తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉంటాయని నూరేళ్లకే శాశ్వతనిద్రను కోరుకున్న అతని ముత్తాత తరచూ లియోతో అంటూండేవాడు. అక్షరాలు నేర్పమని లియో ఆయన్ని మళ్లీమళ్లీ అడగ్గా, “నాకు ఇంతవరకే వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి,” అంటూ, ‘అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ’ అనే ఆరు అక్షరాలను రాసి చూపించాడు. అవి నిజంగానే గుండ్రంగా, వింతగా ఉన్నాయి! అప్పుడు లియో మరీ చిన్నవాడు. అయినా ఆ సంఘటన అతనికి బాగా గుర్తుండిపోయింది. కాస్త పెద్దయ్యాకనే, ముత్తాత చనిపోయాడు.
ముత్తాత ట్రంకుపెట్టెను అటక మీద నుంచి దింపడానికి, లియో అతని తండ్రికి సాయం చేశాడు. ఆ పెట్టెలో చెదలు తినెయ్యగా మిగిలిన రెండు పుస్తకాలు దొరికాయి. లియో వాటిని తీసుకోబోతూ ఉంటే, “నీకెందుకురా అవి? వెంటనే చెత్తలో పారెయ్యి! నిఘా విభాగం వాళ్లకు తెలిస్తే కొంపలంటుకుంటాయి,” అంటూ తండ్రి అతన్ని వారించాడు.
“అలాగే, నాన్నా! పారేస్తాను. కొన్నిరోజులు ఉండనీ, మీ తాతగారికి గుర్తుగా,” అని లియో బ్రతిమాలినప్పుడు తండ్రి కాదనలేకపోయాడు.
మరో రెండేళ్లకిగాని లియో మెదడులోని బాల్యపు ఛిప్ స్థానంలో పెద్దల ఛిప్ పెట్టరు. అందుచేతకూడా లియో తండ్రి, ‘పోనీలే, చిన్న పిల్లడు,’ అని ఊరుకున్నాడు. తరువాత ఆ సంగతే మర్చిపోయాడు. లియో అప్పుడప్పుడూ ఆ పుస్తకాలు తెరిచి పేజీలు తిప్పుతూండేవాడు. ముత్తాత నేర్పిన ఆరు అక్షరాలు అతనికి అక్కడక్కడా కనిపించాయి కూడాను! వాటి మీద తన చూపుడు వేలును ఉంచి, బిగ్గరగా – ‘అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ’ అంటూ పలికేవాడు. అవి ఆ పేజీల్లోంచి దొర్లి, రాలిపోతాయేమో అన్నంత గుండ్రంగా ఉన్నాయి! అటువంటి అక్షరాలు ఉండడం, అవి ఆ శబ్దాలను చెయ్యడం అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది.
అతని వద్దకు చేరిన రెండు తెలుగు పుస్తకాల్లోంచి అక్షరాలన్నీ జారిపడి, పేజీలన్నీ తెల్ల కాయితాలుగా మారిపోయినట్టుగా లియోకి పీడకలలు వచ్చేవి. ఈ సంగతి తండ్రికి చెప్పాలని అనుకున్నాడుగానీ, వాటిని పారెయ్యమంటాడని భయపడి, తల్లికి చెప్పాడు.
ఆమె, “మరో రెండేళ్లు ఓపికపట్టు. పెద్దల ఛిప్ అమర్చాక కలలే ఉండవు. కలంటే ఏమిటో మర్చిపోయాం,” అని నిట్టూర్చింది. లియోకి అర్థం కాకపోయినా ఆమె వైపు సానుభూతిగా చూశాడు.
“అసలు తెలుగుని ‘మాతృభాష’ – అంటే తల్లిభాష అనేవారుట, నీకు తెలుసా అమ్మా?”
“నేనెప్పుడూ వినలేదే?! నీకెవరు చెప్పారు?”అంది తల్లి కొంచెం గాభరా పడుతూ.
