ఆఁ!

Spread the love

“ఆఁ…” అని నోళ్ళు తెరచుకున్నాయి మొసళ్ళు. వాటి సగం శరీరాలు నీళ్ళలోనూ సగం శరీరాలు వొడ్డుమీదా వున్నాయి.

          పిట్టలు మొసళ్ళ నోళ్ళల్లో వాలి వాటి పల్ల సందుల్లో యిరుక్కున్న ఆహారపు రవ్వల్ని ముక్కుతో పొడిచి తీసి తింటున్నాయి. అటు మొసళ్ళ నోళ్ళు అంటే పల్లు చక్కగా శుభ్రం అయిపోతున్నాయి. ఇటు పిట్టల చిన్ని పొట్టలు యెంచక్కా నిండిపోతున్నాయి.

          “ఈ మొసలి మనల్ని తినెయ్యదా?, మనం దాని నోట్లో నాలుక మీదనే వున్నాం కదా?” అంది లేత పిట్ట, బెరుకుగా.

          “తినదు, తింటే పంటి కిందికి కూడా మనం రామని దానికి తెలుసు” అంది ముదర పిట్ట. “పైగా మనం చేసేది దానికి వుపయోగపడే పని. మొసళ్ళు వాటి పల్లు అవి శుభ్రం చేసుకోలేవు” అని కూడా అంది. “అంటే, మనం లేకుంటే మొసళ్ళ పల్లు పాడయిపోయి తినలేక త్వరగా చచ్చిపోతాయి, అంతేనా?” అడిగింది కుర్ర పిట్ట. “అంతే… అంతే, యీ మొసళ్ళ ఆరోగ్యం మనమీద ఆధారపడి వుంది, మన పిట్ట జాతే తరాల తరబడి మొసళ్ళ జాతిని కాపాడుతోంది” అంది నడిమి పిట్ట.

          “మన మాటల్ని యీ మొసలి వింటే?” అని భయంగా అడిగింది లేత పిట్ట.

          “నీ మొకం, పిట్ట భాష వేరు. మొసలి భాష వేరు” దానికి అర్థం కాదన్నట్టు ముదురు పిట్ట నిర్లక్ష్యంగా రెక్క విదిల్చింది. ఆపై మొసలి అంగుడులో వున్న నల్లమచ్చని చూసి పురుగు అనుకొని భ్రమించి గట్టిగా ముక్కుతో పొడిచి చిన్న కండలాగింది. అంతే… నాలుగు పిట్టల్ని చప్పరించిన నాలుక అంగుట్లోంచి అరక్షణంలో పొట్టలోకి జార్చేసింది.

          “అదేం పని? అంత ఆకలిగా వుందా?” అడిగింది పక్క మొసలి. పిట్టల్ని తిన్న మొసలి తేన్చింది.

          “పరాకున తిన్నావా?” యీ పక్కనున్న మొసలి.

          “నేను ఆవలింత తీసి, నోరు మూశాను… అంతే. అయినా అవి నోరు మూస్తున్నప్పుడు అప్రమత్తంగా వుండి యెగరాలి కదా?, రెక్కలున్నది దేనికి?” అంది పిట్టల్ని తిన్న మొసలి.

          “లేదు, నీకు వేటాడే వోపిక కూడా లేనట్టుంది” అని ఆ పక్కనున్న మొసలి అంది.

          “పిట్ట మాంసం నేనెప్పుడూ రుచి చూడలేదు” అంది యీ పక్కనున్న మొసలి.

          “దానికి అంత ఆలోచన దేనికి? ఒకసారి గుటుక్కు మనిపించు…” అంది పిట్టల్ని తిన్న మొసలి.

          “తప్పు తప్పు…” అంది పక్క మొసలి.

          “నువ్వేమయినా నీళ్ళు తాగి బతకగలవా? నీచు తినే బతకాలి. భగవంతుడు మనల్ని అలా పుట్టించాడు. లేదంటే చస్తాం” అంది పిట్టల్ని తిన్న మొసలి.

          “నువ్వు చేసిన పనికి కూడా చస్తాం!” అంది యీ పక్క మొసలి.

          “నేనేం చేశాను?” తిరిగి అడిగింది పిట్టల్ని తిన్న మొసలి.

          “మన పల్లల్లో యిరుక్కున్నవి తీసి మనకి సేవ చేస్తున్న పిట్టల్ని తింటే, మరో పిట్ట వచ్చి వాలుతుందా?” అంది ఆ పక్కనున్న మొసలి.

          “ఔను, భయపడి పిట్టలు రావడం మానేస్తే?” అంది యీ పక్కనున్న మొసలి.

          పిట్టల్ని తిన్న మొసలి మళ్ళీ నోరు తెరచింది. మరికొన్ని పిట్టలు వచ్చి వాలాయి. అయ్యో, మా పూర్వీకులు యిక్కడే అసువులు బాసారని అవి ఆగలేదు. “మనం లేకపోతే మొసళ్ళ జాతి యేనాడో అంతరించి పోయేది” అంది మరో కుర్ర పిట్ట. “ఈ మొసలి పుంజిడు పిట్టల్ని యిందాకే తినేసింది తెలుసా?” మరో లేత పిట్ట భయంతోనో వుక్రోషంతోనో వణుకుతూ అడిగింది. “అదంతా నీ భ్రమ. భయం. మన పూర్వీకులు యిదే చేశారు, మనమూ యిదే చెయ్యాలి” గొంతులో ఖచ్చితత్వంతో అంది మరో నడీడు పిట్ట. “ఇది మన జాతి విద్యుక్తధర్మం” అంది మరో ముదర పిట్ట.

అలా ఆ నాలుగు పిట్టలూ ఆకలితో ఆత్రంతో అవి పల్ల సందుల్లో యిరుక్కొని ఆనవాలుగా మిగిలిన తమ జాతిని, ఆహారముగా స్వీకరించాయి.

          అలా విధి నిర్వహణలో వున్న మరో నాలుగు పిట్టల్ని గుటుక్కుమనిపించింది పిట్టల్ని తిన్న మొసలి.

          మిగతా పిట్టలు మొసళ్ళ నోళ్ళమీంచి యెగిరిపోలేదు. కొన్ని బెదిరి యెగిరినా కాసేపటికి మళ్ళీ వచ్చి వాలాయి. పల్లలోని పదార్థాన్ని చక్కగా దొలిచి తీస్తూ తింటున్నాయి పిట్టలు.

          ఇంక తను మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్టు పిట్టల్ని తిన్న మొసలి యేమీ మాట్లాడలేదు.

          మిగతా మొసళ్ళకి యింతో అంతో అర్థమయ్యింది కాని పాపం పిట్టలకే అర్థం కాలేదు?!

బమ్మిడి జగదీశ్వరరావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *