‘తెల్ల ఏనుగు’ పుస్తకం గురించి మాట్లాడేప్పుడు, అద్భుతమైన, అందమైన, విశేషమైన అనేమాదిరి పడికట్టు విశేషణాలు సరిపోవు, నా వరకూ ఈ పుస్తకం మొదలుపెట్టి, పూర్తిచేయడం రాతిమీద చెక్కిన ఆకృతి నిలిచిపోయేమాదిరి అనుభవం. సరదాగా ఒక ప్రయాణంలోనో, నిద్రరావడానికి మందుగా ఒక గంట అలవోకగా చదవగలిగే పుస్తకమనో చెప్పి నేను మిమ్మల్ని మోసగించను. ఈ పుస్తకంతో ప్రయాణించాలి, ఆ దారి నల్లేరుబండి నడకలా వెళ్లే దారి కాదు; ఒకసారి వేగంగా కదులుతాము, ఒక్కోసారి దుర్గమంగా ఉన్న దారిని చూసి వణికిపోయి కొంత ఓరిమితో ప్రయత్నం చేసి కానీ ముందుకి కదలలేం, ఇంకొంత దారి దాటి వచ్చేసిన అనుభవాన్ని మననం చేసుకుంటూ, మనకుమల్లే ఇటువంటి దారిలో నడిచిన ముందరితరాల బాగుఓగులు ఎంచుకుంటూ, నేర్చుకుంటూ మనల్ని శుభ్రపరచుకోవాల్సిన కథ. ముఖ్యంగా తెలుగు అనువాదంలో ఉపయోగించిన పదజాలం… ప్రతి పదం చాలా కచ్చితంగా, ఓపిగ్గా వెతుక్కు పేర్చితెచ్చినదిగా వుంది. ఆ స్పష్టత, ఆలోచనాత్మకత చదివే అనుభవాన్ని మరింత గొప్పగా చేసింది.
పుస్తకం పూర్తి చేసిన తర్వాత నాతో ఉండిపోయింది కథ మాత్రమే కాదు… ఒక అంతులేని అగాథపు లోతులనొప్పి. సామాజిక నిచ్చెనమెట్లలో వ్యవస్థీకరించబడి ఎదుర్కోవడానికి మనం తప్పుకునే అనాది వేదనకి నేర్పుగా, మెలకువగా చేసిన అటాప్సీ. మనలో చాలామందికి ఆ బాధ గమనంలో ఉంటుంది, ఆలోచనగల వ్యక్తిగా గుర్తిస్తాం కూడా. కానీ, నిజాయితీగా సహజరూపంతో ఆ వేదన స్వరూపం చూడగలగడం, ఎదుర్కోగలగడం అరుదు. ఈ పుస్తకం ఆ నొప్పిని కళ్లారా చూడమని నిలదీస్తుంది. ఆ డిమాండ్… మనతోనే ఉంటుంది. ఏదో మార్చేస్తుంది మనలో.
హిస్టారికల్ ఫిక్షన్ జాన్రా పై ఉన్న ప్రత్యేక ఆసక్తివల్ల మాత్రమే కాకుండా కథగా కూడా నన్ను కట్టిపడేసింది. కలోనియల్ అత్యాచారాల గురించి మనలో తెలియనివారు వుండరేమో – చరిత్ర పుస్తకాలేమీ!! నిన్న మొన్న అమితావ్ ఘోష్ వంటి వాళ్లు చెప్పిన ఓపియం యుద్ధాల కథలేమీ!! కాక పోస్ట్-కలోనియల్ ట్రామా గురించి రాయబడిన దేశదేశాల కథలైతేనేమీ!!. ఈ నవల ప్రత్యేకత ఏమంటే ఆ గాయాలను జెయమోహన్ ముద్ర ఐన నికార్సైన నిష్కాపట్యతతో చూపించడం. ఆ విషాద కాలపు నిజాన్ని అవసరమైనంత విశాలంగానూ కావలసినంత సన్నిహితంగానూ చూపించడం. భరింపశక్యంకానిదైనా ఈ అనుభవం అవసరమైనది.
మానవ సమానత్వంపై అచంచలమైన నమ్మకంతో ఇలాంటి రచన చేయడం అంత సులభం కాదు. ఈ కథకు ప్రత్యేకమైన texture ఆపాదించిన సంగతి, కథ చెప్పిన ప్రాంతం. స్వాతంత్య్రపూర్వపు ఉత్తర భారతం కథావేదికగా రకరకాల పార్శ్వాలను స్పర్శిస్తూ అనేకులు కథలు చెప్పారు, అది ఆనందమఠం కానివ్వండి, ఠాగూర్, ప్రేమ్‌చంద్ లే కాక శరత్ సాహిత్యంలో కూడా స్వాతంత్య్ర పోరాటపు ప్రస్తావనలెన్నో చూశాం. కానీ దక్షిణ భారతం వేదికగా నా పరిమితపు చదువులో ఇటువంటి పుస్తకం చదవలేదు. అట్లాగే అణగారిన వర్గాల అణచివేత కేంద్రంగా రాయబడిన సాహిత్యం నేను పెద్దగా చదవలేదు. ఇది నా లిమిటేషన్. అంబేద్కర్ గురించి కొంత తెలుసు అని మాత్రమే చెప్పగలను —ఆయన ఎందుకోసం నిలబడ్డారు, ఎలాంటి కష్టాలు సహించవలసివచ్చిందీ, అయినప్పటికీ ఈ దేశానికి ఏం ఇచ్చారు అన్న కృతజ్ఞత జన్మాంతరం వుండగలదు. అవిగాక కొన్ని రచనలు అంటరాని వసంతం, శరణ్ కుమార్ లింబాలే అక్రమసంతానం, పంచతంత్రం వంటివి మాత్రం చదివాను. ఈ రచనల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, కులం, వర్గం వ్యవస్థల లోటుపాట్లని ఎంత నిజాయితీగా బహిర్గతం చేశాయన్నది. వాళ్ళు చిత్రించింది passive discrimination కాదు; it was active suppression. ఆయా కాలాల్లో అధికారంలో ఉన్నవాళ్లు అందరూ తమ సామాజిక, ఆర్థిక, సంస్థాగత అధికారాలను ఒకే పరమఉద్దేశంతో ప్రయోగించారు Don’t let them rise. Not even a step.
ఇంత దుర్మార్గంతో నిండిన వ్యవస్థలను విమర్శిస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఆ విమర్శ తీవ్రతవల్ల సాధారణ పాఠకుడు పూర్తిగా వస్తువుకే దూరమైపోయే పోయే ప్రమాదం ఉంది. కానీ ఈ నవల ఆ పని చేయలేదు. చాలా జాగ్రత్తగా ఒక సమతూకపు నడక నడుస్తుంది. సత్యాన్ని ఎదుర్కొంటుంది, కానీ పాఠకుణ్ణి ఆ నిజానికి దూరం చేయదు. మనల్ని కదిలిస్తుంది, కలవరపరుస్తుంది, చేదుగా ఉన్నప్పటికీ అవసరమైన, సరైన ఆలోచనని మిగుల్చుతుంది. వ్యాధి ఇంత లోతుగా ఉన్నప్పుడు, ఔషధం కూడా కఠినంగా ఉండక తప్పదు కదా కీమో స్థాయిలో.
కథలో ఒకానొక ముఖ్యమైన సందర్భంలో కనిపించే లక్షచేతుల కరువు రాక్షసి గ్రాఫిక్ చిత్రణ నన్ను దాదాపు మౌనంగా చేసింది. ఆ సందర్భం చదివి తట్టుకుని నన్ను నేను కూడదీసుకోవడానికి చాలా సమయం పట్టింది. బహుశా ఒక చదువరిగా నా సెన్సిబిలిటీ కూడా దీనికి కారణం కావచ్చు, కానీ ఏ ఒక్కరైనా ఆ సన్నివేశాన్ని, సందర్భాన్ని కనీసం ఒక్కసారైనా కన్ను తడపకుండా దాటగలరంటే నేను నమ్మను. దీనికి మించిన నిస్సత్తువ కలిగింది, ఆ తర్వాత జెయమోహన్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు విని. ఆ కరువు గురించి తను రాసింది నిజానికి స్వల్ప పరిమాణంలో చూపించిన వెర్షన్ అని, అసలు జరిగిన దానికంటే చాలా తక్కువ స్థాయిలో రాశానని చెప్పినప్పుడు… నాకు మాటలు మిగలలేదు. కేవలం నిశ్శబ్దం.
***
ఈ పుస్తకంలోని కొన్ని సన్నివేశాలు నాతో ఎప్పటికీ ఉండిపోతాయి. ముఖ్యమైనది, మృతుల ఊరేగింపు. ఒక్కసారిగా అంతటి భావోద్వేగాన్ని భరించడం కష్టమైంది. మళ్లీ వెనక్కివెళ్లి కానీ చదవలేకపోయాను. అది దృశ్యపరంగా, భావోద్వేగపరంగా చాలా హాంటింగ్‌గా మిగిలిపోయే సన్నివేశం. కరువుకాలపు రోడ్లపై మరణం యొక్క విలయతాండవం ఎంత కలచివేసిందో ముందే మాట్లాడుకున్నాం.
ఆ తర్వాత ఆండ్రూ. ఎంత అద్భుతంగా రాసిన పాత్ర! అతని పాత్ర చిన్నదైనా, అతని స్వచ్ఛత, మనిషి కోసం అతని ఆర్ద్రత ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అతని పేరు కూడా ఒక సంకేతంలా అనిపిస్తుంది, ఒక నిశ్శబ్ద నివాళిలా. కథలో కొద్ది సమయం ఉన్నా, అతను పట్టుకొచ్చే భావోద్వేగపు వెల్లువ సమాయాతీతం. బహుశా ఆండ్రూ ఆ కాస్తసేపూ పాఠకుడి ప్రతిరూపంలా ఆ సన్నివేశంలోకి చొచ్చుకుపోయాడు… ఆ కరువుని చూస్తూ, ఆ తీవ్రత గ్రహిస్తూ, బాధపడుతూ, నిశ్శబ్దంగా అంతా గమనిస్తూ, గుండె చెదిరిపోతూ పాఠకుడికీ అతను చదువుతున్న అక్షరాలకూ మధ్య కట్టిన ఒక వారధి, ఒక సజీవ సాక్షి.
మరొక అరెస్టింగ్ ఇమేజ్ గవర్నర్ బంగ్లా… రాత్రిపూట దాని ఆడంబరం, వెలుగు నీడల గాంభీర్యం; పగటి వెలుగులో మాసిపోయినట్లున్న అదే బంగ్లా రూపం—ఇవన్నీ భ్రమ, సత్యం అనే నాణానికి రెండువైపులవంటి సంకేతంలా ఉన్నాయి. ఆ ద్వంద్వపు సింబాలిజాన్ని చాలా అందంగా చిత్రించారు.
ఇక ఇప్పుడు, ఆ తెల్ల ఏనుగు.
ఏమని చెప్పను, ఎంత గొప్ప మెటఫర్! ఆ తెల్ల ఏనుగు కథలో మామూలు కంటికి కనపడుతున్న ఖండాంతర ప్రయాణాలు చేసిన మంచుగడ్డా!? కలోనియల్ బ్యూరోక్రసీనా!? లేదా అంతకు మించి అధికార వ్యవస్థలకు సంకేతమా!? కాక ఒక మిథికల్ ప్రాణా!? సరే! మనం నిజంగా ఇప్పటికీ ఆ వైట్ ఎలిఫెంట్‌తో పోరాడుతున్నామా? లేదా అది కాలంతరాన నల్ల ఏనుగుగా మారిందా? మనవి అనుకుంటున్న సొంత వ్యవస్థల్లోనూ లోతుగా పాతుకుపోయిందా? ఎవరు ఎవరిని నియంత్రిస్తున్నారు!? ఈ ప్రశ్నలన్నీ పక్కనపెట్టినా అసలు ఈ తెల్ల ఏనుగు, దానిని నియంత్రిస్తున్నాం అనుకునే మావటి చూపిన దారిలో నడుస్తుందా లేక తెల్ల ఏనుగే తన మార్గం నిర్ణయించుకుని మనల్ని ఆ మార్గంలోకి లాగుతుందా!?
ఈ నవలలోని అతిగొప్ప ఐరనీ ఏడెన్ రిపోర్ట్ ఉపయోగించబడిన విధానం.
ఏడెన్ ఆ రిపోర్ట్‌ను తన శరీరం, హృదయం, మేథ అన్నిటికీ మించి తన ఆత్మతో సృజిస్తాడు. ఎన్నెన్నో రకాలుగా చెక్కి చివరికి తాను చూసిన వేదననంతా కొన్ని అంకెలుగా మార్చవలసిరావడం వల్లనే ఎంతో కలత చెందుతాడు. ఆ అంతర్గత సంఘర్షణ చాలా మానవీయమైనది, నిజమైనది. సత్యాన్ని అన్వేషించడానికీ, దొరికిన సత్యాన్ని సులభంగా అర్థం చేయించగల గణాంకాలుగా మార్చవలసిన బాధ్యతలో ఉన్న ప్రతీ జీవుడి వేదనే అది. అతను సత్యాన్ని చెప్పాలనుకున్నాడు, కానీ భావోద్వేగాలతో, మనస్సుతో సంబంధంలేని ఆబ్జెక్టివిటీలోకి నెట్టబడ్డాడు. అతను న్యాయం కోసం పోరాడుతున్నాను అనుకుని ఆ రిపోర్ట్ తయారుచేసాడు, కానీ ఆ రిపోర్ట్ చివరికి ఎందుకు ఉపయోగింపబడింది తెలిసి కూలిపోయాడు. అధికారులను మేల్కొల్పడానికి తయారుచేసిన నివేదిక, బ్యూరోక్రాటిక్ జస్టిఫికేషన్‌కు ఉపయోగపడడానికి మించిన ఐరనీ ఇంకెక్కడ చూడగలం. ఆ తెల్లఏనుగు తన స్వభావసిద్ధంగా, ఈ నివేదికను కూడా ప్రజల బాధల పట్ల మానవీయతతో స్పందించడానికి కాక, తన నిర్మాణాన్ని, సామ్రాజ్యాన్ని ఇంకాస్త పటిష్టంగా విస్తరించడానికి నిస్సిగ్గుగా ఉపయోగించుకుంది. ఇదంతా, వేదనపడ్డ, ఆకలితో అలమటించి, ఆక్రందించి, పట్టించుకునే నాథులు లేక రోడ్ల పక్కనే శవాలుగా మారిన ఆ మనుషులే పునాదులుగా!! మరెప్పుడో బకింగ్హమ్ కాలువనో, మరో గొప్ప నిర్మాణాన్నో చూసినప్పుడు మానవప్రతిభ ను చూసి కాక మానవ క్రౌర్యం గుర్తొచ్చి ఉలిక్కిపడి పడతానేమో!? ఇది షాకింగ్‌గా ఉందా? ఉండాలా? లేదా ఇది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొనసాగుతున్న చరిత్ర కాదా!?
ఈ కథలోని brutal brilliance ఇదే. అత్యంత నిజాయితీ నిండిన మానవప్రయత్నం కూడా ఈ వ్యవస్థీకృత తెల్లఏనుగు బంధనాల్లోకి చిక్కినప్పుడు మనిషికి ఇంకాస్త హాని కలిగించగల గొప్ప సాధనం అవగలదన్న హెచ్చరిక.
******
Aiden Byrne నాతో చాలాకాలం ఉండిపోయే పాత్ర. ఎంత వైరుధ్యాల కలబోత ఈ పాత్ర! మంచీచెడుల ద్వందాల్లోకి ఒదగని వ్యక్తి. సంక్లిష్టమైనవాడు. అతని భావోద్వేగాల, నైతికతల ఆర్క్ అసాధారణం.
ఒక సాధారణ సైనికుడిలా మొదలైన ప్రయాణం, లోకమేమీ పట్టనట్లు, తనని నియోగించిన విధులను ఏ ఆలోచనాలేకుండా నిర్వర్తిస్తూ. ప్రతినిత్యం జరిగే ఒకానొక సాధారణ దుర్మార్గపు చర్యని చూసినప్పుడు అతనిలో ఏదో మారుతుంది. ఆ క్షణం అతనిలో ఏదో నిప్పురవ్వ రాజుకుంటుంది. బహుశా ఈ సైనిక జీవితం లోకి అడుగుపెట్టేముందు, తన తండ్రితో వీడ్కోలు సమయంలో ఆ ఐరిష్ పెద్దమనిషి చెప్పిన చివరి మాటలను గుర్తుచేసుకున్నట్లున్నాడు. అప్పటి నుండి, ముఖ్యంగా కార్తవ రాయన్‌ను కలిసిన తర్వాత, అతని కళ్ళతో అణగార్చపడిన, పీడించబడుతున్న మనుషులవంటి తోళ్ళు మాత్రం కప్పుకున్న జీవితాలను జీవులను స్వయంగా చూసిన తర్వాత, వాళ్ల కష్టాలకూ, కన్నీళ్లకూ, కరువుకూ చలించి వాళ్ళనిగురించి వాదించే న్యాయవాదిగా తనను తాను నియమించుకుంటాడు.
ఇటువంటి ఒక మనిషిలోని అత్యంత ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే, ఏ కార్మికులకోసం అతను ఈ ప్రయాణం మొదలుపెట్టాడో వాళ్లే అతని మాట వినడం మానేసిన క్షణాన, అతని మానవత్వంలోని మనిషితనం బయటపడుతుంది. అతనూ తెల్లఏనుగులోని ఒక ముఖ్య పరికరంగా మారతాడు. భావోద్వేగాలు ముంచెత్తిన ఉత్త మనిషి అవుతాడు… ఇక అతను వారికి “రక్షకుడు” కాదు, అనిశ్చితీ, ఆవేశంతో నిండిన తన చర్యలనీ ప్రతిచర్యలనీ నియంత్రించలేని సాధారణ మనిషి. ఆ మనిషి సృష్టించగలిగేది విధ్వంసం మాత్రమే. ఏడెన్ లోని ప్రత్యేకత అతను ఆ అధమస్థాయిలో ఆగకపోవడం. తనను తాను నిప్పుతో కడిగినంతగా ప్రక్షాళన చేసుకుంటాడు, ఆ బూడిదకుప్పల్లోనుంచి ఫీనిక్స్ పక్షిలాగా పునర్జన్మ పొందుతాడు, ఈ ఏడెన్ కి ధర్మంస్వస్వరూరపు అవగాహన పూర్తిగా వుంది, ఈ ధర్మం తానే స్వయంగా తాదాత్మ్యం చెందిన నైతిక దిక్సూచి. ఎవరిచేతనో ఆరోపించబడింది కాదు.
******
చివరగా, ఈ పుస్తకం ఆ తెల్లఏనుగో లేదా ఈ నల్ల ఏనుగో, రెండూ అణగారిన వర్గాల జీవితాలను ఎలా భరింపశక్యం కానివిగా మార్చాయనే లోతైన ఆలోచనలను మిగుల్చుతుంది. ప్రశ్న ఏమిటంటే—ఎవరు ఎక్కువ హాని చేశారు? ఎవరు ఏ కాస్త అయినా సాయం చేయడానికి ప్రయత్నించారు?
ఈ ఆలోచనలు నాతో ఉండిపోతాయి. ఈ పుస్తకం సహానుభూతిని దాని అత్యుత్తమ రూపంలో చూపిస్తుంది.
ఏడెన్ ఒక నైతిక సంక్లిష్టతను తెస్తాడు. అతని పాత్ర ఆశను చిగురింపజేస్తుంది. అతను ప్రజలందరికీ సమాన స్థాయీ, గుర్తింపూ ఇచ్చాడు. వాళ్లను మనుషులుగా భావించేలా చేశాడు. గౌరవంగా, సహమానవులుగా చూశాడు. అది మానవత్వంపై కొంత నమ్మకాన్ని పునరుద్ధరిస్తుంది.
బహుశా అందుకే, చారిత్రకంగా, దళితులు ఈ తెల్ల వాళ్లను కొంచెం సురక్షితమని భావించారు. నలుపు, తెలుపు ఈ రెండు వర్గాలూ వాళ్ళ పట్ల అకృత్యాలు, దుర్మార్గాలూ చేసినప్పటికీ, బయటినుంచివచ్చిన ఆ తెల్లవాళ్లు కనీసం వాళ్లను మనుషులుగా గుర్తించారు. భారతీయ కుల వ్యవస్థ చాలాకాలం పాటు అలా చేయలేకపోయింది.
ఈ సత్యాన్ని మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు, వాళ్లు బ్లాక్ కంటే వైట్‌పై ఎందుకు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతుంది. ఈ కథ మొదలూ అక్కడే.
ఇంక జెయమోహన్ గురించి ఏమని చెప్పను?
ఆయనతో నా మొదటి పరిచయం చిలుకంబడి దధికైవడి, ఆ తర్వాత యాత్ర, ఇంకా చాలా రచనలు… ఎంత గొప్ప మనిషి! మానవత్వం పట్ల అచంచలమైన విశ్వాసం, ధర్మం పట్ల దృఢమైన నమ్మిక, ఆ ధర్మం వైపు మనిషిలో ఒక్క అడుగైనా మార్పు తీసుకురావాలనే అలుపెరగని ఆర్తి. ఆయన రచనలు చదవడం నాకు ఇష్టం. ఆయనకు ధర్మం పట్ల ఉన్న ప్రేమను నేను ఆరాధిస్తాను. ఇటువంటి రచయితను తెలుగు సాహిత్యంలోకి పరిచయం చేసి, తరచుగా తర్జుమా చేస్తున్న కుమార్ గారికీ, భాస్కర్ గారికీ మనఃపూర్వక ధన్యవాదాలు. ఒక్కోమాటా, ఒక్కో వాక్యం మళ్లీ మళ్లీ దిద్దుకుంటూ, తిప్పి రాస్తూ, సరైన పదం కోసం డ్రాఫ్టుని మళ్లీ మళ్లీ చిత్రికపడుతూ ఎంత పనిచేసారో తెలిసిన మనిషిగా వీరి అనువాదంపట్ల నాకు ఎంతో గౌరవం. ఇంత చేసినా చేస్తున్నది అనువాదమే కదా! అని లోకులు తీసిపారేయగలరని తెలిసీ అనువాదానికి వీరిద్దరూ ఇచ్చిన మర్యాద మీద ఇంకాస్త గౌరవం. తప్పులు వుండవనీ కాదు, అన్నీ ఒప్పులనీ కాదు; శ్రద్ధని మెచ్చుకోకుండా వుండలేక ముచ్చటతో ఈ చివరి రెండు మాటలూ. వెళ్ళిరండి మీరూ ఈ తెల్లఏనుగులోకంలోనికి.
డాక్టర్ సునీతా రత్నాకరం
జిందాల్ బిజినెస్ స్కూల్లో సీనియర్ అసోసియేట్ డీన్‌గా పని చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యం విరివిగా చదువుతారు. పుస్తక సమీక్షలు చేస్తారు.
