ఐ.యంత్ర part 2

Spread the love

“హాస్పటల్‌కి తీసుకువెళ్ళారు. ఇంకో 48 గంటలు గడిస్తేగాని చెప్పలేం అంటున్నారు క్రిటికల్ కండిషన్ అన్నారు.”

విదూషి ముఖం పాలిపోయింది.

“సూసైడ్ చేసుకోవటానికి కారణం తెలుసా?  మనం చదువుకొంటున్నాం. చిన్న చిన్న రీజన్స్‌కే ఇలా చేయటం ఏమిటి? అమ్మానాన్నలు కోపంలో ఏదో అంటారు. అంతమాత్రానికే…”

“ఇది ఇంట్లో సమస్య కాదు విదూ” అందో అమ్మాయి.

“మరి!”

“ఫేస్‌బుక్‌లో, గ్రూపుల్లో మృదుల ఎప్పటికప్పుడు తన పిక్చర్స్ అప్‌లోడ్ చేస్తుంటుంది. ప్రొఫైల్ పిక్చర్స్ మార్చుతుంది. ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తుంటే వాటి గురించి ఏమీ తెలియకపోయినా ఏక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మృదుల చిత్రాల్ని మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంట. ఇప్పటికే కొన్ని గ్రూపుల్లో షేర్ చేశారంట. అది భరించలేక ఇలా చేసింది.”

అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంది.

“మన పేరెంట్స్ మన సేఫ్టీ కోసం స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారు. మన స్టడీస్‌కి చెందిన ఎన్నో విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. అలాంటి వాటిని ఉపయోగించుకోకుండా ఇలా చేయటం సరయిందా?” అంది విదూషి.

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఓ రెవల్యూషన్ వచ్చింది విదూ!”

“ఇదా రెవల్యూషన్ అంటే… ఐయామ్ సారీ” అంది.

“ఈరోజు మనకు క్లాస్ వుండదు. మనం హాస్పటల్‌కి వెళ్ళి మృదులను చూసి వద్దాం” అన్నారు కొందరు.

“మృదుల ఐ.సీ.యూ.లో వుంది. ఎవరినీ రానియ్యరు.”

******

విదూషికి రూపేందర్ గుర్తు వచ్చాడు.

ఆయన తమ ఇంటి దగ్గర వుంటారు. సైన్స్ ఫిక్షన్ కథలూ, నవలలూ రాస్తుంటారు. ఎక్కువగా ఆంగ్లంలో అవన్నీ వుంటాయి. అరుదుగా తెలుగులో రాస్తుంటారు. అనేక కాన్ఫరెన్స్‌లకి వెళ్తుంటారు. విదేశాలకు వెళ్తారు.

“మన తెలుగులో సైన్స్ ఫిక్షన్‌కి ఆదరణ తక్కువ విదూషీ” అన్నారు ఓసారి.

వీలున్న సమయంలో వారితో విదూషి మాట్లాడుతుంది. ఆయనది తన తాతగారి వయసు.

“మనకు చందమామ కథలంటే ఇష్టం వుంటుంది. అలా చెప్పిన కథలే చెబుతుంటారు. పక్షులూ, జంతువులూ, జానపద కథలు వద్దని నేను అనను. అవన్నీ ఓ దశ వరకే. కొత్త విషయాల మీద దృష్టి పెట్టాలి. మనకు వయసు పెరుగుతోంది. అయిదారు సంవత్సరాల దగ్గర ఆగిపోతే ఎలా వుంటుంది విదూ!” అన్నారు ఓసారి.

“అన్ న్యాచురల్‌గా వుంటుంది అంకుల్.”

“నన్ను అంకుల్ అనకు గ్రాండ్‌ పా అను” నవ్వారాయన.

వెంటనే రూపేందర్‌ని కలవాలని అనుకుంది. ఇంటిదగ్గర వుంటారో వుండరో అనిపించింది. ఆయన ఉన్నారు.

మృదుల గురించి చెప్పింది. ఆయన కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు. తననే విదూషి చూస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచి అన్నారు.

“విదూ! మృదుల మీతోపాటు చదువుతోంది. మీ ఫ్రెండ్. అందుకని మీరంతా బాధపడుతున్నారు. దేశంలో, ప్రపంచంలో ఇలాంటివి ప్రతి అయిదు నిమిషాలకు ఒకటి జరుగుతోంది. అవన్నీ మన దాకా రావు.” విదూ తలూపింది.

“మా రచయితలు, రచయిత్రులు వున్నారు. నేనిలా అనటం కాస్త హర్ష్‌గా వుంటుంది. వారి రచనలు ప్రజలకు కావాలి. వారి భంగిమలు కాదు కదా ! మీరు ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి నిద్ర పోయేదాకా ఏం చేస్తుంటారో జనానికి కావాలా! నువ్వు ఓ పోస్ట్ పెట్టగానే రెండు వందలమంది లైకులు కొడితే మీకు బాగుంటుందా. దాంతో గొప్పవాళ్ళు అవుతారా?”

“సోషల్ మీడియా వచ్చాక ఇవన్నీ పెరిగాయి కదా గ్రాండ్‌ పా.”

“విదూ! ప్రపంచంలో ఏది మొదలయినా, ఏ కొత్త విషయం డిస్కవర్ చేసినా మంచికే మొదలవుతుంది. తర్వాత అది దుర్మార్గుల చేతిలో వెపన్ అవుతుంది. ఇప్పుడు నీలాంటి పిల్లల్లో ఆలోచించే శక్తి వుంటుంది. దాన్ని మీ దృష్టి నుండి తప్పించాలంటే ‘ప్రేమ’ లాంటి విషయాలను మీ ముందుకు తీసుకువస్తారు. చాలామంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు” అన్నాడు రూపేందర్.

“ఇప్పుడు మనమేం చేయాలి?” అడిగింది విదూషి.

“మనకు ఓ గమ్యం వుండాలి. సైంటిఫిక్ థాట్ వుండాలి. సైన్స్ అంటే చంద్ర మండలానికో, గ్రహాలకో వెళ్ళటం కాదు. అవన్నీ జరుగుతాయి. మనం సైన్స్‌ని జీవితాలకు అప్లై చేయాలి. మనం లంచ్, డిన్నర్లు చేస్తుంటాం. దానికి ముందు వంట చేయాలి. ఇవన్నీ సైన్స్‌తో ముడిపడి వున్నాయి.”

“అవునవును. నేను ఈ మధ్య ఓ ఆర్టికల్ చదివాను గ్రాండ్‌ పా. మనకు నచ్చిన కలలు మనం కనవచ్చంట.”

రూపేందర్ చిన్నగా నవ్వి చెప్పాడు.

“అమెరికాకు చెందిన ‘ప్రొఫెటిక్’ సంస్థ ఈ విషయం మీద పని చేస్తోంది. ఇందుకో పరికరాన్ని డెవలప్ చేస్తోంది. దానికి ‘హలో’ అని పేరు పెట్టింది. అదో కిరీటంలా వుంటుంది. నిద్రపోయేముందు తలకు ఇది పెట్టుకోవాలి. దీని ధర లక్షా పాతికవేల నుంచి, అరవైవేల వరకు వుంటుంది. వీటిని రెమ్, నాన్ రెమ్ అని రెండు దశలుగా విభజిస్తారు.”

విదూషి ఆసక్తిగా వింటోంది.

“మూసిన రెప్పలోని కనుగుడ్లు వేగంగా కదిలిస్తూ నిద్రపోయే ప్రక్రియను REM దశగా పిలుస్తారు. దానికి LUCID డ్రీమ్ అని పేరుంది. మనం ఎలాంటి కలల్ని కనాలో నిర్ణయించుకుని ప్రోగ్రామింగ్ ద్వారా ‘హలో’ సాధనం ప్రవేశపెడుతుంది. ఇలా కలలను నియంత్రించుకోవటం ద్వారా ఆ సమయాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చని వీటి రూపకర్తలు చెబుతున్నారు” అన్నాడాయన.

“ఇవన్నీ డబ్బులున్న వారికే కదా!”

“అంతే కదా! నిద్రరాని మనుషులు కోట్లలో వుంటారు. వారు నిద్రలోకి జారినా అప్పులూ, సమస్యలూ, పీడకలలూ, వారిని హాంట్ చేస్తుంటాయి. అందుకని అందరూ నచ్చిన కలలు కనలేరు విదూషీ.”

ఇద్దరూ నవ్వుకున్నారు.

“నాకు చాలా బాధగా ఉంది గ్రాండ్‌ పా. మా మృదులకు ఏమన్నా జరిగితే…” అని ఆగింది.

“విదూ! సంతోషం నుండి కొన్ని, బాధ నుండి కొన్ని, కన్ఫ్యూజన్ నుండి మరికొన్ని ఆవిష్కరణలు జరుగుతుంటాయి. మృదులకు ఏమీ కాకూడదని మనం కోరుకుందాం. ఇలాంటి అనుభవాల నుండి నేర్చుకోవాలి. నాకు పనుంది. వెళ్ళాలి. తీరిగ్గా మాట్లాడుకుందాం” అన్నాడు.

******

రెండు రోజులు విదూషి ఆందోళనతో గడిపింది. మృదుల ప్రమాదం నుండి బయటపడుతుందా లేదా! ఇదే ఆలోచన.

అప్పుడు ప్రియాంక వచ్చింది. తనకి మృదుల విషయం చెప్పింది.

“ఇంతవరకు మనకు స్మార్ట్ ఫోన్‌లు ఇవ్వలేదు. అంత అవసరం కూడా లేదు. ఒకవేళ ఇచ్చినా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. మనకు అనేకమంది ఫ్రెండ్స్ వున్నారు. చదువుకోవటానికి, ఇతర పనులు చేసుకోవటానికే మనకు టైమ్ చాలటం లేదు. అందుకని చాలా జాగ్రత్తగా వుండాలి.”

“అమ్మా వాళ్ళు నన్ను ఒక్కదాన్నే బయటకు పంపటం లేదు. మనం పిరికిగా వుండాలా అక్కా?” అంది ప్రియాంక.

“పిన్ని, బాబాయే కాదు. పేరెంట్స్ ఎవరయినా పిల్లలకు జాగ్రత్తలు చెబుతారు. దాని అర్థం పిరికిగా వుండమని కాదు. ఈ రోజున అనేకమంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. ఆడపిల్లల గురించి చెప్పటానికి లేదు. మరికొంత వయసు వచ్చేదాకా అందరం జాగ్రత్తగా వుండాలి. మనం కొత్త మనుషుల్ని వెంటనే నమ్మకూడదు. మన రోహన్‌ని చూడు. చిన్నప్పటి నుంచి మన అడ్రస్, ఫోన్ నెంబర్లు గుర్తించుకునేలా చేశారు. ఎప్పుడు, ఏం జరుగుతుందో మనకు తెలియదు ప్రియా” అంది విదూషి.

******

మూడవ రోజున మృదుల ప్రమాదం నుండి బయటపడింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విదూషి, ఫ్రెండ్స్ మృదుల ఇంటికి వెళ్ళి చూసి వచ్చారు.

వారం రోజుల తర్వాత కాలేజీకి వచ్చింది.

అప్పుడు మృదులతో విదూషి మాట్లాడింది.

“నువ్వు ఇలా చేసి వుండాల్సింది కాదు” అంది.

“ఏం చేయాలో నాకు తెలియలేదు. నాకు ఏడుపు వచ్చింది. భయం కలిగింది. చివరకి చచ్చిపోవాలనుకున్నాను” అంది బాధగా.

“ఏమైనా నువ్వు మా మధ్యకి వచ్చావు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాంటి పని ఎప్పుడూ చేయకు మృదులా!”

“ఇప్పుడు నేను సెల్‌ఫోన్ పక్కన పారేశాను” అంది మృదుల.

విదూషి కొద్దిసేపు ఆలోచించింది.

“మనం దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్లు మాత్రమే కాదు, ఏదయినా. అందులో మంచీ-చెడూ వుంటుంది. కత్తులతో కూరగాయలు కోసుకోవచ్చు. ఎవరి చేతుల్నైనా నరకవచ్చు. అందుకని కత్తుల్ని వద్దు అనుకోలేం. అలాగే నువ్వు ఫోన్‌ని కాదనకు. ఏది ఎలా వాడాలో తెలుసుకో!”

మృదుల తలూపింది.

“ఈ అనుభవం గురించి మరచిపో. ఇప్పటికే పోలీసులకు కంప్లయింట్ చేశారు. కసిగా పని చెయ్యి. ఈ స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేయవచ్చో ప్రపంచానికి చెప్పాలి” అంది విదూషి.

“నువ్వు నా గురించి ఎక్కువ ఊహిస్తున్నావు విదూ…”

“ఇంతమంది ఫ్రెండ్స్ వున్నాం. చచ్చిపోవాలనుకున్నప్పుడు మేం గుర్తు రాలేదు, నీ బాధ చెప్పుకోవటానికి ఒక్కర్నీ నమ్మలేదు!” మృదుల తల దించుకుంది.

“మన ఇంట్లోవారు గాని, బయటవారు గాని మనకంటూ ఓ పర్సన్ అవసరం. మనం ఏం చేసినా బాగుంది అనేవారు కాదు. ఉన్నదున్నట్లు చెప్పేవారు. నా వరకూ రూపేందర్ అనే గ్రాండ్‌ పా వున్నారు. నాకు రకరకాల డౌట్స్ వస్తుంటాయి. వాటికి తాతగారు నాకు జవాబులు చెబుతారు. అంటే గ్రాండ్‌ పా నాకు గైడ్, మెంటార్, ఫిలాసఫర్” అంది విదూషి.

“ఇంతకూ ఫిలాసఫీ అంటే ఏంటి విదూ – భగవంతుడ్ని నమ్మటమా? ఆరాధించటమా?”

“అలా అని కాదు. జ్ఞానం పట్ల ప్రేమ. దాని బహిర్గత రూపం జిజ్ఞాస. మామూలుగా చెప్పాలంటే ఆలోచన. అది వున్నవారందరూ తత్వవేత్తలే. ఇంత చక్కటి తెలుగులో నాకు చెప్పింది రూపేందర్ తాతగారే.”

అప్పుడు మృదుల కళ్ళు వెలిగాయి.

“నేను తొందరపడ్డాను విదూ” అంది బాధగా.

“మనందరం మాత్రమే కాదు. పెద్దవాళ్ళు, చివరికి సైంటిస్టులు కూడా తొందరపడతారు మృదులా. సో… మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి” అంది విదూషి.

******

రోహన్ మిత్రుడు యువాన్.

ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుతున్నారు. వాళ్ళది ముంబయ్ దగ్గర ప్రాంతం. బదిలీ మీద హైదరాబాద్ వచ్చారు. ఇద్దరూ ఒకే బస్‌లో వెళ్తారు. ఒకే ఫ్లోర్‌లో వుంటున్నారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటారు. యువాన్ అమ్మానాన్నలు ఉద్యోగాలు చేస్తున్నారు.

అందువల్ల తీరిక దొరికినప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకుంటారు. ఈ రోజు రోహన్‌ని తన గదికి తీసుకువెళ్ళాడు. అక్కడ రకరకాల టాయ్స్ వున్నాయి. అవి ఇంతకుముందు చూసినవే. కానీ సైజ్‌లోనూ, ఖరీదుగా వున్నాయి.

“ఇవన్నీ వార్‌లో యూజ్ చేస్తారు రోహన్. హండ్రెడ్స్, థౌజెండ్స్ పీపుల్ వితిన్ మినిట్స్‌లో దే బికమ్ డెడ్” అన్నాడు యువాన్.

“యు లైక్ వార్ మూవీస్ యువాన్?”

“య్యా… యు డోంట్ లైక్” అడిగాడు యువాన్.

“చిన్నప్పుడు లైక్ చేశాను. నౌ నో ఇంట్రెస్ట్” అన్నాడు రోహన్.

“యూ సా జేమ్స్‌బాండ్ మూవీస్.”

“వన్ ఆర్ టు. మా మదర్ నో అని చెప్పింది.”

“వై?”

“దోజ్ ఆర్ ఆల్ ఫర్ ఎల్డర్స్. మీరు కిడ్స్ అంటుంది.”

అప్పుడు ప్రియాంక వచ్చింది.

“రోహన్! పిన్ని పిలుస్తోంది. ఇక్కడ ఏం చేస్తున్నారు?” అంది.

“దిసీజ్ యువాన్. మై బెస్ట్ ఫ్రెండ్” అన్నాడు రోహన్.

“హలో… ఐ యామ్ రోహన్స్ కజిన్ ప్రియాంక.”

“హాయ్” అని చేతులు కలిపాడు.

“తమ్ముడూ! యువాన్‌కి బ్రదర్స్, సిస్టర్స్ లేరా?”

“లేరు. ఒక్కడే.”

“ఐయామ్ ఆల్సో సింగిల్ యువాన్” అని గదంతా చూసింది. అక్కడ రూప్ మీద స్టార్స్ కనిపించాయి.

“నాకూ స్టార్స్ అంటే ఇష్టం. నా రూమ్‌లో కూడా మా ఫాదర్ వీటిని పెట్టించారు” అంది ఆనందంగా.

“అక్కా! యువాన్‌కి స్టార్ వార్స్ అంటే ఇష్టం.”

“య్యా… ఐ లైక్ వార్స్. ఐ వాంట్ టు సీ ఏలియన్స్ ఆల్సో” అన్నాడు యువాన్.

“అక్కా! ఏలియన్స్ వున్నారా?”

“ఎందుకు వుండరు. మనం మూవీస్‌లో చూస్తున్నాం కదా. అక్కడిదాకా ఎందుకు. హారీపోటర్‌లో కనిపించే వారంతా నిజంగా వున్నారా? అంతా ఇమాజినేషన్. మనకు కనిపించకపోతే లేనట్లేనా. నువ్వో పని చేయరా! ఈరోజు నీ డ్రీమ్స్‌లోనికి ఏలియన్స్ రావాలని అనుకో. వచ్చేస్తారు.”

“నువ్వు కూడా అంతేనా?”

“అవును. నాకు చాలా కోరికలు వున్నాయి. అవన్నీ డ్రీమ్స్‌లో చూస్తుంటాను. సరే మళ్ళీ మాట్లాడుకుందాం. పిన్ని పిలుస్తోంది. బై యువాన్” అని రోహన్‌ని తీసుకువెళ్ళింది.

******

“నేను నాలుగు రోజుల దాకా రావటం కుదరదు. అందుకని మనం ఆడుకుందాం” అని విదూషి గదికి తీసుకువెళ్ళింది.

“అక్కా! యువాన్ దగ్గర చాలా టాయ్స్ వున్నాయి. కొన్నే చూశాం.”

“అన్నీ డిస్ట్రాయ్ చేసేవి రోహన్. చిన్నప్పుడు ఇలాంటివి నువ్వూ కావాలని అల్లరి చేసేవాడివి” అంది.

రోహన్ అక్కని చూశాడు.

“ఇలాంటివి అబ్బాయిలు అడుగుతారు. మా ఆడపిల్లలకు ఇలాంటివి నచ్చవు” అంది ప్రియాంక.

“అదేం కాదు. కొంతమంది గర్ల్స్ ఆల్సో లైక్ చేస్తారు” అన్నాడు రోహన్.

“అదేరా నేను చెప్పేది. కొంతమందే. మీ అబ్బాయిలు చాలామందికి డిస్ట్రాయ్ చేయటం ఇష్టం. అక్క చెప్పినట్లు మనం క్రియేట్ చేయాలి.”

“నాకూ ఇష్టం లేదు. అంతమంది మనుషులు చచ్చిపోవటం ఏమిటి? అందుకే రోబోలను క్రియేట్ చేశారు.”

కొద్ది క్షణాలు ఆశ్చర్యంగా చూసింది.

“నేను మా ఫ్రెండ్ దగ్గర రోబోని చూశాను. అది గదంతా క్లీన్ చేస్తోంది. వార్స్ కోసం రోబోల్ని క్రియేట్ చేయలేదు అనుకుంటాను. మనకు పనులు చేయటం కోసం చేశారు. నీకు కోల్ మైన్స్ తెలుసు కదా. అవి డిగ్ చేయటానికి మనుషులు వెళ్తారు. అప్పుడప్పుడు అవి కూలిపోతుంటాయి. చాలామంది చనిపోతుంటారు” అంది ప్రియాంక.

“మై గాడ్!” అన్నాడు రోహన్.

“నేనయితే మై గాడెస్ అంటాను” అంది ప్రియాంక.

