మధుత్రయ రాజ్యం

Spread the love

మధుత్రయ రాజ్యంలో ఆకాశహర్మ్యాలు ఎన్ని ఉన్నా, అంతఃపుర శోభ మాత్రం వర్ణనాతీతం. సంధ్యా సమయంలోని అంతఃపుర దివ్య కాంతులు ఇంద్రధనస్సునే మైమరిపిస్తాయి. అక్కడి చెలికత్తెల సమాగమం అప్సరసల కోలాహలంలా వుంటుంది. ఎర్రని తివాచీలు పరుచుకున్న రహదారులకు ఇరువైపులా మిరుమిట్లు గొలిపే కాంతులతో ఎగజిమ్మే నీటీ తటాకమ్ములు, అనంత శోభ సంతరించుకున్న జలపాతముల సొగసు వర్ణింప తరమా! మహారాజ మందిరం, విశ్రాంతి  మందిరముల రాజసం అమోఘం! ఇలా ఆ ప్రాకారంలో ఎన్ని ఉన్నా, మహారాణి మందిరం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. చంద్రుడి వెన్నెల కాంతులలో, వికసించే కలువల సొగసులు అద్దుకున్న సొంపైన సెలయేర్ల నడుమ, సువర్ణమయమై దేదీప్యమానంగా వెలిగిపోతూ చూపరుల హృదయాలకు హత్తుకుంటుంది. సుశిక్షితులైన వీరవనితల  కరవాలపు నీడలో పదిలమైన ఆ అంతఃపురంలోనికి,మహారాజు దుంధుమారుడు మరియు అతని అంతరంగికుడు మంధునికి తప్ప అన్య పురుషులకు ప్రవేశం నిషిద్ధం.

              మధుత్రయ రాజ్యానికి మహారాజు దుంధుమారుడైతే మహారాణి గాథ. అంతఃపుర మణిమకుటం ఆమె. అప్సరసలకు అందని లావణ్యం, అంతకు మించిన సౌందర్యం, విస్మయం కలిగించే ఖడ్గ విన్యాసం ఆమె సొంతం. ఆమె కత్తి తిప్పితే మేఘంలా అగుపిస్తుంది.  వేగం పెంచితే అదే మేఘం మరింతగా విస్తరించి తుఫానులా మారినట్లనిపిస్తుంది. ఆమె కత్తి ధాటికి మహా  యోధుని కత్తి  కూడా రెపరెపలాడి నేల రాలుతుంది. ఆమె గాధేయ మహారాజు ఏకైక ముద్దుబిడ్డ.

                        **********

                      ” మహారాణీ ! మీకోసం ఒక సందేశం ” అంటూ పరుగున మహారాణి వద్దకు వచ్చి ఒక చెలికత్తె విన్నవించింది. ” నిస్సందేహంగా చెప్పు నిశ్చలా!” అంది మహారాణి గాథ. ” మహారాజు గారు దేశ పర్యటన ముగించుకుని మన అంతఃపురానికి విచ్చేయుచున్నారు. కానీ! ” అంటూ తటపటాయించింది నిశ్చల. ” ఆ కానీ ఏమిటో నిర్భయంగా చెప్పు నిశ్చలా! ” అని మహారాణి అనగానే ” క్షమించాలి మహారాణి!  మహారాజు గారు మధుచ్ఛద అనే ఒక యువతిని తన వెంట తీసుకు వస్తున్నారని తెలిసింది. ఆమెను వచ్చే పౌర్ణమినాడు ప్రాతఃకాలంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటారని తెలిసింది ”  అంటూ మౌనం దాల్చి తల దించుకొని నిలబడుకుంది నిశ్చల. ” ఇంకా ఏమి తెలిసింది?  మౌనం వీడి ఆ అమ్మాయి గురించి   ఇంకా చెప్పు! ”  అంది మహారాణి.  ” ఆమె పేరు మధుచ్ఛద. పేరుకు తగినట్లే మయూర పింఛమువంటి సొగసు ఆమె సొంతమట! ఆమె గాత్రం వింటే వీణ కూడా సప్తస్వరాలను మరచిపోయి శిలలా మరి మూగబోవునట ! ఆమె నాట్యంచేసే సమయంలో, ఆమె పరికిని కూడా ఒక లయలో తరంగంలా మారి చూపరుల మనసును వలపు అలలా తాకుతుందట! తాంబూలమద్దకనే ఆమె పెదవులు ఎరుపు రంగును పులుముకున్నాయట! కడలిలోని కల్లోలం తీరాన్ని తాకినట్లు, ఆమె పరిమళం మన  మహారాజుగారి శ్వాసను తాకి, ఆయన మనసును ఉప్పెనలా కమ్మేసిందట! మీరు వారిద్దరికీ స్వాగతం పలకాలని మహారాజు గారి వర్తమానం. ” అంటూ దద్గధ స్వరంతో చెప్పి తిరిగి మౌనం దాల్చింది నిశ్చల. కొన్ని క్షణాలపాటు అంతఃపురం మూగబోయింది.

                       మూగబోయిన అంతఃపురం మహారాణిగారి నడకతో తేరుకుంది. చెలికత్తెలతో కూడి మహారాజుగారికి ఆహ్వానం పలికేందుకు అంతఃపుర ముఖ ద్వారాన్ని చేరుకుంది. మహారాజు మధుచ్ఛదతో కలిసి సప్తాశ్వరథాన్ని అధిరోహించి వస్తుంటే, తొలిసారి ఆమెను పరికించి చూసింది గాథ.  నిశ్చల వర్ణించిన సౌందర్యానికి మించిన తేజస్సుతో వెలిగిపోతోన్న మధుచ్ఛదను చూసిన ఆమె కళ్ళు అసూయతో ఒక్క క్షణం రగిలిపోయాయి. కానీ మరుక్షణమే మహారాజుపై ఆమెకున్న అనంతమైన ప్రేమ ఆ క్రోధాగ్నిని చల్లార్చి ఆమె ముఖకమలంపై చిరునవ్వు వికసించింది. హారతి పట్టి ఇద్దరినీ అంతఃపురం లోనికి ఆహ్వానించింది. మధుచ్ఛదకు విశ్రాంతి మందిరం చూపించమని నిశ్చలను ఆదేశించింది. నిశ్చల ఆమెను తీసుకుని విశ్రాంతి మందిరానికి బయలుదేరింది. దుంధుమారుడు గాథను తన బిగి కౌగిట్లో బంధించి ” నేరం నాది కాదు! నా మనసుది. అది విశాలమై ఇలా మీ ఇద్దరికీ చోటు నిచ్చింది. నాపై అలకబునకు సుమా!” అంటూ గాథను ఊరడించే ప్రయత్నం చేస్తుంటే, గాథ మధ్యలోనే ఆపి “ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. మీకు విశ్రాంతి అవసరం. ముందు మీరు మీ విశ్రాంతి మందిరానికి దయచేయండి! ” అని అనునయించింది. మహారాజు ఆనందంతో గాథను హత్తుకొని తన మందిరం లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు.

                         *********

                        మరుసటి రోజు ఉదయం మహారాజు అంతరంగికుడు మంధుడు ఎంత పిలిచినా మహారాజు తలుపు తియ్యలేదు. వెంటనే  మంధుడు తన పరుగులో వేగం పెంచి మహారాణి మందిరానికి చేరుకున్నాడు . ఆందోళనగా ఉన్న మంధుడ్ని చూసి ” ఏమిటి విషయం? ” అని అడిగింది గాథ. “ఎంత పిలిచినా మహారాజు గారు తలుపులు తెరవడం లేదు. నా మనసు కీడు శంకిస్తోంది మహారాణి! మీరు త్వరగా రండి!” అన్నాడు మంధుడు. ఇద్దరూ కలిసి మహారాజు మందిరం వైపు వేగంగా వెళ్ళారు. అతి కష్టమ్మీద తలుపులు తెరిచారు. కానీ మహారాజు గదిలో కనిపించలేదు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. కానీ గదిలోకి వెళ్ళిన మహారాజు ఎలా మాయమయ్యారో వారికి అంతుబట్టడం లేదు! అంతఃపురం లోని అన్ని విశ్రాంతి మందిరాలను, అంతపురం బయట ఉన్న రాజ ప్రసాదాలనన్నింటిని తరచి చూశారు. కానీ మహారాజు జాడ ఎక్కడా కనపించలేదు. చూస్తుండగానే సంధ్యా సమయం ఆసన్నమయ్యింది. గాథ మనసులో ఆందోళన ప్రారంభమయ్యింది. చెలికత్తెలతో నిశ్చలకు కబురంపింది. నిశ్చల రావడంతో మధుచ్ఛద గురించి వాకబు చేసింది. “గత రాత్రి అంతా ఆమెతోనే గడిపాను మహారాణీ! ఆమె చాలా ముభావంగా ఉన్నారు. చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తున్నారు. మీరు కబురు పంపే వరకు నేను ఆమెకు సపర్యలు చేస్తూనే ఉన్నాను” అంది నిశ్చల. నిశ్చల మాటలు విన్న గాథ, మహారాజు కనపడక పోవడానికి, మధుచ్ఛదకూ ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించుకుంది. తిరిగి మధుచ్ఛదను సేవించమని నిశ్చలను ఆదేశించింది. నిశ్చల విశ్రాంతి మందిరానికి బయలుదేరింది. గాథ ఆదేశం కోసం అంతఃపురం బయట ఎదురుచూస్తున్న మంధుని వద్దకు వెళ్ళి ” మంధా! మహారాజుగారు అదృశ్యమైన ఈ విషయం ఎవ్వరికి తెలియనియ్యకు. తెలిస్తే రాజ్య శ్రేయస్సు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మహారాజు గురించి ఎవరైనా అడిగితే ఆయన మధుచ్ఛదతో నిశ్చయించుకున్న వివాహ నిర్ణయాన్ని వివరించి, ఆశీస్సులు తీసుకోవడానికి సింధువృషమహాముని ఆశ్రమానికి వెళ్లారని చెప్పు. ఈ లోపల మహారాజు గారి జాడ కనిపెడదాం. నా ఆజ్ఞ మీరితే నీకు శిరచ్ఛేదం తప్పదు! తెలుసు కదా!”  అంది గాథ. “అలాగే మహారాణి! ఇంక సెలవు! ” అంటూ మంధుడు అక్కడి నుండి బయలుదేరాడు.

                          మంధుడు బయలుదేరిన వెంటనే గాథ మహారాజు విశ్రాంతి మందిరానికి వేగంగా చేరుకుంది.  ఆ మందిరాన్ని అణువణువునా పరిశీలించింది. ఆ గదిలో ఏదైనా రహస్యం మార్గం ఉంటుందేమోనన్న ఆమె ఆశ, అడియాసయ్యింది. కానీ ఆమె నిరుత్సాహపడలేదు. మరింత ఏకాగ్రతతో ఆలోచించిన ఆమెకు, మహారాజు గారు ముందు రోజు ముగించిన దేశ పర్యటన గుర్తుకు వచ్చింది. ఆ పర్యటన గురించి తెలుసుకుంటే ఏదైనా సమాచారం దొరుకుతుందన్న ఆశ ఆమెలో చిగురించింది. ఉదయాన్నే వచ్చిన మంధునితో మహారాజు గారి పర్యటన వివరాల గురించి వాకబు చేసింది. “ఆ పర్యటన గురించి తనకేమీ తెలియదని,  అంగరక్షకులతో మరియు సేనాధిపతి సంధ్యాబలుడితో కలిసి మహారాజుగారు రహస్య పర్యటనకు వెళ్లారని, అంతకు మించి ఆ పర్యటన గురించి తనకేమీ తెలియదు” అని మంధుడు సమాధానమిచ్చాడు. “అలాగైతే మొదట ఆ అంగరక్షకులను నా ముందు ప్రవేశపెట్టు. నేను  వారిని విచారించాలి.” అని మంధుని గాథ ఆదేశించింది. “అలాగే మహా రాణి! “అని మంధుడు అక్కడి నుండి బయలుదేరాడు. మంధుడు అంగరక్షకులను చేరుకునే లోపల ఆరుగురు అంగరక్షకులూ విగత జీవులై పడి ఉన్నారు. అది చూసిన మంధుడు నివ్వెరపోయాడు.  అతని మనసులో మహారాజు గారికి హాని జరిగి ఉంటుందన్న తలంపు మొదలయ్యింది. క్షణమాలస్యం చెయ్యకుండా మహారాణి వద్దకు పరిగెత్తాడు. జరిగింది ఆమెకు వివరించిన వెంటనే, మహారాణి గాథ అనుమానమంతా సేనాధిపతి సంధ్యాబలుడి వైపుకు మళ్ళింది. అతన్ని పిలిచుకు రమ్మని మంధున్ని ఆదేశించింది. మంధుడు అతన్ని పిలుచుకు వచ్చి అంతఃపుర ముఖ ద్వారం వద్దకు చేరుకున్నారు. అంతే! ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన విషపు బాణం సంధ్యాబలుడి గుండెను చీల్చడంతో, అతడు అక్కడికక్కడే  కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామాన్ని కళ్ళారా చూసిన గాథ   నిర్ఘాంతపోయింది. మహారాజు రాజ్యంలో లేనప్పుడు సేనాధిపతి చనిపోయాడని తెలిస్తే రాజ్యంలో అస్థిర పరిస్థితులు నెలకొంటాయని భావించిన గాథ సేనాధిపతి మరణాన్ని రహస్యంగా ఉంచమని, అతడి పార్థివదేహాన్ని భద్రపరచమని మంధున్ని ఆదేశించింది. అందుకు సహాయకారులుగా తన అంగరక్ష వనితలను పంపింది.      

                        *******

                        ఉదయం నుంచి ఊపిరి సలపకుండా జరుగుతున్న ఈ వరుస పరిణామాల నేపథ్యంలో అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయింది గాథ. మహారాజు కనబడక పోవడానికి గల కారణాన్ని ఛేదించడంలో  సహాయపడడానికి, మధుచ్ఛద మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉందని గ్రహించింది. వెను వెంటనే మధుచ్ఛద విశ్రాంతి మందిరం వైపు దృష్టి సారించింది. మధుచ్ఛదను కలిసిన మహారాణి గాథ, మధుచ్ఛద పుట్టుపూర్వోత్తరాల గురించి వాకబుచేయగా , తనది ఇరవై క్రోసుల దూరంలోనున్న కారడవిలోని మర్మపురమనీ, ఒకరోజు తాను మర్మపురానికి దగ్గరలోనున్న జలపాతం వద్ద విహరిస్తుండగా,  తనను మహారాజు బలవంతంగా తీసుకు వచ్చాడని తెలిపింది. తన తల్లిదండ్రులు లోకం తెలియని అమాయకులనీ, వారు ఎలా ఉన్నారో? తెలియడం లేదని మహారాణి వద్ద వాపోయింది. గాథ ఆమెను ఓదార్చి తన తల్లిదండ్రులను అంతఃపురానికి రప్పిస్తానని మధుచ్ఛదకు మాట ఇచ్చింది. ఆ వెంటనే మహామంత్రి శ్రంధునికి, తనను కలవవలసినదిగా కబురు పంపింది.
                       
                         అంతఃపుర ముఖద్వారానికి చేరుకున్న శ్రంధునితో ప్రక్కనే ఉన్న సందర్శకుల గదిలో, మహారాజు కనపడక పోయినప్పటి నుండి జరిగిన పరిణామాలన్నింటినీ వివరించింది. అతడు మహారాణి చర్యలను సమర్థించి ఆమెకు అండగా నిలబడటానికి అంగీకరించాడు. ఈ మొత్తం వ్యవహారంలో మధుచ్ఛద చెప్పిన మర్మపురం గురించి మొదటి సారి వింటున్నానని, అలాగే  రాజవంశీయులలో కుశాగృడికి అమితమైన రాజ్యకాంక్ష ఉందని, ఈ రెండు అంశాలను మరింత సూక్ష్మంగా పరిశీలిస్తే మహారాజుగారి అదృశ్యరహస్యం తెలిసే అవకాశం ఉందని అన్నాడు. ఇంతలో ఒక బాణం శ్రంధుడికి వెంట్రుకవాసిదూరంలో దూసుకెళ్ళింది. ఆ బాణం  వచ్చిన దిశవైపు  చూడగా ముఖానికి ముసుగు ధరించిన వాడొకడు హుటాహుటిన గుర్రంపై వేగంగా వెళ్తూ కనిపించాడు. ఆ వెంటనే అక్కడే సిద్ధంగా ఉన్న అశ్వాన్ని అధిరోహించి మహారాణి ఆ ముసుగు మనిషిని వెంబడించింది. మహామంత్రి శ్రంధుడు కూడా మరో అశ్వంపై ఆమెను అనుసరించాడు. రాజప్రాసాదాలగుండా వెల్తున్న ఆ ముసుగు మనిషి సరిగ్గా కుశాగృడి భవనం వద్ద కనుమరుగయ్యాడు. దాంతో కుశాగృడిపై అనుమానం మరింత బలపడింది. ఇద్దరూ కుశాగృడి భవనంలోపలికి ప్రవేశించారు. లోపల ఏకాంతంగా ఉచితాసనంపై కూర్చొనిఉన్న కుశాగృడు వీరిని చూడగానే లేచి నిలుచుని “ఏమిటి మహారాణి! మహామంత్రితో కలిసి ఈ వేళలో, ఇలా వచ్చారు? ఆశ్చర్యంగా ఉందే! ” అని నింపాదిగా అన్నాడు. గాథ అతన్ని నిశితంగా పరిశీలించింది. ఇంత చలిలో కూడా అతని నుదుటిపైను చెమట, చేతిలోనున్న గొలుసును పదేపదే గుండ్రంగా తిప్పడం గమనించింది. మరుక్షణంలో అతని కంఠంపై కత్తి నుంచి, అతని గుండెవేగాన్ని పరిశీలించవలసిందిగా మహామంత్రిని ఆదేశించింది. అతని గుండె వేగాన్ని పరిశీలించిన శ్రంధుడు “అశ్వాన్ని అధిరోహించిన వారి గుండెలా ఇతడి గుండె కూడా వేగంగా కొట్టుకుంటోంది మహారాణీ!” అన్నాడు. “ఇంకా ఏమైనా ఆధారాలు లభిస్తాయేమో పరిశీలించు మహామంత్రీ!” అంది గాథ కత్తిని కుశాగృడి కంఠానికి మరింత దగ్గరచేస్తూ. మందిరాన్నంతా అన్వేషించిన శ్రంధుడు “మందిరంలో మరెవ్వరూ లేరు. పైగా ఈ మేలిముసుగు లభించింది. కావున ఇతడే ఆ ముసుగు మనిషయివుంటాడని నా అనుమానం” అని విన్నవించాడు. దాంతో రౌద్ర రూపం దాల్చిన గాథ కుశాగృడి కుడికాలును ఖండించింది. ఖండించబడిన చోటునుండి రక్తం ధారగా బయటికి వస్తుండగా కుశాగృడు నిలుచున్నచోటనే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో భీతావహుడైన కుశాగృడు “మహారాణీ! నన్ను క్షమించండి. మహారాజు కనపడటంలేదని వత్సల అనే చెలికత్తె ద్వారా తెలుసుకున్న నేను, రాజ్యకాంక్షతో మీరు మహారాజు కోసం చేస్తున్న అన్వేషణను అడ్డుకోవాలని అనుకున్నాను. అందుకే అనుక్షణం మీ కదలికలను పరిశీలిస్తూ అంగరక్షకులను, సేనాధిపతిని తుదముట్టించాను. చివరకు మహామంత్రిని కూడా చంపే ప్రయత్నం చేశాను. మహారాజు తిరిగి రాకపోతే రాజ్యాధికారం నా వశమే అవుతుందని నా ఆశ. అందుకే అలా చేశాను. అంతేకానీ, మహారాజు కనపడక పోవడంలో నా పాత్రలేదు” అన్న మరుక్షణమే నీలాంటి రాజు ద్రోహులను ఉపేక్షించను అంది గాథ. ఆ మరుక్షణంలోనే ఆమె కరవాలపు పదునుకు అతడి తల నేలకొరిగింది. ఆ వెంటనే వత్సలను బంధించమని మహామంత్రిని ఆదేశించింది. వత్సలను బంధించిన అనంతరం తెల్లవారుజామున కొంత మంది సైనికులను వెంటబెట్టుకొని మహామంత్రి శ్రంధుడు మర్మపురానికి బయలుదేరాడు.

                           *******

                           రానురాను సమస్య మరింత జటిలమవుతుండటంతో గాథ రహస్యాన్ని ఛేదించడంకోసం మహారాజు అంతరంగికుడు మంధునితో సమావేశమయ్యింది. “మహారాజు గారు తన మందిరంలో అదృశ్యమైన సంఘటనను పోలిన సంఘటనలు గతంలో ఏమైనా జరిగాయా? నీవిచ్చే సమాచారం పైనే ఈ రాజ్యం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎలాంటి విపరీత విషయమైనా చెప్పు” అని అడిగింది. “క్షమించాలి మహారాణి! మహారాజు గారి ఆంతరంగిక విషయామైనా రాజ్య శ్రేయస్సు దృష్ట్యా మీకు చెప్పక తప్పడం లేదు. మహారాజు స్త్రీలోలుడు. అందుకే  రోజుకొక అంతఃపుర కాంతను తన  మందిరంలోనికి ప్రవేశపెట్టమనేవారు. ఒక్కొక్కసారి మహారాజు గారు మాత్రమే గదినుండి బయటకు వచ్చేవారు. కానీ లోపలికి వెళ్ళిన అంతఃపుర కాంత మాత్రం ఎంత వెతికినా ఆ గదిలో కనబడేది కాదు. ఆమె ఎలా మాయమయ్యిందో నాకు అర్థమయ్యేది కాదు. అలాగని సాహసించి ఏ ఒక్క రోజు కూడా వారేమయ్యారు?  అని మహారాజును అడిగే ధైర్యం చేయలేకపోయాను.” అని మంధుడు  సమాధానమిచ్చాడు. ఆ మాటలు విన్న గాథ కళ్ళు ఎరుపెక్కాయి. కోపంతో చెక్కిళ్ళు వనకసాగాయి. కానీ తన మనసులోని ఆందోళనను అణిచివేసుకుంటూ మహారాజమందిరంలోని రహస్య మార్గం కోసం మరింత క్షుణ్ణంగా పరిశీలించ సాగింది. మంధుడు ఆమెను అనుసరించాడు. ఎంత వెతికినా రహస్య మార్గం కనిపించలేదు. చివరకు కాకతాళీయంగా వారి దృష్టి మహారాజు గారి హంసతూలికా తల్పంపై పడింది. ఇద్దరూ కలిసి దాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా అది కదిలేలా కనిపించలేదు. దాంతో వారి అనుమానం మరింత బలపడింది. కదిలించడానికి ఎక్కడైనా మీట లాంటి అమరిక ఉందేమోనని తరచి తరచి చూసిన వారికి ఒక చక్రం లాంటి అమరిక కనపడింది. ఆ అమరికను తిప్పే ప్రయత్నం చేశారు. అంతే ఆ హంసతూలికా తల్పం కిందికి జారిపోతూ నేలమాళిగలోనికి వెళ్ళింది. దీప కాంతులతో వెలిగిపోతున్న ఆ నేలమాళిగ ఇంద్ర భవనంలా ఉంది. అందులో సకల సౌకర్యాలు ఉన్నాయి. నేలమాళిగలోని ఉత్తరం వైపునున్న  గోడలో అమరి ఉన్న ఒక తలుపును తెరిచారు. దాంతో వారికి  మరింత క్రిందకు వెళ్లేందుకు మెట్లమార్గం కనపడింది. ఇద్దరూ కలిసి ఆ మెట్ల  మార్గం వెంట వెళ్ళి అక్కడున్న మరో గొళ్ళెం వేసిన తలుపులు తెరిచారు. లోపలికి వెళ్ళిన వారు నిశ్చేష్టులై నిలబడి పోయారు. ఆ చీకటి గదిలో వంద మందికి పైగా అంతఃపుర కాంతలు బంధీలై ఉన్నారు. కొన్ని రోజులుగా  అన్నపానీయాలు లేక అందరూ అవసానదశలో ఉన్నారు. వారిలో ఒక అంతఃపుర కాంతను  “మీరంతా ఎందుకు ఇలా బంధీలై ఉన్నారు?” అని అడిగింది గాథ. అందుకు ఆమె “మహారాజు గారికి పడక సుఖం అందించిన వారికే ఆ పూట అన్నపానీయాలు అందిస్తారు. మిగిలిన వారంతా ఇలా చీకటి గదిలో మగ్గి పోవాల్సిందే!” అని నిట్టూర్చింది. అది విన్న మహా రాణి కంట నీరు ఏరులై పారింది. వెంటనే తేరుకొని వారినందరినీ తీసుకొని మహారాజు విశ్రాంతి గదికి చేరుకుంది.  వారికి మంచి వస్త్రములను తెప్పించి, అన్న పానీయాలనందించింది.  వారిపై అపారమైన కరుణను చూపింది. ఏదో చెప్పాలని మంధుని కోసం వెదుకగా అతడు ఒక అతఃపుర కాంతకు సపర్యలు చేస్తూ కనబడ్డాడు. “ఈ అంతఃపుర కాంత ఎవరు?” అని గాథ అడుగగా “ఈమె నా భార్య” అని చెప్పిన మంధుని దద్గధ స్వరంపు మాటలు మహారాణి గాథ మనసును కలిచివేశాయి. ఆవేశంతో ఉన్న ఆమె పెదవులు ఆదరగా, ఆమె చేతులు చేవకు కరవాలం కకావికలమయ్యింది. మనసు కుదుట పరుచుకుని అందరినీ ఉద్దేశించి ఇలా అంది. ” మీకు జరిగిన అన్యాయం తెలిసిన తరువాత నాకు మహారాజు పై ఉన్న గౌరవం పోయింది. అతన్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాజ్యం అస్థిర పడకూడదు. అందుకే ఈ విషయాలన్నింటిని నేను ఆదేశించునంతవరకు గోప్యంగా ఉంచండి. మహారాజు దొరికిన వెంటనే అతన్ని తప్పక శిక్షిస్తానని మీకు మాట ఇస్తున్నాను. సహకరించండి.” అని చెప్పి కొందరు వీరవనితలు తీసుకొని తిరిగి నేలమాళిగలోనికి వెళ్ళిపోయింది గాథ.

                         *******

                        మహామంత్రి శ్రంధుడు కారడవిని చేరి, మర్మపురం కోసం వెదకసాగాడు. ఆకలిదప్పులతో అలమటిస్తున్న వారికి సెలయేటి గలగలలు వినిపించాయి. దాహం తీర్చుకోవడానికి వెళ్ళిన వారికి అతి మనోహరమైన జలపాతం కనిపించింది. అది వారి కనులకు విందు చేసింది. పైగా ఆ ప్రాంతంలో ఉన్న అనేక రకాల ఫల వృక్షములు వారి ఆకలిని తీర్చాయి. అల్లనేరెడు పండ్లతో కడుపు నింపుకున్న శ్రంధుడి మనసుకు, మధుచ్ఛద చెప్పిన జలపాతం ఇదే అయివుంటుందని అనిపించింది. కానీ మహారాజుగారు ఈ పరిసరాల్లోకి  ఏ కార్యంపై వచ్చారో అతనికి అంతుబట్టలేదు. ఏమైనా కానీ మర్మపురం ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుందనుకుంటూ ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని,  ఉదయాన్నే తిరిగి మర్మపురాన్ని వెదకడం మొదలు పెట్టాలని అనుకున్నాడు శ్రంధుడు.               

                    *********
      
                  మరో రహస్య మార్గం కోసం నేలమాళిగలోనికి వెళ్ళిన గాథ  ఎంతసేపు వెదికినా మరో రహస్యమార్గం కనబడక పోవడంతో నిరాశచెందింది. నిరాశతో తల్పంపై కూర్చున్న ఆమె దృష్టి కాకతాళీయంగా ఎదురుగానున్న దర్పణం పై పడింది. అది కొంచెం వక్రంగా ఒకవైపుకు  వాలినట్లుగా కనిపించింది. వెంటనే దర్పణం వద్దకు వెళ్ళి దాన్ని తొలగించే ప్రయత్నం చేసింది. అతి కష్టమ్మీద దర్పణం తొలగించగా లోపల ఒక స్వరంగ మార్గం కనిపించింది. అంతఃపుర వీర వనితలతో కలిసి గాథ  ఆ సొరంగ మార్గంలోనికి ప్రవేశించింది. దివిటీలు చేతబూని వారు  వెళ్తూ వుంటే, దారివెంటా వారికి రక్తమాంసములు కనిపించసాగాయి. వాటినుంచి వచ్చే దుర్గంధం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది.    అప్పటికే సొరంగమార్గం వెంట వారి ప్రయాణం రెండు ఘడియలు దాటింది.కాబట్టి ఇక్కడ ఉన్న రక్తమాంసములు  కేవలం మహారాజువయ్యే  అవకాశం లేదు. అంతదూరం ఒకే మనిషి రక్తపుధారలు అసంభవం. కాబట్టి అంతకుమించి ఏదో జరిగి ఉంటుందన్న అనుమానం గాథలో మొదలయ్యింది. 
కానీ సడలని ధైర్యంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి మహారాజు కోసం వారి అన్వేషణను  కొనసాగించింది గాథ.

                        *********

                        ప్రాతఃకాలంలోనే జలపాతం వద్ద నుండి మర్మపురాన్ని అన్వేషిస్తూ బయలుదేరిన శ్రంధునికి వెదురు కర్రలతో నిర్మించిన వందకు పైగా కుటీరాలున్న ఒక ప్రాంతం కనబడింది. మర్మపురం  అదే అయివుంటుందని నిర్ధారణకు వచ్చాడు శ్రంధుడు. కానీ జనావాసంగా ఉండాల్సిన ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో, పేరుకు తగినట్లే ఉన్న ఈ మర్మపురంలో, ఏదో రహస్యం దాగి వుందని శ్రంధునికి అనిపించింది. మధుచ్ఛద చెప్పినట్లు ఆమె అమ్మానాన్నల కోసం మర్మపురంలో అణువణువునా గాలించమని సైనికులను ఆజ్ఞాపించాడు. ఏ ఇల్లు వెదికినా ఒక్క నరమానవుడు కూడా కనిపించని వారికి ఒక ఇంట్లో మాత్రం వృద్ధదంపతులు కనిపించారు. పైగా కంటిచూపు లేని వారు మూడు నాలుగు రోజులుగా ఆహారం లేక నీరసించి ఉన్నారు. వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మంచంతో సహా వారిని తీసుకెళ్ళి శ్రంధుని ముందు ప్రవేశపెట్టారు సైనికులు. వారిని చూసిన శ్రంధుడు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. “విజయవర్ధన మహారాజా! ఆశ్చర్యంగా ఉందే! మీరు ఇంకా జీవించే ఉన్నారా! పడవ ప్రమాదంలో మీరు మరణించారని మహారాజు గారు చెప్పారు. అసలు ఏమి జరిగిందో చెప్పగలరా? అన్నాడు శ్రంధుడు. “ఎవరిది? నన్ను గుర్తించిన మిమ్ములను కంటిచూపు మందగించడం వలన నేను గుర్తించలేకున్నాను. మీరెవరో చెప్పండి?” అన్నాడా వృద్ధుడు. “మహారాజా! నేను మహామంత్రి శ్రంధుడను. మీ పరిపాలనలో రాజ్యం సురక్షితంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏమీ బాగోలేవు. అయినా ఆ సంగతులెందుకులేండి. ముందు మీ గురించి చెప్పండి” అన్నాడు శ్రంధుడు. “మహామంత్రీ!  బాగున్నావా! నా గురించి ఏమి చెపమంటావు? పసిబిడ్డతో వనవిహారానికి వచ్చిన నాపై, నాభార్య పై విషప్రయోగం చేశాడప్పటి నా సేనాధిపతైన నా మేనల్లుడు దుంధుమారుడు. అతడు ప్రయోగించిన విషప్రభావం వలన స్పృహ తప్పిన నన్ను, నా భార్యను , ఉగ్గుపాలు తాగే నా పసిబిడ్డతో సహా ఒక చిన్న పడవలో పడవేసి పోటెత్తిన విరజానదిలోనికి విడిచిపెట్టాడు. కాలం కలిసి రావడంతో ఈ గిరిజనులు మా ప్రాణాలు కాపాడారు. విషం ప్రభావం వలన మేము ఇలా అంధులమయ్యాము. కూతురు భవిష్యత్తు కోసం రాజ్యకాంక్షను వదిలిపెట్టి ఇదిగో ఇలా ఈ మర్మపురంలో జీవిస్తున్నాం. కానీ గత నాలుగు రోజులుగా నా కుమార్తె మధుచ్ఛద కూడా కనపడలేదు.” అని కంటతడి పెట్టాడు  విజయవర్థన మహారాజు. అతని దుస్థితిని చూసిన శ్రంధుడు ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు. “మహారాజా! మీరు కంగారు పడవలసిన పనిలేదు. మీ మధుచ్ఛద మన అంతఃపురంలో సురక్షితంగా ఉంది. ఆమెను మీ వద్దకు చేర్చే పూచీ నాది. మీరు నిశ్చింతగా ఉండండి.” అని అనునయించగానే విజయవర్థన మహారాజు శ్రంధున్ని అమితానందంతో  ఆలింగనం చేసుకున్నాడు.

                    *******

                     సొరంగ మార్గంలో అన్వేషిస్తున్న గాధకు ముందుకుసాగే కొద్దీ వస్తున్న ఎడతెగని రక్తమాంసపు దుర్గంధం ఆందోళన కలిగించింది. అలా నలభై ఘడియల సుదీర్ఘ అన్వేషణ అనంతరం సొరంగమార్గం ఒక అడవిలోనికి తెరుచుకుంది. అడవిలోనికి ప్రవేశించినంతనే భరించలేని దుర్గంధము వారిని భయపెట్టింది. చుట్టూ పరిశీలించగా వారికి  ఒకచోట దారుణంగా చిత్రహింసలకు గురిచేసి చంపబడ్డ వందకుపైబడిన శవాలు గుట్టలుగుట్టలుగా  కనబడ్డాయి. వారిలో పురుషులతో పాటు వృద్ధులు, స్త్రీలు ఆఖరికి పసిపిల్లలు కూడా ఉన్నారు. వారంతా సామాన్య ప్రజలుగా అనిపించారు గాథకు. ఇంతటి విళయం సృష్టించిన వారెవరైనా ఉపేక్షించకూడదని తన మనసులో అనుకుంది గాథ. అప్రయత్నంగా ఆ ప్రాంతంలోని నేలను పరిశీలించిన ఆమెకు సప్తాశ్వరథపు జాడతో పాటు కొన్ని గుర్రపుడెక్కల జాడలు కనిపించాయి. దాంతో ఈ ప్రాంతంలో మహారాజు సంచరించాడని రూడీ చేసుకున్న గాథ మహారాజును అన్వేషిస్తూ మరింత ముందుకు సాగింది. ఒక ఘడియ గడిచేసరికి ఆమె ఒక జనావాసానికి చేరువయ్యింది.  అక్కడున్న తన సైనికులతోపాటు మహామంత్రిని చూడగానే ఆమెకు అది మర్మపురమని అర్థమయ్యింది. అలాగైతే  మహారాజుగారి అదృశ్యానికి కారణం మధుచ్ఛదేనా! ఆమె కళ్ళలో కనబడిన సత్యం నా భ్రమమాత్రమేనా! అనే అయోమయంలో పడిపోయింది గాథ. ఏది ఏమైనా కానీ, తన అన్వేషణను గోప్యంగా ఉంచుతూనే జరిగిందేమిటో తెలుసుకోవాలనుకుంది. తన వెంట వచ్చిన వీరవనితలను మౌనందాల్చమని ఆదేశించింది.

              మహారాణి గారిని చూసిన మహామంత్రి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. “మహారాణీ! మీరు ఇక్కడికి రావడం నన్ను ఆశ్చర్యపరుస్తోంది! మహారాజు గారి జాడ ఇంకా తెలియరాలేదు. కానీ ఈ మర్మపురం మనకు ఒక రహస్యాన్ని బట్టబయలు చేసింది. ఈయన ఎవరో కాదు. మన మహా రాజు గారికి స్వయానా మేనమామైన విజయవర్ధనులవారు. వీరే అతఃపురంలోని మధుచ్ఛదయొక్క తల్లిదండ్రులు. మనం వీరు మరణించారని ఇన్నాళ్ళూ అనుకుంటున్నాము” అంటూ విజయవర్ధన మహారాజుగారి వృత్తాంతాన్ని మహారాణికి గాథకు  వివరించాడు శ్రంధుడు. “మహామంత్రి గారు సైనికులను పంపించండి. మనం ఏకాంతంగా చర్చించవలసిన అవసరం ఉంది.” అని మహారాణి అనగానే సైనికులంతా పక్కకు వెళ్ళి వారికి ఏకాంతాన్ని కలుగజేశారు. తదనంతరం శ్రంధునితో ఇలా అంది. “మన మహారాజు కనపడని విషయాన్ని గురించి వీరితో ప్రస్తావించారా! అందులో వీరి పాత్ర ఏమైనా ఉందా? అసలు మర్మపురం లో వీరిద్దరు తప్ప  ఇంకెవ్వరూ కనిపించడం లేదెందుకని? మీరు ప్రశ్నించారా?” అని అడుగగా విజయవర్ధన మహారాజు సమాధానమిస్తూ “మహారాణీ! నా ఒక్కగానొక్క కుమార్తే మా సర్వస్వమని ఈ కారడవిలో తల దాచుకున్న అంధులము మేము.  మహారాజును మాయం చేసేంత శక్తి మాకు లేదు. ‘రాజ్యం వీర భోజ్యం’ అని తెలిసిన క్షత్రియుడను నేను. మాకు ఇప్పుడు, ఎటువంటి రాజ్యకాంక్షా లేదు. మేము అజ్ఞాతంలో ఇలా జీవిస్తుండగా ఒకరోజు మహారాజు దుంధుమారుడు మరియూ అతడి  సేనాధిపతి సంధ్యాబలుడు కొంత మంది సైనికులతో కలిసి ఈ మర్మపురానికి వచ్చారు. ఆ సమయంలో మేము వారికి కనబడకుండా జాగ్రత్త పడ్డాము. వారు ఈ మర్మపురవాసులతో ‘రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ఒక సొరంగ మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. దానికి మీరు సహకరిస్తే నీకు ఎనలేని సంపదను వజ్రవైడూర్యాలను ప్రతిఫలంగా ఇస్తాము.’ అని ఆశ చూపారు. కష్టం తప్ప సుఖం తెలియని ఈ అమాయక ప్రజలకు వచ్చే ఆ సంపదను దూరం చేయాలని నాకనిపించలేదు. అందుకే వారిని నేను వారించలేక పోయాను. ఆనాటి నుంచి ఈ మర్మపురంలో మా ముగ్గురితో పాటు, మాకు రక్షించేందుకు నియమించబడ్డ విష్వక్సేనుడు తప్ప మరెవ్వరూ లేరు. గత నాలుగు రోజులనుంచి మధుచ్ఛదతో పాటు విష్వక్సేనుడు కూడా కనిపించడం లేదు. మధుచ్ఛద దుంధుమారునితో కలిసి అంతఃపురం చేరిందని శ్రంధుడు చెప్పగా విన్నాను. కానీ విష్వక్సేనుడి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు.” అని ముగించాడు విజయవర్ధన మహారాజు. అంధుడైనాకూడా అతడి కళ్ళలో నిజాయితీని గుర్తించిన గాథ మనస్సుకు మధుచ్ఛద  విషయంలో తన అంచనా సరైనదేనని  అనిపించింది.  అదే సమయంలో ఆమెకు విష్వక్సేనుని మీద అనుమానం మొదలయ్యింది. ఇంతలో అక్కడికి ఒక అశ్వం వచ్చి ఆగింది. ఆ అశ్వం నుంచి దిగిన వ్యక్తి దివ్యతేజస్సుతో వెలిగి పోతున్నాడు. దేహదారుఢ్యంలో మహావీరులను కూడా  మరిపిస్తున్నాడు.  అతడి కళ్ళల్లో ఆమెకు విజయగర్వం కనిపించింది. అతడి చిరునవ్వును బట్టి తన భర్త అదృశ్యమవ్వడానికి అతడే కారణమేమో అనిపించింది మహారాణి గాథకు. అతడి మహారాజా! అన్న పిలుపుతో అంధుడైన విజయవర్ధనుడు ఆప్యాయంగా ఆలింగనం కోసం పరితపించడం చుస్తే అతడే విష్వక్సేనుడని మహారాణి గాథకు అర్థమయ్యింది. మరుమాట మాట్లాడకుండా గాథ వారందరిని తన రాజ్యానికి తీసుకెళ్ళింది.

                   *******

                  వారందరిని మధుచ్ఛద ఎదుట ప్రవేశ పెట్టిన గాథకు విష్వక్సేనుడు, మధుచ్ఛదల మధ్యనున్నన్న ప్రేమ గురించి తెలిసింది. ఆ వెంటనే మధుచ్ఛద, విష్వక్సేనుల వివాహం ఘనంగా జరిపించింది. వారి వివాహం అనంతరం రాజ్యంలోని యావత్తు ప్రజలతో ఒక గొప్ప సభను ఏర్పాటు చేసింది. ఆ సభలో ” నా పతిదేవుడైన మహారాజు దుంధుమారుల వారు కొన్ని విపత్కర పరిస్థితులలో మరణించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మన అదృష్టవశాత్తు మహారాజుగారి మేనమామ మరియూ మన మధుత్రయ సామ్రాజ్యపు పూర్వపు మహారాజు శ్రీ విజయవర్ధనుల వారు తిరిగొచ్చారు. కావున ఆయనను ఈ మధుత్రయ రాజ్యానికి మహారాజుగా ప్రకటిస్తున్నాను. అలాగే మన రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా బుద్ధికుశలుడు, మహాబలసంపన్నుడైన  విష్వక్సేనుడిని నియమిస్తున్నాను. అలాగే ఈ రాజ్యాన్ని గాధేయ మహారాజు వారి సామంత రాజ్యంగా ప్రకటిస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను.” అని ప్రకటించిన గాథ తన తండ్రి గాధేయ మహారాజు వద్దకు పయనమయ్యింది. దారి వెంట ఆమె మనసులో తను చేసినది సరైనదో? కాదో? అని ఎంతో సంఘర్షణ చోటుచేసుకుంది. తన భర్త విజయవర్ధన మహారాజుకు చేసిన మోసం అలాగే రహస్య స్వరంగ  మార్గాన్ని నిర్మించిన వారిని వధించడం వంటి చర్యలను రాజనీతిగా అభివర్ణించుకున్నాగానీ వృద్ధులను, పసిపిల్లలను వధించడం, అంతఃపుర కాంతలను కూడా చిత్రహింసలకు గురి చేయడం క్షమించరాని నేరంగా ఆమెకు తోచింది. ఒకవేళ మహారాజు తిరిగివచ్చినా అతడిని కఠినంగా శిక్షించాల్సి వచ్చేది. కావున మహారాజు దుంధుమారుడి చావుకు కారణమైన వారిని ఉపేక్షించడం సబబే అని తన మనసుకు సర్ది చెప్పుకుంది. గొప్పరాజనీతిని ప్రదర్శించి తన భర్తకు అపఖ్యాతి రాకుండా, అలాగే న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్న పితృ సమానులైన విజయవర్ధనులవారికి, అదే సమయంలో  శత్రుసమానుడైన విష్వక్సేనుడికి   రాజ్యాధికారాన్ని కట్టబెట్టి తన చెక్కుచేతల్లో ఉండే తన సామంతులుగా చేసుకున్నందుకు విజయగర్వంతో తలెత్తి చిరునవ్వు నవ్వి తనలోని సంఘర్షణకు ముగింపు పలికింది.

                    *******

                   “మహారాజు దుంధుమారుడి అదృశ్యం వెనుక ఉన్నది నువ్వేనా?” అన్న మధుచ్ఛదతో  “ఇదే నేను నీకు ఇచ్చే మరపురాని బహుమానం. అయినా పసివాళ్ళను చంపిన పాపం ఊరికే పోతుందా? అన్నట్లు మరచిపోయా! నాకు చాలా పనులున్నాయి. వెంటనే మనకు సహాయం చేసిన వత్సలను  విడుదల చేయించాలి. అలాగే రాజవైద్యులను పిలిపించి మీ తల్లిదండ్రులకళ్ళకు పోయిన వెలుగులను మళ్ళీ రప్పించాలి. నీవు సంధ్యా సమయం వరకు నాకోసం వేచి చూడక తప్పదు.” అంటూ ఆ సభాస్థలి నుండి విశ్వక్సేనుడు నిష్క్రమించాడు.

                      *******

దర్పణం శ్రీనివాస్

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన వారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. కడప జిల్లా పెద్దముడియం మండలం భూతమాపురం గ్రామంలో పనిచేస్తున్నారు. 2010 సంవత్సరంలో 'దర్పణం 60' అనే కవితా సంపుటి ద్వారా తొలిసారి రచనా రంగంలోకి ప్రవేశించారు. ఆ తరువాత తొలి రచననే ఇంటి పేరుగా మార్చుకున్నారు.  వైజ్ఞానిక ఆధ్యాత్మిక వ్యాసాలతో తన రెండవ రచనను తెలుగు మరియు ఇంగ్లీషు భాషలలో "నీవే అద్భుత లోకం" మరియు "ది వండ్రస్ ల్యాండ్" గా ప్రచురించారు. అనంతరం  2023 లో "అలుగోగు కథలు" అనే కడప యాసలో రాసిన  ఒక కథా సంపుటి విడుదలై  ప్రశంసలు అందుకుంది. అలుగోగు వంక పరిసరాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ప్రేరణతో; అక్కడి సంస్కృతిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్లో  "శంభలా నగరం" అనే నవల విడుదలై అత్యంత ప్రజాదరణ పొందింది


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *