‘వియ్యుక్క’: మహిళల పోరాట గాథల సంకలనం

Spread the love

2023లో విరసంవారు ‘వియ్యుక్క’ అనే ఆరు కథా సంకలనాలను ప్రచురించారు. ఒక్కొక్కటీ సుమారు 500 పేజీలు   ఉన్న ఈ సంకలనాలన్నీ కూడా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న మహిళలు స్వయంగా వ్రాసుకున్నవి కావడం వీటి విశిష్టత. మొత్తం ఆరు సంపుటాలలో, 3,000 పైగా పేజీలలో 52 మంది అఙ్ఞాత రచయిత్రులు వ్రాసుకొన్న 282 కథలివి. వీరిలో చాలామంది మరణించడం ఒక విషాదం. మారుపేర్ల వెనుక అసలు రచయిత్రులను గుర్తించడం, దాడులలో పోయిన కిట్‌బ్యాగులు, వాటిల్లోని కథలు పోగా, ఇంత పెద్ద ఎత్తున ఈ రచనలను సేకరించి ముద్రించడం ఒక బృహత్కార్యం. ఇందుకుగాను సంపాదకులకు, ప్రచురణకర్తలకు ముందుగా అభినందనలు. ఏ సమూహంలోనైనా అది సృష్టించే సాహిత్యమే సామాజికశాస్త్ర పరిశోధనలకన్నా ముందుంటుంది. అందుచేతనే సామాజిక స్థితిగతులను బేరీజు వేసేందుకు విభిన్న సాహిత్యాలను లోతుగా పరిశీలించడం అవసరం.

ఎక్కడో అడవుల్లో, ఏదో సంఘర్షణ జరుగుతున్నదని చూచాయగా అందరికీ తెలుసు. కానీ అక్కడ నిజానికి ఏమి జరుగుతున్నదనేది తెలుసుకోవడానికి ‘వియ్యుక్క’ వంటి రచనలు ఉపయోగపడతాయి. పోరాటక్రమంలో ఆయా సామూహాల ప్రజలు రాజకీయేతర అంశాలలో కూడా చైతన్యవంతులవుతారు; జీవన విధానంలోనూ, కట్టుబాట్లలోనూ అనివార్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఏ ఉద్యమమైనా అవి సమీకరించిన సమూహాల్లో బహుముఖమైన మార్పులను తీసుకొస్తాయని చరిత్ర మనకు తెలుపుతున్నది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణా సాయుధ పోరాటం (1946-1951), అలాగే శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం (1967-1970)  ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తాయి. ఐదేళ్ల లోపుగానే అణచివేయబడినప్పటికీ, ఆ పోరాటాలు రాజకీయరంగంలోనే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాలలో శాశ్వతమైన మార్పులను అందించాయని మనకు తెలుసు. అంతేకాదు, అంతకుముందు ఎన్నడూ పట్టించుకోని పాలకుల దృష్టిని గిరిజన, నిరుపేద రైతాంగ సమస్యల వైపుగా ఆ పోరాటాలు మళ్లించాయి.

1967లో నక్సల్‌బరీ పోరాట ప్రేరణతో మొదలై, భారతదేశ ప్రజాపోరాటాల చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా, సుమారు అరవై ఏళ్లుగా కొనసాగుతోన్న సాయుధ పోరాటం, విప్లవకారులనూ, అది ఉద్దేశించిన గిరిజనులనూ ఏ విధంగా మార్చింది? మారుస్తున్నది? మార్చే క్రమంలో, క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి? వాటిని విప్లవసంస్థల సభ్యులు ఏవిధంగా పరిష్కరిస్తున్నారు? ఏమేరకు విజయవంతం అవుతున్నవి? ఎక్కడ విఫలమవుతున్నవి? ఆధునిక సమ సమాజాన్ని స్థాపించాలని కోరుకొనే విప్లవకారులు, మూఢనమ్మకాలతో కూడిన గిరిజన సమూహాలతో ఎట్లా పనిచేయగలుగుతున్నారు? దళాల్లో పనిచేసేవారి జీవితం ఎట్లా ఉంటుంది? స్త్రీ-పురుష సంబంధాలు, వివాహం, పిల్లలు – ఈ అంశాలపై వారి ఆచరణ ఏ విధంగా ఉన్నది? అసలు ఎవరైనా సాయుధపోరాట పంథాను ఎన్నుకొనే క్రమం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు జవాబులు వెతుక్కొనేందుకై సామాజిక శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు జరపాల్సి ఉంటుంది. ఏ సమూహంలోనైనా అది సృష్టించే సాహిత్యమే అది ప్రేరేపించే సామాజికశాస్త్ర పరిశోధనలకన్నా ముందుంటుంది. అందుచేతనే సామాజిక స్థితిగతులను బేరీజు వేసేందుకు పోరాట సాహిత్యాన్ని లోతుగా పరిశీలించడం అవసరం.

ముందుగా ఒక వివరణ. ఈ పరిచయం కేవలం ‘వియ్యుక్క-1’ అనగా తొలి సంపుటికి మాత్రమే పరిమితం.  ‘వియ్యుక్క’ అంటే గోండి భాషలో వేగుచుక్క అని సంపాదకురాలు బి.అనూరాధ ముందుమాటలో తెలిపారు. ఇందులోని కథలన్నీ క్షేత్రస్థాయిలో పనిచేసిన, చేస్తూన్న, మావోయిస్టు పార్టీకి చెందిన మహిళా సభ్యులు వ్రాసుకున్నవి. నిత్యం ప్రజల మధ్య తిరుగాడే దళాలనుండి, సాధారణ సభ్యుల అనుభవాల నుండి, అనగా దిగువ నుండి వచ్చిన కథలు. ఇదే వీటి ప్రత్యేకత, విశిష్టత. ముందుమాటలో చెప్పినట్లు, ఈ కథా రచయిత్రులలో ఒకే కథ వ్రాసిన వాళ్లున్నారు; చెయ్యితిరిగిన రచయిత్రులుగా పరిణితిని పొందిన వాళ్లూ ఉన్నారు. అంతేకాదు, ఒకవైపు ప్రధాన స్రవంతిలోని తెలుగు పత్రికలు మూతబడుతూంటే, మరోవైపు ఉద్యమకారులు సాహిత్య పత్రికలు నడుపుతున్నారు!

గిరిజనులు అనే మాట చాలా విస్తృతమైనది. వారిలో ఎన్నో తెగలు, భాషలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. వీటన్నింటి పట్లా రచయిత్రులకు పూర్తి అవగాహన ఉన్నట్లుగా తోస్తుంది, ఈ కథలు చదువుతూంటే. పార్టీ కార్యకర్తలు స్థానికుల భాషలను నేర్చుకొని ధారాళంగా మాట్లాడతారు; పాటలు పాడతారు. గిరిజన సమూహాల్లో పితృస్వామ్యమే ఆధిపత్యం చెలాయిస్తున్నది; మూఢాచారాల మూలంగా స్త్రీల పరిస్థితి దారుణంగా ఉంది. గిరిజనుల్లో కన్యాశుల్కం (ఓలి) ఉంది. అబ్బాయి తరఫువారు అమ్మాయి తండ్రికి కల్లు, ధనం ఇచ్చుకుంటే పెళ్లి కుదిరిపోయినట్టే. ఈ విభాగంలోని కథలన్నీ పితృస్వామ్య దురాచారాలకు బలి అవుతూన్న స్త్రీలు, ఉద్యమ ప్రభావంతో చైతన్యవంతులు అవుతూన్న క్రమాన్నీ, పార్టీ ప్రమేయంతో సంప్రదాయ మూఢాచారాలు సడలుతూన్న తీరునీ తెలియజేస్తాయి.

ఇష్టంలేనివాడితో పెళ్లి జరిగాక, బలవంతంగా కాపురానికి తీసుకుపోయే ప్రయత్నాన్ని అడ్డుకున్న దళం, ఆమె భద్రతకి హామీ ఇచ్చినప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది లచ్చి – ‘నారి’ కథలో.  ‘బాలి’ కథలో అదే పేరుగల యువతి, దళంలోచేరి, ఇష్టంలేని పెళ్లినుండి, ఆత్మహత్యా ప్రయత్నంనుండి బయటపడుతుంది. ఆమె ఎంతోకొంత చదువుకున్నది; నగర స్త్రీలకు కూడా భద్రత లేదనే ఎరుక కలిగినది.

‘మొలకెత్తే దృశ్యం’ కథలో లింగో, తాగుబోతు తండ్రి బారినుండి బయటపడి, వివాహంలో ఇరుక్కుంటుంది. భర్త దళ సభ్యుడే. అతని ప్రవర్తన సక్రమంగా లేక బయటకు వచ్చేసినా ఆమె దళంలోనే కొనసాగుతుంది.

భూతవైద్యుడు కోసాల్ ఎదుర్కొన్న సందిగ్ధతను ‘సోయి’ కథలో చూస్తాం. ఇనుపఖనిజంపై కన్నువేసిన కార్పొరేట్ సంస్థ, భూమిపూజకై కోసాల్‌కి డబ్బు ఆశ చూపినప్పుడు, రానుపొమ్మనడంతో కథ ముగుస్తుంది.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, తుపాకులూ, కిట్‌బ్యాగులూ మోసుకుంటూ, నిరంతరంగా సాగే కాలినడక, కొండలూ గుట్టలూ ఎక్కిదిగడం, అవకాశం దొరకగానే ఇంత వొండుకొని తినడం, జిల్లీ (ప్లాస్టిక్ షీట్) పరచుకొని కాసేపు విశ్రమించడం, సెంట్రీ డ్యూటీలు, అపాయింట్‌మెంట్‌లు, సమావేశాలు, చర్చలు, బోధనా తరగతులు, చదువుకోవడం, వ్రాసుకోవడం, కలయకలు, వీడ్కోళ్లు, దళజీవితపు నిత్య కార్యకలాపాలని ఈ కథలు తెలియజేస్తాయి.

ఒక్కో ఋతువులో ఒక్కో రకమైన సమస్యలు ఎదురవుతాయి.  గిరిజన ప్రాంతాల్లో ప్రతీ ఒక్కర్నీ మలేరియా పీడిస్తుంది. దళసభ్యులు గాయపడితే, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటే వైద్య సదుపాయాలు మృగ్యం. ఇవికాక మహిళల ప్రత్యేక సమస్యలు రక్తహీనత, నెలసరి, జుట్టు. వీటన్నిటిపైనా దృష్టి పెడతారు రచయిత్రులు. పార్టీ-సమాజం మధ్య క్షేత్రస్థాయి చైతన్యం, నిర్ణయాధికారం అగుపడతాయి కథలన్నింటిలో. ఈ ప్రక్రియలో స్త్రీలు క్రియాశీలంగా పాల్గొంటున్నారని అవగతమవుతోంది.

కొత్తగా దళాలలో చేరే గిరిజనేతరులు తొలిదశలో ఎదుర్కొనే ప్రధానమైన సమస్య ఆహారపు అలవాట్లకు సంబంధించినది. కార్యకర్తలు తమ అలవాట్లను క్రమేపీ మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో ‘చీమల పచ్చడి’, ‘గొడ్డు మాంసం’ కథల్లో తెలుస్తుంది. ‘గెరిల్లా జీవిత అనుభవం’ కథలో నగరవాసుల దళజీవిత తొలిదశను రచయిత్రి నమోదు చేస్తారు.

మండు వేసవిలోనూ, పోలీసులు జాలాశయాల చెంత మాటు కాసినప్పుడూ త్రాగేందుకు నీళ్లు దొరక్క దళసభ్యులు ఎంతగా విలవిలలాడిపోతారో ‘నీళ్లెంత రుచి’ కథలో చెబుతారు రచయిత్రి.

‘గొడ్డునుకాను’ కథలో సమాంతర కథనాలున్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను అందించడానికి కంకణం కట్టుకున్న డాక్టరు, అతని సహాయకురాలిగా వైద్యశిక్షణ పొందిన కార్యకర్త పాఠకుల దృష్టిని ఆకట్టుకుంటారు.

కొన్ని ప్రాంతాల్లో బాబాలు, భక్తులు, అడవి దేవతల స్థానంలో శివలింగాలను ప్రతిష్టించి, గిరిజనుల మధ్య సృష్టించిన విభేదాలను పార్టీ చాకచక్యంగా అధిగమించడాన్ని ‘ఆదివాసీలు-అంటరానితనం’ కథలో చూస్తాం.

పోరాట క్రమంలో చదువుకి రెండు పార్శ్వాలుంటాయని ఈ విభాగాన్ని పరిచయం చేస్తూ సంపాదకులు మనకు తెలియజేస్తారు. మొదటిది వివిధ విద్యార్హతలతో, భిన్న నేపథ్యాలతో ఉద్యమంలో చేరే సభ్యుల ఎదుగుదలను ప్రోత్సహించే చదువు. రెండవది ఉద్యమ ప్రాంతాల ప్రజల్ని, ముఖ్యంగా పిల్లల్ని ఉద్దేశిస్తూ చదువు చెప్పే స్కూళ్లు, వర్గచైతన్యంపై దృష్టినిపెట్టే బోధనా తరగతులు. తమ స్కూళ్లలో బోధనకై ప్రత్యేకమైన సిలబస్‌ని, పాఠ్య పుస్తకాలను కూడా ఉద్యమకారులు తయారు చేసుకున్నారు!

షావుకార్ల దోపిడిని, తప్పుడు తూకాలనీ బహిర్గతం చేసే లెక్ఖలు, తమ ప్రాంతంతో మొదలుపెట్టి, దేశ విస్తృతిని పరిచయంచేసే భౌగోళిక శాస్త్రం, గతకాలాల పోరాటాలను అధ్యయనం చేయించే చరిత్ర పాఠాలు, పితృస్వామ్య ఆధిపత్యాన్ని నిలదీసే సాంఘిక శాస్త్రం,…ఇదీ సిలబస్.

బూర్జువా చదువులకు భిన్నంగా, నిజ జీవిత సమస్యలు, సందర్భాలతో కూడిన బోధన, ఉదాహరణలు, ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్య పుస్తకాలు – వీటిని ఆధారంగా చేసుకొని చదువు సాగుతుంది. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు తమ బోధనా సాధనాలను, పద్ధతులను మెరుగు పరచుకుంటూ ఉంటారని ఈ కథలు తెలుపుతున్నాయి.

‘కామ్రేడ్ పొజ్జె ఉత్తరం’, ‘చదువురాని వారు’ కథల్లో ఉద్యమంలోకి రాకముందో, లేక వచ్చాకో కొంతవరకూ చదువుకున్నవాళ్లు, రానివాళ్లకు నేర్పే క్రమం, బాగా చదువుకోవాలనే తపన, నిత్యసాధన కనిపిస్తాయి. చదువుంటే పార్టీలో ఇంకా ఎక్కువ బాధ్యతలు తీసుకోవచ్చనే స్ఫురణ కూడా ఉన్నది. తొలిరోజుల్లో బాగా చదువుకున్నవాళ్లు వచ్చేవారనీ, ఇప్పుడు వారి సంఖ్య తగ్గిపోతున్నదనీ అనే పరిశీలన ఉంటుంది.

‘చదువు’ కథలో ఇరవై రోజులపాటు స్కూలు నిర్వహించడం, బోధనా పద్ధతులపై చర్చను చూస్తాం. ‘మార్పు’ కథలో పోలీసుల రాకతో స్కూలు అర్థాంతరంగా మూతబడుతుంది. అలెక్స్ హేలీ ‘రూట్స్’ (‘ఏడుతరాలు’) సీరియల్ చూపించి చర్చకు పెడతారు. ‘స్పార్టకస్’, ‘దో బీఘా జమీన్’ చిత్రాలను చర్చిస్తారు ‘మౌఖిక చరిత్రకారులు’ కథలో.

‘విప్లవోద్యమంలోకి అడుగుపెట్టడమంటే కుటుంబం అనే పితృస్వామిక వ్యవస్థనుండి బైటపడి, కొత్త, సమిష్టి జీవనంలోకి అడుగుపెట్టడం’ – అంటారు సంపాదకులు. అయితే ఇది వెనువెంటనే జరిగిపోదు. ఆ మార్పు జరిగే క్రమానికి, సంఘర్షణకి ఈ కథలు లిఖితరూపాన్ని ఇస్తాయి. పితృస్వామ్య కాడిని వదిలించుకున్న స్త్రీ-పురుషులు తమ సంబంధాలలో సమానత్వాన్ని, నూతనత్వాన్ని కనుగొంటారు. ఈ విభాగంలోని కథలు ఉద్యమ నేపథ్యంలో మరింత జటిలమయ్యే స్త్రీ-పురుష సంబంధాల క్లిష్టతను శోధిస్తాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రల్లో ఎదుగుదల, పరిణితి స్పష్టంగా కనిపిస్తాయి. అవే వారిని సంక్షోభాలనుండి బయటపడేస్తాయి.

‘ఆప్యాయత’ కథలో కమాండర్, దళ సభ్యురాలైన భార్య పట్ల మెతకగా ఉండకూడదనే ఆతురతతో అదనపు కాఠిన్యంతో వ్యవహరిస్తాడు. ఆమె గాయపడ్డప్పుడు కంటనీరు పెట్టుకొని, అందరి ముందూ ప్రేమను ప్రదర్శిస్తాడు.

‘పీడితులందరి దారిలో’ అనే కథ, జటిలమైన మానవ సంబంధాల లోతులకు వెళ్తుంది. అనారోగ్యంతో బాధపడుతూన్న దళ సభ్యురాలైన భార్యను అలక్ష్యంచేసి, మరో వివాహితతో సంబంధం పెట్టుకున్న జిల్లాస్థాయి నాయకుడి కథ ఇది. పైగా తాను సంబంధం పెట్టుకున్న స్త్రీని అదే ఇంట్లో ఉంచి, తన భార్యే ఆమెకు సేవ చెయ్యాలని భావిస్తాడతడు. ఇంటికి వచ్చిన కమాండర్ ఆదుకుంటాడని ఆశిస్తే, అతడు తన భార్యను విడిచిపెట్టి వెళ్తాడు, అనారోగ్యం నుండి కోలుకొనేందుకు. బాధితురాలు ఎదురుతిరిగి, భర్తని విడిచిపెట్టి, మళ్లీ అడవిబాట పడుతుంది.

‘ఎవరి కథలను వాళ్లే చెప్పుకోవాలి’ అనే చైతన్యం తెలుగు సాహిత్యంలో వేళ్లూనింది. ఉద్యమకారులు స్వయంగా వ్రాసుకున్నఈ కథలు వెలుగు చూడడం తెలుగు సాహిత్యంలో అపూర్వమైన పరిణామం. అయితే ఇవన్నీ అత్యుత్తమ రచనలని చెబితే అది అతిశయోక్తి అవుతుంది. వీటి విశిష్టత సాధారణ పాఠకులకు తెలియని ప్రపంచాన్ని పరిచయం చెయ్యడంలోనే ఉంది. వీటిల్లో ఎక్కడా కులాల ప్రసక్తి లేకపోవడం ఈ కథలకు గల మరో ప్రత్యేకత.

‘సాయుధపోరాట పంథాకీ, గత అరవై ఏళ్లల్లో మారిపోయిన సామాజిక స్థితిగతులకూ ఎంతవరకూ పొంతన ఉన్నది?’ ‘కమ్యూనిజానికి కాలం చెల్లిందని సోవియట్ యూనియన్, చైనాల అనుభవాలు తెలుపుతున్నవి కదా?’ వంటి మౌలిక ప్రశ్నలపై బాహ్య సమాజంలో చర్చ జరుగుతూండగా, అలనాటి లక్ష్యాల వైపుగానే మావోయిస్టుల అఙ్ఞాత పోరాటం కొనసాగుతున్నదనేది వాస్తవం.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *