రాత్రి రెండు గంటల వేళ, దళిత మహాసభ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది, నాన్న చనిపోయాడని, ఆయన ఫోన్ బుక్ లో నా నంబరు ఉందంటూ.
ఈ ఇరవై యేళ్లలో ఆయన తన కుటుంబం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రపంచానికి ఆయనొక ఒంటరి జీవిగానే తెలుసు.
రెండు రోజులుగా పెనుతుఫాను, రోజంతా వాన, చిత్తడి. హాస్పిటల్ నుంచి, ఆయన శరీరాన్ని, ఆయన సొంత ఊరు కలిచేడు చేరుస్తామని చెప్పాడు, ఆ ఫోన్ చేసిన మనిషి. “నేను స్వేచ్ఛగా, నిర్బంధాలు లేని వాక్యంగా జీవించగలిగే ప్రదేశం. అక్కడ భూమి నాతో సంభాషిస్తుంది. ముఖ్యంగా మా యింటి ఎదురుగా ఉన్న రాతి చప్టా, అది నా ప్రార్థనాస్థలం,” అని ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో అన్నాడు నాన్న.
బస్ ఎక్కుతూ పేపరు, వీక్లీ కొన్నాను. వీక్లీలో నాన్న ఇంటర్వ్యూ, ఆయన రాసిన కథ. ఆ ఇంటర్వూ చివరి ఇంటర్వ్యూ, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు దళిత మహాసభ ఆఫీసులో ఇచ్చిన ఇంటర్వ్యూ. (మొదటిసారిగా అందులో అమ్మ ప్రస్తావన ఉంది. అమ్మ గురించే, ఎక్కడా నా ఊసేలేదు.) ఆ కథ, బహుశ, అది ఆయన చివరి కథ అయ్యుంటుంది. ఆత్మకథలా ఉంది. ఎలిజీలా కూడా ఉంది.
వీక్లీని మూసివేసి, నాన్న రూపాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించాను. దాదాపు సంవత్సరం అయ్యింది ఆయన్ను చూసి. ఏదో హాస్పటల్లో చూశాను. అదే చివరిసారి ఆయన్ను చూడటం. పెద్దగా మాట్లాడలేదు. మృదువుగా నా తలను నిమిరాడు. ఆయన రాసిన కొన్ని పుస్తకాలు, ఆయనది పాత డైరీ నాకిచ్చాడు. ఇక్కడ ఎక్కువ సేపు ఉండొద్దు వెళ్లు అంటూ. అదే చివరి జ్ఞాపకం.
వాన ఆగిపోవడం కోసం ఎదురుచూశాము. పొడి గాలి లేదా ఉగ్రమైన ఎండ కావాలని ఆ వానలోనే డప్పు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. (ఆయన రాసిన పాటలే.) వాన చినుకుల చప్పుడులో పాట పదాలుగా విడిపోయి, గాయపడిన పదాలుగా దుఃఖంతో తడిసిన పదాలుగా ఆయన శరీరం పై పదో, ఇరవయ్యో గొడుగులు పట్టి చుట్టూ నలభయ్యో, యాభైమందే ఉన్నారు. అక్కడంతా నిశ్శబ్దం. వీధి అరుగుపై కూర్చున్నాను నేను. నా పక్కన హైదరాబాద్ నుంచి వచ్చిన యూనివర్శిటీ కుర్రాళ్లు కూర్చున్నారు. నాకు కాస్త దూరంలో ‘పాటల రాణి’ కూర్చుంది. కంజెర మోగిస్తూ పాటలు పాడాలని ప్రయత్నం. పాటలు వెలికి రావటంలేదు. ఆమె గొంతు నిండా దుఃఖపు జీర. అమ్మ కోసం వెతికేను. ఆ చివరనెక్కడో కారు ఆగి ఉంది. ఆ కారులోనే లేదా ఆ గుంపు వెనకనో, ఎక్కడో అమ్మ ఉండే ఉంటుంది.
వానను దాటుకొని, రాతి చప్టాపై నిర్జీవంగా పడి ఉన్న నాన్న శరీరంవైపు పరిగెత్తాలని పెద్దగా ఏడ్చి దుఃఖాన్ని ప్రకటించి (శోకండాలు పెట్టి), లేదా అమ్మవైపు నడిచి, అమ్మ భుజంపై చెయ్యి వేసి, దగ్గరకు లాక్కొని, ఓదార్చి… (ఆమె ముఖంలో దుఃఖపు ఛాయలేమైనా ఉంటాయా?) కానీ నేనీ వీధి అరుగుపైనే, దుఖాన్నో ప్రేమనో వ్యక్తం చేసే పదాలు మౌనంగా, నిశ్శబ్దంగా…
అమ్మ, నేను ఇద్దరం స్త్రీలం అనే విషయం తప్ప మా ఇద్దరిలో సామ్యామైన విషయాలేమీ లేవు. ఆమె తెల్లగా, పొడవుగా గంభీరమైన ఆలోచనలా ఉంటుంది. నేను నల్లగా (నాన్నలాగే) భూమిపుత్రికలా ఉంటాను. ఆమె జనసమూహాలకు అవతల, ఆదివాసీల మధ్య, చిన్న చిన్న ఉద్యమాలు నిర్మిస్తూ, కోర్టుల్లో దావాలు వేస్తూ. ఆమెను నేను దగ్గరగా చూసిన సందర్భాలు కొద్దిగానే ఉన్నాయి. చానాళ్లపాటు కులం, వర్గం వద్దంటూ పోట్లాడింది ఆమె. నేనేమో కులమనే గాయాన్ని మోసుకుంటూ, దళిత ఏక్టివిస్టుగా నాకొక కార్యస్థలం, నేనో రచయితను, కాలమిస్టును.
కృష్ణానదికి ఆవలివైపు ఊరు అమ్మ వాళ్లది. ఇవతలవైపు నాన్న ఊరు. ఆమె ఏక్టివిస్టు, కవి, ఎక్కువగా వ్యాసాలు రాసేది. నాన్నతో కలిసి ఒక పత్రిక కూడా నడిపింది. ఒక గుడ్డసంచిలో కరపత్రాలు, చిన్న చిన్న కవితలు రాసుకునే డైరీ. ఆమె తన ముప్పైయవ ఏట నాన్నను పెళ్లి చేసుకుంది. పొడవైన నల్లటి సూర్యుడిలాంటి (హాండ్సమ్) దళిత మేధావి నాన్న. ఆ పెళ్లిని ఒక పోరాట ప్రకటనలా ఇద్దరూ భావించారు. నా బాల్యమంతా కవులు, రచయితల, పొలిటి కల్ ఏక్టివిస్టుల మధ్య గడిచింది. నా పదో ఏట వాళ్లిద్దరూ విడిపోయారు.
నా వరకూ వాళ్లిద్దరూ, నా పుస్తకాల మధ్యన దాచుకున్న ఫోటోలు మాత్రమే. వెల్ఫేర్ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో, ఒంటరిగా పెరిగాను. నా కులపు అవమానాల్ని, విజయాన్ని కథలుగా, వ్యాసా లుగా రాస్తూ…
వాన నిరంతర దుఃఖంలా కురుస్తుంది. వానలో తడుస్తూనే చాలామంది, అభిమానులు, స్నేహితులు అక్కడకు చేరారు. అంత్యక్రియల గురించి చర్చలు జరుపుతున్నారు. అంత వానలోనే నాన్న శరీరం పక్కన కూలబడి, జోసఫ్ అనే కళాకారుడు, డప్పుతో గొంతెత్తి పాడుతున్నాడు. తడిచిన డప్పు శబ్దాల్లో, దుఃఖపు గాఢత ఉంది. నా పక్కనే కూర్చున్న పాటల రాణి, జోసఫ్ పాటలకు కోరస్ లాగా పాడుతుంది. చిక్కటి, గాఢమైన దుఃఖపు రంగులో ఉన్న నల్లటి వస్త్రాన్ని ఆయన శరీరం పై కప్పారు. ఎర్రజెండాను కప్పుదామని కొందరు ప్రయత్నించారు. ఆ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. అక్కడున్న వాళ్లలోంచి కుర్రాడొకడు ముందుకు వచ్చి, నాన్న రాసిన పోయమొకటి చదువుతున్నాడు.
నా నాలుకపైని అక్షరాలన్నీ తలలు నరికేసిన శిశువుల్లా…
నేను నాన్న గురించే ఆలోచిస్తున్నాను. ఆయన జీవితం, ప్రపంచం ఆయన గురించి చేసిన తీర్మానాలు, ముఖ్యంగా అతని మరణం, అంత నిగర్వంగా, ఒంటరిగా (దళిత మహాసభ ఆఫీసు వరండాలో, ఏ నిశి రాత్రివేళ, ఎవరూ లేని ఒంటరితనంలో, ప్రపంచాన్ని విడిచిపోయాడాయన). అక్కడ మూగిన జనం, ఆయన జీవితం గురించే మాట్లాడుతున్నారు. జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు. ‘నేను ప్రపంచానికి పోరాటాన్ని నేర్పడానికి వచ్చిన ప్రవక్తను,’ అనేవాడు నాన్న. ఆయనో గొప్ప ప్రేమికుడు. ఆయన కళ్లనిండా కరుణ, ప్రేమ… ఆ కళ్లు మనల్ని ఆలింగనం చేసుకొని, ఆయన ఉద్యమాలు, ఆయన ప్రేమ కథలు, పుస్తకాలు, పాటలు, ఇవి ఉన్నా ఆయన ఒంటరిగానే జీవించాడు. ప్రపంచాన్ని శపించిన వాడిలా ఆయనంటే కోపం, ధిక్కారం. ఆయనో తాగుబోతు కూడా. రోజంతా ఆల్కాహాలు తాగుతూనే ఉంటాడు (ఆ ఒక్క అలవాటే లేకపోతేనా, అంటూ వెనక నుంచి ఎవరో కామెంట్ చేస్తున్నారు).
నిండుగా పారుతున్న కాలువ ఒడ్డున రాగిచెట్టు. చెట్టు కింద, ఎన్నో యేళ్ల క్రితం, మునిసిపాలిటీ వాళ్లు వేసిన సిమెంటు బల్లపై ఆయన పడుకుని ఉన్నాడు. ఆయనకా ప్రదేశం ఇష్టం. అక్కడే ఆ చప్టా కింద కూర్చుని, మార్క్సుని చదివాడు. ఉద్యమ రహస్యపు డాక్యుమెంట్లు (సైక్లో స్టైల్డ్) చదివేవాడు. అక్కడే తన మొదటి కవితను రాసుకున్నాడు. ఆ చప్టా ఎదురుగానే ఆయన ఇల్లు. చాలాయేళ్లుగా ఆ ఇంటిలోకి వెళ్లటం మానివేశాడు. ఎప్పుడొచ్చినా ఆ రాతి బండపైనే, ఏ రాత్రిపూటో వచ్చి, దానిపై పడుకొని, తన శాలువాని నిండుగా కప్పుకొని, పొద్దున్నే సూర్యుడితో సహా ప్రత్యక్షమవుతాడు. ఉద్యమపు పాటలు కట్టిన ప్రదేశం అదే. విప్లవ పార్టీ నుంచి బహిష్కరింపబడినాక, ఎన్నో రాత్రులు ఈ చప్టాపై (ఇక్కడే తాగి తాగి, స్పృహ లేకుండా పడిపోయి, ఎవరో లేవదీసి, రెండు ముద్దలు పెట్టి) అంబేద్కరిజాన్ని చదువుకున్నాడు. నలుపు రంగు దళిత ఉద్యమాన్ని కలలు కన్నది ఇక్కడే. ఆ ప్రదేశంలోనే ఆయన అంత్యక్రియలు చేయాలని, శరీరాన్ని అక్కడకు తరలించారు.
క్రమంగా ఆ ప్రదేశంలో, ఐదువందలకు పైగా జనం చేరారు. తడిసిన శరీరంపై వందలుగా దండలు ముఖం తప్ప మిగిలిన శరీరాన్ని మొత్తం పూలతో కప్పి ఉండీ ఉండీ, పెద్ద ఎత్తున నినాదాలు మోగుతున్నాయి. వానలోనైనా ఒక ఊరేగింపును తీయాలని నిర్ణయించారు. శరీరంపై దండలన్నీ తీసి, ఆయన శరీరాన్ని అంతిమయాత్ర సిద్దం చేశారు. దగ్గరకు వెళ్లే సాహసం చెయ్యలేకపోయాను. శరీరంలో వణుకు. అమ్మ కోసం చూశాను. ఆ గుంపులో ఎక్కడో అదృశ్యమైంది. అమ్మ తప్పనిసరిగా ఆ సమూహంలో ఎక్కడో ఉంటుందని నా నమ్మకం. నా పక్కనే కూర్చున్న పాటల రాణి, ఒక పాటను ఎత్తుకుంది. శ్రావ్యంగా, దిగాలుగా, మహా ప్రవాహంలా నేను నాన్న డైరీలోంచి, (సరిగ్గా సంవత్సరం క్రితం, నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు, తన దిండు కింద దాచిన డైరీ నాకిచ్చాడు), ఒక్కొక్క పేజీనీ పైకి పెద్దగా చదువుకుంటూ
1. ఏడుగురు సంతానంలో ఐదోవాణ్ణి. ఐదుగురు మగపిల్లల్లో మూడోవాణ్ణి. దళితులు అనే మాట ఇంకా వాడుకలో లేని కాలం అది. నేనో ప్రత్యేకమైన వర్గం వాడిననే విషయం నా చిన్నతనంలోనే అర్థమైంది. అయితే ఆ విషయాన్ని తిరస్కరిస్తున్నట్లుగా ప్రవర్తించే వాడిని. నాదొక ప్రత్యేక ప్రపంచం. ప్రత్యేకమైన భాష. విశృంఖలత్వాన్ని ధరించిన వాడిలా, నా చూపూ, రూపూ (దువ్వెనకు లొంగని నా జుట్టు కూడా నా తిరస్కార ప్రకటనలా ఉండేది).
2. మా ఇల్లు రెండు వీధులకు మధ్యన (అమ్మ, నాన్నలిద్దరూ టీచర్లు). మా ఇంటికి అటు వెళితే ఫిలిప్స్ ఫాదర్ యిల్లు. ఇటు చూస్తే రేకులు, తాటాకులు కప్పిన చిన్న చిన్న ఇళ్లు. దుఃఖమూ, బాధలు తెలియవన్నట్లుగా, పిల్లలందరూ ఆటల్లో మునిగిపోయేవాళ్లు. మేము ఆదమరచి ఉన్నప్పుడు, ఎవడో ఏసేబు విషయాన్ని గుర్తుకు తెచ్చేవాడు. మా ముఖాలు, ముఖ్యంగా నా ముఖం నిప్పులకుండలా భగభగమనేది. వెన్నులోంచి సన్నని పామేదో బయటకు వచ్చేది. నా జీవితమంతా నన్ను వెంటాడిన దృశ్యం ఏసేబు మరణం, ఒక మెటాఫర్లా, నా జీవిత తాత్వికతని నిర్ణయించిన జ్ఞాపకం అది. మా యింటికి ఇరవై ఐదు ఇళ్ల అవతల, వీధి మధ్యలో గుంజకు కట్టివేసి, అతని శరీరంపై పెట్రోలు పోసి, నిలువునా తగలబెట్టిన సంఘటన.
ఆ వీధి, ఆ రాతిగుంజ, ఇన్నేళ్ల తరువాత కూడా, అక్కడో తగలబడు తున్న శరీరం, నల్లగా, కమిలిపోయి, కమురువాసన వేస్తూ, ఏసేబూ, ఏసేబూ, అంటూ, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నట్లు గాలినిండా ఏడుపులే. ఏసేబు తగలబడిన చోటే, నేను నా మొదటి పాట రాశాను. డప్పుపై సన్నగా దరువు వేస్తూ నా మొదటి పాట, అక్కడే కట్టాను.
3. మా యింటి వెనక గదికుండే కిటికీ దగ్గర కూర్చోవటం నాకిష్టం. అక్కడినుంచి సమాధుల తోట కనిపించేది. కొన్ని సాయం కాలాలు నల్లటి ముసుగు కప్పుకున్నట్లుగా ఉండేవి. చావు ఉరేగింపులు, ఆ కిటికీ ముందు నుంచే వెళ్లేవి. గుండెలవిసేలా ఏడుస్తూ ఆడవాళ్లు, పిల్లలు. ఆ దృశ్యం చూసి నాకూ ఏడుపు వచ్చేది. ‘అసలు మనుషులెందుకు చచ్చిపోవాలి’ అని ప్రశ్నించుకునేవాణ్ని. చావు నాకెదురైతే, దానితో పోట్లాడాలని, ఎదురు తిరిగి కలబడాలనిపించేది. మా వీధి అరుగుల పైనా, చప్టాలపైనా, మా పెద్దవాళ్లందరూ కూర్చుని, దూరంగా ఎటువైపుకో చూస్తూ (బహుశా అనంత శూన్యం లోకి) నిశ్శబ్దంగా, మాటలు లేనట్లుగా, జ్ఞాపకాలన్నీ చచ్చిపోయిన వాళ్లలా ఉండటం నన్ను భయపెట్టేది.
4. సెప్టెంబర్ 84లో నేను గుంటూరు వచ్చాను. నా కాలేజీ మిత్రుడొకడు చచ్చిపోయాడు. చావు మళ్లీ నన్ను కవ్విస్తుంది. ఆ చనిపోయిన మిత్రుడూ, నేనూ కలిసి తిరిగిన వీధులన్నీ పిచ్చివాడిలా తిరిగాను. వాడికోసం ఒక కవిత రాసి, పెద్దగా చదువుతూ (వద్దనుకున్నా ఏడుపు వస్తుంది). ఇది చివరి ప్రకటన, చావును, ఏడ్పునూ తిరస్కరిస్తున్నాను, అనుకున్నాను.
5. మనద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి, అందా అమ్మాయి. “we are so much alike. ఒకే భావానికి రెండు రూపాలం మనం” అంది. అప్పటికి మేమిద్దరం, విప్లవ పార్టీలో సభ్యులం కూడా. మా యిద్దరిని వేరు వేరు కులాలు అనే విషయాన్ని, నేనెందుకో మరిచిపోయాను. దళితుడననే విషయాన్ని కూడా నేను మర్చిపొయ్యాను. కానీ పార్టీలోని కొద్దిమంది సభ్యులు ఆ విషయాన్ని మర్చిపోలేదు. ముఖ్యంగా మమ్మల్ని వేధించి, వెంటాడి నాకు వ్యతిరేకంగా తీర్మానాలు, ఆరోపణలు. పేగు కోసుకొని బయటకు వచ్చాను. ఒక అమ్మాయి, అబ్బాయి, వాళ్లిద్దరూ నిర్మించుకొన్న ప్రేమ అనే విశ్వాసం వాళ్లెందుకు విడిపోతారు. మొదటి పోటు పొడిచిన ‘బ్రూటస్’ ఎవరు?
6. ఆ రోజులలోనే, నేను మరో చావుకు వెళ్లాను. అతనో ఇంజనీరింగ్ విద్యార్థి. కాలేజీలో కులం పేరుతో అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సన్నగా, నిస్సహాయంగా ఉన్న వాడి శరీరం వైపు చూస్తూ కూర్చున్నాను. ఆశ్చర్యంగా నాకు దుఃఖం రాలేదు. కోపం వచ్చింది. ఆ చనిపోయిన వాడి నిర్లక్ష్యంపై కోపం వచ్చింది. అంత అమాయకంగా, unguardedగా జీవించినందుకు కోపం వచ్చింది. అతని శరీరం నల్లగా ఉంది. కళ్లు గాఢంగా ఎటో చూస్తున్నాయి. అతని శరీరంపై బట్టలు, వదులుగా, రాతికి చుట్టిన బట్టల్లా ఉన్నాయి. అతన్నింక మళ్లీ చూడలేను. మట్లాడలేను, అనే విషయం గుర్తుకొచ్చి, అతని పై కోపం వచ్చింది. నాపైన కూడా కోపం వేసింది. అప్పటికప్పుడు మరణాన్ని వ్యతిరేకిస్తూ, ఒక పాటను పాడాను. అక్కడే చాలామంది మిత్రులు కలిశారు. ఇక దుఃఖం వద్దు, మరణం వద్దు అని తీర్మా నించుకొన్నాము అందరం. ఒకరినొకరు కౌగిలించుకున్నాము. కవితల్లా అల్లుకుపోయాము.
7. ఆ రోజు ఆ చావు దగ్గర, నేను మరికొన్ని దృశ్యాలు చూశాను. దూరం నుంచి ఆడవాళ్లు, ఒక సమూహంలా కూడి, గుండెలవిసేలా ఏడుస్తూ, ఆ చనిపోయిన వాడి జ్ఞాపకాన్ని ఏకరువు పెడుతున్నారు. వాళ్లకు దగ్గరలోనే కూర్చున్న మగవాళ్లు, ముసలివాళ్లు, వాళ్ల ముందర సారాయి సీసాలు వాళ్లు మరణాన్ని జయించిన వాళ్లలా, ప్రవక్తల్లా వెలిగిపోతున్నారు. కొంచెం ఆశ్చర్యం వేసింది. నేనూ వాళ్ల పక్కన కూర్చుని సారాయి తాగాను. నా ఆత్మ పైని దుఃఖపు ముసుగులన్నీ చిరిగిపొయ్యాయి. నేనో మహావృక్షమంత ఎదిగాను, నా బాల్యమంతా ఆకుపచ్చని తోటలా నాకెదురైంది. యవ్వనం, ప్రేమ, ఆమె, ఋతు ఘోషలా నన్ను ఆలింగనం చేసుకున్నాయి. అది మొదలు తాగుడు నా ఆత్మకథలో ముఖ్యమైన భాగమైంది.
8. నాలుగు రోడ్ల కూడలి మధ్యన ఎత్తైన వృక్షంలా నిలబడి కుడివైపున మృత్యు భూములు, మరణించిన వాళ్ల సమాధులు, ఎడమ వైపున ఉదయిస్తున్న నల్లనల్లని సూరీడు (ఆ తరువాత, నాన్న డైరీలో పేజీలన్నీ, అక్షరాలన్నీ వెలిసిపోయి, ఖాళీ, ఖాళీగా ఉన్నాయి. 9 నుంచి 92 వరకూ ఆయన డైరీ జ్ఞాపకాలు మాయం అయ్యాయి).
93. ఉద్వేగాన్నో, కోపాన్నో ఎట్లా వ్యక్తం చేస్తాము. నలభై రోజుల ఆందోళన, రూపంలేని ఆందోళన, ప్రియమైన ముఖం, నిజాయితీ కలిగిన పలకరింపులు లేని రోజులు. ఎదురుగా ప్రశ్నలు, ప్రశ్నలు, ఆత్మ ప్రశ్నల జెండాలా. రాబోయే నలభై రోజులకొక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
94. ఈ రాత్రి కొత్త పోయమ్ రాయాలి. సంపాదకీయం రాయాలి. కవికి నా ఇష్టాన్ని చెప్పాలి. సంచార జీవితంపై ఈ గాఢమైన వాంఛ బహుశా నా పూర్వీకుల వారసత్వమేమో. నా లోపల ఒక పక్షి గాయపడి, రక్తమోడ్చుతూ, క్రీచ్, క్రీచ్ మంటూ నేనో గడ్డగట్టిన అవమానాన్ని, నలుపురంగు కేకను. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. లేను.
95. డి.ఎస్. పత్రిక కోసం ఒక కొత్త కథ రాయటం మొదలు పెట్టాను. కథ ఇలా మొదలౌతుంది. జోసఫ్ గుడ్డివాడు. రంగు రంగుల చీరల్ని తీసుకొచ్చి దళిత వాడల్లో అమ్ముతాడు. అతని బండికో బెల్ ఉంటుంది. దాని ట్రింగ్ ట్రింగ్ శబ్దానికి పల్లె ఉలిక్కిపడుతుంది. జోసెఫ్ వచ్చిన రోజు పల్లె రంగు రంగు చీరల్లో మెరిసిపోతుంటుంది. గుబురు మీసాలతో, గడ్డాలతో చర్చి ఫాదరు, తెల్లని అంగీతో, గాయ పడ్డ పావురంలా శిలువ ముందు కూర్చుని ప్రార్ధిస్తుంటాడు. మైకులో ఆయన ప్రార్థనంతా పల్లెకు వినిపిస్తుంది. ఉండీ ఉండీ ఫాదరు పెద్దగా ఏడుస్తుంటాడు. పల్లెలోని వాళ్లందరినీ, ఆదివారాలు, నల్లబట్టలు వేసుకోమని ఆజ్ఞాపిస్తాడు. మనకు విముక్తి రాలేదంటాడు. జోసెఫ్ ని రంగు చీరలు అమ్మొద్దని శాసిస్తాడు. ‘గుడ్డివాణ్ణి నాకంతా నలుపే కదా, ప్రభువా!’ అంటాడు జోసెఫ్. ఒక ఆదివారం పల్లె సరిహద్దులన్నీ మూయించాడు ఫాదరు. ఆఫ్రికాదేశపు పోరాటకథలన్నీ వాళ్లకు వినిపిస్తాడు. చికెన్ తో ఊరంతటికీ విందు చేశాడు ఫాదరు. ఆ సాయంకాలం చర్చి వెనుకనున్న చెట్టుకు, నలుపు రంగు కండువాతో ఉరివేసుకున్నాడు ఫాదరు.
పల్లెంతా ఫాదర్ పునరుద్దానం కోసం ప్రార్థనలు చేస్తున్నారు రోజూ. జోసెఫ్ ఇప్పుడు నలుపురంగు చీరల్నే అమ్ముతున్నాడు – కథ రాయటం ఆపివేశాను. కథలోని ఫాదర్ పునరుత్థానం చెందుతాడని నేనీ రాత్రి గట్టిగా నమ్ముతున్నాను.
96. మరో కథ (ఉదయం వీక్లీలో చదివిన కథ), ఆ కథ ఇలా సాగుతుంది. ‘రెక్కలు’
ఒక మనిషి పాతికేళ్ల పాటు, రాత్రీ పగలూ శ్రమించి, తన కోసం ఒక జత రెక్కలు తయారుచేసుకున్నాడు. ఆంధ్రదేశం, 1980ల కాలం. మొదట్లో ఎరుపు రంగు రెక్కల్ని తయారుచేసుకున్నాడు ఆ మనిషి.
ఉదయపు వేళల్లో, తూరుపుదిశలో సూర్యుడు మెల్లగా కళ్లు తెరుస్తున్న సమయంలో ఆ రెక్కల్ని ధరించేవాడు. అడవిలోని ఎత్తైన చెట్టు ఎక్కి మేఘాలవైపుకు, ఆకాశం వైపుకు, అంతా వెలుగే నిండిన ఒక మహా దృశ్యం వైపుకు ఎగరాలని ప్రయత్నించేవాడు. ఎర్రెర్రని పాటలతో సూర్యుణ్ణి కీర్తిస్తూ, ఆకాశం వైపుకు ఎగిరేవాడు. ఎగరలేక, జారి, ఏ కొమ్మపైనో పడి, రెక్కలు విరిగిపోయి, గాయాలతో, విరిగిన రెక్కలతో ఇంటికి చేరేవాడు. నిరుత్సాహపడకుండా మళ్లీ రెక్కల్ని తయారుచేసుకునేవాడు. పాటలతో, కవిత్వంతో తన్ను తాను ఉత్సాహపరుచుకునేవాడు.
ఆ మనిషికి క్రమంగా ఎగరటం అనేది ఒక అబ్సెషన్ అయ్యింది. ఇంటిని వదిలేశాడు. చదువును వదిలేశాడు. చెట్ల పైనే జీవించటం మొదలుపెట్టాడు. అడవికి దగ్గరలోనే ఒక ఫ్యాక్టరీలో చేరాడు. పగలంతా అక్కడ పనిచేసేవాడు. రాత్రివేళ ఒక పొడవాటి రాతిసంచిలో రెక్కల్ని పెట్టుకొని, అడవివైపు వెళ్లేవాడు. ఎత్తైన ఒక చెట్టు పైన మనిషి పట్టేంత గూడును తయారుచేసుకున్నాడు. ఆకుపచ్చని చెట్లు, గంభీరమైన చెట్లు, రాత్రివేళ చెట్ల ఆకుల్లోంచి మిణుక్కుమనే చుక్కలు, వాటిని చూసి మోహపడేవాడు. వెన్నెల రాత్రులయితే, అతని పరవశానికి హద్దేలేదు.
ఉదయం అవుతూనే గుంపులుగా పక్షులు, సంగీత గమకాలతో, ఆకాశం వైపు రెక్కలు విప్పేవి. అతనూ, తన ఎరుపు రంగు రెక్కలతో, వాటికి పోటీగా ఎగరాలని, ఎగిరిన ప్రతిసారీ అతను విఫలమయ్యేవాడు. అది 1988వ సంవత్సరం. ఒకరోజు, దాదాపు పది అడుగుల పైకి ఎగరగలిగాడు. గాలివాటం వైపు దిశను మార్చాడు. అయితే బలమైన గాలి వేగానికి రెక్కలు రెండుగా విరిగి, అదుపు తప్పి నేలపై కూలిపోయాడు. కాలు విరిగింది. కాలికి, చేతికి, పిండి కట్టువేశారు. అతను పనిచేసే ఫ్యాక్టరీలో పెద్ద అలజడి అయ్యింది. అతని రహస్య సాహసాన్ని, అందరూ తీవ్ర స్వరంతో ఖండించారు. అతడ్నొక అనార్కిస్టు స్వాప్నికుడిగా ముద్రవేసి ఫ్యాక్టరీ నుంచి తొలగించారు. భార్య అతన్ని వదిలేసింది. మిత్రులందరూ, అతని మానసిక స్థితి గురించి మాట్లాడసాగారు. అయితే, అతనిలో ఎగరాలనే కోరిక మాత్రం చావలేదు.
చాలా ఊళ్లు తిరిగాడు. లైబ్రరీలో గడిపాడు. ఇట్లా రెక్కలతో ఎగిరిన వాళ్ల చరిత్రలన్నీ తిరగేశాడు. వాళ్ల అనుభవాల్ని నోట్ చేసుకున్నాడు. 1990లో విరిగిపోయిన రెక్కలకు బదులుగా మరో జత రెక్కల్ని తయారుచేసుకున్నాడు. ఇవి నలుపు రంగు రెక్కలు. నల్లగా గొప్ప సౌందర్యంతో మెరిసిపోయేవి. రెక్కలను శరీరానికి తగిలించే టప్పుడు, విస్కీ (లేదా సారాయి) తాగితే, శరీరం మరింత తేలికయ్యి, ఎగరటం సులువు కావటం అతను గమనించాడు.
1996లో తన ప్రయోగాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. ఈసారి సిటీ నడిబొడ్డులో. సిటీలోని, ఒక శిధిలమైన మేడను వెతుక్కుని, దాని వెనుకనే, మనిషి పొడుగు గుడిసెను ఏర్పరచుకున్నాడు. ఒక రాత్రి, ఆ శిధిలమైన మేడ పైకి ఎక్కి సిటీ దీపాల వెలుగులో ధగధగమంటున్న సమయంలో, అతను తన శరీరానికి రెక్కలు తగిలించుకొన్నాడు. ఎగరడానికి సిద్దం అయి రెక్కలు విప్పాడు.
పొద్దున్నే రోడ్లు ఊడ్చే కార్మికులు శిధిలాల మధ్య, స్పృహలేని ఒక రెక్కల మనిషిని చూశారు. భయపడి పోలీసులకు కబురుచేశారు. ఆ పాత మేడ చుట్టూ పోలీసులు, ఫైరింజనూ, వందలాదిగా జనం మూగారు. ఉదయం ఎనిమిది గంటలకు అతనికి స్పృహ వచ్చింది. చుట్టూ జనం, పోలీసులు. అతనికి పరిస్థితి అర్థమైంది. రోడ్డు పై ఆగి పోయిన కార్లు, కార్ల పైన నిలబడి, అతన్నో వింతజీవిలా చూస్తూ. పోలీసులింకా అతన్ని చేరుకోలేదు. లేచి, కూలిన గోడపైన నిలబడి, రెక్కల్ని ఒకసారి తడుముకొని, ఒక్కసారిగా లేచి, రెక్కలు సాచి, ఆకాశం వైపు ఎగరటం మొదలుపెట్టాడు. గాలి కూడా అతనికి సహకరించింది. గుంపులుగా ఉన్న జనం తలల మీదుగా అతను పైకి ఎగిరాడు. ఉదయపు వెలుగులో అతని నలుపు రంగు రెక్కలు మిలమిలలాడుతున్నాయి. అతను పైకి, పైపైకి ఎగిరాడు. అసెంబ్లీని దాటి, రవీంద్ర భారతిని దాటి, బుద్ధదేవుడి శిరస్సు పై నుంచి ఎగురుతుండగా, రెక్కలు తమ శక్తిని కోల్పోయాయి. అతను పట్టుతప్పి, ఒక ఎత్తైన భవనం, దాని పక్కన ఉన్న నిలువెత్తు విగ్రహం మధ్యన జారిపడ్డాడు. ఆ భవనం అంబేద్కర్ భవనం. ఆ విగ్రహం అంబేద్కర్ ది.
అప్పటినుంచి, అతను అక్కడే పడి ఉన్నాడు. అతనిప్పుడు ముసలివాడయ్యాడు. రెక్కల పైన ఈకలు రాలిపోయాయి.
* * *
నాన్న శరీరాన్ని శుభ్రం చేసే కార్యక్రమం సాగుతుంది. ఎముకల పోగులాంటి శరీరం దగ్గరకు వెళ్లి పాదాల్ని ముట్టుకున్నాను. ముఖాన్ని చేతుల్తో పట్టుకున్నాను. ఆయన ముఖం ఎన్నో సంగతుల్ని వివరిస్తున్న ట్లుగా డిలాన్ థామస్ పోయమ్లా ఉంది. ఆ ముఖం. నా లోపల ఒక కదలిక. నేను, ఒక భావ రాహిత్యంలోకి వెళ్లినట్లు ‘పాటల రాణి’ గొప్ప ఉద్వేగంతో పాటలు ఆలపిస్తుంది. అవన్నీ నాన్న రాసిన పాటలే. అన్ని పాటలూ, ఈ క్షణమే పాడాలన్నట్లుగా పాటలు రాణి పక్కన కూర్చున్నాను. ఆమె చేతుల్ని నా చేతుల్లోకి తీసుకొని, ఆమె తలని నా భుజంపై ఆన్చుకొని పాటలరాణి, తన కథను సన్నటి గొంతులో నాకు మాత్రమే వినబడేలా చెబుతుంది. అది నాన్న మరో ప్రేమకథ.
పరిచయమైన రెండోరోజు అది. బస్టాప్ లో కూర్చున్నాం మేమిద్దరం. అలవోకగా ఒక పాట అల్లాడు. పాటలో ఒక రాగం, లయ. సన్నగా పాడి వినిపించాడు. ‘ఏదీ పాడు’ అన్నాడు, నా వైపు చూస్తూ, నా లోపల ఏదో గట్టు తెగి, నేనో నదినయ్యాను. ఖాళీగా ఉన్న బస్టాప్ లో ఎదురుగా అతనొక్కడే. మహాద్భుతమైన పాటగా మారాను. లయగా, శరీరాన్ని ఊపుతూ, అతని ముఖంలో వెలుగు (ప్రశంస) నాకు తెలుస్తూనే ఉంది. బస్సు ఒకటి వచ్చి ఆగింది మా ముందు. ఎటు వెళుతుందో తెలుసుకోకుండానే ‘పద ఎక్కు’ అన్నాడు. ఎక్కడికి అన్నట్లు చూశాను. చివరి స్టాప్ వరకూ వెళదాం అన్నాడు. బస్సులో ఉన్న వాళ్లందరినీ గ్రీట్ చేశాడు. ముఖ్యంగా ముందువరసలో ఉన్న స్కూలు పిల్లలు, వాళ్ల దగ్గరకు వెళ్లి కబుర్లు చెప్పాడు. ఒక కథను పాటలాగా పాడాడు. ముందు కొత్తగా, ఆశ్చర్యంగా, క్రమంగా వాళ్లు అతనితో కలిసిపొయ్యారు.
లూజ్ పాంట్, ఉతికి, ఇస్త్రీ చెయ్యని చొక్కా విశాలమైన కళ్లు, నిర్లక్ష్యంగా ఎగిరే జుట్టు, బస్సులో ఉన్న అందర్నీ పలకరిస్తూ.
నా పక్కన కూర్చుని, తను అనువాదం చేసిన ఇంగ్లీషు నవల, మాన్యుస్క్రిప్ట్ ని చదివి వినిపించాడు. బెన్ ఓక్రి నవల అది. మరణించిన శిశువు తన కథను చెబుతుంది. ఆ కథను వింటుంటే సుప్తమైన జ్ఞాపకాలేవో పైకి ఉబికాయి.
ఒక స్టేజీలో ఇద్దరం కిందకు దిగాము. ఎదురుగా చర్చి. చిన్న పిల్లలు, చర్చి మెట్ల పైనా, చెట్లకిందా, ఆకలిచూపులతో, చిరిగిన బట్టలు, మురికిగా, దగ్గరలో ఉన్న షాపుకు వెళ్లి, బిస్కెట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి, ఆ పిల్లలతోనే మధ్యాహ్నం దాకా గడిపి, వాళ్ల కోసం కథల్ని, పాటల్ని పాడి, వాళ్లతో ఆడుకొని హఠాత్తుగా, నా దగ్గరకు వచ్చి, నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, “నా దుఃఖం, భాష లేనిది, నది పొంగినట్లుగా ఒక ఆవేశం పొంగుకు వస్తుంది. దాన్ని రికార్డు చేసే భాషే లేదు. నాకే కాదు, ఏ దళిత స్వరానికీ, తనదైన భాష లేదు. భాషలేని అనాథస్వరాలం మనం,” అన్నాడు నీళ్లు నిండిన కళ్లతో.
ఆ రోజంతా అతనితో తిరుగుతూనే ఉన్నాను. అతనో కొత్త భాషను కనుగొనబోతున్నాడనిపించింది. దళితుల గొంతుకల్లో కదలాడే, ఒక వణుకు, కసి, కోపంలాంటి, ఆశలాంటి ఒక వ్యక్తీకరణ. నా కంఠస్వరం ద్వారా అతని కొత్త భాషను (పాటల్ని) ప్రపంచానికి వినిపించాలని, మేరీ కరుణ, రాగశ్రీగా మారింది. రాగశ్రీ ఇప్పుడు (నల్ల) పాటలరాణిగా మారింది. అతను పెట్టిన పేరు అది. జాతి విముక్తం కాబోతోంది అనేవాడు. బస్టాపుల్లో కూర్చుని, బస్సుల వైపు ఇష్టంగా చూసేవాడు. మానవ సమూహాలంటే ఎంతో ఇష్టం తనకు. సమూహాల మధ్యన కూర్చుని ‘కథాగానాలు’ పాడటం ఇష్టం తనకు.
ఆ రాత్రి నా గదిలో, అతనూ, నేనూ కొత్త ప్రేమకథగా మారాము. అతడు నన్ను ముద్దు పెట్టుకున్నపుడు నా శరీరంలో, ఒక పరిమళం, తీయని రుచిలాంటి పరిమళం. అతన్నొక జ్ఞాపకంగా మార్చి, శరీరం చుట్టూ అద్దుకోవాలని…
అతనితోపాటు వీధులన్నీ తిరిగి, రోడ్లను, ట్రాఫిక్ ని, బస్సులను, గుంపుల్నీ చూస్తూ అతనితో కలిసి పుస్తకాల షాపులు, టాంక్ బండ్, కాఫీ హోటళ్లు, కలవటమనే గొప్ప సుఖాన్ని, నిరంతరం నాస్టాల్జియాల గురించి మాట్లాడుకోవడం, వెంట తెచ్చుకున్న దుఃఖాన్ని చెప్పుకొని ఇద్దరం, ఒక నిషిద్ధ దేశంలా మారి, దుఃఖం, కోపం, అవమానం అంటని శిశువుల్లా మారి.
అతని కథలన్నీ తెలుసు నాకు. అతన్ని యోధుడన్నారు.యుద్ధ భూమి నుంచి పారిపోతున్నాడన్నారు. అతని ప్రేమకథలన్నీ తెలుసు నాకు. ఆ పెళ్లి, ఆ విడిపోవటం, ఇంకా చాలా స్త్రీ పురాణాలు, సాయం కాలాన్ని దాటి, చీకటి పడేవేళ, అతని శరీరాన్ని మంత్రించి, నా లోపలే ఇముడ్చుకుని, మేము గాఢమైన కౌగిలిలా, పెనుదుఖంలా, మరణాన్ని తిరస్కరించిన రెండు ఆత్మల్లా, నిషిద్దపు మాటల్లా, మేము కొత్త పాటలు పాడాము. ఎన్నో ప్రోగ్రాములు, అతనూ, నేనూ, పల్లెల్లో, సిటీల్లో సరిగ్గా మూడు నెలల తరువాత మా ప్రేమ కథ ముగిసింది. అతను రాసిన పాటలు, తాగి పారేసిన సీసాలు, అపురూపంగా ఇప్పటికీ నా దగ్గరే దాచుకున్నాను.
చినుకుల ఉధృతి కాస్త తగ్గింది. ఉరేగింపు కోసం సన్నాహం మొదలైంది. మినీలారీ, పూలదండలు, కుంకుమ, మరమరాలు, బుట్టలుగా బంతిపూలు, మరణం చిన్న చిన్న కర్మకాండలుగా మారి. చెట్టు పైన కాకి ఒకటి, ఆకాశంవైపు చూస్తూ, దాని ముక్కుపై వాన చుక్కలు పడుతూ, రెక్కల్ని విప్పి, గమ్మత్తుగా, అది ఎక్కుపెట్టిన తుపాకీలా ఉంది.
ప్లాస్టిక్ కప్పుల్లో టీ అందిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, పాటల రాణి చాలాసేపటి నుంచి నా పక్కనే కూర్చుని ఉంది. టీ కప్పును కుడిచేత్తో పట్టుకొని, చెట్టు పైన, ఒక్కొక్కటీ వచ్చి చేరుతున్న కాకుల వైపు వింతగా చూస్తుంది. పది, ఇరవై, యాభై, చెట్టునిండా కాకులే.
పాటల రాణి ఇంకో టీ కప్పు తెచ్చుకుంది. ఇష్టంగా తాగుతుంది. పాడాల్సిన పాటలెన్నో ఉన్నట్లుగా, నోట్ బుక్ ని , కంజిరను బయటకు తీసింది. ఆమె ముఖం నిండా జ్ఞాపకాలు అల్లుకుపోయి ఉన్నాయి. సంచిలోంచి నల్లటి, గద్దరు మార్కు గొంగళి బయటకు తీసి భుజంపై కప్పుకుంది.
చెట్టుపైన కాకుల సంఖ్య పెరిగింది. వందా, రెండు వందలు, ఇంకా ఎక్కువే, లెక్కపెట్టలేనన్ని, చెట్టునిండా కాకులే. ఇంకా చేరుతూనే ఉన్నాయి. ఆకాశంనిండా పరిచిన నల్లటి దుప్పటిలా ఎటుచూసినా కాకులే. నల్లటి పతాకాల్లా, అట్లా చెట్ల పైనా, ఇళ్ల కప్పుల పైనా.
పాటలరాణి, మోకాళ్లపై తలను పెట్టుకొని గాఢమైన చింతనలో. ఆమె భుజంపై చెయ్యి వేశాను. తల పైకెత్తి చూసింది.
“నన్ను, నా పాటను పునీతం చేసిన జ్ఞాపకం ఆయన. నాలో కలల్ని నాటినవాడు, ఆయన ఒక వెలుగు వృక్షం, ఒక చీకటి ఖండం, ఆయన ఇప్పటికీ నా సహచరుడే,” అంది.
పాటలరాణి నా చుట్టూ చేతులు వేసి, నన్ను గుండెలకు హత్తు కుంది. నేనూ ఆమెకు దగ్గరగా జరిగి…
చెట్ల పైన కాకులు ఒక్కసారిగా, రెక్కలు విప్పి పైకి లేచాయి. ఎటు చూసినా కాకులే. ఆకాశం నిండా, భూమిపైనా, కాకుల సముద్రంలా లేదా కాకుల మహా సామ్రాజ్యంలా…
నల్లసూరీడి అంతిమయాత్ర మొదలైంది. హఠాత్తుగా ఊరేగింపును చీల్చుకుని, ఒక స్త్రీ లారీపైకి ఎక్కి ఆయన శరీరంపై పూలు చల్లి, ఎర్రశాలువా కప్పి, రెడ్ సెల్యూట్ చేసి, లారీ దిగి, జనంలోకి అదృశ్యమైంది. ఆ వైపుకు పరుగెత్తాను. ఆమె ఖచ్చితంగా అమ్మే అని నా నమ్మకం.
* * *
డా.వి.చంద్రశేఖరరావు తెలుగు కథా రచనలో ఆయన నూతన ఒరవడిని సృష్ఠించారు. మ్యాజిక్ రియలిజం టెక్నిక్‌ను ఆయన కథా రచనకు విరివిగా వాడుకున్నారు. ఈ కథ ఆయన మరణానంతరం వెలువడిన ‘ముగింపుకు ముందు’ సంకలనం నుంచి తీసుకోబడింది.
డా॥ వి. చంద్రశేఖరరావు
డా॥ వి. చంద్రశేఖరరావు 13 ఏప్రిల్ 1959న ప్రకాశం జిల్లాలో జన్మిం చారు. 1990లో నైట్ డ్యూటీ కథ ద్వారా సాహితీరంగానికి పరిచయమై, 8 జులై 2017న హైదరాబాదులో చనిపోయేంత వరకు రచనాప్రక్రియను కొనసాగిస్తూనే వచ్చారు. జీవని, లెనిన్స్, మాయాలాంతరు, ద్రోహవృక్షం కథాసంపుటాలు: ఐదు హంసలు, ఆకుపచ్చని దేశం, నల్లమిరియం చెట్టు నవలలు ప్రచురించారు. 2014లో ఎంపిక చేసిన 31 కథలతో విశాలాంధ్ర ప్రచురణాలయం వారు 'చిట్టచివరి రేడియో నాటకం' కథాసంపుటి ప్రచురించారు. చాలా కథలు ఇంగ్లీషులోకి, వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.
గుంటూరులో మెడిసిన్ చదివిన అనంతరం IRSకు సెలక్టయి రైల్వేలో ఉన్నతాధికారిగా ఉద్యోగం ప్రారంభించి, 2017 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు.డా.వి.చంద్ర శేఖర రావు తెలుగు కథా రచనలో ఆయన నూతన ఒరవడిని సృష్ఠించారు. మ్యాజిక్ రియలిజం టెక్నిక్‌ను ఆయన కథా రచనకు విరివిగా వాడుకున్నారు.