ఒక కుటుంబ వ్యవహారం

Spread the love

న్యూయీ స్టీల్ ట్రామ్, పోర్ట్ మై యోన్ ను దాటి వెళుతున్నది.అడ్డువచ్చినవి తొలగిపోవాలని కూత వేస్తోంది -ఊపిరాడని వ్యక్తి రొప్పుతున్నట్టు పొగ వదులుతూ. దాని పిస్టన్లు  వేగంగాపైకి కిందికి కదులుతూ ఇనుప కాళ్లు పరిగెడుతున్న శబ్దాలు చేస్తున్నాయి. ఆ రైలు విశాలమైన రోడ్లను దాటుకుంటూ సెయిన్ వరకు వెళ్తుంది. అది జూలై నెల చివరి రోజులు కావడంతో, ఊరంతా ఒకటే ఉక్కపోతగా ఉంది. ఎక్కడా గాలి కదలడం లేదు. తెల్లగా సుద్ధ లాంటి ధూళి ఊపిరాడనివ్వడంలేదు;చర్మానికి అతుక్కుపోతోంది,కళ్ళనిండా చేరుతోంది,ఊపిరితిత్తుల్లోకి కూడా వెళుతున్నది.జనాలు ఇళ్ల బయట గుమ్మాల దగ్గర నిల్చని గాలి పీల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

స్టీమ్ ట్రామ్ తలుపులన్నీ తీసి ఉన్నాయి.గాలికి అటూఇటూ కదులుతున్నాయి. లోపల చాలా కొద్ది మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. జనాలంతా బయట తిరగడానికి, ప్లాట్ ఫారాల మీద ఉండడానికి ఇష్టపడుతున్నారు. కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్లు బొద్దుగా,చిత్రమైన బట్టలు వేసుకొని ఉన్నారు. వారు ఊరి చివరలో ఉండే షాపులవాళ్ళ భార్యలు అని ఇట్టే తెలిసిపోతుంది. వారిలో తెచ్చిపెట్టుకున్న హుందాతనం మచ్చుకు కూడా లేదు. పురుషులు ఆఫీసులలో పనిచేసి చేసి అలసిపోయి, ముఖాలన్నీ మడ్డి కొట్టుకుంటూ ఉన్నాయి;డెస్క్ మీద వంగి ఎక్కువసేపు రాయడం వలన వాళ్ళ భుజాలన్నీ వంగిపోయి- ఒక భుజం పైకి  మరో భుజం కిందికి-ఉన్నాయి. వారి మొహాలు కష్టాలతో సతమతమవుతున్నట్టు, ఎప్పుడూ డబ్బుల కోసం వెతుక్కుంటున్నట్టు, ఆశలన్నీ అడియాసలయినట్టు, ఉదాసీనంగా విచారంగా ఉన్నాయి. వాళ్లంతా  తక్కువ ధరలకు వచ్చే చవకబారు వస్తువులతో సరిపెట్టుకొని, తప్పనిసరి అవసరాలకే ఖర్చు చేసే వారు. పారిస్  శివార్లలో  ప్లాస్టరింగ్ కూడా లేని ఇళ్లలో ఉండేవాళ్ళు; వాళ్ళ ఇళ్ల చుట్టూ చిన్న చిన్న తోటలయితే ఉండేవి కానీ వాటిలో అందమైన పూలమొక్కలు పెంచడానికి ఏనాడూ ఏ మాత్రం  శ్రద్ధ పెట్టేవారు కాదు. అంతేకాదు,వాటి మధ్యలో మానవ మల విసర్జనాలు కూడా ఉండేవి. 

ఒక పొట్టి, లావాటి మనిషి, ఉబ్బుగా ఉన్న మొహంతో, నల్లటి లెనిన్ సూట్ వేసుకొని, కోటు బటన్ కి చిన్న అలంకారం పెట్టుకుని ఉన్నాడు. అతడు, పొడుగ్గా సన్నగా, తెల్లటి మురికి లెనిన్ సూట్, దానిపై గుండీలు లేని కోటు వేసుకుని, తలపై తెల్లటి పనామా టోపీ పెట్టుకున్న మనిషితో మాట్లాడుతున్నాడు. రైతు ఎంత నెమ్మదిగా, తడబడుతూ మాట్లాడుతున్నాడంటే,అతనికి నత్తి ఉందేమో అని అనుమానం వస్తుంది. అతని పేరు మాన్జీయర్ కెరొవాన్. అతను అడ్మిర్యాలిటీ(నౌకాదళంలో)లో ప్రధాన క్లర్క్. రెండో వ్యక్తి ,గతంలో ఒక వ్యాపార నౌకా బోర్డులో సర్జన్ గా పనిచేశాడు. సాహసాలతో నిండిన అతని గత జీవితానికి ముందెప్పడో వైద్య విద్య చదివాడు. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నికృష్ట  జీవితాలు గడుపుతున్న పేద ప్రజల మీద ప్రయోగిస్తున్నాడు.అతని నైతికత పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 

మాన్షియర్ కెరొవాన్ ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి జీవితాన్ని గడిపాడు. గత 30 ఏళ్లుగా అతను పొద్దున్న ఒకే సమయంలో ఆఫీసుకు వెళ్ళాడు, ఒకే రకమైన వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కలిసాడు, ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో ఇంటికి ఒకే దారిలో నడిచి వచ్చాడు. ఒకే రకమైన మొహాలు చూస్తూ చూస్తూ ముసలివాడు కూడా అయ్యాడు. ప్రతిరోజు ఉదయం ‘సెయింట్ హనూరి’ మూలమీద ఒక పెన్నితో వార్తాపత్రిక, దానితో పాటు రెండు రోల్స్ కొనుక్కొని వచ్చేవాడు. తన ఆఫీసుకు ఏదో నేరం చేసినవాడిలాగా వెళ్లి, తన స్థానంలో కూర్చునేవాడు. ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నట్టే కనిపించేవాడు. సరిగ్గా పనిచేయలేదని ఎవరైనా తిడతారేమో అన్నట్టు ఒదిగొదిగి  ఉండేవాడు. 

ఏ మార్పూ లేని తన జీవితాన్ని మార్చుకోవడానికి ఏనాడూ ప్రయత్నించలేదు. జీవితంలోని ఏ సంఘటనా తన ఆఫీసు పనిని, ఇతర ప్రయోజనాలను- గ్రాట్యూటీ, పదోన్నతులు, వంటి వాటిని-ప్రభావితం చేయలేదు. ఆఫీసులో గానీ ఇంట్లో గానీ డ్యూటీ విషయం తప్ప మరో విషయం మాట్లాడేవాడు కాదు. అతడు ఏ ఆస్తిపాస్తులు లేని తన సహ ఉద్యోగి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. నిరుత్సాహంగా సాగే అతని జీవితంలో ఆఫీసు పని తప్ప వేరే ఏ విషయానికీ చోటు ఉండేది కాదు. ఆఫీసుకు సంబంధించిన పనులు తప్ప ఏ ఇతర ఆశలు, కలలు ఉండేవి కావు. దీనివల్ల అతని జీవితం ఏ సరదాలు సంతోషాలు లేకుండా చేదుగా గడిచింది. ఆ రోజుల్లో చాలామంది నేవల్ ఆఫీసర్ల జీవితాలు అలాగే ఉండేవి. మొదటి తరగతి గుమస్తాలుగా ఉండటం వలన, వారు వెండి అల్లికలు ఉన్న డ్రెస్ వేసుకునే వారు. అందువలనే వారిని ‘టీన్ స్మిత్’ అని కూడా పిలిచేవాళ్ళు. ప్రతిరోజు రాత్రి భోజనం చేసే సమయంలో తన భార్యతో ఆరోజు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పి ఘాటుగా చర్చించేవాడు. ఆమె దగ్గరే తన కోపాన్నంతా వెళ్లగక్కేవాడు. నేవీలో పనిచేయాల్సిన వాళ్లందరికీ పారిస్ లో ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయమని అతని వాదన. 

ఇప్పుడు అతను బాగా పెద్దవాడయిపోయాడు. జీవితం అంతా ఎలా గడిచిపోయిందో గమనించనే లేదు. స్కూల్ కి వెళ్ళే బదులు ఆఫీసుకి వెళ్లాడు.అంతే. ఆ మధ్య కాలంలో జరిగిన మార్పు అంటూ పెద్దగా ఏమీ లేదు. ఒకప్పుడు ఉపాధ్యాయుడిని చూసి బెదిరిపోయేవాడు.ఆతరువాత అధికారులను చూసి భయపడ్డాడు. నియంతృత్వ అధికారుల గదులలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు తల నుంచి అరికాళ్ళ వరకు వణికిపోయేవాడు. అలా వారి ముందు ఎప్పుడూ భయపడుతూ ఉండడం వలన,అతని నడత వికారంగా తయారయింది; ఆందోళనతో మాటలు తడబడుతూ ఉండేవి.  

అతనికి పారిస్ గురించి ఓ గుడ్డివాడికి తెలిసినదాని కన్నా ఎక్కువ తెలియదు -గుడ్డివాడికి దారి చూపించే కుక్క, అతనిని ప్రతిరోజు ఒకే స్థలానికి తీసుకెళ్లడం వలన అతనికి మరో విషయం తెలిసే అవకాశం లేదుకదా . అతను రోజూ  కొనుకొచ్చుకునే పైసా ఖరీదు చేసే వార్తాపత్రికలో ఏ అసాధారణ సంఘటన గురించో, అపవాదు గురించో పడితే, అతనికి అది ఒక అద్భుతమైన కథనం లాగా అనిపించేది.అవి ప్రెస్ వారు ఉద్యోగులను సంతోషపెట్టడానికి రాసిన కట్టు కథలలాగా అనిపించేవి.అతడు వార్తా పత్రికలో రాజకీయ వార్తలను చదవడు; పత్రిక తన రాజకీయాలను తరచుగా మారుస్తూ ఉంటుంది;నిధులు ఇచ్చే రాజకీయాల వార్తలు మాత్రమే ఉంటాయి. అతనికి కొత్తదనం అంటే కిట్టదు.ప్రతిరోజు చాంప్ ఎలీసిస్ ఎవెన్యూ దాటి వెళుతూ నడకదారిలో వెళ్తున్న జన సందోహాన్ని చూసేవాడు. అదే సమయంలో ఆవిరితో నడిచే బండ్లను కూడా ఆశ్చర్యంగా చూసేవాడు-ఒక కొత్త ప్రదేశంలో దారి తప్పిన ఒక ప్రయాణికుడు చూసినట్టే. 

ఆ సంవత్సరం జనవరి నెల మొదటి తేదీ కి అతడి 30 ఏళ్ల సేవాకాలం ముగిసింది. అతనికి ‘లిజియన్ ఆఫ్ ఆనర్’ బిరుదు ఇచ్చారు. పాక్షిక సైనిక కార్యాలయాల్లో, బానిసల లాగా తలఎత్తకుండా, సీట్లలో కదలకుండా కూర్చుని పనిచేసే వారికి ఇచ్చే బిరుదు అది. అనుకోకుండా దక్కిన ఈ గొప్ప గౌరవం, తన సమర్థతను గురించిన అతని అంచనాలని పూర్తిగా తారుమారు చేసింది. అతడు ఇదివరకు వేసుకునే ఫాన్సీ వెయిస్ట్ కోట్లు గాని, లేత రంగు ప్యాంట్లు గాని వేసుకోవడం మానేశాడు. నల్లటి ట్రౌజర్లు, పొడుగాటి కోట్లు వేసుకోవడం మొదలుపెట్టాడు. వాటిపై కొట్టొచ్చినట్టు కనిపించే వెడల్పాటి రిబ్బన్ తగిలించుకుంటున్నాడు. గౌరవప్రదంగా కనిపించేటట్టు చూసుకుంటున్నాడు. ప్రతిరోజు పొద్దున్నే గడ్డం గీసుకుని, గోళ్ళు తీసుకుంటున్నాడు. రెండు రోజులకోసారి బట్టలు మార్చుకుంటున్నాడు- సభ్యతగా ఉండే బట్టలు వేసుకోవాలనే స్థాయి నుంచి గౌరవప్రదంగా ఉండేవి వేసుకునే స్థాయికి చేరాడు. జాతి ధర్మబద్ధత పట్ల గౌరవం,- ఇప్పుడు ఆ ధర్మ బద్ధతలో అతను కూడా ఒక భాగం- ఆనాటి నుంచి ఏర్పడింది. అతను ఇప్పుడు పూర్వపు  కెరొవాన్ కాదు. ఖచ్చితమైన ప్రవర్తన, గంభీరత, నమ్రత అలవాటు చేసుకున్నాడు. 

