మళ్ళీ మళ్ళీ చచ్చిపోయాడు

Spread the love

“ఇంత నాశినం నా బట్టల్ని యాడా సూడ్లా వదినా” అంటా చేతి మెటికలు విరుత్తా రవణతో వస్తన్న రాములమ్మ నాకల్లా ఎగజూసి, టప్పని నోరు మూసింది.ఆళ్ళు మా బావ శవంబాక్సు కాడ నుండే వస్తన్నారని అనుమానం వచ్చింది.ఇప్పటికి మూడుసార్లు ఫోన్ చేసాడు హైదరాబాదు నుంచొచ్చిన బావ చిన్నకొడుకు విజయ్, ఆయన శవం బాక్సు కాడ్నుంచి.ఏందో వుందే అనుకుంటా గబగబా రైలుగేటు దాటి అవతలకి పోయా. 

గేటుదాటి నాలుగడుగులు ఎయ్యంగానే కుడిచేతేపు వుంటది మా బావ ఇల్లు.ఇంటి ముంగల రోడ్డు మీనే వుంచారు బావని ఐసుబాక్సులో.ఆ రోడ్డు పొడుగూతా మార్జినోళ్ళు ఆడా మగ అంతా ఇళ్ళ బయట కూచొని ఇటే చూత్తా వున్నారు.అప్పుడే షామియానా ఏసినట్టున్నారు.కుర్చీలు సదురుతున్నారు.మిట్టమజ్జేనం మాడు పగలగొడుతున్న ఎండలో నిల్చోలేక, వచ్చిన బంధువులు గబగబా షామియానా కింద కుర్చీల్లో కూర్చుంటున్నారు.ఇంతలో ఎవరో పెద్దాయన ఐసుగడ్డేసి మంచినీళ్ళ డ్రమ్ము పెట్టండ్రా అని పురమాయిస్తున్నాడు.అప్పుడే ఎవరో కట్టెపుల్లలు కట్ట ఒకటి తెచ్చి ఐసుబాక్సు పక్కనే పడేసారు.వడగాలికి షామియానా తపతప కొట్టుకుంటన్నప్పుడల్లా కర్రలు ఒంగిపోయి, బావ శవం బాక్సు మీద ఎండ పడతా వుంది.

వాళ్ళని దాటుకుంటా అట్టనే ఇంట్లోకి పోయా.రెండు పోర్షనుల ఇళ్ళు. ఒకటి మా బావ భార్య రాముడక్క వుండేది. రెండోది ఆళ్ళ పెద్దకొడుకు రమేష్ కుటుంబం వుండేది.రాముడక్క అయిటంలో ముందు చిన్నగది. తరువాతది బెడ్‌రూమ్.ఆ తర్వాత కిచెన్. ముందు గదిలో విజయ్ తో పాటు ఎవరో బంధువులు కూర్చోనున్నారు.బెడ్‌రూమ్లో ఒకవైపు రాముడక్క కుర్చీలో దిగాలుగా కూర్చోనుంటే, మరోవైపు మంచం మీద ఆ చివర ఇద్దరు తెల్లబట్టలు వేసుకున్న మగవాళ్ళు, ఈ చివర ఇద్దరు తెల్లచీర కట్టుకున్న ఆడవాళ్ళు గమ్మున మొఖాలు ఏలాడేసుకొని కూచోని వున్నారు. పక్కనే మంచం మీద బైబిలు పుస్తకాలు వున్నాయి.

విజయ్ నన్ను చూసి గబగబా లేచి, షామియానాకి దూరంగా తీసుకొచ్చి, ఎవరూ లేనిచోట, ఒక వేపచెట్టు నీడలో నుంచోబెట్టాడు. 

“ఏందిరా విజయ్..ఎప్పుడొచ్చావు?”

“పొద్దున పదైంది మామా.నాన్న నిన్ననంగా చచ్చిపోతే..అర్థరాత్రి చెప్పారు మామా నాకు. అప్పటికప్పుడు బయల్దేరి అదరాబదరా లగెత్తుకొచ్చా” విజయ్ మొఖం చెమట పట్టి ఆందోళనగా అవుపడతంది. మాట గసగా వస్తంది.

“ఏందిరా మరి..అన్నిసార్లు ఫోన్ చేసావు.ఏవయింది?” విజయ్ వాలకం చూసి భుజం మీద చేయి వేసాను.అప్పటిదాకా ఉగ్గబట్టుకొని వున్నట్టున్నాడు, ఆ మాత్రం అనునయనానికే వాడు కళ్ళ నిండుగా నీళ్ళు తీసుకున్నాడు.ఏదో చెప్పబోతున్నాడు గానీ, గుండెల్లో దుఃఖం వల్ల గొంతులోంచి మాట బయటకు రావడం లేదు.కాసేపు వాడి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా లాక్కొని, కాసేపు అట్టాగే ఉన్నాను.ఈలోపు మెల్లగా తెప్పరిల్లాడు విజయ్.

“అది కాదు మామా..నాన్న చచ్చిపోయి మా ఏడుపు మేం ఏడుత్తా వుంటే..ఆ నందాగాడోళ్ళు ఏంది మామా కాట్లకుక్కల్లాగ వచ్చి మీద పడతన్నారు.’మాలదాన్ని తగులుకొని ఎళ్ళిపోయావుగారా.. మళ్ళా ఎందుకొచ్చావు? ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? నువ్వసలు ఆయనకి పుట్టినోడివే కాదు. ఎప్పుడో నిన్ను చచ్చినోళ్ళలో జమేసామురా.ఎట్టొచ్చావో అట్ట ఎళ్ళిపోరా మర్యాదగా’ అని ఇందాకడిదాక పెద్ద రచ్చ చేసారు మామా”

“ఆ నందాగాడికేం పొయ్యేకాలం..వాడికెందుకసలు మీ ఇంటి విషయాలు?ఆ రమేషుగాడు లేడంట్రా అప్పుడు..వాడేం అంటన్నాడు?”

“అసలు రమేషన్నే కదా మామా ఇదంతా రేపెట్టింది.ఆళ్ళ బాబాయిలందర్నీ రెచ్చకొట్టి పిలచకొచ్చాడు నా మీనకి.ఆళ్ళ పొగరుబట్టిన మాటలు చూడు మామా.ఎదవలు ఎంతెంత మాటలు అంటన్నారో చిన్నంతరం పెద్దంతరం లేకుండా.ఆళ్ళట్టా మాట్టాడతంటే ఇంతమంది బంధువులు వుండీ ఒక్కళ్ళు కూడా కిక్కురుమన లేదు మామా.ఆ రమేషుగాడు ఈళ్ళందర్నీ రెచ్చగొట్టి ఆడు మాత్రం ఫుల్లుగా పట్టించి ఇంటో పడిపోయాడు.”

“అదేందిరా..రమేషుగాడు పడిపోతే ఎట్టా?మరి బావకి మట్టి ఖర్చులు..అయ్యీ..?” ఆశ్చర్యంతో నోరు తెరిచా

“ఈడ నేనొకడ్ని వున్నా కదా మామా ఊడుదాకోడ్ని.నా మీద దొబ్బేరు.మేం వచ్చేతలికే నాన్నని దిక్కూదివాణం లేనట్టు ఆ రోడ్డు మీదే పండేసి వుంచారు మామా.ఇక చూసి చూసి ఐస్‌బాక్సు నేనే తెప్పించా.వచ్చినోళ్ళకి టిపిన్లు, కాఫీలని..అన్నిటికీ ఇక నామీదే వాలిపోయారు మామా..”

“మరయితే అక్క ఏం చేస్తందిరా..ఇంత జరుగుతుంటే..ఏమనలేదంట్రా..”

“ఏమంటది మామా..ఆడట్టా నిషాలో పడున్నాడు కదా..చావనీ..మట్టిఖర్చులు మనమే పెట్టుకుందాం లేరా.అందరి ముందూ ఎందుకు గోల.పోనీ..అనింది”

“మరి..ఇంట్లో ఆళ్ళెవరు ?చర్చీ వాళ్ళా?”

“అవును మామా..ఖర్చులన్నీ మనయ్యే గదా.పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయించుకుందాం అని అమ్మే ఆళ్ళని పిలిచింది మామా”

“……….”

“ఇగ జూస్కో మామా..పాస్టరోళ్ళు అట్టా వచ్చేరో లేదో..కయ్యిమంటా మీద పడ్డారు నందాగాడోళ్ళు. మాది హిందూ సంప్రదాయం.ఈడ ప్రార్థన్లు గీర్థన్లు చెయ్యడానికి వీల్లేదు.పాస్టర్లు ఈడ వుంటానికి వీల్లేదని ఓ..అని పెద్ద గొడవ..మా బాబాయిలు కూడా అదే మాట.వచ్చిన బంధువులూ అదే మాట. శవం కాడ రచ్చరచ్చ..ఇంక మేం గెలవలేక అందరం ఇంటోకెళ్ళి కూచున్నాం.నాకు కాళ్ళూచేతులు ఆడక నీకు ఫోన్ చేసా మామా కాస్త ధైర్యంగా వుంటదని.”చెపుతా చెపుతా విజయ్ గొంతు బొంగురు పోయింది. 

“ఏడ్రా.. ఆ నందాగాడు..యాడా అవుపడ్డం లేదు..”మాట తప్పించాను.

“ఎందుకవుపడతాడు మామా..మా బాబాయిల్నేసుకొని మందు తాగను పోతే..అయినా మామా..నా మీన అంత తగాదా ఆడి, గొడవ పెట్టుకొని తిట్టి మళ్ళా నన్నే సిగ్గులేకుండా డబ్బులు ఎట్టా అడగబుద్దేసిద్ది మామా ఆళ్ళకి..” విజయ్ మొఖం మొటమొటలాడించుకున్నాడు.

“మరి, నువ్వెట్టా ఇచ్చారా మరి?”

“ఇవ్వక చస్తానా మామా..ఒకటేమొయిన కొరుక్కు తినేస్తంటే..”

ఇద్దరం కాసేపు ఏం మాట్టాడుకోకుండా ఇబ్బందిగా గడిపాం. 

ఇంతలో షామియానా దగ్గర అలికిడి.నందాగాడు, విజయ్ బాబాయిలందరూ వచ్చినట్టున్నారు. వెకిలి నవ్వులు పెద్దంగా వినపడతా వున్నయ్యి.ఇద్దరం షామియానా కాడకి నడిచాం.

నందాగాడు పండ్లన్నీ బయటపెట్టి ఎగతాళిగా నవ్వుతా నా దగ్గరకు వచ్చాడు.” పాతకుండ కాడకి ఉత్తముండవు చేరావా”అని తన మాటలకి తనే కిసుక్కున నవ్వాడు.మిగతా జనం కూడా ముసిముసిగా నవ్వేరు.నాకు కడుపులో చర్రమంది.

“ నేను ఉత్తముండనేరా..నువ్వు మాత్రం పెళ్ళాం వదిలేసిన పాతకుండవేరా నందాగా”అన్నాను.

నందాగాడికి అంత మందుమత్తులోనూ మొఖం మీద నవ్వు మాయమైంది.బదులియ్యలేక మాటల కోసం వెతుక్కున్నాడు. 

“ అరేయ్..ఆళ్ళు ప్రార్థన్లు చేయించుకుంటారు.కూటాలు పెట్టించుకుంటారు.నీకెందుకురా..? నువ్వేమన్నా ఆర్చేవాడివా.తీర్చేవాడివా.ప్రతి దానికి నేనంటూ ఎగేసుకొని వచ్చేత్తావు.నీకే తింటానికి తిఖానా లేదు.మళ్ళీ నీకు బోడి యవ్వరాలు..” నందా గాడినే అంటన్నా అందరివైపు చూస్తా అన్నా.

“అదేందబ్బాయ్..అట్టెట్టా కుదురుద్ది? మనమేంది? మన కులమేంది? మన మతమేంది? మన పద్దతులేంది? అట్టెట్టా మన ఇళ్ళ మధ్య క్రిస్టియన్ల ప్రార్థన్లు పెట్టిస్తాం? చూడబోతే పెట్టెలో పెట్టి తీస్కెళ్ళి కప్పెట్టేసేట్టున్నారే..అయ్యోవ్..ఇంత దూరం వచ్చింది ఈ దరిద్రం చూస్తా వుంటానికా ఏంది? కోటేశ్వర్రావు అన్నకి హిందూల పద్దతుల ప్రకారమే అంత్యక్రియలు జరగాల్సిందే”

“నీకంటే దేవుడూ దెయ్యం లేదు..మన, తన లేదు. మాక్కూడా లెవ్వనుకుంటన్నావా ఏంది?”

“కూటికి లేకపోతే మాత్రం కులం పోగొట్టుకుంటామా?”అందరూ తలో మాటంటా మూకుమ్మడిగా నా మీద పడ్డారు.

“ మీరు మీ హిందూ ధర్మాన్ని గాలికి వదిలేసి కూచుంటే వాళ్ళు వాళ్ళకు తెలిసిన ధర్మాన్ని తెచ్చుకున్నారు” అన్నాను తీరిగ్గా కుర్చీలో కూర్చుంటా

“మేం మా ధర్మాన్ని గాలికి వదిలేసామా?ఎట్టా..తిరకాసు మాటలు మాట్టాడకుండా తిన్నగా చెప్పు” 

మా బావ తమ్ముడు బానకడుపు వెంకటేశ్వర్లు అరచేతిలో అరచెయ్యి తిరగేసి కొడతా ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు.

“ సరే బావా..మనలో తండ్రి చనిపోతే ఎత్తుబడి ఖర్చులు ఎవరివి?”

“మగ పిల్లలవి”

“బాధ్యత ఎవరు ఎత్తుకోవాలి?”

“ పెద్దకొడుకు”

“మరి యేడి ఆ పెద్ద కొడుకు..?ఎయ్యీ ఆడి ఎత్తుబడి ఖర్చులు ?అన్నీ విజయ్ గాడి మీద దొబ్బి ఆ రమేష్ గాడు బాగా దెంగితాగి పడుకున్నాడు.అదేందిరా ఈ సమయంలో ఈ వరస అని  మీరెవరన్నా ఆడ్ని తీసుకొచ్చి ఈడ నిలబెట్టి హిందూ ధర్మాన్ని నిలబెట్టారా?లేదు.ఆడి కాడకి ఎవడన్నా ఎళ్ళి,ఆడి కాడ ఖర్చులు తీసకొచ్చి పెడతన్నారా?లేదు. ఈడ కూర్చొని మాత్రం సొల్లుకబుర్లు..”

“………….”

“అదేందంటే..క్రిష్టియన్ పిల్లని చేసుకున్నాడని విజయ్ గాడ్ని వేథింపులు..ఏఁ..నందాగాడి మామ చర్చీకి ఎళ్ళడం లేదా?చర్చీకి ఎళ్ళినంత మాత్రాన ఆడికి మామ కాకుండా పొయ్యాడా?విజయ్ గాడు మా బావకి కొడుకు కాకుండా పొయ్యాడా?ఏం మాటలు బావా ? రమేషు గాడే వచ్చి నిలబడితే పాస్టరు ఎందుకొచ్చేవోడు చెప్పు?”

“…………”

“ అంతెందుకు బావా? అన్నా అన్నా అని నీలుగుతున్నారు కదా..ఒక్కడైనా ఒక దండ తెచ్చి ఆయనకి గౌరవంగా వేసారా? ఒక్కడైనా భర్త పోయిన బాధలో వున్న మీ వదిన్ని పలకరించారా?”

“…………”

“తాగడానికి డబ్బులియ్యట్లేదని బావని ఆ రమేషు గాడు పొద్దాక కొడతావుంటే,ఇల్లొదిలి ఆయన అక్కని తీసుకొని వెదుళ్ళపల్లి పారిపోయి వుంటే,ఒక్కడన్నా రమేషు గాడ్ని ఇదేందని మందలించారా?ఒక్కరన్నా పోయి బావని పలకరించారా?ఉహుఁ..ఇప్పుడు మాత్రం పొడుచుకొచ్చేసింది.అన్నా..అన్నా..అని”

“…………”

“ఒరేయ్..ఆ అబ్బాయి చెప్పేదీ సబబుగానే వుంది..ముందా రమేషు గాడ్ని లేపుకురండి పొండి.. వాడెట్టున్నాడో..ఏం కతో..”వింటా వున్న ఒక ముసలాయన అందరికీ వినపడేట్టు అరిచాడు.

నన్ను తప్పించుకోవడానికి అన్నట్టు ఐదారుగురు దబదబా లేచారు.హుటాహుటిన రమేషు గాడి అయిటంలోకి ఎళ్ళారు.వాళ్ళెనకమాల నేనూ వెళ్ళా..

రమేషుగాడు ఫుల్లు నిషాలో నేల మీద పడి దొల్లుతా వున్నాడు.లుంగీ అంతా తడిసి కంపు కొడతా వుంది.అందులోనే ఉచ్చ పోసుకున్నట్టు వున్నాడు.ఒకళ్ళిద్దరు వాడ్ని కదిపి లేపి కూర్చోబెడదామని చూసారు గానీ, వాళ్ళకి అలివి గాక రమేషు గాడు జారగిల పడిపోతన్నాడు. 

అసలికే నా మాటలకి మంట మీద వున్న వెంకటేశ్వర్లు బావ..” ఇట్ట కాదురా..లాక్కొచ్చి నాలుగు బిందెలు నీళ్ళు పొయ్యండి..అప్పుడు గాని లేవడు”అన్నాడు కచ్చిగా.ఇద్దరెళ్ళి గబగబా చేతిపంపు కొట్టి, రమేషు గాడ్ని బయట కూర్చోబెట్టి నాలుక్కి నాలుగు బిందెలు తల మీద పోసి, ఎట్టోకట్ట సొయిలోకి తెచ్చారు.లోపలికి తీసికెళ్ళి రమేషుగాడి పెళ్ళాం చేత పొడిబట్టలు ఏయించారు.

పది నిమిషాలు అయినా లోపల నుండి ఉలుకూ పలుకూ లేదు.ఇక నేనే లోనికెళ్ళా.వెంకటేశ్వర్లు బావ, ఆయన తమ్ముళ్ళు, నందాగాడు రమేషు గాడి చుట్టూ వున్నారు. రమేషు గాడేదో అంటున్నాడు.

నన్ను చూసి “ ఇదోయ్యా..ఈడు చెప్పేది ఈడు చెపుతున్నాడు విను” అన్నాడు ఇంకో బావ రామకృష్ణ. ఏందన్నట్టు రమేషు వంక చూసా. 

“ ఏం లేదు మామా..నానకి పెన్షన్ వత్తంది.అందులో ఆళ్ళు నాకేం పైసా ఇయ్యడం లేదు.ఆ మాలోడికే పంపిత్తన్నారు.ఆడికే పంపిత్తన్నప్పుడు ఇంక నాకేం పట్టింది ?ఆళ్ళనే చూసుకోమను..”

“పెన్షన్‌తో నీకేం సంబంధంరా..?ఆళ్ళు తినొద్దా?అయినా ఆళ్ళని బాగా చూసుకుంటే కొద్దోగొప్పో ఇత్తారు గానీ, పొద్దాక తాగి తలకుపోసుకొని ఆళ్ళని తంతంటే ఇత్తారంట్రా రమేషుగా?ఆళ్ళని ఇక్కడ్నుంచి ఎళ్ళగొట్టిందాక ఒంటికాలు మీన వున్నారు కదరా మీ మొగుడూపెళ్ళాలు..”

“ నీకు తెలీదులే మామా..అంతా ఆ మాలోడికే తినబెడతన్నారు.ఒక్కసారి ఆడు ఎళ్ళిపోయి ఆ మాలదాన్ని చేసుకున్న తర్వాత, ఆడ్ని వదిలేసి మన మానాన మనం బెట్టుగా వుండాలి గానీ, మధ్యలో ఆడ్ని తెచ్చి వాటేసుకుంటే..మేమేంది ఈడ..ఎర్రిపుష్పాలమా మామా?కులంలో విలువుంటదా మామా”

“నీ బొందరా..నువ్వు చూసావారా ఆడికి పెట్టడం?అయినా బావ నీకెంత డబ్బు తగలేసాడో నాకు తెలీదా..నీకు తెలీదా?”

“నీకు తెలీదులే మామా ఆళ్ళ యవ్వరాలు.ఆ ప్రార్థనలని, పాటలని ఆళ్ళని బుట్టలో ఏసుకున్నాడ్లే మామా ఆ మాలోడు.ఫోన్లలో కూడా ఆ పాడు ప్రార్థనలే..వింటంటేనే గు..లో మండుద్ది.ఆడు ప్రేముండి వచ్చాడనుకున్నావా?ఆస్తి కోసమే వచ్చాడు.ఆడ్నెందుకు రానిస్తాను మామా.. తరిమిదెంగనూ..” రమేష్ గాడు పళ్ళ మధ్య నాలిక మడత పెట్టి కొరికి, పైకి లేవబోయి, వల్లకాక కింద పడిపోయాడు. 

“ అరేయ్..అయన్నీ అయ్యే పన్లు కాదులేరా.మనం కాదనుకోంగానే ఆడికి ఈడ హక్కు లేకుండా పోతందా ఏంది?కూడుకి గుడ్డకి కాని మాటలు ఎందుకురా?లే..లేచిరా..మళ్ళా పొద్దుపొయ్యిందంటే మట్టి చెయ్యడం కుదరదు” అన్నాను పైకి లేచి

రమేషు గాడు కరాకండీగా మొఖం పెట్టి “ ఆ మాలోడుండంగా నేను రాను మామా..” అన్నాడు. ఆడి చెయ్యి పట్టుకొని లేపడానికి చాచిన నా చెయ్యిని విదిలించుకుంటున్నాడు.

“అయినా బాబాయ్..ఎళ్ళిపోయినోడు ఎళ్ళిపోవచ్చు కదా.మళ్ళీ వచ్చి చిచ్చు పెట్టడం ఎందుకు?”

నందా గాడు పాయింటు లాగాడు.

“ చెప్పేవులే నందాగోవ్..ఆ వచ్చినోడి కాడ బాగానే గుచ్చారు కదా అందరూ.. తాగింది చాల్లేదా? ఇంక రమేషు గాడిని ఆడి వంతు డబ్బులు తియ్యమను.అన్నీ లెక్క రాస్తున్నా.మళ్ళా ఆళ్ళు డబ్బులు పెట్టల్సొస్తే ఆళ్ళ ప్రార్థనలు మొదలుపెడతారు.మళ్ళా మన హిందూ ధర్మానికి దెబ్బ. దబ్బున రమేష్ గాడ్ని లేపి, ఆడ్ని తీసుకురా.లేట్ అవుతా వుంది” ఇంకాడ వుండడం వేస్టనిపించి, బయటకు వచ్చేసాను. 

నేరుగా కోటేశ్వర్రావు బావ ఐస్‌బాక్సు దగ్గరకు వెళ్ళా.బాక్సు అద్దంలోంచి బావ మొఖంలోకి చూసా.మనసు భారమై,కళ్ళకి నీళ్ళు కమ్మాయి.బావ బుగ్గలు పీక్కుపోయి, మడిసి సగమయ్యాడు.

‘ఎంత అందగాడు బావ.బాడీబిల్డింగ్ చాంపియన్.తాతలు తండ్రులు బాబాయిలంతా పనీ పాట లేకుండా, వున్నదంతా తాగి తలకుపోసుకొని, ముండల ముఠాకోర్లయి తిరిగుతున్న రోజుల్లోనే, ట్రెజరీ ఆఫీసులో ఉద్యోగం సంపాయించాడు.ఇద్దరు పిల్లలయే లోపే గెజిటెడ్ ఆఫీసరయ్యాడు.మూడో పిల్లాడు పుట్టి, పిచ్చికుక్క కరిచి చనిపోయాక దిగులేసుకున్నాడు.తగులుకున్న ఉబ్బసం ఆయన ఊపిరితిత్తుల్ని తినేత్తే..తాగుడుకి అలవాటయిన రమేషుగాడు చదువుసంధ్యల్ని గాలికొదిలి, మా బావ డబ్బుని, ఆయన మనశ్శాంతిని తినేయడం మొదలుపెట్టాడు.రాముడక్క ఈ సెర పడలేక చర్చీలోకి మారిపోయింది. విజయ్ గాడు ఆ చర్చీలోనే ఒకమ్మాయిని ప్రేమించి, ఎళ్ళిపోయి, పెళ్ళి చేసుకుని, ఆళ్ళని ఇంకాస్త ఇరకాటంలో ముంచాడు.ఇదంతా చూత్తానే వున్న రమేషుగాడు, ఆడి పెళ్ళాం సంసారాన్నంతా ఆ ఇద్దరి మీదా ఏసి, డబ్బులిచ్చినప్పుడు ముద్దు; ఇవ్వకపోతే గుద్దు అన్నట్టు ముసలాలిద్దర్నీ ఏపుకు తిన్నారు.ఇంకో వంక ఆ పిల్లని చేసుకొని హైదరాబాదు చేరిన విజయ్ గాడు ఎట్టయితే ఏం, కుక్కబాధలు పడి, ఒక స్కూలు పెట్టుకొని, ఇద్దరు పిల్లల్ని కనిపెట్టుకొని, ఆడు బతుకు ఆడు గౌరవంగానే బతుకుతున్నాడు.ఎట్టనో తల్లిదండ్రులకి మళ్ళా దగ్గరయ్యి, ఫోన్లలో మాట్టాడుకుంటా బాగానే వున్నాడు.ఇదంతా నచ్చని రమేషు గాడు ఒకరోజు బిర్రుగా తాగి, తాగుడికి డబ్బులియ్యలేదని బావ తలకాయి పగలగొట్టబోతే, ఆళ్ళు భయపడి వెదుళ్ళపల్లి పారిపోయి, బంధువుల ఇంటో అద్దెకు చేరారు.ఆడ బావకి ఉబ్బసం బాగా ఎక్కువయి, వైద్యానికి డబ్బులు మంచినీళ్ళలాగ ఖర్చయినియ్యి.పెన్షన్ డబ్బులు రమేషు గాడి జల్సాలకి చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి పోతుండడంతో చాలడం లేదు.విజయ్ గాడికి విషయం తెలిసి, డబ్బులు పంపించి వైద్యం చేయించాడు.చివరికి బావ పరిస్థితి విషమించితే, రాముడక్క గుంటూరు ఆసుపత్రికి ఏసుకెళ్ళినా, రెండు లక్షలు వదిలాయి గానీ, మడిసి దక్కలా.ఇంత జరుగుతున్నా ఆ రమేషు గాడు మాత్రం పాపం అనలా, పైసా విదల్చలా.’

ఆలోచనల్లోంచి తేరుకొని చూత్తే, సూరీడు పడమరకు వంగిపొయ్యాడు.షామియానాలో జనం పల్చబడ్డారు. ‘ఏడీ రమేష్ గాడు..ఎంతకీ రాడే..’ అని పోయి చూత్తే, ఇంటికి తాళం పెట్టుంది.

గుండె గుబిక్కుమని, బావ తమ్ముళ్ళందర్నీ పోగేసి విషయం చెబితే, ఏం చెప్పాలో తెలీక ఆళ్ళూ మల్లాగుల్లాలు పడతన్నారు.అవతల పొద్దు పోతా వుందని నా టెన్షను నాది.ఈ గోలకి రాముడక్క, చర్చీవోళ్ళు బయటకొచ్చారు.విషయం తెలిసి రాముడక్క అవాక్కయిపోయింది.వెంటనే తేరికొని ఎట్టా ఎట్టా అనుకొని విజయ్ గాడి వంక చూసి ”అయితే విజయ్ పెడతాడులే “ అంది

అంతే..! గోలగోల రేగింది అక్కడ. పెద్దకొడుకు వుండగా రెండో కొడుకు ఎట్టా పెడతారన్నారు.విజయ్ క్రిస్టియన్ కదా కొరివి పెడతానికి వీల్లేదన్నారు.అవసరమయితే రమేషు గాడ్ని దెవులాడి తెచ్చి కొరివి పెట్టిచ్చాలి గానీ, ఇదేం పని అన్నారు.ఈ తడవ ఆడోళ్ళ గొంతులూ గట్టిగా వినపడినియ్.అందరూ శవం బాక్సుకి అడ్డం పడిపోయేలా వున్నారు.ఆళ్ళ వంక కోపం గానూ,చిరాగ్గానూ, జాలిగానూ, నిస్సహాయంగానూ చూసాను.ఆళ్ళు నన్ను గంగా పట్టించుకున్నట్టు లేదు.ఇంక ఇది తెమిలేట్టు లేదని చర్చీ పాస్టరోళ్ళు ఉసూరుమంటా ఎళ్ళిపోయారు.రాముడక్కతో పాటు సూరీడు కూడా మెల్లగా కుంగిపోయాడు.పంతం నెరవేరిందని జనం తృప్తిగా ఎక్కడోళ్ళక్కడ సర్దుకున్నారు.

చీకటిపడతా వుండడంతో షామియానాలో ఒక గుడ్డిలైటు వెలిగించారు.ఆ వెలుతురులో రమేష్ గాడి ఇంటి తాళంకప్ప ఎక్కిరిస్తా అవుపడతా వుంది.రాముడక్క ఇంటి పోర్షనులో లైట్లు ఎలిగినా, ఇంటో మడుసుల మొఖాల మీన చీకటి తారాడతా వుంది. ఇదంతా చూస్తా ఐసుబాక్సులో చచ్చిపోయి కుళ్ళిపోతున్న మా బావ శవం మళ్ళా ఎన్నిసార్లు కుళ్ళికుళ్ళి చచ్చిపోయిందో

P. Srinivas Goud

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి. రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

సెల్ : 9949429449 మెయిల్ : srinivasgoudpoet@gmail.com


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *