కాల్పనికత, వాస్తవికతల కలనేత ‘పట్టుతోవ’

Spread the love

క్రీ.పూ. రెండవ శతాబ్దంలో ఏర్పడి విస్తరించి, సుమారుగా 15వ శతాబ్దం వరకూ అంటే 1600 సంవత్సరాల పాటు వాడుకలో ఉండిన పట్టుతోవ (Silk Route)కి విశేషమైన చారిత్రక ప్రాముఖ్యత ఉన్నది. హాన్ రాజవంశంనాటి (సుమారుగా క్రీ.పూ. 200 నుండి క్రీ.శ. 220) చీనాదేశాన్ని – కొండలు, అడవులు, పర్వతాలు, కనుమలు, నదులు, ఎడారులగుండా – ఐరోపా ఖండంతో సంధించిన వాణిజ్యమార్గం అది. మరో ఆరువందల ఏళ్లపాటు చీనా పాలకులు పరమరహస్యంగా దాచిపెట్టిన పట్టు పరిశ్రమ, పట్టుబట్టలకు ఏర్పడ్డ అనూహ్యమైన గిరాకీ ఈ దారిని కనుగొనడానికీ, దాన్ని కాపాడుకోవడానికీ మూలకారణాలు.

చైనా, భారత్‌లను సందర్శించి ఇటలీకి తిరిగివచ్చిన మార్కోపోలో (1254-1324) పట్టుతోవ వెంబడి ప్రయాణించిన వెనిస్ నగరానికి చెందిన వ్యాపారి, సాహసి. 24 ఏళ్లపాటు సాగిన తన ప్రయాణాన్ని ముగించుకొని స్వస్థలం చేరుకున్నాక, పురుగుల నుండి పట్టు ఉత్పత్తి అవుతుందని అతడు ప్రకటించినప్పుడు, ‘ముసలాడికి మతిభ్రమించింది’ అంటూ అతని దేశస్థులు కొట్టిపారేశారట.

బౌద్ధమత గురువులు, భిక్షువులు తప్ప పట్టుతోవ మొత్తం దూరం (సుమారు 6,500 కి.మీ.) ప్రయాణించినవారు అరుదు. దళారీల ప్రమేయంతో మజిలీలు, కారవాన్ సరాయ్‌లు, స్థానిక విక్రయ కేంద్రాలు, ఈ మార్గంలో వెల్లివిరిసాయి. అనేక మజిలీల చెంత రోమన్ నాణేలు లభ్యమయ్యాయి. అన్ని భాషలు, మతాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు ఈ మార్గంవెంట పయనించాయి. ఈ మార్గాన్ని కాపాడుకోవడానికే చైనాగోడ అవసరం అయింది. దాని నిర్మాణం ఎన్నో తరాలపాటు సాగింది. ఎందరో శ్రామికులను అది బలితీసుకుంది. ఈ నవలలో చైనాగోడ, చైనీయుల ఆవిష్కరణ అయిన కాగితం వాడుక విస్తరించడం, రాచరిక పాలనా వ్యవస్థలో పరీక్షల ప్రాముఖ్యత (ఇది నేటికీ కొనసాగుతున్నది), బౌద్ధం అక్కడ అడుగు పెట్టకముందు తావో, కంఫ్యూజియన్ బోధనలతో ప్రభావితమైన సంప్రదాయాలు, పట్టుతోవ వెంట ఏర్పడ్డ వసతులూ, నెలకొన్నవేశ్యావాటికలూ, అంతఃపురంలో ‘కొజ్జాలు’ పడ్డ హింస. – ఇటువంటి ఎన్నో అంశాలను, వివరాలను ఈ రచనకు ఒడుపుగా జోడిస్తాడు వసుధేంద్ర.

వెయ్యిన్నరేళ్ల చరిత్రను కలిగిన పట్టుతోవ (నిజానికి ఎన్నో తోవల సముదాయం) ఆధారంగా చారిత్రక నవలను వ్రాయబూనడం ఒక సాహసం. ఈ సాహసకార్యాన్ని చేబట్టిన రచయిత, రెండు-మూడు తరాలను, ఆ తోవ వెంబడి ఉండే ఐదారు ప్రాంతాలను ఎంచుకున్నాడు. కథాకాలం పట్టుతోవ ఏర్పడ్డ తొలిదశ నాటిది. చివరిలో వివిధ ప్రాంతాల జనుల కథనాలను జోడిస్తాడు. ఈ పద్ధతి విధించే పరిమితులలోనే నవల నడుస్తుంది. ఉదాహరణకి, నవల ఆద్యంతం ప్రయాణించే పాత్రలు లేకపోవడం వలన కథనం శకలాలుగా సాగుతుంది. అందుచేత ఈ నవల పట్టుతోవను గురించి తెలియపరచేది ఒక పార్శ్వం మాత్రమే అనే ఎరుకతో పాఠకులు ముందుకి సాగాలి.

ఉత్తమస్థాయి చారిత్రక రచన చేసేది, చెయ్యగలిగేది – ఇతివృత్తంలోని స్థలకాలాల పట్ల, ఆనాటి మానవ సంఘర్షణల పట్ల లోతైన ఆసక్తిని రేకెత్తించడం. మరింత సమాచారంకోసం, మరిన్ని వివరాలకోసం పాఠకులు స్వయంగా వెతుక్కొనేందుకు ప్రోత్సహించడం; చరిత్ర అధ్యయనం పట్ల జీవితాంతం నిలిచిపోయే జిజ్ఞాసను కలిగించడం. ఇందుకు గొప్ప ఉదాహరణలు రాహుల్ సాంకృత్యాయన్ రచనలు. ఈ విషయంలో వసుధేంద్ర నవల ‘పట్టుతోవ’ విజయవంతం అయింది.

ప్రకృతిలో సహజీవనం సాగిస్తూన్న తెగల జీవన విధానంతో మొదలుపెట్టి, వారి బతుకుల్లో సంచలనం సృష్టించిన పట్టుతోవను, దానికోసం పాలకులు చేబట్టిన ఏర్పాట్లను మన కళ్లముందుంచుతాడు రచయిత. అనేకానేక విశిష్టమైన చారిత్రక ఘట్టాలున్నాయి నవలలో. వీటిల్లో మొదటిది, కుషాను చక్రవర్తి అయిన కనిష్కుడు ద్రవ్య వ్యవస్థను, అనగా నాణేలను ప్రవేశపెట్టడం. ఈ చర్య ఊహించని గందరగోళానికి దారితీస్తుంది. సంచార జీవులకు, అడవి మీద ఆధారపడి జీవించే తెగలకు, చదువు, లెక్కలూ అవసరం లేదు. ప్రకృతితో మమేకమైన సహజఙ్ఞానులు వాళ్లు. వస్తుమార్పిడికి అలవాటు పడ్డవాళ్లు. ఈ నాణేలు వారి కంటికి వినాశ కారకాలుగా, సైతాన్ సృష్టిగా అగుపడ్డాయి. నాణేలను, వ్యాపారంలో వాటి స్థానాన్ని తొలుత అర్థం చేసుకున్నవారు వైశ్యులు, బౌద్ధ భిక్షువులే. భిక్షువులకు ధనంపట్ల ఆకర్షణలేదు, డబ్బు పోగుచేసుకోవాలనే ఆసక్తీ లేదు. పైగా వారు బంగారాన్నీ, నాణేలను చేత్తో తాకరాదనే నియమం ఉండేది. ఆనాటి సందిగ్ధాలను చక్కగా ఒడిసి పట్టుకుంటాడు రచయిత వసుధేంద్ర.

విస్తారమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కనిష్కుడు (పాలనాకాలం క్రీ.శ. 127-150) – వివిధ ప్రాంతాల నడుమ, అలాగే ఇతర దేశాలతో వాణిజ్యానికి వస్తుమార్పిడి సరిపోదనీ, ద్రవ్య విధానం అవసరం అనీ గ్రహించాడు. చీనాలో అప్పటికే నాణేల చెల్లుబడి స్థిరపడింది. కనిష్కుడి సామ్రాజ్య విస్తరణ ఉత్తర భారతదేశాన్ని మధ్య ఆసియాతో సంధించింది. పైగా అతడు బౌద్ధాన్ని ఆదరించాడు. కనిష్కుడి పాలనా కాలం, అటు పట్టుతోవ సుస్థిరతకు, ఇటు బౌద్ధ ప్రచారానికీ అనుకూలించింది. బహుశా అందుకే తన నవలకు శ్రీకారం చుట్టేందుకు వసుధేంద్ర ఆ కాలాన్ని ఎంచుకున్నాడు. రాజ్యాధికారానికీ, మత విశ్వాసాలకూ మధ్య ఉండే సంబంధం ఉద్రిక్తభరితమైనది. ప్రజల విశ్వాసాలను రాజ్యాన్ని సుస్థిరపరచేందుకు వినియోగించగల అవకాశాలను పాలనావ్యవస్థ వదులుకోదు. ఈ పెనుగులాటను రచయిత సున్నితంగా చిత్రీకరిస్తాడు.