అతడు నిమిషానికోసారి ‘నా క్రాస్’అని గర్వంగా అంటుండేవాడు;దాన్ని చూసుకుని ఎంత గర్వపడేవాడంటే,ఎవరైనా కోటు కన్నాల్లో వేరే ఏ రిబ్బన్ పెట్టుకున్నా భరించలేకయేవాడు. వింతైన రంగులు వేసుకోవడా న్ని సహించలేకపోయేవాడు.’ఫ్రాన్స్ లో ఇటువంటి వాటిని వేసుకోవడానికి అస్సలు అనుమతించకూడదు’ అంటాడు. ముఖ్యంగా చెనెట్ వేసుకోవడాన్ని మరింత ద్వేషించేవాడు-ప్రతిరోజు సాయంత్రం అతడు చెనెట్ ని ట్రాం కారులో కలిసేవాడు.చెనెట్ ప్రయాణిస్తున్నప్పుడు కోటు కన్నానికి రకరకాల రంగుల రిబ్బన్లను అలంకరించుకునే వాడు- తెలుపు,నీలం,నారింజ,ఆకుపచ్చ,ఇలా ఎన్నో రంగు రిబ్బన్లతో అలంకరణ చేసుకునేవాడు. 

‘ఆర్ డి ట్రంప్’ నుండి ‘న్యూఇల్లీ’ వెళ్లే వరకు ఇద్దరూ ప్రతిరోజు ఒకే రకమైన సంభాషణలు చేసుకునేవారు. ఇద్దరూ మొట్టమొదట, స్థానికంగా జరిగే అక్రమాల గురించి మాట్లాడుకునే వాళ్ళు. అవి ఇద్దరికీ నచ్చేవి కావు. న్యుయిలీ మేయర్ కి తిట్లలో ఎక్కువ భాగమే దక్కేవి. ఆ తర్వాత వైద్యం గురించి- సర్వసాధారణంగా వైద్యుల ఎదురుగా జరిగే సంభాషణే మాట్లాడుకునేవారు. రోగాల గురించి మాట్లాడేవాడు. రోగాలని మరింత ఎక్కువ చేసి సుదీర్ఘంగా చెప్పేవాడు. అలా మాట్లాడడం వలన తన అనారోగ్యాలను బయట పెట్టకుండానే వాటి గురించి ఉచిత సలహాలు పొందవచ్చని  ఆశపడేవాడు. అతని తల్లి గత కొన్నిరోజులగా  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బాగా ఇబ్బంది పెడుతోంది. తరచుగా చాలాసేపు స్పృహ తప్పి పడిపోతున్నది. 90 ఏళ్ళు వచ్చినా, ఆమె తన ఆరోగ్యం గురించి ఏమాత్రం శ్రద్ధ తీసుకోదు. 

ఆమె గురించి మాట్లాడేటప్పుడు కారొవాన్ మనసు మెత్తబడుతుంది. ఆమె వయసు గురించి చెప్తూ చాలా సార్లు డాక్టర్ చెనెట్ ని -పూర్తి అర్హత గల డాక్టర్ కాకపోయినప్పటికీ- ప్రత్యేకంగా డాక్టర్ అని  సంభోదిస్తూ,’అంత వయసు ఉన్న వాళ్ళు మీకు ఎక్కడైనా తారసపడ్డారా ‘అని అడుగుతూ, సంతోషంగా చేతులు నులుపుకునేవాడు. తన తల్లి ఈ భూమి మీదే పది కాలాలపాటు ఉంటుందని కాదు. తల్లి దీర్ఘాయుష్షురాలు అవడం వల్ల తన ఆయుర్దాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందనే నమ్మకం.

“మా కుటుంబంలో అందరికీ దీర్ఘాయుష్యే. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తప్ప నేను కూడా బాగా ముసలి వాడినయ్యే వరకు బతుకుతాను” అన్నాడు.

డాక్టర్ అతని వైపు జాలిగా చూసాడు; ఎర్రటి మొఖం, పొట్టి మెడ, కొవ్వుతో నిండి వదులైన కాళ్లు- రక్తపోటు లక్షణాలున్న గుండ్రని ఆకారం. డాక్టర్ తలపై పెట్టుకున్న తెల్లటి పనామా టోపీని  ఒకసారి తీసి, సన్నగా నవ్వుతూ, 

“ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పలేను. అసలైనా, మీ అమ్మ గారి శరీరం ఉక్కు లాగా చాలా గట్టిది. కానీ నీ జీవితం అంత బాగుంటుందని నేను అనుకోను” అన్నాడు. ఆ మాటలకి కారొవాన్ కి చాలా బాధపడ్డాడు .ఆ రోజు ఇద్దరూ గమ్యాన్ని చేరేవరకు మళ్ళీ మాట్లాడుకోలేదు. ట్రైన్ దిగిన తర్వాత చెనెట్ ‘ కెఫె డి గ్లోబ్’ లో ఒక గ్లాసు వెర్మొత్ తాగుదామా అని అడిగాడు. ఇద్దరికీ తరచుగా అలా తాగడం అలవాటే. ఆ షాపు యజమాని కూడా వీళ్ళిద్దరి స్నేహితుడే. వీరిని చూడగానే అతను రెండు వేళ్ళు చూపించాడు. వాళ్లు కౌంటర్లో తమ సీసాలు తీసుకొని మధ్యాహ్నం నుంచి అక్కడ డామినోస్ ఆడుతున్న ముగ్గురు స్నేహితులను కలిశారు. అందరూ కలిసి తాగడం మొదలుపెట్టారు.సాధారణంగా సంభాషణ మొదలు పెట్టినట్టే, వాళ్ళు” కొత్త సంగతులు ఏమైనా ఉన్నాయా ” అని అడిగారు. అంతా కలిసి కాసేపు డొమినోస్ ఆడుకున్నారు. ఆ తర్వాత ఆ ముగ్గురు ఆటగాళ్లు “మళ్లీ  కలుద్దాం” అంటూ సెలవు తీసుకునేటప్పుడు,చేతులు అయితే అందించారు గాని వారి ముఖాలను కూడా చూడలేదు. ఆ తర్వాత ఇద్దరూ భోజనానికి ఇంటికి వెళ్ళిపోయారు. 

కారొవాన్,కార్ బేవోయ్ లో ఒక రెండంతస్తుల ఇంట్లో ఉండేవాడు.ఆ ఇల్లు రెండు రోడ్ల కూడలిలో ఉండేది. ఇంటి కింద భాగంలో మంగలి కొట్టు ఉండేది. రెండు పడక గదులు, ఒక భోజనాలగది, ఒక వంటగది ఉన్న అపార్ట్మెంట్ అది. మేడం కారవాన్ 24 గంటలూ ఇల్లు శుభ్రం చేయడంలో మునిగితేలేది. వారి కూతురు మెరి  ఉవిస్ కి  12 ఏళ్లు. కొడుకు, ఫిలిపి  అగుస్. ఫిలిపి చుట్టుపక్కల ఉన్న మురికి అల్లరి పిల్లలతో కలిసి మురుగు కాలువల పక్కన ఆడుకునేవాడు. 

కారొవాన్ తల్లిని పై అంతస్తులో ఉంచాడు. ఆమెను చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా పరమలోభి అంటారు. చాలా సన్నగా, ఎప్పుడూ కోపంగా ఉంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరితో వాదులాడుతూనే ఉంటుంది. ఎవ్వరితోనూ గొడవపడకుండా ఆమెకు ఒక్క రోజు కూడాగడవదు. ఎప్పుడూ కోపంగా కొట్లాడుతూ, సహనాన్ని కోల్పోతూ ఉంటుంది. తమ ఇంటి గుమ్మాలలో నిలుచుని ఉన్న చుట్టుపక్కల వాళ్లందర్నీ, వీధులూడ్చేవారని, చిల్లర సరుకులు అమ్ముకొని బతికే వాళ్ళని, ఊసుపోక వీధిలో తిరిగే వెధవాయిలని, పరమ చెత్తగా మాట్లాడేది. వాళ్లు కూడా ఆమె బయటికి బయలుదేరి వెళ్తున్నప్పుడు, ఆమె వెనకే కాస్త దూరంగా నడుస్తూ, చెత్త వాగుడు వాగే వాళ్ళు. ఒక పొట్టి నార్మండీ పనిమనిషి వీరి ఇంట్లో పని చేసేది.అమెకి జాగ్రత్తగా ఉండడం అంటే ఏమిటో తెలియనే తెలియదు; బుర్ర తక్కువది;ఇంట్లో పనంతా చేసేది. ముసలామెకు ఎప్పుడు ఏం అవసరం వస్తుందోనని ఆమెతోపాటు రెండో అంతస్థులో పడుకునేది. 

అతని భార్యకు ఎప్పుడూ ఏదో ఒకటి శుభ్రం చేస్తూనే ఉండడం అలవాటు. కారొవాన్ ఇంటికి వెళ్లేసరికి ఆమె చెక్క కుర్చీలను గుడ్డ పెట్టుకుని తుడుస్తూ మెరుగు పెడుతోంది. ఆమె ఎప్పుడూ నూలు చేతి తొడుగులు వేసుకుని ,తలపై కాప్ పెట్టుకొని ఉండేది. ఆ క్యాప్ మీద రకరకాల రిబ్బన్లు  ఉండేవి. టోపీ ఒక చెవి మీద ఒరిగి ఉండేది. ఎవరైనా పాలిష్ పెడుతున్నప్పుడు,తుడుస్తూ,లేదా కడుగుతన్నప్పుడు చూస్తే, ఆమె వెంటనే, ” మేము ధనికులం కాదు.మా ఇంట్లో ప్రతివస్తువూ సామాన్యంగా ఉంటుంది. కానీ శుభ్రంగా ఉంచడమే నాకెంతో ఇష్టమైన పని. దాని విలువ ఇంక దేనికుంటుంది” అనేది. 

ఆమెకు పట్టుదల ఎక్కువ. లోకజ్ఞానం ఎక్కువ. అందువలన ఆమె భర్తకు ప్రతి విషయంలో సూచనలు, సలహాలు ఇస్తుంటుంది. రాత్రి భోజనం సమయంలో,ఆ తర్వాత తమ గదిలో ఉన్నప్పుడు కూడా. ఆఫీసులో జరిగిన ప్రతి విషయాన్నీ సుదీర్ఘంగా చర్చిస్తారు. ఆమె అతని కన్నా 20 ఏళ్లు చిన్నదైనప్పటికీ, అతడు అన్ని విషయాలూ ఆమెతో చెప్తాడు. ఆమే అతనిని నడిపిస్తుంది. ప్రతి విషయంలోనూ సలహాలు ఇస్తుంది.

ఆమె వయసులో ఉన్నప్పుడయినా అందగత్తె కాదు. ఇప్పుడు పెద్దదై మరింత అంద వికారంగా తయారయింది. పైగా పొట్టిగా, సన్నగా ఉంటుంది. ఎప్పుడూ నిర్లక్ష్యంగా బట్టలు వేసుకుంటుంది. ఏ మాత్రం మంచి అభిరుచి లేకపోవడం వల్ల ఆమెలో ఉన్న కొద్దిపాటి ఆకర్షణా మరుగున పడిపోయింది.బట్టలు వేసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పాటించి ఉన్నా ఆమెలో స్త్రీత్వం కనిపించి ఉండేది. ఆమె వేసుకున్న స్కర్ట్ లు ఎప్పుడూ అస్తవ్యస్తంగా ఉండేవి. ఎప్పుడూ ఎక్కడో అక్కడ గోక్కుంటూ ఉండేది. అది ఏ భాగం అని  పట్టించుకునేది కాదు. ఎవరు చూస్తున్నారనేది కూడా లక్ష్య పెట్టేది కాదు. ఆమెని చూసిన వాళ్ళు ఎవరైనా ఆమె ఏదో దురదలతో బాధపడుతుందని అనుకునేవాళ్ళు. ఆమె ఏదైనా అలంకారాలు అంటూ చేసుకుందంటే, అది కేవలం సిల్క్ రిబ్బన్లతోనే. వాటిని ధారాళంగా వాడేది. రకరకాల రంగుల రిబ్బన్లు కొనుక్కునేది. వాటికి ఇంట్లో వేసుకునే టోపీలకు అలంకరించుకునేది. 

ఆమె భర్తను చూడగానే లేచి, మీసాలను ముద్దు పెట్టుకుని 

“పొటీన్ తీసుకురావడం నీకు గుర్తుందా ప్రియా” అని అడిగింది. 

అతను ఒకసారి కుర్చీలో కూలబడిపోయాడు. చేస్తానని మాట ఇచ్చి చెయ్య లేకపోవడం ఇది నాలుగో సారి. 

“అయ్యో చచ్చానురా బాబు,మర్చిపోయాను. ఇది నా బుర్రలోకి ఎక్కడం లేదు. అందుకని సాయంత్రం తీసుకు రావడం గుర్తుండడం లేదు” 

అతను మర్చిపోయినందుకు అంత బాధపడినా ఆమె మాత్రం ప్రశాంతంగా, 

“రేపు నువ్వు ఈ విషయమే ఆలోచిస్తావులే. ఇంతకీ ఆఫీస్ లో ఏమైనా కొత్త విశేషాలు ఉన్నాయా” అని అడిగింది. 

“అవును గొప్ప విశేషమే ఉంది మరొక టీం స్మిత్ ని రెండో ప్రధాన గుమస్తాగా నియమించారు”. ఒక్కసారి ఆమె గంభీరంగా మారిపోయింది:”అంటే అతను రామొన్ తర్వాత ఆ స్థానంలోకి వస్తాడన్నమాట. ఈ స్థానం నీకు రావాలని నేను కోరుకున్నాను.ఇక రామొన్ పరిస్థితి ఏమిటి?”

“అతను రిటైర్ అవుతాడు పెన్షన్ వస్తుంది.”

ఆమెకు మరింత కోపం వచ్చింది. తలపై ఉన్న టోపీ భుజం పై పడింది.”ఇప్పుడు ఇక చేయగలిగింది ఏమీ లేదు. కొత్తగా వచ్చిన కమిషనర్ పేరేంటి?” 

“బోనాసోట్”.

ఆమె ఎప్పుడూ తన చేతికి అందుబాటులో పెట్టుకునే నావెల్ సంవత్సర పుస్తకాన్ని తెరిచి చూసింది. 

అతని వైపు చూస్తూ,”బోనాసోట్ ట్రౌలాన్ లో జన్మించాడు.1871లో విద్యార్థి కమిషనర్ గా ఉన్నాడు.1875లో సబ్ కమిషనర్ అయ్యాడు. అసలతను ఎప్పుడైనా సముద్రం ముఖం చూసాడా?”ఈ ప్రశ్న అడిగేసరికి కారొవాన్ కి స్పష్టత వచ్చింది. అతను పక్కటెముకలు నొప్పి పుట్టేంతగా నవ్వాడు.

“ఓ ‘బాలిన్’ లేదా మా అధికారి ‘బఫెను’ చూసినట్టే. దానికి వాళ్ళ ఆఫీసులో వాడుకునే ఒక జోక్ ని కలిపి మరింత నవ్వుకున్నాడు. 

“అతనిని ‘పాయింట్ డి  జోర్’ కూడా పంపించలేం.ఎందుకంటే,సియాన్ లోని చిన్న మరబోట్లలో ప్రయాణం కూడా అతనికి పడదు.వాంతులు చేసుకుంటాడు.” 

కానీ ఆమె మాత్రం ఇప్పటికీ గంభీరంగానే ఉంది. ఈ మాటలేవీ చెవిలో దూరినట్టే కనిపించలేదు. ఆ తర్వాత గొంతు తగ్గించి, అతని గడ్డాన్ని గోకుతూ,”మనం నమ్మగల ఒక డిప్యూటీ ఉంటే బాగుండు. ఈ నావికా విభాగంలో జరుగుతున్న అక్రమాలు తెలుసుకొనే మనిషి ఉండాలి. అప్పుడిక ఈ  మంత్రి బయటకు పోవాల్సి వస్తుంది.” 

ఈ మాటలు అంటున్నపుడే మెట్లమీద పెద్ద శబ్దం వినిపించింది. మెరి ఉవిస్, ఫిలిపి అగుస్ మురికి గుంట దగ్గర నుంచి ఆడుకుంటూ వచ్చి, మెట్ల మీద ఒకరినొకరు కొట్టుకుంటున్నారు.వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లి విడదీసి, ఇద్దరినీ లాక్కొచ్చి గదిలో పడేసింది. పిల్లలు నాన్నని చూడగానే  అతని దగ్గరికి పరిగెత్తారు.ప్రేమగా అతన్ని ముద్దు పెట్టుకున్నారు.కారొవాన్ ఇద్దరినీ దగ్గరకు తీసుకుని కాళ్ళ మీద కూర్చోపెట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. 

ఫిలిపి అగుస్ అంద వికారంగా మురికిగా ఉంటాడు. తెలివి తక్కువ వాడిలాగా కనిపిస్తాడు.మెరి ఉవిస్ వాళ్ళ అమ్మ లాంటిదే.వాళ్ళ అమ్మలాగే మాట్లాడుతుంది. మాట్లాడిన పదాలనే మళ్లీమళ్లీ వినియోగిస్తుంది. కదలికలు కూడా వాళ్ళ అమ్మలాగే ఉంటాయి. ఆమె కూడా తల్లిలాగే వాళ్ళ నాన్నని” ఆఫీసులో కొత్త విషయాలు ఏమున్నాయి” అని అడిగింది. అతను సరదాగా, 

“నీ స్నేహితుడు,ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చొని మనతోపాటు భోజనం చేస్తాడే, ఆ రామొన్ కి,రెండో అధికారిక గుమస్తాగా ప్రమోషన్ వచ్చింది .” 

ఆమె నాన్న వైపు చూసి ఆరిందాని లాగా” అయితే ఇప్పుడు నీ నెత్తి మీదికి మరో బాస్ వచ్చాడన్నమాట”అనింది.

అతను నవ్వడం ఆపేసాడు.సమాధానం చెప్పలేదు. మాట మార్చే ప్రయత్నం చేశాడు. కిటికీలు శుభ్రం చేస్తున్న భార్యని ,”మేడ మీద అమ్మ ఎలా ఉంది?” అని అడిగాడు 

కెరొవాన్ భార్య తుడవడం ఆపి,తలపై ఉన్నటోపీని సరిచేసుకుని,కోపంతో వణుకుతున్న పదాలతో, 

“సరే, ఇప్పుడు మీ అమ్మ గురించి మాట్లాడుకుందాం.ఆమె ఇంతకు ముందే మేడం లిబౌడిన్ తో పెద్ద గొడవ పెట్టుకుంది;మేడం లిబౌడిన్ కాస్త బియ్యం పిండి అడగడానికి  మేడ మీదకి వెళ్ళింది. అప్పుడు నేను ఇంట్లో లేను.మీ అమ్మ ఆమెను ఒక ముష్టి దాన్ని తరివేసినట్టు తరిమేసింది. అయితే నేను మీ అమ్మకి బాగానే ఇచ్చుకున్నాను లెండి. ఏమీ విననట్టు నటించింది. తనకి ఇష్టం లేని విషయాలు చెప్పినప్పుడు నటిస్తుందే, అలాగే. నిజానికి ఆమెకు చెముడు లేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు.అంతా నటన. ఆమె మారు మాట్లాడకుండా వెంటనే తన గదిలోకి వెళ్లి పోవడమే అందుకు రుజువు.” 

కారొవాన్ కాస్త తత్తరపడ్డాడు.ఇంకేం మాట్లాడలేదు. అప్పుడే వాళ్ళింట్లో పని చేసే అమ్మాయి,భోజనాలకి టైం అయింది రమ్మని  పిలిచింది. కారొవాన్, మేడమీద ఉన్న అమ్మని కూడా పిలవడానికి గది మూలనున్న చీపురుకట్ట తిరగేసి పట్టుకుని పై కప్పుని దబ దబా కొట్టాడు. ఆ తర్వాత భోజనాలు గదిలోకి వెళ్ళాడు. అంతా గంజి తాగుతూ ముసలమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె రాలేదు. ఒకవైపు గంజి కాస్త చల్లబడిపోతుంది;ఆ తర్వాత వాళ్ళ నెమ్మదిగా తినడం ప్రారంభించారు.ప్లేట్లన్నీ ఖాళీ అయిపోయాయి.అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ముసలామె  ఇంకా కిందికి దిగలేదు.భార్యకి ఒళ్ళు మండిపోయింది.భర్త పై అంతెత్తున లేస్తూ,” ఆమె కావాలనే ఇలా చేస్తోంది. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు ఎప్పుడూ ఆమె మాటే వింటావు.”

ఇక ఈ విషయంలో ఎవరిని సమర్థించాలో తెలియక, మెరి ఉవిస్ ని,”పోయి బామ్మని పిలుచుకు రమ్మని’ పై అంతస్తుకి పంపించాడు. ఒక నిమిషం తర్వాత గది తలుపులు తెరుచుకున్నాయి. పాప పాలిపోయి,ఊపిరి ఎగబిలుస్తూ గబగబా,”బామ్మ నేల మీద పడిపోయింది” అనింది.

కారొవాన్ ఒక్క ఉదుటున లేచాడు.చేతి గుడ్డను టేబుల్ మీద విసిరేసాడు. మెట్లవైపు పరిగెత్తాడు. అతని భార్య ఇదంతా అత్తగారు ఆడుతున్న నాటకమని అనుకుంటుండడం వల్ల నెమ్మదిగా అతన్ని అనుసరించింది. అనుమానంగా భుజాలు ఎగరేసింది. ఇద్దరూ పైకి వెళ్లి చూసేసరికల్లా ముసలమ్మ గది మధ్యలో బోళ్ళాపడి ఉంది. వెనక్కి తిప్పారు. ఆమెలో ఏమాత్రం చలనం లేదు. ఆమె చర్మం మరింత మడతలు పడి, పసుపు పచ్చగా ఉంది. కళ్ళు మూతలు పడి ఉన్నాయి. పళ్ళు గట్టిగా పట్టి ఉన్నాయి. శరీరం అంతా మొద్దు బారింది.

కారొవాన్ ఆమె పక్కనే వంగి కూచుని, ములుగుతున్నాడు.

“అయ్యో అమ్మ! అయ్యో అమ్మా !!” 

అతని భార్య మాత్రం,”మరేం పర్వాలేదు,మళ్ళీ  కాస్త సృహ తప్పి ఉంటుంది. మనల్ని రాత్రిపూటయినా ప్రశాంతంగా కలిసి భోజనం చేయనీయకుండా వేషాలు వేస్తోంది. కచ్చితంగా నాకు తెలుసు.” 

ఆమెను ఎత్తి మంచం మీద పడుకోపెట్టారు. పూర్తిగా బట్టలన్నీ విప్పారు.భార్యాభర్తలిద్దరూ,పనిమనిషి కలిసి ఒళ్ళు రుద్దడం మొదలుపెట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు మెలుకువ రాలేదు. వెంటనే రోజెలిని డాక్టర్ చెనెట్ ని పిలుచుకు రమ్మని పంపించారు.చెనెట్ చాలా దూరంలో ఉంటాడు. అందువల్ల అతను వచ్చేసరికి సమయం పట్టింది. చివరికి వచ్చి ముసలామె వైపు చూసి, ఆమె నాడి పట్టుకుని చూసి, గుండె చప్పుడు విని”అంతా అయిపోయింది” అన్నాడు.

కారొవాన్ ఒక్కసారిగా ఆమె శరీరంపై వాలిపోయాడు. తీవ్రంగా దుఃఖించాడు. అమ్మ మొహాన్ని పదేపదే ముద్దు పెట్టుకున్నాడు. అతను కన్నీళ్లు ఆమె మొహాన్ని తడిపేసాయి.సహజంగానే భార్య, కూతురు కూడా తమ దుఃఖాన్ని వెలిబుచ్చారు.భార్య మూలుగుతూ భర్త వెనక నిలుచుంది. తీవ్రంగా కళ్ళు నులుపుకుంది.

కానీ కారొవాన్ ఉన్నట్టుండి లేచి నిలుచున్నాడు.ఉన్ననాలుగు వెంట్రుకలూ అటూఇటూ చెదిరిపోయాయి;ఏడుస్తుండడం వలన మరింత వికారంగా కనిపించాడు. 

“కానీ డాక్టర్, మీరు చెప్పేది నిజమేనా? కచ్చితంగా చనిపోయిందా?” అని అడిగాడు. 

డాక్టరు ఆమె శరీరం దగ్గరగా నిలుచున్నాడు. వృత్తి నైపుణ్యంతో,”ప్రియ మిత్రమా ఆమె కళ్ళను చూడు” అంటూ కళ్ళ రెప్పలు పైకి ఎత్తాడు. ఆమె కళ్ళు పూర్తిగా మారిపోయాయి. కంటి గుడ్డు బాగా పెద్దదయింది చూసి కారొవాన్ కంగారు పడిపోయాడు. చెనెట్ మిత్రుడి చేతిని తన చేతిలోకి తీసుకొని, వేళ్ళని బలవంతంగా తెరిచాడు. కోపంగా”నేనెప్పుడూ తప్పు చెప్పను. నీకు కూడా ఆ సంగతి తెలుసు” అన్నాడు. 

కారొవాన్ ఆమె పక్కనే కూలబడిపోయాడు.అతని భార్య చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయడం మొదలుపెట్టింది. రాత్రి టేబుల్ ని తీసుకొచ్చి, దానిమీద ఒక పెద్ద తువ్వాలు పరిచింది. నాలుగు క్యాండిల్స్ ని నాలుగు వైపులా పెట్టింది. వాటిని వెలిగించింది. ఆ తర్వాత చిమ్నీకున్న స్ప్రింగ్ బాక్స్ ని తీసింది. దానిని నాలుగు క్యాండిల్స్ మధ్యలో ప్లేట్ మీద పెట్టింది. ఆమె దగ్గర పవిత్ర జలం లేదుకాబట్టి, ప్లేట్లో శుభ్రమైన నీరు పోసింది. కాసేపైన తర్వాత నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసింది.ఇదంతా చేస్తూ శుద్ధి చేస్తున్నట్టు భావించింది. అంతా పూర్తి చేసి మౌనంగా నిలుచుంది. ఆమెకు సహాయం చేస్తున్న డాక్టర్,ఆమె  చెవులో,”మనం కారొవాన్ని బయటికి తీసుకుపోవాలి” అన్నాడు.

ఆమె ఒప్పుకున్నట్టు తలూపింది. ఇంకా మోకాళ్ళ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న భర్త దగ్గరికి వెళ్లి, చెయ్యి పట్టుకుని లేవనెత్తింది. డాక్టర్ చెనెట్ రెండో చేతిని పట్టుకుని ఎత్తాడు. 

ఇద్దరూ కలిసి అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. భార్య ముద్దు పెట్టి అతనికి తత్వాన్ని బోధించడం మొదలుపెట్టింది. చెనెట్ ఆమె మాటలకు వత్తాసు పలికాడు-ఇటువంటి  కష్టకాలం ఎదురైనప్పుడు స్థిరంగా, దృఢంగా, ధైర్యంగా ఉండాలని.నిజానికి అటువంటి పరిస్థితుల్లోనే ధైర్యాన్ని కోల్పోతాం.ఇద్దరూ కారొవాన్ రెండు చేతులు పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోయారు. 

అతడు చిన్న పిల్లవాడి లాగా ఏడుస్తున్నాడు. అతని చేతులు వేలాడిపోయాయి;కాళ్లు బలహీనంగా ఊగిపోయి ఎక్కడికెళ్తున్నాడో తెలియకుండా, పై అంతస్తు నుంచి కిందికి వచ్చాడు.కాళ్లు యాంత్రికంగా కదులుతున్నాయి.అతనిని రోజూ భోజనం చేయడానికి  కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టారు-ఎదురుగా ఇంతకు ముందు తాగి ఖాళీ చేసిన గంజి కంచం ఉంది. అతను ఎదురుగుండా ఉన్న గ్లాస్ వంకే చూపు మరల్చకుండా,ఏమాత్రం కదలకుండా చూస్తూ కూచున్నాడు.ఎంత దుఃఖంలో మునిగిపోయాడంటే,అసలేమీ ఆలోచించలేకపోతున్నాడు. 

కారొవాన్ భార్య, డాక్టర్ తో మాట్లాడి ,చేయాల్సిన పనులు ఏమున్నాయో తెలుసుకుంటున్నది. చివరికి చెనెట్ తన టోపీని తీసి, తాను ఇంకా భోజనం చేయలేదని చెబుతూ, వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతం ఇచ్చాడు. వెంటనే కెరొవాన్ భార్య,”ఏమిటి మీరు ఇంకా భోజనం చేయలేదా! ఇక్కడ ఉండండి డాక్టర్,వెళ్లొద్దు. మా దగ్గర ఉన్నది మేం పెడతాం.అయితే, బహుశా మీకు కడుపునిండా పెట్టలేకపోవచ్చు.” డాక్టర్ ఏవో సాకులు చెప్పి ఆమె ప్రతిపాదన తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆమె మాత్రం,”మీరు తప్పకుండా ఉండాలి. ఇటువంటి సమయాల్లో మీలాంటి స్నేహితులు మా దగ్గర ఉండడం, అది కూడా నా భర్తని ఒప్పించి కాస్తంత తినిపించ గల వాళ్లు ఉండడం, మాకెంతో ధైర్యాన్నిస్తుంది” అనింది. 

డాక్టర్ కి తప్పలేదు,”సరే అలా అయితే నేనుంటాను అమ్మా” అన్నాడు.

బుర్ర తక్కువ రోజలి కి ఆమె కొన్ని ఆదేశాలు ఇచ్చింది. రోజలి డాక్టర్ పక్కనే కూచుని అతనికి సాయంగా తినడం మొదలు పెట్టింది. డాక్టర్ గంజి తాగారు. ఆ తర్వాత బాగా ఉల్లివాసన దంచికొడుతున్న పేగులతో చేసిన వంటకం వడ్డించారు. మేడం కారొవాన్ తను కూడా ఈ వంటకం రుచి చూడాలని అనుకుంది.కాస్త తిన్న డాక్టర్” బ్రహ్మాండం గా ఉంది” అన్నారు. ఆమె చిరునవ్వు నవ్వి తన భర్త వైపు తిరిగి, మీరు కూడా కొంచెం తాగండి. కడుపులోకి ఏదో కాస్త పోనివ్వాలి. రాత్రంతా ఆమెను చూస్తూ కూర్చోవాలని తెలుసు కదా!”

అతడు ప్లేట్ ని ఏమరు పాటుగా, నిద్రలో పట్టుకున్నట్టు పట్టుకొన్నాడు. ఆమె చెప్పింది చేస్తున్నాడు. ఏమాత్రం ప్రతిఘటించకుండా, ఆలోచించకుండా. కాస్తంత తిన్నాడు. డాక్టర్ అతనికి మూడు ముద్దలు నోట్లో  పెట్టాడు. భార్య ఫోర్క్ తో పెద్ద ముక్క తీసి నోట్లో పెడుతుంటే, అనాలోచితంగా మింగాడు. 

మాక్రోనితో నిండిన సలాడ్ గిన్నెని తెచ్చినప్పుడు డాక్టర్,”దేవుడా నాకు ఇదంటే చాలా ఇష్టం” అన్నాడు. 

మేడం కారొవాన్ అందరికీ వడ్డించింది. అంతవరకు పిల్లలను తమ ఇష్టానికి వదిలేయడం వలన సాసర్లు నాకేసి వదిలారు. నీళ్లు కలుపుకోకుండా వైన్ తాగారు. ఇప్పుడు ఇక బల్లకిందికి దూరి కొట్టుకోవడం మొదలుపెట్టారు.

చెనెట్ కి పాటలు రాసే రోజలి సుపరిచితమే. ఆమెకు ఇటాలియన్ వంటలంటే చాలా ఇష్టం. ఉన్నట్టుండి నువ్వు ఆ పాటలో కొన్ని వాక్యాల్ని ఇలా కూడా పాడొచ్చు అన్నాడు’మాస్ట్రియో రోజలి కి మేకరొని అంటే ఇష్టం’

ఆయన మాటలను ఎవరూ  పట్టించుకోలేదు. కానీ మేడం గారు ఈ సంఘటన పర్యవసానాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె భర్త రొట్టెను ముక్కలు ముక్కలుగా చేసి టేబుల్ మీద పెడుతూ వాటి వైపే పిచ్చిగా చూస్తూ కూర్చున్నాడు. ఒక గ్లాస్ తర్వాత ఒక గ్లాసు సారా తాగుడుతుండడంతో అతని గొంతు ఎండిపోయింది. బుర్ర పని చేయడం మానేసింది. ఒకవైపు దుఃఖం, మరోవైపు షాక్ వలన అతని ఆలోచనలు మసకబారాయి. తిన్నది అరగడం మొదలుపెట్టిన తర్వాత మళ్లీ ఆలోచనల నృత్యం మొదలైంది. 

అప్పటివరకు డాక్టర్ తాగుతూనే ఉన్నాడు. మత్తు బాగా ఎక్కింది. మేడం కారొవాన్ మందు ముట్టనే లేదు. కానీ ఆమెకు నరాల బలహీనత వల్ల ఉండడం ఆందోళన, ఉద్రేకం కలిగాయి. బుర్రంతా తిరగడం మొదలెట్టింది. 

డాక్టర్ చెనెట్ మృత్యువుకి సంబంధించిన కథలు ఒక్కొక్కటి చెప్పడం మొదలు పెట్టారు. పారిస్ నగరాన్ని ఆనుకుని ఉన్న ఒక ప్రాంతంలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. అక్కడున్న వ్యవసాయదారులంతా మృత్యువుని ఉపేక్షిస్తారు. తమ తల్లిదండ్రులైనా సరే. అలా అగౌరవంగా చూడడం అక్కడున్న గ్రామాలలో సర్వసాధారణం. అదే పారిస్ లో అయితే అరుదైన విషయం. 

“కిందటి వారం నన్ను రూ డి పోటెక్స్ కి పంపించారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోగి చనిపోయాడు; అతని పక్కనే కుటుంబం అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. చనిపోయినతను అంతకు ముందు రోజు రాత్రి కోరిన సోంపు గింజల మద్యాన్ని తెచ్చుకుని తాగుతున్నారు” 

కానీ మేడం ఇదేమి పట్టించుకోవడం లేదు. ఆమె దృష్టంతా వారసత్వంగా తమకు రావలసిన ఆస్తి పైనే ఉంది.కారొవాన్ కి ఇవేమీ పట్టలేదు.

కాఫీలు ఇవ్వడం మొదలైంది. మనసులలో ధైర్యం నింపడానికి కాఫీ ని చిక్కగా కాచారు. ప్రతి కప్పులో కాస్తంత సారాయి పోశారు. అవి వాళ్ళ ముఖాలను ఎర్రగా చేసాయి; ఆలోచనలని మరింత గందరగోళ పరిచాయి. పైగా చెనెట్  బ్రాందీ సీసాని తీసుకొని నోళ్ళల్లో పోయడం మొదలుపెట్టారు. దానిని మనసును స్వాంతన పరిచేదిగా వర్ణించారు. భోజనాలు తర్వాత అందరూ నెమ్మదిగా కొంచెం కొంచెం తీయని పచ్చసారా తాగారు. అందరి కప్పుల కింది భాగంలో కాస్తంత సారా మిగిలి పోయింది. 

పిల్లలందరూ నిద్రపోయారు. రోజలి అందరినీ పక్కల మీద పడుకోబెట్టింది.కారొవాన్ యాంత్రికంగా బ్రాందీ తాగుతూ కాలక్షేపం చేశాడు. కాంతి విహీనమైన అతని  కళ్ళు నెమ్మదిగా కాంతివంతమవుతున్నాయి. చివరికి డాక్టర్ వెళ్ళిపోతూ, తన స్నేహితుడి చేయి పట్టుకొని,”నాతో రా. చల్లని గాలి నీకు కాస్త ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒకే చోట నిలబడి పోకూడదు” అన్నాడు. 

కెరొవాన్ యాంత్రికంగా టోపీ పెట్టుకుని, చేతిలో కర్ర పట్టుకుని అతని వెంట వెళ్ళాడు.ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని, నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూసుకుంటూ సెయిన్ వైపు, నడవడం మొదలుపెట్టారు.

గాలి వెచ్చగా హాయిగా ఉంది. చుట్టూ ఉన్న తోటలు అన్నీ పూలతో నిండి ఉన్నాయి. పూల గుబాలింపు గాలంతా ఆవరించింది. నిజానికి ఈ సువాసన మాధుర్యాన్ని పగటిపూట పొందలేము. అంతా చీకటి నిండిన రాత్రి పూట మాత్రమే పిల్లగాలులలో తేలిన మృదువైన వాసన చుట్టూ వ్యాపిస్తుంది.

బ్రాడ్ ఎవెన్యూలో రెండు వరసల్లో గ్యాస్ దీపాలు ఉన్నాయి. అవి ఆర్క్ డి ట్రి  వరకు వ్యాపించి ఉన్నాయి.రోడ్లన్నీ నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ, దూరంగా ఎర్రటి పొగ మంచు కమ్ముకున్న పారిస్ హోరు వినిపిస్తోంది. అదంతా రణగణ ధ్వనితో నిండి ఉంది. అదే సమయంలో దూరం నుంచి రైలు కూత వినిపించింది. అన్ని ప్రాంతాలను దాటుకుని అత్యంత వేగంగా సముద్రాన్ని చేరుకుంటున్నది. ఇప్పుడు అతను దుఃఖాన్ని అనుభవించడం లేదు. మందగొడితనం అతని బాధను తరిమేసింది. రాత్రి మృదుత్వం అతనికెంతో ఉపశమనాన్ని ఇచ్చింది.

వారు బ్రిడ్జి చేరుకోగానే కుడి వైపు తిరిగారు. నది మీద నుంచే వచ్చే చల్లగాలి అప్పుడు మరింత తాజాగా వాళ్లను చుట్టుముట్టింది. ఆ గాలంతా నది అంచులచుట్టూ ఉన్న పోప్లర్ చెట్లు చుట్టూ  ప్రశాంతంగా, విషాదంతో వ్యాపిస్తున్నది. నది పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నదిలోని నీటి ప్రవాహంతో పాటు తేలి ప్రవహిస్తున్నట్లు కనిపిస్తోంది.నది ఒడ్డున రెండువైపులా పరుచుకుని ఉన్న మంచు,ఊపిరితిత్తుల్లోకి చేరి, చల్లగా ఉంది. ఉన్నట్టుండి కారొవాన్ ఒకసారి ఆగాడు. నది నుంచి వీచిన గాలి అతనికి పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. అతడికి పీకార్ డి లో ఉన్నప్పటి  అమ్మ గుర్తుకొచ్చింది. ఆమె వాళ్ల ఇంటి గుమ్మం దగ్గరి నుండి పారుతున్న నది ఒడ్డున వంగి నిలుచుని, నదిలో పారుతూన్న నీళ్లలో, గుట్టలు గుట్టలుగా బట్టలు ఉతుకుతుండేది. ఆ నది తమ ఇంటి తోట మధ్య నుండి పారుతుండేది. గ్రామమంతా కమ్ముకున్న నిశ్శబ్దంలో అతనికి ఆనాడు అమ్మ బట్టలను ఉతకడానికి కర్రతో కొట్టిన శబ్దం వినిపిస్తున్నట్టు అనిపించింది.”ఆల్ఫ్రెడ్ నాకు కాస్త సబ్బును తెచ్చి పెట్టు” అని అమ్మ అన్న మాటలు కూడా వినిపించాయి. అతడా నీటి ప్రవాహం వాసన చూశాడు. నిజానికి అతనావాసనను ఎన్నడూ మర్చిపోనేలేదు. కానీ అమ్మ చనిపోయిన ఆరోజు సాయంత్రం, అది మళ్ళీ అతని హృదయాన్ని తాకింది. 

విషాదం మళ్లీ అతనిని చుట్టు ముట్టింది. తను ఎంత ఆపదలో చిక్కుకున్నాడో అర్థం అవడం మొదలుపెట్టింది. నది నుంచి వచ్చిన ఆ గాలి అతనిని నిరాశలోకి నెట్టింది. అమ్మ చావుతో జీవితం సగానికి తెగిపోయినట్టు, యవ్వనం మాయమైనట్టు అనిపించింది. భవిష్యత్తులో, తన గత కాల అనుభవాలను పంచుకునే వాళ్లే ఉండరు- తనకు తెలిసిన మనుషులను గురించి, తన దేశం గురించి, తన జీవితం గురించి. తన జీవితంలోని ఒక భాగం ఇంకెప్పటికీ ఉండదు. బహుశా భవిష్యత్తు కూడా త్వరలోనే ముగిసిపోవచ్చు. 

ఆ తర్వాత అతనికి యవ్వనంలో ఉన్న అమ్మ గుర్తుకొచ్చింది. మంచి బట్టలు వేసుకున్న అమ్మ. ఆ జ్ఞాపకాలు తనతోనే ఉన్నాయి.అవి ఎన్నటికీ తనతోనే ఉంటాయి. ఆమె కదలికలు, భిన్న స్వరాలు, అలవాట్లు, అభిరుచులు, కోపతాపాలు, మొహం పై పడ్డ ముడతలు, కదులుతున్న సన్నని వేళ్ళు,ఆమె వైఖరులు-ఇవేవీ ఇకమీద ఉండబోవు. డాక్టర్ చేతిని గట్టిగా పట్టుకుని బోరున ఏడవడం మొదలుపెట్టాడు. అతని సన్నని కాళ్లు వణుకుతున్నాయి. నిట్టూర్పులతో అంత లావు మనిషి కదిలిపోతున్నాడు. 

కేవలం ,”నా అమ్మ ,నా అమ్మ నా అమ్మ” అని మాత్రమే అనగలుగుతున్నాడు.

కానీ అతనితో వచ్చిన అతని స్నేహితుడు ఇంకా పూర్తిగా మత్తులో ఉన్నాడు. అతడు రహస్యంగా వచ్చే చోట్లకు వెంటనే వెళ్లాలనుకున్నాడు. ఒక రోగిని చూడాలన్న సాకుతో స్నేహితుడిని విడిచిపెట్టి వెళ్ళాడు. 

కారొవాన్ కాసేపు ఏడ్చాడు. ఆ తర్వాత కళ్ళు తుడుచుకుని, దుఃఖం నుంచి ఉపశమనం పొందిన తర్వాత,మనసు కుదుట పడింది.

ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు,దిగంతాన్ని మెత్తటి వెలుగులో ముంచెత్తాడు.పొడవైన పాప్లర్ చెట్ల మీద మంచు పడి, అంచులు మెరుస్తున్నాయి.నేల మీద పడ్డ మంచు గాలికి ప్రవాహం లాగా కొట్టుకుపోతున్నది. నదిలో నక్షత్రాల ప్రతిబింబాలు ముత్యపు చిప్పల మెరుపులతో నెమ్మదిగా తేలి ప్రవహిస్తున్నాయి. గాలి మెత్తగా, తియ్యగా ఉంది. కెరొవాన్ ఆ గాలి తృప్తిగా పీల్చాడు. ఇప్పుడు అతని మనసు తాజాగా ప్రశాంతంగా ఉంది. స్వాంతన పొందాడు. 

నిజానికి తాను అటువంటి ప్రశాంతత, ఉపశమనం కోరుకోలేదు. ‘నా అమ్మ నా అమ్మ’ అంటూ ఏడ్చే ప్రయత్నం చేయబోయాడు. కానీ చాలాసేపు ఏడవలేకపోయాడు. ఆ దుఃఖాన్ని కలిగించే ఆలోచనలు, తెరలు తెరలుగా వచ్చి తేలిపోతున్నాయి. కాసేపయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు.ఆ నిర్మలమైన వాతావరణం అతనిని కట్టి పడేసింది. విచారాన్నిమర్చిపోగలిగాడు. మంచి ఉపసమనం పొందాడు. 

అక్కడి నుంచి బయలుదేరే చివరి ట్రామ్ కారు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.దాని వెనక వెలుగులు నిండిన గ్లోబ్ లైట్ కిటికీలు ఉన్నాయి ఎవరితోనైనా తన కష్టాన్ని పంచుకోవాలని అనుకున్నాడు. విచారంగా మొహం పెట్టి, తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గరికి వెళ్లి చూస్తే, యజమాని ఇంకా అక్కడే ఉన్నాడు.విచారంగా ఉన్న తన రూపం ఓ సంచలనం రేపుతుంది అని, ప్రతి వాళ్ళు తన దగ్గరకు వచ్చి చేతులు చాస్తారని,”ఏమయింది? సంగతేంటి?” అని ఆత్రుత గా అడుగుతారని ఆశించాడు. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. అతడు విచారంగా ఉన్నసంగతి ఎవరూ  గమనించనే లేదు. అందుకని కౌంటర్ దగ్గరికి వెళ్లి మొహాన్ని రెండు చేతులతో కప్పుకొని “మాండ్యు మాండ్యు”  అని అడిగాడు.

కొట్టు యజమాని అతని దగ్గరికి వచ్చి,”మోన్షియర్ కారొవాన్! నీ ఆరోగ్యం బాగులేదా?”  అని అడిగాడు.

“లేదు మిత్రమా, మా అమ్మ ఇప్పుడే చనిపోయింది”అన్నాడు. 

‘ఓ’ అని ఒకసారి అని, ఆ తర్వాత పక్కనున్న వినిమయ దారుడు బాబేరియన్ బీర్ ని అడగగా అతనికి సప్లై చేయడానికి వెళ్ళాడు. సానుభూతిని ఎదురుచూసిన కెరొవాన్ కి నోటమాట రాలేదు. 

తమతో రోజూ డామినో ఆట ఆడే ముగ్గురూ అదే సీట్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. వాళ్ళు ఆటలో పూర్తిగా మునిగిపోయారు. వాళ్ళ దగ్గరికి సానుభూతి పొందడానికి వెళ్ళాడు. కానీ వాళ్ళు అతను వచ్చినది గమనించలేదు; పట్టించుకోలేదు.అందువల్ల అతనే కల్పించుకొని,” ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను అన్యాయం అయిపోయాను” అన్నాడు. మాటలు విన్న వెంటనే  ముగ్గురూ తలలు కాస్త పైకెత్తారు గాని చూపులు మాత్రం వాళ్ల చేతిలో ఉన్న కార్డుల మీదే ఉన్నాయి.

“నువ్వేమన్నావ్?”

“అమ్మ ఇప్పుడే చనిపోయింది”.

“అయ్యో !అవునా”అని ఒకడు లేని సానుభూతిని ప్రకటించి,మళ్లీ ఆటలో మునిగిపోయాడు. రెండోవాడు మాట్లాడేందుకు ఏమీ లేదన్నట్టు ఊరుకున్నాడు. కేవలం ఓ సానుభూతి ఈలవేశాడు, తలను కాస్త వంచాడు. మూడోవాడు మళ్లీ ఆట మొదలెట్టాడు,”నువ్వు చెప్పదలుచుకున్నదంతా ఇంతేనా” అన్న భావన కలిగించాడు. 

కెరొవాన్ వాళ్లు హృదయపూర్వకంగా స్పందిస్తారని ఆశించాడు. కానీ తాను చెప్పిన వార్తకు వచ్చిన స్పందన చూసి, ఆ టేబుల్ దగ్గరి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ఒక స్నేహితుడి విషాదాన్ని ప్రశాంతంగా పంచుకున్న వారి తీరు అతనిని బాధించింది. ఇప్పుడు అతని బాధ ఎంత తగ్గిందంటే, అతనే విషాదాన్ని అనుభవించడం లేదు. ఇంటికి వెళ్లేసరికి భార్య అతనికోసం రాత్రి దుస్తులతో ఎదురు చూస్తున్నది. కిటికీదగ్గర కూచుని వారసత్వ సంపద పంపిణీ గురించి ఆలోచిస్తున్నది. 

“బట్టలు మార్చుకోండి. మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు”అనింది. 

అతడు ఒకసారి తల పైకి ఎత్తి ఇంటి కప్పు వైపు చూసి,”కానీ ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు” 

“రోజలి ఇప్పుడు ఆమెతో పాటు పైనే ఉంది. మూడు గంటలకి ఆమెకు బదులుగా మీరు వెళ్లి ఉండండి. అంతవరకు కాస్త నిద్రపోండి” అనింది భార్య. 

అతను చొక్కా మాత్రమే మార్చుకొని, ఎప్పుడైనా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక సిల్కు రుమాలు గుడ్డను తలకి చుట్టుకున్నాడు. కాసేపు సేద తీరాడు. ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. మేడం కారొవాన్ ఆలోచిస్తూనే ఉంది.

“మీ అమ్మ విల్లు ఏమైనా రాసిందా” అని అడిగింది. 

“నాకేం తెలియదు. లేదు. రాయలేదు” అన్నాడు. 

భార్య అతని వైపు కోపంగా చూసి చిన్నగా, 

“ఇది చాలా అన్యాయం. మీరు గత పది ఏళ్లగా ఆమెని చూసుకుంటూనే ఉన్నారు. ఆమెకి తిండి, వసతి కల్పించారు. మీ అక్క ఆమె కోసం ఇంతగా చేసి ఉండదు. ఆమె ఈ రకంగా అన్యాయం చేస్తుందని తెలిసి ఉంటే నేనైనా ఒప్పుకునే దానిని కాదు.”

“నిజానికి ఇది ఆమె జ్ఞాపకాలకే అవమానం. నాకు ఇవ్వాల్సింది ఇచ్చిందని అనకండి. పిల్లలకి డబ్బు ఇచ్చినంత మాత్రాన సరిపోదు.చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకంగా ఏదైనా ఇవ్వాలి. గౌరవ ప్రదమైన మనుషులు చేసేది అదే. అంటే ఇన్నాళ్ల నా కష్టం వృధా అన్నమాట. సరే మంచిదే, మంచిదే. “

పాపం కారొవాన్ తన కలవారపాటు నుండి కాస్త బయటపడి,మళ్లీ “నా అమ్మ! నా అమ్మ”అనుకోవడం మొదలుపెట్టాడు. 

“ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ఊరుకో”.

ఆమె కాస్త నెమ్మదించింది.తన మామూలు కంఠస్వరంతో,”నువ్వు రేపు నీ అక్క కి విషయాన్ని తెలియజేయాలి”అనింది. 

“అవును నిజమే, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. రేపు ఆమెకు ఒక టెలిగ్రామ్ పంపిస్తాను. రేపు పొద్దున్న లేవగానే చేసే మొట్ట మొదటి పని అదే”

వెంటనే ఆమె”వద్దు పది గంటల కన్నా ముందు పంపించవద్దు. అప్పుడు మనకి అన్నీ చూసుకునే సమయం ఉంటుంది. చరన్టన్ నుంచి ఇక్కడికి రావడానికి రెండు గంటల కన్నా ఎక్కువ సమయం పట్టదు. దుఃఖంతో మరిచిపోయామని మనం చెప్పుకోవచ్చు. పొద్దుటే చెప్పడం అంటే తొందరగా చెప్పడమే. దానివల్ల మనకి చక్కదిద్దుకునే వీలు ఉండదు”.

కారొవాన్ నుదుటిమీద చెయ్యి పెట్టుకొని, ఎప్పుడూ తన అధికారులతో మాట్లాడే బలహీనమైన స్వరంతో-అసలు వాళ్ళ పేరు చెప్తేనే అతను వణికిపోతుంటాడు-“నేను ఆఫీసు వాళ్లకు కూడా చెప్పాలి” 

“ఎందుకు చెప్పాలి” అడిగిందామె.” ఇటువంటి విషయాలు చెప్పకపోవడం వల్ల ఎవరూ తప్పు పట్టరు. ఎవరికీ చెప్పకు. నీ అధికారి కూడా నిన్నేం అనలేడు. నువ్వు అతన్ని ఇరుకన పెట్టవచ్చు” అని సలహా ఇచ్చింది. 

“సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను.నేను మానేయడం అతనికి విపరీతమైన కోపం తెప్పిస్తుంది. నిజమే నువ్వే రైట్. అతనికి మా అమ్మ చనిపోయిందని చెపితే ఇక తిట్టలేడు.” 

తను వేసిన జోక్ కి తానే నవ్వుతూ చేతులు నులుపుకున్నాడు. ఒకవైపు పై అంతస్తులో చనిపోయిన అతని ముసలి తల్లి ఉండగా, అతడికి అతని అధికారి మొహం గుర్తుకొచ్చింది. చనిపోయిన ఆమె పక్కన తోడుగాఉన్నది వాళ్ల పనిమనిషి. 

మేడం ఆలోచనలతో సతమతమవుతోంది. చివరికి,” మీ అమ్మ నీకు తన గడియారాన్ని ఇచ్చింది కదా. అదే, కప్పు బాల్ తో ఆడపిల్ల ఆడుకుంటున్న ఆ గడియారమే.” కారొవాన్ కాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత అవునవును.”నువ్వు నన్ను బాగా చూసుకుంటే, నేను నీకు ఈ గడియారాన్ని ఇస్తాను అనింది.”

మేడం కారొవాన్ కి ధైర్యం వచ్చింది.వెంటనే ఆమె ప్రసన్నంగా,”అయితే సరే దాన్ని ఆమె గదిలోంచి తీసేయ్. మీ అక్క వస్తే మనల్ని తీయనియ్యదు”అనింది. 

అతని కాసేపు సంతోషించాడు. 

“మనం అలా చేయొచ్చా”అన్నాడు. 

ఆ మాటకు కోపంతో మండిపడింది. 

“తప్పకుండా చేయొచ్చు. ఒకసారి మన అధీనంలోకి వస్తే, అది ఎలా వచ్చిందో ఆమె తెలుసుకునే అవకాశం ఉండదు.అది మనదే.ఆమె గదిలో ఉన్న ఆ పాల రాతి మూత ఉన్న చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ విషయమైనా అంతే. ఆమె మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఒక రోజు దానిని నాకు ఇచ్చింది. దాన్ని కూడా మనం కిందికి తెచ్చుకుందాం.” 

కెరొవాన్ నమ్మలేకపోయాడు.

“కానీ అది పెద్ద బాధ్యత కదా” అన్నాడు. 

అతని మాటలకు ఆమె మండిపడింది. 

“అయినా నువ్వు అసలు ఇక మారవా? నీ పిల్లలు ఆకలితో చచ్చిపోవాల్సిందే గాని నువ్వు ఏ మాత్రం చలించవన్న మాట. ఆ చస్ట్ ఆఫ్ డ్రాయర్ మనకి దక్కుతుందా లేదా? నాకు ఇచ్చిందా లేదా? ఒకవేళ నీ అక్క ఇచ్చిందనుకోకపోతే నాతో ఆ మాట అనమను. మీ అక్క మాటలు నాకు గడ్డిపోచతో సమానం.సరే, ఇకలే. మీ అమ్మ ఇచ్చిన వాటిని మనం వెంటనే కిందికి తెచ్చుకుందాం.”

వణికిపోతూ, ఓడిపోయినవాడిలాగా అతడు మంచం మీద నుంచి లేచి ట్రౌజర్ వేసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె వద్దనింది .ఆపింది.

“ఈ మాత్రం పనికి నువ్వు అంత పెద్దగా బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదులే.నీ లో దూస్తులతో కూడా  పైనుంచి కిందికి తెచ్చుకోవచ్చు. నేను కూడా ఇలాగే వస్తున్నాను” అనింది.

ఇద్దరూ తమ తమ రాత్రిపూట వేసుకునే దుస్తుల్లోనే చప్పుడు చేయకుండా పైకి వెళ్లి తలుపులు తీశారు. గదిలోకి ప్రవేశించారు.గదిలో టేబుల్ మీద నాలుగు వైపులా నాలుగు దీపాలు ప్రకాసవంతంగా వెలుగు తున్నాయి. మధ్యలో ఒక ప్లేట్ లో బాక్స్ వుడ్ ఆకు రెమ్మ ఉంది. అవే చనిపోయిన ముసలామె గట్టిబడిపోయిన శరీరానికి కాపలా కాస్తున్నాయి; ఎందుకంటే  రోజలి కూడా పడక కుర్చీలో కాళ్లు చాపుకొని, తలను పక్కకు వాల్చి పడుకొని ఉంది. ఆమె చేతులను మడిచి ఒళ్ళో పెట్టుకుంది;నోరు తెరుచి గురక కూడా పెడుతున్నది. 

కారొవాన్ గడియారాన్ని తీసుకున్నాడు-సామ్రాజ్యవాద కాలంలో అపరిమితంగా ఉత్పత్తి చేసిన వింత వస్తువులలో అదొకటి. ఆ గడియారంలో ఒక అమ్మాయి ఇత్తడి కప్పు, బాలు పట్టుకొని ఉంటుంది. ఆ బాలే గడియారం పెండ్యులం గా ఉంటుంది. 

“అది నాకు ఇచ్చేసి, ఆ టేబుల్ కి ఉన్న చలువ రాతి పలకని తీసి పట్టుకో” అనింది కెరొవాన్ భార్య.

అతడు ఆ చలువ రాత్రి పలకను కష్టపడి భుజానికి ఎత్తుకుని గది నుండి బయటకి వచ్చాడు. కిందికి వస్తుంటే కెరొవాన్ కాళ్లు వణికాయి. భార్య వెనక్కి అడుగులేస్తూ అతనికి దారి చూపాల్సి వచ్చింది. ఆమె ఒక చేత్తో క్యాండిల్ పట్టుకుంది.గడియారాన్ని చంకలో పెట్టుకుని దిగింది.

వాళ్లు తమ గదిలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. 

“అమ్మయ్య! అతి కష్టమైన పని ముగించాం. ఇప్పుడు ఇక మిగిలిన వస్తువులు తెచ్చుకుందాం” అనింది. 

కానీ ఆ టేబుల్ డ్రాయర్లు ముసలమ్మ వేసుకునే బట్టలతో నిండి ఉన్నాయి. వాటిని అన్నిటిని ఎక్కడో ఒక చోట దాచాలి.వెంటనే మేడం కెరొవాన్ అందుకు పథకం వేసుకుంది.

“వెళ్ళండి, ముందు గదిలో ఉన్న ప్యాకింగ్ డబ్బా ని తీసుకురండి. అదేం పెద్ద ఖరీదు కాదు. దాన్ని మనం ఇక్కడ పెట్టొచ్చు”.

అతడు డబ్బాని తీసుకురాగానే, ఆమె దాన్ని బట్టలతో నింపడం ప్రారంభించింది. కాలర్లు, టోపీలు, షర్టులు-దాదాపు అన్ని బాగా పాతబడిపోయినవే-తీసి డబ్బాలో చక్కగా సర్దేసింది.ఆ మర్నాడు  వచ్చే కెరొవాన్ సోదరి మేడం బ్రాక్స్ ఈ డబ్బాలో నే పెట్టుకుందని నమ్మేంత జాగ్రత్తగా సద్ది పెట్టింది. 

సద్దడం అంతా పూర్తయిన తర్వాత టేబుల్ కిందకు తీసుకొచ్చారు.ఇద్దరూ టేబుల్  చెరో చివర్లో పట్టుకొని కిందికి దించారు. ఆ తర్వాత దాన్ని ఎక్కడ పెడితే బాగుంటుందో అని ఆలోచించడం మొదలుపెట్టారు. చివరికి దాన్ని తమ గదిలోనే తమ మంచానికి ఎదురు గుండా రెండు కిటికీల మధ్య పెట్టుకుందామని నిశ్చయించుకున్నారు. అనుకున్నచోట పెట్టగానే మేడమ్ కెరొవాన్ తమ వస్తువులతో దానిని పూర్తిగా నింపేసింది. గడియారాన్ని భోజనాలు చేసే గదిలో చిమిని దగ్గర పెట్టింది. పెట్టిన వస్తువులు ఆయా స్థానాల్లో ఎలా ఉన్నాయోనని ఇద్దరూ ఒకసారి పరీక్షగా చూసుకుని, చాలా సంతోషించారు. బాగా నచ్చింది. ఇద్దరూ క్యాండిల్స్ ని ఆపేసి విశ్రాంతి తీసుకున్నారు. ఇంట్లో అందరూ పడుకున్నారు. 

కెరొవాన్ లేచే సరికి బాగా పొద్దెక్కింది. గందరగోళంగా అనిపించింది.జరిగిన సంఘటనలు ఏవి అతనికి కొన్ని నిమిషాలు గుర్తుకు రాలేదు. కాసేపటికి గుర్తు రాగానే గుండె బరువెక్కింది. మంచం మీది నుంచి కిందికి దిగాడు .మళ్లీ ఏడుపు వచ్చింది. గబగబా పై గదిలోకి వెళ్ళాడు.రోజలి  ఇంకా రాత్రి తాము చూసిన స్థితిలోనే పడుకుని ఉంది. ఒక్కసారి కూడా లేచినట్లు లేదు. ఆమెను లేపి పనులు పురమాయించాడు. ఆరిపోయిన కొవ్వొత్తుల స్థానంలో కొత్త వాటిని వెలిగించమన్నాడు. అమ్మ వైపు ఒకసారి చూశాడు. అతని మనసులో మతానికి, తాత్వికచింతనకి సంబంధించిన ఆలోచనలు -సాధారణంగా సామాన్య ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, తమ సొంతవాళ్లు చనిపోయినప్పుడు వచ్చే ఆలోచనలు-వచ్చాయి.

కానీ ఇంతలో అతని భార్య కింద నుంచి పిలవడం వినిపించింది. ఆమె పొద్దున్నే చేయాల్సిన పనుల చిట్టాను తయారు చేసింది. దానిని చూడంగానే బేజారు పడిపోయాడు. 

1.మేయర్ ఆఫీసులో చావుని నమోదు చేయడం.2. చివరిసారిగా ఆమెను పరీక్షించిన డాక్టర్ను కలవడం.3.శవపేటిక కోసం ఆర్డర్ పెట్టడం.4.చర్చికి నోటీసు ఇవ్వడం.5. శవ సంస్కారం చేసే వాడి దగ్గరికి వెళ్లడం.6.ముద్రణాలయంలో ఆమె మరణ వార్త ప్రకటనకు ఇవ్వడం.7.న్యాయవాది దగ్గరికి వెళ్లడం.8.మరణం వార్తను కుటుంబ సభ్యులందరికీ టెలిగ్రాముల ద్వారా పంపడం. 

ఈ పనులు కాక కొన్ని చిన్నా చితకా పనులు కూడా ఉన్నాయి. అతడు టోపీ తగిలించుకొని బయటికి వెళ్ళాడు. వార్త బయటికి పొక్కగానే మేడమ్ కెరొవాన్ మహిళా స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు పరామర్శకు రావడం మొదలు పెట్టారు. ఒక్కసారి చనిపోయిన ముసలామె దేహాన్ని చూడాలని పట్టుబట్టారు. తమ ఖాతాదారులకి క్షవరాలు చేస్తున్న ఆ మంగలి కొట్టు దగ్గర భార్యా భర్తల మధ్య చిన్న తగాదా వచ్చింది.”నేను ఇప్పటివరకు చూసిన పిసినారి వాళ్లలో ఒకరు తగ్గారు.” అనింది మంగలివాడి భార్య. “నిజానికి ఆమె చనిపోయినందుకు నాకే విచారం లేదు. అయితే నేం, చివరిసారిగా ఆమెను ఒకసారి చూడాలి” అనింది తన అల్లిక కొనసాగిస్తూ. 

భర్త తన దగ్గరకు గడ్డం గీయించుకోవడానికి వచ్చిన మనిషి గడ్డానికి సబ్బు నురగ రాస్తూ,”ఇదో వింత ఆనవాయితీ. మహిళలు తప్ప ఇతరులు ఎవరూ ఇలా ఆలోచించలేరు. వాళ్ళు జీవించి ఉన్నంత కాలంలో పెట్టిన ఇబ్బందులు చాలవన్నట్టు చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా వదిలిపెట్టరు” అన్నాడు. అయితే, అతని భార్య విషయాన్ని అంతటితో వదిలేయలేదు. అతనికి సమాధానం చెబుతూ,”నా భావనలు నాకన్నా గట్టివి. ఆమెను ఒకసారి చూసి రావాల్సిందే. అలా చూడకపోతే, చూడలేదన్న వెలితి నన్ను జీవితాంతం వెన్నాడుతుంది. ఒకసారి బాగా చూసి వచ్చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది” అనింది. 

గడ్డం గొరుగుతున్న అతడు స్వరం తగ్గించి , గొరిగించుకునే అతనితో,”ఊరికే నేను నిన్ను సరదాగా అడుగుతున్నాను. అసలు మహిళలకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో. నేను మాత్రం ఒక శవాన్ని చూడడానికి ఇష్టపడను.” కానీ అతని భార్య వెంటనే ” సరే కానివ్వండి, అలాగే కానివ్వండి” అని అల్లిక చేసే సూదులు కౌంటర్ పక్కన పెట్టి, పైకి వెళ్ళింది. మొదటి అంతస్తులో కి వచ్చిన మిగిలిన చుట్టుపక్కల వాళ్ళని కలిసింది. అందరూ మేడమ్ కెరొవాన్ తో, సంఘటన జరిగిన పూర్వాపరాల గురించి విపులంగా చర్చిస్తున్నారు. అంతా ఆమె చనిపోయిన గదిలోకి వెళ్లారు. నలుగురు మహిళలు నెమ్మిదిగా ఒకరి తరువాత ఒకరు వెళ్లారు. పక్క బట్టల మీద ఉప్పు నీళ్లు జల్లి, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థనలు చేసారు. ఆ తర్వాత లేచి కాసేపు శవాన్ని చూసారు. శవం కళ్ళు గుండ్రంగా విప్పారి ఉన్నాయి. నోరు సగం తెరిచి ఉంది . కోడలు నోటికి అడ్డంగా రుమాలు పెట్టుకొని ఏడుస్తున్నట్లు నటిస్తోంది. 

ఆమె బయటికి వచ్చే సరికల్లా తలుపు దగ్గర మెరి ఉవిస్ ఫిలిపి ఆగుస్ ఆశ్చర్యంగా జరుగుతున్న విషయాలన్నీ గమనిస్తున్నారు. ఆమె తన దుఃఖపడుతున్న నటన సంగతి మరిచిపోయి, చేతులు వాళ్ళ పైకెత్తి”పిచ్చ వెదవల్లారా, ఇక్కడి నుండి బయటికి వెళ్తారా లేదా” అని కోపంగా కేకలేసింది.

పది నిమిషాల తర్వాత మరి కొంతమంది చూడడానికి వచ్చిన చుట్టుపక్కల వాళ్లతో కలిసి మేడ మీదికి వెళ్ళింది. ప్రార్థనలు చేసింది. ఏడ్చింది. ఆమె బాధ్యతగా చేయాల్సిన పనులన్నీ చేసింది.మళ్లీ అక్కడ పిల్లలు కనిపించారు. వాళ్ళు ఆమె వెనకే పైకి వస్తున్నారు. ఆమె వాళ్ళ చెవులు మెలేసి తిట్టింది. కానీ వాళ్ళు ఆమెను పట్టించుకోలేదు. చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పైకెళ్ళినప్పుడల్లా పైకి వెళుతూ, వాళ్ళ అమ్మ లాగా ఒక మూల మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు.కొంత సేపైన తరువాత ఆమె వాళ్ళను పట్టించుకోవడం మానేసింది. 

మధ్యాహ్నం అయేసరికల్లొ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తాపత్రయపడే వాళ్ళ సంఖ్య నెమ్మదిగా తగ్గింది. కొంతసేపు అయిన తర్వాత చూడడానికి వచ్చేవాళ్ళు మిగల్లేదు. మేడం గారు తన భాగంలోకి వచ్చి అంతిమ సంస్కారాలకి అవసరమైన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. శవం దగ్గర ఎవరూ లేరు.

ఆ గది కిటికీలు తెరిచే ఉన్నాయి. వేడిగాలి ఉధృతంగా లోపలికి వస్తుంది. దానితోపాటు దుమ్ము కూడా. కదలకుండా పడి ఉన్న శవం చుట్టూ ఉన్న క్యాండిల్స్ మిణుకు మిణుకు మంటున్నాయి. శవం పైన కప్పిన దుప్పటిపై, మూసిన కళ్ళపై చిన్న చిన్నఈగలు వాలుతున్నాయి. అవి నిరంతరంగా బయటికి లోపలికి ఎగురుతున్నాయి. ముసలామెకి ఇప్పుడు అవే తోడుగా ఉన్నాయి. 

మెరి ఉవిస్ , ఫిలిపి అగుస్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. వీధిలో అటు ఇటు పరిగెడుతున్నారు. వాళ్లతో పాటు ఎప్పుడూ ఆడుకునే వీధిలో పిల్లలంతా చేరారు. ముఖ్యంగా చిన్న ఆడపిల్లలు. వాళ్లకి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహం, కోరిక. తాము పెద్దయిపోయినట్టు అనుకుంటూ,పెద్ద వాళ్ళని రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు.

“మీ బామ్మ చనిపోయిందా?” 

“చనిపోయింది , నిన్న రాత్రి” 

“చనిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు?” 

మెరి వాళ్ళకు వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. వెలిగించిన క్యాండిల్స్ గురించి , స్ప్రిగ్ బాక్స్ గురించి,శవం మొహం గురించి. వాళ్లకి కుతూహలం పెరిగి ,తమకు కూడా శవాన్ని చూడ్డానికి పైకి వెళ్ల డానికి అనుమతి కావాలన్నారు .

మెరి  ఉవిస్ వెంటనే ఒక బ్యాచ్ ని,అన్వేషణ యాత్రకి పైకి తీసుకెళ్లడానికి సిద్ధం చేసింది. అందులో ఐదుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్లే బ్యాచ్ అంతట్లో అందరికన్నాపెద్దవాళ్లు, అందరికన్నా ధైర్యవంతులు. ఆమె వాళ్ళందర్నీ కాళ్ళకి వేసుకున్న షూస్ తీసేయమని కోరింది. అపుడిక వాళ్ళు వెళుతున్నసంగతి ఎవరూ గమనించరని ఆమె భావన. పిల్లలు అంతా వరుసగా ఇంట్లోకి దూరారు. నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు, చిన్న ఎలకల సైన్యం లా . 

గదిలోకి వెళ్ళగానే చిన్న పిల్ల, తల్లిలాగే అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. శవం పక్కకి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుంది, ప్రార్థన చేస్తున్నట్టు పెదవులను కదిలించింది. ఆ తర్వాత లేచి నిలబడి పక్క మీద ఉప్పు నీళ్లు చల్లింది. పిల్లలందరూ  చేరి చనిపోయిన ఆమె ముఖం, చేతులు చూడడానికి ఒకవైపు భయపడ్డారు.మరోవైపుఆశ్చర్యపోయారు. ఉన్నట్టుండి ఆమె చేతి రుమాలు లో ముఖం పెట్టుకుని ఏడవడం మొదలు పెట్టింది. కానీ వెంటనే తమను తాను తమాయించుకుంది. కింద ఉన్న పిల్లలందరూ తనకోసం ఎదురు చూస్తారని కిందకి పరిగెత్తింది. ఆ తర్వాత ఇంకో గ్రూప్ ని  తీసుకుని మళ్ళీ పైకి వచ్చింది. ఆ తర్వాత మూడో గ్రూపు. అలా ఆ గ్రామంలోని చిన్న పిల్లలందరూ వరుసగా పైకొచ్చి చూడడం మొదలుపెట్టారు,ఆఖరికి వేసుకున్న బట్టలు చిరిగిపోయిన ముష్టి వాళ్లు కూడా. అందరూ ఈ కొత్త ఆనందంలో భాగస్వాములవాలనుకున్నారు. ప్రతిసారి ఆ పిల్ల వాళ్ళ అమ్మ చేసిన గిమ్మిక్కు లను చేస్తూ వచ్చింది. 

చివరికి వచ్చేసరికల్లా బాగా అలసిపోయింది. బయట ఆటలు, వేరే పనులు, లేదా ఇంటి నుంచి వచ్చే పిలుపుల వలన పిల్లలందరూ వెళ్లిపోయారు. లోపల ముసలి బామ్మ ఒక్కతే ఉండిపోయింది. అందరూ ఆమె సంగతే మర్చిపోయారు. 

గదిలో చీకటి ఆవరిస్తోంది. గట్టి పడిపోయిన, ఎండిపోయిన శవం మీద పడ్డ క్యాండిల్ వెలుగుల వలన శవం అతుకులేసినట్టు కనిపిస్తోంది.

రాత్రి 8 గంటల అవుతుండగా  కారొవాన్ చనిపోయిన ఆమె గదిలోకి వచ్చాడు. తలుపులన్నీ మూసేసి క్యాండిల్స్ ని మళ్లీ వెలిగించాడు. ఇప్పుడు, అతను గదిలోకి ప్రవేశించుతున్నప్పుడు, స్థిమితంగా ఉన్నాడు.శవాన్ని చూడడానికి అలవాటు పడిపోయాడు. ఆ శవం అక్కడ నెలల తరబడి ఉన్నట్టు అనిపించింది. అసలు శవం ఏమాత్రం కుళ్ళిపోవడం లేదని ప్రకటించే స్థాయికి వచ్చాడు. 

డైనింగ్ టేబుల్ దగ్గర  అందరూ జావ మౌనంగా తాగడం మొదలుపెట్టారు. రోజంతా పిల్లల్ని వాళ్ళ కర్మానికి వదిలేసారు కాబట్టి వాళ్లు బాగా అలసిపోయారు. కుర్చీలలోనే నిద్రపోతున్నారు. ఎవరు మాట్లాడడానికి ప్రయత్నించలేదు. 

ఉన్నట్టుండి గదిలో దీపం వెలుగు బాగా తగ్గిపోయింది. మేడం వత్తిని కాస్త పెద్దది చేసింది. కానీ దీపం ఆరిపోయింది. వాళ్ళు అసలు నూనె కొనడం మర్చిపోయారు. ఇప్పుడు గనక పచారీ కొట్టుకి నూనె కోసం పంపిస్తే, భోజనం చేయడానికి వీలు అవ్వదు. ఇల్లంతా క్యాండిల్స్ కోసం వెతికారు.కానీ దొరకలేదు.పైన శగం ఉన్న గదిలో టేబుల్స్ చుట్టూ పెట్టిన క్యాండిల్స్ మాత్రమే వెలుగుతున్నాయి. 

మేడం గారు నిర్ణయాలు తీసుకోవడంలో ముందు ఉంటుంది. ఆమె వెంటనే మెరి ఉవిసి ని పైకి పంపించి, రెండు క్యాండిల్స్ కిందికి తీసుకురమ్మని చెప్పింది. ఆమె వచ్చేవరకు అంతా చీకట్లో కూర్చున్నారు. 

చిన్న పాప పైకి ఎక్కుతున్న పాదాల శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కాసేపు నిశ్శబ్దం ఆ తర్వాత పాప నెమ్మదిగా కిందికి వస్తోంది. తలుపు తెరుచుకొని చిన్న గొంతుతో “నాన్నా బామ్మ బట్టలేసుకుంటున్నాది”  అనింది. 

కుర్చీలో కూర్చున్న కెరొవాన్ కాళ్లు నేలకేసి ఎంత గట్టిగా కొట్టాడంటే కూర్చున్న కుర్చీ కాస్త వెనుక గోడకి కొట్టుకుంది. తడబడుతూ “నువ్వేం అంటున్నావు? నువ్వు అంటున్నదేమిటి?” అన్నాడు కంగారుగా.

కానీ మెరి ఉవిసి ఉద్వేగంతో ఉక్కురిబిక్కిరి అయి మళ్లీ అదే మాట అనింది”బామ్మ బామ్మ బామ్మ బట్టలేసుకుంటున్నాది ” అంటూ మెట్లు దిగింది. 

కెరొవన్ వెంటనే గబగబా ధైర్యంగా మెట్ల ఎక్కాడు. అతని వెంట అవాక్కైన భార్య కూడా. మెట్లు ఎక్కిన తర్వాత గది ముందుకు వచ్చేసరికల్లా నిశ్చలంగా నిలబడి పోయాడు. అప్పటికి భయం కాస్త తగ్గింది. అయినా లోపలికి వెళ్ళడానికి జంకాడు. మేడం కారొవాన్ ధైర్యం చేసింది .గది హ్యాండిల్ తెరిచి లోపలికి అడుగు పెట్టింది. 

ముసలామె నిలుచునుంది. గాఢ నిద్రలో నుంచి సృహ వచ్చి లేచినట్టు ఉంది. పక్కకు తిరిగి తన మంచం చుట్టూ ఉన్న క్యాండిల్స్ లో మూడింటిని ఆపేసింది. తను చస్ట్ ఆఫ్ డ్రాయర్స్ గదిలో లేకపోవడం మొదట్లో ఆమెని ఒకంత ఆందోళనకి గురిచేసింది. కానీ ఒక చెక్క పెట్టెలో తన బట్టలు అన్నీ ఉండడంతో, స్ప్రిగ్ ఆఫ్ బాక్స్ ని అద్దం వెనక్కి నెట్టేసి, కుర్చీలను వాటి స్థానాల్లో పెట్టి, కిందికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నది. అప్పుడే ఆమెకి కొడుకు, కోడలు ఎదురుపడ్డారు. 

కెరొవాన్ అడుగులు ముందుకు వేసి, ఆమె చేతులు పట్టుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని భార్య అతనికి వెనక నుండి కపటత్వంతో “ఓ దేవుడా బతికించావు బతికించావు ” అనింది.

ముసలామె ఇవేం మాత్రం పట్టించుకోలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దృఢంగా నిలబడి మెరుస్తున్న కళ్ళతో “భోజనం సిద్ధం అయిందా ” అని అడిగింది. 

ఏం మాట్లాడాలో అర్థం కాక అతను మాత్రం “అవునమ్మా భోజనం సిద్ధంగానే ఉంది. నీ కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం ” అన్నాడు. 

తనకు అలవాటు లేని ఉత్సాహంతో ఆమె చేతిని చేతిలోకి తీసుకున్నాడు. మేడం, చిన్న పాప చేతిలోని క్యాండిల్ ని తన చేతిలోకి తీసుకొని కిందికి దిగింది. వెనుక ఉన్న వాళ్ళకి లైట్ వెలుగు చూపిస్తూ ,ఒక్కొక్క మెట్టే దిగింది. రాత్రి తన భర్తకి చూపించినట్టే-చలువరాతిని తీసుకుని వస్తున్నప్పుడు.

కిందికి రాగానే, ఆమె పరిగెత్తి వెళ్లి పైకి రాబోతున్న మనుషుల్ని ఆపింది. ఆ వస్తున్నది ఎవరో కాదు క్యారెన్టన్ కుటుంబం. మేడం బ్లాక్స్ తన భర్తతో వచ్చింది.

బాన పొట్టతో, పొడుగ్గా, లావుగా ఉండే భార్య అప్పటికే భయంతో కళ్ళు పెద్దవి చేసి చూడడం మొదలుపెట్టింది. పారిపోవడానికి సిద్ధంగా ఉంది. భర్త ఒక సోషలిస్టు చెప్పులు తయారు చేసేవాడు, బొచ్చున్న పొట్టివాడు. దాదాపు కోతిలా ఉంటాడు. ఏ మాత్రం పట్టించుకోకుండా,” సరే ,అయితే తర్వాత సంగతేంటి?  ఏమన్నా మళ్లీ లేచిందా”? అన్నాడు.

మేడమ్ కెరొవాన్ అతనిని గుర్తించి,వెంటనే గట్టిగా,”అరే మీరందరూ వచ్చారా ఎంత సంతోషం”  అనింది. 

కానీ మేడం బ్రాక్స్ అవాక్కై ఏమీ అర్థం కానట్టు చూసింది. చిన్న గొంతుతో,” నువ్వు ఇచ్చిన టెలిగ్రామ్ వల్లే మేము ఇక్కడికి వచ్చాం. అంతా అయిపోయింది అనుకున్నాం ” అనింది.

ఆమె వెనకే ఉన్న ఆమె భర్త నోరు మూసుకోమని నెమ్మదిగా గిచ్చాడు. కాస్తంత వంకర నవ్వు తన దట్టమైన గడ్డంల్లో దాచుకుని,”మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము అనుకోకుండా గబగబా వచ్చేసాం” అన్నాడు. ఆ మాటలే రెండు కుటుంబాల మధ్య చాలా రోజులుగా శత్రుత్వం ఉన్నట్టు తెలియజేస్తున్నాయి. అప్పటికి ముసలామె చివరి మెట్టుకు వచ్చేసింది. గబగబా అల్లుడి  దగ్గరికి వెళ్లి బుగ్గలను తన చెంపలకు చేర్చుకుంది. అతడు చెవిలో,” అబ్బా!అమ్మ మీరెంత దృఢంగా ఉన్నారు ఎప్పటిలాగే” అన్నాడు. 

మేడం బాక్స్ తెలివి తక్కువగా, అందరూ చనిపోయిందని అనుకున్న ముసలామె బతికి ఉండడం చూసి కనీసం కౌగిలించుకోడానికి కూడా ధైర్యం చేయలేదు. ఆమె స్థూల కాయం ఇద్దరినీ దరిదాపులకు కూడా రానీయలేదు. ముసలామెకు కాస్త అసౌకర్యంగా అనిపించి అనుమానం గా చూసింది.కానీ ఏమీ మాట్లాడలేదు. 

తన చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ ఒకసారి పరీక్షగా చూసింది. ఆ చూపు తీక్షణం గా  కఠినంగా ఉంది. ఆమె బూడిద రంగు కళ్ళు,  అక్కడ తన చుట్టూ ఉన్న వారిపై స్థిరంగా నిలిచాయి. ఆ చూపులో ఎంత గూడార్ధం దాగి ఉందంటే పిల్లలు దడుచుకొని పారిపోయారు. 

ఉన్న పరిస్థితిని వివరించడానికి కెరొవాన్,”ఏం లేదు ఆమెకు కాస్త ఒంట్లో బాలేదు. ఇప్పుడు పరవాలేదు బాగానే ఉంది. ఇప్పుడు బాగున్నావు కదమ్మా”అన్నాడు. 

ముసలామె నడుస్తూ, ఎక్కడో దూరం నుంచి వినిపిస్తున్నట్టు బొంగురు గొంతుతో,”అవును నేను మూర్చ పోయాను. మీరంతా మాట్లాడుకోవడం వింటూనే ఉన్నాను” అనింది. 

ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఆవరించింది. అందరూ భోజనాలు గదిలోకి వచ్చారు. కొన్ని నిమిషాల్లో మెరుగైన భోజనాలు వడ్డించడంతో, అందరూ భోజనాలు చేయడం మొదలుపెట్టారు.

బ్రాక్స్ మాత్రమే నిగ్రహంగా ఉన్నాడు. అతని గొరిల్లా రూపంలో కుటిలత్వాన్ని దాచుకున్నాడు. వెళుతూ వెళుతూ ఆయన వాడిన ద్వందార్ధాల మాటలు అందరిని తీవ్రంగా కలిచి వేశాయి. 

బయట వీధి తలుపు బెల్ ప్రతి సెకండు మోగుతూనే ఉంది. రోజలి లోపలికి వచ్చి కెరొవాన్ని పిలిచింది. 

వెంటనే గబగబా వాడుతున్న నాప్కిన్ ని టేబుల్ మీద పడేసి బయటికి పరిగెత్తాడు. అతని బావ,” ఇది నువ్వు అందర్నీ కలుసుకోవాల్సిన రోజు  కాదా” అని ఎగతాళిగా అడిగారు. కెరొవాన్ తడబడుతూ,” కాదు. ఏమో కొన్ని పార్సిల్ వచ్చాయి అంతే” అన్నాడు. 

ఒక పార్సిల్ వచ్చింది. దాన్ని అతను జాగ్రత్తగా తెరిచాడు. అందులో నుంచి అనుకోకుండా,విచారాన్ని ప్రకటిస్తున్న నల్ల అంచుల పత్రిక బయటపడింది.

అతని తల్లి దాన్ని చూడలేదు .ఆమె ఆ గదిలో గూడు మీద ఉన్న గడియారం వైపు తీక్షణం గా చూస్తోంది. అసలే సూది కింద పడితే శబ్దం వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆమె తీక్షణమైన చూపు దాన్ని మరింత ఇబ్బందికరంగా మార్చింది. ముసలామె, ముడతలు పడ్డ ఆమె మొహాన్ని కూతురు వైపు తిప్పి,” సోమవారం నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి పోవాలి. నేను నీ చిన్న కూతుర్ని ఎంతగానో చూడాలనుకుంటున్నాను” 

మేడం బా క్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది “తప్పకుండా అమ్మ! నేను తీసుకెళ్తాను”

ఆమె కన్నా చిన్నవాడైన కెరొవాన్ ముఖం ఒక సారిగా పాలిపోయింది. కలవరపాటు తో దాదాపు కింద పడబోయాడు. పురుషులు ఇద్దరూ నెమ్మదిగా మాటల్లో పడ్డారు. ఆ తర్వాత రాజకీయాలు చర్చించడం మొదలుపెట్టారు . బ్రాక్స్ ఒక విప్లవకారుడు. కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాడు. అతని కళ్ళు మెరుస్తుండగా, “ఈ  వ్యక్తిగత ఆస్తి అనేది కార్మిక వర్గాలపై జరుగుతున్న దోపిడి. భూమి అంతా మనుషుల ఉమ్మడి సంపద. అసలు వంశపారంపర్య హక్కులు అనేవి ప్రతిష్టను దిగజార్చేవి ,అవమానకరం”. ఉన్నట్టుండి ఇక్కడ ఆగి కాస్త మెత్తని స్వరంతో ” బహుశా ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదనుకుంటాను”.

ఇంతలో తలుపు తెరుచుకుంది. డాక్టర్ చెనెట్ వచ్చారు. ఒక నిమిషం అతను నిర్గాంత పోయారు. వెంటనే తేరుకుని తన భావాలను ప్రదర్శించడంలో జాగ్రత్త పడ్డాడు. ముసలామె దగ్గరికి వెళ్లి”ఆహా అమ్మా! ఈరోజు మీరు బాగున్నారు కదా. మళ్లీ మీరు తిరిగి ఇంత ఆరోగ్యవంతులవుతారని  నాకు కచ్చితంగా తెలుసు .నేను మీ గదికి మెట్లు ఎక్కుతూ కూడా ఇదే అనుకున్నాను. మళ్ళీ మీరు మీ కాళ్ళపై నిలబడటం నేను కచ్చితంగా చూస్తాను అని అనుకుంటూ వచ్చాను.”ఈ మాటలు అంటూ అతడు ముసలామె వీపును కాస్త నెమ్మదిగా చరిచాడు. “ఓహో! ఆమె ఇనప బ్రిడ్జి కన్నా గట్టిగా ఉంది. మనందరిని మించింది. కాదంటారా ?”

అతను కూర్చుని, కాఫీ నెమ్మదిగా తాగుతున్నాడు. ఆ తర్వాత మాట్లాడుకుంటున్న ఇద్దరు మగవాళ్ళతో మాటలు కలిపాడు. బ్రాక్స్ ని సమర్థించాడు. అతను కూడా కమ్యూన్ తో సంబంధాలు ఉన్నవాడే. 

ముసలామె కి ఇక అలసటగా అనిపించింది. కాసేపు వెళ్లి పడుకోవాలి అనుకుంది. కెరొవాన్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నా గడియారాన్ని, చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా పైన పెట్టించాలి” 

“సరే అమ్మ అలాగే చేస్తాను” అన్నాడు ఊపిరి పీల్చుకుంటూ. ముసలమ్మ కూతురు చేయి పట్టుకొని తన గదిలోకి వెళ్లిపోయింది. కొడుకు కోడలు గాబరా పడిపోయారు. మౌనంగా, విషాదంలో కూరుకు పోయారు. 

బ్రాక్స్ నవ్వుకుంటూ కాఫీ తాగుతున్నాడు. 

ఉన్నట్టుండి మేడం కెరొవాన్ కోపంతో రగిలిపోయింది. ఆమె అతని దగ్గరికి వెళ్లి,” నువ్వు ఒక దొంగవి, దారి దోపిడీ గాడివి, ఊర కుక్కవి. నీ మొహం మీద ఉమ్మ బుద్దేస్తుంది. నేను నేను…” కోపంతో ఒళ్ళు కాలిపోతుండడంతో ఆపైన ఏమనడానికి ఆమెకు మాటలు దొరకలేదు. అతడు మాత్రం ఆనందంగా కాఫీ తాగుతూనే ఉన్నాడు. 

మేడం కెరొవాన్ ఆడపడుచు మీద దాడి చేసింది. ఇద్దరు మహిళలు-ఒకరు లావుగా పొడుగ్గా, మరొకరు సన్నగా పీలగా-కోపం తో పెద్ద పెద్దగా కేకలువేసుకుంటూ తిట్టుకుంటున్నారు. చేతులు ఊపుకుంటూ అరుచుకుంటున్నారు.”

చెనెట్, బ్రాక్స్ మాటలు కాస్తంత సేపు ఆపారు. బ్రాక్స్ భార్య దగ్గర వచ్చి భుజాలు గట్టిగా పట్టుకొని వీధిలోకి తోసేసాడు.”మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు, రోతదానా! వెళ్ళు బయటికి పో” అని కేకలేసి బయటికి తరిమేశాడు.ఇక ఇద్దరు వీధిలో పడి కొట్టుకోవడం మొదలుపెట్టారు. 

చెనెట్, కెరొవాన్ ని ఒక్కడినే అతని కర్మకు వదిలేసి బయటికి వెళ్లిపోయాడు. ఒళ్లంతా చెమటలు పట్టేసిన, ఆ భర్త,  పాపం, కుర్చీలో కూలబడ్డాడు.” రేపు పొద్దున్న నా అధికారికి ఏమని సమాధానం చెప్పుకోవాలి” అని వాపోయాడు.

***

ఉషారాణి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *