇద్దరూ వేరు కదా. మీ మ్యారేజ్ కాకముందు భువన వేరు. మోహన్ వేరు. భువనా ఈజ్ యువర్ ఐడెంటిటీ. అస్తిత్వ అనే పదానికి మీనింగ్ నీకు తెలుసు. మనవాళ్ళు అంటారు ఆకాశంలో సగం అని. ఆ సగభాగానికి ఐడెంటిటీ వద్దా… ఎందుకు డినై చేస్తున్నావు.”
భువన కళ్ళు మూసుకుంది.
“యస్. మీరు నాకు బర్త్ నిచ్చారు. తర్వాత నా లైఫ్‌లోకి సలీల్ వచ్చాడు. ఆ తర్వాత ప్రవాహ, అగన్య వచ్చారు. అందరం ఒకరినొకరు లవ్ చేస్తాం. అన్నీ అకేషన్స్ సెలబ్రేట్ చేసుకుంటాం. అటాచ్‌మెంట్ వుండాలి. దాని పక్కన డిటాచ్‌మెంట్ వుంది. రేపు నీ గ్రాండ్ చిల్డ్రన్ బయటకు వెళ్తారు. సమ్ అదర్ డే నేనో, సలిలో…”
“మయూ ప్లీజ్” అంది.
తర్వాత… “చాలా కాలం నేనూ, మోహన్ కొన్ని అకేషన్స్‌ని ఇద్దరికీ లిమిట్ చేసుకున్నాం. తను లేకుండా ఇలాంటి అకేషన్‌ని జరుపుకోవటం ఇదే మొదటిసారి. ఆ థాట్ రాగానే మనసు అదోలా అయిపోయి సైలెంట్‌గా వున్నాను. ఇంకో విషయం. అస్తిత్వ సమస్య మా మధ్య రాలేదు. ఇద్దరం కలిసి ఓ ఫ్యామిలీని నిర్మించుకున్నాం కదా. ఓ.కే. మీ ఇష్టప్రకారం చేయండి. కాకపోతే నాదో రిక్వెస్ట్” అంది భువన.
“చెప్పు మామ్…”
“ఇందుకోసం మనం ఏ ఐలాండ్స్ వెళ్ళనవసరం లేదు. ఇక్కడే చేసుకుందాం. అది మన ఫ్యామిలీ మెంబర్స్‌కు పరిమితం చేసుకుంటే ఇంకా బాగుంటుంది.”
“మామ్! ఇక్కడ చేసుకుందాం అన్నావు. అంతవరకు ఓ.కే. నిజానికి మేం బిజినెస్‌లో పడి బయటకు వెళ్ళి మంత్స్ అవుతోంది. పిల్లలు కూడా న్యూ ఏరియాలకు వెళ్దామని అడుగుతున్నారు. అందుకని సలీల్ ఐలాండ్స్‌ని ప్రిఫర్ చేశాడు. ఇంక మ్యారేజ్-బర్త్- ఈవెన్ డెత్‌ని కూడా పదిమంది ముందు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఇవన్నీ పర్సనల్ కాదు.”
“సరే మయూ… మీ ఇష్టం వచ్చినట్లు చేయండి” అంది భువన. ఇంతలో ప్రవాహ, అగన్య వచ్చారు.
“గ్రానీ ఓ.కే. అందా! వేరీజ్ ది వెన్యూ” అంది అగన్య.
“య్యా… షీ ఎగ్రీడ్. మనం బర్త్‌డేస్‌ని విడిగా ప్లాన్ చేసుకుందాం. నవ్ వెన్యూ ఇక్కడే. అది డాడీ డిజైన్ చేస్తారు. రైట్” అంది మయూరి.
“థాంక్యూ గ్రానీ” అంటూ మనవరాళ్ళు భువనకు ముద్దులు పెట్టి వెళ్ళారు.
“నేను కూడా నీకు థాంక్స్ చెబుతున్నాను మామ్” అంది మయూరి.
******
రాత్రి…
తన గదిలో భువన బెడ్ మీద కూర్చుని వుంది. ఆమె చేతిలో మోహన్ ఫోటో వుంది. అతను వెళ్ళిపోయి అయిదు సంవత్సరాలు. ఆరోగ్యంగా వుండేవాడు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తప్ప ఇంకేమీ లేవు. అలాగని ఒత్తిళ్ళు లేవు. చాలా ప్రశాంతంగా కనిపించేవాడు.
తమ సంస్థల్లో పని చేసేవారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేవాడు. తను కొంతకాలం అతనితో పాటు ఆఫీస్‌కి వెళ్ళేది. ఇద్దరూ కలిసి లంచ్ చేసేవారు. అది కూడా భువన ఇంటిదగ్గర వండేది. ఎప్పుడన్నా మయూరితో కలిసి డిన్నర్‌కి వెళ్ళేవారు. అలాగే బిజినెస్‌లో భాగంగా అప్పుడప్పుడూ పార్టీలు జరిగేవి. అందులో కూడా మర్యాద కోసం ఓ థర్టీ ఎం.ఎల్ మాత్రం తీసుకునేవాడు. గ్లాస్ నింపితే అది పార్టీ అయ్యేంతవరకు ఖాళీ అయ్యేది కాదు.
నో స్మోకింగ్. ఇద్దరూ కలిసి మార్నింగ్ వాక్‌కి వెళ్ళేవారు. అది తన విషయంలో ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. క్రమంగా భువన పుస్తకాలను చదవటం మొదలుపెట్టింది. అలాగే జనంతో మమేకం కావటం మొదలుపెట్టింది.
తను కిట్టీ పార్టీల లాంటికి సాధ్యమైనంతవరకు దూరంగా వుండేది. ఓసారి అన్నాడు.
“భువీ… నాకు మీ నాన్నగారు మొదటిసారి కలిసినప్పుడు చాలా భిన్నంగా అనిపించారు. ఆయన వ్యవసాయం చేసేవారు. వారి ఆలోచనలు వినూత్నంగా వుండేవి. వేరే వారినుండి ఈ సంబంధం వచ్చింది. అప్పుడు తొలిసారిగా నీ పేరు భువన అని వినగానే నిన్ను ప్రేమించాను.”
“ఇది ప్రేమలో కొత్త విషయం అనుకుంటాను. మనిషిని చూడకుండానే, పేరు విని ప్రేమించటం! ఇలాంటిది మొదటిసారి వింటున్నాను.”
మోహన్ చిన్నగా నవ్వాడు.
“ఆ స్త్రీ ఎంత మహాద్భుత సౌందర్యవతి అయినా తన పేరు ‘గగన’ అని వుంటే నేను ప్రేమించగలిగేవాడిని కాదు.”
“ఇదీ చిత్రంగా వుంది” అంది భువన.
“అవునా. నాకు భూమి మీద వుండేవారంటే ఇష్టం.”
“మనుషులందరూ భూమ్మీదే వుంటారు మహాశయా!”
“కాళ్ళు భూమ్మీద వుంటే చాలదు. ఆలోచనలు, కోరికలు, అన్నీ భూమ్మీద వుండాలి. ఇది నేను కోరుకుంటాను. అందులోనూ మధ్యతరగతి యువకుడిని కదా!”
ఆ విషయం తర్వాత మాట్లాడతాను. నేను కురూపిని అయితే ఏం చేసేవారు?”
ముఖం అదోలాపెట్టి అన్నాడు.
“అత్తగారిని అప్పటికి నేను చూడలేదు. మావయ్య గారు అందగాడు. వారి ఆనందం వారి శ్రమలో వుంది. కష్టజీవి అని నాకు తెలుసు. అయినా నేను ఎంత అందగాడినో నాకు తెలుసు.”
ఇద్దరూ నవ్వుకున్నారు.
“అయినా భువనా! కురూపం అనేది మనసుకు చెందింది. నేను సిన్సియర్‌గా చెబుతున్నాను. నా దృష్టిలో ఏ స్త్రీ కూడా కురూపి కాదు. మన ఆలోచనలు మన ముఖాల్లో ప్రతిబింబిస్తాయి అంటారు. అలా చూసినప్పుడు ప్రతి అందగత్తెలోనూ, ఎక్కడో వికారం వుంటుంది. అది భావాలకు చెందిందే. అలాగే కొన్ని యాంగిల్స్‌లో రంగూ, రూపం బాగుండకపోయినా అందంగా వుంటారు. చూసే దృష్టిని బట్టి వుంటుంది.”
“మీ దగ్గర నుండి చాలా నేర్చుకోవాలి” అంది భువన.
“నీ దగ్గర నుండి ముందు ముందు మరింత నేర్చుకుంటాను. అన్నట్లు మన పెళ్ళి శుభలేఖల్లో నా భువన ముందు ‘దేవి’ కూడా వుందని తెలిసింది.”
“అంటే దేవతను చేసుకుంటున్నా అనుకున్నారా?
“దేవత లాంటి స్త్రీని.”
“మీరు కవిత్వం కూడా రాస్తారా?”
“నాకు రొమాంటిక్ పోయిట్రీ అంటే ఇష్టం. ఇంతవరకు రాయలేదు గాని, ఎప్పుడన్నా రాస్తానేమో!”
“రొమాంటిక్ పోయిట్రీ అంటే ఎందుకు ఇష్టం. ఇంకా చాలా రకాల కవిత్వాలు వున్నాయి కదా!”
“ఓ స్త్రీని అర్థం చేసుకున్నవాడు, ఆమె మనసు లోతులు తెలుసుకున్నవాడు మాత్రమే రొమాంటిక్ పోయిట్రీ రాయగలడు. అలాగే స్త్రీ కూడా. రొమాంటిక్ అంటే యువతీ యువకులు అనుకునేది మాత్రమే కాదు. అదో కల్పన. అదో అద్భుతం. ప్రణయంలోనే కాదు, ప్రళయంలోనూ రొమాంటిసిజం వుంటుంది.”
ఇప్పుడు మోహన్ లేడు. అతని జ్ఞాపకాలు వున్నాయి. యోగా చేసేవాడు. మంచి సంగీతం వినేవాడు. అలాంటిది ఆరోజు గదిలో నిద్రపోతున్నాడు. అప్పటికే ఆఫీస్ నుండి ఫోన్లు వస్తున్నాయి. ఆరు గంటల ప్రాంతంలో భువన లేపటానికి వెళ్ళింది. ముందు కదలలేదు. చేతి మీద చెయ్యి వేసింది. చల్లగా అనిపించి అనుమానం వచ్చింది. ‘మోహన్ మోహన్’ అంటూ బిగ్గరగా అరిచింది. గొంతు వణికింది. క్రమంగా అది దుఃఖపు వెల్లువలా మారింది.
‘కార్డియాక్ అరెస్ట్’ అన్నారు.
మౌనంగా చూస్తుండిపోయింది.
‘మోహనా-నా-మోహనా ఒక్క మాటన్నా చెప్పావా. తిరిగి మరో జన్మంటూ వుంటే మనం కలిసి బతుకుదాం అన్నావా! ఇంకో జన్మ వుంటుందా! అది కదా అందమైన రొమాంటిసిజం.’
“గ్రానీ నీ దగ్గర పడుకుంటాను” అంటూ వచ్చింది అగన్య. చేతిలో తాత ఫోటో చూసింది.
“గ్రాండ్‌పా ఐ లవ్ హిమ్” అంది అగన్య.
******
అదో అందమైన ఫామ్‌హౌస్. దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. రకరకాల పువ్వులు. తులిప్‌లు. కనీసం మూడు నాలుగు వందలమంది వచ్చారు. రకరకాల కార్లు… ఓ పక్క సంగీతం. కొంతమంది తెలుగువారు, బెంగాళీలు, తమిళులు, పంజాబీవారు, కన్నడిగులు. వివిధ వయసులవారు. స్త్రీలను, వారి దుస్తుల్ని, వారి అలంకరణను చూస్తుంటే కళ్ళు జిగేల్ మంటున్నాయి. అమెరికన్లూ, ఇతర దేశాలవారు. పిల్లలు.
అక్కడ కార్యక్రమాలు మొదలయ్యాయి. రకరకాల నృత్యాలు.
“ఐ లవ్ మై ఇండియా” అంటూ గీతాలు.
“ప్రవాహ, అగన్యలు దేవతల్లా మెరిసిపోతున్నారు. మయూరి నెమలిలా వుంది. సలీల్ బెంగాలీ డ్రెస్‌లో హుందాగా వున్నాడు. రకరకాల వంటకాలు, బెంగాలీ స్వీట్లు.
భువన మాత్రం చేనేత చీర కట్టుకుంది. ఎంతో హుందాగా వుంది. నుదుట బొట్టును ధరించింది. ఓసారి ఎవరినో పలకరించటానికి మోహన్‌తో వెళ్ళింది. అక్కడ భర్తను పోగొట్టుకున్న స్త్రీని చూసి కలత చెందాడు.
“ఎందుకని ఆ బొట్టు తీయటం. ఎందుకని సంవత్సరాలపాటు ఏ ఫంక్షన్ జరిగినా హాజరు కారు. అందరూ స్వంత మనుషులే. చుట్టుపక్కల కలిసి వుండే మిత్రులే. ఆత్మీయులే. రోజులు మారిపోయాయి కదా. అయినా ఆ అమ్మాయి వయసెంతని. ఇలాంటివి నాకు నచ్చవు భువనా” అన్నాడు.
ఆ మాటలు గుర్తుంటాయి ఎప్పుడూ!
సలీల్ మైక్ అందుకున్నాడు. ఆంగ్లం, హిందీ, కాసింత తెలుగు, బెంగాలీ మిక్స్ చేసి మాట్లాడుతున్నాడు.
‘దేవియోం జేర్ సజనో’ అంటూ మొదలుపెట్టాడు.
భారతదేశంలో కూడా అమెరికాలానే అనేక స్టేట్స్ వున్నాయని. రకరకాల ఆచారాలు, అలవాట్లు, భాషలు వున్నాయని, అలాగే ఇలాంటి సందర్భాలను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పాడు. మయూరి మాట్లాడింది. భువన పాదాలకు నమస్కరించింది. కొంతమంది తెలుగువారు మాట్లాడారు. మీరు వెయ్యి పున్నములు చూడాలని ఆకాంక్షించారు.
“వియ్ లవ్ అవర్ గ్రానీ అండ్ వుయ్ మిస్డ్ అవర్ గ్రాండ్‌పా” అని ప్రవాహ, అగన్య మాట్లాడారు. కాక్ టైల్ పార్టీ ఆరంభం అయింది. అందరూ భువనకు ఏవేవో కానుకలు అందించారు.
చివరిగా భువన మాట్లాడింది.
“మోహన్ జీ నా భర్త. వారు ఇప్పుడు లేరు. కానీ మోహన్ చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ నా ముందున్నాయి. ఏజ్ ఓ నెంబర్ మాత్రమే అంటారు. కొన్ని మన చేతుల్లో వుండవు. ఉన్న జీవితాన్ని అందంగా మలుచుకోవటం మన చేతుల్లో కొంతవరకయినా వుంటుంది. మీ అందరూ వచ్చి నాకు ఉత్సాహాన్ని ఇచ్చారు. మా అమ్మాయి మయూరి, మా సన్ ఇన్లా సలీల్ చౌధురి, మా గ్రాండ్ డాటర్స్ ప్రవాహ, అగన్య, అలాగే గెస్టులు అందరూ ఒకే మాట చెప్తారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. యస్, ఇకనుండి నాలో వున్న పెయిన్‌ని తగ్గించుకుంటాను. నాకోసం కూడా నేను బతుకుతాను. అందరికీ ధన్యవాదాలు” అంటూ చేతులు జోడించింది.
******
“మామ్… నువ్వేం అంటున్నావో నాకు అర్థం కావటం లేదు” అంది మయూరి కాస్త తికమకగా చూస్తూ.
“ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను.”
“వాటిజ్ దిస్. ఇంత సడన్‌గా నిర్ణయం తీసుకున్నావు. నేను డైరెక్ట్‌గా అడుగుతున్నాను. నా వల్లగాని, సలీల్ ఈవెన్ మా చిల్డ్రన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశావా? చేస్తున్నావా?”
“అదేం లేదు మయూరి!”
“దెన్!”
“మొన్న నువ్వు అస్తిత్వ గురించి మాట్లాడావు కదా. అది నన్ను థింక్ చేసేలా వుంది. అప్పుడు నాకూ అనిపించింది. నేను ఎవర్ని అని?”
“మామ్… నీ సెవెన్టీ యియర్స్ పూర్తి అయిన అకేషన్‌ని సెలబ్రేట్ చేయాలని మాట్లాడాను. డాడ్ మెమరీస్ నుండి నిన్ను బయటకు తీసుకురావాలని అనుకున్నాను. మనుషులు ఎప్పుడూ ఒకే రకమైన ఫ్రీక్వెన్సీలో వుండకూడదు కదా! ఓ రకంగా నువ్వు డిప్రెషన్‌లోకి జారుతున్నావు అనిపించింది. అందుకు కొంతవరకయినా నిన్ను కన్‌సోల్ చేయాలనిపించింది. అది నిన్ను ప్రోవోక్ చేయటానికి కాదు. అది నిన్ను హర్ట్ చేయటానికి కాదు. నన్ను క్షమించు” అంది బాధగా.
“నువ్వు నన్ను ప్రోవోక్ చేశానని ఎందుకు అనుకుంటున్నావు మయూ… నన్ను నేను వెతుక్కోవటానికి మార్గం చూపించినట్లు నాకు అనిపించింది. ఇప్పటిదాకా మోహన్ అనే పార్ట్నర్ నీడగా మాత్రమే బతికానా అనేది సెర్చ్ చేసుకోవాలి. ఎట్‌లీస్ట్ ఇప్పుడు నా కోసం నేను కొంతకాలం బతకాలి మయూరీ.”
“మామ్ నీ వాదనను నేను అంగీకరిస్తున్నాను. ఇక్కడ నీ గది నీకు ప్రత్యేకంగా వుంది. అది నీ ప్రపంచం. ఇంకా నీకంటూ ఓ సెపరేట్… ఐ మీన్ ఇంకో విల్లా తీసుకుందాం. ఇండియాలో అయినా, కనీసం మన నగరంలో లేదా మన ఇంటిలోనయినా డిఫరెన్స్ ఏముంటుంది. దేశమేనా? ఇక్కడా అక్కడా వుంది పీపులే కదా!”
“దేశమే. అది చిన్నదా మయూ… మనుషులకు దేశమే కదా ఐడెంటిటీ. అలాగే పుట్టిన ఊరు, జిల్లా, రాష్ట్రం వీటి చుట్టూనే కదా అస్తిత్వాలు ఏర్పరుచుకునేది. యుద్ధాలు చేసేది. అభిమానాలు, దురభిమానాలు పెంచుకునేది. తేడా చాలా వుంటుంది మయూ. మీరు ఇక్కడ వుండటానికి అలవాటు పడ్డారు. అయినా ఐ లవ్ మై ఇండియా అంటూ ఫంక్షన్‌లో పాటలు పాడారు. నృత్యాలు చేశారు.”
“అది తప్పంటావా మామ్?”
“అనను. ఎందుకంటే నేను కూడా మన దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇంకా పీపుల్ గురించి మాట్లాడావ్. అమెరికన్లను మన ఇండియానో, మరో కంట్రీనో వచ్చి వుండమంటే వుండగలరా. ఆఫ్‌కోర్స్ ఉద్యోగాలకో, వ్యాపారానికో, బంధానికో తప్ప. అందుకని నన్ను అర్థం చేసుకో. ఇక్కడ ప్రపంచం వేరు. ఎప్పుడన్నా వచ్చి అయిదారు నెలలు వుండటం వేరు. అస్తిత్వం అనేది ఇంటినుండి మొదలు అవుతుంది. ఫ్యామిలీ నుండి!”
మయూరి మౌనంగా వుండిపోయింది.
“నాకూ ఇక్కడ ఎలాంటి యిబ్బంది లేదు. నా రక్తం పంచుకు పుట్టిన నువ్వున్నావు. అల్లుడున్నాడు. ప్రవాహ, అగన్యలు వున్నారు. పిల్లలిద్దరూ ఎవరి ప్రపంచం వారు నిర్మించుకుంటున్నారు. అలాగే మీ బిజినెస్‌లు మీకు వున్నాయి. వాటిలో మీరు బిజీ. మనుషులు ఎప్పుడూ గదుల్లోనే వుండరు. ఆలోచనల్తోనే వుండరు. బయటి ప్రపంచాన్ని చూడాలనుకుంటారు. మీరు నా కోసం మనిషిని ఏర్పాటు చేయవచ్చు. అది కూడా ఓ సమస్యే.”
“మామ్ నీ నిర్ణయాన్ని మార్చుకుంటావా? కనీసం ఒకటి రెండు సంవత్సరాలు వాయిదా వేసుకుంటావా?” చివరిగా అడిగింది మయూరి.
“సమయం లేదు మయూరి. ఇప్పుడు నాకు ఇంకా ఓపిక వుంది. రాలిపోవటానికి ఏ క్షణమైనా పట్టవచ్చు. అసలు అంత ఆరోగ్యంగా వున్న మీ నాన్న అకస్మాత్తుగా చనిపోగలరని మనం ఊహించటం అలా వుంచు. మోహన్ అనుకున్నారా! మృత్యువు రాక గురించి కొంతమందికి ముందుగా తెలుస్తుంది. వయసు పెరగటం అంటే డేంజర్ సిగ్నల్స్ పంపించటమే. అందుకే నాకు అనిపిస్తుంది. మోహన్‌కి ఎలాంటి డౌట్ వచ్చినా తను చేయాలనుకున్న పనులు పూర్తి చేసి వుండేవారు, కనీసం మనతో చెప్పి వుండేవారు.”
“మనకి అనకు. మేం దూరంగా వున్నాం!”
“టెక్నాలజీ పెరిగింది. ఈరోజు దూరం ఓ సమస్యా? శరీరాలు దూరంగా వుండవచ్చు. రూపం కనిపిస్తుంటుంది. మాటలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు నా విషయంలోనూ అంతే కదా!” అంది భువన.
మయూరికి అమ్మ నిర్ణయం మారదు అని అర్థం అయింది.
“ఇంతగా మాట్లాడుకున్నాక ఇంకా నిన్ను ఇక్కడే వుండమనటంలో మీనింగ్ లేదు. య్యా… నేను చెప్పిందే. నీకు అస్తిత్వం కావాలి. ఇప్పుడు నీకు అస్తిత్వం లేదని నేను అనను. మనిషి పుట్టుకే ఓ అస్తిత్వం. అక్కడ నుండి కదా ఆ అస్తిత్వాన్ని ఇతరులు గుర్తించాలని మనకి మనం గుర్తించాలని తాపత్రయం. ఆ దశ దాటాక అస్తిత్వానికి జోడించాల్సిన విషయాలు ఎన్నో వుంటాయి. యు ఆర్ ఆన్ దట్ జర్నీ. ఐ లవ్ యు మామ్” అంది ఉద్వేగంగా.
భువన మయూరిని హగ్ చేసుకుంది.
“నాకో ప్రామిస్ చెయ్యి మామ్!”
“చెప్పు మయూ…”
“నీకు ఎప్పుడు రావాలనిపించినా హెజిటేట్ చేయకు. అక్కడ శపథాలు చేసి ఇండియా వచ్చాను కదా అనుకోకు. ఆ లిటిల్ ఇగోని జయించు మామ్.”
“నేను శపథం చేసి వెళ్ళటం లేదు మయూరి!”
“నన్ను మాట్లాడనీయని. ఇంతగా మాట్లాడే అవకాశం ఇకముందు రాదు.”
భువన తలూపింది.
“నీకు రావాలనుకున్నప్పుడు, కనీసం కొన్ని రోజులకయినా అమెరికా రా. అలాగే మమ్మల్ని చూడాలనిపించినప్పుడు ఫోన్ చెయ్యి. అవకాశాన్ని బట్టి అందరం రాలేకపోయినా నేను వస్తాను. అంతే.”
“తప్పకుండా మయూ! నేను మీ అందరి మీద ప్రేమలు తెంచుకుని వెళ్ళటం లేదు. ఓ రకంగా నా బాధ్యతలు పూర్తి అయ్యాయి. బంధాలూ అంతే. ఇవన్నీ వదిలివేయటం అంత తేలిక కాదు. నేను ప్రేమించటానికి, బంధాలు పెంచుకోవటానికీ వెళ్తున్నాను. అస్తిత్వ భావనలోని అందాలను, పరిమితులను కూడా అన్వేషించే ప్రయాణం నాది” అంది భువన.
******
ఎయిర్పోర్ట్.
చెకింగ్‌కి వెళ్ళేముందు ప్రవాహనూ, అగన్యను హగ్ చేసుకుంది.
“గ్రానీ! నిన్ను మిస్ అవుతున్నాం” అంది ప్రవాహ.
“నేను మీ ముద్దుల్ని మిస్ అవుతున్నాను” అంది భువన.
“బ్యాక్ టు అమెరికా ఎప్పుడు?” అడిగింది అగన్య.
పైకి చూపించి అంది “డెస్టినీ… మనందరినీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు పొమ్మంది. వెళ్తున్నాను. రేపు రమ్మంటుంది. అప్పుడు వస్తాను. ఓ.కే.” అంది.
మయూరి, సలీల్ పాదాలకు నమస్కరించారు. వారి కళ్ళముందు నుండి వీడ్కోలు చెప్పి వెనక్కి తిరుగుతూ గమనించింది-మయూరి కళ్ళల్లో నీటి పొరలు. ఓ క్షణం ఆగిపోవాలనిపించింది. అడుగులు ముందుకే పడ్డాయి.
కొన్ని గంటల సమయం గడిచిపోయింది. విమానం గాల్లోకి లేచింది. తనది విండో సీట్. తెల్లటి మేఘాలు పరుగులు తీస్తున్నాయి. అప్పుడు వినిపిస్తుందా పాట!
‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే!’
రాలిపోని పూలుంటాయా… రాలటం, రాలకపోవటం మధ్య కాలపు అడుగులే వుంటాయి. అవును. రాలిపోయే పువ్వులకి రాగాలు కావాలి. అవి నిన్నటి రాగాలు కావచ్చు. రేపటివి కావచ్చు. పువ్వు రాలే చప్పుడు అందరికీ వినిపించకపోవచ్చు. మనసు చేసే చప్పుడు కూడా అంతే. అది మనమే వినగలం.
మయూరి కన్నీటి తెరను గమనించినప్పుడు కాలం వేగంగా పరుగులు తీసుకుంటూ వెనక్కి వెళ్ళింది. ఒక్క కాలానికే ఇలాంటి అవకాశం వుందేమో. కాలం అంటే ప్రకృతి చరిత్ర కదా!
తను మొదటిసారి తమను వదిలి చదువుకోవటానికి బెంగళూరు వెళ్తున్నప్పుడు తనను కౌగిలించుకుని, భుజాన్ని తడుపుతూనే వుంది. మోహన్ నవ్వుతూ చూస్తున్నా అతని కళ్ళల్లోనూ తడి.
“ఎందుకురా! కన్నీళ్ళని ఇప్పుడే ఖర్చు పెట్టకు. ముందు ముందు చాలా రోజులున్నాయి. అయినా చదువుకోవటానికి వెళ్తున్నావు. రేపు అమ్మనూ, నాన్ననూ వదిలేసి ఎగిరిపోయే క్షణాలు ముందున్నాయి” అంది భువన.
“నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను. అసలు నేను పెళ్ళే చేసుకోను. మీతోనే వుంటాను.”
“నేనూ ఇలానే అన్నాను.”
మోహన్ నవ్వుతున్నాడు.
“లేదు-లేదు. నేను పెళ్ళి చేసుకోను” అంటూ భువన గుండెల మీద చిన్నగా కొట్టింది. ఎప్పుడు ఇంటికి వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు ఇలాంటి దృశ్యాలే.
ఇప్పుడు మయూరికి అలాంటి అనుభవం ఎదురయ్యే అవకాశం లేదు. ప్రవాహ, అగన్యలు అలా అనే అవకాశం లేదు అనుకుంది.
విమానం పరుగులు తీస్తూనే వుంది.
******
మయూరి సీలింగ్ కేసి చూస్తోంది. పిల్లలు ఎవరి గదుల్లో వారున్నారు. సలీల్ ఇంకా రాలేదు. అమ్మ ఎంతవరకు ప్రయాణం చేసిందో తెలియదు. ఇంకా ఫోన్ రాలేదు. అప్పుడు మోహన్, భువనలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
వారి మధ్యలోకి వచ్చింది మయూరి.
“అమ్మా! నాకు మయూరి అని ఎందుకు పేరు పెట్టారు. ఎవరు పెట్టారు?”
“మీ నాన్న పెట్టారు. ఎందుకో తనని అడుగు” అంది భువన.
“నాకు నెమలి అంటే ఇష్టం మయూ… నాకు నెమలి చేసే నాట్యం అంటే ఇంకా ఇష్టం. అందుకని నీకు ఆ పేరు పెట్టుకున్నాను. మీ అమ్మ కూడా అందుకు ఒప్పుకుంది. కాకపోతే మీ అమ్మమ్మలా దేవినో, మరొకటో నీ పేరు ముందు తగిలిస్తానని గొడవ చేయలేదు.”
అప్పుడు మరోసారి దేవికి చెందిన విషయం గుర్తు చేసుకున్నారు.
మయూరికి అమ్మానాన్నలతో నెమలి పురి విప్పి నర్తించిన దృశ్యం గుర్తు వచ్చింది. మొదటిసారి చూసినప్పుడు ఆ అనుభూతిని వర్ణించటానికి మయూరి దగ్గర భాష లేదు.
“అంటే మీరు నన్ను డాన్స్ నేర్చుకోమంటున్నారా?”
“కొన్ని పదాలు ఆంగ్లంలో వుంటే బాగుంటాయి. ఇంకొన్ని మన తెలుగులోనే అందంగా వుంటాయి. డాన్స్ అనకు. నెమలికి నేర్పిన నడకలు అంటారు కవులు. నృత్యం అను, బాగుంటుంది.”
“సరే. నన్ను నృత్యం నేర్చుకోమంటారా?”
“అది ఒకరు చెబితే వచ్చేది కాదు. ఏదయినా అంతే. మన మనసులో పుట్టాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.”
“ప్రేమయినా అంతేనా మోహన్ గారూ!” అంది భువన.
మయూరి ఇద్దరినీ చూస్తోంది.
“అంతే కదా! అమ్మా నాన్నలు చెబితే పెళ్ళి చేసుకుంటారు. ప్రేమించలేరు కదా!”
“పేరును మాత్రమే విని ప్రేమించేవారూ వుంటారు” అంది భువన కొంటెగా.
“ప్రతిదానికీ ఎక్సెప్షన్స్ వుంటాయి భువీ… భౌతిక రూపాన్ని చూసి ప్రేమించటాన్ని, ఐ మీన్ ఆకర్షింపబడటాన్ని ఇన్‌ఫాక్చుయేషన్ అంటారు. నేను మయూరిని నృత్యం నేర్చుకో అంటాను. బలవంతంగా నేర్చుకుంటుంది. అలాగే మంచి అబ్బాయినో, అమ్మాయినో చూశాం పెళ్ళి చేసుకో అంటారు. చేసుకుంటారు. తర్వాత తప్పు చేశాం అనిపిస్తుంది. అందుకే కదా కాపురాల్లో ఇన్ని అసంతృప్తులు” అన్నాడు మోహన్.
“భువనమోహనా… మీకు అసంతృప్తులు వున్నాయా?”
“భగవంతుడి దయ. ఇప్పటివరకు నాకు ఎలాంటి అసంతృప్తులు లేవు. నువ్వు నన్ను నమ్మవచ్చు!”
“ఇకముందు వస్తే?”
“రాకూడదని గ్యారెంటీ లేదు. అది మోహనుడికి పరిమితం కాదు. భువనానికి వర్తిస్తుంది!”
ఇద్దరూ నవ్వుకున్నారు.
తను బెంగళూరులో ఇంజనీరింగ్ చేయటానికి వెళ్తున్నప్పుడు జరిగిన సంభాషణలు గుర్తు వచ్చాయి మయూరికి.
అప్పుడు పరిచయం అయ్యాడు సలీల్.
తనకంటే ఓ సంవత్సరం సీనియర్. అప్పుడు మొదటిసారి కలిగిన ఫీలింగ్ ఇప్పటికీ గుర్తుంటుంది మయూరికి.
“ఈ యువకుడు అందంగా వున్నాడే!”
“అందంగా వుంటే నీకెందుకు? అందవిహీనంగా వుంటే నీకెందుకు నెమలి గారూ. ఈ యూనివర్సిటీలో పదులకొద్దీ యువకులు వున్నారు. అందరిలో అందం వుంటుంది” అని మనసు ప్రశ్న.
“దీన్నే ఇన్‌ఫాక్చుయేషన్ అంటారు” తండ్రి చెవి దగ్గర గుసగుసలాడుతున్నట్లు అనిపించింది మయూరికి. అప్పుడు భువన గుర్తు వచ్చింది.
“మయూ… నేను పెళ్ళంటూ చేసుకోను. అమ్మానాన్నలతోనే వుంటాను అంటుంటావు. యాదున్నదా?”
అప్పుడు సిగ్గు అనిపించింది. ప్రామిస్‌ని బ్రేక్ చేసే పరిస్థితికి ఇది మొదటి సిగ్నలా అనుకుంది.
“ఏంటి మయూ… బిక్ థింకింగ్ జోన్‌లో వున్నావా?” అని వినిపించింది. ఉలిక్కిపడి చూసింది. సలీల్. అతను తెలుగుని కొంచెం నేర్చుకున్నాడు. తను బెంగాలీలో కొన్ని పదాలు తెలుసుకుంది. తన మీద సలీల్ తెలుగు చాలా బెటర్.
“మెమరీస్ సల్లూ” అంది.
“మీ మామ్ గురించేనా- ఫాదరిన్లా గురించా?”
“ఇద్దరి గురించి. దానికి మించి నేనూ-సలీల్ గురించి.”
“ఓ… డిస్టర్బ్ చేశానా?”
“ప్లీజ్ సిట్” అంది మయూరి. అతను ఆమె పక్కన కూర్చున్నాడు.
“ఇంతకుముందు చెప్పాను. అసలు నేను మ్యారేజ్ చేసుకోనని మామ్ అండ్ డాడ్‌తో చెప్పేదాన్ని. నిన్ను చూశాక టోటల్ ఛేంజ్. నేను నేనేనా అనిపిస్తుంది.”
“సో… ఐయామ్ యువర్ హీరో.”
“య్యా… మామ్ ఇండియా వెళ్తుందని నేను అనుకోలేదు సల్లూ. అలా జరిగిపోయింది. అంతే. బాధగా వుంది.”
“త్రీ డేస్… వన్ వీక్… తర్వాత పెయిన్ గోస్… దటీజ్ లైఫ్ మై డియర్. ఆంటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి థింక్ చెయ్యి. షీ హజ్ అనదర్ వరల్డ్. అక్కడ తనకు సోలాస్ హ్యాపీ వుంది. లెట్ హర్ ఎంజాయ్” అన్నాడు సలీల్.
“య్యా… య్యా… అంది మయూరి.
“నేను ఫాదరిన్లా-ఆంటీల లవ్ ఎఫైర్ గురించి విన్నాను. సమ్‌థింక్ యూనిక్, ఈస్థటిక్ అండ్ రొమాంటిక్ సాగా” అన్నాడు నవ్వుతూ.
“ఇట్ మే బీ” అని అతని చేతులు అందుకుంది మయూరి.
***










