అస్తిత్వ రాగా! part 5

Spread the love

ఓసారి మోహన్, మరో ఇద్దరు ఆత్మీయులు మాత్రం వున్నప్పుడు ఎవరి యవ్వనపు రోజులు, తొలి ఆకర్షణల గురించి వారు చెప్పుకున్నారు. మోహన్ భువన గురించి చెప్పినప్పుడు అందరూ ఇది బాగుంది గాని, మొదటి క్రష్ గురించి చెప్పమన్నారు.

“ఎడ్యుకేషన్” అన్నాడు మోహన్. మీరు నమ్మినా, నమ్మకపోయినా అది మాత్రమే నా క్రష్. దాని వెనకాల మా అమ్మానాన్నల చెమట చుక్కలున్నాయి. అప్పులున్నాయి. ప్రేమించటం కోసమో, ఆకర్షణలకు లొంగిపోవటం కోసమో నన్ను పంపలేదు మా ఊరి నుండి అనే స్పృహ నాకుంది” అన్నాడు.

“అయినా కలలు కనని మనుషులుంటారా?” అన్నారు.

“మనకంటూ ఓ గోల్ వున్నప్పుడు మిగతా విషయాల మీద దృష్టి వుండదు. ఇది అందరికీ వర్తిస్తుందని నేను అనటం లేదు. ఇది పూర్తిగా నాకు పరిమితం” అన్నాడు మోహన్.

“నువ్వు ఎన్నన్నా చెప్పు. నీ సమస్యలు, నీ పేదరికం ఇవన్నీ నిన్ను కోరికల నుండి వెనక్కి లాగవచ్చు. నేను ప్రేమించినా, నన్ను ఎవరు చేసుకుంటారనే భయం వుండవచ్చు. అసలు నాలో ఏ అందం వుంది అని నీకు ఇన్ఫీరియారిటీ వుండవచ్చు. ఇవన్నీ మేం ఒప్పుకుంటాం. కానీ మనసు చెడ్డది. అది ఎవరి మాటా వినదు. నిరంతరం సిగ్నల్స్ పంపుతుంటుంది” అన్నాడో మిత్రుడు.

“పంపింది” అన్నాడు మోహన్. చప్పట్లు కొట్టారు అందరూ.

“ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఎవరామె?”

“చిత్రకారుడు ఓ బొమ్మను పూర్తి చేశాడు. ముఖం మాత్రం పూర్తి చేయలేదు. ఆమె కళ్ళు, నుదురు, పెదవులు, ముక్కు, శిరోజాలు వీటిని మిగిల్చాడు. అప్పుడు ఎవరయినా ఎలా అయినా ఊహించుకోవచ్చు కదా. అలా అప్పుడప్పుడు ఆ చిత్రంలో అజ్ఞాత సుందరి ఎవరై వుంటుందా అని నిద్రలో అటూ ఇటూ దొర్లుతున్నప్పుడు మెలకువ వచ్చేది.”

“నీ మిసెస్‌కి మేం చెప్పం. రివీల్ చెయ్యి.”

“నీ తొలి క్రష్ ఎవరో చెప్పు” అని ఆమే నన్ను అడిగింది” నవ్వాడు మోహన్.

సుదర్శన్ ఇప్పుడు అలాంటి విషయాలు ఎందుకు గుర్తు వచ్చాయి అనుకున్నాడు. తిరిగి అమృత గుర్తు వచ్చింది. ఎగ్జామ్స్ అయిపోయాయి. మరో సంవత్సరం వుంది. తను హిందీలో కూడా మాట్లాడేది. హాలు నుండి బయటకు వస్తున్నప్పుడు కలిశారు.

“ఎగ్జామ్స్ ఎలా రాశారు అమృతా?” అన్నాడు.

“ఫర్వా నై” అంది.

“హాలిడేస్‌కి పంజాబ్ వెళ్తున్నారా?”

చిరునవ్వుతో తలూపింది. అలా నవ్వుతూ తలదించుకుంది. అమృత చామన ఛాయలో వుంటుంది. ఆమె ముక్కు, పెదవులు, పలువరస, రింగుల శిరోజాలు బ్రహ్మదేవుడు శ్రద్ధగా తీర్చి దిద్దినట్లు వుంటాయి. అప్పుడు సుదర్శన్ దగ్గర కెమెరా లేదుగాని తన కంటితో క్లోజ్ షాట్ ని క్లిక్ చేశాడు. అప్పట్లో దానికి నెగెటివ్ కావాలి. అప్పుడే అది డార్క్ రూమ్‌లో డెవలప్ కాలేదు. మెదడు పొరల్లో నిక్షిప్తం అయింది.

“పంజాబ్ బాగుంటుందా అమృతా జీ!”

“బహుత్ సుందర్ హై” అని “హమారా గావ్ భీ” అంది.

“ఏక్ బార్ పంజాబ్ దర్శన్ కరో సుదర్శన్ జీ” అని కూడా అంది.

“హాలిడేస్ అయ్యాక వస్తారుగా”

“జరూర్” అని “ఫిర్ మిలింగే” అని అభివాదం చేసి వెళ్ళింది. అలా చూస్తుండిపోయాడు.

అదే చివరి కలయిక. అమృత రాలేదు. ఆ కాలేజ్ నుండి టీ.సీ. తీసుకువెళ్ళేటప్పుడు వస్తుందేమోనని ఎదురు చూశాడు. లేదు. చదువు మానేసిందో, పెళ్ళి చేశారో, ఖలిస్థాన్ మూమెంట్‌లోకి వెళ్ళిపోయిందో, అసలు బతికి వుందో, లేదో తెలియదు.

ఓసారి పంజాబ్ వెళ్ళాడు. ఆమె ఊరు తెలియదు. అక్కడి వీధులు తిరిగాడు. స్వర్ణ దేవాలయంలోకి వెళ్ళాడు. అతని చూపులన్నీ అమృత కోసమే. అప్పుడే పొయిట్రీ రాయాలనుకున్నాడు. ఓ కవిత రాసి చించేశాడు. అప్పుడే అనుకున్నాడు.

“నేను ఎప్పటికైనా ఓ పొయిట్రీ బుక్ తీసుకుని వస్తాను. దాని పేరు ‘బహుత్ సుందర్ హై’. అది ప్రింట్ చేసి నలుగురికి పంచుతానా, లేక నాకు మాత్రమే పరిమితం చేసుకుంటానా అనేది టైమ్ విల్ డిసైడ్” అని.

మళ్ళీ మొదటికి వచ్చాడు సుదర్శన్. ఎక్కడెక్కడికో ఆలోచనలు చుట్టుముట్టాయి. అసలు విషయం… మనుషులకు ఏది వుండదో, ఏది సాధించలేరో దాని గురించి ఆలోచనలు వుంటాయి. విమర్శలు వుంటాయి. అందని ద్రాక్ష పుల్లన అంటారు. సామెతలు మేధావులు, జ్ఞానులు మాత్రమే చెప్పరు. మామూలు మనుషుల అనుభవాల నుండి, మాటల నుండి అనేక వేదాంతాలు, వేదారంభాలు మొదలయ్యాయి.

ఎక్కడ వైఫల్యం చెందారో, అక్కడ నుండి ఫీనిక్స్ ని ఆదర్శంగా తీసుకునేవారు కొందరు. వాటి మీద ద్వేషం పెంచుకుని, మార్గాలు మార్చుకుని, వికృత వ్యాఖ్యానాలు చేసుకుంటూ, తమ లోపాలను పాతిపెట్టి ఆత్మతృప్తిని పొందేవారు ఎక్కువ.

మన శ్రమకు, మన పోరాటానికి, మన సంసిద్ధతకు ఇంతే ఫలం. మనం శ్రమ చేయకుండా ఫలితం రావాలనుకోవటం, కీర్తి రావాలనుకోవటం, అసహజం అనుకున్నవారు సుఖంగా వుంటారు. ఇతరులను వుండనిస్తారు.

ఇప్పటిదాకా బంధాలు వదులుకుంటున్నాను అనుకుని జర్నీ చేస్తున్న సుదర్శన్, ఓ ప్రశ్నకు, ఇంకొకరి అనుభవానికి ఇంత మథనపడుతున్నాడు.

ఇప్పుడు స్పర్శ కావాలనిపిస్తోంది. అది తిరిగి బంధాలలోకి వెళ్ళటమా అంటే వేరే విషయం. ఒక్కసారి గగనాన్ని ముద్దాడాలి. గగనం అంటే గగారిన్ కాదు, గగారిన్ కొడుకు. తన మనవడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ప్రస్తుతం అనవసరం. అప్పుడు అనిపించింది.

గుర్తులన్నీ, నెంబర్లన్నీ డిలీట్ అయ్యాయి. ఇప్పుడు గగారిన్ కుటుంబం గురించి తనకు ఎలాంటి వివరాలు తెలియవు. అయినా ఫర్వాలేదు. ఆధునిక కాలంలో తలుచుకుంటే ఏదయినా సాధించవచ్చు. ఏడెనిమిది తరాల వెనక్కి వెళ్ళవచ్చు. ఇకనుండి ఆ ప్రయత్నంలో వుంటాను అనుకున్నాడు.

******

సలీల్ ఇంటికి వచ్చాడు. మయూరి సర్వం కోల్పోయినదానిలా వుంది.

“వాట్ హాపెండ్ మయూరి?” అన్నాడు.

“నన్ను కొంతసేపు కదిలించకండి. హెడెక్‌గా వుంది.”

“టాబ్లెట్ తీసుకున్నావా! ముందు ప్రవాహని పిలుస్తాను.”

“ప్లీజ్, నాకు ఎవరూ అవసరం లేదు. మీరు పక్కన వుంటే చాలు” అంది. సలీల్ కి ఏదో జరిగిందని అర్థం అయింది.

“ఇట్సాల్ రైట్. టేక్ రెస్ట్. నీకు తగ్గాక కాల్ చెయ్యి” అని అక్కడి నుండి వెళ్ళాడు.

ప్రవాహ, అగన్యలు హోమ్ థియేటర్‌లో వున్నారు. 

“హాయ్ డాడ్” అన్నారు.

“మామ్‌కి హెడెక్‌గా వుంది” అన్నాడు.

“షీ మే కాల్ అజ్” అంది ప్రవాహ ముక్తసరిగా.

“ఓ.కే. ఐ విల్ బీ విత్ మామ్. ప్లీజ్ క్యారీ ఆన్” అని అక్కడినుండి కూడా వెళ్ళాడు. టెర్రస్ మీదకు వెళ్ళాడు. అక్కడ మయూరి వుంది.

సలీల్ కి కాస్త ఆశ్చర్యం కలిగింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనుకున్నాడు. అప్పుడు వెనక్కి తిరిగింది మయూరి.

“హెడెక్‌గా వుందన్నావు” అన్నాడు సలీల్.

“ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ వుంది, అందుకని వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చావు. ప్రవాహ వాళ్ళు మామ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు.”

సలీల్ ఆమె దగ్గరికి వెళ్ళాడు.

“నీకు హెడెక్. రేపు మార్నింగ్ మనం మాట్లాడుకుందాం.”

“నాకు హెడెక్ వచ్చింది వాళ్ళ వల్లనే.”

“మయూ! చిల్డ్రన్ ఆంటీతో మాట్లాడారు. అంతే కదా!”

“అంత ఈజీగా అంటావేంటి సల్లూ. మామ్ కూడా వాళ్ళతో మాట్లాడుతోంది. అది ఇంతవరకు మనకు తెలియదు. అంత సీక్రెట్‌గా మాట్లాడుకోవలసిన నెసెసిటీ ఏముంది. ఇంతకుముందు ఇలా జరిగిందా?”

“వాట్ మయూ! ఆంటీ అప్పుడు ఇక్కడే వున్నారు. మనం మన పనులతో బిజీగా వున్నాం. వాళ్ళకి మాత్రం ఎవరున్నారు. ఆంటీ మనతో వున్నారు. సో ఇంటిమసీ పెరిగింది. వాటీజ్ రాంగ్.”

“సల్లూ… మామ్ మనల్ని కాదనుకుని వెళ్ళింది. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఈ సమయంలో వారిని చూసుకోవటం మదర్స్ రెస్పాన్సిబిలిటీ. నేను టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాను. కనీసం టూ యియర్స్ ఇక్కడ వుండమన్నాను. బ్లంట్‌గా రిజెక్ట్ చేసింది. పిల్లల మీద అంత ప్రేమ వుంటే ఆ మాత్రం చేయలేదా? అయినా పిల్లల్ని ఆ మాత్రం అడగటానికి మామ్‌గా నాకు హక్కులేదా?”

“ఎందుకు అంత దూరం వెళ్తున్నావు. రైట్స్ దాకా అవసరమా?”

“ఇప్పుడు మా అమ్మ గురించి దిగులు కాదు సల్లూ. పిల్లలిద్దరినీ చూస్తుంటే నాకు షివరింగ్ వస్తోంది. వాళ్ళు మాట్లాడిన మాటలు నువ్వు వినలేదు. ప్రవాహ బుక్స్ చదువుతోందట. సినిమాలు చూస్తుందంట. ఆ లాంగ్వేజ్‌ని నువ్వు వినాలి. ఇప్పటిదాకా ఇంకా ఎడాలసెన్స్‌లో వుందనుకున్నాను. అగన్యని కూడా ఛేంజ్ చేస్తోంది. రేపు ఎలాంటివి క్రియేట్ చేస్తారో!”

“నువ్వు మరీ ఎగ్జాగరేట్ చేస్తున్నావు. దే ఆర్ అవర్ చిల్డ్రన్.”

“ఎగ్జాగరేషన్ కాదు. ఇప్పుడు వాళ్ళను పిలువు. లేదంటే కిందకి వెళ్ళి మాట్లాడదాం. అప్పుడు నీకు తెలుస్తుంది. కమాన్” అని చెయ్యి అందుకుంది.

మెల్లగా చేతిని విడిపించుకున్నాడు.

“డెఫినెట్‌గా మాట్లాడదాం మయూ, నాట్ నవ్. నువ్వు పూర్తిగా ఎమోషనల్‌గా వున్నావు. మనం పిల్లలతో ఎలా మాట్లాడాలో నీకు తెలుసు. అందులోనూ నీకు థింక్ చేసి హెడెక్ వచ్చింది. వాళ్ళు ప్రశాంతంగా మూవీ చూస్తున్నారు.”

“అవి చూసే నేర్చుకుంటున్నారు.”

“ఓ.కే. లెటజ్ టాక్ మయూ. కూల్.”

“లేదు లేదు. దీని వెనకాల మామ్ వుంది. షీ ఈజ్ క్రియేటింగ్ ఆల్ దిస్ నాన్సెన్స్.”

“మయూ! ఇంతకుముందు సినిమాలు అన్నావు. ఇప్పుడు ఆంటీ అంటున్నావు. అసలు ఆంటీకి ఇలా చేయటం వలన వచ్చే ప్రాఫిట్ ఏమిటి? షీ ఈజ్ యువర్ మదర్” అన్నాడు సలీల్.

“రివెంజ్ సల్లూ రివెంజ్” అంది మయూరి.

“క్యా బాస్… నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా. ఎవరన్నా వింటే నవ్వుతారు. అందులో ఆంటీకి వచ్చేదేంటి?”

“ఆనందం. ఇప్పటికే నన్ను మామ్ ని వదిలేసిందని మా సర్కిల్‌లో కామెంట్స్. నన్ను స్ట్రైయిట్‌గా అడిగారు సల్లూ. అవన్నీ నీకు తెలియవు. ఇప్పుడు పిల్లల్ని నా మీదకు వదిలింది. సో, షీ వాంట్ టు ప్రూవ్ దట్ ఐ యామ్ నాటే గుడ్ డాటర్. గుడ్ మదర్. టుమారో గుడ్ వైఫ్ ని కాదంటారు” అంది బాధగా.

“హు ఆర్ దోజ్ పీపుల్. వన్ ఆర్ టూ. వాళ్ళు అలా అంటున్నప్పుడు నువ్వు సైలెంట్‌గా ఎందుకున్నావు. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. వై కాంట్ యు ఆస్క్ దెమ్. మీ పేరెంట్స్ ఎక్కడున్నారు. ఎందుకున్నారు. లెట్ మీ క్లారిఫై అని. నీ మీద నైబర్స్ ప్రభావం ఎక్కువగా వుంది. ఈసారి ఎవరు అడిగినా, దిసీజ్ మై ఫ్యామిలీ. మీరు మీ ఫ్యామిలీని చూసుకోండి. డోంట్ ఇంటర్‌ఫియర్. మా పర్సనల్ విషయాలు మీకు అనవసరం. లేదంటే మీ లైఫ్ లోకి మేం కూడా ఎంటరవుతామని. అప్పుడు చూడు” అన్నాడు. అంతలోనే…

“నైబర్స్ అంటే ఓ పీస్‌ఫుల్ లివింగ్ కోసం. నాట్ లైక్ దిస్. ఇలా ఎవరన్నా కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్‌లో హోల్స్ చాలా వున్నాయని. అయినా ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా? మన గురించి డిస్కస్ చేయటానికి.”

“అంటే మామ్ ని వదిలేయమంటావు!”

“బిట్వీన్ యు అండ్ ఆంటీ ఏదో జరిగింది. అది నువ్వు అనుకున్నంత పెద్దది కాదు. ఇది నా ఫీలింగ్. అయితే చెప్పు, రేపు ఇండియా వెళ్దాం. ఆంటీతో నేను మాట్లాడతాను. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అవుతాయి.”

మయూరి మాట్లాడలేదు.

“ప్రేమ ఎక్కువ అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మయూ. అది ఆంటీ అయినా-చిల్డ్రన్ అయినా-ఈవెన్ హస్బెండ్ అయినా. నువ్వు డిటాచ్ అవ్వటం మొదలుపెట్టు. ఇక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పే మెంటార్స్-ఫిలాసఫర్స్ చాలా మంది వున్నారు. వారిని కలుసుకుందాం. ఈ సమస్యని పెద్దది చేయకు. ఐ యామ్ రిక్వెస్టింగ్ యు” అన్నాడు.

అప్పటికీ ఆమె మాట్లాడలేదు.

“నాకు ఆకలిగా వుంది. కిందకు వెళ్దాం. డిన్నర్ చేద్దాం.”

“నాకు ఆకలి లేదు.”

“కనీసం జ్యూస్ తీసుకో. ఫ్రూట్స్ తీసుకో. లేదంటే నేను కూడా డిన్నర్ చేయను. పిల్లలు కూడా చేయరు. అది నీకు ఇష్టమైతే ఓ.కే. నేను కిందకు వెళ్తున్నాను” అని సలీల్ వెళ్ళిపోయాడు.

పది నిమిషాలు అక్కడ నిలబడింది.

“లోపం నాలోనే వుందా? అందరినీ బాధపెడుతున్నానా?” అనుకుంది. అయినా మనసు అంగీకరించటం లేదు.

“చూశావా-చివరికి సలీల్ కూడా నిన్ను భరించలేకపోతున్నాడు. విన్నర్ ఎవరు? నువ్వా? నేనా?” అని భువన అడుగుతున్నట్లు అనిపించింది.

“నేను ఓడిపోను” అని పైకే అంది.

విసురుగా కిందకు వెళ్ళిపోయింది.

******

సలీల్ ఉదయమే ప్రవాహను, అగన్యను వాకింగ్‌కి తీసుకువెళ్ళాడు. ముగ్గురూ ఓ చోట కూర్చున్నారు.

“మామ్‌కి మీకు మధ్య రిలేషన్ ఎందుకని కట్ అయింది. అసలేం జరిగింది ప్రవాహా?”

“మేం రిలేషన్ కట్ చేయలేదు డాడ్. మేం గ్రానీకి ఫోన్ చేశాం అంది మామ్. గ్రానీ మిస్డ్ కాల్ వుందని చూసింది. నాకు చెప్పకుండా ఎందుకు గ్రానీకి ఫోన్ చేశారు అంది. అసలు షౌటింగ్‌తో కన్వర్సేషన్ బిగిన్ చేసింది. గ్రానీ ముందు మనకి ఫోన్ చేయాలి అంది. నాకు చెప్పకుండా, పర్మిషన్ లేకుండా ఎందుకు చేశారు అంది.”

“య్యా డాడీ! గ్రానీ వెళ్ళి హవ్ మెనీ డేస్ అయింది. మేం ఫోన్ చేశామా? తన హెల్త్ బాగుండలేదేమో అనుకున్నాం. అయినా ఓన్లీ వన్స్ కాల్ చేశాం. అంతే” అంది అగన్య.

“హాట్ డిస్కషన్ జరిగింది డాడ్” అంది ప్రవాహ.

“ఏం జరిగిందో మమ్మీ మీకు చెప్పలేదా?”

“షీ ఈజ్ షౌటింగ్ అండ్ షౌటింగ్. అప్పుడు నా పర్మిషన్ లేకుండా మా ఫోన్ ఎందుకు చూశావు డిటెక్టివ్‌లా అన్నాను.”

“అది రాంగ్ కదా?” అన్నాడు సలీల్.

“మరి గ్రానీకి ఫోన్ చేయటం తప్పెలా అవుతుంది. మామ్‌కి, గ్రానీకి క్వారల్ వుందని మాకు చెప్పిందా?”

“ఓ.కే. ఓ.కే. తిరిగి మనం అన్నీ డిస్కస్ చేయవద్దు. మామ్ పెద్దది. మీరు ఏమన్నా వుంటే నాకు చెప్పాలి. ఈ ఇంట్లో నేను కూడా వున్నాను కదా.”

ప్రవాహ ఏదో అనబోయింది.

“సీ చిల్డ్రన్. మనది ఓ బ్యూటిఫుల్ హోమ్. అవునా?”

తలూపారు ఇద్దరూ.

“జరిగింది మరిచిపోదాం. మీ అమ్మ హర్ట్ అయింది. మీరు కూడా హర్ట్ అయ్యారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీరు చేస్తారా?”

“వాటీజ్ ఇట్ డాడ్?”

“మీ మామ్‌కి సారీ చెప్పాలి.”

ఇద్దరూ మాట్లాడలేదు.

“ఓ, ఇప్పుడే మీలో కూడా ఇగో మొదలా? కిస్సులిస్తారు. హగ్ చేసుకుంటారు. సారీ మాత్రం చెప్పరు. అలాగే, నేను బెంగాల్ వెళ్ళిపోతాను. ఫర్ ఎవర్! మామ్ సంగతి నాకు తెలియదు” అని లేచాడు.

ఇద్దరూ సలీల్ చేతులు పట్టుకున్నారు.

“వద్దు డాడ్. మేం మామ్‌కి సారీ చెబుతాం.”

“అన్‌కండిషనల్‌గా!”

“య్యా…”

“మనం వచ్చేవారం టూర్ వెళ్తున్నాం. ఓ.కే.”

ముగ్గురూ ఇంటికి వచ్చారు. మయూరి కాఫీ తాగుతోంది. ఇద్దరూ అమ్మ దగ్గరకు వెళ్ళారు.

“సారీ మామ్. ఇంకెప్పుడూ నిన్ను హర్ట్ చేయం” అన్నారు. వారి కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి.

******

సుదర్శన్ అన్వేషణ ఆరంభం అయింది. దానికి ముందు భువనతో మాట్లాడాడు.

“నేను కొంతకాలం బయటకు వెళ్తున్నాను భువనా జీ” అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ…

“కొంతకాలం అంటే ఎంతకాలం. మీరు కూడా ఇక్కడ వున్నారని కదా నేను వచ్చాను” అంది.

“ఇక్కడకు కాకపోతే ఇంకో చోటుకు వెళ్ళేవారు. అయినా అమెరికాను, పిల్లల్ని కాదనుకునే కదా ఇక్కడికి వచ్చారు” అన్నాడు.

“పూర్తిగా కాదనుకుని రాలేదు. అలాగే వృద్ధాశ్రమాల్లో చేరాలని కూడా నాకు ఎప్పుడూ ఆలోచన రాలేదు సుదర్శన్ గారూ. మీరు ఫోన్ చేశాక, ఇక్కడకు వచ్చి ఇవన్నీ చూశాక అప్పుడనిపించింది. ఇలాంటి చోట కూడా వుంటే కొత్తగా జీవితం మొదలుపెట్టవచ్చు అని. ఇప్పుడు మీరు మధ్యలోనే…” అని ఆగింది.

“నేను కొంతకాలం అని మాత్రం అన్నాను. ఇంక తిరిగిరాను అనటం లేదుగా!”

“ఇప్పుడిప్పుడే ఇక్కడి మనుషులకు అలవాటు పడుతున్నాను. పోనీ మీరు మీ ప్రయాణాన్ని కొంతకాలం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు కదా!”

“కొంతకాలం అంటే ఎంతకాలం? అప్పటికి మీరు ఈ పరిసరాలకు అలవాటు పడగలనంటారా?” అన్నాడు సుదర్శన్.

మయూరి తనని ఇలానే అడగటం గుర్తొచ్చింది భువనకి. అప్పుడు తను చెప్పిన సమాధానం కూడా. జీవితం చాలా చిత్రమైంది. మనం ఏం కాదంటామో అదే చేయవలసి వస్తుంది. మనం ఏ ప్రశ్నలు వేస్తామో అవే మనకు ఎదురవుతాయి. మనం ఎలాంటి విమర్శలు చేస్తామో, అలాంటి విమర్శలనే మన మీదే చేస్తారు. ఇలాంటి ఆలోచనలు మొదటే మనకు ఎందుకు రావు అనుకుంది.

“ఏంటి ఆలోచిస్తున్నారు. మనం ఒక్కరిగానే ఈ లోకంలోకి వచ్చాం. అలాగే వెళ్ళిపోతాం. మధ్యలో రకరకాల బంధాలలోకి వెళ్తాం. తిరిగి అవి వదిలించుకునే ప్రయత్నం చేయటానికి ఇలాంటి చోట్లకు వస్తుంటాం. ఇక్కడ కొత్తేమిటి? పాతేమిటి భువనా జీ!”

“మీరు ఇప్పుడు కొత్త బంధాల కోసం వెళ్తున్నారా? సూటిగా చెప్పండి. అది మీ వ్యక్తిగతం కానప్పుడు నన్ను కూడా మీతో రమ్మని ఎందుకు అనటం లేదు. అందరం వృద్ధాప్యంలోకి వచ్చాం. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరమైనా రావచ్చు కదా ఆరోగ్యపరంగా!”

చిన్నగా నవ్వాడు సుదర్శన్.

“నవ్వకండి. అసలు దీనికి కారణం నేనే!”

“మీరెలా అవుతారు?”

“మా గ్రాండ్ చిల్డ్రన్‌తో మాట్లాడిన విషయం చెబుతున్నప్పుడు మీరు బంధాలలోకి వెళ్తున్నారా అన్నారు. అది మీకూ అనిపించవచ్చు అన్నాను కదా. అది మీ మీద పని చేసి వుంటుంది.”

“నిజం చెబుతున్నాను నేను మీ అంత అదృష్టవంతుడిని కాదు.”

“ఏ విషయంలో?”

“కుటుంబం విషయంలో. మీకు మయూరి, ఇద్దరు మనవరాళ్ళు వున్నారు. వాళ్ళు మీకు ఫోన్లు చేస్తున్నారు. కొంతకాలం వారి దగ్గర  వుండి వచ్చారు. అలాంటి అదృష్టం నాకు లేదు.”

“అదృష్టం అని ఇప్పుడనిపించిందా? ఇంత మెచ్యూరిటీ వచ్చాక మీరు ఆ మాట అనకూడదేమో!”

“ఏదయినా కానీయండి. మా గగారిన్ గురించి నాకు తెలియదు. వాడి భార్య గురించి, మనవడి గురించి తెలియదు. నాకు తెలిసేటప్పటికి ఓ దేశంలో వున్నారు. నా భార్య చనిపోయేటప్పటికి కాస్తో కూస్తో వున్న బంధం తెగిపోయింది. ఇప్పుడు బంధం పెంచుకోవాలనుకున్నా వారి గురించి వెతుక్కోవాలి. తీరా వారు దొరికినా నన్ను గుర్తు పట్టకపోవచ్చు. నా మనవడు నన్ను ప్రేమగా హత్తుకోకపోవచ్చు. అలాంటి మంచి జ్ఞాపకాలు మేం వాడికి ఇవ్వలేదు కదా!”

“మరెందుకు ఇప్పుడీ ప్రయాణం?”

“ఉన్నచోటులో ఎప్పుడూ వుండలేక. అసంతృప్తి. ఇంకేదో వెతుకులాట. మీరు అన్నట్లు కొత్త గాలి కావాలి. అందుకని ఎక్కువ కాలం వుండను. వచ్చేస్తాను. ఈసారి ఎక్కడెక్కడ తిరుగుతానో నాకు తెలియదు. అందులో కొన్ని కష్టమైన ప్రాంతాలు వుండవచ్చు. మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించండి” అన్నాడు సిన్సియర్‌గా. 

“అలా మాట్లాడకండి. ఇలా అడిగినందుకు మీరు నన్ను క్షమించండి. మయూరిని, అల్లుడ్ని, మనవరాళ్ళని వదిలి వచ్చాను. ఇక్కడ మీరు లేకపోతే వుండలేనా? ఇప్పటికే కొంతమంది పరిచయం అయ్యారు కదా!”

“మీరు ఏమీ అనుకోవద్దు. మొన్న మీతో పాటు ఇద్దరు దంపతులు వచ్చారు కదా. మీకు ఇక్కడ బోర్ అనిపించినా, కాస్త వెదర్ ఛేంజ్ కోసం వారి దగ్గరకు వెళ్ళి నాలుగు రోజులుండవచ్చు. ఆ ఇల్లు అలానే  వుంది కదా!”

“అలానే  వుంది సుదర్శన్ గారూ. అది అమ్మటం అంటూ వుండదు. అందులో ఇంకా మా జ్ఞాపకాలు వున్నాయి. ఇంకో విషయం నేను నారాయణా, సుశీలమ్మల దగ్గరకే కాదు అమెరికా కూడా వెళ్ళి ఓ నెల రోజులుండి రావొచ్చు. అందుకని నా గురించి ఆలోచించకుండా మీరు హ్యాపీగా వెళ్ళి రండి. ఆల్ ది బెస్ట్. అంతేకాదు మీ అనుభవాలు వినటానికి నేను ఎదురు చూస్తుంటాను” అంది భువన.

సుదర్శన్ “బై” చెప్పి వచ్చాడు.

పంజాబ్‌తో ఆరంభించాలనుకున్నాడు. అక్కడ నదీ నదాలు చూశాక అన్వేషణను మొదలు పెట్టాలనుకున్నాడు. అలాంటి ప్రయత్నంలో ఓచోట అతనికి ఓ అమ్మాయి కనిపించింది. తన వయసు ఇరవై సంవత్సరాలలోపు వుంటుందేమో అనిపించింది.

అచ్చంగా అమృతలా అనిపించింది. మొదటిసారి అమృతను చూసినప్పటి ఫీలింగ్. ఈ అమ్మాయి అమృత మనవరాలు అయి వుంటుందా అనుకున్నాడు. కాదు ముని మనవరాలు అయి వుంటుంది. ఆ అమ్మాయి నడుస్తుంటే అనుసరించటం మొదలుపెట్టాడు. మధ్యలో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. ఎవరితను తన వెనకాల వస్తున్నాడనుకుందేమో.

మనిషిని చూస్తే మంచివాడిలా వున్నాడు. పంజాబీ కాదని తెలుస్తూనే వుంది. ఇంకొంత దూరం వెళ్ళింది. అతను వస్తూనే వున్నాడు. అతని కళ్ళల్లో ఎవరినో పోగొట్టుకున్న భావన. దశాబ్దాల తర్వాత విడిపోయినవారు కలుసుకున్నప్పటి స్థితి కనిపించాయి. అపరిచితులను నమ్మవద్దని ఇంట్లో చెబుతుంటారు.”

అప్పుడే అటు ఆటో వచ్చింది. ఆపి అందులో ఎక్కింది. అది ముందుకు కదిలి వెళ్తోంది.

సుదర్శన్ ముఖం వివర్ణంకాగా అటే చూస్తుండిపోయాడు.

******

​సుదర్శన్ వెళ్ళిపోయాడు. అతనితో ఇంకా వాదన పెంచవచ్చు. అంతకుముందు నువ్వు సాలేగూటి లోకి వెళ్తున్నావు అన్నాడు. ​రకరకాలుగా అన్నాడు. ఇప్పుడు అర్థమవుతోంది ఆ మాటల వెనుక వున్నది గగారిన్ మీద వున్న కోపం, ప్రేమ కూడా. ఎంతో ఇష్టపడి పెట్టుకున్న పేరు అది. తర్వాత కాలంలో దూరం అయ్యాడు. భార్య వున్నంతకాలం ఇంకో రకం. ఎవరో ఒకరు పోయాక అసలు జీవితం మొదలు అవుతుంది. అతను వారి గురించి ఏమీ తెలియదు అనటం వాస్తవమే. తెలుసుకుంటానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు కదా. ఈ వయసులోనూ సిగ్గుపడటమా?’ అనుకుంది.

​అప్పుడు ప్రవాహ, అగన్యలు గుర్తుకువచ్చారు. వాళ్ళు తిరిగి ఫోన్ చేయలేదంటే ఒకటే కారణం అయుంటుంది. మయూరికి ఈ విషయం తెలిసి వుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించటం అనవసరం. పెద్ద గొడవ చేయవచ్చు. చిన్న వార్నింగ్‌తో సరిపెట్టవచ్చు. ఏమైనా బ్రేక్ పడింది. అందుకే ఇంతకుముందులా వారు హాయిగా ఫోన్ చేయలేకపోతున్నారు.

అప్పుడు ఫోన్ రింగయింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు వెలిసింది.

​”హాయ్” అంది భువన.

​”ఒక్కసారి రింగ్ ఇచ్చావు. మేం ఫోన్ ఎక్కడో పెట్టాం. తిరిగి రింగ్ ఇవ్వవా గ్రానీ” అంది ప్రవాహ.

​”ఫోన్ లిఫ్ట్ చేయగానే మొదలు పెట్టారా? ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరు చేశారు. అయినా పదేపదే నేను మీకు ఫోన్ చేస్తే మీ అమ్మకి ఇష్టం వుండదు. అదే… వుండకపోవచ్చు. మీ స్టడీస్‌కి ఇబ్బంది అవుతుందేమో అనుకుంటాను కదా!”

​”మామ్‌కి, నీకూ ఎందుకు ఫైట్ అయింది.”

​”అది మీ అమ్మను అడుగు.”

​”నిన్ను అడుగుతున్నాను చెప్పు. నువ్వు ఫోన్ చేస్తే మా అమ్మకి ఇష్టం వుండదు అన్నావు కదా. ఎందుకు ఇష్టం వుండదో యు హావ్ టు టెల్ అజ్” అంది ప్రవాహ.

​”మా మామ్‌కి ఇష్టం లేకపోతే ఇప్పుడు ఎందుకు చేస్తాం?” అంది అగన్య.

​”అంటే మీ అమ్మ చెయ్యమంటే చేస్తున్నారు. అంతేనా?”

​”నో” అంది ప్రవాహ.

“ఇప్పటిదాకా క్వారల్ మీ ఇద్దరి మధ్య-మేం ఇంటర్ ఫియర్ అవకూడదు అనుకున్నాం. ఇప్పుడు అసలు ప్రాబ్లమ్ తెలుసుకోవాలని చేశాం. నువ్వు ఎల్డర్‌వి. అందుకని ఫస్ట్ నువ్వు క్లారిఫై చేయాలి. అనదర్ థింగ్ మా అమ్మ వద్దన్నా ఫోన్ చేస్తాం. నువ్వు వద్దంటే మాత్రం చెయ్యం. రైట్” అంది ప్రవాహ.

​”మీరు గడుసుపిల్లలే” అంది భువన.

​”అంటే, మాకు తెలియదు మీనింగ్” అంది అగన్య.

​”మీవి స్ట్రాంగ్ హెడ్స్ అంటున్నా.”

​”స్కోల్డింగ్ కదా!”

​భువన చిన్నగా నవ్వింది.

“సరే వినండి. మీ మామ్‌కి నాకూ మధ్య బేసిక్ డిఫరెన్సెస్ లేవు. చిన్న చిన్నగా అరుసుకుంటాం. అది మీరూ చేస్తారు. నేను మీ దగ్గర వుండటం లేదని మయూ కంప్లైంట్. నాకు ఇంకో త్రీ ఫోర్ యియర్స్ తర్వాత ఓపిక తగ్గుతుంది. అప్పుడు మీ దగ్గరకే కదా రావాలి.”

​”వస్తావా?”

​”రానని నేను చెప్పానా? మీకు హాలిడేస్ ఇస్తారు. ఎక్కడికైనా వెళ్ళాలని మీకు అనిపించదా. అమ్మానాన్నలను మీరు రమ్మంటారు. వారికి కుదరదు. అప్పుడు మిమ్మల్ని పంపిస్తారు. వన్ మంత్ మీరిద్దరూ వెళ్ళారు. పక్కన వాళ్ళు వుండరు కదా. అయినా ఎంజాయ్ చేస్తారు కదా. ఇది కూడా సేమ్. దిసీజ్ మై వెకేషన్.”

​”నీకు మాటలు వచ్చు. బాగా వచ్చు.”

​”ప్రవాహా! మీకంటే బాగా రావు. నేను మీ అందరినీ ఇండియా రమ్మంటాను. అన్నీ వదిలేసి మీరు నా దగ్గరకు రాలేరు కదా. ఇవన్నీ నేను అర్థం చేసుకోకుండా మీ మీద కోపం పెంచుకుంటే నష్టం నాకే కదా. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాను కదా. ఇదే గొడవ. నథింగ్ దేన్ దట్.”

​”మయూరి మంచిదేనా?”

​”అదేంటి, మామ్ అనకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు. మయూరి నా డాటర్. డీసెన్సీ మెయింటెన్ చెయ్యండి.”

​”మీ డాటర్ మంచిదేనా అనాలనుకున్నాను.”

​”మంచిది. చాలా మంచిది. షి ఈజే గుడ్ గర్ల్. గుడ్ డాటర్. చాలా. గుర్తుంచుకోండి. స్మాల్ డిఫరెన్సెస్ వేరు. ఇక్కడ నన్నూ అడుగుతుంటారు. మీ గ్రాండ్ చిల్డ్రన్ నిన్ను చూడటానికి ఎప్పుడు వస్తారు. మీ డాటర్, సన్-ఇన్-లా ఎప్పుడు వస్తారు అని. వాళ్ళకు వీలు కుదరాలి. పిల్లలు చదువుకుంటున్నారు. వారికి కంపెనీలున్నాయి. వారికి మాత్రం అమ్మని చూడాలని వుండదా అంటాను. ఎవరి మీదా మనం కంప్లయింట్స్ చేయకూడదు. సెకండ్ థింగ్…”

“ఏంటి గ్రానీ?”

​”మన ఇంట్లో విషయాలు బయటకు చెప్పకూడదు. అలాగే ఎదుటివారి పర్సనల్ విషయాలు వినాలనుకోకూడదు. మంచి విషయాలు మాట్లాడుకోవాలి. అర్థమైందా అగన్యా-ప్రవాహలు?” అంది భువన.

​”ఊ… ఇప్పుడేం చేస్తున్నావు?”

​”చెప్పాను కదా. తీరిగ్గా కూర్చుని మీ గురించి ఆలోచిస్తున్నాను అని. మీరు ఫోన్ చేసినందుకు థాంక్స్. నేను వారానికి ఓసారి చేస్తాను. మీరు ఓసారి చేయండి. సరేనా?”

​”అలాగే. జస్టే మినిట్” అని ఫోన్‌లో కిస్ పెట్టింది. అగన్యకు ఇచ్చింది. తనూ ఇచ్చింది.

“నిజమైన కిస్ కావాలంటే అమెరికా రమ్మన్నారు. నేనూ అదే అంటున్నాను. మీ గ్రానీ హగ్ కావాలంటే ఇండియా రండి” అంది భువన.

​”బై గ్రానీ” అన్నారు ఇద్దరూ ఒకేసారి.

******

అదో రహస్య సమావేశం. కొద్దిమంది ప్రముఖులు అక్కడ వున్నారు. వారంతా వివిధ దేశాలకు చెందినవారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారు. అక్కడికి వచ్చినవారు ఎవరూ ఎవరికీ తెలియదు. పరిచయాలు వుండవు. అక్కడ పనులన్నీ మెకానికల్‌గా జరిగిపోతుంటాయి.

ముందుగా వారికి సమాచారం అందుతుంది. ఎవరికి వారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఓ చోట దిగుతారు. తర్వాత ఆ దేశం నుండి ఎటు తీసుకువెళ్తారో తెలియదు. అది ఐలాండ్ కావచ్చు. అరణ్యం కావచ్చు. మరో ప్రాంతం కావచ్చు. అక్కడికి అడుగు పెట్టేంతవరకు కూడా ఏమీ తెలియదు. అలాగని కళ్ళకు గంతలు కట్టరు. కార్లు ట్రావెల్ చేస్తుంటాయి. వాటికి నల్లటి అద్దాలు. డెస్టినేషన్‌కి చేరుకున్నాక కూడా అదే ప్రాంతమో తెలియదు. తిరిగి వెళ్ళటానికి ఎవరో టికెట్ బుక్ చేస్తారు. వారికి అంతకుముందు పెట్టిన ఖర్చులు రీ ఇంబర్స్‌ అవుతాయి.

అలాగే వారికి ఫండింగ్ వుంటుంది. అది ఏ రూపంలో అయినా వారికి అందుతుంది. దానిని వారు ఖర్చు చేస్తుంటారు. వ్యక్తుల మీద, సంస్థల మీద, రకరకాల రూపాల్లో. అరుదుగానే సమావేశాలు జరుగుతుంటాయి. 

అప్పుడూ, ఇప్పుడూ మనుషులు కలవరు. వారి ముందు ఓ ఛాంబర్ వుంటుంది. రకరకాల సిస్టమ్స్ వుంటాయి. వారు ఏ భాష మాట్లాడేవారయినా కావచ్చు. వారు చెప్పే మాటలూ, వినే మాటలు క్షణాల్లో అన్ని భాషల్లోకి ట్రాన్స్‌లేట్ అవుతుంటాయి. అన్నీ రోబోలు.

​అప్పుడు ఆరంభం అయింది సెషన్.

​”మనందరికీ తెలుసు. ప్రపంచం ఎప్పుడూ యుద్ధం అంచుల మధ్య వుంటుంది. అది ప్రపంచ యుద్ధంగా మారేంతవరకు దేశాల మధ్య జరుగుతుంది. అందుకు ఆయుధాలు, అణువులు, ఆయిల్, అంతరిక్షం, గోల్డ్, డ్రగ్స్… ఏవయినా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. వీటికంటే ప్రమాదకరమైన వెపన్స్ వున్నాయి. అవి పైకి కనిపించవు. ఫర్ సే లవ్. దిసీజ్ ఆల్సో వెరీ డేంజరస్ వెపన్.”

“లవ్ అనేది వైరస్. ఇది ఈస్థటిక్‌గా, రొమాంటిక్‌గా మనకు లిటరేచర్, సినిమా, ఇంకొన్ని ఆర్ట్ ఫామ్స్ ప్రజెంట్ చేస్తుంటాయి. లవ్‌లో క్రైమ్, హారర్, శాడిజం, డిస్ట్రాయ్, ఎలిమినేషన్ ఇన్ని మిక్స్ అవుతుంటాయి. ఇవి మామూలు మనుషులకే కాదు. ఇంటలెక్చువల్స్‌కి కూడా పూర్తిగా అర్థం కావు. అంత గొప్ప మిక్సింగ్స్ అవి. పేటెంట్‌కీ అందని పరిశోధనలు అవి. ఇన్ని వేల రంగులు, షేడ్స్ మనం చూస్తున్నాం. ప్రాథమిక వర్ణాలు మూడు. అవి కలిపితే వచ్చేదే రంగుల ప్రపంచం.”

​కొంత విరామం.

​”మనందరం ఎప్పటికప్పుడు ప్రపంచ పరిణామాలను, రానున్న ప్రమాదాలను పసిగట్టాలి. ప్రపంచమంటే మనుషులే కాదు. యంత్రాలు కాదు. సరిహద్దులు కాదు. ఇంతకుముందు చెప్పుకున్నవి కాదు”

ఓ ఊపిరి విడిచిన శబ్దం.

“మనిషి అంతరంగం! ఇంతకుమించిన అద్భుతం, ఇంతకుమించిన విధ్వంసకర ఆయుధం ఇంకోటి వుండదు. ఇది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతుంటుంది. ఇది ఇంట్రో కావచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్‌లోకి వద్దాం. రిలాక్స్ అవండి. జస్టే స్మాల్ బ్రేక్” అని వినిపించింది.

​అక్కడికి హాజరయిన వారిలో ఇండియన్స్ వున్నారు.

తిరిగి సమావేశం ప్రారంభం అయింది.

​”ఫ్యామిలీకి హెడ్ వుంటాడు. ఫ్యాక్టరీకి గాని, బిజినెస్‌కి గాని, సంస్థకు గాని, సినిమాకు గాని హెడ్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? బాస్. అలాగే దేశానికి ప్రధానమంత్రి. అందరూ పనిచేస్తుంటారు. అప్పుడే ఏ వ్యవస్థ అయినా నడుస్తుంది. అలాగే ప్రపంచానికి కూడా బాస్ వుంటాడు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్!”

​అందరికీ చిరునవ్వుల శబ్దం వినిపించింది.

​”అయితే ఇది అంగీకరించరు. అంగీకరించేలా చేస్తాం. అందుకు అన్ని మెథడ్స్ ఉపయోగిస్తాం. అయినా ఎప్పటికప్పుడు ఈ కేంద్రాన్ని కూల్చే వైరస్‌లు పనిచేస్తుంటాయి. అవి విరుచుకుపడేదాకా ఆగితే మొత్తం మ్యాన్‌కైండ్‌కి ప్రమాదం. అందుకే మొదట్లో ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేయాలి. ఏమంటారు?”

​అందరూ థంబ్ నెయిల్స్ పెట్టారు.

​”ఇది కొత్త వైరస్ కాదు. అది మనుషుల పుట్టుకతో వచ్చిందే. అయితే దాన్ని వైరస్‌గా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అదే అస్తిత్వ!”

​”ఇది ప్రారంభించింది మనమే కదా” అన్నారొకరు.

​”య్యా… అది మన చేతులు దాటే పరిస్థితి వచ్చింది. ప్రతి విధ్వంసానికి ఓ కేంద్రం వుంటుంది. అది నేలమాళిగల్లో వుండవచ్చు. అనేక రూపాల్లో వుండవచ్చు. ఇప్పటికే స్ప్రెడ్ అయి వుండవచ్చు. ట్విన్ టవర్స్‌ని కూల్చుతారని ఇంత గూఢచారి వ్యవస్థ వున్నవారు ఊహించారా? అందుకు కారణమైన వ్యక్తిని కనుక్కోవటానికి, తీసేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. అంటే మన నెట్‌వర్క్‌లో బలహీనతలు మనకు తెలుస్తున్నాయి కదా!”

​”అవును, అవును” అన్నారంతా.

​”ప్రపంచానికి పదేపదే అలాంటి ప్రమాదాలు రాకూడదు. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. అవర్స్ ఈజే స్మాల్ వింగ్. మిగతా విషయాలు మన బాస్‌లు చూసుకుంటారు. మనం రెండు రకాలుగా ఫైట్ చేయవచ్చు. ఒకటి డైరెక్ట్ ఫైట్. అక్కడ శత్రువు బలంగా లేకున్నా, ఫెయిల్ అయినా ఆ భావాలు వేగంగా చొచ్చుకుపోతాయి. వాటిని కంట్రోల్ చేయటం కష్టం. అందుకని రెండో మార్గం వుంది!”

​”దాన్ని వివరించండి.”

​”దేన్నయినా వార్ అందాం. వార్ విత్ ఇన్. అంటే మనిషిని రకరకాలుగా విభజిద్దాం. జెండర్ ఏదయినా కావచ్చు. ముందు వారిలో వారితో యుద్ధాన్ని క్రియేట్ చెయ్యాలి. వార్ విత్ ది ఫ్యామిలీ. కుటుంబంలో యుద్ధం మొదలు కావాలి. నేచర్‌తో వార్ మొదలవ్వాలి. అంతకుముందు బతకటం కష్టం కావాలి. బతకటం ఓ వైభోగం కావాలి. అందుకు వారికి సమయం వుండకూడదు. ఇందుకు ఎవరెవరిని ఎన్నుకుంటారో, ఏ భావాలను నాటుతారో మీకు తెలుసు. మరీ ముఖ్యంగా టార్గెటెడ్ పీపుల్ ఎవరంటే ఇంటలెక్చువల్స్. వారిని హైర్ చేయండి. వారిని అణువులుగా విడగొట్టండి. మీ అనుభవాలు పంపండి. మీకు ఫండ్స్, సూచనలు ఎప్పటికప్పుడు అందుతాయి. ఈ సమావేశం ముగిసింది” అని వినిపించింది.

​ఛాంబర్ గదులు ఓపెన్ అయ్యాయి.

******

మయూరి ఒంటరిగా వుంది. ఆమెకు వరుసగా ఇటీవలి సంఘటనలు గుర్తు వస్తున్నాయి. పిల్లల్తో గొడవ, సలీల్ వచ్చాక ఓ కొసదాకా తమ సంభాషణ జరగటం, చివరకు అతను కూడా విసుక్కోవటం. ఇంతకుముందు తనలో ఇంతటి కోపంగాని, ఎదురు తిరగటం గాని వుండేది కాదు. నిజానికి ఎవరన్నా ఏమన్నా అంటే తనలో తను కుమిలిపోయేది. బయటకు చెప్పుకునేది కాదు.

​ఇదంతా భువన గమనించి మెల్లగా బుజ్జగించి అడిగేది. అప్పుడు గాని మేఘాలు చల్లటి గాలి తగలగానే కురిసినట్లు ఆమె స్పర్శకు కదిలిపోయి చెప్పుకునేది. అప్పుడే భువన చెప్పింది.

​”మనుషులు సున్నితంగా వుండటం అవసరం. తోటి వారితో ప్రేమగా వుండాలి. పెద్దవాళ్ళంటే గౌరవం వుండాలి. నమ్రత వుండాలి. అలా అని ప్రతి విషయంలోనూ మెత్తగా, తప్పు చేసినట్లు వుండకూడదు. మనం ఎవరినీ ఓ మాట అనం. అనవసరంగా కామెంట్లు చేయం. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోం. కానీ ఎదుటివారు అది బలహీనతగా తీసుకున్నప్పుడు మాత్రం మనలో మనం కృంగిపోవటం కాదు. స్ట్రాంగ్ వుమెన్‌లా వుండాలి. ఫైట్ చేయటం నేర్చుకోవాలి. అసలు మనం సెపరేట్ వ్యక్తులమే. అయినా పది మందితో కలిసి బతుకుతున్నాం. మన సంతోషాలు, బాధలు పంచుకోవటానికి కొంతమంది మనకు కావాలి. ఇంటి నుండయినా, బయటి నుండయినా” అని.

​అందుకేనేమో అప్పట్లో నేను పెళ్ళి చేసుకోను. మీ దగ్గరే వుంటాను అనేది. అలాంటిది తర్వాతి కాలంలో తనలో చాలా మార్పులు వచ్చాయి. మొండితనం వచ్చింది. కోపం వచ్చింది. ఇప్పటికీ బయటివారి మీద అంత ప్రతాపం చూపించదు. ఎక్కడో ఫియర్ కాంప్లెక్స్ వుంటుంది. ఇప్పుడు స్వంత మనుషుల మీద అది ఎక్కువ అయింది. 

ప్రవాహ, అగన్యలను చూస్తే ఓ రకంగా సంతోషపడాలి. ఆ వయసులో ఎప్పుడూ అంత ధీమాగా తను మాట్లాడలేదు. అంత క్లారిటీతో కూడా! సలీల్ పిల్లలిద్దరితో ఏం మాట్లాడాడో తనకు ఇప్పటికీ తెలియదు. ఇద్దరూ వచ్చి సారీ చెప్పినప్పుడు ఓ క్షణం మనసు మూలిగింది. మీ సారీలు నాకు అవసరం లేదని వారి చేతులు నెట్టేయాలనిపించింది. అయినా పాత మయూరి బయటికి వచ్చింది.

​ఇప్పటికీ అంతుబట్టటం లేదు. ప్రవాహ, అగన్యలు సారీ చెప్పటానికి వెంటనే అంగీకరించారా? ఆ రాత్రి జరిగింది, ఉదయం సలీల్ అందరినీ దగ్గరకు చేర్చి మాట్లాడతాడు అనుకుంది. అప్పుడు మళ్ళీ రచ్చరచ్చ అవుతుంది అనిపించింది. అలాంటిది ఊహించని విధంగా రాజీ కుదిర్చాడు.

​ఇప్పుడు వారి గురించి పట్టించుకోవటం లేదు. వారి గదులను, ఫోన్లను, మనసులను సెర్చ్ చేయాలనిపించటం లేదు. అమ్మతో మాట్లాడుతున్నారా లేదా, జరిగిన విషయాలు ఆమెకు చెప్పారా? అందుకు అమ్మ ఎలా రియాక్టయింది ఇలాంటి ఆలోచనలు రావటం లేదు. 

ఇప్పుడు ఒకటే ఆలోచన.

“నేను తిరిగి ఈ ధోరణిలోకి వస్తానా? పిల్లల్ని అనుమానిస్తానా? అంటే అమ్మ అన్నట్లు నాలో ఏదో మార్పు వచ్చింది. తను సైకియాట్రిస్ట్‌ను కలవమంది. సలీల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను తెలుసుకోమన్నాడు. రెండూ ఒకటే” అనుకుంది.

​అప్పుడు గుర్తు వచ్చింది ఉదయం. డాక్టర్ ఉదయం.

తన కాలేజ్‌మేట్. ఆమె అమ్మానాన్నలు ఇద్దరూ ప్రోగ్రెసివ్ మూమెంట్స్‌లో పని చేసేవారు. ఇద్దరూ రకరకాల ప్రాంతాలకు తిరిగేవారు. వాళ్ళ అమ్మది మహిళా విభాగం. ఆమె స్వయంగా సైకిల్ మీద తిరిగేది. వాళ్ళ గురించి ఉదయం చెబుతున్నప్పుడు ఆసక్తికరంగా వినేది.

​ఉదయం నాన్నగారిని అరెస్ట్ చేసిన సందర్భాలు వున్నాయి. అప్పుడామె తల్లి ఉషా గారు బెంబేలు పడిపోలేదు. కన్నీళ్ళు పెట్టుకోలేదు. చిన్న చిన్న పనులు చేసేది. ఉదయంతో పాటు ఇంకో చెల్లి వుంది. వారిని చదివించేది.

​”చెల్లిని నువ్వు చూసుకో. మీరు గుర్తుంచుకోండి. అందరి అమ్మానాన్నలా మేం కూడా వుండాలనుకోవద్దు. మాకు మీ ఇద్దరూ మాత్రమే పిల్లలు కాదు. మాది జగమంత కుటుంబం అనుకున్నాం. మేం మీకు సమయం ఇవ్వలేం, ఆస్తులు ఇవ్వలేం, ఇవ్వగలిగింది చదువుని, ఆశయాన్ని. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి.”

​ఈ మాటలు ఉదయం మీద గాఢంగా ప్రభావం చూపించాయి. తను మెడిసిన్ చదవాలనుకుంది. అందుకు కష్టపడింది. అప్పుడే ఇద్దరూ దూరం అయ్యారు. అయినా సంబంధాలను కోల్పోలేదు. తను సైకియాట్రిస్ట్ కావాలనుకుంది. అదేంటి హార్ట్ గాని, మరొకటి గాని మంచి డిమాండ్ వుంటాయి కదా అని మయూరి అడిగింది.

​”మనుషుల మనసు పెద్ద ప్రహేళిక. ముందు ముందు సమస్యలన్నీ మానసిక భావనలతోనే. వాటికి ఎంత డిమాండ్ వుంటుందనేది నాకు అనవసరం. మా పేరెంట్స్ ఓ రకంగా సమాజం కోసం పని చేస్తున్నారు. నేను ఈ రంగాన్ని ఎన్నుకున్నాను” అంది ఉదయం.

​చెల్లి కూడా డాక్టర్ అయింది. తను ఇండియాలోనే వుంది. ఉదయం అమెరికా వచ్చింది. అందుకు కారణం ప్రేమ. ఓసారి ఇద్దరూ కలుసుకున్నారు. ఉదయం భర్త కూడా డాక్టరే. అతను హార్ట్ స్పెషలిస్టు. మెడిసిన్ చదువుతున్నప్పుడు పరిచయం. అలా దగ్గరయ్యారు.

​”సైకియాట్రిస్టులు కూడా ప్రేమిస్తారా?” అంది మయూరి సరదాగా.

​”నాది మెదడులో కలిగే కెమికల్ రియాక్షన్స్. తనది గుండె చప్పుడులో వచ్చే పరిణామాలు. అందుకని ఇద్దరికీ కలిసిందేమో!” అని ఉదయం నవ్వింది.

​అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు. ఓసారి అందరూ వారి ఇంటికి వెళ్ళారు. అలాగే వాళ్ళు వచ్చారు.

​ఇంత గొడవ జరుగుతుంటే తనకు ఉదయం గుర్తు రాకపోవటం ఏమిటి అనుకుంది. వెంటనే ఫోన్ చేసింది మయూరి. వెంటనే రెస్పాండ్ అయింది.

​”మయూ! ఎన్ని రోజులయింది మనం మాట్లాడుకుని!”

​”అది నా తప్పే. ఇప్పుడు అర్జెంట్‌గా నిన్ను కలుసుకోవాలి ఉదయా.”

​”ఎవరన్నా పేషెంట్‌ని రిఫర్ చేస్తున్నావా?”

​”అవును, ఆ పేషెంట్ పేరు మయూరి.”

​”జోక్ చేయకు” అంది ఉదయం నవ్వుతూ.

​”సీరియస్‌గానే!”

​”సరే. ఫ్యామిలీతో వస్తున్నావా?”

​”లేదు. ఒంటరిగానే వస్తున్నాను.”

​”ఓ.కే. ఎప్పుడు వస్తున్నావు? మనం తీరిగ్గా మాట్లాడుకుందాం,” అంది ఉదయం.

​”రెండు రోజుల్లో” అంది మయూరి.

​”వెల్‌కమ్” అంది ఉదయం.

******

​భువనకు పరిచయం అయిన వారిలో సరస్వతి ఒకరు. ఆమె కూడా ఇక్కడకు కొంతకాలం కింద వచ్చారు. ఆ రకంగా ఆమె సీనియర్. అప్పుడప్పుడు వాకింగ్‌లోనో, మరో సందర్భంలోనో ఎదురయినప్పుడు చిరునవ్వుతో చూసుకునేవారు. తర్వాత మాట్లాడుకున్నారు. ఒకరి గురించి మరొకరు చెప్పుకున్నారు. అయినా అంత దగ్గరితనం రాలేదు.

సుదర్శన్ వెళ్ళాక అడిగిందామె.

​”సుదర్శన్ సర్‌తో మీ రిలేషన్ ఏమిటి?”

​”మా హస్బెండ్‌కి ఫ్రెండ్. తర్వాత బిజినెస్ పార్ట్నర్. ఓ రకంగా నేను ఇక్కడకు రావటానికి కారణం సుదర్శన్ గారే” అంది భువన.

​”మాది కూడా బిజినెస్ భువన గారూ. నేను హోమ్ మేకర్‌గా వుండేదాన్ని. మాకు ముగ్గురు పిల్లలు. వారిని నేను దగ్గరుండి చూసుకున్నాను. మంచి చదువులు చదివించాం. గ్రాండ్‌గా పెళ్ళిళ్ళు చేశాం. అందరికీ ముందుగా ఆస్తులు పంచాం. నేను మనకంటూ ప్రత్యేకంగా ఎందుకు? అవన్నీ ముందు ముందు మనం చూసుకోవటం కష్టం. అయినా మన పిల్లలని ప్రేమగా పెంచుకున్నాం. వాళ్ళు కూడా మనల్ని ప్రాణంగా చూసుకుంటున్నారు అనేదాన్ని. మనం అన్ని రోజులూ ఒకేలా వుండాలి అనుకోవటం సరయింది కాదు అనేవారు. అసలు నాకు ఆస్తుల గొడవల గురించి ఏమీ తెలియదు భువన గారూ”

​భువన తలూపింది.

​”ఆయన బతికి వుండగానే ముసలం మొదలయింది. అందరికీ స్థలాలు, ఇళ్ళు ఇచ్చినప్పుడు వాటి ధరలు ఒకే రకంగా వున్నాయి. తర్వాత కొన్ని విపరీతంగా పెరిగాయి. అక్కడనుండి మీరు పక్షపాతం చూపించారు అని గొణగటం మొదలుపెట్టారు. తర్వాత వ్యాపారం మాకు కావాలంటే, మాకు కావాలన్నారు. అందులోకి మా అమ్మాయి కూడా చేరింది.”

​”సహజమే కదండీ.”

​”ఏం సహజం భువన గారూ. ముందుగా అమ్మాయి పెళ్ళి చేశాం. తనే పెద్దది. అప్పుడు ఒకే పిల్ల కదా అని ఎంత బంగారం పెట్టామో నాకు తెలుసు. మగపిల్లలకు బంగారం కొనాలని అనిపించేది కాదు. మంచి చదువులు చెప్పిస్తే వారే కొనుక్కుంటారు. కోడళ్ళు ఎటూ తెచ్చుకుంటారు కదా అనుకునేదాన్ని.”

​”మీ అమ్మాయి ఏం చదువుకుంది?”

​”గ్రాడ్యుయేషన్. మా వారు ఇంజనీరింగ్ చేయమని బలవంతం చేశారు. అయినా అది ఒప్పుకోలేదు. మగపిల్లలు బాగా చదివారు. తనేమో నా పెళ్ళికి ఖర్చు పెట్టాం అంటారు, వారి చదువులకు ఎంత ఖర్చయిందో లెక్కలు చెప్పండి అంటుంది. ఎవరు రాసుకుంటారు ఇలాంటి ఖర్చులన్నీ. అలా ఒక గొడవ కాదు. మేం ఎవరింటికి వెళ్ళినా మమ్మల్ని దోషులుగా చూడటం మొదలుపెట్టారు. అందుకని ఎవరి ఇంటికీ వెళ్ళకుండా మేం ఇద్దరమే వుండిపోయాం” అంది సరస్వతి.

​”అలాగా?”

​”ఇప్పుడు ముగ్గురికీ ఒకరంటే ఒకరికి పడదు. ఎవరింటికీ ఎవరూ వెళ్ళరు. మావారు వ్యాపారం ఎవరికీ ఇవ్వలేదు. అన్నీ అమ్మేశారు. మేం వుంచుకుంటాం అన్నారు. అవసరం లేదు. మీ కళ్ళముందే అమ్ముతున్నా అన్నారు. అందరికీ సమానంగా ఇచ్చారు. చివరకి మేం వుంటున్న ఇల్లు కూడా అమ్మారు. అదేంటి అన్నారు పిల్లలు. మేం బతికి వుండగానే మాకు నరకం ఎలా వుంటుందో చూపించారు. చచ్చాక ఈ ఇంటి గురించి గొడవలు ఎందుకు. మేం ఒకేసారి చనిపోలేం కావాలనుకున్నా. అందుకని నాలుగు వాటాలు వేశాను. మా వాటా మీద ఎవరికీ హక్కు లేదు. ఇది నా స్వంత సంపాదన. నేనో, నా భార్యో ఎవరు ముందుపోతే వారు బతకటానికి. మిమ్మల్ని రూపాయి అడగం. సిగ్గు శరం వుంటే ఈ రోజు నుండి మీరు మా దగ్గరకు రావద్దు అన్నారు.”

​”అంతవరకు వచ్చిందా?” అంది భువన.

​”ఇదేం వింత కాదు గాని-మావారు స్పష్టంగా చెప్పారు. మా తలలకు కొరివి పెట్టాలి కదా అని మీరు బ్లాక్‌మెయిల్ చేయాలనుకోవచ్చు. మీరెవరూ ఆ పని చేయనవసరం లేదు. అందువల్ల మాకు సద్గతులు కలగవు. నరకానికి పోతాం. ఈ నరకం కంటే ఆ నరకం అంత కష్టం కాదు అని. ఆయన పోయాక వచ్చారు. నేను మాత్రం మావారి చివరి మాటను గౌరవించాను. వారిని దగ్గరకు రానియలేదు. నలుగురూ నాలుగు రకాలుగా అనుకున్నారు. అవన్నీ నాకు అనవసరం కదా!”

​”ఇప్పుడు మీరు ఇక్కడున్న విషయం వారికి తెలుసా?”

​”అంత తీరిక వారికి లేదు. ఇప్పుడు ఒకరి మీద ఇంకొకరు కేసులు వేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మావారి ముందుచూపు వలన నేను ఇక్కడికి చేరుకున్నాను. ఇవన్నీ ఎందుకో మీకు చెప్పుకోవాలనిపించింది” అంది సరస్వతి.

​”మరో విషాద కథ” అంది భువన.

​”మీకు ఎంతమంది పిల్లలు?”

​”ఒకే అమ్మాయి!”

​”అయినా సమస్యలా?”

​”అలాంటిదేం లేదు. వాళ్ళు అమెరికాలో వున్నారు. అక్కడ నేను ఎంత ప్రయత్నం చేసినా ఎడ్జస్ట్ కాలేకపోయాను. ఇండియాలో పుట్టాను. ఇక్కడే చనిపోవాలనుకున్నాను. అందుకని వచ్చేశాను. మాకు ఆస్తుల తగాదాలు లేవు” అంది భువన.

​”అదృష్టవంతులు భువన గారూ” అంది సరస్వతి.

******

చంద్రశేఖర అజాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *