ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుల వేదిక మీదకి ఆహ్వానించిన అతిథులకు ఏపిల్ బుగ్గలతో ముద్దులు మూటగట్టేలా చలాకీగా పళ్ళు తీసుకొచ్చి యిస్తూ తిరుగుతున్న చిన్ని పాపేనా –
“అస్తిత్వాన్ని దహిస్తోన్న దారిలో కాసిన్ని మెత్తటి పూలను పరుచుకోనీ” అంటూ ఈనాడు ఇలా అస్తిత్వ ఆలాపనను కవిత్వీకరించినది!
నాన్న చేయిపట్టుకుని ఆదివారం పూట వచ్చి ఇల్లంతా గలగలల మాటల్ని ప్రవహింపచేసిన పిల్లేనా-
” ఓ ఆడపిల్ల లాగే /భారాన్నంతా మోస్తూ మౌనంగా మారి/ సంద్రంలో కలిసిపోగలవా” అంటూ ఆదర్శాల ఒరవడిని నేర్చిన గోదావరిలా ప్రవహిస్తోంది! ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి ప్రతీ బొమ్మని ఆసక్తిగా చూడటమే కాకుండా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణ పుస్తకాలకి చిత్రాలు వేస్తూ, ఇన్విటేషనుకు అక్షరాలు చెక్కుతున్న వీర్రాజుగారి పక్కనే నిలబడి ఎగిరెగిరి చూస్తున్నపిల్లేనా–
“జాతీయహస్తకళలతో ఇల్లంతానింపి
దేశాన్నే ఇంట్లో పొదిగినంత పొంగి పోతుంది” అంటూ కవిత్వీకరించినది!
లోపలి గదుల్లోకి వచ్చి పల్లవి లెక్కలు చేసుకోటానికి ఇంట్లో గోడకి వేలాడదీసిన బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు పరుస్తునో, బొమ్మలేస్తూనో మధ్యలో పాఠాలు చెప్తున్నట్లు అభినయించిన అల్లరి పిల్లేనా “ఆకాశం అంచున ఊయలలూగే చుక్కల కథలన్నీ” అంటూ కవిత్వాక్షరాలుగా కాగితాల వేదికల్ని నింపినది!!!!
నాన్న చిటికెన వేలు పట్టుకొని ఇంట్లోకి అడుగుపెట్టిన చిన్నారి కవిత ఈనాడు “ఇట్లు నీ కవిత” అంటూ కవిత్వమై ప్రవహిస్తూ —
“నీఅంత ప్రేమించేందుకు
ప్రయత్నిస్తూనే వున్నాను” అంటూ నాన్నకేకాదు తాతకి కూడా గర్వకారణం అయ్యేందుకు తొలి అడుగు వేసింది!!!!!
నాన్న మీద రాసిన కవిత ఎంత ఆర్ద్రమైనదో ఒంటరిదైన అమ్మ మీద రాసిన కవిత మరింత సాంద్రమైనది —
“కంటి తడిలోంచి మేం తోడుకున్న
నా ఏకాంతాల్ని చాటుగా చూసాను
నీకళ్ళలో కాంతి సముద్రమై పొంగి
నా ఇల్లు వెలుగుతో తడిసి పోవాలి” అంటోన్న ఆ చిన్ని హృదయం కూడా తడిసిపోయేవుంటుంది.
కవితలు చదువుతున్నంత సేపూ అందులోని ఇల్లాలిగా అనుభూతిస్తూ, మహిళగా అస్తిత్వాన్ని తడుముకుంటూ, తల్లిగా, చెల్లిగా, భార్యగా జ్ణాపకాల వీధులోకి నడుచుకుంటూ, పంక్తుల వెంట అడుగులు వేసుకుంటూ పోయాను.
కవిత మొదలు పెట్టిన ఈ కవిత్వ ప్రయాణంలో “గుండెల్లో నేలని దాచుకున్న వాళ్ళేకదా ప్రేమికులు” అని చెప్తూ అంతతో వూరుకోలేదు.
“నేల ఎక్కడైనా తన ఆకర్షణ శక్తి కోల్పోదు
ఉక్రెయిన్ ఐనా గాజాలో అయినా ” అంటూ సంఘీభావం తెల్పుతుంది
“మట్టిలోకి దిగబడిన వేళ్ళను / పెకిలించే బలం ఏ యుద్దానికీ లేదు” అని ఖచ్చితంగా యుద్దం-నేలకి గల బంధాన్ని నిర్ధారణచేసింది.
“నాకు నేనే రంగులద్దుకునే
కొత్త ముఖం కావాలిపుడు” అంటూ తనను తాను వెతుక్కునే క్రమంలో కవిత్వం దారిలోకి వచ్చిన కవితని చూస్తున్నానిప్పుడు.
తాను పుట్టిన నేలనీ, దేశాన్నీ విడిచిపెట్టినందుకు కవిత మనసు స్నేహితుల్ని, తిరిగిన పరిసరాల్ని, ఇన్నేళ్ళయినా దుఃఖ పడుతునే వుందనటానికి సాక్ష్యం-
“ఆలోచనలవీధిలో/ జెండా పాతిన గతం
మనదేశం నుంచి ఎవ్వరొచ్చినా చుట్టమేనంటుంది”
‘పుస్తకంలోంచి’ కవితలో కవయిత్రి తనకి గల సాహిత్యపిపాశని “చదవడం ఆపేయాలంటి
మనసుపడ్డ వాళ్ళని వదలి వెళ్తున్న
ముల్లు గుచ్చుకుంటుంది” అంటూ వ్యక్తపరుస్తుంది.
“గుప్పిటలోని ఇసుకలా వేళ్ళ సందుల్లోంచి జారిపోతున్నా ఆచితూచి అడుగులేస్తున్న” కవయిత్రి జస్ట్ హౌస్ వైఫ్ లా మౌనంగా పండుటాకులా రాలటం కాకుండా “కొత్త సారం కడుపులోంచి మళ్ళీ పుడతాను” అంటుంది.
“చల్లని అక్షరాల గొడుగు
భరోసా నీడలోకి నడిపిస్తుంటుంది” అంటూ మర్చిపోయిన తనను అక్షరాల్లో వెతుక్కుంటుంది.
నిగూఢం, రూపాంతరం, వంటి కవితల్లో పూలపరిమాళాల్నీ, వెన్నెల తునకల్ని, వాన తుంపర్లనీ పరిమళింప చేస్తుంది. గాయపడ్డ అడవి పాట, యుద్దం-నేల వంటి కవితల్లో ధర్మాగ్రహాన్ని ఎలుగెత్తింది. అనుభూతుల్ని ఎంత అందంగా అక్షరీకరిస్తుందో, తన చుట్టూ వున్న స్త్రీల ఆవేదనల్నీ, ఆస్తిత్వాల్నీ, దుఃఖాల్నీ తాను ఆవాహన చేసుకొని అంతలా ఆగ్రహాన్ని వెలిబుచ్చుతుంది.
మూడేళ్ళ క్రితం కవిత కొత్తగా రాస్తోన్న కవితల్ని చదివిన వీర్రాజుగారు “వచ్చే ఏడాది కల్లా నీ కవిత్వం పుస్తకం రావాలి” అని అభినందించారు. కానీ కార్యరూపం దాల్చడానికి మూడేళ్ళు పట్టింది.
కుందుర్తి గారు తన మనవరాలికి కవిత అనే పేరు ఏమనుకుని పెట్టారో కానీ కుందుర్తి కవిత అంటే కుందుర్తిగారి కవిత్వమా లేక కుందుర్తి కవిత అనే అమ్మాయా అని కొందరిని సందిగ్ధపరుస్తూనే ఉంది. అందుకేనేమో శ్రీనివాస్ తన భార్యని చూస్తూ “ఈమె ఇంటి పేరూ కవిత్వమే, వంటి పేరూ కవిత్వమే”అని మురిపంగా ఓసారి నాతో అన్నమాట ఇప్పటికీ గుర్తొస్తోంది.
కవితాసంపుటి వచ్చేసింది కదా అని, కవినైపోయానని విరామం ప్రకటించకుండా ముందు ముందు మరింతగా అధ్యయనం చేస్తూ, మరిన్ని చక్కటి కవితలతో మంచికవిగా ఎదగాలని ఆశిస్తూ
కుందుర్తి కవితకు ప్రేమపూర్వక అభినందనలు.