ఎండి శుష్కించిన నేలను ఎట్టకేలకు తొలకరి వానలు కరుణించాయి. గాలివాటం మారింది. వర్షాకాలం మొదలైపోయింది. మూడు రోజులుగా ముసురు. నేడు సముద్రం వైపునుండి గాలి ఉధృతంగా వీస్తోంది. అయినా ఉక్కపోత. కళింగపట్నం మీదుగా అగ్రహారంవైపు వెళ్లే దారంతటా బురద. అప్పటివరకూ ఉండీఉడిగీ కురిసిన వానలకే రహదారులన్నీ బురదనీటి గుంటలుగా మారిపోయాయి. వేద పాఠశాల విద్యార్థులకు పరీక్ష నిర్వహించడానికని పొరుగూరు వెళ్లిన విశ్వనాథశర్మ, ఒంటెద్దు గూడుబండి మీద ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆనాడు అతని ఆలోచనలన్నీ ఒక్కగానొక్క కొడుకు అనంతకృష్ణుడి చుట్టూనే తిరుగాడుతున్నాయి. ముసురు పట్టినా, గాలీవానా వచ్చినా కొడుకు ఎలా ఉన్నాడో అనే ప్రశ్న అతన్ని వేధిస్తూంటుంది.
పంతులుగారికి ఇబ్బంది కలగకూడదని బండివాడు ఎద్దును అదిలిస్తూ నెమ్మదిగానే పోనిస్తున్నాడు; మరో ప్రక్క బండి చక్రాలు ఏ బురదగుంటలోనో ఇరుక్కుపోతాయేమోననే చింత. శర్మ ఇవేమీ పట్టించుకొనే స్థితిలో లేడు. బండి ఊగిసలాడుతూ అగ్రహారంలోకి ప్రవేశించింది.
ఎదురుపడ్డ పెద్దాచిన్నా అతనికి దండంపెట్టి ప్రక్కకు తప్పుకుంటున్నారు. మధ్యాహ్న భోజనాలు కానిచ్చి, పెంకుటిండ్ల ఎత్తరుగుల వరండాలలో సేదతీరుతూ విసనకర్రలతో విసురుకుంటూనో, లేక వాటి కాడలతో పేతపట్టిన తమ వీపుల్ని సావకాశంగా గోక్కుంటూనో కూర్చున్న బ్రాహ్మణులు లేచినిల్చొని, శర్మగారికి వినయంగా నమస్కరిస్తున్నారు. అతడు ఒక్కోసారి తల ఊపుతున్నాడు. తన ఆలోచనల్లో మునిగితేలుతూ పరిసరాల్ని పట్టించుకోవడం లేదు.
సింహళం వైపుగా వెళ్లిన ఓడలన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి. ఇంటికి తిరిగొచ్చిన మహానావికుడొకడు – అతనుకూడా వరహాలశెట్టి ఓడలోనే పనిచేస్తున్నాడట – అనంత కృష్ణుడు రావడానికి మరో రెండు వారాలైనా పడుతుందనే కబురు అందజేశాడు.
‘ఇటువంటి సమయాల్లో వాడు నాకు తోడుగా ఉండాల్సింది. అటువంటిది, దేశాలు పట్టిపోయి, ఒక వైశ్యుడితో కూడి, సరకుల కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నాడు – అదేమి ఖర్మమో?’ అని నూరోసారి అనుకున్నాడు. పైకి చెప్పుకోలేని బాధ; కనీసం భార్యతో కూడా చెప్పుకోలేడు; ఆమె మరింత ఆందోళన చెందుతుందని తెలుసు. ఈ ప్రయాణంలో కొడుకు విషయాలు అతన్ని మరీ ఎక్కువగా వేధిస్తున్నాయి.
కొడుకు సంస్కృత వ్యాకరణం, వేదపఠనం వీటిల్లో కొంతవరకూ పురోగమించాక ఆ చదువులు నిలిపివేసినా గణితం, ఖగోళశాస్త్రాలలో ఆసక్తి చూపి, వాటిమీద మంచి పట్టు సాధిస్తున్నాడని సంతోషించాడు. చిన్నతనంనుండీ వైశ్యులతో, నావికులతో స్నేహంచేస్తూ, సమయం దొరికినప్పుడల్లా కళింగపట్నం ఓడరేవులోనే గడుపుతున్నాడని తెలిసినప్పుడు సరేలే, ఇవన్నీ బాల్యచేష్టలు అని సరిపెట్టుకున్నాడు; ఈ రోజున కృష్ణుడు ఒక వైశ్యుడివద్ద కొలువు చేస్తున్నాడు. ఇలా అవుతుందని విశ్వనాథుడు ఎన్నడూ అనుకోలేదు.
విశ్వనాథశర్మ ఆ ప్రాంతపు ప్రముఖ బ్రాహ్మణ పండితుడు. కాశీవెళ్లి చదువుకొని వచ్చాక ఆ ప్రాంతపు ఘనాపాఠీగా పేరుపొందాడు. ఆ చుట్టుపక్కల ఎవరికి ఏ ధర్మసందేహం కలిగినా, ఏ ధర్మసంకటం ఏర్పడ్డా అతని వద్దకు పరుగెత్తాల్సిందే.
కాశీలో పెద్దలతో జరిపిన చర్చలలోసనాతన ధర్మాన్ని కాపాడగల మార్గం వైష్ణవం ఒక్కటే అని విశ్వనాథుడు గ్రహించాడు. పామరులను భక్తిమార్గం మోక్షం వైపుగా తీసుకెళ్లగలదు అని అతడు భావించాడు. మొత్తానికి బౌద్ధం, జైనంవంటి విపరీత పోకడలనుండి తప్పించుకోవాలంటే ఒకవైపు వైష్ణవాన్నీ, మరోవైపు భక్తిమార్గాన్నీ ఆశ్రయించాలి అని అతడు తెలుసుకున్నాడు. ఈ విషయాల్లో ఉత్తరదేశ పండితుల విఙ్ఞత అతడిని అబ్బురపరచింది.
‘మన విశ్వనాథం, కాశీ వెళ్లి మారిపోయాడు,’ అన్నారు సాటి బ్రాహ్మలు. నిజమే, కాశీలో నాలుగైదేళ్లు ఉండి వచ్చాక అంతకు ముందు కన్నా ముక్తసరిగా, అంతర్ముఖంగా ఉన్నాడనిపించింది గ్రామస్థులకు. కాశీలో అతడు పోగుచేసుకున్న ఙ్ఞానసంపదనీ, పాండిత్యాన్నీ గౌరవించేవారేతప్ప శంకించేవారెవ్వరూ లేరు. అప్పటికే మించిపోయిందని తొందరపడ్డ తల్లితండ్రులు, అతడు కాశీనుండి తిరిగిరావడంతోనే – సుబ్బాయమ్మతో వివాహం జరిపించారు; సంవత్సరం తిరగ్గానే కుమారుడు కలిగాడు. కృష్ణభక్తిని సూచించే విధంగా కొడుక్కి అనంతకృష్ణ శర్మ అని పేరు పెట్టుకున్నాడు. తరువాత ఇద్దరు బిడ్డలు మరణించారు. చివరిగా దక్కినవాళ్లు ముగ్గురూ ఆడపిల్లలే. కాశీలో ఉండగా జ్యోతిష్యశాస్త్రం అధ్యయనం చేశాడు విశ్వనాథుడు. జాతకాలు వ్రాయించుకోవడానికని చాలామంది అతని వద్దకు వస్తూ ఉంటారు.
‘అందరికీ శకునం పలికే బల్లి తావెళ్లి కుడితిలో పడిందట. నా పరిస్థితి అలాగే ఉంది’, అనుకుంటూంటాడు విశ్వనాథశర్మ. కొడుకు పుట్టినప్పుడు అతడే స్వయంగా జాతకచక్రం వేశాడు. గ్రహబలం అద్భుతంగా ఉంది, కొడుకు మహాపండితుడవుతాడని నిర్థారించాడు. తీరామోసి ఇలా అయింది. బృహస్పతి బలంగా ఉన్నప్పటికీ, చంద్రుడి దెబ్బ ఊహించనివిధంగా తగిలినట్లుంది. చంద్రుడే కొడుకుని సముద్రాలవైపు ఆకర్షించాడని విశ్వనాథశర్మ ఈమధ్య కాలంలో అనుకుంటున్నాడు. సముద్రపు ఆటుపోట్లకీ, చంద్రుడికీ ఉండే అన్యోన్య సంబంధం, కళింగపట్నం తీరానికి సమీపాన పుట్టిపెరిగిన విశ్వనాథునికి తెలియనిది కాదు.
చిన్న వయసులోనే దేశసంచారం చేసి విశేషంగా ధనార్జన చేస్తాడని కొడుకు జాతకం తెలిపింది. అది మాత్రం నిజం అయింది. వివాహం ఆలస్యంగా అవుతుందనీ, భార్య ద్వారా అతని ఆస్తిపాస్తులు వందరెట్లు పెరిగిపోతాయని జాతకంలో ఉంది. పాతికేళ్లొస్తున్నా ఇంకా పెళ్లయితే కాలేదు మరి…నడి వయస్సులో గొప్ప ఖ్యాతిని గడిస్తాడని జాతకం తెలుపుతోంది. ఏమవుతుందో చూడాలి…ఇవన్నీ ఎవరితో చెప్పుకోగలడు?
అందివస్తాడనుకున్న కొడుకు సముద్రాలు పట్టి తిరుగుతున్నాడు. నియమనిష్ఠల్ని తుచ తప్పకుండా పాటించే సద్బ్రాహ్మణుడి కొడుకు నావికుడు కావడం ఏమిటని చెవులు కొరుక్కున్న బ్రాహ్మలున్నారు. అయితే వాళ్లెవరికీ విశ్వనాథుని నిలదీసే ధైర్యంలేదు. కొడుక్కి మంచి సంబంధాలు రాకపోవడానికి కారణం అతగాడు ఎంచుకున్న వృత్తేనేమో అని విశ్వనాథునికీ, అతని భార్యకూ కొన్నాళ్ల క్రితం సందేహం కలిగింది. ఈ మధ్యకాలంలో ఆ సందేహం మరింత బలపడుతోంది.
విశ్వనాథుడు నిట్టూర్చాడు. బండివాడు, ‘హే, హే, హే… హో, హో!’ అంటూ ఎద్దుని అదిలిస్తున్నాడు. బండి మలుపు తిరిగి విశ్వనాథం ఉండే వీధిలోకి ప్రవేశించింది; తన ఇంటిని సమీపించింది. గుమ్మం ముందు ఎవరివో పల్లకి, ఎడ్లబండి నిలిచి ఉన్నాయి. అంతవరకూ పరాచికాలాడుతూన్న బోయీలూ, బండివాడూ చప్పున మౌనం వహించి, ఒక ప్రక్కగా నిలబడి, చేతులు కట్టుకొని, తలలు దించుకున్నారు.
‘పెద్ద మనుషులెవరో వచ్చినట్లున్నారు…ఎవరై ఉంటారు చెప్మా?’ అనుకుంటూ లోపలికి నడిచాడు.
“అమ్మా!…నాన్నగారొచ్చారే!” అంటూ ఇంటిముందున్న మందార మొక్కలకు నీళ్లుపోస్తున్న చిన్నకూతురు లోపలికి పరుగెత్తింది.
అరుగుమీద పరిచిన జంబుఖానాపై కూర్చున్న పెద్దమనుషులు నలుగురూ లేచినిలబడ్డారు. “నమస్కారం, శర్మగారూ,” అంటూ చేతులను జోడించారు.
ఇంట్లోకి వెళ్లిన చిన్నకూతురు ఇత్తడిచెంబులో నీళ్లతో పరుగెత్తుకుంటూ వచ్చింది. చెంబు అందుకొని కాళ్లు కడుక్కున్నాడు విశ్వనాథం.
ఆ నలుగురిలో ఒకతన్ని గుర్తుపట్టాడు – వరహాలశెట్టి. మిగతా ముగ్గురూ వైశ్యులే అయిఉంటారు – వేళ్లకి వజ్రపుటుంగరాలు, నుదుట అడ్డ నామాలు, చెవులకి బరువైన స్వర్ణ కుండలాలు, చేతులకి రాళ్లుపొదిగిన బంగారు మురుగులు, మెడలో బంగారు గొలుసులు.
‘ఇతగాడెందుకు వచ్చినట్లు?…అది కూడా వీళ్లందర్నీ వెంటబెట్టుకొని?’ విశ్వనాథం మనసు కీడుని శంకించింది. కృష్ణుడికేమీ కాలేదుకదా?
పెద్దమ్మాయి వంటింట్లో తల్లికి సాయం చేస్తున్నట్లుంది. పప్పుపులుసు వాసన వీస్తోంది. నడిమిదీ, చిన్నదీ వెండి రేకు తాపడం చేసిన ఎత్తుపీటని మోసుకొచ్చి వరండాలో వేసి లోనికి వెళ్లిపోయారు. చిన్నది మళ్లీ లోపల్నించి రాగిచెంబుతో నీళ్లు తీసుకొచ్చింది.
“శెట్టిగార్లు దాహం పుచ్చుకున్నారా?” అని అడిగాడు కూతుర్ని, రాగిచెంబు అందుకుంటూ.
“అమ్మగారు చల్ల అంపారండీ” అన్నాడు వరహాలశెట్టి.
చిన్నకూతురికి ఆ శెట్టిగార్ల వేషభూషణాలు కొత్తగా కనిపిస్తున్నాయి. వాళ్ల వంటిమీది బంగారం ఆమెను ఆకర్షించింది. గుడ్లప్పగించి వాళ్లని ఎగాదిగా చూస్తూ అక్కడే నిల్చుండిపోయింది.
ఖాళీ అయిన రాగిచెంబుని అందజేస్తూ తండ్రి,”ఇంక లోపలికి వెళ్లు!” అన్నాడు కొంచెం కటువుగా.
తండ్రి తాగగా చెంబులో మిగిలిన నీళ్లని మందారమొక్కకు పోద్దామని ఆ పిల్ల గుమ్మం వద్దకు నడిచింది.
“వర్షాకాలంలో మొక్కలకి నీళ్లు పొయ్యనక్కర్లేదు!” అని తండ్రి గద్దించడంతో అయిష్టంగా ఇంట్లోకి వెళ్లిపోయింది.
“చెప్పండి శెట్టిగారూ, ఏమిటిలా వచ్చారు? మావాడి సంగతి ఏమైనా తెలిసిందా? ఎప్పుడొస్తున్నాడు?” అని అడిగాడు, వరహాలశెట్టిని – బాసికపట్టు వేసుకుంటూ.
అతడు, “అయ్యా! మొదట మేము ఉడతాభక్తిగా తీసుకొచ్చిన చిరు కానుకలను స్వీకరించండి” – అంటూ పట్టు వస్త్రం కప్పిన వెండి పళ్లేన్ని అందజేసాడు. సువాసన బట్టి మామిడిపళ్లు ఉన్నాయని తెలుస్తున్నది. లడ్డూలు, అరిసెలు కూడా ఉన్నాయి. తలను ఊపి, ప్రక్కగా పెట్టమని విశ్వనాథుడు సైగ చేశాడు. కానుకలు తీసుకొచ్చారంటే అంతా సవ్యంగానే ఉందన్నమాట, అనుకున్నాడు విశ్వనాథుడు. అతనికి కొంత ఉపశమనం కలిగింది.
చెల్లెళ్లకు వడ్డించి తనని భోజనం చేసెయ్యమని పెద్దకూతురికి చెప్పి, సుబ్బాయమ్మ మొందుగదిలోకి వచ్చి, గుమ్మంచాటున నిలబడి, వరండాలో జరుగుతూన్న సంభాషణను వినసాగింది. ఈ శెట్టిగార్లు ఏ కబురు మోసుకొచ్చారో అని ఆమెకూ గుబులుగా ఉంది. ఆమె అక్కడ ఉన్న సంగతి అతిథులకు తెలియదుగానీ, భర్తకు కనబడుతూనే ఉంది. భార్య ఆందోళన, ఆతృత విశ్వనాథునికి తెలుసు. వరహాల శెట్టి లేచి నిలబడి, చేతులుజోడించాడు.
“అయ్యా! శర్మగారూ! మీవాడు సింహళంలో క్షేమంగా ఉన్నాడు. నేనే నాలుగురోజులాగి అక్కడ పనులన్నీ చక్కబెట్టుకొని రమ్మన్నాను. ఏడాది బట్టీ ఉప్పూ, నేతబట్టలతో బాటు బియ్యం ఎగుమతి చెయ్యడం మొదలుపెట్టాను. బాకీలు వసూలు చెయ్యమని పురమాయించాను. పూర్వం రోజుల్లో అయితే నేనే స్వయంగా మా ఓడల్లో వెళ్లేవాడిని. ఇప్పుడు మోకాళ్ల నెప్పులతో ఇబ్బందిగా ఉంది. మీవాడు మంచి ప్రయోజకుడు; కార్యదక్షుడు. ఎవరితో ఏవిధంగా మాట్లాడాలో తెలిసినవాడు. నాకన్నా బాగా సింహళభాష మాట్లాడతాడు. నా వ్యాపారంలో భాగస్వామిని చేద్దామనుకుంటున్నాను. నాకు మొగపిల్లలు లేరు; ఉన్నదొక్కర్తే ఆడపిల్ల. మరొక్క విషయం మీతో మనవి చేసుకోవాలి. నా నోటితో చెప్పేకన్నా మా శ్రేణికి పెద్ద – ఇదిగో, ఈ శివయ్యశెట్టిగారు చెబితే బాగుంటుందని వారిని తోడు రమ్మన్నాను”. ఈ మాటలు అంటున్నంతసేపూ వరహాలశెట్టి తన చేతుల్ని సగౌరవంగా జోడించే ఉంచాడు.
వరహాలశెట్టి వంటి పెద్ద ఓడ వర్తకుడి నోటివెంట వెలువడిన కొడుకు ప్రశంసలు విశ్వనాథ శర్మ చెవులకు ఇంపుగా వినిపించాయి. కృష్ణుడి క్షేమసమాచారం అతని గుండెలపై పేరుకున్న భారాన్ని దించింది. భార్యవంక ఒక్క క్షణం సేపు చూశాడు. ఆమె వదనం ప్రసన్నమైందని గమనించాడు. ఇక ఈ శెట్టి ప్రముఖుడు ఏమి చెబుతాడో అని ఆసక్తిగా ఆ పెద్దాయనవైపు చూశాడు. వయోభారంతో కొద్దిగా వంగిన శివయ్య గిరజాల జుత్తు అతని భుజాల్ని తాకుతున్నది. మనిషి పీలగా ఉన్నా, గొంతు మాత్రం కంచుకంఠం. కూర్చొనే మాట్లాడాడు.
“పంతులుగారూ, మీరు అన్యధా భావించకుండా దయచేసి నేను చెప్పేది మొదట సావకాశంగా వినండి. వయసులో చిన్నవాడైనా మీ అబ్బాయి అనంతకృష్ణ శర్మ గారంటే మా వర్తకులందరికీ మంచి గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. అటు సువర్ణదేశంలోనూ, ఇటు సింహళద్వీపంలోనూ ఉన్న వర్తక శ్రేణుల్లో ఆయనకు గుర్తింపు ఉన్నది. అంతేకాదు, వరహాలశెట్టిగారి అమ్మాయికి ఆయనంటే సదభిప్రాయం కలిగింది. చిన్నశర్మగారు కూడా ఆమెయందు సుముఖంగా ఉన్నారని తెలిసింది. ఇక ఆరు ఓడలకు అధిపతి అయిన మా వరహాలశెట్టికి వర్తక శ్రేణిలో ఉన్న పేరుప్రఖ్యాతులు మీకు తెలియనివి కాదు. మీరెండు కుటుంబాలూ ఒకటైతే మన ప్రాంతీయులంతా సంతోషిస్తారు. కాబట్టి, వారిరువురికీ వివాహం జరిపించినట్లయితే దివ్యంగా ఉంటుందని మా అందరి ఆలోచన. మీ పాండిత్యం, నియమనిష్ఠలు అందరికీ తెలిసినవే. మీ భ్యార్యాభర్తలిరువురూ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది,” అంటూ ముగించాడా వైశ్యవృద్ధుడు.
మిగతా ముగ్గురు వైశ్యులూ శర్మవంక ఆతృతగా చూస్తున్నారు.
విశ్వనాథశర్మ నిర్ఘాంతపోయాడు. ‘ఈ వైశ్యులకెంత ధైర్యం? ధనబలం చూసుకొని విర్రవీగుతున్నారు. నాలుగు రూకలు కంటబడగానే బ్రాహ్మణులతో సమఉజ్జీ అయిపోయేం అనుకుంటున్నారు! ఏకంగా నా ఇంటికే వచ్చి నా కొడుక్కి వాళ్ల పిల్లనిస్తామంటున్నారు,’ అనుకున్నాడు. కోపంతో అతని ముఖం ఎర్రబడింది. దిగ్గున పీటమీదనుండి లేచాడు. ఒక్క క్షణంసేపు అతని నోటివెంట మాట రాలేదు. భార్య వంక చూశాడు. ‘శాంతించండి’ అన్నట్లుగా ఆమె తన అరచేతిని ఆడిస్తూ సైగ చేసింది.
“ఏం మాట్లాడుతున్నారు శెట్టిగారూ? నా ఇంటికి వచ్చి నన్నే అవమానిస్తారా? వయసులో పెద్దవారని ఊరుకుంటున్నాను. నా నోటివెంట శాపనార్థాలు వచ్చేలోగా దయచేయండి,” అనేశాడు.
ఆ వైశ్యప్రముఖులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అవమానాలకు వెరువక, కోపతాపాలకు తావులేకుండా సమస్యలను సౌమ్యంగా పరిష్కరించుకొనే స్వభావం వైశ్యులది. అందరిలోకీ అనుభవఙ్ఞుడూ, మృదుభాషీ అయిన శివయ్య శెట్టి,
“మీరు పెద్దవారుగనక మీకు మొదట తెలియజెయ్యడం, మీ ఆశీర్వాదం కోరుకోవడం మా ధర్మం,” అన్నాడు పరమ శాంతంగా.
శివయ్య మాటల వెనుక ఏదో హెచ్చరిక దాగిఉందని విశ్వనాథునికి తోచింది.
“ఏమిటి మీరనేది?”
“అయ్యా! మీరు సర్వఙ్ఞులు; మీకు తెలియనిది కాదు. నాకు తెలిసి బ్రాహ్మణవరుడు చతుర్వర్ణాలలోని ఏ యువతినైనా చేసుకోవచ్చు. అదే బౌద్ధంలో అయితే అసలు కులపట్టింపులు లేనే లేవు”.
“బౌద్ధం?…ఇప్పుడు బౌద్ధం సంగతి దేనికి? అయినా మన ప్రాంతాలలో బౌద్ధం ఎక్కడుంది?” శర్మ గొంతులో చిరాకు ధ్వనించింది.
“నిజమే పంతులుగారూ! మన దేశంలో బౌద్ధం అంతరించిపోయింది. విహారాల శిథిలాలు మిగిలాయి. కానీ అటు సువర్ణ భూమిలోనూ, ఇటు సింహళ ద్వీపంలోనీ బౌద్ధం విరాజిల్లుతున్నది కాదా? మహానుభావుడు రామానుజాచార్యులవారు స్వయంగా పూజా సంప్రదాయాలను నెలకొల్పిన పూరీ జగన్నాధాలయంలో దశావతారాల ఫలకం ఉన్నది. అందులో బుద్ధావతారానికి గుర్తింపు ఉన్నది.”
“అయితే?” శర్మగారి చప్పున కోపం చల్లారిపోయింది; అతనికంతా అయోమయంగా ఉంది.
వరహాలశెట్టి అందుకున్నాడు –
“ఇప్పటికీ మా ఓడల్లో ఆ దేశాల భిక్షువులు ఎవరో ఒకరు వస్తూ, పోతూనే ఉంటారు. మా పూర్వీకులు నిర్ణయించిన ఆనవాయితీ ప్రకారం వారివద్ద మేము కేవు తీసుకోము. అనంతకృష్ణ శర్మగారు ఆ దేశాలకు తరచూ వెళ్తూ ఉంటారు. అక్కడి పెద్దలతోనూ, బౌద్ధ ఆచార్యులతోనూ వారికి చర్చలూ, సంభాషణలూ జరుగుతూ ఉంటాయి. అక్కడి పద్ధతులు ఆయనకు బాగా నచ్చాయి. వర్తకులకు, అలాగే అన్ని వృత్తులవారికీ అక్కడ దొరికే గౌరవం ఆయన్ను ఆకట్టుకుంది. ఈ సంగతి నేను అనేక సందర్భాలలో గమనించాను. ఎన్నో తరాలుగా ఓడవర్తకంలో ఉన్నాం. ఇవాళ కొందరు పండితులు మమ్మల్నే తప్పుపడుతున్నారు. సముద్రయానం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటున్నారు. ఆ దేశాల్లో ఇటువంటి పేచీలు లేవు”.
“అంటే మావాడు బౌద్ధం స్వీకరించాడా?!”
“ఇంకా లేదు. మీరు గనక ఈ వివాహానికి అడ్డు చెబితే ఆ ఆలోచన చెయ్యవచ్చు. అదేగనక జరిగితే పెళ్లి చేసుకొని సింహళదేశం వెళ్లి స్థిరపడే ఆలోచన కూడా ఉన్నట్లుంది,”
“అలాగని మీతో అన్నాడా?”
“చిత్తం! మేమే అడ్డుకున్నాం. మొదట మీ నాన్నగారికొక మాట చెప్పి చూద్దాం అంటే సరే అన్నారు, మీ అబ్బాయిగారు”.
విశ్వనాథుని నోటమాట రాలేదు. నాలందా నాశనంతోనే బౌద్ధానికి ఉనికి లేకుండాపోయిందని చాలామంది పండితుల మాదిరిగానే విశ్వనాథుడూ భావించాడు. కానీ పగబట్టిన నాగుపాములాగా అది మళ్లీమళ్లీ ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంది. ఎందుకని ఈ విధంగా జరుగుతోందో శర్మగారికి అర్థంకాలేదు. అతని బుర్ర పనిచేయడం మానేసింది. మనిషి పూర్తిగా డీలాపడిపోయాడు
సుబ్బాయమ్మ – “ఏమండీ, మిమ్మల్నే! ఒకసారిలా రండి,” అన్నది తలుపు చాటు నుండి.
విశ్వనాథుడు లోపలికి వెళ్లాడు.
“వీడు మనల్నీ, మన వంశాన్నీ బజారుపాలు చేశాడు,” అన్నాడు భార్యతో. అతని గొంతులో నిస్పృహ, నిరాశ ధ్వనించాయి.
“ఇంటికొచ్చిన పెద్దమనుషులతో అలాగేనా మాట్లాడేది? ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి పంపించెయ్యండి. కృష్ణుడు వస్తున్నాడుకదా, వాడితో మాట్లాడాక ఒక నిర్ణయానికి రావచ్చు”.
విశ్వనాథునికి ఆ ఆలోచన నచ్చింది. వరండాలోకి వచ్చాడు.
“శెట్టిగారూ, మీరు చెప్పాల్సింది చెప్పారు. మావాడితో కూడా మాట్లాడాలి కదా? రానియ్యండి, ఆ తరువాతే ఆలోచిద్దాం,” అన్నాడతడు.
వరహాలశెట్టి మొహం వెలిగింది. శివయ్య అందుకున్నాడు –
“అలాగే పంతులుగారూ! తప్పకుండా అలాగే చేద్దాం. అబ్బాయిగారితో మాట్లాడండి; ఆ తరువాతే మీ దర్శనం చేసుకుంటాం”.
వరహాలశెట్టి, “అయ్యా, మరొక్క మనవి. మీకు వీలుచిక్కినప్పుడు, ఒక్కసారి మీ దృష్టిని దీనిమీదికి సారించండి” అంటూ ఒక తాళపత్రాన్ని అందజేశాడు.
“ఏమిటిది?” అన్నాడు విశ్వనాథుడు సంశయిస్తూ.
“మా అమ్మాయి చంద్రావతి జన్మకుండలి. మీ నిర్ణయం ఏదైనప్పటికీ ఒక్కసారి మీరుచూస్తే మాకు తృప్తిగా ఉంటుంది,”
“ఇటివ్వండి,” అంటూ దాన్ని అందుకున్నాడు.
‘చంద్రావతి! ఆమె పేరు చంద్రావతి కావడం యాదృచ్ఛికం కాజాలదు. కొడుకుమీద చంద్రుడి ప్రభావాన్ని ఈమె మళ్లించగలదేమో?’ అనుకున్నాడు, విశ్వనాథుడు.
శెట్టిగార్లంతా బయటకు నడిచారు. విశ్వనాథుడు మర్యాదకోసం వాళ్లని గుమ్మంవద్ద దిగవిడిచి ఇంట్లోకి వెళ్లిపోయాడు.
“మా బాగా నెట్టుకొచ్చారు,” అంది సుబ్బాయమ్మ, ముసిముసి నవ్వులు నవ్వుతూ.
శివయ్య శెట్టిని పల్లకీలో పంపించి తన బాల్య మిత్రులూ, దూరపు బంధువులూ అయిన ఇద్దరు వైశ్యులతో బాటుగా వరహాలశెట్టి ఎడ్లబండి ఎక్కాడు. బండి బయలుదేరింది.
“చూశార్రా ఆ బాపనాయన పొగరు? శివయ్యలాంటి పెద్దమనిషిని పట్టుకొని ఎంత మాటనేశాడో!” అన్నాడు తన మిత్రులతో.
“అవును మరి, ఎంత వయసొచ్చినా, ఎంత సంపాదించినా మనం బ్రాహ్మలకన్నా ఒక మెట్టు కిందనే ఉంటాం…అది తప్పదులేగానీ బావా, జన్మకుండలి ఇచ్చి తొందరపడ్డావేమో?” అన్నాడొక మిత్రుడు.
“నాకూ అదే అనిపించిందిరా. జాతకాలు సరిపడలేదని సాకు చూపించి తిప్పికొడతాడేమో?” సందేహం వ్యక్తం చేశాడు రెండవ స్నేహితుడు.
“అనంత కృష్ణగారి జాతకం దగ్గర పెట్టుకొని మరీ రాయించిన జన్మకుండలిరా! పెద్ద శర్మగారికి దిమ్మ తిరిగిపోతుంది – అంతలా జోడించి రాయించాను,”
“నువ్వు మహా ఘటికుడివిరా, బావా! ఇంతకీ చిన్నశర్మగారి కుండలి ఎక్కడ సంపాదించావు?”
“ఎక్కడేమిటి? ఆయనే ఇచ్చాడు. ఆయన దగ్గర నకలు ఉంది!”
“నువ్వు సామాన్యుడివి కాదురా, బాబూ!”
“వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించాలని పెద్దలు అన్నారా లేదా?” అని చమత్కరించాడు వరహాలశెట్టి.
“అవునవును, ముల్లుని ముల్లుతోనే తియ్యాలి,” అన్నాడతడి మిత్రుడు.
ముగ్గురు స్నేహితులూ నవ్వుకున్నారు.
***
వైశ్యులు తెచ్చిన సంబంధం శర్మని కలవరపరచింది. వాళ్ల మాటలు అతని మెదడులో గిరికీలు కొట్టాయి. వరహాలశెట్టి తనకొక్కర్తే కూతురు, కృష్ణుడిని వ్యాపారంలో భాగస్వామి చేస్తానన్నాడు. శివయ్య ఏకంగా పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చాడు. అంటే ఏమనుకోవాలి? జాతకంలో ఉన్నట్లుగా కొడుకు గొప్ప ధనవంతుడయ్యే మార్గం ఇదేనేమో?! కృష్ణుడు ఓడలకి అధిపతి కాగల అవకాశం మళ్లీమళ్లీ రాబోదని అనిపించింది. అలాగని – కట్టుబాట్లని వదులుకొని వైశ్యుల పిల్లని ఇంటికోడలుగా తెచ్చుకుంటామా? అతనికి ఎటూ తోచలేదు. శివయ్య చెప్పిందీ సబవుగానే ఉంది. క్షత్రియులూ, బ్రాహ్మణులూ ఏ కులపు వధువునైనా స్వీరించవచ్చు. అలోచన చెయ్యగా, చెయ్యగా అతని సమస్యల్లా – మిగతా అగ్రహార బ్రాహ్మణులు ఏమంటారో అనే సంకోచంతప్ప మరేమీ కాదని తెలుసుకున్నాడు. ఇదే మాట భార్యతో అన్నాడు – నూతివద్ద స్నానం చేసివచ్చి, భోజనానికి కూర్చుంటూ.
అయితే సుబ్బాయమ్మని ఈ ధర్మసంకటాలేవీ బాధించలేదు. నాలుగు గోడలమధ్యే పెరిగినా ఆమెకు లోకపు పోకడలన్నీ బాగానే తెలుసు. పుట్టిన ఇంట్లో పట్టుబడ్డ వ్యవహార ఙ్ఞానం ఆమెది. జమీందారుగారి వద్ద కొలువు చేసిన తండ్రి, కరణీకాలతో భూములు సంపాదించుకున్న అన్నలూ, భర్తకి తెలియకుండా వడ్డీకి అప్పులిచ్చే తల్లీ – వీరందరి సాహచర్యంతో ఆమెకు లోకంతీరు బాగా తెలిసి వచ్చింది. తన భర్తకు చాదస్తం మరీ ఎక్కువ అనీ, ముక్కుకి సూటిగా పోయి ఎదురుదెబ్బలు తినేరకం అనీ పెళ్లయిన నెల్లాళ్లకే గ్రహించింది. పైగా ప్రథమ కోపం. అంచేత భర్తని ఎల్లప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలని తెలుసుకుంది. పొగడ్తలకి ఇట్టే లొంగిపోతాడని కూడా ఆమెకు తెలుసు.
“మీ మాటకి ఎదురుచెప్పే వాళ్లెవరున్నారండీ ఈ అగ్రహారంలో? పైగా శాస్త్రం అమోదిస్తున్నదని మీరే అంటున్నారు కదా?” అన్నదామె, భర్తకు భోజనం వడ్డిస్తూ.
ఆలస్యంగానైనా ఆరోజు భర్త తిరిగి వస్తాడని ఆమెకు తెలుసు. అందుకే అతనికిష్టమైన ముద్ద పప్పూ, దోసకాయ నువ్వుల పచ్చడీ చేసింది. బెల్లం లావుగా వేసి తోటకూర పులుసు చేసింది. తన వంటకాల్ని భర్త ఇష్టంగా తింటూండడం ఆమెకు తృప్తిని కలిగించింది. విసనకర్రతో విసురుతూ, ఆమె ఆలోచిస్తున్నది.
లేనిపోని పంతాలకూ, పట్టింపులకూ పోకుండా, ఈ కోమట్ల పిల్లని కోడలుగా తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట అడుగుపెడుతుంది. ఈ ఇంటికి సరస్వతీ కటాక్షం ఎలాగూ ఉంది. కృష్ణుడి మొండితనం ఆమెకు తెలుసు. తను ఎంత వేడుకున్నా వినకుండా, చివరికి తండ్రి మాటను మెడ్డివేసి, కొడుకు ఓడెక్కి వెళ్లిపోవడం ఆమెకొక పాఠం నేర్పింది. వ్యవహారం అన్నాక తెగేవరకూ లాగకూడని తెలుసు.
“మనకి పెళ్లికావలసిన ఆడపిల్లలున్నారు, ఏమిటి సాధనం?” విశ్వనాథశర్మ ఊగిసలాడాడు.
“మీరే అంటారు కదా? విధిరాతని మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదని. ఏదవ్వాలో అదే అవుతుంది,” అన్నది సుబ్బాయమ్మ దృఢంగా.
భార్య మొండి ధైర్యం విశ్వనాథునికి ఆశ్చర్యం కలిగించింది; కొంత సత్తాని ఇచ్చింది. అతని మేధస్సు మేలుకొని, పనిచేయనారంభించింది. ‘కొడుకు జాతకం నిజం కాబోతున్నది. రాసిపెట్టిందాన్ని మార్చడానికి మనం ఎవరం? ఆరు ఓడలకు అధిపతి అయ్యే అవకాశం తలక్రిందులుగా తపస్సు చేసినా ఏ బాపడికీ రాదు. కట్నాలో కానుకలో సమర్పించుకొని ఉన్నంతలో కూతుళ్లకు కాస్త మంచి సంబంధాలు తీసుకురాగలడు. తనకున్న పరపతి తక్కువేం కాదు…ఆ బాధ్యతకూడా కృష్ణుడి మీదే పెడితే?’
“మొదట పెద్దదానికి పెళ్లి చెయ్యాలి, ఆ తరువాతే నీ సంగతి అని వాడికి చెబితే?” అన్నాడతడు, భార్య అందించిన తుండుతో చేతులు తుడుచుకుంటూ.
“భేషుగ్గా ఉంటుంది. చెల్లెళ్ల పెళ్లిళ్లు చెయ్యడం వాడి బాధ్యత కాదా ఏం?” మద్దతు తెలిపింది సుబ్బాయమ్మ – ఆకూ, వక్కా అందిస్తూ.
అతడి ఆందోళన తగ్గుముఖం పట్టిందని గ్రహించింది. తానుకూడా భోజనం కానిచ్చి పడకగదిలోకి తొంగిచూస్తే, అతగాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు – సన్నగా గురకపెడుతూ. ‘పాపం అలసిపోయారు, ప్రయాణపు బడలిక; వొచ్చీ రాగానే పెద్ద కోమట్లతో ఈ మల్లగుల్లాలు,’ అనుకుంటూ పిల్లలకు చిరుతిళ్లు చెయ్యడానికని వంటింట్లోకి వెళ్లింది. అప్పుడామెకొక ఊహ కలిగింది. ‘వైశ్యుల పిల్ల కోడలిగా వచ్చి, ఈ వంటింట్లో అడుగుపెడితే, ఈ ఇంట్లో మసులుతూ ఉంటే ఎలాఉంటుందో?’ ముఖాన చిరునవ్వుతో శనగపిండి డబ్బా అందుకుంది, బజ్జీలు చెయ్యడానికని.
ఆ మరుసటి రోజే కన్యకాపరమేశ్వరి పూజకి విచ్చేయమని వరహాలశెట్టి ఇంటినుండి సుబ్బాయమ్మకు పిలుపు వచ్చింది. ఆ వేళకల్లా గుమ్మం ముందు పల్లకీ వచ్చి నిలిచింది. ఆడపిల్లలు ముగ్గురూ మేమూ వస్తామని పట్టుబట్టారు. మరి కాసేపట్లో వాళ్లకోసమని మరో పల్లకీ వచ్చింది. పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు.
అక్కడి వైశ్య స్త్రీల బంగారాలూ, పట్టు చీరలూ చూసినప్పుడు సుబ్బాయమ్మ కళ్లు చెదిరిపోయాయి. వైశ్యులిచ్చిన కానుకలకూ, చేసిన మర్యాదలకూ ఇంటిల్లిపాదీ మురిసిపోయారు. తమదొక పేద బ్రాహ్మణ కుటుంబం అని సుబ్బాయమ్మకు స్పష్టంగా తెలియవచ్చింది. ఇప్పుడంటే కొడుకు నాలుగు రూకలు తెచ్చి చేతిలో పెడుతున్నాడుగానీ, భర్త ఆదాయం అంతంత మాత్రమే. ఉన్నదల్లా – వాటాలు వేసుకోగా దక్కిన నాలుగెకరాల పొలం, రెండెకరాల మామిడితోట.
చంద్రావతి కలుపుగోరుతనం, పెద్దలపట్ల అణకువ సుబ్బాయమ్మకు బాగా నచ్చాయి. ఆమెలో ధనమదం మచ్చుకైనా కనిపించలేదు. ఇదే మాట భర్తకు చెప్పింది. వరహాలశెట్టి ఇంట తాను తెలుసుకున్న మరో విషయాన్ని భర్త చెవిన వేసింది.
“అయ్యో రామా! రజస్వలానంతర వివాహం కూడానా?” అన్నాడు విశ్వనాథుడు లెంపలు వేసుకుంటూ.
“అవునుమరి, వాళ్లు సరిగ్గా చెప్పడంలేదుగానీ పిల్లకి ఇరవై దగ్గర ఉంటాయి. అయినా నిండా మునిగినవాడికి చలేమిటండీ?” అంది సుబ్బాయమ్మ.
చంద్రావతి మొహంలో లక్ష్మీకళతో బాటుగా సరస్వతీదేవి అనుగ్రహం వెలిగిపోతున్నదని భర్తకు చెప్పినపుడు అతను సంతోషించాడు. అయితే ఆమెది చామనచాయ కన్నా ఒక పాలు తక్కువే అన్న సంగతి మాత్రం సుబ్బాయమ్మ భర్తకు వెల్లడించలేదు.
కృష్ణుడికీ, చంద్రావతికీ జాతకాలు అద్భుతంగా కుదిరాయి. ఇంత బాగా పెనవేసుకుపోయిన జాతకాలను విశ్వనాథుడెప్పుడూ చూడలేదు. వాళ్లిద్దరికీ విధి రాసిపెట్టాడని విశ్వనాథుడికి బలంగా అనిపించింది. అదే మాట భార్యతో అంటే ‘నాకూ అలాగే అనిపిస్తోంది’ అన్నది.
అయితే సుబ్బాయమ్మకి కూడా వివరంగా చెప్పని మరో సంశయం విశ్వనాథశర్మని పీడిస్తున్నది. అతడు కాశీలో ఉండగా ఉత్తరాది పండితులు కొందరు, సముద్రయానం పాపకార్యం అని అతనితో బలంగా వాదించారు. బెస్తవారు తప్ప మరెవ్వరూ సముద్రం మీదికి పోకూడదని వారి వాదన. ఏనాడూ సముద్రం ముఖం చూడని ఈ పెద్ద మనుష్యులు ఈ విధమైన కట్టుబాట్లు చెయ్యడం ఏమిటని అతడు విస్తుపోయాడు. ఏ శాస్త్రంలో ఈ ఆంక్షలున్నాయో చూపమని వాళ్లని నిలదియ్యాలని అనుకుంటూనే ఆయా పెద్దలమీద గౌరవంతో విరమించుకున్నాడు. తాను తీరప్రాంత నివాసి. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులతో సహా తరతరాలుగా అంతా ఓడలెక్కి సముద్రాలమీద ప్రయాణించినవారే. పూర్వం రోజుల్లో నావికులుగా, మహానావికులుగా వ్యవహరించిన బ్రాహ్మణులు ఉండేవారని పెద్దలు చెప్పగా అతను విన్నాడు. దక్షిణదేశంలో ఇప్పటికీ బ్రాహ్మలు నావికులుగా, మహానావికులుగా సముద్రయానం చేస్తారని కొడుకు ఒక సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఏమిటీ కట్టడి? ఈ విషయమై శాస్త్రాలేమంటున్నాయా అని వెతికాడుగాని సరైన సమాధానం దొరకలేదు. పైగా ఆ ఉత్తరాది పండితులు సముద్రయానం అనే పాపానికి ఒడిగట్టిన వాళ్లు చెయ్యాల్సిన ప్రాయశ్చిత్తం ప్రకటించారు. దానికి కూడా ఆధారాలు లభించలేదు, విశ్వనాథునికి. ఇదంతా ‘కోతిపుండు బ్రహ్మ రాక్షసి’ అనుకొని అప్పట్లో విడిచిపెట్టాడుగానీ, చుట్టూ తిరిగి ఇప్పుడదే తన మెడకు చుట్టుకుంది.
‘శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలన్నారు. పనిలోపని, కొడుకు మీద మరో నిబంధన విధిస్తే?…భలే, భలే! అసలీ ఆలోచన మొదట ఎందుకు రాలేదు?’… శర్మగారి మెదడు చురుకుగా పనిచేయనారంభించింది.
***
ఋతుపవనాల ప్రభావంతో సముద్రం కల్లోలంగా మారింది – అనంతకృష్ణుడి మానసిక స్థితి మాదిరిగానే. అనుభఙ్ఞుడైన నావికుడుగనుక తిరుగు ప్రయాణంలో అతడేమంత ఇబ్బందిపడలేదు.
కళింగపట్నంలో బయలుదేరినప్పుడే,
“మీరేమీ బెంగ పడకండి శర్మగారూ! మీ నాన్నగారిని నేను ఒప్పిస్తాను కదా? మీరీ ప్రయాణం పూర్తిచేసుకొని రండి, అంతా నేను చూసుకుంటాను. ఒక్క మాట! మీ జాతకచక్రం నకలు ఉందన్నారుకదా? అదొక్కటీ నా చేతికిచ్చీసి, మీరు బయల్దేరండి” అని పంపించాడు వరహాల శెట్టిగారు.
‘కాయా? పండా? ఏమైందో మరి?’ ఏ సంగతీ తెలియక అనంతకృష్ణుడు ఓడలో ఉన్నన్ని రోజులూ ఆందోళనతో గడిపాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదీ కుదరకపోతే సింహళదేశం వెళ్లిపోయి పెళ్లిచేసుకుందామనే ఆలోచన అతనిలో బలపడింది. సింహళానికి ప్రయాణం కట్టే ముందు అతడీమాట చంద్రావతితో అన్నప్పుడు, ఆమె తన తండ్రితో సంప్రదించి అందుకు ఒప్పుకుంది. ‘అంత వరకూ రాకుండా నేను చూసుకుంటాలే,’ అని వరహాల శెట్టి హామీ పలికాడు వారిరువురితో.
తల్లిదండ్రులతో గొడవపడి, అవసరమైతే తెగతెంపులు చేసుకోవాలేమో అనుకుంటూ అనంతకృష్ణుడు ఇల్లుచేరేనాటికి తన పెళ్లి విషయమై వారిరువురూ సుముఖంగానే ఉండడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. వరహాలశెట్టి రాయబారం పనిచేసిందన్నమాట అనుకున్నాడు. తను కూడా సామరస్యంగానే వ్యవహరించాలని నిశ్చయించుకున్నాడు. తండ్రి విధించిన నిబంధనని పాటించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు; సముద్రయానం మానుకుంటానని ప్రమాణం చేశాడు. తన తలకు కొరివి పెట్టేందుకు కొడుకు మళ్లీ అర్హుడైనందుకు విశ్వనాథశర్మ సంతోషించాడు;
కానీ తనను సంప్రదించకుండా తండ్రికి మాట ఇచ్చినందుకు చంద్రావతి కోపగించింది. ‘మనం అనుకున్నదేమిటి? నువ్వు చేసిందేమిటి?’ అని నిలదీసింది. అందరు పెళ్లికూతుళ్ల మాదిరిగా ఆమె చిన్నపిల్ల కాదు. ఒక్కతే కూతురు, అదీ తల్లిలేని పిల్ల కావడం మూలాన తండ్రి చేసిన గారాన్ని వినియోగించుకొని ‘ఇప్పుడే కాదు’ అంటూ పెళ్లి వెనకపెట్టింది. వ్యాపార వ్యవహారాలనూ, లోకంతీరునూ తెలుసుకుంది. ఆమెకు చదువు బాగా వంటబట్టింది. రామాయణ భారతాలను చదువనేర్చింది; పద్యాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలను వివరించగలదు. వారి వైవాహిక జీవితం ఎలా ఉండాలి అనే విషయంలో ఆమెకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆ విషయాలన్నీ అనంతకృష్ణతో చర్చించింది.
నిజానికి అనంతకృష్ణుడికీ, చంద్రావతికీ మొదట సఖ్యత ఏర్పడ్డది గణితంలో. తొలిసారి ఆమెను కలుసుకున్నప్పుడు కాగితం, కలం అవసరంలేకుండా ఆమె నోటితోనే చక్రవడ్డీ లెక్కలు చకచకా కట్టడం అతడిని అబ్బురపరచింది. ఆమె ప్రతిభ వడ్డీ లెక్కలతోనే ఆగిపోకుండా బీజగణితానికీ, రేఖాగణితానికీ విస్తరించిందని తెలుసుకున్నప్పుడు అతని ఆశ్చర్యానికి అంతులేదు. తండ్రి సాయంతో, అతని ఉద్యోగులైన నఖోడాలు (పారశీకంలో ఓడతో బాటు ప్రయాణించే వర్తకుడు లేదా అతని ప్రతినిధి), మౌలీం (పారశీకంలో మహానావికుడు)ల ద్వారా అరబ్బు, పారశీక భాషా గ్రంథాలను, అలాగే బౌద్ధ భిక్షువుల ద్వారా పాలీ రచనలను, బ్రాహ్మణ పండితుల నుండి సంస్కృత తాళపత్ర గ్రంథాలను ఆమె సేకరించింది. ‘నాలందా నాశనం కావడం గొప్ప విషాదం, ఎప్పటికీ తీరని లోటు’ అని ఆమె తరచూ అంటూంటుంది. ఎప్పటికైనా కళింగపట్నంలో ఒక ఉత్తమస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటుచెయ్యాలని ఆమె కోరిక.
తానే గనుక మొగపుట్టుక పుట్టిఉంటే తండ్రి ఓడలమీద మహానావికుడిగా దేశవిదేశ సంచారం చేసి ఉండేదాన్ని అని అనుకుంటూ నిట్టూరుస్తూ ఉండేది – కొంత కాలం క్రితం వరకూ. కృష్ణుడితో పరిచయం, స్నేహం ఏర్పడ్డాక ఆ ఆరాటం కొంత తగ్గింది. రెండు విషయాలో ఆమెకూ, కృష్ణుడికీ బాగా బాగా కుదిరింది. మొదటిది ప్రకృతిలోని ప్రక్రియలపట్ల అంతులేని కుతూహలం – రెండవది ఇందుకు తోడుగానే – ఙ్ఞానం పట్ల అపారమైన గౌరవం. తమది ఙ్ఞానమార్గమే అని త్వరలోనే నిశ్చయించుకున్నారు. థేరవాద బౌద్ధంలో వారిరువురికీ ఆసక్తి కలగడానికి ఇదే మూలం.
వారికి స్నేహం ఏర్పడుతూన్న తొలి దినాల్లో, కృష్ణుడిని – సముద్రయానం గురించీ, మాలిమిశాస్త్రం గురించీ ఎన్నో ప్రశ్నలు వేసేది. అతడు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చేవాడు. రాత్రి పూట నక్షత్రాల సాయంతో ఓడని ఏవిధంగా సరైన మార్గంలో నడిపిస్తారని ఆమె అడిగినప్పుడు ఆమెను మిద్దెపైకి తీసుకెళ్లి నక్షత్రరాశుల గురించి వివరించాడు. ఆ సందర్భంగానే, ఆ తారాజగత్తు వారి నిమిత్తమే తెరచిన ఆకాశమార్గాలలోనే, ఆ చుక్కల పందిరి క్రిందనే వారి స్నేహం, గాఢమైన ప్రణయంగా మారింది. ఈ జంట యవ్వనోద్రేకాన్ని చూసీ చూడనట్టు పరికించిన చంద్రుడు, నవ్వుకుంటూ మబ్బుల చాటుకు చేరుకొనేవాడు.
***
మూడు నెలలు తిరక్కుండా అనంతకృష్ణశర్మ దూరపు బంధువుల అబ్బాయితో తన పెద్ద చెల్లెలి పెళ్లి జరిపించాడు. మరో మూడు నెలల్లో అతడి వివాహం చంద్రావతితో అత్యంత వైభవంగా జరిగిపోయింది. ఆ కులాంతర వివాహానికి విచ్చేసిన వైశ్యులు, తమ స్థాయి ఏమిటనేది ఇప్పటికైనా నలుగురికీ తెలియవచ్చింది అనుకున్నారు; బ్రాహ్మలు ‘కలికాలం’ అన్నారు.
కావిళ్లకొద్దీ కట్నాలూ, కానుకలూ, వంటినిండా బంగారం, ఒక బ్రాహ్మణ వంటపుట్టి, మరో ముగ్గురు పరిచారికలతో లక్ష్మీదేవిలా కాపురానికొచ్చిన చంద్రావతిని చూసి మురిసిపోయారు అత్తమామలు.
ఆ సంవత్సరం, వర్షాకాలం రాక ముందే వరహాల శెట్టి – తాపీ మేస్త్రీల్నీ, వడ్రంగుల్నీ, చెక్కసున్నం పనివాళ్లనీ పంపి తన కూతురు, అల్లుడు సౌఖ్యంగా ఉండేందుకని శర్మగారి ఇంటికి ఆనుకొని ఒక మిద్దెగది, కొట్టుగది, వరండా కట్టించాడు. ఆ పాత ఇంటికి మరామ్మత్తులు చేయించాడు, సున్నాలూ, రంగులూ వేయించాడు – వియ్యంకుడికి కాణీ ఖర్చు లేకుండా. ఆ అగ్రహారంలోని పాతకాలపు ఇళ్లముందు విశ్వనాథ శర్మ ఇల్లు వెలిగిపోయింది.
అగ్రహారపు అమ్మలక్కల ముందు కొంచెం గర్వంగానే కొత్త కోడలు గుణగణాలనూ, వియ్యాలవారి మంచీ-మర్యాదలనూ సుబ్బాయమ్మ వర్ణించసాగింది. మొదట ‘అబ్బా! అలాగా?’ అని ఆశ్చర్యం వెలిబుచ్చిన వాళ్లంతా ఆమె కనుమరుగుకాగానే, ‘చూశారర్రా, ఈమెగారి మిడిసిపాటు? నడమంత్రపు సిరి అంటే ఇదే మరి!’ అంటూ చెవులు కొరుక్కున్నారు.
వంటపనీ, ఇంటిపనులూ తప్పినందుకు సుబ్బాయమ్మ మొదట సంతోషించిందిగానీ ఆమెకు ఇంట్లో ఉండే ప్రాధాన్యత తగ్గిపోతున్నది తెలుసుకుంది. పెద్దింటి కోడల్ని పల్లెత్తు మాట అనలేకపోయినా, పనివాళ్లమీద పెత్తనం చెయ్యసాగింది. ఆరునెలలు కాకుండానే అత్తాకోడళ్ల మధ్య చిన్నచిన్న వాదనలు, చిరాకులు తలెత్తి కోపతాపాలకు దారితీసాయి. ముఖ్యంగా – శుచి, శుభ్రం పేరుతో బ్రాహ్మణ కుటుంబాలలో సాగే మడి, మైల వ్యవహారాల మూలంగా. ఇక లాభంలేదని చంద్రావతి పట్టుబట్టి అత్తింటి అలవాట్లు, ఆచారాలు నేర్చేసుకుంది. ఈ విషయంలో ఆమె తన వెంట తీసుకొచ్చిన వంటామె ఎంతగానో సహకరించింది. అగ్రహారవాసులు, అందులోనూ కొంతమంది ఓర్వలేని కుటుంబాలవాళ్లు ఈ కులాంతర వివాహం కుప్పకూలుతుందని ఆశిస్తున్నారని చంద్రావతికి తెలుసు. అందుకే ఆమె అత్యంత జాగరూకతతో, పట్టుదలతో – అణుకువగా కాపురాన్ని నెట్టుకొచ్చింది. మొగవాళ్లెవరికీ ఈ సంగతులేవీ తెలియవు.
ఇప్పుడు విశ్వనాథునికీ, వరహాలశెట్టికీ ఒకటే కోరిక. మనుమడు కావాలి.
వరహాలశెట్టి తన వ్యాపారాన్ని అల్లుడికి అప్పగించసాగాడు. భర్తకి సహాయ సహకారాలను అందిస్తూ తీరికలేకుండా ఉంటూన్నది చంద్రావతి.
పెళ్లయిన మూడేళ్లకి చంద్రావతి ఆడబిడ్డను కన్నది. ఆమెకు హేమమాల అని పేరు పెట్టుకున్నారు దంపతులిద్దరూ కూడబలుక్కొని. సుబ్బాయమ్మ పేరు పెట్టి ఉండాల్సింది అనుకున్నాడు విశ్వనాథుడు. మనుమడు కలగలేదనే నిరుత్సాహాన్ని తాతలిద్దరూ హేమమాల ఆటపాటలలో మునిగితేలుతూ మర్చిపోయారు. అనంతకృష్ణుడి చెల్లెళ్లకు ఆ పాప ఒక ఆటబొమ్మ. ఆమెను వీళ్లు ఆడిస్తున్నారా, లేక ఆ పసిపాపే వీళ్లని ఆడిస్తున్నదా అంటే చెప్పడం కష్టం. మనుమరాలిచేత ‘తాతా’ అని వీనులవిందుగా పిలిపించుకున్నాకనే విశ్వనాథ శర్మ అకస్మాత్తుగా జబ్బుపడి వెళ్లిపోయాడు. కర్మకాండలన్నీ కొడుకు చేతులమీదుగా జరగాలనే అతని కోరిక నెరవేరింది.
వరహాలశెట్టికి ఆరోగ్యం బాగోలేక మొత్తం ఆరు ఓడల వ్యాపారాన్ని పూర్తిగా అల్లుడిపైనే వదిలిపెట్టాల్సి వస్తోంది. అప్పుడప్పుడైనా ఓడలపై పయనించి స్వయంగా పర్యవేక్షించేవారు లేకపోవడంతో లెక్కలు, కొలతలు గాడి తప్పుతున్నాయి; మొండిబకాయిలు పెరిగిపోతున్నాయి. రావాల్సిన పైకం సమయానికి అందడంలేదు. వ్యాపార వ్యవహారాలలో చంద్రావతి ఎవరినీ నమ్మదు. ప్రతీ ఒక్కరినీ నిలదీస్తుంది; వివరాలు అడిగి తెలుసుకుంటుంది. కృష్ణుడి స్వభావం అందుకు భిన్నం; విచక్షణ చూపకుండా ఉద్యోగులను, మధ్యవర్తులను నమ్మి చాలాసార్లు మోసపోయాడు.
“ఇక మీదటయినా సముద్రయానం చెయ్యవచ్చుకదా?” అంటుంది చంద్రావతి. అంతేకాదు, వ్యాపార వ్యవహారాలు చర్చకు వచ్చినపుడల్లా -“అమ్మకాలూ, కొనుగోళ్లూ నువ్వే స్వయంగా చూసుకోవాలి. అవసరమైనప్పుడల్లా ఓడలతో బాటు ప్రయాణించాలి,” అంటూ పోరసాగింది.
భర్తగనుక సముద్రయాత్రలు మొదలుపెడితే అతనితో కలిసి సింహళం వెళ్లి దంతమందిరం చూడాలని ఆమెకో చిన్న కోరిక.
తండ్రికి ఇచ్చిన మాటతప్పేదిలేదంటాడు అనంత కృష్ణుడు.
“మీ నాన్నగారు కోరుకున్న విధంగా కర్మకాండలన్నీ జరిపించావు. అనుకున్న విధంగానే ఆయన వెళ్లిపోయారు. ఇక మీదట సముద్రప్రయాణాలకి నీ అభ్యంతరం ఏమిటో నాకర్థం కావడంలేదు,” ఇది చంద్రావతి వాదన.
అన్నాళ్లూ లాభసాటిగా నడిచిన వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి. చంద్రావతి భర్తను హెచ్చరించసాగింది.
“వ్యాపారం అన్నాక ఇవన్నీ మామూలే. చూస్తూ ఉండు, వచ్చే ఏడాది రెండింతలు లాభాలు వస్తాయి,” అంటాడు అనంతకృష్ణుడు.
ఏళ్లు గడుస్తున్నాయి. నష్టాలు పేరుకుపోతున్నాయి.
భార్యాభర్తలిరువురూ తరచూ ఘర్షణ పడుతున్నారు. ఎప్పుడూ సఖ్యంగా ఉండే తల్లిదండ్రులు గొడవలు పడడం చూసి హేమమాల బిత్తరపోయింది.
చాలా రోజుల తరువాత ఒకనాడు మునిమాపు వేళ తీరికచేసుకొని శాలిహుండం విహార శిథిలాలవైపుగా దంపతులిద్దరూ వ్యాహ్యాళికి వెళ్లారు. వంశధారనది వయ్యారంగా వంపు తిరుగుతూ సముద్రంలో కలుస్తూన్న దృశ్యాన్ని చూస్తూ మరోసారి మైమరిచిపోయారు. దూరంగా కళింగపట్నం రేవువద్ద లంగరు దింపిన ఓడల తెరచాపలు – ఆ సాయంత్రపు వాలుటెండలో మెరుస్తూ. వారిరువురికీ తమ ప్రణయం చిగురించిన తొలిరోజులు గుర్తుకొచ్చాయి. ‘ఎక్కడ బయలుదేరారు? ఎక్కడకి చేరుకున్నారు?’ అనుకుంటూ దిగులు చెందింది చంద్రావతి. చంద్రావతి అసంతృప్తికి కారణాలు అనంతకృష్ణుడికి తెలియకపోలేదు. ఏమీ అనలేక మిన్నకున్నాడు. వారిద్దరి మధ్యా కాసేపు మౌనం.
అది ఎప్పటి అనుబంధమోగాని, శాలిహుండం మెట్లు ఎక్కినప్పుడల్లా సముద్రం దాటి, సింహళదేశం వెళ్లి, దంతపుర ఆలయానికి పయనం కట్టాలనే వాంఛ ప్రగాఢంగా చంద్రావతి మనసులో మెదులుతుంది. అదేమాట భర్తతో అన్నది – ఏమంటాడో అని సందేహిస్తూనే.
“నాకుమాత్రం మళ్లీ ఓడలెక్కి తిరగాలని లేదనుకుంటున్నావా, చంద్రా? ఆ ఉప్పుగాలి, అవిరామంగా సాగే ఊగిసలాట, తెరచాపల ఛటఫట, బిగిసిన మోకుల కీచుకీచు, చెక్కబల్లల ఒరిపిడి, కళాసీల కోలాహలం, సరంగుల ఆదేశాలు అన్నింటికన్నా ముఖ్యంగా అతి మనోహరమైన సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ – వీటన్నిటి మధ్యా తుఫానులను ఎదుర్కొంటూ చేసే సముద్రప్రయాణం ఒక గొప్ప సాహసం. వర్తకుడిగా కన్నా నావికుడిగానే నా జీవితం సార్థకమయిందని అనిపిస్తూంటూంది. కానీ అదంతా ముగిసిపోయిన చరిత్ర. నాన్నగారికిచ్చిన మాట జవదాటడం నాకిష్టం లేదు. అంతేకాదు, అప్పుడంటే బ్రహ్మచారిని; కొన్నిరోజులకైనా నిన్నూ, హేమని వదిలివెళ్లేందుకు నాకు మనస్కరించడం లేదు. ఇప్పుడు నా వయస్సు తక్కువేమీ కాదు. ఒకవేళ సాధ్యపడినా, ఎప్పుడైనా ఒకసారి వెళ్లి రాగలనేమో గాని పూర్వంలాగా తరచూ సముద్ర ప్రయాణాలు చెయ్యలేననిపిస్తోంది,” అన్నాడు – అనంతకృష్ణుడు.
“ఎప్పటికైనా మనం ఇద్దరం కలిసికట్టుగా సముద్రప్రయాణం చెయ్యాలి. సింహళదేశయాత్ర చేసి, దంతపురాన్ని సందర్శించుకోవాలి. వ్యాపారం కోసం కాకపోయినా తీర్థయాత్ర అనుకో”.
“అలాగే తప్పకుండా ఆ పని చేద్దాం! మరో ఏడాది, రెండేళ్లు ఓపిక పట్టు. వ్యాపారం ఒక కొలిక్కి వస్తుంది”.
కృష్ణుడు అంత సులభంగా తన పట్టువీడతాడని చంద్రావతి ఊహించలేదు. అతని చేతిని తనచేతిలోకి తీసుకొని ముద్దుపెట్టుకుంది. అప్పటికే బాగా చీకటి పడింది.
పూర్ణచంద్రోదయం అయింది. దూరంగా సముద్రంపై పడ్డ వెన్నెల తళతళా మెరుస్తూన్నది. తూరుపునుండి చల్లటిగాలి – ఆహ్లాదకరంగా. చంద్రావతిని దగ్గరకు తీసుకున్నాడు అనంతకృష్ణుడు. వెన్నెలలో విహారపు మెట్లు బాగానే కనిపించాయి. చెట్టాపట్టాలు వేసుకొని మెట్లన్నీ దిగేశారు.
‘కొన్ని శతాబ్దాలుగా ఈ విహారం ఇక్కడ ఉంది. ఎన్ని వేలమంది భిక్షువులు, భిక్షుణిలు, భక్తులు ఈ మెట్లు ఎక్కి దిగి ఉంటారో?’ అనుకుంది చంద్రావతి. తాను కోరుకున్న సింహళదేశయాత్ర సుసాధ్యంగానే ఆమెకు గోచరించింది. ఆమెలో ఒక నూతనోత్సాహం పెల్లుబికింది. కెరటాల తాకిడి, హోరు స్పష్టంగా వినవస్తున్నవి. పున్నమినాటి సముద్రపు పోటు ఉధృతంగా ఉన్నదని వాళ్లిద్దరూ గ్రహించారు. అగ్రహారం వైపుగా నడుస్తున్నారు. తొలకరి వర్షాలకు దారి చిత్తడిగా ఉంది. కప్పల బెకబెక ఆ వెన్నెల రాత్రిని ఆవహించింది.
***
కష్టాలన్నీ కట్టకట్టుకొని ఒకేసారి మీద పడతాయంటారు. ఆ వర్షాకాలంలోనే సువర్ణదేశం నుండి వస్తూన్న రెండు ఓడలు తుఫానులో చిక్కుకొని మునిగిపోయాయి. ఆ వార్త విన్న వరహాలశెట్టి గుండె ఆగి మరణించాడు. వ్యాపార బాధ్యతలన్నీ అనంతకృష్ణుడిపై పడ్డాయి. చంద్రావతి తనకు వీలుచిక్కినప్పుడల్లా సాయం చేస్తుందిగానీ ఎదుగుతూన్న కూతురి చదువుపైనా, వయోభారంతో, అనారోగ్యంతో కృంగిపోతూన్న అత్తగారిపైనా ఆమె ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసి వస్తోంది.
ఈలోగా మరో ఓడని అప్పుల వాళ్లకు చెల్లించాల్సిన బాకీ క్రింద వదులుకున్నారు. ఇంకొక పాతబడ్డ ఓడ మరమ్మత్తులకు పెద్ద ఎత్తున పెట్టుబడి అవసరమై మూలపడి ఉంది. ఇక రెండే మిగిలాయి; వాటిమీద తెచ్చిన అప్పులు అలానే ఉన్నాయి. భూములూ, బంగారం అమ్ముకోవడమో కుదువ పెట్టడమో తప్పలేదు. అదే సమయంలో అరబ్బు, పారశీక ఓడలనుండి గట్టి పోటీ ఎదురైంది. జీతాలు సమయానికి అందక నమ్మకస్తులైన నావికులూ, సరంగులూ, కళాసులూ వేరే ఓడల్లో కొలువులు చూసుకున్నారు. కొత్తవాళ్లల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మరాదో తెలియని పరిస్థితి. అనంతకృష్ణుడికి చిరాకులూ, పరాకులూ ఎక్కువయ్యాయి; ఇంట్లోనూ, బయటా సుఖశాంతులు అడుగంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగోలేక పనివాళ్లను తొలగించింది చంద్రావతి. ఇంటిపనీ, వంటపనీ ఆమె మీదనే పడ్డాయి.
‘బ్రాహ్మణ వ్యవసాయం, వ్యాపారం ఈలాగునే తగులడతాయి’ అని చాలామంది బ్రాహ్మలూ, కొంతమంది వైశ్యులూ వ్యాఖ్యానించారు. కుక్కా, గాడిదల చందంగా ఎవరి వృత్తులు వాళ్లే ఆచరించాలి తప్ప ఒకరి పనులు మరొకరు చేయరాదని తీర్మానించారు.
‘ఎప్పుడైతే అనంతవర్మ చోడగంగ దేవుడు కళింగ రాజధానీ నగరాన్ని శ్రీముఖలింగం నుండి కటకనగరానికి మార్చాడో అప్పటినుంచీ మన ప్రాంతానికి చెడు దినాలు దాపురించాయి. మనల్ని పట్టించుకొనే నాథుడే లేదు. రోజురోజుకీ ధర్మం భ్రష్టుపట్టిపోతున్నది. బలమైన రాజ్యపాలన లేదు. హితవు పలికే బ్రాహ్మణ పండితులు కరువయ్యారు. బ్రాహ్మణులే కులధర్మాన్ని పాటించకపోతే ఇంకేమవుతుంది? అన్నీ అరిష్టాలే’ అన్న పండితులూ ఉన్నారు. వీళ్లెవరూ తన తండ్రీ, మామగారూ బ్రతికిఉండగానో, వ్యాపారం బాగా నడిచిన రోజులలోనో ఎందుకని ఈ ప్రవచనాలు చెయ్యలేదో కృష్ణుడికి అర్థంకాలేదు.
తప్పనిసరి పరిస్థితులలో తన వాటాలో సగం అమ్ముకొని, ఒక వైశ్య ప్రముఖుడిని తన భాగస్వామిగా చేసుకున్నాడు. నిజానికతడు చంద్రావతికి దూరపు బంధువే. పైగా వరహాలశెట్టికి బాల్యమిత్రుడు; ఒకనాడు అనంతకృష్ణుడిని చంద్రావతి కోసం అడగడానికి శివయ్య, వరహాలశెట్టిలకు తోడుగా వచ్చినవాడు; నెమ్మదస్తుడూ, ఓడ వర్తకంలో విశేషమైన అనుభవం ఉన్నవాడూను.
అయితే అతగాడొక మాటన్నాడు. “శర్మగారూ, నేనూ, మా అబ్బాయీ ఓడల సంగతి చూసుకుంటాం. మీరు గ్రామాలకూ, పట్టణాలకు వెళ్లి సరకు కొనుగోలు, రేవుకి రవాణా చేసే పనులు చూసుకోండి”.
అనంతకృష్ణకి ఇది సబవుగానే తోచింది. సముద్రంతోనూ, ఓడలతోనూ అతనికున్న బంధాన్ని విడనాడేందుకు మనస్కరించకపోయినా ఒప్పుకున్నాడు.
ఓడ వర్తకంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకొని నిలబడ్డనాడే ఆ వ్యాపారం స్వాధీనంలో ఉంటుంది. ఖర్చులు మితిమీరకుండా చూసుకోవాలి; ఎప్పటికప్పుడు బాకీలు రాబట్టుకోవాలి. తక్కువలో ఉన్నప్పుడు సరుకు కొనుగోలు చెయ్యాలి. ధర చురికినప్పుడు అమ్ముకోవాలి. ఈ పనులన్నీ దేశవిదేశాల్లో చేసిపెట్టడానికి నమ్మకస్తులను నియమించుకోవాలి. అలాగని మొత్తం వాళ్లమీద వదిలిపెట్టకూడదు. స్వంత వ్యవహారలనే కాకుండా, పోటీదార్లని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఢక్కామొక్కీలు తిన్నాక కృష్ణుడు ఈ గుణపాఠాలు నేర్చుకున్నాడు. అతని భాగస్వామికి ఇవన్నీ కొట్టినపిండి. చంద్రావతి తరచూ అంటూండేది,
“మా నాన్న మరికొన్నాళ్లు బతికి ఉంటే నీకు ఈ మెళకువలన్నీ స్వయంగా నేర్పించి ఉండేవాడు” అని.
అనంత కృష్ణుడు బియ్యం, నేతబట్టలతో బాటుగా బాగా విలువైన చందనం, గంధం చెక్క, మిరియాలు, లవంగాలు, తేనె, మైనము, సైంధవలవణము, పెట్లుప్పు, లక్క, తుమ్మబంక, కొనుగోలు చెయ్యడానికి పెద్ద మొత్తాలను వెండి, లేదా బంగారు నాణేల రూపేణా చిన్న మూటలుగా కట్టుకొని సుదూర ప్రాంతాలకు, అటవీ ప్రదేశాలకు వెళ్లివస్తూండడం కొందరి కంటపడింది. జాగరూకుడైన కృష్ణుడు తన భద్రత కోసం ఇద్దరు కాపలాదారులను వెంట తీసుకుపోతూంటాడు.
దారి దొంగల బెడద ఎప్పుడూ ఉండేదేగానీ, పాలకులూ, అధికారులూ సరైనవాళ్లులేక, రక్షకభట వ్యవస్థ లోపించి మరింత గందరగోళంగా మారింది ఆనాటి పరిస్థితి. అందరు దూరప్రయాణీకుల మాదిరిగానే రాత్రులు ఏదో ఒక గ్రామంలోనో, సత్రంలోనో లేదా గుడిలోనో తలదాచుకోవడం అలవరచుకున్నాడు, కృష్ణుడు. గ్రామాలలో బ్రాహ్మణ, లేదా వైశ్య కుటుంబీకులెవరైనా ఉంటే పిలిచి భోజనం పెట్టేవారు. మరీ కుగ్రామాలైతే అటుకులు, మురీలు, తేనె, లేదా పండ్లు, ఫలాలు – వీటితో కడుపు నింపుకొని, బండిలోనే నిద్రపోయేవాడు.
ఒకనాటి మధ్యాహ్నం – దట్టమైన అడవిలోంచి ఎడ్లబండిపై ప్రయాణిస్తూంటే, ఎవరో తమను అనుసరిస్తున్నారని కాపలాదారులకు అనుమానం కలిగింది. మరికాసేపట్లో గుర్రాల సకిలింపు వినబడింది. తనకు ఒక కత్తి ఇవ్వమన్నాడు అనంత కృష్ణుడు. ‘ఎందుకులెండి, మేం చూసుకుంటాం,’ అన్నారు కావలివాళ్లు. బలవంతం చెయ్యగా అయిష్టంగా ఒక కత్తిని కృష్ణుడి చేతిలో పెట్టారు.
బండి మలుపు తిరుగుతూండగా, ప్రక్కనే ఉన్న గుట్టమీదనుండి తమ గుర్రాలను దౌడు తీయిస్తూ, కత్తులు ఝుళిపిస్తూ ఆరుగురు ముసుగు దొంగలు మీదకు ఉరికారు. ఎడ్లు బెదిరాయి. కాసేపు పరుగెత్తి అలసిపోయాయి. వెంటతరుముతూ వచ్చిన దొంగల గుంపు దాడిచేసింది.
అందరిచేతుల్లోనూ కత్తులు ఉండడం చూసిన దారిదోపిడి దొంగలు వాళ్లంతా కాపలాదారులనే అనుకున్నారు. శెట్టి ఎవరో గ్రహించలేకపోయారు. హోరాహోరీగా పోరాటం సాగింది. అనంత కృష్ణుడికి పొట్టలో పెద్ద గాయం అయింది. క్రింద పడిపోయాడు. అతని పీకమీద కత్తిపెట్టిన దొంగల నాయకుడు రొంటిన ఉన్న చిక్కాల్ని గుంజుకొని మరో పోటు పొడిచాడు. దొంగలంతా వచ్చిన దారినే వెళ్లిపోయారు.
కృష్ణుడికి తగిలిన గాయాల నుండి రక్తం బాగా పోయింది. సమీప గ్రామాలలో వైద్యుడులేక చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఒక ఊళ్లో అనుభవశాలి అయిన వైద్యుడు పసరుపూసి, ఆకులు చుట్టి, కట్లు కట్టాడుగానీ అప్పటికే బాగా చీము పట్టింది. మర్నాడు జ్వరం వచ్చింది. కాపలాదారులు తిరుగు ప్రయాణం కట్టారు. దారిలో కృష్ణుడి పరిస్థితి విషమించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ‘చంద్రా… హేమా…’ అని పలవరిస్తూ ఎడ్లబండిలోనే ప్రాణం విడిచాడు. బాధ్యతలన్నీ భార్య చంద్రావతికి విడిచిపెడుతున్నానే దుఃఖమే అతని ఆఖరి ఆలోచన. అయితే చంద్రావతి, హేమల జీవితాలు ఎటువైపు మలుపు తీసుకోబోతున్నాయో అనేది అతడి ఊహకు అందని విషయం.
***
అనంత కృష్ణుడి ఆకస్మిక మరణాన్ని చంద్రావతి తట్టుకోలేక పోయింది. సుబ్బాయమ్మ సరేసరి. ఆమె భర్త ఏనాడో పోయాడు, ముగ్గురు కూతుళ్లూ దూరదేశ సంబంధాలు చేసుకొని వెళ్లిపోయారు. ఇప్పుడు ఒక్కగానొక కొడుకు పోయాడు. తాను ఏకాకినైపోయాననే భావన సుబ్బాయమ్మను మరింత కృంగదీసింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పచ్చగా ఉన్న తమ కుటుంబానికి దిష్టి తగిలిందనీ, తమ పైన ఎవరో కక్ష కట్టారనీ, దుష్టశక్తులను ప్రయోగిస్తున్నారనీ సుబ్బాయమ్మకు దృఢమైన నమ్మకం ఏర్పడిపోయింది. శాంతిహోమాలు చేయించి, బ్రాహ్మణులకు దానాలు చేసింది; చివరికి భూతవైద్యులను పిలిపించింది. మామ్మకి కలిగే అంతులేని అనుమానాలతో, ఆమెకు మాత్రమే పొడచూపే నిదర్శనలతో హేమ బెదిరిపోయింది. కూతురు భయపడిపోతున్నదని గ్రహించిన చంద్రావతి, భూతవైద్యుల రాకపోకలను కట్టడిచేసింది. ఈ విషయమై అత్తా కోడళ్ల మధ్య పెద్ద వాగ్యుద్ధం జరిగింది. చంద్రావతి తన పట్టు సడలించలేదు.
హేమకి పెళ్లి చేసెయ్యాలని సుబ్బాయమ్మ పోరుపెడుతోంది. ఆమె చూపు మందగించింది. మనుమరాలి పెళ్లి కళ్లారా చూస్తానో లేదో అని బెంగపడుతోంది.
“చేద్దాం లెండి. తొందరేముంది?” అంటుంది చంద్రావతి.
హేమను వ్యాపారంలో ప్రవేశపెట్టి తాను తప్పుకోవాలని చంద్రావతి కోరిక. ఆమెకి బతుకు మీద ఆశ మిగిలి ఉందంటే అది హేమమాల వల్లనే.
భర్త పోయి సంవత్సరం తిరక్కుండానే తనను తాను సంబాళించుకొని, నిరాశ చెందకూడదని నిశ్చయించుకుంది. వ్యాపారాన్ని నిలబెట్టాలనే పట్టుదల ఆమెలో మరింత పెరిగింది. తమ కుటుంబాలను తప్పు పడుతున్న అగ్రహారవాసుల నోళ్లు మూయించాలని ఆమె అనుకున్నది.
తండ్రిగారి మిత్రుడి తోడ్పాటుతో వ్యాపారం పుంజుకున్నది. లాభాలు నిలకడగా ఉన్నాయి. విదేశీయులు ఆ ప్రాంతపు ఉత్పత్తులకోసం, నేతబట్టకోసం ఎగబడుతున్నారు. పారశీక, అరబ్బు నావికుల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, అందరికీ సరిపడా అవకాశాలున్నాయి. చంద్రావతి మళ్లీ పనివాళ్లను పెట్టుకుంది. ఉన్నదాంతో తృప్తిపడడం అలవరచుకుంది. ఉన్నంతలో దానధర్మాలు చెయ్యగల స్థాయికి చేరుకుంది. అప్పుడప్పుడూ కళింగపట్నానికి వస్తూపోతూ ఉండే భిక్షువులను కలుసుకోవడం, వారికి ఆతిథ్యం ఇవ్వడం ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది. బౌద్ధాచార్యుల ఉపన్యాసాలు ఆమెను ఆకట్టుకునేవి.
భర్త మరణించాక చంద్రావతి మదిలో వైరాగ్యం అలముకున్నది. వ్యాపారం, డబ్బు కూడబెట్టుకోవడం, నిత్యం ఏదో ఒక భయంతో, బెంగతో గడపడం – ఇంతేనా జీవితం అంటే? అని ఆమెకు తరచూ అనిపిస్తున్నది. ఇంకేదో ఉన్నది, తాను చెయ్యాల్సింది, చెయ్యగలిగింది – అని ఆమెకు బలంగా తోస్తున్నది. ఏమి చెయ్యాలన్నా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోకుండా, వెంబడే చేసెయ్యాలనే ఆతృత ఆమెలో ఎక్కువైంది. అత్తగారు నిత్యం చేస్తూండే పూజలూ, క్రతువులూ వీటిలో కన్నా బుద్ధుని బోధనలలో ఆమెకు ఎక్కువ మనశ్శాంతి దొరుకుతున్నది.
ఒకనాడు – శాలిహుండాన్ని దర్శించడానికి సింహళదేశం నుండి బౌద్ధ ఆచార్యులు తన శిష్యులతో బాటుగా వచ్చారని చంద్రావతికి కబురు వచ్చింది.
ఎప్పటిలాగానే హేమమాలను తోడు తీసుకొని బయలుదేరింది. ఇప్పుడు కూతురికి పధ్నాలుగేళ్లు.
ఆనాటి చలికాలపు ఉదయాన తల్లీ కూతుళ్లు అక్కడికి చేరుకొనేసరికి విహార శిథిలాలలో మహాస్థూపపు పునాదుల ముందు మోకాళ్లమీద కూర్చొని భిక్షువులంతా ప్రార్థనలు చేస్తున్నారు. దీపాల వరుసలు కంటికింపుగా వెలుగుతున్నవి. సాంబ్రాణి సువాసనలు నలుదిశలా వ్యాపిస్తున్నాయి. స్థూపం చుట్టూతా పరచిన బంతి, చేమంతి పూలు కనులకు ఇంపుగా ఉన్నాయి. మంద్రస్వరంలో సాగుతోన్న వారి మంగళపఠన ధ్వనులు చెవులకు అస్పష్టంగా సోకుతున్నాయి. వారు వెలిగించిన దీపాలు గాలికి కొట్టుమిట్టాడుతూనే ప్రకాశిస్తున్నాయి. వారి కాషాయి చీవారాలు ఆ శిథిలాల ఇటుకల రంగుని పోలి ఉన్నవిగానీ ఆనాటి ఉదయపు చిరిఎండలో అవి నూతనజీవంతో, శోభాయమానంగా మెరుస్తున్నవి. భిక్షువుల శిరస్సులు తళతళ లాడుతున్నవి. వారందరి నడుమా శాలిహుండం తిరిగి ప్రాణంపోసుకున్నది. ఆ దృశ్యాన్ని చూసేందుకైనా చంద్రావతి అక్కడికి రావాలని కోరుకుంటుంది. భిక్షువులులేని విహార శిథిలాలు ఆమెకు అపారమైన దిగులును, దుఃఖాన్ని కలిగిస్తాయి. సింహళ బిక్షువులెవరైనా అటుగా వచ్చినపుడు తల్లికి తోడుగా అక్కడికి వస్తూండడం, ఆచార్యులతో వచ్చీరాని సంస్కృతంలో సంభాషించడానికి హేమ ఇష్టపడుతున్నది.
ప్రార్థనలు ముగిశాయి. చంద్రావతి ఆచార్యుల వద్దకు వెళ్లి నమస్కరించి పరిచయం చేసుకున్నది. అతని వదనం బౌద్ధ బిక్షువులలో తరచుగా కనిపించే సంతుష్టి, సమ్యక్దర్శనాలతో ప్రకాశిస్తూ, ప్రసన్నంగా ఉన్నది.
“మీ గురించీ, సింహళం నుండి కళింగపట్నం మీదుగా వచ్చిపోయే భిక్షువులకు మీరిచ్చే ఆతిథ్యం గురించీ మా విహారాలలో చెప్పుకుంటూండగా విన్నాను. మీ వంటి ఉపాసికలు ఇప్పటికీ ఈ ప్రాంతాలలో ఉండడం మాకు సంతోషంగా ఉంది,” అన్నాడు చిరునవ్వుతో.
బౌద్ధులకు అతి ముఖ్యమైన నాలుగు క్షేత్రాలు – లుంబిని, బుద్ధగయ, సారనాథ్, కుశినారా – వీటినే కాకుండా ఇంకా అనేక విహారాలనూ, నాలంద శిథిలాలనూ దర్శించుకొని తిరిగి తమ దేశానికి వెళ్లిపోతున్నామనీ, ఈ యాత్రతో తమ జన్మ సార్థకమైందనీ అతడు వివరించాడు.
“హేమా! గురువుగారికి నమస్కారం చెయ్యి,” అంటూ చంద్రావతి తన కుమార్తెను ఆదేశించింది.
హేమ ఆచార్యులకు భక్తితో నమస్కరించింది.
“నీ పేరేమిటి అమ్మాయీ?”
“హేమమాల”
“అంటే….?”
“అవును, తథాగతుని దంతాన్ని సింహళ ద్వీపానికి రహస్యంగా తీసుకొచ్చి అందజేసిన కళింగ రాజకుమారి పేరే పెట్టుకున్నాం” అన్నది చంద్రావతి.
“అబ్బో! అలాగా? చాలా సంతోషం!! ఆ సంఘటనకు మా దేశంలో ఉన్న ప్రాముఖ్యత, ఆ రాజకుమారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే మీరు సింహళకు రావాల్సిందే,” అన్నాడు ఆచార్యుడు.
“మాకా అదృష్టం కలగలేదు, భాదంతే,” అన్నది చంద్రావతి నిరాశగా.
“ఏముంది? మాతో బాటు వచ్చెయ్యండి! వేసవిలో బుద్ధ జయంతి ఉత్సవాలు చూసుకొని తిరుగు ప్రయాణం చెయ్యవచ్చు. అప్పుడు మా విహారం నుండే మరో బృందం ఇటుగా వస్తుంది. వారితోబాటు పంపే బాధ్యత నాది,”
“మీరంటే సాధువులు. అన్నింటినీ త్యజించినవారు. మేమంతా సంసారసాగరంలో పడి కొట్టుకుపోతున్నాం. ఉన్నపళంగా అన్నీ వదులుకొని రమ్మంటే రాగలమా?”
“మనసుంటే మార్గం ఉంటుంది,” అంటూ నవ్వాడతడు. తన శిష్యులవైపు తిరిగి, సింహళ భాషలో,
“మీకు చెప్పాను గుర్తుందా? ఈమే చంద్రావతి. కళింగపట్నంలో మనకు పెద్ద అండ. ఇదిగో ఈ అమ్మాయి ఆమె కూతురు. పేరేమిటో తెలుసా? హేమమాల!”
భిక్షువులంతా వికసించిన వదనాలతో తల్లీ కూతుళ్లను చూశారు. వాళ్ల ముఖాలలో రవ్వంత ఆశ్చర్యం, బోలెడంత ఆనందం, “సాధు! సాధు!” అంటూ వారంతా తమ సంతోషాన్ని తెలియజేశారు.
చంద్రావతీ, హేమా వారికి నమస్కరించారు. భిక్షువులు ప్రతి నమస్కారం చేశారు. హేమమాల! ఆ పేరు వినగానే వారిలో చంద్రావతి కుటుంబంతో ఒక బలమైన స్నేహబంధం ఏర్పడిపోయింది.
“వీళ్లని మన వెంట మన విహారానికి అతిథులుగా రమ్మంటున్నాను,”
“అవునవును, తప్పకుండా మాతో బాటు రావాల్సిందే,” అన్నారంతా – సింహళ భాషలో.
ఆచార్యుడు చంద్రావతి వైపు తిరిగి, “మీరు తప్పక మావెంట రావల్సిందే అంటున్నారు, మా వాళ్లంతా”
చంద్రావతి ఏదో అనబోయింది. హేమమాల చటుక్కున,
“భాదంతే! నేను మీతో వస్తాను,” అనేసింది. ఆ క్షణంలో ఆమె తండ్రికి ఉండిన సముద్రయాన కాంక్ష, తల్లికి బౌద్ధం పట్ల ఉన్న గౌరవం కలగలిసిపోయాయా?…లేక అది పసితనపు అనాలోచిత చర్యా? నిజానికి హేమ చిన్నపిల్ల కాదు.
“హేమమాల స్వయంగా మావెంట వస్తానంటే అంతకన్నా కావల్సింది ఏముంది? గత చరిత్ర పునరావృతం కాబోతున్నదేమో? తథాగతుడు చెప్పిన కాలచక్రం కదులుతున్నదేమో? ఎవరు చెప్పగలరు? కానీ మీ తల్లిగారి అనుమతి ఉండాలి సుమా!”
చంద్రావతి గుండె దడదడా కొట్టుకుంది. మాటమారుస్తూ, “భాదంతే! ఈ రోజున మీరంతా మా ఇంటికి భోజనానికి విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించాలని నా మనవి,” అన్నది.
“అలాగే, తప్పకుండా!” ఆచార్యులు ఆహ్వానాన్ని స్వీకరించారు.
***
భోజనాలయ్యాక ఆచార్యుడు – “అయితే నువ్వూ, హేమమాల మావెంట వస్తున్నారా?” అని సూటిగా అడిగాడు.
“ఆలోచించాలి, భాదంతే! నిజానికి నాకు ఎప్పటినుండో సింహళదేశం సందర్శించాలనే కోరిక; ఇన్నాళ్లయినా తీరనేలేదు. నా భర్తతో బాటుగా వచ్చి పొలోన్నరువ, అనురాధపురాలనూ, దంతమందిరాన్ని సందర్శించాలని ఎంతగానో అనుకున్నాను. నా భర్త మరణించినప్పటి నుంచీ నాకు దేనిమీదా పెద్ద ఆసక్తి కలగడం లేదు,” అన్నది చంద్రావతి.
“ఇప్పుడు మావెంట వచ్చి కొన్నిరోజులు మా ఆరామంలో గడిపితే నీ మనసు కుదుట పడవచ్చు. బుద్ధపూర్ణిమ పండగలయ్యాక తిరిగి వచ్చేద్దువుగాని”.
“ఇప్పటికిప్పుడు రాలేను భాదంతే! ఎప్పుడో ఒకరోజున వస్తానేమో తెలియదు”.
“నువ్వూ, నీ కుమార్తె ఎప్పుడు వచ్చినా మీకు నేనూ, మా శిష్యులూ స్వాగతం పలుకుతాం. ఒక్క మాట గుర్తుంచుకో – మనసుంటే మార్గం ఉంటుంది”.
***
మరుసటేడు సుబ్బాయమ్మ ప్రశాంతంగా, నిద్రలోనే మరణించింది. ఆమెకూ తనకూ ఉన్నది సర్వసాధారణమైన అత్తాకోడళ్ల సంబంధమే. అంతకన్నా ఎక్కువా కాదు, అలాగని తక్కువా కాదు. పైగా సుబ్బాయమ్మకు వైశ్యులన్నా, అసలు బ్రాహ్మణులు కానివారందరి పట్లా, ఆ మాటకొస్తే, బ్రాహ్మణుల్లోని ఇతర శాఖలవారన్నా చిన్నచూపు. ఆమె విరోధభావాలు ఒక్కోసారి బయటపడేవి. అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి, హేమ పుట్టాక సుబ్బాయమ్మ ధోరణి బాగా మారింది. తాను బ్రాహ్మణేతరకులస్థురాలిననే భావన, కూతురు పుట్టాక చంద్రావతికి ఒక్కసారి కూడా కలగలేదు. ఏచిన్న పనికైనా కోడల్ని సంప్రదించాల్సిందే. అత్తగారి మరణంతో ఆ కుటుంబంతో తనకున్న సంబంధాలన్నీ తెగిపోయాయనిపించింది చంద్రావతికి. భర్త తీపిగుర్తు హేమ ఒక్కతే ఆమెకు మిగిలింది. ప్రస్తుతానికి తన బాధలు చెప్పుకొనేందుకు ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఆడబడుచులు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోయారు. హేమ మరీ చిన్నపిల్ల, చంద్రావతి దృష్టిలో.
తమకు పెళ్లైన కొత్తలో తండ్రి తమకోసం ప్రత్యేకంగా కట్టించిన గదులు, మిద్దె పైకెక్కి నక్షత్రాలను చూస్తూ, సముద్రపు హోరును వింటూ కృష్ణుడితో గడిపిన రాత్రులూ, తెలతెలవారుతూండగానే వరండా మీద తన శిష్యులతో కూర్చొని కంచుకంఠంతో వినిపింపజేసిన మామగారి వేదపఠనం, ఆ వంటింట్లో అత్తగారు నేర్పిన భర్త ఇష్టపడే వంకాటలూ, పోటీలు పడుతూ పెరట్లో ఉసిరికాయలూ, జామకాయలూ కోసుకొనే ఆడబడుచులూ, ‘వదినా, వదినా’ అంటూ వాళ్లు తన వెంట తిరగడం, వాళ్లతో సమంగా తాను అష్టాచెమ్మ, తొక్కుడుబిళ్ల ఆడడం, జామచెట్టు పండ్లకోసం వచ్చే రామచిలుకలూ, ఇంటిముందు విరగబూసే మందార మొక్కలూ, గుమ్మంముందు పరచుకొనే సన్నజాజులూ….ఆ ఇంటి సందడంతా ఒక్కసారిగా స్తంభించి, కలలాగా మిగిలిపోయిందనిపించింది. తన జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయింది. హేమకి పెళ్లి చెయ్యమని నిత్యం పోరే అత్తగారు లేరు. నిజమే, హేమకి పెళ్లై వెళ్లిపోతే తనకింక ఏ బాధ్యతలూ ఉండబోవు. అప్పుడిక కొత్త అధ్యాయం మొదలవుతుందా? ఏమో?… అంతా అగమ్యగోచరం.
తల్లి నిరుత్సాహంగా, మౌనంగా ఉండడాన్ని హేమ గమనించింది. రెండు వారాలయ్యాక, తల్లితో –
“అమ్మా! పద, మనిద్దరం సింహళదేశం వెళ్దాం” అన్నది.
చంద్రావతి ఆశ్చర్యపోయి, “ఏం? ఎందుకలా అంటున్నావు?” అన్నది.
తన తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని, “నువ్వు ఎప్పటినుంచో సింహళ వెళ్లాలని అనుకుంటూ వెళ్లలేకపోయావని నాకు తెలుసు. క్రిందటి సారి శాలిహుండంలో ఆచార్యులవారిని కలుసుకున్న దగ్గరనుండీ అక్కడికి వెళ్లి, ఆరామవాసుల జీవనం ఎలా ఉంటుందో చూడాలని నాకు అనిపించింది. భిక్షువులు, భిక్షుణిలు ఏ చీకూ చింతా లేకుండా ఎప్పుడూ అంత ప్రశాంతంగా ఎలా ఉంటారు? వాళ్ల మొహాల్లో నిత్యం చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది. మన ఓడ మీద వెళ్లి కొన్ని రోజులుండి వద్దాం, పదమ్మా!” అన్నది హేమ – కొంత గారాలపట్టిలా, కొంత బాధ్యత ఎరిగిన కూతురిలా.
కూతురి మాటలకు చంద్రావతిలో ఒకవైపు ఆశ్చర్యంతో కూడిన సంతోషం, మరో వైపు అందోళనతో కూడిన శంక – రెండూ కలిగాయి. ‘భిక్షువులు, ఆరామ జీవితం – వీటిని గురించి ఆలోచించాల్సిన వయసేనా ఈ పిల్లది?’ అనుకుంది.
“సరేలే, చూద్దాం,” అని దాటవేసింది.
నెల్లాళ్లు తిరక్కుండా ఒక భిక్షువుల బృందం శాలిహుండంలో విడిది చేసినట్లు చంద్రావతికి కబురొచ్చింది. తీర్థయాత్రలు పూర్తిచేసుకొని సింహళ తిరిగి వెళ్లిపోతున్నారట. ఎప్పటిలాగే హేమను వెంట బెట్టుకొని ఆ బృందాన్ని భోజనానికి ఆహ్వానించింది.
హేమ “వీళ్లతో వెళ్దాం, పద!” అంటుంది.
“ఇప్పటికిప్పుడు ఎలా?” అంటుంది చంద్రావతి.
తల్లీ కూతుళ్ల మధ్య వాగ్విదాలు జరిగాయి. హేమ అలిగింది.
చివరికి చంద్రావతి ఒప్పుకుంది. ‘ఇటుగా వచ్చే మొదటి ఓడలోనే తిరిగి వచ్చేద్దాం’ అంది.
ఆచార్యులకు ‘మేము కూడా మీతో వస్తాం’ అని తెలియజేసినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు.
“సాధు! సాధు!…కళింగ రాజకుమారి హేమమాల మనతో వస్తుంది!” అని భిక్షువులు చమత్కరించారు.
***
హడావుడిగా మధ్యహ్న భోజనాలుకానిచ్చి బయలుదేరిన తల్లీ కూతుళ్లు, కళింగపట్నం రేవులో లంగరుదించిన వారి నౌకను చిన్న పడవమీదవెళ్లి చేరుకున్నారు. వారికోసమే ఎదురుచూస్తూన్న నఖోడా, మౌలీంలు వారికి స్వాగతం పలికి, బసకోసం చిన్న కొట్టుగదిని చూపించారు. మరి కాసేపట్లో ఓడ లంగరు ఎత్తింది; నావికులు తెరచాపల్ని విప్పదీసి, మోకులతో కట్టారు. ఓడ నెమ్మదిగా కదలనారంభించింది. హేమ ఆనందానికి అంతులేదు. చంద్రావతికి అది కొత్త అనుభవం. తమ పెళ్లికి ఒప్పుకోకపోతే బౌద్ధం స్వీకరించి సింహళదేశంలో స్థిరపడిపోవాలని అనుకోవడంలోని యవ్వనోద్రేకం గుర్తుకొచ్చి ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది.
ఆ సాయంత్రం వేళ, ఓడ తీరాన్నివదిలి నడి సముద్రంలోకి అడుగిడినపుడు చంద్రావతి ఉద్వేగానికి లోనయ్యింది. హేమ మహానావికుడిని వెంబడించి తన ప్రశ్నలతో వేధించ సాగింది. చంద్రావతికి తన చిన్నతనం, ఆనాటి కుతూహలం ఙ్ఞాపకం వచ్చి నవ్వుకుంది.
మొదట తీరం, తరువాత తూరుపు కనుమలు, కనుమరుగవుతూండగా – అనంతకృష్ణుడు ఎన్నిసార్లు ఇదే విధంగా తన యాత్రలను మొదలుపెట్టి ఉంటాడో? అనుకుంది. వాతావరణం సహకరించింది. అనుకూల పవనాలు బలంగా వీస్తూనే ఉన్నాయి. తెరచాపలు టపటపా కౌట్టుకుంటున్నాయి. మధ్యమధ్యలో ఛెళ్లుఛెళ్లు మంటూ కెరటాలు ఓడను తాకుతున్నవి. అనంతకృష్ణుడు ప్రస్తావించిన ఊగిసలాట మొదలైంది. కీచుమంటూ చెక్కబల్లలూ, మోకులూ కలసికట్టుగా చేసే శబ్దాలు వినవస్తున్నాయి. మరికాసేపట్లో ఆకాశమంతటా విరిసిన చుక్కలు మిలమిలా మెరిసాయి. మిద్దెపై అనంతకృష్ణుడి సాహచర్యంలో గడిపిన రాత్రులు గుర్తుకు వచ్చి చంద్రావతిలో అపారమైన దుఃఖం ఉబికివచ్చింది. చుట్టూ ఎవరూ లేరు. వెక్కివెక్కి ఏడ్చింది.
ఓడ మృదువుగా ఊగుతున్నది. ఆ రాత్రి ప్రయాణీకులిద్దరికీ మంచినిద్ర పట్టింది. ముందురోజున పడ్డ దుఃఖాన్ని దాటుకొని ప్రశాంతంగా నిద్రలేచింది చంద్రావతి. హేమ మాత్రం లేచీ లేవడంతోనే మౌలీంను వెతుక్కుంటూ వెళ్లింది.
వెచ్చటి వెలుతురు నిండిన ఆ ఉదయాన, రివ్వున గాలి వీస్తూండగా – అనంతకృష్ణుడు తనతో బాటు ఆ ఓడలో ప్రయాణిస్తున్నట్లు, చిరునవ్వులు చిందిస్తూ తనకు ముందుకిసాగమని ధైర్యం చెబుతున్నట్లు, ఆమెకు పదేపదే అనిపించసాగింది. అది కనుచూపుమేర చుట్టూతా పరచుకున్న నీలి సంద్రం కలిగిస్తూన్న భ్రమా లేక నిజంగానే అతడి ఆత్మ అక్కడ తిరుగాడుతున్నదా? చంద్రావతి తేల్చుకోలేకపోయింది. ఆమెలో ఒక ఆత్మవిశ్వాసం, నిండైన ధైర్యం, చిన్ననాటి తెగింపు నెలకొన్నాయి.
వారి ప్రయాణం వారం రోజులపాటు సాగింది. అటువంటి ప్రశాంత వాతావరణంలో సముద్రయానం అంటే ఎవరికైనా ‘ఓస్! ఇంతేనా?’ అనిపిస్తుంది. అందుకేనేమో, తుఫానులను ఎదుర్కోని యాత్రికులు ఎన్నటికీ నావికులు కాజాలరు అంటారు.
ఓడ త్రికోణమలై (ట్రింకోమలీ) రేవు పట్టణాన్ని చేరుకుంటున్నప్పుడు తీరం అగుపించగానే భిక్షువుల ఉత్సాహం రెట్టింపుకావడం చంద్రావతి గమనించింది. సుమారు సంవత్సరం తరువాత వారంతా స్వదేశం చేరుకుంటున్నారు మరి. సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నందుకుగాను కృతఙ్ఞతాపూర్వకంగా ప్రార్థనలు చేశారు.
విహారాన్ని చేరుకున్నప్పుడు ఆ బృందానికి ఘనమైన స్వాగతం లభించింది. చంద్రావతిని కొందరు విహారవాసులు గుర్తుపట్టారు. కళింగపట్నంలో ఎన్నో ఏళ్లుగా భిక్షువులకు సేవలనందించిన ఉపాసికగా తనకు మంచి పేరున్నదని అక్కడికి వచ్చాకే చంద్రావతికి తెలిసింది. ఆమెను ప్రతీఒక్కరూ ఎంతో గౌరవంగా చూస్తున్నారు. హేమమాల అందరికీ ముద్దుబిడ్డ అయింది. ఆమెను ‘చిన్న హేమ’ అని పిలువసాగారు. వారిరువురి కోసం భిక్షుణిలుండే గదులకు చేరువలోనే ఒక కుటీరాన్ని కేటాయించారు.
విహార వాతావరణం, భిక్షువుల నిరాడంబర జీవనం, బుద్ధుని బోధనపట్ల వారికున్న లోతైన అవగాహన, చంద్రావతిని ఆకట్టుకున్నాయి. భిక్షువుల కఠినమైన క్రమశిక్షణ, అంకితభావం, తల్లీకూతుళ్లపై బలమైన ముద్రవేశాయి. నెల్లాళ్లు ఇట్టే గడిచిపోయాయి. సింహళభాష కొద్దికొద్దిగా అర్థం అవుతోంది. అప్పుడే వారికి కొందరు భిక్షుణిలతో మైత్రి ఏర్పడింది. అంత స్వేచ్ఛగా, సమిష్టిగా, పురుషుల నియంత్రణ లేకుండా జీవించే ఆడవాళ్లను వారెన్నడూ చూడలేదు. బౌద్ధగాథలలోని స్త్రీలను గురించి భిక్షుణిలు చెప్పినప్పుడు, ఆ పాటలను వినిపించినప్పుడు – గౌతమి, యశోధర, విశాఖ, అమ్రపాలి – వీళ్లంతా ఎంతో విశిష్టమైన వ్యక్తులుగా, కారణజన్ములుగా కనిపించారు. భిక్షుణిల ఉత్సాహం, కలివిడి ఇద్దరినీ ఆకట్టుకున్నవి; ఒకటి రెండు వారాల్లోనే వాళ్లల్లో కలిసిపోయారు. వాళ్లను విడిచివెళ్లాలనే ఆలోచనే తల్లీకూతుళ్లకు కష్టంగా తోచింది.
పొద్దున్నే ప్రార్థనలు, ఆ తరువాత గురువులైన థేరోల బోధనలు, మధ్యాహ్న భోజనం, కాసేపు విశ్రాంతి, ఆ తరువాత చర్చలు, సాయంత్రాలలో మళ్లీ ప్రార్థనలు. అవకాశం చిక్కినప్పుడు గ్రంథాలయానికి వెళ్లడం – రోజంతా ఇట్టే గడిచిపోయేది. హేమకు భిక్షుణిల సాహచర్యంతో సింహళభాష తొందరగానే పట్టుబడింది. తల్లీకూతుళ్లు తమ శక్తిమేరకు ఆరామాన్ని ఊడ్చి శుభ్రం చెయ్యడం, వంటశాలలో సహాయం అందించడం చేసేవారు. చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి.
ఆ మూడు నెలల్లోనే హేమ రజస్వల కావడం సంభవించింది. భిక్షుణిలు, స్థానిక ఉపాసికలు తమ నివాసం వెలుపల పందిరివేయించి, స్త్రీల కోసమని ఒక వేడుక నిర్వహించారు; పాటలు పాడారు. కూతురు వివాహం విషయమై చంద్రావతి లోతుగా ఆలోచించనారంభించింది. అందుకోసమైనా కళింగదేశం వెళ్లిపోవాలి అనుకుంది. కానీ మరోవైపు – భిక్షుణిల పొరపొచ్చాలు లేని సాన్నిహిత్యం, ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన నిరాడంబర ఆరామజీవనం ఆమె మనసుని ఆకట్టుకున్నాయి. ఆమెకు ఎటూ తోచలేదు. చివరికి హేమనే అడిగింది,
“మనం ఇంక తిరుగుప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుందామా?” అని.
“ఇప్పుడే ఏం తొందర? బుద్ధ పూర్ణిమ వేడుకలు చూసి వెళ్లమన్నారు కదా, గురువుగారు?” అని ఎదురు ప్రశ్న వేసింది, హేమ.
నిజానికి, ఆరామ జీవనంలో చంద్రావతికి అంతకుముందెన్నడూ లేని ప్రశాంతత, మనశ్శాంతి లభించాయి. అంతేకాదు, ఆమె తన జీవిత ఘటనల్ని ఎటువంటి ఆవేశకావేషాలు, ఉద్వేగాలకు లోనుకాకుండా నిష్పాక్షికంగా చూడనారంభించింది.
చిన్నతనంలోనే తన తల్లి మరణించింది. కన్నతండ్రీ, అత్తమామలూ, భర్తా – ఒక్కరొక్కరే వెళ్లిపోయారు. అసలు కళింగదేశంతోనే సంబంధం తెగిపోయిందనిపించింది. కాలం ఎంత విచిత్రమైనది! మనం అనుకొనేదొకటి, జరిగేదొకటి. పెళ్లికాక ముందు సింహళదేశం ఒక ఊహ, ఒక పలాయన మంత్రం మాత్రమే. చివరికి ఇక్కడికే వచ్చి చేరింది – ఒక్కగానొక్క కూతుర్ని వెంటబెట్టుకొని. ఆ రాత్రి ఆమెను పట్టరాని దుఃఖం ఆవహించింది. చాలసేపు ఏడ్చింది.
తెల్లవారుతూండగా చంద్రావతి ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చింది. ప్రాతఃకాల ప్రార్థనలు అయ్యాక విహారపు ప్రధానాచార్యులను కలుసుకొని,
“భాదంతే! నాకు ధర్మదీక్షను ప్రసాదించండి. నేను భిక్షుణిని కాగోరుతున్నాను,” అన్నది.
ఆచార్యులు చిరునవ్వు నవ్వి, “ఇది తొందరపడి తీసుకొనే నిర్ణయం కాదు. బాగా అలోచించుకో. ఉపాసికగా నీవు బౌద్ధ సంఘంకోసం ఎన్నో సేవలందించావు. ఆ సంగతి మా అందరికీ తెలుసు. కావాలనుకుంటే అదేవిధంగా కొనసాగవచ్చు. నీకెవ్వరూలేరని నాకు తెలుసు. సన్యసించడానికి ఎవరి అనుమతీ నీకవసరం లేదు. అయినప్పటికీ మీ అమ్మాయిని సంప్రదిస్తే బాగుంటుంది. హేమ చిన్న పిల్లేమీ కాదు,”
“అయితే ఆమెతో మాట్లాడతాను, భాదంతే!”
“నీకు ఈపాటికి తెలిసే ఉంటుంది. నువ్వుగనక ధర్మదీక్ష తీసుకుంటే మరుక్షణం నుండీ నువ్వు సన్యాసినివి అవుతావు. ఆ తరువాత హేమ నీకు కూతురూ కాదు, నీవు ఆమెకు తల్లివీ కాదు. బంధాలూ, బంధుత్వాలూ అన్నీ ముగిసిపోతాయి,”
“నాకా విషయం తెలుసు భాదంతే”.
చంద్రావతి ఆనాటి సాయంత్రం హేమకు తన అభీష్టాన్ని వెల్లడించినపుడు ఆమె ఎట్టి ఆశ్చర్యాన్నీ ప్రకటించలేదు. పైగా – ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించినట్లు చంద్రావతికి అనిపించింది.
“గత కొద్దివారాలుగా నీ ప్రవర్తన చూస్తూంటే ఇలాంటిదేదో తలపెడతావని నాకనిపించింది,” అన్నది హేమ.
హేమ స్వరంలో ఎట్టి నిందారోపణా వినిపించలేదు చంద్రావతి చెవులకు. కూతురు తనను తప్పు పట్టడం లేదని గ్రహించి తేలికగా ఊపిరి పీల్చుకున్నది.
బుద్ధజయంతి వేడుకలకు ఆరామంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు మొదలయ్యాయి. అందులో భాగంగానే పాతికమంది బాలురూ, బాలికలూ వారి తల్లి తండ్రుల ఆశీర్వచనలతో ధర్మదీక్షను స్వీకరిస్తున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు సంతోషంగా కనిపిస్తూనే, లోలోపల దుఃఖిస్తున్నట్లు చంద్రావతికి అనిపించింది. వాళ్ల భావోద్వేగాలు ఆమెను ఎంతగానో కదిలించాయి. పిల్లల్ని వదులుకోవడమంటే అదేమైనా సులభమైన నిర్ణయమా? చంద్రావతి కనులవెంట ఏకధారగా కన్నీళ్లు. దీక్ష పుచ్చుకున్నాక పిల్లలను వారి తండ్రులు పేర్లు పెట్టి పిలవకూడదు. కొంతమంది ఆఖరిసారిగా తమ పిల్లలను దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకోవడం చంద్రావతి చూసింది. ఒకసారి వాళ్లు సంఘంలో అడుగుపెట్టాక వాళ్లని తాక కూడదు; ఆ పిల్లలకు కూడా ఇక మీదట కుటుంబ సభ్యులంటూ ఎవరూ ఉండబోరు. ఇవన్నీ చంద్రావతిని బాధించాయి.
ఆ దీక్షా వేడుకలు ముగిసాక, తల్లీకూతుళ్లు తమ కుటీరం వైపుగా నడవడం మొదలుపెట్టారు.
“అమ్మా, నీకొక విషయం చెప్పాలి. నేనుకూడా బౌద్ధ దీక్ష తీసుకొని సంఘంలో చేరుతాను”.
చంద్రావతి నిర్ఘాంతపోయింది. ‘అసలీ చిన్నపిల్లకు ఈ ఆలోచన ఎలా వచ్చింది?’ అనుకుంది. అదే ప్రశ్న కూతుర్ని అడిగింది.
“అమ్మా! నిన్నూ, నాన్ననీ చూశాను. తాతల సంగతులు నాకు తెలుసు. వాళ్లే కాదు, మనుష్యులనే వాళ్లెవరూ ఆనందంగాలేరు. ఎప్పుడూ ఏదో ఒక దుఃఖం, ఆందోళన, అసంతృప్తి, వెతుకులాట. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి. అదేమిటో తెలుసుకోకుండానే చాలామంది వెళ్లిపోతారు. ఇక్కడ, ఈ ఆరామంలో నాకు నా సమాధానాలు వెతుక్కొనే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇక్కడి మనుష్యులు, ఈ వాతావరణం నాకెంతో నచ్చాయి. భిక్షుణిలను చూడు, ఎంత ప్రేమతో, కరుణతో నడుచుకుంటారో! ఎంత ఉత్సాహంగా, కలిసిమెలిసి ఉంటారో! అలాగే ఇక్కడి ఆచార్యులను చూడు, ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ ఎంత వినమ్రంగా, అణకువగా, ప్రేమగా ఉంటారో!”
హేమ మాటలకు చంద్రావతి నివ్వెరపోయింది. చివరి ప్రయత్నంగా, “నువ్వింకా చిన్నపిల్లవి. నువ్వు చూడాల్సినవీ, చెయ్యాల్సినవీ చాలా ఉన్నాయి. సంపాదించిన వాళ్లే ఆస్తిపాస్తులను వదులుకోగలరు. భోగులే నిజమైన యోగులవుతారంటారు. అనుభవించిన వారే త్యజించగలరు. తథాగతుడు బోధించిన ప్రాపంచిక దుఃఖం అవగతం కావాలంటే మొదట జీవితానుభవం కావాలి”.
“నాకన్న చిన్నవాళ్లెంతోమంది తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భిక్షువులుగా, భిక్షుణిలుగా మారిపోవడం మనం కళ్లారా చూశాం. ఆచార్యుల ప్రసంగాలు విన్నాక, ముఖ్యంగా బౌద్ధంలో స్త్రీల స్థానాన్నీ చూశాక, నాకు ఇదే సరైన మార్గం అనిపిస్తున్నది”.
హేమ నోటివెంట ఇంత గంభీరమైన మాటలు వెలువడడం చంద్రావతికి ఆశ్చర్యం కలిగించింది.
‘నిజమే, ఇదిప్పుడు చిన్నపిల్ల కాదు,’ అనుకుంది. కానీ కూతురు ఏమి కోరుకుంటున్నదో స్పష్టంగా తెలియలేదు.
“ఇంతకీ నువ్వనేది ఏమిటి?” అని అడిగింది.
“నువ్వు ధర్మాన్ని స్వీకరిస్తావంటే సంతోషమే. నేనుకూడా నీ బాటలోనే నడుస్తాను. అందుకు నీ అంగీకారం కావాలి”.
చంద్రావతి కొంచెం అసహనంగా. “నా సంగతి వేరు. నేను మంచీ, చెడూ అన్నీ చూశాను. కష్టాలూ, నష్టాలూ అన్నీ అనుభవించాను. చెప్పాను కదా, నువ్వు చిన్నపిల్లవి. అయినా ఇప్పటికిప్పుడు తేల్చుకోవలసిన సమస్య కాదు. వీలు చూసుకొని ఆచార్యుల వారిని సంప్రదిస్తాను”.
“ఎన్నాళ్లైనా నీకు చిన్నపిల్లగానే కనబడతానమ్మా! ఒక మాట అడుగుతాను, చెప్పు. పెళ్లైనప్పుడు నీ వయసెంత?”
” పద్ధెనిమిదో, పంథొమ్మిదో ఉండి ఉంటాయి,”
“ఇప్పుడు నా వయసు ఇంచుమించుగా అంతే. నువ్వే చెప్పావు, మీ పెళ్లికి తాతగారు ఒప్పుకోకపోతే బౌద్ధం తీసుకొని సింహళ వచ్చేద్దామనుకున్నానని. అప్పటికి విహారజీవితం, బౌద్ధసంఘం ఎలా ఉంటాయనేవి నీకు తెలియదు. నాకిప్పుడు ఆ అనుభవం ఉంది. బౌద్ధంగురించి తెలుసని చెప్పలేనుగానీ, సంఘం గురించి బాగానే తెలుసుకున్నాను. నేను ఏమి కోరుకుంటున్నానో అది నా కళ్ల ఎదుట స్పష్టంగానే ఉంది”.
మరి కొద్దిరోజుల పాటు తల్లీ కూతుళ్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరికి చంద్రావతి ప్రధానాచార్యులను సంప్రదించింది.
“నేటి సాయంత్రం – ప్రార్థనలయ్యాక హేమను వెంట తీసుకొని రా. ఆమె ఎదుటనే నా అభిప్రాయం తెలియజేస్తాను” అన్నారాయన.
హేమ ఉత్కంఠతోనూ, చంద్రావతి ఆందోళనగానూ ఆ సాయంత్రం ప్రధానాచార్యులను కలుసుకున్నారు.
ఆయన చిరునవ్వుతో, “అమ్మాయ్, హేమా! సంఘంలో చేరాలని నీవు కోరుకోవడం మా అందరికీ ఆనందం కలిగించింది. అయితే నీకు ఇరవై ఏళ్ల వయస్సు వచ్చేదాకా వేచి ఉండాలి. అప్పటికింకా నీలో ఇదే కోరిక బలంగా ఉంటే గనుక నువ్వు దీక్ష పుచ్చుకుందువుగాని. ప్రస్తుతానికి నీవొక అంతేవాసిగా ఆరామ పరిసరాలలో ఉందువుగాని. అంతేవాసులు శిరోముండనం కావించరాదు. కాషాయి చీవారాలు ధరించరాదు. నువ్వు సంస్కృతం, పాలీ, సింహళ భాషలు శ్రద్ధగా నేర్చుకోవాలి. బౌద్ధ గ్రంధాల అధ్యయనం, ఆరామంలో నిర్వర్తించాల్సిన విధులు, భిక్షుణిల సేవలు కొనసాగిస్తూ గడపాలి. రేప్పొద్దున్ననీ ఆలోచనలు మారవచ్చు. ఏది ఏమైనా, ఈ నాలుగైదేళ్లల్లో బౌద్ధం గురించి నీకొక అవగాహన ఏర్పడుతుంది,” అని తన ఆసనం మీదినుండి లేచాడు. సమావేశం ముగిసిందని అర్థం.
గురువుగారి విఙ్ఞతకు చంద్రావతి లోలోపలే కృతఙ్ఞతలు తెలుపుకొని సెలవు తీసుకుంది. ఆయన చేసిన సూచన – నిజానికది ఆదేశమే – హేమకు నచ్చలేదని చంద్రావతి గ్రహించింది.
తమ కుటీరం దిశగా మౌనంగా నడిచారు.
ఆ రాత్రి ఇద్దరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. పొద్దున్న లేస్తూనే, హేమ తన తల్లితో,
“గురువుగారు అలా ఎందుకన్నారో నాకర్థం కావడంలేదు. నా కన్నా చిన్నవాళ్లు సంఘంలో చేరుతున్నారు. వాళ్లకు త్రిరత్నాలు, బౌద్ధ సూత్రాలు అర్థం అయ్యాయంటావా? వాళ్లెవరికీ నాకు తెలిసినపాటి కూడా తెలియదు. కావాలంటే పరీక్ష పెట్టుకోమను,”
“ఆయన్ను ప్రశ్నించడానికి మనం ఎవరం? మనం ఈ దేశస్థులం కాము. మన నేపథ్యం, సంస్కృతి వేరు. బహుశా అందుకే నువ్వు కొన్నాళ్లపాటు ఆగాలి అని ఆయన అనుకున్నారేమో? అంతదాకా నువ్వు ఏమి చెయ్యలనేది ఆయన స్పష్టంగానే చెప్పారు”.
***
బుద్ధజయంతి నాటి పర్వదినాన చంద్రావతి భిక్షుణిగా అవతరించింది. అనురాధపురంలో జరిగిన ఆ వేడుక విహారచరిత్రలో నమోదు చెయ్యబడింది. ఆ సందర్భంగా ప్రధానాచార్యులవారొక మాటన్నారు –
“తథాగతుని స్వదేశం నుండి మన మధ్యకు వచ్చిన ఈ మహిళలు సంఘంలో చేరడం మనకు శుభసందర్భం. ఈ చమత్కారం ఇక్కడ, అనురాధపురంలో జరగడం మరీ గొప్ప విశేషం. ఎందుచేతనంటే బుద్ధునికి ఙ్ఞానోదయం అయిన పవిత్రస్థలం – బుద్ధగయ నుండి మహేంద్రుడు, సంఘమిత్ర స్వయంగా సముద్రాలను దాటి, తీసుకొచ్చి పాతిన బోధివృక్షపు అంటు ఇక్కడ చిగురించి, విస్తరించింది. బుద్ధుని స్వస్థలంలో తగ్గుముఖం పట్టిన బౌద్ధం – ఇక్కడ సింహళద్వీపంలో నిలదొక్కుకోవడమే కాకుండా ప్రజలందరి హృదయాలలోనూ శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంది. అటువంటి గొప్ప చారిత్రక సంఘటనలకు ఈనాడు మనం వీక్షించిన ధర్మదీక్ష ఒక గొప్ప కొనసాగింపు. కళింగప్రాంతపు కెరటాలు మరోసారి సింహళ ద్వీపాన్ని చేరుకున్నాయి.”
“సాధు! సాధు!” అంటూ భిక్షువులంతా జయజయ ధ్వానాలు చేశారు. చంద్రావతీ, హేమమాల ఒకరినొకరు చూసుకున్నారు. కాషాయి చీవారలలో, నున్నగా మెరుస్తూన్న శిరస్సుతో చంద్రావతి కొత్తగా, వింతగా కనిపించింది, హేమ కనులకు. తల్లి ముఖంలో ముందెన్నడూ చూడని ఒక కొత్త కాంతి; సరైన మార్గాన్ని ఎన్నుకున్నాననే ఆత్మ విశ్వాసం; ఇద్దరి పెదవులపైనా చిరునవ్వులు వికసించాయి. ఆమెను తల్లి అని భావించడం, సంబోధించడం సరి కాదేమో?
ఆచార్యులు తన ప్రసంగాన్ని కొనసాగించారు.
“నేటి సంఘటన ఈనాటికీ కొనసాగుతూన్న సత్ఫలితాల పరంపరలో భాగం. ఎందుకంటే మహానుభావులు, కారణజన్ములు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక సత్కార్యం చేబట్టినప్పుడు, మానవజాతి కోసం, ధర్మంకోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినపుడు వాటి సత్ఫలితాలు, ఎవర్ని, ఎక్కడ, ఎప్పుడు తాకుతాయో ముందుగా ఊహించలేం. ఇందుకు అత్యుత్తమమైన ఉదాహరణ మనకు బుద్ధుని జీవితంలోనే కనిపిస్తుంది. ఆనాటి రాత్రి, కఠోరమైన నిర్ణయం తీసుకొని సిద్ధార్థుడు యశోధరనీ, రాహులుడినీ రాజమందిరంలో వదిలిపెట్టి, ఙ్ఞానాన్వేషణకై బయలుదేరకపోయిఉంటే మానవాళి గతి ఏమయ్యేది? మనం ధర్మం, సంఘం లేకుండా అంధకారంలో ఉండిపోయేవాళ్లం. నేడది మన ఊహకి అందని విషయం. లుంబినీవనంలో సిద్ధార్థుడు జన్మించిన నేటి శుభదినాన ఈ ఇద్దరు మహిళలనూ ధర్మం దిశగా ప్రయాణానికి, సంఘంలో జీవనానికి ఆహ్వానిద్దాం. అతిథులుగా కాకుండా ఇక మీదట చంద్రావతి భిక్షుణిగా, హేమమాల అంతేవాసిగా మనమధ్య ఉంటారు. వీరిరువురినీ మనస్ఫూర్తిగా మన విహారానికి ఆహ్వానిస్తున్నాను”.
ప్రసంగం ముగిసింది. చంద్రావతి అప్పుడొక మహత్తర దృశ్యాన్ని చూసింది. ఆ బుద్ధ పూర్ణిమ దినాన, నిండు చంద్రుడు జేగురు రంగులో ఉదయిస్తున్నాడు. మరి కాసేపట్లో ఆ వేసవినాటి నిర్మలాకాశంలో ఉజ్వలంగా ప్రకాశించ సాగాడు. చంద్రుని కాంతికి చుక్కలన్నీ సవినయంగా తప్పుకొని, కనుమరుగయ్యాయి. ముగ్ధురాలై, చంద్రావతి ఆ దృశ్యాన్ని చూడమని హేమకు సైగ చేసింది. అది సిద్ధార్థుని చల్లని ఆశీర్వచనంగా చంద్రావతికి తోచింది. ‘కళింగ తీరంలో కూడా ఇదే చంద్రుడు ఈ క్షణంలో వెలుగుతూ ఉంటాడు, సందేహంలేదు. అంతేకాదు, తన శక్తితో సముద్రపు పోటును ఉధృతంగా మార్చి ఉంటాడు,’ అనుకున్నది.
అక్కడున్న భిక్షుణిలు, భిక్షువులు, అంతేవాసులు, మొత్తం ప్రజా సమూహం, ఏక కంఠంతో త్రిరత్నాలను పఠించారు –
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
…
[మార్చి 2023నాటి ‘పాలపిట్ట’ పత్రికలో మొదట ప్రచురింపబడింది]