చైనా కవిత్వం గురించి మొదట గాలి నాసరరెడ్డి గారి దగ్గర విన్నాను. అప్పటికి ఆయన చైనా కవిత్వం తెలుగులోకి అనువాదం చేసి వున్నాడు. ఆయన అనువాదంలో చైనా కవిత్వం లోని సారళ్యత ముందుగా నన్ను పట్టుకుంది. ఆ తర్వాత జపనీయ హైకు సాహిత్యం ఆవహించిన పిదప కొన్నాళ్ళకి మరలా వాడ్రేవు చినవీరభద్రుడు గారు తమ వ్యాసాలలో చీనా కవిత్వ కాంతులు చూయించారు. ఆయన ఆ కవిత్వాన్ని గొప్ప పరవశంతో మనకు పరిచయం చేసే పద్దతి వల్లా, ఆ కవిత్వం అడుగు కనపడే ఒక స్వచ్ఛమైన శుభ్రజలంలా తోచడం వల్లా చీనా కవిత్వానికి ఆకర్షితుణ్ణి అయ్యాను.
అన్ని దేశాలకు గొప్ప సాహిత్య సంపద వున్నట్లే చైనాకూ గొప్ప సాహిత్య సంపద వున్నది. క్రీస్తు పూర్వం నుంచే ఎవరు రాసారో తెలియని వేల గీతాలు తరాలు దాటి, పరంపరగా వాటి ప్రాశస్త్యాన్ని నిలుపుకుంటూ వచ్చాయి. చైనీయ తత్వవేత్త కన్‌ఫ్యూషియస్ ( క్రీ.పూ. 551 – 479 ) వాటిని ఒక దగ్గర చేర్చి, 305 గీతాలతో షి చింగ్( Shih Ching – The Book of Classic Poetry ) గా సంకలనం చేసాడు. ప్రాచీన కాలం నుంచీ చైనీయ సంస్కృతిలో కళలు, సాహిత్యమూ అంతర్భాగంగా వుండడం వల్ల కూడా అక్కడ గొప్ప సాంస్కృతిక వైభవం పరిఢవిల్లింది.
చైనాలో తంగ్ రాజవంశ ఏలుబడిలో వున్న కాలాన్ని ( 618 – 905 ) సాహిత్యానికి స్వర్ఞయుగంగా చెపుతారు. ఈ కాలంలోనే లి బాయి ( 701 – 762 ), వాంగ్ వీ ( 706 – 761 ), దు ఫు ( 712 – 770 ) వంటి మహాకవులు జన్మించారు. ఆ కాలంలో రాజరిక ఆస్థానాలలో ఉద్యోగాలు, పదవులు పొందాలంటే ప్రభుత్వం నిర్వహించే పరీక్ష (జిన్షి)లో ఉత్తీర్ణులు కావలసి వుంది. దానికి కన్ఫ్యూషియస్ ఆలోచనా ధార, చైనా చరిత్ర, ప్రాచీన శాస్త్రాల ఔపోపన, పూర్వ కవిత్వ అధ్యయనం, కవిత్వం రాయడం మొదలయిన వాటిలో అభ్యర్థులు ప్రావీణ్యులై వుండాలి. అప్పటి చైనీయ మొదటి సామ్రాజ్ఞి వు జావో ( 624 – 705 ) ఆదేశాల ప్రకారం కవిత్వం అల్లడం ఒక ముఖ్యమైన నిబంధన కావడం వల్ల చైనాలో ఆబాలగోపాలానికి కవిత్వం అల్లడం ఒక విధిగా వుండేది. అందువల్ల చాలా చిన్నతనం నుంచే కవిత్వం అల్లడం ప్రారంభించిన దు ఫు తదనంతర కాలంలో కవిగా ప్రఖ్యాతుడైనా, అనివార్య కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయాడు. కానీ చైనీయ మహాకవుల్లో ఒకడిగా చరిత్రలో నిలిచిపోయాడు.
శతాబ్దాల తర్వాత కూడా పాశ్చాత్యుల దృష్టిని చైనీయ కవిత్వం ఆకర్షించింది. దు ఫు కవిత్వం పట్ల ఆసక్తి పెరిగింది. అనేక మంది పాశ్చాత్య విమర్శకులు, కవులు చైనీయ కవిత్వాన్ని అధ్యయనం చేసి, చైనీయ మూలాల నుంచే కాకుండా వివిధ మూలాల నుంచి చైనీయ కవిత్వాన్ని అనువదించి, వాఖ్యానాలు చేసారు. Kenneth Rexroth లాంటి అమెరికన్ కవిత్వ ప్రేమికుడు చీనా భాషను నేర్చుకొని, చీనా భాషా పండితుల సాయంతో చీనా కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసాడు. దీనిలో దు ఫు కవిత్వం అగ్రస్థానం వహిస్తుంది. One Hundred Poems from the Chinese అనే తన పుస్తకంలో ముందుమాట రాస్తూ “ దు ఫు కవిత్వానికి చీనా చరిత్రకారుడు, భాషావేత్త William Hung రాసిన గద్య అనువాదాల నుండి, జర్మనీ Erwin con Zach నుండి నేను కొంత సమాచారం సేకరించాను. చాలా సంవత్సరాలుగా ఈ కవిత్వం గురించి నా చీనా అనువాదకులతో, స్నేహితులతో చర్చిస్తూ వచ్చాను. అయినా ఆ తర్వాత కూడా ఈ కవితల్ని మూల కవిత్వంతో పోల్చుకుంటూ, నాకు తోచిన మార్పులు చేసుకుంటూ వస్తున్నాను” అన్నాడు. వాస్తవానికి ఇది Rexroth ఒక్కడి ఇబ్బందే కాదు. చైనీయ కవిత్వాన్ని అనువాదం చేస్తున్న అందరు అనువాదకులకు వర్తిస్తుంది.
చైనీయుల భాషని ( బహుశా మాండరిన్ ) ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఆంగ్ల పాఠకులకు కొన్ని పుస్తకాలు వున్నాయి. ఉదాహరణకు Zong- qi Cai లాంటి వాళ్ళు రాసిన How to Understand Chinese Poetry లాంటివి. అవి చైనీయ కవిత్వంలో ఛందస్సు, శైలుల గురించి వివరిస్తూ, భాషను ఎలా అర్థం చేసుకోవాలో, పదాలను ఎలా ఉచ్చరించాలో సవివరంగా చెపుతుంది. ఇది చైనీయ కవిత్వంలో సొగసును, వాటి మూల సారానికి దగ్గరగా, దాని అంతఃసౌందర్యాన్ని అనుభూతి చెందడానికి ఉపకరిస్తుంది. తెలుగులో మనకు ఇటువంటి ఉపయుక్తమైన గ్రంథాలు లేకపోవడం వల్ల మనం కఠినమైన చైనీయ భాష ఉచ్చారణలో అయోమయానికి గురవుతాము. అంతేగాక అనువాదకులు ఇచ్చిన ఆంగ్ల కవితల అనువాదాల ఆధారంగా మనం అనువాదం చేయడం వల్ల కూడా చైనీయ కవిత్వ మూల సారానికి, ఆత్మకు మనం కొంతైనా దూరంగా జరుగుతాము. ఇంకొక విషయం కూడా ఏమిటంటే వివిధ రకాలైన అనువాదకులు దు ఫు లాంటి కవి కవిత్వాన్ని తమ తమ పద్దతులలో అనువాదం చేయడం వల్ల, వాటి ఆధారంగా అనువాదం చేసేవారి తెలుగు అనువాదం కూడా, ఆయా ఆంగ్ల అనువాదంలోని నాణ్యతను అనుసరించే వుంటుంది. మూల చైనీయ భాషలో ఛందస్సుతో, కొన్ని పాదాలకు పాటించే అంత్యప్రాసలతో వుండే కవిత్వం అదే నాణ్యతతో, అదే శైలితో, అదే పద గాంభీర్యంతో ఇతర భాషలలోకి యధాతథంగా వచ్చే అవకాశం అతి తక్కువ. ఎందువల్లనంటే వ్యాకరణ, భాషా ప్రతిబంధకాలు, ఉచ్చారణ దోషాలు అడుగడుగునా ఎదురవుతాయి. చైనీయుల భాష, ఉచ్చారణ చాలా ప్రత్యేకమైనది కావడం, ఏక వర్ణ పదాలు ఎక్కువ వుండడం వల్ల, ఆ భాష మిగతా భాషలలోకి అంత తేలిగ్గా అనువాదానికి లొంగదు.
‘చైనా కవిత్వం’ పుస్తక రచయిత, అనువాదకులు దీవి సుబ్బారావు గారు చైనా భాష గురించి వివరిస్తూ ఇలా అంటున్నారు.” చైనా భాష చీనో టిబెటన్ భాషా కుటుంబానికి చెందినది. లిపి చిత్రలిపి. ధ్వన్యాత్మకం కాదు.ఇండో యూరోపియన్ , ద్రావిడ భాషలకున్న వ్యాకరణం చీనా భాషకు లేదు. వాక్యంలో పదానికి వున్న స్థానాన్ని బట్టి ఆ పదం ఏ భాషాభాగానికి చెందినదో నిర్ణయించబడుతుంది. అనగా ఒక పదం, వాక్యంలో గల స్థానాన్ని బట్టి క్రియ గానో, విశేషణం గానో, నామవాచకం గానో, మరొకటిగానో మారుతుంది. కాలాన్ని బట్టి క్రియలో మార్పు రాదు. అచ్చుల్లో హ్రస్వాలు, దీర్ఘాలు వున్నవి.ఒక్కోసారి స్వరం యొక్క హెచ్చుతగ్గులు బట్టి కూడా అర్థం మారుతూ వుంటుంది. “
చైనీయ స్వరాల ఉచ్చారణలో ట – ద గాను, ప – బ గాను, చ – జ/ఝ గాను పలకుతున్నారు. అంటే
టు ఫు (Tu Fu)ని దు ఫు (Du Fu ) గానూ, లి పొ ని(Li Po) లి బాయి( Li Bai ) గానూ, పొ చుయ్ (Po Chui )ని బాయి జుయ్( Bai Juyi) గానూ వ్యవహరిస్తున్నారు. ఈ ఉచ్చారణ అన్ని రకాల నామవాచకాలకూ వర్తిస్తుంది. ఆంగ్ల అనువాదకులు చైనీయ ఉచ్చారణను తమ దేశాల ఆంగ్ల ఉచ్చారణకు అనుగుణంగా మార్చుకున్నారు. ఉదాహరణకు Szu- ch’uan ను Szechwan గా, Pei- ching ను Pecking గా ఉచ్చరించడం. నా ఈ అనువాదంలో కూడా అనేక ప్రాంతాల, వ్యక్తుల, స్థిర అస్థిర ప్రాకృతిక పదార్థాల ఉచ్చారణలను భారతీయ ఆంగ్ల ఉచ్చారణ కిందకే నేను తీసుకున్నాను. కొన్ని పదాల ఉచ్చారణలను చైనీయ ప్రామాణిక ఉచ్చారణతో సరిపోల్చవలసి వున్నది.
దు ఫు కవిత్వం విషయానికి వస్తే ఈ అనువాద కవితలు కొన్ని ఒక రకంగా, కొన్ని మరొక రకంగా వుండడానికి రెండు కారణాలు వున్నాయి. ఒకటి : దు ఫు భిన్నమైన శైలులలో కవిత్వం రాయడం, రెండవది : భిన్నమైన ఆంగ్ల అనువాదకుల పుస్తకాల నుండి కవితలు అనువాదం చేయడం. నా కన్నా మునుపే ఈ ప్రతిబంధకాలను దాటుకొని దు ఫు కవితల్ని వాడ్రేవు చినవీరభద్రుడు గారు, గాలి నాసరరెడ్డి గారు, దీవి సుబ్బారావు గారు, ముకుందరామారావు గారు లాంటి ఘటిక అనువాదకులు తెలుగు చేసారు. వారు తెలుగు చేసిన ఈ చీనా కవిత్వమే ఇంత కాంతులీనుతుంటే ఇక మూలంలో ఆ కవిత్వం ఇంకెంత గాఢానుభూతిని ఇస్తుందో తలచుకుంటేనే ఒడలు పులకరిస్తాయి.
దు ఫు కవిత్వం మిగతా కవుల కన్నా ఎందుకు భిన్నమైనదని విమర్శకులు భావిస్తున్నారంటే , దు ఫు ఇతర కవుల కన్నా ఎక్కువగా తన వైయక్తిక అనుభవాలను వ్యక్తం చేయడం, సామాన్య ప్రజల సాధకబాధకాలను నమోదు చేయడం, యుద్ధం వల్ల అతలాకుతలం అవుతున్న చైనా ప్రజల ఇక్కట్లను కవిత్వంలో ఇమడ్చడం వల్ల, ఇది అన్యాపదేశంగా చైనా సామాజిక, రాజకీయ చరిత్రను కూడా నమోదు చేయడం వల్ల, దు ఫును Poet- Historian అన్నారు. దు ఫు కవిత్వంలో మానవ సంవేదనలు, మనుష్య సంబంధాలు, ప్రకృతి పరవశత్వం, యుద్ధ భీభత్సం, రాజరిక వ్యవస్థల యుద్ధకాంక్ష వల్ల నలిగిపోతున్న వారి పట్ల ప్రభుత్వ వైఖరి గురించిన తీవ్ర విముఖత, రాజ్య క్షేమం పట్ల పెనుగులాట తదితర అంశాలు ఇతర కవుల కవిత్వంలో కన్నా ఎక్కువగా మనం చూడవచ్చు.అందువల్ల దు ఫు అనువాదకుల్ని లోబరుచుకుంటాడు.
దు ఫు రాసిన పద్నాలుగు వందల పైబడిన కవితల్లో నుండి ఆంగ్లంలోకి అనువదించిన కొన్ని సంపుటాల నుండి గ్రహించి, నేను చేసిన యాభై కవితల తెలుగు అనువాదమిది. టెలిగ్రాఫిక్ భాషలా సముచ్ఛయాలు లేని చైనీయ భాషను ఆంగ్లంలోంచి తెలుగులోకి అనువాదం చేసి, కొన్నిచోట్ల వాక్యాలకూ వాక్యాలకూ మధ్య లేని లంకెలు కలిపి చేసిన ప్రయత్నమిది. ఎక్కువ కవితలు One Hundred Poems from the Chinese – Kenneth Rexroth ( 1971 ), The Selected Poems of Du Fu – Burton Watson ( 2002 ) నుండి తీసుకున్నాను. చాలా తక్కువ కవితలు ఇతర సంకలనాల నుండి తీసుకున్నాను. దు ఫు కవిత్వంలో ఇదొక పాయ మాత్రమే.
ఈ కవితలు ఏవైనా పాఠకులను అలరిస్తే, ఆ గొప్పదనమంతా దు ఫు ది; ఆ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించిన అనువాదకులది. లోపమేదైనా వుంటే అది నాది.