ఇద్దరూ నవ్వుకున్నారు.

“అలాంటిచోట రోబోలను వుంచితే మనుషులు చచ్చిపోరు” అంది ప్రియాంక.

అప్పుడు విదూషి వచ్చింది.

“ఏం మాట్లాడుకుంటున్నారు?”

“రోబోల గురించి అక్కా!” అన్నారిద్దరూ.

“మంచి పని చేస్తున్నారు.”

అప్పుడు యువాన్ గదిలో టాయ్స్ గురించి చెప్పింది ప్రియాంక.

“ఇవన్నీ పిల్లల కోసం తయారు చేస్తుంటారు. అయినా కొత్త వెపన్స్ చేయటం గొప్ప కాదు. మన ప్రతి మూవీలోనూ కొత్త వెపన్‌ని డిజైన్ చేస్తుంటారు. వారి క్రియేటివిటీ ఇందుకు యూజ్ చేస్తారు. రక్తం కాల్వలు. ఎంత హింస వుంటే అంత బాగా చూస్తారని వారి నమ్మకం. మనం అలాంటివి చూస్తుంటే మనకు కూడా వయోలెన్స్ మీద అభిమానం పెరుగుతుంది” అంది విదూషి.

“ఇవన్నీ కూడా సైన్స్ కదా అక్కా?”

“అన్నీ సైన్సే. వెపన్స్ క్రియేట్ చేయాలన్నా మన మెదడు కావాలి. అలానే ఇతర గ్రహాలకు వెళ్ళటం. ఇంకా ఎన్నో విషయాలున్నాయి. అలాంటి ఎక్స్పరిమెంట్స్ చేస్తే ఉపయోగం. ఈరోజుల్లో ఏం చేయాలన్నా కోట్లాది రూపాయలు కావాలి. ఇలా అవి వేస్ట్ అవుతుంటాయి”

“అక్కా! ఏలియన్స్ వుంటారా?”

“ఉండవచ్చు. ఇవన్నీ మనుషుల ఊహలు. మనందరికీ కనిపించేదాకా అవన్నీ కల్పనలు” అంది విదూషి.

“చిన్నక్క! మగ పిల్లలకే వెపన్స్ ఇష్టం అంటోంది.”

విదూషి నవ్వింది.

“స్పీల్ బెర్గ్ ఏలియన్స్ మీద సినిమా తీశాడు. అందులోనూ సెంటిమెంట్ వుంటుంది. ఆడపిల్లలకి బై బర్త్ మదర్ ఇన్‌స్టింక్త్ వుంటుంది అంటారు” అంది విదూషి.

“అంటే…?”

“అమ్మతనం రా! మనందరం పుట్టటానికి అమ్మలు చాలా నొప్పులు పడతారు. అవి ఎవరికీ రాకూడదు అనుకుంటారు. అలాగే ఇంత పెయిన్‌తో పిల్లల్ని కంటే వారిలో వారు చంపుకోవటం ఏంటి! మగవారికి నొప్పులు తెలియవు కదా” అంది విదూషి.

“అయితే ఓ పని చేయాలక్కా! మనం కొత్తది డిస్కవర్ చేయాలంటావు కదా. నేను హారీపోటర్ లాంటి హీరోని చేస్తాను. అతను మంత్రాల స్టిక్‌తో ఆడపిల్లలని, మగపిల్లలని మార్చేస్తాడు. ఆడపిల్లలని అమ్మలూ, మగ పిల్లలను నాన్నలూ కనాలి. అప్పుడు మగవాళ్ళకి నొప్పులు తెలుస్తాయి. వాళ్ళలోనూ మదర్ ఇన్‌స్టింక్త్

వస్తుంది.”

విదూ, రోహన్‌ని ఆశ్చర్యంగా చూసింది.

“మగవాళ్ళు బర్త్‌ని ఇస్తే ఫాదర్ ఇన్‌స్టింక్త్ వస్తుంది” అంది ప్రియాంక.

“ఏదొకటి రానీ చిన్నక్కా! అలాంటి నొప్పులు ఎవరికీ రాకూడదు అనుకుని న్యూక్రియేషన్ చేస్తారు.”

“ఇదేదో బాగుంది రోహన్. మీ హారీపోటర్‌కి ఆ పనేదో తొందరగా చేయమని చెప్పు.” అంది విదూషి నవ్వుతూ…

******

అందరికీ పరీక్షలు అవుతున్నాయి. వేసవి సెలవులు వస్తున్నాయి. ఈసారి ఎక్కడకు వెళ్ళాలి అని పిల్లల మధ్య చర్చలు నడుస్తున్నాయి.

“విదూ అక్క వస్తుందో రాదో! ఈసారి తను సెకండ్ యియర్ కదా. హాలిడేస్ లోనూ కాలేజ్ వుంటుందేమో” అంది ప్రియాంక.

“గీతి వాళ్ళను ఇక్కడకి రమ్మందాం” అన్నాడు రోహన్.

“అట్లా కాదురా. మనం త్రివేండ్రం వెళ్దాం. అక్కడనుండి కన్యాకుమారి వెళ్దాం. ఈ సంవత్సరం తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ అని నన్ను కూడా బయటకు పంపరు” అంది ప్రియాంక.

