ఇటీవల (జనవరి 2024) ఛాయా పబ్లికేషన్స్ వెలువరించిన తల్లావజ్ఝుల పతంజలిశాస్త్రి కథల సంపుటి ‘2+1 = 0’ పై సంక్షిప్త సమీక్ష ఇది. పుస్తకం చిన్నదే (92 పేజీలు, ఏడు కథలు); వాటి మార్మికత వెనుక దాగిన విస్తారమైన తాత్వికతను సందర్శించే చిరు ప్రయత్నం కూడా
మనలాగ
కథను మొదలు పెడుతూనే పంచేంద్రియాలు అందించే సుతిమెత్తని అనుభవాలను ఆవాహన చేస్తూ, ఒక ఆహ్లాదకరమూ, ప్రేమభరితమూ అయిన అనుభూతులకు తెరతీస్తాడు రచయిత. అవి హేమ, ఇందిరలు తమకోసం ఏర్పరచుకున్న లోకపు అనుభూతులు. అప్పుడు పానకంలో పుడకలాగా ప్రవేశిస్తాడు తల్లిపట్ల గౌరవంలేని ఇందిర కొడుకు వినయ్ – పైసా చెల్లించని ‘పేయింగ్ గెస్ట్’. పాఠకుడికి కూడా విసుగుపుడుతుంది వాడి ప్రవర్తనతో. ఇందిరకు ఆమె భర్తతో ఏనాడూ సత్సంబంధాలు లేవు. పైగా ఆమెకు మగాళ్లంటే అసహ్యం. సహజమూ, సర్వసాధారణమూ అని భావించే కుటుంబసంబంధాల అధ్యాయాన్ని ఆవిధంగా ముగిసాయి. హేమ, ఇందిరల మధ్య ఉన్నది స్వలింగ (లెస్బియన్) సంబంధమని ఒక్క గెంతులో గ్రహిస్తాడు పాఠకుడు. ఈ సంగతి కథ మొదట్లోనే, ఒక్క వాక్యంలో ప్రకటించవచ్చు. కానీ మిగతా సంబంధాల వైఫల్యాల ద్వారా రచయిత మనకు వెల్లడి చేస్తాడు.
ఇందిరకన్నా హేమ చైతన్యవంతురాలిగా, స్వేచ్ఛాజీవిగా కనిపిస్తుంది. సాధారణ కుటుంబసంబంధాల కట్టడినుండి ముందుగానే బయటపడ్డ హేమకు స్పష్టత ఉన్నది. మనకు తెలిసిన విషయాలతో మొదలుపెట్టి, తెలియని విషయాలవైపు వెళ్లే సాహసమే అర్థవంతమైన జీవితానికి తొలిమెట్టు. ఇందిరకి ఏది అక్ఖర్లేదో తెలిసినంతగా, ఏది కావాలన్నది తెలియదనిపిస్తుంది. ఆ ఎరుకకై ఆమెకు హేమ సాహచర్యం అవసరం. ‘మనిద్దరిలో మొగుడెవరు?’ అని ఇందిర ప్రశ్నించినప్పుడు, ‘మనిద్దరం ఒకరికొకరు భార్యలం,’ అంటుంది హేమ.
అరకులోయలో రోడ్డుని విడిచిపెట్టి కాలిబాటన నడుస్తూ వెళ్లి పచ్చని బయలు ప్రదేశాన్ని చేరుకుంటారు కథ చివరిలో. అక్కడ ఇక రహస్యాలు లేవు; దాపరికాలూ లేవు. ‘ప్రేమంటే భయాలనుండి విడుదల, మనలాగా’ అనే అవగాహనను చేరుకుంటారు. ఆత్మన్యూనతకూ, అపరాధభావనకూ లోనుకాకుండా, స్వలింగసంబంధాన్ని ప్రకటించుకోవడంలోని సవాళ్లతో ఆగిపోకుండా, చల్లటి పరిమళభరితమైన గాలితెమ్మరలా అత్యంత సహజంగా కథ ముగుస్తుంది.
కిటికీలు
వృద్ఢాశ్రమాన్ని ‘వృద్ఢాప్యాన్ని ముగించుకొనే ఆశ్రమం’గా నిర్వచిస్తూ ‘కిటికీలు’ కథ మొదలౌతుంది. కృష్ణమూర్తీ, వరదాచార్యులూ చిరకాల మిత్రులు. భార్య పోయాక, కొడుకు కూతుర్లవద్ద ఉండలేక ‘రైలు నుండి విడిపోయిన పెట్టెలా వృద్ధాశ్రమం చేరుకున్నాడు వరద. నిర్మలగారు వారికక్కడ పరిచయమైన మహిళ. ముగ్గురికీ అనుసంధానంగా రాజమండ్రి. వరద మృతితో కథ మొదలవుతుంది. ఆత్మహత్యా? కావచ్చు. అతని కర్మఫలం ముగిసిందా? ఏమో? పతంజలిశాస్త్రి వర్ణనలు ఒకటి రెండు వాక్యాలకు మించవు. అవి ఆ క్షణాల మానసికస్థితిని ఒడిసిపట్టుకొని కథని ముందుకి లాక్కెళతాయి తప్ప బాహ్యంగా నిలిచిపోవు. గతంలో వ్రాసిన తన కథల్లోని పాత్రలను జోడించి వారి ప్రయాణాలను కొనసాగించడం ఈ కథల ప్రత్యేకత. ఈ విధమైన ప్రయోగం ఇంతకుముందు ఎవరూ చేసినట్టులేదు.
మిత్రుని మరణం తరువాత, కృష్ణమూర్తీ, నిర్మలలు భోజనశాలలో కలుసుకున్నప్పుడు, ‘బయట చెట్లు వదిలేసిన ఎండముక్కలు తప్ప అంతా నీడ అతికినట్టుంది…ఇద్దరి మధ్యా పల్చటి మృత్యువు సాలెగూడులా అల్లుకొని ఉంది’ అంటాడు. పాఠకుడు ఇక్కడొక నిమిషం ఆగితే ఎన్ని అర్థాలైనా స్ఫురిస్తాయి. ఆ భోజనశాలను వదిలి బయటికి, తోటలోకి వెళ్లేందుకు నాలుగు ‘పొడవాటి వెడల్పు మెట్లు’ దిగాలి. ఆ తోటలో ‘ఎవరో ఒకరు సాయంత్రం కాలక్షేపంగా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటారు. అటూ ఇటూ తిరుగుతూ సమాధానాల్లేని పాతప్రశ్నల్లా కనిపిస్తూంటారు.’ ఇది ఏకకాలంలో బాహ్యపరిసరాల దృశ్యీకరణ, మానసిక అంతరంగాల ఆవిష్కరణ, కథకు ముక్కుసూటి కొనసాగింపు.
మరణించిన మిత్రుడు వరద తన జీవిత చరమాంకంలో భగవద్గీతలో, ప్రవచనాలలో ఓదార్పు పొందుతాడు. జీవితకాలంలో జరిగిన సంఘటనలకు, తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించకుండా కర్మానుసారంగా జరిగిపోయినట్లు భావించడంలో ఒక సాంత్వన ఉంటుంది. మరికొందరు దాన్ని పలాయనంగా, బాధ్యతారాహిత్యంగా భావించవచ్చు. కృష్ణమూర్తికీ, నిర్మలకీ గీతా ప్రవచనాలు సరిపోపు. ఇంకేదో ఉందని వాళ్ల అన్వేషణ. నిర్మల జిడ్డు కృష్ణమూర్తి శిష్యురాలు – ఒకప్పుడు. ‘మనందరం ఎవరో ఒకరి ఙ్ఞాపకాలం’ అంటుందామె.
మనుషులు తమ ప్రశ్నలకు లభించే జవాబుల్లో తమకు ఇబ్బంది కలిగించని వాటినే ఎన్నుకుంటారు అని కృష్ణమూర్తి భావిస్తాడు. కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మనలో ఏదో శూన్యం ఏర్పడుతుందని కూడా తెలుసుకుంటాడు. మిత్రుడు వరద మరణం తరువాత జరిగిన అంతర్మధనంలో అన్నాళ్లూ తన వెంటఉండిన బరువుల్ని ఒక్క క్షణంలో వొదిలించుకుంటాడు కృష్ణమూర్తి. నువ్విక్కడున్నావు గనుకనే ఈ జీవితం ఉంది; నువ్వు లేకపోతే ఏదీ లేదు. అటువంటప్పుడు ‘నిన్ను మినహాయించుకొని జీవితం గురించి ఆలోచించడం ఏమిటి?’ అనే ఆలోచన హఠాత్తుగా కలుగుతుంది కృష్ణమూర్తికి. అది అతనికి ఙ్ఞానోదయం. అన్నింటికీ అతీతంగా, అన్నిట్లోనూ భాగంగా దిగంతాలు పరచుకున్న సరస్సులో కాగితం పడవలా తేలియాడతాడు కృష్ణమూర్తి. బుద్ధుడు ప్రతిపాదించిన అనాత్మవాదం, శూన్యతలవైపుగా అతడు నడుస్తున్నాడా?
నీ పేరేమి?
“రాక్షసులతో పోరాడుతున్నప్పుడు, మీరే రాక్షసుడిగా మారకుండా జాగ్రత్త వహించండి…ఎందుకంటే మీరు అగాధంలోకి సుదీర్ఘంగా చూసేటప్పుడు అగాధంకూడా మీవంక చూస్తూనే ఉంటుంది.” అంటాడు జర్మన్ తత్వవేత్త ఫ్రెడెరిక్ నీచా (Friedrich Nietzsche). నిత్యం నేరస్థులతో వేగే పోలీస్ ఆఫీసరు సత్యరాజుకి పేరూ ఊరూలేని, తను ఆడా? లేక మొగా? అనేదికూడా తెలియని ‘ఎక్స్’అనే మనిషితో ఎలా ప్రవర్తించాలో తెలీక తికమక పడతాడు. అయితే సత్యరాజు క్రూరుడైన పోలీస్ ఆఫీసర్ కాదు. సున్నిత మనస్కుడు; పాపభీతి, జంతుదయ కలిగిన క్రైస్తవుడు. అతడు ఎమ్మెస్సీ జూవాలజీ చేసినవాడు; నిత్యం శ్రద్ధగా ప్రార్థనలు చేసేవాడు అని సూచిస్తాడు రచయిత. తానే రాక్షసుడిగా మారిపోయాడా? అనామకుడైన ఎక్స్ అనేవ్యక్తి కల్తీలేని, రాజీపడని మానవ లక్షణాలతో సంచరిస్తున్నాడా? ‘నీ పేరేమి?’ కథలో. పుట్టగానే గుర్తింపబడే లింగం, పెట్టిన పేర్లు, వెంటవచ్చే ఇంటిపేర్లు, కులం, మతం – ఈ ముద్రలేవీలేకపోతే ఎంత సుఖం? ఆ ఉక్కిరిబిక్కిరి నుండి ఎంత స్వేచ్ఛ?! జంతువుల్లాగా, ప్రాణులలాగా మసులుకుంటే ఎంత విముక్తి? మనిషిని చుట్టుముట్టి, జీవితాంతం వెంటాడే మానవ సంబంధాలు, బంధనాలు లేకపోతే ఎంత విడుదల?
మిస్టర్ ఎక్స్, అతని జీవితంలోకి ప్రవేశించాక, సత్యరాజు తనకి తానే భిన్నంగా – అపరిచితంగా కనిపించసాగాడు – అద్దంలో కూడా. “వాడు పిచ్చాడు కాదు. దేవుడే పంపించాడేమో నా కొరకు” అని భార్యతో అన్నప్పుడు – ముఖ్యంగా ‘కొరకు’ అన్న మాటని ఉపయోగించినప్పుడు సత్యరాజు క్రైస్తవుడా అని మొదట్లోనే మనకు అనుమానం కలుగుతుంది. మరికాసేపట్లో ఆ ఊహ నిజమని తేలుతుంది. ఒకేఒక్క పదప్రయోగంతో, పాత్రల నేపథ్యాన్ని ఆవిష్కరించడం అనితరసాధ్యం. ‘ఎక్సు ఎక్కువసేపు తనవైపు చూస్తే ఇద్దరం ఒకటే అనిపిస్తుంది’ ఎస్సై సత్యరాజుకి. అతడు ఎక్సులోకి పరకాయ ప్రవేశం చేస్తున్నాడు – తన ప్రమేయంలేకుండానే. రైల్లో పసిపాప నిష్కల్మషంగా నవ్వినప్పుడు ఎక్సు కూడా అదే స్థాయిలో నవ్వుతాడు ఎక్సు – మనుషులు నిర్మించుకున్న అడ్డుగోడలులేకుండా, సంపూర్ణ మానవుడిగా. కథ ముగుస్తుంది. నిజానికి పతంజలిశాస్త్రి కథలు చాలావరకూ సముద్రం ప్రస్తావనతోనో, నిర్వికల్ప సమాధికి దారితీయగల నూతన ప్రయాణారంభాలతోనో ముగుస్తాయి. ఇది కాకతాళీయం కాజాలదు.
భారతీయ తాత్విక, యోగానుభవాలను అర్థంచేసుకొనే ప్రయత్నంలో భాగంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన శైశవ ‘మహాసాగరానుభూతి’ (oceanic feeling)ని రచయిత సూచిస్తున్నాడా?
2+1 = 0
పురుషుడు ఫుట్‌బాల్, టెన్నిస్ లేదా క్రికెట్ ఆడేటప్పుడు ‘బంతిని తాపుతన్ని వదిలించుకోవాలని చూస్తాడు’ అంటాడు రచయిత. అంతటితో ఆగక, క్రికెట్ ఆట సంఘపు ఆమోదం కలిగిన పురుష హస్తప్రయోగం అనికూడా పేర్కొంటాడు. అంత మాటన్నాక, పాఠకులు ఇక్కడ కాసేపాగి ఆలోచించకుండా ఉండలేరు. మొదట వెంటపడటం, తీరా అందుబాటులోకి వచ్చాక ఓ తాపుతన్ని విదిలించుకోవడం, ఇదేనా పురుష లక్షణం? స్త్రీ-పురుష సంబంధాల మౌలిక సూత్రం? ఈమాట మనల్ని ఆలోచింపజేస్తుంది; ఇబ్బంది పెడుతుంది.
ఇది ‘మనలాగ’లో ఎదురైన పాత్రలు – హేమ, ఇందులతో కూడిన మరో కథ. వాళ్లిద్దరే కాకుండా చందు, వసంత అనే పాత్రలుకూడా ప్రవేశిస్తారు. స్వలింగసంబంధాలు వాటికవే కొనసాగకపోవచ్చు; భర్త (లేదా భార్య) ప్రియురాలు (లేదా ప్రియుడు) ఇష్టపూర్వకంగానో, పరిస్థితుల మూలంగానో ఏకలింగ భాగస్వాముల మధ్య ప్రవేశించవచ్చు. లేక ఆ భాగస్వాములే బైసెక్సువల్ అయితే…? వారి సంబంధాలు మరింత క్లిష్టంగా, జటిలంగా మారుతాయి. అందీఅందని సౌఖ్యంకోసం మానవులు నిత్యంపడే యాతన, వెంపర్లాట మరింత అనిశ్చితం, అశాశ్వతం అవుతాయి. ముగిసిపోయిన సంబంధాలు కేవలం దుఃఖాన్ని మిగిల్చి ఊరుకోకుండా ఒక్కోసారి స్వేచ్ఛను ప్రసాదిస్తాయి; కొత్త అవకాశాలను ఏర్పరుస్తాయి. అదే సమయంలో గాలివాటానికి కొట్టుకుపోతున్న భావనను, అభద్రత కలిగిస్తాయి. చివరికి ‘ఆ క్షణంకోసమే జీవించడం’ అలవరుస్తాయి.
అనిశ్చిత, అభద్రతలు ఆందోళనకు మూలా లైన చిన్ననాటి భయాలు జీవితాంతం వెంటాడతాయి. లోలోపల పేరుకుపోయిన ఆందోళనలు కలల రూపంలో ప్రతీకాత్మకంగా దర్శనమిస్తాయని ఫ్రాయిడ్ మనకు చెప్పి ఉన్నాడు. దిగులు పుట్టించే వర్షాకాలంలో ‘అది పాము నోటికి చిక్కిన కప్ప అరుపు’ అన్న ఆమె అమ్మమాట ఇందిరకు గుర్తుకొస్తుంది. ఒంటిమీద బట్టలులేకుండా బహిరంగప్రదేశాల్లో సంచరిస్తున్నట్లుగా కలగంటాము. అలాగే మనం ఎక్కాల్సిన ట్రెయిన్ ప్రతీసారీ చూస్తూండగానే వెళ్లిపోతుంది. అంతటా దిగులు, భయం, ఆందోళన. ‘మీ అవ్యక్తచేతనం మీ ఎరుకలోకి రానంతకాలం అది మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది; కాకపోతే మీరు దాన్ని విధివ్రాతగా భావిస్తారు,’ అంటాడు యుంగ్. ఆ అవ్యక్తచేతనంలో ఆందోళనలు, భయాలు నిబిడీకృతమై ఉంటాయి. ఒక్కోసారి పీడకలలుగా మన కళ్ల ఎదుటనిలుస్తాయి. హేమకు తరచూ వచ్చేకలలో ఆమె ఒక పెద్ద లారీని అపరిచిత నగరంలో లాగుతూ ఉంటుంది; కాసేపట్లో డ్రైవరు మాయం అవుతాడు. ఆమె ఒక్కర్తీ నిస్సహాయంగా తాడుని లాగుతూంటూంది. ఈ కలని కనీసస్థాయిలో హేమ జీవితానికి అన్వయించడానికి మనోవైఙ్ఞానికులు అవసరం లేదేమో?
ఇద్దరి మధ్య ఉండాల్సిన బంధం (‘2’) లోకి మరో వ్యక్తి (‘1’) ప్రవేశిస్తే మిగిలేది శూన్యం (‘2+1 = 0’) అని ఈ కథకు పెట్టిన శీర్షిక సూచిస్తున్నదా? ఒక నవలలో శోధించాల్సిన వస్తువుని కథగా చెప్పడం సాహసమే.
దీపాలపల్లె బోవాలె
పశ్చిమ నాగరికతలలో కాలగమనం సరళరేఖలో మున్ముందుకి సాగుతుంది. భారతదేశ సంస్కృతిలో కాలచక్రం నిరంతరంగా తిరుగుతూ ఉంటుంది. క్రింద ఉన్న ఆకు పైకి వస్తుంది; పైన ఉన్నది క్రిందికి పోతుంది. ఈ కథలోని ప్రధాన పాత్ర అయిన నాగముని గానుగత్రిప్పేవాడు. గుండ్రంగా తిరిగే ఎద్దూ, ఒకే గాడిలో దొర్లే గుండ్రటిబండ అతని చైతన్యంలో పెనవేసుకుపోయాయి. అతనిది ‘సమాంతర కాలగమనం’ అని మొదటి పేరాలోనే మనకు తెలుస్తుంది. ఆ గమనం అతన్ని గతించిన లోకాలకు తీసుకెళుతూంటుంది రాత్రికీ, పగలుకీ తేడా తెలియని ఆసుపత్రిలో. ‘దీపాలపల్లె బోవాలె’ అని అంటూంటాడు తన కుంచించుకుపోతున్న ‘గడియారపు చిన్న ముల్లు’ – హవుస్ సర్జన్ – మనవరాలితో. అదెక్కెడుందో అతనికే తెలియదు. ‘నాగముని లోకం చూడగల ప్రపంచానిది కాదు’; సమాజపు సమిష్టిఙ్ఞాపకాలతో, సుప్తచైతన్యంతో పెనవేసుకుపోయినది. కార్ల్ యుంగ్ చెప్పినట్లు – అది వ్యక్తిగత జీవితానుభవాలకు అతీతమైనది; జన్యుపరంగా, తరతరాల మానవజాతి అందజేస్తూ వచ్చినది.
నాగముని తాత, శ్రీకాకుళంజిల్లానుండి వలసవచ్చి గోదావరీతీరం చేరుకున్నాడు. అనగా అతని పూర్వీకులది బౌద్ధానికి నెలవు అయిన కళింగదేశం. ఇంట్లో నాగముని తాత వెంటతెచ్చిన బుద్ధుని ప్రతిమ ఉండేది – దాని ప్రాశస్త్యం తెలియకపోయినా. మరణశయ్యపై ఉన్ననాగమునిని పురాతనమైన ఙ్ఞాపకాలు కెరటాల్లా వచ్చి తాకుతాయి; మళ్లీ వెనక్కి మళ్లుతాయి. చాలా అస్పష్టతలమధ్య ఒక్కసారిగా గతించిన దినాల గుర్తులు ప్రకాశిస్తాయి; అవి అతని జీవితకాలంలోనివి కూడా కాదు; అత్యంత పురాతనమైనవి. ఆఖరి క్షణాల్లో దీపాలపల్లె అతని కళ్లల్లో వెలుతురు నింపుతుంది. వ్యక్తావ్యక్తంగా, అప్రయత్నంగా అతని పెదవులపైకి వచ్చిన త్రిరత్న పఠనంతో కథ ముగుస్తుంది. ఈ కథ నిద్రాణంగా ఉండిపోయిన ముందుతరాల ఙ్ఞాపకాలకు మేలుకొలుపు, మొత్తం సమాజం పోగొట్టుకున్న సమిష్టిఅనుభవాల పునఃచైతన్యం. నాగముని అని ఆ పాత్రకు పేరుపెట్టడం యాధృచ్ఛికం కాదేమో?
మృత్యుభారం
‘జాతస్య మరణం ధృవం’ అంటుంది గీత. చావు అనే అగాధం ఎదురుగా నిలిచి ఉన్నన్నాళ్లూ మనిషి దైవ విశ్వాసాలవైపు మళ్లుతూనే ఉంటాడు అన్నాడు చలం. భగవంతుడిని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకం ధైర్యాన్నిస్తుంది. భారాన్ని దించుతుంది. మనచేతుల్లో ఏదీలేదు అనిపిస్తుంది. ‘జీవితాన్ని సహించాలంటే చావుకి సిద్ధంగా ఉండు’ అంటాడు ఫ్రాయిడ్. మరణానుభవాన్ని వివరించిన వారులేరు. మరణాంతర జీవనం, పోనీ ఆత్మ, పునర్జన్మ ఉన్నయా అంటే ఖచ్చితమైన ఆధారాలులేవు. ‘మరణం గురించి నేనేమీ చెప్పలేను; ఎందుకంటే అది ఇంకా నా అనుభవంలోకి రాలేదు’ అని కూడా ఫ్రాయిడ్ చమత్కరించాడు. ధ్యానానికి అత్యున్నత స్థాయి మృత్యువుని సమీపించడమే అంటాడు ఓషో. మృత్యువు అన్నిటికీ ముగింపు. ఆ తరవాత ఇంకేమీ లేదనేది వాస్తవం. వెంపర్లాడే మనసులోని ఆకాంక్షలను తొలగించుకోవాలని అనుకుంటే జీవించి ఉండగానే వాటికి ఒక్కొక్కటిగా వీడ్కోలు చెప్పాలి; విముక్తులం కావాలి అని జిడ్డు కృష్ణమూర్తి సూచన.
తథ్యమని తెలిసిన చావుని ఎదుర్కోవడంలో మాత్రం మనుషుల మార్గాలు భిన్నంగా ఉంటాయి. చావు గురించి మాట్లాడాలంటేనే చాలామందికి భయం. ప్రతీ చిన్నపనికీ పథకాలు, జాబితాలు సృష్టించే మనుషులు తమ వీలునామా విషయంలో వెనకాడతారు; అలక్ష్యం చేస్తారు. పండితులూ, తత్వవేత్తలూ, ప్రవచనకారులూ కూలంకుషంగా చర్చించి వివరించిన చావు తీరామోసి తమ గుమ్మం ముందుకే వచ్చి కూర్చుంటే…?
ఈ చిన్న కథలో కాసులు అనే ‘సాధారణ’ స్త్రీ, గోదావరినదితో ఆమే జీవితం పెనవేసుకు పోయింది. హింసించే భర్తను విడిచిపెట్టి, ఇష్టపడ్డ మగాడితో గోదావరి ఒడ్డుకే వచ్చి చేరుకుంది. అతడిప్పుడు కాన్సర్ ముదిరి మృత్యుముఖాన ఉన్నాడు. కాసులు చాలా కాలంగా పనిచేసిన ఇంట రాజుగారి భార్య కూడా అదే పరిస్థితి. భార్య తనకు దూరం అవుతున్నదనే బెంగతో రాజుగారు కృశించిపోయాడు. భార్య చావుని ఎలా ఎదుర్కోవాలో అతనికి తెలియలేదు. కాసులు మాత్రం భద్రాచలంలో విని నేర్చుకున్న కీర్తనలు, భజనల ఆధారంతో, రాముడి అండతో సునాయాస మరణాన్ని ఆహ్వానిస్తుంది. చావుని గురించి అత్యంత సరళమైన, ఆత్మవిశ్వాసంతో నిండిన భావాలను నిండుకుండలా ప్రకటించడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. భద్రాచలం గుడిని రోజూ తుడుస్తూ, కడుగుతూ పుణ్యం వెనకేసుకున్నాని ఆమె నమ్మకం.
ఆమె తన జీవితభాగస్వామి గురించి పూజారితో, “రాములోరు పిలుస్తున్నారు. ఇంక ఆయనే చూసుకుంటాడు…బిడ్డని భుజానికి ఎత్తుకుంటాంకదా? అలాగే తీసుకుపొమ్మని అడుక్కుంటున్నాను,” అంటుంది. గోదావరి ఈ కథకు అంతస్సూత్రంగా, నిరంతర చలనంగా, నేపథ్యంలో ప్రవహిస్తూ ఉంటుంది.
యువరానర్
తాను పనిచేసే ఏలేశ్వరం ప్రాజెక్టు ఆఫీసులో శ్రీశ్రీ, తిలక్, బైరాగిల కవిత్వం చదవడం – ఫైళ్లమీద మూత్రం పొయ్యడం, తీవ్రవాద చర్యలవుతాయా? మన ప్రభుత్వాలు ప్రసాదించే పథకాలు, ప్రాజెక్టులు అన్నీ కూడా అవినీతి కార్యక్రమాలే, అక్రమ సంపాదనకు మార్గాలే అనే అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ స్థిరపడిపోయింది. పత్రికల్లో ప్రముఖంగా వచ్చినా, ఎలెక్ట్రానిక్ మీడియాలో బ్రద్దలైనా ఎవరికీ చీమ కుట్టినట్టయినా అనిపించడంలేదు. తినేవాళ్లంతా తినగా ప్రజలకు ఏమాత్రం దక్కుతుందనేదే నేటి బేరీజు.
ఆ ప్రాజెక్టు ఆఫీసులో పనిచేసే బాలిరెడ్డి అనే గిరిజనుడు (కొండరెడ్డి), ఈ ‘దుశ్చర్య’కు పాలుపడ్డాడు. నక్సలైట్లతో సంబంధం ఉందని అతనిపై ఆరోపణ. ఆమాట ఎలాఉన్నా, అడవితోనూ, సాటి గిరిజనులతోనూ అతనికి ఏదో ఒక మేరకు మిగిలి ఉన్నది సజీవబంధమే. ఏలేశ్వరం ప్రాజెక్టు మూలంగా నష్టపోయే గిరిజనులకు సక్రమంగా పరిహారం అందాలనేదే బాలిరెడ్డి తపన. ‘అడుక్కునేవాళ్లకు సాయంచేసినట్టు ఉండకూడదు,’ అంటాడు. అవినీతిపరులైన రాజాకీయనాయకులకు ‘జైల్లో చిప్పకూడు తినబెట్టాల,’ అని కలలు కంటాడు. పెద్దోళ్లెవరూ జైలుకెళ్లరని మరోసారి ఋజువవుతుంది. ‘న్యాయం చెయ్యడం ఎంత ప్రాబ్లెమో ఈ యూనిఫాం వేసుకుంటేగాని మీకు తెలియదులెండి,’ అంటాడు పోలీసు అధికారి.
ఆనాటి మూత్రవిసర్జన అసంకల్పితచర్య అనీ, బాలిరెడ్డి ఒక పథకం ప్రకారం ఆ పని చెయ్యలేదనీ చివర్లో తెలుస్తుందిగానీ, దాంట్లో ఏదో సమర్థనీయత ఉన్నట్లుగా తోస్తుంది. ఏలేశ్వరం కుంభకోణం అందరికీ తెలిసిందే అయినా, బాలిరెడ్డి మూత్రం దానికి దుర్గంధం జోడించి రాష్ట్రమంతటా వ్యాపింపజేసింది. సామాన్యుల కోపాన్ని, అసహ్యాన్ని ఒక చిరుద్యోగి అందరికీ అర్థం అయ్యేలా ప్రకటించాడని ఒక విలేఖరి వ్రాస్తాడు. మరో రెండు రోజుల్లో ఈ ఉదంతాన్ని అంతా మర్చిపోతారు. మనిషి ఓటమిని బైరాగి అర్థం చేసుకున్నాడని బాలిరెడ్డి భావిస్తాడు. తాను వ్రాసుకున్న కవిత్వాన్ని బైరాగి ఫొటోకి నివేదిస్తాడు. ఆ కవితలోని ఆఖరి చరణాలు:
‘ఇదిగో ఇంక ఈ తలుపు మూస్తున్నాను
ఒక వెలుతురు చూపూ చొరలేని తలుపు.…..
ఎన్నాళ్లని ఈ శవాన్ని మోయగలను?
ఎవరో ఒక బైరాగి వదిలిన పాదముద్రల్ని
వెతుక్కుంటూ ఇక వెళ్లిపోతాను.
నేరస్థులు, అవినీతిపరులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. సామాన్యులకు న్యాయం జరగాలని తపించేవారు శిక్షలకు గురి అవుతున్నారు.
ముగింపు
పతంజలిశాస్త్రి కథలన్నింటిలాగే ఇవికూడా అన్వేషణాత్మంగా ఉంటాయి తప్ప, పరిష్కారాలవైపుగా ప్రయాణించవు. వీటిల్లో ఏ కథనైనా తీసుకొని పరిష్కారంవైపుగా నెట్టవచ్చు. ఉదాహరణకి ‘యువరానర్ కథని సాయుధపోరాటాన్ని సమర్థించేందుకు వినియోగించవచ్చు. అలాగే ‘మృత్యుభారం’ కథని చక్కటి రామభక్తి సందేశంగా దిద్దవచ్చు. ‘దీపాలపల్లె బోవాలె’ని అగ్రవర్ణాల కుట్రను బహిర్గతం చెయ్యడానికి సాధనంగా మార్చవచ్చు. అయితే అప్పుడవి పతంజలి శాస్త్రి కథలు కావు. ఇంకేవో అవుతాయి.
ఈ కథల వైవిధ్యం మనల్ని అబ్బుర పరుస్తుంది. ఇవన్నీ కూడా జీవిత మధనం నుండి పుట్టినవే. వీటిల్లో రచయిత సందర్శింపజేసిన సమాజం, మానవ సంబంధాలు మనకు అపారమైన దుఃఖాన్ని కలిగిస్తాయి. ‘అయ్యో! ఎందుకిలా ఉన్నాం? ఇలా ఉండకూడదు!’ అనిపించేలా చేస్తాయి. అయితే ఈనాటి దుఃఖానికి కారణాలు అందరికీ తెలుస్తున్నప్పటికీ, అశక్తులుగా మిగిలిపోవడమే నేటి విషాదం. ఈ దుఃఖమయ జీవనానికి నివారణలేదా? ‘కిటికీలు’ కథలో నిర్మల అంటుంది, ‘మనదైన జీవితం ఉందని తెలుసుకోవాలి. ఇతరులవల్ల కలిగే ఆనందం ఒక్కటే కాదు, నీవల్ల నువ్వు సంతోషపడాలి’.
చివరిగా ఒక మాట. అస్తిత్వవాదనలు బలంగా వినిపిస్తూన్న నేటియుగంలో ఇటువంటి మార్మికమైన కథల్ని పట్టుకొని వాటి తాత్విక లోతులకై అన్వేషించడం అవసరమా? అని కొంతమంది ప్రశ్నించవచ్చు. ఇందిర, హేమల వ్యధ (‘మనలాగ’) LGBTQల కథ కాదా? ‘కిటికీలు’ కథ జీవిత చరమాంకంలోని సీనియర్ సిటిజెన్లకు వాళ్ల అనుభవాలు మరోవిధంగా కనబడతాయి అని చెబుతున్నది. చాలామంది ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తారు; కొందరే తమ అన్వేషణను కొనసాగిస్తారు. ‘నీ పేరేమిటి?’ కథ, పుట్టుక అనే ఏక్సిడెంట్ జరిగిన వెంటనే – జెండర్, మతం, కులం – వీటికి నిర్దేశించే, శాశ్వతంగా శాసించే విధంగా ఆ వ్యక్తిపై రుద్దే లేబిల్స్‌ని గురించి అని భావించవచ్చు. ‘2+1=0’ కథ మనుష్యులను నడిపించే అంతః శక్తులను ప్రస్తావిస్తుంది. వాటిని గుర్తిస్తూనే మనకు సంతోషం కల్గించే రీతిలో జీవించడం గురించి చెబుతున్నది. నూనెగానుగ నడిపే కళింగదేశ శ్రామికుడి సమిష్టి సుప్తచేతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన బౌద్ధ మూలాల కథ ‘దీపాలపల్లె బోవాలె’. పామరులు అనబడేవారే జీవితపు ఒడుదొడుకుల్నీ, మరణాన్నీ సమర్థవంతంగా ఎదుర్కోగలరని, ‘మృత్యుభారం’ తెలియజేస్తున్నది. చదువుకోగలిగి, ఉద్యోగులుగా అవతరిస్తూన్న నేటితరం గిరిజనుడి గాథ ‘యువరానర్’. అటు అడవితో సంబంధం పలచబడి, అన్నల మధ్య ఇమడలేక, ఇటు ప్రభుత్వశాఖల్లో పేరుకుపోయిన అవినీతినీ, అలసత్వాన్నీ భరించలేక సతమతమవుతూన్న సున్నిత మనస్కుడు బాలిరెడ్డి. ఈ కాఫ్కా-తరహా అబ్సర్డ్ డ్రామాలో పూర్తిగా తలక్రిందులుగా నడుస్తూన్న సమకాలీన సమాజం, అది సృష్టించిన విధ్వంసం క్షోభను కలిగిస్తాయి.
ఇన్ని అణచివేయబడిన సమూహాల ప్రతినిధుల కథలు ఊసుపోక వ్రాసుకున్నవి కానేరవు. ఇవి ఇప్పటి మన సమాజపు కథలు. అనాకానేక పరిమితుల నడుమ వ్యక్తులు తమ జీవితాలతో సంఘర్షించేటప్పుడు ఏకకాలంలో ఉద్భవించే బాహ్య-అంతః పోరాటాల రక్తసిక్త గాథలు. అందుకే ఇవి సార్వజనీన సత్యాన్వేషణలు. వీటి సంక్షిప్తరూపానికి మనోవైఙ్ఞానిక ఆధారితమైన మార్మికతని రచయిత వినియోగించాడని తోస్తుంది; అలాగే నేటి విధ్వంసానికి నడుమ ఎక్కడో మిణుకుమిణుకుమంటూన్న ఆశను ఎగదోసే తాత్వికతను కూడా. ఇవి మళ్లీమళ్లీ చదివి, వాటి లోతులను అన్వేషించుకుంటూ ఎవరికివారే అన్వయించుకోవాల్సిన కథలు.
‘2+1=0’ పతంజలిశాస్త్రి కథలు. ఛాయా పబ్లికేషన్స్. 92 పేజీలు. వెల రూ. 150/-. ప్రతులకు: www.chaayabooks.com .