“ముత్తాతగారు చెప్పారు. ఆయనకన్నీ గుర్తే. ఆయన మెదడులో అసలు ఛిప్పే పెట్టలేదు!”
“అవును, డెబ్భై ఏళ్లు దాటినవాళ్లకి ఛిప్ పెట్టరు. అందుకే అతను వింతగా ప్రవర్తిస్తూండేవాడు; నిఘా పోలీసులంటే అతనికి చాలా కోపం. ఒఠ్ఠి తిక్క మనిషి!”
“అవునమ్మా, చివరిదాకా అతనికి కలలు వస్తూండేవి.”
“నీకెలా తెలుసు?”
“ఆయనే చెప్పాడు. కలలో అతనికి ముత్తవ్వ, ఎనిమిదవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన తాతగారూ కనిపిస్తూండేవాడు. నాతో చెప్పి చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు.”
“అందుకే కలలనేవి ఉండకూడదని ప్రభుత్వంవారు నిర్ణయించారు. ఈ పిచ్చి మాటలు చాలుగానీ, రేపటి పాఠాలు డౌన్‌లోడు చేసుకొని ఒకసారి చదువుకో,” అన్నది తల్లి.
లియో ఒక్క క్షణం కళ్లు మూసుకొని తన పాస్‌వర్డ్ – ‘రంగాచారి#2312’ – తలుచుకున్నాడు. అది అతని ముత్తాత పేరు, చనిపోయిన సంవత్సరం – పాతకాలపు క్రీస్తు శకం పద్ధతిలో. బయటకి, “రేపటి పాఠాలు,” అన్నాడు. అవన్నీ అతని బాల్యపు ఛిప్ ద్వారా మెదడులోకి చేరుకున్నాయి. అనవసరమైన పాత సమాచారం డిలీట్ అయిపోయింది.
లియో, అతని ముత్తాత, ఒకే గదిలో పడుకొనేవారు. ముత్తాత చెప్పిన కథలూ, పాతకాలపు సంగతులూ అన్నీఇన్నీ కావు. ఏది కథో, ఏది నిజంగా జరిగిన సంఘటనో లియోకి తెలిసేది కాదు. ఈ మధ్య ఎందుకోగానీ ముత్తాత ఎంతగానో గుర్తుకొస్తున్నాడు. అతడు ప్రేమగా తన తల నిమురుతూ చెప్పిన కబుర్లు, తనని నిద్రపుచ్చాలని చేసిన ప్రయత్నాలు, చివరి రోజుల్లో ముత్తాత అనారోగ్యం, అతని కోరిక మీదనే అతన్ని శాశ్వతంగా నిద్రపోయేలా చెయ్యడం పెద్దవుతున్న కొద్దీ లియోకి మరీ మరీ గుర్తుకొస్తున్నాయి.
ఆ రోజున లియోని అతని తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లనే లేదు. ముని మనుమడిని ఆఖరుసారి చూడాలని ముత్తాత పట్టుబట్టేడు. గత్యంతరంలేక అతని మంచం వద్దకు లియోని తీసుకొచ్చారు. లియోని చూడగానే అతడి మొహంలో సంతోషం వెల్లివిరిసింది. ముని మనుమడి చెయ్య పట్టుకొని, ఎంతో ఆప్యాయంగా,
“ఒరే అబ్బాయ్! నాకు అన్నీ ఙ్ఞాపకం వస్తున్నాయిరా!” అన్నాడు.
అతని ఉత్సాహం లియో తండ్రికి కూడా ఆశ్చర్యం కలిగించింది.
“అ – అమ్మ, ఆ – ఆవు, ఇ – ఇల్లు, ఈ – ఈగ, ఉ – ఉడత, ఊ – ఊయల ఇంకా చాలా ఉన్నాయి…”
“ఎక్కువగా మాట్లాడకూడదు తాతగారూ! డాక్టరుగారు వస్తున్నారు” అంటూ నర్సు అతన్ని వారించింది.
“డాక్టరుకాదు, యమభటుడు,” అంటూ ముత్తాత నవ్వాడు. ‘యమభటుడు’ అంటే ఏమిటో అక్కడున్నవాళ్లెవరికీ అర్థం కాలేదు.
“ఎ – ఎలుక, ఏ – ఏనుగు, ఒ – ఒంటె, ఓ – ఓడ,..,”అంటూ ముత్తాత ఉత్సాహంగా గుర్తు చేసుకుంటూ పోతున్నాడు.
లియో తండ్రి, నర్సుని పక్కకి పిలిచి, “ముసలాయనకి కొంతకాలంగా మతి భ్రమించింది. పోయేలోగా నా కొడుకుని చూడాలన్నాడు; తీసుకొచ్చి చూపించాం. ఆఖరి కోరిక తీరిపోయినట్టేగా? ఈ కార్యక్రమం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది,” అంటూ ప్రాధేయపడ్డాడు. ఈ సంభాషణ లియో సమక్షంలోనే జరిగింది.
“నేను డాక్టరుగారితో మాట్లాడతాను. మీ అబ్బాయి ఇక్కడ ఉండకూడదు. ఇంటికి తీసుకెళ్లిపొండి. అసలు మీరు కూడా ఉండనక్ఖరలేదు. ఇది రోజూ జరిగే తంతు,” అన్నదామె.
ఆ గదిలో ఒక్కడూ పడుకోవడం లియోకి కష్టం అయింది. ముత్తాత తరచూ కలలోకి వచ్చేవాడు – గుండ్రటి అక్షరాలు ముత్తాత చుట్టూ వలయాలుగా తిరుగుతూ కనిపించేవి. అవి పీడకలలో, మంచికలలో తేల్చుకోలేకపోయాడు లియో.
***
ఒక రోజున తండ్రికి నిఘా విభాగపు సందేశం వచ్చింది. లియోకి పెద్దల ఛిప్ అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభం అవుతున్నాయని దాని సారాంశం. లియోకి గాభరా వేసింది. అతని అమ్మా నాన్నలు ధైర్యం చెప్పారు.
“దీంట్లో భయపడాల్సింది ఏముంది? నువ్వు పెద్దవాడివి అవుతున్నావు. నీ పెద్ద చదువులకి అయ్యే ఖర్చులకు ప్రభుత్వం క్రెడిట్స్ ఇస్తుంది. చదువయ్యాక ఉద్యోగం చూసిపెడుతుంది. మరి కొన్నాళ్లకి నీకో అమ్మాయినికూడా వెతికి పెడుతుంది,” అంటూ తల్లి నవ్వింది.
లియోకి చిరాకనిపించింది. “నా బాల్యపు ఛిప్‌ని తీసేస్తారు…”
“అవును, దాని అవసరం ఉండదు,” అన్నాడు తండ్రి.
‘ఈ పెద్దవాళ్లతో మాట్లడడమే దండగ. ఎంత సేపూ వాళ్ల గోల వాళ్లదే,’ అనుకొని మౌనంగా ఉండిపోయాడు.
పెద్దల ఛిప్‌ని అమర్చే ముందు కొన్ని పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను బట్టి ఏమి చదవాలో, ఏ వృత్తిలోకి వెళ్లాలో నిర్ణయిస్తారు, ప్రభుత్వాధికారులు. అయితే అంతకు ముందు నాలుగు నెలలపాటు సర్వైవల్ ట్రెయినింగు తీసుకోవడం తప్పనిసరి. అందుకని లియోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్‌కి పంపాల్సిందిగా ఆదేశం వచ్చింది. ప్రయాణపు ఏర్పాట్లు, వసతి, భోజనం ప్రభుత్వ విభాగాలే అందజేస్తాయి. ఉపకారవేతనంకూడా ముట్టజెపుతారు. ఖర్చు, ఆదాయం, డబ్బు రూపేణా కాకుండా డెబిట్, క్రెడిట్‌లుగా వ్యక్తుల వర్చువల్ ఖాతాల్లో నమోదు అయిపోతాయి.
వాతావరణంలో మార్పులు, భూకంపాలు, వరదలు, అణుయుద్ధం, సైబర్ దాడులు, ఉల్కాపాతం, గ్రహాంతరవాసుల దాడులు – ఇటువంటివి సంభవిస్తే ఏమి చెయ్యాలి? మానవజాతి అంతరించిపోకుండా ఎలా కాపాడుకోవాలి? అనే అంశాలపై సర్వైవల్ ట్రెయినింగు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ట్రెయింగులో పాల్గొనాల్సిందే. అంతే కాదు, అయిదేళ్లకొక సారి పెద్దలందరూ రెండు నెలలపాటు మళ్లీ తర్ఫీదు పొందాల్సిందే.
***
లియో తల్లిదండ్రులు స్టేషన్‌కి వస్తామన్నారుగానీ అది అతనికి ఇష్టంలేదు. తండ్రి బయటపడకపోయినా, తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుందని లియోకి తెలుసు. మొదటిసారిగా పార్టికల్ ఏక్సెలరేటర్ టెక్నాలజీ (పాట్)తో నడిచే హై-స్పీడ్ ట్రెయిన్ ఎక్కాడు. నిజానికది అత్యంత వేగంగా పరుగెత్తే పాట్-ఏ కాదు; కేవలం గంటకి 500 కి.మీ. వేగంతో నడిచే పాట్-సీ. మరీ వేగంగా వెళ్లే రైళ్లల్లో కిటికీలోంచి ఏమీ కనబడదు; అంతా అలుక్కుపోయినట్టుగా ఉంటుంది. పాట్-సీ అయితే, ప్రకృతి, పొలాలు, ఊళ్లు కనిపిస్తాయి. ఇప్పుడంతా తక్కువ వేగంగా వెళ్లే రైళ్లనే ఇష్టపడుతున్నారు. పైగా డెబిట్స్ తక్కువ.
పెద్దల ఛిప్ అమర్చగానే, అతని పేరు ‘నాలుగు అక్షరాలు-ఎనిమిది అంకెలు’ అనే సిస్టంలోకి మారిపోతుంది. అక్షరాలకీ, అంకెలకీ మధ్య పురుషుడైతే ‘#’ స్త్రీ అయితే ‘@‘ చేరుతుంది. తమ లింగాన్ని ప్రకటించుకోవడం ఇష్టం లేనివాళ్లకి ‘-‘ ఉపయోగిస్తారు. తన పేరులోని నాలుగు అక్షరాలను ‘LEON’గా ఉంచమని తండ్రి దరఖాస్తులో అభ్యర్థించాడు. ముత్తాతకి కోపం తెప్పించిన విషయాల్లో ఇదొకటి. “వాళ్లెవరు, మనకి పేర్లు పెట్టడానికి?” అని గొంతు చించుకొని ఎగిరేవాడు. “మనలో మొగవాళ్ల పేర్ల చివర ఆచారి అని ఉండితీరాలి,” అని అతని వాదన.
ట్రెయిన్ కదిలింది. మరి కాసేపట్లో పొలాలు, గ్రామాలు, ఇళ్లు కనిపించసాగాయి. అరటి తోటలు, పొలాల గట్లపై పచ్చగడ్డి మేస్తూన్న ఆవులు…’ఇవేవీ ముత్తాతల కాలం నుంచీ, బహుశా ఎన్నో తరాల నుంచీ మారలేదు,’ అనుకున్నాడు. హఠాత్తుగా ‘అ – అరటి, ఆ – ఆవు, ఇ – ఇల్లు…’ ఙ్ఞాపకం వచ్చి అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ముత్తాత ఉండివుంటే పెద్దవాడిని అవుతున్నందుకు సంతోషించేవాడా? లేక ప్రభుత్వ వ్యవస్థల మీద విరుచుకుపడే వాడా?…ఏమో? బాల్యపు ఛిప్‌ని తీసేసినప్పుడు చిన్నప్పటి ఙ్ఞాపకాలు డిలీట్ అయిపోతాయి. ముత్తాతని మర్చిపోతాననే గ్రహింపురాగానే లియోకి పట్టరాని దుఃఖం కలిగింది. తన ఆలోచనలను మళ్లించుకోవడానికని కిటికీలోంచి బయటకు చూశాడు. పచ్చని పంట పొలాలు వెనక్కి పరుగుతీస్తున్నాయి. దూరంగా మనుషుల్లేని నల్లటి యంత్రాలు కోతపనిలో గబగబా కదులుతున్నాయి. అవి తెగ బలిసిన వింత పురుగుల్లా కనిపించాయి లియో కళ్లకి. మరి కాసేపట్లో కనుచూపు మేర అరటి తోటలు! గెలలతో నిండుగా!
ముత్తాత ‘అ’తో ‘అమ్మ’ అన్నాడని లియోకి గుర్తుకొచ్చింది. తనేమో ‘అరటి’ అన్నాడు! ఒక్క క్షణంలో అతనికి అర్థం అయిపోయింది! ఒకే అక్షరంతో ఎన్నో మాటలు ఉండవచ్చు! అక్షరాలను రకరకాలుగా కలుపుతూపోతే మాటలు, వాటిల్లోంచి వాక్యాలు, పుస్తకాలు పుడతాయి! బలే, బలే! అతని లోలోపల గుండ్రటి తెలుగు అక్షరాలంటే అవ్యాజమైన ప్రేమ ఏర్పడింది.
ఈ సంగతి తల్లికి చెప్పాలని లియోకి బలంగా అనిపించింది. కనీసం తను సమయానికి స్టేషన్ చేరుకున్నాననీ, ట్రెయిన్ బయలుదేరిందనీ చెబితే తల్లి పడే కంగారు తగ్గుతుందని అతనికి అనిపించింది. సీటుకి తగిలించి ఉన్న రిసీవర్ తీసి, తన వేలిముద్రను చూపాడు. ఇంటికి కాల్ వెళ్లింది. తండ్రి ఫోన్ ఎత్తాడు. ఆయన తన పద్ధతిలో ముక్తసరిగా మాట్లాడాడు. “చేరగానే మళ్లీ చెయ్యి,” అని పెట్టేశాడు. తల్లితో మాట్లాడలేకపోయినందుకు లియో నిరాశ చెందాడు. తనకో అన్నో, అక్కో ఉండి ఉంటే బాగుండేది అనిపించింది లియోకి. ఆ ఆలోచన అతనికే ఆశ్చర్యం కలిగించింది.
లియోకి ఎదురుగా కూర్చున్న యువకుడు, “మీ ఇంట్లోభాష తెలుగా?” అని అడిగాడు.
అతనికి సుమారు పాతికేళ్లు ఉండవచ్చు. అతని స్నేహపూరితమైన చిరునవ్వు, లియోని ఆకర్షించింది.
“అవును. ఇంట్లోభాష అనకూడదటగా? మాతృభాష అనాలని మా ముత్తాత చెప్పేవాడు.”
“మాతృభాష! ఆ మాట విని ఎంత కాలం అయిందో!? నువ్వు నీ మొదటి అడల్ట్ ట్రెయినింగ్‌కి వెళ్తున్నావా? నేను నా రెన్యూవల్ కోసం అక్కడికే వెళ్తున్నాను. నా పేరు మీర్,” అంటూ చెయ్యజాపి, కరచాలనం చేశాడు.
‘హమ్మయ్య! ఇతగాడికి అక్కడి పద్ధతులు బాగా తెలుస్తాయి,’ అనుకున్నాడు, లియో.
లియో, తనని వేధిస్తూన్న ప్రశ్నలను వెంటనే అడిగేశాడు. “ఛిప్ మార్పిడి కోసం జరిగే సర్జికల్ ప్రొసీజర్ చాలా నొప్పిగా ఉంటుందా? నా పేరు మారిపోతుందా?… లియో అని ఉండాలని మా నాన్న కోరిక.”
మీర్ నవ్వి, ఇప్పుడు సర్జికల్ ప్రొసీజర్ అవసరం లేదు; ఈ రోజుల్లో డెంట్ – అంటే డెడికేటెడ్ ఎక్స్‌టెర్నల్ న్యూరో ట్రాన్స్‌మిటర్ ఉపయోగిస్తున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను; ఎందుకంటే నేను ఛిప్-లెవెల్ డిజైనర్‌ని. ఇక నీ పేరంటావా? లియో బాగుందిగానీ, వాళ్లు ఏ పేరు పెడితే అది తీసుకోవడం ఉత్తమం. నువ్వు తెలుగు బాగా మాట్లాడుతున్నావు; మీ ముత్తాత గారు ఇంకా ఏమి నేర్పించారు?”
లియో తన ముత్తాత ఙ్ఞాపకాలను టూకీగా చెప్పి, “ఇంకా ఎన్నో విషయాలు ఆయన్ని అడిగి ఉండాల్సింది. అతనికి గుర్తుగా నా వద్ద రెండు తెలుగు పుస్తకాలు మాత్రమే మిగిలాయి,” అన్నాడు, బాధగా.
మీర్ అదిరిపడ్డాడు.
“తెలుగు పుస్తకాలా?! ఏమిటవి?”
“ఇవిగో, ఇవేమిటో నాకు తెలియదు,” అంటూ ఆ రెండు పుస్తకాలనూ తన బ్యాగులోంచి తీసి చూపించాడు.
మీర్ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది.
“ఓ మై గాడ్! ‘పెద్దబాలశిక్ష!’ వేమన శతకం!!’ ఐదేళ్లుగా వీటికోసం వెతుకుతున్నాను! అయినా వీటిని ఎందుకు తీసుకొచ్చావు? నిఘా పోలీసులకు పట్టుబడితే ప్రమాదం.”
“తెలుగు నేర్చుకుందామని. నీకు చదవడం వచ్చన్న మాట! నాకు నేర్పిస్తావా?”
“ట్రెయినింగులో అంత తీరికెక్కడ ఉంటుంది? డిజిటైజ్ చేసుకొని నీకిచ్చేస్తాను. నాకు కొన్ని వేమన పద్యాలు కంఠస్థం వొచ్చు,” అంటూ ‘వేమన శతకం’ తెరిచి, చదవసాగాడు –
ఉప్పు కప్పురంబునొక్క పోలికనుండు
చూడచూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ!”
లియో నిర్ఘాంతపోయాడు. అతనికి ‘ఉప్పు’ అనే మాట ఒక్కటే అర్థం అయింది.
“కప్పురంబు అంటే?”
“నాకూ తెలీదు. ఇక్కడి సందర్భాన్ని బట్టి చూస్తే అదికూడా ఉప్పులాగానే తెల్లగా ఉంటుందని ఊహించవచ్చు. పూర్వీకులు దాన్ని కూడా వంటల్లో వాడేవారేమో?” అన్నాడు మీర్.
వీళ్ల మాటలు మరో మూల కూర్చున్న ప్రయాణీకుడు శ్రద్ధగా వింటున్నాడని లియో గమనించాడు. మళ్లీ అటువైపు చూస్తే ఆ ప్రయాణీకుడు సీట్లో లేడు! టాయ్‌లెట్‌కి వెళ్లాడా? నిఘా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాడా? లియోకి భయం పట్టుకుంది. సరిగ్గా అప్పుడే యూనిఫాంలు వేసుకున్న ఇద్దరు నిఘా పోలీసులు లియో వైపుగా వస్తున్నారు. వాళ్ల వెనకాతలే ఇందాక మాయమైన ప్రయాణీకుడు!
లియో భయపడుతున్నాడని మీర్ గ్రహించాడు. లియో చెయ్య పట్టుకొని, “వాళ్ల వైపు చూడకు; ఏదో ఒకటి మాట్లాడు; పోనీ నేను మాట్లాడతాను, నువ్వు వింటూ ఉండు…ఒకటి గుర్తుంచుకో! సాహిత్యమే తెలుగుని కాపాడగలదు,” అన్నాడు.
నిఘా పోలీసులు లియోని దాటుకొని ముందుకి వెళ్లిపోయారు. ఆ దొంగచూపుల ప్రయాణీకుడు తన సీట్లో కూర్చొని కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు.
లియో, తడారిపోయిన గొంతుతో, “అదెలా సాధ్యం?” అన్నాడు.
“మరో రెండేళ్లలోపు నీకు అడల్ట్ ఛిప్ పెడతారా? అంతకు ముందుగానే నీ చదువు, నువ్వు చెయ్యబోయే ఉద్యోగం, నువ్వు పెళ్లాడబోయే అమ్మాయి ఇవన్నీ వాళ్లే నిశ్చయిస్తారు. ఉదాహరణకి నువ్వు సివిల్ ఇంజినీర్ కావడానికి తగినవాడివని పరీక్షల్లో తేలిందనుకో. ఫిలాసఫీ, ఆర్థికశాస్త్రం, సోషియాలజీ, ఆంత్రపాలజీ, సైకాలజీ,…ఇవేవీ నీకు అందుబాటులోకి రాకుండా నీ ఛిప్‌ని డిజైన్ చేస్తారు. అందరూ అన్నీ తెలుసుకోకూడదని వాళ్ల పాలసీ. ముఖ్యంగా భాషలు, సాహిత్యం, చరిత్ర ఎవరికీ అందుబాటులో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ఒక ప్రపంచం, ఒక భాష’ – అనేది ప్రభుత్వ విధానం – అదికూడా యూనికాం ప్రోటొకాల్. అన్ని శాస్త్రాలనూ సమగ్రంగా ఆవిష్కరించేది సాహిత్యం; సమాజం ఏ దారిన నడుస్తోందో తెలియజేసేది చరిత్ర! ఇదే వాళ్ల అసలు భయం. ఒక్క మాటలో చెప్పాలంటే కలలు, కళలు, చరిత్ర – ఇవే వాళ్ల కొంప ముంచుతాయి.
“ఇదంతా మారాలంటే?”
“నీ వయస్సువాళ్లే పూనుకోవాలి. పెద్దలంతా రోబోలే. వాళ్లెవరికీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేదు.”
లియోకి అంతా అయోమయంగా ఉంది. “నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి?”
“శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు!” అన్నాడు, మీర్ – నవ్వుతూ.
లియోకి అర్థంకాలేదని గ్రహించి, “నేను ఛిప్-లెవెల్ డిజైనర్‌ని అనేది మర్చిపోకు!”
లియోకి కొంచెం బోధపడింది; కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ట్రెయిన్ గమ్యస్థానాన్ని చేరుకోబోతున్నదనే అనౌన్స్‌మెంటు వినిపించింది.
బాగా ముందుకి వొంగి, తీక్షణంగా చూస్తూ, “భాష లేకపోతే సాహిత్యం లేదు; ఈ పెద్దబాలశిక్ష భాషాబోధిని అనుకోవచ్చు; వేమన శతకం మన సాహిత్యం. కళలు, సాహిత్యం ఉంటేనే సంస్కృతి నిలబడుతుంది,” అన్నాడు మీర్.
“సంస్కృతి అంటే?”
“మనం ఎవ్వరం అనేది మనకీ, పైవాళ్లకీ తెలియజేసేది సంస్కృతి.”
లియోకిది బొత్తిగా అర్థంకాలేదు. మీర్ నవ్వుతూ అతని భుజం తట్టి, “నెమ్మదిగా అన్నీ అర్థం అవుతాయిలే, కంగారుపడకు. ఈ రెండు నెలల్లోనూ కలుసుకుంటూ ఉందాం,” అని ధైర్యం చెప్పాడు.
“నువ్వు చెబుతున్నవన్నీ ఇంకెవరికీ తెలిసే అవకాశమే లేదా, మీర్?”
“ఎందుకు లేదు? చరిత్రకారులు, పరిశోధకులు, భాషావేత్తలు బహు కొద్దిమంది ఉంటారు. వాళ్లకి ప్రత్యేకమైన ఛిప్స్ అమరుస్తారు. చరిత్రనీ, భాషనీ, సాహిత్యాన్నీ ప్రభుత్వ అవసరాల మేరకు మార్చి, చిన్న మోతాదుల్లో అందజేయడం వాళ్ల పని. నిఘా విభాగం, వాళ్లని వెయ్యి కళ్లతో కనిపెడుతూంటుంది.”
తనని వేధిస్తూన్న సందేహాన్ని బయటపెట్టాడు లియో. “మహానాయకుడు నిజంగా ఉన్నాడా?”
“నాకు తెలిసి అటువంటి వాళ్లెవరూ లేరు. ఎయిడ్ జీ-మాస్ నెట్‌వర్క్ అంటే ‘ఏఐ డ్రివెన్ గ్లోబల్ మాస్టర్ నెట్‌వర్క్’ మనందర్నీ నడిపిస్తోంది. దాని చేతులలో మనమంతా బానిసలం.”
ట్రెయిన్ గమ్యం చేరుకుంది. ప్లాట్‌ఫాం నిండా సైనికులు; వాళ్లంతా మరమనుషుల్లా కనిపించారు లియోకి.
“పద, లోకల్ కమాండ్ సెంటర్‌కి రిపోర్ట్ చెయ్యాలి,” అంటూ మీర్ లేచాడు.
‘కప్పురంబు అంటే ఏమై ఉంటుంది? ఎవరిని అడగాలి? ఎలా తెలుసుకోవాలి?’ అనుకుంటూ, మీర్‌ని అనుసరించాడు, లియో.
జవాబులు స్వయంగా వెతుక్కోవాలనే ప్రగాఢమైన కాంక్ష అతని అంతరంగంలో స్థిరపడింది. అది ఎప్పటికై ప్రమాదకరమే – మొదట వ్యక్తులకీ, తరువాత వ్యవస్థకీ. ఈ సంగతి లియోకి తరవాతెప్పుడో తెలిసింది.
[గమనిక: ఈ కథలోని సంభాషణలు ఇంట్లో తెలుగు, యూనికాం ప్రోటొకాల్‌ల మిశ్రమంలో సాగాయి. గతకాలపు పాఠకుల సౌకర్యం కోసం క్రీ.శ. 2000ల నాటి పురాతన తెలుగు భాషలోకి అనువదించడమైనది].
9000601068












“భాష లేకపోతే సాహిత్యం లేదు; ఈ పెద్దబాలశిక్ష భాషాబోధిని అనుకోవచ్చు; వేమన శతకం మన సాహిత్యం. కళలు, సాహిత్యం ఉంటేనే సంస్కృతి నిలబడుతుంది.
౨ –
జవాబులు స్వయంగా వెతుక్కోవాలనే ప్రగాఢమైన కాంక్ష ఎప్పటికైనా ప్రమాదకరమే – మొదట వ్యక్తులకీ, తరువాత వ్యవస్థకీ.
ప్రస్తుతం మన ప్రయాణం ఆ దిశలోనే వున్నట్టుంది!