“నాకు తెలిసిందిలే!”

“ఏం తెలిసిందిరా?”

“పద్మనాభస్వామి గుడిలో చాలా గోల్డ్ వుంది. అది తెచ్చుకుని నువ్వు గొలుసులు, వడ్డాణాలు చేయించుకుంటావు” అనగానే నవ్వింది.

“రోహనూ… ఆ గదుల్లో బంగారు విగ్రహాలు వున్నాయి. ఆ గోల్డ్‌తో నేను నా విగ్రహాన్ని తయారు చేయించుకోవచ్చు. నాది మాత్రమే కాదు. మనందరి విగ్రహాలు చేయించుకుందాం. అయినా నాకు నువ్వున్నావురా. నువ్వే నా హారీపోటర్‌వి. నువ్వు నీ మేజిక్ స్టిక్‌తో ఎంత బంగారాన్ని అయినా క్రియేట్ చేయగలవు. అందుకు అక్కడిదాకా వెళ్ళనవసరం లేదు.”

“మరెందుకు వెళ్ళటం?”

“సముద్రాలను చూడాలి. మనుషుల్ని చూడాలి. టెంపుల్స్ వున్నాయి. వాటి స్తంభాలను టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుందంట!”

“రియల్లీ!”

“ప్రపంచంలో ఇలాంటి విశేషాలు చాలా వున్నాయి. మనం మమ్మీ సినిమా చూశాం కదా. అక్కడ పిరమిడ్లు ఎలా కట్టారంటావు. ఇప్పటిలా యంత్రాలు లేవు కదా. అంటే సైన్స్ ఎప్పటినుంచో వుంది.”

“అలా కాదు చిన్నక్కా! అప్పుడు కూడా సూపర్‌మెన్లూ, హారీపోటర్లూ వున్నారు. నువ్వు బాబాయి పిన్నిని అడుగు. నేను అమ్మని అడుగుతాను.”

“ముందు అక్కని రమ్మని రిక్వెస్ట్ చెయ్యి. విదూ అక్క పక్కనుంటే మనకు అన్ని విషయాలు చెబుతుంది.”

“నేను అమ్మనీ, నాన్ననీ అడుగుతాను.”

“అలా కాదురా! నాయనమ్మనూ, తాతగారిని అడగాలి. వాళ్ళిద్దరూ అలాగే అంటే మా నాన్న, పెదనాన్న కూడా కాదనలేరు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిలు కదా!” అంది ప్రియాంక.

“దీన్ని కూడా సైన్స్ అంటారా?”

“సైంటిఫిక్ థింకింగ్!” అంది ప్రియాంక.

అనుకున్నట్లు ప్రయాణానికి అంగీకరించారు.

“ఇప్పుడే చెబుతున్నాను. వచ్చే సంవత్సరం నుండి విదూకి మరో రెండు సంవత్సరాల వరకూ ఇలాంటి జర్నీలు వుండవు. రోహన్, ప్రియాంకల సంగతి పక్కనపెడదాం. అందుకని బాగా ఎంజాయ్ చేయండి” అన్నాడు జిష్ణు.

“ఎంజాయ్ చేయండి అంటున్నారు. మీరు రావటం లేదా?” అంది విదూషి.

“నాకు కుదరదు. అమ్మా, పిన్నీ మీతో వస్తారు. బాబాయ్‌కి కుదిరితే వస్తాడు. నేను కూడా వీలు చూసుకుని చివరి రెండు రోజులూ వచ్చి మీతో జాయిన్ అవుతాను.”

“నానీ, తాతగారు రావటం లేదా?” అన్నాడు రోహన్.

“పెదనాన్నకి, నాన్నకి వంట చేయాలి కదా” అంది ప్రియాంక.

“ఇది కూడా సైన్సేనా?”

“చూడక్కా! ప్రతిదానికీ ఇది సైన్సేనా అని వెక్కిరిస్తున్నాడు.”

“అవున్రా. ఇదీ సైన్సే. ముందు మనం ఏమేం ప్రదేశాలు చూడాలో అనుకోవాలి. అక్కడ గెస్ట్‌హౌసుల్లో వుంటామా? హోటల్స్‌లోనా? కార్లు ఎక్కడ బుక్ చెయ్యాలి. అన్నీ ప్లాన్ చేయాలి. ఈ జర్నీలో యిబ్బంది పడకూడదు. తిరిగి రావటానికి టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఈ ప్రయాణం సరిగ్గా ఇరవై రోజులు వుంటుంది” అన్నాడు జిష్ణు.

“నేను తాతగారిని, నానిని అడిగాను. ఇన్ని రోజులు మేం ప్రయాణం చేయలేం అన్నారు. అంతేగాని నాన్న వాళ్ళకు వంట సమస్య కాదు. అంతగా అయితే బయట తింటారు. లేదంటే స్విగ్గీ వుంది” అంది విదూషి.

“మనం ఎలా వెళ్తాం” అన్నాడు రోహన్.

“నడిచి వెళ్తాంరా. లేదా గాల్లో ఎగిరి వెళ్తాం. నీ దగ్గర మేజిక్ స్టిక్ వుందిగా. అప్పుడు ఏ రిజర్వేషన్ అవసరం లేదు” అంది ప్రియాంక.

అందరూ నవ్వుకున్నారు.

“నాకు గాల్లో ఎగిరి వెళ్ళాలని వుంది” అన్నాడు రోహన్.

“పెదనాన్నా! మీరు వాడికి రోహన్ అని పేరు పెట్టారు. మిస్టర్ విదూషక్ అని పెట్టాల్సింది.”

“నేను ఇంతవరకు విమానం ఎక్కలేదు” అన్నాడు రోహన్.

“ఓకే… ఇక్కడనుండి మీరు విమానంలో వెళ్తారు. వచ్చేటప్పుడు రైలు టిక్కెట్లు బుక్ చేయండి. మిగతావన్నీ అమ్మా, పిన్నితో కూర్చుని ఫైనలైజ్ చేయండి విదూ. నేను బయలుదేరతాను” అన్నాడు జిష్ణు.

“ఆ టికెట్లు కన్‌ఫామ్ అవుతాయా?”

“తత్కాల్ వుంటుంది. లేదంటే విమానంలోనే వస్తారు. సరేనా?”

“అలాగే నాన్నా” అంది విదూషి. జిష్ణు వెళ్ళాడు.

“థాంక్స్ రా రోహన్. మేజిక్ స్టిక్ లేకుండానే మా అందర్నీ విమానంలో తీసుకువెళ్తున్నావు. నాకు కూడా ఫ్లయిట్‌లో వెళ్ళాలనుంది. చాలా డబ్బులు కావాలి కదా అని సైలెంట్‌గా వున్నాను. ఇంతవరకూ నేను విమానం ఎక్కలేదు” అంది ప్రియాంక.

“ముందు సుధా అమ్మమ్మకి, గీతిషా వాళ్ళకు చెబుదాం” అంది విదూషి.

అప్పటికప్పుడు లత దగ్గర ఫోన్ తీసుకుని చేశారు. ముందు గీతితో మనందరం కలుస్తున్నాం అన్నారు. లత, సుధతో మాట్లాడింది.

“అమ్మా! నేనూ, పిల్లలూ, ఉష, ప్రియాంక వస్తున్నాం. అక్కడ తిరగటానికి రెండు కార్లు బుక్ చేసుకుందాం. నువ్వూ అన్నయ్య వాళ్ళు వస్తానంటే ఆ రకంగా ప్లాన్ చేసుకుందాం” అంది.

******

మరో రెండు రోజుల్లో బయలుదేరుతారు అనుకున్నప్పుడు విదూషి రూపేందర్‌ని కలుసుకుంది.

“తాతగారూ! మేం కేరళకు వెళ్తున్నాం. మూడు వారాలు ఈ జర్నీ వుంటుంది.”

“గుడ్. మనుషులకు ట్రావెల్ చేయటం చాలా అవసరం విదూ. అది రైలా, బస్సా, కారా, విమానమా అనేది కాదు. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన మనసు లేదా మెదడు కూడా వేగంగా ట్రావెల్ చేస్తుంది. నువ్వు గమనించావో లేదోగాని అలాంటప్పుడే గొప్ప క్రియేటివ్ థాట్స్ బయటకు వస్తాయి.”

“నాకు అర్థం కాలేదు తాతగారూ” అంది విదూషి.

“మన రైటర్స్ వున్నారు. సినిమా వారున్నారు. వారికి జర్నీలోనే మంచి కథలకు బీజం పడింది అంటారు. అంటే ఓ పక్క ఫిజికల్‌గా, మరో పక్కన మానసికంగా ప్రయాణం. ఈ రెండూ ఓ పాయింట్ దగ్గర కలుస్తాయి. అదే బీజం అవుతుంది. అంటే కొత్త ఆలోచన పుట్టింది. మనం మట్టిలో విత్తనం నాటి, కాసిన్ని నీళ్ళు పోస్తే అది రెండాకులు తొడుగుతుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మొక్క అవుతుంది. తర్వాత అన్నీ అనుకూలిస్తే అది చెట్టు అవుతుంది. తర్వాత మహావృక్షం అవుతుంది.”

“ఇది వాళ్ళకు మాత్రమేనా తాతగారూ?”

“కాదు. ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరికయినా ఇదే క్రమం” అన్నారాయన.

“ఇప్పుడు అర్థం అయింది” అంది సంతోషంగా విదూషి.

“అలాగే… నీ దగ్గర చిన్న నోట్‌బుక్ వుంచుకో. మనల్ని ప్రతిరోజూ కొన్ని పదుల ఆలోచనలు తాకి వెళ్తుంటాయి. తర్వాత వాటిని మరిచిపోతాం. ఏ ఆలోచన ఎలాంటి మంచి మార్పుకి కారణం అవుతుందో అప్పుడు మనకు తెలియదు. అందుకని వాటిని నోట్ చేసుకోవాలి.”

“నాకో అనుమానం తాతగారూ! మన ఆలోచనలు ఒక్కోసారి గొప్పగా అనిపిస్తాయి. ఇంకోసారి మనకే నచ్చవు. అందుకు రీజన్ ఏమిటి?”