ధన వ్యామోహం, వస్తు వ్యామోహంతో చెట్టాపట్టలు వేసుకొని సాగిపోతుందని మార్క్సు సూత్రీకరించాడు. ‘డబ్బెందుకు?’ అనే ప్రశ్నకు సమాధానంగా మార్క్సు మహాశయుడు ఐదు అంశాలను పేర్కొన్నాడు: 1) వస్తువుల విలువను కొలవడానికి; 2) చెలామణీ కావడానికి; 3) దాచిపెట్టుకోవడానికి; 4) చెల్లింపులకు; 5) అందరికీ ఆమోదనీయమైన ద్రవ్యరూపంగా ఉండేందుకు. వస్తూత్పత్తి చేసే శ్రమశక్తికి ఈ లక్షణాలతో క్రియాశీలమైన సంబంధం ఉండే అవకాశం లేదు. శ్రమను ధనరూపంలో వినియోగించడంలోనూ, కూడబెట్టడంలోనూ పైచేయి వ్యాపారులదీ, రాజ్యానిదీ అవుతుంది. కష్టాలు శ్రామికులవీ, నష్టాలు చిరు ఉత్పత్తిదారులవీ, లాభాలు మాత్రం బడా దళారులవీ అవుతాయి. ఈ నవలా రచయితకు ధనం ఎటునుండి ఎటువైపు ప్రవహిస్తుందనే అంశంపై స్పష్టత ఉన్నది.

ఇక వస్తూత్పత్తి విషయానికి వస్తే – అది రెండు రకాలంటాడు మార్క్స్. ఒకటి వినియోగానికీ, రెండవది మారకానికీ. ద్రవ్యరూపంలో లావాదేవీలు జరిగి, అవి చట్టబద్ధం, వ్యవస్థీకృతం అయినప్పుడు వ్యాపారం మొదలవుతుంది. ఎగుమతులు, దిగుమతులు, సుంకాలు, ఆంక్షలు, వచ్చి చేరుతాయి. అంతటితో ఆగక అక్రమ నిల్వలు, దొంగచాటు రవాణాలు, లంచాలు, కల్తీలు, వ్యాపార రహస్యాలు, దారిదోపిడీలు, శిక్షా స్మృతులు – ఇవన్నీ మొదలైపోతాయి. అత్యాశ, అక్రమ లాభార్జనకు పెద్దపీట వేస్తుంది.

లాభనష్టాలే సర్వస్వం అయిన సమాజాల్లో వస్తువుల విలువను మానవ శ్రమ కాకుండా మార్కెట్లు నియంత్రిస్తాయి. సప్లై-డిమాండ్లు గుమిగూడే విపణి వీధుల్లో అటు సప్లైనీ, ఇటు డిమాండ్‌నీ నియంత్రించే ఏర్పాట్లు, మంతనాలు, కుట్రలు సాగుతూనే ఉంటాయి. వస్తువు, అది రాబట్టగల ధర – శ్రమకి భిన్నంగా, శ్రామికులకు అతీతంగా ఉండే స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుందేమో అని భ్రమను కల్పించే మాయాజాలం సర్వత్రా విస్తరిస్తుంది. వీటన్నిటికీ ప్రతీకలను, సృజనాత్మక దృష్టాంతాలను ఈ నవలలో చూడగలం.

ఈ వ్యవస్థ ఏకకాలంలో ప్రాచీనమైనదీ, ఆధునికమైనదీను. వ్యాపారవ్యవస్థ సృష్టించే ప్రక్రియల్నీ, అది నడిపించే పరస్పర చర్యల్నీ, ‘పట్టుతోవ’ సాక్షిగా, చక్కటి కథా రచనకు బలమైన నేపథ్యంగా అల్లుతాడు వసుధేంద్ర. అంతకన్నా ముఖ్యంగా – సామ్రాజ్యాలు, అవి సృష్టించే అమానవీయ వ్యవస్థలను ఆధారంగా చేసుకుంటూ, సామాన్యుల జీవితాలను ధ్వంసంచేసే తీరునూ, మిగిల్చే తరతరాల విషాదాన్నీ మన ముందుంచుతాడు.

ప్రపంచీకరణ ఇవాళ్టిది కాదనీ, వాణిజ్య అవసరాలే దానికి పునాది వేశాయనీ మనకు తెలుసు. పారిశ్రామిక విప్లవం తరువాత శ్రమశక్తిపై, ముడిసరకుపై, మార్కెట్లపై ప్రత్యక్ష నియంత్రణ, ఆధిపత్యం అవసరం అయినప్పుడు సామ్రాజ్యవాదం ఉద్భవించింది. అంతకు ముందుగానే – రాచరికవ్యవస్థలో బలమైన, విశాలమైన సామ్రాజ్యాలు ఏర్పడినప్పుడల్లా వ్యవస్థీకృత వ్యాపారం పెద్ద స్థాయిలో, రాజ్యం మద్దతుతో సరిహద్దులను దాటింది. ఈస్టిండియా కంపెనీ ఈ విధంగానే నెలకొల్పబడింది. శ్రమపై, ముడిసరకుపై, మార్కెట్లపై చక్రవర్తుల ఆధిపత్యం కొనసాగినంతకాలం వ్యాపారం సజావుగా కొనసాగింది. అందుకు అవసరమైన పరిస్థితులను నెలకొల్పి, కొనసాగించడంలో యూరోపియన్ల కన్నా ఎంతో ముందుగానే తూర్పుదేశాల చక్రవర్తులు విజయం సాధించారు. వారిలో చైనీయులు ముఖ్యులు.

మన దేశానికి సంబంధించి, గణరాజ్యాల స్థానంలో మహా సామ్రాజ్యాల నిర్మాణం జరిగిన క్రమంలో భారతీయ పాలకులు వ్యాపారరంగ విజయాలకు సుస్థిరతను కల్పించారు; తద్వారా లబ్ధి పొందారు. యుద్ధకాలాల్లో చక్రవర్తులకు అప్పులిచ్చే జగత్‌సేఠ్‌లు ఉద్భవించారు. ‘హుండీ’ వ్యవస్థ ద్వారా వారు విదేశీ మారక ద్రవ్యాలను కూడా వ్యాపారుల అందుబాటులోకి తెచ్చేవారు. వ్యాపారం సుస్థిరతని కోరుకుంటుంది; బందిపోటు దొంగలు, శత్రుసైన్యాలు, విదేశీ పోటీదారులు – వీరి నుండి రక్షణని కోరుకుంటుంది. అనుకూలంగా ఉండే సుంకాలను, మినహాయింపులను స్వాగతిస్తుంది. ఈ ఇష్టాయిష్టాలు ఈనాటివి కావు.

అయితే ఈ శక్తుల ఘర్షణలో ఆనాడు స్త్రీల స్థానం అంతంత మాత్రమే; శ్రమకు భద్రతలేదు; శ్రామికులకు రక్షణలేదు; అవినీతిపరులైన అధికారులు – వ్యాపారులతో సహా అందర్నీ వేధించారు. ఇవన్నీ ఈ నవలలో మనకు తారసపడతాయి. రాచరికమైనా, సామ్రాజ్యవాదమైనా దోపిడీకి గురవుతూ, అన్ని విధాలా నష్టపోయేవారు అణగారిన వర్గాలవారూ, శ్రామికులూను. ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే కదా? అనిపిస్తుంది, పాఠకులకు. ఉత్తమ చారిత్రక రచన ఉండాల్సిన లక్షణం, గతాన్ని వర్తమానంతో జోడించగలగడం. ఆ పనిని ‘పట్టుతోవ’ నవల  సమర్థవంతంగా నిర్వహిస్తుంది.

అవి భూమార్గాలైనా, సముద్రమార్గాలైనా వాణిజ్య రహదారులవెంట బౌద్ధం ప్రయాణించి, విస్తరించిందని మనకు తెలుసు. వ్యాపారులకు లాభాపేక్ష ఉంటుంది. నిస్వార్థంగా, కేవలం ధర్మప్రచారం కోసమని ఎన్ని వందల తరాలపాటు, ఎన్ని వేలమంది భిక్షువులు, భిక్షుణిలు ఈ ప్రమాదకరమైన ప్రయాణాలు చేశారో? ఏయే అవస్థలు పడ్డారో? ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకున్నారో? వారంతా అనామకులుగా మిగిలిపోయారు. కాలగర్భంలో కలసిపోయారు. తలచుకుంటే గుండె బరువెక్కుతుంది.

ఈ నవల మన ముందుంచే ఇతిహాసపు చీకటికోణాలన్నింటిపైనా బౌద్ధం అనే మహత్తరమైన ఒక వెలుగును ప్రసరిస్తుంది. ఈ రచన అంతటా శ్రమజీవుల ఆశాకిరణంగా బౌద్ధం వెలుగుతుంది. వసుధేంద్ర తన నవలను శాక్యమునికి అంకితం ఇవ్వడం యాదృచ్ఛికం కాజాలదు. ఇతివృత్తంపై లోతైన ఆసక్తి, పరిశోధనలో నిబద్ధత, సృజనాత్మకతపై పట్టు లేకపోతే ఇటువంటి రచన అసాధ్యం.

అయితే ఈ నవల ముగింపు పేలవంగా ఉంది. చక్రవర్తితో సంపర్కానికై ఎదురుచూస్తూ తమ జీవితాలను గడపివేసే వందలాది దిగువస్థాయి రాణీలలో ఒకరిగా కాలం వెళ్లబుచ్చుతూన్న లీహ్వాను శత్రువులకు ‘కానుక’గా ఇవ్వజూపే ప్రయత్నాలు మొదలవుతాయి. చీనా సామ్రాజ్యంపై కసితో ఆమె పట్టు పురుగులను దొంగచాటుగా బయటి ప్రపంచానికి చేరవేసే ప్రయత్నానికి పూనుకుంటుంది. ఆమె చెలికత్తెగా వ్యవరిస్తూన్న విదేశీవనిత హీ (ఆమె అసలుపేరు మధుమాయ) సహాయం తీసుకుంటుంది. బోలుగా ఉండే బుద్ధ విగ్రహంలో పట్టు పురుగులను దాచిపెట్టి, హీ పశ్చిమ దిశగా ప్రయాణం కడుతుంది.

కొన్ని వందల ఏళ్లుగా చైనీయులు కాపాడుకుంటూ వచ్చిన పట్టు పరిశ్రమ రహస్యం మధుమాయ ద్వారా పశ్చిమదేశాలను చేరుకుంది అని మనం ఊహించాలి. బహుశా అది అటువంటి మొదటి ప్రయత్నం కావచ్చు. నిజానికిది  ‘పట్టుతోవ’ నవలకు ఆయువుపట్టు. ఈ సాహసాన్ని, పర్యవసానాలను మరింత వివరంగా, ఉత్కంఠభరితంగా రచయిత చెప్పిఉండవచ్చు. దుర్మార్గమైన రాచరిక వ్యవస్థపై, బాధితులైన ఇద్దరు మహిళల ప్రతీకారంగా నవల ముగింపుకు న్యాయం జరిగేది. ఎందుకోగాని ఆ అవకాశాన్ని వసుధేంద్ర చేజేతులా వదులుకున్నాడు.

చివరిగా ఒకమాట చెప్పుకోవాలి. ఈ నవలా కాలంలో పట్టు పరిశ్రమ రహస్యం, ఐరోపా ఖండాన్ని చేరుకుందనడానికి దాఖలాలు లేవు. చీనా పొరుగు దేశమైన జపాన్‌ని అది క్రీ.శ. 500కి ముందుగానే చేరిందంటారు. మరో ఏభై ఏళ్లల్లో క్రైస్తవ మతబోధకులు పట్టు పురుగులను వెదురు బొంగులలో దాచిపెట్టి, ఐరోపా పాలకులకు అందజేశారనడానికి ఆధారాలున్నాయి.

పట్టుకి ఏర్పడ్డ మారకపు విలువ ఏ స్థాయికి చేరుకుందంటే, అదే ప్రామాణిక ద్రవ్యాధారంగా అవతరించింది. చైనీయ సైనికులు తమ జీతాలను పట్టువస్త్రాల రూపంలో చెల్లించాలని కోరుకొనేవారు. మరోవైపు రోమ్ సామ్రాజ్యంలోని ధనికులు, తమ మహిళలు పట్టు బట్టలపై మోజుతో తమ సొమ్ముని తగలేస్తున్నారనీ, ధనమంతా చైనాకి మళ్లిపోతున్నదనీ వాపోయారు. పైగా పల్చగా ఉండే పట్టుబట్టలు స్త్రీల శరీరాకృతిని బహిర్గతం చేస్తున్నాయనీ, వాటినీ నిషేధించాలనీ మొరపెట్టుకున్నారు. చైనా పట్టుతోవ ప్రపంచాన్ని అనేక దిశల్లో మార్చివేసింది. దాని ప్రకంపనాలు ఇప్పటికీ వినవస్తున్నవి.

ఇటీవలి కాలంలో చైనా ప్రభుత్వం చేబట్టిన Belt and Road Initiative (BRI) ఒక విధంగా అత్యాధునిక పట్టుతోవ. ఆధునిక పారిశ్రామిక దేశంగా, యావత్ ప్రపంచానికే ఫ్యాక్టరీగా అవతరించిన చైనా, తన ఎగుమతులను ఐరోపా ఖండానికీ, అక్కడినుండి ఇతర ప్రాంతాలకూ పంపిణీ చేసే బృహత్ పథకం ఇది. చరిత్ర పునరావృతం అవుతోందా?

తెలుగులో పట్టుతోవపై పరిశోధనలుగానీ, సృజనాత్మక సాహిత్యంగానీ వెలువడినట్టులేదు. అయితే, నిరంతర యాత్రికుడు పరవస్తు లోకేశ్వర్ సిల్కురూట్‌లో స్వయంగా ప్రయాణంచేసి, ఆ ఙ్ఞాపకాలను ప్రచురించాడు (‘సిల్కురూట్‌లో సాహస యాత్ర’). పై పరిమితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇది తెలుగు పాఠకులకు అందిన అపురూపమైన కానుక.

విద్యా, సాంస్కృతిక రంగాలలో నేడు అనేకానేక వికృత, ప్రజావ్యతిరేక ధోరణులు ఆధిపత్యం చెలాయిస్తూన్నవి. చరిత్రకారులకూ, చరిత్ర ఆధారంగా రచనలు చేసేవారికీ ఇది పరీక్షా సమయం. ఈ సమయంలో ‘పట్టుతోవ’ నవల వెలువడడం ఆహ్వానించదగ్గ పరిణామం. తెలుగులో చారిత్రక రచనలను ఆస్వాదించే పాఠకులనూ, అలాగే ఆ ఆసక్తి కలిగిన రచయితలనూ ఇది చేరుకోవాలి; నేటి అంధకారంలో కొంత మేరైనా వెలుతురు ప్రసరించాలి.

రచయిత వసుధేంద్రకీ, అనువాదకులు రంగనాథ రామచంద్రరావుకీ అభినందనలు. అనువాదం సాఫీగా, సరళంగా సాగిపోయింది. అచ్చుతప్పులు బాధించలేదు. తెలుగు పాఠకులకు ఇంతటి విశిష్టమైన చారిత్రక రచనను అందజేసిన ప్రచురణకర్తలు ఛాయా వారికి కృతఙ్ఞతలు.

‘పట్టు తోవ’ – చారిత్రక నవల. కన్నడ మూలం: వసుధేంద్ర. తెలుగు అనువాదం: రంగనాథ రామచంద్రరావు.

ఛాయా రిసోర్సెస్ సెంటర్, హైదరాబాద్. పే.438. వెల రూ.475/-.

ప్రతులకు: www.chaayabooks.com


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *