గురు దత్ – ఓ వెన్నెల ఎడారి
రచయిత్రి: పి. జ్యోతి
అర్ధరాత్రి దాటింది; నిద్ర ఎగిరిపోయింది. ఈ పుస్తకాన్ని చదవడం పూర్తిచేసి, క్రింద పెట్టేసరికి గురు దత్ నన్ను పూర్తిగా ఆవహించాడు. నిర్దయగా వెలిగే వెన్నెల రాత్రులలో ఎడారుల వెంట సాగే నిర్భాగ్యుల ఒంటరి జీవనయాత్రలు గుర్తుకొచ్చాయి. శ్రీశ్రీ పంక్తులు తలపుకొచ్చాయి –
‘గగనమంతా నిండి పొగలాగు క్రమ్మి-
బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
ఆకాశపుటెదారి నంతటా అకట!
ఈ రేయి రేగింది ఇసుక తుఫాను!’
(‘ఒక రాత్రి’, ‘మహాప్రస్థానం’)
భావావేశభరితంగా కాకుండా, పూర్తిగా సహేతుకంగా ఈ పరిచయాన్ని చేయబూనడం అసాధ్యం అని ‘ప్యాసా’ సినీమాపై ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాన్ని చదివినప్పుడే గ్రహించాను. మనం వ్రాయకుండా ఉండలేక, లోలోపలినుంచి తన్నుకొచ్చే రాతలే నిజాయితీతో కూడిన రచనలు అవుతాయి గనుక ఈ ప్రయత్నం.
సున్నితమనస్కుల్నీ, కళాత్మకజీవుల్నీ ఈ లోకం ఎందుకిలా కాల్చుకు తింటుంది? వాళ్ల జీవితాల్ని దుర్భరం చేసి మృత్యువుపైపు నెడుతుంది? వాళ్లు చనిపోయాక వారి ప్రతిభని కొనియాడుతుంది? బ్రతికుండగా పట్టించుకోని సమాజం, కళాకారులు అర్ధాంతరంగా చనిపోతే ఎందుకని ఆకాశానికెత్తేస్తుంది? రచయిత్రి చివరిలో అన్నట్లు –
“గురు దత్ జీవితకాలంలో ఆయన సినిమాలకు అంత గుర్తింపు రాలేదు. ఆయనకు ఒక్క అవార్డు కూడా లభించలేదు….ఇప్పుడు ఆయన సినిమాలలో మూడు, ప్రపంచ సినిమాల్లో మేటి చిత్రాలుగా నిలిచాయి. జీవితకాలంలో పేరు రాకపోగా, మరణాంతరం ప్రశంసలు లభించడం చాలామంది గొప్ప కళాకారుల విషయంలో జరిగింది… వీటన్నింటి వెనుక ఉన్న విస్మరించలేని అంశం – గురు దత్ ఆత్మహత్య! విషాదాంతమే ఆయన జీవితంపై చాలామందికి ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం.”
మీనాకుమారి, సావిత్రి నా మదిలో మెదిలారు. గొప్ప కళాకారుల కళనీ, జీవితాల్నీ వేరుచేయలేం. గురు దత్ విషయంలో కూడా అదే వాస్తవం అని ఈ పుస్తకం చదివాక బలంగా అనిపించింది.
సాహిర్ లుధియాన్వి, ఎస్.డీ. బర్మన్, రఫీ, గీతా దత్…వీళ్లందరి అత్యున్నత స్థాయి కళాత్మకతను మేళవిస్తూ దర్శకుడిగా, నటుడిగా నలుపు-తెలుపు సినిమాల చీకటి వెలుగుల ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచి, సినీ ప్రేమికుల, సాధారణ ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న చిత్రాలను అందించిన గురు దత్‌ని ఆవిష్కరిస్తారు రచయిత్రి పి. జ్యోతి. ఆమె ఈ పనిని దశాబ్దాల పాటు సాగిన విస్తృతమైన పరిశోధన ఆధారంగా ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమతో చేశారని మనకు మొదటి పది పేజీలలోనే విశదమవుతుంది. ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘సాహిబ్, బీబీ ఔర్ గులాం’ – ఈ మూడు చిత్రాలపై రచయిత్రి వివరణ, విశ్లేషణ, అంతఃదృష్టి ఈ పుస్తకం అందించిన అత్యంత విలువైన సులోచనాలు. మళ్లీ మరోసారి ఆ సినిమాల్ని ఈ కొత్త కళ్లజోడు సహకారంతో చూడాలనే బలమైన కోరికని ఆమె రేకెత్తిస్తారు.
గురు దత్ ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయాలున్న చిత్రాలన్నిటిని గురించీ వివరించడం ఈ 570 పేజీల గ్రంథానికి సంపూర్ణతను కలుగజేసింది. నాబోటి సామాన్య ప్రేక్షకులకే కాకుండా, చిత్రనిర్మాణ లోతుపాతులు తెలిసినవాళ్లకు, చిత్రరంగంలో అడుగుపెట్టిన, పెట్టబోతున్న వాళ్లకు, చలనచిత్ర చరిత్రలో ఆసక్తికలిగిన వాళ్లకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడగల పుస్తకం ఇది.
గురు దత్ సినిమాల్లో పాటలకు ఉండే విశిష్టమైన స్థానాన్నీ, క్లోజ్-అప్ షాట్ల ప్రత్యేకతనీ (వాటిని ‘గురు దత్ షాట్‌లు’ అని నేటికీ వ్యవహరిస్తారట) ఉదాహరణలతో వివరిస్తారు. కొన్ని కీలక సన్నివేశాలను చర్చిస్తూ, వాటిల్లోని సూక్ష్మాతిసూక్ష్మాంశాలను వెలికితీస్తారు. సినిమా కథనంలో లీనమైపోయే నాబోటి సాధారణ ప్రేక్షకులు వాటిని గమనిస్తారని అని అనుకోను. అంతటితో ఆగక, ‘ప్యాసా’ కథనే తెలుగులో ‘మల్లెపూవు’గా మలిచినప్పుడు ఆ ప్రయత్నం ఎందుకు విజయవంతం కాలేదో వివరిస్తారు రచయిత్రి.
అతడి మిత్రుడు, సమకాలికుడూ అయిన దేవ్ఆనంద్ మాదిరిగా స్టార్‌గా కాకుండా, నటుడిగానే ఎదగాలని మొదట్లోనే నిశ్చయించుకున్న వాడు గురు దత్. నటుడిగా, ముఖ్యంగా దర్శకుడిగా అతడొక పెర్ఫెక్షనిస్టు. ఎన్నో సినిమాలను మొదలుపెట్టి, తనకే నచ్చక మధ్యలో విడిచిపెట్టాడట. స్టార్‌లు వెలుగులోకి రాకముందు ఉండిన స్టుడియో వ్యవస్థ పనిచేసిన తీరు, మనకు ఈ పుస్తకం మూలంగా కొంతమేరకు తెలిసివస్తుంది. తన బృందంలోని సహ నటులను, రచయితలను, సాంకేతిక నిపుణలను గురు దత్ ఏవిధంగా ప్రోత్సహించి, వారినుండి అత్యుత్తమ ఫలితాలను రాబట్టుకొనేవాడో మనకు తెలుస్తుంది. వహీదా రెహమాన్ ఒక ఉన్నత స్థాయి నటిగా ఎదగడం వెనుక, గురు దత్ కృషి ఉందని కూడా తెలుస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వి.కె. మూర్తి వంటి సినిమాటోగ్రాఫర్లు రాణించడానికి మూలకారణం గురు దత్ పర్యవేక్షణలో పనిచెయ్యడమే అంటారు రచయిత్రి. గురు దత్ సినిమాలలో ప్రధానపాత్రను పోషించిన పాటలను, వాటి చిత్రీకరణను, సవివరంగా చర్చిస్తూ, పాటల తెలుగు అనువాదాల్ని రచయిత్రి అందజేశారు. జీవితం పంచిపెట్టే విషాదంలో కూరుకుపోకుండా, నిరాశావాదంలో మగ్గిపోకుండా, దుఃఖాన్ని ఎదుర్కొంటూనే, కర్తవ్యంవైపుగా మళ్లించగల సాహిర్ లుధియాన్వి పాటలను రచయిత్రి ప్రస్తావిస్తారు. దురదృష్టవశాత్తూ గురు దత్ నిర్మించిన పేరొందిన సినిమాల్లోనూ, అతడు చేజేతులా ధ్వంసం చేసుకున్న వ్యక్తిగత జీవితంలోనూ విషాదం, నిరాశావాదం ప్రముఖ పాత్ర వహించాయి.
గురు దత్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి, సంఘర్షణకు లోనయ్యాడు. రచయిత్రి అతనిలో పేరుకుపోయిన ‘స్వీయ విధ్వంస’ ధోరణిని వివరిస్తారు. వహీదా పట్ల ఆకర్షితుడై, భార్య గీతా దత్‌కి దూరం కావడాన్నీ, భార్య కెరీర్‌పై ఆంక్షలు విధించి పాటలుపాడే అవకాశాలు ముగిసేపోయేలా చెయ్యడాన్నీ రచయిత్రి నిశితంగా విమర్శిస్తారు; అతని కెరీర్ మొదలయ్యే నాటికే అద్భుతమైన గాయనిగా వెలుగొందుతూన్న గీతా దత్ ఎదుగుదలని ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా తప్పు పడతారు.
గురు దత్ బాధ్యతారాహిత్యం, ఆత్మహత్య, అతని పిల్లల జీవితాలను కూడా నాశనం చేసింది. పెద్ద కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు; రెండో కొడుకు తాగుడుకి బలి అయ్యాడు. సమాజంతో పోరాడలేక, ఒత్తిడులకు లొంగిపోయి, వ్యసనపరుడై, ఓటమిని ఆహ్వానించిన వ్యక్తిగా గురు దత్ కనిపిస్తాడు. అతని చిత్రాలు కొన్నింటిలో ఈ స్వభావం మనకు కనిపిస్తుంది. అందుచేత ఈ రచన, గురు దత్‌ని ఆకాశానికెత్తేసే ప్రయత్నం కాదు; భావోద్వేగాలను, హేతుబద్ధతనూ సమతూకంలో రంగరిస్తూ సాగిన పరిశోధనా గ్రంథం.
చివరిలో ఇచ్చిన గీతా దత్ జీవిత స్కెచ్, గురు దత్‌పై వ్రాసిన ముగింపు వాక్యాలు పాఠకుల్ని ఎంతగానో కదిలిస్తాయి. మనుష్యులుగా ఎన్ని బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ, కొందరు కళాకారులుగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా మిగిలిపోతారని అనిపిస్తుంది. సాధించాల్సినవి ఇంకా ఎన్నో ఉంటూండగానే వైతాళికులైన కళాకారులు చిన్న వయసులో మరణించినప్పుడు మనకు పట్టరాని దుఃఖం కలుగుతుంది. ‘అయ్యో, మనవాళ్లని కాపాడుకోలేకపోయామే,’ అనిపిస్తుంది. భారతీయ సినిమా రంగానికి సంబంధించి, గురు దత్ ఈ కోవకి చెందుతాడు.
సినిమా రంగంపై గురు దత్ ప్రభావాన్ని గురించి రచయిత్రి చాలాచోట్ల ప్రస్తావిస్తారు. కానీ ఒక సందేహం. వారసత్వం అనే మాట నాకు ఇష్టంలేదుగానీ, గురు దత్ మొదలుపెట్టిన సరళిని, లేదా ధోరణిని ఏదో రూపంలో, ఎవరైనా కొనసాగించారా? అతడు తన కాలానికన్నా ముందుగా ప్రవేశపెట్టిన ప్రయోగాల్ని మెరుగుపరచి, అతడు వేసిన బాటలో మరో నాలుగడుగులు నడిచే ప్రయత్నాలు జరిగాయా?
మనల్ని విడిచి వెళ్లిపోయిన కళాకారులను గౌరవించుకోవాలంటే వారిపట్ల, వారుచేసిన కృషిపట్ల ఎంతో ప్రేమ ఉండాలి. వాళ్లకి మనం ఇచ్చే నివాళులు మనకోసం, మన తరువాతి వారికోసమే తప్ప మన ప్రపంచం నుండి నిష్క్రమించినవారిని తాకవు. ఈ పుస్తకంలో ఆ ప్రేమ, సంస్కారం మెండుగా కనిపిస్తాయి. ఈ పుస్తకం నిండా ఉన్న ఫొటోలు, గురు దత్ సినిమాల పోస్టర్లు మనల్ని ఆకట్టుకుంటాయి. ఇంత చక్కగా, శ్రద్ధగా, అంకితభావంతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన అనల్ప ప్రచురణ సంస్థ వారు అభినందనీయులు.
చివరిగా ఒక మాట. ఈ పుస్తకం చదవడం పూర్తిచేసిన రోజున నాకు గురు దత్, గీతా దత్, వి.కె. మూర్తి, అబ్రార్ అల్విలు కలలోకి వచ్చారంటే, కొద్దిసేపైనా వారితో తెలుగులో సంభాషించే అవకాశం నాకు లభించిందంటే నమ్ముతారా?….లేక నవ్వుతారా? నిస్సందేహంగా – గురు దత్ నన్ను ఆవహించాడు.