చింతచెట్టు కొమ్మల మధ్య చేరి పుస్తకం చదువుకుంటున్న రాజా గాలి మోసుకువస్తున్న పాటకు పక్కకు చూశాడు.
సైకిల్ పరుగులు తీసుకుంటూ వస్తోంది. మస్తాన్ తొక్కుతున్నాడు. ముందు సలీం కూర్చున్నాడు. ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ అని మస్తాన్ పాడుతున్నాడు. చెట్టు మీద నుండి ఆ దృశ్యం చూస్తుంటే రాజాకు మనసు పులకరించింది. విశాలమైన మైదానం. మధ్యలో
మస్తాన్-సలీంల ప్రయాణం. అది రాజా మనసులో ముద్రించుకుపోయింది.
“ఎప్పటికయినా నేను ఆ బొమ్మను గీస్తాను” అనుకున్నాడు. పాటతో పాటు మస్తాన్, సలీం, సైకిల్ మైదానం దాటి వెళ్ళిపోయారు. తిరిగి పుస్తకంలోకి తొంగి చూస్తున్నాడు.
“రాజా… రాజా” అని ఎవరో పిలుస్తున్నారు. అటు చూశాడు. శరత్ చింతచెట్టు దగ్గరికి వస్తున్నాడు. రాజా కిందకు దిగాడు.
“నువ్వు ఇక్కడ వుంటావని నాకు తెలుసు. ఎందుకని నీకు ఈ చింతచెట్లు అంటే అంత ఇష్టం” అడిగాడు శరత్.
“చెట్లు అంటే ఎవరికి ఇష్టం వుండదు. నీకు మన చింతచెట్లు అంటే ఇష్టం లేదా?” అన్నాడు రాజా.
“మన అనకు. ఇవి మోతుబరి రైతువి” అంటూ చూశాడు. రాజా చేతిలో పుస్తకం కనిపించింది.
“ఇదెక్కడిది. గ్రంథాలయం నుండి తెచ్చావా?”
“లేదు శరత్! ఇంతకుముందు మా ఇంట్లో చాలా పుస్తకాలు వుండేవి. అవన్నీ ఎవరు తీసుకుపోయారో తెలియదు. ఇది దొరికింది. ఇంకో రెండు మూడు పుస్తకాలు దొరికాయి. అందులో కథలు వున్నాయి. చాలా బాగుంటాయి.”
“చందమామ కథలా?”
రాజా కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత “ఇవి చందమామ కథలు కాదు. సోవియట్ పుస్తకాలు. పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం కూడా!” అన్నాడు.
“ఇందులో రాక్షసులు, భూతాలు, దయ్యాలుండవా?”
“అలాంటి పుస్తకాలు ఇంకా చాలా వున్నాయి. అవన్నీ నా దగ్గర లేవు. ఇందులో తొలి ఉపాధ్యాయుడి గురించి వుంది. ఇంకా ఈ కథల్లో పోప్లార్ చెట్లు వుంటాయి. రష్యా వాళ్ళు టీ తయారు చేసుకోవటానికి ‘సమోవార్’ అని వుంటుందంట. ఇందులో బొమ్మలు బాగుంటాయి. రష్యా వాళ్ళకి చెట్లన్నా, మైదానాలన్నా ఎంత ప్రేమో!”
శరత్ చల్లటిగాలి తమను తాకుతుంటే అన్నాడు “ఇంకొంచెం సేపట్లో వర్షం వచ్చేలా వుంది.”
అప్పుడు చూశాడు రాజా! దూరంగా మెల్లగా కదులుతున్న మేఘాల్ని.
“అవును శరత్! ఇంటికి వెళ్తాను. ఈ పుస్తకం తడిసిపోతుంది.”
“నీతో మాట్లాడదామని వచ్చాను. మన పసీ వాళ్ళు రేపు ఆటల పందెం అన్నారు. గోళీలు, బచ్చాలు, బొంగరాలు అంట. నువ్వు వస్తున్నావా?”
“వస్తాను” అని చేతి మీద వాన చుక్క పడటంతో పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయాడు రాజా!
******
వాన మొదలయింది.
మైదానమంతా పరుచుకుంటోంది. మబ్బులు పరుగులు తీస్తున్నాయి. మైదానం నాలుగు దిక్కులా రకరకాల ఇళ్ళు. దూరంగా పొలాలు. మధ్యలో రకరకాల చెట్లు. రాజా కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నాడు.
“ఏంటిరా చూస్తున్నావు?” అంది ప్రతిభ. తను రాజా అక్క.
“వానని చూస్తున్నాను. ఎంత బాగుందో!”
“అందులో తడవాలని లేదా?”
“ఉందక్కా! నాకున్నది రెండు జతల బట్టలు. తడిస్తే ఆరటానికి చాలా సమయం పడుతుంది కదా. అందుకని ఆలోచిస్తున్నాను.”
అప్పుడు ఇద్దరికీ మైదానంలోకి పరుగులు తీసుకుంటూ వెళ్ళిన పిల్లల బృందం కనిపించింది. ఆనందంగా గంతులు వేస్తున్నారు. పాటలు పాడుతున్నారు. అక్కా, తమ్ముడు ఒకరినొకరు చూసుకున్నారు.
“ఇలా అనుకోకుండా వాన వస్తే ఎవరో ఒకరు వస్తారంటారు” అంది ప్రతిభ.
“మన ఇంటికి ఎవరు వస్తారక్కా?”
“ఈ మైదానంలో వుంది మనం మాత్రమేనా?” అంది ప్రతిభ.
రాజా మాట్లాడలేదు. వాన పెద్దది అయింది. పిల్లలందరినీ వాళ్ళ అమ్మలు వచ్చి తీసుకువెళ్తున్నారు.
“కొంతవరకు తడిస్తే బాగుంటుంది. బాగా తడిస్తే జ్వరాలు వస్తాయి” అంది ప్రతిభ.
“అక్కా! నువ్వు స్తెప్ మైదానం గురించి చదివావా?”
“చదివాను. అసలు ఆ పుస్తకాలు దాచిందే నేను.”
“నాకు అవన్నీ చూడాలనుంది అక్కా!”
అప్పుడు తమ్ముడ్ని చిత్రంగా చూసింది.
“అది మన నాన్నకే కుదరలేదు. తను బతికివుంటే మనిద్దరినీ, అమ్మను తీసుకుని వెళ్ళేవాడు. వానలో తడవటమే మనకు కుదరదు. రష్యా వెళ్ళగలమా! అసలు మనం ఎంతకాలం చదువుకుంటామో మనకే తెలియదు. అందుకని అలాంటి వాటి గురించి కలలు కనకు. మన మైదానాన్ని స్తెప్ మైదానం అనుకో. మన చింతచెట్లనీ, వేప చెట్లను పోప్లార్ వృక్షాలు అనుకో.”
రాజా మాట్లాడలేదు. తలదించుకున్నాడు.
“రాజా! అసలు పుస్తకాలు ఎందుకు రాస్తారో తెలుసా? మనుషులందరూ అన్ని ప్రాంతాలకు, దేశాలకు వెళ్ళలేరు. రకరకాల జనాలను చూడలేరు. పుస్తకాలు చదివి ఊహించుకుంటారు. మనలాంటి పేదవారికి, ఎవరికయినా ఇమాజినేషన్‌ను మించింది లేదు!” అంది.
“అంటే?”
“ఊహ. కల్పన. మనం చూసేది వాస్తవం. ఇప్పుడు వానలో నువ్వు తడవలేదు. మన ఫ్రెండ్స్ తడిశారు. నువ్వు పాడని పాట ఇంకెవరో పాడతారు. నువ్వు వేయని బొమ్మ ఇంకెవరో గీస్తారు. అంటే అప్పుడు నీకు రకరకాల ఆలోచనలు వస్తాయి. అవే కల్పనలు. కల్పన వాస్తవం కంటే ఆనందాన్ని ఇస్తుంది.”
“నిజమే అక్కా… ఒక్కోసారి భయాన్ని కూడా ఇస్తుందా?”
“ఎందుకివ్వదు! బతుకు అంటే అదే!” అంది ప్రతిభ.
“నువ్వు టీచర్‌వా?”
“కాదు, నీ అక్కని. మన ఉపాధ్యాయులు వేరే వుంటారు!”
“ఇప్పుడున్నారు కదా?”
“మనకు పాఠాలు చెప్పేవారందరూ టీచర్స్ కాదు. నువ్వు తొలి ఉపాధ్యాయుడి కథ చదివావుగా. అంతకుముందు లేరా? అక్షరాలను నేర్పలేదా? మన జీవితంలో బతికి వున్నంతకాలం గుర్తించుకునే టీచర్స్ ఎప్పుడో దొరుకుతారు!”
“నీకు దొరికారా అక్కా?”
“లేదు రాజా! ప్రస్తుతం పుస్తకాలే నా టీచర్స్” అంది ప్రతిభ.
******
మధ్యాహ్నం ఆడవాళ్ళందరూ అక్కడ సమావేశం అయ్యారు. ఆ వీధిలో వరుసగా ఇళ్ళు వుంటాయి. స్వరాజ్యం మామ్మగారి ఇంటిలో రెండు పోర్షన్‌లు వుంటాయి. అలాగే ఖాళీ స్థలం వుంది. ఒకప్పుడు అక్కడ పశువుల కోసం ఓ పాక వుండేది. అందులో గేదెలు వుండేవి. స్వరాజ్యం గారి భర్త పేరు బుచ్చయ్య గారు. ఆయన చనిపోయి ఆరు నెలలు కావస్తోంది.
అంతకుముందే పశువులను అమ్మేశారు. ఆయనకు పొలాలున్నాయి. మొదటి భార్య చనిపోయింది. వారికి ఓ అమ్మాయి. తనకు ఎప్పుడో పెళ్ళి అయి వెళ్ళిపోయింది. విదేశాల్లో వుంటుంది. బుచ్చయ్య గారు అక్కడికి వెళ్ళి వుండలేరు. అందుకని స్వరాజ్యం గారిని చేసుకున్నారు. ఆమె వయసు కూడా అరవై సంవత్సరాలు దాటిపోయాయి. పిల్లలు లేరు.
బుచ్చయ్య గారి మరణం తర్వాత ఓ గదిని కట్టించుకున్నారు. అందులో వుంటారు. ఆ పోర్షన్‌ని అద్దెకు ఇద్దామనుకుంటున్నారు. ఎప్పుడు ఖాళీ దొరికినా రెండు మూడు ఇళ్ళ నుండి ఆడవారు వస్తారు. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటారు. అక్కడే పచ్చళ్ళు పట్టుకుంటారు. వారపత్రికలు తెప్పించుకుని చదువుకుంటారు.
రాజా వాళ్ళ అమ్మ మూడవ తరగతి వరకు చదివింది. అయినా పత్రికలు చదువుతుంది. స్వరాజ్యం మామ్మగారి గోడ పక్కన పూరి ఇంట్లో ఓ పోర్షన్‌లో వుంటారు. ఆ వీధికి అదే చివరి ఇల్లు. మిగతాది మైదానం. దూరంగా ఇంకో వీధి. వెనకాల మరో వీధి. గరువు మీద వ్యవసాయదారుల ఇళ్ళు వుంటాయి.
రాజా వాళ్ళ అమ్మ ఆ వారం సీరియల్ చదువుతోంది. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు వినిపించి ఆగిపోయింది.
అందరూ అటు చూశారు.
అక్కడ ఓ యువకుడు నిలబడి అందర్నీ చూస్తున్నాడు.
******
చారులత, ప్రతిభ మాట్లాడుకుంటున్నారు.
చారులత వాళ్ళు మామ్మగారి పోర్షన్‌లో వుంటున్నారు. వారికి ఓ హోటల్ వుంది. వాళ్ళమ్మ భిక్షావతి. నాన్న కోటేశ్వరరావు. రాజా, చారులత అయిదో తరగతి చదువుతున్నారు.
“అక్కా! మనకు కొత్త మాస్టారు వస్తున్నారంట” అంది.
“మనకా!” అంది ప్రతిభ.
“అవును. నిన్న వచ్చారంట. నేను పిల్లలకి ట్యూషన్ చెబుతాను. మీ పిల్లలను పంపిస్తారా అని అడిగారంట. అప్పుడేమో” అని చెప్పబోతుంటే…
“మా అమ్మ చెప్పింది చారూ! ఇక్కడ ఇంకా రత్నం అక్కయ్య గారి పిల్లలు వున్నారు. అందరూ ఆడపిల్లలు. మీరు ఎక్కడ వుంటారు. అంతదూరం ఆడపిల్లలను పంపటం కుదరదు అన్నారంట. ఇక్కడకు వచ్చి చెబుతాను. ఎవరి ఇంటి దగ్గర వారికి అన్నారంట. అప్పుడు మామ్మగారు ఇక్కడి పిల్లలందరూ బడి నుండి వచ్చాక ఆటలే ఆటలు. మైదానమంతా తిరుగుతుంటారు. ఓ పని చేస్తాను. మీరు ఇక్కడ హాలులో పాఠాలు చెప్పండి అన్నారంట.”
“అవునక్కా! మాస్టారు అద్దె ఇస్తానన్నారంట. అప్పుడు మామ్మగారు ఈ పోర్షన్ అద్దెకు ఇవ్వాలనుకున్నాను. వీళ్ళందరూ నా పిల్లలే. నాకు అద్దె వద్దు. ఇక్కడ పాఠాలు చెప్పండి. పిల్లలందరినీ మంచి పిల్లలుగా తయారు చేయండి అన్నారంట.”
అప్పుడు రాజా వచ్చాడు.
“అందుకని మీకు ఆటలు వుండవు. బాగా చదువుకోండి” అంది ప్రతిభ.
“అదేంటక్కా… నువ్వూ, రాజా ట్యూషన్ చెప్పించుకోరా?”
“మాస్టారికి వేరే ఉద్యోగం లేదు. ఆయన పాఠాలు చెప్పటానికి ఫీజ్ తీసుకుంటారు. దాంతోనే కదా ఆయన బతకాలి!”
“నాకు బాగుండలేదక్కా! నువ్వూ రాజా రావాలి. నువ్వు ఏడవ తరగతి. కనీసం రాజానయినా పంపవచ్చుగా!” అంది.
రాజా అక్కని, చారులతని చూస్తున్నాడు.
“వాడు బడికి వెళ్తున్నాడు. అక్కడ జాగ్రత్తగా వినాలి. ఏమన్నా తెలియకపోతే నేను చెబుతాను. ఫీజు కట్టడం మా అమ్మకు కష్టం” అంది ప్రతిభ.
“మా అమ్మా వాళ్ళని కట్టమంటాను.”
“అలా అడగవద్దు చారూ! అందరికీ అన్నీ కుదరవు. రాజా లాంటివారు మీ అందరితో పోటీ పడాలంటే రాజా కష్టపడాలి. అయినా అందరూ ట్యూషన్లు చెప్పించుకోలేరు.”
చారులత నిరాశగా వెళ్ళింది.
ప్రతిభ రాజాను చూస్తూ అడిగింది.
“నీకు బాధగా వుందా?”
“లేదు. మన దగ్గర డబ్బులు లేవుగా!” అని బయటకు వెళ్ళిపోయాడు.
******
మైదానంలో శరత్, రాధాకృష్ణ, రాజా ఇతర మిత్రులు కలుసుకున్నారు. అప్పుడు వారి దృష్టికి కొత్త మాస్టారి గురించి వచ్చింది. పసి అన్నాడు.
“ఇప్పటికే మేమంతా ట్యూషన్లలో చేరాం. వాళ్ళందరూ మన క్లాస్ టీచర్లు. ఈ పంతులుగారు అలా కాదు కదా!”
“ఎవరయినా అందరూ టీచర్లే కదా పసి” అన్నాడు రాజా.
“ఎలా అవుతార్రా! మన క్లాసు పంతుళ్ళయితే మనకు పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ముందుగా చెబుతారు. అలాగే మన పేపర్లు దిద్దేటప్పుడు మంచి మార్కులు వేస్తారు. అందుకేగా వారి దగ్గర ట్యూషన్ చేరేది.”
“అంటే మాస్టారింటి దగ్గర మీకు పాఠాలు చెప్పరా?” అన్నాడు రాజా.
“బడిలో చెప్పిందే పాఠం. మీరు చదవండిరా అంటారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత తలుపులు మూసుకుంటారు. మేము కబుర్లు చెప్పుకుని వరండాలో నిద్రపోతాం” అనగానే మిగతావారు నవ్వారు.
“రాధా! నువ్వు కొత్త మాస్టారి దగ్గర ట్యూషన్ చేరతావా?”
“ఏమో నాకు తెలియదు. ఇంటి దగ్గర ఏమంటారో?”
“ఈ కొత్త ట్యూషన్‌లో అందరూ ఆడపిల్లలుంటార్రా. పదండి, ఆడుకుందాం” అన్నాడు పసి.
******
కొత్త మాస్టారి ట్యూషన్ ఆరంభం అయింది.
ముందురోజు చారులత, విజయ, మరో ఇద్దరు అబ్బాయిలు చేరారు. అందరూ అయిదో తరగతి లోపువారు. వారం తిరిగేసరికి పదిమంది అయ్యారు. పిల్లలు కొత్త మాస్టారి గురించి మాట్లాడుకుంటున్నారు.
“ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. నాలుగు బడుల అక్షరాలు నేర్చుకోవాలంట.”
“క్లాసులోకి వచ్చేముందు ‘మే ఐ కమిన్ సర్’ అని అడగాలంట. వెళ్ళేటప్పుడు ‘ఐ యాం గోయింగ్ సర్’ అని చెప్పాలంట. ఇంకా ఏదన్నా డౌట్ వచ్చినా ముందు చెయ్యి పైకెత్తాలంట. ఒక్కొక్కరే ప్రశ్నలు అడగాలంట.”
“గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవెనింగ్, గుడ్ నైట్‌లు పేరెంట్స్‌కి, టీచర్స్‌కి, ఫ్రెండ్స్‌కి కూడా చెప్పాలంట. అలాగే మేనర్స్ నేర్పిస్తున్నారు. అన్నం తినే దగ్గర్నుండి, రోడ్ మీద ఎలా నడవాలి? టీచర్స్ లెసన్స్ చెప్పేటప్పుడు ఎలా వినాలి? ఇలాంటి ఎన్నో విషయాలు.”
ఇవన్నీ రాజా చెవిన పడుతున్నాయి. అతనికి పుస్తకాల్లో చదివిన తొలి ఉపాధ్యాయుడు, అక్క చెప్పిన గొప్ప ఉపాధ్యాయులు గుర్తుకు వస్తున్నారు. అతనికి మాస్టారి దగ్గర ట్యూషన్ చదివితే బాగుండును అనిపించింది. అంతలోనే అక్కా, అమ్మ గుర్తు వచ్చారు. మనసులో అలాంటి ఆలోచనను బలవంతంగా నెట్టేశాడు.
******
స్వరాజ్యం మామ్మగారి ఇంటిముందు మెట్లు వుంటాయి. అవి ఎక్కి లోపలికి వెళ్ళాలి. సాధారణంగా సాయంకాలం బడి అయ్యాక ట్యూషన్ మొదలవుతుంది.
ఆ సమయంలో రాజా మైదానంలో, చింతచెట్ల దగ్గర పరుగులు తీస్తుంటాడు. రకరకాల ఆటలు ఆడుతుంటారు. చింతచెట్లు ఎక్కుతారు. పాటలు పాడుతుంటారు. అలాగే రకరకాల కథలు ఎవరో ఒకరు చెబుతుంటారు. చీకటి పడేదాకా ఆటలు ఆడుతూనే వుంటారు. చివరకు వారి ఇళ్ళ నుండి ఎవరో ఒకరు వచ్చి పిలిచేదాకా ఆటలే ఆటలు.
అలాంటిది ఈ మధ్య రాజా ఆటలకు రావటం లేదు. స్వరాజ్యం మామ్మగారి ఇంటిముందు మెట్లమీద కూర్చుంటున్నాడు. లోపల నుండి మాస్టారి కంఠం వినిపిస్తుంటుంది. మధ్యలో పిల్లలు ఏవో అడుగుతుంటారు. అవన్నీ సగం సగం వినిపిస్తుంటాయి. చెవులు రిక్కిస్తాడు. ఇది గమనించింది ఇద్దరు. ప్రతిభ అక్క మొదటిది.
“ఎందుకురా మెట్ల మీద కూర్చుంటున్నావు. దొంగతనంగా పాఠాలు వింటున్నావా?”
రాజా మాట్లాడలేకపోయాడు.
“నీకు ఆటలంటే ఇష్టం కదా. అవన్నీ మానేశావు. నిన్ను ఆ మాస్టారు చూస్తే ఏమనుకుంటారు?”
“నేను అవన్నీ ఆలోచించలేదక్కా. అక్కడ చిన్న తరగతి పిల్లలున్నారు. ఆ పాఠాలు నేను చదివినవేగా!”
“మరెందుకు అక్కడ కూర్చోవటం?”
“మాస్టారి గొంతు వినాలనిపిస్తోంది అక్కా!”
అప్పుడు ఆశ్చర్యంగా చూసింది ప్రతిభ.
“ఆయన గొంతు బాగుంటుంది. అందులో ప్రేమ వుంది. మనం మాంత్రికుల కథలు చదువుకున్నాం. నువ్వు కూడా చెప్పావు. మాస్టారు మాటల మాంత్రికుడు. ఆయన పిల్లలకు చెబుతున్న పనులు నాకూ చేయాలనిపిస్తోంది.”
“రాజా! నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు. ఇంతకుముందు చెప్పాను. మాటలు, పాఠాలు అన్నింటికీ ఖరీదు వుంటుంది. ఆయనకు ఆ ఫీజులే కదా అన్నం పెట్టేది. ఇంటిని, బట్టలను ఇచ్చేది. ఇలా దొంగతనంగా వింటే బాగుంటుందా?”
“అక్కా… తప్పే. మాస్టారి ట్యూషన్ మొదలవగానే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇక్కడే కాదు మైదానంలో వున్నా. నాకు తెలియకుండా అడుగులు ఇక్కడికి తీసుకువస్తున్నాయి. ఇకనుంచి ఈ మెట్ల మీద కూర్చోను అక్కా” అన్నాడు.
“రాజా! ఇంతకుముందు ఏకలవ్యుడి గురించి చెప్పాను. ద్రోణాచార్యుడి గురువుగారి దగ్గర విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు. అక్కడ రాజుల పిల్లలకే విద్యలు నేర్పుతారు. అందుకని గురువుగారి బొమ్మను తయారు చేసుకుని, దండం పెట్టుకుని విలువిద్యని సాధన చేశాడు. అయినా గురుదక్షిణ ఇచ్చాడు.”
“అంటే ఏంటక్కా?”
“ఫీజు ఇవ్వటం. నువ్వు కూడా ఈ మాస్టారిని మనసులో తలుచుకుని పాఠాలు చదువు. ఎప్పుడో ఒకప్పుడు దక్షిణ ఇద్దువుగాని. అంతేగాని మెట్ల దగ్గర అలా కూర్చుంటే చూసేవారికి బాగుండదు” అంది ప్రతిభ.
ఇది జరిగిన రెండోరోజున ఓ విశేషం జరిగింది.
రాజా మైదానంలోకి వెళ్ళబోతూ మామ్మగారి మెట్ల దగ్గరకు వచ్చాక ఆగిపోయాడు. లోపల నుండి మాస్టారి కంఠం వినిపిస్తోంది. ఆయన ఇంగ్లీష్‌లో ఏదో చెబుతున్నారు.
“మనం అన్ని భాషలూ నేర్చుకోవాలి. దాంతోపాటు సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ముఖ్యంగా మన తెలుగు. ఇంగ్లీష్ భాష కష్టం అనుకుంటారు. ఏ భాష అయినా మనసుపెడితే కష్టం కాదు.”
ఇంగ్లీష్ పదాలు అర్థం కావటం లేదు. మెల్లగా ఆ మాటలు వినిపించటం లేదు.
“ఎవరు నువ్వు? ఎందుకలా నిలబడిపోయావు?” అని వినిపించింది.
ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా మాస్టారు. మొదటిసారి అతని కళ్ళల్లోకి చూశాడు రాజా.
“నేను వెళ్ళిపోతాను సర్.”
“ఇంతకుముందు మెట్లమీద నువ్వు కూర్చోవటం చూశాను.”
“అది తప్పే అని అక్క చెప్పింది.”
“నీకు ట్యూషన్‌కి రావాలనుందా?”
తల నిలువుగా, అంతలోనే అడ్డంగా వూపాడు. “లేదు లేదు” అన్నాడు కంగారుగా.
“రేపటినుండి నువ్వు ట్యూషన్‌కి రా” అన్నాడాయన గంభీరంగా.
“కానీ… ట్యూషన్ కంటే” నసుగుతున్నాడు.
“అవన్నీ నీకు అనవసరం. రేపు వస్తున్నావు. సరేనా?” అని వెనక్కి తిరిగి లోపలకు వెళ్ళాడు మాస్టారు.
తనేం వింటున్నాడో అర్థం కావటం లేదు. ఇది కుదురుతుందా? ఇంకోపక్క వెర్రి ఆనందంగా వుంది. ఇంట్లోకి పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు.
“అక్కా, అక్కా!” పిలిచాడు.
“సరుకులు తీసుకురావటానికి వెళ్ళింది రాజా” అంది అమ్మ.
బయటకు వచ్చాడు. మైదానంలో పరుగులు తీస్తున్నాడు. రెండు చేతులూ చాచాడు. అవి రెక్కల్లా కనిపిస్తున్నాయి. అలా గాల్లోకి ఎగిరిపోతున్న భావన కలిగింది. మిత్రులందరూ ఏమైపోయారో తెలియదు. అలా చింతచెట్టు దగ్గరికి వచ్చాడు. దాని మీదకు ఎక్కాడు.
“నా పోప్లార్ వృక్షమా… మాస్టారు నన్ను పిలిచారు. నన్ను ట్యూషన్‌కి రమ్మన్నారు. మాస్టారి చేతులు అందుకుని స్తెప్ మైదానంలో పరుగులు తీస్తున్నట్లు వుంది. ఇప్పుడు నా దగ్గర సమోవార్ వుంటే మాస్టారికి తేనీరు ఇచ్చేవాడిని” అంటున్నాడు.
“ఎవరు నువ్వు” అని వినిపించింది.
ఉలిక్కిపడి చూశాడు.
“వెంకయ్య కాదులే భయపడకు. నేను ఇంకా కాయటం మొదలుపెట్టలేదు. అప్పుడు కదా మా మొదట్లో ముళ్ళు నింపుతాడు. ఆ రోజులూ దగ్గరకొస్తున్నాయి. ఏమన్నావు పోప్లార్ వృక్షమా! స్తెప్ మైదానమా!”
“నువ్వేనా మాట్లాడుతోంది?” అన్నాడు రాజా.
“నేనే… నీ చింతచెట్టుని మాట్లాడుతున్నా. ఇది మన మైదానం. పిల్లల మైదానం. ఈరోజు చాలా హుషారుగా వున్నావు. నాకూ సంతోషంగా వుందిలే. బాగా చదువుకో.”
రాజా చింత చెట్టుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు గుర్తు వచ్చింది. చెట్టు దిగి చారులత దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు. బయట కనిపించింది.
“చారులతా! ట్యూషన్‌లోకి అడుగు పెట్టేముందు మాస్టారిని ఏమని అడగాలి?”
“మే ఐ కమిన్ టీచర్?”
“ట్యూషన్ అయిపోయాక?”
“ఐయామ్ గోయింగ్ సర్. గుడ్ ఈవెనింగ్” అని…
“ఎందుకు అడుగుతున్నావు రాజా?”
“చెబుతాలే… థాంక్స్” అని పరుగు తీసుకుంటూ వెళ్ళాడు మైదానంలోకి.
******
రాత్రి రాజా, ప్రతిభ కూర్చున్నారు. అమ్మ స్వరాజ్యం గారి దగ్గరకు వెళ్ళింది.
“మాస్టారు నన్ను ట్యూషన్‌కి రమ్మన్నారు. ఇంకా నమ్మాలనిపించటం లేదక్కా!”
“అసలు నీకు ట్యూషన్ ఎందుకురా… నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఏది కష్టం?” అడిగింది ప్రతిభ.
“నాకు కథలంటే ఇష్టం.”
“నేను అడిగింది సబ్జెక్ట్ గురించి.”
“నాకు లెక్కలంటే భయం అక్కా. అవి ఎప్పటికీ నాకు రావనుకుంటాను. అలాగే సైన్స్ అన్నా కూడా ఇష్టం లేదు.”
“భయమా సైన్స్ అంటే?”
“అదేం కాదు. లెక్కలంటేనే భయం. తర్వాత తెలుగు ఇష్టం. అలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటే అనేక కథల పుస్తకాలు చదవొచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకివన్నీ అడుగుతున్నావు?”
“మీ మాస్టారు అందరి దగ్గర ఫీజ్ తీసుకుంటున్నారు. అంత మన దగ్గర తీసుకోకపోవచ్చు. కానీ ఎంతో కొంత ఇవ్వాలి కదా. మనకు నెలకు వచ్చేది డెబ్బై అయిదు రూపాయల ఆదాయం. ఇప్పటికీ కష్టంగా నెల గడుస్తోంది. అయినా అడగకుండానే మాస్టారు ఎందుకు నిన్ను రమ్మన్నారు?”
“అది నాకు తెలియదు. మెట్ల మీద నేను కూర్చోవటం చూశాను అన్నారు. అప్పుడు అనిపించిందేమో!”
“చూద్దాం. అయినా ఈ మాస్టారు మన దగ్గర ఎన్ని రోజులు వుంటారో తెలియదు కదా?”
“నాకు అర్థం కాలేదక్కా?”
“రేపు మీ మాస్టారికి మంచి ఉద్యోగం రావచ్చు. పదిమందికి పాఠాలు చెబితే ఎన్ని డబ్బులు వస్తాయి. మాస్టారికి కూడా ఓ కుటుంబం వుంటుంది కదా!” అంది ప్రతిభ.
రాజా దిగులుగా చూస్తుండిపోయాడు.
“అంతే కాదు రాజా! మాస్టారు ఎంతవరకు చదువుకున్నారో తెలియదు. ఎన్నో క్లాస్ వరకు ట్యూషన్ చెప్పగలరో తెలియదు. ఎందుకు చెబుతున్నానంటే ఇప్పటికే నువ్వు మాస్టారంటే ప్రేమను పెంచుకున్నావు. ఓ రకంగా దేవుడు అనుకుంటున్నావు. మన టీచర్స్‌ని మనం గౌరవించాలి. కానీ అది గురువయినా, అక్కయినా, అమ్మాయినా పిచ్చి ప్రేమను, అభిమానాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే ఎవరూ శాశ్వతంగా కలిసి వుండరు” అంది ప్రతిభ.
రాజా తలూపాడు.
“అయినా ఈ ట్యూషన్ కథ రేపు తేలిపోతుందిలే” అంది ప్రతిభ.
తర్వాత అమ్మ వచ్చింది. స్వరాజ్యం గారు ఆమెతో మాట్లాడారు. మాస్టారు రాజాని మెట్ల మీద కూర్చోవటం చూశారు. అప్పుడు మామ్మగారిని అడిగారు ఎవరా అబ్బాయి అని. అప్పుడు రాజా వాళ్ళ గురించి చెప్పింది. వాడు మంచి అబ్బాయి. ఇంటి దగ్గర తిని వెళ్తాడు కాబట్టి బడికి పంపుతున్నారు. ట్యూషన్ చెప్పించటం కష్టం అని. నేను అతనికి ఉచితంగా ట్యూషన్ చెబుతాను అన్నారంట.
“మీరు నాకు ఉచితంగానే ఈ స్థలం ఇచ్చారు. నేను ఒక్కరికి ఫీజు లేకుండా చదువు చెప్పలేనా?” అన్నారంట. అందుకని రేపటినుండి రాజా మాస్టారి దగ్గరకు వెళ్తున్నాడు.
“అక్కా!” అని మెల్లగా పిలిచాడు రాజా.
“ఏంటిరా… ఇప్పుడు సంతోషంగా వుందా?”
“నువ్వు కూడా ట్యూషన్‌కి వస్తే బాగుంటుంది అక్కా!”
“నీలా నాకు లెక్కలంటే భయం లేదు. అయినా మాస్టారిని ఫ్రీగా నాకు ట్యూషన్ చెప్పమనటం బాగుండదు. నాకు ఇష్టం లేదు. ఇంక నిద్రపో” అంది ప్రతిభ.
******
రాజా ట్యూషన్ నుండి ఇంటికి వెళ్ళబోతుంటే మాస్టారు పిలిచారు.
“నీ పుస్తకాలు ఇంటిదగ్గర పెట్టిరా. నా రూమ్‌కి వెళ్దాం” అన్నారు.
రాజా తలూపాడు.
“ఈ రాత్రికి నువ్వు నా గదిలోనే వుంటావు. అక్కడే భోజనం చేద్దాం. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పిరా” అన్నారాయన.
రాజా ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు. అమ్మకి ఈ విషయం చెప్పాడు.
“అక్క ఈరోజు ఆలస్యంగా వస్తుందిరా” అంది. రాజాకు అర్థం అయింది. ప్రతిభ ఎన్.సి.సి. లో వుంది. వాళ్ళు డ్రిల్ చేస్తుంటారు. అప్పుడప్పుడు రైఫిల్ షూటింగ్ వుంటుంది. అదంతా అయ్యాక వారికి ఇడ్లీలో, దోశలో ఇస్తుంటారు. ప్రతిభ మిగతా పిల్లల్లా అక్కడ తినదు. ఇంటికి తీసుకువస్తుంది. మూడు భాగాలు చేస్తుంది.
“ఎందుకమ్మా అంత కష్టపడి చేస్తావు. ఆకలి అవుతుంది అక్కడ తినవచ్చు. ఇంటికెందుకు తీసుకొస్తున్నావు” అందోసారి అమ్మ.
“ఒక్కదాన్నే తినాలనిపించదమ్మా” అంది ప్రతిభ.
అప్పుడు అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది.
“మీరు ఎదుగుతున్న పిల్లలు. బడికి వెళ్ళేముందు రెండు ముద్దలు తింటారు. అది ఏమాత్రం సరిపోదని నాకు తెలుసు. బడి నుండి వచ్చాక మీకు పెట్టటానికి ఏమీ వుండవు. మళ్ళీ రాత్రికి కారం, మజ్జిగ మెతుకులు. నేను మీకు కడుపునిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను” అని కొంగుతో కళ్ళు తుడుచుకుంది.
“ఇందులో నీ తప్పు ఏముందమ్మా?” అంది ప్రతిభ.
అమ్మ మాట్లాడలేకపోయింది.
“మనలాంటి వారు చాలామంది వున్నారు. మేం కనీసం బడికి వెళ్ళగలుగుతున్నాం. ఆ అవకాశం లేనివారు ఎందరో వున్నారు. నువ్వు బాధపడకు. మనకి వున్నదాంట్లోనే ముగ్గురం పంచుకుంటే నాకు ఆనందంగా వుంటుందమ్మా.”
అప్పుడు చిన్న ముక్క తుంచుకుని “మీరు తినండి” అని వెళ్ళిపోయింది. అది గుర్తు వచ్చింది రాజాకి.
“నిన్ను ఎందుకు రమ్మన్నట్లు” అంది రాజా అమ్మ.
“తెలియదు” అన్నాడు.
రాజా వెళ్ళేసరికి మాస్టారు సైకిల్‌తో రెడీగా వున్నారు.
“ఇది కొత్తగా కొన్నాను. రోజూ నడిచి వస్తున్నాను. నీకు సైకిల్ తొక్కటం వచ్చా?” అన్నారాయన.
“లేదు మాస్టారూ! మాకు సైకిల్ లేదు. నేను బడికి నడిచే వెళ్తాను.”
“మన సైకిల్ మీద నీకు తొక్కటం నేర్పుతాలే.”
“కిందపడితే పాడయిపోతుంది మాస్టారూ!”
“కింద పడకుండా హ్యాండిల్ వంకరపోకుండా సైకిల్ ఎలా వస్తుంది. నాకు మా మాస్టారు సైకిలింగ్ నేర్పారు. అప్పుడు ఎన్నిసార్లు కిందపడేశానో!”
“ముందు పాత సైకిల్ మీద నేర్చుకుంటే బాగుంటుంది కదండి.”
“అలాగే. వారానికోసారి అద్దెకు తీసుకుందాం.”
రాజా తలదించుకున్నాడు.
“అర్థమయిందిలే. నీకు సైకిల్ నేర్పిస్తాను మిగతావి నీకు అనవసరం. ఈ మైదానం నాకు బాగా నచ్చింది. ఈ ప్రాంతాన్ని ఏమంటారో నీకు తెలుసా?”
తల అడ్డంగా వూపాడు రాజా.
“కిసాన్ నగర్. అందుకే నేను ముందుగా మీ దగ్గరికి వచ్చాను. మనం ఈ మైదానంలో రెండు రౌండ్లు వేద్దాం” అన్నారాయన.
రాజాని ముందు కూర్చోబెట్టుకుని ఆయన తొక్కుతున్నారు. అప్పుడు మస్తాన్, సలీంలు గుర్తు వచ్చారు. సలీం తనకంటే చిన్నవాడు. మూడో తరగతి చదువుతున్నాడు.
రాజా మనసులో పాట మెదులుతోంది.
‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’
మాస్టారు మైదానం చుట్టూ తిరుగుతుంటే సైకిల్ మీద స్తెప్ మైదానంతో పాటు ప్రపంచాన్ని చుట్టి వస్తున్నట్లు అనిపించింది.
******
చిన్న గది.
ఓ మూలగా సూట్‌కేస్ వుంది. అందులో మాస్టారి బట్టలు వున్నాయి. ఒకటి రెండు అట్టపెట్టెలు వున్నాయి. అందులో పుస్తకాలు వున్నాయి. గోడ మీద రెండు ఫోటోలు వున్నాయి. వాటి దగ్గరకు తీసుకువెళ్ళాడు.
“మా నాన్నగారు” అన్నాడు.
రాజా నిశితంగా గమనించాడు. ఆయన కళ్ళల్లో ఏదో వెలుగు కనిపిస్తోంది. అంతకు మించినది ఏదో వుంది. పక్కన మాస్టారి అమ్మ ఫోటో వుంది.
“నీ పేరేంటి?” అడిగారాయన.
“రాజా” ఆశ్చర్యంగా చెప్పాడు.
“అది నాకు తెలుసు. నీ పూర్తి పేరు అడుగుతున్నాను.”
“రాజశేఖర్.”
“నా పేరు తెలుసా?”
“తెలియదు మాస్టారూ!”
“కుటుంబరావు.”
చిరునవ్వుతో తలూపాడు రాజా.
“మా నాన్న పేరు రాజేశ్వరరావు. నీ పేరు వినగానే మా నాన్న గుర్తొచ్చాడు. మీ నాన్నలానే మా నాన్న కూడా లేరు రాజా!”
“చనిపోయారా మాస్టారూ!”
“చంపేశారు” అన్నారు మాస్టారు. రాజా కళ్ళల్లో భయం పాకింది.
“కంగారుపడకు. ఈ ప్రపంచం మారాలి అన్నవాళ్ళను చాలా మందిని చంపేశారు. క్రీస్తుకి శిలువ వేశారు. భూమి గుండ్రంగా వుంది అని చెప్పిన వారికి చెవుల్లో సీసం పోశారు. మరి మీ నాన్న ఎలా చనిపోయారు?” అడిగాడాయన.
“మా నాన్నకు మొదటిసారి గుండెపోటు వచ్చింది. అప్పుడు డాక్టర్లు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి అని గట్టిగా చెప్పారు. అయినా నాన్న పార్టీ పనులు మానలేదు. రాత్రీ పగలూ ఊర్లు తిరుగుతూనే వున్నారు. నాన్న కమ్యూనిస్టు పార్టీలో పని చేసేవారంట.”
“నువ్వు మీ నాన్నను చూశావా?”
“చూశాను మాస్టారూ! రెండోసారి గుండెపోటు వచ్చింది. అప్పుడు హాస్పటల్లో వున్నారు. అప్పుడు నేనూ, అక్క నాన్న దగ్గర వుండేవాళ్ళం. పది రోజుల తర్వాత…” అని ఏడ్చేశాడు.
మాస్టారు సిగరెట్ వెలిగించారు.
కళ్ళు తుడుచుకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
“ఏంటి చూస్తున్నావు. సిగరెట్‌నా?”
“మా నాన్న కూడా సిగరెట్ తాగేవారు. డాక్టర్లు ఒక్క సిగరెట్ కూడా తాగవద్దు అని చెప్పారు. నన్ను ఓసారి ఒక్క సిగరెట్ అన్నా కొని తీసుకురా అని డబ్బులు ఇవ్వబోయారు. నేను తేనని నాన్న దగ్గరనుండి వెళ్ళిపోయాను మాస్టారూ” వెక్కుతున్నాడు.
మాస్టారు తన సిగరెట్‌ని కింద పడేసి తొక్కేశారు.
“మనుషులకు కొన్ని బలాలు, బలహీనతలుంటాయి రాజా!” అని ముఖం కడుక్కుని వచ్చారు.
“రాజా! నువ్వు మీ నాన్నను దగ్గరగా చూశావు. కొన్నిసార్లయినా చూశావు. కనీసం మీ నాన్నగారి ముఖాన్ని చూస్తే నీకు గుర్తు వస్తారు. నాకు అలాంటి అదృష్టం లేదు. చాలా చిన్న వయసులో చూశాను. ఇదిగో ఈ ఫోటో వుంది. ఇది చూస్తుంటే మా నాన్న ఇలా వుండేవారా అనిపిస్తుంది. అప్పట్లో ఫోటోలు కూడా తీయించుకునే వారు కాదు.”
“మా నాన్న కూడా అంతే మాస్టారూ…! ఆయన చనిపోయినప్పుడు తీసిన ఫోటో ఒకటే వుంది. అందులో నేనూ, అక్కా, అమ్మా, నాన్న వుంటాం.”
కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం.
“మా నాన్న మమ్మల్ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆంగ్లంలో అండర్ గ్రౌండ్ అంటారు. మీ నాన్న విషయంలో అలా జరిగిందా?”
“మా నాన్న అయిదారు సంవత్సరాలు జైల్లో వున్నారంట మాస్టారూ.”
“భయపడకు. కొన్ని విషయాలు మనం గుర్తించుకోవాలి. మా నాన్న మెడకు మేకులు కొట్టి లారీ బాయ్‌నెట్‌కి కట్టి గతుకుల రోడ్డు మీద కిలోమీటర్ల దూరం ఈడ్చి చంపేశారు.”
రాజా కళ్ళు మూసుకున్నాడు.
“ఇలాంటివి చాలా వున్నాయి. ఆ పని చేసింది పోలీసులు. వారికి అంత కసి వుండనవసరం లేదు. అలాంటి వారందరూ బతకటం కోసం పైవాళ్ళు చెప్పింది చేస్తారు. సరే, అవన్నీ పక్కనుంచుదాం. మీ నాన్నగారిని ఇలా హింసలు పెట్టి చంపలేదు గానీ బతికినంతకాలం నమ్మినదానికోసం పని చేసిన వారందరూ అమరవీరులే.”
చిన్నగా తలూపాడు.
“ఈరోజు మనం హోటల్లో భోంచేద్దాం… పద” అని బయటకు తీసుకువెళ్ళాడు. దారిలో తిరిగి ఆయన మాట్లాడారు.
“మన నాన్నలు మనకు పేర్లు పెట్టటంలోనూ వారి మనసులో కొన్ని ఆలోచనలు వుంటాయి. నా పేరు కుటుంబరావు అని ఎందుకు పెట్టారా అని అనుకునేవాడిని. తర్వాత అర్థం అయింది. ఇలాంటి వారందరూ కలిసినప్పుడు ఓ పాట పాడుకుంటారు. ‘జగమంత కుటుంబం నాది’ అనే పాట. ఒరేయ్ నాన్నా… నువ్వు పెద్దయ్యాక ఏమవుతావో నాకు తెలియదు. నేను వుండను. కానీ జగమంతా నీ కుటుంబమే అనుకో అని నాన్న నాకు చెబుతున్నట్లు వుంటుంది.”
“బాగుంది మాస్టారూ” అన్నాడు రాజా.
“మీ నాన్నగారు కూడా నిన్ను రాజాలా బతకాలని అలాంటి పేరు పెట్టి వుండరు. దాని వెనకాల ఏదో కారణం వుంటుంది. అది ముందు ముందు తెలుస్తుందిలే” అన్నారాయన.
ఇంటికి వచ్చారు.
“తర్వాత నేను బి.ఏ. చదివాను. అమ్మ మా దూరపు బంధువు దగ్గర వుంది. తొందర్లో ఇక్కడికి తీసుకువస్తాను. చదువు అయ్యాక ఏం చేయాలా అని ఆలోచించాను. ఏదొక ఉద్యోగం చేయాలని నాకు అనిపించలేదు. టీచర్‌గా వుండాలనుకున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో సైంటిస్టుల నుండి ఏ రంగంలో చూసినా వారిని తయారు చేసేది గురువే. అమ్మానాన్నల తర్వాత గురువే ఈ లోకానికి దేవుడు. అవునా!”
“అవును మాస్టారూ.”
“ఇంక నిద్రపోదాం. గుర్తుంచుకో రాజా… నువ్వు నా విద్యార్థివే కాదు. నా స్నేహితుడివి, నా తమ్ముడివి. మనల్ని డెస్టినీ కలిపింది!”
“అంటే ఏమిటి మాస్టారూ?”
“విధి అంటారు కదా! అది ఎందుకు కలుపుతుందో తెలియదు. నిన్ను మంచి మనిషిగా తీర్చిదిద్దాలి. అంటే మిగతా వారిని కాదు అని కాదు. మొదటిసారిగా టీచర్ అవతారం ఎత్తాను. నువ్వు నా తొలి విద్యార్థివి” అన్నారు మాస్టారు.
******
ట్యూషన్‌లో పిల్లలందరూ కుటుంబరావు మాస్టారిని చూస్తున్నారు.
“ఈరోజు మీ అందరూ వచ్చి వరుసగా మాట్లాడాలి. మన ట్యూషన్ గురించి మీరు చెప్పాలి. నేను చెప్పే పాఠాలు మీకు అర్థం అవుతున్నాయా? ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది?”
“అర్థం అవుతున్నాయి మాస్టారు” నలుగురు అన్నారు.
“అలా కాదు. ఇక్కడకు వచ్చి మాట్లాడాలి.”
“నాకు భయం సర్” అంది చారులత.
“రేపు మీ బడిలో వక్తృత్వ పోటీలు వుంటాయి. అప్పుడు మాకు భయం అంటే కుదరదు కదా! నేను కూడా మీకు పాఠాలు చెప్పేముందు చదువుకున్నాను. ఇంతకుముందు ఎవరికీ పాఠాలు చెప్పలేదు. నాకు కూడా ముందు భయం అనిపించింది.”
పిల్లలు చిన్నగా నవ్వారు.
“ఇప్పుడు చెప్పండి” అన్నారాయన.
ఎవరూ ముందుకు రాలేదు.
“రాజా! నువ్వు వచ్చి మాట్లాడు” అన్నారు.
తను బిడియపడుతుంటే రాజా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అందులో రకరకాల భావాలున్నాయి. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు.
“మాస్టారూ! మీరు పాఠాలు బాగా చెబుతున్నారు. కాకపోతే…”
“ఫర్వాలేదు. చెప్పు.”
“ఇంతకుముందు మేమందరం బాగా ఆడుకునేవాళ్ళం. సెలవు రోజుల్లో కూడా పాఠాలు వినాలి. హోమ్ వర్క్ చేయాలి. అప్పుడప్పుడు ఆటలు కూడా వుంటే బాగుంటుంది మాస్టారూ” అన్నాడు రాజా.
“ఇంకా?”
“ఇప్పటికి అంతే మాస్టారూ!”
“ఆటలేనా? పాటలు వద్దా?”
“అవి కూడా వుండాలి.”
“మీరు పాడతారా? వింటారా?”
అందరూ ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు.
“ఇకనుండి ఆదివారం మనకు పాఠాలు వుండవు” అన్నారాయన.
అందరి ముఖాల్లో సంతోషం కనిపించింది.
“కానీ క్లాసు వుంటుంది. మనందరం ఆటలు ఆడుకుంటాం. ఇందులో అన్ని రకాల ఆటలు వుంటాయి. ఆడపిల్లల ఆటలను మగ పిల్లలు ఆడాలి. మగ పిల్లల ఆటలను ఆడపిల్లలు ఆడాలి. అలాగే ఆడపిల్లలూ, మగపిల్లలూ కలిసి ఆడాలి. ఇందులో గెలిచినవారికి చిన్న చిన్న బహుమతులు వుంటాయి” అన్నారాయన.
ఆడపిల్లలు మాట్లాడలేదు.
“మాకు సిగ్గు. మేం మగ పిల్లల్తో ఆడం అంటే కుదరదు. అలాగే అందరూ పాడాలి. మాట్లాడాలి. మాకు పాటలు పాడటం రాదు అంటే కుదరదు. మీరందరూ ‘జనగణమన’ ‘వందేమాతరం’ గీతాలు పాడుతున్నారు కదా. అలాగే మీ స్నానాల గదిలో పాడుతుంటారు కదా. అప్పుడు సిగ్గుపడరు. అలాగే ముగ్గులు వేసేవారు, బొమ్మలు వేసేవారు, కథలు చెప్పేవారు ఇలా మనలో అందరూ మన సెలవు రోజున అందరిముందు తమకు వచ్చిన, నచ్చిన కళను ప్రదర్శించాలి.”
“డాన్స్ కూడా చేయవచ్చా మాస్టారూ” అడిగాడో అబ్బాయి.
“చెప్పాను కదా. ఏదయినా సరే. మళ్ళీ సోమవారం నుండి తిరిగి పాఠాలు, నోట్స్‌లు, హోమ్‌వర్క్‌లూ అన్నీ మామూలుగా వుంటాయి. ఏమంటారు?”
“అలాగే మాస్టారూ”
“ఇంక సెలవులు వస్తాయి. వేసవి సెలవులు. అప్పుడు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వుంటాయి. అవి తర్వాత చెబుతాను.”
“సెలవులకి ఊరు వెళ్తాం కదా మాస్టారూ!”
“వెళ్ళేవారు వెళ్తారు. ఇక్కడ ఎవరు వుంటే వాళ్ళందరం కలుసుకుంటాం. ఇప్పుడు అందరూ హ్యాపీసా” అన్నాడాయన. అందరూ తలలూపారు.