“సందర్భం. వాన చినుకులుగా రాలుతుంది. అది ఆల్చిప్పలో పడినప్పుడు ముత్యం అవుతుంది. పొలంలో పడినప్పుడు పంట అవుతుంది. సముద్రంలో పడినప్పుడు ఉప్పులో కలుస్తుంది. అలాగే మన మనసు కూడా రకరకాల సమయాల్లో రకరకాలుగా స్పందిస్తుంది. అలాగే ఒకప్పుడు అద్భుతంగా అనిపించనవి తర్వాత చాలా గొప్పగా వుంటాయి!”

తల వూపింది విదూషి.

“ఇంకొన్ని కారణాలు కూడా వుంటాయి. దేనికయినా ప్రధాన కేంద్రం మన మెదడు. శక్తి కేంద్రం అది. అది పనిచేసినంతవరకు మనం బతికి వున్నట్లు. అందుకే అంటారు ఓ గొప్ప మేధస్సు పనిచేయటం మానేసింది అని. అదే మృత్యువు అంటే!”

“మీ దగ్గర ఎన్నో నేర్చుకోవాలి గ్రాండ్‌ పా!”

“మీ దగ్గర నుండి నేనూ నేర్చుకోవాలి. మనందరం ఈ విశ్వం నుండి నేర్చుకోవాలి. ప్రకృతిలో ఓ లయ వుంది. ఆ సూత్రాలు మనకు ఎంత బాగా అర్థం అయితే అంత ముందుకు వెళ్ళవచ్చు. ఈ జర్నీ మీ పిల్లలందరికీ మంచి మెమోరీస్ ఇవ్వాలి. మీరు వచ్చాక మనం కలుసుకుందాం” అన్నాడు రూపేందర్.

******

అందరూ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి అయ్యాక విమానం దగ్గరకు బస్‌లో వెళ్ళారు. అక్కడ దిగి చూస్తుంటే పదులకొద్దీ విమానాలు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం మనోహరంగా వుంది.

అక్కడ ఫోటోలు తీసుకున్నారు. లోపలికి వెళ్ళారు. లత రోహన్‌ని తన పక్కన కూర్చోమంది. ప్రియాంక విండో సీట్ దగ్గర కూర్చుంది. రోహన్‌కి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో చూపించింది.

“అవసరమా!” అన్నాడు.

“విమానం గాల్లోకి లేస్తున్నప్పుడు ముందు సీటుకి తగలవచ్చు” అంది.

మెల్లగా ప్రకటన వినిపిస్తోంది. ఎయిర్‌హోస్టెస్ జాగ్రత్తలు చెబుతోంది. విమానం పరుగులు తీస్తోంది. అలా ఒక్కసారి గాల్లోకి లేచినప్పుడు చిన్న కుదుపు. ప్రియాంక ఉలిక్కిపడింది. అలా పైకి వెళ్తుంటే భవనాలు, చెట్లు అన్నీ చిన్నవిగా కనిపిస్తున్నాయి. మేఘాలు పరుగులు తీస్తున్నాయి. మధ్య మధ్యలో రోహన్, ప్రియాంకలు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అదో అద్భుతమైన అనుభవం.

విదూషికి రూపేందర్, నాని, తాత, నాన్న, బాబాయి గుర్తు వచ్చారు. తిరిగి విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు మరో కుదుపు. మధ్యలో ప్రియాంక విదూషిని అడిగి విమానం నుండి కొన్ని ఫోటోలు తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వస్తున్నారు. అప్పుడు సుధ, గీతిషా, విజయ్ కనిపించారు. రోహన్ పరుగున వెళ్ళి అమ్మమ్మనూ, మావయ్యనూ కౌగిలించుకున్నాడు.

“భయం వేసిందా రోహన్” అన్నాడు విజయ్.

“నో ఫియర్. నేను మూన్ దగ్గరకూ వెళ్తాను” అన్నాడు.

అందరూ నవ్వారు. రెండు కార్లలో అందరూ ఇంటికి వెళ్ళారు.

లత కళ్ళు తుడుచుకుంటోంది.

“అక్కా! అమ్మ ఎందుకు ఏడుస్తోంది?” అడిగాడు రోహన్.

“అమ్మకి తాతగారు గుర్తు వచ్చారు. నువ్వు చిన్నపిల్లవాడిగా వున్నప్పుడు మనం వచ్చాం. ఇప్పుడు తాతగారు చనిపోయారు. అమ్మకి నాన్న గుర్తు వచ్చారు.”

“మనుషులు ఎందుకు చనిపోతారక్కా?” అన్నాడు.

“మనుషులకే కాదు పుట్టిన ప్రతి దానికీ చావు వుంటుంది” అంది విదూషి.

******

రాత్రి అందరూ మాట్లాడుకుంటున్నారు.

రోహన్‌కి విదూషి చెప్పినప్పటినుంచి ఒకటే ఆలోచన. మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు అని. అప్పుడు హారీపోటర్ గుర్తు వచ్చాడు.

“హారీ! నువ్వు ఎక్కడున్నా నా దగ్గరికి రా” అన్నాడు. అప్పుడు వెలుగు వచ్చి హారీ తన ముందుకు వస్తాడనుకున్నాడు. రోహాన్‌ని చూస్తూ ప్రియాంక దగ్గరకు వచ్చింది.

“అందరూ మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు?”

“హారీని రమ్మని పిలుస్తున్నాను.”

చంద్రశేఖర అజాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *